కరోనా కాషన్.. జాగ్రత్తలు తప్పని సరి

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. 2019 నాటి పరిస్థితి మళ్లీ పునరావృతమౌతుందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ఇటీవలి కాలంలో రోజు వారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. అదే సమయంలో మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తొలి నుంచీ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి? పాజిటివిటీ రేటు ఎలా ఉంది? రికవరీ రేటు అంటూ ప్రకటనలు గుప్పించడంతో సరిపెట్టకుండా కోవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి విజృంభణపై అప్రమత్తమైన కేంద్రం కేవలం సూచనలు, హెచ్చరికలకే పరిమితమౌతోంది. ఇదే వ్యాప్తి తీవ్రత కొనసాగితే.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పవేమోనన్న ఆందోళనను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది కనుక అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోందన్న మాట అయితే వాస్తవమని అందరూ అంగీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే కరోనా డేంజర్ బెల్స్ మెగాయి.  అప్పట్లోనే అధికార వర్గాలు, వైద్య నిపుణులు కోవిడ్ జాగ్రత్తలు కొనసాగించడం తప్పని సరి అని  హెచ్చరికలు జారీ చేశాయి.  కేసుల  పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా కోవిడ్ కేసుల విజృంభణ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అప్రమత్తమైంది. థియోటర్లలో మాస్కులను తప్పని సరి చేసింది. మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమై కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా థియోటర్లు, కార్యాలయాలలో ఏసీల కింద కూర్చుని పని చేసే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే భౌతిక దూరం పాటించడం, శుభ్రతకు పెద్ద పీట వేయడం వంటి చర్యలు తీసుకోవాలి. 

తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీల జాతర? రెండో రోజూ టెన్త్ ప్రశ్న పత్రం లీక్

తెలంగాణలో ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్ష ఏదైనా. పేపర్ ఏదైనా, పోటీ పరీక్షలైనా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా ప్రశ్నపత్రం లీక్ అయి తీరాల్సిందే అన్నట్లుగా పరిస్థితి విరాజిల్లుతోంది. ఇటీవల టీఎస్పీఎస్పీ ప్రశ్న పత్రాల లీకేజీ సృష్టించిన సంచలనం ఇంకా కొనసాగుతుండగానే.. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ ఆ ప్రశ్న పత్రాల లీకేజీ మొదలైంది. తొలి రోజు సోమవారం టెన్త్ ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమైంది. ఇందుకు బాధ్యులుగా కొందరిపై చర్య తీసుకోవడమూ జరిగింది. పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు.. యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతలోనే మరో సంచలనం నమోదైంది. ఈ సారి ఏకంగా ప్రశ్న పత్రాలు లీక్ కావడం కాదు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు మాయమయ్యాయి. ఎలాగంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల ప్రశ్నపత్రాలు మాయమయ్యాయి.   పరీక్షా కేంద్రం నుంచి ఓ ఆటోలో ఆన్సర్ పేపర్ల బండిల్స్ తరలిస్తుండగా..  పోస్టాఫీస్‌కు చేరుకునేలోపు అందులోంచి ఒక బండిల్ మిస్ అయింది. ఆ బండిల్‌లో దాదాపు 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఊట్నూరు మండల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇక మంగళవారం కూడా టెన్త్ పరీక్ష పత్రం లీకైంది. తొలి రోజు తెలుగు ప్రశ్న పత్రం లీకైతే.. రెండో రోజు హిందీ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభమై అరగంట గడిచిందో లేదో ప్రశ్నపత్రం వాట్సప్ లో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి అసలు  పరీక్షలు నిర్వహించే సత్తా ఉందా అని విపక్షాల ప్రశ్నిస్తున్నాయి టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షాలు  పరీక్ష పత్రాల లీకేజీ సాధారణమే అన్నట్లుగా ఆయన మాట్లాడారని విమర్శిస్తున్నాయి. ఆయన మాటలకు తగ్గట్టుగానే తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీ జాతర జరుగుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని విమర్శిస్తున్నారు.  

జగన్ తానే మారెనా.. తీరే మారెనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందా అంటే.. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగం విన్న వారంతా ఔననే సమాధానమిస్తున్నారు. వైనాట్ 175 నుంచి గ్రాఫ్ పెంచుకోకపోతే గెలుపు సులభ సాధ్యం కాదు అనే స్థాయికి ఆయన ధీమా దిగజారిపోయిందంటున్నారు.  దీంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలు, నాయకులను బుజ్జగించడానికి త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ ఇంత కాలం ఎమ్మెల్యేలకు, మంత్రులకు హెచ్చరికలు మాత్రమే జారీ చేసిన జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇటీవలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ విజయానికి తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగే కారణమంటూ కనీసం వారి సంజాయిషీ కూడా కోరకుండా సస్పెన్షన్ వేటు వేసిన ఆయన ఇప్పుడు స్వయంగా తన నోటితోనే పార్టీలో దాదాపు 60 మంది వరకూ ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందన్న విషయాన్ని వెల్లడించారు. సరే ఇది విపక్ష తెలుగుదేశం ఆరోపణగా చెప్పారనుకోండి అది వేరే విషయం. అయినా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉందని ఆయన అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందని అందుకు ఆయన ఎవరినీ వదులు కోవడం తన అభిమతం కాదన అనడంతోనే తేటతెల్లమైందని పరిశీలకులు అంటున్నారు.   చాలాకాలం తర్వాత జగన్‌ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎలాంటి క్లాసులూ, హెచ్చరికలు, బెదరింపులూ లేకుండా.. బుజ్జగింపు మాటలు, బతిమలాడుకునేలా జగన్ ప్రసంగం ఉండటంతో జగన్ లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించిందనీ,   గతంలో పనిచేయకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, మీకు అనేక అవకాశాలు ఇచ్చానని   బెదిరింపు ధోరణితో మాట్లాడిన జగన్‌.. ఈసారి మాత్రం చాలా సాత్వికంగా, ప్రశాంతంగా ‘నేను మీ వాడిని’, ‘మిమ్మల్ని మళ్లీ గెలిపించడమే నా లక్ష్యం’ అంటూ మాట్లాడటంపై ఎమ్మెల్యేలలోనే ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు తమ అధినేత దిగి వచ్చాడన్న చర్చ మొదలైంది. ఇక ఎమ్మెల్యేలు ఏళ్ల తరబడి చేస్తున్న పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  అన్నిటికీ మించి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన సిట్టింగులందరికీ టికెట్లిస్తానని చెప్పారు.  ఈ సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు జగన్ దిగి వచ్చేశారనీ, గతంలోలా ఆయనలో వైనాట్ 175 ధీమా ఇసుమంతైనా కనిపించడం లేదనీ, బొటాబొటీగానైనా మెజారిటీ స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తే అదే పదివేలు అన్న భావన వ్యక్తమైందని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్ల తరువాత ఆయనకు ఎమ్మెల్యేల విలువ ఏంటో తెలిసినట్లుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.   

ఏపీపై కేసీఆర్ లవ్వు.. పార్టీ విస్తరణ కోసమేనా?

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించిన రెండు రోజుల  బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైజాగ్ లో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్  చేయడం వెనుక..స్టీల్  ప్లాంట్ ను కాపాడుకోవాలనే ఆత్రం కన్నా..  తమ పార్టీని ఏపీలో  విస్తరించాలన్న ఆరాటమే ఎక్కువగా  కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా కేసిఆర్ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆ సభను ఈ నెలలోనే అంటే ఏప్రిల్ లోనే నిర్వహించేందుకు ఏపీ బీఆర్ఎస్ అప్పుడే  ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఇది   స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కాదు.. ఏపీలో  పార్టీ విస్తరణకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు సంఘీభావంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు  చెప్తున్నాయి.  స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ భాగస్వామ్యం అయ్యింది. కేంద్రం లోని మోడీ సర్కార్ అన్ని ప్రభుత్వరంగ సంస్థలను తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతోందని ఇటీవల కేసీఆర్, కేటీఆర్ అన్ని వేదికలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాతే వైజాగ్లో పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని భావించినా ఆ తరువాత మళ్లీ ఇప్పటి దాకా కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్..  నాందేడ్ జిల్లాలో సభలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఏపీలో పార్టీ ప్రస్థానం షురూ చేసే  ప్ర యత్నాల్లో ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్ల ను ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్, ఇతర నేతలకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ నెలలోనే కేసీఆర్ సభ ఉండే అవకాశముందని అంటున్నారు. తెరాస బీఆర్ఎస్ గా  మారిన తర్వాత కేసీఆర్ ఏపీపైనే ఫోకస్ పెట్టారు. పలువురు నాయకులను చేర్చుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే, దీనికి ఏపీ ఎమ్మెల్యేలు, ఇతరుల నుంచి పెద్దగా  రెస్పాన్స్ రాలేదు. ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతోంద నే ప్రచారం సాగినా అది వాస్తవం కాదని వెంటనే తేలిపోయింది. దీంతో కేసీఆర్ ఏపీలో పార్టీ విస్తరణ ప్రయత్నాలను తగ్గించారనే ప్రచారమూ జరిగింది. అయితే, ఇప్పుడు ఏపీలో పార్టీ విస్తరణ కు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుంబిగించారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. గద్వాల జిల్లాతో పాటు ఏపీలోని ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రభావం చూపగల చల్లా వెంకట్రామిరెడ్డికి  ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా అదే కారణమని అంటున్నారు.  అయితే  ఏపీలో మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని  వైసీపీ,  గత ఏడాది ఒంగోలు మహానాడు సక్సెస్ తర్వాత ..  జనంలో పాపులారిటీ క్రమంగా పెంచుకుంటున్న  తెలుగుదేశం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా  చూస్తాం అంటూ జనసేన ఇలా ఏపీలోని మూడు ప్రధాన పార్టీల హోరులో  బీఆర్ఎస్ వెంట నడిచేవారెవరుంటారన్న సందేహాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోలవరం ముంపుపై తక్షణం సర్వే.. ఏపీకి కేంద్ర జల సంఘం ఆదేశం

 పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే  సర్వే చేపట్టాలని కేంద్ర జల సంఘం ఏపీ సర్కార్ ను ఆదేశించింది. ఎలాంటి  కాలయాపన చేయకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ సర్వేను పూర్తిచేయాలంటూ ఢిల్లీలో సోమవారం (ఏప్రిల్ 3) జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర జలసంఘం అల్టిమేటం జారీ చేసింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తు, తద్వారా తలెత్తే ముంపు సమస్య సహా అనేక ఇతర సాంకేతికాంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాల మేరకు ఇందులో   కేంద్ర జల సంఘం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో రెండు సమావేశాలు నిర్వహించింది. కాగా గత కొంత కాలంగా పోలవరం ముంపు సర్వేను వేగరమే చేపట్టాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం  ముంపుతో పాటు అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిషా, చత్తీష్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించడంతో సీడబ్యూసీ రెండు సార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం అయ్యింది. రెండు సమావేశాల్లో కూడా పోలవరం ముంపుపై జాయింట్ సర్వేకు తెలంగాణ పట్టుబట్టింది. తాజాగా మూడో సారి కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 3) జరగిన సమావేశంలో ఇందులో ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  పోలవరం ముంపు సర్వే నిర్వహణను ఏపీ ప్రభుత్వం తాత్సరం చేస్తుండటాన్ని తెలంగాణ తప్పుపట్టింది. గతంలోనే సీడబ్ల్యూసీ ఆదేశాలు జారీ చేసినా ఏపీ సర్వే ప్రారంభించకపోవడాన్ని ఎత్తి చూపింది. 

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

జార్ఖండ్ లో జరిగిన భారీ ఎన్ కౌంట‌ర్ లో ఐదుగురు మావోలు హ‌త‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు గాయ‌ప‌డ్డారు.  పలాము- ఛాత్రా జిల్లాల్లోని సరిహద్దులో నక్సల్స్ దాగి ఉన్నారన్న సమాచారంతో ఝార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన కూంబింగ్ సందర్భంగా  ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోల మృతదేహాలతోపాటు, పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. మృతుల్లో రూ. 25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్   ఉన్నట్టు చెబుతున్నారు. మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. గాయపడి తప్పించుకున్న మావోల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. అలాగే నక్సలైట్లకు సహాయపడిన వారి కోసం కూడా కూంబింగ్ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.  కాగా ఘటనా స్థలం నుంచి  పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో రెండు ఏకే-47 రైఫిళ్లను కూడా ఉన్నట్లు తెలుస్తోంది.   గత కొంత కాలంగా పోలీసు చర్యల కారణంగా జార్ఖండ్‌ లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని చెబుతున్నారు. నక్సల్ సమస్యను పూర్తిగా అరికట్డడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

చెప్పుల వేటలో రైల్వే పోలీసులు

మీరెపుడైనా రైలు ఎక్కుతూ చెప్పులు జార విడుచుకున్నారా? ఖంగారు పడకండి.. రైల్వే పోలీసులు వాటిని వెతికి తెచ్చి మీకిస్తారు. సమాన్లు, ఇతర విలువైన వస్తువులు పోతే దొరుకుతాయో లేదో తెలియదు కానీ, చెప్పులు మాత్రం కచ్చితంగా తిరిగి దొరుకుతాయి. నమ్మకం లేదా? కాజీపేటలో అలాగే జరిగింది. పోయిన చెప్పును సొందదారుడికి రైల్వే పోలీసులు భద్రంగా అందించారు. కాజీపేట రైల్వే పోలీసులు ట్వీట్ ద్వారా అందిన ఫిర్యాదుపై స్పందించారు. ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే.. కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కే హడావుడిలో తన చెప్పు జారిపడిపోయిందని ఓ ప్రయాణీకుడు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశాడు. వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. పడిపోయిన చెప్పును వెతికి మరీ ఆ ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడికి అప్పగించారు.  రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం కాకతీయ రైలు ఎక్కుతున్న క్రమంలో అతని చెప్పు జారి పడిపోయింది. వెంటనే  రైల్వే బోర్డు ట్విట్టర్ ఖాతాలో ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడి సమస్యను పరిష్క రించాలని రైల్వేబోర్డు అధికారులు... ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు పడిపోయిన చెప్పును శనివారం రాత్రి ప్రయాణికుడికి అప్పగించారు.  పోలీసులంటే కర్కసత్వం, కాఠిణ్యం, మొరటుతనం మాత్రమే గుర్తుకొస్తాయి.. ఫ్రెండ్లీ పోలిసింగ్ కు ఇది ఉదాహరణ అని కొందరంటుంటే.. చెప్పు పోయిందంటే స్పందించారు. మరి రైల్వే స్టేషన్లలో మిగిలిన చోరీల సంగతేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చైన్ స్నిచింగ్ లు, పిక్ పాకెటింగ్ లు రైల్లే స్టేషన్లలో కామనైపోయాయి కదా, మరి వాటిపై కూడా స్పందించడి అంటున్నారు. 

గిఫ్ట్ ప్యాక్ కు ఐ ప్యాక్ దాసోహం!

పేనుకు పెత్తనం ఇస్తే ... తలంతా గొరిగేసిందని సామెత. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-ప్యాక్‌) వ్యవహారం కూడా అలాగే వుంది. నిజానికి  ఐ ప్యాక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్  తెలిస్తే ఐ-ప్యాక్ తెలిసినట్లే. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో  వైసీపీని గెలిపించడంలో ఐ  ప్యాక్ కీలక భూమిక పోషించిందని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, అప్పటికీ ఇప్పటికీ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచీ చెడు అన్నిటికీ  ఐ  ప్యాక్ సర్వేలు, సలహాల మీదనే ఆధారపడతారనేది జగమెరిగిన సత్యం. ప్రశాంత్ కిశోర్  ఐ  ప్యాక్ నుంచి బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నా, ఆయన బృందం మాత్రం 2024 ఎన్నికల్లో  వైసీపీని  మరోమారు గెలిపించే లక్ష్యంతో  జగన్ రెడ్డి మహారాజ పోషణలో సర్వేలు చేస్తోంది. వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజక వర్గాల్లో ఐ  ప్యాక్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రతి నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి విజయావకాశాలు, మార్పులు చేర్పులు, ఇతర నియోజక వర్గాల్లో పార్టీ విజయావకాశాలపై విభిన్న కోణాల్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు జగన్ రెడ్డికి అందచేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగానే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారని, ఐ  ప్యాక్ సర్వే నివేదికల ఆధారంగానే జగన్ రెడ్డి టికెట్ కు టిక్  పెడతారని అందరికీ తెలిసి పోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఐ ప్యాక్‌ కీలకంగా మారింది. అధికార వైసీపీలో ఆ టీమ్‌ పాత్ర కూడా అంతే కీలకంగా ఉంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. నిజానికి, ఐ  ప్యాక్ సభ్యులకు   చాలా సిన్సియర్  గా సీరియస్  నిజాయతీగా  పనిచేస్తారనే పేరుంది. అయితే  ఏడడుగులు కలిసి నడిస్తే, వారు వీరవుతారు అన్నట్లు, నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు,నాయకులతో కలిసి పనిచేయడం వల్లనో ఏమో, ఐ – ప్యాక్ టీమ్ లో కొందరు అమ్యామ్యాలకు అలవాడు పడినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు లోబడి, నివేదికలను తారు మరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపుల మూటల ‘బరువు’ను బట్టి అభ్యర్ధుల బలాన్ని ఎక్కువచేసి  చూపుతున్నారని, అంటున్నారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ముఖ్యనేత  ఖాయంగా ఓడిపోతరాని ఐ ప్యాక్ సర్వేలో  స్పష్టంగా తేలింది. అయితే, సదరు ఎమ్మెల్యే ఐ  ప్యాక్ కు ఇచ్చిన క్యాష్ గిఫ్ట్ ప్యాక్ బరువుతో నివేదిక మారిపోయిందని అంటున్నారు. ఖాయంగా ఓడి పోయే సిట్టింగ్ ఖాయంగా గెలిచే ఎమ్మెల్యేల జాబితాలో చేరిపోయారని అంటున్నారు.  ఇది ఒక ఉదహరణ మాత్రమే, చాలా వరకు జిల్లాలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఐ-ప్యాక్‌ సర్వే సభ్యుల తప్పుడు నివేదికల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్న ఆందోళన కూడా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 8 జిల్లాల్లో ఇదే తరహాలో చేయి తడిపిన వారికి అనుకూలంగా నివేదికలను తయారు చేసి అధిష్టానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది జిల్లా సభ్యులు ఇచ్చిన తప్పుడు సర్వేలతో ఐ-ప్యాక్‌ రాష్ట్ర ప్రతినిధులు అవే నివేదికలను ప్రభుత్వ పెద్దలకు అందజేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటుండడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ బలహీన పడుతున్నదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్ తెచ్చుకునేందుకు కొందరు పెద్దలు ఐ  ప్యాక్ను ‘మ్యానేజి’  చేస్తునట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో సర్వేకు ఆదేశించిన సందర్భంలో కొన్ని ప్రాంతాలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బలహీనులుగా చిత్రీకరించి నివేదికలను తయారు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఐ ప్యాక్ నివేదికలను బైబిల్ కంటే పవిత్ర పత్రంగా భావిస్తున్నారని, పార్టీలోని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తెసుకోక పొతే, చేజేతులా ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అవుతుందని, పార్టీ పెద్దలు అంటున్నారు.

జగన్ నివాసంలో హెలిప్యాడ్ నిర్మాణానికి రూ.1.89 కోట్టా?.. ఇదేం జీవో జగనన్నా?

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆదాయన్ని కోల్పోయిందనీ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనీ తరచూ చెప్పే ఏపీ సీఎం జగన్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసమే  పన్నులు అనివార్యమయ్యాయని చెప్పుకొస్తోంది. ఆ క్రమంలో చెత్తను సైతం వదలకుండా.. దానిపైనా పన్ను వేసింది. ఈ పన్నుపై సర్వ్రతా విమర్శలు వెల్లువెత్తినా సర్కార్ ఇసుమంతైనా స్పందించలేదు. ఇన్ని విధాలుగా ప్రజలపై పన్నుల భారం మోపుతూ వస్తున్న ప్రభుత్వం.. పొదుపు విషయాన్ని మాత్రం పూర్తిగా మరచిపోయింది. ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనలకు సైతం ప్రభుత్వ వ్యయంతో ప్రత్యేక విమానాలను వినియోగిస్తోంది. తన నివాసానికి కూత వేటు దూరంలో సభలో పాల్గొనేందుకు సైతం రోడ్డు మార్గాన్ని ఎంచుకోరు. వ్యయం తడిసి మోపెడైనా హెలికాప్టర్ వాడాల్సిందే. అంతేనా ఇప్పడు మరో అడుగు ముందుకు వేసి సీఎం జగన్ తన నివాసంలో హెలిప్యాడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1.89 కోట్ల రూపాయిలు మంజూరు చేస్తూ... జీవో జారీ చేసింది.   ఆ సొమ్ములో హెలిప్యాడ్, దాని ఫెన్సింగ్ కోసం 40 లక్షల రూపాయిలు. హెలిపాడ్ వద్ద గార్డ్ రూమ్‌తోపాటు ఇతర సదుపాయాల కోసం 13.50 లక్షల రూపాయిలు.. ఇక సీఎం నివాసం వద్ద పర్మినెంట్   బారికేడింగ్ కోసం 75 లక్షల రూపాయిలు, జగన్ నివాసానికి సమీపంలో పోలీస్ బ్యారెక్, ఇతర సదుపాయాల కోసం 30 లక్షల రూపాయిలు.. సెక్యూరిటీ పోస్ట్, సెక్యూరిటీ గేట్స్, పోర్టబుల్ క్యాబిన్ కోసం 31 లక్షల రూపాయిలు వినియోగించనుంది.  అయితే  మంజూరుపై వైసీపీలోని ఒక వర్గం తీవ్రవంగా వ్యతిరేకిస్తోంది.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకతను పెంచుతుందని ఆ వర్గం అంటోంది.   ఈ సందర్భంగా ఇటీవల  జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ గతంలో అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో   ఏపీ విమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో.. అంటే 2016లో కేన్సర్ బారిన పడి వైద్యం కోసం 23 లక్షల రూపాయిలు వ్యయం చేశారు. ఆమె హోదాకు ఆ నగదు మొత్తం ప్రభుత్వమే  చెల్లించే వెసులుబాటు ఉన్నా.. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదని భావించి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించిన వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నివాసంలో హెలీప్యాడ్ నిర్మాణానికి రూ.1.89 కోట్లు మంజూరు చేయడం సబబు కాదనీ, నెటిజన్లు పంచుమర్తి అనూరాథను   చూసి నేర్చుకో జగనన్న అంటూ హితవు చెబుతూ సెటైర్లు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీలోని ఒక వర్గం అంటోంది.  మరోవైపు  పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే... తన నివాసంలో.. క్యాంపు కార్యాలయంలో.. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం.. అక్షరాలా 64 లక్షల రూపాయిలు ప్రజాధానాన్ని వినియోగించడంపై నాడే విమర్శలు వెల్లువెత్తాయని   గుర్తు చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారని.. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ససేమీరా అన్నారంటూ గతంలో మీడియాలో కథనాలు సైతం వచ్చాయనీ గుర్తు చేస్తున్నారు.  అయినా రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో.. ఏ మాసానికి ఆ మాసం.. నిధుల కోసం.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీకి.. తాడేపల్లికి వయా ముంబై ఆర్బీఐ కార్యాలయం చుట్టూ పర్యటిస్తుండడంతో ఆర్థిక శాఖ మంత్రి కాస్తా అప్పుల శాఖ మంత్రిగా మారిపోయిందని, అలాగే  తాము దాచుకొన్న నగదు సైతం జగన్ సర్కార్ వాడేసుకుందంటూ   ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు బహిరంగంగానే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు.   అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెలకు ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకొంటూ.. మరోవైపు ప్రత్యేక విమానాల్లో  చక్కర్లు కొడుతున్నారంటూ ఇప్పటికే  జగన్‌ వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర చర్చ  గట్టిగానే సాగుతోందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఇటువంటి  పరిస్థితుల్లో సీఎం తన నివాసంలో హెలీప్యాడ్ నిర్మాణానికి భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం ఎంత మాత్రం సబబు కాదనీ, ఆ జీవోను వెనక్కు తీసుకోవాలని సదరు వర్గం ప్రభుత్వంలోని అగ్రనేతలకు సూచిస్తోంది.  

విపక్షాలను ఏకం చేసిన రాహుల్ అనర్హత వివాదం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేజేతులా జాతీయ స్థాయిలో హస్తం పార్టీకి అండ దొరికేలా చేస్తోందా? బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరం పాటించలని భావిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ కు మద్దతుగా రోడ్లపైకి వచ్చేలా చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ పడికట్టు మాటలు మాట్లాడుతూ.. అన్యాపదేశంగా తమ వ్యతిరేకుల విషయంలో మాత్రమే చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, అస్మదీయుల విషయంలో కాదనీ విపక్షాలు భావించేలా బీజేపీ తీరు ఉందనీ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశంలో బీజేపీ యేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చింది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటూ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే బీజేపీని ఎంతగా వ్యతిరేకిస్తారో, అంతగా కాంగ్రెస్ నూ వ్యతిరేకించే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ..ఇలా దేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా జట్టు కట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అనర్హత రగడలో రాహుల్‌కు దాదాపుగా ప్రతిపక్షా లన్నీ అండగా నిలబడ్డాయి.జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల స్థాయిలో కూడా రాహుల్ కు మద్దతు పెరుగుతోంది.  ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ వినా, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలన్నీ రాహుల్ కు అండ, మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. విద్యార్హతలను బయటపెడదాం అనే ఉద్యమానికి పిలుపు నిచ్చింది.  నిన్న మొన్నటి వరకూ బీజేపీయేతర పక్షాలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీలన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీ అనర్హత వేటుకు నిరసనగా ఏకతాటిపైకి వచ్చాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పిలుపు మేరకు గత నెల 27న జరిగిన నిరసన ప్రదర్శనల్లో   17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయా ల్లో కాంగ్రెస్‌ కు దూరంగా ఉండే  తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నది.   దేశంలో  రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మొగిలిన పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ దూకుడుగా ఉంటుంది.   అయితే ఒక్క లక్షద్వీప్‌కు చెందిన మహమ్మద్‌ ఫైజల్‌ మినహా ఎవరిపైనా ఇటీవలి కాలంలో అనర్హత వేటు పడలేదు. తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య ప్రజల్లో రాహుల్‌పై సానుభూతి పెరి గింది. రాహుల్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ టార్గెట్‌ చేసిందన్న అభిప్రాయం జనబాహుల్యంలో కలిగింది. దీనిని గుర్తించే సైద్ధాంతికంగా కాంగ్రెస్‌తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం  రాహుల్‌కు అండగా నిలుస్తున్నాయి. మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనర్హత వివాదమే కీలకాంశం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా.. పార్టీపై జగన్ పట్టు సడలిందా?

వైసీపీ బండారం బయటపడిపోయింది.   పార్టీలో అసమ్మతి, అసంతృప్తి తారస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని ఇంత కాలం వైసీపీ జగన్ గుప్పెట్లో మూసి కప్పి పెట్టినా ఇప్పుడా బండారం బయటపడిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 3) నిర్వహించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, ప్రాంతీయ సమన్వయ కర్తల సమావేశాలని పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడమే ఇందుకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా డుమ్మా కొట్టిన వారిలో జగన్ కు గట్టి మద్దతుదారులుగా ముద్ర పడిన కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కూడా గైర్హాజరయ్యారు. అలాగే మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, విడదల రజని తదితరులు సైతం డుమ్మా కొట్టారు.  అదే విధంగా  సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ భేటీలో కనిపించలేదు.  ధర్మాన ప్రసాదరావు ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నా ఆ మాటలు పెద్దగా నమ్మదగ్గవిగా లేవని పార్టీ శ్రేణులే అంటున్నారు. ఇక మంత్రి బుగ్గన అయితే కోవిడ్ బారిన పడటం వల్ల సమావేశానికి రాలేకపోయారని అంటున్నారు. విడదల రజని త్వరలో తన నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉండి రాలేదని చెబుతున్నారు. వీరే కాక మరి కొందరు కూడా ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎవరికి వారు ఏవేవో కారణాలు చెబుతున్నా, ఒక్క బుగ్గనకు తప్ప మరెవరికీ ఈ సమావేశానికి గైర్హాజరవ్వడానికి క్రెడిబుల్ కారణాలు లేవనే పరిశీలకులు అంటున్నారు.   మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులలో విస్పష్టంగా బయటపడుతున్న అసమ్మతి దెబ్బకు జగన్ దిగి వచ్చారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేలూ, సమన్వయ కర్తలూ, నియోజకవర్గ ఇన్ చార్జిల సమావేశంలో ఆయన స్వరం పూర్తిగా మారిపోయింది. గతంలో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం సమీక్షలలోలా ఈ సారి ఆయన నోటి వెంట హెచ్చరికలు రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు లేవు. రుసరుసలు లేవు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లివ్వను జాగ్రత్త అన్న బెదరింపులు లేవు. అన్నిటికీ మించి టోన్ మారింది. హెచ్చరికల నుంచి బుజ్జగింపులకు దిగి వచ్చారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి, ధిక్కారం ఇవన్నీ విపక్షాల దుష్ప్రచారమన్నారు. ఎన్నికల సంవత్సరం కనుక మరింత కష్టపడి చేయాలని ఒక విధంగా బతిమలాడుతున్న స్వరంతె చెప్పారు. విపక్షాల ఉచ్చులో, వ్యూహంలో పడొద్దన్నారు. 60 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి రగులుతోందన్నది పూర్తిగా దుష్ప్రచారం అని చెప్పుకున్నారు. గడపగడపకూ బ్రహ్మాండంగా సాగుతోందనీ, అంతా చక్కగా పాల్గొంటున్నారనీ కితాబిచ్చారు.  ముందస్తు ఎన్నికలనీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనీ ఈ సమావేశానికి ముందు పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సమాచారం అంతా ఉత్తుత్తిదేనని జగన్ ఈ సమావేశం ద్వారా తేల్చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందనీ, ఈ కాలంలో కష్టించి పని చేసి ప్రభుత్వ, పార్టీ గ్రాఫ్ పడిపోకుండా చూడాలని ఎమ్మెల్యేలను కోరారు.  ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు పార్టీకీ, ప్రభుత్వానికీ ఎలాంటి ఎదురు దెబ్బే తగలలేదని, బ్రహ్మాండంగా 17 స్థానాలలో గెలిచామనీ, ఓడింది కేవలం నాలుగు స్థానాలలో మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జగన్ ప్రసంగం, ఆయన తీరు పార్టీ నాయకులు, శ్రేణులనే కాదు, పరిశీలకులను సైతం నివ్వెరపరిచింది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు. అత్యంత కీలకం అని చెబుతూ జగన్ సోమవారం (ఏప్రిల్ 3) నిర్వహించిన సమావేశానికి పలువురు డుమ్మా కొట్టారు. డమ్మా కొట్టిన వారిలో ఎక్కువ మంది పార్టీకి కానీ, అధినేతకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరయ్యారు. దీంతో జగన్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేననీ, ఆయనకు పార్టీపై పట్టు పూర్తిగా సడలిపోయిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీలో అసమ్మతి మరింత పెచ్చరిల్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.  

ఏపీ వైఫల్యాలను ఎండగట్టడమే తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు వ్యూహమా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఫల్యాలను చూపి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు వ్యూహాలను పన్నుతోందా? జగన్ సర్కార్ వైఫల్యం వల్లే, కేంద్రాన్ని నిలదీయలేని బలహీనతే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోందని, కేంద్రానికి జగన్ తొత్తులా మారడం వల్లే ఆ రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చిందని ఎత్తి చూపి రాష్ట్రంలో పరపతి పెంచుకోవాలని తాపత్రేయపడుతోందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషణలు చేస్తున్నారు. అందుకే కేటీఆర్ తరచుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేమి గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ అథారిటీగా అమరావతి అభివృద్ధి చెంది ఉండేదనీ.. కానీ రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారిన తరవాత అమరాతి అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అదే సమయంలో తెలంగాణలో రూరల్ రింగ్ రోడ్లను సైతం అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పుుకొచ్చారు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ గళమెత్తారు. ఆంధ్రుల హక్కు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో గట్టి పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ ఏపీ శాఖకు పిలుపునిచ్చారు.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాల్సిన ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. వైసీపీ ఎంపీలు విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటం లేదన్నారు ఆయన మాటలను ఎవరైనా సరే ఏపీలో సర్కార్ కేంద్రానికి అడుగులకు మడుగులొత్తుతోందనీ, ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కేంద్రాన్ని గట్టిగా ఎదుర్కొటోందనీ, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలనూ, తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ చేసిన అన్యాయాన్నీ గట్టిగా ప్రశ్నిస్తోందనీ చెప్పుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలంగాణలో పార్టీకి ప్రజాబలం కూడగట్టడంతో పాటు, విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమెత్తడం ద్వారా బీఆర్ఎస్ ఏపీలో కూడా గట్టి పునాది ఏర్పరుచుకునేలా కేటీఆర్ తీరు ఉంది. ఇప్పటి వరకూ ఎప్పుడో అడపాదడపా తప్ప ఏపీలోని జగన్ సర్కార్ తో సఖ్యత కోసమే ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో  జగన్ వైఫల్యాలే తెలంగాణలో తమకు ప్రయోజనం చేకూరుస్తాయన్న భావనకు వచ్చారు. అందుకే సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏపీలోని జగన్ వైఫల్యాలను తెలంగాణ గడ్డ వేదికగా గట్టిగా ఎండగడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ జగన్ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా, తెలంగాణలో ప్రగతిని ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వ ఘనతను చాటుతున్నారు.  

తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్?!

పేపర్ లీకులు తెలంగాణను అతలాకుతలం చేసేస్తున్నాయా? టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం ఇంకా సద్దు మణగక ముందే.. తాజాగా టెన్త్ పరీక్ష పత్రం లీకవ్వడం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో సోమవారం (ఏప్రిల్ 3) నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.  తొలి రోజు పరీక్ష పత్రం పరీక్ష ప్రారంభానికి ముందే లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభానికి కొద్ది సేపు ముందే వాట్సప్ లో ప్రశ్న పత్రం లీకైందని అంటున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షా పత్రం బయటకు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.   టీఎస్పీఎస్సీ  ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం లో ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఆ లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్నపత్రాల లీకేజీలో తలనొప్పులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సర్కార్ కు ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అవ్వడం మరింత ఇబ్బందికర వ్యవహారం అనడంలో సందేహం లేదు.  టెన్త్ పేపర్ లీకేజీపై జిల్లా   విద్యాధికారి పరీక్ష ముగిసిన తరువాత ప్రశ్నాపత్రం మొబైల్ ఫోన్లలో వచ్చింది కానీ, లీక్ కాలేదని వివరించారు. 

పేపర్ల లీకేజీపై రాష్ట్రపతి ముర్ముకు లేఖ

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు బీఆర్ఎస్ సర్కార్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారం భారత రాష్ట్రపతి వద్దకు చేరింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంపై  బీఎస్పీ తెలంగాణ నేత  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.   టీఎస్‌పీఎస్సీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ పాత్రను బహిర్గతం చేయడం కోసం సీబీఐ విచారణ చేయాలని  తాను రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం (ఏప్రిల్ 24)న ట్వీట్ చేశారు.  అలాగే ప్రస్తుత టీఎస్పీఎస్సీ కమిషన్ ను బర్త్ రఫ్ చేయాలని కూడా తానా లేఖలో రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు.   అంతే కాకుండా టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజిపై  అందరూ   రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్‌కు చేతకాదని తేలిపోయిందని.. బీఎస్పీ అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించి, పారదర్శకంగా భర్తీ చేస్తామని ప్రవీణ్ కుమార్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. 

అమిత్ షా, నడ్డాలతో పవన్ భేటీ.. దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెనుమార్పులు జరగనున్నాయా? పొత్తుల విషయంలో ఒక స్పష్టత రానుందా? బీజేపీ అటా ఇటా అన్న డైలమా నుంచి బయటపడుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నాయి. అందుకు తార్కానంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలుగుదేశం నేతలతో భేటీని చూపుతున్నారు. అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా,   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం (ఏప్రిల్ 3)భేటీ కానుండటం కూడా ఏపీలో పొత్తల విషయంలో బీజేపీలో కదలిక వచ్చిందనడానికి తార్కాణంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఆదివారం రాత్రి (ఏప్రిల్ 3) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన అమిత్ షా, నడ్డాలతో భేటీ అవుతారన్న కన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ, ఏ సమయంలో వారితో బేటీ ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు. ఒకే సారి వారిరువురితో భేటీ అవుతారా? విడివిడిగా భేటీ అవుతారా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.  హస్తిన పర్యటనలో పవన్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.  ఇలా ఉండగా బీజేపీ పెద్దల పిలుపు మేరకే పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లినట్లుగా చెబుతున్నారు. కుటుంబంతో వెకేషన్ కు రాజస్థాన్ వెళ్ళిన పవన్ కల్యాణ్ అక్కడి నుంచే నేరుగా హస్తిన చేరుకున్నారు.   ఏపీలో తెలుగుదేశంతో జనసేన ఇప్పటికే పొత్తకు నిర్ణయించుకుందన్న వార్తలు బలంగా వినవస్తున్నాయి. అందుకు తగినట్టుగానే పవన్ కల్యాణ్ కూడా పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తనకు పెద్దగా సఖ్యత లేకపోయినా ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వాన్ని ఏపీలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఒప్పిస్తానని కూడా పవన్ గతంలో ఒకసారి చెప్పారు. ఇప్పుడు స్వయంగా బీజేపీ అధిష్ఠానం ఆయనను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ఏపీలో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడబోతున్నాయా అన్న చర్చకు తెరలేపింది. అలాగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ రాష్ట్రంలో తెలుగు వారి ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాలలో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయాల్సిందిగా కోరేందుకే బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కల్యాణ్ తో భేటీ అవుతోందన్న చర్చ కూడా వినవస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో అమిత్ షా, నడ్డాలతో భేటీ కానుండటం కచ్చితంగా ఏపీ రాజకీయాలలో కీలక మలుపునకు, పరిణామానికి సంకేతమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధమవుతోందని ఇప్పటికే అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలను పవన్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీల మధ్య ప్రస్తుతం పొత్తు ఉన్నప్పటికీ, రెండు పార్టీలు కలిసి పనిచేయడం మాత్రం జరగడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన అభిమానులు ఓటు వేయలేదని బీజేపీ నేత మాధవ్ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే భేటీలతో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణేనా? ఎవరు ఇన్.. ఎవరు ఔట్?

వైసీపీ అధినేత తాను టెన్షన్ పడటమే కాకుండా, పార్టీ మొత్తాన్నీ టెన్షన్ లో పడేశారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయంతో కంగుతిన్న జగన్ ఇక  పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల నాటికి బలమైన టీమ్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. కొందరేమో క్యాబినెట్ పునరవ్యవస్థీకరణ అంటున్నారు. మరి కొందరేమో ఏకంగా అసెంబ్లీ రద్దే అంటున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలతో సోమవారం (ఏప్రిల్ 3) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలలోనే కాదు, పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర టెన్షన్ ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ శ్రేణుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం లేదనీ, తన కేబినెట్ పునర్వ్యవస్థీకరించి.. నష్ట నివారణ చర్యలను చేపడతారని జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు అంటున్నారు. అందులో భాగంగా కొందరు మంత్రులకు, శాఖాపరంగా పట్టు సాధించడంలో విఫలమైన వారూ, అలాగే పార్టీ పరంగా సమన్వయం చేసుకోవడంలో పెద్దగా శ్రద్ధ పెట్టని వారిని తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చే ఉద్దేశంలో జగన్ ఉన్నారని అంటున్నారు.  అలాగే సామాజిక న్యాయం విషయంలో కూడా ఈ సారి జగన్ పెద్ద కసరత్తే చేశారని అంటున్నారు. తన కేబినెట్ లో ఇప్పటి వరకూ అవకాశం లభించని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.   కొత్త కేబినెట్ లోకి చేరే వారిలో పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. గోదావరి జిల్లాలలో గట్టి పట్టు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, అలాగే నెల్లూరు జిల్లాలో రెడ్డి సమాజిక వర్గంలో అసంతృప్తిని తగ్గించేందుకు అదే జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అవకాశం కల్పించాలని జగన్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  ఇక గత కేబినెట్ లో కీలకంగా వ్యవహరించి ఈ తరువాత ఉద్వాసనకు గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నానిలకు మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు.  ఇక ఉద్వాసనకు గురికాబోతున్న వారిలో పని తీరు సంతృప్తికరంగా లేని  కాకాణి, సురేష్, మేరుగ నాగార్జున, తానేటి వనిత, గుమ్మలూరు జయరాం, తదితరుల పేర్లు వినవస్తున్నాయి.  మొత్తానికి జగన్ ఎమ్మెల్యేలూ, సమన్వయకర్తల సమావేశం పార్టీలో టెన్షన్ కు కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కమలం గూటికి నితీష్?.. ఎప్పుడంటే..?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  మళ్ళీ కమలం గూటికి చేరాలని భావిస్తున్నారా? ఆయన చూపు బీజేపీవైపు మళ్లిందా? అంటే బీహార్ రాజకీయాలను నిశితంగా రాజకీయ పరిశీలకులు  వరకు అవుననే అంటున్నారు.  కొద్ది నెలల క్రితం కమలం చేయి వదిలి, లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ) సారథ్యంలోని మహా కూటమితో జట్టు కట్టిన జేడీయు అధినేత నితీష్ కుమార్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతున్న నేపధ్యంలో  ఆర్జేడీతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే నిర్ణయానికి వచ్చారని అందుకే అసెంబ్లీఎన్నికలలోగా మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు  అంటున్నారు.   నిజానికి, ఎన్నికల వ్యూహకర్త, బీహార్ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అడుగులు వేస్తున్న, ప్రశాంత్ కిషోర్ అయితే ఎప్పటి నుంచో ఈ మాట చెబుతున్నారు. ఎప్పటికైనా నిరీష్ కుమార్ మళ్ళీ బీజేపీ గూటికి చేరటం ఖాయమని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించారు. కాగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకంగా బహిరంగ వేదికల నుంచే నితీష్ కుమార్   స్నేహ హస్తం చాచుతూ పంపిన సందేశాలను బయట పెట్టారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలోని  బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో మళ్లీ చేరుతామంటూ జేడీయు నాయకులు తమకు సంకేతాలను పంపిస్తున్నారని అమిత్ షా వెల్లడించారు. అయితే ఎన్డీఏలో చేరికకు జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని, షా  చెప్పారనుకోండి అది వేరే విషయం. అదే సమయంలో అమిత్ షా 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, మోడీనే మూడవసారి ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, 2024 ఎన్నికల తరువాత నితీష్ కుమార్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. కాగా  బీహార్ లో పర్యటిస్తున్న కేంద్ర ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తాయరైందన్నారు.  రెండురోజుల క్రితం  శ్రీరామ నవమి పండగ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో అల్లర్లు చెలరేగిన నవడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. శాంతి భధ్రతలను నెలకొల్పే విషయంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చించి ఏ మాత్రం ఉపయోగం లేదని అమిత్ షా అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతున్నామని ప్రకటించారు. అల్లర్లు చెలరేగిన ససారం పట్టణానికి తాను వెళ్లాలేని  దురదృష్టకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పారు.   బిహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిహార్‌లో శాంతి స్థాపన ఎలా సాధ్యమౌతుందని అమిత్ షా అన్నారు.   2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి కావాలని నితీష్ కుమార్ ఇప్పటి నుంచే కలలు కంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు.   రాజకీయ పరిశీలకులు మాత్రం ఇతర పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, జేడీయు, ఆర్జేడీ మధ్య పొత్తు అసెంబ్లీ ఎన్నికల(2025) వరకు కొనసాగడం కష్టమే అంటున్నారు.  లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని ఆ పరిణామాల నేపధ్యంలో బీహార్ లో ఆర్జేడీ, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలుగా నిలుస్తాయని, అదే విధంగా జేడీయు కనుమరుగై పోతుందని విశ్లేషిస్తున్నారు. 

జగన్ ఎమ్మెల్యేలకు ఏం చెప్పబోతున్నారు?

 ఏపీ సీఎం, వైసీపీ అధినేత   జగన్ సోమవారం  తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం  అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షిస్తారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొంటారు. అన్నిటికీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో బాగా ప్రచారం అవుతున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ముందస్తు ఎన్నికలు తదితర అంశాలపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.  మరో వైపు జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, పార్టీపై జనంలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, వ్యతిరేకత తదితర అంశాలపై కేంద్ర ఇంటెలిజెన్స నివేదికల ఆధారంగా అమిత్ షా జగన్ కు క్లారిటీగా వివరించినట్లు పార్టీ శ్రేణుల నుంచే వినవస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి జ్వాలలను చల్లార్చి, వారిని బుజ్జగించి.. పార్టీని గాడిలో పెట్టే యత్నంలో భాగమే ఈ సమావేశం అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీ రద్దు వంటి నిర్ణయాలపై ఎటువంటి ప్రకటనా సమాచారం ఉండే అవకాశం లేదని అంటున్నారు. అలాగే గత సమావేశాలలోలా ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ వారికి క్లాస్ పీకే అవకాశాలు కూడా కనిపించడం లేదని అంటున్నారు. 

సిగ్గెందుకు.. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదంపై ఉద్ధవ్ థాక్రే

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది.  మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా ఇదే అంశంపై సేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకని ప్రశ్నించారు. ప్రధాని తమ కాలేజీలో చదివారని ఆ కాలేజీ వాళ్లు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు.  అలాగే తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మన విద్యార్హతలు వెల్లడిద్దాం అంటూ ఆరంభించిన ఉద్యమానికి భారీ స్పందన వస్తోంది. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఇతరులు కూడా తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.