డీఎస్ రెంటికీ చెడ్డ రేవడి!
posted on Apr 11, 2023 @ 9:37AM
ఒకప్పుడు రాష్ట్ర రాజకీయా ల్లో చక్రం తిప్పిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజకీయ జీవితం ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. తాజాగా ధర్మపురి కుటుంబ కథా చిత్రం ఎవరికీ అర్థంకాకుండా పోతోంది. ఆయనతో పాటు ఆయన కుమారుల రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నా ర్ధకంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఇటు బీజేపీలో అర్వింద్ పలుచనయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ లో సంజయ్ చులకనైపోయారు.
కాదేదీ రాజకీయాలకు అనర్హం అన్న పాతకాలం నాటి కొటేషన్ ప్రస్తుత రాజకీయాలకూ సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఏ సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటాయి పార్టీలు. ఘటనలే కాదు, మనుషులనూ పొలిటికల్ గేమ్ లో పావులుగా వాడే స్తున్నారు. కాంగ్రెస్ లో డీఎస్ ఎపిసోడ్.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా జాయినింగ్.. ఆ మరుసటి రోజే రిజైన్ తో ధర్మపురి కుటుంబ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్దాలు తిరుగులేని నేతగా వెలుగొందిన డీఎస్ రాజకీయం నేడు వెల వెలబోతుంది. డి.శ్రీనివాస్ గతంలో పీసీసీ అధ్యక్షుడు వైఎస్సార్ తో కలిసి కాంగ్రెస్ ను ఉరకలెత్తించారు. హస్తం పార్టీలో కింగ్ గా ఉన్నారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పు డు బీఆర్ఎస్ మాజీ ఎంపీగా, కారు పార్టీకి అంటరాని నేతగా ఉన్నారు. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీ గా దూసుకుపోతున్నారు. తండ్రి బీఆర్ఎస్ కు దూరమవడంతో.. ఆయన బీజేపీలో చేరుతారని అనుకున్నారు. యువనేతలు ధర్మపురి బ్రదర్స్ కు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఒకరంటే ఒకరికి అసలే మాత్రం పడదు. అందుకే, తమ్ముడు బీజేపీలో ఉంటే.. అన్న కాంగ్రెస్ లో చేరారు. ఆ కార్యక్రమానికి తానూ హాజరై.. కొడుకును ఆశీర్వదించాలని భావించారు.
కానీ తానొకటి తలిస్తే, కాంగ్రెస్ నేతలు మరొకటి తలచారు. సంజయ్ చేరిక సందర్భంగా గాంధీభవన్ కు వచ్చిన డీఎస్ కు కాంగ్రెస్ కండువా కప్పేసి పార్టీలో చేరినట్టు ప్రకటించేశారు హస్తం నేతలంతా కలిసి. ఈ వార్త మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేలా హడావుడి చేశారు. కట్ చేస్తే.. ఆ మర్నాడే తాను అసలు కాంగ్రెస్ లో చేరలేదని, అదంతా అబద్ధమంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు డి. శ్రీనివాస్. పనిలో పనిగా ఒకవేళ తాను పార్టీలో చేరానని మీరు అనుకుంటే.. ఇదిగో నా రాజీనామా అంటూ లేఖ కూడా విడుదల చేశారు.
ఆఖరి దశలో నలిగిపోతున్న డీఎస్ కు గడిచిన రెండు, మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఎప్పటినుంచో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలో చేరినా పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ లో చేర్చుకుని ఖుషీ చేసుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు, కాస్త ఓవరాక్షన్ చేసి.. డీఎస్ ను సైతం పార్టీలో కలిపేసుకున్నారు. ఆ సమయంలో నేతలంతా తనను సన్మానిస్తున్నారని అనుకున్నారు కాబోలు డీఎస్. ఇంటికెళ్లాక కానీ ఆయనకు అసలు జరిగిందేంటో తెలీలేదు.