బీఆర్ఎస్ మరో సెల్ఫ్ గోల్!
posted on Apr 21, 2023 1:02AM
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం, అనవసరంగా వేలు పెట్టి, చేయి కాల్చుకుందా? బీఆర్ఎస్ పార్టీ మరో మారు సెల్ఫ్ గోల్ చేసుకుందా? అంటే, అవునన్న సమాధానమే వస్తోంది, నిజానికి ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇటీవల కాలంలో ఇలాంటి తప్పటడుగులే బీఆర్ఎస్ ఎక్కువ వేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం అయితే నేమీ, నిన్న మొన్నటి పరిక్ష పత్రాల లీకేజీ వ్యవహరం, బండి సంజయ్ అరెస్ట్ విషయం అయితే నేమి,ఇలా ప్రతి విషయంలోనూ బీఆర్ఎస్ నాయకత్వం ముందు వెనక ఆలోచించకుండా తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలతో చిక్కులు తప్పడం లేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ ట్రాప్ లో పడి సమస్యలు కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ఏదో విధంగా బద్నాం చేయడమనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు.
ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే సంకల్పంతో, స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొని, విశాఖ ఉక్కును కాపాడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు చాలా చాలా హడావిడి చేశారు. ఇంతలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి మంత్రి ఫగన్ సింగ్ కులస్థే విశాఖ వచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు అని మాట మాత్రంగా ఒక ముచ్చటను బయట పెట్టారు,అంతలోనే తూచ్ అన్నారు. కానీ, అంతలోనే, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటద ని కేసీఆర్ కు భయపడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, మంత్రి కేటీఆర్ జబ్బలు చరుచుకున్నారు. అయితే కేంద్ర ఉక్కుగనుల శాఖ విశాఖ ఉక్కుని అమ్మేది అమ్మేదే.. వెనక్కి తగ్గేది లేదు, అని కుండ బద్దలు కొట్టింది. దీంతో, బీఆర్ఎస్ నాయకులు ముఖాలు చిన్నబిచ్చుకున్నారు.
అదలా ఉంటే బిడ్ వేసే విషయంలోనూ చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పడినట్లుగా, బిడ్ లో పాల్గొంటామని అరివీర భయంకర ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, బిడ్ గడవు ముగిసినా ఆ ముచ్చట మళ్ళీ తీయలేదు. నిజానికి విశాఖ ఉక్కు కంపెనీ యాజమాన్యం ముందుగా ప్రకటించిన బిడ్ గడువు ఐదు రోజుల క్రితమే ముగిసింది.
అయితే, తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ లో పాల్గొనేందుకు సిద్దమైన సింగరేణి అధికారుల అభ్యర్ధన మేరకే, బిడ్ గడువును ఏప్రిల్ 20 వరకు (ఐదు రోజులు) పొడిగించారు. ఇప్పడు ఆ గడువు కూడా ముగిసింది కానీ, సింగరేణి బిడ్ వేయలేదు. దీంతో విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్ మరో మారు సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు.