కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి ?

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అక్కడి విజయంతో ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నిండుకుంది. దీంతో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఉత్సాహంతో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ఇతర పార్టీల్లోని అసంతృప్తవాదులకు ఓ ఆప్షన్ గా కాంగ్రెస్ మారింది. దీంతో భారీ స్థాయిలో ఆ పార్టీకి సభ్యత్వం నమోదు కావడంతో పాటు కొంత మంది కీలక నేతలు గాంధీభవన్ మెట్లెక్కే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావ్ లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అయితే కొన్నాళ్ల నుంచి వీరిద్దరు ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్దంలో ఉన్నారు. బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం బాగా జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరూ బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. బిఆర్ఎస్ కి  ప్రధాన శత్రువు బిజెపి కాబట్టి వీరిరువురు చేరికలపై రకరకాల రూమర్లు వచ్చాయి.  అయితే కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ లోనే చేరడం బెటర్ అని ఇద్దరు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకోవడం పైగా ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కు బలం ఉండడంతో.. వారిద్దరు కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ లో చేరడానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో వారు సేవ్ వనపర్తి ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. అదే విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వాస్తవానికి  పొంగులేటి బీజేపీలోకి చేరాలని భావించారు. దీంతో ఆయన బీజేపీ చేరికల కమిటీతో రెండు మూడు సార్లు భేటీ కూడా అయ్యారు. ఆయన ఇంటికి ఈటల బృందం వెళ్లింది కూడా. అయితే ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లోకే ఆయన్ని చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత  నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి అప్పుడు ప్రకటించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంతో ఆయన కాంగ్రెస్ లోకే వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాగా, ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లోకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.  

కర్ణాటక బాటలో తెలంగాణా కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్ కు ఊపునిస్తున్నాయి. అంతే కాదు దిశానిర్ధేశం కూడా చేస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీనే గద్దెదింపిన అధిష్టానం రూట్లోనే టీపీసీసీ సీనియర్లు అడుగులు వేయడానికి స్కెచ్ వేస్తున్నారు. దక్షిణాదిలో  ఒక్క కర్ణాటకలో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. మొన్నటి ఫలితాలు బిజెపిని మట్టి కరిపించి కాంగ్రెస్ ను అందలం ఎక్కించింది.    కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. అధికారంలో ఉన్న మంత్రులు,నేతలు, పార్టీ పై ఉన్న వ్యతిరేకతే అనే నిర్థారణకు వచ్చారు. ఇక నిరుద్యోగం, నిత్యావసర ధరల పెంపు, అవినీతి,కమిషన్లు ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు వాటి పై విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికలకు చాలా  రోజుల ముందే ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ మొదటి జాబితా మార్చిలోనే ఖరారైంది.ఇలా అభ్యర్థులను ముందే ప్రకటించడం వల్ల కాంగ్రెస్ విజయానికి దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా కర్ణాటక బాటలోనే ముందుగానే ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.  దీనికి ఆకర్షితులై కన్నడిగులు కాంగ్రెస్ కు పట్టంకట్టారని.. కాబట్టి ఇదే ఫార్ములాను తెలంగాణలో అప్లై చేస్తే మంచి ఫలితాలు ఇక్కడ కూడా వస్తాయని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఓపినీయన్ కు వచ్చారు. రాష్ట్ర ప్రజల్లో వివిధ అంశాల్లో ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకతను ఎజెండాగా తీసుకోవాలనుకుంటుంది టీపీసీసీ.  అయితే కర్నాటకలో బీజేపీ సత్తా ఏంటో తెలిసిపోయిందని, ఇక తెలంగాణలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి, వైపల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతలనే ప్రధానంగా చేసుకొని కార్యాచరణను రూపొందించుకోవాలని టి కాంగ్రెస్ భావిస్తోంది. ఇక హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సరిహద్దు నియోజకవర్గాల్లో మరింత దృష్టి పెట్టి, అవసరాన్ని బట్టి కర్ణాటక నేతలను సైతం రప్పించే అవకాశమున్నది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా వైఫల్యాలను తెరపైకి తెచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయలు, నిరుద్యోగులు , విద్యార్థులు, యూత్ కు చేరువ కావాలన్నాది కాంగ్రెస్ స్కెచ్. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ లో ప్రకటించిన డిక్లరేషన్ రైతులు, వ్యవసాయం పైన ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్. అదే విధంగా ప్రియాంక గాంధీ సమక్షంలో రిలీజ్ చేసిన డిక్లరేషన్ యూత్ పైన ఫోకస్ పెట్టింది. ఈ రెండు ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అనుగుణంగా డిక్లరేషన్ లలో హామీలు ఇచ్చాయి. ఇంకా ఏడు డిక్లరేషన్ లను ప్రకటించడానికి ప్రణాళిక వేసుకున్నది. కర్ణాటక లో వచ్చిన తాజా విజయంతో ప్రభుత్వ వ్యతిరేకతను మరింత బలంగా జనంలోకి తీసుకొని వెళ్లాలనుకుంటున్నారు. కర్ణాటకలో పనిచేసిన ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందనే ధీమాతో కాంగ్రెస్ నేతలున్నారు. మరో వైపు ప్రభుత్వ తొమ్మిది వైఫల్యాలు ఇంకా నెరవేర్చని హామీల లిస్ట్ ను టీ కాంగ్రెస్ వెతికే పనిలో పడింది. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో.. దాన్ని కూడా తెలంగాణలో అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం కర్ణాటకలో విస్తతంగా ప్రచారం చేసినట్లుగానే తెలంగాణలోనూ జాతీయ నాయకులను దింపడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అయితే అధిష్టానం ఫుల్ ఫోకస్ కర్ణాటకపై కేటాయించడంతోనే అలా ఫలితాలొచ్చాయని.. అదే విధంగా తెలంగాణపై దృష్టి సారించాలని టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరనున్నారు. కాకపోతే తెలంగాణలో ఎన్నికలున్నప్పుడే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు రానున్నాయి. దీంతో తెలంగాణలో విజయానికి విస్తృతమైన అవకాశాలున్నందున రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడి నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీని తెలుగువారు నమ్మడం లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరించిందన్న భావన తెలుగువారిలో మరీ ముఖ్యంగా ఆంధ్రులలో చాలా బలంగా ఉంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరించిన తీరు.. ఉద్దేశపూర్వకంగా ఏపీకి, ఏపీ ప్రయోజనాలకూ భంగం వాటిల్లే విధంగానే ఉందన్నది ఆంధ్రుల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది. 2019 ఎన్నికలలో ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా బీజేపీ విజయం సాధించకపోవడమే కాకుండా, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దిక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ఏపీలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి అప్పుడు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఇక ఇప్పుడు తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూడా బీజేపీకి తెలుగువారి ఆగ్రహ జ్వాల సెగ గట్టిగానే తాకింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు అధికంగా ఉన్న ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగువారు స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. 2018లో జరిగిన కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసింది. అయితే తాజా ఎన్నికలలో మాత్రం తెలుగుదేశ పార్టీయే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ  పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. చివరాఖరికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదు. ఆ రాష్ట్రంలో బీడీఎస్ కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎక్కడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. ఆ విషయాన్ని జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పి బీఆర్ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఇక కర్నాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉంటే ఎనిమిది జిల్లాల్లోని 49 స్థానాలలో బీజేపీ కేవలం ఆరు అంటే ఆరు స్థానాలలోనే విజయం సాధించడమే తెలుగు ప్రజలు బీజేపీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ, తెలంగాణ  సరిహద్దు జిల్లాలు సహా దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. దీనిని బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారని తేలుతోంది.   సరిహద్దు జిల్లాలైన కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా దక్కలేదు.  ఇక మొత్తంగా తెలుగు వారి ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న జిల్లాలు కర్నాటకలో రమారమి 10 వరకూ ఉంటాయి. ఆ పది  జిల్లాలలోనూ కలిపి బీజేపీ గులుచుకున్నవి 9 స్థానాలు మాత్రమే. 

సీబీఐకి కొత్త బాస్.. నిష్పాక్షికంగా వ్యవహరిస్తారా?

సీబీఐకి కొత్త బాస్ వచ్చారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (59) ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ గా కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ స్థానంలో ప్రవీణ్ సూద్ ను నియమించింది. మే 25న జైశ్వాల్ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే ప్యానల్.. ప్రవీణ్ సూద్ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్ సమావేశంలో సూద్ ఎంపికపై.. అధిర్ రంజన్ చౌదరి అసమ్మతి నోట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.  1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ సూద్ గత మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దిల్లీ ఐఐటీలో, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. దాంతో పాటు న్యూయార్క్ లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేశారు.  ప్రవీణ్ సూద్ కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్ జిల్లాలకు సూపరింటెండెంట్ గా పనిచేశారు. బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) గానూ సేవలు అందించారు. అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్), మైసూర్ సిటీ పోలీసు కమిషనర్ గానూ  బాధ్యతలు నిర్వహించారు. మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా కూడా ప్రవీణ్ సూద్ పనిచేశారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను ఉపయోగించడం, పౌరులకు సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో.. ప్రవీణ్ సూద్ కు 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు వచ్చింది.  2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు సైతం ఆయన అందుకున్నారు.  చాలా కాలంగా స్వతంత్ర సంస్థ సీబీఐ...  నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదనే వాదన వినవస్తుంది. కేంద్ర కనుసన్నలలో పని చేస్తున్నదనే అపవాదు మూటగట్టుకుంది. దేశ అత్యుత్తమ న్యాయస్థానం ఒకానొకప్పుడు..  సీబీఐ.. పంజరంలో చిలుక అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సైతం.. సీబీఐ పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. నూతన సారధి సారధ్యంలో సీబీఐ పని తీరు ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

జనం..ప్రభం‘జనం’..లోకేష్ పాదయాత్ర@100 డేస్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌  యువగళం  పాదయాత్ర సోమవారం నాటికరి ( మే 15)కి వంద రోజుల ల్యాండ్ మార్క్ కు చేరుకుంది.  కుప్పం నుంచి ప్రారంభించిన ఆయన పాదయాత్ర  ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా  4 వేల కిలోమీటర్ల,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు వంద రోజులకు చేరుకుంది. మరో మూడోందల రోజులు కూడా సాగుతుంది. వాస్తవానికి  ఆయన ఇంత  కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే. ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కదా.   రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఆధునిక (మోడరన్) రావణుడు  ఒక్క ఛాన్స్ పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే మోడరన్ రావణాసుల పాలన అంతమొందించాలన్న సంకల్పంతో  లోకేష్,  యువగళం  పాదయాత్ర చేస్తున్నారని చెప్పవచ్చు.  ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతోంది. ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కొంటున్నారు.  అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో ..01 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేశారు. ఆయన మైక్ లాగేసుకున్నారు. జనాలను ఆయన పాదయాత్రలో అడుగు కలపకుండా ఎన్ని చేయాలో అన్నీ చేసింది జగన్ ప్రభుత్వం.అన్నిటినీ అధిగమించి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఆయన యాత్రకు అవరోధాలు కల్పిస్తునే ఉంది. అయితే పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగుతున్నారు..  లోకేష్ కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని పాదయాత్ర ప్రారంభించడానికి ముందే తెలుసు.   ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత  మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ  లోకేష్ మహాసాహసం చేస్తున్నారన్న విషయం తెలుసు.  అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో ..   లోకేష్ తన పాదయాత్ర సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రజాభిమానం చెలియలకట్ట తెంచుకుని మరీ ఉప్పెనలా ఉప్పొంగుతోంది.  ప్రజల దీవెనలతో దిగ్విజయంగా సాగుతోంది.  లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.  అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పపండం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఎంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్  మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేర్తే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు. చంద్రబాబు దంపతులు.  అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి  400 రోజులు   దూరంగా ఉండడం లోకేష్ కు ఎంత కష్టమో బ్రాహ్మణి, దేవాన్ష్ కు అంతకు మించిన బాధ. అయినా రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం లోకేష్ సుదీర్గ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.   ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన  లోకేష్ కు ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష. ప్రజాభిమానమే కొండంత అండ. ఇక ఆయన అకుంఠిత దీక్షతో పాదయాత్ర కొనసాగిస్తున్న తీరు చూస్తే.. ఔరా అనిపించకమానదు. ప్రతి రోజూ.. తెల్లవారు జామున మొదలు పెట్టి  రాత్రి పదకొండు గంటల వరకూ అలుపెరుగని శ్రమ. గంట పాటు సెల్ఫీలు, ప్రతీ చోటా సమస్యలు తెలుసుకోవడం. భరోసా ఇవ్వడం. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎక్కడికక్కడ నాయకులతో సమాలోచనలు . వంద రోజులుగా  లోకేష్ దినచర్య ఇదే.    ఆయన పాదయాత్రలో జనాల్లేరని చెప్పడానికి వైసీపీ పడిన తాపత్రేయం అపహాస్యం పాలైంది.   ఆయన ప్రసంగంలో  ఎక్కడైనా మాట తడబడితే దాన్ని ఆధారం చేసుకుని ట్రోల్ చేసేందుకు అలా వైసీపీ సోషల్ మీడియాడేగ కన్నుతో ఎదురు చూస్తూనే ఉంది.    లోకేష్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని అవసవ్య మాటలు మాట్లాడిందో అందరికీ తెలుసు.  చివరికి బాడీ షేమింగ్ కు సైతం పాల్పడ్డారు.  అలా రాజకీయాల్లోకి అసలు ఎంట్రీ ఇవ్వకుండానే టార్గెట్ అయిన నేత లోకేష్ ఒక్కరే.  అన్నిటినీ అధిగమించి ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రతి అడుగులోనూ ఆయన ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  అడుగడుగునా ప్రజలతో మమేమౌతూ అడుగులేస్తున్నారు.  ఈ వంద రోజుల నడకలో లోకేష్ ముఖంలో అలసట, విసుగు అన్నవే కనిపించలేదు. ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలను శ్రద్ధగా వినడం, పరిష్కార మార్గాలు చెప్పడం, అడిగిన వారందరితో సెల్ఫీలు తీసుకుంటూ, జనమే లోకేష్.. లోకేషే జనం అన్నట్లుగా యువగళం పాదయాత్ర సాగుతోంది.  వంద రోజుల్లో లోకేష్ మూడు జిల్లాల్లో  పాదయాత్ర చేశారు.  39 నియోజకవర్గాలను కవర్ చేశారు.ఆయన కవర్ చేసిన జిల్లాలన్నీ రాయలసీమ ప్రాంతానివే. మరో మూడు వందల రోజుల పాటు  శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర సాగుతుంది.  రాయలసీమలోనే ఇంత జన ప్రభంజనం ఉంటే ఇక కోస్తాకు వచ్చే సరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో సులభంగా ఊహించుకోవచ్చు.    లోకేష్ పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న సందర్భంగా కుమారుడిని ఆశీర్వదించేందుకు తల్లి భువనేశ్వరి రావడం కొసమెరుపు. మదర్స్ డే రోజున అంటే ఆదివారం భువనేశ్వరి నారా లోకేష్ క్యాంపు సైట్ వద్దకు వచ్చి ఆశీర్వదించారు. వందో రోజు పాదయాత్రలో తనయుడితో అడుగు కలిపి నడిచారు. 

జన్ ధన్ ఖాతాలు ఇక కనుమరుగేనా?!

దాదాపు తొమ్మిదేళ్ళ కిందట ఆర్భాటంగా.. ఒక అద్భుత  ప్రాయోజిత పథకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పి.ఎంజేడీవై) పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. 2014 ఆగస్టులో తన మాసన పుత్రికగా మోడీ ఆవిష్కరించిన ఈ ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు జనాదరణ కోల్పోతోంది. ఏడాది కాలంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించడంతో జనధన్ ఖాతాలన్నిటినీ మూసివేయడానికి  బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 2,23,218 పీఎంజేడీవై ఖాతాలున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో 1,18,55,126 ఖాతాదారులున్నారు. వీటిలో 80 శాతానికి పైగా ఖాతాల్లో ఆర్ధిక లావాదేవీలు నిలిచి పోయి చాలా కాలమైంది. బ్యాంకులు పలు సార్లు మెసేజ్ రూపంలో అల్టిమేటం ఇచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో మెజారిటీ ఖాతాలను బ్లాక్ లిస్టులో పెట్టేశారు. 2023 మార్చి నెల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా కింద బ్యాంకులలో ఉన్న  ఖాతాల సంఖ్య 48.85 కోట్లు. ప్రస్తుతం ఈ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.1,98,844.34 కోట్లు జమ అయ్యాయి. దాదాపు 4.08 కోట్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. నో క్యాష్.. నో ట్రాన్సాక్షన్స్ సాకుతో వివిధ జాతీయ, షెడ్యూల్ ఇప్పటికే శాలను బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ఆర్ధిక లావాదేవీలే ఆధారంగా ఖాతాల కొనసాగింపునకు బ్యాంకులు అల్టిమేటంతో సంప్రదించిన వారందరికీ సేవింగ్ ఖాతాలుగా మార్చుకోవాలని అధికారులు సెలవిస్తున్నారు. ఇది ప్రభుత్వాదేశాలు ఏమాత్రం కావని, స్తంభించిన ఖాతాలను సేవింగ్ కోసం మార్చుకోవాలని మౌలిక సూచనలు మాత్రమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణ ఖాతాలు కావడంతో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి. చూపని ఖాతాదారులు ఆశించిన ప్రయోజనాలేమీ కనిపించకపోవడంతో ఇక మాకొద్దులే.. అని వదిలేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి రెండు కోణాల్లో ముప్పు వాటిల్లుతోంది. కేంద్రం ఆదరణ తగ్గిపోవడం ఒకటైతే.. ఖాతాదారుల్లో అవగాహన లోపం మరొకటిగా పీఎంజేడీవై పథకం నిర్వీర్యానికి గురవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 647 బీమా క్లెయిమ్ లు కేంద్రానికి అందాయి. వాటిలో 928 క్లెయిమ్లను మాత్రమే పరిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 941 క్లెయిమ్ లు వచ్చాయి. వాటిలో 182 క్లెయిమ్స్ సెటిల్ చేయగా, 48 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 111 బ్లెయిమ్లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వానికి కూడా తెలియదు. సెటిల్ చేసిన క్లెయిమ్ ల కోసం రూ.2.27 కోట్లు చెల్లించారు. అదేవిధంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 306 17 యిమ్ లను పరిష్కరించారు. 10. క్లెయిమ్లు తిరస్కరించారు. మిగిలిన 149 దరఖాస్తులు ప్రస్తుత పరిస్థితి ఏంటో గవర్నమెంట్ వారికి సైతం తెలియదు. గత ఆర్థిక సంవత్సరంలో సెటిల్ అయిన కేసుల రూ.1.88 కోట్లు చెల్లించారు. పథకం కింద ఖాతాదార్లకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజీ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదార్లు బ్యాంక్ ఖాతాతో పాటు రూపే కెవిట్ కార్డును పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల లోపు, ద ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరిపినట్లయితే, అతను ||మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హుడు అన్న షరతు ఉంది. చాలా సందర్భాలలో క్లెయిమ్ తిరస్కరణకు ఈ షరతే కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. ప్రజలకు ఏదో చేసెద్దామని రూపకలగపన చేసిన పథకం.. నేడు సొంత ఆదరణ కరవై.. నిర్వీర్యం అవుతున్న తరుణంలో.. ఖాతాలను సేవింగ్ అకౌంట్ గా మార్చుకోమని బ్యాంకులు..గగ్గోలు పెడుతున్న తరుణంలో... ప్రధాని గాని, ప్రధాన మంత్రి కార్యాలయం గాని దీనిపై తగిన వివరణ ఇవ్వకపోవడం.. గమనార్హం.

బీజేపీ ముక్త దక్షిణ భారత్!

కాంగ్రెస్ ముక్త భారత్.. ఇది గత తొమ్మిదేళ్లుగా బీజేపీ నినాదం. కాంగ్రెస్ బలహీనతల కారణంగా అత్యథిక రాష్ట్రాలలో ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీలోనే కాదు.. జనంలోనూ ఉంది. ఇతర రాజకీయ పార్టీలలోనూ ఉంది. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రస్తానవ గత నాలుగేళ్లలో ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కేంద్రంగానే చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో జనం ఒకింత నిరాశ చెందుతున్నారన్న మాట కూడా వాస్తవమే. కానీ కాంగ్రెస్ కొట్టింది. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలన్నట్లుగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు.. అలాగే అంతకంటే ముందు మరికొన్ని కీలక రాష్ట్రాలలో ఎన్నికలు జరగడానికి ముందు, ఆ ఎన్నికలన్నిటికీ లిట్మస్ టెస్ట్ లా పరిశీలకులే కాదు.. పార్టీలూ బలంగా విశ్వసిస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకుని బీజేపీని కంగు తినిపించింది. కాంగ్రెస్ ముక్త భారత్ సంగతి ఏమిటో కానీ, బీజేపీ ముక్త దక్షిణ భారత్ అని కాంగ్రెస్ డంకా భజాయించి మరీ చెప్పింది.  సర్వేలే హంగ్ అన్నాయి, స్వల్ప అధిక్యత అన్నాయి. జనం నాడిని పట్టుకున్నా.. ఆది ఉన్నదున్నట్లు వెల్లడించలేని బలహీనత కారణంగా కొన్ని మీడియా సంస్థలు బీజేపీదే కర్నాటకలో మరోసారి అధికారం అనీ చెప్పేశాయి. ఫలితాలు బీజేపీకి దిమ్మతిరిగేలా వచ్చాయి. స్వల్ప ఆధిక్యత కాదు. మ్యాజిక్ ఫిగర్ కంటే 22 స్థానాలు అధికంగా వచ్చాయి. సీఎం ఎవరన్న విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడితే పడుతూ ఉండొచ్చు. విజయం తరువాత కూడా విభేదాలు మరచి ఆ పార్టీ కర్నాటక నేతలంతా ఏకతాటిపై నిలబడి ఇచ్చిన ప్రకటనలు కాంగ్రెస్ లో కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లే కనిపిస్తోంది. సరే అది పక్కన పెడితే.. బీజేపీకి ఈ పరాజయం కేవలం పరాజయం కాదు. మసకబారిన  మోడీ ప్రతిష్టకు, ఆ పార్టీ ఇంతకాలం నమ్ముకున్న హిందుత్వ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికీ కూడా నిదర్శనం. తన హోదా, పదవి, పరిధి కూడా మరచి మోడీ ప్రచారంలో జై బజరంగ్ బలి నినాదం చేయడం, సున్నిత అంశాలను ప్రస్తావించి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం, చివరాఖరికి ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేసి ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించడానికి ప్రయత్నించడం ఇవేమీ కూడా బీజేపీ పట్ల వ్యతిరేకతను ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి.  ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం.. తేలికగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే.. ఆ రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మార్గదర్శిగా అందరూ చెప్పుకునే బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని వాస్తవం చేయడానికి దేశంలోని రాష్ట్రాలలో బీజేపీ విజయానికి రూట్ మ్యాప్ లిఖించారని చెప్పబడుతున్న బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం, అలాగే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం పార్టీ తన చతురంగ బలాలనూ దించింది. బీజేపీ జాతీయ నాయత్వమంతా కర్నాటకలో మోహరించి ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు తక్కువ వారం రోజులు ఆ రాష్ట్రంలో సుడి గాలి పర్యటనలు చేశారు. రెండు పదులకు పైగా సభలలో ప్రసంగించారు. తన వాక్చాతుర్యమంతా ప్రదర్శించి మరీ కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపారు.   ఫలితం లేకపోయింది. చివరకు ఆఖరి క్షణంలో వారు నమ్ముకున్న భజరంగ్ దళ్ వివాదం కూడా వారికి ఓటమి నుంచి బయటపడేయలేకపోయింది.  బీజేపీ పాలనలోని 40 శాతం అవినీతిని నిలువెత్తు లోతులో పారేసి గురివింద సామెతను బీజేపీకి గుర్తు చేశారు.  ఎప్పుడూ సొంతగా గెలవకుండా.. రెండుసార్లు కాంగ్రెస్‌-జెడీఎస్‌ పార్టీల నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో, నిలబెట్టుకున్న బీజేపీ అధికార సామ్రాజ్యం, ప్రజావ్యతిరేక పవనాలకు ఎగిరిపోయింది.     

కాంగ్రెస్ ఫలితాలపై మోడీ, కెటీఆర్ ట్వీట్స్

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకశాసనసభ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందిన తర్వాత ట్వీట్ చేశారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.  దక్షిణాదిన  బిజెపి అధికారంలో వచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక. కాంగ్రేస్ పార్టీ నుంచి అధికారం కైవసం చేసుకున్నబిజెపి ఈ ఎన్నికలలో  ఆ అధికారాన్ని  కాంగ్రెస్ కు తిరిగి అప్పగించింది.  కర్ణాటక ఫలితాల  ప్రభావం తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోదని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ అన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల కోసం యుకె వెళ్లిన మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన పొరుగునే ఉన్న తెలంగాణలో ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.     

బ్రహ్మనందం ప్రచారంతొ మంత్రిగారు ఓటమి 

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదాకర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఆయన ఓడిపోయారు. చిక్‌బళ్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో 11, 130 ఓట్ల తేడాతో సుధారక్ ఓటమ చవి చూడాల్సి వచ్చింది. సుధాకర్ గెలుపు కోసం బ్రహ్మనందం నాలుగు రోజుల పాటు.. చిక్‌బళ్లాపూర్‌లో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో తెలుగు ప్రజల శాతం అత్యధికంగా ఉంటుంద విషయం విదితమే.  అయితే తన ప్రచారంలో బ్రహ్మనందం తాను నటించిన సినిమాల్లోని డైలాగ్‌లు పేల్చి.. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు మాత్రం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతో లేకుంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న మక్కువతోనో.. కానీ హస్తం పార్టీకి గంపగుత్తుగా ఓట్లు గుద్దిపడేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఇక 2019లో జరిగిన చిక్ బళ్లాపూర్ ఉప ఎన్నికల్లో సైతం సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేయడంతో.. నాడు ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అయిందన్న సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి శివకుమార్? సిద్ద రామయ్య?

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వాడి వేడి చర్చ జరుగుతోంది. 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ద రామయ్యకి మళ్లీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. గాంధీ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్న డికె శివకుమార్ పేరు కూడా ముఖ్యంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ,  రాహుల్ గాంధీ ఆలోచనను బట్టే ముఖ్యమంత్రి అభ్యర్థి డిసైడ్ కానున్నారు. 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా సిద్ద రామయ్యను ప్రకటించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్యను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి శివకుమార్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ప్రకటించే అవకాశం  కనిపిస్తుంది. డికె శివకుమార్ అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రాజకీయ నేత. అతన్ని ఎంపిక చేస్తే  వచ్చే లోకసభ ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక సహకారం అందించవచ్చని పార్టీ భావిస్తోంది. ఒక వేళ శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం అతను బెయిల్ మీద ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్ ను ప్రకటిస్తే బిజెపీ ప్రభుత్వం పాత కేసులను తోడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. శివకుమార్ పై సిబిఐ, ఈడీ, ఐటీ శాఖ లలో అనేక కేసులున్నాయి.  దర్యాప్తు సాగుతుంది. శివకుమార్ ఇప్పటకే 104 రోజులు తీహార్ జైలులో గడిపారు. 

సోనియాను అభినందించిన స్టాలిన్ 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం బిజెపి వ్యతిరేక శక్తులకు ఊరట నిచ్చింది. తమిళనాడులో డిఎంకె నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఫలితాల పట్ల తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ చేసి మరీ అభినందించారు. యుపిఏ మిత్ర పక్షాలతో బాటు బిజెపిని వ్యతరేకించే పార్టీలు కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలుపుతునకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ 97 స్థానాల్లో నెగ్గి, 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా, అందుకు మరో 16 స్థానాల దూరంలో ఉంది. అధికార బీజేపీ 48 స్థానాల్లో నెగ్గి, మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీ (ఎస్) 14 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు.  కాగా, కాంగ్రెస్ ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్నాళ్లుగా మోదీ ప్రాభవం ముందు కాంగ్రెస్ వెలవెలాపోతోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కానీ, కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపించామన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. 

 ప్రియాంక ప్రత్యేక పూజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకొంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఊరు వాడా.. నేతలు, కార్యకర్తలతో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.. హిమాచల్ ప్రదేశ రాజధాని సిమ్లాలో జఖూలోని హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దేశంతోపాటు కర్ణాటక రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సుల కోసం ఆమె ప్రార్థనలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గంట వ్యవధిలోనే సగం స్థానాల మార్కును సునాయాసంగా హస్తం పార్టీ దాటేసింది. మరోవైపు మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలకు పైగా కైవసం చేసుకొంటుందని ప్రియాంక గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కి రేవంత్ చురకలు

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలిత్లాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఫలితంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకు వెళ్తోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో సత్తా చాట లేకపోయిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఎటువైపు ఉంటుందో తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చెబితే.. ఆయన స్నేహ బంధం ఏమిటనేది బయటపడుతొందన్నారు. బీజేపీతో జత కట్టమని చెబుతారా? అంటూ సీఎం కేసీఆర్‌కు ఈ సందర్బంగా రేవంత్ చురకలంటించారు.   మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసిన స్థానాలు చింతామణి, ముల్బగల్, బాగేపల్లి గౌరీబిదనూర్, చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ స్థానాల్లో  కాషాయం పార్టీ ఘోర పరాభవం చవిచూడల్సి వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీలో కొద్దిపాటి స్తబ్దత నెలకొంది.

కన్నీరుమున్నీరవుతోన్న సిద్దరామయ్య ఫ్యామిలీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. హస్తం పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఆనందడొలికల్లో మునిగి తేలుతోన్నాయి. అలాగే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కుటుంబం కూడా విజయనందంలో ఉంది. అలాంటి వేళ... సిద్దరామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ కొద్ది సేపటి క్రితం మరణించారు. దీంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలముకొన్నాయి. ఈ రోజు ఉదయం రామేగౌడ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని మైసూర్‌లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో.. సిద్దరామయ్య కుటుంబంలో విషాదం చాయలు అలుముకొన్నాయి. రామేగౌడ ఆరోగ్యం మెరుగు పడి క్షేమంగా ఇంటి వస్తారని.. కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగడంపై సిద్దరామయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్లడంపై సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకొంటుందని.. ఈ నేపథ్యంలో తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని చెప్పారు.

కీలక నేతలకు విజయాలు, అపజయాలు

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక నేతల పాత్ర ప్రధానం. అయితే కీలక నేతలు కూడా ఓడిపోయారు. బిజేపీలో కూడా అదే పరిస్థితి.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలువురు కీలక నేతలు విజయం సాధించగా... మరికొందరు ఊహించని విధంగా పరాజయం పాలవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురి నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు.  బళ్లారి రూరల్ స్థానం నుంచి బి.శ్రీరాములు ఓటమి పాలయ్యారు. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ ఓడిపోయారు. మరోవైపు రేపు ఉదయం బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. గెలుపొందిన అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.

ఖాకీల కండకావరం.. సామాన్యుడిలో కలవరం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అధికార జగన్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని.. ఆ పార్టీ నేతల అడుగులకు పోలీసులు మడుగులోతుత్తోన్నారని.. ఇంకా చెప్పాలంటే  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. ఫ్యాన్ పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిందంటూ గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతోన్నాయి. అయితే జగన్ పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న శైలిని చూసి.. యావత్ భారతావని ఔరా అంటు ముక్కున వేలేసుకొనే పరిస్థితి అయితే దాపురించిందని ఇప్పటికే ప్రజాస్వామిక వాదులు స్పష్టం చేస్తున్నారు.   ఆ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకొన్న సంఘటన చూసి.. జాతీయ మానవ హక్కుల సంఘం సైతం నోరెళ్లబెట్టే పరిస్థితికి వచ్చేస్తోందని సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి. మే 12వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  కావలి వేదికగా రైతులకు చుక్కల భూముల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ విచ్చేశారు. ఆ క్రమంలో పట్టణంలో నిరసనకారులు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకొవడంలో భాగంగా.. ఓ పోలీస్.. తన కాళ్ల మధ్య ఆ కార్యకర్త తల ఉంచి.. గట్టిగా నొక్కుతోన్న వీడియో దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు సైతం వెల్లువెత్తుతోన్నాయి.   ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన... అమెరికాలో చోటు చేసుకొన్న అప్రో అమెరికన్ జార్జి ప్లాయిడ్ ఘటనను గుర్తు చేసే విధంగా ఉందనే అభిప్రాయం సైతం ప్రజాస్వామిక వాదుల్లో వ్యక్తమవుతోంది. 2020, మే 25వ తేదీన అమెరికాలోని మినిపోలీస్ నగరంలో కర్కశత్వానికి మారు పేరుగా నిలిచిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్ మోకాళ్ల కింద జార్జి ప్లాయిడ్ నలిగి పోతూ కూడా... తనకు ఊపిరి అందడం లేదని చెబుతున్నా వినకుండా.. తుది శ్వాస విడిచే వరకు అతడిని గట్టిగా తన కాళ్లతో అదిమి పెట్టి ఉంచడంతో.. జార్జీ ప్లాయిడ్ మృత్యు ఒడిలోకి జారుకొన్నాడు... అందుకు సంబంధించిన వీడియోతోపాటు ఫొటోలు సైతం వైరల్ కావడంతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోయింది. చివరకు ట్రంప్ ప్రభుత్వంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతోపాటు.. ఆయన తన అధ్యక్ష పదవి పోగొట్టుకోవడంలో జరిగిన అతి ముఖ్య  సంఘటనల్లో ఇది ఒకటిగా నిలవడం గమనార్హం. చివరకు అంత కూర్రత్వంతో వ్యవహరించిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్‌కి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు సైతం వెలువరించడం.. అదీ కూడా అతడి హత్య జరిగిన జస్ట్ 36 రోజుల్లోనే ఈ తీర్పు వెలువడం నిజంగా శుభ పరిణామమేనని చెప్పాలి.  ఎందుకంటే.. ఇటువంటి ఘటనలు.. సంఘటనలు మన రాష్ట్రంలో చోటు చేసుకొన్నా.. ఈ చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు అయితే ఉండవు. ఓ వేళ చర్యలు తీసుకొన్నా.. అవి కంటితుడుపు చర్యలే ఉంటాయన్నది మాత్రం పక్కా వాస్తవం. అదీకాక  బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లిన వేళ అంటూ మనం ఘనంగా అమృతోత్సవాలు జరుపుకొంటున్నాం కానీ.. మనం.. మన ఎన్నుకొన్న నాయకాగణం మాత్రం.. ఆ నాటి బ్రిటిష్ వారి రాసిన.. చేసిన  చట్టాలనే ఏళ్లకు ఏళ్లు పట్టుకొని వేలాడుతోన్నారు. అంతేకానీ.. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనువుగా పోలీసు చట్టాలను మార్చాలనే  చిత్త శుద్ది మన పాలకల్లో కొరవడింది. దీంతో పోలీసు వ్యవస్థ అంటే.. బలవంతులు, అధికారంలో ఉన్నవారి రక్షణకే రక్షక భట వర్గం అనే ఓ రాజముద్ర  దేశంలోని ప్రతీ సామాన్యడి మదిలో బలంగా ముద్ర పడిపోయింది. అయితే తాజాగా కావలిలో చోటు చేసుకోన్న ఈ ఘటన.. రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలను దారి తీస్తుందోనని ప్రజాస్వామిక వాదుల్లో ఓ కలవరం అయితే మొదలైందనేది మాత్రం  పక్కా వాస్తవం.  

కర్ణాటకలో కాయ్ రాజా కాయ్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే క్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగుల పర్వం కొనసాగుతోంది. ఓ వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను పందానికి పెట్టాడు. తనతో పందెం కాసేవారు ఉంటే రావాలని డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. ఈ ఘటన హొన్నాళ్లి నియోజకవర్గంలో చోటు చేసుకొంది. సదరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాంతనగౌడ, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య బరిలో నిలవగా.. వీరిద్దరిపై జోరుగా పందాలు కొనసాగుతోండగా.., నాగణ్ణ అనే వ్యక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతనగౌడ విజయం సాదిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అందుకోసం తను రెండెకరాల పొలాన్ని పందెం కాస్తున్నానని, తనపై పందెం కాసేవారు ఉంటే ముందుకు రావాలంటూ గ్రామంలో డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  మరోవైపు కొండసీమల చామరాజనగర జిల్లాలోనూ బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సోమణ్ణ  గెలుస్తారంటూ కోటి రూపాయల వరకు పందం కాసినట్లు తెలుస్తోంది. ఇక గుండ్లుపేట తాలూకా మల్లయ్యైనపుర గ్రామానికి చెందిన కిరణ్.. తన చేతిలో రూ. 3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాయడం.. అందుకు సంబంధించిన వీడియో బహిర్గతం కావడంతో..  పోలీసులు ఆయన నివాసంపై దాడులు నిర్వహించి.. విచారణ చేపట్టారు. మరోవైపు తాను ప్రకటించిన అభ్యర్థులు తప్పక గెలుస్తారని.. అలా కాదన్న వారు కోటి రూపాయల పందెం కాయవచ్చు అంటూ ప్రకటించిన ఓ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

నాన్న ముఖ్యమంత్రి కావాలి 

మైసూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే.. కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో తమ పార్టీ విజయం సాధిస్తుందని హస్తం పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తనదైనశైలిలో స్పందించారు. బీజేపీకి అధికారం దూరం చేసేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని.. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని ఆయన తన మనస్సులోని మాటను ఈ సందర్భంగా వెల్లడించారు.  గతంలో తన తండ్రి సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఇంతకాలం బీజేపీ పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలన్నారు. తన తండ్రి... వరుణ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారని.. భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధిస్తారని చెప్పారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగగా..  మే 13వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే... మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 100కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉండగా 70 పై చిలుకు స్థానాలో బీజేపీ లీడ్‌లో ఉంది. జేడీ(ఎస్‌) 30 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంగా పని చేసిన సిద్ధూ మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ సైతం పోటీపడుతోన్నట్లు సమాచారం. అదీకాక.. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ఆయన సఫలీకృతులయ్యారనే ప్రచారం సైతం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఆసక్తి ఉందని పలుమార్లు పరోక్షంగా ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ ఢంకా మోగిస్తే.. సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందనే ప్రచారం ఇప్పటికే జోరందుకొంది.