కుక్కకేమి తెలుసు ఆయన అడిషనల్ కలెక్టరని!
posted on Apr 4, 2023 @ 8:45PM
ఇటీవల వీధి కుక్కల బారినపడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా తెలంగాణలో వీధి కుక్క కాటుకు గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఓ ఘటనలో సాక్షాత్తు అదనపు కలెక్టరే కుక్క కాటు బాధితుడయ్యారు. అవును సిద్ధిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్క కాటుకు గురయ్యారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్ నే కుక్క కరవడంతో రంగంలోకి దిగారు.
రాత్రి సమయంలో క్వార్టర్స్ వద్ద వాకింగ్ చేస్తున్న అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపై వీధికుక్క దాడి చేసింది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు చెబుతున్నారు.
కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు దిగారని స్థానికులు అంటున్నారు.
అయినా మన పిచ్చి కానీ తాను కరిచింది అదనపు కలెక్టర్ ను అని ఆ కుక్కకేం తెలుసు. పిచ్చి జనానికి తెలుసు ఆయన కలెక్టర్ అని... పాపం ఆ శునకాని ఏం తెలుసు? అని సెటైర్లు వేస్తున్నారు.