ఆలీ .. కల తీరేనా?
కమెడియన్ అలీ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. ఆయన జగమెరిగిన కమెడియన్ ... బాలా నటుడిగా అరంగేట్రం చేసిన అలీ, అలా అలా ఎదుగుతూ వచ్చారు. వందల్లో కాదు, వెయ్యికి పైగానే సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా ఒకటో రెండో (ఇంకా ఎక్కువో) సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అలాగే అలీ ...తో సరదాగా .. కార్యక్రమంతో టీవీ యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇన్ని మాటలు ఎందుకు గానీ,తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని, గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకున్నారు. సందేహం లేదు.
అంతవరకు అయితే, ఓకే కానీ ఈలోగా ఆలీని రాజకీయ పురుగు కుట్టింది. సినిమా విజయాలతో సంతృప్తి చెందని ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు.నిజానికి ఆలీ రాజకీయలకు కూడా కొత్తకాదు. ఎంతో కాలంగా ఆయన పొలిటీషియన్ అయిపోవాలని కలలు కంటున్నారు. కాస్ట్యూమ్స్ గట్రా రెడీ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, లంచ్ కి పిలిచి త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, కొత్త బొత్తాలు కుట్టించుకుని రెడీ అయి పోయారు. అయితే, కొత్త బట్టలు పాతబడి పోయాయి కానీ, ప్యాలెస్ నుచి పిలుపైతే రాలేదనుకోండి అది వేరే విషయం.
అయితే ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా పట్టుకోవాలని, ఆలీ ఎప్పటి నుంచో కలలు కంటూనే ఉన్నారు. ముందు తెలుగు దేశం టికెట్ కోసం ట్రై చేశారు. అప్పట్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి టికెట్ కన్ ఫర్మ్ అయిపోయిందని కూడా టాక్ నడిచింది. అయినా అదేమీ జరగలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన రెండూ పార్టీలకూ బాగా దగ్గరగా ఉన్న అలీ.. ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు.
పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడేళ్ళు మురిపించి, రాజ్యసభ, ఎమ్మెల్సీ మొదలు మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవి వరకు చాలా చాలా ఆశలు చూపించి, చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. పాపం ఆలీ అదే మహా ప్రసాదం అన్నట్లుగా సంబరపడి పోయారు. ఆ సంబరం,సంతోషంలో ఏకంగా పవన్ కల్యాణ్‌నే వ్యతిరేకించి ఆయనపైనే పోటీ చేస్తానని ఛాలెంజ్ చేశారు. నిజానికి రాజకీయాలను పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ తో ఆలీకి చాలా మంచి సంబంధాలున్నాయి. ఇంచు మించుగా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ, కథతో సంబంధం లేకుండా ఆలీకి అవకాశం కల్పించారు. అయినా ఆలీ, ఎట్టయినా ఎమ్మెల్యే అయిపోవాలనే కోరికతోనే కావచ్చును, తిన్నింటి వాసాలు లెక్కించేందుకు కూడా సిద్దమై పోయారని అంటారు.
అదొకటి అలా ఉంటే చివరకు ఆలీ కల నెరవేరుతుందా? తల్లినీ, చెల్లినే కాదు పొమ్మన్న వైసీపీ ఓనర్ జగన్మోహన్ రెడ్డి అలీకి పార్టీ టికెట్ ఇస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి తర్వాత తండ్రి అంతటి బాబాయ్ నే పక్కకు తప్పించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ రెడ్డి అలీ కి ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పిస్తారా? అంటే, అదేమో గానీ, ఆలీ మాత్రం రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి ఫిక్స్ య్యారని అంటున్నారు.
అంతే కాదు ఆయన ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకుని సర్వేలు కూడా చేసి అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారని అంటున్నారు. ఇందులో గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయట. ఈ నియోజకవర్గాల్లో ఏ చోట నుంచి పోటీ చేసినా సరే కచ్చితంగా గెలుస్తాననే ధీమా అలీకి ఉందట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట.
అలీ సినిమా పరంగా మంచి నటుడే కావచ్చు.. అంతకంటే ఎక్కువ పేరున్న వ్యక్తే కావచ్చు. కానీ నటన, రాజకీయం వేరు అనేది ఇప్పటి వరకూ రీల్ నుంచి రియల్ లైఫ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన పలువురి విషయాల్లో నిరూపితమైంది. పైగా రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలని.. ఏం చేస్తే గెలుస్తామని కాకలు తీరిన నేతలే అర్థం కాక జుట్టు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అలీ పోటీచేస్తే ఏ మాత్రం గెలుస్తారనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. తాను కోరుకున్న అసెంబీ స్థానాన్ని ఇస్తే 20 నుంచి 30 కోట్లు డబ్బులు సొంతంగా ఖర్చుపెట్టడానికి కూడా అలీ సిద్ధమయ్యారట. కానీ, కేవలం కాసులతోనే పనవుతుందా అంటే, అది అయ్యే పని కాదని చరిత్ర చెపుతోంది. మరో వంక అలీ ఆశిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు పోటా పోటీగా టికెట్లు ఆశిస్తున్నారే తప్ప.. ఖాళీ అయితే ఎక్కడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి అంతటి ఉద్ధండులను కాదని అలీకి టికెట్ ఇస్తారా? ఇస్తే మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కుంటున్న వ్యతిరేక సునామీలో అలీ నిలబడి గెలుస్తారా? ఏమో ... చివరకు ఏమి జరుగుతుందో ... శుభం కార్డు ఎలా అపడుతుందో చూడవలసిందే ,, అంటున్నారు విశ్లేషకులు