బండి సంజయ్ అరెస్ట్.. భగ్గుమన్న బీజేపీ శ్రేణులు
posted on Apr 5, 2023 @ 10:07AM
ఓ వంక టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మరీన నేపథ్యంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నడుమ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ ను మంగళవారం (మంగళవారం) రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజికి బండి సంజయ్ అరెస్టుకు సంబంధం ఉందా లేదా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నమనేది చెప్పకుండానే పోలీసులు బలవంతంగా ఇంట్లో చొరబడి, ఎంపీని బలవంతగా తీసుకు పోయారని బండి సంజయ్ సతీమణి మీడియాకు తెలిపారు.
కాగా బండి సంజయ్ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు భారీగా మోహరించారు. అదే సమయంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారిలో కరీంనగర్ అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, సీఐలు లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి, నటేష్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రెండువైపులా తోపులాట జరిగాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయినప్పటికీ ఇవన్నీ ముందే ఊహించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం తమ పనిచేసుకుపోయారు.
బండి సంజయ్‌ని అరెస్టు చేసి.. హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ని తిమ్మాపూర్ మీదుగా తరలిస్తుండగా పోలీస్ వెహికిల్‌కి మార్గమధ్యలో రిపేర్ వచ్చింది. పోలీసులు ఆయన్ని మరో బండిలోకి ఎక్కించారు. ఐతే.. బండి సంజయ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నదీ పోలీసులు.. కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. బుధవారం బండి సంజయ్ అత్త (సంజయ్ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్ వచ్చారు. ఆ కార్యక్రమాల్లో ఉండగా.. పోలీసులు బలవంతంగా తీసుకు పోయారని బందువులు ఆరోపిస్తున్నారు.
కాగా తన అరెస్టుపై బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీఆర్ఎస్ లో భయం నిజం. మొదట నేను ప్రెస్‌మీట్ పెట్టకుండా నన్ను అడ్డుకున్నారు. తర్వాత నన్ను అర్థరాత్రి అరెస్టు చేశారు. తప్పులు చేస్తోందని దానిపై నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. నన్ను జైలుకు పంపినా.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపను అని బండి సంజయ్ ట్వీట్‌లో తెలిపారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి ఇంటిపై దాడి చేసి ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అంటే.. పోలీసులు హద్దు మీరి ప్రవర్తించినట్లే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తున్నారు. ఓ ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. అలాంటిది ఏమీ లేకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరించటం ఏంటని.. దీనిపై కోర్టుల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.
ఎంపీగా ఉన్న తనను నోటీసులు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటంపై.. ఎంపీ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వచ్చి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించినదీ, తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దురుసుగా లాక్కెళ్లిన తీరును.. ఫొటోలు, వీడియోలతో సహా లోక్ సభ స్పీకర్ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అగ్రనేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ శ్రేణులు మండిపోతున్నాయి. ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంపీ.. అంతే కాకుండా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తిని కారణాలు చెప్పకుండా అర్థరాత్రి.. ఇంటి మీదకు వచ్చి.. బలవంతంగా అరెస్ట్ చేయటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బండి సంజయ్ అరెస్టు విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ప్రశ్నాపత్రాల లీకేజీకీ, బండి సంజయ్‌కీ ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో ఓ ఎంపీని అరెస్ట్ చేయటంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా అర్థరాత్రి సమయంలో బండి సంజయ్‌ని ఇంటికి వచ్చి మరీ బలవంతంగా అరెస్టు చెయ్యడం బీజేపీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇది ఊహించని పరిణామంగా చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఏప్రిల్ బుధవారం (ఏప్రిల్ 5) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది.