కర్ణాటకలో అమూల్ కల్లోలం
posted on Apr 10, 2023 @ 2:49PM
బెంగుళూరులో తమ పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో డెలివరీ చేస్తామంటూ గుజరాత్ కు చెందిన ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) చేసిన ట్వీట్ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయ దుమారాన్ని రేపింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారు అయిన నందిని బ్రాండ్ నిర్వాహకులను ఇబ్బందుల పాల్డేయడానికి, నందిని బ్రాండ్ ను వినియోగిస్తున్న కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ను, అమూల్ లో విలీనం చేయడానికి జరుగుతున్న కుట్రగా కాంగ్రెస్, జేడీ(ఎస్) విమర్శలు గుప్పిస్తున్నాయి.
అమూల్ ఉత్పత్తులను కొనేది లేదంటూ కన్నడిగులు ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. అమూల్, నందిని మధ్య ఎలాంటి రాజకీయాలు లేవని, దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్ గా నందిని నిలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి అమూల్ ను దొడ్డిదారిన తెచ్చేందుకు గుజరాత్ కు చెందిన ప్రధాని, కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఒక దేశం, ఒక అమూల్ అంటూ ప్రధాని మోడీ సర్కారు చేసిన వ్యాఖ్యకు జేడీ(ఎస్) నేత కుమారస్వామి చురకలు వేశారు. ఒక దేశం, ఒక అమూల్, ఒక పాలు, ఒక గుజరాత్ అనేది కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానంగా మారిపోయిందంటూ ట్వీట్ చేశారు. దేశమంతా గుజరాతీమయం చేయాలనేది మోడీ లక్ష్యంగా కనిపిస్తోందనీ , ఆ లక్ష్య సాధన కోసం కాషాయం పార్టీ ఎంతటికైనా దిగజారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.