టీఎస్పీఎస్సీ లీకేజీ.. ఈడీ వర్సెస్ సిట్!
posted on Apr 14, 2023 @ 3:23PM
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల లీకేజీలో మనీల్యాండరింగ్ ద్వారా భారీగా సొమ్ములు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో కేసు దర్యాప్తును కూడా చేపట్టింది. దీంతో ఈడీ వర్సెస్ సిట్‌గా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్లు కేంద్రం చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. రాష్ట్రం చేతిలో సిట్ ఉంది అన్నట్లుగానే ఈ దర్యాప్తు సంస్థల తీరు కూడా ఉంది.
తాజాగా తమ దర్యాప్తునకు సిట్ సహకరించడంలేదని ఈడీ ఆరోపిస్తోంది. తమకు విచారణకు సంబంధించి సిట్ ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ రెండు దర్యాప్తు సంస్థల పంచాయతీ కోర్టుకు చేరింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. వివరాలు ఇవ్వాల్సిందిగా మార్చి 23న సిట్ కు లేఖ రాసింది. ముందు నుంచి సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తుండటంతో పేపర్ లీకేజీకు సంబంధించిన 8 డాక్యుమెంట్లను ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. అయితే ఇప్పటి వరకూ కూడా ఈడీ లేఖకు సిట్ అధికారులు స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది.
టీఎస్సీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో అడిగిన సమాచారాన్ని తమకు ఇవ్వడంలేదంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అందుకు సిట్ ఇచ్చే సమాచారం తమకు ఉపయోగపడుతుందని అంటోంది. అందుకే కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది. ఇదిలా ఉంటే ఈడీ పిటిషన్‌పై సిట్ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉండడంతో వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ తన కౌంటర్ లో పేర్కొంది.ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.
పేపర్ లీక్ కేసులో ఈడీ ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపైనే దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది.
భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌ల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. టీఎస్సీఎస్పీ నిందితుల నుంచి సిట్ ఏడు లక్షలు సేకరించింది. రూ.40 లక్షలు లావాదేవీలు జరిగినట్లు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ పేర్కొన్నది. కేసు వ్యవహారం రానున్ను రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.