ఏప్రిల్ లోనే భానుడి ప్రతాపం
posted on Apr 5, 2023 @ 12:34PM
వేసవి ప్రతాపం అప్పుడే కనిపిస్తోంది. మార్చి నెలలోనే మండిన ఎండలు, ఏప్రిల్ లొలి వారం నాటికి రోహిణి కార్తెను తలపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
తెలంగాణలో ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో అసాధారణంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మండు వేసవిలో అంటే ఏప్రిల్ మూడో వారంలో హైదరాబాద్ లో సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరువ అవుతాయి. అలాంటిది ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే.. ముందు ముందు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదౌతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్ నినో కారణంగా ఈ ఏడు ఎండలు మండిపోతాయన్న హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఎల్ నినో ప్రభావం ఇప్పుడే మొదలైపోయిందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఎండలు తీవ్రం అవ్వడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.