ఎన్నికల వేళ బీఆర్ఎస్ బేజారు.. దేనికి సంకేతం
posted on Feb 22, 2023 @ 1:24PM
బీఆర్ఎస్ అసాధారణంగా మౌనం వహిస్తోంది. కేసీఆర్ ఏదైనా సభో, సమావేశమో ఏర్పాటు చేసి నాలుగు మాటలు మాట్లాడటానికే పరిమితమౌతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కార్యక్రమాలన్నవే కనిపించని పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఎప్పుడో కానీ క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లడం లేదు. రాష్ట్రంలో ఇది ఎన్నికల ఏడాది. అధికార బీఆర్ఎస్ న మినహాయిస్తే.. విపక్ష కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల సన్నాహాలలో బిజీబిజీగా ఉన్నాయి. బీజేపీ కార్నర్ మీటింగులతో దూకుడు పెంచగా, 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' పేరుతో కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలూ కూడా కేడర్‌తో, జనంతో మమేకమౌతున్నాయి. ఇది ఆయా పార్టీల శ్రేణులలో ఉత్సాహాన్ని నింపుతోంది.
అదే సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టకపోవడంతో క్యాడర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా స్తబ్దత గోచరిస్తోంది. కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతం కంటే జాతీయ స్థాయిలో వీలైనన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించడం అవసరం అందుకే ఆయన ఫోకస్ అంతా జాతీయ రాజకీయాలపై పెట్టారు. దీంతో రాష్ట్రంలో పార్టీకి దిశా నిర్దేశం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ గడువు సమీపిస్తోంది కూడా. అయినా అధికార పార్టీలో ఎటువంటి సందడీ లేదు. పార్టీ శ్రేణులలో స్దబ్దత, నాయకులలో నిర్లిప్తత కనిపిస్తోంది. పాల ముంచినా, నీట ముంచినా భారం అధినేతదే అన్నట్లుగా వారున్నారు.
గత నెలలో ఖమ్మంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించిన తరువాత మళ్లీ పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరగలేదు. ఎమ్మెల్యేలు ఏవో తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఏవో పనులకు శంకుస్థాపనలకే పరిమితమయ్యారు. ఇక పార్టీ శ్రేణులకు దిశా, నిర్దేశం అనేదే లేకుండా పోయింది. కార్యకర్తలలో ఎన్నికల వేళ పార్టీలో ఈ నిస్తేజం ఆందోళ రేపుతోంది. మరో వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తున్నది. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట దశల వారీగా రాష్ట్రం అంతా చుట్టేశారు. అలాగే ప్రజా గోస.. బీజేపీ భరోసా పేరిట ప్రజలతో మమేకం అవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలూ, ముఖ్యమంత్రి కుటుంబ పాలన, అవినీతి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిత్యం ప్రజలలో మమేకమౌతూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నది.
ఇంకో వైపు కాంగ్రెస్ కూడా పార్టీకి గత వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నది. టీపీసీసీ చీఫ్ పాదయాత్ర, కార్నర్ సమావేశాలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ సైలెన్స్ ఆ పార్టీ క్యాడర్ లో నైరాశ్యాన్ని నింపుతోంది. పార్టీ అధినాయత్వం మాత్రం క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేలా కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇప్పటికే యాంటీ ఇన్ కంబెన్సీ ఎదుర్కొంటున్న అధికార పార్టీ, కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటంతో వేగంగా ఆ పార్టీ ప్రతిష్ట ప్రజలలో దిగజారుతోందన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.