కర్నాటకలో రేకలు రాలిన కమలం
posted on Apr 21, 2023 7:02AM
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా, నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందే అభ్యర్ధుల ఎంపిక కసరత్తును, దిగ్విజయంగా పూర్తి చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన చివరి జాబితాను గురువారం (ఏప్రిల్ 20) విడుదల చేసింది. అలాగే కొన్ని నియోజక్ వర్గాల్లో ముందు ప్రకటించిన అభ్యర్ధుల స్థానంలో కొత్తవారిని తెర మీదకు తెచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పోటీ చేస్తున్న షిగ్గావ్ నుంచి తమ అభ్యర్థిగా మహ్మద్ యూసఫ్ సవనూర్‌ను ప్రకటించిన కాంగ్రెస్, తాజాగా ఆయన స్థానంలో స్థానికుడైన యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది.
షిగ్గావ్ ఎమ్మెల్యేగా బొమ్మై ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గంలో లింగాయత్‌లు, ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. దీంతో నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని మార్చడం ఆసక్తికరంగా మారింది. కాగా, తుది జాబితాలో రాయచూర్ టికెట్ మహ్మద్ షలీమ్‌కు ఇచ్చిన కాంగ్రెస్.. సిడ్లఘట్ట నుంచి బీవీ రాజీవ్ గౌడ, సీవీ రామన్ నగర్ నుంచి ఎస్.ఆనంద్ కుమార్, అర్కాల్‌గుడ్ నుంచి హెచ్‌పీ శ్రీధర్ గౌడ, మంగళూరు సిటీ నార్త్ నుంచి ఇనాయత్ అలీని పోటీలో నిలిపింది.
నిజానికి, కాంగ్రెస్ పార్టీలో, ఏ పంచాయతీ లేకుండా సజావుగా అభ్యర్ధుల ఎంపిక సాగడం ఐక్యతకు సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే హస్తం పార్టీకి ఇదొక శుభ సంకేతంగా పేర్కొంటున్నారు. అదలా ఉంటే, ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని ఆశిస్తున్న అధికార బీజేపీలో అభ్యర్ధుల ఎంపిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంచు మించుగా మూడింట ఒక వంతు (75) టికెట్లు కొత్త వారికి ఇచ్చిన కమలం పార్టీలో క్రమశిక్షణ కట్టుబాట్లు కట్లు తెంచుకున్నాయి. కమలం రేకలు రాలిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒకరివెంట ఒకరు క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
బీజేపీ టికెట్ పై ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీ తదితర బీజేపీ నేతలు ఇప్పటికే హస్తం గూటికి చేరగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2017 వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తర్వాత జేడీఎస్ తరఫు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపరేషన్ కమలంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయ కారణాలతో తాను పార్టీ మారుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన ఆయన 2017 వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.
అనంతరం ఆయన జేడీఎస్‌లో చేరి హున్సూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపరేషన్ కమలంలో భాగంగా.. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 డిసెంబర్లో జరిగిన ఉపఎన్నికల్లో ఓడిన ఆయనకు 2020 జులైలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇప్పుడు ఆయన మళ్ళీ సొంత గూటికి చేరారు.
అదలా ఉంటే, ఫిరాయింపుల ప్రభావం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగదీశ్ షట్టర్ అయితే 25 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను ఓడిస్తానని ప్రకటించారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం జగదీశ్ షట్టర్ , జనసంఘ్’రోజుల నుంచి పార్టీలో ఉండి ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆయన కుటుంబ సభ్యులే జీర్ణించుకోలేక పోతున్నారని..ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిదంగా ఉన్నారని అనటున్నారు.
అలాగే, సుదీర్ఘ కాలంగా ఆయనతో కలిసి పనిచేసిన పార్టీ స్థానిక నాయకులు , కార్యకర్తలు, జగదీశ్ షట్టర్ స్వతంత్ర అభ్యర్ధిగా పొటీకి దిగి ఉంటే ఆయనపై ఉన్న అభిమానంతో ఆయనను గెలిపించుకునే వారమని, పోయిపోయి కాంగ్రెస్ లో చేరి ఆయన తప్పు చేశారాణి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుంది అనుకునేదుకు లేదని, ప్రస్తుతం తుపాను ముందు ప్రశాంతత ఉన్నా, ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేమని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.