బండికి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. పేపర్ లీకేజీ కంటే ముందే బండి సంజయ్ తో నిందితుడు ప్రశాంత్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బండి సంజయ్ తో ప్రశాంత్ వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు క్లారిటీకి వచ్చారు.  తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. 10 వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని అన్నారు. బండిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్, సీఆర్పీసీ 154, 157 కింద  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.  కాగా బండి సంజయ్ ను హనుమకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఆయన బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.  దీంతో పోలీసులు బండి సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించారు. కాగా బండి సంజయ్ పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును బీజేపీ లీగల్ సెల్ ప్రతినిథులకు వివరించారు.  పోలీసులు దురుసుగా వ్యవహరించి తనకు గాయపరిచారని చెబుతూ  చొక్కా విప్పి లాయర్లకు గాయాలను చూపారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అనుకున్నదొకటి.. అయినది మరొకటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అంతకు ముందు కేంద్ర మంత్రి, బీజేపే ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ తోనూ సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా, ప్రధాని మోదీతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని వార్తలు వచ్చినా, ఆయన రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా, అలాంటిదేమీ జరగ లేదు. మురళీధరన్, నడ్డాతో సమావేశమై పవన్ కళ్యాణ్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు.  ఒక విధగా చూస్తే ఈ సమావేశానికి బీజేపీ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు. ఓ మొక్కుబడి తంతుగానే ముచ్చట్లు ముగిశాయి. రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎలాగైతే జన సేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తారో అదే విధంగా ఢిల్లీ నేతలు వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోక పోయినా, ఢిల్లీ నాయకులు తనకు సముచిత గౌరవం ఇస్తారనే భ్రమల్లో ఉన్నపవన్ కళ్యాణ్ కు ఈ పర్యటనలో బీజేపే తత్త్వం బోధ పడేలా వారు ట్రీట్ చేశారని, చూసినవారికి అర్థమైంది. పిలవని పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తయిదువును ట్రీట్ చేసిన విధంగానే, ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో వ్యవహరించారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.  అదలా ఉంటే  నడ్డాతో  సమావేశం అనతరం పవన్ కళ్యాణ్  స్వయంగా పలికిన పలుకులలోని అస్పష్టతను గమనిస్తే  ఆయన ఢిల్లీ వచ్చిన కార్యం నెరవేరలేదని స్పష్టమైందని  అంటున్నారు. అలాగే  మీడియాతో మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్, ఆయన పక్కన నిలుచున్న నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్  గమనిస్తే  పవన్ కళ్యాణ్ నటించిఃన జల్సా సినిమాలోని  కామెడీ సీన్  గుర్తుకొస్తోందని అంటున్నారు.  నిజానికి  పవన్ ఢిల్లీ యాత్రపై జనసేన వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజలలో కూడా చాలానే అంచనాలున్నాయి. ముఖ్యంగా సంవత్సర కాలానికి పైగా ఎటూ తేలకుండా గాలిలో తేలుతున్న ఎన్నికల పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశించారు.ఈ నేపధ్యంలోనే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు  రానున్న ఎన్నికల్లో  పొత్తులపై  అనుసరించాల్సిన వ్యూహంపై  బీజేపీ అగ్రనేతలతో  చర్చించేందుకే  పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టుగా  ప్రచారం జరిగింది. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదే కావచ్చు. కానీ  బీజేపీ పెద్దల ఆలోచన మరో విధంగా వుందో ఏమో కానీ పొత్తుల విషయం పక్కన పెట్టి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం గురించి మాట్లాడి పంపించారు. అంటే బీజేపీ ఏపీ రాజకీయాలపై కనీసం ప్రస్తుతానికి ఎలాంటి  నిర్ణయం తీసుకునేందుకు సిద్దంగా లేదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.  ఇతర విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కు రెండు విషయాల్లో క్లారిటీ వుంది. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించవలసిన చారిత్రక అవశరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అలాగే  వైసేపీ అరాచక పాలన అంతమొందించేందుకు  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే విషయంలోను పవన్ కళ్యాణ్ కు ఫుల్ క్లారిటీ వుంది. కమిట్మెంట్  వుంది. అందుకే  2014 పొత్తులను పునరుద్ధరించి  వైసీపీ అరాచక పాలన అంతమొందించాలనే  ఆలోచనతో బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నారు. అయితే, బీజేపీ లెక్కలు వేరుగా ఉన్నట్లున్నాయి .. అందుకే,  పొత్తుల విషయం పక్కన పెట్టి కాలయాపన చేస్తోందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బీజేపీ ఉచ్చులోంచి బయటకు రావాలని పరిశీలకులు అంటున్నారు. ఇంకా జాప్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.

బండి అరెస్టుపై బీజేపీ హై కమాండ్ సీరియస్!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్  వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ సంచలనంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు మూడు రోజుల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని, బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బండి సంజయ్ అరెస్ట్  పై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  అరెస్ట్ ను బీజేపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యనేతలతో నడ్డా ఫోన్‌లో మాట్టాడారు. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా   సూచించారు.  అంతకు ముందు, దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించేందుకు బీజేపీ హై కమాండ్ సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడుజేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశమై బండి అరెస్ట్ విషయాన్ని చర్చించారు. ఈ సందర్భంగా బండి అరెస్ట్ సందర్భంగా జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మోడీ పర్యటనకు ముందు ఇలా జరగటంపై చర్చించారు.   బండి సంజయ్ అరెస్టుకు కారణాలు ఏంటీ.. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అరెస్ట్ చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా, అమిత్ షా.మరో రెడ్నురోజుల్లో 8వ తేదీన ప్రధాని రాష్ట్రంలో పర్యటించాల్సిన ఉన్న క్రమంలో.. ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం.. చేసిన తీరును ప్రధాని మోడీకి నడ్డా, అమిత్ షా వివరించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సైతం స్పందించినట్లు తెలుస్తుంది. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించాలని.. బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులను తెలుసుకోవాలని మోడీ సూచించారు.  మరోవంక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు, తరుణ్ చుగ్   బండి అక్రమ అరెస్ట్ ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన్ విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.     కాగా, స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ నాయకులు విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

సలహాల్రావులు.. సర్వాధికారులు!

నూరు పూలు వికసించనీ..  వేయి ఆలోచనలు సంఘర్షించనీ అంటాడు మావో. అలాగే ప్రజా క్షేత్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ ఆలోచనలూ, ఆచరణా మరింత మెరుగ్గా ప్రజా సేవకు, సంక్షేమానికి, అభివృద్ధికీ దోహదపడేందుకు సలహాదారులపై ఆధారపడటం కద్దు. ఆ విధంగానే ముఖ్యమంత్రులు కొందరు సలహాదారులను నియమించుకుని.. పాలన మరింత సమర్ధంగా సాగేందుకు వీలుగా వారి సహకారం తీసుకుంటారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో   రాజకీయాలలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు కూడా ఒక సలహాదారుల బృందం ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, విపక్ష నేతగా ఉన్నప్పుడూ ఈ బృందం ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఆ సలహాదారుల బృందం రాజకీయ సర్కిల్స్ లో గండిపేట మేధావులుగా గుర్తింపు పొందింది. వీరు కేవీ సత్యనారాయణ, అట్లూరి వెంకటేశ్వరరావు, మింటె పద్మనాభం, నందివాడ సాంబశివరావు, ప్రొఫెసర్ ఎఫ్ డీ వకీల్, ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, తుమ్మల చౌదరి. ఎన్టీఆర్ పాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వెనుక వీరి సలహాలే ఉన్నాయని చెబుతారు. కానీ వీరెన్నడూ తెరదాటి ముందుకు రాలేదు.    అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి కూడా చంద్రమౌళిరెడ్డి అనే సలహాదారు ఉండేవారు. సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ)పై నిషేధం ఎత్తివేత, ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు స్వేచ్ఛ వంటి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్నది చంద్రమౌళిరెడ్డి సలహాలే అని చెబుతారు. ఆయన కూడా తెర వెనుకే ఉన్నారు తప్ప బయటకు వచ్చి అంతా తన ఘనతే అని చాటుకోలేదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ సలహాదారుగా వ్యవహరించారు. పాలనాపరమైన, పార్టీ పరమైన అన్ని వ్యవహారాలలోనూ  వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ చేదోడు వాదోడుగా ఉండేవారు. కేవీపీ ఆమోదం లేకుండా వైఎస్ ఏ నిర్ణయం తీసుకునే వారు కాదని చెబుతారు. సలహాదారుగానే కాకుండా కేవీపీ వైఎస్ కు ఆత్మబంధువుగా కూడా చెబుతారు. అయినా కూడా ఆయన వైఎస్ వెనుక కనిపించేవారే కానీ ఎన్నడూ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు.   కేవీపీ ప్రత్యక్ష రాజకీయాలలో కూడా చురుకుగా ఉండేవారు కనుక ఆయన జనాలకు   సుపరిచితులే. అయితే ఎన్నడూ సర్వం తానేనన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబు సలహాదారు కుటుంబరావు అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా  పని చేశారు. ఆ హోదాలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మీడియాతో మాట్లాడేవారే కానీ ఆ పరిధిని దాటలేదు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎందరో సలహాదారులు ఉండొచ్చు కానీ ప్రస్ఫుటంగా అందరికీ తెలిసిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ, పార్టీ పరంగా అన్నిటా ఆయనే అన్నట్లుగా సజ్జల తీరు ఉంటుంది. సకల శాఖల మంత్రిగానే కాకుండా డిఫాక్టో సీఎంగా కూడా ఆయనే ప్రభుత్వ విధానాలు, పార్టీ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తుంటారు. జగన్ కేబినెట్ లోని ఏ మంత్రీ కూడా తమ తమ శాఖలకు సంబంధించిన వివరాలు మీడియా సమావేశం పెట్టి వెళ్లడించే అవకాశం ఇవ్వకుండా సజ్జలే వెల్లడించేస్తారు. ఇక ప్రభుత్వ అభివృద్ధిపై సాధారణంగా ఆయా శాఖల బాధ్యతలు చూస్తే ఐఏఎస్ లు మీడియాకు వెళ్లడిస్తారు. కానీ ఆ విషయాలను మీడియా ముఖంగా చెప్పే పని కూడా సజ్జలే సొంతం చేసేసుకున్నారు. జగన్ సర్కార్ లో జగన్ ను మించి నిర్ణయాలు తీసుకునేదీ, అమలు చేసేదీ కూడా సజ్జలేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి. సలహాదారుగా కంటే సజ్జల సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా సజ్జల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సలహాదారు కేవీపీకి  ప్రస్తుత సీఎం సలహాదారు సజ్జలకు ఉన్న బేధాన్ని ఎత్తి చూపుతున్నారు. 

ఏపీ డిప్యూటీ సీఎంకు అసమ్మతి సెగ??|

 ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో  అంతర్గత కుమ్ములాటలు, జిల్లా నుంచి జిల్లాకు, నియోజక్ వర్గం నుంచి నియోజాక వర్గానికి విస్తరిస్తున్నాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమ మాటే, శిలాశాసనం అన్నట్లుగా వ్యవహరించిన వారు, అలాగే, యథా సీఎం తథా మంత్రి, యథా మంత్రి తథా ఎమ్మెల్యే అన్నట్లుగా, పై నుంచి కింది వరకు ఎవరికి వారు, తమ తమ పరిధిలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. అయితే, ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది. తాడేపల్లి ప్యాలెస్ మొదలు పంచాయతీ స్థాయి వరకు ఎక్కడి క్కడ అసమ్మతి బుసలు కొడుతోంది.  కాగా, తాజగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కి సొంత పార్టీలో అసమ్మతి మొదలైంది. పెనుమూరు మండలానికి చెందిన ఆయన వ్యతిరేక వర్గం సమావేశమై నారాయణ స్వామిపై ఘాటుగా విమర్శలు చేశారు. నారాయణస్వామి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఎవరిని అడిగి మండల పార్టీ కన్వీనర్లను మార్చేశారని సొంత పార్టీ వారే నిలదీస్తున్నారు.   ‘గడప, గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఆహ్వానించడం లేదనీ,  పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణస్వామి నియమించిన కన్వీనర్లను అంగీకరించేది లేదని గట్టిగా ధిక్కార స్వరం విమర్శించారు. నారాయణస్వామి అధికారులు, పోలీసుల్ని అడ్డుగా పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి, ఇదిలా ఉంచితే తనపై అసమ్మతీయులు చేిస తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్య్తం చేశారు,. అసమ్మతి వర్గం తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధికి పనిచేయనివారు టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని.. సొంత పార్టీకి నష్టం చేసేవాళ్లను వదిలేసే ప్రసక్తేలేదన్నారు. పెనుమూరు మండలంలో కొందరు సొంత పార్టీ నాయకులే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వాటిని సహించేదిలేదని హెచ్చరించారు. కొందరు భూ ఆక్రమణదారులకు నోటీసులు అందాయని.. తప్పు చేయకుంటే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలి కానీ తన మీద నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని నారాయణ స్వామి అసమ్మతి నేతలపై ఎదురు ది చేస్తున్నారు.అసమ్మతి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడినవారికి కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు నారాయణ స్వామికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఊహించని పరిణామం ఎదురైంది. సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు కార్వేటినగరం పంచాయతీలో పర్యటిస్తున్న సందర్బంగా యువకుల నుంచి డిప్యూటీ సీఎంను యువకులు నిలదీశారు.  డీఎస్సీ నిర్వహణ,  నిరుద్యగోగ యువతకు ఉద్యోగావకాశాలు.  జాబ్ క్యాలెండరక తదితర అంశాలపై జనం డిప్యూటీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.  రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కూడా వారీ సందర్భంగా ప్రస్తావించారు.   నిజానికి ఇది ఒక్క ఉప ముఖ్యమంత్రి సమస్య కాదు ... మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ వారు అసమ్మతి సెగల తాకిడికి ఉక్కపోతకు గురవుతున్నారు. అంతే కాదు,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేర్కొనే ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఎదురవుతున్న అవమానాలను భరించలేక పోతున్నారు. అందుకే ఆయన గడప గడకు మన ప్రభుత్వం సమీక్షకు కూడా హాజరు కాలేదని, అలాగే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రికెట్ ఇవ్వక పోతే రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటానని అన్నారు . అనే ఆయన ఎంతగా హర్ట్’ అయ్యారో వేరే చెప్పవలసిన అవసరం లేదు. వైసీపీ ఇలాంటి ఎమ్మెల్యేలు ఒకరో ఇద్దరో కాదు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకుని ప్రయోజనం ఏముందని అంటున్నారు,

ఆసియా కుబేరుడు అంబానీయే!

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్  అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయాడు.  83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ఆసియాలోనే సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు.   గౌతమ్ అదానీ 128 బిలియన్ డాలర్ల సంపదతో గత జనవరి వరకూ  ప్రపంపచ ఫోర్బ్స్ అగ్రగామి పాతిక మంది జాబితాలో మూడో  స్థానంలో ఉన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్  ఆఫ్ కంపెనీ అక్రమాలపై నివేదిక సమర్పించడంతో.. అదానీ షేర్లు భారీగా  పతనమైన నేపథ్యంలో అదానీ సంపద భారీగా తరిగి.. ప్రపంచ కుబేరుల జాబితాలో 24 వ స్థానానికి పడిపోయాడు.   అమెజాన్ అధినేత జెఫ్ బెజోఫ్ మూడవ స్థానంలో, ఎలన్ మస్క్ రెండవ స్థానంలో ఉన్నారు.  ఫ్రాన్స్ విలాస వస్తువుల వ్యాపారవేత్త  ఎల్పీఎం హెచ్ ఆధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. మస్క్ (180 డాలర్లు) బెజోస్ (114 బీ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.  ఫోర్బ్స్ 2023 జాబితాలో 169 మంది భారతీ యులు చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ఈ  సంఖ్య 160గా ఉండింది.  

తెలంగాణకు కర్నాటక లింకేమిటి?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. పరిశీలకుల విశ్లేషణల మేరకు ఆ రాష్ట్రంలో ఫలితాలు కచ్చితంగా ఆ తరువాత జరగబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం కనుక ఆ ప్రభావం ఉంటుందని కాదు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం, విజయం సాధించి అధికారం చేపట్టడం కోసం బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ పోరులో ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలూ అధికారమే లక్ష్యంగా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా పోటీలో బలంగా ఉంది. అక్కడ కర్నాటకలో మాత్రం బీడీఎస్.. పోటీలో ఉన్నా.. ఆ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదన్నది పరిశీలకుల మాట. అందుకే బీడీఎస్ కర్నాటకలో హంగ్ కోరుకుంటోంది. అలా హంగ్ వస్తే..కింగ్ మేకర్ రోల్ పోషించాలన్నది ఆ పార్టీ అభిమతం. ఇక్కడ తెలంగాణలో మూడు పార్టీలో హోరాహోరీ తలపడుతుండటంతో హంగ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.  అయితే ఆ అంచనాలు, పరిశీలనలూ పక్కన పెడితే.. కర్నాటక ఎన్నికలలో బీజేపీపై కాంగ్రెస్ పై చేయి సాధిస్తే మాత్రం ఆ ప్రభావం తెలంగాణలో కచ్చితంగా ఉంటుందనీ, కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడతాయనీ చెబుతున్నారు. ఎందుకంటే కర్నాటక ఫలితాల ప్రభావం రాష్ట్రంలో ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గు చేపేలా చేస్తుందని చెబుతున్నారు. అదీ కాక తెలంగాణలో గతంతో పోలిస్తే.. ఆ పార్టీ బాగా పుంజుకుందని సర్వేలే చెబుతున్నాయి. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక దాదాపు అంతే కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో  ఓటర్లు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. ఆ ప్రభావం నిస్సందేహంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుంది. ఇప్పటికే పుంజుకున్న బలం పొరుగురాష్ట్రంలో విజయంతో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అలా కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ ఏర్పడితే.. ఇక ఇప్పటికే తెలంగాణ సీనియర్ నేతలు చెబుతున్న జోస్యాలు, చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం తెలంగాణలో, కర్నాటకలో అధికారం చే జిక్కించుకునేది కాంగ్రెస్సేనని ధీమాగా చెబుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కోసం తెలంగాణ నుంచి ఎటువంటి సహకారం అయినా చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. పైగా కర్నాటక పీసీసీ చీఫ్ తో రేవంత్ కు తొలి నుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే దక్షిణాదిన ఆ పార్టీకి ఏమైనా స్టేక్ అంటూ ఉందంటే ఇప్పటి వరకూ కర్నాటకలోనే.. ఇటీవలి కాలంలోనే తెలంగాణలో ఒకింత పుంజుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే కర్నాటకలో గెలవక తప్పని అనివార్య పరిస్థితి ఆ పార్టీది. కానీ కర్నాటక ఆనవాయితీ ప్రకారం ఏ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా రెండో సారి అధికారం ఇవ్వరు. ఇప్పుడు కూడా అదే పునరావృతమైతే.. తెలంగాణపై ఆశలు కూడా వదిలేసుకోవలసిందేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఎలాగైనా కర్నాటకలో అధికారాన్ని  చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా తమ పార్టీ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది. 

కర్ణాటకలో మళ్ళీ హంగ్? సీఎం కుమారస్వామేనా?

కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సహజం ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది? అనే చర్చ జరుగుతుంది. కానీ, కర్ణాటకలో మాత్రం, పొలిటికల్ ఫోకస్ మొత్తం మూడో పార్టీ పైనే వుంది. అవును.. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే కర్ణాటకలో మరో మారు హంగ్ తప్పదనే వ్యూహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో,  రేసులో ఉన్న మూడో పార్టీ జేడీఎస్ ఎటు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్ కింగ్ ఆర్  కింగ్ మేకర్ గా కీలకంగా మారుతోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది.  దీంతో  78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ ఎగరేసుకుపోయింది.  హెచ్ డీ కుమార స్వామి ముఖ్యమంత్రిగా  జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర.  సంకీర్ణంలో చిచ్చు రేగింది. సర్కార్ కూలి పోయింది. ఈ లోగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా ఏడాది తిరగక ముందే   యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా  బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది,  ఆ తర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే ఆ చరిత్రను అలా ఉంచితే, రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ కర్నాటకలో  అదే హంగ్  స్థితి పునరావృతం అయితే .. ఏం జరుగుతుంది?  కింగ్ మేకర్ జేడీఎస్ ఏమి చేస్తుంది అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ ..  హంగ్ వచ్చినా తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్తం చేశారు.  తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరాదని నిర్ణయించారని దేవెగౌడ వెల్లడించారు. ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ పొత్తులు వద్దనుకున్నామన్నారు. రెండు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.  సొంతంగా అధికారంలోకి రావడంపైనే దృష్టి సారించామని దేవెగౌడ చెప్పారు. సొంతంగా అధికారంలోకి వస్తేనే మ్యానిఫెస్టోలో ప్రకటించే అన్ని కార్యక్రమాలనూ దిగ్విజయంగా అమలు చేయగలుగుతామన్నారు. అయితే  జేడీఎస్ ఒంటరిగా అధికారంలోకి రావడం అయ్యే పనికాదని, హంగ్ అంటూ వస్తే, కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో కుమార స్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 127 స్థానాలు గెలుచుకోవచ్చని ఏబీపీ ఒపీనియన్‌ పోల్‌ సర్వే తెలిపింది. ఇదే జరిగితే జేడీఎస్ అవసరం కాంగ్రెస్‌కు ఉండదు. అయితే పీపుల్స్ పల్స్’ తదితర సంస్థలు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా, మేజిక్ ఫిగర్  కు డజను సీట్ల దూరంలో ఉండి పోతుందని, సో .. జేడీఎస్ కింగ్ మేకర్ గా కంటిన్యూ అవుతుందని అంటున్నారు.  మరో వంక బీజేపే నాయకులు 150 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిషన్ 150 వ్యూహరచన చేశారనీ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా సింగిల్ గానే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ నెంబర్ చేరుకోకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్రలోకి వెళ్తుంది. కాగా  పస్తుతం 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది.

పవన్ హస్తిన పర్యటన..జరిగిందేమిటి? ఒరిగిందేమిటి?

జనసేనాని హస్తిన పర్యటన పై ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన ఉత్కంఠ ఆయన హస్తినలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలతో చప్పున చల్లారిపోయింది. హఠాత్తుగా రాజస్థాన్ హాలీడే ట్రిప్ నుంచి అటు నుంచి అటే హస్తినలో వాలిన జనసేన బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీ ధరన్ తోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. ఆ తరువాత మంగళవారం (ఏప్రిల్ 4) రాత్రి హస్తినలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటలలో ఒక్కంటే ఒక్క కొత్త మాట లేదు. గత కొన్నాళ్లుగా ఆయన చెబుతున్నదే మరోసారి చెప్పారు. ఏపీలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడమే తన లక్ష్యం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యం కూడా అదేనని ఉద్ఘాటించారు. కానీ బీజేపీ లక్ష్యం ఏమిటన్నది బీజేపీ నేతల నోటి నుంచే చెప్పించి ఉంటే ఆ ఎఫెక్ట్ మరింతగా ఉండేది. జనసేన అధినేతగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ తరువాత ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల ముందుకు వచ్చి ఏపీలో తమ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే అని ప్రకటించి ఉంటే.. ఆ మాటకు విశ్వసనీయత మరింతగా ఉండేది. అలా కాకుండా పవన్ కల్యాణ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి బీజేపీ లక్ష్యాన్ని ప్రకటించడమేమిటని పరిశీలకులే కాదు.. జనసేన శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో జగన్ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ గత కొంత కాలం నుంచీ చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో ఏపీలో తాను మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులతో తనకు అంతగా పొసగడం లేదని కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. అదే సమయంలో కేంద్రంలోని మోడీ, అమిత్ షాలపై తనకు అపారమైన గౌరవం, నమ్మకం ఉందనీ, ఏపీలో రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించి, అధికార వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చేలా వారిని ఒప్పిస్తాని పవన్ కల్యాణ్ గతంలో పలు మార్లు చెప్పారు. అయితే  అటువైపు నుంచి అంటే బీజేపీ నుంచి మాత్రం పవన్ కు అటువంటి గౌరవం మర్యాదా దక్కుతోందా? అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.  బీజేపీ ఏపీ విషయంలో అటు  వైసీపీ అధినేత జగన్ తోనూ.. ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ తోనూ ఆడుతున్నది పొలిటికల్ గేమ్ మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు, అటు జాతీయ స్థాయి నేతలూ కూడా పవన్ కల్యాణ్ విషయంలో డబుల్ గేమ్ అడుతున్నారా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.  అసలు ఇంతకీ పవన్ కల్యాణ్ ను హస్తినకు పిలిపించుకుని చర్చించిన విషయం కర్నాటక ఎన్నికలపైనేని అంటున్నారు.   

కుటుంబ పాలనే కమల దళం అస్త్రం!

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వేటికవి ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్  తెర చాటు  వ్యూహరచన చేస్తుంటే, మరో ‘ముఖ్య’ నేత మంత్రి కీటీఆర్  క్షేత్ర స్థాయిలో ముందుండి యుద్ధానికి సేనలను సిద్దం చేస్తున్నారు. హరీష్ రావు వంటి ఇతర ముఖ్య నేతలను ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడుకుంటూ కేటీఅర్ ఒంటి చేత్తో చక్రం తిప్పుతున్నారు.  అలాగే  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కుంటున్న సవాళ్ళను ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబం లక్ష్యంగా ఒకదాని వెంట ఒకటిగా వెంటపడుతున్నఅవినీతి ఆరోపణలను తిప్పి కొడుతూ కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై పదునైన అస్త్రాలను సంధిస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ చేస్తున్న విమర్శలు, ప్రయోగిస్తున్న భాష రోజు రోజుకు రాటు తేలుతోందన్న విమర్శలూ, ప్రశంసలూ కూడా వినవస్తున్నాయి.  భాష విషయంలో కేటీఆర్ కంటే కేసీఆరే కొంత నయం అనిపిస్తున్నారని బీజేపీ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి అన్నారంటే, కేటీఆర్  భాషాప్రయోగంలో ఎంతగా రాటుదేలారో అవగతమౌతుంది.   మరో వంక కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రలు, అంతర్గత పంచాయతీలు  సమాంతరంగా సాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కుదిరి అంతలోనే మాయమై పోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రేసులో  ఉందా లేదా అన్నది  అంతు చిక్కని ప్రశ్నగా ఉందని పరిశీలకులు అంటున్నారు. అయినా, నాయకుల తీరు ఎలా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి  ఉన్న సంస్థాగత బలం, ఓటు బ్యాంకు ఆ పార్టీకి శ్రీరామా రక్షగా పనిచేస్తుందని అంటున్నారు.  మరోవంక అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ఎన్నికల సన్నాహాలు సాగిస్తూ, మరో వంక అధికార పార్టీని ఆర్థిక అవకతవకల, అవినీతి కేసుల ఉచ్చులో అష్ట దిగ్బంధనం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని ప్రధాన  ఎజెండాగా చేసుకుని పావులు కదుపుతోందని అంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కల్వకుట్ల తాక రామా రావును ముద్దాయిలుగా చూపించి, వారి ఇమేజ్ ని డ్యామేజి చేసేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పడు తాజాగా, ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ బయట పెట్టిన రహస్యం  నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేందుకు, సిద్దం చేసుకున్న అస్త్రంగా భావిస్తున్నారు. ఇదలా ఉంటే బీజేపీ... బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంది అనేందుకు ఆధారమా అనేట్లుగా, బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని చేసిన వ్యాఖ్య రాజకీయవర్గాల్లో సంచలనంగామారింది.

ఏప్రిల్ లోనే భానుడి ప్రతాపం

వేసవి ప్రతాపం అప్పుడే కనిపిస్తోంది. మార్చి నెలలోనే మండిన ఎండలు, ఏప్రిల్ లొలి వారం నాటికి రోహిణి కార్తెను తలపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. తెలంగాణలో ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో అసాధారణంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మండు వేసవిలో అంటే ఏప్రిల్ మూడో వారంలో హైదరాబాద్ లో సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరువ అవుతాయి. అలాంటిది ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే.. ముందు ముందు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదౌతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్ నినో కారణంగా ఈ ఏడు ఎండలు మండిపోతాయన్న హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఎల్ నినో ప్రభావం ఇప్పుడే మొదలైపోయిందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఎండలు తీవ్రం అవ్వడంతో  విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రాజీనామా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. కొద్ది రోజుల క్రితం కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తరువాత తాజాగా  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి కూడా బీజేపీని ఓడించడం కోసం అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసి మరీ అవసరం అయితే  కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చని స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. సరే ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా  కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అధికారికంగా చేతులు కలిపినా కలపక పోయినా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ అనుకూల వర్గం ఉందనేది కాదన లేని నిజం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలో మూడింట రెండు వంతుల (12) మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఒకొంతు మంది (6గురు) మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు.  సో .. కాంగ్రెస్ బీఆర్ఎస్ రక్త సంబంధం గురించి  కొత్తగా మళ్లీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.     అదలా ఉంటే గత కొంత కాలంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్  వర్గాలలో ఉభయ పార్టీల పొత్తు గురించిన చర్చ జరుగుతూనే వుంది. ముఖ్యంగా పరువు నష్టం కేసులో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, ఆవెంటనే ఆయన లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు పడడం చకచకా జరిగిపోయిన  నేపధ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బంధం మరింత బలపడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్  ముఖ్య నేతలు ఇద్దరూ రాహుల్  గాంధీకి ఓపెన్ గా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటం చేసేందుకు ఆమోదం తెలిపారు.  అయితే, బీఆర్ఎస్ తో  కాంగ్రెస్ పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్కడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయన మంగళవారం (ఏప్రిల్ 4) కాంగ్రెస్, బీఆర్ఎస్  పొత్తుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా ఆ విధమైన  కుట్ర జరుగుతోందనే విషయం చెప్పకనే చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ  పొత్తు అనేది జరిగితే అది తన రాజీనామా తర్వాతనేని కుండబద్దలు కొట్టేశారు. అలాగే  తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పొత్తు దిశగా కదలికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు.  అయితే  అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నా రాష్ట్రంలో దేశంలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే, రోజులు గడిచే కొద్దీ, బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత అనివార్యం అవుతున్నది. విపక్షాలు  చేతులు కలపడం మినహా మరో మార్గం లేకుండా కేసులు, అరెస్టులతో విపక్షాలను ఒకటిగా కట్టి పడేస్తోంది. ఈనేపధ్యంలో  మాజీ మిత్ర పక్షాల మధ్య  మళ్ళీ పొత్తు పొడవదని చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. అయితే అదే జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ మాతృ సంస్థ (టీడీపీ) గూటికి చేరడమూ ఖాయమని అంటున్నారు.

బండి సంజయ్ అరెస్ట్.. భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

ఓ వంక టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మరీన నేపథ్యంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నడుమ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ ను మంగళవారం (మంగళవారం) రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజికి బండి సంజయ్ అరెస్టుకు సంబంధం ఉందా లేదా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నమనేది చెప్పకుండానే పోలీసులు బలవంతంగా ఇంట్లో చొరబడి, ఎంపీని బలవంతగా తీసుకు పోయారని బండి సంజయ్ సతీమణి మీడియాకు తెలిపారు.   కాగా  బండి సంజయ్ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు భారీగా మోహరించారు. అదే సమయంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారిలో కరీంనగర్‌ అడిషనల్ డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీ  శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, సీఐలు లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి, నటేష్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రెండువైపులా తోపులాట  జరిగాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయినప్పటికీ ఇవన్నీ ముందే ఊహించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం తమ పనిచేసుకుపోయారు. బండి సంజయ్‌ని అరెస్టు చేసి.. హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ని తిమ్మాపూర్‌ మీదుగా తరలిస్తుండగా పోలీస్ వెహికిల్‌కి మార్గమధ్యలో రిపేర్ వచ్చింది. పోలీసులు ఆయన్ని మరో బండిలోకి ఎక్కించారు. ఐతే.. బండి సంజయ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నదీ పోలీసులు.. కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. బుధవారం బండి సంజయ్‌ అత్త (సంజయ్‌ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్‌ వచ్చారు. ఆ కార్యక్రమాల్లో ఉండగా.. పోలీసులు బలవంతంగా తీసుకు పోయారని బందువులు ఆరోపిస్తున్నారు.  కాగా  తన అరెస్టుపై బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.  బీఆర్ఎస్ లో భయం నిజం. మొదట నేను ప్రెస్‌మీట్ పెట్టకుండా నన్ను అడ్డుకున్నారు. తర్వాత నన్ను అర్థరాత్రి అరెస్టు చేశారు. తప్పులు చేస్తోందని దానిపై నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. నన్ను జైలుకు పంపినా.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపను అని బండి సంజయ్ ట్వీట్‌లో తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి ఇంటిపై దాడి చేసి ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అంటే.. పోలీసులు హద్దు మీరి ప్రవర్తించినట్లే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తున్నారు. ఓ ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. అలాంటిది ఏమీ లేకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరించటం ఏంటని.. దీనిపై కోర్టుల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.  ఎంపీగా ఉన్న తనను నోటీసులు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటంపై.. ఎంపీ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వచ్చి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించినదీ, తన ప్రశ్నలకు  సమాధానం చెప్పకుండా దురుసుగా లాక్కెళ్లిన తీరును.. ఫొటోలు, వీడియోలతో సహా లోక్ సభ స్పీకర్ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.  బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అగ్రనేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ శ్రేణులు మండిపోతున్నాయి. ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంపీ.. అంతే కాకుండా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తిని కారణాలు చెప్పకుండా అర్థరాత్రి.. ఇంటి మీదకు వచ్చి.. బలవంతంగా అరెస్ట్ చేయటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  బండి సంజయ్ అరెస్టు విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ప్రశ్నాపత్రాల లీకేజీకీ, బండి సంజయ్‌కీ ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో ఓ ఎంపీని అరెస్ట్ చేయటంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా అర్థరాత్రి సమయంలో బండి సంజయ్‌ని ఇంటికి వచ్చి మరీ బలవంతంగా అరెస్టు చెయ్యడం బీజేపీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇది ఊహించని పరిణామంగా చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఏప్రిల్ బుధవారం (ఏప్రిల్ 5) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది.

రాజ్ దీప్ పై పరవు నష్టం దావా వేస్తారా ?

ఎవరో అంటే ఏమో అనుకోవచ్చును  కానీ, ఆ మాటన్నది ఎవరో దారిన పోయే దానయ్య,కాదు.. ఇండియా టుడే అంతటి ప్రతిష్టాత్మక టీవీ చానల్ కన్సల్టెంట్ ఎడిటర్ ...  రాజ్‌దీప్ సర్దేశాయ్. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు  కల్వకుట్ల చంద్రశేఖర రావు ఆర్థిక స్థోమత గురించి ఆయన సంచలన విషయం బయట పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దెదించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్   2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటై, ప్రతిపక్ష ఐక్య కూటమి నాయకత్వ పగ్గాలు తన చేతికి అప్పగిస్తే  మరో పార్టీ, మరో అభ్యర్ధి జేబులో చెయ్యి పెట్టవలసిన అవసరం లేకుండా మొత్తం 545 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార వ్యయం మొత్తం తానే ( బీఆర్ఎస్) భరిస్తానని ప్రైవేటు సంభాషణల్లో చెప్పినట్లు రాజ్ దీప్  పబ్లిక్ గా  ప్రకటించారు.   రాజ్‌దీప్ తన వీక్లీ బ్లాగ్‌లో మోడీ వర్సెస్ ఆల్ అనే అంశం గురించి మాట్లాడారు. అందులో ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన రాజ్‌దీప్, 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి అన్ని ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతాయా? అనేది చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రశ్నకు తన పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్యాక్టర్స్ సమాధానం చెబుతాయని పేర్కొన్నారు. అదే క్రమంలో ఆయన ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి కూడా  ప్రస్తావించారు. ప్రతి నేతా కూడా తనను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారని అన్నారు.  కేసీఆర్‌ను తీసుకుంటే.. ఆయన తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు.  మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కాన్వర్సేషన్ లోకేసీఆర్.. తన  సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్‌ను చేస్తే 2024 ఎన్నికల ఖర్చు మొత్తం భరించడానికి   సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్‌కు సమకాలీకులుగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా? అని రాజ్‌దీప్ అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్‌దీప్ ప్రస్తావించారు. అయితే కేసీఆర్ ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అంగీకరిస్తారా లేదా చూడవలసి ఉందని  రాజ్‌దీప్  పేర్కొన్నారు.  అయితే ఇప్పుడు  ఇతర ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ఆఫర్  అంగీకరిస్తాయా? ఆయన్ని కూటమి నేతగా, ప్రధాని అభ్యర్ధిగా అంగీకరిస్తాయా ? అనేది కాదు ప్రశ్న. ఆయనకు ఇంత పెద్ద మొత్తం సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సంధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్  రెడ్డి సహా పలువురు డిమాడ్ చేస్తున్నారు. అదలా ఉంటే రాజ్‌దీప్ చెప్పినదాట్లో నిజం లేకుంటే, ఆయన వివరణ కోరాలి లేదా ఆయన పై పరువు నష్టం దావావేయాలని అంటున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొన్ని విపక్ష పార్టీలతో ఐక్యతను మెయింటెన్ చేస్తున్నారు.  అయితే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వ్యుహాలు పక్కాగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. అయితే తాజగా కేసీఆర్‌కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

ఇంతకి జగన్ వైజాగ్ వెళ్లేది ఎప్పుడు?

ఏపీ సీఎం జగన్  వైజాగ్ నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పి దాదాపు మూడు నెలలవుతోంది.  అసలు జగన్ నిజంగా వైజాగ్ వెడతారా..? అక్కడి నుంచే పాలన సాగిస్తారా..? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఎన్నికల ముందు సీఎం జగన్ వైజాగ్ వెళ్తున్నట్టు ఆయన కేబినెట్ మంత్రులు తెగ ప్రచారం చేశారు. త్వరలో తాను వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని స్వయంగా జగన్ కూడా చెప్పారు. అయితే వైజాగ్ వెళ్లే విషయంపై జగన్  ఎందుకో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.   అయితే జగన్ వైజాగ్ వెళ్లేది ఇప్పుడు కాదు.. జులైలో అని టాక్ వస్తోంది.  మూడు రాజధానులు అంటూ తెగ హడావుడి చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి పాలన విషయంలో జగన్ ఇప్పుడంత ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.  సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ జరుగుతోంది. విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయండని ఏపీ ప్రభుత్వం సుప్రీంకు అభ్యర్థనల మీద అభ్యర్థనలు పెట్టినా ఫలితం ఉండటం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి . అందుకే జగన్.. మూడు రాజధానులు, వైజాగ్ అంశాలను  పక్కన పెట్టేశారా అన్న సంశయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  ఎలా చేద్దాం..ఏం చేద్దామని  జగన్ కు ఎవరూ సలహా ఇవ్వలేరు..  ఎంతైనా ఆయన   మోనార్క్ కదా... సలహాదారులెంత మంది ఉన్నా ఆయనకు సలహా ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు మరి.!

కుక్కకేమి తెలుసు ఆయన అడిషనల్ కలెక్టరని!

ఇటీవల వీధి కుక్కల బారినపడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచి వేసింది.  ఆ తరువాత కూడా తెలంగాణలో వీధి కుక్క కాటుకు గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని  ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఓ ఘటనలో సాక్షాత్తు అదనపు కలెక్టరే కుక్క కాటు బాధితుడయ్యారు. అవును సిద్ధిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్క కాటుకు గురయ్యారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది  పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్ నే కుక్క కరవడంతో రంగంలోకి దిగారు.  రాత్రి సమయంలో క్వార్టర్స్ వద్ద వాకింగ్ చేస్తున్న అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపై వీధికుక్క దాడి చేసింది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు  చెబుతున్నారు.  కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు  దిగారని  స్థానికులు అంటున్నారు.  అయినా మన పిచ్చి కానీ తాను కరిచింది అదనపు కలెక్టర్ ను అని ఆ కుక్కకేం తెలుసు. పిచ్చి జనానికి తెలుసు ఆయన కలెక్టర్ అని... పాపం ఆ శునకాని ఏం తెలుసు? అని సెటైర్లు వేస్తున్నారు. 

పిట్టా పోయి.. కుక్కా వచ్చే ఢాంఢాంఢాం..!

ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై  దృష్టి పెట్టాడు.  ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్ లో కాదు..  డెస్క్ టాప్  వెర్షన్లో మాత్రమే ఇలా  చేశాడు.  ట్విటర్ వెబ్ సైట్ లో  హోం బటన్ గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టో కరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్ లో కనిపిస్తోంది.  ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్ ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు. 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను 'డాగ్'గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్ షాట్  షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.  క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్ కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్ పై   ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత  డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరగటం గమనార్హం..!

బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు!

బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి  కేటీఆర్  సంచలన ట్వీట్ చేశారు.    తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. అవి రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల నుంచి సంపాదించినట్లు తెలుస్తోందన్నారు.  ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్ల వివరాలు తెలిపి,  గెలవడం నేరమే కదా  అన్నారు. దీని ఆధారంగా ఆ ఇద్దరు ఎంపీలను   డిస్క్వాలిఫై ఎందుకు  చేయరని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ పై.. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ రెండింటినీ కూడా  కోడ్ చేసే విధంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీజేపీపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణకు చెందిన ఫేక్ విద్యార్హత సర్టిఫికెట్ల మంత్రులెవరన్న దానిపై సామాజిక మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. 

బీఆర్ఎస్ తో పొత్తా.. నో నెవ్వర్.. రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పక్క ఆ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహలాడుతుంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రశక్తే లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. మాఫియాతో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోదని కుండబద్దలు కొడుతున్నారు. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి జ్వలిస్తూనే ఉంది. అయితే హైకమాండ్ సీనియర్ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతను రేవంత్ పై పెట్టింది. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు. రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ విజయాలు సాధించకపోయినా.. శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే సీనియర్లు మాత్రం రేవంత్ గమనానికి అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారు.  అయితే మాణిక్యం ఠాకూర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన  మాణిక్‌రావు ఠాక్రే  సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టడంలో చాలా వరకూ కృతకృత్యులయ్యారు. అసంతృప్తి జ్వాలలు పూర్తిగా చల్లారిపోయాయని చెప్ప లేకపోయినా.. పార్టీలో మాత్రం గణనీయమైన మార్పు కనిపించింది. విభేదాలు ఉన్నా సీనియర్లు, జూనియర్లు.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం కూడా ఎవరి దారిన వారు పార్టీ కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. దీంతో పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తోంది.  కానీ అడపా దడపా సీనియర్లు మాత్రం ఏదో ఒక పుల్ల విరుపు మాట అయితే అంటూనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం అయినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అనివార్యమని వ్యాఖ్యలు చేసిన రేపిన సంచలనం ఇలా సర్దుమణిగిందో లేదో.. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి  రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్  బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు.  అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్  బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో ... శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్  బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని   వివరణ కూడా ఇచ్చారు.   అటు బీఆర్ఎస్ కూడా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే.. కాంగ్రెస్ అండ కావాలి అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఇటీవల ఢిల్లీ వేదికగా బీజేపీని ఓడించాలంటే బీజేపీయేతర పార్టీలతో కాంగ్రెస్ కలిసి రావాలని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా  సమష్టి పోరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జానా రెడ్డి పోత్తు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు.  తాను తెలంగాణ  ప్రదేశ్  కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా   బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని,  మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ పరాజయం తథ్యమని, బీజేపీ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని రేవంత్ అన్నారు.