విజయసాయిరెడ్డి... మార్పులో మతలబేంటి?
posted on Apr 21, 2023 7:57AM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు జన్మదినం గురువారం (ఏప్రిల్ 20) ఆయనకు పార్టీ నుంచి, ప్రజల నుంచీ, వివిధ రంగాల ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వైసీపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం, అదీ ఎంతో అభిమానంతో, గౌరవంతో మర్యాదపూర్వక భాషలో తెలియజేయడం అన్ని వర్గాల వారినీ సంభ్రమాశ్చర్యలలో ముంచెత్తింది. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నావిజయసాయిరెడ్డి చంద్రబాబుకు తెలిపిన అభినందనలు రాజకీయవర్గాలలోనే కాదు సామాన్య జనంలో కూడా కొత్త చర్చకు దారితీశాయి.
విజయసాయి ట్వీట్లు.. అవి అభినందించడానికి చేసినా సాధారణంగా విమర్శలు, వెటకారాలు, అనుచిత భాషా ప్రయోగాలతో ఉంటాయి. ఆయన గతంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్లు చూస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది. అయితే ఈ సారి మాత్రం విజయసాయి చంద్రబాబుకు తెలిపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం చాగంటి వారి ప్రవచనంలాగా చాలా మర్యాద, మన్ననా ఉట్టిపడుతూ ఉంది. ఇదే సర్వత్రా చర్చకు కారణమైంది. రాజకీయవర్గాలలో విజయసాయిలో వచ్చిన ఈ మార్పు పట్ల పలు కోణాల్లో చర్చ జరుగుతోంది.
విజయసాయి చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డి స్పందించిన తీరుకీ... ఇప్పుడ ఆయన స్పందించిన తీరుకు చాలా చాలా వ్యత్యాసం ఉందనీ,సీఎం జగన్ భాషలో లా నాడు – నేడు కార్యక్రమం స్టైల్‌లో చెప్పాలంటే చాలా చాలా ఉదాహరణలతో చెప్పొచ్చని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా.. విజయసాయిరెడ్డి ఎలా చెలరేగిపోయేవారో గుర్తు చేస్తున్నారు.
ఇంతకీ.. విజయసాయిరెడ్డిలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి.. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి సమీప బంధువని.. అయితే తారకరత్న మృతి నేపథ్యంలో వారి ఇంట విజయసాయిరెడ్డి అంతా తానై వ్యవహరించారని.. ఆ క్రమంలో తారకరత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో ఈ విజయసాయిరెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారని.. ఈ ఎపిసోడ్ తర్వాత విజయసాయిరెడ్డిని జగన్ సాధ్యమైనంత దూరం పెట్టారనీ, ఇటీవలి కాలంలో విజయసాయికి వైసీపీ కార్యక్రమాలలో కానీ, వ్యవహారాలలో కానీ కనీస ప్రాతినిథ్యం లేకుండా పోయిందని అంటున్నారు.
మరో నెటిజన్ అయితే వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడాకు తరలించారని... మరికొద్ది రోజుల్లో వైయస్ అవినాష్‌రెడ్డికి సైతం శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదంటూ ఓ ప్రచారం అయితే బయట జోరుగా సాగుతోందని... అటువంటి తరుణంలో జగన్... పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో భేటీ అయి.. ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారని... కానీ ఈ భేటీకి విజయసాయిరెడ్డిని దూరంగా ఉంచిన సంగతిని గుర్తు చేస్తూ.. జగన్.. తనను దూరం పెడితే.. తాను సైతం ఆయనను దూరం పెట్టగలనన్న సంకేతాన్ని విజయసాయి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ట్వీట్ ద్వారా ఇచ్చారని వివరించాడు. ఏది ఏమైనా ఏదో అడ్వర్టైజ్ మెంట్లలో మరక మంచిదే అన్నట్లు.. విజయసాయిలో వచ్చిన ఈ మార్పు కూడా మంచికే నంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.