అయినను వెళ్లి రావలె హస్తినకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. గత పర్యటనలలా ఇదేమీ సిరికిం చెప్పడు అన్నట్లుగా హఠాత్తుగా, రహస్యంగా ఖరారు చేసుకున్న పర్యటన కాదు.  ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన హస్తిన వెళుతున్నారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. స్వకార్యం కాకపోతే ఆయన ప్రపంచం తల్లకిందులైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టరు.  గత నీతి ఆయోగ్ సమావేశాలకు జగన్  హాజరు కాలేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెళ్లే వారు. కానీ ఈ సారి మాత్రం జగన్ స్వయంగా ఆ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమావేశానికి హాజరు కావడానికి 27వ తేదీ ఉదయం ప్రత్యేక విమానం ఎక్కినా సరిపోతుంది. కాకుంటే 26 రాత్రి బయలు దేరినా సరిపోతుంది. కానీ జగన్ మాత్రం 26వ తేదీ ఉదయానికే హస్తినలో వాలిపోతున్నారు. ఆయన పర్యటనకు నీతి ఆయోగ్ సమావేశం ఒక సాకు మాత్రమేననీ, అంతకు మించిన రాచకార్యం ఏదో వెలగబెట్టేందుకే ఆయన బగ్గనను పక్కన పెట్టి మరీ హస్తిన ప్రయాణం పెట్టుకున్నారనీ అంటున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితం తరువాత బీజేపీ అగ్రనాయకత్వం జగన్ కి గతంలోలా  అండగా నిలిచే అవకాశాలు దాదాపు మృగ్యం అని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. అయిననూ వెళ్లి రావలె హస్తినకు అన్నట్లుగా జగన్ ఏదో విధంగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు.  జగన్ అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లలో పలుమార్లు హస్తిన వెళ్లారు. కేంద్రంలోని పెద్దలందరినీ కలిశారు. కానీ అలా కలిసిన ఏ సారీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవు.  ఆయన హస్తిన యాత్రలన్నీ పూర్తిగా వ్యక్తిగత అజెండాతోనే సాగాయన్న విమర్శలు ఉన్నాయి.  ఇక ఇప్పుడు ఎన్నికల ఏడాది.  ప్రభుత్వంపై రాష్ట్రంలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అన్ని వర్గాలూ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాటలో ఉన్నారు. వైసీపీ గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ వంటి కార్యక్రమాల సందర్భంగా ప్రజల ముందుకు వెళ్లిన ప్రజా ప్రతినిథులకు వారి నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఎమ్మెల్యేలూ, మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవశం చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో  వైసీపీ గెలుపొందింది. ఆ తరువాత ఓ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని వైసీసీ చెప్పుకుంది కానీ, అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను పక్కన పెడితే స్వయంగా వైసీపీ నాయకులే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని అంగీకరిస్తున్నారు. గతంలోలా ప్రభుత్వంలో పార్టీలో జగన్ మాటే శాసనం అన్న పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఉన్న ధీ మా ఇప్పుడు సీఎం జగన్ లో ఏ మాత్రం కనిపించడం లేదు.  గతంలోలా పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ఏది చెబితే దానికి జీహుజూర్ అనే పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. జగన్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీలో అసంతృప్తులను బుజ్జగించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వైనాట్ 175 అన్నజగన్  ఇప్పుడు అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. విపక్షం అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుందంటే ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఎన్ని చేసిన ప్రజా వ్యతిరేక పవనాల ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఇక నాలుగేళ్లుగా ఎన్నడూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోని, విభజన హామీల గురించి కేంద్రాన్ని నిలదీయని జగన్ ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశం పేరుతో హస్తిన యాత్ర పెట్టుకుని.. అదీ ఒక రోజు ముందు ఢిల్లీలో వాలి.. ప్రధాని, మోడీలను కలిసి విభజన హామీలపై ఏదో ఒక ప్రకటన చేయమని బతిమాలుకునే అవకాశం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. అలా ఏమైనా  ప్రకటన చేయించుకుంటే.. అది ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండం బద్దలు కొట్టేశామని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తుందన్నది జగన్ భావనగా చెబుతున్నారు. ఎందుకంటే.. నాలుగేళ్ల పాలనలో ఇది సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం తో ఏం చెప్పి ఓట్లు అడగాలన్న ఇబ్బందిని అధిగమించడానికి ఇదే మార్గంగా  వైసీపీ అధినేత భావిస్తున్నారని అంటున్నారు. ఇక  వివేకా హత్య కేసులో అవినాష్ ను సీబీఐ మరోసారి విచారణకు పిలిచింది. వాస్తవానికి ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల కారణంగా రాలేనని లేఖ రాసి నాలుగు రోజులు వ్యవధి కోరారు. జగన్ హస్తిన వెళ్లే వరకూ ఆయన వాయిదాల మీద వాయిదాలు కోరే అవకాశం ఉందనీ, అరెస్టును తప్పించుకోవడానికి ఆయన పూర్తిగా జగన్ మీదే ఆధారపడ్డారనీ అంటున్నారు.  గత జనవరిలో కూడా వివేకా హత్య కేసులో అవినాష్ కు సీబీఐ సమన్లు జారీ చేయగానే జగన్ హస్తిన వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల ఫలితం వెలువడిన రెండో రోజునే సీబీఐ అవినాష్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. మళ్లీ జగన్ హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఈ సారి ఏం జరుగుతుందో చూడాల్సిందే మరి అంటున్నారు పరిశీలకులు.  

మాకు హెల్త్ టీచరే కావాలి

 పేరు ప్రదీప్ ఈశ్వర్.. కర్ణాటకలో చిక్ మగళూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు.. అతనికి తల్లి లేదు.తండ్రి లేదు.కుటుంబం లేదు.. ఫైనాన్షియల్ గా  జీరో..వృత్తి రీత్యా హెల్త్ టీచర్.. బీజేపీ ఒకానొక సమయాన అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది..దాదాపు 20 కేసులు పెట్టి జైల్లో పెట్టింది.అప్పుడు కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య గారు సపోర్ట్ చేసి బయటకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించాడు.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, తనకు సీటు కావాలని అడిగాడు.. రాహుల్ గాంధీ ఒక్క క్షణం అతని వైపు చూస్తూ, పార్టీ నాయకత్వంతో మాట్లాడాడు అతనికి సీటు వచ్చింది.. అటు సైడ్ బీజేపీ తరుపు నిలబడింది కర్ణాటక హెల్త్ మినిస్టర్.. పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి..ఇద్దరిది కూడ ఒక్కటే గ్రామం.ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి..ఎంతోమందిని సిని నటులను ప్రచారాన్ని కూడా పిలిపించుకున్నాడు.. అందులో మన బ్రహ్మానందం గారు కూడా ఒకరు..ఒక ఓటుకి 2000 రూపాయలు పంచారు అయినప్పటికీ చిక్ మగళూరు ప్రజలకు సుధాకర్ ని ఓడించి ఉపాద్యాయుడు అయిన ప్రదీప్ ఈశ్వరుని గెలిపించుకున్నారు కారణం ప్రదీప్ ను అక్రమంగా జైలుకు పంపించడమే బిజెపి చేసిన అతిపెద్ద తప్పు.. ప్రదీప్ ఈశ్వర్ ఒక రూపాయి కూడా పంచలేదు.. చిక్ మగళూరు   ప్రజలు హెల్త్ మినిస్టర్ కావాలా,హెల్త్ టీచర్ కావాలా అంటే హెల్త్ టీచరే కావాలి అన్నారు  చిక్ మగళూరు ప్రజలు.. కర్ణాటకలో సామాన్య వ్యక్తులను సైతం ఎమ్మెల్యే చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపించారు..

అమ్మ భువనేశ్వరి!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్బంగా ఆయన తల్లి భువనేశ్వరి సోమవారం కుమారుడితో అడుగు కలిపి నడిచారు. అంతకు ముందు  రోజు మాతృ దినోత్సవం సందర్భంగా  ఆదివారం లోకేష్ క్యాంప్ సైట్ వద్ద లోకేష్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కుమారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.   అంతే కాకుండా పాదయాత్రలో లోకేష్‌కు  వెన్నుదన్నుగా నిలుస్తున్న యువగళం దళాన్ని భువనేశ్వరి పేరుపేరునా పలకరించి, వారికి కృతజ్ఞతలు చెప్పారు.  భోజన విరామ సమయంలో భువనేశ్వరి యువదళం సభ్యులకు స్వయంగా వడ్డించారు. ఆ సందర్భంగా  లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు నెలల తరబడి కుటుంబాలను విడిచి  రావడం ఎంతో గొప్ప విషయమనీ,  మీకూ, మిమ్మల్ని పంపించినందుకు మీ కుటుంబాలకు కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.  మీ ప్రేమ లోకేష్‌కు ఉండాలి. మీ సేవలు అమూల్యం. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు. ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు లోకేష్ అదృష్టవంతుడని పేర్కొన్నారు.  సహజంగా ఎప్పుడూ తెరపైకి రాని భువనేశ్వరి, తన కుమారుడు లోకేష్ పాదయాత్ర వందరోజుల సందర్భంగా బయటకు వచ్చి, పాదయాత్రలో పాల్గొని, వాలంటీర్లు, లోకేష్ బృందానికి స్వయంగా భోజనం వడ్డించడం అందరినీ ఆకర్షించింది.  

ఓడలు బళ్లయ్యాయా?..

ఒకే ఒక్క ఫలితం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోందా?  బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు కర్నాటక ఫలితం దోహదం చేసిందా? మరీ ముఖ్యంగా ఏ మాత్రం స్టేక్ లేని ఏపీలో  నిన్న మొన్నటి వరకూ అంతా మేమే, అన్నీ మేమే అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు అంతా మీరే, అన్నీ మీరే అన్నట్లుగా తెలుగుదేశంవైపు జాలి చూపులు చూస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో.. దర్యాప్తు సంస్థలు చేతిలో ఉన్నాయన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు విశ్వయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా కాపాడాలంటూ బేల మాటలు మాట్లాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో అధికారం ఖాయం.. ఏపీలో మేం సహకరిస్తేనే తెలుగుదేశం పార్టీకి అధికారం అన్న ధోరణితో వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే తెలుగుదేశం సహకారం అనివార్యం అన్న పరిస్థితిలో పడింది. అలాగే కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. దక్షిణాది నుంచి కొన్ని పార్లమెంటు స్థానాలు తప్పని సరిగా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఏపీలో తెలుగుదేశంతో పొత్తు కోసం తహతహలాడుతోంది. నిన్న  మొన్నటి వరకూ తెలంగాణలో ఎవరి మద్దతు అవసరం లేదు..ఒంటరిగానే వంద స్థానాల్లో  గెలుస్తామంటూ విర్రవీగిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో అధికారం దక్కాలంటే.. ఆ రాష్ట్రంలో  బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం అని భావిస్తోంది. తెలంగాణలో సహకారం అందిస్తే.. ఏపీలో అండగా ఉంటామని నేరుగా కాకపోయినా ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ మద్దతు అవసరమా? అన్న ప్రశ్నకు మాత్రం ఆ పార్టీ నేతల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీకి తెలుగుదేశం మద్దతు, ఆసరా అవసరమని ఆ పార్టీ హైకమాండ్ గుర్తించింది. అందుకే నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా తెలుగుదేశంతో పొత్తు విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నామంటూ ఫీలర్స్ పంపుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక లో తగిలిన ఎదురు దెబ్బ బీజేపీ ఆత్మ విశ్వాసాన్ని గట్టిగానే దెబ్బతీసిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా.. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ కు కర్నాటక విజయం ఒక జీవన్ టోన్ టానిక్ లా పని చేస్తోందని అంటున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో  ఐక్యంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కబలించడమే ధ్యేయంగా గత ఎనిమిదేళ్లుగా సాగిన బీజేపీ మనుగడ ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చింది. 

తెలుగుదేశంతో పొత్తు.. ఇప్పుడు బీజేపీ అవసరం!

కర్నాటక పరాజయంతో బీజేపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని పరిశీలకుల విశ్లేషణ. అందుకే  ఏపీలో ఆ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. తెలుగుదేశంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలన్న తమ మిత్రుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలిస్తోందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బీజేపీ ఏపీ నాయకులు. మరీ ముఖ్యంగా ఇంత కాలం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో అంటకాగుతోందన్న అభిప్రాయం బలంగా ఏర్పడేందుకు దోహదపడిన జీవీఎస్ నరసింహం, సోము వీర్రాజులే కొత్త పల్లవి అందుకున్నారు. కర్నాటకలో బీజేపీ పరాజయానికి ముందు వరకూ వీరి వాణి, బాణి ఇలా లేదు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తుకు నో అంటూ వచ్చారు.  కర్నాటకలో బీజేపీ ఘోర పరాజయంతో వారికి వాస్తవం తెలిసి వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. ఏపీలో బీజేపీతో పొత్తు ఇటు తెలుగుదేశంకైనా అటు జనసేనకైనా తెల్ల ఏనుగు లాంటిదే. ఒక గుది బండ లాంటిదే. పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండో మూడో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. బీజేపీకి రాష్ట్రంలో  కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని పరిస్థితుల్లో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించడం కూడా  జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఏ మంత ప్రయోజనం చేకూర్చే అంశం కాదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక కారణంతో ఆ పార్టీని జట్టులో చేర్చుకున్నా.. ముందుగా బీజేపీ రాష్ట్రంలో వైసీపీతో అంటకాగడం లేదన్న విషయాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. నేరుగా చెప్పకపోయినా తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆ మాట అనేశారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందన్న మాట మేం అనడం లేదు.. జనం అంటున్నారు అన్న అచ్చెన్నాయుడు, బీజేపీ వైసీపీకి దగ్గరగా ఉందన్న భావన జనంలోంచి పోగొట్టుకోవలసి బాధ్యత బీజేపీదే అని కూడా అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో జనం దృష్టిలో బీజేపీ పలుచన కావడానికి ఉన్న కారణాలలో వైసీపీ అక్రమాలు, అన్యాయాలు, అస్తవ్యస్త నిర్ణయాలు ఇలాఅన్నిటికీ, అన్ని విధాలుగా కేంద్రంలోని మోడీ సర్కార్ సహాయ సహకారాలు అందిస్తోందన్న భావన జనంలో ఏర్పడటానికి తమ పార్టీ తీరే కారణమన్న బాధ ఏపీ బీజేపీలోని ఒక వర్గంలో  బలంగా ఉంది. అందుకే పలు సందర్బాలలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేసింది. అయినా అధిష్ఠానం వైఖరిలో మార్పు రాకపోవడంతో కొందరు బహిరంగంగానే పార్టీ హైకమాండ్ తీరును విమర్శిస్తుంటే.. కన్నా వంటి వారు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి  తమ దారి తాము చూసుకున్నారు. తాజాగా విష్ణుకుమార్ రాజు ఒక చానెల్ తో మాట్లాడుతూ పార్టీ తీరును ఎలాంటి శషబిషలూ లేకుండా ఎండగట్టి.. హై కమాండ్ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. పార్టికీ రాష్ట్రంలో బలం లేదన్న విషయం అందరికీ తెలిసినా, నిన్న మొన్నటి వరకూ సైద్ధాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా ప్రజలలో ఏదో మేరకు కొద్ది పాటి గౌరవమైనా ఉండేది. కానీ జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర బీజేపీ తీరుతో జనంలో ఆ కొద్ది పాటి గౌరవం కూడా సన్నగిల్లింది. సైద్ధాంతిక నిబద్ధతను బీజేపీ రాష్ట్ర నాయకత్వం గాలికొదిలేసిందనీ.. జగన్ భజనలో తరించి సొంత లాభం కొంత చూసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అడ్డగోలు రుణాలకు కేంద్రం నిబంధనలకు తిలోదకాలిచ్చేసి మరీ పచ్చజెండా ఊపడం, అలాగే వైసీపీ సర్కార్ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకుంటున్న చర్యలకు వత్తాసు పలకడం వంటి చర్యలతో కేంద్రంలోని మోడీ సర్కార్  జగన్ కు అండగా నిలుస్తోందన్నది జనం అభిప్రాయం. జనం ఇంతగా వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్ భుజాన మోస్తున్నదని జనం భావిస్తుంటే.. అటువంటి బీజేపీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ  ఏలా ముందుకు వస్తుందన్నది ఆ పార్టీ నాయకులు అంటున్న మాట. జగన్ ప్రభుత్వంపై తమకు ఎలాంటి ప్రత్యేక ప్రేమ, అపేక్ష లేదని ప్రజలకు అర్దమయ్యేలా బీజేపీ ఇప్పటికైనా చర్యలకు ఉపక్రమిస్తే.. అప్పుడు పొత్తు విషయం ఆలోచిస్తామని తెలుగుదేశం నాయకులు పరోక్షంగానైనా విస్పష్టంగా చెబుతున్నారు. బీజేపీ వైసీపీతో అంటకాగుతోందన్నది ప్రజాభిప్రాయం అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనడం వెనుక అర్దం అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలవాలన్నది బీజేపీ ఛాయిస్ గా ఎంత మాత్రం  లేదు. ఆ పార్టీకి నెససిటీ అంటే అవసరం. బీజేపీని కలుపుకోవాలా వద్దా అన్నది తెలుగుదేశం ఛాయిస్. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలూ అందడం లేదనీ, అందవని నిర్ధారణ అయ్యేలా బీజేపీ తీరు మారడాన్ని బట్టే ఆ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో తెలుగుదేశం నిర్ణయం ఉంటుందని అంటున్నారు. 

ఒంగోలుపై బాలినేని పట్టు!?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాపై పట్టు కోసం వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య పోరు నడుస్తున్న సంగతి విదితమే. ఇటీవలి కాలంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలకు వైవీ సుబ్బారెడ్డి కారణమనే అనుమానం కూడా బాలినేనిలో ఉంది. ఆ అభిప్రాయాన్నీ, అనుమానాన్నీ బాలినేని ఏమీ దాచుకోవడం లేదు. కొద్ది రోజుల కిందట ప్రాంతీయ కన్వీనర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని, సొంత జిల్లా బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రిని కోరినా,  జగన్  అందుకు సుతరామూ అంగీకరించలేదు. పార్టీలో అందరికీ ఒకటే నిబంధన ఉంటుందని తేల్చేశారు. ఇక చేసేది ఏమీ లేక..బాలినేని మిన్నకుండిపోయారు. బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీ సానుభూతిపరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో బాలినేనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయడానికి ముఖ్యమంత్రి చిన్నాన్న, ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వైవీసుబ్బారెడ్డి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వైవీ పార్లమెంటుకు పోటీ చేస్తారా అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే విషయంలో ఇప్పటి వరకూ అయితే క్లారిటీ లేదు. 2019లో వైవీ సుబ్బారెడ్డికి టిక్కెట్ దక్కకపోవడంతో రెండు విడతల్లో టీటీడీ ఛైర్మన్  పదవిని ఇచ్చి జగన్ కాంపన్ సేట్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని, మంత్రి వర్గంలో చోటును ఆశించినా సిఎం మాత్రం దానిని నెరవేర్చలేదు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం  వైవీ సుబ్బారెడ్డి మాట జగన్ వద్ద చెల్లుబాటు అవుతోందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఒంగోలు నుంచి బాలినేనికి బదులుగా వైవీకి వైసీపీ టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని ఒంగోలు నుంచే తాను పోటీ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, బాలినేని వైసీపీలో కొనసాగుతారా అన్న చర్చకు తెరతీసింది.  అంతే కాకుండా నేరుగా సీఎంపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రడ్డి బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని, అదే సమయంలో నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉందని బాలినేని అన్నారు. ఈ వైఖరిని జగన్ మార్చుకోకపోతే గడ్డు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందనడంలో సందేహం లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు.  వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఒంగోలు నుంచే తన పోటీపై మరింత స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయంగా జీవితావన్ని ఇచ్చిన ఒంగోలును వదిలిపెట్టే ప్రశ్నేలేదని కుండబద్దలు కొట్టేశారు.   తనను నమ్ముకున్న వారిని, తమ పార్టీ అధినేత  జగన్ ను తప్ప ఎవరినీ లెక్క చేయనని పరోక్షంగా ప్రత్యర్థుల గట్టి హెచ్చరిక చేశారు.  మార్కాపురం, గిద్దలూరు, దర్శి లలో ఏదో ఓ చోటు నుంచి పోటీలో ఉంటానంటూ ఇటీవల వస్తున్న ప్రచారాన్ని బాలినేకి కొట్టి పారేశారు.  సొంత పార్టీలోని వారే ఇటువంటి  ప్రచారాన్ని చేస్తున్నారనీ, తనకు వ్యతిరేకంగా  కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారనీ బాలినేని చెప్పారు.  అటువంటి వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదనిపించిందని కార్యకర్తలు తనను ఇప్పటికి అయిదుసార్లు గెలిపించారని వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు.  ఇలా ఉండగా పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని ఉద్దేశించి చేసినవేనని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఒంగోలు నంచి పోటీ చేస్తాననంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి  స్పందన ఎలా ఉంటుందనే  దానిపై అందరూ ఆసక్తి తో చూస్తున్నారు.

ముదిరి పాకాన పడ్డ గెహ్లాట్ పైలట్ వివాదం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత  సచిన్ పైలట్  మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.  పైలట్ ..బాహాటంగానే.. గెహ్లాట్ పై సంచలన విమర్శలు చేశారు. గత  బీజేపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీపై ఈ నెలాఖరులోపు చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయన చేపట్టిన అయిదు రోజుల జన్ సంఘర్ష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు.  తమ డిమాండ్లను ఈ నెలాఖరులోపు అంగీకరించకపోతే ప్రతి గ్రామంలోనూ ఆందోళన చేపడతామని, తాను దేనికీ భయపడనని, పదవిలో ఉన్నా, లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాననీ చెప్పిన పైలట్ తననెవరూఅణచివేయలేరన్నారు. పార్టీలో విభేదాల గురించి మాట్లాడుతూ ఆయన గెహ్లాట్ వర్గంపై పరోక్ష విమర్శలు చేశారు. గెహ్లాట్ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తాము కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానన్నారు. 2020లో  ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు బీజేపీ నేత వసుంధర రాజే అండగా నిలిచారంటూ ఇటీవల గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపైనా పైలట్ పరోక్షంగా స్పందించారు.  గెహ్లాట్ తన సొంత పార్టీ నేతలను తూలనాడుతూ  ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రశంసిస్తున్నారు.  అయినా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులు తప్ప ఇంకేవీ పనిచేయవని పైలట్ పేర్కొన్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానంపెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇరువురు నేతలతో చర్చించి వారి మధ్య మనస్పర్ధలు తొలిగించడంపై హై కమాండ్ దృష్టి సారించడం లేదు. వివాదాన్ని పరిష్కరించకుంటే.. ఇది మరో  మధ్యప్రదేశ్ అంటే కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ గా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రజాభీష్టం.. కన్నా

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయాలన్నది జనాభీష్టమని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాభీష్టం మేరకే రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటాయని చెప్పారు.   తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు సూర్తి చేసుకున్న సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడతారన్నారు. దుర్మార్గంగా పాలన సాగిస్తున్న జగన్ పార్టీని గద్దె దించాలని ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కన్నా అన్నారు.  ముందస్తైనా కాకపోయినా  వచ్చే ఎన్నికలలో వైసీపీ గద్దె దిగడం ఖాయమన్నారు. పామూరు నుంచి గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన దూబగుంట ట్రిపుల్ ఐటీ వరకూ ఏడు కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ పొత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ పీకే డైరెక్షన్ లోనేనని అన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి తెలగాణ వాదంతో ఉన్న టి.ఆర్.ఎస్ తో పోత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.  ఈ పాదయాత్రలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్  డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గోన్నారు.మార్గమధ్యంలో గ్రామ, గ్రామాన వీరికి ఘన స్వాగతం లభించింది.  

కర్నాటక ఫలితం సమీకరణాలను మార్చేసింది!

కర్నాటక ఫలితాల తరువాత   జాతీయ రాజకీయ సమీకరణాలపై చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జరిగిన ఐక్యతా యత్నాలు ఇక నుంచి ఆ ఏతర జాబితా నుంచి అనివార్యంగా కాంగ్రెస్ ను తీసేస్తాయి. ఇకపై ఐక్యతా యత్నాలలో కాంగ్రెస్సేతర అన్న మాట వినిపించే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. 2004 నుంచి యూపీఏ భాగస్వామ్య పక్షాులుగా ఉన్న అనేక పార్టీలు ఆ తరువాత వివిధ రాజకీయ కారణాలతో దూరమయ్యాయి. అయినా కూడా యూపీఏ కూటమి మనుగడ సాగిస్తూనే ఉంది. కానీ గతంలోలా ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ బలంగా లేదు. దీంతో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీకీ, కాంగ్రెస్ కూ సమదూరం అంటూ కొత్త కూటమి ఏర్పాటు  దిశగా పావులు కదిపాయి.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్  వంటి వారు ఎవరికి వారుగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెససేతర కూటమి యత్నాలు చేపట్టినా అవి పెద్దగా ముందుకు సాగలేదు. డీఎంకే అధినేత స్టాలిన్ వంటి వారు  కాంగ్రెస్ లేని విపక్ష కూటమికి తావే లేదని కుండబద్దలు కొట్టేశారు. కర్నాటక ఫలితాల తరువాత కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తామంటూ వస్తున్న నాయకుల స్వరం మారుతోంది. అందరి కంటే ముందుగా తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు విప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. తొలి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అంటూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వరంలో కూడా మార్పు వస్తోంది. బీజేపీ దర్యాప్తు సంస్థల ద్వారా ఆప్ అస్థిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలు కేజ్రీవాల్ కు తత్వం బోధపడేలా చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక యూపీలోని రెండు బలమైన పార్టీలు ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కూడా బీజేపీయేతర కూటమికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో బీఎస్పీ (బహుజనసమాజ్ పార్టీ) జాతీయ రాజకీయ యవనికపై పెద్దగా కనిపించడం లేదు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి గళంలో పదను తగ్గిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే యూపీ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించేవారికి మాత్రం ఈడీ, సీబీఐ కేసుల భయమే మాయావతి మౌనానికి కారణమని అంటున్నారు. ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత ఆమె రాజకీయంగా మరింత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే మమత బెనర్జీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ యేతర కూటమి వైపే అఖిలేష్ యాదవ్ కూడా మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వి ప్రసాద్ వంటి వారు ఇప్పటికే కాంగ్రెస్ తో కూడిన విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతాయి. కూటమిలోకి వచ్చి చేరే పార్టీల సంఖ్యా పెరుగుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక అందరి కంటే ముందుగా కాంగ్రెస్సేత, బీజేపీయేతర కూటమి, నాలుగో ఫ్రంట్ అంటూ గళం విప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనివార్యంగా ఇప్పుడు తన జాతీయ పార్టీని కూడా బీజేపీయేతర కూటమి పంచన చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బుధవారం (మే 17) ఆ పార్టీ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద ఒక్క విజయం.. ఔను ఒకే ఒక్క విజయం కాంగ్రెస్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేసింది. బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దింపాలంటే కాంగ్రెస్సేతర అన్న విధానాన్ని వదులుకోకతప్పదని బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు స్పష్టంగా అర్ధమయ్యేలా చేసింది.  

అవినాష్ రెడ్డికి సీబీఐ పిలుపు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం (మే 16) మధ్యాహ్నం కోఠీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆ నోటీసులలో స్పష్టం చేసింది.  హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన అవినాష్ నోటీసులు అందుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.   అందరూ అనుకున్నట్లుగానే కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ ఎదురు చూసిన సీబీఐ వెంటనే రంగంలోకి దిగింది. వివేకా హత్య కేసులో ప్రస్తుతం కారాగారంలో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 30వ తేదీతో విచారణ పూర్తి చేయాలన్న ఆదేశాలను మరో రెండు నెలల పాటు పొడిగించడంతో సీబీఐ తన విచారణను మరింత లోతుగా జరుపుతోంది.  మరో వైపు వివేకాకు న్యాయం జరగాలంటూ సునీత చేస్తున్న పోరాటం ఈ కేసులో మరికొన్ని కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది.  వివేకా హత్య ఆస్తి కోసమే జరిగిందంటూ అవినాష్ రెడ్డి వర్గం రంగంలోకి దించిన ఆయన రెండో భార్య షమీప్ ఎపిసోడ్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు సునీత భర్త రాజశేఖరరెడ్డిని కూడా సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న విధంగా వివేకా హత్య ఆస్తి కోసం జరగలేదని సిబీఐ నిర్థారణకు వచ్చింది.  దస్తగిరి అప్రూవర్ గా మారి వివేకా హత్య జరిగిన వైనాన్ని పూసగుచ్చినట్లు చెప్పడంతో సీబీఐతో పాటు సామాన్య ప్రజలకు కూడా జరిగినది ఏమిటో అర్దమైంది.  కడప జిల్లాలో మరీ ముఖ్యంగా పులివెందులలో వివేకా హత్యకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తున్నాయి. గత రెండు వారాలుగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసిన సబీఐ బృందం అనేక మందిని కలిసి సాక్ష్యాలను సేకరించింది. అలా సేకరించిన సాక్ష్యాలపై అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాచ్ మెన్ రంగన్న తో పాటు ఎర్రగంగిరెడ్డి, భాస్కరరెడ్డి, దస్తగిరి, ఉదయ్ కుమార్ రెడ్డిల నుండి సేకరించిన వివరాలు అవినాష్ రెడ్డి విచారణలో కీలకం కానున్నాయి. ఏది ఏమైనా అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న వివేకా హత్య కేసు ఆయన అరెస్టుతోనే ఓ కొలిక్కి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

జాతీయ రాజకీయాలపై కెసీఆర్ ఫోకస్

భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనుంది.కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బిఆర్ఎస్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో  పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు ,  ప్రధాన ప్రత్యర్థి బిజెపిని ఓడించడం, స్థానిక రాజకీయాల్లో పావులు కదపాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం కెసీఆర్ ముందు ఉన్న సవాల్. కర్ణాటక ఫార్ములాను ప్రయోగించాలని ఆయన మదిలో బలంగా ఉంది.  కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపబోదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. కర్ణాటక ఫలితాలు వచ్చినప్పుడు రామారావ్ యుకెలో ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. మంత్రి  కెటి రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించే ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను అడ్డుకోవడానికే కెటిఆర్ ఆ విధంగా  స్టేట్ మెంట్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లి చూపులు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్  మూడోసారి అధికారంలో రావాలని చూస్తోంది.  మహరాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశముందని బిఆర్ఎస్ కు ఉప్పందింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టింది.   తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో  బిఆర్ఎస్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయ. మెదక్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు కర్ణాటక బార్డర్ లో ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కప్ప గంతులు వేసే ప్రమాదముందని అధి నాయకత్వం గుర్తించింది.  ఈ జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వాళ్లు  ప్రతీరోజు కర్ణాటక రాష్ట్రానికి వెళుతుంటారు. కన్నడ వచ్చిన వారు ఈ జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాల్లో ఉన్న వోటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండకూడదన్న తలంపుతో బిఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది.  జూన్ రెండో తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ఎస్  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఉత్సవాలల్లో స్థానికులను భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశం మేరకు ఆయా రాష్ట్రాలలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి కారణమైన డెవలప్ మెంట్, వెల్ఫేర్ స్కీంలను అన్ని చోట్ల ప్రచారం చేయాలని ఇప్పటికే కేసీఆర్ పార్టీ క్యాడర్ ను ఆదేశించారు.   సర్పంచ్ నుంచి మొదలు ఎంఎల్ ఏ,  ఎంపీల వరకు తమ నియోజకవర్గాల్లో అమలవుతున్న ప్రభుత్వ స్కీములను ప్రచారం  చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎందుకంటే వచ్చే డిసెంబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. సమయం ఎక్కువ లేదు. ప్రచారమే మన ముందున్న లక్ష్యమని కేసీఆర్ క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్ని సినిమా హాల్స్ లో స్లైడ్స్ వేయాలని, టీవీలు, పత్రికల్లో ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ కార్యకర్తలకు ఆదేశించారు.    

టీడీపీ దారే ఇక బీజేపీ దారి!

కర్నాటక ఫలితాలు ఏపీలో బీజేపీకి అన్ని దారులూ మూసేశాయి.  ఇక ఆ పార్టీ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదనలకు తలూపడం తప్ప మరో మార్గం లేకుండా చేశాయి. కాదని ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీతో అంటకాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదన్న విషయం బీజేపీకి కర్నాటక ఫలితాలు వెలువడిన వెంటనే అవగతమైంది. అందుకే ఏపీలో ఆ పార్టీ నేతల టోన్ మారింది. ఏపీ బీజేపీలో వైసీపీ వ్యతిరేక వర్గం నోరు నొక్కి మరీ ఏక ఛత్రాధిపత్యం చెలాయించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జేవీఎల్ ల గళం వెంటనే మారింది. ఏపీలో జనసేన, బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని జేవీఎల్ కు కర్నాటక ఫలితాల తరువాతే గుర్తుకు వచ్చింది. మిత్రుడి ప్రతిపాదనను.. అంటే జనసేనాని తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తమ పార్టీ అధిష్ఠానం చాలా సీరియస్ గా పరిశీలిస్తోందని ఆయన మీడియా ముందు చెప్పారు. గతంలో  అయితే తెలుగుదేశంకు వ్యతిరేకంగా చాలా గట్టిగా గళమెత్తిన జేవీఎల్ ఒక్క సారిగా ఇలా మెత్తపడిపోవడం వెనుక బీజేపీ అగ్రనాయకత్వం మందలింపు ఉందని అంటున్నారు. ఏపీ బీజేపీలో గతంలో చాలా మార్లు సోము, జేవీఎల్ ల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే అధిష్ఠానం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో ఏవో కొన్ని స్థానాలను ఒప్పందంలో భాగంగా వైసీపీ నుంచి పొందే యోచనలోనే ఇప్పటి వరకూ ఉంది. ఆ కారణంగానే  వైసీపీ అవినీతిపై ఎవరెంత మొత్తుకున్నా, ఆర్థిక అరాచకత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చూసీ చూడనట్టుగానే వ్యవహరించింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ అడ్డగోలు అప్పులకు పచ్చజెండా ఊపుతూ వచ్చింది. కర్నాటక ఫలితాలకు రెండు రోజుల ముందు కూడా ఏపీ సర్కార్ కు ఆర్థిక వెసులుబాటు దక్కే విధంగా భూరీ రుణాన్ని బాండ్ ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి తెచ్చుకునే వెసులు బాటు కల్పించింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు ఇటువంటి వెసులు బాటు దక్కకుండా చేసిన కేంద్రంలోని బీజేపీ.. ఏపీ విషయంలో మాత్రం అపారమైన ఉదారతను చూపింది. అయితే కర్నాటక ఫలితంతో ఇక ఆ వెసులుబాట్లు, ఆ ప్రత్యేక అభిమానాన్ని బహిరంగంగా చాటే ధైర్యం ఇక బీజేపీ హైకమాండ్ చేసే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అవినీతిపై విమర్శలు గుప్పించిన బీజేపీ.. స్వయంగా తమ ప్రభుత్వంపై 40శాతం కమిషన్ ఆరోపణను పూర్తిగా విస్మరించి దెబ్బతింది. ఏపీలో కూడా ఇంత వరకూ బీజేపీ అదే పంథాను అనుసరిస్తూ వస్తోంది. గత తెలుగుదేశం హయాంలో అవినీతిపై జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణలకు వత్తాసు పలుకుతూ.. వైసీపీపై వచ్చిన అవినీతి ఆరోపణలను మాత్రం పూర్తిగా విస్మరించింది. స్వయంగా ప్రధాని మోడీ జగన్ సర్కార్ అక్రమాలపై చార్జ్ షీట్లు రూపొందించలని మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విస్మరించిందంటేనే.. మోడీ ఆదేశాలలోని సీరియస్ నెస్ అర్థమౌతుంది. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఫలితంతో ఏపీ ప్రభుత్వ అవినీతిని పట్టించుకోకుండా ఆ పార్టీతో అంటకాగితే ఉన్న ఒక శాతం ఓటు బ్యాంకు కూడా చేజారిపోతుందన్న వాస్తవాన్ని బీజేపీ గ్రహించడంతోనే.. ఆ పార్టీ రాష్ట్ర శాఖలోని జగన్ అనుకూల వర్గం స్వరం మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే ఇంత కాలం పట్టించుకోని జనసేన అధినేతను తమ  మిత్రుడంటూ భుజాన ఎక్కించుకుంటోందని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే ఆయన  రాష్ట్రంలోని జగన్ సర్కార్ పతనమే ద్యేయం అని విస్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాకుండా మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి హస్తిన వెళ్లి మరీ.. తాను తెలుగుదేశంతో కలిసి నడుస్తాననీ, బీజేపీ కూడా కలిస్తే మంచిది.. లేకుంటే మీదారి మీది.. నాదారి నాది అని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తరువాతే బీజేపీ హైకమాండ్ నుంచి జగన్ అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలకు రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఇక ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత  స్పష్టంగా రాష్ట్రంలోని అధికార పార్టీకి  తాము దూరం అన్న విషయాన్ని ప్రజలకు అర్దం అయ్యేలా చెప్పేందుకు ఉపక్రమించింది. ఆ విషయాన్ని రాష్ట్రనాయకత్వానికి అర్దమవ్వడంతోనే జేవీఎల్ స్వరం మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోలా జగన్ అడ్డగోలు అప్పులకు, ఆర్థిక అరాచకత్వానికి ఇక నుంచి కేంద్రం నుంచి సపోర్టు దక్కే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. జేవీల్ ప్రకటనతో వచ్చే ఎన్నికలలో బీజేపీ తెలుగుదుశం, జన సేన కూటమితోనే కలిసి నడుస్తుందనడానికి ఇది స్పష్టమైన సంకేతంగా అభివర్ణిస్తున్నారు. 

ఫలితాల తర్వాత వామ పక్షాల వైఖరిలో మార్పు

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో విపక్షాలు బీజేపీతో పాటు మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇన్నాళ్లు కాంగ్రెస్, బిజెపిలను  సమదూరంలో ఉంచిన వామ పక్షాలు ప్రస్తుతం కర్ణాటక ఫలితాల తర్వాత కేవలం బిజెపిని మాత్రమే టార్గెట్ గా ఎంచుకున్నాయి.  పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సిపిఐ, సిపిఎంలు యోచిస్తున్నాయి.  ఈ క్రమంలో సీపీఐ నారాయణ కర్ణాటక ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందన్నారు. ఇంతలా దిగజారిన ప్రధానిని చూడలేదన్న ఆయన రానున్న ఎన్నికల్లో మోడీ ఎట్టి పరిస్థితుల్లో రారని వ్యాఖ్యానించారు మత విద్వేషాలు రెచ్చగొట్టారని, లౌకిక దేశానికి మోడీ ప్రధానిగా అనర్హుడని నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక ప్రజలు బీజేపీని చితక్కొడడంతో సౌత్ లో ఆ పార్టీకి గేట్లు మూసుకుపోయాయన్నారు నారాయణ. కర్ణాటక ఫలితాలు దేశానికే దిక్సూచి అని అన్నారు. ఇక తెలంగాణలో మాకో ఆప్షన్ వచ్చిందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి సీన్ లేదని.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే పోటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కర్ణాటక ఎన్నికల ప్రభావం తప్పని సరిగా తెలంగాణ పై ఉంటుందన్నారు. అయితే కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి రావడం లేదని.. కొన్ని రోజుల పాటు చూసి ఆ తరువాత మా రూట్ మేము చూసుకుంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పొత్తులపై చర్చ చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.ఇక మాక్కూడా సీట్లు కావాలని, మేమేం రాజకీయ సన్యాసం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి త్వరలోనే కామ్రెడ్లు కాంగ్రెస్ తో దోస్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.

కర్నాటక సీఎం పదవి.. ఎవరిని వరించేనో?

డీకే శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలు కావడంలోనూ.. అంచనాలకు సైతం అందనంతగా కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలోనూ డీకే శివకుమార్ ది కీలక పాత్ర. కర్నాటక పీసీసీ చీఫ్ కూడా.  పార్టీ విజయానికి ప్రధాన కారకుడు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాడె  మోసి కాంగ్రెస్ రాష్ట్రంలో నిలబడటంలో కీలక భూమిక పోషించిన డీకే శివకుమార్ కు మాత్రం ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేసులో ఆయన ముందువరుసలో ఉన్నప్పటికీ ఆ పదవి ఆయనకు దక్కే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు ఆయనకు ప్రధానంగా అడ్డంకులు సృష్టిస్తున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని అంటున్నప్పటికీ.. బీజేపీ వ్యూహాత్మకంగా గతంలో ఆయనపై పెట్టిన కేసులు, సీబీఐ దర్యాప్తే కారణమని అంటున్నారు. కర్నాటకలో బీజేపీ ఇలా పరాజయం పాలైందో లేదో.. ఆ పరాజయానికి ప్రధాన కారకుడైన డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టే విధంగా బీజేపీ అధిష్ఠానం పావులు కదిపిందంటున్నారు. బీజేపీ ఎత్తుగడలో భాగమే.. సీబీఐ కత్త బాస్ గా ప్రణీత్ సూద్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఈ మూవ్ సిద్దరామయ్యను ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు. కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా నియమించడంతో డీకే శివకుమార్ పై బీజేపీ బనాయించిన అవినీతి కేసుల దర్యాప్తును మళ్లీ తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయన సీఎం రేసులో వెనుకబడేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించందని అంటున్నారు. శివకుమార్ ను ఒక వేళ పార్టీ అధిష్ఠానం సీఎంగా ఎంపిక చేసి పదవి కట్టబెట్టినా.. కేసుల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న అనుమానాలున్నాయి. దీంతో కర్నాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్యనే ఎంపిక చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. డీకే కూడా అదే అభిప్రాయంతో హస్తిన వెళ్లకుండా బెంగళూరులోనే ఉండిపోయారనీ, తన అసంతృప్తిని మాత్రం తన మాటల ద్వారా గట్టిగా వ్యక్తం చేస్తున్నారనీ అంటున్నారు. తాను కాంగ్రెస్ కోసం చేయగలిగినంత చేశాననీ, ఎన్నో త్యాగాలు చేశాననీ అంటున్నారు. సిద్దరామయ్యతో విభేదాలున్నాయన్న వార్తలు కేవలం వదంతులేనని స్పష్టం చేసిన డీకే శివకుమార్ గతంలో ఎన్నో మార్లు ఆయనకు మద్దతుగా నిలబడ్డానని గుర్తు చేస్తున్నారు. కర్నాటక సీఎం ఎపింక కసరత్తు జరుగుతున్న తరుణంలో డీకే మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసులు, అరెస్టు ముప్పు పొంచి ఉన్న డీకే శివకుమార్ కు చాన్సెస్ తక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా అదే భావంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ అభిమానులు, అనుచరులు ఫెక్సీ వార్ కు తెరతీశారు. ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ అంతర్గత కలహాల కారణంగా ఆ విజయ ఫలాలను చేజార్చుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని  మరోసారి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నది. అయితే రాష్ట్రంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఇప్పటికే సిద్ధరామయ్యకు ముఖ్యమత్రి పదవి విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. అందుకే ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని పరిశీలకులు హస్తిన వెళ్లినా, వారి వెంట సిద్దరామయ్య కూడా హస్తిన బాట పట్టినా డీకే శివకుమార్ మాత్రం బెంగళూరు దాట లేదు. తాను చేయాల్సిందంతా చేశాననీ, బీజేపీ కుట్రపూరితంగా తనను జైలు పాలు చేసినప్పుడు సోనియా గాంధీ తనను జైలుకు వచ్చి మరీ పరామర్శించిన సంగతినీ గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ విజయంతో తన పాత్రను అధిష్ఠానం విస్మరించదన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి డీకే, సిద్ధరామయ్యల మధ్య పంచాయతీని కాంగ్రెస్ అధిష్ఠానం ఎటువంటి నష్టం లేకుండా ఎలా పరిష్కరిస్తుందో. 

వీకెండ్ విరామం లేదు.. లోకేష్ పాదయాత్ర నిరాటంకం!

పాదయాత్ర మొదలు.. మధ్య మధ్యలో విరామం ఇచ్చి.. ప్రతీ గురువారం రాత్రి విమానంలో హైదరాబాద్‌కు వచ్చేసి.. మళ్లీ ఆ మరునాడే అంటే శుక్రవారం సాయంత్రం విమానం ఎక్కి అటు విజయవాడ ఎయిర్‌పోర్టో లేదా రాజమండ్రి ఎయిర్ పోర్టో అదీకాకుంటే కోడి కత్తితో అదృష్టాన్ని తెచ్చి పెట్టిన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనో దిగి పాదయాత్ర ఎక్కడ వరకు ఆపారో.. అక్కడికి చేరుకొని.. మళ్లీ పాదయాత్ర కొన... సాగించడాలు లేవు. అలాగే నేను ఉన్నాను.. నేను విన్నాను లాంటి కాకమ్మ కబుర్లు లేవు... ఇక తెచ్చి పెట్టుకొన్న షిక్కటి  చిరునవ్వులు అయితే అసలు లేవు కాక లేవు.. ఉన్నది ఒక్కటే.. దృఢ సంకల్పం.. స్థిర చిత్తం.. వీటినే ఆయుధంగా మలుచుకొని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం  పాదయాత్ర నిర్విరామంగా ముందుకు దూసుకు పోతోంది. ఓ వేళ ఆయన.... తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చినా, అది నందమూరి తారకరత్న మరణించిన సమయంలో హైదరాబాద్ చేరుకొని.. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. మళ్లీ  వెంటనే తిరిగి వచ్చి తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకేష్. అలాగే హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించినా...  ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభ వేడుక ఘనంగా జరిగినా నారా లోకేష్  తన పాదయాత్రకు  తాత్కాలిక  విరామం ఇచ్చి.. వాటిలో పాల్గొన లేదు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం మేమే నెంబర్ వన్ అంటూ.. జీవో నెంబర్ వన్ తీసుకు వచ్చినా.. అలాగే యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్‌కు పోలీసులు పలు రకాల అడ్డంకులు సృష్టించినా.. ఎక్కడ ఆయన పాదం అగిందీ లేదు.. మరెక్కడా ఆయన వెనకడుగు వేసింది లేదు.   అలా జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర విరామం లేకుండా.. ప్రతి రోజూ..   గ్రామాలు, పట్టణాల ప్రజలతో ఆయన మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నారు. అలాగే  రైతులు, మహిళలు, యువత... ఇలా అందరిని కలుసుకొంటూ.. వారి సమస్యలను అడిగి.. వాటిని సావధానంగా వినడం.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ  స్పష్టమైన భరోసా సైతం కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.  అయితే నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మే 15వ తేదీ అంటే సోమవారం వంద రోజుల మైలు రాయిని చేరుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఆయన చేపట్టిన పాదయాత్ర శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొని..  అశేష ప్రజాభిమానంతో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికి రాయలసీమలోని మూడు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. అదీ రాయలసీమ... ఆ పైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇలాకా కడప జిల్లాలో సైతం నారా లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం సైతం పట్టారు. ఇక ఆయన పాదయాత్ర కోస్తా జిల్లాల.. మీదగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తే..  ఇక జనం ప్రభంజమే అని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు నారా లోకేశ్ 100వ రోజు మైలురాయిని పూర్తి చేసుకొంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అందులోభాగంగా నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజవర్గాల్లోని పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించనున్నాయి.      ఇక మే రెండో ఆదివారం మదర్స్ డే ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 99వ రోజు అంటే మే 14వ తేదీ ఆదివారం తన పాదయాత్ర ముగించుకొని శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల క్యాంప్ వద్దకు ఆయన చేరుకొగానే.. ఎదురుగా తల్లి భువనేశ్వరి కనిపించడంతో నారా లోకేశ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఈ 100వ రోజు లోకేశ్ పాదయాత్రలో తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇక భర్త చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రానీ నారా భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి అడుగు వేయడం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువగళం పేరుతో నారా లోకేశ్ 2023, జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర.. 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది.

మల్లి ఖార్జున్ ఖర్గే పై పరువు నష్టం దావా

కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొందింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టయ్యింది. ఎన్నికల ప్రచారంలో మల్లి ఖార్జున ఖర్గే చేసిన వాఖ్యలు ప్రస్తుతం ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఎన్నికల ప్రసంగాల్లో  భజరంగ్ దళ్ పై మల్లి ఖార్జున ఖర్గే వాడిన పదాలు ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని హిందూ సురక్షా పరిషత్ పేర్కొంది.  కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. హిందూ సురక్షా పరిషత్ భజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్ వాసి అయిన హితేష్ భరద్వాజ్ ఖర్గేకి వ్యతిరేకంగా రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా భజరంగ్ దళ్ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలను ఖర్గే చేసినట్టు ఆరోపణ.  జాతి వ్యతిరేక సంస్థలతో సమానంగా భజరంగ్ దళ్ ను కాంగ్రెస్ పార్టీ పోల్చినట్టు హితేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పదో పేజీలో భజరంగ్ దళ్ ను జాతి వ్యతిరేక సంస్థలతో పోల్చారు. తాము ఎన్నికల్లో గెలిస్తే నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చారు’’ అని హితేష్ భరద్వాజ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల చూపు సిద్ద రామయ్యవైపే

 కర్ణాటకలో కాంగ్రెస్ విజయ భేరి మోగించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయం వాడి వేడిగా చర్చ జరుగుతోంది. సిద్ద రామయ్య పూర్వాశ్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్లీ ముఖ్యమంత్రి చాన్స్ దొరకవచ్చని తెలుస్తోంది.  గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న డి. శివకుమార్ కు అవకాశం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం యోచిస్తుండగా ఎమ్మెల్యేల చూపు సిద్దరామయ్య వైపే ఉన్నట్లు తెలుస్తోంది.  కర్ణాటకలో కాంగ్రెస్ విజయ భేరి మోగించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఉత్కంఠగా మారింది.  సిద్ద రామయ్య పూర్వాశ్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనినే మళ్లీ సీఎం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తుంది. ఇక పోతే డీకే శివకుమార్ పై ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అతన్ని బలపరిస్తే కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేసులు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేయవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా? అంటే ఆ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన సిద్ధరామయ్యవైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం సీటు రేసులో సిద్ధరామయ్యే ముందంజలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడుతున్న విషయం తెలిసిందే! ఈ నేతలు ఇద్దరిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యే ముందుండగా.. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనకబడ్డట్లు సమాచారం. దీంతో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.