దున్నపోతుపై వర్షం!
posted on Apr 11, 2023 7:36AM
పశ్చిమ బెంగాల్ కు కేంద్రం నుంచి రావల్సిన నిధుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త తరహా నిరసనను తెలపనున్నారు. రాష్ట్రా నికి రావల్సిన వాటా నిధులను డిమాండు చేస్తూ బెంగాల్ ప్రజల నుంచి కోటి లేఖలు ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ పంపనున్నారు. బెంగాల్ ప్రజల నుంచి వచ్చిన కోటి లేఖలను కేంద్రం ఎలా అడ్డుకుంటుందో చూస్తామని మమతా అన్నట్లు తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. మనెగారా పథకం కింద బెంగాల్ కు రావల్సిన నిధుల విడుదల కోసం ఒత్తిడి చేసేందుకు సంతకాల సేకరణ, ప్రధానమంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రికి లేఖలు పంపే కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు.
ఈ లేఖలను తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన బూత్ స్థాయి నాయకులు సేకరించి, బకాయిలు చెల్లించని లబ్దిదారులతో కలిసి ఢిల్లీకి వెళతామన్నా రు. 2019 లోక్ సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలోనూ పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మంచి జనాదరణ ఉన్న ప్రాంతమైన అలీపుర్ దువార్ లో జరిగిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ ప్రసంగించారు. ఇటీవల సీఎం మమతా బెనర్జీ కూడా బెంగాల్ పెండింగ్ బకాయి లపై కోల్ కతాలో రెండు రోజుల ధర్నాలో పాల్గొన్నారు. తృణమూల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి, ఖర్చులకు సంబంధించిన లెక్కలు చెప్పపోతున్నా రని, అందుకే నిధులు ఆలస్యమవుతున్నా యని బీజేపీ అంటుంది. 100 రోజుల పని పథకానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా లోని రెడ్ రోడ్ లో ధర్నాకు కూర్చున్న విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్ర వివక్ష చూపుతుంది.. రాష్ట్రాలకు రావల్సిన వాటాలను ఇవ్వకుండా, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విజ్ఞాప్తిలను కోటి లేఖలేం ఖర్మ... వందల కోట్లు పంపినా.. అది దున్నపోతుపై వర్షంలా వ్యర్థం అని రాజకీయ నిపుణులు అభిప్రాపడుతున్నారు..