జగనన్నకు చెబితే మాత్రం ఏం చేస్తారు?
posted on May 10, 2023 @ 9:30AM
జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం (మే 9) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. సంతృప్తి స్థాయిలో వినతులను పరిష్కరించే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ... వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేవని, టిడిపి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని దుయ్యబట్టారు, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించానని, పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని సిఎం చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్-1902కు కాల్ చేస్తే సమస్యకు పరిష్కారం అందుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని సిఎం చెప్పారు. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం మంచి పరిష్కార వేదిక అవుతుందని నమ్మబలికారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని, ఫిర్యాదు నవెూదు చేసిన వెంటనే వైఎస్సార్ ఐటీ కేటాయింపు చేస్తుందని, ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు స్టేటస్ అందుతుందని, ప్రత్యక్షంగా సిఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని తెలిపారు.
స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. యిదంతా ఒకెత్తయితే.. ఈ నాలుగేళ్లలో జగన్ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ బెబుతూ వస్తున్నదంతా శుద్ధ అబద్ధమని జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంతోనే తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నాలుగేళ్ల పాలన పూర్తయిన తరువాత జగన్ యింత కాలం ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేశారని స్వీయ విశ్లేషణ చేసుకుంటే ఏమీ చేయలేదని తేలడంతోనే.. తాజాగా జగనన్నకు చెబుదాం అన్న కార్యక్రమాన్ని ప్రారంభించి.. యింత కాలం మీరు చెప్పిందేమీ నేను వినలేదని తేటతెల్లం చేశారంటున్నారు. యింత కాలం ఆయన చేసిందేమిటయ్యా అంటే.. గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలకు నాలుగేళ్ల తరువాత మళ్లీ శంకుస్థాపనను చేయడం.. అలాగే గత ప్రభుత్వంలో ఆరంభమైన పనులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసి.. యిప్పుడు వాటిని తిరిగి ఆరంభించడం.. అలా తిరిగి ఆరంభించిన పనులకు గతంలో ఉన్న పేర్లు తీసేసి తన పేరు పెట్టుకోవడం అంటూ విమర్శలు వినవస్తున్నాయి.
యిక యిప్పుడు ఆయన తాజాగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కూడా కొత్త కార్యక్రమం ఏమీ కాదు.. గత చంద్రబాబు ప్రభుత్వం పీపుల్స్ ఫస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విధానమే యిప్పుడు కొత్తగా జగనన్నకు చెబుదాం కార్యక్రమమని పరిశీలకులు చెబుతున్నారు. యిప్పుడు కూడా ఈ కాల్ సెంటర్ కు అందే ఫిర్యాదులలో ఎక్కువ భాగం జగన్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పురగతికి నోచుకోని పనులు.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏయే సమస్యలపై అయితే వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ ప్రజలు నిలదీశారో అవే సమస్యలు ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జనం ఫిర్యాదు చేస్తారని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్న సమస్యల పరిష్కారానికే దిక్కు లేదు.
ఓ ఫోన్ నంబర్ కు జనం తమ సమస్యలు చెబితే ప్రభుత్వం స్పందిస్తుందనుకోవడం అపోహేనంటున్నారు. ఎన్నికల ముందు చేసే హడావుడిలో భాగమే యిదని విశ్లేషిస్తున్నారు. ప్రజల సమస్యలు ఏమిటి? నాలుగేళ్లలో తాము పరిష్కరించకుండా వదిలేసిన సమస్యలేమిటి? అన్నవి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో జగన్ ఉన్నారా అని జనం కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగనన్నకు చెబుదాం అన్న కార్యక్రమం వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు, ఆర్ జోన్ స్థలాల పంపిణీ వంటి అంశాల నుంచి జనం దృష్టి మరల్చేందుకు తీసుకువచ్చిన ప్రోగ్రామేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.