జ‌యంతి మూడు పెళ్లిళ్లు చేసుకున్నార‌నీ, ఆ మూడూ విఫ‌ల‌మ‌య్యాయ‌నీ మీకు తెలుసా?

  తెలుగువారైన న‌టి జ‌యంతి తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్ర‌రంగాల్లోనూ రాణించారు. చెప్పాలంటే తెలుగుకు మించి క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. క‌న్న‌డిగులు ఆమెను క‌న్న‌డ న‌టిగానే ప్రేమించారు. తెలుగులో ఎన్టీఆర్, త‌మిళంలో ఎంజీఆర్ ఎలాగో, క‌న్న‌డంలో రాజ్‌కుమార్ అలాగా అని మ‌న‌కు తెలుసు. అలాంటి రాజ్‌కుమార్ స‌ర‌స‌న అత్య‌ధికంగా 30 చిత్రాల్లో నాయిక‌గా న‌టించారు జ‌యంతి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు లాంటి అగ్ర‌హీరోల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన జ‌యంతి, అనేక చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఏడుపు పాత్ర‌ల‌కు పెట్టింది పేర‌నిపించుకున్నా, స‌ర‌దా పాత్ర‌ల్లోనూ స‌మానంగా రాణించారు. 500కు మించిన సినిమాల్లో న‌టించి, స‌క్సెస్‌ఫుల్ ఆర్టిస్టుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు సంపాదించుకున్న జ‌యంతి వ్య‌క్తిగ‌త జీవితం ఓ ఫెయిల్యూర్ స్టోరీ లాంటిది. మూడు వివాహాలు చేసుకున్న‌ప్ప‌టికీ అవి ఆమెకు క‌లిసి రాలేదు. మొద‌ట ఆమె న‌టుడు పేకేటి శివ‌రామ్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టికే ఆయ‌న వివాహితుడు. పిల్ల‌లు కూడా ఉన్నారు. అప్పుడ‌ప్పుడే ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్న జ‌యంతిని ప్రేమ‌లో దింపి, పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కూడా స‌హ‌క‌రించార‌ని అప్ప‌ట్లో చెప్పుకున్నారు. ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య పొర‌పొచ్చాలు మొద‌ల‌య్యాయి. జ‌యంతిని త‌న చెప్పుచేత‌ల్లో ఉంచుకొని, ఆమెను క‌ట్ట‌డి చేయాల‌ని శివ‌రామ్ ప్ర‌య‌త్నించార‌నీ, స్వ‌తంత్ర వ్య‌క్తిత్వం ఉన్న జ‌యంతి ఆయ‌న ధోర‌ణిని త‌ట్టుకోలేక‌పోయార‌నీ, అందువ‌ల్లే ఆయ‌న నుంచి జ‌యంతి విడిపోయార‌నీ అంటారు. జ‌యంతి న‌టిగా త‌న కెరీర్‌లో కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఆ టైమ్‌లో రంగ‌నాథ్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'చంద‌న' (1974) మూవీలో జ‌యంతి హీరోయిన్‌గా న‌టించారు. బండారు గిరిబాబు అనే ఆయ‌న ఈ సినిమాకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో ఏర్ప‌డిన స‌న్నిహిత‌త్వంతో గిరిబాబును వివాహం చేసుకున్నారు జ‌యంతి. ఇక్క‌డ కూడా గిరిబాబు వివాహితుడే. స్వ‌ల్ప కాలంలోనే ఇరువ‌రి మ‌ధ్య బేదాభిప్రాయాలు త‌లెత్తి విడిపోయారు. ఇలా రెండు వివాహాలు విఫ‌ల‌మ‌య్యాక‌.. క‌న్న‌డంలో యంగ్ హీరో అయిన రాజ‌శేఖ‌ర్ ప్రేమ‌లో ప‌డ్డారు జ‌యంతి. ఆమెకంటే రాజ‌శేఖ‌ర్ వ‌య‌సులో చాలా చిన్న‌వాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఇర‌వై ఏళ్ల‌కు పైగా వ్య‌త్యాసం ఉందంటారు. త‌న శ్రేయోభిలాషుల స‌హ‌కారంతో రాజ‌శేఖ‌ర్‌ను ఆమె మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం కార‌ణంగా జ‌యంతి చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అయినా ఆమె ప‌ట్టించుకోలేదు. రాజ‌శేఖ‌ర్‌ను హీరోగా నిల‌బెట్టేందుకు ఆమె చాలా డ‌బ్బు ఖ‌ర్చుపెట్టార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఒక సినిమా తీస్తే, అది ఫెయిలై, చాలా న‌ష్టం వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొంత కాలానికే వారి బంధం కూడా విచ్ఛిన్న‌మైంది. ఇలా మూడు పెళ్లిళ్లు ఫెయిల‌వ‌డంతో జీవితంలో ఆమె ఎక్కువ‌కాలం ఒంట‌రిగానే గ‌డిపారు. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు మించి ఉబ్బ‌స వ్యాధితో బాధ‌ప‌డుతూ జూలై 26 తెల్ల‌వారుజామున బెంగుళూరులోని త‌న నివాసంలో ఆమె చివ‌రిశ్వాస విడిచారు.

మ‌హాన‌టి భానుమ‌తి గురించి మీకు తెలీని నిజాలు!

  మ‌హాన‌టి, గాయ‌ని, ద‌ర్శ‌కురాలు భానుమ‌తి త‌ల్లితండ్రులు బొమ్మ‌రాజు స‌ర‌స్వ‌త‌మ్మ‌, వెంక‌ట‌సుబ్బ‌య్య‌. చిన్న‌ప్ప‌ట్నుంచీ సంగీత సాహిత్యాల‌పై భానుమ‌తి ఆస‌క్తిని తండ్రి ప్రోత్స‌హిస్తూ వ‌స్తే, స‌దాచారాలు, సంప్ర‌దాయ‌ప‌ర‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించారు త‌ల్లి. ఆమె సుప్ర‌సిద్ధ క‌వి గుర్రం జాషువా సోద‌రి హెడ్‌మిస్ట్రెస్‌గా ఉన్న స్కూల్లో చ‌దువుకున్నారు. తెలివైన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు వ‌చ్చేస‌రికే సినీ రంగంలో ప్ర‌వేశించాల్సి వ‌చ్చింది. త‌ర్వాత 1966లో ప్రైవేటుగా మెట్రిక్ రాసి పాస‌య్యారు. 1967లో పీయూసీ పాస‌య్యారు.  వ‌ర‌విక్ర‌యం (1939) చిత్రం ద్వారా ఆమె న‌టిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. అందులో కాళింది పాత్ర చేశారు. "క‌ట్న‌మిచ్చి కొంటేగానీ, క‌న్నియ‌ల‌కు వ‌రుడే రాడూ.. క‌న్న‌వారికా కోతా, క‌న్నెజ‌న్మ‌మే రోతా.. స్వాతంత్ర‌మే లేదా" అని ఆ చిత్రంలో పాడారు. అంటే న‌టించిన‌ తొలి చిత్రంతోనే గాయ‌నిగానూ ఆమె ప‌రిచ‌య‌మ‌య్యారు. భ‌ర‌ణీ పిక్చ‌ర్స్‌ను స్థాపించి ఆమె నిర్మించిన మొద‌టి చిత్రం 'ర‌త్న‌మాల' (1948). ఈ చిత్రానికి క‌థ వాళ్ల‌మ్మ బొమ్మ‌రాజు స‌ర‌స్వ‌త‌మ్మ స‌మ‌కూర్చారు. భానుమ‌తి భ‌ర్త రామ‌కృష్ణారావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ లేక‌పోయినా, స‌క్సెస్‌ఫుల్‌గా వంద రోజులు ఆడింది. 'చండీరాణి' (1952) చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌య్యారు భానుమ‌తి. ఆ చిత్రంలో ఆమె ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, రేలంగి, ఆర్‌. నాగేశ్వ‌ర‌రావు, హేమ‌ల‌త‌ లాంటి ఉద్ధండుల‌ను డైరెక్ట్ చేశారు. తెలుగు చిత్ర‌సీమ‌లో తొలిసారిగా ఒక మ‌హిళ ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేయ‌డం, అదీ మూడు భాష‌ల్లో.. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో.. చిత్రాన్ని రూపొందించ‌డం విశేషంగా చెప్పుకున్నారు. ఆ సినిమా షూటింగ్ చూడ‌డానికి సుప్ర‌సిద్ధ హిందీ న‌టుడు దిలీప్ కుమార్ త‌న మిత్రుల‌తో స‌త్యా స్టూడియోకు రావ‌డం ఇంకో విశేషం. మూడు భాష‌ల్లోనూ ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ సంద‌ర్భంగా వివిధ రంగాల్లో విశేష‌మైన కృషి చేసిన వారిని ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించింది. ప్ర‌సిద్ధులైన స్థానం న‌ర‌సింహారావు, గ‌డియారం సీతారామ‌శాస్త్రి, శ్రీ‌పాద సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి, ద్వారం వెంక‌ట‌స్వామినాయుడు లాంటి మ‌హానుభావుల స‌ర‌స‌న భానుమ‌తినీ స‌త్క‌రించారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానం పొందిన ఎంజీఆర్‌తో భానుమ‌తి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఆమెను ఆయ‌నెప్పుడూ గౌర‌వ‌పూర్వ‌కంగా 'భానుమ‌తి అమ్మ‌యార్' అని పిలిచేవారు. ఆయ‌న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయ్యాక భానుమ‌తి మీద‌వున్న అభిమానంతో, గౌర‌వంతో ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల డైరెక్ట‌ర్‌, ప్రిన్సిపాల్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఎన్టీఆర్‌కూ, భానుమ‌తికీ మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో భ‌ర‌ణీ పిక్చ‌ర్స్ నిర్మించిన‌ 'వివాహ‌బంధం' ఒక‌టి. ఈ సినిమాలో న‌టిస్తుండ‌గానే క‌న్నాంబ కీర్తిశేషుల‌య్యారు. ఆ పాత్ర‌ను సూర్య‌కాంతంతో రిషూట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు భిన్నంగా రూపొందిన చిత్రాల్లో 'వివాహ‌బంధం' కూడా ఒక‌టి.

ఎలా ప్రేమించాలో జ‌యంతికి నేర్పించిన కె. విశ్వ‌నాథ్‌!

  ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన సూప‌ర్ హిట్ సినిమాల్లో 'సుమంగ‌ళి' (1965) ఒక‌టి. సావిత్రి టైటిల్ రోల్ చేసిన ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో కాగా, మ‌రో హీరోగా జ‌గ్గ‌య్య న‌టించారు. అందులో శోభ‌న్‌బాబుతో పాటు జ‌యంతి ఒక చిన్న పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆ సినిమాలో "ఓ ఫ‌స్ట్ నైట్ సీన్‌, అందులో  ఓ సాంగ్ వ‌స్తుంది.. ఆ క్యారెక్ట‌ర్ చేస్తావా?" అని ఆదుర్తి అడిగితే, అంత పెద్ద ఆర్టిస్టులు చేస్తున్న సినిమా కాబట్టి స‌ర‌దాగా చేద్దామ‌నిపించి స‌రేనన్నారు జ‌యంతి.  ఫ‌స్ట్ నైట్ సీన్ కోసం జ‌యంతికి పెళ్లికూతురు అలంకారాలు చేశారు. మేడ‌పై ఆ సీన్ తీస్తున్నారు. సీన్ ప్ర‌కారం జ‌యంతి వ‌య్యారంగా నిల్చోవాలి. శోభ‌న్‌బాబు వ‌చ్చి ఆమె భుజంపై చేయి వేస్తారు. అప్పుడు ఆమె పుల‌క‌రించాలి. ఆ పుల‌క‌రించ‌డం ఏమిటో జ‌యంతికి తెలీలేదు. దాంతో క‌ట్ చెప్పారు ఆదుర్తి. ఆ సినిమాకు కె. విశ్వ‌నాథ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న జ‌యంతి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. "ఏయ్ బండ‌పిల్లా.. ఏమిట‌లా నిల్చుంటావ్‌! అబ్బాయి చేయి ఒంటిమీద ప‌డ‌గానే ఎలా పుల‌క‌రించాలి?" అన్నారు. "నాకు తెలీలేదు సార్" అన్నారు జ‌యంతి. "ప‌క్క‌కు త‌ప్పుకో.." అని చెప్పి, భుజంమీద అబ్బాయి చేయి ప‌డితే "హా.." అంటూ ఎలా పుల‌క‌రించాలో చేసి చూపించారు. వ‌య్యారంగా క‌ళ్లతో ఎలా చూడాలో చూపించారు. "ఇలా చూడాలి.. అంతే కానీ బండ‌బండ‌గా చూడ‌కూడ‌దు." అని చెప్పారు విశ్వ‌నాథ్‌. ఆ ర‌కంగా ఒక్కొక్క షాట్‌కి ఎలా నిల్చోవాలో, ఎలా క‌ళ్లు పెట్టాలో, ఎలా మ‌త్తుగా చూడాలో జ‌యంతికి అన్నీ నేర్పారు. "చెప్పాలంటే నాకు ల‌వ్ ఎలా చెయ్యాలో నేర్పించింది కె. విశ్వ‌నాథ్ గారు" అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు జ‌యంతి. అలా సుమంగ‌ళిలో శోభ‌న్‌బాబుతో ఆమె ఫ‌స్ట్ నైట్ సీన్‌, "ఏవేవో చిలిపి త‌ల‌పులురుకుతున్న‌వి.." పాట‌ను చేశారు.

తెలుగులో ఫ‌స్ట్ మేల్‌ ప్లేబ్యాక్ సింగ‌ర్ అయిన ఈయ‌నను గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా?

  నండూరి సుబ్బారావు గారు ర‌చించిన "ఈ రేయి న‌న్నొల్ల‌నేర‌వా రాజా" అనే పాట ఒక మేల్ సింగ‌ర్ పాడిన తొలి తెలుగు ప్లేబ్యాక్ సాంగ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. వై.వి. రావు, భానుమ‌తి జంట‌గా న‌టించిన‌ 'తాసిల్దారు' (1944) సినిమాలో ఈ పాట‌ను పాడింది ఎం.ఎస్‌. రామారావు. ఆ ర‌కంగా తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఫ‌స్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్ అనే కీర్తిని పొందారాయన‌. 1941లో ఇంట‌ర్మీడియేట్ చ‌దువుతున్న‌ప్పుడు క‌ళాశాల‌లో జ‌రిగిన ల‌లిత సంగీత పోటీలో ఆయ‌న‌కు ఫ‌స్ట్ ప్రైజ్ వ‌చ్చింది. ఆ పోటీకి సుప్ర‌సిద్ధ న‌వ‌లా ర‌చ‌యిత‌, చిత్ర‌కారుడు అడివి బాపిరాజు ఒక జ‌డ్జిగా వ‌చ్చారు. రామారావు గారి పాట‌విని సినీరంగంలో ప్ర‌వేశించ‌మ‌ని సూచించారు.  అలా 1944లో 'తాసిల్దారు' సినిమాతో నేప‌థ్య గాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఎం.ఎస్‌. రామారావు పూర్తిపేరు మోప‌ర్తి సీతారామారావు. రెండు ద‌శాబ్దాల పాటు అనేక సినిమాల్లో త‌న‌దైన మ‌ధుర గాత్రంతో పాట‌లు పాడి సంగీత ప్రియుల‌ను అల‌రించారు. ఆయ‌న పాటలు పాడిన వాటిలో దీక్ష‌, ద్రోహి, మొద‌టిరాత్రి, పాండురంగ మ‌హాత్మ్య‌ము, నా ఇల్లు, సీతారామ క‌ల్యాణ‌ము, శ్రీ‌రామాంజ‌నేయ యుద్ధ‌ము లాంటి సినిమాలున్నాయి. "ఈ రేయి న‌న్నొల్ల‌నేర‌వా రాజా" పాట పాట‌డానికి ముందుగా ఆ పాట‌ను నేర్చుకోవ‌డానికి ఏలూరు వెళ్లి నండూరి వారి ఇంట్లో ఉండి, ఆ పాట‌ను నేర్చుకొని, ఆ త‌ర్వాత సినిమాకి పాడారు రామారావు. 'దీక్ష' చిత్రంలో ఆయ‌న పాడిన "పోరా బాబూ పో" అనే పాట ఆ రోజుల్లో అత్యంత పాపుల‌ర్ అయ్యింది. అదే పాట‌ను త‌మిళ వెర్ష‌న్‌లోనూ పాడి అక్క‌డ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు రామారావు. 1964లో ఆయ‌న మ‌ద్రాసునూ, చిత్ర‌రంగాన్నీ వ‌దిలిపెట్టి రాజ‌మండ్రి వెళ్లి ఒక గురుకులంలో 1975 వ‌ర‌కూ ప‌నిచేశారు. తులసీదాస్ ర‌చించిన 'శ్రీ హ‌నుమాన్ చాలీసా'ను 1970లో తెలుగులో అనువ‌దించి గానం చేశారు. అది చాలా పేరు తెచ్చింది. అలాగే వాల్మీకి రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ‌ను సుల‌భ‌శైలిలో తెలుగులో గేయ‌రూపంగా మ‌లచి గానం చేశారు. 'సుంద‌ర‌కాండ' ఆకాశ‌వాణిలో కొన్ని రోజుల‌పాటు వ‌రుస‌గా ప్ర‌సార‌మై ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తిని సాధించిపెట్టింది. తెనాలి తాలూకా మోప‌ర్రు గ్రామంలో 1921 జూలై 3న జ‌న్మించిన ఎం.ఎస్‌. రామారావు 1992 ఏప్రిల్ 20న హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని స్వ‌గృహంలో క‌న్నుమూశారు. ఆయ‌న నివాసం ఉండిన వీధికి 2001 డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్ మునిసిపాలిటీవారు 'సుంద‌ర‌దాసు ఎం.ఎస్‌. రామారావు వీధి' అనే పేరు పెట్ట‌డం విశేషం.

కృష్ణ లాగే నిర్మాత‌ల‌ను డ‌బ్బు అడ‌గ‌కుండా న‌ష్ట‌పోయిన జ‌మున‌!

  ఒక‌ప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నిర్మాత‌ల‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించేవారు. సినిమాలు ఫ్లాపైతే, ఆ నిర్మాత‌ల‌కు మ‌ళ్లీ డేట్స్ ఇచ్చి ఇంకో సినిమా చేసిపెట్టేవారు. ఈ విష‌యాలు అప్ప‌టి ప‌త్రిక‌ల్లో వ‌చ్చేవి. ఆ త‌ర్వాత త‌రంలో కృష్ణ నిర్మాత‌ల హీరోగా పేరు తెచ్చుకున్నారు. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌ల్ని కృష్ణ ఎప్పుడూ ఇబ్బంది పెట్ట‌లేదు. నిజం చెప్పాలంటే అస‌లు అడిగేవారు కాదు. నిర్మాత‌లు ఇచ్చిన‌ప్పుడే తీసుకొనేవారు. ఆ క్ర‌మంలో నిర్మాత‌లు ఆయ‌న‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వ‌కుండా ఎగ్గొట్టిన సంద‌ర్భాలు అనేకం.  ఇలా ఉండ‌బ‌ట్టే ఆయ‌న‌తో సినిమాలు నిర్మించ‌డానికి నిర్మాత‌లు తెగ ఉత్సాహం చూపించేవార‌న్న పేరు కూడా వ‌చ్చింది. అంతే కాదు, సినిమా ఫ్లాపైన‌ప్పుడు త‌ర్వాత సినిమాని ఉచితంగా ఆ నిర్మాత‌గా చేసివ్వ‌డం ఓ అల‌వాటుగా చేసుకున్నారు కృష్ణ‌. దానివ‌ల్లే ఇండ‌స్ట్రీలో చాలా మంచి మ‌నిషిగా ఆయ‌నకు పేరు వ‌చ్చింది. హీరోయిన్ల ధోర‌ణి అలా ఉండ‌టం చాలా అరుదు. హీరోల‌తో పోలిస్తే హీరోయిన్ల కాలం చాలా త‌క్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి, దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్లు డ‌బ్బు విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటారు. అయితే అల‌నాటి నాయిక జ‌మున తీరే వేరు. మ‌నిషి ఎంత‌టి అభిమాన‌వ‌తి అయినా, డ‌బ్బు విష‌యంలో చాలా లిబ‌ర‌ల్‌గా ఉండేవారు జ‌మున‌. "అందుకే ఆ రోజుల్లో కృష్ణ‌గారు, నేను పోగొట్టుకున్నంత డ‌బ్బు ఎవ‌రూ పోగొట్టుకోలేదు. సినిమా పూర్త‌య్యేవ‌ర‌కూ డ‌బ్బు గురించి అడిగేవాళ్లం కాదు. చివ‌ర‌ల్లో నిర్మాత‌లు డ‌బ్బు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే పోనీలే అని వ‌దిలేసేవాళ్లం." అని చెప్పారామె. సినిమా ఫీల్డులో నిర్మాత వ‌ట‌వృక్షం లాంటివాడు. నిర్మాత బాగుంటేనే ఆ ఫీల్డు బాగుంటుంది. "స‌గం సినిమా అయ్యాక డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే షూటింగ్ ఎగ్గొట్టిన హీరోయిన్లు ఉన్నారు. కానీ నేను ఆ బాప‌తు కాదు. చాలామంది నిర్మాత‌లు డ‌బ్బు ఇవ్వ‌లేని స్థితిలో ఉంటే కృష్ణ‌గారిలా నేనూ పారితోషికం వ‌దిలేసేదాన్ని. సినిమా దెబ్బ‌తింటే మ‌ళ్లీ కాల్షీట్లు ఇచ్చి స‌హ‌క‌రించేదాన్ని. హీరోల్లో రామారావు గారు, నాగేశ్వ‌ర‌రావు గారు, కృష్ణ‌గారు.. కానీ హీరోయిన్ల‌లో జ‌మున మాత్ర‌మే అలా చేసింది." అని తెలిపారు జ‌మున‌.

రాళ్ల‌ప‌ల్లి పెద్ద కుమార్తె ర‌ష్యాకు వెళ్తూ ట్రైన్‌లోనే చ‌నిపోయింద‌ని మీకు తెలుసా?

  రాళ్ల‌ప‌ల్లి న‌ర‌సింహారావు అంటే మ‌న‌లో చాలా మంది ఎవ‌రాయ‌న‌? అన‌డుగుతారు. రాళ్ల‌ప‌ల్లి అంటే మాత్రం తెలుగు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణించిన న‌టుడ‌ని చెప్పేస్తారు. వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ రెండేళ్ల క్రితం ఆయ‌న క‌న్నుమూశారు. అయితే ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెల‌నీ, వారిలో పెద్ద‌మ్మాయి ర‌ష్యాలో డాక్ట‌ర్ కోర్సు చ‌ద‌వ‌డానిక‌ని వెళ్తూ మార్గ‌మ‌ధ్యంలో చ‌నిపోయింద‌నీ మ‌న‌లో చాలామందికి తెలీదు. అవును.  రాళ్ల‌ప‌ల్లి పెద్ద‌మ్మాయి పేరు మాధురి. న‌లుగురి ఆరోగ్యాన్ని బాగుచేసే వైద్యురాలిగా పేరు తెచ్చుకోవాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్న‌ది. ర‌ష్యాలో మెడిసిన్ చద‌వాల‌ని బ‌య‌లుదేరింది. ట్రైన్‌లో వెళ్తుంటే వైర‌ల్ ఫీవ‌ర్ లాంటిదేదో సోకి, స‌కాలంలో వైద్యం అంద‌క, అదే ట్రైన్‌లో ప్రాణాలు కోల్పోవ‌డం ఎంత‌టి బాధాక‌రం! ఆమెను భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి చెన్నైకి ర‌ప్పించ‌డానికి అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి దివంగ‌త పి.వి. న‌ర‌సింహారావు సైతం సాయం చేశారు.  మాధురి ఆక‌స్మిక‌ మృతిని రాళ్ల‌ప‌ల్లి త‌ట్టుకోలేక‌పోయారు. కూతుళ్లంటే ఆయ‌న‌కు అమిత‌మైన ప్రేమ‌. పెద్ద‌మ్మాయి పోయిన దుఃఖాన్ని చాలా కాలం ఆయ‌న మోశారు. ఆమెను మ‌ర‌చిపోలేక‌, ఆమె మీద ప్రేమ‌తో 'మాధురి' అనే అక్ష‌రాల‌ను త‌న ప్ర‌తి చొక్కా జేబుపై కుట్టించుకునేవారు. ఎక్క‌డికైనా ఆ చొక్కాలు వేసుకొనే వెళ్లేవారు. పార్టీల‌కో, ఏవైనా ప్రోగ్సామ్స్‌కో త‌ప్ప‌ తాను చ‌నిపోయేంత వ‌ర‌కూ ఆయ‌న అలాగే చేసేవారు.

చిరంజీవిని ఫూల్‌ చేద్దామ‌నుకొని...

  పూర్ణిమ అన‌గానే మ‌న‌కు 'ముద్ద‌మందారం', 'నాలుగు స్తంభాలాట‌', 'మా ప‌ల్లెలో గోపాలుడు' సినిమాలు ముందుగా గుర్తుకువ‌స్తాయి. 'పుత్త‌డి బొమ్మ‌'గా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం పొందిన పూర్ణిమ ఒక‌సారి ఏప్రిల్ 1న ఎవ‌ర్ని ఫూల్ చెయ్యాలా అని ఆలోచించి ఫోన్‌లో కొన్ని నంబ‌ర్ల‌కు ట్రై చేశారు. ముందు చంద్ర‌మోహ‌న్‌ను ఫూల్ చేద్దామ‌నుకున్నారు. కానీ అప్పుడాయ‌న ఊళ్లో లేరు. చివ‌ర‌కు ఓ మంచి ఐడియా త‌ట్టింది. స‌రే అనుకుంటూ చిరంజీవి నంబ‌ర్‌కు ట్రై చేశారు.  "హ‌లో" అంది అవ‌త‌లి కంఠం. అది చిరంజీవి గొంతుకాద‌ని ఆమెకు అర్థ‌మైంది. "హ‌లో.. చిరంజీవి గారున్నారండీ?" అని అడిగారు. "ఎవ‌రూ?" అంది అవ‌త‌లి కంఠం. "నేను ఆయ‌న అభిమానిని." చెప్పారు పూర్ణిమ‌. "ఒక్క నిమిషం" అంది అవ‌త‌లి కంఠం. ఒక‌ట్రెండు నిమిషాల త‌ర్వాత "చిరంజీవి హియ‌ర్" అని వినిపించింది. "హ‌లో.. చిరంజీవి గారా.. న‌మ‌స్తే అండీ. నేను మీ అభిమానిని. ఒంగోలు నుంచి వ‌చ్చాను, మిమ్మ‌ల్ని చూద్దామ‌ని. నా పేరు శాంతి." అన్నారు పూర్ణిమ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ. "ఓ.. ఐసీ.. అలాగా. చాలా సంతోషం. ఏం చేస్తుంటారు?" అడిగారు చిరంజీవి. "బీయ‌స్సీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాను సార్‌." చెప్పారు పూర్ణిమ‌. "ఏ కాలేజీలో?" అడిగారు చిరంజీవి. "ఒంగోలు యూనివ‌ర్సిటీ కాలేజీ." అనేశారు పూర్ణిమ‌. నిజానికి ఒంగోలులోని కాలేజీల పేర్లేవీ ఆమెకు తెలీదు. క్ర‌మంగా ఆయ‌న సినిమాలు, ఆయ‌న న‌ట‌న గురించి మాట్లాడుతూ కొంత‌సేప‌య్యాక "నేనెవ‌రో గుర్తుప‌ట్టారా?" అన‌డిగారు పూర్ణిమ‌. "ఎవ‌రూ?" అని అడిగారు చిరంజీవి ఆశ్చ‌ర్యంగా. "నేను, మీరు క‌లిసి ఓ సినిమాలో న‌టించాం కూడా." అని క్లూ ఇచ్చారు పూర్ణిమ‌.  అప్ప‌టికీ చిరంజీవికి గుర్తు రాలేదు.  "ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌లో మ‌నిద్దం క‌లిసి ఒక సాంగ్ కూడా చేశాం." అని మ‌రో క్లూ ఇచ్చారు పూర్ణిమ‌. "ఓ పూర్ణిమా.. ఇవాళ ఏప్రిల్ ఒక‌టో తేదీ అని నాకు తెలుసు. ఇంత‌కీ నువ్వు ఫోన్ చెయ్య‌గానే ముందు మాట్లాడింది ఎవ‌రో తెలుసా?" అడిగారు చిరంజీవి. "మీ సెక్ర‌ట‌రీ" చెప్పారు పూర్ణిమ‌. "కాదు నేనే.. గొంతు మార్చి మాట్లాడాను." అన్నారు చిరంజీవి కూల్‌గా. అప్పుడు ఫూల్ అవ‌డం పూర్ణిమ వంతైంది.

అక్క శ్రీ‌ల‌క్ష్మిని సినిమాల్లో న‌టించ‌వ‌ద్ద‌ని దెబ్బ‌లాడిన‌ రాజేశ్‌!

  శ్రీ‌ల‌క్ష్మి, రాజేశ్ అక్కాత‌మ్ముళ్లు. రాజేశ్ హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి, యంగ్ ఏజ్‌లోనే లివ‌ర్ దెబ్బ‌తిని మృతిచెందాడు. శ్రీ‌ల‌క్ష్మి లేడీ క‌మెడియ‌న్‌గా జంధ్యాల సినిమాల్లో రాణించి, అలా వ‌చ్చిన పేరుతో అనేక అవ‌కాశాలు సంపాదించుకొని ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను పొందారు. నిజానికి శ్రీ‌ల‌క్ష్మి సినిమాల్లో న‌టించ‌డం రాజేశ్‌కు ఏమాత్రం ఇష్టంలేదు. ఆమెను న‌టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న చెప్పినా, శ్రీ‌ల‌క్ష్మి విన‌లేదు. అంద‌రూ ప‌నిచేస్తేనే కుటుంబం గ‌డుస్తుంద‌నీ, త‌ను న‌టిస్తాన‌నీ తేల్చిచెప్పి న‌టిగా కొన‌సాగారు. నిజానికి వాళ్ల నాన్న తొలి త‌రం సినీ క‌థానాయ‌కుడు అమ‌ర్‌నాథ్. తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు వాళ్ల కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉండేది. ఆయ‌న చ‌నిపోయాక జీవ‌నాధారం కోసం మ‌ద్రాస్ వెళ్లింది ఆ కుటుంబం. అమ‌ర‌నాథ్‌కు, భానుచంద‌ర్ వాళ్ల నాన్న మాస్ట‌ర్ వేణు (అల‌నాటి మేటి సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రు) మంచి మిత్రులు. అలా ఆ కుటుంబం తెలియ‌డంతో నేరుగా వారి ఇంటికే వెళ్లారు శ్రీ‌ల‌క్ష్మి వాళ్లు. ఆ ఇంట్లోనే ఓ పోర్ష‌న్‌లో అద్దెకున్నారు. రాజేశ్‌కు జంధ్యాల సినిమా 'నెల‌వంక‌'లో హీరో వేషం వ‌చ్చింది. దాని త‌ర్వాత 'రెండు జెళ్ల సీత' సినిమాలోని న‌లుగురు హీరోల్లో ఒక‌డిగా రాజేశ్‌ను తీసుకున్నారు జంధ్యాల‌. ఆ సినిమాలో సుత్తి వేలు భార్య‌గా ఓ చిన్న వేషానికి శ్రీ‌ల‌క్ష్మిని తీసుకున్నారు. అయితే అక్క న‌టిగా మార‌డం ఎందుక‌నో రాజేశ్‌కు రుచించ‌లేదు. మొద‌ట అత‌ను మౌనంగానే ఉన్నాడు. శ్రీ‌ల‌క్ష్మిని రెండు రోజుల క్యారెక్ట‌ర్ కోస‌మే తీసుకున్నారు శ్రీ‌ల‌క్ష్మి. కానీ.. సుత్తి వేలు, ఆమె మ‌ధ్య స‌న్నివేశాలు బాగా వ‌స్తూ, విప‌రీత‌మైన హాస్యాన్ని కురిపిస్తున్నాయ‌న్న విష‌యం సెట్స్‌లోనే అర్థ‌మ‌వ‌డంతో జంధ్యాల ఆమె పాత్ర‌ను పెంచారు.  అప్పుడు రాజేశ్, "నువ్వెందుకు ఈ క్యారెక్ట‌ర్‌కు వ‌చ్చావ్‌?  నేను హీరోగా చేస్తున్నాను. నువ్వు రెండు రోజుల వేషానికి వ‌చ్చావ్‌. నువ్వు వెళ్లిపో" అని చెప్పాడు. "అదేంట్రా.. న‌లుగురూ క‌ష్ట‌ప‌డితేనే క‌దా మ‌న కుటుంబం వెళ్లేది! నువ్వేమో వెళ్లిపో అంటున్నావ్‌. పో.. కావాలంటే నీ ప్రెస్టీజ్ నిల‌బెట్టుకో. నేను వ‌చ్చిన ప‌ని చేసుకొని వెళ్తానంతే." అని క‌చ్చితంగా చెప్పేశారు శ్రీ‌ల‌క్ష్మి. "నీ ఖ‌ర్మ" అని రాజేశ్ అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. అట్లా ఇద్ద‌రి మ‌ధ్యా దెబ్బ‌లాట జ‌రిగింది. 'రెండు జెళ్ల సీత' తెచ్చిన పేరుతో వెన‌క్కి తిరిగి చూడ‌కుండా కెరీర్‌లో ముందుకు దూసుకుపోయారు శ్రీ‌ల‌క్ష్మి. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు శ్రీ‌ల‌క్ష్మి.

ఐశ్వ‌ర్య తండ్రి 'మ‌ల్లెమొగ్గ‌లు' రాజేశ్ అర్ధంత‌రంగా ఎలా చ‌నిపోయాడు?

  ఐశ్వ‌ర్యా రాజేశ్ అంటే ఇప్పుడు మ‌నంద‌రికీ తెలుసు. ఆమెది సినీ కుటుంబం. ఆమె తాత అమ‌ర్‌నాథ్ తొలినాటి తెలుగు సినీ హీరోల్లో ఒక‌రు. ఆమె తండ్రి రాజేశ్‌.. ఒక‌ప్పుడు 'మ‌ల్లెమొగ్గ‌లు' రాజేశ్‌గా మ‌నంద‌రికీ సుప‌రిచితుడు. 'రెండు జెళ్ల సీత‌', 'ఆనంద భైర‌వి' లాంటి కొన్ని సినిమాల్లో హీరోగా, మ‌రి కొన్ని సినిమాల్లో నెగ‌టివ్ రోల్స్‌లో క‌నిపించిన రాజేశ్ యంగ్ ఏజ్‌లోనే అర్ధంత‌రంగా క‌న్నుమూసి, అటు త‌న స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల హృద‌యాల్లో విషాదాన్ని నింపారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఎక్కువ‌గా కుంగిపోయింది ఆయ‌న కుటుంబ‌మే. రాజేశ్‌కు భార్య‌తో పాటు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు.  న‌టునిగా బాగా బిజీగా ఉన్న కాలంలో ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవ‌డంతో అనేక‌మంది ఆయ‌న చుట్టూ చేరేవారు. స్వ‌త‌హాగా మృదుస్వ‌భావి, ద‌యాగుణం క‌ల‌వాడు కావ‌డంతో అనేక‌మందికి ఆయ‌న డ‌బ్బు సాయం చేశాడు. ఫైనాన్స్ సంస్థ‌ల్లో అప్పులు తీసుకున్న కొంత‌మందికి ష్యూరిటీగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ మంచిత‌న‌మే ఆయ‌న‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రుణాలు తీసుకున్న‌వారు వాటిని చెల్లించ‌క‌పోవ‌డంతో రాజేశ్‌పై ఆ భారం ప‌డేద‌ని చెప్పుకునేవారు. ఆ ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డ్డానికో, ఏమో తాగుడు వ్య‌స‌నానికి గుర‌య్యాడు. దాంతో స‌హ‌జంగానే ఆయ‌న ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ది.  ఆ కాలంలో ఆ కుటుంబం చాలా ఆర్థిక క‌ష్టాలు ఎదుర్కొంది. కుటుంబ పోష‌ణ భారం తీసుకున్న రాజేశ్ భార్య ఎల్ఐసీ ఏజెంట్‌గా ప‌నిచేశారు. భ‌ర్త‌నూ, న‌లుగురు పిల్ల‌ల‌నూ పోషించుకుంటూ వ‌చ్చారు. ఆమె సంపాద‌న‌లో అధిక భాగం రాజేశ్ వైద్యానికే ఖ‌ర్చ‌య్యేది. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆయ‌న లివ‌ర్ అప్ప‌టికే బాగా దెబ్బ‌తినిపోయింది. ఐశ్వ‌ర్య‌కు ఏడెనిమిదేళ్ల వ‌య‌సులో రాజేశ్ మృతి చెందాడు. ఆ స‌మ‌యానికి వారికి మ‌ద్రాస్‌లోని టి. న‌గ‌ర్‌లో ఒక ఫ్లాట్ మిగిలింది. ష్యూరిటీ ఉండ‌టం వ‌ల్ల ఫైనాన్స్ వ్యాపార‌స్తులు గొడ‌వ‌లు చేయ‌డంతో ఆ ఫ్లాట్‌ను కూడా రాజేశ్ భార్య అమ్మేసి, ఆ డ‌బ్బును వాళ్ల‌కు చెల్లించారు.  త‌ర్వాత అద్దె ఇంట్లోనే ఉంటూ పిల్ల‌ల‌ను పెంచుతూ వ‌చ్చారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఒక ప్ర‌మాదంలో ఇద్ద‌రు కొడుకులు మృతిచెంద‌డం ఆ కుటుంబంలో జ‌రిగిన మ‌రో పెద్ద విషాదం. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ వ‌చ్చిన ఐశ్వ‌ర్య ఇవాళ న‌టిగా మంచి పేరు తెచ్చుకుని తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్ట‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కుటుంబాన్నీ నిల‌బెట్టింది. ఐశ్వ‌ర్య అన్న‌య్య‌కు పెళ్ల‌యింది కూడా.  త‌మిళ‌, తెలుగు చిత్రాల‌తో బిజీగా ఉంటున్న కూతుర్ని చూసుకుంటూ గ‌ర్విస్తోంది ఆమె త‌ల్లి. లేడీ క‌మెడియ‌న్‌గా ఎన్నో సినిమాల్లో మ‌న‌ల్ని న‌వ్వించిన శ్రీ‌ల‌క్ష్మి.. ఐశ్వ‌ర్య‌కు స్వ‌యానా మేన‌త్త‌!

గుర్రంపై నుంచి కింద‌ప‌డిపోయిన శాంతిప్రియ‌!

  భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ తెలుగులో వంశీ సినిమా 'మ‌హ‌ర్షి'తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేశాక బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ రాణించింది. వివాహానంత‌రం సినిమాల‌కు దూర‌మైంది. పెళ్లయిన కొంత కాలానికే భ‌ర్త ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో ఇద్ద‌రు కుమారుల‌ను పెంచి పెద్ద‌చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తోంది. కెరీర్ ఆరంభంలో ర‌ఘువ‌ర‌న్ స‌ర‌స‌న 'పెరియ‌వ‌ర్‌గ‌ళే తాయ్ మార్గ‌ళే' అనే త‌మిళ చిత్రంలో నాయిక‌గా న‌టించింది శాంతిప్రియ‌. అప్పుడు ఆమె స్క్రీన్ నేమ్ నిశాంతి. మ‌ద్రాస్ వైఎంసీఏలో షూటింగ్ జ‌రుగుతోంది. అందులో శాంతిప్రియ గుర్ర‌పు స్వారీ చేసే స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ సీన్ తీసే ముందు ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆమెకు డూప్ పెడ‌తామ‌న్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆమెకు గుర్ర‌పు స్వారీలో మంచి ప్ర‌వేశం ఉంది. అందుక‌ని తానే స్వ‌యంగా గుర్ర‌పు స్వారీ చేస్తాన‌ని, డూప్ లేకుండా ఆ స‌న్నివేశంలో న‌టించేందుకు రెడీ అయ్యింది. చేసేది లేక ద‌ర్శ‌కుడు, నిర్మాత స‌రేన‌న్నారు. గుర్రాన్ని తెప్పించారు. స్టైల్‌గా గుర్ర‌మెక్కి క‌ళ్లాన్ని ప‌ట్టుకుంది శాంతిప్రియ‌. గుర్ర‌పు స్వారీలో త‌న ప్రావీణ్యం చూపించాల‌ని క‌ళ్లాన్ని అదిలించి, స్పీడుగా గుర్రాన్ని ప‌రుగెత్తించింది. గుర్రం ఫాస్ట్‌గా ప‌రుగెత్తుతోంది. కొంత‌దూరం వెళ్లిన త‌ర్వాత ఆ గుర్రం చేసిన జంప్‌కు ఆమె కాళ్లు రికాబులోంచి జారి పైకి ఎగిరింది. బ్యాలెన్స్ దొర‌క‌లేదు. ఆలోగా చేతిలో క‌ళ్లెం జారిపోయింది. గుర్రం ముందుకు ప‌రుగెత్తింది. అంతే.. శాంతిప్రియ ద‌బ్బున నేల‌మీద ప‌డింది. యూనిట్ మొత్తం ఆమెవైపు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చారు. అంత‌లోనే ఆమె నేల‌మీద లేచి నిల‌బ‌డ్డంతో వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. గుర్రం మీద‌నుంచి ప‌డినా ఆమెకు ఒక్క దెబ్బ కూడా త‌గ‌ల్లేదు మ‌రి. ఎప్పుడైతే కాలు ప‌ట్టుత‌ప్పిందో అప్పుడే తాను కింద‌ప‌డ‌తాన‌ని ఊహించి, తెలివిగా తానే గుర్రం మీద‌నుంచి జారి కింద‌ప‌డి దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా త‌ప్పించుకుంద‌న్న మాట శాంతిప్రియ‌!

బాల‌కృష్ణ స‌ర‌స‌న‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. సురేశ్ మొద‌టి భార్య!

  కెరీర్ తొలినాళ్ల‌లో సురేశ్ ప‌లు సినిమాల్లో హీరోగా న‌టించాడు. అనేక‌మంది పేరుపొందిన తార‌లు ఆయ‌న స‌ర‌స‌న న‌టించారు. అలా త‌న ప‌క్క‌న న‌టించిన ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డారు సురేశ్‌. ఆమెను 1990లో పెళ్లాడారు. ఐదేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత ఇద్ద‌రూ విడాకులు తీసుకొని విడిపోయారు. "నేనొక అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నా. ఆమె నాతో సినిమాల్లో న‌టించింది. త‌ను మంచి సింగ‌ర్ కూడా. ఒక టైమ్‌లో మేం బాగా స్ట్ర‌గుల్ అయ్యాం. ఆమెకు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ న‌చ్చ‌లేదు. ఉన్న‌త చ‌దువులు చ‌దువుకొని అబ్రాడ్‌లో సెటిల్ అవుదామ‌ని త‌ను చెప్పింది. నా ప‌రిస్థితి కూడా అప్పుడు బాగా లేదు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీని వ‌దిలేసే కండిష‌న్ మీదే మేం పెళ్లి చేసుకున్నాం." అని ఒక ఇంట‌ర్వ్యూలో సురేశ్ చెప్పారు. ఇంత‌కీ ఆయ‌న మొద‌టి భార్య ఎవ‌రో తెలుసా? జంధ్యాల డైరెక్ట్ చేసిన 'బాబాయ్ అబ్బాయ్' సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన అనితా రెడ్డి. ఆమెకు అదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. అయితే అంత‌కంటే ముందు ఆమె సింగ‌ర్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. లెజెండ‌రీ సింగ‌ర్ కె.జె. యేసుదాస్ క‌లిసి సంగీత క‌చేరీల్లో పాల్గొని, ఆ త‌ర్వాత పాప్ సింగ‌ర్‌గానూ పేరు తెచ్చుకుంది. చిరంజీవి 'ఖైదీ' మూవీలో "త‌ప్పించుకోలేవు నా చేతిలో" పాట‌ను పాడింది ఆమే. నిజానికి 'శ్రీ‌వారి శోభ‌నం' సినిమా కోసం హీరోయిన్‌గా అనిత‌ను తీసుకున్నారు జంధ్యాల‌. కానీ ముందుగా 'బాబాయ్ అబ్బాయ్' విడుద‌ల‌వ‌డంతో, ప్రేక్ష‌కుల‌కు ఆ సినిమాతోటే ప‌రిచ‌య‌మైంది. భానుచంద‌ర్ 'టెర్ర‌ర్' మూవీలో సురేశ్‌, అనిత‌రెడ్డి జంట‌గా న‌టించారు. అప్పుడే మ‌న‌సులు క‌లిసి, పెళ్లి చేసుకున్నారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా పెళ్లి త‌ర్వాత సురేశ్‌కు సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి. "ఒక ఏడాది నేను ఏకంగా 18 సినిమాల్లో న‌టించాను. స్టోరీ డిస్క‌ష‌న్స్‌, షూటింగ్స్‌, ట్రావెలింగ్‌తోటి బాగా బిజీ అయిపోయాను. ఆమె నిర్ణ‌యం గురించి ఇంకోసారి ఆలోచించ‌మ‌ని నా భార్య‌ను రిక్వెస్ట్ చేశాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. పిల్ల‌లు పుడితే అయినా ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌తాయ‌ని మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఒక‌బ్బాయిని క‌న్నాం. అయినా ఫ‌లితం లేక‌పోయింది. మేం డైవోర్స్ తీసుకున్నాం." అని సురేశ్ వెల్ల‌డించారు. ఇప్పుడు అనిత ఎక్క‌డ ఉన్నారు, ఏం చేస్తున్నారో విష‌యాలు మ‌న‌కు తెలీదు. ఆమెతో విడిపోయాక‌ రాజ‌శ్రీ బిష్త్ అనే ర‌చ‌యిత్రిని వివాహం చేసుకున్నారు సురేశ్‌.

చివ‌రి రోజుల్లో కుటుంబ పోష‌ణ కోసం సీరియ‌ల్స్‌లో న‌టించిన సుత్తి వేలు!

  తెలుగు సినిమాల్లో సుత్తి జంట‌ది ఒక ప్ర‌త్యేక ముద్ర‌. సుత్తి వీర‌భ‌ద్ర‌రావు, ఆయ‌న అసిస్టెంట్‌గా సుత్తి వేలు ఎన్ని సినిమాల్లో ప్రేక్ష‌కుల్ని త‌మ సుత్తితో న‌వ్వించారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రిలో వీర‌భ‌ద్ర‌రావు త్వ‌ర‌గా ఈ లోకాన్ని విడిచి వెళ్ల‌గా, ఆ త‌ర్వాత వేలు ఇటు కామెడీ పాత్ర‌ల‌తోనే కాకుండా అటు వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తోనూ ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. 'ప్ర‌తిఘ‌ట‌న‌'లో పిచ్చివాడిగా మారిన పోలీస్ కానిస్టేబుల్‌గా వేలు న‌ట‌న గురించి ఎంత మెచ్చుకున్నా త‌క్కువే. ఆ ఒక్క పాత్ర‌తో వేలు త‌న న‌ట‌న‌లోని మ‌రో కోణాన్ని అద్భుతంగా చూపించారు. వీర‌భ‌ద్ర‌రావును గురువుగా భావించే వేలు.. ఆయ‌న మ‌ర‌ణంతో చాలా కుంగిపోయారు. ఆ త‌ర్వాత త‌న‌ను 'ముద్ద మందారం'తో సినీ న‌టుడిగా ప‌రిచ‌యం చేసి, 'నాలుగు స్తంభాలాట‌'తో సుత్తి వేలుగా పాపులారిటీ క‌ల్పించిన ద‌ర్శ‌కుడు జంధ్యాల క‌న్నుమూయ‌డంతో మ‌రింత బాధ‌కు లోన‌య్యారు. మ‌ద్రాసులో ఉన్నంత కాల‌మూ వేలుకు తిరుగులేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే తెలుగు చిత్ర‌సీమ హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చిందో.. అప్ప‌ట్నుంచి ఆయ‌న‌కు క‌ష్ట కాలం మొదలైంద‌నే చెప్పాలి. మునుప‌టి ప్రాభ‌వాన్ని ఆయ‌న కోల్పోయారు. ఎంత క‌ష్ట‌ప‌డినా, ఆయ‌న‌కు ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా అవ‌కాశాలు బాగా త‌గ్గిపోవ‌డంతో ఒకానొక ద‌శ‌లో ఆయ‌న‌కు కుటుంబాన్ని పోషించ‌డం కూడా క‌ష్టంగా ప‌రిణ‌మించింది. భార్య‌, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకును పోషించ‌డానికి త‌ప్ప‌నిస‌రిగా టీవీ సీరియ‌ల్స్‌ను ఆశ్ర‌యించారు. అంత‌కుముందు ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం కామెడీ సీరియ‌ల్ 'ఆనందో బ్ర‌హ్మ‌'లో తెగ న‌వ్వించిన వేలు, చివ‌రి రోజుల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా టీవీ సీరియ‌ల్స్‌లో అంత‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌ల‌ను కూడా చేశారు. జీవ‌న పోరాటంలో అలిసిపోయిన ఆయ‌న 66 ఏళ్ల వ‌య‌సులో 2012 సెప్టెంబ‌ర్‌లో క‌న్నుమూశారు. అప్ప‌టికే ఆయ‌న ప‌ళ్లు ఊడిపోయి, 70 ఏళ్ల‌కు పైగా వ‌య‌సుంటుంద‌నే విధంగా మారిపోయారు.  కామెడీ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగి, ప్ర‌తిఘ‌ట‌న‌, వందేమాత‌రం, ఈ చ‌దువులు మాకొద్దు, ఒసేయ్ రాముల‌మ్మా లాంటి సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుని, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరుపొందిన వేలు ఆఖ‌రి రోజుల్లో ఆర్థిక క‌ష్టాల‌కు గురికావ‌డం మాత్రం ఎంతైనా శోచ‌నీయం.

బాల‌కృష్ణ 'క‌థానాయ‌కుడు' క‌థ విని "ఇందులో ఏముంది బ్ర‌ద‌ర్‌?" అనేసిన ఎన్టీఆర్‌!

  బాల‌కృష్ణ, విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన 'క‌థానాయ‌కుడు' (1984) మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న‌విజ‌యం సాధించి, 175 రోజులు ఆడింది. కె. ముర‌ళీమోహ‌న‌రావు ద‌ర్శ‌క‌త్వంలో డి. రామానాయుడు ఈ సినిమాని నిర్మించారు. ఇందులో జ‌డ్జిగా శార‌ద న‌టిస్తే, ఆమె ఇద్ద‌రు త‌మ్ముళ్లుగా చంద్ర‌మోహ‌న్‌, బాల‌కృష్ణ న‌టించారు. ఆ రోజుల్లో బాల‌కృష్ణ న‌టించే సినిమాల క‌థ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఎన్టీ రామారావు వినేవారు. ఈ సినిమా టైమ్‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. త‌ను ఎంత తీరిక‌లేని ప‌నుల‌తో ఉన్న‌ప్ప‌టికీ క‌థ‌లు వినేందుకు స‌మ‌యం కేటాయించేవారు. 'క‌థానాయ‌కుడు' క‌థ‌ను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చెప్పిన‌ప్పుడు, "ఇందులో ఏముంది బ్ర‌ద‌ర్‌?" అన్నారు ఎన్టీఆర్‌. "రాజ‌కీయాల‌కూ, న్యాయ‌వ్య‌వ‌స్థ‌కూ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఉంది అన్న‌గారూ" అని వివ‌ర‌ణ ఇచ్చారు బ్ర‌ద‌ర్స్‌. "కానీ.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేవు క‌దా" అని మ‌ళ్లీ అడిగారు ఎన్టీఆర్‌. "అన్ని మ‌సాలాలు వేసి వంద రోజులు ఆడేవిధంగా స్క్రిప్టును తీర్చిదిద్దుతాం" అన్న‌గారూ అని మాట ఇచ్చారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌. "ఇట్సాల్ రైట్‌.. అన్న‌మాట నిల‌బెట్టుకొనే మ‌నిషి నాయుడుగారు.. ఆయ‌న మీద న‌మ్మ‌కంతో ఈ క‌థ ఓకే చేస్తున్నాను. ప్రొసీడ్.." అని చెప్పారు రామారావు.  బాల‌కృష్ణ‌తో రామానాయుడు నిర్మించిన తొలి సినిమా 'క‌థానాయ‌కుడు'. ఇందులో 'కింగ్ కాంగ్' అనే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ను ప‌రుచూరి గోపాల‌కృష్ణ చేశారు.  ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రించిన‌ ఈ సినిమా ర‌జ‌తోత్స‌వం 1985 జూలై 28న హైద‌రాబాద్‌లోని ప‌ర‌మేశ్వ‌రి, మ‌హేశ్వ‌రి థియేట‌ర్‌లో జ‌రిగింది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అధ్య‌క్ష‌త వ‌హించారు. బాలీవుడ్ తార‌లు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మీనాక్షి శేషాద్రి, ప్రాణ్‌, ఖాద‌ర్ ఖాన్‌, సారిక లాంటివాళ్లు ఈ వేడుక‌లో పాల్గొన‌డం విశేషం.

న‌డుము గిల్లిన ఆక‌తాయిని చెంప ఛెళ్లుమ‌నిపించిన ల‌తాశ్రీ‌!

  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకొని, చాలా సినిమాల్లో హీరో చెల్లెలిగా, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా న‌టించిన ల‌తాశ్రీ గుర్తున్నారా? 'య‌మ‌లీల' సినిమాలో య‌ముడిగా న‌టించిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ఐస్‌క్రీములు తినిపిస్తూ, ఆయ‌న‌తో ఓ డ్యూయెట్ కూడా చేసి ప్రేక్ష‌కుల్ని అల‌రించారు ల‌తాశ్రీ‌. అలాంటి ఆమెను ఓ సంద‌ర్భంలో ఓ ఆక‌తాయి అల్ల‌రి చేశాడు. ఆ క‌థేమిటంటే... సీనియ‌ర్ న‌రేశ్, సీత జంట‌గా న‌టించిన 'పోలీస్ భార్య' (1990) చిత్రంలో ల‌తాశ్రీ ఓ కీల‌క పాత్ర చేశారు. రేలంగి న‌ర‌సింహారావు డైరెక్ట్ చేసిన ఆ ఫిల్మ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, వంద రోజులు ఆడింది. ఆ సినిమా శ‌త‌దినోత్స‌వ వేడుక స‌భ‌ జ‌రిగిన‌ప్పుడు దానికి ల‌తాశ్రీ హాజ‌ర‌య్యారు. ఆ వేడుక‌కు వేలాది మంది జ‌నం వ‌చ్చారు. వేడుక ముగిశాక ఆర్టిస్టులంద‌రూ స్టేజి మీద‌నుంచి కింద‌కు దిగి వ‌స్తున్నారు. ముందు న‌రేశ్‌, ఆ వెనుక సీత‌, ల‌తాశ్రీ‌, మిగ‌తా ఆర్టిస్టులు న‌డుస్తున్నారు. హ‌ఠాత్తుగా ఆడియెన్స్‌లోంచి ఒక ఆక‌తాయి వెనుక నుంచి ల‌తాశ్రీ న‌డుము ప‌ట్టుకుని గిల్లాడు. ఉలిక్కిప‌డి చూశారు ల‌తాశ్రీ‌. అత‌ను రెండోసారి గిల్ల‌డానికి వ‌స్తున్నాడు. పిచ్చికోపం వ‌చ్చేసిందామెకు. ఠ‌క్కున అత‌ని చేయిప‌ట్టుకొని మెలితిప్పి, చెంప ఛెళ్లుమ‌నిపించారు ల‌తాశ్రీ‌. అది చూసి, ప‌ది మందికి పైగా ఉన్న వాడి గ్యాంగ్ అక్క‌డ‌కు వ‌చ్చేశారు. ఏంటి మావాడ్ని కొడుతున్నార‌ని మీద మీద‌కు వ‌చ్చారు. అప్పుడు ల‌తాశ్రీ పాలిట న‌రేశ్ రియ‌ల్ హీరో అయ్యారు. ఆ గ్యాంగ్‌తో గ‌ట్టిగా మాట్లాడి, అక్క‌డున్న‌ పోలీసుల‌ను పిలిపించి, వాళ్ల‌ను అక్క‌డ్నుంచి పంపించేశారు. ల‌తాశ్రీ జోలికి మ‌ళ్లీ ఎవ‌రూ రాకుండా తాను ర‌క్ష‌ణ‌గా ఉండి, వ్యాన్‌లో ఎక్కించారు న‌రేశ్‌. 30 ఏళ్ల క్రితం జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌ను ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేదు ల‌తాశ్రీ‌.

జ‌నాన్ని న‌వ్వించ‌లేక‌పోయిన బ్ర‌హ్మానందం!

  బ్ర‌హ్మానందం సినీ ఫీల్డులోకి రాక‌ముందు అత్తిలి డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. అప్ప‌టికే ఆయ‌న ఎన్నో ఏళ్లుగా మిమిక్రీ చేస్తూ, మంచి మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు. ఓసారి ఆ ఊళ్లోనే బ్ర‌హ్మానందం ఓ సంద‌ర్భంలో మిమిక్రీ ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఆయ‌న మిమిక్రీ చేస్తుంటే జ‌నం విర‌గ‌బ‌డి న‌వ్వుతున్నారు. విప‌రీతంగా ఆనందిస్తున్నారు. వాళ్లు అలా న‌వ్వుతుంటే ఆయ‌న‌లో ఉత్సాహం మ‌రింత ఎక్కువై, వాళ్ల‌ను మ‌రీ మ‌రీ న‌వ్విస్తున్నారు. ఆ ప్ర‌దేశ‌మంతా న‌వ్వుల‌మ‌యం అయిపోయింది. అంత‌లోనే ఓ విచిత్రం జ‌రిగింది. ఆ ఊరి ప్రెసిడెంట్ అక్క‌డికి వ‌చ్చి జ‌నాన్ని ఉద్దేశించి, "ఆపండి" అని కేక వేశాడు. జ‌నం న‌వ్వ‌డం ఆపేశారు. బ్ర‌హ్మానందం ప్రోగ్రామ్ ఆపేశారు. సూది నేలమీద వేస్తే ఆ చ‌ప్పుడు అంద‌రికీ వినిపించేంత నిశ్శ‌బ్దం ఆవ‌రించింది. బ్ర‌హ్మానందంకు ఏమీ అర్థం కాలేదు. ఏమిటా అని చూసేస‌రికి ప్రెసిడెంట్ గొంతు వినిపించింది. "మీరంతా ఎందుకు న‌వ్వుతున్నారు? అస‌లు మీకెందుకు న‌వ్వొస్తుంది? ఆయ‌నెవ‌ర‌నుకున్నారు.. మ‌న‌వూరి కాలేజీ తెలుగు లెక్చ‌ర‌ర్‌. ఆయ‌న్ని చూస్తే మీకు న‌వ్వులాట‌గా ఉందా? ఇంకెప్పుడు ఇలా న‌వ్వ‌కండి. ఈసారి కానీ మీలో ఎవ‌రు న‌వ్వినా చంపేస్తాను" అని గ‌ద్దించి, బ్ర‌హ్మానందంను చూసి, "మీరు ప్రోగ్రాం కానివ్వండి మాస్టారూ" అన్నాడు. బ్ర‌హ్మానందం మ‌ళ్లీ మిమిక్రీ కొన‌సాగించారు. ఆయ‌న వాళ్ల‌ను న‌వ్వించ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా వాళ్ల ముఖాల్లో న‌వ్వు క‌నిపించ‌డం లేదు. వాళ్లు న‌వ్వ‌కుండా ఉండ‌టంతో ఆయ‌న‌లో ప‌ట్టుద‌ల ఎక్కువై వాళ్ల‌ను న‌వ్వించ‌డానికి క‌ష్ట‌ప‌డి ఎన్నో ర‌కాలుగా మిమిక్రీ చేశారు. వాళ్ల‌కి న‌వ్వు వ‌స్తున్నా లోలోనే దిగ‌మింగి, నోరు మూసుకొని కూర్చున్నారే కానీ ఒక్క‌రూ పైకి న‌వ్వ‌లేదు. ఎన్నోసార్లు, ఎన్నో మిమిక్రీ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చి ఎంద‌రెంద‌రినో బ్ర‌హ్మానందం న‌వ్వించారు. కానీ అప్పుడు వాళ్ల‌ను మాత్రం న‌వ్వించ‌లేక‌పోయారు. ఈ త‌మాషా సంఘ‌ట‌న గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బ్ర‌హ్మానందం న‌వ్వుకుంటూ ఉంటారు.

విల‌న్ జీవాది ల‌వ్ మ్యారేజ్ అంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు!

  న‌టుడిగా జీవా తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయ‌న క‌ళ్లే ఆయ‌న‌కు ఎస్సెట్‌. క‌ళ్ల‌తోనే ఆయ‌న భ‌య‌పెట్టేస్తారు. ఆ క‌ళ్ల‌వ‌ల్లే ఆయ‌న‌కు ఆదిలో విల‌న్ అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో అల‌రిస్తూ, ర‌క‌ర‌కాల పాత్ర‌లు చేసుకుంటూ వ‌చ్చారు. అలాంటి ఆయ‌న‌కూ ఓ ల‌వ్ స్టోరీ ఉంద‌నీ, త‌ను ప్రేమించిన యువ‌తినే ఆయ‌న పెళ్లి చేసుకున్నార‌నీ చాలా మందికి తెలీదు. అస‌లు ఆయ‌న క‌ళ్ల‌ను చూసి, ఎవ‌రు ప్రేమిస్తార‌నే సందేహ‌మూ వ‌స్తుంది. కానీ అది నిజం. ఆయ‌న‌ది ప్రేమ వివాహం. అంతేనా.. పెళ్లికి ముందు మ‌ద్రాసులో సినిమా వేషాల కోసం తిరుగుతూ ఆర్థిక క‌ష్టాలు ఎదురైన‌ప్పుడ‌ల్లా జీవాను ఆమే ఆదుకుంటూ వ‌చ్చారు! జీవా స్వ‌స్థ‌లం గుంటూరు. ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర‌ల్లోనే బండ్ల‌మూడి హ‌నుమాయ‌మ్మ స్కూలు ఉంది. ఆమె ఆ స్కూలు విద్యార్థిని. స్కూలు అయిపోయే టైమ్‌కు దారికాచి ఆమెకు లైన్ వేసేవారు జీవా. అక్క‌డ సుబ్బాయ‌మ్మ బ‌డ్డీ కొట్టు ఉంటే, ఏదో కొనుక్కోవ‌డానికి వెళ్లిన‌ట్లు అక్క‌డ‌కు వెళ్లేవారు జీవా. అక్క‌డ్నుంచి ఆమెను చూస్తూ ఉండేవారు. అలా ఇద్ద‌రికీ చూపులు క‌లిశాయి. తన ప్రేమ‌ను ముందుగా ఆయ‌నే వ్య‌క్తం చేశారు. ఆమె కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. న‌టుడు కావాల‌నే కోరిక‌తో గుంటూరు నుంచి మ‌ద్రాస్ వెళ్లారు జీవా. అప్పుడు ఆమె జిల్లా గ్రంథాల‌య సంస్థ‌లో ఉద్యోగిని. మ‌ద్రాస్‌లో జీవా హోట‌ల్‌లో రూమ్ తీసుకొని వేషాల కోసం తిరిగేవారు. ద‌గ్గ‌రున్న డ‌బ్బులు అయిపోతుంటే, ఆమెకు ఉత్త‌రం రాసేవారు. ఆమె డ‌బ్బు పంపేవారు. అలా కొన్నాళ్లు గ‌డిపాక‌, న‌టుడిగా వ‌రుస‌గా వేషాలు వ‌చ్చి, ఆర్థిక క‌ష్టాలు తీరాక అప్పుడు ఆమెను వివాహం చేసుకున్నారు. 

'నార‌ప్ప' మూవీ రివ్యూ

  సినిమా పేరు: నార‌ప్ప‌ తారాగ‌ణం: వెంక‌టేశ్‌, ప్రియ‌మ‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, రాఖీ, కార్తీక్ ర‌త్నం, రావు ర‌మేశ్‌ అమ్ము అభిరామి, నాజ‌ర్‌, వ‌శిష్ఠ సింహా, న‌రేన్‌, దీప‌క్‌శెట్టి, శ్రీ‌తేజ్‌, రామ‌రాజు, ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, కాదంబ‌రి కిర‌ణ్‌, ఝాన్సీ, బేబీ చైత్ర‌ క‌థ‌, స్క్రీన్‌ప్లే: వెట్రిమార‌న్‌ సంభాష‌ణ‌లు: శ్రీ‌కాంత్ అడ్డాల‌ పాట‌లు: సీతారామ‌శాస్త్రి, అనంత శ్రీ‌రామ్‌ సంగీతం: మ‌ణిశ‌ర్మ‌ సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేశ్‌ స్టంట్స్‌: పీట‌ర్ హెయిన్‌, విజ‌య్‌ ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌ కొరియోగ్ర‌ఫీ: వి.జె. శేఖ‌ర్‌ నిర్మాత‌లు: డి. సురేశ్‌బాబు, క‌లైపులి ఎస్‌. థాను ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌కాంత్ అడ్డాల‌ బ్యాన‌ర్స్‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, వి. క్రియేష‌న్స్‌ విడుద‌ల తేదీ: 20 జూలై 2021 ప్లాట్‌ఫామ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఓటీటీ) వెంక‌టేశ్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కావ‌డం అనేది తెలుగు సినిమాకు సంబంధించినంత వ‌ర‌కూ ఓ పెద్ద వార్త‌. టాలీవుడ్‌లో ఒక బిగ్ స్టార్ న‌టించిన సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకుండా స్ట్రయిట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ‌వ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి సినీగోయ‌ర్స్ అంతా ఈ సినిమా విష‌యంలో అత్యంత ఆస‌క్తిని చూపించారు. ధ‌నుష్ న‌టించ‌గా వెట్రిమార‌న్ డైరెక్ట్ చేసిన సూప‌ర్‌హిట్ త‌మిళ ఫిల్మ్ 'అసుర‌న్‌'కు ఇది రీమేక్‌. శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన 'నార‌ప్ప' ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చేసింది.  క‌థ‌ మూడెక‌రాల భూమిని న‌మ్ముకొని జీవ‌నం సాగించే నిమ్న జాతికి చెందిన‌ నార‌ప్ప (వెంక‌టేశ్‌)కు భార్య సుంద‌ర‌మ్మ (ప్రియ‌మ‌ణి), ఇద్ద‌రు కొడుకులు మునిక‌న్న (కార్తీక్ ర‌త్నం), సిన‌బ్బ (రాఖీ), ఒక కూతురు బుజ్జ‌మ్మ (చైత్ర‌) ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన బావ‌మ‌రిది బ‌స‌వ‌య్య (రాజీవ్ క‌న‌కాల‌) కూడా వారితో పాటే ఉంటాడు. ఆ ఏరియాలో భూస్వామి అయిన పండుస్వామి (న‌రేన్‌) త‌మ్ముడు దొర‌స్వామి (దీప‌క్‌శెట్టి) రంగూన్ నుంచి వ‌చ్చి అక్క‌డ‌ సిమెంట్ ఫ్యాక్ట‌రీ క‌ట్టాల‌నుకుంటాడు. అందులో భాగంగా మూడెక‌రాల నార‌ప్ప పొలాన్నీ సొంతం చేసుకోవాల‌నుకుంటారు. నార‌ప్ప ఇవ్వ‌డం కుద‌ర‌దంటాడు. రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌ల్లో మునిక‌న్న‌ను దారుణంగా హ‌త్య చేయిస్తాడు పండుస్వామి. ప్ర‌తీకారంగా పండుస్వామిని న‌రికి చంపుతాడు ప‌ద‌హారేళ్ల కుర్రాడైన సిన‌బ్బ‌. దాంతో చిన్న‌కొడుకునూ, త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోడానికి అక్క‌డ్నుంచి పారిపోతాడు నార‌ప్ప‌. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఎన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నా నార‌ప్ప సౌమ్యంగా ఎందుకుంటున్నాడు? దానికేద‌న్నా నేప‌థ్య‌ముందా? అనేది మిగ‌తా క‌థ‌. విశ్లేష‌ణ‌ 'అసుర‌న్' చూసిన‌వాళ్ల‌కు 'నార‌ప్ప'ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.. ఒరిజిన‌ల్‌కు ఈ రీమేక్ కార్బ‌న్ కాపీ అని. న‌టీన‌టుల‌ను మార్చి రెండు సినిమాల‌నూ ఏక కాలంలో చిత్రీక‌రించారేమోన‌నే అనుమాన‌మూ క‌లుగుతుంది. అసుర‌న్‌లో న‌టించిన న‌రేన్‌, అమ్ము అభిరామి ఈ సినిమాలోనూ అవే పాత్ర‌ల్లో క‌నిపిస్తారు కూడా. తెలుగు వెర్ష‌న్ కోసం స్క్రీన్‌ప్లేని ఏమాత్రం మార్చ‌కుండా య‌థాత‌థంగా వెట్రిమార‌న్ స్క్రీన్‌ప్లేతోటే 'నార‌ప్ప‌'ను తీశారు. త‌మిళంలోని డైలాగ్స్‌ను మాత్రం శ్రీ‌కాంత్ అడ్డాల తెలుగులోకి అనువ‌దించాడు. తిరుప‌తి చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి డైలాగ్స్‌లో అక్క‌డి యాస‌ను వాడారు. దీనికి ప్ర‌ముఖ ర‌చ‌యిత నామిని సుబ్ర‌హ్మ‌ణ్యంనాయుడు స‌హ‌కారం తీసుకున్నారు. ఆ యాస‌లో న‌టులు మాట్టాడుతుంటే విన‌సొంపుగా ఉంది. కాక‌పోతే 'అసుర‌న్‌'లో ధ‌నుష్ ఏ స్టైల్‌లో డైలాగ్స్ చెప్పాడో, సేమ్ టు సేమ్ అదే స్టైల్‌లో వెంక‌టేశ్ డైలాగ్స్ చెప్తుంటే కాస్త త‌మాషాగా అనిపించింది.  స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో డైరెక్ట‌ర్ ఎక్క‌డా స్వేచ్ఛ తీసుకోకుండా త‌మిళ ఒరిజిన‌ల్‌ను మ‌క్కీకి మ‌క్కీ దింపేయ‌డం కూడా అంత బాగ‌నిపించ‌లేదు. 'అసుర‌న్‌'లో ధ‌నుష్ త‌న కొడుకును తీసుకొని లాయ‌ర్ ప్ర‌కాశ్‌రాజ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ప్ర‌కాశ్‌రాజ్ నెరిసిన గ‌డ్డంతో క‌నిపిస్తాడు. 'నార‌ప్ప‌'లో అదే సీన్‌లో లాయ‌ర్ రావు ర‌మేశ్ కూడా నెరిసిన గ‌డ్డంతోనే క‌నిపిస్తాడంటే, శ్రీ‌కాంత్ అడ్డాల ఒరిజిన‌ల్‌ను ఎంత‌గా ఫాలో అయ్యాడో ఊహించుకోవ‌చ్చు. ఆఖ‌రుకు కాస్ట్యూమ్స్ విష‌యంలోనూ అంతే. ఒరిజిన‌ల్‌లో ఏ క్యారెక్ట‌ర్ ఏ త‌ర‌హా డ్ర‌స్సుల్లో క‌నిపిస్తాయో 'నార‌ప్ప‌'లోని అన్ని క్యారెక్ట‌ర్లు అవే త‌ర‌హా దుస్తుల్లో క‌నిపిస్తాయి. కేవ‌లం న‌టీన‌టులు మారారంతే. లొకేష‌న్లు కూడా ఒరిజిన‌ల్‌లో ఉన్న‌ట్లే క‌నిపిస్తాయి. 'అసుర‌న్' ప్ర‌స్తావ‌న‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే, పండుస్వామిని న‌రికి చంపిన సిన‌బ్బ‌ను తీసుకొని నార‌ప్ప ఒక దిక్కు, చెల్లెలు సుంద‌ర‌మ్మ‌, మేన‌కోడ‌లు బుజ్జ‌మ్మ‌ను తీసుకొని బ‌స‌వ‌య్య ఇంకో దిక్కు పోతే, వాళ్ల‌ను ప‌ట్టుకోడానికి దొర‌స్వామి మ‌నుషులు వేట మొద‌లుపెట్ట‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఈ స‌న్నివేశాల‌తోటే ప్రేక్ష‌కుడు క‌థ‌లో లీన‌మైపోతాడు. అంత‌లో వాళ్లెందుకు అలా పారిపోతున్నారో చెప్ప‌డం ప్రారంభిస్తాడు క‌థ‌కుడు. గొడ‌వ‌ల్లో ఆవేశం ప్ర‌ద‌ర్శించ‌కుండా నార‌ప్ప సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం, కొడుకులు మునిక‌న్న‌, సిన‌బ్బ ప్ర‌తిదానికీ ఆవేశ‌ప‌డుతుండ‌టం చూస్తాం. ఆఖ‌రుకు సుంద‌ర‌మ్మ‌కున్న ఆవేశం కూడా నార‌ప్ప‌లో క‌నిపించ‌దు. త‌మ పొలంలోని బావిలోంచి పండుస్వామి మ‌నుషులు నీళ్ల‌ను తోడేస్తుంటే.. అడ్డుకోబోతుంది సుంద‌ర‌మ్మ‌. కర్ర‌కు గుచ్చిన కొడ‌వ‌లితో ఒక‌డి పీక కూడా ప‌ట్టేసుకుంటుంది. ఆమెలోని వీర‌త్వాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. త‌న కొడుకు రంగ‌బాబుపై మునిక‌న్న చేయిచేసుకున్నందుకు నార‌ప్ప‌ను త‌న‌తో స‌హా ఊళ్లోని త‌మ‌వాళ్లంద‌రి ఇళ్ల‌కూవెళ్లి అక్క‌డి మ‌గాళ్ల కాళ్ల‌కు దండం పెట్టిస్తాడు పండుస్వామి. వెంక‌టేశ్ అలా చిన్న పెద్దా మ‌గాళ్ల కాళ్ల‌కు సాష్టాంగ న‌మ‌స్కారాలు చేస్తుంటే మ‌న‌కు ఆ పాత్ర‌పై సానుభూతి క‌లుగుతుంది. తండ్రిచేత అలాంటి ప‌ని చేయించిన పండుస్వామిని సినిమా హాలు మ‌రుగుదొడ్డి ద‌గ్గ‌ర మునిక‌న్న చెప్పుతో కొట్టి అవ‌మానిస్తే అత‌డి హీరోయిజానికి శ‌భాష్ అంటాం. అదే మునిక‌న్న‌ను పండుస్వామి దారుణంగా హ్య‌త‌చేయించి త‌ల న‌రికేసి, మొండేన్ని ఒక ఖాళీ పొలంలో ప‌డేయిస్తే, నార‌ప్ప‌-సుంద‌ర‌మ్మ‌లు అక్క‌డ‌కు వ‌చ్చి, ఆ మొండేన్ని చూసి విల‌పించే స‌న్నివేశాల‌కు మ‌న హృద‌యం ద్ర‌వించిపోతుంది. తండ్రి ఏడ‌వ‌డం, తాగ‌డం త‌ప్ప ఏమీ చేయ‌ట్లేద‌ని కోపంతో ఊగిపోతూ, త‌నే సొంతంగా త‌యారు చేసిన బాంబులను సంచీలో వేసుకొని, పండుస్వామిని ప‌ద‌హారేళ్ల పిల్ల‌గాడు సిన‌బ్బ క‌త్తితో మెడ‌న‌రికితే, అలా చెయ్యాల్సిందేన‌ని సిన‌బ్బ ఆవేశంతో స‌హానుభూతి చెందుతాం. ఇక పండుస్వామి మ‌నిషి గంప‌న్న (బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌) త‌న అనుచ‌రుల‌తో సిన‌బ్బ‌ను ప‌ట్టి చంప‌బోతుంటే, అంత‌దాకా సౌమ్యంగా క‌నిపించిన నార‌ప్ప అతివీర భ‌యంక‌రుడిలా మారి, అంద‌ర్నీ చిత‌క్కొట్టి కొడుకును ర‌క్షించుకోవ‌డం చూసి ఇప్ప‌టిదాకా నార‌ప్ప‌లోని ఈ వీర‌త్వం, ఈ ఆవేశం ఏమైపోయింద‌ని అనుకుంటాం. తండ్రి ప‌రాక్ర‌మాన్ని క‌ళ్లారాచూసి నోరెళ్ల‌బెట్టిన సిన‌బ్బ‌కు అప్పుడు నార‌ప్ప త‌న క‌థ చెప్తాడు. ఆ క‌థ మ‌న‌ల్ని మ‌రింత‌బాగా ఆక‌ట్టుకుంటుంది. నిమ్న కులాల‌పై భూస్వామ్య వ‌ర్గాల‌వారు చేసే దాష్టీకాలు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో. అయితే నార‌ప్ప మేన‌కోడ‌లుగా ఒరిజిన‌ల్‌లో న‌టించిన అమ్ము అభిరామినే తీసుకోవ‌డం క‌రెక్ట‌నిపించ‌లేదు. ధ‌నుష్ ప‌క్క‌న అమ్ము అభిరామి స‌రిపోయింది కానీ, వెంక‌టేశ్ ప‌క్క‌న ఆమెను ఊహించుకోవ‌డం ఇబ్బందిక‌రం. ఆరు ప‌దులు దాటిన వెంక‌టేశ్‌కు ఎంత మేక‌ప్ వేసి కుర్రాడిగా మార్చినా, 20 ఏళ్ల అభిరామి ప‌క్క‌న ఆయ‌న ఏమాత్రం న‌ప్ప‌లేదు. ఇదొక్క‌టి మిస్‌క్యాస్టింగ్ అనిపించింది. అయితే ఆమె పాత్ర‌, ఆమెపై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు హృద‌యాల‌ను పిండేస్తాయి. చెప్పులు వేసుకున్న‌ద‌ని ఆ చెప్పుల్నే ఆమె త‌ల‌పై పెట్టించి, వీధుల్లో న‌డిపిస్తూ ఆమెను కాలితో తంతూ శీనా చేసే దాష్టీకం స‌న్నివేశాలు నిమ్న కులాల వారిపై అగ్ర‌వ‌ర్ణాల దుర‌హంకారం ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టిస్తాయి. టెక్నిక‌ల్‌గానూ సినిమా ఉన్న‌త ప్ర‌మాణాల‌తో క‌నిపించింది. మ‌ణిశ‌ర్మ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ఎస్సెట్‌గా నిలుస్తాయి. గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ వ‌ర్క్ కానీ, పీట‌ర్ హెయిన్‌, విజ‌య్ స్టంట్స్ కానీ టాప్ స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి. మార్తాండ్ కె. వెంక‌టేశ్ ఎడిటింగ్ కూడా ఈ 155 నిమిషాల నిడివి సినిమాను ఇంప్రెసివ్‌గా మార్చింది. న‌టీన‌టుల అభిన‌యం 'నార‌ప్ప' అనేది క‌థ‌తో పాటు తార‌ల అభిన‌యం మీద ఆధార‌ప‌డిన సినిమా. టైటిల్ రోల్‌లో వెంక‌టేశ్ న‌ట‌న గురించి చెప్పేదేముంది! ఎప్ప‌టిలా అత్యుత్త‌మ స్థాయి అభిన‌యాన్ని చూపారు. వృద్ధాప్య చాయ‌లు మీద‌ప‌డుతున్న వాడిలా, ఫ్లాష్‌బ్యాక్‌లో యువ‌కుడిలా రెండు ఛాయ‌ల పాత్ర‌ను సూప‌ర్బ్‌గా పోషించారు. సుంద‌ర‌మ్మ పాత్ర‌లో ప్రియ‌మ‌ణి రాణించింది. చాలా కాలం త‌ర్వాత ఆమెను స్క్రీన్‌ప్లే ఇలాంటి అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌లో చూడ‌డం ఆనందం క‌లిగించింది. రాజీవ్ క‌న‌కాల‌కు కూడా ఎంతో కాలం త‌ర్వాత ఒక మంచి పాత్ర ల‌భించింది. బ‌స‌వ‌య్య పాత్ర‌లో ఇమిడిపోయాడు. ఒరిజిన‌ల్‌లో ప‌శుప‌తికి ఏమాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా, ఇంకా బెట‌ర్‌గా చేశాడ‌నిపించాడు.  లాయ‌ర్‌గా రావు ర‌మేశ్ త‌న‌కు అల‌వాటైన రీతిలో సునాయాసంగా ఆ పాత్ర‌ను చేసుకుపోయాడు. పండుస్వామిగా న‌రేన్‌, దొర‌స్వామిగా దీప‌క్‌శెట్టి, ఇన్‌స్పెక్ట‌ర్ తిప్పేస్వామిగా రామ‌రాజు ఆ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు. ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలో వ‌చ్చే శంక‌ర‌య్య‌గా నాజ‌ర్‌, శీనాగా వ‌శిష్ఠ సింహా, క‌న్న‌మ్మ‌గా అమ్ము అభిరామి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేయాల్సింది మునిక‌న్న‌గా కార్తీక్ ర‌త్నం, సిన‌బ్బ‌గా కొత్త న‌టుడు రాఖీ న‌ట‌న‌ను. ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌ను పోషించిన తీరు ముచ్చ‌టేస్తుంది. మ‌రీ ముఖ్యంగా రాఖీ న‌ట‌న చూస్తే.. అత‌డికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌నిపించింది. తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌ పూర్తిగా 'అసుర‌న్' త‌ర‌హాలోనే న‌డిచే 'నార‌ప్ప' ఆక‌ట్టుకుంటాడు. ఊళ్ల‌లోని నిమ్న కులాల వారిపై అగ్ర కులాలు జ‌రిపే దౌర్జ‌న్యాల‌ను అత్యంత ప్ర‌భావవంతంగా చూపించే 'నార‌ప్ప‌'లోని న‌టీన‌టుల‌ అభిన‌యాలు ఆక‌ట్టుకుంటాయి. ఇప్ప‌టికే 'అసుర‌న్' చూసిన‌వాళ్ల‌కు పెద్ద‌గా ఏమీ అనిపించ‌క‌పోవ‌చ్చు కానీ, ఆ సినిమాని చూడ‌నివాళ్ల‌కు 'నార‌ప్ప' త‌ప్ప‌కుండా న‌చ్చుతాడు. రేటింగ్‌: 3/5 - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

చ‌ల‌ప‌తిరావు భార్య ఇంట్లోనే అగ్నిప్ర‌మాదంలో చ‌నిపోయార‌ని మీకు తెలుసా?

  సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు విభిన్న త‌ర‌హా పాత్ర‌ల‌ను ఐదున్న‌ర ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ, అల‌రిస్తూ వ‌స్తున్నారు. మొద‌ట్లో విల‌న్ పాత్ర‌ల‌తో భ‌య‌పెట్టిన ఆయ‌న‌, త‌ర్వాత సాత్త్విక పాత్ర‌ల్లోనూ మెప్పించారు. 'నిన్నే పెళ్లాడుతా'లో హీరో నాగార్జున తండ్రిగా చేసిన పాత్ర ఆయ‌న కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పింద‌ని చెప్పాలి. నిజ జీవితం విష‌యానికి వ‌స్తే, ఆయ‌న కుమారుడు ర‌విబాబు కూడా న‌టుడిగా రాణిస్తూనే, ద‌ర్శ‌కుడిగా మారి 'అల్ల‌రి', 'అన‌సూయ‌', 'అవును' లాంటి హిట్ సినిమాల‌ను రూపొందించారు. చాలామందికి తెలీని విష‌యం చ‌ల‌ప‌తిరావు భార్య అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని. అదీ కూడా వాళ్ల ఇంట్లోనే. పెళ్ల‌యి, ముగ్గురు పిల్ల‌లు పుట్టిన కొద్ది కాలానికే ఆమె మృతి చెందడం చ‌ల‌ప‌తిరావు జీవితంలో అతిపెద్ద విషాదం.  ఆరోజు అంద‌రూ ఇంట్లోనే ఉన్నారు. మ‌ద్రాసులో అప్పుడు రెండు రోజుల‌కోసారి నీళ్లు వ‌చ్చేవి. రాత్రి 2 గంట‌ల‌కు లేచి ప‌ట్టుకోవాలి. ఆమె లేచి ప‌డ‌తానంటే, తాను ప‌డ‌తాన‌ని చెప్పారు చ‌ల‌ప‌తిరావు. "లేదు.. నేను ప‌డ‌తాలే" అని ఆమె వెళ్లారు. అంత‌లోనే కేక‌లు వినిపించాయి. "నిన్నే.. నిన్నే" అని ఆమె పిలుస్తూ ఉంది. ఏంటా అని అటు వెళ్లారు చ‌ల‌ప‌తిరావు. ఏదో మంట క‌నిపించింది. వంట‌గ‌దిలో స్ట‌వ్, మ‌రికొన్ని వ‌స్తువులు కింద‌ప‌డి ఉన్నాయి. మంట‌ల్లో భార్య‌! ఆమె ముందువైపు ఏమీ అంటుకోలేదు. ఆమె క‌ట్టుకున్న నైలెక్స్ చీర వెనుక‌వైపు అంటుకొని త‌గ‌ల‌బ‌డిపోతోంది.  మంట‌లు ఆర్పి, ఆమెను ఎత్తుకొని ఆటోలో హాస్పిట‌ల్‌కు తీసుకుపోయారు చ‌ల‌ప‌తిరావు. అప్ప‌టికే వెనుక‌వైపు చ‌ర్మం అంతా ఊడివ‌చ్చేసింది. మూడు రోజులు ఆమె మృత్యువుతో పోరాడారు. అప్పుడు ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం కూడా ఆమెను చూడ్డానికి హాస్పిట‌ల్‌కు వెళ్లారు. ఆ ప్ర‌మాదం ఎలా జ‌రిగిందో బాధితురాలైన చ‌ల‌ప‌తిరావు భార్య‌కూడా చెప్ప‌లేక‌పోయారు. మూడో రోజు భ‌ర్త‌తో, "ఈ పిల్ల‌ల‌తో నువ్వు వేగ‌లేవు. నువ్వు పెంచ‌లేవు. పెళ్లి చేసుకో" అని చెప్పారు. ఆమె తృప్తి కోసం స‌రేన‌న్నారు చ‌ల‌ప‌తిరావు. అంతే! ఆ రోజే ఆమెను మృత్యువు క‌బ‌ళించేసింది. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు చ‌ల‌ప‌తిరావు. కొడుకు ర‌విబాబుతో పాటు ఇద్ద‌రు కూతుళ్ల‌ను ఒంట‌రి తండ్రిగా పెంచి పెద్ద‌చేశారు చ‌ల‌ప‌తిరావు. ముగ్గురు పిల్ల‌లూ చ‌దువులో గొప్ప‌గా రాణించారు, ఎవ‌రి జీవితాల్లో వారు బాగా స్థిర‌ప‌డ్డారు. అదే తండ్రిగా ఆయ‌న‌కు తృప్తి.

మోడ్ర‌న్ డ్ర‌స్‌లో రాజ్య‌ల‌క్ష్మి.. గుర్తుప‌ట్ట‌లేక‌పోయిన కాలేజీ అమ్మాయి!

  'శంక‌రాభ‌ర‌ణం' రాజ్య‌ల‌క్ష్మి అన‌గానే చీర‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా, ఒద్దిక‌గా క‌నిపించే రూపమే మ‌న‌కు గుర్తుంటుంది. అలాంటి ఆమె మోడ్ర‌న్ డ్ర‌స్సులో బ‌య‌ట‌కు వ‌స్తే ఎవ‌రైనా గుర్తుప‌డ‌తారా? ఇప్పుడు కాదు కానీ, కొంత కాలం క్రితం వ‌ర‌కూ రాజ్య‌ల‌క్ష్మి మోడ్ర‌న్ దుస్తుల్లోనే బ‌య‌ట తిరిగేవారు. అలా ఒక‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఒక త‌మాషా అయిన సంఘ‌ట‌న జ‌రిగింది.  ఆమె మ‌ద్రాసులో ఉంటున్న రోజుల్లో 'పెళ్లిచూపులు' అనే టీవీ సీరియ‌ల్‌లో న‌టించారు. దాని షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అప్ప‌టివ‌ర‌కూ ఆమె సినిమాల్లో చీర‌క‌ట్టులోనో లేదా లంగా ఓణీల్లోనో అచ్చంగా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయిలా క‌నిపించేవారు. ఆరోజు ఆమె మోడ‌ర‌న్ దుస్తుల్లో చేతిలో గాగుల్స్‌, ఒక తెలుగు న‌వ‌ల ప‌ట్టుకొని ఫ్లైట్‌లో కూర్చున్నారు. ఆమె ప‌క్క సీట్లో కాలేజీ స్టూడెంట్‌లా క‌నిపిస్తున్న అమ్మాయి కూర్చుంది.  కొంత‌సేప‌టికి ఆ అమ్మాయి న‌వ‌ల చ‌దువుతూ ఉన్న రాజ్య‌ల‌క్ష్మితో "మీరు తెలుగువారేనా?" అన‌డిగింది. "అవునండీ" అంది రాజ్య‌ల‌క్ష్మి. "మీదేవూరు? ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నారూ?" అడిగింది ఆ అమ్మాయి. "మాది తెలుగుప్రాంత‌మే. ఇప్పుడు ఉంటున్న‌ది మాత్రం మ‌ద్రాసులో." చెప్పింది రాజ్య‌ల‌క్ష్మి. "ఎన్నాళ్ల నుంచీ అక్క‌డుంటున్నారు?" ఆ అమ్మాయి ప్ర‌శ్న‌. "తొమ్మిదేళ్ల‌కు పైగా." రాజ్య‌ల‌క్ష్మి స‌మాధానం. "మీరేదైనా కాలేజీలో చ‌దువుతున్నారా?" అడిగింది అమ్మాయి. "అబ్బే లేదండీ." చెప్పింది రాజ్య‌ల‌క్ష్మి. "హైద‌రాబాద్‌లో ఎక్క‌డుంటారు?" మ‌ళ్లీ అమ్మాయి ప్ర‌శ్న‌. "హోట‌ల్‌లో." రాజ్య‌ల‌క్ష్మి జ‌వాబు. "మీ పేరు?" అడిగింది అమ్మాయి. "రాజ్య‌ల‌క్ష్మి" చెప్పింది రాజ్య‌ల‌క్ష్మి. ఇలా ఇద్ద‌రి మ‌ధ్యా సంభాష‌ణ న‌డిచింది. ఆ త‌ర్వాత రాజ్య‌ల‌క్ష్మి ఆ అమ్మాయి వివ‌రాలు అడిగింది. ఆమె చెప్పింది. అన్ని విష‌యాలు చెప్పినా రాజ్య‌ల‌క్ష్మిని ఆ అమ్మాయి పోల్చుకోలేక‌పోయింది. చివ‌ర‌కు, "మీరేం చేస్తుంటారు?" అన‌డిగింది అమ్మాయి. "సినిమాల్లో న‌టిస్తుంటాను." జ‌వాబ‌చ్చింది రాజ్య‌ల‌క్ష్మి. వెంట‌నే, "సినిమాల్లో యాక్ట్ చేసే రాజ్యల‌క్ష్మి మీరేనా.. సారీ.. పోల్చుకోలేక‌పోయాను. సాధార‌ణంగా సినిమాల్లో మిమ్మ‌ల్ని చీర‌క‌ట్టులో చూస్తుంటాం క‌దా. స‌డ‌న్‌గా మీరు మోడ్ర‌న్ డ్ర‌స్‌లో క‌నిపించేస‌రికి పోల్చుకోలేక‌పోయాను." అంది ఆ అమ్మాయి ఆశ్చ‌ర్య‌పోతూ. "ఫ‌ర్వాలేదు. మోడ్ర‌న్ డ్ర‌స్‌లో మీరే కాదు, ఎవ్వ‌రూ న‌న్ను గుర్తుప‌ట్ట‌లేరు. అందుకే నేనెక్కువ‌గా మోడ్ర‌న్ దుస్తుల్లోనే బ‌య‌ట‌కు వెళ్తుంటాను." అని చెప్పింది రాజ్య‌ల‌క్ష్మి. "సారీ అండీ.. మిమ్మ‌ల్ని పోల్చుకోలేక‌పోయాను." మ‌ళ్లీ నొచ్చుకోలుగా అందా అమ్మాయి. "అదేనండీ నాకు కావాల్సింది. అప్పుడే క‌దా.. నా గురించి జ‌నం ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోగ‌ల‌ను." అంది రాజ్య‌ల‌క్ష్మి చిన్న‌గా న‌వ్వుతూ.