ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం
posted on Apr 15, 2023 @ 9:38AM
ఢిల్లీ మద్యం కుంభకోణంలోలో మరో సంచలనానికి తెరలేచింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సహా అనేక మంది విచారించి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరు కీలక వ్యక్తులను ఆరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఆదివారం (ఏప్రిల్ 16) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. మార్చిలో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీష్ సిసోడియా చార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటంతో ఇప్పుడు ఆయన్ను విచారించాలని నిర్ణయించింది. మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆదివారం (ఏప్రిల్ 16) ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడావలసి వుందని అంటున్నారు.
గతంలో కవిత సహా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులకు, వారి బిజీ షెడ్యూల్ ఇతరత్రా కారణాలతో, సీబీఐ, ఈడీ విచారణ తేదీలలో వారు కోరుకున్న విధంగా మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అదే విధంగా అరవింద్ కేజ్రివాల్ కోరితే విచారణ మరో రోజుకు వాయిదా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.
కాగా ఇదే ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. అందులో ఏకే.. అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించారు.
అదలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్యం కుంభకోణంలో నోటీసులు జారీ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రూ.100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో పాత మద్యం విధానమే అమలు అవుతోంది. మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ.. ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయటం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు పంపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సీబీఐ సమన్లతో అరవింద్ కేజ్రీవాల్ పోరాటం ఆగదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీని ప్రశ్నించినందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని సంజయ్ సింగ్ అన్నారు. సీబీఐ విచారణకు కేజ్రీవాల్ ఆదివారం (ఏప్రిల్ 16)వెళ్తారని సంజయ్ సింగ్ తెలిపారు.