అధ్యక్షా ..చదువు కున్నారా?.. కొన్నారా?
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికీ విద్యార్హతలు అక్కర లేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు, ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా, రాజకీయ నాయకుల విద్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి.
ఈ మధ్య కాలంలోనే ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం నడిచింది. మోడీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. చివరకు ఆ వివాదం ఆయన మెడకే చుట్టుకుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పదే పదే అడిగి సమాచార కమిషన్ సమయాన్ని వృధా చేస్తున్నారని భావించిన న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన ‘డిగ్రీ’ విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు కూడా చేరింది.
తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రి సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు బయట పెట్టిన ఆధారాలు ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారాయి. ఏపీ స్పీకర్ డిగ్రీ చదవలేదు. కానీ ఆయన హైదరాబాద్‌లోని ఒక న్యాయ కళాశాలలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో న్యాయశాస్త్రం విద్యార్ధిగా చేరారు. ఈ అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి వివరాలు సేకరించారు.
తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లుగా, తమ్మినేని సీతారాం విద్యార్హతలు ఏమిటన్న వివరాలు తెలుసుకుంటే అసలు విషయం బయట పడిందని తెలంగాణ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. తమ్మినేని డిగ్రీ చదవలేదు, కానీ, చదివినట్లుగా ఒక నకిలీ సర్టిఫికేట్ సంపాదించారు. ఆ నకిలీ సర్టిఫికేట్ అర్హతగా లా కాలేజీలో ప్రవేశం పొందారు. ప్రవేశ దరఖాస్తుకు ఆ నకిలీ సర్టిఫికేట్ జతచేసి లా కళాశాలలో ప్రవేశం పొందారు. ఆయన ఏ స్టడీ సెంటర్లలో అయితే డిగ్రీ చేసినట్లు చూపించారో, ఆ స్టడీ సర్కిల్లో ఆయన చదవ లేదని వెరిఫికేషన్ లో తేలిందని.. డిగ్రీ సర్టిఫికెట్‌లో చెప్పిన హాల్ టిక్కెట్ నెంబర్ కూడా లేదని నర్సిరెడ్డి చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని… నకిలీ డిగ్రీ సృష్టించి ఉంటే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి తమ్మినేని నకిలీ డిగ్రీ అంశం పై ఇప్పుడే కాదు ఇంతకూ ముందు దుమారం రేగింది. అయినా ఆయన నోరు విప్పడం లేదు. డిగ్రీ గురించి మీడియా ప్రశ్నించినా, చిరునవ్వే అయన సమాధానం అవుతోందని అంటున్నారు. ఈ అంశం ఇప్పటికైతే పెద్దగా రచ్చ కెక్కలేదు కానీ, భవిష్యత్ లో రాజకీయ దుమారం రేపే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి డిగ్రీ లేకున్నా పదవులు పొందవచ్చును, కానీ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ఉన్న పదవి ఊడి పోవడంతో పాటుగా, ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. అయితే తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో లో డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారా లేదా అనేది తెలియవాల్సి వుంది. అది తెలిస్తే, అప్పడు కథ మరో మలుపు తిరుగుతుంది, లేదంటే ..అంతే సంగతులు.