మా దేశం దివాళా తీసేసింది.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
posted on Feb 20, 2023 @ 2:48PM
పాకిస్థాన్ దివాళా తీసేసింది. ఈ విషయాన్ని బయట దేశం నుంచి ఎవరో చెప్పడం కాదు. స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి పీఎమ్ఎల్-ఎన్ పార్టీ నేత ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. మా దేశం దివాళా ఆల్రెడీ దివాళా దీసేసిందంటూ ఓ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔను పాకిస్థాన్ దివాళా అంచున ఉంది. విదేశీ అప్పులను చెల్లించలేకపోతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది అన్న వార్తలు వింటున్నాం మనం అయితే ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మాత్రం మనం దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం అని దేశ ప్రజలకు అర్ధమయ్యేలా వాస్తవ పరిస్థితి చెప్పేశారు.
ఈ సమస్యను అధిగమించి.. మళ్లీ మన కాళ్ల మీద మనం నిలబడాలంటే.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు. అని కుండబద్దలు కొట్టేశారు. పాకిస్థాన్ ప్రస్తుతం అసాధారణ స్థాయిలో ఆర్థికఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. ఇదిలాఉంటే.. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పొందిన పాకిస్థాన్..వాయిదాలు కట్టడంలో విఫలం కావడంతో ఐఎమ్ఎఫ్.. నిధుల విడు దల నిలిపివేసినట్టు సమాచారం.
ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో పాకిస్థాన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ద్రవ్యోల్బణం అసాధారణంగా పెరిగిపోయింది. కనీసం గోధుమలు కొనుక్కోవడానికి కూడా జనం వద్ద డబ్బులు లేవు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం హద్దును ఎప్పుడో దాటేశాయి. పాకిస్థాన్ దివాళాకు ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినా కూడా ఇప్పటి వరకూ అక్కడ సుస్థిర ప్రభుత్వం లేదు. దేశంలో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని సంతోషపడినంత సేపు కూడా ఆ ప్రజా ప్రభుత్వం స్ధిరంగా అధికారం లో కొనసాగిన దాఖలాలు లేవు. అక్కడి ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వాలు కూడా సైన్యాధ్యక్షుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందన్నది వాస్తవం. సైనికుల కనుసన్నలలో మెలిగినంత కాలం మాత్రమే పాక్ లో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
ఎప్పుడైతే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వాధినేత ప్రయత్నిస్తారో.. ఆ మరుక్షణమే సైనిక తిరుగుబాటుతో ఆ ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే అక్కడ సైనిక ప్రభుత్వాలే దీర్ఘకాలం మనుగడ సాగించాయి. స్వాతంత్య్రం లభించిన దగ్గర నుంచి పాక్‌లో ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న దాయాది దేశాన్ని 1948 నుంచి శత్రువుగానే చూడడం, ఎంతసేపూ కశ్మీర్‌ను ఎలా ఆక్ర మించుకుందామనే కుయుక్తులే ఆ దేశ రాజకీయాలకు శాపం అయ్యిందంటే అతిశయోక్తి కాదు. దేశంలో దారిద్ర్యంతో జనం సతమతమౌతున్నా, పట్టించుకోకుండా కాశ్మీర్ ను కబలించడమెలా అని కుట్రలు పన్నడంలో పాకిస్థాన్ పాలకులదీ, సైన్యానిదీ ఏకాభిప్రాయమే.
దేశంలో సమస్యలు ఎదురైనప్పుడల్లా వాటి పరిష్కారం కోసం కృషి చేయడం అటుంచి ఆ సమస్యపై నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్ ను బూచిగా చూపడంలో సైన్యం, ప్రభుత్వాలది ఒకే మాట. ఇదే ఆయుధంతో ఏడున్నర దశాబ్దాలుగా అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాకిస్థాన్ ఏదో రూపంతో భారత్ తో కాలుదువ్వుతూ, యుద్ధం చేస్తూనే వస్తోంది. పాలకులు, సైన్యం అనుసరించిన ఆ వైఖరే పాకిస్థాన్ నేటి దుస్థితికి, ఆ దేశ ప్రజల దీనావస్థలకు కారణమనడంలో సందేహం లేదు. ఏ దేశంపై అయితే నిత్య ద్వేషంగా రగిలిపోయిందో.. ఆ దేశంలోనే విలీనమౌతామంటూ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలు అణచివేయలేక, దేశంలో అలజడిని, ప్రజల కష్టాలనూ తీర్చలేక పాకిస్థాన్ సతమతమౌతోంది.