అమ్మ ఇంటికే రాహుల్.. ఇక అక్కడే మకాం
posted on Apr 15, 2023 @ 11:26AM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, తుగ్లక్ లేన్-12లోని తన అధికార నివాసం ఖాళీ చేసి, తల్లి సోనియా గాంధీ అధికార నివాసం 10 జనపథ్ కు మకాం మార్చేస్తున్నారు. 2004లో రాహుల్ గాంధీ తొలిసారిగా, అమేథీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎంపీగా ఆయనకు ప్రభుత్వం కేటాయించిన తుగ్లక్ లేన్-12బంగ్లాలోనే ఉంటున్నారు.
అయితే ఇటీవల, ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన నేపధ్యంలో, ఆయన అధికార నివాసం ఖాళీ చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో రాహుల్ గాంధీ తన సామాన్లను 10 జనపథ్’కు షిఫ్ట్ చేశారు. ఇహనో ఇప్పుుడో ఆయన కూడా షిఫ్ట్ అవుతారు. ఇక నుంచి ఆయన తన తల్లి వద్దే ఉంటారు. మరోవంక రాహుల్ గాంధీ 2019లో ఎన్నికల ర్యాలీలో చేసిన దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది అన్నందుకు ఆయన్ని దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ నేపథ్యంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పార్లమెంటు సెక్రటెరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. మరో వంక ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. అయితే, కేసును విచారించిన న్యాయస్థానం తుది తీర్పును ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
మరోవంక రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన నేపధ్యంలో ఏప్రిల్ 22లోగా అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనకు మార్చి 27న నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఖాళీ చేసి సోనియా నివాసానికి మారారు.
అయితే రాహుల్ గాంధీకి ఇప్పడు ఖాళీ చేస్తున్న బంగ్లాతో సుదీర్ఘ అనుబంధం వుంది. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వరసగా మరో రెండు మార్లు అదే నియోజక వర్గం నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం, అమేధీతో పాటుగా కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేధీలో ఓడి పోయినా, వాయనాడ్ లో గెలిచి వరసగా నాల్గవ పర్యాయం (ఎంపీగా అనర్హత వేటు పడేంత వరకు) ఎంపీ కొనసారు.
అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలకు పైగా రాహుల్ అదే తుహ్లాక్ లైన్ 12 బంగ్లాలో ఉంటున్నారు. ఆయన ఆ బంగ్లాతో తనకున్న అనుబంధాన్ని, అనుభూతులను పంచుకున్నారు. మరోవంక రాహుల్ గాంధీ తమ నివాసాన్ని ఖాళీ చేయవలసివస్తే, తమ నివాసంలో ఉండవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆఫర్ ఇచ్చారు. అయితే రాహుల్, అమ్మతో ఉండేందుకే నిర్ణయించుకున్నారు.