అయిన వారికే అందలాలు.. తెలంగాణలో రైటైర్డ్ బ్యూరోక్రాట్లకే పెద్ద పీట

తెలంగాణలో బ్యూరోక్రాట్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకే ఆయన పెద్ద పీట వేస్తుండటంతో అధికారుల్లో అసంతృప్తి అండర్ కరెంట్ గా రగులుతోంది. సర్వీసులు ఉన్న అధికారులను పక్కన పెట్టి మరీ పదవీ విరమణ చేసిన వారినే ఆయన అందలం ఎక్కిస్తున్నారన్న భావన చాలా మంది  అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇష్టం ఉన్న అధికారులు పదవీ విరమణ కాగానే వారికి సలహాదారు పదవో, లేదా పదవీ విరమణ చేయడానికి ముందు వారు నిర్వహించిన వాఖలో బాధ్యతలను అప్పగించడంతో సర్వీసులో ఉన్న అధికారుల్లో అసంతృప్తి గూడుకట్టుకుంటుంది.   ముఖ్యమంత్రి వ్యవహారాలను చూసే ముఖ్య కార్యదర్శి సైతం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత కేసీఆర్ ఈ కొత్త ట్రెండ్ ను తీసుకు వచ్చారని అంటున్నారు.  ఆర్థిక, ప్రజాపంపిణీ, సాధారణ పరిపాలన, పశుసంవర్ధక శాఖల్లో పదవీ విరమణ చేసిన వారే అదే హోదాలో కొనసాగుతున్నారు.   అయితే రాష్ట్ర విభజన నాటికి 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం ఆ తరువాత 32 జిల్లాల రాష్ట్రంగా మారడంతో ఐఏఎస్ ల కొరత కారణంగానే రిటైర్డ్ అధికారులను కొనసాగించాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తున్నా... రాష్ట్రంలో పని చేస్తున్న చాలా మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడంపై విమర్శలు వినవస్తున్నాయి.  

పశ్చిమ బెంగాల్.. అయినా పరిస్థితులు మారలేదు!

పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ మారినా.. పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు కనిపించలేదు. గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. పాత గవర్నర్ స్థానంలో కొత్త గవర్నర్ వచ్చినా ప్రభుత్వం- గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది.   గవర్నర్ గా  జగదీప్‌ ధనకర్‌ ఉన్నప్పుడు రాష్ట్రంలో నిత్యమూ ఘర్షణ పూర్వక వాతావరణమే కనిపించేది. గవర్నర్‌ ధన్‌కడ్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య సఖ్యత సంగతి పక్కన పెడితే నిత్యం ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ ఉండేవారు. ధన్ కడ్ గవర్నర్ గా ఉన్నంత కాలమూ.. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఇరువురి మధ్యా సామరస్యపూరిత వాతావరణం ఉన్న దాఖలాలు లేవు. అయితే మమతకు ఊరట కలిగించేలా ధన్ కడ్   ఉప రాష్ట్రపతిగా ధన్‌కడ్‌   బాధ్యతలు స్వీకరించారు. ధన్ కడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా వ్యవహరించిన తీరు కారణంగానే మోడీ ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించారని పరిశీలకుల విశ్లేషణలు పక్కన పెడితే ఆయన రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో మమత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పారు.  ఆయన స్థానంలో  1977 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన  సీవీ ఆనంద్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మోడీ ఏరి కోరి ఎంపిక చేసి మరీ పంపించారు. గత ఏడాది  నవంబర్‌లో సీవీ ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో గవర్న్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య సుహృద్భావ పూరిత వాతావరణమే ఉండింది. మమత రచనలు, పెయింటింగ్లు, సంగీత కంపోజిషన్లు, అల్బమ్ లపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మమతా బెనర్జీ సైతం ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన రసగుల్లాలను బహుమతిగా ఇచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మమత ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని ఇటీవలి బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆనంద్ బోస్ అక్షరం పొల్లుపోకుండా చదివారు.  ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ, పీఎంఏవై నిధుల విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ ఉన్న భాగాలను కూడా ఆయన అక్షరం పొల్లుపోకుండా చదివేశారు.   అయితే ఇటీవల ఆయన వైఖరి మారింది. అందుకు కారణం ఆయన వ్యవహార శైలి పట్ల కేంద్రం కన్నెర్ర చేయడమేనని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ గవర్నర్ లో భేటీ అయ్యారు. వీరి మధ్య ఈ భేటీ దాదాపు రెండు గంటలకు పైగా జరిగింది. సాధారణంగా గవర్నర్ అంత సేపు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ తరువాత నుంచే గవర్నర్ వైఖరిలో మార్పు వచ్చిందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఆ భేటీ తరువాత లోకాయక్త నియామకం విషయంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం సైతం చేయలేదు. పైగా లోకాయుక్త నియామకం ఉత్తర్వులలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని ఆరోపణలు సైతం చేశారు. ఆ వెంటనే తనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన నందినీ చక్రవర్తికి గవర్నర్ ఉద్వాసన పలికారు. దీంతో పశ్చిమ బెంగాల్ లో గవర్నర్- ప్రభుత్వం మధ్య సంబంధాలు మళ్లీ మొదటికి చేరుకున్నాయి.  

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం.. కవిత భర్తకూ నోటీసులు?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే.. ఈడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆ అనుమానాలే బలపడుతున్నాయి.   ఈ కుంభకోణంలో సౌత్ గ్రూపు పోషించిన పాత్ర కీలకమని ఈడీ స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా   డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఈ గ్రూపును నడిపించినట్లు ఆరోపించింది. ఇందులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవను, శరత్‌చంద్రారెడ్డి  అరెస్టు అయ్యారు.   తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరి వంతు అవుతుందనే చర్చలు మొదలయ్యాయి.   ఈ కేసులో ఈడీ కవిత భర్త అనిల్‌కు కూడా నోటీసు జారీచేసి ప్రశ్నించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన టైంలో అంటే గత ఏడాది మేలో హైదరాబాద్ లో కవిత నివాసంలోనే చర్చలు జరిగాయని ఈడీ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది.   ఆ సమావేశంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారని ఈడీ అంటోంది. ఆ రోజు చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఈ స్కామ్‌లో ఏ మేరకు ఆయనకు భాగస్వామ్యం ఉంది అన్న వివరాలను రాబట్టేందుకు కవిత భర్తను ప్రశ్నించాలని ఈడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   

నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటిన్ లో వెల్లడి

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది.   ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు   హెల్త్ బులిటిన్ బులిటిన్ విడుదల చేశాయి.   తారకరత్న ఆరోగ్యం  నిలకడగా ఉందని పేర్కొన్నాయి. ఆయనకు ఎమ్మారై స్కానింగ్ చేసినట్టు చెప్పాయి.   ప్రస్తుతం తారకరత్న మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వివరించాయి. ఇలా ఉండగా ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం ( ఫిబ్రవరి 18) హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా   బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని చెప్పారు. గురువారం(ఫిబ్రవరి 17) ఆయనకు ఎమ్ ఆర్ ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు.  నందమూరి కుటుంబ సభ్యుల సన్నిహితుల నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందనీ, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారనీ తెలుస్తోంది. అన్నిటికీ మించి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు బాలకృష్ణ వైద్యులతో సంప్రదిస్తున్నారనీ, వైద్యులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించిన అప్ డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారని చెబుతున్నారు.    గత నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే.    ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని,   చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ గతంలో వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పొటో ఒకటి కూడా గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో తారకరత్న క్లీన్ షేవ్ తో కనిపించారు. 

కన్న బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కిలోమీటర్లు.. అంబులెన్స్ సౌకర్యం కల్పించని కేజీహెచ్ అమానవీయం

జగన్ పాలనలో సర్వ వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవత్వం అన్నది మచ్చుకైనా కనిపించని పరిస్ధితి నెలకొంది. అసలు జనగ్ పాలనలో జవాబుదారీ తనమై కరవైందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. జనం ప్రశ్నిస్తున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆందోళనకు దిగినా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఒక అమానవీయ ఉదంతం గురించి తెలుగుదేశం జాతీయ కార్యదర్వి నారా లోకేష్ గురువారం ( ఫిబ్రవరి 16) చెప్పారు. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ఓ చిన్నారి మరణిస్తే.. ఆమె మృత దేహాన్ని అక్కడ నుంచి   స్వస్థలమైన పాడేరుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ ను ఏర్పాటు చేయడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాళ్లు పట్టుకుని అడిగినా కేజీహెచ్ సిబ్బంది కనికరించలేదనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, అవమానించారనీ ఆ పాప తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక విశాఖ నుంచి పాడేరుకు 120 కిలోమీటర్ల దూరం తన కన్న బిడ్డ మృతదేహాన్ని స్కూటీపై తీసుకువెళ్లారు. ఈ దయనీయ సంఘటన చూసిన వారందరికీ కంట నీరు తెప్పించింది. ఈ సంఘననే లోకేష్ చెప్పారు. ఆ పాప తల్లిదండ్రుల దయనీయ స్థితి వింటున్న తనకు కన్నీరు వచ్చిందనీ, అందరి చేతా కంటనీరు పెట్టించిన ఉదంతం అధికారంలో ఉన్న పబ్జీ ప్లేయర్ జగన్ ను మాత్రం కదిలించలేకపోయిందని విమర్శించారు. రోమ్ నగరం తగలడిపోతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తే బెటర్ అన్నట్లుగా జగన్ తీరు ఉందని దుయ్యబట్టారు. పూటకో అమాన‌వీయ ఘ‌ట‌న‌, రోజుకో ద‌య‌నీయ దృశ్యం జగన్ పాలనలో నిత్యకృత్యంగా మారిపోయాయన్నారు. ఇక కేజీహెచ్ లో మరణించిన చిన్నారి విషయానికి వస్తే.. అనారోగ్యంతో ఆ పాప మరణించింది వాస్తవమే. అయితే ఆ పాప అనారోగ్యం ఏమిటన్నది కూడా ఆసుపత్రి వర్గాలు కానీ, వైద్యులు కూడా చెప్పలేదు. ఆ పాప తల్లి దండ్రులు మాత్రం ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ రక్త నమూనాలు సేకరించారనీ, అయితే మా పాప అనారోగ్యం ఏమిటన్నది కానీ, రోజూ రక్త నమూనాలు ఎందుకు సేకరిస్తున్నారని కానీ తమకు మాటమాత్రం చెప్పలేదని ఆ పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు టీచర్లకు టీడీపీనే భరోసా.. లోకేష్ హామీ ఇదే!

దేశంలో అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యారంగంలో ప్రైవేట్ శాతం ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తోంది...ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు అందించగలిగితే కచ్చితంగా స్వాగతించాల్సిందే... కానీ అలా చెప్పుకుపోవడం తప్ప ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రభుత్వం వైపు నుండి జరగడం లేదు అనేది సుస్పష్టం. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆర్థికారంలోకి వచ్చాక... ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెడుతున్నాం... ఉన్నత వర్గాలేనా ఇంగ్లీషు చదివేది... పేదల పిల్లలు చడవకూడడా అంటూ రాగాలు తీశారు. కానీ అమలులో మాత్రం ఆల్రెడీ ఉపాధ్యాయులుగా చేస్తున్న వారికి కనీస శిక్షణ ఇవ్వకపోగా ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం వేధిస్తున్న తీరు చూస్తున్నాం.  ఇంగ్లీషు మీడియం ఎలా అమలవుతుందో చూస్తున్నాం.  ఇక ప్రయివేటు విద్యాసంస్థల విషయానికొస్తే... కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత అన్నట్టే మాట్లాడుకోవాలి.  కోవిడ్ కారణంగా అప్పులు తెచ్చి టీచర్లకు జీతాలు ఇస్తూ... మళ్లీ రీ ఓపెన్ చేసి నడిపించే స్థోమత లేక వేలల్లో ప్రైవేట్ స్కూల్స్ మూతపడిన విషయం  తెలిసిందే. స్కూలును నడపలేక అప్పులు తీర్చే దారి కనబడక కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో సెల్ఫీ వీడియో తీసుకొని దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల దయనీయ స్థితిని కళ్ళకు కట్టింది. ఇదంతా ఒక ఎత్తైతే,  ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ గుర్తింపును 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయించుకొనే విధానం గత తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తే,  ఇప్పుడు   వైసీపీసర్కార్ దానిని మూడు సంవత్సరాలు కుదించడం  ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు గుది బండలా మారింది. ఇదే విషయాన్ని యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీసుకెళ్లాయి. వారి సమస్యలను సావధానంగా విన్న లోకేష్ వారికి  స్పష్టమైన హామీ ఇచ్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత విధానం ప్రకారం ప్రయివేటు స్కూల్స్ గుర్తింపు 3 సంవత్సరాలకు ఒకసారి కాకుండా, 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేసుకునేలా జీవో తీసుకోస్తాం అని లోకేష్ విస్పష్ట హామీ ఇచ్చారు.   ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల విషయానికొస్తే. అదే కోవిడ్ సమయంలో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. కూలీ పనులు చేసుకునో,  కూరగాయలు అమ్ముకునో లేదా చందాలు వేసుకొనో ఒకరికొకరు పోషించుకున్న టీచర్లు కూడా ఉన్నారు. ఆ సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ టీచర్లకు భృతి ఇచ్చి ఆదుకున్నాయి.  కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భృతి కూడా ఇవ్వకుండా వారిని గాలి కొదిలేసింది. ఒకే ఒక్క నిబంధన ప్రైవేట్ టీచర్స్ జీవితాల్లో చీకట్లు నింపింది. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ గా చెయ్యాలంటే... టెట్ క్వాలిఫై కావడం కంపల్సరీ చెయ్యడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్,  బీఎడ్ చేసినా టెట్ క్వాలిఫై కాని వారు టీచర్లుగా అర్హత కోల్పోతారు. కొన్ని వేల మంది ఉద్యోగార్థులు. అటు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాక, ఇటు ప్రైవేటు ఉద్యోగమూ చేసుకోలేక కూలీలుగా మారిపోయి తమ తలరాత ఇంతే అనుకుంటూ బతుకీడాల్సివస్తున్నది. ఇక టెట్ క్వాలిఫై అయినా నోటిఫికేషన్లు కోసం ఎదురు చూసి చూసి వయస్సు మీద పడి అర్హత కోల్పోయి...  ప్రైవేట్ స్కూల్స్ మీదే ఆధారపడి జీవిస్తున్న వారు  ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ పరిధిలో తమను చేర్చి తమ జీవితానికి కనీస భరోసా కల్పించమని  ఎన్ని సార్లు విన్నవించినా వారిని పట్టించుకున్నా జగన్ సర్కార్ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే సమస్యలు జగన్ పాదయాత్రలో కూడా ఆయన్ను కలిసి ప్రస్తావించినప్పుడు నేను అధికారంలోకి వస్తే తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చి... ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిది కాదా..! ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు...  టీచరు లారా ఆలోచించండి... మీ సమస్యల పరిష్కారానికి, మీ హక్కుల సాధనకై ప్రత్యామ్నాయం నేనౌతా... చట్ట సభల్లో మీ గొంతుకనౌతా అంటూ... భరోసా కల్పిస్తున్నారు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాం గోపాల్ రెడ్డి.

అలో లక్ష్మణా అంటున్న ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులమయ్యాం అని సంబరపడినంత సేపు పట్టలేదు వారికి తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని తెలుసుకోవడానికి.  తమది ప్రభుత్వ ఉద్యోగం కాదు వెట్టి చాకిరీ అని వారు ఇప్పడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించగానే సంబరాలు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉన్న సదుపాయాలు కోల్పోయి  కుడితిలో పడ్డ ఎలుకలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వోద్యోగం వస్తే ఇక జీవితం సెటిల్ అయినట్లే అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అలాగే సంబరపడ్డారు. గత ఏడాది ఆర్టీసీని ఏపీ సర్కార్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించేసింది. ఇంకే ముంది తమ జీవితాలు ధన్యమైపోయినట్లేనని ఆర్టీసీ ఉద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ కు క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు అప్పట్లో చేసిన ఆందోళన కు కూడా వారు దూరం జరిగారు. అయితే ఆ తరువాత కానీ వారికి తత్వం బోధపడలేదు. జగన్ సర్కార్ తమకు అర చేతిలో వైకుంఠం చూపి నిలువునా ముంచేసిందని. ఆర్టీసీ పేరుకే ప్రభుత్వ సంస్థ కానీ, ఆ సంస్థలో ఉద్యోగులకు మాత్రం గతమే మేలు అని ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. అప్పట్లో పేరుకే కార్పోరేషన్ ఉద్యోగులం కానీ.. తమకు రావలసిన వేతనాలు, వేతన బకాయిలు, టీఏలు, డీఏలు సమయానికి వచ్చేవనీ, ఏటేటా ఇంక్రిమెంట్లూ సవ్యంగా దఖలు పడేవనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో ఆర్టీసీ కార్పోరేషన్ గా ఉన్నప్పుడు ఉద్యోగులకు క్రమం తప్పకుండా రాయతీలు, అలవెన్సులూ అందేవి. ఇప్పడు ప్రభుత్వంలో విలీనం పేరు చెప్పి వాటిని నిలిపివేసింది జగన్ సర్కార్. అంతేనా ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం చేసిన ఆందోళనలో పాల్గొనకుండా ప్రబుత్వానికి మద్దతుగా నిలిచినందుకు బోనస్ గా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగిడంతో ఇక తప్పదన్నట్లుగా జగన్ సర్కార్ గత ఏడాది జూన్ లో పీఆర్సీ అమలు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ   ఆ పెరిగిన వేతనాలు ఆర్టీసీ ఉద్యోగులకు రెండు నెలల తరువాత కానీ అందలేదు.  అయితే గత ఆరు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీ, ఇతర అలవెన్సులనూ సర్కార్ నిలిపివేసింది.  పోనీ ఓటీలు చేయడం మానేద్దామా అంటే వస్తున్న జీతం చాలదు. అయినా ఓటీ చేసినా డబ్బులు రావడం లేదు కనుక మానేద్దామంటే ఉద్యోగం ఊడిపోతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే ఆర్టీసీలో గత పదేళ్లుగా కొత్త నియామకాలు లేవు. దీంతో రిటైరైన వాళ్లు రిటైరైపోతున్నారు. ఆ పని భారం కూడా ఉన్న వారి మీదే పడుతోంది.  దీంతో నిబంధనల ప్రకారం డ్యూటీ టైం 8 గంటలు అయినా 12 గంటల పాటు పని చేసి తీరాల్సిన అనివార్య పరిస్థితి ఉంది.   ముఖ్యంగా గ్యారేజీలలో పని చేసే వారిపై ఈ భారం అధికంగా ఉంది. దీంతో ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పేరుకే ప్రభుత్వోద్యోగం చేస్తున్నది మాత్రం వెట్టి అన్నట్లుగా తయారైంది. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే అంతంత మాత్రం. ఆ మాత్రం వేతనాలతోనే అధిక గంటలు పని చేయిస్తూ.. ఎక్కువ సమయం పని చేస్తే ఇవ్వాల్సిన ఓటీకి కూడా ఎగనామం పెడుతూ జగన్ సర్కార్ వారి శ్రమను నిలువునా దోచుకుంటోంది.   

సోమేష్ కు ప్రభుత్వంలో కీలక పోస్టు.. కేసీఆర్ నిర్ణయం

ముందు నుంచీ అందరూ అనుకున్నట్లుగా నే జరిగింది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన  గత నెల 12న   అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేశారు.  అయితే అప్పుడే ఆయన స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. వాస్తవానికి  సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ గత నెలలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద విరమణకు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగింది.  అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా సోమేష్ కుమార్ గత నెల 12న  ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.   ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి, తేదా  బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా దాదాపు మూడేళ్ల పాటు పనిచేసిన సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఎం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే  తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.   ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి.  దీంతో సోమేష్ కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారనీ, అందుకోసమే ఇప్పటికే ప్రస్తుతం సెక్రటేరియెట్ గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ లోనే సోమేష్ కోసం ఛాంబర్ రెడీ అవుతోందని అధికారులలో జోరుగా చర్చ సాగుతోంది.  గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్‌శర్మను ముఖ్య సలహాదారుగా, ఎస్‌కే జోషిని సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా కేసీఆర్ నియమించిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.     

బీజేపీకి కన్నా రాజీనామా.. 26న తెలుగుదేశంలో చేరిక

భారతీయ జనతా పార్టీ, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 26న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆయన రాజీనామా వార్త విన్న వారంతా.. కన్నా ఇప్పటి వరకూ బీజేపీలోనే ఉన్నారా? అని ఆశ్చర్య పోతున్నారు.  ఎందుకంటే కన్నా చాలా కాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలగిన నాటి నుంచీ  పార్టీ వ్యవహారాలకు   దూరంగా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.  నిజానికి ఒక్క కన్నా అనే కాదు  రాష్ట్ర విభజన తర్వాత కట్టకట్టుకుని కాషాయం గూటికి  చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు చాలా మంది 2019 తర్వాత సైడైపోయారు.   కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి కటీఫ్ చెప్పేసి తెలుగుదేశం, లేదా జనసేన లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరనున్నడంతో ఆ ప్రచారానికి తెరపడింది. వాస్తవానికి గత కొంత కాలంగా కన్నా రాష్ట్ర బీజేపీ  తీరుపై  చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఆయన దారి ఎటు అన్నది చెప్పకనే చెప్పేశాయి.  వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువౌతారని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది కూడా.  ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు కన్నా హాజరు కాలేదు. అలాగే గత నెల  24న భీమవరంలో   జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ  డుమ్మా కొట్టారు.  ఆ రోజు బీజేపీ నేతలంతా భీమవరంలో ఉంటే కన్నా మాత్రం వ్యక్తిగత  పనులు అంటూ  హైద్రాబాద్ లో ఉన్నారు.  అప్పుడే రాజకీయ విశ్లేషకులు   కన్నా కమలాన్ని వీడిన ట్లేనని తేల్చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా విశ్లేషించారు. వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత  ఏడాది డిసెంబర్ లోనే గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది.   జనసేన రాజకీయ వ్యవహారాల  కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.  అ పాత మిత్రులం  కదా  అందు  ఓ సారి  కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని  అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు.   అప్పట్లోనే జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ  చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.  కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  నియమించిన ఆరు  జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు  తొలగించారు. దీంతో  అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు  జనసేనతో    సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా   సోము వీర్రాజ  వైఖరే కారణమని  కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ  బహిరంగంగానే  తప్పుబట్టారు.  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్  స్టార్ట్ అయిందని, ఆ తరువాత  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో   ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది.  అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని పరిశీలకుల పేర్కొన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు   కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని తెలుస్తోంది.  అయితే, ఇ బుజ్జగింపులకు ముందే  కన్నా ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, త్వరలోనే   నిర్ణయాన్ని ప్రకటిస్తారని అప్పటి నుంచీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. కన్నా బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సత్తెన పల్లిలో ఈ నెల 26న కన్నా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా లేనట్టుగానే ఉంటున్న  మరి కొందరు మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కన్నా బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

వైసీపీ ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బింది.. రఘురామకృష్ణం రాజు

నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది.. ఆ మాటలతో మాట్లాడిన వారికేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంది రాజధాని విషయంలో అధికార వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులు మాట్లాడుతున్న మాటలు. ఏ నిముషానికి ఎవరేం మాట్లాడతారో తెలియక ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎవరు చెప్పింది నమ్మాలో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులే పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నోరు మెదకపోవడం చూస్తుంటే.. ఈ గందరగోళ వ్యాఖ్యల వెనుక ఏదో వ్యూహం ఉందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ తీరు రాజధాని విషయంలో అయోమయం సృష్టించి పబ్బం గడుపుకోవడమే ఆ వ్యూహం అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు అన్నది  మిస్ కమ్యూనికేషన్ అని, విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెబితే.. అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జగన్ మూడు రాజధానుల కు కట్టుబడి ఉన్నారని చెబుతూ.. అయితే రాజధాని అన్న పేరు లేకపోవచ్చు కానీ విశాఖతో పాటు అమరావతి, కర్నూలు కూడా రాజధానులేనని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అని చెప్పి, వాటినీ అభివృద్ధి చేస్తామనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.     బుగ్గన ఏ సందర్భంలో విశాఖ ఒక్కటే రాజధాని అని  చెప్పాలో తెలియదని..  వైజాగ్ లో సచివాలయం, అమరావతి లో  అసెంబ్లీ, కర్నూలులో హై కోర్ట్ కర్నూలు  ఇదే మా విధానం అని మీడియాకు చెప్పారు.  అయితే సుప్రీం కోర్టులో మాత్రం ప్రభుత్వం న్యాయరాజధాని అనేదే లేదని విస్పష్టంగా చెప్పేసింది. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బుగ్గన, అంతకు ముందు ఢిల్లీలో సీఎం జగన్ విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని విస్పష్టంగా చెప్పారు. రోజుల వ్యవధిలో పార్టలోని ముగ్గురు కీలక నేతల నోటి వెంట రాజధాని విషయంలో వచ్చిన ఈ భిన్న ప్రకటనలు దేనికి సంకేతం?   పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని,  తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుంది కానీ, బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు లు చెప్పిన విధంగా కాదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా స్థిరత్వంలో అస్దిరత్వం అన్న వింత విధానాన్ని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణం రాజు. రచ్చబండలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 15)  మీడియతో మాట్లాడిన రఘురామరాజు  రాజధాని విషయంలో మంత్రుల మాటలు చూసి ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బిందని అంటున్నారని ఆయన అన్నారు.  రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖాలు ద్వారా, అమరావతే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు.   రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలను చూసి, అమరావతి రైతులు నవ్వుకోవాలి తప్పితే, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఓటమి భయంతో ప్రభుత్వ పెద్దలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.  

బీహార్ సీఎం నితీష్ యూటర్న్.. ప్రశ్నార్థకంగా విపక్షాల ఐక్యత?

సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ విపక్షాల ఐక్యతారాగం శృతి తప్పుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీల ఐక్యత ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయి.. కేంద్రానికి వ్యతిరేకంగా తమతమ తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ప్రయత్నాలు కూడా షురూ చేశాయి. అయితే బీజేపీయేతర పార్టీలలో సైద్ధాంతిక విభేదాలను పక్కన పెడితే.. ఆయా పార్టీలలో పరస్పర విశ్వాసం, నమ్మకం కొరవడిన పరిస్థితి కనిపిస్తోంది. విపక్షాల ఐక్యతకు కెటలిస్టుగా ఉంటారనుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ఇప్పుడు  యూటర్న్ తీసుకున్నారన్న వార్తలు.. విపక్షాల ఐక్యతకు పెద్ద అవరోధంగా మారాయి. నితీష్ కుమార్  అమిత్ షా ల మధ్య ఫోన్ సంభాణన కు సంబంధించి వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్ఠిస్తున్నాయి.  ఎన్డీయే కూటమి నుంచి గత ఏడాది బయటకు వచ్చి.. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన నితీష్ అంతలోనే ప్లేట్ ఫిరాయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో బీహార్ సీఎం కమలం గూటికి చేరేందుకు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదుగా మారింది. కేంద్రం ఇటీవల 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిచిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీహార్ కూ కొత్త గవర్నర్ ను నియమించింది. బీహార్ కొత్త గవర్నర్ గా విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ నియమితులయ్యారు. ఇంత వరకూ బానే ఉంది. బీహార్ కు కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సీఎం నితీష్ కుమార్ కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నితీష్ కుమారే మీడియాకు చెప్పారు. ఇక్కడే నితీష్, బీజేపీల కుమ్మక్కు అనుమానాలు వెల్లువెత్తాయి. బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఫోన్ చేసి మరీ బీహార్ సీఎంకు చెప్పారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పైగా నితీష్ కుమార్ బీజేపీకి ఆషామాషీగా గుడ్ బై చెప్పలేదు. తన నేతృత్వంలో బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి, తాను స్వయంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీకి బద్ధ శత్రువైన ఆర్జేడీ, కాంగ్రెస్ లతో మహాఘట్ బంధన్ పేర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని రాజకీయ వర్గాలలో చర్చ జోరందుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఐక్యత కోసం నితీష్ కుమార్ స్వయంగా జాతీయ స్థాయిలో పలువురు నేతలను కలిశారు. అవి ఎంత వరకూ సఫలమయ్యాయన్న విషయాన్ని పక్కన పెడితే.. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేందుకు బీజేపీ నితీష్ కుమార్ ను మళ్లీ కమలం గూటికి అంటే ఎన్డీయేలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నితీష్ కుమార్ విషయంలో విపక్షాలలో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే నితీష్ కుమార్ పరిస్థితులను బట్టి దోస్తానీ, కటీఫ్ లు చెప్పడంలో ఆరితేరిన దిట్ట అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే  నితీష్ కుమార్‌కు అమిత్ షా కాల్ పట్ల బీజేపీయేతర పార్టీల నేతలలో శంక మొదలైంది. అయితే జేడీయూ అధికార ప్రతినిథి మాత్రం నితీష్ మళ్లీ ఎన్డీయే గూటికి అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. నితీష్ కుమార్, జేడీయూ సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉన్నాయన్నారు. బీజేపీ ముక్త భారత్ కోసం నితీష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వివరించారు. 

డామిట్ .. బీఆర్ఎస్ కథ అడ్డం తిరిగింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ వ్యూహరచనలో ఆరి తేరిన దిట్ట. ఎత్తుకు పైఎత్తులువేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి...  అయితే, ఇదంతా  నిన్నటి వైభోగం. ఈ రోజు ఆయన ఏమిటో, ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. ఆయన ముందులా స్థిరంగా స్థిమితంగా ఏ విషయం పైనా దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఒకడుగు అటు ఒకడుగు ఇటు వేసి చివరకు ఎటు కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో క్యాడర్  లో గందరగోళం ఏర్పడుతోంది. ఇది ఎవరో పరాయి వాళ్ళో  ప్రతిపక్షాలో చేస్తున్న ఆరోపణ కాదు. ముఖ్యమంతి కేసీఆర్  ఇన్నర్ సర్కిల్ లోని కీలక నేతలే  ఆఫ్కోర్స్ ఆఫ్ ద రికార్డ్ అనుకోండి.. ఇలాటి వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఒకటికి రెండు సార్లు తన డొల్ల తనాన్ని బయట పెట్టుకున్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) బహిష్కృత నేత, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  విషయంలో ఆయన తీసుకున్న యూ టర్న్, పార్టీ ఇమేజ్ ని బాగా డ్యామేజి చేసిందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసేఆర్  ఈటల పేరు తీసుకున్నప్పుడు, సభలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు  ఆయన ‘అంతరంగం’ అర్థం కాలేదు. ఆయన ఏదో సైటైరిక్ గా ఈటలపై వ్యంగ బాణాలు విసురుతున్నారని భావించారు. అందుకే ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు ఫక్కున నవ్వారని  అయితే ముఖ్యమంత్రి ఒకటికి పదిసార్లు ఈటలను పొగడ్తలతో ముంచెత్తిన తర్వాత గానీ, అసలు విషయం అర్థం కాలేదని అంటున్నారు. అర్థమైన తర్వాత  ఈటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కోరుకుంటున్నారనే విషయం అర్థమై, విస్తు పోయామని అంటున్నారు. అలాగే  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైలైట్ గా నిలిచిన ఈటల ఎపిసోడ్   విషయంలో, పార్టీ నాయకులు మీడియా ముందు చిలక పలుకులు పలుకులు పలుకుతున్నా వ్యక్తిగత చర్చల్లో మాత్రం ఈటల ఎపిసోడ్  కేసేఆర్  ఇమేజ్ ని, పార్టీ ఇమేజ్ ని  గట్టిగా  దెబ్బతీసిందని  పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం పర్యవసానంగానే ఈరోజు అధికారం చేజారే పరిస్థితి వచ్చిందని  కొంచెం చాలా ఆలస్యంగా ముఖ్యమంత్రి గుర్తించారని అంటున్నారు.    మరోవంక ఈటల రాజేందర్  ను టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి బహిష్కరించడం, ఆ తర్వాత కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడం కేసీఆర్ చేసిన రెండు చారిత్రక తప్పిదాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి  ఈటలను మెడ పట్టి బయటకు గెంటిన తర్వాతనే భారాస కష్టాలు మొదలయ్యాయి. కేసేఆర్ అడుగులు తడబడడం వ్యూహాలు దెబ్బతినడం మొదలైందని, ఇక అక్కడి నుంచి తప్పు వెంట తప్పు దొర్లుతూ వస్తోందని అంటున్నారు. ఈ అన్నిటి పర్యవసానంగానే, ఈ రోజు ఒక్క కేసేఆర్ మాత్రమే కాదు, కేటీఆర్, హరీష్ రావు కూడా శాసన సభలో ఈటలను పొగిడి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయవలసి వచ్చిందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.  అదలా ఉంటే జాతీయ రాజకీయాల విషయంలోను కేసీఆర్ చరిత్రక తప్పిదమన దగ్గ తప్పిదం  చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. నిజానికి, కాంగ్రెస్ ను కాదని, జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక వేదిక ఏర్పాటు అయ్యే పని కాదు, అందుకే కేసీఆర్ ఎన్నిగడపలు తొక్కినా శరద్ పవార్ మొదలు తేజస్వీ యాదవ్ వరకు ఎందరితో  మంతనాలు జరిపినా   ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు జాతీయ రాజకీయాల్లో మనుగడ కోసం పార్టీ పేరు మార్చుకున్నా అదీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దేశం మొత్తంలో ఎక్కడా కూడా తీసేసిన తసిల్దార్లు తప్ప సత్తా ఉన్నా నాయకుడు ఎవరూ బీఆర్ఎస్ చెంతకు రాలేదు. అందుకే, పార్టీ పేరు మార్పు వలన ఒక విధంగా రెంటికీ చెడిన రేవడిలా ఉభయ భ్రష్టత్వం నెత్తికి ఎత్తుకున్నట్లు అయిందని అంటున్నారు. అందుకే కామోసు, బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రస్థానం, రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ, హత్యలుండవు, అనే నానుడిని మరో మారు రుజువు చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.

మోదీ సర్కార్ ముద్దుబిడ్డ జగన్!?

అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో .. ఇది చాలా పాత సామెత. అయితే, రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే వ్యవహరిస్తాయా? కేంద్ర ప్రభుత్వానికి అణిగి మణిగి, ప్రధాని మోదీ ఇతర కేంద్ర పెద్దల అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల విషయంలో ఒకలా ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరిస్తాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  అడ్డుపెట్టి కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం మొకాలడ్డింది. కానీ, పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనూ మండలి ఎన్నికల షెడ్యూలు విడుదలైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కడప ఉక్కు ఫ్యాక్టరీ  శంకుస్థాపనకు(అది కూడా నాలుగో సారి) మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇది  రాష్ట్రాల మధ్య వివక్ష కాదా, అని తలసాని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.   అవును  సచివాలయం ప్రారంభోత్సవానికి అడ్డుపడిన కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై  మంత్రి తలసాని తమ సహజ ధోరణిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ కడపలో ఉక్కు కర్మాగారానికి బుధవారం (ఫిబ్రవరి 15) శంకు స్థాపన చేశారు.  అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కానీ, తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి మాత్రం ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. నిజానికి, కడప  జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. అలాంటప్పుడు అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వనికి అనుమతి ఇవ్వడాన్ని తాము తప్పు పట్టడం లేదని, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిపేందుకు ఇదొక ఉదహరణ మాత్రమే తలసాని చిన్నపాటి వివరణ కూడా ఇచ్చారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 17 చేపట్టాలని భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చింది. రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. అదే విధంగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటించింది. గురువారం (ఫిబ్రవరి 16) నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13న ఎన్నికలు జరుగన్నాయి. మార్చి 16న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నూతన సచివాలయ ప్రారంభోత్స తేదీని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఈసీని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 17న జరగాల్సిన నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే తాజాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కూడా ఏపీ సీఎం జగన్ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం.. అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్.. ఎన్నికల సంఘం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజమే, ఈ ఒక్క విషయంలోనే కాదు, అడ్డగోలు అప్పులకు అనుమతి ఇచ్చే విషయంలో అయితే నేమీ, కోర్టు కేసుల  విషయంలో వెసులుబాటు కల్పించే విషయంలో అయితే నేమీ, ప్రధాని ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ విషయంలో అయితే నేమి, ఇతరత్రా వ్యవహారాల విషయంలో అయితే నేమీ, కేంద్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రుల కంటే కొంచెం ఎక్కువగా చూస్తోందనేది నిజం. అయితే అందుకు కారణం కూడా లేక పోలేదు. కేసేఆర్ లేదా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాగా  జగన్ రెడ్డి కేంద్రం కట్టు దాటడం లేదు.  అసలు కేంద్రాన్ని పల్లెత్తు మాటైనా అనని ‘మంచి’ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్నారు. పాదాభివందనాలు, సాష్టాంగ సంస్కారాల, వంగి వంగి దండాలు పెట్టే విషయంలో ఆయన ఏ మాత్రం భేషజాలు పోరు.  సో...  కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం పట్ల ప్రత్యేక ప్రేమ చూపుతోంది అనుకోవచ్చు. అయితే, ఎన్నికల సంఘం వంటి రాజ్యంగ వ్యవస్థలు కూడా ఇలా జీ హుజూర్. అనవచ్చునా...?

అత్మవంచన పరనింద!

నిజమే కావచ్చు...  ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చును, కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను కూడా ప్రజలు మరిచి పోతారు, నాకే జై కొడతారని ఎవరైనా అనుకుంటే, అలాంటివారు అయితే మంద బుద్దులో, మరొకటో అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో ఏమో కానీ, ‘నువ్వే మా నమ్మకం’ అని ఆయనకు ఆయనే ప్రచారం చేసుకోవడం, ఇంటింకీ వెళ్లి స్టిక్కర్లు అంటించడం చూస్తుంటే, ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇంకేమైనా కారణంగా ఆయన తన ముందు జరుగుతున్న నిర్వాకాన్ని  చూడలేకపోతున్నారా? అంటే సమాధానం చెప్పడం కష్టమే కానీ, జగన్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారని మాత్రం నిస్సందేహంగా చెప్ప వచ్చునని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.   నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే  పతాక స్థాయికి చేరింది. గడప గడపకు.. ప్రచారంలోనే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేసేందుకు... గడపగడప నివేదికలను సిద్ధం చేసుకున్నారు. నిజమే  ఎమ్మెల్యేల పట్ల  స్థానికంగా వ్యతిరేక ఉన్నమాట నిజం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం దిగమింగే దౌర్భాగులు ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా మరొకరు అయినా సహజంగానే అలాంటి వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఇసుక మాఫియా, మరో మాఫియాలో మునిగి తెలుతున్నవారే అనే ఆరోపణలు వస్తున్నపుడు.. ఎమ్మెల్యేల పై స్థానికంగా వ్యతిరేకత భగ్గుమంటుంది. అందులో సందేహం లేదు. ఆ కోణంలో చూసినప్పడు, ముఖ్యమంత్రి పాయింటవుట్  చేసిన 40 మందో 50 మందో ఎమ్మెల్యేల పై మాత్రమే కాదు, అధికార పార్టీ పార్టి ఎమ్మెల్యే ఎదో ఒక అవినీతి కుంభకోణంలో ఇరుకుని ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటున్న వారే అయితే కావచ్చు కానీ, వాస్తవంలో ఎమ్మెల్యేల పట్ల ఎంత వ్యతిరేకత వుందో అంతకు రెట్టింపు స్థాయిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజాగ్రహం పెల్లుబుకుతోందని అనేక సర్వేలు చెపుతున్నాయి. నిజానికి, ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు నేరుగా ముఖ్యమంత్రి ఖాతాలో పడుతున్నాయి. వాస్తవం ఇలా ఉంటే, ముఖ్యమంత్రి మరోమారు భజన బృందాలను సిద్దం చేసి, నువ్వే మా నమ్మకమని బలవంగా అనిపించేందుకు, స్టిక్కర్ల దండును సిద్దం చేస్తున్నారు. వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు అంతా కట్ట కట్టుకుని ఇళ్లు, వాకిళ్ళ మీద స్టిక్కర్లు అంటించే  ఆత్మానంద కార్యక్రమానికి శ్రీకారం  చుడుతున్నారు. నిజమే  అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వచ్చి ఇంటికి స్టిక్కర్ అంటిస్తామంటే సహజంగా ప్రజలు  ఇష్టం ఉన్నా లేకున్నా కాదనరు. కావాలంటే, ఇంటికి, ఫోన్ కే కాదు ముఖాలకు అంటిస్తామన్నా  సమాన్య ప్రజలు వద్దనే సాహసం చేయరు. అలాగని, రేపటి ఎన్నికల్లో స్టిక్కర్లు ఓట్లుగా మారతాయని అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. జగన్ రెడ్డికి ఈ ‘చక్కటి’ సలహా ఎవరు ఇచ్చారో కానీ  ఇది ఆత్మవంచన, పరనిందకు పరాకాష్టగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లో ఈ రెండు లక్షణాలు కొంచం చాలా ఎక్కువనే అంటారు. ఇప్పడు, ఆ స్టిక్కర్ స్కీంతో అది పరాకాష్టకు చేరుకుందని, అంటున్నారు.

బీఆర్ఎస్ కు వామపక్షాలు దూరం.. కారణమదేనా?

బీఆర్ఎస్ కు మిత్రులు దూరమౌతున్నారా? ఇతర రాష్ట్రాలలో విస్తరణ పేరుతో రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిన నాయకులను  చేర్చుకుని తన భుజాలను తానే చరుచుకుంటున్న కేసీఆర్.. తెలంగాణలో మాత్రం ఉన్న మిత్రులను దూరం చేసుకుంటోంది. గత ఎనిమిదేళ్లుగా అరమరికలు లేకుండా మిత్రపక్షంగా (ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు) ఉన్న ఎంఐఎం కారణాలేమైతేనేం ఇటీవలి కాలంలో దూరం జరుగుతూ వస్తోంది. ఇక బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదికగా.. బేషరతుగా కేసీఆర్ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తూ ముందుకు వచ్చిన వామపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) కు బేషరతు మద్దతు ప్రకటించిన వామపక్షాలు ఆ పార్టీ అభ్యర్థి విజయానికి తమ వంతు సహకారం అందించాయి. అప్పుడే కాదు.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ.. వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచాయి. అందుకు వారు చెప్పిన మాట మతతత్వ శక్తులు బలోపేతం కాకుండా అడ్డుకోవడమేనని చెబుతూ వచ్చారు. అంత వరకూ బానే ఉంది.. కానీ హఠాత్తుగా వామపక్షాలు ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగననున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలన్న వ్యూహంతో వామపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తో దోస్తీ ఉన్నప్పటికీ ఆయన వామపక్షాలకు తగినన్ని సీట్లు కేటాయిస్తారన్న నమ్మకం ఆ పార్టీలకు లేకపోవడంతో వామపక్షాలు వ్యూహం మార్చాయి. బీఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టి వామపక్షాలు ఉమ్మడిగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలన్న వ్యూహంతో ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్ల జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల బలోపేతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఈ సంగతిని వామపక్షాల అధిష్ఠానాలు ప్రకటించకపోయినప్పటికీ.. తెలంగాణలో సంభవిస్తున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే.. వామపక్షాల వ్యూహం బీఆర్ఎస్ విషయంలో మారిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించడాన్ని చూపుతున్నారు. వామపక్షాలకు ఎటూ సొంతంగా అధికారంలోకి వచ్చే బలం తెలంగాణలో లేదు. అయినా ఆ పార్టీ  బీజేపీ వ్యతిరేకత విషయంలో  ముందు వరుసలో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కూడా గతంలో ఎలా ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆయన మాట, శ్వాస కూడా బీజేపీ వ్యతిరేకతే అన్నట్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు కేసీఆర్ కు బేషరతుగా దగ్గరయ్యాయి. గతంలో వామపక్షాలను చులకన చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలూ, విమర్శలను సైతం పట్టించుకోకుండా మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఆ తరువాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనూ సందడి చేశాయి. మరి హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ.. సొంతంగా పోటీపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఫోకస్ పెట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు చేరువ అవుతున్న సంకేతాలు ఇచ్చాయి. ఇందుకు కారణం.. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు వామపక్షాలతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం పట్టు బలం లేని వామపక్షాలకు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం లేదనీ, కేసీఆర్ కూడా పోత్తు ఉన్నప్పటకీ వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా సానుకూలత చూపే అవకాశం లేదనీ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే వామపక్షాలు తమ దారి తాము చూసుకుంటున్నాయని అంటున్నారు.  ఇదిలా ఉంటే నల్గొండ  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని వ్యాఖ్యానించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని కూడా వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీ.. అధికారం దక్కించుకున్నా దక్కించుకోలేకపోయినా.. రాష్ట్రంలో చెప్పుకోదగ్గంతగా బలపడిందన్నది మాత్రం నిర్వివాదాంశం. అలాగే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టడం, రాహుల్ భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ లో ఆత్మ విశ్వాసం పెరిగింది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో విజయంపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గణనీయంగా బలపడింది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఎర్పడు అవకాశాలున్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా బీఆర్ఎస్ కు దూరం జరిగి కాంగ్రెస్ కు చేరువ కావడానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఎలాగూ బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ కు సెక్యులర్ పార్టీగా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉంది. ఒక స్టేచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా ఎన్నికల తరువాత ఎటూ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దగ్గరవ్వక తప్పని పరిస్థితి ఉన్నందున ముందే కాంగ్రెస్ కు దగ్గరైతే గౌరవంగా ఉంటుందని వామపక్షాలు భావిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం!

నందమూరి తారక రామా రావు...  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.   రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే.  ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణెం త్వరలో విడుదల కానుంది. 

రాజ్యాంగ బద్ధ పదవుల్లో రాజకీయ నియామకాలా?

దేశంలో గవర్నర్లను నియామకం అయితే సంచలనమైనా అవుతోంది.. లేకపోతే వివాదాస్ప దమైనాఅవుతోంది. రాజకీయమే ఇందుకు కారణమనడంలో సందేహంలేదు.ఏ రాష్ట్రానికైనా కొత్తగా గవర్నర్‌ నియామకం జరిగిన వెంటనే గవర్నర్ల వ్యవస్థ అవసరంపై చర్చ అనివార్యంగా తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలలో తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ విషయమే తీసుకుంటే.. తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తమిళనాడులో అయితే ఏకంగా అసెంబ్లీ సాక్షిగానే గవర్నర్ వైఖరిని అక్కడి స్టాలిన్ ప్రభుత్వం తప్పుపడితే.. గవర్నర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాలలో  గవర్నర్లను నియామకం మార్పు చేసినప్పుడు మరో సారి దేశ వ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థపై చర్చకు తెరలేచింది.  గవర్నర్ల నియామకంలో ప్రథమ ప్రాథాన్యత  రాజకీయ ప్రయోజనాలకే ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతోంది. ఇది కేంద్రంలో బీజేపీ కొలువుతీరిన తరువాత ప్రారంభం కాలేదు... ఇక్కడితో అగుతుందన్న నమ్మకమూ లేదు.  రాజకీయ ప్రాధాన్యత ఆధారంగానే గవర్నర్లను నియమించడం అన్నది  గతంలోనే అంటే ఇందిరా గాంధీ హయాం నుంచే ఆరంభమైంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో గవర్నర్ గా ఉన్న రామ్ లాల్ వ్యవహరించిన తీరు ఎంత వివాదాస్పదం అయ్యిందో తెలియంది కాదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కుముద్ బెన్ జోషి ఉన్న సమయంలో కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా రాజ్ భవన్ ఉండేదని రాజకీయ పండితులు ఇప్పటికీ చెబుతుంటారు.  అప్పట్లో ఇలా ఒకటి రెండు ఉదాహరణలే ఉండేవి. అప్పట్లో కూడా గవర్నర్ల వ్యవస్థ అవసరమా అన్న చర్చ పెద్ద స్థాయిలోనే జరిగింది. గవర్నర్ వ్యవస్థ అనవసరం అన్న చర్చకు అప్పట్లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చాలా బలంగా తెరమీదకు తీసుకువచ్చారు. ఇక ఇటీవలి కాలంలో అయితే  చాలా వరకూ  గవర్నర్లు పూర్తిగా రాజకీయ పాత్రల పోషణకే పరిమితమైపోయారన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది.  జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో గవర్లర్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  అందుకే రాజకీయ పునరావాసంగా గవర్నర్లను నియమిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కేంద్రం లో ఉన్న ప్రభుత్వాలు తమ పార్టీకి చెందిన సీనియర్లకు, పదవుల అవకాశం లభించని వారికీ రాజకీయ పునరావాసం కింద గవర్నర్ పదవులలో నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేని కీలక పదవులలో పని చేసి రిటైర్ అయిన వారిని గవర్నర్లుగా నియమించడానికి ప్రాధాన్యత ఇస్తున్నది. అయితే ఆ నియామకాలు కూడా వివాదాస్పదంగానే మారడం గమనార్హం. ఉదాహరణకు ఏపీ గవర్నర్ గా కేంద్రం ఇటీవల నియమించిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి   జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం విషయంలో వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న చర్చనే చెప్పుకోవచ్చు.  రాజకీయ రంగం నుంచి వచ్చిన వారి కంటే న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థల నుంచి వచ్చిన వారు   రాజ్యాంగానికే కట్టుబడి ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. అయితే కేంద్రం ఇటీవలి నియామకాలను గమనిస్తే..  విధి నిర్వహణలో తమకు అనుకూలంగా వ్యవహరించిన వారిని పదవులతో కేంద్రం సత్కరిస్తోందా అన్న అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తడానికీ, ఆ నియామకాలు వివాదాస్పదంగా మారడానికీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

సోము వీర్రాజుపై భూ కబ్జా ఆరోపణలు!

ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీజేపీకి అడుగడుగునా అడ్డంకులూ, అవాంతరాలే ఎదురౌతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వైఖరిని నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారు. నేడో, రేపో ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారని కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. మరో వైపు సోము వీర్రాజు పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ అలా ఉంచితే.. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వర్గం రాష్ట్రంలో అధికార వైసీపీతో అంటకాగుతోందన్న విమర్శలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్త మౌతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు వీర్రాజు సన్నిహితంగా మెలుగుతూ అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలాగే తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక సందర్బంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా బుధవారం ( ఫిబ్రవరి 15) ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. సోము వీర్రాజు దళితుల భూములను కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.   విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డికి సోముకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో కిషన్ రెడ్డి కారును అడ్డుకుని సోముకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  వారి ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయమేమిటంటే.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకుడు లక్ష్మీపతి రాజా, వల్లభనేని సుధాకర్ లు  మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీకి సమీపంలో  దళితులకు చెందిన ఆరు ఎకరాల భూమిని   తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమతా సైనిక్ దళ్ (ఎస్ఎస్ డి)ఆరోపిస్తోంది.   వరప్రసాద్‌ అనే దళితుడి భూమిని కబ్జా చేసేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని  ఆరోపించింది.  సోము వీర్రాజు కు వ్యతిరేకంగా ఈ నెల 18న ఏపీ బీజేపీ కార్యాలయ ముట్టడికి దళిత సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితుల నిరసనలు, ఆందోళనలూ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

మారుత్ యుద్ధ విమానంపై హనుమంతుడి బొమ్మ తొలగింపు

యుద్ధవిమానం పైనున్న హనుమంతుడి చిత్రాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) మంగళవారం (ఫిబ్రవరి 14) తొలగించింది. విమానం తోక భాగంలో ఏరో ఇండియా-2023లో ప్రదర్శించిన హెచ్ఎల్ఎఫ్‌టీ-42 యుద్ధ విమానం మోడల్ తోక భాగంలో హనుమాన్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా  స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘మారుత్’ యుద్ధవిమానం స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ‘హెచ్ఎల్ఎఫ్‌టీ-42’ విమానాన్ని రూపొందించింది. ఈ విమానం తాలూకు మోడల్‌ను బెంగళూరులో  జరుగుతున్న ఏరో ఇండియా షోలో ప్రదర్శించింది. మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. పవనసుతుడు హనుమంతుడు కాబట్టి.. హెచ్ఎల్ఎఫ్‌టీ-42పై హనుమంతుడి చిత్రాన్ని ఏర్పాటు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ. అయితే ఆ చిత్రాన్ని ప్రదర్శన ప్రారంభమైన రెండో రోజే ఎందుకు తొలగించారన్నదానిపై మాత్రం ఎటువంటి సమాచారం లేదు.