కేసీఆర్ వ్యూహ వైఫల్యాలు.. రీజనేంటంటే?
posted on Feb 13, 2023 @ 11:16AM
మాటల మాంత్రికుడు.. రాజకీయ వ్యూహ చతురుడు కేసీఆర్. గత తొమ్మిదేళ్లుగా తెలగాణ కేసీఆర్ కు పర్యాయపాదాలుగా వాడే పదాలు అవే. అయితే గత కొద్ది కాలంగా ఆయన మాటలు మంత్రాలుగా చెలామణి కావడం లేదు. వ్యూహాలు వికటిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత ప్రణాళికలు పారడం లేదు సరికదా బూమరాంగ్ అవుతున్నాయి. అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటి బోల్తా పడ్డావులే దొరా అన్నట్లుగా తయారైంది కేసీఆర్ పరిస్థితి.
ముఖ్యంగా ఫామ్ హౌస్ కేసు విషయం నుంచి నూతన సచివాలయం ప్రారంభోత్సవం వరకూ ఆయన ఏం అనుకున్నా అందుకు రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది సీఎంలో అసహనం పెంచుతోందా అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఔననే అంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం విషయంలో కూడా కోర్టు వరకూ వెళ్లి కూడా కేసు ఉపసంహరించుకుని మరీ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కేసీఆర్ ఎంతగా డిఫెన్స్ లో పడ్డారో అందరికీ తేటతెల్లం చేసింది. వ్రతం చెడ్డా కూడా ఫలం దక్కలేదన్నట్లు.. గవర్నర్ ను స్వయంగా అసెంబ్లీలోకి ఆహ్వానించినా కూడా గతేడాది సెప్టెంబరులో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్‌లోనే ఉంచారు.
అంతకు ముందుఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయంలోనూ ఆయన తొందరపాటు కారణంగానే.. సభకు జనాన్ని బాగానే సమీకరించగలిగినా... ఆయన అనుకున్న విధంగా బీఆర్ఎస్ కు కావలసినంత మైలేజీ రాలేదు. హస్తిన వేదికగా భారీ బహిరంగ సభ అని తొలుత అనుకున్నప్పటికీ.. తెలుగుదేశం ఖమ్మం సభ విజయవంతం కావడం.. రాష్ట్రంలో ఆ పార్టీ పూర్వ వైభవం దిశగా వేగంగా కదులుతోందన్నఅంచనాల నేపథ్యం ఒక వైపు.. ఖమ్మం నుంచి ఇద్దరు పలుకుబడి కలిగిన నాయకులు తుమ్మల, పొంగులేటి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం మరో వైపీ.. అన్నిటికీ మించి ప్రధాని మోడీ వందే భారత్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నరన్న సమాచారంతో బీఆర్ఎస్ సత్తా చాటకపోతే వెనుకబడిపోతామన్న భావనతో గత నెల 18నే ఆయన ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్బావ సభ నిర్వహించేశారు.
అది విజయవంతం అయ్యిందా లేదా అన్న విషయం కంటే జాతీయ పార్టీ ఆవిర్భావ సభ హస్తిన వేదికగా నిర్వహించి ఉంటే వచ్చే మైలేజే వేరుగా ఉండేది.. అయితే కేసీఆర్ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకను కూడా అనివార్యంగా వాయిదా వేసుకోవలసిన పరిస్థితి కేసీఆర్ కు ఏమంత సంతోషం కలిగించే విషయం కాదు. అసలు నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి తన పుట్టిన రోజును ముహూర్తంగా నిర్ణయించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
తీరా ప్రారంభోత్సవ తేదీ ప్రకటించేసిన తరువాత నూతన సెక్రటేరియెట్ లో సంభవించిన అగ్ని ప్రమాదం నెగటివ్ సెంటిమెంట్ ను స్ఫురింప చేసింది. అదలా ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ అంటూ ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఫామ్ హౌస్ కేసు, రిపబ్లిక్ డే నిర్వహణ ఇలా కేసీఆర్ ఇటీవలి కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి వ్యూహం బూమరాంగ్ అవుతూనే వచ్చాయి.