కృత్రిమ మేథతో కోట్లాది మంది ఉపాధి గోవిందా?!

దేవుడిని మానవుడు ఆవిష్కరించినప్పుడు చరిత్ర మొదలైంది. ఇప్పుడు మానవుడే దేవుడిగా మారుతున్నాడా? ఇటీవలి వరకూ కంప్యూటర్లు మనతో భౌతిక నైపుణ్యాలు, ఉద్యోగాల విషయంలోనే పోటీ పడేవి.  తొలిసారి అవి మేధో నైపుణ్యాల విషయంలోనూ పోటీ పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం జెట్‌ వేగంతో పరుగులు పెడుతోంది.  కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. అది మానవ జీవితంలో స్పృశించని పార్శ్వమంటూ లేకుండా పోతోంది. మనుషుల స్థానాన్నే ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులపై సర్వత్రా ఆసక్తి, ఆందోళన వ్యక్తమౌతోంది. టీవీలో మనం వార్తలు చూస్తూనే ఉంటాం. వివిధ కార్యక్రమాలు, షోలను హోస్ట్ చేసే యాంకర్లనూ చూస్తున్నాం. ఆ వార్తలు చదివే వారు, షోలను హోస్ట్ చేసే వాళ్లు నిజమైన మనుషులు కాకపోతే?  కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే డిజిటల్‌ రూపాలైతే?  ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(క‌ృత్రిమ మేధస్సు) తీసుకొస్తున్న విప్లవం అనాలో, ప్రమాదం అనాలో తెలియదుగానీ.. క్రమంగా మానవ సామర్థ్యాన్ని పెరుగుతున్న సాంకేతికత మింగేస్తోంది.  ఇప్పటి వరకూ రోబో ‘సోఫియా’ ఒక సంచలనం అనుకుంటుండగా.. తాజాగా ‘కృత్రిమ’ న్యూస్‌ యాంకర్ వచ్చేసింది! చూడటం, వినడం, తాకడం మాత్రమే కాదు.. అవసరానికి తగ్గట్టు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో రోబో కూడా అలాగే ప్రవర్తించేట్లు, తనకు తాను కొత్తగా నేర్చుకునేట్లు అందులో ఒకరకమైన తెలివి తేటలను ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా అభివృద్ధి చేశారు. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అంటారు.  అలసట అన్నదే లేకుండా 24 గంటలూ పనిచేస్తుంది. కానీ.. ఇది జీవించి ఉన్న మహిళ కాదు. కంప్యూటర్ ప్రోగ్రామ్ అమర్చిన వర్చువల్ రోబోటిక్ న్యూస్ యాంకర్. ఇది టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ను ఉపయోగించి మాట్లాడే వీడియో.  సాధారణ యాంకర్ మాదిరిగానే పెదవులను కదుపుతూ, గొంతు, ముఖ కవళికలు, హావభావాలను సహజంగా ప్రదర్శిస్తూ అనేక భాషల్లో తాజా వార్తలను మనకు అందజేస్తుంది.  దీంతో మనం నిజమైన న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుంటే చూసిన అనుభూతిని పొందుతాం. అందుకే  ఆ రోబో యాంకర్ ను వర్చువల్ యాంకర్ అని కూడా పిలుస్తారు. భవిష్యత్తులో ఈ రోబో న్యూస్ యాంకర్లు అన్ని దేశాలకూ విస్తరించినా ఆశ్చర్యం లేదు. ప్రజలు అప్లికేషన్ ద్వారా విద్య, గృహాలు, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై న్యూస్ యాంకర్‌తో మాట్లాడొచ్చు. ఇప్పుడు న్యూస్ యాంకర్ల స్థానాన్ని ఏఐ యాంకర్లు ఆక్రమించుకునే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.  ఇండియా టుడే గ్రూప్ నకు చెందిన ‘ఆజ్ తక్’ న్యూస్ చానెల్ ‘సనా’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మహిళా న్యూస్ యాంకర్ ను ప్రవేశ పెట్టింది. ప్రముఖ జర్నలిస్టు సుధీర్ చౌదరి ఇటీవల నిర్వహించిన ‘బ్లాక్ అండ్ వైట్’ షో ద్వారా ‘సనా’  ప్రేక్షకులకు పరిచయమైంది.  సుధీర్ చౌదరితో కలిసి షో నిర్వహించిన ‘సనా’ వార్తలు కూడా చదివింది. ఈమె దేశంలోనే తొలి ఏఐ న్యూస్ యాంకర్ గా రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో తొలి ఏఐ న్యూస్ యాంకర్ ను చైనా నాలుగేళ్ల క్రితమే ప్రారంభించింది. చైనా సెర్చ్ ఇంజిన్ కంపెనీ సోగో,  చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా సంయుక్తంగా రూపొందించిన ఒక పురుష ఏఐ న్యూస్ రీడర్ చైనా భాషతో పాటు ఇంగ్లీషులో వార్తలు చదువుతున్నాడు. ఏడాది తర్వాత మహిళా ఏఐ న్యూస్ రీడర్ ‘షిన్‌ షియావోమెంగ్‌’ ను కూడా ఆవిష్కరించారు.  జీవమనేది ప్రకృతి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ప్రకృతి స్థానాన్ని ఇప్పుడు సైన్స్‌ ఆక్రమిస్తోంది. కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు(ఏఐ)కు సంబంధించిన ఆల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. వాటికి అభ్యాస, విశ్లేషణ సామర్థ్యాలు ఉంటున్నాయి. ఇన్ఫోటెక్‌, బయోటెక్‌ల కలయికతో మనల్ని మెరుగ్గా విశ్లేషించే, మనతో సంభాషించే సామర్థ్యమున్న ఆల్గారిథమ్‌లకు మార్గం సుగమమవుతోంది. ఈ కృత్రిమ మేధస్సు, బయో ఇంజినీరింగ్‌తో కొత్త జీవజాతి పుట్టుకొస్తోంది. వీటివల్ల అనేక సమస్యలూ తలెత్తుతాయి. సాంకేతిక ఆవిష్కరణల కారణంగా కొన్ని దేశాలు సంపన్నమవుతాయి. ఇతర దేశాలు పేదరికంలో కూరుకుపోతాయి. ఇంతకీ ఆర్టిఫిషియల్ అంటే ‘కృత్రిమ’, ఇంటెలిజెన్స్ అంటే ఆలోచించే శక్తి ఉన్న ‘మేధస్సు’. ఏఐ అంటే మనిషి  తయారు చేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్ కు ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని అందించడమే. మానవ మేధస్సును అనుకరిస్తూ మనుషులు సాధారణంగా చేసే పనులను సొంతంగా చేసుకోగలిగే శక్తిని అందించే యంత్రాలను తయారు చేయడమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకునే మరియు ఆలోచించగల సామర్థ్యం ఉన్న ప్రోగ్రామ్. ఏఐ ప్రధానంగా మూడు రకాలు. (1) బలహీనమైన ఏఐ (2) బలమైన ఏఐ (3) అత్యంత బలమైన ఏఐ. బలహీనమైన ఏఐ: ఒక పనిపైనే దృష్టి సారిస్తుంది. దాని పరిమితులను మించి పని చేయదు. ఉదాహరణకు ప్రస్తుతం మనం రోజువారీ ఉపయోగిస్తున్న యంత్రాలు.  బలమైన ఏఐ:  మానవుడు చేయగలిగిన ఏదైనా మేధోపరమైన పనిని అర్ధం చేసుకోగలుగుతుంది. మనం ప్రోగ్రామింగ్ చేసి పెడితే నేర్చుకొని మన సూచనలకు అనుగుణంగానే సొంతంగా చేస్తుంది. ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, ఏఐ న్యూస్ యాంకర్లు, ఏఐ లాయర్లు, చెస్ ఆడే యంత్రం. దానిలోని కృత్రిమ మేధను యాంత్రిక అనువాదం చేయడం సాధ్యం కాదు. పరిశోధకులు ప్రస్తుతం బలమైన ఏఐలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి మానవాళికి విరుద్ధంగా తయారయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే దాని పరిధి చాలా చిన్నది.  సూపర్ ఏఐ: ఇది మానవ మేధస్సును అధిగమిస్తుంది. అనేక రకాల పనులను మనుషుల కంటే మెరుగ్గా, చురుకుగా చేయగలిగే కృత్రిమ మేధ. పరిశోధకులు ఇప్పటికీ వీటిని తయారు చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. సూపర్ ఏఐ పరిశోధనలు ఫలప్రదమై మానవాళికి విరుద్ధంగా తయారయ్యే పరిస్థితి వస్తే..? నిజంగా అక్కడి దాకా వస్తే.. అది మానవాళికి విరుద్ధంగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు.  మేధస్సు కలిగిన కంప్యూటర్లు ఉద్యోగ మార్కెట్‌ నుంచి మానవులను గెంటివేస్తాయి. ఏఐ రోబో ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వర్ గానే కాకుండా టీవీ ఛానెళ్లలో వార్తలు చదివే యాంకర్ గా, లాయర్ గా న్యాయ సలహాలు అందించేందుకూ సిద్ధమైంది. త్వరలో కోడింగ్, సాఫ్ట్ వేర్ డెవలపింగ్, కంటెంట్ రైటింగ్, పారా లీగల్, న్యాయ సహాయం, మార్కెట్ రీసెర్చ్ విశ్లేషకులు, ఉపాధ్యాయులు, ఫైనాన్స్ పరిశ్రమలో కార్మికులు, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో, ఆడియో ఎడిటింగ్‌, అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్టులు, వైద్యులు, డ్రైవర్లు, సైనికులు, బ్యాక్‌-ఆఫీస్‌ ట్రాన్సాక్షన్‌ ప్రాసెసింగ్‌, మార్ట్‌గేజ్‌.. ఇలా అన్ని రంగాల్లో ఏఐ రోబోలు పాగా వేయనున్నాయి. నటులు, సంగీతకారులు, గాయకులు, నిర్మాతలుగానూ ఏఐ రోబోలు అవతరిస్తారు. ఆయా రంగాల్లో 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర నుంచి 37న్నర కోట్ల మంది తమ ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉద్యోగులకు ఎక్కువ నష్టం కలుగుతుంది.  ఆటోమేషన్‌ వల్ల కొత్త ఉద్యోగాలకూ కొదవ ఉండదు. సాంకేతిక పరంగా ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ యంత్రాల వెనుక, యంత్రాలతో పాటు మనుషులు ఉండాల్సిందే. తోటపని, ప్లంబింగ్‌, చిన్నపిల్లలు-వృద్ధుల సంరక్షణ తదితర పనులు రోబోలు చేయలేవు. ఇంధన పొదుపు తదితర విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే.. కృత్రిమ మేధో ప్రపంచంలో 40% మందికి పని దొరికినా మిగిలిన 60% మంది పరిస్థితి దుర్భరంగా ఉంటుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఏఐతో వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కొత్త ఉద్యోగాలను సృష్టించడమే సరైన వ్యూహం. సాంకేతిక మార్పులకు అనుగుణంగా మానవ శక్తిని సన్నద్ధం చేయడం, అందుకు ముందస్తు సన్నాహాలు చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి.   చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీతో భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో సహా 1344 మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కోట్లాది ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాళి ఉనికికే ముప్పు తీసుకొచ్చే ఏఐను వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందంటూ బహిరంగ లేఖ రాశారు. చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ ఇటీవల జీపీటీ-4 పేరుతో అత్యాధునిక వ్యవస్థను పరిచయం చేసింది. జీపీటీ-4 కంటే శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సమాజానికి, మానవాళికి ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని, ప్రతికూల ప్రభావాలు తలెత్తితే నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా ముందుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఏఐతో వచ్చే కుదుపులను తగ్గించుకోవడానికి, సర్దుబాట్ల సమయం తీసుకోవడానికి ఆటోమేషన్‌ వేగాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు భావించే వీలుంది. అయితే దీన్ని పూర్తిగా నిరోధించడం అసాధ్యం, అవాంఛనీయం. నేడు కారు ప్రమాదాల్లో ఏటా 12.5 లక్షల మంది చనిపోతున్నారు. వీటిలో మానవ తప్పిదాల వాటా 90% కన్నా ఎక్కువే. స్వయం చోదిత వాహనాలతో ఆ ముప్పు తగ్గిపోతుంది. ఆటోమేషన్‌పై ఆధారపడే సమాజంలో ప్రపంచ శక్తి సమతౌల్యమనే ప్రభుత్వాల నుంచి టెక్‌ కంపెనీల వైపు మొగ్గుతుంది. అందువల్ల ఈ కంపెనీలే ప్రభుత్వ అవతారం ఎత్తవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభుత్వాలు గుత్తాధిపత్యం చెలాయించే అవకాశమూ లేకపోలేదు.

కొత్త పొత్తుల మొలకలు నిజమేనా?

రాజకీయాల్లో అసాధ్యమన్న పదానికి స్థానం లేదు. పాలటిక్స్ లో శాశ్వత  మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. అంటే నేడు తిట్టుకున్ననేతలే.. రేపు చేతులు కలుపుకుంటారు. నేడు చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన పార్టీలు రేపు విమర్శల కత్తులు దూసుకుంటాయి. రాజకీయాలలో ఇలాంటివన్నీ సహజమే అని ఎంత సరిపెట్టుకుందామనుకున్నా.. అలా సరిపెట్టుకోవడానికి కూడా నమ్మశక్యం కానీ కొన్ని వార్తలు జనాలనే కాదు.. పరిశీలకులను సైతం అయోమయానికీ, సంభ్రమాశ్చర్యాలకూ గురౌతుంటాం. అసలా వార్త నిజమా కాదా  అని నిర్ధారణ  అయ్యేదాకా వినడానికే ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి వార్త ఒకటి ఇప్పుడు రాజకీయవర్గాలలో సర్క్యులేట్ అవుతోంది. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్న ఆ వార్త ఏమిటంటే...  ఏపీలో ఎలాగైనా కాలు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాదు.. స్వరాష్ట్రమైన తెలంగాణలో కూడా బలమైన పొత్తు లేదా అండ లేకపోతే ముందుకు సాగడం కష్టం అన్న నిర్ధారణకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఎవరో ఆయన ప్రత్యర్థులు కాదు.. స్వయంగా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే ఆయన ఉభయ తారకంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బలమైన పార్టీ నిర్మాణం, క్యాడర్ ఉన్న తెలుగుదేశంతో జట్టు కట్టడానికి విశ్వయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ఆయన ఏ అవకాశాన్నీ వదల దలుచుకోలేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధానాలనూ, వ్యవహరాశైలినీ, పాలనా తీరును తప్పుపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ ప్రగతిని తెలంగాణ ప్రగతితో పోల్చి చూపుతున్నారు. తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు అయిన కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ ప్రపంచంలోనే అమరావతి గొప్పనగరం అని కీర్తించడమే కాకుండా గత నాలుగేళ్లలో అక్కడి ప్రభుత్వ నిర్వాకం వల్ల అమరావతి కుంటుపడిందని విమర్శించారు. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ తెలుగుదేశంతో చెలిమికి తహతహలాడుతున్నారు. ఇందు కోసం ఆయన అన్ని దారులనూ వెతుకుతున్నారు. ఒక వైపు చంద్రబాబు బీజేపీ, జనసేనలతో  జట్టుకట్టేందుకు ప్రయత్రాలు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీతో స్నేహం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ఆయన చంద్రబాబు వద్దకు జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాయబారానికి పంపే యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరించాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ణుడి అండ అవసరమన్నది కేసీఆర్ భావనగా తెలుస్తోంది.  వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేయడంలో పార్టీల మధ్య పొత్తులు కుదర్చడంలో చంద్రబాబు అనుభవం బీఆర్ఎస్ విస్తరణకు దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక అందుకు లిట్మస్ టెస్టుగా కర్నాటక ఎన్నికలలో చంద్రబాబుతో సమన్వయం చేసుకుని జేడీఎస్ నేత కుమారస్వామి ని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలను సరికొత్తగా ప్రారంభించాలన్న యోచనతో కేసీఆర్ వ్యూహాత్మకంగా చంద్రబాబుతో చెలిమికి చేయి చాస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ రాయబారాలకు తెలుగుదేశం నుంచి కానీ, చంద్రబాబు నుంచి కానీ ఎటువంటి స్పందనా రాలేదంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఏపీలో బీఆర్ఎస్ పొత్తు వల్ల ఒకింత ప్రయోజనం ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏపీలో ఒంటరి పోరుకు దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదో మేరకు ఆ పార్టీకి మళ్లే అవకాశం ఉందని, అలా కాకుండా బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం జట్టులో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలే ఉండవని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి చంద్రబాబు లేకుండా గతరెండేళ్లుగా బీజేపీయేతర కూటమి యత్నాలు జరుగుతున్నాయి కానీ అవి ఇసుమంతైనా సఫలం కావడం లేదు. కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎవరికి వారుగా చేసిన ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగానే సాగాయి.  ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కలుపుకుంటే కొత్త పొత్తుల మొలకలకు అవకాశం ఉంటుందని పరిశీలకులు సైతం అంటున్నారు.  

ఒక్క చాన్స్.. ఎరక్కపోయి ఇచ్చాము!

సహజంగా ఒక పార్టీ పేరున గెలిచిన ప్రజాప్రతినిధి ఎవరైనా ... లోపల ఎంత అశాంతి ఉన్నా, అంత త్వరగా బయట పడరు. అందులోనూ  రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అయితే, అసలే పెదవి విప్పరు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో  అధికార వైసీపీకి చెందిన సర్పంచులు పెదవి విప్పడం కాదు.. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి మరీ ... తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.   చివరకు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి  ‘మీ పార్టీ తరఫున గెలిచామని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నాం. మీకు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. వైఎస్సార్‌ అంటే అభిమానం. ఆయన బిడ్డగా మిమ్మల్ని నమ్మాం. కానీ మీరు నట్టేట ముంచారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. సర్పంచుల ఆత్మహత్యలు జరిగితే దానికి సీఎం జగనే కారణం” అంటూ ఆగ్రహాన్ని, ఆవేదననూ వ్యక్తం చేస్తున్నారు.   విజయవాడలో సోమవారం (ఏప్రిల్ 10) జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు .. వైసీపీ ప్రభుత్వం తమను నమ్మించి నట్టేట ముంచిందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అందులో భాగంగానే,  ప్రకాశం జిల్లా చినగానిపల్లె సర్పంచి (వైకాపా), సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌,  అందరి ముందూ తన చెప్పుతో చెంపల మీద కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.  అలాగే, రాష్ట్రంలో 80 శాతం మంది సర్పంచులు వైకాపాకు చెందిన వారే ఉన్నారనీ, అందరినీ ఇంటింటికి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పాలని ఆదేశాలు పంపుతున్నారని, అలా చెప్పాలంటే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు ఖర్చు చేసి సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే బిల్లులు విడుదల చేయలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని రమేష్ వాపోయారు. అలాగే, మరో అధికార పార్టీ నేత, సర్పంచి కొండబాబు మాట్లాడుతూ  పాము పిల్లలను పామే తిన్నట్లు సీఎం జగన్‌ పరిస్థితి తయారైందని మండిపడ్డారు.  సర్పుంచులు సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు. ఏదైనా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు. సమాంతర వ్యవస్థలను పెట్టి మా విధులు, నిధులు లాక్కొన్నారు. సర్పంచిగా గెలిచి రెండేళ్లు అయింది. ఒక్క బిల్లు రాలేదు  అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వైకాపా నాయకుడు, సంఘం గౌరవ సలహాదారుడు ఆచార్యులు మాట్లాడుతూ  జగనన్నే మా భవిష్యత్తు అని స్టిక్కర్లు వేయమంటున్నారు. కానీ పంచాయతీల భవిష్యత్తు ఏమిటి జగనన్నా అని మనం స్టిక్కర్లు వేయాలి’ అని పిలుపు నిచ్చారు.   గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులు రూ.2020 కోట్లు ఏమాయ్యయని సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. సచివాలయాల కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి పంచాయతీలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నిజానికి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యంచేస్తూ వస్తోందనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నిధులూ పట్టుకుపోయి, మీట నొక్కుడు ఖాతాలో..  కాదంటే ... సొంత ఖజానాలో వేసుకోవడమే కానీ, స్థానిక సంస్థల అవసరాలను తీర్చింది లేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పడు ఆ ఆగ్రహం అసంతృప్తి సర్పంచులను తాకింది...  చెప్పుతో కొట్టుకునే స్థితికి చేర్చింది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందని సర్పంచులే కాదు సామాన్యులు కూడా వపోతున్నారని, జనవాక్యంగా వినిపిస్తోంది.

ఆంధ్రోళ్లు ఆదరిస్తారా?

ఆంధ్రోళ్ల పెత్తనం పోవాలే..  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలే.. నీళ్లు.. నిధులు.. నియామాకాలు.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి.. ఆ క్రమంలో ఆ ప్రాంత వాసులందరినీ ఏకం చేసి.. ఏక తాటిపైకి తీసుకు వచ్చి..  సుదీర్ఘ ఉద్యామాన్ని నడిపి  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన  గులాబీ బాస్ కేసీఆర్.  ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఆ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. నడిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వలస పాలన, ఆంధ్రోళ్లు అంటే సీమాంధ్ర వాసులపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ ఇంకా ఏపీ జనంలో పచ్చిగానే ఉన్నాయి. సరే అదలా ఉంచితే..  కేసీఆర్ ఇటీవల పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగించి.. ఆ స్థానంలో భారత్ అని చేర్చి... టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి ఒక్క సారిగా పోల్ వాల్ట్ లా గెంతేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక కూటమిని తయారు చేసేందుకు  కేసీఆర్ నడుం బిగించారు. ఆ క్రమంలో ఆయన ఇప్పటికే మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించిఅక్కడి స్థానిక నేతలను కారెక్కించారు.   అదే విధంగా సాటి తెలుగురాష్ట్రం  ఆంధ్రప్రదేశ్ లో కూడా తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పాలని   వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.   ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌కు కేసీఆర్ బాధ్యతలు కట్టబెట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ అధ్యక్షతన విశాఖపట్నం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.   అయితే టీఆర్ఎస్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీగా రూపాంతరం చెంది.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. అయితే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను ఆంధ్ర ప్రజలు ఓన్ చేసుకొంటారా? అన్న సందేహాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. నాటి నుంచి నేటి వరకూ  అంటే ఈ  ఎనిమిదేళ్ల కాలంలో ఏపీ స్థిరంగా కుదురుకున్న దాఖలు  లేవు. ఏపీ ఇంకా  సమస్యల సుడిగుండంలో చిక్కకొని అల్లాడిపోతోంది. అలాగే విభజన సమయంలో ప్రజాస్వామ్యంలో  దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు సైతం గల్లంతు అయ్యాయని వారు గుర్తు చేస్తున్నారు.  విభజన బిల్లు.. ఆమోదం పొందే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5, 10, 15 ఏళ్లు అంటూ.. బహిరంగ వేలం జరుగుతోన్న వేళ...  నాయకులు గొంతు సవరించుకునేలోగానే బిల్లు పాస్ అయిపోయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా లేదు.. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాలేదు.   మహాభారతంలో భీముడు.. జరాసంధుడ్ని సునాయాశంగా చీల్చినట్లు.. విభజనతో రాష్ట్రాన్ని చీల్చారు.  విభజనతో అన్ని విధాలుగా నష్టపోయినా ఏపీకి  ఇంత వరకు  న్యాయం జరగలేదు.  మరో వైపు విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉమ్మడి ఆస్తుల పంపకం ఈ రోజుకూ తేల లేదు. నదీ జాలాల్లో నీటి వాటా కోసం.. ఈ రెండు రాష్ట్రాల పేచీ నేటికీ జలసౌధ సాక్షిగా   కొన.. సాగుతోనే ఉందని వారు వివరిస్తున్నారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగులు పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది. అలాంటి వేళ ఆంధ్ర ప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అయితేనేమీ.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ ఈ గులాబీ దళం ఏనాడు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చిన పాపాన పోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. మా తెలంగాణకీ ఇవ్వాలి.. పోలవరంకు జాతీయ హోదా ఇస్తే.. మా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలంటూ కేసీఆర్ ఫ్యామిలీ ప్లస్ ఆయన కేబినెట్‌లోని మంత్రులు  సైతం పలు సందర్బాల్లో పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు.  అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలన్నీ మూటా ముల్లు సర్థుకొని ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతాయంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. గతంలో ఎన్నిక ప్రచారం వేళ.. చేసిన వ్యాఖ్యల వీడియోలు  నేటికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ.. ప్రైవేటీకరణ దిశగా మోదీ ప్రభుత్వం వేసిన అడుగు పూర్తి కావోస్తున్నాయి. అలాంటి వేళ దీనిని కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం బిడ్ వేస్తోందనే ఓ టాక్ అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరు కూడా ఉండకూడదంటూ.. హుకూం జారీ చేసిన కారు పార్టీ అధినేత.. నేడు.. ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తారని... ఓ వేళ వస్తే..  ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా అంటే సందేహేమే అని పరిశీలకులు అంటున్నారు. అదీకాక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలతో నిత్య కల్యాణం పచ్చ తోరణంలాగా నిత్యం కళకళలాడుతూ ఉండేదని... ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.... దేశంలోని మొత్తం రాష్ట్రాల జాబితాలో... అక్షర క్రమంలోనే కాదు... అభివృద్ధిలోనే కాదు... ఆర్దికాభివృద్ధిలో సైతం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేదని... కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. అంటే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత.. విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలి పోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో అగ్రస్థానంలోనే ఉన్నా.. అభివృద్ధిలో... ఆర్థికాభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానానికి సర్రున  జారిపోయిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో...  ఉన్న కళను పొగొట్టి.. మళ్లీ పాత కళ తీసుకు వస్తామని పక్క రాష్ట్రం వారు ఎవరో వచ్చి చెబితే.. ఆంధ్రోళ్లు ఆదరిస్తారా? అంటే.. ఏమో... ఎన్నికల వేళ వరకు వేచి చూడాల్సిందేననే ఓ అభిప్రాయం అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం!

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనన్నాడు మావో. అయితే సంబంధాలు కాదు అనుబంధాలు, ఆత్మీయతలూ కూడా ఆర్థిక వ్యవహారాలుగానే మారిపోతున్నాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, భార్యా భర్తలు ఇలా అనుబంధాలన్నీఆర్థిక బంధనాలలో చిక్కుకుని చిన్నాభిన్నమైపోతున్నాయి. చిన్న చిన్న మొత్తాల కోసమే ఒకరినొకరు తెగనరుక్కునే పరిస్థితికి తెగబడుతున్నాయి. తాజాగా ఖర్చుకు సొమ్ములు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే హతమార్చిన కొడుకు ఉదంతం ఒకటి వెలుగులోనికి వచ్చింది. హైదరాబాద్ రామంతాపూర్ లో ఒకడు కన్న తండ్రినే డబ్బుల కోసం హత్య చేశాడు. రామంతాపూర్ కు చెందిన పాండు సాగర్(54) కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల కిందట పాండు సాగర్ మరో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ మొదటి భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాండు సాగర్ కుమారుడు పవన్ డబ్బుల కోసం తండ్రిని నిలదీశాడు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో పవన్ తండ్రిని దారుణంగా హత్య చేశారు.  ఇక ఇలాంటిదే మరో సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. హమీర్ పూర్ జిల్లాలో ఆస్తి కోసం తలెత్తిన వివాదంలో ఒక కొడుకు తండ్రిని నరికి చంపాడు.  పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణం కలకలం రేపింది.  ఇక మరో ఘటనలో బీమా డబ్బుల కోసం తండ్రిని హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు మరో ప్రబుద్ధుడు. ఈ ఘటన రెండు వారాల కిందట తెలంగాణలోని కొడంగల్ మండలంలో జరిగింది.  బిక్యానాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ శ్రీనివాస్‌ నాయక్‌  తండ్రి రాథోడ్‌ ధన్‌సింగ్‌ నాయక్‌ పేరుమీద ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలో రూ.30 లక్షల వరకు బీమా పాలసీ ఉన్నది. ఎలాగైనా ఈ డబ్బులను తీసుకోవాలన్న దురుద్దేశంతో   ఉడిమేశ్వరం గ్రామ శివారు లో తండ్రి తలపై బండరాయితో బాది ఘోరంగా హత్యచేశాడు. ఆ తరువాత ఈ ఘటనను బైక్‌ ఆక్సిడెంట్‌గా చిత్రీకరించి ఇన్సూరెన్స్‌ కంపెనీని మోసం చేసేందుకు ప్రయత్నించాడు.    

బీసీ హాస్టల్ లో విద్యార్థులతో వెట్టి చాకిరీ

బీసీ గురుకుల విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా పనులు చేయిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు బాపులే బీసీ గురుకుల హాస్టల్ లో విద్యార్థుల చేత పనులు చేయిస్తున్నారు. సమయం అంటే లేకుండా ఆ హాస్టల్ లో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. హాస్టల్ విద్యార్థుల చేత వార్డెన్ కిచెన్ క్లీనింగ్, వంట చేయించడం, అలాగే చెత్తను తొలగించడం తదితర పనులు చేయిస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.  అంతే కాకుండా ఉపధ్యాయులు కూడా  విద్యార్థులతో  సొంత పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. హాస్టల్ లో ఉన్నంత మాత్రాన వారు పనిపిల్లలు కాదనీ, చదువుకోవాల్సిన విద్యార్థుల చేత పని చేయించడం ఏమిటని నెటిజన్లు మండి పడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల చేత పని చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయిస్తునారు. 

అభ్యర్ధుల ఎంపికే అత్యంత కీలకం!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. నెలరోజుల్లోకి వచ్చేశాయి. వచ్చే నెల 10 వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సగానికి పైగా స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినా, అధికార  బీజేపీ మాత్రం ఇంకా తొలి జాబితా అయినా ప్రకటించలేదు. అభ్యర్ధులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆయినా, అభ్యర్ధుల పేర్లను   ఇంకా గుట్టుగానే  ఉంచారు. అయితే ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మొత్తం జాబితా రెడీ అయిందని,  తాను షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని  ఒకటి రెండు రోజుల్లో మొత్తం జాబితా ఒకేసారి ప్రకటిస్తామని మీడియా ముఖంగా ప్రకటించారు.  అయితే  బీజేపీ అభ్యర్ధుల ప్రకటన ఆలస్యం అయ్యే కొద్దీ ఇటు ఆశావహుల్లో అంతకంటే ఎక్కువగా విపక్షాలలో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే 165 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 60 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే విషయంలో ఆచితూచి  అడుగులు వేస్తోంది. మరోవంక కర్ణాటకలో బీజేపీ గుజరాత్ ప్రయోగం చేస్తున్నదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, కొత్త వారికీ పెద్ద పీట వేస్తుందని పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోందని అంటున్నారు. టికెట్ రాని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకి కాంగ్రెస్ లో చేరకుండా ఉండేందుకే, బీజేపీ అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం చేస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి బొమ్మై కాంగ్రెస్ పార్టీకి 60 నియోజక వర్గాల్లో అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు.  మరో వంక 165 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్   రాష్ట్రంలోని రెండు ఆధిపత్య కులాలైన లింగాయత్’లకు 30, వొక్కలిగాలకు 24 టిక్కెట్లను కేటాయించింది. అయితే, తమ వర్గానికి ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలని కోరుతున్న వీరశైవ-లింగాయత్‌లను శాంతింపజేయడానికి పార్టీ పెద్దలు బుజ్జగింపు ప్రయత్నాల్లో ఉన్నారు.  అదలా ఉంటే  మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘సీటు’ హాట్ సీటుగా మారింది.  సిద్దరామయ్యపై  పోటీ చేసేందుకు సీనియర్‌ నేత సోమన్నను బీజేపీ ఎంపిక చేసినట్లు సమాచారం. వరుణ స్థానం నుంచి ఈ ఇద్దరూ బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమన్న వరుణ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి సిద్దరామయ్య కూడా వరుణ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. తనకు మరో స్థానాన్ని కేటాయించాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. వరుణతో పాటు ‘కోలార్‌’ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దీనిపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కర్ణాటక ఎన్నికల్లో ‘ఒకరికి ఒక్క సీటు మాత్రమే’ నిబంధనను పాటిస్తున్న కాంగ్రెస్‌.. సిద్ధరామయ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో  చూడాలి.  2018 ఎన్నికల్లోనూ ఆయన రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు.  మైసూరులోని చాముండేశ్వరి స్థానంలో పరాజయం పాలైన ఆయన బగల్‌కోట్‌లోని బాదామి నుంచి విజయం సాధించారు. కాగా వరుణ నియోజవర్గంలో దాదాపు 70 వేల మంది ఓటర్లు ఉంటారు. ఇందులో లింగాయత్‌లే సింహభాగం. ఈ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన సోమన్నను అభ్యర్థిగా నిలిపితే.. పార్టీకి మరింత బలం చేకూరడంతోపాటు సులభంగా విజయం సాధించవచ్చని బీజేపీ భావిస్తోంది. వక్కలిగ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కనకపుర నియోజకవర్గ స్థానంలోనూ బలమైన వ్యక్తిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పోటీ చేస్తున్నారు. కర్ణాటక జనాభాలో దాదాపు 15శాతం ఉన్న వక్కలిగులు... లింగాయత్‌ల (17శాతం) తర్వాత రెండో అతిపెద్ద సామాజిక వర్గం. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 100 చోట్ల లింగాయత్‌ల ప్రాబల్యమే ఎక్కువ. వీటిలో ఎక్కువ సీట్లు ఉత్తర కర్ణాటకలోనే ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి 54 మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 37 మంది బీజేపీ చెందిన వారే ఉన్నారు.  కాగా  కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తగ్గేదే లే..అన్నట్లుగా తలపడుతున్నారు. అందుకే అభ్యర్ధుల ఎంపిక విషయంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కుల సమీకరణలో పాటుగా ఇతర సామాజిక, ఆర్థిక సమీకరణల విషయంలోని ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అలాగే, ఈసారి ఎన్నికల్లో  కులాల కంటే మత రాజకీయ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర సమస్యలతో పాటుగా జాతీయ రాజకీయాలు, జాతీయ సమస్యల ప్రభావం కూడా కొంచెం  ఎక్కువగా ఉంటుందని న్తున్నారు. అందుకే అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాజకీయ పార్టీలే  కాదు, రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. ప్రజల నాడిని పట్టుకోలేక పోతున్నారని అంటున్నారు.

బీజేపీ ప్రాపకం కోసమేనా ఈ పిల్లిమొగ్గలు..?

పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు తమ డిగ్రీ పత్రాలను చూపించాలని కొందరు నేతలు ప్రశ్నించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్రంగా మండిపడుతున్నారు. నాయకులు చదువుకున్న కళాశాల ఏది? వారి డిగ్రీ అర్హత ఏంటీ? అనే ప్రశ్నలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ఇవి అసలు రాజకీయ అంశాలేనా? " అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందనీ.. వాటిపై దృష్టి పెట్టకుండా నాయకుల విద్యార్హత వంటి  అనవసర అంశాన్ని లేవనెత్తటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, శాంతి భద్రతలు, ద్రవ్యోల్బణం వంటి తీవ్ర అంశాలపై కాకుండా ఇలాంటి వాటిని సమస్యలుగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కులం, మతం అంటూ ప్రజల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి, ఉద్యో గాలు లేక ఎంతోమంది యువత ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఇలాంటి వాటిపై కేంద్రాన్ని నిలదీ యండి  అని హితవు పలికారు. అదానీపై  హిడెన్ బర్గ్ సమర్పించిన నివేదిను తప్పు పట్టిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్.. నేడు మోడీ విద్యార్హత, సర్టిఫికేట్ పై  అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిపై మండిపడటం వెనుక మతలబు ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు.  శరద్ పవార్ ఈ విన్యాసాలన్నీ బీజేపీ ప్రాపకం కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో  ఏక్ నాథ్ షిండే  బీజేపీతో కుమ్మకై.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి అధికారానికి దూరమైన పవార్ ధోరణిలో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందనీ..  ఇదంతా దేని కోసమో అర్ధమౌతోనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.  అటు మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  రాజకీయాలన్నీ అధికారం చుట్టూనే తిరుగుతున్నాయనడానికి శరద్ పవార్ వ్యవహారం తాజా ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. 

వేసవి హీట్ ను మించి ఏపీలో పొలిటికల్ హీట్

వేసవి హీట్ ను మించి ఏపీలో రాజకీయ హీట్ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ  పార్టీలు ఇప్పటి నుంచే విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.  అందులోభాగంగా రాష్ట్రంలో  స్టిక్కర్ వార్.. జరుగుతోంది.  ఇక  విమర్శలు.. ప్రతివిమర్శల జోరు సరేసరి. తాజాగా అధికార జగన్ పార్టీ.. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ఇంటింటికీ స్టిక్కర్ వేసే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ప్రజల్లోకి వెళ్తోంది.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ.. తన దైన శైలిలో ఈ కార్యక్రమంపై వ్యంగ్య బాణాలు సంధిస్తోంది. మా దరిద్రం నువ్వే జగనన్న అంటూ పంచ్ డైలాగ్‌లు పేలుస్తోంది. అలాగే మీ బిడ్డను ఆశీర్వదించండి.. మీ బిడ్డకు అండగా నిలవండంటూ సీఎం  జగన్.. వివిధ వేదికలు, బహిరంగ సభలపై నుంచి ఇస్తున్న పిలుపునకు సైతం... మీ బిడ్డ పెద్ద క్యాన్సర్ గడ్డ అంటూ తెలుగుదేశం శ్రేణులు  ఎద్దేవా చేస్తున్నాయి.  మరోవైపు మా నమ్మకం నువ్వే జగనన్న   కార్యక్రమంపై జనసేన సైతం   స్పందించింది. సంచులేసుకొని, స్టిక్కర్లు అతికించుకొంటూ.. మీ నినాదాలే మీరు చేసుకుంటే వచ్చేది.. నమ్మకం ఎలా అవుతుంది  స్టిక్కర్ సీఎం అంటూ ట్విట్ చేసింది. అలాగే మాకు నమ్మకం లేదు జగన్.. మాకు నమ్మకం పవన్ అనే స్టిక్కర్లు తిరుపతిలో దర్శనమిస్తున్నాయి. జగన్ పార్టీ స్టిక్కర్ల పక్కనే ఈ స్టిక్కర్లను జనసేన పార్టీ శ్రేణులు అంటిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు సభలకు ప్రతిగా సభలు... ర్యాలీలకు పోటీగా ర్యాలీలు... దాడులకు పోటీగా ప్రతి దాడులు... విమర్శలకు దీటుగా ప్రతి విమర్శలకు తోడు ఇప్పుడు ఈ స్టిక్కరింగ్ వార్ ఆ జాబితాలో చేరిందని చెప్పవచ్చు. జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అవుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు..  షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. అయితే   ఈ ఏడాది చివరిలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న చర్చ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకొంది. అదీ కాక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఎన్నికలకు అట్టే సమయం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం   జగన్.. ఫిబ్రవరి 7వ తేదీన నువ్వే మా భవిష్యత్త జగనన్న అంటూ స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఆ క్రమంలో 1.60 కోట్ల కుటుంబాలను వీరంతా సందర్శించి.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడమే కాకుండా.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాల గురించే కాకుండా.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడమే కాకుండా.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పలాల గురించి కూడా వారికి వివరిస్తున్నారు.  ఆ క్రమంలో 82960 82960 నెంబర్‌కు మిస్డ్ కాల్ సైతం ఇస్తారు. దీంతో ఈ కుటుంబం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉందని ఆ పార్టీ అధిష్టానం ఓ అంచనాకు వస్తుందని తెలుస్తోంది. అయితే మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమంపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు గుప్పించడంపై సోషల్ మీడియాలో ఈ స్టిక్కరింగ్ వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది.

బడ్జెట్ సెషన్ అదానీయార్పణం!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అదానీయార్పణం అయిపోయాయి. గత గురువారంతో ముగిసిన బడ్జెట్ సమావేశాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ రోజులు మాత్రమే జరిగాయి. అదే విధంగా సభా కార్యక్రమాలు  అత్యంత ముఖ్యమైన వార్షిక బడ్జెట్‌ ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం పొందిన సందర్భం కూడా ఇదే కావచ్చునని అంటున్నారు. సాధారణంగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రతిపాదనల మీద సుదీర్ఘంగా, లోతుగా చర్చలు, వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ఏకాభిప్రాయం గనుక సాధ్యమైతే మార్పులు, చేర్పులు కూడా చోటు చేసుకుంటాయి. అయితే, ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో అసలా ఊసే లేదు. జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలన్న స్ఫుృహ అటు అధికార, ఇటు విపక్ష సభ్యులలో కనిపించలేదు.  అదానీ-హిండన్‌బర్గ్‌ కు సంబంధించిన వ్యవహారాలపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని, దీని మీద కూడా చర్చ జరగాలని అవి వాదించాయి. అదానీ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాల ఒత్తిడికి, డిమాండ్లకు పాలక పక్షం ఏమాత్రం తలవంచలేదు. ప్రతిపక్షాల డిమాండ్లన్నిటినీ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించింది. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీనివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పైగా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి కూడా దిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం సన్నగిలుతోందని, ఈ పరిస్థితిని నివారించడానికి ఇతర దేశాలు సహాయం చేయాలంటూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో విజ్ఞప్తి చేసినందుకు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ పాలక పక్షం పట్టుబట్టింది. తాను అటువంటి ప్రకటనలేవీ చేయలేదని స్పష్టం చేసిన రాహుల్‌ గాంధీ, దానిపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. రాహుల్‌ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ బీజేపీ పక్ష సభ్యుడు స్పీకర్‌కు లేఖ రాయడం జరిగింది. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. దీనిపై ప్రతిపక్షం గందరగోళ పరిస్థితి సృష్టించడంతో పార్లమెంట్‌ సమావేశాలు స్తంభించిపోయాయి.  ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించడం అన్నిటికన్నా ముఖ్యమనే ప్రాథమిక విషయాన్ని అధికార, విపక్షాలు పూర్తిగా విస్మరించడం వల్లనే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎటువంటి చర్చా లేకుండా ముగిశాయి.  

బీఆర్ఎస్ కు షాక్.. ఏపీలో కారు గుర్తు లేనట్టే!?

ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని భావించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి భారీ షాక్ తగిలింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేయడానికి విశాఖ ఉక్కును ప్రచారాస్త్రంగా మలచుకుని ముందుకు సాగాలని యత్నిస్తున్న సమయంలో  ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఇంతకాలం కొనసాగిన ‘రాష్ట్ర పార్టీ’ హోదాను  రద్దు చేస్తున్నట్లు  ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ పార్టీగా గుర్తింపు పొందిందని, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తగిన ఆర్హతలను సాధించడంలో బీఆర్ఎస్ విఫలం అవ్వడంతో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీహోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్ర హోదాను ఎందుకు తీసేయకూడదంటూ మూడుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ నుంచి స్పందన లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆ ప్రకటనలో పేర్కొంది.  కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్ 1968 లోని సెక్షన్ 6-ఏ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి స్టేట్ పార్టీ స్టేటస్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి  పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఏదేని పార్టీ రాష్ట్ర పార్టీగా కొనసాగాలంటే నిర్దుష్టమైన నిబంధనలు, అర్హతలు, ప్రమాణాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ అర్హతలను పొందలేకపోయిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పోటీచేయలేదని, దీంతో అస్సలే ఓట్లు పడలేదని, దీంతో రాష్ట్ర పార్టీకి ఉండాల్సిన అర్హతలు సాధించలేకపోయిందన్నారు. స్టేట్ పార్టీ హోదాకు సంబంధించి ఎప్పటికప్పుడు గుర్తింపుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు.  తొలిసారి 2019 జూలై 18న బీఆర్ఎస్ పార్టీకి తొలి షోకాజ్ నోటీసు జారీచేసి, ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ పార్టీ హోదాను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని,   దీంతో 2021 డిసెంబరు   27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీకి లేఖ రాశామని పేర్కొన్నారు. దానికి కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా లేదని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు. ఆ తరువాత ముచ్చటగా మూడో సారి ఈ ఏడాది మార్చి 7న మరో లేఖలో.. అదే నెల 20 ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరామనీ, కానీ అప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి స్పందన లేదనీ, ఆ సమావేశానికి ఆ పార్టీ  తరఫున ఎవరూ హాజరు కాలేదనీ పేర్కొన్నారు.  దీంతో నిబంధనలకు విరుద్ధంగా స్టేట్ పార్టీ హోదాను కొనసాగించడం వీలు కాని కారణంగా ఆ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసినట్లువివరించారు.  దీంతో  బీఆర్ఎస్ ఇకపైన ఏపీలో పోటీ చేస్తే కామన్ సింబల్ అంటే కారు గుర్తు దక్కడం దాదాపు అసాధ్యమే.  తెలంగాణలో కారు గుర్తుమీద పోటీ చేస్తున్నా ఏపీలో అలాంటి అవకాశం ఉండదు. అయితే ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ణప్తి చేస్తే  ఎన్నికల సంఘం అందుకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

జగనన్నా నిన్ను నమ్మలేమన్నా!

రాజకీయ పార్టీల మనుగడకు సమర్ధ నాయకత్వం అవసరం. అది మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్ రెడ్డి లేదా ఇంకైవరైనా కావచ్చును. ఒక రాజకీయ పార్టీ మనుగడ పార్టీ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది.  నాయకుడు ముందుండి పార్టీని నడిపిస్తేనే పార్టీ ముందుకు సాగుతుంది. అంతే కానీ, నాయకుడు అన్నవాడు ప్యాలెస్ లో కూర్చుని కొరడాతో అదిరిస్తాననే అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఆ ఆట అట్టే కాలం సాగదు.  అందులో సందేహం లేదు.  అలాగే  అదే సమయంలో కేవలం సమర్ధ నాయకత్వం ఉంటే సరిపోతుందా? అంటే సరిపోదు. కింది నుంచి పైదాకా పార్టీ నిర్మాణం ఉంటేనే పార్టీ ముందుకు సాగుతుంది. నాయకుడుకి పార్టీ జెండామోసే కార్యకర్తలకు దూరం ఎంతగా  పెరిగితే,  పార్టీ అంతగా నష్ట పోతుంది. ఇప్పుడు ఏపీలో అధికార  వైసీపీ విషయంలో అదే జరుగుతోంది. ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు, నాయకులు. చివరకు, వైసీపీకి ఓటేసి తప్పు చేశామని  సర్పచులు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. నిజానికి ఈ రోజున అధికార పార్టీలో నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య దూరం అంతో ఇంతో కాదు, ఏకంగా ఏ లంగరుకు అందనంతగా పెరిగింది. అగాధంగా మారింది. అడ్డు గోడల ఎత్తు రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతేకాదు  వైసీపీ నాయకులు ఎవరిని అడిగినా  కార్యకర్తలు, ఓటర్ల విషయం పక్కన పెట్టండి, మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగడం లేదనే మాటే సమాధానంగా వస్తోంది.  అయితే ఇటీవల ముఖ్యమంత్రి,  రాజకీయాలంటే మానవ సంబంధాలు అంటూ చాలా గంభీర ప్రకటన చేశారు. అంతే  కాదు  ఈ గుణాన్ని, నాన్న నుంచి నేర్చుకున్నాను  అని పెద్దాయన సెంటిమెంట్ ను ఉపయోగించుకున్నారు.  అంతకు ముందుకు భిన్నంగా, ఎమ్మెల్యేలను ఛీ ..ఛా .. అనకుండా, బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంత వరకు మీ పనితీరు మెరుగు పరచుకుంటారా.. మిమ్మల్నే పీకేయ మంటారా ? అంటి గర్జించిన జగన్ రెడ్డి స్వరం మార్చి,  నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోనుఅంటూ  బుజ్జగింపులకు దిగారు. అయితే  ముఖ్యమంత్రిలో ఈ మార్పు ఎంతవరకు నిజమో, ఎంతవరకు నటనో అనే విషయాన్ని పక్కన పెడితే  ముఖ్యమంత్రిలో ‘మార్పు’ వచ్చే సరికే పుణ్యకాలం పూర్తయిందని, ఇప్పుడు చేతులు కాలిన తర్వత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదని పార్టీ నేతలు గుసగుసలు పోవడం కాదు, గట్టిగానే అంటున్నారు.  ముఖ్యంగా ఈ నెల 7 నుంచి ప్రారంభమైన,  ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వంపై, ఆ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకుల్లో భగ్గుమంటున్న అసమ్మతి  పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం లోతులకు అద్దం పడుతోందని అంటున్నారు. నిజానికి, ఏప్రిల్ 7 కార్యక్రమం కొంత ఉత్సాహంగానే మొదలైంది, అయితే ఇక అక్కడ నుంచి రోజు రోజుకు దిగజారి మూడు రోజులకే మొక్కుగ్గుబడి తంతుగా మారింది. నిజానికి  సంవత్సర కాలంగా సాగుతున్న గడప గడపకు కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు జనం నాడి అర్థమైంది. అందుకే గడప గడపకు కార్యక్రమంపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం లేక పోయింది. ఇప్పడు దానికి కొనసాగింపుగా, దింపుడు కళ్ళెం ఆశతో చేపట్టిన ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలోనూ అవమానలే ఎదురవుతున్నాయని వైసీపే నాయకులు వాపోతున్నారు.  నిజానికి  ఫెయిల్ అయింది  నిన్నటి గడప గడపకు, ఇప్పటి  ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమాలు కాదు వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి నాయకత్వం. ఈ వాస్తవాన్నిగుర్తించికుండా, ఐ ప్యాక్ ను నమ్ముకుని ఇప్పటి  ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ వంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా లక్షల సంఖ్యలో గృహ సారథులను నియమించినా అందులో ఒకరిని సచివాలయం పరిధిలో చైర్మన్ గా నియమించి .. లేదా ఇంకా ఇలాంటి చిల్లర నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా  ఫలితం ఉండదని పరిశీలకులు అంటున్నారు. చివరకు, ఇంతచేసినా ఇంతేనా అని వాపోక తప్పదని అంటున్నారు. అన్నిటినీ మించి అసలు లోపం ప్యాలెస్ లో పెట్టుకుని, ఎవరినో బాధ్యులను చేయాలను కుంటే ఎలా? అంటున్నారు. అందుకే, జనం జగనన్నా... నిన్ను నమ్మలేమన్నా అంటున్నారు .. వైసీపీ అభిమానులు. చెప్పులతో కొట్టుకుంటున్నారు.  

డీఎస్ రెంటికీ చెడ్డ రేవడి!

 ఒకప్పుడు రాష్ట్ర రాజకీయా ల్లో చక్రం తిప్పిన  ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజకీయ జీవితం  ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. తాజాగా ధర్మపురి కుటుంబ కథా చిత్రం ఎవరికీ అర్థంకాకుండా పోతోంది.  ఆయనతో పాటు ఆయన కుమారుల రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నా ర్ధకంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఇటు బీజేపీలో అర్వింద్ పలుచనయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ లో సంజయ్ చులకనైపోయారు. కాదేదీ రాజకీయాలకు అనర్హం అన్న పాతకాలం నాటి   కొటేషన్ ప్రస్తుత రాజకీయాలకూ సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.  ఏ సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటాయి పార్టీలు. ఘటనలే కాదు, మనుషులనూ పొలిటికల్ గేమ్ లో పావులుగా వాడే స్తున్నారు. కాంగ్రెస్ లో డీఎస్ ఎపిసోడ్.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా జాయినింగ్.. ఆ మరుసటి రోజే రిజైన్ తో   ధర్మపురి కుటుంబ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్దాలు తిరుగులేని నేతగా వెలుగొందిన డీఎస్ రాజకీయం నేడు వెల వెలబోతుంది. డి.శ్రీనివాస్  గతంలో పీసీసీ అధ్యక్షుడు వైఎస్సార్ తో కలిసి కాంగ్రెస్ ను ఉరకలెత్తించారు. హస్తం పార్టీలో కింగ్ గా ఉన్నారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పు డు బీఆర్ఎస్ మాజీ ఎంపీగా, కారు పార్టీకి అంటరాని నేతగా ఉన్నారు. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీ గా దూసుకుపోతున్నారు. తండ్రి బీఆర్ఎస్ కు దూరమవడంతో.. ఆయన బీజేపీలో చేరుతారని అనుకున్నారు. యువనేతలు ధర్మపురి బ్రదర్స్ కు   వ్యక్తిగతంగా, రాజకీయంగా ఒకరంటే ఒకరికి అసలే మాత్రం పడదు. అందుకే, తమ్ముడు బీజేపీలో ఉంటే.. అన్న కాంగ్రెస్ లో   చేరారు.   ఆ కార్యక్రమానికి తానూ హాజరై.. కొడుకును ఆశీర్వదించాలని భావించారు. కానీ తానొకటి తలిస్తే, కాంగ్రెస్ నేతలు మరొకటి తలచారు. సంజయ్ చేరిక సందర్భంగా గాంధీభవన్ కు వచ్చిన డీఎస్ కు కాంగ్రెస్ కండువా కప్పేసి పార్టీలో చేరినట్టు ప్రకటించేశారు హస్తం నేతలంతా కలిసి. ఈ వార్త మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేలా హడావుడి చేశారు. కట్ చేస్తే.. ఆ మర్నాడే తాను అసలు కాంగ్రెస్ లో చేరలేదని, అదంతా అబద్ధమంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు డి. శ్రీనివాస్. పనిలో పనిగా ఒకవేళ తాను పార్టీలో చేరానని మీరు అనుకుంటే.. ఇదిగో నా రాజీనామా అంటూ లేఖ కూడా విడుదల చేశారు.  ఆఖరి దశలో నలిగిపోతున్న డీఎస్ కు గడిచిన రెండు, మూడేళ్లుగా  అనారోగ్యంతో బాధపడుతున్నారు.   ఆయన ఎప్పటినుంచో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలో చేరినా పెద్దగా ఉపయోగం   ఉండక పోవచ్చు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ లో చేర్చుకుని ఖుషీ చేసుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు, కాస్త ఓవరాక్షన్ చేసి.. డీఎస్ ను సైతం పార్టీలో కలిపేసుకున్నారు. ఆ సమయంలో నేతలంతా తనను సన్మానిస్తున్నారని అనుకున్నారు కాబోలు డీఎస్. ఇంటికెళ్లాక కానీ ఆయనకు అసలు జరిగిందేంటో తెలీలేదు.    

దున్నపోతుపై వర్షం!

పశ్చిమ బెంగాల్ కు కేంద్రం నుంచి రావల్సిన నిధుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త తరహా నిరసనను తెలపనున్నారు. రాష్ట్రా నికి రావల్సిన వాటా నిధులను డిమాండు చేస్తూ బెంగాల్ ప్రజల నుంచి కోటి లేఖలు ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ పంపనున్నారు.  బెంగాల్ ప్రజల నుంచి వచ్చిన  కోటి లేఖలను కేంద్రం ఎలా అడ్డుకుంటుందో చూస్తామని మమతా అన్నట్లు తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. మనెగారా పథకం కింద బెంగాల్ కు రావల్సిన నిధుల విడుదల కోసం ఒత్తిడి చేసేందుకు సంతకాల సేకరణ, ప్రధానమంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రికి లేఖలు పంపే కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ లేఖలను తృణమూల్ కాంగ్రెస్ కు  చెందిన బూత్ స్థాయి నాయకులు సేకరించి, బకాయిలు చెల్లించని లబ్దిదారులతో కలిసి ఢిల్లీకి వెళతామన్నా రు. 2019 లోక్ సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలోనూ పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మంచి జనాదరణ ఉన్న ప్రాంతమైన అలీపుర్ దువార్ లో జరిగిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ ప్రసంగించారు. ఇటీవల సీఎం మమతా బెనర్జీ కూడా బెంగాల్ పెండింగ్ బకాయి లపై కోల్ కతాలో రెండు రోజుల ధర్నాలో పాల్గొన్నారు. తృణమూల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి, ఖర్చులకు సంబంధించిన లెక్కలు చెప్పపోతున్నా రని, అందుకే నిధులు ఆలస్యమవుతున్నా యని బీజేపీ అంటుంది. 100 రోజుల పని పథకానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా లోని రెడ్ రోడ్ లో  ధర్నాకు కూర్చున్న విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్ర వివక్ష చూపుతుంది.. రాష్ట్రాలకు రావల్సిన వాటాలను ఇవ్వకుండా, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విజ్ఞాప్తిలను కోటి లేఖలేం ఖర్మ... వందల కోట్లు పంపినా.. అది దున్నపోతుపై వర్షంలా వ్యర్థం అని రాజకీయ నిపుణులు అభిప్రాపడుతున్నారు..

కొండరాయికి వడదెబ్బ.. పెద్ద శంబ్దంతో పగిలిన వైనం

రోహిణీకార్తె ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు. ఇంకా రోహిణీ కార్తె రాలేదు. మే మూడో వారంలో రోహిణీ కార్తె వస్తుంది. ఇప్పుడు ఇంకా ఏప్రిల్ ఎనిమిదో తేదీయే. అయినా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలకు కొండలు పగులుతున్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్లలో భానుడి భగభుగలకు ఏకంగా ఓ కొండరాయి పగిలిపోయింది. పటపట మని పెద్ద శబ్దాలు చేసుకుంటూ పెద్ద కొండరాయి బీటలు తీసింది. ఆ శబ్దాలకు పరిసరాల్లో నివసించే జనం భయంతో వణికిపోయారు. ఏం జరుగుతోందో అర్ధం కాక తల్లడిల్లిపోయారు. ఆ పగిలిన బండరాయి ఏ క్షణంలో జారి పడుతుందోనని భయాందోళలనతో బిక్కు బిక్కు మంటున్నారు. ప్రమాదం జరగకుండా తక్షణం ఆ పగిలిన కొండరాయిని అక్కడ నుంచి తొలగించాలని కోరుతున్నారు.   అయినా ఏప్రిల్ లోనే ఎండలు ఇలా ఉంటే ఇక వచ్చేనెలలో మరెంత తీవ్రంగా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ఏడు వర్షాభావ పరిస్థితులు ఉంటాయనీ, ఎండలు మండిపోతాయనీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండ ప్రచండంగా మారింది. సూర్యుడి ప్రతాపానికి బండరాళ్లు బీటలు వీస్తున్నాయి. ముందు ముందు భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుందనీ, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సీఎం జగన్.. లోతైన విచారణ కోరుతూ పిటిషన్

కోడి కత్తి కేసులో బాధితుడిగా ఏపీ సీఎం జగన్ కోర్టుకు హాజరయ్యారు. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు జగన్ సోమవారం (ఏప్రిల్ 10) హాజరయ్యారు. గత ఎన్నికలకు (2019) ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై  శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు విచారిస్తోంది.  ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపును కోరారు. ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.  నిందితుడిగా ఇప్పటి వరకూ సీబీఐ కోర్టు, హై కోర్టు  మెట్లు ఎక్కిన జగన్ తొలి సారిగా బాధితుడిగా ఎన్ఐఏ కోర్టు మెట్లు ఎక్కారు.  కోడి కత్తి కేసులో బాధితుడు కోర్టుకు హాజరై తీరాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేయడంతో అనివార్యంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు.  అంతకు ముందు గత విచారణల సందర్భంగా జగన్ హాజరుపై ఎన్ఐఏ కోర్టు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై నిందితుడు జనుపల్లె శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని గత విచారణలో న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయినా ఈకేసులో బాధితుడు జగన్ కోర్టుకుహాజరు కావాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేయడంతో సోమవారం (ఎప్రిల్ 10) జగన్ ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు.  అనూహ్యంగా ఆయన ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఎన్ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచీ హాజరును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన జగన్  ఇప్పుడు కేసు విచారణ మరింత జాప్యం అయ్యేందుకు వ్యూహాత్మకంగా పిటిషన్ వేశారని అంటున్నారు. అలాగే సీఎంను కనుక తాను కోర్టుకొస్తే ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు పాలనా పరమైన ఇబ్బందులు వస్తాయని అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  అసలు ఈ కేసు ఎన్ఐఏ  చేపట్టడానికి కేంద్రంపై జగన్ తీసుకు  ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత, అదీ కోర్టు అక్షింతలు వేస్తేనే  తీరిగ్గా కోర్టుకు హాజరైన జగన్ లోతైన విచారణ అంటూ పిటిషన్ దాఖలు చేయడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పిటిషన్ చూస్తుంటే ఆయన ఎన్ఐఏ విచారణపై నమ్మకం లేదని అంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లె  శీను  నాలుగేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. అదే సమయంలో తన కారు మాజీ డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ  బెయిలు పై బయటకు వచ్చారు.   జగన్ తాజా పిటిషన్ ఆయనలోని భయాన్ని బయటపెట్టిందంటున్నారు. గత ఎన్నికలలో తన విజయానికి దోహదపడిన రెండు కేసులూ ఇప్పుడు విచారణ సజావుగా సాగి వాస్తవాలు బయటపడితే.. తనకు మైనస్ అవుతుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే సొంత బాబాయ్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు ఇప్పట్లో తెమలకూడదన్న వ్యూహంతో వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ ఏడు వర్షాభావమే.. వ్యవసాయం కష్టమే.. ఎల్ నినో ఎఫెక్ట్ అన్న స్కైమెట్!

ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ ఈ ఏడు వర్షపాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ ఏడాది అన్న దాతలకు కష్టకాలమే అని పేర్కొంది.  ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ కాలానికి వర్షాలు సగటు  94 శాతంగా ఉండొచ్చని తెలిపింది.   స్కైమెట్ అంచనా మేరకు ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదౌతుంది. అనుకూల ప్రభావంతో గత కొన్ని సంవత్సరాలుగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. అయితే ఈ ఏడాది ఆ అనుకూల ప్రభావం పోయి ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉణ్నాయని పేర్కొంది. ఉత్తర భారత్, మధ్య భారత్ లోని ప్రాంతాలు ఎక్కువ వర్షాభావాన్ని ఎదుర్కొంటాయని స్కైమెట్ చెబుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జులై, ఆగస్ట్ లో సరైన వర్షపాతం ఉండకపోవచ్చని పేర్కొంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఎల్ నినో, లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించినవి. వాటి ఆధారంగానే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. భారత వాతావరణ విభాగం ఇంకా ఈ ఏడాది వర్షాకాలానికి సంబంధించి అధికారిక అంచనాలను ప్రకటించలేదు. ప్రస్తుత వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని మాత్రమే ప్రకటించింది.

విడదల రజనీ వర్సెస్ నందమూరి సుహాసిని@ చిలకలూరిపేట?

చిలకలూరిపేటలో రాజకీయం అంటే.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే విడదల రజినీనే చేయాలి అనే ఓ టాక్ అయితే సదరు నియోజకవర్గంలో తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్... ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడదల రజినీకి లైన్ క్లియర్ అయిందనే ఓ చర్చ   స్థానికంగా జోరందుకుంది.  ఈ నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం గట్టిగానే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో  ప్రముఖ నటుడు,తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేర్వేరుగా సమావేశమై..  సుహాసిని అభ్యర్థిత్వాన్ని ఓకే చేయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతోన్న పత్తిపాటి పుల్లారావుకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు పంపిస్తామనే స్పష్టమైన హామీని ఈ సందర్భంగా బాలయ్య ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. చిలకలూరిపేటలో  కమ్మ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అభ్యర్థి విజయంలో వీరి పాత్ర అత్యంత కీలకమన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను పరిశీలిస్తే ఇట్టే  అర్దమవుతుంది. అయితే గత ఎన్నికల వేళ  జగన్ పార్టీ వ్యూహాం మార్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి.. తన కేబినెట్‌లోకి తీసుకుంటానని ఆ పార్టీ అధినేత  జగన్ గత ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రకటించడం ద్వారా...  అంతకు కొద్ది రోజుల ముందే పార్టీలోకి వచ్చిన విడదల రజినీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలా ఆమె విజయం కోసం మర్రి రాజశేఖర్... పని చేయక తప్పలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అదీకాక విడదల రజినీ బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు.. జగన్ వేవ్ కూడా ఆమె విజయానికి  కలిసి వచ్చిందనే చెప్పాలి.  కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపైనే కాదు.. ఎమ్మెల్యే విడదల రజినీపైన కూడా నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. అలాగే ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు సైతం అధికంగా ఉన్నాయి.  వీరి ఓట్లు సైతం అభ్యర్థి గెలుపులో కీలకంగా మారనున్నాయి. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో  జగన్ సర్కారు లోపాయికారి ఒప్పందం చేసుకుందనే భావనలో  మైనార్టీ వర్గం బలంగా విశ్వసిస్తోంది. అలాంటి వేళ నందమూరి సుహాసినిని చిలకలూరిపేట నుంచి రంగంలోకి దింపితే.. రజినీకి ఎదురీత తప్పదన్న చర్చ  చిలకలూరిపేటలో హల్‌చల్ చేస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి రామకృష్ణ, నందమూరి చైతన్య కృష్ణా, జూనియర్ ఎన్టీఆర్‌లు రంగంలోకి దిగననున్నారనే టాక్ సైతం స్థానికంగా సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది.

కర్ణాటకలో అమూల్ కల్లోలం

బెంగుళూరులో తమ పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో   డెలివరీ చేస్తామంటూ గుజరాత్ కు చెందిన ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) చేసిన ట్వీట్ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయ దుమారాన్ని రేపింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారు అయిన నందిని బ్రాండ్   నిర్వాహకులను ఇబ్బందుల పాల్డేయడానికి, నందిని బ్రాండ్ ను వినియోగిస్తున్న కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ను, అమూల్  లో విలీనం చేయడానికి జరుగుతున్న కుట్రగా కాంగ్రెస్, జేడీ(ఎస్)  విమర్శలు గుప్పిస్తున్నాయి. అమూల్ ఉత్పత్తులను కొనేది లేదంటూ కన్నడిగులు  ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. అమూల్, నందిని మధ్య ఎలాంటి  రాజకీయాలు లేవని, దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్ గా నందిని నిలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి అమూల్ ను   దొడ్డిదారిన తెచ్చేందుకు గుజరాత్ కు చెందిన ప్రధాని, కేంద్ర మంత్రి  ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక దేశం, ఒక అమూల్ అంటూ ప్రధాని మోడీ సర్కారు చేసిన వ్యాఖ్యకు జేడీ(ఎస్) నేత  కుమారస్వామి చురకలు వేశారు.  ఒక దేశం, ఒక అమూల్, ఒక పాలు, ఒక గుజరాత్ అనేది కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానంగా మారిపోయిందంటూ ట్వీట్ చేశారు. దేశమంతా గుజరాతీమయం చేయాలనేది మోడీ లక్ష్యంగా కనిపిస్తోందనీ ,  ఆ లక్ష్య సాధన కోసం  కాషాయం పార్టీ ఎంతటికైనా దిగజారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.