కడప బరిలో అత్తా కోడలా?
posted on Apr 21, 2023 7:28AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి... హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించి... విచారిస్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి ఎన్ని సార్లు కోర్టు తలుపు తట్టినా.. ఆయన అరెస్ట్ కావడం మాత్రం పక్కా అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఓ వేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన రాజకీయ జీవితానికి శుభం కార్డు పడే అవకాశాలున్నాయని వైసీపీలోని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
అదీకాక వివేకా హత్య కేసులో ప్రజల వేళ్లన్నీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయని... దీంతో ఆయన పోటిలికల్ గ్రాఫ్ పడిపోయిందనీ... ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి.. తమ ఫ్యామిలీకి ఆయువు పట్టులాంటి కడప లోక్‌సభ స్థానం లో పార్టీ పట్టు జారకుండా ఉండేందుకు చేపట్ట వలసిన నష్ట నివారణ చర్యలపై ఫోకస్ చేశారని ఆ వర్గం చెబుతోంది. అందులోభాగంగా తాడేపల్లి ప్యాలెస్‌లో తాజాగా పార్టీ అగ్రనేతల భేటీలో ఇదే అంశంపై జగన్ కులంకుషంగా చర్చించారని చెబుతోంది.
ఆ భేటీలో.. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి భారతీని నిలబెట్టాలన్న ఓ ప్రతిపాదన వచ్చిందనీ... అయితే వివేకా హత్య కేసులో ఆమె ప్రమేయం ఉందంటూ ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారని... అదీకాక వివేకా హత్య జరిగిన తర్వాత.. అటు జగన్ ఓఎస్డీకి, ఇటు భారతి పీఏ నవీన్‌కు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి పలుమార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు.. సీబీఐ విచారణలో అధికారులు గుర్తించారని...ఆ క్రమంలో వారిద్దరికీ సీబీఐ నోటీసులు జారీ చేసి.. విచారించిందని... అటువంటి పరిస్థితుల్లో భారతిని కడప ఎంపీగా బరిలోకి దింపితే... విజయావకాశాలు కష్టమయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం కూడా ఆ భేటీలో వ్యక్తమైందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను.. కడప ఎంపీగా బరిలోకి దింపితే.. ఆమె భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయన్న చర్చ కూడా తాడేపల్లి ప్యాలస్ లో పార్టీ అగ్రనేతలతో జగన్ జరిపిన భేటీలో చర్చకు వచ్చిందని అంటున్నారు. అయితే కడప ఎంపీగా బరిలో దిగేందుకు విజయమ్మ అంగీకరిస్తారా? లేదా అన్న అనుమానం సైతం ఈ సందర్బంగా వ్యక్తమైందని అంటున్నారు. జగన్.. అధికార పీఠం ఎక్కిన కొద్ది రోజులకే... ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు.. తెలంగాణకు షిప్టయిపోయారు. ఆ తర్వాత షర్మిల... వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ఆ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు.
అలాంటి వేళ కడప ఎంపీగా పోటీ చేయాలంటూ జగన్ విజయమ్మకు ఆఫర్ ఇస్తే అంగీకరిస్తారా? అన్న అనుమానాలు ఆ భేటీలో వ్యక్తమయ్యాయి. కడప లోక్‌సభ స్థానం కోసమే వివేకా హత్య జరిగిందంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆ ఆఫర్‌ను విజయమ్మ తిరస్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన భావన ఆ భేటీలో వ్యక్తమైందంటున్నారు. ఓ వేళ విజయమ్మ ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ ఫ్యామిలీలోని వారే నిలుస్తారా? లేకుంటే.. బయట వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉందా? అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.