విజయవాడలో పొలిటికల్ హీట్... కేసినేని నాని అడ్డాలో నాయుడుగారి కోడలు?
posted on Feb 13, 2023 @ 2:44PM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యిందా? వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా.. పార్లమెంటు స్థానాలలో కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి చేసేశారన్న టాక్ పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఎంత ముఖ్యమో, అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలలో విజయం సాధించి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సంపూర్ణంగా సాధించడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదేమంత కష్టసాధ్యం కాదని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం నల్లేరు మీద బండినడకేనని ఆయన అంచనా వేస్తున్నారు.
అధికార వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అన్ని వర్గాలూ తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతాయన్న విశ్వాసం ఆయనలోనే కాదు, తెలుగుదేశం శ్రేణుల్లోనూ వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ శపథం కూడా తెలుగుదేశం పార్టీకే ప్రయజనకరంగా పరిణమించనున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు ఇప్పటికే ఖాయమైందనీ, అధికారిక ప్రకటన లాంఛనమేననీ భావిస్తున్న వేళ.. చంద్రబాబు లోక్ సభ నియోజకవర్గాలపై కూడా దృష్టి పెట్టారని చెబుతున్నారు. కచ్చితంగా గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న చంద్రబాబు రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలలో 24 నియోజకవర్గాలపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అయితే కీలకమైన విజయవాడ లోక్ సభ స్థానం విషయంలోనే ఆయన ఒకింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారనీ, ఆ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు ప్రతిబంధకంగా మారాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికలలో విజయవాడ ఎంపీగా ఎన్నికైన కేశినేని నాని, ఈ సారి ఎన్నికలలో ఆ సీటు కోసం పోటీ పడుతున్న ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ల మధ్య సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పడం లేదంటున్నారు. కేశినేని నాని వ్యవహార శైలి పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నది. అదే సమయంలో ఆయన సోదరుడిని ప్రోత్సహించి టికెట్ ఇచ్చినా.. కేశినేని నాని సహకారం లేకుంటే విజయం సాధించే అవకాశం లేదు. అలాగని కేశినేని నానికి టికెట్ ఇచ్చినా ఆయన సోదరుడి సహకారం అవసరం. వీరిద్దరినీ కాదని కొత్త వారిని ఎంపిక చేస్తే.. అన్న ఆలోచనే నారా బ్రాహ్మణి పేరును తెరమీదకు తెచ్చిందంటున్నారు.
నారా బ్రాహ్మణిని విజయవాడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కేశినేని బ్రదర్స్ ఇద్దరూ మారు మాట్లాడకుండా అంగీకరిస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కేశినేని నాని తనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. తన సోదరుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వడానికి వీల్లేదని పేర్కొన్న సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అందుకే నారా బ్రాహ్మణిని విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే కేశినేని బ్రదర్స్ ఇద్దరూ పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తారని, అదే సమయంలో బ్రాహ్మణి ఎంట్రీ పార్టీకి కొత్త జోష్ తీసుకు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి మరింత ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, జనసేనాని పవన్ కల్యాణ్ ల సినిమా గ్లామర్ కు ఎన్టీఆర్ మనవరాలు బ్రాహ్మణి ఎంట్రీ మరింత బలం చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ అధినేతగా చంద్రబాబు ప్రజాక్షేత్రంలో జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నారు. ముందు ముందు (పొత్తు కుదిరితే) పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కూడా తెలుగుదేశం గ్రాఫ్ ను మరింతగా పెంచేస్తుంది. ఇక విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఇటు అసెంబ్లీ, అటు లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం స్వీప్ చేయడం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
అదే విధంగా బ్రాహ్మణి లాంటి విద్యావంతురాలు లోక్ సభలో తెలుగుదేశం సభ్యురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. ఏతా వాతా వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంతో పొత్తు కుదిరితే బ్రాహ్మణికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.