జగన్ స్టిక్కర్లంటే వాటికీ కోపమే!
posted on Apr 14, 2023 @ 2:45PM
ఏపీ సీఎం జగన్ స్టిక్కర్ల ను ప్రజలే కాదు.. కుక్కలు, కోతులూ కూడా చీదరించుకుంటున్నాయి. జగన్ స్టిక్కర్ కనిపిస్తే చాలు పీకి, చింపి పారేస్తున్నాయి. జగన్ స్టిక్కర్ ను ఎవరైనా తొలగిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తున్న సర్కార్.. మరి కోతులు, కుక్కలపై కూడా చర్యలు తీసుకుంటారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఏపీ సీఎం జగన్ రెడ్డి చిత్రం ఉన్న స్టిక్కర్ ను చింపిన కుక్కపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ కుక్క స్టిక్కర్ ను చింపడం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ జగన్ రెడ్డి స్టిక్కర్ ను చింపిన కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును తీసుకోవడానికి ముందు వెనుకలాడిన పోలీసులు ఎట్టకేలకు స్వీకరించారనుకోండి అది వేరే విషయం. నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్ర మంలో భాగంగా ఓ ఇంటికి అంటించిన స్టిక్కర్ ను కుక్క చించేయడానికి సంబంధించిన వీడియో గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రికి తీవ్ర అవ మానం జరిగిందని, దీనిని రాష్ట్ర ప్రజలందరికీ జరిగినట్లుగా భావించి ఆ కుక్కపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నున్న పోలీసు స్టేషన్లో ను ఉదయశ్రీ తెదేపా నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు.
దీన్ని పోలీసులు స్వీకరించి నెంబరు కూడా ఇచ్చారు. అధికార పార్టీ నేతలకు అవమానం జరిగితే ఆఘ మేఘాలపై కేసులు నమోదు చేసే పోలీసులు.. సీఎంకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసినా ఎందుకు వేగంగా స్పందించడం లేదని జనం నిలదీస్తున్నారు. అలాగే ఓ ఇంటిపై అంటించి ఉన్న జగన్ పోస్టర్ ను ఓ కోతి పీకి పాడేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతిపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో?