నూతన సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 14న

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఏపీల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తన జన్మదినం అయిన ఫిబ్రవరి 7 ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  అడ్డు రావడంతో ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా  ఏప్రిల్ 14న అంబేడ్కర్ రోజున సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించాలనీ, అదే రోజున  సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ  సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఒకే వేదికపై నలుగురైదుగురు ముఖ్యమంత్రులు కూర్చుంటే.. బీఆర్ఎస్ సభపై దేశ వ్యాప్త చర్చ జరుగుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సభకు పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, కేరళ, పంజాబ్, డిల్లీ ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా ఆహ్వానించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

మరో మెడికో ఆత్మహత్య

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్మయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఆస్పత్రిలో ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉంది. అంతలోనే మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి  బలవన్మరణానికి పాల్పడ్డాడు.  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళా. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) తన హాస్టల్ గదిలో శుక్రవారం ( ఫిబ్రవరి 24) రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాసరి హర్ష ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం డిన్నర్ చేసేంత వరకూ తోటి విద్యార్థులతో కలివిడిగా తిరిగిన హర్ష ఆ తరువాత తన గదిలోకి వెళ్లిపోయాడనీ, ఉదయం చూసే సరికి ఉరి వేసుకుని మరణించాడని సహ విద్యార్థులు చెబుతున్నారు.   దాసరి హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లా చింతగూడ.   

రాజకీయాలలో దార్శనికుడి తొలి అడుగుకు నేటితో నాలుగున్నర దశాబ్దాలు

రాజకీయంగా ఆయనతో విభేదించే వారు కూడా ఆయన దార్శనికతను వేనోళ్ల పొగుడుతారు. అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా, ఎవరితోనూ రాజీపడరు. ఆయనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హైదరాబాద్ బిజినెస్ స్కూల్, హైటెక్ సిటీ, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రగతి దారిలోనూ తొలి అడుగు ఆయనదే. అటువంటి దార్శనికుడు రాజకీయ ప్రస్థానం నేటికి నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైంది. ఔను సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కిందట ఇదే రోజు (ఫిబ్రవరి 25, 1978) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు తొలిసారి నామినేషన్ వేశారు.  అప్పటి నుంచీ చంద్రబాబుది ఒకే దీక్ష, ఒకే లక్ష్యం, ఒకే సంకల్పం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలో అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ నంబర్ వన్ గా చూడాలి. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగానే సాగింది. అభివృద్ధి విషయంలో కానీ, ప్రజా సంక్షేమం విషయంలో కానీ ఎక్కడా ఎప్పుడూ చంద్రబాబు రాజీపడిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్న సమయంలోనూ.. లేని సమయంలోనూ కూడా ఆయన రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసమే తపించారు. సంపద సృష్టి జరగాలి.. ఆ పెరిగిన సంపద ఫలాలు పేదవాడికి చేరాలి. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన ఆలోచన, తపన, కృషి ఇందుకే. అడుగులూ ఆ లక్ష్య సాధనకే... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి సారిగా ఎన్నికల బరిలో అడుగుపెట్టి  నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఈ నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మరెన్నో సంక్షోభాలను అధిగమించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అపనిందలు మోశారు. అన్నిటినీ ప్రజా జీవితంలో ప్రజల కోసం అడుగులు వేయడానికి లభించిన అవకాశాలుగానే భావించి ముందుకు సాగారు. దార్శనికత ఉన్న నేతగా.. దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు విపక్ష నేతగా క్రీయాశీలంగా వ్యవహరించిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లుగా విపక్ష నేతగా జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారు.  ప్రజాక్షేత్రంలో ఇంతగా  సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ మనగలిగిన నేత వర్తమాన రాజకీయాలలో మరోకరు కనిపించరు. అతి పిన్న వయస్సులోనే చట్టసభకు ఎన్నికైన నాయకుడిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు.   తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.  1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా  రాజకీయ కుట్ర జరిగి నెల రాజు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చంద్రబాబు ముందుండి నడిపించారు.  1985 ఎన్నికల్లో తెలుగుదేశం విజయంలో కీలక భూమిక పోషించారు.    1995 సెప్టెంబర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆయన హయాంలోనే ఇప్పుటి ఐటీ హబ్ సైబరాబాద్ నిర్మాణమైంది. సాహసోపేతంగా  ఆర్థిక సంస్కరణలను  అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి దారిలో పరుగులు పెట్టించారు. అందుకే తిరుగులేని మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చారన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ సారధ్యంలో బీజేపీ, కమ్యూనిస్టులు సహా దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.   నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ  ఏర్పాటు వెనుక క్రియాశీలంగా వ్యవహరించిందీ చంద్రబాబే.   దేశ ప్రధాన మంత్రుల నియామకంలోనూ అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్నే మిగిలిన పార్టీలన్నీ శిరోధార్యంగా భావించాయి. ఇక రాష్టప్రతులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలామ్ ఎంపికలో కీలక భూమిక పోషించింది కూడా చంద్రబాబునాయుడే అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.   విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం 208 రోజులు 2,817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజనతో  అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్నిటా అగ్రస్థానంలో నిలబడాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని జనం నమ్మారు. అందుకే  మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగల నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొట్టమొదట గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబు నాయుడు కనుకనే   2014 ఎన్నికలలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సరే ఆ తరువాత 2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ అభ్యర్థనకు తోడు వివేకా హత్య, కోడి కత్తి కేసుల కారణంగా వచ్చిన సానుభూతి పవనాలతో వైసీపీ విజయం సాధించింది. కానీ విజయం సాధించిన స్వల్ప కాలంలోనే జనంలో ఆ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల భ్రమలు తొలగిపోయాయి. వివేకా హత్య వెనుక ఉన్నదెవరు? కోడికత్తి సంఘటన డ్రామా ఎవరి వ్యూహం అన్నవి జనానికి అర్ధమౌతున్నాయి. దానికి తోడు రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు.. అప్పులే తప్ప అభివృద్ధి జాడ లేకపోవడంతో మళ్లీ జనం చంద్రబాబు వైపు చూస్తున్నారు.  తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ప్రజల పక్షానే నిలిచారనడానికి ఇప్పుడు ఆయన సభలకు జనం బ్రహ్మరథం పట్టడమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

విజయసాయి రెడ్డి అధికారాలకు కత్తెర!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..  వైయస్ జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్ అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు దూరం పెట్టారు? ఎందుకంటే.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేస్తున్న పాదయాత్రలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. అలా వచ్చిన రైతులను.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఔను జగన్ ఆయనను దూరం పెట్టడానికి అదే ఏకైక కారణం. ఈ సంగతి స్వయంగా   ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. సరే ఆ తరువాత జరిగిన పరిణామాలతో  కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు కోటం రెడ్డికి వచ్చిన పరిస్థితే వైసీపీ కీలక నేత విజయసాయికి వచ్చింది. విజయసాయినీ జగన్ దూరం పెట్టారని పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయనను జగన్ ఎందుకు దూరం పెట్టారు అన్న ప్రశ్నకు  ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విజయసాయి అక్కడకు వెళ్లి పరామర్శించడం,  ఆయన మరణించిన తరువాత ఆయన అంత్యక్రియల వరకు నందమూరి, నారా ఫ్యామిలీలు ఎలా అయితే అంత్యక్రియల ఏర్పట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారో..  విజయసాయిరెడ్డి కూడా చేశారు. ఎందుకంటే.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డి భార్యకు సొంత చెల్లెలి కుమార్తె కావడంతో ఆ బంధుత్వంతో విజయసాయి కూడా అక్కడే ఉండి అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకున్నారు.   బెంగళూరు నుంచి తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకు వచ్చిన నాటి నుంచి విజయసాయిరెడ్డి అక్కడే ఉండి.. తారకరత్నకు నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను   విజయసాయిరెడ్డి పలకరించి.. వారి పక్కనే కూర్చొని కొద్ది సేపు   ముచ్చటించారు.  అయితే ఈ వ్యవహారాన్ని ఎవరూ పొలిటికల్ గా చూడలేదు. ఒక విషాద సమయంలో బంధువు కుటుంబానికి విజయసాయి అండగా నిలుచున్నారనే భావించారు. అయితే  విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని అధికార వైసీపీ అధినేత జగన్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తనను ధిక్కరించడంగానే భావించారు.   ఎందుకంటే.. వైసీపీ  అధిష్టానం  రాజకీయ ప్రత్యర్ధులు అంటే వ్యక్తిగత శత్రువులుగానే భావిస్తుంది.  ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకు తార్కానమే.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్.. అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు  వైసీపీ నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది. అందులో యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, ట్రేడ్ యూనియన్, వాణిజ్యం, సాంస్కృతిక, పబ్లిసిటీ, నేత కార్మికులు, వైద్యులు, ఐటీ, వికలాంగులు, సేవాదళ్,  గ్రీవెన్స్ సెల్‌తోపాటు వివిధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఇలా అన్ని జిల్లా స్థాయి పార్టీ అనుబంధ విభాగాల నియామకంపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్తగా పేర్కొంది. అది ఇప్పుడు అసలు సిసలు చర్చకు.. అదే వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెట్టారన్న చర్చకు తెరలేపింది.  ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. అదీకాక విజయసాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు.  అటువంటి విజయసాయిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించేసింది. విజయసాయికి కో ఇన్ చార్జ్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆ స్థానంలో నియమించారు.    విజయసాయిరెడ్డి వ్యవహారశైలి గత కొన్ని రోజులుగా మారింది ఈ విషయాన్ని  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజే కనిపెట్టారంటే..  పార్టీ అధిష్టానం కనిపెట్టలేదా? ఇంతకీ ఆ మార్పు ఏమిటంటే  విజయసాయిరెడ్డి తన ట్వీట్లలో హీట్ ను పూర్తిగా తగ్గించేశారు. సంసారపక్షంగా, హుందాగా ఆయన ట్వీట్లు ఇటీవలి కాలంలో ఉంటున్నాయి. అదే గతంలో అయితే విజయసాయి  చంద్రబాబు, లోకేష్ పై.. ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడే వారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.  అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దలతోనే కాదు.. అక్కడి అధికార కేంద్రాలతో సైతం ఆయన చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటారు. అందుకే ఆయనకు రాజ్యసభకు ప్యానెల్ ఛైర్మన్ పదవి  దక్కింది.. అలాగే తాజాగా సంసద్ రత్న అవార్డు కూడా వచ్చింది. దీంతోనే వైసీపీ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని చెబుతున్నారు.  ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. విజయసాయిరెడ్డిని జగన్ ఇక పక్కన పెట్టేసినట్లేనని అంటున్నారు.  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయనకు ఉద్వాసన పలికినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.

శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ మాట కొస్తే, దేశ రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కున్న స్థానం ప్రత్యేకం. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడంలో ప్రస్తుతానికి మోదీ, షా జోడీది పై చేయి అయితే కావచ్చు కానీ, అ విషయంలో శరద్ పవార్  ఆ ఇద్దిరికీ ఏ మాత్రం తీసిపోరు. నిజం చెప్పాలంటే వారికంటే పవార్ రెండాకులు ఎక్కువే చదివారు.   2019లో మహారాష్ట్ర బీజేపీ, శివసేన కూటమిలో తలెత్తిన సంక్షోభం  ప్రభుత్వం ఏర్పాటుకు అవరోధంగా మారిన సమయంలో,  ఆ ఇద్దరినీ సైతం శరద్ పవార్ బురిడీ కొట్టించారని అంటారు. ఇక విషయంలోకి వెళితే, 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో,బీజేపీ,శివసేన కూటమిని ప్రజలు గెలిపించారు. మెజారిటీ కట్ట బెట్టారు. కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తడంతో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదు. ఈ నేపద్యంలో మరో గత్యంతరం లేకనో.  లేక రాజకీయ ఎత్తుగడలో భాగంగానో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి సిఫార్స్  మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.  ఇంతవరకు అంతా శాస్త్రోక్తంగానే జరిగింది కానీ, ఆ తర్వాత సీన్ మారింది. శివ సేన దారికి వచ్చే వరకు రాష్ట్రపతి పాలన కొనసాగించాలన్న బీజేపీ అగ్ర నేతల ఎత్తుగడలను ముందుగానే పవార్ పసిగట్టారు. (నిజానికి రాష్ట్రపతి పాలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వమే అయినా, కేంద్ర ప్రభుత్వం అ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించింది మాత్రం శరద్ పవార్ అంటారు)  అంతే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగామూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి పురుడు పోశారు. ఆ తర్వాత దానికి మహా వికాస్ అఘాడీ (ఏమ్వీఎ) గా నామకరణం చేశారు. సరే అదంతా వేరే కథ. ఇక శరద్ పవార్ చాణక్యం విషయానికి వద్దాం.శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అఘాడీ ప్రభుత్వం ఏర్పడాలంటే, ముందు రాష్ట్రపతి పాలన అడ్డుగా నిలిచింది. అందుకోసం పవార్, పథకం రచించారు. మాములుగా అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అంత తేలిగ్గా ఎత్తివేయదు.  ఆ విషయం పవార్ కు బాగా తెలుసు. అందుకే పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ ద్వారా బీజేపీతో రాయబేరాలు నడిపారు.  రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం తెల్లారేసరికి  బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే, దేశ రాజకీయాల్లో మహాశ్చర్యాలలో ఒకటిగా నిలిచిన  బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కేవలం మూడంటే మూడు రోజులలో   పతనమైంది. ఆ తర్వాత, ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేశారు. అదంతా ఇప్పడు చరిత్ర.  అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు  దేవేంద్ర ఫండవిస్ 2019లో అజిత్ పవర్ తో కలిసి తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనక  శరద్ పవార్ మద్దతు ఉందని  చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పడు దుమారం రేపుతున్నాయి. గత వారం రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో, ‘అప్పుడేం జరిగింది?’ అనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఈ నేపధ్యంలో శరద పవార్ అసలు గుట్టు విప్పారు. అయితే అసలు విషయం చెప్పకుండా  అప్పడు అలా రాత్రికి రాత్రి ప్రభుత్వం ఏర్పాటు జరగకపోయి ఉంటే రాష్ట్రపతి పాలన సుదీర్ఘంగా  కొనసాగేదని మాత్రమే పేర్కొన్నారు. ఆయన అంత ముక్తసరిగా చెప్పిన ఆ ఒక్క మాటే..  2019 మూడునాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు ఆయన ఎత్తుగడలో  భాగమేనన్న వాస్తవాన్ని బయటపెట్టేసింది. అందుకే  ఆయన పవార్  అయ్యారు. రాజకీయ ఎత్తులు , జిత్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎందుకంటారో మరో సారి రుజువైంది. దటీజ్ పవార్!

అరెస్టు లేకపోయినా.. అవినాష్ లో ఎందుకీ ఆందోళన, అసహనం?

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్.. రెండో సారి సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం (ఫిబ్రవరి 24) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సారి అవినాష్ అరెస్టు తథ్యం అంటూ పలు విశ్లేషణలు వెలువడ్డాయి. రాజకీయ పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమనే భావించారు. ఎందుకంటే రెండో సారి విచారణకు రావాలంటూ ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు  పంపిన అనంతరం  సీబీఐ హైకోర్టులో వేసిన ఓ కౌంటర్‌లో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో పేర్కొన్నారు. ఆ కౌంటర్ కూడా వివేకా హత్య కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేశారు.  దీంతో   సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందనే అంతా భావించారు. అయితే సీబీఐ అవినాష్ ను ఐదు గంటలపాటు ప్రశ్నించి వదిలేసింది. మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పలేదు. ఈ పరిణామం సహజంగా అవినాష్ కు ఎంతో ఊరట కలిగించి ఉండాలి. కానీ సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డిలో ఆ ఊరట కనిపించలేదు సరికదా.. గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన కనిపించింది. ఖంగారు కనిపించింది. సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదు.. ఏడాది కాలంగా విపక్ష తెలుగుదేశం ఏవైతే ఆరోపణలు చేసిందో వాటికి అనుగుణంగానే సీబీఐ విచారణ, ప్రశ్నలు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐని విపక్ష తెలుగుదేశం మ్యానేజ్ చేస్తోందన్న అర్ధం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. పనిలో పనిగా మీడియాపైనా విమర్శలు గుప్పించారు. దుష్ప్రచారం చేస్తన్న మీడియా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. అయితే వివేకా ఆందోళన వెనుక, సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణల వెనుక.. రెండో సారి విచారణలో సీబీఐ ఆయనకు సంధించిన ప్రశ్నలే కారణమని తెలుస్తోంది. తొలి సారి విచారణలో ఆయన తప్పించుకోలేని విధంగా వివేకా హత్య తరువాత ఎవరెవరికి ఫోన్ చేశారన్న దానిపై ప్రశ్నలు సంధించిన సీబీఐ ఈ సారి పూర్తిగా  అవినాష్ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలపై కాన్ సన్ ట్రేట్ చేసిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి   కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ఆధారంగా  అవినాష్ పై ప్రశ్నల వర్షం కురిపించిందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ప్రశ్నించడంతో అవినాష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారనీ, అందుకే మీడియాతో  మాట్లాడుతూ ఆందోళన, అసహనాన్ని దాచుకోలేకపోయారని అంటున్నారు. ఇప్పటికే లాజికల్ గా ఒక కంక్లూజన్ కు వచ్చేసిన సీబీఐ అరెస్టుల కంటే.. ఈ కేసులో సూత్రధారులను కూడా వెలికి తీయడం అన్న అంశంపైనే దృష్టి పెట్టిందని దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలు, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో ప్రస్తావించిన అంశాలనూ గమనిస్తే..  ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే అవినష్ రెడ్డిలో తనను సీబీఐ అరెస్టు చేయలేదన్న ఊరట కనిపించడం లేదని చెబుతున్నారు. 

ఎన్నికల సంగతి తరువాత.. ముందు కవిత చిక్కులపైనే కేసీఆర్ దృష్టి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐలు వేటికవిగా దర్యాప్తును వేగవంతం చేసిన క్రమంలో రోజు రోజుకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు చేరువ అవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే స్వయంగా కవిత, బీఆర్ఎస్ లు కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు అయితే.. ఏం చేయాలన్న దానిపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సీనియర్ మంత్రులు, నేతలతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య ప్రగతి భవన్ లో అధికారిక ప్రకటనలేవీ లేకుండానే అత్యవసర సమావేశాలు జోరుగా సాగుతున్నాయనీ అంటున్నారు. ఆ సమావేశాల చర్చల సారం ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టయితే ఏం చేయాలి.. లీగల్ గా ఎదుర్కోవడంతో సరిపెట్టకుండా, పొలిటికల్ ఫైట్ ఏ విధంగా చేయాలి అన్న దానిపై వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయ ప్రకటనలు, విమర్శలకు దూరంగా ఉన్న కవిత ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం కూడా వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం వెనుక ఒక వేళ డిల్లీ మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేస్తే కేంద్రాన్ని విమర్శించిన కారణంగా కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు జరిగిందంటూ కేంద్రాన్ని తప్పుపట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు.  మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేయడం జరిగితే.. అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి... ఇప్పటికే కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీయే కాకుండా కాంగ్రెస్, వైఎస్సార్టీపీ.. ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై షర్మిల విమర్శల కారణంగానే ఇటీవల ఆమెను రెండు సార్లు అరెస్టు చేశారంటూ వైఎస్సార్టీపీ ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక ఇప్పుడు కవిత అరెస్టు జరిగితే.. కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తున్నందుకే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేయాలని భావించినా.. సామాన్య జనంలో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా తేలికగా తీసుకుంటారా అన్న చర్చ కూడా ప్రగతి భవన్ లో జరుగుతున్నట్లుగా సమాచారం.  ఇక కవితను అరెస్టు చేయడమంటూ జరిగితే లీగల్‌గా ప్రొసీడ్ కావడం? అదే సమయంలో రాజకీయంగా బీజేపీని డిఫెన్స్ లో పడేయడం అన్న అంశాలపైనే ప్రగతి భవన్ లో చర్చలన్నీ కేంద్రీకృతమయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎన్నికల సంవత్సరంలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అధినేత.. తన కుమార్తెను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి ఎలా రక్షించుకోవాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఎలా అన్న ఆందోళన కూడా పార్టీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.   లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లు, అందులో సీబీఐ, ఈడీ లేవనెత్తిన అంశాలు, నిందితులపై మోపిన అభియోగాలు, వీటన్నిటినీ మించి కవితను సీబీఐ గత ఏడాది డిసెంబరు 11న సాక్షిగా ప్రశ్నించడం, ఆ తరువాత సీఆర్పీసీ సెక్షన్ 191 కింద మరో నోటీసు జారీ చేయడం, ఇక అక్కడ నుంచి చార్జిషీట్లలో కవిత పేరును ఈడీ, సీబీఐలు పదేపదే ప్రస్తావిస్తుండటంతో  ఆమెను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఫిక్స్ కేంద్ర ద్యాప్తు సంస్థలు ఫిక్స్ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా కవిత మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం ఆరోపణలు ఆమెను చిక్కుల్లో పడేశాయని అంటున్నారు. అదీ కాక ఇప్పటికే కవితకు సన్నిహితులుగా చెబుతున్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులు అరెస్టు కావడంతో ముందు ముందు కవిత కూడా అరెస్టయ్యే అవకాశాలే ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  ఒక వేళ అదే జరిగితే ఏకకాలంగా న్యాయపరంగా, పొలిటికల్ గా ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహరచనపైనే ఇప్పుడు సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

ఏపీలో బీజేపీ మౌనం దేనికి సంకేతం? ఒంటరి పోరేనా?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. సుదీర్ఘ కాలం పాటు, మూడు పర్యాయాలు ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత ... అన్నిటినీ మించి, రాష్ట్రంలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ టార్గెట్ చేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కన్నా లక్ష్మినారాయణ, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయన  ఏదో వచ్చిన దారిలో వంటరిగా వెళ్ళి పోలేదు. వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన  పలువురు కీలక నేతలతో సహా తన వెంట వచ్చిన పుచిక పుల్ల సహా అందరినీ ఉడ్చుకు పోయారు. అంతే కాదు  బీజేపీ ఒరిజినల్ క్యాడర్, లీడర్ లను కూడా కన్నా సైకిల్ ఎక్కించారు. నిజానికి ఇది బీజేపీకి పెద్ద షాక్. అసలే ఏపీలో అంతంత మాత్రంగా, అంటే ఉండీ లేనట్లుగా ఉన్న బీజేపీకి కోలుకోలేని దెబ్బ. అయినా  బీజేపీ నాయకత్వంలో చలనం లేదు.  వచ్చేవాళ్ళు వస్తుంటారు.. పోయే వాళ్ళు పోతుంటారు అనే నిర్లిప్త ధోరణి కైపిస్తోంది. రాష్ట్ర నాయకులే కాదు, జాతీయ నాయకులు సైతం, కన్నా రాజీనామా పై స్పందించలేదు.  నిజానికి కన్నా...  ఎవరికీ చెప్పకుండా, ఎవరితోనూ చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి విషయంలో ఆయన తన అసంతృప్తిని ఏమాత్రం దాచుకోలేదు. నిజానికి, కన్నా తమ అసంతృప్తిని లేఖల రూపంలో అయితే నేమీ, పత్రికలు, మీడియా ద్వారా అయితే నేమి పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ని ఢిల్లీకి పిలిపిచుకుంది. మాట్లాడింది. అంతే  ఆ తర్వాత అంతా మౌనం. ఈ నేపథ్యంలోనే  కన్నా ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని, అయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విషయంలో ఏ విధంగా అయితే ఎటూ తేల్చకుండా, అయన తమ దారి తాను చూసుకునేలా చేసిందో, అదే సైలెంట్ స్ట్రాటజీనే కన్నా విషయంలోనూ కంటిన్యూ చేసింది.   నిజానికి, అప్పుడే కాదు. ఇప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం మౌనం వీడక పోవడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అందుకే  కన్నా రాజీనామా విషయంలో బీజేపీ నాయకత్వ ధోరణి, ఒక విధంగా నిండా మునిగినవాడికి చలేమిటన్న విధంగా ఉందని అంటున్నారు. నిజమే  ఏపీలో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏపీలో బీజేపీకి మినిమం స్టేక్ కూడా లేదు. అలాగే, టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా బీజేపీకి రాజకీయంగా ఒరిగేదీ లేదు పోయేదీ లేదు. బహుశా అందుకే కావచ్చు, బీజేపీ  జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని,( రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, తెలుగు దేశం పార్టీలు రెండూ బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చాయి, అలాగే, రాజ్యసభలో బిల్లుల  విషయంలోనూ ఉభయ పార్టీలు అప్రకటిత మిత్ర పక్షాలుగా బీజేపీకి అండగా నిలుస్తున్నాయి) టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటించాలనే వ్యూహంతో అడుగులు వేస్తోందనే విశ్లేషణలు వినవస్తున్నాయి.  నిజానికి, రాష్ట్రంలో మరోసారి టీడీపీ,బీజేపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు 2014లో లాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడుతుందని చాల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇప్పడు తెలుగు దేశం, జనసేన పొత్తు విషయంలో స్పష్టమైన సంకేతాలున్నా  బీజేపీ విషయంలో ఆ క్లారిటీ లేదు.  నిజానికి  ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు అయినా లేదు. సో ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రభావం ఇంచు మించుగా జీరో.. అయినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలరాదనే లక్ష్యంతో  తెలుగు దేశం  అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు. అయితే, బీజేపీ ఎందుకనో ఏమో, జనసేనతో పొత్తుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేస్తోంది. మరోవంక జనసేన వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీతో పొత్తు అనివార్యమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజా పరిణామాలను గమనిస్తే  ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమవుతున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. అదే జరిగితే  బీజేపీ ఓటుతో పాటుగా, మోడీ అభిమానులు, కేంద్ర ప్రభుత్వ విధానలను సమర్ధించే మధ్యతరగతి ఓటర్లు ఏం చేస్తారు? ఇదీ ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

ఎన్నికలు వద్దు... ఎంపికలే ముద్దు..సీబ్ల్యూసీపై కాంగ్రెస్ ప్లీనరీ నిర్ణయం

 పాతికేళ్ళ తర్వాత గత సంవత్సరం (2022) అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీ కుటుంబ బయటి వ్యక్తి మల్లి ఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ లో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర, 2023 జనవరి 30 తేదీన శ్రీనగర్ ( జమ్ము కశ్మీర్) లో ముగిసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా, ప్రస్తుతం, హత్ సే హాత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం(ఫిబ్రవరి 24) ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో మూడు రోజులపాటు జరిగే  కాంగ్రస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రంతోపాటు  పక్కనున్న మధ్యప్రదేశ్‌, తెలంగాణ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి  ఆ భరోసాతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఇందుకోసం భావసారూప్య పార్టీలతో జట్టుకట్టే అంశంపైనా ప్లీనరీలో మేధోమథనం సాగించనున్నారు. ఈ ప్లీనరీకి కాంగ్రెస్‌ అగ్రనాయకులతోపాటు సుమారు 15వేల మంది ప్రతినిధులు హాజరు అవుతున్నట్లు సమాచారం. అయితే, పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా  పార్టీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సభ్యుల ఎన్నికకు సంబంధించి, మళ్ళీ పాత, ‘ఎంపిక’ విదానానికే ఓటేసింది.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ()కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేస్తారని ఆయన వెల్లడించారు. రాయపూర్‌లో  జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ తొలి సెషన్  స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ తదితరులు సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కార్యవర్గానికి ఎన్నిక వద్దని, నామినేషన్ వేయాలనే నిర్ణయం కూడా ఏకగ్రీవంగా జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ తెలిపారు.  పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటులో పార్టీ నేతతో కలిపి సీడబ్ల్యూసీలో మొత్తం 25 మంది సభ్యులు ఉంటారు. 12 మంది ఎన్నిక ద్వారా మరో 11 మంది నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు, ఉండాలని జూనియర్లు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 1997లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి.  కాగా ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరు కాలేదు. మల్లికార్జున్ ఖర్గే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చేందుకే వారంతా సమావేశానికి దూరంగా ఉన్నారని, మిగతా నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సీనియర్ నేతలు చెప్పారు. ఇదిలా ఉండగా రాయపూర్ లో ప్రారంభమైన ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

యువరాజ పట్టాభిషేకం కోసమేనా.. కేసీఆర్?

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంచు మించుగా  ఏడాది నుంచే ముందస్తు ఊహగానాలు వినిపిస్తూ వచ్చినా, ఎందుకనో గానీ, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ ఇక్కడా అక్కడా ముందస్తు మాట వినిపిస్తున్నా, ఇక ముందస్తు ముచ్చట లేనట్లే అనే అభిప్రాయమే బలపడుతోంది.  అధికార పార్టీ ‘ముఖ్య’ నాయకుడు సహా ఆ పార్టీ నాయకులు అందరూ, ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయం ఉందని క్యాడర్ ను సన్నద్దం చేస్తున్నారు.  తాజాగా  మంత్రి కేటీఆర్  గురువారం(ఫిబ్రవరి 23) జయశంకర్ భూపాల పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలోనూ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయముందనే అన్నారు.   అయితే, అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలకంటే, జాతీయ రాజకీయాలపైనే అంతకంటే ముఖ్యంగా, ఏపీలో బీఆర్ఎస్  పార్టీని బలోపేతం చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.  నిజానికి  ఇంతవరకు తెలంగాణ సహా మరే రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరగలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు ఆంధ్రప్రదేశ్. టీఆర్ఎస్ పేరు మారి బీఆర్ఎస్ గా అవతరించిన కొద్ది రోజులకే మూడు పార్టీలు మారి వచ్చిన తోట చంద్రశేఖర్‌ ను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టారు. అంతేకాదు ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకంటే ఏపీ నాయకులకు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయనీ, వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోయేందుకు వీలుగా గ్రీన్ కార్డు ఎంట్రీ సదుపాయం కల్పించారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.  అదలా ఉంటే కేసీఆర్ ప్రత్యేక దృష్టి కారణంగానే ఏపీలో బీఆర్ఎస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయని అంటున్నారు.  తాజాగా విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల బీఆర్ఎస్ లో చేరారు. ఆమెతో పాటుగా మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి,  ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రితో పాటు మరికొందరు  మైనారిటీ నాయకులు  గుంటూరు పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన శకుంతల గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది మేయర్‌గా పనిచేసిన ఆమె, ఆ తర్వాత కాంగ్రెస్‌‌లో కొంత కాలం, ఆ తర్వాత టీడీపీ మరికొంత కాలం పనిచేశారు. చివరకు 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అయితే  అక్కడ ఆమెకు తగిన ప్రాధాన్యత దక్కలేదో ఏమో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె మరో  మారు కండువా మార్చారు. బీఆర్ఎస్‌లో చేరారు. అదలా ఉంటే, కారణం ఏమైనా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల కంటే, ఏపీ పాలిటిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ఆయన ఎపీ లోనూ న్యూస్ పేపర్  (నమస్తే ఆంధ్ర ప్రదేశ్) ప్రారంభించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు.  అయితే  ఎంత చేసినా ఏపీలో బీఆర్ఎస్ కు ఓట్లే కానీ సీట్లు రావని రాజకీయ విశ్లేషకులు స్పష్టం  చేస్తున్నారు. అయితే ఆ సంగతి కేసీఆర్ కు తెలియదని అనుకోలేం.   కేటీఆర్’ పట్టాభిషేకం కోసం గ్రౌండ్ ప్రిపేర్  చేసేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా, ఓ వంక ఇటు పార్టీలో,  అటు ప్రభుత్వంలో కేటీఆర్ ప్రాధాన్యత పెంచుతూ,  అదే సమయంలో  జాతీయ రాజకీయాల పేరిట తమ ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకున్తున్నారని అంటున్నారు.

మౌనమేలనోయీ.. విజయసాయీ!?

వైసీపీలో కీలక నేత విజయసాయి. అందులో సందేహం లేదు. పార్టీ ఆవిర్బావం నుంచి.. పార్టీ నిర్మాణం వరకూ, 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సహా అన్నిటా అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అందుకే విజయసాయిని జగన్ వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ సహా ప్రతి విషయాన్నీ స్వయంగా పర్యవేక్షించే వ్యక్తి విజయసాయి. అలాగే అధినేత మనసెరిగి విపక్షంపై మాటల దాడి చేయడంలోనూ,  విమర్శలతో విపక్షాల నాయకులను చెరిగేయడంలోనూ విజసాయి స్టైలే వేరు.. రూటే సెపరేటు. ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ నాయకులనూ ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే ఆయన ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకే సాగారు తప్ప వెనుకడుగు వేసిన సందర్బం కనిపించలేదు. అయితే ఇటీవలి కాలంలో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా అన్న అనుమానం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తమౌతోంది. గత కొంత కాలంగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పార్టీ వ్యవహారాలన్నీ తానై  చక్కబెడుతున్నారు. ఈ పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ విజయసాయి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయనదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించి.. సజ్జల కుమారుడికి ఆ బాధ్యతలు కట్టబెట్టారో.. అప్పటి నుంచీ విజయసాయి ప్రతి కదలికపైనా జగన్ నిఘా పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమౌతూ వస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా గత నెలలో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంగా... ఆ విచారణ తేదీ కంటే ముందు  జగన్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ కావాలని భావించారు. అయితే.. మోడీ అప్పాయింట్ కన్ ఫర్మ్ చేయడంలో విజయసాయి విఫలం కావడంతో జగన్ కినుక వహించారని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. రీసెంట్ పాస్ట్ నుంచి విజయసాయి తీరు కూడా పార్టీ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి రాజ్యసభ వేదికగా అమరావతిపై ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వైసీపీకి శరాఘాతంగా తగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించినట్లు కేంద్రం స్పష్టం చేయడమూ, మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తమను సంప్రదించ లేదని కుండబద్దలు కొట్టడంతో ఇంత కాలం అమరావతి విషయంలో జగన్ సర్కార్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. దీంతో వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఇది కూడా పార్టీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై మూడు వారాల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ను విజయసాయి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న విజయసాయికి బంధువు కావడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన తారకరత్న ఆరోగ్యం గురించి మాట్లాడిన మాటలు, ఆ తరువాత తారకరత్న మరణించిన అనంతరం మీడియా ఎదుట విజయసాయి మాట్లాడిన మాటలూ, వైసీపీ నేతల విమర్శలను ఖండించే విధంగా ఉన్నాయి. అన్నిటికీ మించి విజయసాయి ఆ సందర్భంగా చంద్రబాబుతో ముచ్చటించడం, బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించడం అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదలా ఉంచితే.. ఇటీవలి కాలంలో విజయసాయి తెలుగుదేశం, ఆ పార్టీ నేతలపై విమర్శల జోలికి పోవడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య మౌనం పాటించడమో లేదా, సౌమ్యంగా మాట్లాడడమో చేస్తున్నారు. విజయసాయి అంటే భగ్గుమనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం విజయసాయిలో వచ్చిన ఈ మార్పును గుర్తించి.. ఇది మంచి పరిణామమంటూ కితాబునిచ్చారు. వైసీపీ పట్ల ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించడం వల్లే విజయసాయిలో మార్పు వచ్చిందని రఘురామరాజు భాష్యం చెప్పారనుకోండి.. అది పక్కన పెడితే.. ఇటీవల గన్నవరంలో జరిగిన సంఘటనలపై తెలుగుదేశం.. వైసీపీల మధ్య మాటలయుద్ధమే జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం పరుషంగా విమర్శలు చేస్తూ.. పోలీసుల అండ లేకుండా ఎంత మంది వచ్చినా ఎదుర్కొనడానికి సై అంటూ సవాల్ విసిరారు. ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితే చెప్పనే అక్కర్లేదు. వైసీపీకి అండగా నిలుస్తున్న పోలీసు అదికారుల సంగతి అధికారంలోకి వచ్చాకా తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ పైనా, వైసీసీ నేతలపైనా విమర్శల దాడి తీవ్రం చేశారు. ఇన్ని జరుగుతున్నా విజయసాయి నోరు మెదపడం లేదు. గతంలో జగన్ మీద ఈగ వాలితే.. అందుకు తెలుగుదేశం అధినేతే కారణమంటూ విరుచుకుపడే విజయసాయి.. ఇప్పుడు నోరెత్తడం లేదు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపైనా ఆయన మాట్లాడటం లేదు.  తాజాగా ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విజయసాయి వైసీపీ మంత్రులకు దూరంగా కూర్చోవడం కూడా ఏపీ రాజకీయ సర్కిళ్లలో చర్చకు తెరలేపింది. అంతే కాకుండా ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ను హస్తినలో కలిసినది వైసీపీ నుంచి ఇద్దరు మాత్రమే.. వారిలో ఒకరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాగా రెండో వ్యక్తి విజయసాయి మాత్రమే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయసాయి వైసీపీ నాయకులతో కలివిడిగా కనిపించకపోవడం  రాజకీయ వర్గాలలో పలు అనుమానాలకు తావిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిని దూరం చేసుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ లో కనిపిస్తోందని అంటున్నారు. అసలు విజయసాయి నిజంగా పార్టీ కార్యక్రమాలకు తనంత తానుగా దూరం జరుగుతున్నారా? లేక పార్టీయే దూరం పెడుతోందా అన్న అనుమానాలకు తోడు.. ఈ మౌనం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. 

వివేకా హత్య కేసు.. దోషులెవరు? నిర్దోషులెవరు?.. సునీత పోరాటం తేల్చేసిందా?

గత నాలుగేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు ఎందుకు ఎదుర్కొందన్నది కూడా ఇప్పుడు సందేహాలకు తావు లేకుండా తేలిపోయింది. హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సీబీఐ విచారణే వద్దనీ, కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐకి ముందుకు సాగకుండా అడ్డంకులు ఎదురౌతున్నా కిమ్మనకుండా చోద్యం చూడడానికీ కారణమేమిటన్నది కూడా ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. తెలుగుదేశం నెత్తిన ఇప్పటి వరకూ ఉన్న నిందా భారం ఒక్క సారిగా తొలగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.   తన తండ్రి హత్యకు కారణమైన హంతకులు, ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ చేసిన న్యాయ పోరాటం నిజంగా  నిస్సందేహంగా తెలుగుదేశం నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. ఆమె అలుపెరుగని పోరాటం ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తున్నదనడంలో సందేహం లేదు. అమె పట్టుబట్టి తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది వెలుగులోకి వచ్చే దిశగా కేసు దర్యాప్తు సాగుతోంది.  ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తునన  పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.  సోదరుడు సీఎంగా ఉన్నందున,   తండ్రిని హత్యచేసిన వారెవరన్నది    సులభంగా తేలిపోతుందని తొలుత ఆమె భావించారు. వివేకా హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న సోదరుడు జగన్  వివేకా హత్య కేసు దర్యాప్తునకు హత్య జరిగిన వెంటనే వివేకా గుండెపోటుతో మరణించారని మీడియా ముందు చెప్పిన జగన్, ఆయన అనుయాయులూ  ఆ తర్వాత గొడ్డలి పోటని, ఆ పోటు వెనుక నారాసుర రక్త చరిత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  సరే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇక తండ్రిహత్య కేసు  సత్వరమే పరిష్కారమై పాత్రధారులు, సూత్రధారులకు శిక్ష పడుతుందని ఆశించారు.  అయితే జగన్ అనూహ్యంగా వివేకా హత్య కేసులో  సీబీఐ విచారణ అవసరం లేదని.. కోర్టుకు తెలిపింది. దీంతో వివేకా కుమార్తె సునీత కంగుతిన్నారు.   ఆ తర్వాత కూడా కేసు నెలలపాటు నత్త నడకన సాగడంతో సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. సాధించారు. అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే అడ్డుపడుతుండటం వివేకా హత్యలో సునీత-ఆమె భర్త హస్తం ఉందన్న రీతిలో ఒక వర్గం మీడియాలో కథనాలు రావడంతో ఆమెకు తన తండ్రి హత్య వెనుక ఉన్న శక్తులెవరన్న విషయంలో ఒక స్పష్టత వచ్చింది. అందుకే జగన్ సీఎంగా ఉన్న ఏపీలో కేసు ముందుకు సాగదని నిర్ధారణకు వచ్చి ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి అప్పగించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసింది. అక్కడ నుంచే వివేకా హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది.   కడప జైలులో ఉన్న నిందితులను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు మార్చడం, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడం, ఆ విచారణ ఆధారంగా రాబట్టిన సమాచారంతో జగన్ ఓఎస్‌డీ, భారతి పీఏలను విచారించడం,  వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి. అలాగే అవినాష్ రెడ్డిని రెండో సారి విచారించేందుకు కూడా సీబీఐ నిర్ణయించుకోవడం.. ఇదంతా సునీత పోరాట ఫలితమేనన్నది కాదనలేని వాస్తవం.  వివేకా హత్య కేసులో ఎవరు హంతకులు? ఎవరు నిర్దోషులు? ఈ కేసులో   ఎవరెవరిని అరెస్టు చేస్తారన్నది పక్కన పెడితే..  తన తండ్రి హంతకులెవరో తేల్చాలని సునీత చేసిన పోరాటం నిజంగా చారిత్రాత్మకం. ఆమె మడమ తిప్పని పోరాట ఫలితమే.. ఈ కేసు ముందుకు సాగేలా చేసింద. లేకుంటే ఎన్నటికీ పరిష్కారం కాని కేసులాగే వివేహా హత్య కేసు కూడా మిగిలిపోయి ఉండేది. అలా మిగిలిపోయి ఉంటే.. ఈ కేసులో నేరస్థులు ఆరోపణులు చేస్తూ.. నిర్దోషులు నిందలు మోస్తూ గడపాల్సి వచ్చేంది. గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య.. కేసులో వివేకా దగ్గరి బంధువులు అప్పటి ప్రభుత్వంపై.. ప్రభుత్వాధినేతపై ఆరోపణలు గుప్పించారు. ఆ ఆరోపణల కారణంగానే అప్పటి విపక్ష పార్టీకి సానుభూతి.. అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ప్రతిఫలంగా దక్కాయి.  సరే ఎన్నికల పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. విపక్షంలో ఉండగా తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేలా అడుగులు వేశారు. విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు అంటూ డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నారు. సునీత గట్టిగా నిలబడి ఉండక పోతే ఏం జరిగేది? ఈ   కేసు ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు.   వివేకా హత్య నిందను తెలుగుదేశం పార్టీ మోస్తూ ఉండాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అన్న అపనిందను దశాబ్దాలుగా చంద్రబాబు ఎలా మోశారో..  వివేకా హత్య కేసులో ఆరోపణలను సైతం అలాగే మోయాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అపనిందల భారం నుంచి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబును తప్పించారు. అయితే అందుకు దశాబ్దాలు పట్టింది. వివేకా హత్య కేసు ఆరోపణల నుంచి సునీత పోరాటం తెలుగుదేశం పార్టీని బయట పడేసింది.   ఇప్పుడు సునీత పోరాటం వల్ల.. వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులెవరన్న ఒక్కో నిజం నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తోంది. ఏకంగా సీబీఐ తన విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి,  ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించింది. దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్‌గా మారారు. అందులో పాత్రధారులు-సూత్రధారులెవరన్నదీ స్పష్టంగా పేర్కొని, వాటిని కోర్టుకు సమర్పించింది.   సీబీఐ గానీ, మరొకరు గానీ కోర్టుకు ఆధారాలు సమర్పించిన తర్వాత, అది అధికార డాక్యుమెంట్‌తో సమానమే. కోర్టు నుంచి ఎవరైనా ఆ కాపీలు తీసుకోవచ్చు. పిటిషనర్ న్యాయవాది కూడా వాటిని తీసుకోవచ్చు.  ఇవన్నీ కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది నిజాన్ని నిగ్గు తేల్చడానికి సునీత జరిపిన పోరాటం గురించి మాత్రమే.   

కాంగ్రెస్ ..కు అంత లేదు.. కవిత సెటైర్లు

గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించడం పాత సామెత ... వందేళ్ల  కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పేరుమార్చుకుని జాతీయ అవతారం ఎత్తిన బీఆర్ఎస్  ఎక్కిరించడం కొత్త సామెత. అవును  ఢిల్లీ లిక్కర్  స్కాం పుణ్యాన జాతీయ మీడియాలో తరచూ వినిపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాంగ్రెస్ ఎక్కిరించారు. ఎగతాళి చేశారు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను కవిత ఎద్దేవా చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, కాంగ్రెస్ పార్టీని చులకన చేసి మాట్లాడారు. అంతేకాదు  హస్తం పార్టీ అహంకారం వీడాలని సలహా కూడా ఇచ్చారు. నిజమే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉన్న మాట నిజమే కానీ, ఇప్పటికీ  ప్రతిపక్ష పార్టీలు అన్నిటిలో  నిజమైన జాతీయ హోదా గుర్తింపు ఉన్న పార్టీ  ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. సంఖ్యాపరంగా చూసినా పార్టీ మనుగడ పరంగా చూసినా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జాతీయ ప్రత్యామ్నాయం. ఇది బీఆర్ఎస్ మాత్రమే కాదు , కమలం పార్టీ కూడా కాదనలేని, అంగీకరించి తీరాల్సిన నిజం. మిగిలిన పార్టీలలో  వేటికీ కూడా లోక్ సభలో మూడంకెల సంఖ్యను దాటిన చరిత్ర లేదు. సమీప భవిష్యత్ లో బీఆరేఎస్ సహా మరే ఇతర   జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా మూడంకెల సంఖ్యకు చేరుకునే అవకాశం లేశ మాత్రంగా  కనిపించడం లేదు. మరో వంక వందేళ్ళకు పైబడిన చరిత్ర ఇంచుమించుగా 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు పదేళ్లకు పైగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించిన అనుభవం ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజుకు కూడా  పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే.  సో.. ఖర్గే చెప్పినా చెప్పక పోయినా సహజంగానే   బీజేపీ వ్యతిరేక పార్టీలకు ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేది కాంగ్రెస్ పార్టీయే. అందులో సందేహం లేదు.  బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి.   అందుకే ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ కాలికి  బలపం కట్టుకుని దేశ మంతా తిరిగినా ఒక్కటంటే ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా  కాంగ్రెస్ ను కాదని  కేసీఆర్  తో జట్టుకట్టలేదు. చివరకు చేసేదేంలేక కేసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం,  ఎంట్రీ పాస్  గా టీఆర్ఎస్ పేరును, బీఆర్ఎస్  మార్చుకున్నారు. మరోవంక ఒక మమత బెనర్జీ,  ఒక కేసీఆర్, ఒక అరవింద్ కేజ్రివాల్ మినహా మిగిలిన  ప్రాంతీయ పార్టీలు  ముఖ్యంగా శరద్ పవార్, నితీష్ కుమార్  ఎంకే స్టాలిన్ వంటి ఉద్దండ నాయకులు కాంగ్రెస్ చెయ్యి వదిలేది లేదని కుండబద్దలు కొట్టారు. చివరకు వామ పక్ష పార్టీలు కూడా ప్రాంతీయ స్థాయిలో ఏ పార్టీలతో పొట్టు పెట్టుకున్నా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుందని స్పష్టంగా చెపుతూనే ఉన్నాయి. నిజానికి  నిజం ఏమిటో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటో కవితకు తెలియంది కాదు. చివరకు కేంద్రంలోనే కాదు, అవసరం అయితే  రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పదనే విషయం  కేసేఆర్ మొదలు కవిత వరకు అందరికీ తెలుసు. అలాగే, రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకే బీఆర్ఎస్  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని గుర్తించడం లేదని అంటున్నారు.

బీఆర్ఎస్ కు తెలంగాణలో కష్టకాలమేనా?... యూజ్ ఆండ్ త్రో పాలసీయే అసలు కారణమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు యుద్ధ తంత్రాన్ని తలపంప చేస్తాయి. ఆయన అవసరానికి బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకోవడానికి వెనుకాడరు.. ఈ మాట ఎవరో అన్నది కాదు స్వయంగా కేసీఆరే. ఆయన రాజకీయ చాణక్యం ముందు నరేంద్ర వంటి ఎందరో నేతలు సోదిలోకి లేకుండా పోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో నేతలు ఆయన పంచన చేరి ఆ తరువాత కనుమరుగైపోయారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఉద్యమ సమయంలో తనతో కలిసి నడిచిన ఎందరో నేతలను ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ కాదు.. జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ ఆయన చేసిన చేస్తున్న ప్రసంగాలకుఆకర్షితులై గతంలో ఆయనతో విభేదించో.. లేక ఆయనకే నచ్చకో దూరం అయిన వారిని మళ్లీ అక్కున చేర్చుకున్నారు. పిలిచి మరీ పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరే వరకే ఆ తరువాత వారికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, బిక్షమయ్యగౌడ్ వంటి నేతలు ఘర్ వాపసీ అంటూ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తరువాత పార్టీలో వారి అతీగతీ పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అలాగే మోత్కుపల్లి.. కేసీఆర్ నిజమైన దళిత బంధుగా కేసీఆర్ ను అభివర్ణించి పంచన చేరి ఈ నాడు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినా.. పార్టీ నుంచి బయటకు పంపేసినా ఏ పని చేసినా అవసరం వినా మరో మాటకు తావే ఉండదని రాజకీయ వర్గాలలో ఓ టాక్ జోరుగా ఉంటోంది. నేతలను ఇలా కూరలో కరివేపాకులా వాడుకున్న ఆయన తీరు కారణంగానే తెరాస భారాసగా మారిన తరువాత రాజకీయంగా ఆయన తెలంగాణలో వెనుకబడే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో వెనుక బాటు అన్నంత మాత్రాన ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ దూసుకు పోతోందని కాదు.. విస్తరణ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కేసీఆర్ ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి మొండి చేయి చూపుతారు అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఘర్ వాపసీల తో అయితేనేమీ, ఆపరేషన్ ఆకర్ష్ తో అయితేనేమి.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ హౌస్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరికి పార్టీ టికెట్ కేటాయించినా అసమ్మతి, అసంతృప్తి భగ్గు మనడం ఖాయం. అంతేనా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనే రెబల్స్ బెడద అధికంగా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి.  ఏళ్ల తరబడి నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయకుండా నాన్చిన ఫలితంగా ఇప్పుడు ఆ నామినేటెడ్ పోస్టుల భర్తికీ కేసీఆర్ పచ్చ జెండా ఊపినా.. ఎవరికి పదవి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో అన్న జంకు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం, ఎదుర్కొని గెలుపు బాట పట్టడం అంత సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. 

వంశీ ప్రతిష్ట డ్యామేజీ.. వైసీపీలో ఆయన వ్యతిరేకులు సో హ్యాపీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు.. స్థానిక టీడీపీ కార్యాలయంపై ముకుమ్మడి దాడితో... ఫ్యాన్ పార్టీలోని వంశీ వ్యతిరేక వర్గానికి చక్కటి అవకాశం చే జేతులా చిక్కినట్లు అయిందని.. ఈ నేపథ్యంలో వంశీకి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సదరు వర్గానికి చేతి నిండా పని దొరికినట్లు అయిందనే ఓ చర్చ ఆ నియోజకవర్గంలో విస్తృతంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ..  ఆ తర్వాత జగన్ పార్టీలోకి దూకేసిన సంగతి తెలిసిందే.  అయితే వంశీ రాకను.. గన్నవరం నియోజకవ వైసీపీ  ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ రంగంలోకి దిగి.. వెంకట్రావ్‌ను కూల్ కూల్ చేశారు. కానీ వంశీకి, యార్లగడ్డ వెంకట్రావ్‌కు మధ్య వైరం నాడే కాదు.. నేటికి పచ్చి పచ్చిగానే ఉందని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి.  మరోవైపు ఇదే నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ కీలక నేత దుట్టా రామచంద్రరావు  తన అల్లుడికి గన్నవరం టికెట్ ఇప్పించుకొనేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన జగన్‌ ఫ్యామిలీతో దగ్గర బంధుత్వం కలిగి ఉన్న వ్యక్తి కూడా.  వీరందరినీ కాదని... వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ వంశీకేనంటూ ఇప్పటికే  జగన్   క్లారిటీతో చెప్పేసినట్లు వైసీపీ శ్రేణుల్లోనే ఒక చర్చ జోరుగా సాగుతోంది.  జరిగిన, జరుగుతున్న పరిణామాలను దుట్టా వర్గం, యార్గగడ్డ వర్గం  సైలెంట్‌గా గమనిస్తూ ఉన్నాయనీ....   తాజాగా టీడీపీ కార్యాలయంపై వంశీ వర్గీయులు దాడి ఘటనను ఈ రెండు వర్గాలు తమకు అనుకూలంగా మలచుకుని.. వంశీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే అవకాశాలు  మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  మరోవైపు గతంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.... ఆ తర్వాత ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సారీ సిస్టర్ అంటూ క్షమాపణలు చెప్పినా..  అప్పటికే వంశీ ఇమేజ్‌ ఎంతగా డ్యామేజ్ కావాలో అంతా  జరిగిపోయిందని.. ఇప్పుడు తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై ముక్కుమ్మడి దాడి ఘటనతో టోటల్‌గా వంశీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందనే ఓ చర్చ సైతం సైతం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే  కొడాలి నానికి అయినా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయినా.... పోలిటికల్ లైఫ్ ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలో చేరి.. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీపైనే ఆరోపణలు గుప్పించడం వల్ల... వీరిపై ప్రజల్లో ఓ విధమైన తప్సుడు అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతోందని.. ఈ  అంశాన్ని దుట్టా, యార్లగడ్డ వర్గాలు... ఒక తాటిపైకి వచ్చి.. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగితే..  ఆయన తట్టుకోగలడా అనే ఓ విధమైన సందేహం ప్రస్తుత ఎమ్మెల్యే వర్గంలో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.  అదీకాక వంశీపై రాజకీయంగా పట్టు సాధించేందుకు యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా వర్గాలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొంటూనే ఉన్నాయని... ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో వంశీపై టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్‌ను బరిలో నిలిపేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని తెలుసుకొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. టీడీపీ కార్యాలయంపై దాడి చేయాలంటూ ఆయన వర్గీయులను ఆదేశించారనే చర్చ సైతం స్థానికంగా వైరల్ అవుతోంది.   ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గన్నవరం నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుదన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకే 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ వేవ్‌లో సైతం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందారు. అలాంటి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పట్టాభిని నిలబెడితే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని.. అందులో ఎటువంటి సందేహం అయితే లేదనే ఓ చర్చ సైతం వంశీ వర్గీయుల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వంశీ వర్గీయులు సైకిల్ పార్టీ కార్యాలయంపై దాడికి పునుకున్నారనే చర్చ సైతం స్థానికంగా కొన.. సాగుతోంది.

కాంగ్రెస్ ప్లీనరీలో కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం!

కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. నిజంగానే గాంధీ కుటుంబం పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను పార్టీకి వదిలేసి దూరంగా ఉంటున్నారు. అంటే రాజకీయ వర్గాలలో మాత్రం ఔననే సమాధానం వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచీ ప్రక్షాళన చేసి.. క్యాడర్ ను మరింత క్రియాశీలంగా మార్చాలన్న నిర్ణయంతో ఉంది. అందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షులు  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పూర్తిగా సహకారం అందిస్తున్నారు. పార్టీ తమ ప్రమేయం లేకుండానే స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కీలక సమావేశాలు, నిర్ణయాలలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు. అలా అని పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా అంటే అదేం లేదు. కాంగ్రెస్ లో ప్రస్తుతం కనిపిస్తున్న జోష్ కు, విజయంపై పెరిగిన విశ్వాసానికి రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. ఇలా ఉండగా కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 24) నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వేదికగా జరుగుతాయి. ఏఐసీపీ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాలలో మొత్తం 6 తీర్మానాలను పార్టీ ఆమోదిస్తుంది. ముఖ్యంగా సీడబ్ల్యుసీకి ఎన్నికల నిర్వహణపై స్టీరింగ్ కమిటీ చర్చిస్తుంది. అయతే ఈ చర్చకు పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దూరంగా ఉంటారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకే వారీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

టి.20 మహిళల ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఫైనల్ ఆశలు గల్లంతు

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా పోరు సెమీస్ తో ముగిసింది. సెమీస్ లో ఆస్ల్రేలియా చేతిలో ఐదుపరుగుల తేడాతో పరాజయం పాలైంది. విజయం ముంగిటకు వచ్చి కూడా చివరి నిముషంలో తడబడి ఓటమి మూటగట్టుకుంది. అయితే పోరాడి ఓడిన భారత అమ్మాయిలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. మొత్తం మీద టైటిల్ ఆశలో వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా మహిళల జట్టుకు ఆ ఆశ నెరవేరలేదు. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది.  173 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత దీప్తి శర్మ (20 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన దశలో భారత్ పది పరుగులు మాత్రమే సాధించగలిగింది. దీంతో 5 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.  ఈ విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్స్ కు చేరింది. అయితే సెమీస్ లో టీమ్ ఇండియా ఓటమికి దురదృష్టమే కారణమని చెప్పాలి. విజయం దిశగా జట్టును నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అవ్వడంతోనే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 15వ ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్ ప్రీత్ కౌర్ నాలుగో బంతిని హర్మన్ మరో షాట్ కొట్టింది. అయితే బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపిన ఫీల్డర్..బంతిని వేగంగా వికెట్ కీపర్ కు త్రో చేసింది. రెండో పరుగు తీస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్ లోకి చేరేలోగా కీపర్ వికెట్ స్టంప్ చేశాడు. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అయ్యింది. ఆ ఔటే విజయం ముందు టీమ్ ఇండియా బోల్తాపడేలా చేసింది. జర్వంతోనే క్రీజ్ లోకి దిగిన స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును దాదాపు విజయం అంచులకు చేర్చింది. అయితే దురదృష్టవశాత్తూ..ఆమె రనౌట్ టీమ్ కు విజయాన్ని దూరం చేసింది. 

ఇక అరెస్టేనా?

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దమైందా?అంటే పోలిటికల్ సర్కిల్‌లో ఔననే సమాధానమే వినిపిస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 24)  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరుకానున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు   సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు  ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ  హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా జోరందుకొంది.    అయితే ఈ హత్య కేసులో   అవినాష్ రెడ్డిని గత నెల 28 తేదీనే సీబీఐ అరెస్ట్ చేసేందుకు సిద్ధమైందని.. అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో ఉందని.. అందుకే ఆ రోజు.. సీబీఐ వెనక్కి తగ్గి....  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని.. ఆ క్రమంలోనే ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతీ పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించిన తర్వాత.. సీబీఐ అధికారులకు  క్లారిటీ   వచ్చిందని.. అందుకే మళ్లీ   అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారని.. అదీ కూడా వాట్సప్‌లో పంపడం బట్టి చూస్తే..  అరెస్టు తప్పదన్న చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిందని తెలుస్తోంది.  ఇంకోవైపు.. గత నెల 28 నే తనను అరెస్ట్ చేస్తారని కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి అర్థమైందని.. అందుకే తనతోపాటు.. తన సొంత జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని పలువురు కీలక నాయకులు, కేడర్‌ను సైతం హైదరాబాద్ తీసుకువచ్చారనే ప్రచారం సైతం కొన.. సాగుతోంది. కానీ సీబీఐ మాత్రం వేచి చూసే దోరణి కారణంగా.. నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని సమాచారం.    అదీకాక జనవరి 28వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి... సీబీఐ విచారణకు హాజరయ్యారని.. మరోవైపు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్... అంతకుముందు అధికారికంగా ఆ రోజు నిర్ణయించుకున్న అన్నీ పర్యటనలను అర్థాంతరంగా రద్దు చేసుకుని మరీ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారనే అంశం కూడా ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   మరి ఫిబ్రవరి 24వ తేదీన సీఎం  జగన్..   తన అధికారిక పర్యటనలు లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? లేకుంటే. ఓ వేళ ఆ రోజు పర్యటనలు ఏమైనా ఉంటే వాటిని గతంలో లాగా అర్థాంతరంగా రద్దు చేసుకుని.. తన నివాసానికే పరిమితమైపోతారా? అనే సందేహాలు సైతం  వ్యక్తం అవుతున్నాయి.   వివేకా హత్య కేసులో ఓ వేళ వైయస్ అవినాష్ రెడ్డి   అరెస్ట్ అయితే.. ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసేది ఎవరిని అనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.

పట్టిన దయ్యం వదలాలంటూ భార్యకు కుక్కతో పెళ్లి!

మనుషుల్లో మూఢనమ్మకాలు 21వ శతాబ్దంలోనూ సభ్య సమాజాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక విజ్ణానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా మనిషిలోని మూఢత్వాన్ని పారద్రోల లేకపోతున్నాయనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తుందీ సంఘటన. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు ఓ కుక్కతో పెళ్లి జరిపించాడు. ఎందుకయ్యా అంటే తన భార్యకు దయ్యం  పట్టిందనీ, దానిని వదల్చాలంటే కుక్కతో పెళ్లి చేయక తప్పదని బదులిచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అతగాడి భార్య కూడా తనకు దయ్యం పట్టిందనీ, కుక్కుతో పెళ్లి జరిగితేనే దయ్యం వదులుతుందనీ చెప్పడం. కుక్కతో పెళ్లికి తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని ముక్తాయించడం. అసలీ ఆలోచన వారికి ఎలా వచ్చిందంటే.. ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆమెకు దయ్యం పట్టిందని పండితులు(?) చెప్పారట. ఆ దయ్యం వదలాలంటే ఓ శునకంతో ఆమెక వివాహం జరిపించాలని, అలా చేస్తేనే దయ్యం వదులుతుందని నమ్మకంగా చెప్పారట. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నీ భార్యకు దయ్యం పట్టడం సంగతేమిటో తెలియదు కానీ.. నీకు మాత్రం పిచ్చి పీక్స్ కు చేరిందయ్యా అంటూ సదరు భర్తపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముందు ఇద్దరూ మంచి వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేసుకోండి అని సలహా ఇస్తున్నారు.