విజయసాయిలో మార్పు.. పరివర్తనేనా?.. రఘురామకృష్ణం రాజు అనుమానం
posted on Feb 20, 2023 @ 1:54PM
వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను గమనించిన తరువాత ఆయనలో మార్పు వస్తోందని, ఇది మంచి పరిణామమేనని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో విజయసాయి చేస్తున్న ట్వీట్లు చూస్తే ఆయనలో వస్తున్న మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందుకు కారణమైన అధికార వైసీపీ తీరు.. ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకత చూస్తే ఎవరిలోనైనా మార్పు రాక తప్పదని అన్నారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్టులు తథ్యమని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకోవడం ఏ విధంగా చూసినా పెద్ద పరిణామమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.
నందమూరి తారకరత్న చిన్న వయస్సులోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, ఆయన మరణంపై కొందరు వైసీపీ నేతలు, లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయన్నారు. వైసీపీ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమనీ, వారు చావులో రాజకీయ లబ్ధి వెతుక్కుంటున్నారని విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను స్వార్థ రాజకీయాల కోసం ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీ పార్వతి వంటి మారి మాటలు, వ్యాఖ్యలను విజయసాయి తన మాటలు, చేతల ద్వారా తప్పని చాటారు. రఘురామరాజు అన్నారు. నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.