పవన్ హస్తిన పర్యటన..జరిగిందేమిటి? ఒరిగిందేమిటి?
posted on Apr 5, 2023 @ 1:45PM
జనసేనాని హస్తిన పర్యటన పై ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన ఉత్కంఠ ఆయన హస్తినలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలతో చప్పున చల్లారిపోయింది. హఠాత్తుగా రాజస్థాన్ హాలీడే ట్రిప్ నుంచి అటు నుంచి అటే హస్తినలో వాలిన జనసేన బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీ ధరన్ తోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. ఆ తరువాత మంగళవారం (ఏప్రిల్ 4) రాత్రి హస్తినలో విలేకరులతో మాట్లాడారు.
ఆయన మాటలలో ఒక్కంటే ఒక్క కొత్త మాట లేదు. గత కొన్నాళ్లుగా ఆయన చెబుతున్నదే మరోసారి చెప్పారు. ఏపీలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడమే తన లక్ష్యం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యం కూడా అదేనని ఉద్ఘాటించారు. కానీ బీజేపీ లక్ష్యం ఏమిటన్నది బీజేపీ నేతల నోటి నుంచే చెప్పించి ఉంటే ఆ ఎఫెక్ట్ మరింతగా ఉండేది. జనసేన అధినేతగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ తరువాత ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల ముందుకు వచ్చి ఏపీలో తమ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే అని ప్రకటించి ఉంటే.. ఆ మాటకు విశ్వసనీయత మరింతగా ఉండేది. అలా కాకుండా పవన్ కల్యాణ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి బీజేపీ లక్ష్యాన్ని ప్రకటించడమేమిటని పరిశీలకులే కాదు.. జనసేన శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి.
ఏపీలో జగన్ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ గత కొంత కాలం నుంచీ చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో ఏపీలో తాను మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులతో తనకు అంతగా పొసగడం లేదని కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. అదే సమయంలో కేంద్రంలోని మోడీ, అమిత్ షాలపై తనకు అపారమైన గౌరవం, నమ్మకం ఉందనీ, ఏపీలో రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించి, అధికార వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చేలా వారిని ఒప్పిస్తాని పవన్ కల్యాణ్ గతంలో పలు మార్లు చెప్పారు. అయితే అటువైపు నుంచి అంటే బీజేపీ నుంచి మాత్రం పవన్ కు అటువంటి గౌరవం మర్యాదా దక్కుతోందా? అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.
బీజేపీ ఏపీ విషయంలో అటు వైసీపీ అధినేత జగన్ తోనూ.. ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ తోనూ ఆడుతున్నది పొలిటికల్ గేమ్ మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు, అటు జాతీయ స్థాయి నేతలూ కూడా పవన్ కల్యాణ్ విషయంలో డబుల్ గేమ్ అడుతున్నారా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇంతకీ పవన్ కల్యాణ్ ను హస్తినకు పిలిపించుకుని చర్చించిన విషయం కర్నాటక ఎన్నికలపైనేని అంటున్నారు.