తెలుగుదేశం, జనసేన పొత్తు గ్యారంటీ.. బీజేపీ పరిస్థితేంటి?
posted on Feb 11, 2023 @ 12:13PM
ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్ పదేపదే చెప్పడం వెనుక అంతరార్థం ఇదేనని ఇరు పార్టీలూ కూడా చెబుతున్నాయి. ఇక సీట్ల సర్దుబాటు కుదరడం, పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడటం తరువాయి అన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనల ఎన్నికల పొత్తుపై సందేహాలు అనవసరం అని పరిశీలకులు సైతం జరిగిన, జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణల్లో స్పష్టం చేస్తున్నారు. పవన్, చంద్రబాబు ఇటీవల విజయవాడలో ఒక సంయుక్త సమావేశంలో కూడా ఉభయులు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతునట్లు, ఇందులో భాగంగా త్వరలో రోడ్ మ్యాప్ రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇక్కడే జనసేన, బీజేపీ మైత్రి విషయం సంగతేమిటన్న చర్చ తెరమీదకు వస్తోంది.
జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే జనసేన, బీజేపీల మధ్య ఉన్న మైత్రీ బంధం దాదాపు తెగిపోయినట్లేనని చెబుతున్నారు. బీజేపీతో మైత్రి కొనసాగినా, కొనసాగకపోయినా.. పెద్దగా ఫరఖ్ పడదని జనసేనాని భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ కూటమి విజయం నల్లేరు మీద బండినడకేనన్న అభిప్రాయం.. రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వ్యక్త మౌతోంది. ఇరు పార్టీలకూ కలిసి కనీసం 44శాతం ఓట్లు ఉంటాయన్నది ఆ పార్టీల అంచనా, అదే సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీపై రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత తెలుగుదేశం, జనసేన కూటమికి మరింత బలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలలో తెలుగుదేశం, జనసేన పొత్త ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంత వరకూ వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన సీఎం జగన్ స్వరంలో కూడా మార్పు కనిపించింది. ఎలాగోలా అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా ఆయన మాటలూ, చేతలూ మారిపోయాయి. వరుస సమావేశాలతో పార్టీ శ్రేణులకూ దిశా నిర్దేశం చేయడానికి సిద్ధమౌతున్నారు. అదే సమయంలో జగన్ ప్రజలలోకి వెళ్లడానికి కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఇవన్నీ దింపుడు కళ్లెం ఆశలేనని అంటున్నారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్కుకునేందుకు అవసరమైన పటిష్టమైన పార్టీ నిర్మాణం, యంత్రాగం, నెట్ వర్క్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే సమయంలో క్రౌడ్ పుల్ చేయగలిగిన కరిష్మా జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉంది. అందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు ప్రభంజనం సృష్టిస్తుందన్న గుబులు అధికార వైసీపీలో రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఆశ మొత్తం బీజేపీపైనే పెట్టుకుంది. ఆ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తెరవెనుక సాయం చేస్తే చేకూరే ప్రయోజనంపైనే ఇప్పుడు వైసీపీ తన ఆశలన్నీ పెట్టుకుంది. పవన్‌తోనే మా మైత్రి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించినా అది నాలుక చివరి మాటే తప్ప మరొకటి కాదని ఎవరికైనా ఇట్టే అర్దమైపోతుంది. ఎందుకంటే.. టీడీపీ జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లుగా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నా.. జనసేనతో తమ కున్న మైత్రిని పదిలం చేసుకోవడానికి, మరింత పటిష్టం చేసుకోవడానికి బీజేపీ నుంచి ఇంత వరకూ వీసమెత్తు ప్రయత్నం కూడా జరగలేదు. మరో వైపు జనసేన, బీజేపీ మైత్రి కొనసాగాలనీ, ఆ రెండు పార్టీలతో కలిసి పొత్తు ఉంటే విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని తెలుగుదేశం భావిస్తోంది.
అందుకే తెలంగాణలో అడుగులు బలంగా వేస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధికారం చేజిక్కించుకునేంత బలం లేకపోయినా.. కనీసం పాతిక, ముఫ్ఫై నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే సత్తా ఆ పార్టీకి ఉంది. అందుకే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. తెలంగాణలో తెలుగుదేశం సహకారం ఉంటే మేలని భావించేందుకు వీలుగా.. ఆ రాష్ట్రంలో బలప్రదర్శనకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభతో తెలుగుదేశం తెలంగాణలో ఇప్పటికీ ఒక బలీయమైన శక్తి అన్నది చాటిన చంద్రబాబు. త్వరలో మరి కొన్ని బహిరంగ సభలతో బీజేపీ దృష్టిని ఆకర్షించాలన్న వ్యూహంతో ఉన్నారు.
అంటే తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం సహాయం, ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం అన్న ఒప్పందం దిశగా కమలం పార్టీపై ఒత్తిడి తీసుకురావడమే చంద్రబాబు ఎత్తుగడగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ ఎత్తుగడ ఫలిస్తే.. అటు తెంగాణలో బీజేపీకి అధికారం, ఇటు ఏపీలో తెలుగుదేశం విజయం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకుల విమర్శలు, వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు స్పందించడం లేదనీ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో తెలుగుదేశం సహకారం కోసం.. బీజేపీ అనివార్యంగా ఏపీలో తెలుగుదేశం కూటమికి చేరకతప్పని పరిస్థితులు ముందు ముందు ఎదురౌతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.