కొండరాయికి వడదెబ్బ.. పెద్ద శంబ్దంతో పగిలిన వైనం
posted on Apr 10, 2023 @ 5:00PM
రోహిణీకార్తె ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు. ఇంకా రోహిణీ కార్తె రాలేదు. మే మూడో వారంలో రోహిణీ కార్తె వస్తుంది. ఇప్పుడు ఇంకా ఏప్రిల్ ఎనిమిదో తేదీయే. అయినా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలకు కొండలు పగులుతున్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్లలో భానుడి భగభుగలకు ఏకంగా ఓ కొండరాయి పగిలిపోయింది.
పటపట మని పెద్ద శబ్దాలు చేసుకుంటూ పెద్ద కొండరాయి బీటలు తీసింది. ఆ శబ్దాలకు పరిసరాల్లో నివసించే జనం భయంతో వణికిపోయారు. ఏం జరుగుతోందో అర్ధం కాక తల్లడిల్లిపోయారు. ఆ పగిలిన బండరాయి ఏ క్షణంలో జారి పడుతుందోనని భయాందోళలనతో బిక్కు బిక్కు మంటున్నారు. ప్రమాదం జరగకుండా తక్షణం ఆ పగిలిన కొండరాయిని అక్కడ నుంచి తొలగించాలని కోరుతున్నారు.
అయినా ఏప్రిల్ లోనే ఎండలు ఇలా ఉంటే ఇక వచ్చేనెలలో మరెంత తీవ్రంగా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ఏడు వర్షాభావ పరిస్థితులు ఉంటాయనీ, ఎండలు మండిపోతాయనీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండ ప్రచండంగా మారింది. సూర్యుడి ప్రతాపానికి బండరాళ్లు బీటలు వీస్తున్నాయి. ముందు ముందు భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుందనీ, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.