కాగడా పెట్టి వెతికినా కనిపించని పొలిటికల్ హార్మనీ!
posted on Feb 20, 2023 @ 10:25AM
భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా చెబుతుంటారు. దేశంలో ప్రజల మధ్య సామరస్యం సంక్షోభమో, సమస్యో వచ్చిన ప్రతి సారీ కనిపిస్తూనే ఉంటుంది. అకేషన్ కు అనుగుణంగా దేశ ప్రజలు ఐక్యతను చాటుతూనే ఉన్నారు. దేశంలో మతసామరస్యం కోసం రాజకీయ నాయకులు, పార్టీలూ శ్రమించాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలకు తమ ఐక్యతను ఎలా చాటాలో, ఎప్పుడు చాటాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కుల,మత, వర్గ విభేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అని జనం పదే పదే చాటుతున్నారు.
వాస్తవానికి సామరస్యం ఉండాల్సింది రాజకీయ పార్టీల మధ్యే. రాజకీయ నేతల మధ్యే. ప్రజాస్వామ్య మనుగడలోనే ప్రమాదంలో పడేసేంతగా రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీలు అన్న భావన సమసిపోయి, శతృపార్టీలా అన్నంతగా విభేదాలూ, విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నాయి. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య వైరుథ్యాలు, విభేదాలు సైద్ధాంతిక పరిధి దాటేసి వైరి పక్షాల స్థాయికి చేరిపోయింది. ఈ ధోరణి ఇందిరా గాంధీ హయాం నుంచీ కనిపిస్తున్నా.. ఇఫ్పుడు మోడీ హయాంలో మాత్రం కొత్త ఎత్తులకు ఆ ప్రమాదకర ధోరణి చేరింది. పార్లమెంటు సమావేశాలలో పార్టీల సభ్యులు బద్ధ శత్రువుల్లా మారి ఘర్షణలకు సైతం దిగుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలు వ్యక్తిగత దూషణలకు, పరస్పర నిందారోపణలకు పరిమితమౌతున్నాయి.
రోజుల తరబడి సభా కార్యక్రమాలు జరగకుండా వాయిదాల పర్వం నడవడం అన్నది గతంలో ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడొక ఆనవాయితీగా మరిపోయింది. పార్టీల ఈ తీరు, వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. విపక్షాల సూచనలను విమర్శలను ఖండించడానికే అధికార పార్టీ సభ్యులు ఉన్నారా అన్నట్లుగా బీజేపీ, మిత్రపక్షాలు వ్యవహరిస్తుంటే.. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించడానికే ఉన్నట్లుగా విపక్ష సభ్యుల తీరు కనిపిస్తోంది. రాజకీయ పార్టీల ఈ వైఖరి కారణంగా ప్రజాహితం, దేశ హితం, ప్రజా హితం కోసం చర్చలు జరగడం లేదు. పరస్పరం గౌరవించుకుంటూ.. ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు వేదికగా నిలవాల్సిన పార్లమెంటు.. ఒక కుస్తీగోదాలా మారిపోయింది.
అధికార విపక్ష సభ్యులు పరస్పర నిందలు, ఆరోపణలతో పార్లమెంటు సమావేశాలలో అర్ధవంతమైన చర్చ ను అటుంచి అసలు సమావేశాలనే అర్ధరహితంగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అప్రజాస్వామిక విధానాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించాయి. ఒక అంశంపై చర్చ విషయంలో మంచి చెడుల సంగతి ఇసుమంతైనా పట్టించుకోకుండా.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, కనుక మనం సమర్ధించాలి అన్నట్లుగా అధికార పక్షం, అధికార పక్షం సమర్ధిస్తోంది కనుక మనం వ్యతిరేకించాలి అన్నట్లుగా విపక్షం తమ తమ పట్టుదలలకే పరిమితమై ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశాయి.
ఆరోగ్యకర పార్లమెంటరీ వ్యవస్థలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, కాగడా పెట్టి వెతకినా కనిపించడం లేదు. దురదృష్టవశాత్తూ పాలక, ప్రతిపక్షాలు మధ్య ద్వేష భావమే తప్ప సుహృద్భావం మచ్చుకైనా లేదు. అందుకే సమాజంలోనూ విద్వేష ధోరణులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే ముందుగా రాజకీయ పార్టీలలోనూ, ఆయా పార్టీల నాయకులలోనూ మార్పు రావాలి. సామరస్య ధోరణి రాజకీయ పార్టీలలో కనిపించాలి.