ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సీఎం జగన్.. లోతైన విచారణ కోరుతూ పిటిషన్
posted on Apr 10, 2023 @ 3:48PM
కోడి కత్తి కేసులో బాధితుడిగా ఏపీ సీఎం జగన్ కోర్టుకు హాజరయ్యారు. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు జగన్ సోమవారం (ఏప్రిల్ 10) హాజరయ్యారు. గత ఎన్నికలకు (2019) ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు విచారిస్తోంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపును కోరారు.
ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. నిందితుడిగా ఇప్పటి వరకూ సీబీఐ కోర్టు, హై కోర్టు మెట్లు ఎక్కిన జగన్ తొలి సారిగా బాధితుడిగా ఎన్ఐఏ కోర్టు మెట్లు ఎక్కారు. కోడి కత్తి కేసులో బాధితుడు కోర్టుకు హాజరై తీరాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేయడంతో అనివార్యంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. అంతకు ముందు గత విచారణల సందర్భంగా జగన్ హాజరుపై ఎన్ఐఏ కోర్టు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై నిందితుడు జనుపల్లె శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని గత విచారణలో న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అయినా ఈకేసులో బాధితుడు జగన్ కోర్టుకుహాజరు కావాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేయడంతో సోమవారం (ఎప్రిల్ 10) జగన్ ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు. అనూహ్యంగా ఆయన ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచీ హాజరును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు కేసు విచారణ మరింత జాప్యం అయ్యేందుకు వ్యూహాత్మకంగా పిటిషన్ వేశారని అంటున్నారు. అలాగే సీఎంను కనుక తాను కోర్టుకొస్తే ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు పాలనా పరమైన ఇబ్బందులు వస్తాయని అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఈ కేసు ఎన్ఐఏ చేపట్టడానికి కేంద్రంపై జగన్ తీసుకు ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత, అదీ కోర్టు అక్షింతలు వేస్తేనే తీరిగ్గా కోర్టుకు హాజరైన జగన్ లోతైన విచారణ అంటూ పిటిషన్ దాఖలు చేయడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ పిటిషన్ చూస్తుంటే ఆయన ఎన్ఐఏ విచారణపై నమ్మకం లేదని అంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లె శీను నాలుగేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. అదే సమయంలో తన కారు మాజీ డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బెయిలు పై బయటకు వచ్చారు. జగన్ తాజా పిటిషన్ ఆయనలోని భయాన్ని బయటపెట్టిందంటున్నారు. గత ఎన్నికలలో తన విజయానికి దోహదపడిన రెండు కేసులూ ఇప్పుడు విచారణ సజావుగా సాగి వాస్తవాలు బయటపడితే.. తనకు మైనస్ అవుతుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే సొంత బాబాయ్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు ఇప్పట్లో తెమలకూడదన్న వ్యూహంతో వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.