లోకేష్ పాదయాత్రకు రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర  సోమవారం 11వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పెరుగుతున్న జనాదరణతో  లోకేష్ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగుతోంది.  నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లును పూర్తి చేసుకొంది. జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతోన్నారు. అలాగే  జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను లోకేష్ ఈ పాదయాత్రలో ఎండగడుతున్నారు. విపక్ష  న నేతగా ఉండగా జగన్ చేసిన పాదయాత్రలో నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు..  గద్దెనెక్కిన ఈ మూడున్నరేళ్లలో వాటిని విస్మరించిన తీరును ప్రజలకు కళ్లకు గట్టేలా వివరిస్తున్నారు.  అదే విధంగా జగన్ తీరు కారణంగా   ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలనే కాదు.. ఎస్సీ, ఎస్టీలపై అక్రమంగా నమోదవుతున్న   కేసులతోపాటు వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై   జగన్ సర్కార్ దెబ్బకొట్టిన  విధానాన్ని లోకేష్ తన పాదయాత్రలో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. అలాగే దళితలను హత్య చేసి.. మృతదేహాలను సైతం డోర్ డెలివరి చేసే సౌకర్యం కూడా జగన్ సర్కార్ కల్పించిందంటూ సెటైర్లు గుప్పించారు.   జగన్  పాలన అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సైతం లోకేష్ జనాలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక లోకేష్ ను కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకునేందుకు జనం పోటీలు పడుతున్నారు. యువత ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. దారిపొడవునా మహిళలు హారతులు పడుతున్నారు.  ఇలా అన్ని వర్గాల ప్రజలూ లోకేష్ పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. అదే విధంగా దారిపొడవునా కలిసిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటూ, భవిష్యత్ పై వారికి బరోసా కల్సిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఒక వైపు లోకేష్ కు జనం బ్రహ్మరథం పడుతుంటే.. మరో వైపు పోలీసులు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారు. అనుమతులు లేవంటూ సభలను అడ్డుకోవడం, ప్రచార వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై జనంల ఆగ్రహం వ్యక్తమౌతోంది.  

అదిగో.. హోదా వచ్చేస్తోంది(ట)!

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సారి కాదు, వందసార్లు స్పష్టం చేసింది. అంతే కాదు హోదా ముగిసిన అధ్యాయం, క్లోస్డ్ చాప్టర్ అని కుండ బద్దలు కొట్టేసింది. మళ్ళీ  తెరిచే ప్రశ్నే లేదని ఒకటికి పది సార్లు పార్లమెంట్ వేదికగానే ప్రకటించేసింది. అయినా హోదా హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాలలో  కేంద్రాన్ని గట్టిగా అడిగే ‘సాహసం’ చేయలేక పోయింది.   అయితే నాలుగేళ్ళ తర్వాత ఇప్పడు వైసీపీ ఎంపీలు  కళ్ళు తెరిచి తగుదునమ్మా అంటూ ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు  పెడతామని ప్రకటించారు. అయితే, వైసీపీ ఎంపీలకు ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు  ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకు  వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ప్రస్తావన చేస్తున్నారు? అంటే, జరగరానిది ఏదో జరగనుందనే ఉప్పందడం వల్లనే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హోదా అస్త్రాన్ని పైకి తెచ్చారని వైసీపీ నేతలే అనుమానిస్తున్నారు.  ఓ వంక కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అన్నింటినీ పక్కన పెట్టినా, బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉపేక్షించినా, పూర్తిగా విస్మరించినా, ఒక్కటంటే ఒక్కటైనా మేజర్ ప్రాజెక్ట్ ఏదీ ఏపీకి ప్రకటించక పోయినా, ఏమీ చేయలేక చేతులెత్తేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, విపక్షాల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు హోదా డ్రామాను తెర మీదకు తెచ్చిందని స్వపక్షీయులే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయమే జరిగింది. విభజ హామీల ఉసెత్తలేదు. ఏ రంగానికి  కనీస కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అంతగా వాయిస్ లేని ముగ్గురు ఎంపీలను  (రంగయ్య, రెడ్డప్ప, పిల్లి సుభాష్’)  మీడియా ముందుకు పంపారు.  పార్లమెంట్‌లో సైలెంట్ గా ఉండి.. బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కనీసం మద్దతు కూడా ఇవ్వని వైసీపీ ఎంపీలు  మీడియా ముందుకు వచ్చి  విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అన్ని అంశాలపై ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతామని గంభీర ప్రకటన చేశారు. ఈ ముగ్గరు ఎంపీల మాటను ప్రభుత్వం సీరియస్ గా తీసు కుంటుందనే నమ్మకం ఇతరులకే కాదు, కనీసం ఆ  ప్రకటన చేసినముగ్గురు ఎంపీలకూ కూడా లేదని వేరే చెప్పనక్కర్లేదని అంటున్నారు. నిజానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రసంగం ముగిసీ ముగియక ముందే, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి  ‘బడ్జెట్ బ్రహ్మాండం’ అంటూ కితాబు నిచ్చారు. కానీ  ఇప్పడు వైసీపీ ఎంపీలు మాత్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని.. ఏం అడిగినా పట్టించుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. అలాగే  ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు తెస్తామని, ఉత్తుత్తి ప్రకటనలు గట్టిగా చేస్తున్నారు. అయితే  వైసీపీ ఎంపీలు తమను తాము మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు కావచ్చును. కానీ, ప్రజలు మరీ అంత అమాయకులు కాదని అంటున్నారు.   నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే హోదా విషయంలో చేతులెత్తేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో  చేతులెత్తి వేడుకోవడం మినహాయించి చేసేదేమీ లేదని చెప్పేశారు. ఆ తర్వాత గడచిన నాలుగు సంవత్సరాలలో హోదా కోసం చేసిన గట్టి ప్రయత్నం ఏదీ లేదు. కానీ  ఇప్పడు  మెల్లిగా హోదాకోసం ప్రైవేటు బిల్లు పెడతామని ఎంపీలు చెప్పుకోవడం ఆత్మ వంచన తప్ప మరొకటి కాదు. ఆవిషయం వారికీ తెలుసు ... ప్రజలకు తెలుసు.

కేజ్రీవాల్ కి లిక్కర్ సెగ

ఢిల్లీ లిక్కర్ స్కాం  కు సంబంధించి ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  పేరు ప్రముఖంగా చోటు చేసుకుంది. నిజానికి ఇది అనూహ్య పరిణామం కాదు. అయినా, ఢల్లీ రాజకీయాలలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో తిరుగు లేని అధికారాన్ని  చెలాయిస్తున్న బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీలో కొరకరాని కొయ్యలా తయారైన అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఇరకాటంలో పెట్టేందుకు ఈడీ చార్జ్ షీట్ రాజకీయ బ్రహ్మాస్త్రంలా అందివచ్చింది. కేజ్రీవాల్‌ టార్గెట్‌గా బీజేపీ కార్యకర్తలు నిరసన బాట పడుతున్నారు. తాజాగా ఢిల్లీలోఆప్‌ ఆఫీస్‌ ముందు బీజేపీ నిరసనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మారుమోగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు సీఎంకు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను కంట్రోల్‌ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఆఫీస్‌ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. మరోవైపు ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కేసు ఫేక్ అని.. ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీకి ఈడీ సాయం చేయడమేనని కేజ్రీవాల్ ఆరోపించారు.  లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఫేస్ టైం వీడియోకాల్ ద్వారా సమీర్ మహేంద్రుతో మాట్లాడించినట్లు ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడుకుందని ఆరోపించింది. లిక్కర్ లైసెన్సులు ఇప్పించేందుకుగానూ ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఈడీ చెబుతోంది.  మరో వంక ఢిల్లీ లిక్కర్ స్కాం  ఢిల్లీలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను  ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటుగా తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు కూడా చేర్చడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్  ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే చర్చఆసక్తి రేకిస్తోంది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్లు ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కవిత ఆదేశాలతోనే అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ స్పష్టం చేసింది. ఈ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బునే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్లో ఈడీ ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం, ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని ఈడీ తెలిపింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ చార్జిషీట్ ను  అటు ఢిల్లీలో ఇటు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అటు ప్రతిపక్ష్లాల నుంచి అదానీ గోల్ మాల్ హస్త్రం దూసుకోస్తోంది. ఇదే అంశం పై ఇప్పటికే వరసగా రెండు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేసిన విపక్షాలు, అదానీ అస్త్రాన్ని నేరుగా ప్రధాని మోడీ మీదకు ఎక్కుపెడుతున్నాయి. చివరకు అదేమవుతుంది, ఇదేమవుతుంది  అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ...చివరకు ఏమవుతుంది అనేది ముందుముందు చూడవలసిందే .. అంటున్నారు.

బీఆర్ఎస్ కు ఎంఐఎం తలాక్!

తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఎంఐఎం సహా ఏ పార్టీతోనూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటిరిగానే పోటీ చేసింది. విజయం సాధించింది. అలాగే ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసి సహా రాష్ట్ర్రంలోని మున్సిపల్, కార్పొరేషనలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అక్కడక్కడ స్థానికంగా పొత్తులు పెట్టుకున్నా. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. ఎంఐఎంతో సహా మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వతా సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసేఆర్ (బీజేపీ, ఎంఐఎం మినహా) అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కడువాలు కప్పి కారు ఎక్కించారు,  కానీ, ఎన్నికలకు ముందు మాత్రం మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఏ పార్టీతోనూ ప్రత్యక్ష్యంగా పొత్తు పెట్టుకోలేదు. మొదటి సారిగా మునుగోడులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసన సభలో   ఎంఎఐఎం ను  తమ మిత్ర పక్షంగా సగౌరవంగా ప్రకటించారు. విపక్షాలు ముఖ్యంగా బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా, చివరకు రజాకార్ల పార్టీ అన్నా కేసీఆర్ పట్టించుకోలేదు. అవును.. ఎంఐఎం మా మిత్ర పక్షమని కేసీఆర్ ఒకటికి రెందు సార్లు స్పష్తం చేశారు. అంతే కాదు. ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు. కానీ ఇంత వరకూ ఎంఐఎంతో  పొత్తు పెట్టుకునే ఆలోచన మాత్రం చేయలేదు.  అయితే, ఇప్పుడు మిత్ర పక్షాలు (ఎంఐఎం, బీఆర్ఎస్) మధ్య దూరం పెరిగింది. దూరం పెరగడం కాదు, ఎంఐఎం ఏకంగా బీఆర్ఎస్  కు తలాక్  చెప్పెసిందని అంటున్నారు. ఒక విధంగా ఎంఐఎం  మిత్ర పక్షం బీఆర్ఎస్  కు షాకిచ్చింది. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో, మిత్ర పక్షం అభ్యర్ధన మేరకు  ఎంఐఎం కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి మాత్రం, అల్లుడు అల్లుడే పేకాట పేకాటే అనే విధంగా ఎన్నికల పొత్తు ప్రస్తావన మాత్రం ఇంతవరకు చేయలేదు. మరోవంక, బీఆర్ఎస్‌ కు  ఎంఐఎం తలాక్ చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో శనివారం(ఫిబ్రవరి 4) ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్‌ మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా అదే సంకేతాలు ఇస్తోందని అంటున్నారు.  అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్, మంత్రులు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వరంటూ మండిపడ్డారు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినే కలుస్తామంటూ ఎద్దేవా చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని.. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి గంటలు గంటలు సమయం ఇవ్వటం సరి కాదన్నారు. శానససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందు అక్బర్‌ బాగానే మాట్లాడేవాడని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదన్నారు.  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఎంఐఎంకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కేటీఆర్ చేసిన కామెంట్ కు కౌంటర్ గా వచ్చే ఎన్నికల్లో  ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తాం  అంటూ అక్బరుద్దీన్ ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యమేంటని శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనేఇప్పటి వరకు మిత్ర పక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం స్నేహబంధం తెగిపోయినట్లేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైందని అంటున్నారు. మరోవైపు బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమే ఈ ప్రకటన అనే చర్చ కూడా జరుగుతోంది. నిజంగానే ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే, ఆపార్టీ 15 సీట్లు గెలుచుకునే విషయం ఎలా ఉన్నా బీఆర్ఎస్ కు ఆమేరకు నష్టం అయితే ఖాయంగా జరుగుతుందని అంటున్నారు.

సొంతగూటికి పొంగులేటి?

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు కీలకంగా, ఆసక్తిదాయకంగా మారాయి. రసకందాయంలో పడ్డాయి. కొంత కాలం క్రితం, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ రీ ఎంట్రీకి ఖమ్మం వేదికయింది. టీడీపీ అధినేత, చంద్రబాబు ఖమ్మం నుంచే శంఖారావం పూరించారు. ఆ తర్వాత, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికయింది. అదలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ రాజకీయ భవిష్యత్ కు కొత్త బాటలు వేసుకునే క్రమంలో  ఆత్మీయ  సమ్మేళనాలు నిర్వహించి హాల్ చల్ సృష్టించారు. అయితే, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్  హరీష్ రావు జరిపిన దౌత్యంతో తుమ్మల మెత్త పడ్డారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.  కానీ, పొంగులేటి బీఆర్ఎస్ ను వదిలేశారు. బీఆర్ఎస్ లో జరిగిన అవమానాలను తలచుకుని తలచుకుని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే  తనకు  తన వర్గానికి అన్యాయం చేసిన బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు ఎవరితో జట్టు కట్టాలి , ఏ పార్టీలో చేరాలి  అనే విషయంలో మాత్రం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోతున్నారు. ఈ నేపధ్యంలోనే, పొంగులేటి ఖమ్మం రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.  బీఆర్ఎస్ నుంచి అయితే  బయటకు వచ్చేసిన పొంగులేటి ఏ పార్టీలో చేరతారు అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. బీఆర్ఎస్ నుంచి నేరుగా ఆయన బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం సాగింది. ముహూర్తాలు, వేదికలు కూడా ఫిక్సయి పోయాయి. కానీ,ఇంతలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. తేల్చుకొనే లోగా గత పరిచయాలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చక్రం తిప్పారు. పొంగులేటితో చర్చించారు. గతంలో వైసీపీలో పని చేసిన పొంగులేటికి ఆ కుటుంబపై అభిమానం ఉంది. తాజాగా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇక నిర్ణయానికి వచ్చేశారు. పార్టీలో చేరిక.. ముహూర్తం దాదాపు ఫిక్స్ అయ్యాయి. తన నిర్ణయం పై అనుచరలతో సమవేశానికి పొంగులేటి సిద్దమయ్యారు.  పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా జిల్లాలో తన హవా కొనసాగాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సిద్దమయ్యారు. తొలుత బీజేపీలో చేరాలని భావించారు. కానీ  కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లు గా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టు చిక్కటం కష్టమని శ్రేయోభిలాషులు సూచించారు. వామపక్ష.. కాంగ్రెస్.. గులాబీ పార్టీకే అక్కడ ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటూ సర్వే నివేదికలు స్పష్టం చేసాయి. దీంతో.. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలతో భేటీ అయ్యారు. జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో.. అక్కడ మినహా ఇతర నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతు దారులకు సీట్లు ఇచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే బాగుంటుందని షర్మిల సూచించారు. నిర్ణయం మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తాజాగా విజయమ్మ తో భేటీ అయ్యారు.  విజయమ్మతో భేటీ తరువాత పొంగులేటి రాజకీయ అడుగులు ఏంటనేది స్పష్టత వచ్చింది.  వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటుగా మూడు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి గెలుపొందారు. ఇప్పుడు వైఎస్సార్టీపీ ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో షర్మిల అదే జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం ఆ కుటుంబంతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో.. ఇప్పుడు తన అనుచరులకు ఈ పార్టీ ద్వారా టికెట్లు దక్కించుకోవటం పైన చర్చలు జరిపారు  కాంగ్రెస్ లో కొంత ఓట్ బ్యాంక్ కలిసి రావటంతో పాటుగా వైఎస్సార్ ఇమేజ్.. తమకు వ్యక్తిగతంగా ఉన్న మద్దతు కలిసి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవచ్చని లెక్కలు వేశారు. పాలేరు లో షర్మిల గెలుపునకు సహకరించేందుకు పొంగులేటి విజయమ్మతో భేటీలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..నాడు జగన్ తో కలిసి వైసీపీలో.. నేడు షర్మిలతో కలిసి వైఎస్సార్టీపీలో పొంగులేటి పని చేయటం ఖాయమని చెబుతున్నారు.  ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరికపై వరుస మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నెల 8 న పాలేరు లో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. అదే రోజున పొంగులేటి వైఎస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. తనతో పాటుగా అనుచరులను పార్టీలో చేర్చేలా మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ రోజు చేరటమా లేక షర్మిల పాదయాత్ర ముగింపు సభలో చేరటమా అనేది చర్చ జరిగింది.  పాలేరులో విజయమ్మ - షర్మిల సమక్షంలోనే చేరేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఏం జరుగుతుందనేది త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

గవర్నర్, ప్రభుత్వం మధ్య సయోధ్య కొనసాగుతుందా?

అబద్ధాలా .. అర్థ సత్యాలా అనే  విషయం పక్కన పెడితే, అసలు గవర్నర్  శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అందరిలో కాకున్నా కొందరిలో ఇంకా అలాగే వుంది.  నిజం  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  సాదరంగా ఆహ్వానించింది, నిజంగా నిజమేనా, అనే అనుమానం కూడా ఇంకా పూర్తిగా తొలిగి పోలేదు. అలాగే, ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్  చక్కగా అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం  నిజంగా నిజమేనా  అనే అనుమానాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి.  గత రెండు రెండున్నర సంవత్సరాలుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న  పోరు,  అంతకు మించి రాష్ట్ర శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ వివాదం రాజ్యాంగ వివాదానికి దారితీసేలా తలెత్తిన పరిస్థితులు  గుర్తు చేసుకుంటే, ఇలాంటి దృశ్యం ఒకటి ఇంత త్వరగా చూస్తామని బహుశా రాజకీయ పండితులు సైతం ఊహించి ఉండరు. నిజానికి  రాష్ట్ర హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ  లేదంటే  నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.    కానీ, అందరి ఊహాలను తల్లకిందులు చేస్తూ  ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్  అటు గవర్నర్ తమిళి సై  చాలా చక్కగా ఎవరి పాత్రను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం అగుపించాయనుకోండి  అది వేరే విషయం.  అయినా  రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే కనిపించారు. అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా   ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ  ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆమోద ముద్ర వేస్తారా? తిప్పి పంపుతారా? అనేది తేలితే సయోధ్య ఎంత వరకు నిలుస్తుందని అనే విషయంలో కొంత క్లారిటీ వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా   మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ  గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లును  గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. ప్రస్తుత సయోధ్య నేపధ్యంలో అయినా  గవర్నర్ దానిని ఆమోదిస్తారా? లేదా అనే ‘ఉత్కంఠ వ్యక్తమవుతోంది.  నిజానికి, రాష్ట్రంలోని 127 పట్టణ, నగరపాలక సంస్థలలో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రస్తుతమున్న మూడేళ్ళ గడవు జనవరి 26తో ముగిసింది. మరో వంక ఇప్పటికే అనేక పట్టణ, నగర పలక సంస్థలలో అధికార బీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. అలాగే హుజురాబాద్ సహా అనేక పట్టణ  నగరపాలక సంస్థలలో అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చారు. క్యాంపులు, ప్రజా ప్రతినిదుల కొనుగోలు వ్యవహారాలు మొదలైన వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్  అవిశ్వాస గడువు పొడిగింపు బిల్లుకు ఆమోదమ తెలుపుతారా ? తిప్పి పంపుతారా? అదీ ఇదీ కాకుండా పరిశీలనలో ఉంచుతారా? అనేది సయోధ్యకు పరీక్షగా మారిందని అంటున్నారు.

కేసీఆర్ మనవడి మిస్సింగ్.. పోలీసులే పట్టుకెళ్లారంటూ ఆరోపణలు!

కే‌సీ‌ఆర్ మనవడు మిస్సింగ్. స్వయంగా కేసీఆర్ మనవడి తల్లి ఈ ఆరోపణ చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఔను నిజమే కేసీఆర్ మనవడు రితేష్ కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆమె తల్లి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు.   రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు  తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.   సిటీ వ్యాప్తంగా గాలించినా తన కుమారుడి ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అసలు విషయమేమిటంటే రాష్ట్రంలో సమస్యల పరిష్కారం డిమాండ్ తో ఎన్ఎస్ యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చింది. దీంతో పోలీసులు ఎన్ఎస్ యూఐ ముఖ్య నేతలూ, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్ఎస్ యూఐలో చురుకుగా ఉంటున్న రితేష్ ను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వాళ్లను ఎక్కడ ఉంచామన్నది కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో రితేష్ జాడ తెలియడం లేదంటూ రమ్యారావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు రెండు వాహనాల్లో వచ్చి రితేష్ గురించి ఆరా తీశారని రమ్యారావు చెప్పారు. ఆ తరువాత రితేష్ గురించి ఇళ్లంతా గాలించారనీ ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారనీ, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ రితేష్ ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. రితేష్ ఆచూకీ కోసం అన్నిపీఎస్ లూ తిరిగినా ఫలితం లేకపోయిందనీ, ఇక్కడికి వెళితే అక్కడా, అక్కడికెళితే అక్కడ అని తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ శత జయంతి కానుక.. త్వరలో వెబ్ సైట్, సావనీర్

నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయన చరిత్ర భావి తర తరాలకు స్ఫూర్తి  కావాలనే  ఉద్దేశంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని  మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి  టి .డి  జనార్దన్ తెలిపారు.     ఎన్ .టి .ఆర్ శత జయంతి కమిటీ  చైర్మన్ జనార్దన్ శనివారం (ఫిబ్రవరి 4)  మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్  సినిమాలలో పలు చిరస్మర ణీయమైన పాత్రలు పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారనీ,  అలాగే రాజకీయాలలో ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల స్వల్ప కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారనీ చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో  ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలను అందుకున్నారని చెప్పారు.  ఎన్టీఆర్  తెలుగునాట మాత్రమే కాదు,  భారత రాజకీయాలలో కూడా క్రియాశీల పాత్ర పోషించి,   జాతీయ నాయకుడిగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారన్నారు. దార్శనికత కలిగిన నాయకుడిగా ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారి కి  మార్గదర్శకం కావాలనే ఉద్ధేశంతో  ఎన్టీఆర్ శత జయంతి కమిటీ, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం,  రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్ .టి ఆర్ వెబ్ సైట్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఎన్టీఆర్ తో చిత్ర రంగంలో పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ రంగంలో వారితో సాన్నిహిత్యం వున్న నాయకులు,ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారి  వ్యాసాలు , ప్రముఖుల కథనాలు, సందేశాలు , అరుదైన ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక రూపొందిస్తున్నట్లు జనార్దన్ చెప్పారు. అలాగే  ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు , చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురించనున్నట్లు జనార్దన్ తెలిపారు.  ఎన్టీఆర్ నటుడిగా  తెలుగు ,తమిళ ,హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. మూడు  తరాల ప్రేక్షకులకు  ఆయన అభిమాన నటుడయ్యారు. సినీ రంగంలో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అపూర్వం ,అనితర సాధ్యం . కేవలం నటుడిగానే కాక ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అన్నగా నేనున్నానంటూ ముందు కొచ్చి ఆదుకున్నాడు . రాయలసీమ కరవు , దివిసీమ సీమ ఉప్పెన విపత్తులలో బాధితులను ఆదుకోవడానికి సహ నటీనటులతో కలిసి  కలసి విరాళాలు సేకరించారు.  చైనా యుద్ధ సమయంలో కూడా దేశ రక్షణ కోసం నిధుల సేకరణకు నడుం బిగించారు. ఆ అసమాన సేవే ఆయనను రాజకీయ రంగం వైపు నడిపించిందని జనార్దన్ తెలిపారు. తెలుగువారి ఆత్మ  గౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు  చరమ గీతం  పలకాలని, నట జీవితాని త్యాగం చేసి  1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన మహోన్నత నాయకుడు,ఆదర్శ ప్రజా సేవకుడు,  తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత   ఎన్ .టి .ఆర్ అని జనార్దన్ చెప్పారు . సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రను సృష్టించాయన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ,మహిళలకు ఆస్తిలో హక్కు  వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని, నిలువనీడ కల్పించలేని, కట్టుకోవడానికి గుడ్డ ఇవ్వలేని రాజకీయం ఎందుకని? ఆయన ఆవేదనతో ప్రశ్నించారు.అది  నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో చివరి వరకూ కృషి చేశారని జనార్దన్ చెప్పారు. ఎన్టీఆర్  భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అయినా,  ఇప్పటికీ జాతికి స్ఫూర్తి నిస్తూనే వున్నారు  ఆయన జీవితం తర తరాలకు మార్గదర్శం కావాలనే ఈ మహాయజ్ఞానికి పూనుకున్నామని జనార్దన్ తెలిపారు. ఎన్ .టి .ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ , హైదరాబాద్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని , తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు , ఇతర జాతీయ నాయకులు , సినిమారంగ  ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు .  ఈ కమిటీలో  సీనియర్ నాయకులు ఎమ్ .ఏ .షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్, తెలుగు వన్  ఎండీ కంఠంనేని రవి శంకర్ , నిర్మాతలు  కాట్రగడ్డ ప్రసాద్,  అట్లూరి నారాయణ రావు,  సీనియర్ జర్నలిస్టులు విక్రమ్ పూల, భగీరథ,  పారిశ్రామిక వేత్త మధుసూదన రాజు, మండవ సతీష్ , కాసరనేని  రఘురామ్  శ్రీపతి సతీష్ వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు .  రామ్మోహన్ రావు , సత్యనారాయణ , వినాయకరావు తదితరులు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారని జనార్దన్ తెలిపారు .      ఈ ప్రయత్నానికి అన్నగారి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు , అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా  tdjanardhan@gmail.com మెయిల్ లేదా 9866178085 మొబైల్ నంబర్ కి WhatsApp పంపించి సహకరించాలని జనార్ధన్ మీడియా ద్వారా  జనార్దన్ విజ్ఞప్తి చేశారు .

ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని వాణిజయరాం శనివారం (ఫిబ్రవరి 4) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తీసుకుంటున్న వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  పలు హిట్ చిత్రాల్లో అద్భుత పాటలు పాడిన వాణీజయరాం మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి.   14 భాషల్లో దాదపు 20 వేల పాటలు పాడిన వాణీ జయరామ్ కు కేంద్రం ఇటీవలే  కేంద్రం పద్మభూషణ్ పురస్కారం లభించిన సంగతి విదితమే. తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించున్న వాణీజయరాం మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ తో దోస్తానీకి ఎంఐఎం చెల్లుచీటీ?.. అందుకే అసెంబ్లీలో అక్బరుద్దీన్ విమర్శల బాణాలు?

 ఎనిమిదేళ్ల జిగిరీ దోస్తానీకి తెరపడిందా? ఎంఐఎం, బీఆర్ఎస్ ల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచీ కేసీఆర్, ఒవైసీల మధ్య మైత్రి కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ గా ఉన్నంత కాలం ఇరు పార్టీల మధ్యా పొరపచ్చాల్లేవు. ఎన్నికల పొత్తు లేకపోయినా.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ఇరు పార్టీల మధ్యా బహిరంగ అవగాహనే ఉండేది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఆ అవగాహన మేరకే అభ్యర్థులను రెండు పార్టీలూ నిలబెట్టాయి. అయితే ఆ మైత్రి ఇప్పుడు మాయమైంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఆరంభమయ్యాయనీ, అవి నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్నాయనీ పరిశీలకులు అంటున్నారు. అయితే తాజా బడ్జెట్ సమావేశాలలో ఆవి ఒక్కసారిగా బయటపడ్డాయి.  అసెంబ్లీలో శనివారం (ఫిబ్రవరి 4)న బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది.   ఎంఐంఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. తప్ప వాటిని అమలు చేయరని  విమర్శించారు. సమస్యలు చెప్పుకుందామంటే సీఎం, మంత్రుల దర్శనమైనా మాకు కలగడం లేదని దుయ్యబట్టారు. మీకు మమ్మల్ని కలవడం ఇష్టం లేకపోతే..   మీ చెప్రాసిని   చూపిస్తే వారినైనా కలిసి మా సమస్యలపై విన్నవించుకుంటామని ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పాతబస్తీలో మెట్రో సంగతి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని ఒవైసీ  నిలదీశారు. ఉర్ధూ రెండవ అధికారిక బాష అయినా అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల   రాష్ట్రానికి ఒరిగిందేమిటని ఒవైసీ అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీకి మద్దతు ఇవ్వొద్దని అప్పట్లో నెత్తీ నోరు బాదుకుని చెప్పినా అప్పటి టీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు.  దీంతో ఒవైసీ మాటలకు మంత్రి కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఒవైసీ చెప్పిన మాటలన్నీ వాస్తవం అయిపోవన్నారు. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కోరుతోందనీ, అది సాధ్యం కాదనీ కుండబద్దలు కొట్టారు. అసలు బీఏపీ సమావేశానికి రాకుండా ఇప్పుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇష్టారీతిగా మాట్లాడి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఇంత కాలం పాలు, నీళ్లలా కలిసి ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్యా అసెంబ్లీ వేదికగా మాటలయుద్ధం సాగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరు పార్టీల మధ్యా మైత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు సిద్ధపడినప్పుడే తెగిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న క్షణమే  తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్)   మిత్రపక్షం  ఎంఐఎం గులాబీ పార్టీకి తలాక్  చెప్పాలనే నిర్ణయానికి వచ్చిందంటున్నారు. నిజానికి ముందు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ మలి విడత ఉద్యమాన్నీ వ్యతిరేకించింది.  రాష్ట్ర విభజ జరిగితే  బీజేపీ బలపడుతుందన్న ఏకైక  కారణంతోనే ఎంఐఎం అధ్యక్షుడు,  హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్  లోపలా వెలుపలా కూడా పలు సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఆయన వ్యతిరేకతను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ తరువాత అనూహ్యంగా  కేసీఆర్, ఒవైసీ జిగిరీ దోస్తులై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదికగానే, ‘అవును. ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ప్రకటించారు కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసినా, ఫలితాలు వచ్చిన తర్వాత  మళ్లీ ఒకటై పోయారు. చివరకు మొన్నటికి మొన్న సెప్టెంబర్ 17న  అనివార్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపవలసి వచ్చినప్పుడు కూడా  తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన దినంగా కాకుండా ఒవైసీ సూచించిన విధంగా జాతీయ సమైక్యతా దినంగా కేసీఆర్ జరిపించారు. అయితే  ఇప్పటికే జాతీయ రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత ఒవైసీ  కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించలేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వైపు దృష్టి సారిస్తే తెలంగాణలో   తెరాస(బీఆర్ఎస్) గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని ఒవైసీ భావిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి కూడా  కేసీఆర్ తీరే కారణమని ఒవైసీ గుర్రుగా ఉన్నారు.  అంతే కాకుండా రాష్ట్రంలో కాషాయ దళం బలోపేతం కావడానికి కేసీఆరే ఉద్దేశపూర్వకంగా అవకాశం ఇస్తున్నారన్న అనుమానాలు కూడా ఆయనలో గూడుకట్టుకుని ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఇంత కాలం తెరాసతో ఉన్న రాజకీయ అవగాహన కారణంగా  ఎంఐఎం ఇంతవరకూ పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ,  హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెరాస బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీకి దూరం జరగడమే కాకుండా   రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఇతర జిల్లాలు, నియోజక వర్గాల నుంచి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తెరాసను కనుమరుగు చేసిన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నిర్ణయానికి ఎంఐఎం వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఎంఐఎం కేవలం పాత బస్తీకే పరిమితమైతే   బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత  తమ గొంతు నొక్కేస్తుందని,  అందుకే పాతబస్తీకి ఆవల కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ.. భవిష్యత్ లో ఒక వేళ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని  ఎంఐఎం అధినేత భావిస్తున్నారు.  ఈ నేపధ్యంలోనే ఉమ్మడి అధిలాబాద్, నిజాబాబాద్, కరీంనగర్ జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం నాయకత్వం నిర్ణయానికి వచ్చి నట్లు తెసుస్తోంది. అలాగే, ఓబీసీలు, దళితులను కలుపుకుని రాష్ట్రంలో విస్తరించే, ప్రణాళికకు ఒవైసీ పదును పెడుతున్నారు. అలాగే  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎంఐఎం కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందన్నది కూడా ఎంఐఎం అధినేత వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు.   అందుకే ఎంఐఎం బీఆర్ఎస్ తో మైత్రికి చెల్లుచీటీ పాడేసిందనీ, ఆ ఫలితమే నేడు అసెంబ్లీలో ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ సర్కార్ పై అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారని అంటున్నారు.    

తార్కిక ముగింపు దిశగా వివేకా హత్య కేసు.. సజ్జల కుట్ర భాష్యం అందుకేనా?

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలం అనుమాలు ఉన్నాయన్న అభిప్రాయం సామాన్యజనంలో ఉండేది. ఇప్పుడు అది దాదాపుగా నివృత్తమైందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కేసులో తాడేపల్లి ప్యాలెస్ ఇరుక్కుందన్న విషయం వైసీపీ శ్రేణులకే కాదు.. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి కూడా అవగతమైంది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన రోజు నుంచీ వైసీపీలో ఆరంభమైన గాభరా.. శుక్రవారం (ఫబ్రవరి  3) సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో మరింత పెరిగింది. అందుకే వారెక్కడా మీడియా కంటబడకుండా, మీడియాతో మాట్లాడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని విచారణ నుంచి బయటకు వచ్చిన వెంటనే వారిని ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ల విచారణ తరువాత వివేకా హత్య కేసులో ఏవన్ అయిన గంగిరెడ్డిని శనివారం విచారించనుంది. వరుసగా సంభవిస్తున్న పరిణామాలలో వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులు ఉన్నారన్న నమ్మకం బలపడుతూ వస్తోంది. అదే వైసీపీలో కంగారుకు కారణమౌతోంది.  వివేకా హత్య జరిగిన నాటి నుంచీ గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడం దగ్గర నుంచీ, ఆ తరువాత ఈ హత్య వెనుక ఉన్నది నారా చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించడం వరకూ..ఇక కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్నది ఆయన కుమార్తె సునీత, ఆమె భర్తే అంటూ ఆరోపణలు చేయడం వరకూ వైసీపీ ఈ కేసులో లోతుల్లెకి వెళ్లి దర్యాప్తు జరగకుండా అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. పన్నని కుట్ర లేదు. ఏకంగా సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు, కడపలో వారికి బెదరింపుల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. అయితే పట్టు వదలకుండా వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చేసిన న్యాయపోరాటం కారణంగా కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చిన తరువాత.. దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇన్నేళ్లుగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. కనీసం విచారణకు కూడా రావలసిన అవసరం లేకుండా మేనేజ్ చేసుకోగలిగిన అవినాష్ రెడ్డి అనివార్యంగా సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టిన సీబీఐ.. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కు సన్నిహితంగా మెలిగే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను పిలిపించుకుని విచారించింది. ఇప్పుడు వెంటనే గంగిరెడ్డిని విచారించడంతో అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపే అనుమానంగా చూస్తున్నాయి. వివేకా హత్య వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఈ కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ రాద్ధాంతం చేయడానికి సిద్ధపడుతోంది. ఇందుకు తొలి పలుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంటే వచ్చింది. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.  వివేకా హత్య కేసులో వైసీపీ ఎన్ని యూటర్న్ లు తీసుకుందో లెక్కే లేదు. గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మించడానికి చేసిన ప్రయత్నం నుంచి  చంద్రబాబు,  వివేకా కుమార్తె, అల్లుడులపై ఆరోపణల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో వైసీపీ పెద్దల ప్రమేయం బయటపడటం ఖాయమని తేలిన తరువాత ఇక ఇప్పుడు అనివార్యంగా కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అక్రమాస్తుల కేసులు జగన్ అరెస్టయిన సందర్బంగానూ వైసీపీ దాదాపుగా ఇటువంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే.   తెలుగుదేశం, కాంగ్రెస్ లు కుట్ర చేశాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇంత కాలం అనుమానాలుగా ఉన్న విషయాలపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జోరందుకున్న తరువాత స్పష్టత వస్తోంది.  అదే వైసీపీని గాభరాపెడుతోంది. అందుకే కుట్ర అంటూ గగ్గోలు పెడు తోంది.   

జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. సీజేఐకి న్యాయవాది లేఖ

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  గత నెల 31న విచారణ జరగాల్సి ఉండగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో గత నెల 30న  జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  జగన్ ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సుప్రం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఓ న్యాయవాది.  త్వరలో విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని ప్రకటించడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్  కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఏపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ విశాఖ రాజధాని అని ప్రకటించడం ద్వారా ఏపీ సీఎం జగన్  కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, జగన్ పై సుమోటాగా చర్యలు తీసుకోవాలని ఆయన సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

హతవిధీ ఇదేం కొలువు.. జగన్ సర్కార్ లో బ్యూరోక్రాట్ల పరిస్థితి దయనీయం!

జగన్ సర్కార్ లో హైరార్కీ అన్నది కాగడా వేసి వెతికినా కనిపించదు. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పని చేయడమే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. బహుశా స్వతంత్ర భారత దేశంలో అధికారుల సేవలను ఇంతగా తన అవసరాల కోసం వాడుకున్న సీఎం జగన్ వినా ఎవరూ ఉండకపోవచ్చు. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఔను సీఎస్ స్వయంగా వారిని విచారిస్తున్న జైలు వద్దకు వెళ్లి విచారణ పూర్తి కాగానే తన కారులో ఎక్కించుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డిని వాచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పికే నవీన్ లను సీబీఐ శుక్రవారం ( ఫిబ్రవరి 3)న విచారించింది. వారిరువురినీ కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లోదాదాపు 6 గంటల పాటు విచారించింది. విచారణ  ముగిసిన అనంతరం వారు బయటకు రాగానే సీఎస్ జవహర్ రెడ్డి వారిరువురినీ తన కారులో  తిరుపతి విమానాశ్రాయానికి అక్కడ నుంచి విమానంలో తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఒక కేసులో విచారణకు హాజరైన ఇరువురి విషయంలో అంత శ్రద్ధ తీసుకుని విచారణ ముగిసిన అనంతరం స్వయంగా పికప్ చేసుకని మరీ తాడేపల్లికి తోడ్కొని రావడం సంచలనంగా మారింది. ఇరువురినీ విచారణ ముగిసిన తరువాత పికప్ చేసి తీసుకుని రావడమే కాదు.. తాడేపల్లి నుంచి కడపకు ఈయనే డ్రాప్ చేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పికప్ ఆండ్ డ్రాప్ పనులు చేయడమేమిటన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాదు సామాన్యులలో కూడా జోరుగా సాగుతోంది. జగన్ సర్కార్ లో సీఎస్ కు పనీపాటా లేదా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.   ఒక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను సీఎస్ ఇలా తన కారులో పికప్ చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కొని రావడం తీవ్రమైన విషయమనీ, ఇది దర్యాప్తును ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా ఈ హత్య కేసులో నిందిుతలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహయం, సహకారం అందడం తీవ్ర మైన విషయంగా చెబుతున్నారు. సీఎస్ ఎందుకోసం, ఎవరి కోసం ఇలా చేస్తున్నారో అర్ధమౌతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.   అయినా జగన్ సర్కార్ లో అధికారులను అడ్డగోలుగా వాడుకోవడం.. చివరికి ఎక్కడైనా తేడా కొడితే నిర్దాక్ష్యిణ్యంగా బలిపశువులను చేసి వదిలించుకోవడం అనవాయితీగా మారిపోయిందని రాజకీయవర్గాలు అంటున్నారు. జగన్ సీఎం కావడానికి ముందు నుంచే ఆయన చెప్పినట్లల్లా నడుచుకున్న అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎంత అవమానకర రీతిలో ఆ పదవి నుంచి సాగనంపారో తెలిసిందే కదా అంటూ ఉదహరిస్తున్నారు. ఆ తరువాత  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయమే తీసుకుంటే.. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా, విపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఆయన పోలీసు అధికారిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉద్యోగుల చలో విజయవాడను విఫలం చేయడంలో ఏపీ పోలీసు వైఫల్యం ఆయన పదవికి ఎసరు తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్.. సునీల్.. విపక్ష నేతలు, సామాన్యులపై అడ్డగోలు కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధించారు. కనీస ఫార్మాలటీస్ కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నారంటూ కోర్టులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఏలిన వారి సేవలో తరించారు. అటువంటి సీఐడీ మాజీ చీఫ్ ను కూడా జగన్ సర్కార్ కూరలో కరివేపాకు మాదిరిగా ఆ పదవి నుంచి పక్కకు పెట్టేయడమే కాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. ఇక తాజాగా గవర్నర్ కార్యదర్శి సిసోడియాకూ అటువంటి మర్యాదే చేసింది. జగన్ సర్కార్. ఏరి కోరి గవర్నర్ కార్యదర్శిపదవిలో నియమించిన ప్రభుత్వమే ఆయనను నిర్దాక్షిణ్యంగా ఆ పదవి నుంచి బదలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సిసోడియా అత్యంత విశ్వాసపాత్రుడు. గవర్నర్ కు వచ్చే ఫిర్యాదులను సిసోడియా లీక్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్ష నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకకుండా చేయడం, అలాగే కీలక విషయాలు గవర్నర్ దృష్టికి వెళ్లకుండా చేయడంలోనూ సిసోడియా కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలనూ ఆయన ఎదుర్కొన్నారు. అటువంటి సిసోడియాపై సర్కార్ బదలీ వేటు వేయడం, ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆయన కూడా జగన్మాయకు బలిపశువు అయ్యారని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ సిసోడియాపై వేటుకు కారణమేమిటంటే.. గవర్నర్ కు ఉద్యోగుల అపాయింట్ మెంట్ దొరకడమే. ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడమే. ఉద్యోగ సంఘాల నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇప్పించింది సిసోడియానే అన్న నిర్ధారణకు వచ్చిన జగన్ సర్కార్ ఆయనపై బదలీ వేటు వేసిందని అంటున్నారు. ఇక జగన్ సర్కార్ లో అధికారుల విధి నిర్వహణ మొత్తం జగన్ మెప్పు పొందడం కోసమే అన్నట్లుగా మారిందనీ, ఆ పారామీటర్లు చేరుకోలేని వారెవరినైనా ప్రభుత్వం స్పేర్ చేయదనీ ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

అబద్ధాల పుట్ట.. తప్పుల తడక.. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ బాకా ఊదడానికే పరిమితమైందని విపక్షాలు విమర్శించాయి. ఎంత సేపూ ప్రభుత్వ పథకాలను ఆకాశానికి ఎత్తేయడమే తప్ప రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం లేదని దుయ్యబట్టాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ధరణి పోర్టల్ వంటి అంశాలు గవర్నర్ ప్రస్తావించనే లేదన్నారు. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్ట అని అభివర్ణించారు. ఈ ప్రసంగం చేయడం కంటే గవర్నర్ ప్రసంగం లేకుండా గత ఏడాది మాదిరిగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఆమె ప్రసంగం మొత్తంలో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావనకైనా రాలేదని నిలదీశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అంటూ చెప్పడం శుద్ధ అబద్ధమని జీవన్ రెడ్డి అన్నారు. అలాగే  దళితబంధు పేరుతో దళితుల్నిప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ తమిళిసై ప్రసంగం మొత్తం తప్పుల తడక అని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అన్నదిపూర్తిగాఅవాస్తవమని, ఎక్కడా వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందడం లేదన్నారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ గురించి గవర్నర్ ప్రసంగంలో అసలు మాట్లాడనేలేదని ఈటల అన్నారు.  

తెలుగుదేశంకే స్వల్ప మొగ్గు.. ఆత్మసాక్షి సర్వే

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడం అధికార వైసీపీకీ, విపక్ష తెలుగుదేశం కు కూడా నల్లేరు మీద బండి నడక కాదు. తీవ్ర మైప ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న.. వైసీపీ, బలంగా పుంజుకున్న తెలుగుదేశం కూడా ఎన్నికలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ,   . పొత్తులు, పోటీలపైనే కాకుండా,  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చోపచర్చలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి. ఇప్పటికే   రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధకారంలోకి ఏ పార్టీ వస్తుంది, పొత్తులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పొత్తులు లేకుండా వేర్వేరుగా పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఏలా ఉంటుంది అన్న విషయంపై పలు రకాల సర్వేలు వచ్చాయి.  అయితే తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం వైపు స్వల్ప మొగ్గు ఉంటుందని తేలింది. ఔను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 78 స్దానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే సింపుల్ మెజారిటీకి మాత్రం ఆ పార్టీ అడుగు దూరంలోనే నిలిచిపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక వైసీపీ 63 స్థానాలలో గెలిచి రెండో స్థానంలో నిలుస్తుంది.  ఇక జనసేన కేవలం 7 స్థానాలకే పరిమితమౌతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా 27 స్థానాలలో పోటీ ఉంటుందని పేర్కొంది. అయితే తుది ఫలితం మాత్రం ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ఆధారపడి ఉంటుందని, అయితే తెలుగుదేశం పార్టీ కనీసం 36 స్థానాలలో ప్రస్తుత అభ్యర్థులు లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది. అలాగే వైసీపీ కూడా కనీసం 50 స్థానాలలో సిట్టింగులను లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది.  అంటే తెలుగుదేశం కు స్వల్ప మొగ్గు కనిపించినా, అభ్యర్థుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ భారీగా నష్టపోకతప్పదని సర్వే వెల్లడిస్తోంది. ఇదే పరిస్థితి వైసీపీకి కూడా ఉందని చెబుతోంది. వివిధ సామాజిక వర్గాల మొగ్గు, ఆయా వర్గాలను ఆకట్టుకునే విషయంలో తెలుగుదేశం, వైసీపీలకు ఉన్న సానుకూలతలు, వ్యతిరేకతలు, ఇంకా పొత్తులు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి. పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమిటి? అన్న అంశాలపై సమగ్ర విశ్లేషణతో పూర్తి సర్వేను త్వరలో వెల్లడించనున్నట్లు శ్రీ ఆత్మసాక్లి ఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు.. కేసీఆర్, తమిళిసైల మధ్య విభేదాలకు తెర!

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి.. కేసీఆర్ సర్కార్ కు మధ్య  గత మూడేళ్లుగా రగులుతున్న విభేదాల మంట టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఉన్న అగాధం పూడిపోయింది. ఇంత కాలం ఉప్పు నిప్పులా, విమర్శలు, ప్రతి విమర్శలతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలు చల్లారిపోయాయి. ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ తమిళసై దిగజారిస్తే.   గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం, రాజ్ బవన్ ను బీజేపీ కార్యాలయంగా చేశారని ఆరోపించడమే కాకుండా, గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా ఇవ్వకుండా అవమానించారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి, మర్యాద గీత దాటేశాయి అనే అంతా అనుకున్నారు. అలాంటిది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీన్ ఒక్క సారిగా మారిపోయింది.  తెలంగాణ బడ్జెట్ కు అనుమతి విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న దశలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తన పిటిషన్ ఉపసంహరించుకుంది. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఇలా రాజీ కుదిరింది. దీంతో సీన్ మారిపోయింది.  శుక్రవారం (ఫిబ్రవరి 3) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  అంతకు ముందు.  అసెంబ్లీకి వచ్చిన  గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురేగి, గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు. ఆ తరువాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.   ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభించారు. తన ప్రభుత్వం (my government) అంటూ ప్రసంగం ఆరంభించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అంటూ ప్రస్తుతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిథుల నిర్విరామ కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ సర్కార్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు.  దేశానికే ధాన్యాగరంగా ఆదర్శంగా మారిందన్నారు.  సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి సిద్ధం చేసి ఇచ్చిన ప్రతినే గవర్నర్ తమిళిసై చదివారు. ఎక్కడా తన సొంత అభిప్రాయాలను వెల్లడించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, కొత్త సచివాలయం, వైద్య కళాశాలల పెంపు ఇలా అన్ని అంశాలనూ స్పృశిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు.  దీంతో గవర్నర్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుతారో అన్న టెన్షన్ తో ఉన్న ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలకు పూర్తిగా తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

నిజానికి ఒక తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ దాడులు, సోదాలపై రాజకీయ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా  సోదాల దారి సోదాలదే, ఆరోపణల దారి ఆరోపణలదే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ సోదాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా  హైదరాబాద్ లో మరో మారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి.  ఈ ఏడాది  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటీ అధికారులు తరచూ రైడ్స్ నిర్వహించడం ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ కు గురిచేస్తున్నాయి.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో గురువారం (ఫిబ్రవరి 3)ను పెద్దం సంఖ్యలో ఐటీ అధికారులు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయనకు సంబంధించిన  కంపెనీల్లో సోదాలు చేసిన ఐటీ ఇప్పడు ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది.  ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో దాడులు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తరువాత,  తాజాగా ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఐటీ అధికారులు ఎమ్మెల్సీ ఇంట్లో, ముప్పా, వెర్టెక్స్ కంపెనీల్లో సైతం ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ రైడ్స్ సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలా   తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీలు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  జరిగాయి. కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఇప్పుడు ఐటీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో దాడులు జరుగుతున్నాయి.

బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటలకు?

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. విడతల వారీ పాదయాత్రలను సక్సెస్ ఫుల్ గా ముగించినా, ఆ పాదయాత్రల ప్రారంభానికి, ముగింపునకు ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చి ఆర్భాటం చేసినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు మైలేజీ రాలేదా?  పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి కానీ, పార్టీ ఇమేజ్ ప్రజలలో ఇసుమంతైనా పెరగలేదా? ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారైందా? రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పట్ల ఆందోళనలో ఉందా? గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవలసిన చర్యలపై కసరత్తులు ప్రారంభించిందా? అందులో భాగంగా పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్టీ హై కమాండ్ కూడా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సీరియస్ గా దృష్టి సారించిందంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విఫలమయ్యారని హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సభలకు జనసమీకరణలో బండి సంజయ్ సక్సెస్ అయినా.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం విషయంలో ఆయన అనుకున్నంతగా విజయవంతం కాలేదని బీజేపీ హైకమాండ్ అభిప్రాయపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం..  రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఈటలకు అప్పగించాలన్న యోచనలో బీజేపీ హై కమాండ్ ఉందని చెబుతున్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వే ఫలితం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సర్వే ఫలితం అని కాకపోయినా.. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఎంత మాత్రం పట్టు లేదన్న సంగతి హై కమాండ్ కూడా గుర్తించిందంటున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక ఫలితానికి కూడా అదే కారణమని హై కమాండ్ భావిస్తోంది.  ఇక పోతే ఇటీవలి కాలంలో బండి సంజయ్ కుమారుడి వివాదాస్పద వైఖరి వల్ల పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత పొడసూపిందన్న భావన కూడా బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది. అదీ కాక పట్టణ ప్రాంతాలకే బండి సంజయ్ ప్రభావం పరిమితం అన్న నిర్ధారణకు కూడా మోడీ, షా వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు అర్బన్ లోనూ ఇటు రూరల్ లోనూ కూడా మంచి పట్టున్న నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ అయితే పార్టీని క్షేత్ర స్థాయిలో మరింతగా బలోపేతం అవుతుందని మోడీ షా ద్వయం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

12 మంది భార్యలు... 102 మంది పిల్లలు.. ఇక చాలు బాబు!

పెళ్లిళ్లలో కాదు కానీ.. పిల్లల విషయంలో గిన్నిస్ రికార్డు సాధించాలనుకున్నాడో ఏమో కానీ ఉగండాకు చెందిన ఓ వ్యక్తి 12 పెళ్లిళ్లు చేసుకుని ఏకంగా 102 మంది పిల్లల్ని కన్నాడు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఇక పెళ్లిళ్లకు, పిల్లలకుఫుల్ స్టాప్ పెట్టేశానంటున్నాడు. ఇప్పుడు తన పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒంట్లో చేవ ఉన్నంత వరకూ కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటాననీ, అయినా ఇంత పెద్ద కుటుంబాన్ని సాకాలంటే సాయం కావాలి కదా మరి అంటున్నాడు. అతనికి 102 మంది పిల్లలు ఉన్నారు.. వాళ్లల్లో చాలా మందికి వివాహాలయ్యాయి. వాళ్లకీ పిల్లలుపుట్టేశారు. అతగాడు తాత కూడా అయిపోయాడు. ఔను అతగాడికి 568 మంది మనవళ్లు ఉన్నారు. ఇంతకీ అతడి వయస్సు ఎంతంటారా? జస్ట్ 67 ఏళ్లు. ఇంతకీ అతడి పేరేంటో చెప్పలేదు కదూ.. అతడి పేరు ముసా హసహ్యా. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని సాకడానికి ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు.