ఒక బిగ్ స్టార్ మూవీ 100 డేస్‌ ఫంక్ష‌న్‌లో సాయికుమార్‌కూ, తండ్రికీ దారుణ అవ‌మానం!

  టాలీవుడ్‌లోని ఓ బిగ్ స్టార్ సినిమా 100 డేస్ ఫంక్ష‌న్ తిరుప‌తిలో జ‌రప‌డానికి ఏర్పాట్లు చేశారు. ఆ మూవీలో సాయికుమార్ తండ్రి పి.జె. శ‌ర్మ న‌టించారు. అందువ‌ల్ల ఆయ‌న‌కు కూడా ఆ ఫంక్ష‌న్‌కు ఆహ్వానం అందింది. నిన్ను కూడా ర‌మ్మ‌న్నార‌ని సాయిని కూడా తోడు తీసుకువెళ్లారు శ‌ర్మ‌. అప్ప‌టికింకా వాళ్లు హైద‌రాబాద్‌కు రాలేదు. మ‌ద్రాసులోనే ఉంటున్నారు. మ‌ద్రాస్ నుంచి తిరుప‌తికి చార్ట‌ర్డ్ ఫ్ల‌యిట్‌లో తీసుకుపోతార‌ని చిన్న‌పిల్లాడిలా ఆనంద‌ప‌డిపోతూ శ‌ర్మ చెప్పారు. పొద్దున్నే ఆఫీసుకు ర‌మ్మ‌ని క‌బురు రావ‌డంతో ఇద్ద‌రూ ఆటోలో వెళ్లారు. అక్క‌డెవ‌రూ లేరు. టెక్నీషియ‌న్స్‌కు సంబంధించిన బ‌స్సు మాత్రం ఉంది.  ఏంటీ అని ఆరా తీస్తే అప్ప‌టికే గెస్టులంద‌రూ చార్ట‌ర్డ్ ఫ్లైట్‌కు వెళ్లిపోయార‌నీ, వాళ్ల‌ను బ‌స్సులో ర‌మ్మ‌న్నార‌నీ చెప్పారు. దాంతో శ‌ర్మగారు చిన్న‌బుచ్చుకున్నారు. ఆయ‌న‌ను బుజ్జ‌గించి, తిరుప‌తికి ఎంత సేప‌ట్లో వెళ్తామ‌ని చెప్పి, బ‌స్సులోనే తీసుకువెళ్లారు సాయి. తిరుప‌తిలోని విష్ణుప్రియ హోట‌ల్‌లో అంతా బ‌స చేశార‌ని తెలిసింది. బ‌స్సును స‌రిగ్గా ఆ హోట‌ల్ ముందే ఆపారు. తండ్రీకొడుకుల‌ను మాత్రం అక్క‌డ దిగిపొమ్మ‌ని చెప్పారు. హ‌మ్మ‌య్య‌.. బ‌తికిపోయాం అనుకుని హోట‌ల్ లోప‌ల‌కు వెళ్లారు. రూమ్ ఇచ్చారు.  ఆ సాయంత్రం ఫంక్ష‌న్‌. ఇద్ద‌రూ అక్క‌డికి వెళ్లారు. ఆ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్‌తో అభిమానులు విప‌రీతంగా వ‌చ్చేశారు. చాలామంది స్టేజ్ ఎక్కేశారు. అది కూలిపోతుందేమో అనిపించింది. దాంతో ఫంక్ష‌న్ కాన్సిల్ చేసేసి, అంద‌రూ వెన‌క్కి మ‌ళ్లారు. తిరిగొచ్చేట‌ప్పుడు చార్ట‌ర్డ్ ఫ్లైట్ లేదు. అతిథుల కోసం ఒక సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు వేశారు. అంత‌కు ముందు అదే బ‌స్సులో శ‌ర్మ‌గారు, సాయికుమార్ ల‌గేజ్‌తోటే ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. ఆ బ‌స్సులో అంద‌రూ ఎక్కారు. మ‌ధ్య‌లో ఒక‌చోట మూన్‌లైట్ డిన్న‌ర్ ప్లాన్ చేశారు. సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు అక్క‌డికి వెళ్లింది. టెక్నీషియ‌న్ల బ‌స్సును బ‌య‌టే ఆపేశారు. లోప‌ల‌ బ్ర‌హ్మాండంగా అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. పార్టీ జ‌రుగుతోంది. అప్పుడు ఆ స్టార్ హీరోకు కావాల్సిన ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌స్సు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. బ‌స్సెక్కి క‌రెక్టుగా శ‌ర్మ‌గారు, సాయి వాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగాడు ఆ ప్రొడ్యూస‌ర్‌. "మీరు దిగిపోండి. బ‌య‌టున్న బ‌స్సులో మ‌ద్రాస్ వెళ్లిపోండి" అని చెప్పాడు. శ‌ర్మ‌గారి ముఖం కంద‌గ‌డ్డ‌లా మారిపోయింది. వెంట‌నే సాయికుమార్‌, "సార్ సార్‌.. వాళ్ల‌తో పార్టీలో కూర్చోడానికి నాకు అర్హ‌త లేదు. నేను చిన్న‌పిల్లాడిని. నేనెళ్లిపోతాను. నాన్న‌ను మాత్రం పంప‌కండి. నాన్న‌ను పార్టీలో ఉంచండి ప్లీజ్" అని వేడుకున్నారు. "నేను చెప్తున్నాను క‌ద‌మ్మా.. మీ ఇద్ద‌రూ దిగిపోండి." అని ఆయ‌న మ‌ళ్లీ చెప్పాడు. ఆ సినిమా హీరోతో కానీ, డైరెక్ట‌ర్‌తో కానీ మాట్లాడాల‌ని సాయి ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర‌లేదు. తండ్రీకొడుకులిద్ద‌రినీ బ‌స్సులోంచి దింపేశారు. ఇద్ద‌రూ మౌనంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. తండ్రిని టెక్నీషియ‌న్ల బ‌స్సు ఎక్కించ‌డానికి సాయికి గ‌గ‌న‌మైపోయింది. పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లుగా, ఆ బ‌స్సులో ఉన్న‌వాళ్లంద‌రికీ తింటానికి ఒక పొట్లం, క్వార్ట‌ర్ బాటిల్ ర‌మ్ తీసుకొచ్చి ఇచ్చారు.. 'ఇది మీకు.. బ‌స్సులో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్లండ‌'న్న‌ట్లు. ఆ బాటిల్ తీసుకొని కోపంతో కిందికి విసిరికొట్టారు శ‌ర్మ‌గారు. "స్కాచ్ తాగ‌డానికి నేను అర్హుడ్ని కాద‌న్న‌మాట‌." అంటూ బాధ‌ప‌డ్డారు, ఎమోష‌న‌ల్ అయ్యారు. అలాగే మ‌ద్రాస్ వెళ్లారు. ఆరోజు తండ్రి ఎదుర్కొన్న అవ‌మానం, ఆయ‌న ప‌డిన బాధ సాయికుమార్‌కు ఇప్ప‌టికీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు గుర్తుంది. తండ్రికి ఎలాగైనా స్కాచ్ కొనివ్వాల‌ని ఆరోజు డిసైడ్ అయ్యారు సాయికుమార్‌. ఆ టైమ్‌లోనే ఒక‌సారి అమెరికా వెళ్లారు సాయి. అక్క‌డ 108 డాల‌ర్లు పెట్టి స్కాచ్ బాటిల్ తీసుకొని, తండ్రికి ఇచ్చారు. తండ్రికి తానిచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ అదేన‌ని ఫీల‌వుతుంటారు సాయి. ఈ విష‌యాల‌న్నింటినీ ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న పంచుకున్నారు.

అమెరిక‌న్‌ను పెళ్లిచేసుకుంటాన‌న్న కుమార్తెకు జ‌గ‌ప‌తిబాబు ఏం చెప్పారు?

  సీనియ‌ర్ న‌టుడు, నిన్న మొన్న‌టి దాకా ఫ్యామిలీ హీరోగా ఆడియెన్స్‌ను అల‌రించిన జ‌గ‌ప‌తిబాబు పెద్ద కుమార్తె మేఘ‌న 2015లో చాద్ బోవెన్ అనే అమెరిక‌న్‌ను వివాహం చేసుకుంది. అప్ప‌ట్లో ఈ వివాహం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. జ‌గ‌ప‌తిబాబు ఓ అమెరిక‌న్‌ను అల్లుడిగా ఎలా అంగీక‌రించాడు? ఆయ‌న కావాల‌నుకుంటే త‌న బంధువుల్లో కానీ, బ‌య‌టి వాళ్ల‌లో కానీ ఎంత మంచి సంబంధం తెచ్చుకోగ‌ల‌డు? అన్న‌వాళ్లు చాలామందే ఉన్నారు. మేఘ‌న యు.ఎస్‌.ఎ.లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న‌ప్పుడు బోవెన్‌తో ప్రేమ‌లో ప‌డింది.  "నేను ఓ అమెరిక‌న్‌ను ల‌వ్ చేశాను నాన్నా" అని మేఘ‌న చెప్పిన‌ప్పుడు చాలా మంది తండ్రుల్లా జ‌గ‌ప‌తిబాబు షాక‌వ‌లేదు. ఆయ‌న ఒక‌టే చెప్పారు - "ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకో. అప్పుడూ ఇలాగే బావుంటామ‌నిపిస్తే నాకు అభ్యంత‌రం లేదు" అని. త‌న ప్రేమ‌ను మేఘ‌న గ‌ట్టిగా న‌మ్మింది. దాంతో వాళ్లిద్ద‌రికీ హైద‌రాబాద్‌లోనే పెళ్లి చేశారు జ‌గ‌ప‌తిబాబు. పెళ్లికి చాద్ బోవెన్ త‌ర‌పున అత‌ని త‌ల్లితండ్రులు మాత్ర‌మే వ‌చ్చారు. జ‌గ‌ప‌తిబాబు త‌న బంధువుల్నీ, 20 ఏళ్లుగా స‌న్నిహితులైన వాళ్ల‌నూ.. మొత్తం ఓ 200 మందిని పిలిచారు. ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లా కాకుండా త‌న ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లాగే పెళ్లి వేడుక‌ను జ‌రిపారు. వ‌చ్చిన అతిథులు ఆ పూట వేడుక‌ను ఆస్వాదించి, వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించి వెళ్లారు. నిజానికి మేఘ‌న‌కు జ‌గ‌ప‌తిబాబు వాళ్ల బంధువుల నుంచి సంబంధాలు వ‌చ్చాయి. అయితే 'జ‌గ‌ప‌తిబాబు ఏం ఇస్తాడు?' అని వాళ్ల‌డిగారు. క‌ట్నం ఇవ్వ‌డానికీ, తీసుకోడానికీ ఆయ‌న వ్య‌తిరేకం. చాద్ బోవెన్ త‌ల్లితండ్రుల‌కు ఈ క‌ట్నాల గోల‌, లాంఛ‌నాల గోల లాంటివేమీ తెలీదు. జ‌గ‌ప‌తిబాబు నుంచి వాళ్లేమీ ఆశించ‌లేదు. ఆయ‌నే నోరు తెర‌చి, "ఏమైనా కావాలంటే చెప్పండి" అన‌డిగారు కూడా. వాళ్లేమీ వ‌ద్ద‌న్నారు. "నిజానికి వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ఇంకెవ‌రికీ అభ్యంత‌రం ఉండాల్సిన ప‌నిలేదు. కాక‌పోతే పెళ్లితో రెండు కుటుంబాల‌కు సంబంధం ఉంటుంది కాబ‌ట్టి ఆ పెళ్లి జ‌రిగితే వాళ్ల జీవితాలు బాగుంటాయా, వాళ్లు సంతోషంగా ఉంటారా అని ఆలోచిస్తే చాలు." అని చెప్పారు జ‌గ‌ప‌తిబాబు.

'వ‌సంత‌కోకిల‌'లో డాన్స్ చెయ్య‌లేక చెప్పాపెట్ట‌కుండా ఇంటికెళ్లిపోదామ‌నుకున్న సిల్క్ స్మిత‌!

  క‌మ‌ల్ హాస‌న్‌, శ్రీ‌దేవి ప్ర‌ధాన పాత్ర‌ధారుగా బాలు మ‌హేంద్ర రూపొందించిన క్లాసిక్ ఫిల్మ్ 'మూండ్రం పిరై' (1982). తెలుగులో ఆ సినిమా 'వ‌సంత కోకిల‌'గా విడుద‌లై, ఇక్క‌డ కూడా క్లాసిక్ అనిపించుకుంది. ఈ సినిమాలో సిల్క్ స్మిత కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు ముందు ఆమె 'వండి చ‌క్రం' అనే త‌మిళ సినిమా చేశారు. నిజానికి అదే ఆమె తొలి సినిమా. ఈ సినిమా తెలుగులో శోభ‌న్‌బాబు హీరోగా 'ఘ‌రానా గంగులు' టైటిల్‌తో రీమేక్ అయ్యింది. 'మూండ్రం పిరై'లో క‌మ‌ల్‌, స్మిత‌పై ఓ పాట ఉంది. త‌మిళంలో "పొన్మేని ఉరువుదే" అనే ప‌ల్ల‌వితో ఆ పాట సాగుతుంది.  ఆ పాట‌ను ఊటీలో చిత్రీక‌రించారు. స్మిత ఊటీ వెళ్ల‌డం అదే తొలిసారి. అయితే వారు ఊటీ వెళ్లిన సీజ‌న్ ఎలాంటిదీ అంటే.. కాళ్లూ, చేతులూ కొంక‌ర్లు పోయే డిసెంబ‌ర్ నెల‌లో. మామూలుగానే ఊటీలో ఉష్ణోగ్ర‌త చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అలాంటిది డిసెంబ‌ర్‌లో అక్క‌డి వాతావ‌ర‌ణం, చ‌లి ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి అత్యంత శీత‌ల ప్ర‌దేశ‌మైన ఊటీలో, వైకాడు ప్రాంతంలో సాంగ్ పిక్చ‌రైజేష‌న్‌కు అంతా సిద్ధ‌మైంది. డైరెక్ట‌ర్ బాలు మ‌హేంద్ర తాను ఊహించుకున్న ఎఫెక్టు ఊహించిన‌ట్లుగా క‌చ్చితంగా వ‌స్తేనే కానీ షాట్ ఓకే చేసే వ్య‌క్తి కాదు. పైగా ఆ సినిమాకు ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్ కూడా.  అంత‌కుముందు చాలా సినిమాల్లో ఊటీ అంద‌చందాల్ని చిత్రీకరించేశారు కాబ‌ట్టి, ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని కొత్త లొకేష‌న్స్‌లో వైవిధ్యంగా పాట‌ను చిత్రీక‌రించాల‌ని బాలు మ‌హేంద్ర అనుకున్నారు. పాట‌ను మొత్తం మంచు నేప‌థ్యంలో తియ్యాలి. ఊటీలో కురిసే మంచు య‌థాత‌థంగా అత్యంత స‌హ‌జంగా స్ప‌ష్టంగా తెర‌పై క‌నిపించాల‌న్న‌ది ఆయ‌న తాప‌త్ర‌యం. దాని కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు ముందు, సాయంత్రం ఆరున్న‌ర దాటిన త‌ర్వాత షూటింగ్ జ‌ర‌ప‌డానికి టైమ్ ఫిక్స్ చేశారు. ఇక స్మిత పాట్లు చూడాలి. పాట నాగ‌రాలో ప్రారంభ‌మ‌య్యేస‌రికి ఆమె కాళ్ల‌లోంచి వ‌ణుకు ప్రారంభ‌మ‌య్యేది - అక్క‌డి మంచుకు, చ‌లికి. పైగా కాళ్ల‌కు చెప్పులు లేకుండా నృత్యం చెయ్యాలి. అలా చేస్తుంటే, రాళ్లు కాళ్ల‌లోకి గుచ్చుకుపోయేవి. దాంతో ఆ చ‌లికి మ‌రింత బాధ అనిపించేది. ఆ బాధ‌కు ఏం చెయ్యాలో, ఎలా డాన్స్ చెయ్యాలో తెలియ‌క అవ‌స్థ‌ప‌డుతూ ఉంటే, ఓ వైపు నుంచి డాన్స్ డైరెక్ట‌ర్ సుంద‌రం మాస్ట‌ర్ "ఎన్న‌మ్మా స్మితా" అంటూ తొంద‌ర‌పెట్టేవారు. ఇక స్మిత ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం! అప్ప‌టికి ఆమెకు త‌మిళం అస‌లు రాద‌నే చెప్పాలి. ఆయ‌న‌కు ఏం స‌మాధానం చెప్పాలో, ఎలా స‌మాధానం చెప్పాలో తెలీక బిక్క‌మొహం వెయ్యాల్సిన ప‌రిస్థితి. పైగా అక్క‌డి చ‌లి బాధ‌కి, రాళ్ల బాధ‌కి సుంద‌రం మాస్ట‌ర్ చెప్పేవిధంగా స్టెప్స్ వెయ్య‌డం ఎలా?  డాన్స్ చెయ్య‌డం ఎలా? ఎలాగో ప్రాణాల‌న్నీ ఉగ్గ‌బ‌ట్టుకొని తొలిరోజు షూటింగ్ అయ్యింద‌నిపించారు స్మిత‌. షూటింగ్ నుంచి హోట‌ల్ రూమ్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమె ఆలోచించారు. "ఏలూరు నుంచి వ‌చ్చి ఇలా సినిమా న‌టిని అయ్యాను. న‌టిగా ఇన్ని క‌ష్టాలు ప‌డాలా? ఇన్ని క‌ష్టాలు ప‌డ‌టం నా వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? ఈ క‌ష్టాల‌న్నీ ప‌డే బ‌దులు, మ‌ర్నాడు షూటింగ్‌కు హాజ‌రుకాకుండా, ఎవ‌రికీ చెప్పా చెయ్య‌కుండా మా ఊరెళ్లిపోతే బాగుండును క‌దా" అనుకున్నారు. కానీ అంత‌లోనే త‌న‌ను తాను త‌మాయించుకుని, "ఈ సినీరంగ‌మే కాదు, ఏ రంగంలోనైనా మనం చేరాల‌నుకున్న గ‌మ్యం చేరాలంటే క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. ఈ క‌ష్టానికి భ‌య‌ప‌డి పారిపోతే భ‌విష్య‌త్తులో మ‌నం ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌యం సాధించ‌లేం" - అని త‌న‌కు తానే స‌మాధాన‌ప‌ర్చుకున్నారు. మ‌ర్నాడు షూటింగ్‌కు అంద‌రికంటే ముందుగా లొకేష‌న్‌కు చేరుకున్నారు. అప్ప‌టి ఆత్మ‌బ‌లం ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చి, ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రిగిన ఎనిమిది రోజులూ ఆమెచేత న‌టింప‌జేసింది. ఆ పాట‌లో స్మిత నృత్యాన్ని చూసి క‌మ‌ల్ హాస‌న్‌, బాలు మ‌హేంద్ర ఇద్ద‌రూ ఎంతో మెచ్చుకున్నారు. 'మూండ్రం పిరై' విడుద‌లైన త‌ర్వాత స‌క్సెస్‌ఫుల్‌గా న‌డ‌వ‌డ‌మే కాకుండా, ప్ర‌త్యేకించి స్మిత‌కు ఎంతో పేరు ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిపెట్టింది. ఎంద‌రో అభిమానుల్ని సంపాదించి పెట్టి, ఆమె సినీ కెరీర్‌లో అనూహ్య‌మైన మ‌లుపునీ తెచ్చిపెట్టింది. కేవ‌లం డాన్స‌ర్‌గానే కాక‌, ఆ సినిమాలో ఆమె పోషించిన ఆ పాత్ర‌ను ప‌రిస్థితుల ప్రాబ‌ల్యం వ‌ల్ల పొందిన మ‌నోవికారాన్ని అద్భుతంగా, అత్యంత స‌హ‌జంగా డైరెక్ట‌ర్ బాలు మ‌హేంద్ర తీర్చిదిద్ద‌డం వ‌ల్ల టాలెంటెడ్ యాక్ట‌ర్‌గానూ ఆమెకు విశేష‌మైన గుర్తింపు ల‌భించింది. అదే సినిమా హిందీలో 'స‌ద్మా' పేరుతో రిలీజై, స‌క్సెస్ అవ‌డంతో దేశ‌వ్యాప్తంగా స్మిత‌కు అభిమానులు ఏర్ప‌డ్డారు. న‌టిగా అలాంటి క‌ష్టాలు ఓర్చిన స్మిత జీవితంలో త‌గిలిన దెబ్బ‌లు త‌ట్టుకోలేక 1996లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొంద‌డం ఎంతైనా బాధాక‌రం.

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న రాశిని హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసిన చిరంజీవి భార్య సురేఖ‌!

  ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'గోకులంలో సీత' (1997) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి హిట్ట‌యింది. 11 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. ఆ సినిమాలో ప‌వ‌న్ జోడీగా రాశి న‌టించారు. ఆమెను ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసింది సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌వ‌చ్చుకానీ, అది నిజం. అంత‌కుముందు రాశి హీరోయిన్‌గా న‌టించిన 'శుభాకాంక్ష‌లు' సినిమాని సురేఖ చూశారు. రాశి న‌ట‌న‌, అంద‌చందాలు ఆమెను బాగా ఆక‌ట్టుకున్నాయి.  అప్ప‌టికే రాశి ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీకి తెలుసు. ఎలా అంటే.. 'గ్యాంగ్ లీడ‌ర్' హిందీ రీమేక్ 'ఆజ్ కా గూండారాజ్‌'లో చిరంజీవి అన్న కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించారు రాశి. అట్లా ఆమె ఫ్యామిలీ చిరంజీవికి తెలుసు.  చిరంజీవికి చెన్నైలోనూ ఇళ్లున్నాయి. ఒక‌సారి భార్య‌ను తీసుకుని చెన్నై వ‌చ్చారు చిరంజీవి. అప్పుడు రాశి వాళ్లు చెన్నైలోనే ఉంటున్నారు. చిరంజీవిగారు ర‌మ్మ‌న్నారంటూ రాశి వాళ్ల నాన్న‌కు ఫోన్ వ‌చ్చింది. ఆయ‌నే పిలుస్తున్నార‌నుకొని, త‌న ఫొటో ఆల్బ‌మ్ తీసుకుని, తండ్రితో పాటు చిరంజీవి వాళ్లింటికి వెళ్లారు రాశి. అక్క‌డ‌కు వెళ్లాక తెలిసింది, త‌మ‌ను పిలిపించింది చిరంజీవి కాద‌నీ, ఆయ‌న భార్య సురేఖ అనీ. ఆమె రాశి ఆల్బ‌మ్ చూశారు. అవ‌న్నీ సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన దుస్తుల్లో ఉన్న‌వే. అలా కాద‌నీ, వెస్ట్ర‌న్ వేర్‌తో ఒక ఫొటో షూట్ చేద్దామ‌న్నారు సురేఖ‌. అలా మోడ్ర‌న్ డ్ర‌స్సుల‌తో రాశితో ఫొటో షూట్ చేశారు.  ఆ ఫొటోలు చూశాక త‌ను అనుకున్న పాత్ర‌కు రాశి స‌రిపోతుంద‌ని ఆమెకు అనిపించింది. "మ‌న క‌ల్యాణ్ ప‌క్క‌న ఈ అమ్మాయి బాగుంటుంది" అని డైరెక్ట‌ర్ ముత్యాల సుబ్బ‌య్య‌కు రిక‌మెండ్ చేశారు సురేఖ‌. అలా 'గోకులంలో సీత' మూవీలో టైటిల్ రోల్ చేసి, ఆక‌ట్టుకున్నారు రాశి.

ఫ్లాష్‌బ్యాక్‌.. సినీ ఫ‌క్కీలో దొంగ‌ను ప‌ట్టుకున్న‌ శ‌ర‌త్‌కుమార్.. ఫ‌లితం అరెస్ట్ వారెంట్‌!

  న‌టుడు శ‌ర‌త్‌కుమార్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. త‌మిళుడైన‌ప్ప‌టికీ, తెలుగు సినిమాల్లోనూ న‌టించి మ‌న ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన చ‌క్క‌ని న‌టుడు. న‌టి రాధిక‌ను వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. శ‌ర‌త్‌కుమార్ సినిమాల్లో డూప్ లేకుండా ఎన్నో ఫైట్లు, సాహ‌సాలు చేశాడు. అయితే చ‌దువుకొనే రోజుల్లోనే సినీ ఫ‌క్కీలో ఆయ‌న చేసిన ఓ సాహ‌సం చివ‌ర‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేలా చేసింది. ఆ క‌థేమిటంటే... అప్పుడాయ‌న మ‌ద్రాస్‌లోని న్యూ కాలేజీలో బీయ‌స్సీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఓ ఆదివారం అడ‌యార్‌లోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న త‌మ ఇంట్లూ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆయ‌న టేప్ రికార్డ‌ర్‌లో వెస్ట్ర‌న్ మ్యూజిక్ వింటూ, స‌ర‌దాగా పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. అలాంటి స‌మ‌యంలో హ‌ఠాత్తుగా బ‌య‌టి నుంచి ఓ అమ్మాయి కెవ్వుమ‌ని వేసిన కేక వినిపించింది. అంత‌దాకా జాలీ మూడ్‌లో ఉన్న శ‌ర‌త్‌కుమార్ బృందం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. టేప్ రికార్డ‌ర్ క‌ట్టేసి వాళ్లంతా బ‌య‌ట‌కొచ్చి చూశారు. చూస్తే.. ఎవ‌డో దొంగ ఓ అమ్మాయి మెడ‌లోని బంగారు గొలుసును లాగేసి సైకిల్ మీద తుర్రుమ‌ని పోతున్నాడు. మిగ‌తా మిత్రులంతా ఆమె ద‌గ్గ‌ర‌కెళ్లి విష‌య సేక‌ర‌ణ ప్రారంభించారు. శ‌ర‌త్‌కుమార్ మాత్రం వెన‌కా ముందూ ఆలోచించ‌కుండా, ప‌క్క‌నే ఉన్న స్కూటర్ తీసుకొని, ఆ దొంగ వెంట‌ప‌డి ప‌ట్టుకున్నాడు. ఆమెకు గొలుసు ఇప్పించి, ఆ దొంగ‌ను ద‌గ్గ‌ర్లోని పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించాడు.  అప్ప‌ట్లో అక్క‌డ భ‌ట్ అనే ఆయ‌న అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్‌. ఆయ‌న శ‌ర‌త్‌కుమార్ ధైర్యాన్ని మెచ్చుకొని అభినందించారు. చ‌ట్ట‌ప్ర‌కారం ఎఫ్ఐఆర్ త‌యారుచేయించి, దాని మీద సంత‌కం పెట్టించుకొని, "సాక్ష్యానికి కోర్టుకి వ‌స్తారా?" అని అడిగారు. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పాడు శ‌ర‌త్‌కుమార్‌.  ఆరు నెల‌లు గ‌డిచాయి. బీయ‌స్సీ పూర్త‌యి, బెంగ‌ళూరులోని ఓ డైలీ పేప‌ర్ ఆఫీసులో అడ్వ‌ర్ట‌యిజింగ్ మేనేజ‌ర్‌గా ఉద్యోగంలో కూడా చేరిపోయాడు శ‌ర‌త్‌. ఒక‌రోజు అనూహ్యంగా వాళ్ల ఇంటినుంచి క‌బురొచ్చింది.. "నీకు అరెస్ట్ వారంట్ వ‌చ్చింది. అర్జెంటుగా బ‌య‌లురేరి రా" అని. దాంతో షాకైపోయాడు శ‌ర‌త్‌. ఏం అర్థం కాలేదు. తానెప్పుడూ ఏ గొడ‌వ‌లో త‌ల‌దూర్చ‌లేదు, ఏ పోలీస్ కేసులోనూ ఇరుక్కోలేదు, అలాంటి త‌న‌కు అరెస్ట్ వారంటేమిటా? అనుకుంటూ ఆ రాత్రికి రాత్రే బెంగ‌ళూరు నుంచి మ‌ద్రాసుకు బ‌య‌లుదేరి వ‌చ్చేశాడు. ఇంటికొచ్చాక అస‌లు విష‌యం అర్థ‌మైంది. ఆర్నెల్ల క్రితం ఆయ‌న ప‌ట్టుకున్న దొంగ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. సాక్ష్యం కోసం ఆయ‌న‌ను కోర్టుకు ర‌మ్మ‌న‌మ‌ని కోర్టు నుంచి పిలుపొచ్చింది. ఆ స‌మ‌యానికి ఆయ‌న ఊళ్లోలేని కార‌ణంగా, ఎక్క‌డున్నా ప‌ట్టుకొని, అరెస్ట్ చేసి సాక్ష్యానికి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌మ‌ని సైదాపేట కోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింది. ఆ ఆర్డ‌ర్ తీసుకొని ఆయ‌న వెంట‌నే చంద్ర‌న్ జ‌య‌పాల్ అనే అడ్వ‌కేట్‌ను క‌లిశాడు. ఆయ‌న స‌ల‌హా మేర‌కు సైదాపేట కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పివ‌చ్చాడు శ‌ర‌త్‌. ఆ దొంగ‌కు శిక్ష ప‌డింది. అప్ప‌డు న్యాయ‌మూర్తి స‌హా అక్క‌డున్న వాళ్లంతా ఆయ‌న‌ను మెచ్చుకున్నారు. ఆ రోజున శ‌ర‌త్ పొందిన ఆనందం, అనుభూతి అంతా ఇంతా కాదు.

'రుద్ర‌వీణ‌', 'ఆప‌ద్బాంధ‌వుడు' లాంటి సినిమాలు చిరంజీవి ఇప్పుడెందుకు చేయ‌ట్లేదు?

  'అభిలాష‌', 'శుభ‌లేఖ‌', 'స్వ‌యంకృషి' లాంటి సినిమాల్లో చిరంజీవి పోషించిన భిన్న త‌ర‌హా పాత్ర‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందాయి. ఆ సినిమాలూ స‌క్సెస్ అయ్యాయి. "సూప‌ర్‌స్టార్స్ భిన్న‌త‌ర‌హా పాత్ర‌లు పోషిస్తే ఆ సినిమాలు స‌క్సెస్ కావు అని చెప్ప‌డానికి వీల్లేదు. అయితే ఒక మాస్ స్టార్ ఇమేజ్ వున్న న‌టుడ్ని అలాంటి పాత్ర‌ల్లోనూ ఆద‌రించే స్థాయిలో మ‌న ప్రేక్ష‌కులు లేర‌"ని చిరంజీవి అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి కార‌ణం, ఆ అభిరుచిని మ‌నం వాళ్ల‌లో పెంపొందించ‌లేక పోవ‌డ‌మేన‌ని ఆయ‌న అంటారు. భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'ఆరాధ‌న‌', బాల‌చంద‌ర్ నిర్దేశ‌క‌త్వంలో చేసిన 'రుద్ర‌వీణ‌', కె. విశ్వ‌నాథ్ తీర్చిదిద్దిన 'ఆపద్బాంధవుడు' సినిమాల‌ను ఎంతో ప్రేమించి చేశారు చిరంజీవి. కానీ అవి ప్రేక్ష‌కుల్ని ఆశించిన రీతిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అనిపించుకోలేక‌పోయాయి. 'ఇమేజ్' అనేది ఏడాదికేడాది పెరుగుతూనే ఉంటుంది. అది స‌హ‌జం. ఆ పెరుగుద‌లే లేక‌పోతే ఇవాళున్న స్థాయికి ఆయ‌న చేరుకునేవారు కాదు. అయితే 'ఇమేజ్' పెరుగుతున్న కొద్దీ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఎక్కువ‌వుతాయి. విభిన్న పాత్ర‌ల పోష‌ణ విష‌యంలో ఆ 'ఇమేజ్' స్టార్ల‌కు ప్ర‌తిబంధ‌కం అవుతుంటుంది. అదే మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్స్ మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి విష‌యంలో అక్క‌డ వారి సినిమాలు బ‌డ్జెట్‌కు లోబ‌డి ఉంటాయి. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఖ‌ర్చు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. 30 రోజుల్లో సినిమాల‌ను తీసేస్తుంటారు వారు. అందుకే అక్క‌డి హీరోలు ఎక్కువ సినిమాల్లో న‌టించ‌గ‌లుగుతున్నారు. వారు మాస్ స్టార్ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోలేదు కాబ‌ట్టే వారిని ఏ పాత్ర‌లోనైనా అంగీక‌రించ‌గ‌ల త‌త్వం అక్క‌డి ప్రేక్ష‌కుల్లో అల‌వ‌డింది.  టాలీవుడ్‌కు వ‌చ్చేసరికి స్టార్ హీరోలు క‌మ‌ర్షియ‌ల్ అనే చ‌ట్రంలో చిక్కుకుపోయి, రిచ్‌నెస్ వ్యామోహంలో ఇరుక్కుపోయి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేసి, వాటిని చేరుకోవ‌డం ఎలా అనేది పెద్ద ప్రాబ్లెమ్‌గా త‌యారుచేసుకున్నారు. చిరంజీవిలోని ఆర్టిస్టుకు విభిన్న‌మైన పాత్ర‌లు పోషించాల‌నే త‌ప‌న ఉంది. కానీ తెలుగు సినిమా చాలా కాలంగా క‌మ‌ర్షియ‌ల్ పంథాలోనే సాగుతూ వ‌స్తోంది. వ్యాపార రీత్యా చాలా సంద‌ర్భాల్లో బాలీవుడ్‌ను మించి కూడా దేశంలోనే నంబ‌ర్ వ‌న్ అనిపించుకుంది టాలీవుడ్‌.  అందుకే పాతికేళ్ల క్రిత‌మే ఓసారి అమితాబ్ బ‌చ్చ‌న్ - "నిజంగా నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. తెలుగు సినిమాకు ఐదు కోట్ల రూపాయ‌ల పైన వ్యాపారం సాగ‌డం నాకు చాలా ఆశ్చ‌ర్యంగా ఉంది. అదీ నీ ఒక్క సినిమాల‌కే - అంటే, నువ్వు చాలా గొప్ప‌వాడివి" అని చిరంజీవిని ప్ర‌శంసించారు. "అది నా గొప్ప‌త‌నం కాదు. మా ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధి నిమిత్తం ప్ర‌వేశ‌పెట్టిన ప‌న్నువిధానం, రాయితీల వ‌ల్ల కావ‌చ్చు" అని జ‌వాబిచ్చారు చిరంజీవి. ఇలా పెరిగిపోయిన బ‌డ్జెట్‌ను న‌మ్మి కోట్లు ఖ‌ర్చుచేసి సినిమాలు కొనే బ‌య్య‌ర్ల‌కు వాళ్ల పెట్టుబ‌డి వాళ్ల‌కు రావాలీ అంటే, ప్రేక్ష‌కుల అభిరుచిని బ‌ట్టి సినిమాలు చెయ్య‌డం మంచిదా?  లేక త‌న వ్య‌క్తిగ‌త‌మైన అభిరుచిని అనుస‌రించి, త‌న‌కు న‌చ్చింది చెయ్య‌డం క‌రెక్టా - అని త‌న‌ను తాను బేరీజు వేసుకొని చూసుకున్న‌ప్పుడు వ్య‌క్తిగ‌త‌మైన అభిరుచిని, త‌న‌లో ఉన్న న‌టుడ్ని ప‌క్క‌కు నెట్టి ప్రేక్ష‌కులు త‌న‌నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో అవే చెయ్య‌డం న్యాయ‌మ‌నిపించింది చిరంజీవికి. అంచేత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనే న‌టించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు, అలాగే చేస్తూ వ‌స్తున్నారు.

'మురారి'లో మ‌హేశ్ తండ్రి పాత్ర‌ను చేజేతులా ప్ర‌సాద్‌బాబుకు అప్ప‌గించిన‌ న‌ర‌సింహ‌రాజు!

  మ‌హేశ్ టైటిల్ రోల్ చేసిన 'మురారి' సినిమా ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ఆద‌ర‌ణ‌ను పొందింది. నిజానికి ఆ సినిమా మ‌హేశ్‌లోని న‌టుడ్ని తొలిసారి ఆవిష్క‌రించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. మ‌హేశ్‌, సోనాలీ బెంద్రే జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని అంద‌రూ అన్నారు. ఆ మూవీలో మ‌హేశ్ త‌ల్లితండ్రులుగా ల‌క్ష్మి, ప్ర‌సాద్‌బాబు న‌టించారు. నిజానికి తండ్రి క్యారెక్ట‌ర్ చెయ్యాల్సింది 'జ‌గ‌న్మోహిని' హీరో న‌ర‌సింహ‌రాజు. అదివ‌ర‌కు కృష్ణ‌వంశీ సినిమా 'సిందూరం'లో ఆయ‌న ఓ చిన్న పాత్ర చేశారు.  'మురారి' సినిమా త‌ల‌పెట్టిన‌ప్పుడు త‌ల్లి పాత్ర‌కు ల‌క్ష్మిని ఎంచుకున్న కృష్ణ‌వంశీ, ఆమె భ‌ర్త పాత్ర‌కు ఎవ‌రిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న‌ప్పుడు న‌ర‌సింహ‌రాజు మ‌న‌సులో మెదిలారు. వెంట‌నే ఆయ‌న‌కు క‌బురుపెట్టారు. ఆఫీసుకు వ‌చ్చారు న‌ర‌సింహ‌రాజు. మ‌హేశ్ తండ్రిగా, ల‌క్ష్మి భ‌ర్త‌గా పాత్ర చెయ్యాల‌ని కృష్ణ‌వంశీ చెప్పారు. దాంతో ల‌క్ష్మి భ‌ర్త‌గా త‌ను స‌రిపోతానా అనే డౌట్ ఆయ‌న‌కే వ‌చ్చింది. చూడ్డానికి కాస్త స‌న్న‌గా, అస‌లు వ‌య‌సు కంటే చిన్న‌వాడిగా క‌నిపిస్తుంటారాయ‌న‌. త‌న సందేహాన్ని కృష్ణ‌వంశీ ద‌గ్గ‌ర వ్య‌క్తం చేశారు. "ల‌క్ష్మి ప‌క్క‌న నేను ప‌నికొస్తానా సార్‌?" అన‌డిగారు. దాంతో కృష్ణ‌వంశీకి కూడా డౌట్ వ‌చ్చింది. ఆయ‌నకు ఇద్దామ‌నుకున్న పాత్ర‌ను ప్ర‌సాద్‌బాబుకు ఇచ్చారు. ఆ పాత్ర ప్ర‌సాద్‌బాబుకు రావ‌డానికి కార‌ణం కూడా న‌ర‌సింహ‌రాజే! అవును. కృష్ణ‌వంశీని క‌లిసిన‌ప్పుడు "ఫాద‌ర్ అంటే ప్ర‌సాద్‌బాబు లాగా అయినా ఉండాలి క‌దా సార్" అని మాట‌వ‌ర‌స‌కు ఆయ‌న అన్నారు. అలా మ‌హేశ్ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌ను ప్ర‌సాద్‌బాబు చేశారు. త‌న‌కు ఏదైనా సందేహం వ‌స్తే వెంట‌నే ఆ విష‌యాన్ని దాచుకోకుండా చెప్ప‌డం న‌ర‌సింహ‌రాజు అల‌వాటు. దాని వ‌ల్ల ఆయ‌న కొన్ని పాత్ర‌లు మిస్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో న‌రసింహ‌రాజు స్వ‌యంగా చెప్పారు.

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చిరంజీవికి 'గాడ్‌ఫాద‌ర్' ఎవ‌రో తెలుసా?

  సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి స్వ‌యంకృషితో పైకివ‌చ్చి మెగాస్టార్‌గా ఎదిగార‌నే విష‌యం చాలామందికి తెలుసు. ఆయ‌న అస‌లు పేరు శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే విష‌య‌మూ తెలుసు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న‌ప్పుడే 'పునాదిరాళ్లు' సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు 153వ సినిమా 'గాడ్‌ఫాద‌ర్' చేస్తున్నారు. నిజానికి ఆయ‌నకు ఇండ‌స్ట్రీలో గాడ్‌ఫాద‌ర్ అంటూ ఎవ‌రూ లేరు. అయితే ఆయ‌న‌లో ఆత్మ‌విశ్వాసం ఉంది. ఆ ఆత్మ‌విశ్వాసంతో, స్థిర ల‌క్ష్యంతో, న‌టుడ్ని కావాలి అనే దృఢ సంక‌ల్పంతో మ‌ద్రాస్ వెళ్లారే త‌ప్ప‌, ఓ చాన్స్ చూద్దాం అనే ఉద్దేశంతో వెళ్ల‌లేదు. ఆయ‌న‌లో బ‌ల‌మైన ఇచ్ఛ ఉంది. 'ఆ ఇచ్ఛ‌ను సాధించ‌డానికి నేనేం చెయ్యాలి? ఏం చేస్తే నేను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధిస్తాను?  దానికి స‌రైన మార్గం ఏమిటి?' అనేవి బాగా ఆలోచించుకొని మ‌రీ వెళ్లారు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత వెంట‌నే సినిమాల్లో అవ‌కాశాలు వాటంత‌ట అవి ల‌భించేస్తాయా? ల‌భించ‌వు. ఆయ‌న‌కున్న బీకాం డిగ్రీ స‌రిపోదు. అందుక‌ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో ట్రైనింగ్ అయ్యారు. దానివ‌ల్ల ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డింది. 'పునాదిరాళ్లు' చిత్రంలో తొలిసారిగా న‌టించే అవ‌కాశం అనుకోకుండా వ‌చ్చిందే త‌ప్ప ఆయ‌న ప్ర‌య‌త్నిస్తే రాలేదు. అప్ప‌టికి ఆయ‌నింకా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు. మిత్రుడు సుధాకర్‌కు ఆ సినిమాలో మొద‌ట అవ‌కాశం వ‌చ్చింది. కానీ అదే స‌మ‌యంలో భార‌తీరాజా సినిమాలో హీరోగా చాన్స్ రావ‌డంతో ఆ విష‌యం చెప్ప‌డానికి చిరంజీవిని తోడు తీసుకొని వెళ్లారు సుధాక‌ర్‌. అప్పుడు సుధాక‌ర్‌కు అనుకున్న వేషానికి చిరంజీవి మ‌రింత బాగా స‌రిపోతాడ‌ని ఆ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు అనుకొని, ఆయ‌న‌ను అడిగారు. ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ పొందే కాలంలో ఏ విద్యార్థీ సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌న్న నిబంధ‌న ఉంది. ఆ కార‌ణంగా మొద‌ట అంగీక‌రించ‌డానికి మ‌న‌స్క‌రించ‌లేదు. అందుక‌ని ఇన్‌స్టిట్యూట్ రూల్స్ అంగీక‌రించ‌వ‌ని వాళ్ల‌కు చెప్పారు చిరంజీవి. అయినా వాళ్లు ఇన్‌స్టిట్యూట్ నుంచి అనుమ‌తి తీసుకుంటామ‌ని చెప్పి బ‌ల‌వంతం చేశారు. అలా త‌ప్ప‌నిస‌రై ఆయ‌న 'పునాదిరాళ్లు' చిత్రంలో న‌టించ‌డం, ఆ చిత్రంలోని స్టిల్స్ చూసి ప్ర‌ముఖ నిర్మాత క్రాంతికుమార్ ఆయ‌న‌కు 'ప్రాణం ఖ‌రీదు' సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చారు. అప్పుడే శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ కాస్తా చిరంజీవి అయ్యారు. మొద‌ట న‌టించింది 'పునాదిరాళ్లు' సినిమాలో అయినా విడుద‌లైంది 'ప్రాణం ఖ‌రీదు'. అలా ఆయ‌న తొలి సినిమా 'ప్రాణం ఖ‌రీదు' అని చెప్పుకుంటే, చిరంజీవిగా ముఖాన రంగు వేసుకున్న నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న‌కున్న గాడ్‌ఫాద‌ర్‌, అండ‌, మార్గ‌ద‌ర్శి, ఫిలాస‌ఫ‌ర్ ఎవ‌రూ అంటే ఆయ‌న‌లోని శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తే! ఆయ‌న న‌ట జీవితం ప్రారంభించిన నాటి నుంచీ, ఆయ‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అదిలిస్తూ, మంద‌లిస్తూ స‌రైన మార్గంలో వెళ్లేలా చూస్తే, తెర‌మీద‌నే కాకుండా, తెర‌వెనుక కూడా రాణించాలంటే ఏయే ల‌క్ష‌ణాలు అల‌వ‌ర‌చుకోవాలి, ఎలా ప్ర‌వ‌ర్తించాలి? అనేవి అనుక్ష‌ణం చెప్పే వ్య‌క్తి శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాదే! ఉదాహ‌ర‌ణ‌కు.. హీరోగా చిరంజీవి న‌టిస్తూ, రాణిస్తున్న రోజుల్లో విల‌న్ పాత్ర‌లు పోషించే అవ‌కాశం వ‌చ్చిన సంద‌ర్భాల్లో ఆయ‌న‌కంటూ వెన‌క ఓ అండ ఉంటే ఠ‌క్కున వెయ్య‌కండి అని చెప్పేవారు. 'విల‌న్ వేషాలు నేను వెయ్య‌ను' అని గ‌న‌క ఆయ‌న అనివుంటే 'ఎంత గ‌ర్వం ఈ మ‌నిషికి, స‌త్య‌చిత్ర లాంటి పెద్ద సంస్థ‌లో అవ‌కాశం వ‌స్తే తిర‌స్క‌రించాడు' అని ఎక్క‌డ అపార్థం చేసుకుంటారోన‌ని వాళ్ల ఆఫీసుకెళ్లి బ‌తిమాలుకుంటే 'త‌ర్వాత చిత్రంలో నువ్వు హీరోవ‌య్యా' అని వారు చెబితే, వాళ్ల మాట‌లు గుడ్డిగా న‌మ్మి రెండు చిత్రాల్లో - కృష్ణ‌తో క‌లిసి విల‌న్‌గా న‌టించాల్సి వ‌చ్చింది.  కార‌ణం - పెద్ద బ్యాన‌ర్‌, పెద్ద హీరో చిత్రం. కాదంటే వాళ్లేమ‌నుకుంటారో - ఇప్పుడు మ‌నం తిర‌స్క‌రిస్తే రేపు మ‌న భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో అనే అతి జాగ్ర‌త్త వ‌ల్ల‌, 'ఒక సినిమాలో విల‌న్‌గా న‌టించినందువ‌ల్ల నీకేం న‌ష్టం లేదు - ఆ పాత్ర‌లోనే నువ్వు నీ టాలెంట్‌ని రుజువు చేసుకోవ‌చ్చు' అని ఆయ‌న‌లోని శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తి చిరంజీవిని ప్రోత్స‌హించాడు. అందువ‌ల్లే అతి స్వ‌ల్ప కాలంలోనే సుప్రీమ్ హీరోగా, త‌ర్వాత మెగాస్టార్‌గా నంబ‌ర్ వ‌న్ రేంజికి చేరుకున్నారు. సో.. చిరంజీవి అస‌లుసిస‌లు 'గాడ్‌ఫాద‌ర్‌'.. శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌!!

పొత్తిళ్ల‌లో పాప ఉండ‌గానే రాధిక‌కు స్క్రిప్టు వినిపించిన భార‌తీరాజా!

  1992 ఆగ‌స్ట్‌.. అప్పుడే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన రాధిక హాస్పిట‌ల్ బెడ్‌పై ప‌క్క‌లో శిశువును చూసుకుంటూ ఆనందాతిరేకంతో మురిసిపోతున్నారు. మాతృత్వ మ‌ధురిమ‌ను అనుభ‌వించ‌డం ఆమెకు అదే తొలిసారి. ఆ పుట్టిన పాప పేరు ర‌యానే. రెండో భ‌ర్త రిచ‌ర్డ్ హార్డీ ద్వారా ఆ పాప జ‌న్మించింది. (1990లో వారి పెళ్ల‌యితే ర‌యానే పుట్ట‌క‌ముందే 1992లోనే వారు విడాకులు తీసుకున్నారు.) అప్ప‌టికే అగ్ర న‌టి కావ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆమెను క‌లుసుకొని, శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆ వ‌చ్చిన వారిలో లెజెండ‌రీ డైరెక్ట‌ర్ భార‌తీరాజా కూడా ఉన్నారు. ఆయ‌న త‌న‌తో ఓ స్క్రిప్టు కూడా వెంట తెచ్చారు. అదీ ఆమెకు వినిపించ‌డం కోస‌మే ఆయ‌న తెచ్చారు. ఆ విష‌యం ఆయ‌న చెప్ప‌గానే మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయారు రాధిక‌. ఆ త‌ర్వాత న‌వ్వేశారు. "మీకేమైనా పిచ్చిప‌ట్టిందా! నేనిప్పుడే బిడ్డ‌ను క‌న్నాను. మీరు న‌న్ను యాక్ట్ చెయ్య‌మ‌ని అడుగుతున్నారు." అన్నారామె. "నో.. నో.. రాధికా.. ఈ స్క్రిప్టు నీ కోస‌మే త‌యారైంది. నువ్వు చెయ్యాల్సిందే" అన్నారు భార‌తీరాజా. ఆమె ద‌గ్గ‌ర ఆయ‌న‌కు ఆ చ‌నువు ఉంది. ఎందుకంటే ప‌దిహేనేళ్ల వ‌య‌సులో ఉన్న ఆమెను 'కిళ‌కే పోగుమ్ రైల్' (తూర్పు వెళ్లే రైలు) సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసింది ఆయ‌నే. ఆ సినిమా సూప‌ర్ హిట్‌. రాధిక‌ను ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మార్చిన‌ ఆ మూవీలో మ‌న క‌మెడియ‌న్ సుధాక‌ర్ హీరోగా న‌టించారు తెలుసా! రెండు నెల‌లు గ‌డిచాయి. ర‌యానేకు పాలిస్తూనే త‌మిళ‌నాడులోని వాద‌ల‌కుండులో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు రాధిక‌. భార‌తీరాజా డైరెక్ట్ చేసిన ఆ సినిమా 'కిళ‌క్కు చీమ‌యిలే' (1993). సింగిల్ మ‌ద‌ర్‌గా పాప‌ను తీసుకొని ఆమె ఆ సినిమా షూటింగ్ లొకేష‌న్ల‌ను ప్ర‌యాణాలు చేశారు. దాంతో అదివ‌ర‌కు లేని ఓర్పు ఆమెకు అల‌వ‌డింది. జీవితాన్ని మ‌రింత బాగా అర్థం చేసుకోవ‌డానికీ, కెరీర్‌లో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఆ సినిమా ఆమెకు బాగా ఉప‌యోగ‌ప‌డింది. 

'ప్రేమ‌సాగ‌రం' హీరోయిన్ న‌ళిని ఫ్యామిలీ సంగ‌తులు తెలిస్తే స‌ర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

  న‌ళిని అన‌గానే మ‌న‌కు మొద‌ట గుర్తుకొచ్చే సినిమా టి. రాజేంద‌ర్ రూపొందించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ 'ప్రేమ‌సాగ‌రం'. తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా సంవ‌త్స‌రం ఆడ‌టం అదే మొద‌టిసారి. అందులోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్‌. ఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచియ‌మైన న‌ళిని.. ఆ త‌ర్వాత చిరంజీవి స‌ర‌స‌న 'సంఘ‌ర్ష‌ణ', 'ఇంటిగుట్టు' సినిమాల్లో నాయిక‌గా న‌టించ‌డం ద్వారా మ‌రింత చేరువ‌య్యారు. అనంత‌రం అప్ప‌టి త‌మిళ స్టార్ యాక్ట‌ర్ రామ‌రాజ‌న్‌ను వివాహం చేసుకొని, కొంత కాలం సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత రి-ఎంట్రీ ఇచ్చి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఇటు సినిమాల్లో, అటు టీవీ షోల‌లో న‌టించారు.  1980ల‌లో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ మాస‌న్ లాంటి న‌టుల‌కు రామ‌రాజ‌న్ గ‌ట్టి పోటీదారుగా ఉండేవారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించిన‌ప్పుడు ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డ్డారు న‌ళిని. ఆ ఇద్ద‌రూ 1987లో వివాహం చేసుకున్నారు. ఆ ఇద్ద‌రికీ అరుణ అనే కుమార్తె, అరుణ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే అనంత‌ర కాలంలో అభిప్రాయ భేదాలు, మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో 2000 సంవ‌త్స‌రంలో న‌ళిని, రామ‌రాజ‌న్ విడాకులు తీసుకున్నారు. పిల్ల‌లిద్ద‌రూ న‌ళిని వ‌ద్ద‌నే పెరుగుతూ వ‌చ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లేవారు. విడిపోయిన న‌ళిని, రామ‌రాజ‌న్‌ల‌లో ఎవ‌రూ రెండో వివాహం చేసుకోలేదు. వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన అరుణ ఒక హోట‌ల్ య‌జ‌మాని అయిన రామ‌చంద్ర‌న్‌ను పెళ్లి చేసుకున్నారు. త‌న త‌ల్లిదండ్రుల‌కు సంబంధించిన ఒక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. చ‌ట్ట‌ప‌రంగా త‌మ త‌ల్లిదండ్రులు విడిపోయిన‌ప్ప‌టికీ, ఒక‌రిపై ఒక‌రికి ఇప్ప‌టికీ అపార‌మైన గౌర‌వం ఉంద‌నీ, ఒక‌రి గురించి మ‌రొక‌రు ఎన్న‌డూ చెడుగా మాట్లాడ‌ర‌నీ అరుణ చెప్పారు. కోర్టులో త‌మ త‌ల్లితండ్రులకు విడాకులు మంజూరైన రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా ఆమె వెల్ల‌డించారు. ఆమె చెప్పిన దాని ప్ర‌కారం విడాకులు మంజూరు చేస్తున్న‌ట్లు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించ‌గానే న‌ళిని కోర్టులోనే స్పృహ‌త‌ప్పి కింద‌ప‌డిపోయారు. వెంట‌నే రామ‌రాజ‌న్ ఆమె ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి, ఆమెను ప‌ట్టుకున్నారు. ఆమె ప‌రిస్థితి చూసి ఏడ్చేశారు. వాళ్ల‌ను అలా చూసిన న్యాయ‌మూర్తి ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక‌రిపై ఒక‌రికి ఇంత ప్రేమానురాగాలు ఉన్న‌ప్పుడు, ఎందుకు విడాకులు కోరుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌ను ఒక చిన్న రామ‌రాజ‌న్ లాగా త‌న త‌ల్లి పెంచార‌నీ, త‌న‌లో తండ్రి గుణాలు చాలా ఉన్నాయ‌నీ అరుణ తెలిపారు. "నేను మా నాన్న‌ను ఎప్పుడు క‌లిసినా, ఆయ‌న మొద‌ట నా గురించి కాకుండా మా అమ్మ గురించి అడుగుతారు." అని ఆమె వెల్ల‌డించారు. సో.. భార్యాభ‌ర్త‌లుగా విడిపోయిన‌ప్ప‌టికీ.. న‌ళిని, రామ‌రాజ‌న్ ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకుంటూ వ‌స్తుండ‌టం మంచి విష‌యం, అనుస‌ర‌ణీయం.

జ‌య‌మాలినిని ప్రేమిస్తున్నాన‌ని చెప్పిన‌వాళ్లే కానీ పెళ్లిచేసుకుంటాన‌న్న వారు లేరు!

  ఒక‌ప్పుడు జ‌య‌మాలిని అంటే జ‌నానికి పిచ్చ క్రేజ్‌. సినిమాలో ఆమె పాట వ‌స్తోందంటే ఊగిపోవ‌డానికి సిద్ధ‌మ‌య్యేవాళ్లు ఎంద‌రో! తెర‌పై ఆమె డాన్స్ వేస్తుంటే, తెర ముందు కేరింత‌లు కొడుతూ డాన్సులు వేసేవారు! ఆ రోజులే వేరు!! జ‌య‌మాలిని డాన్స్ అంటే అదీ. వ్యాంప్ ఆర్టిస్టుల్లో ఆమెలాంటి అంద‌గ‌త్తెలు అరుదు. చాలామంది హీరోయిన్ల‌కు కూడా ఆమె అందం ఉండ‌దు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా, డాన్స‌ర్‌గానే స్థిర‌ప‌డ్డారు జ‌య‌మాలిని. చాలామందికి తెలీని విష‌యం.. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తొలి సినిమాలో ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ జ‌య‌మాలిని! ఆ సినిమా 'అన్న‌ద‌మ్ముల అనుబంధం'. సినిమాల్లో జ‌నాల్ని క‌వ్వించి, మైమ‌ర‌పించి, వాళ్ల‌ను మ‌రో లోకంలోకి తీసుకుపోయే జ‌య‌మాలిని నిజ జీవితంలో అందుకు పూర్తి భిన్నం. కెమెరా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఆమె వంపుసొంపుల ప్ర‌ద‌ర్శ‌న‌. ఒక‌సారి షాట్ అయ్యిందంటే, మ‌ళ్లీ ఒంటిని నిండుగా క‌ప్పేసుకునేవారు. చాలా చాలా డీసెంట్‌గా వ్య‌వ‌హ‌రించేవారు. అందుకే ఎవ‌రూ ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవారు కాదు. డాన్స‌ర్‌గా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దానికి పైగా ఆమె ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేశారు. 1994లో ఆమె పార్తీప‌న్ అనే పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను వివాహం చేసుకొని, ఆ త‌ర్వాత పూర్తిగా సంసారానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎవ‌రినీ సినీ రంగంలోకి ఆమె తీసుకురాలేదు. నిజానికి ఆమె అంద‌చందాల‌కు ఎంతోమంది మోహితులైన‌వాళ్లే. సినీ రంగంలో ఎవ‌రూ ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌లేదా?  లేక ఆమె ఎవ‌రినీ ప్రేమించ‌లేదా?  చెప్పాలంటే సినిమాల్లో న‌టించినంత కాలం ఒక ప్రొఫెష‌న‌ల్‌గానే ఆమె వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. త‌న ప‌ని చూసుకోవ‌డం, ప్యాక‌ప్ చెప్ప‌గానే క్ష‌ణం ఆల‌స్యం చెయ్య‌కుండా ఇంటికి బ‌య‌లుదేరి వెళ్లిపోవ‌డం.. ఇంతే ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఎవ‌రితోనూ ప్రేమ‌లో ప‌డ‌లేదు. "కొంత‌మంది న‌న్ను ప్రేమిస్తున్నాని చెప్పారు. కానీ నాకు కుటుంబ బాధ్య‌త ఉంది. అందుకే నేను ఆ ప్రేమ‌ల్ని యాక్సెప్ట్ చెయ్య‌లేదు. నేను పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్న‌ప్పుడు సినిమా వాళ్లెవ‌రూ 'నేను పెళ్లి చేసుకుంటాను' అని నా ద‌గ్గ‌ర‌కు రాలేదు. డిస్కో శాంతిని శ్రీ‌హ‌రి చేసుకున్న‌ట్లు 'నీ బ‌రువు బాధ్య‌త‌ల్ని నేను తీసుకుంటాను' అని ఎవ‌రైనా వ‌చ్చిన‌ట్ల‌యితే మా అమ్మ న‌న్ను క‌చ్చితంగా వారికిచ్చి పెళ్లి చేసేదే. కానీ అలా ఎవ‌రూ రాలేదు." అని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు జ‌య‌మాలిని. ఆమె పెళ్లిచేసుకున్న పార్తీప‌న్ వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండే. జ‌య‌మాలిని త‌ల్లి వాళ్ల‌ను అడిగారు. వాళ్లు ఆలోచించుకొని ఓకే చెప్పారు. అలా త‌ల్లి చూసిన ఆ సంబంధం చేసుకున్నారు జ‌య‌మాలిని. పెళ్లి త‌ర్వాత కూడా భ‌ర్త ఆమెపై ఎలాంటి రెస్ట్రిక్ష‌న్స్ పెట్ట‌లేదు. న‌టించ‌వ‌ద్ద‌ని చెప్ప‌లేదు. అయిన‌ప్ప‌టికీ కుటుంబ జీవిత‌మే ముఖ్య‌మ‌నుకొని ఆమె తిరిగి సినిమాల్లోకి రాలేదు. న‌టించినంత కాలం న‌ట‌న‌ను, డాన్స్‌ను ఎంజాయ్ చేసిన జ‌య‌మాలిని, పెళ్ల‌యి పిల్ల‌లు పుట్ట‌గానే వారి ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం, భ‌ర్త‌కు అవ‌స‌ర‌మైన‌వి స‌మ‌కూర్చ‌డంలోనే ఆనందం పొందుతూ వ‌చ్చారు. ఇప్పుడు త‌న వ‌య‌సుకు త‌గ్గ మంచి పాత్ర‌లు వ‌స్తే చేయడానికి రెడీగా ఉన్నాన‌ని ఆమె చెప్తున్నారు.

కె.ఆర్‌. విజ‌య ఎంత రిచ్ అంటే.. సొంత విమానం క‌లిగిన మొట్ట‌మొద‌టి న‌టి ఆమే!

  అల‌నాటి అందాల తార‌ల్లో కె.ఆర్‌. విజ‌య ఒక‌రు. సావిత్రి త‌ర‌హాలోనే బొద్దుగా ఉండి న‌టిగా రాణించిన వారిలో ఆమె కూడా ఒక‌రు. ఆమె అస‌లు పేరు దైవ‌నాయ‌కి. ఆమె తండ్రి చిత్తూరుకు చెందిన తెలుగువ్య‌క్తి కాగా, త‌ల్లి కేర‌ళ వ‌నిత‌. కె.ఆర్‌. విజ‌య తండ్రి రెండో ప్ర‌పంచ యుద్ధంలో పాల్గొన్న భార‌త సైనికుడు. ఆర్మీలో ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌ల‌యాళ స్నేహితుని చెల్లెలిని ఆయ‌న వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. డ్రామాలు వేస్తూ చెన్నైకి వ‌చ్చిన విజ‌య త‌మిళ సినిమా 'క‌ర్ప‌గ‌మ్' (1963) సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా డైరెక్ట‌ర్ కె.ఎస్‌. గోపాల‌కృష్ణ‌న్‌ పేరు మార్చుకొమ్మన‌మ‌ని సూచించ‌డంతో త‌ల్లి క‌ల్యాణి, తండ్రి రామ‌చంద్ర పేర్లు రెంటినీ క‌లుపుకొని కె.ఆర్‌. విజ‌య‌గా త‌న స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన పౌరాణిక చిత్రం 'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం' (1966) ఆమె తొలి తెలుగు చిత్రం. అప్పుడామె వ‌య‌సు 17 సంవ‌త్స‌రాలు. 1966లోనే త‌మిళ చిత్ర నిర్మాత‌, ఫైనాన్షియ‌ర్ సుద‌ర్శ‌న్ వేలాయుధ‌మ్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయ‌న ఫైనాన్స్ చేసిన ఓ త‌మిళ‌ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ప్పుడు వారు తొలిసారి క‌లుసుకున్నారు. ఆ ప‌రిచ‌యం క్ర‌మంగా పెరిగి, ప్రేమ‌గా మారింది. పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత‌కాలం బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్ప‌కుండా దాచారు. ఎందుకంటే అప్ప‌టికి ఇంకా విజ‌య మేజ‌ర్ కాలేదు. ఆమె ఎనిమిది నెల‌ల గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు వేలాయుధ‌మ్ ఆమెను సిలోన్‌కు తీసుకువెళ్లారు. ఫ్ల‌యిట్ నుంచి కింద‌కు దిగేట‌ప్పుడు ఒక వ్య‌క్తి ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలు మ‌రుస‌టి రోజు న్యూస్ పేప‌ర్స్‌లో వ‌చ్చేశాయి. విజ‌య‌, వేలాయుధ‌మ్ సిలోన్‌కు హ‌నీమూన్‌కు వెళ్లారంటూ రాసేశాయి. అలా వారి పెళ్లి విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వేలాయుధంకు ప‌లు హోట‌ల్స్ కూడా ఉండేవి. అంతే కాదు.. సొంత జెట్ విమానం కూడా ఆయ‌న కొన్నారు. అలా దేశంలోనే ప్రైవేట్ జెట్ క‌లిగిన తొలి న‌టిగా కె.ఆర్‌. విజ‌య రికార్డుల్లోకి ఎక్కారు. వేలాయుధ‌మ్‌తో పెళ్లి ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె రాజ‌భోగాలు అనుభ‌వించారు. అయితే ఆమె కెరీర్‌కు పెళ్లి అడ్డు కాలేదు. కూతురు పుట్టిన కొన్ని నెల‌ల త‌ర్వాత‌ సినిమాల్లో న‌టించ‌డం కొన‌సాగించ‌మ‌ని, పెళ్లితో కెరీర్‌ను ఆపాల్సిన అవ‌స‌రం లేద‌నీ భ‌ర్త ఎంక‌రేజ్ చేయ‌డంతో కె.ఆర్‌. విజ‌య న‌ట‌న‌ను కంటిన్యూ చేశారు. దేవ‌త పాత్ర‌ల‌కు తిరుగులేని న‌టిగా పేరుపొందారు. ఆమెను మ‌హారాణిలా చూసుకున్న భ‌ర్త వేలాయుధ‌మ్ 2016లో క‌న్నుమూశారు.

చిన్నన‌టి అయిన‌ మంజుభార్గ‌వి 'శంక‌రాభ‌ర‌ణం' నాయిక అవ‌డం వెనుక క‌థ ఇదే!

  మంజుభార్గ‌వి సుప్ర‌సిద్ధ నాట్య‌కార‌ణి. కూచిపూడిలో వెంప‌టి చినస‌త్యం మాస్టారు ఆమె గురువు. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన క్లాసిక్ ఫిల్మ్ 'శంక‌రాభ‌ర‌ణం'లో హీరోయిన్ తుల‌సి పాత్ర మంజుభార్గ‌వి న‌ట జీవితంలో మైలురాయిగా, ఒక క‌లికితురాయిలా నిలిచిపోయింది. అయితే ఆ సినిమాకు ముందు ఆమె కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు.. ఆమె మాట‌ల్లోనే చెప్పాలంటే "పిచ్చి పిచ్చి వేషాలు" వేశారు. అలాంటి ఆమెకు ఏకంగా 'శంక‌రాభ‌ర‌ణం' లాంటి సినిమాలో నాయిక‌గా అవ‌కాశం రావ‌డం అంటే మాట‌లు కాదు. అదెలా సాధ్య‌మైంది?  విశ్వ‌నాథ్ ఆమెనే ఎందుకు తుల‌సి పాత్ర‌కు ఎంచుకున్నారు? చెన్నైలో ఒక‌సారి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ వారు ఏదో ఒక ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. ఆ ఫంక్ష‌న్‌లో గీత‌, మంజుభార్గ‌వి, మ‌రో న‌టి.. ముగ్గురిని వాకిట్లో నిల్చొని వ‌చ్చిన అతిథులంద‌రి మీదా ప‌న్నీరు చ‌ల్లి, వారికి పూలు ఇవ్వమ‌ని చెప్పారు. ఆ వ‌చ్చిన అతిథుల్లో విశ్వ‌నాథ్ కూడా ఉన్నారు. అప్ప‌టికే 'శంక‌రాభ‌ర‌ణం' క‌థ మీద ప‌నిచేస్తున్న ఆయ‌న‌ మంజుభార్గ‌విని చూడ‌గానే ఆయ‌నకు తుల‌సి పాత్ర‌ధారిణి దొరికేసింద‌ని అనిపించింది. అయితే ఆమె ఆ పాత్ర‌కు స‌రిపోతుందో, లేదో తెలియాలి క‌దా! అందుక‌ని 'శంకరాభ‌ర‌ణం' కంటే ముందు తీసిన 'ప్రెసిడెంట్ పేర‌మ్మ' మూవీలో మంజుభార్గ‌వి చేత ఓ జావ‌ళి చేయించారు. ఆ సినిమాలో నూత‌న్‌ప్ర‌సాద్‌, క‌విత హీరో హీరోయిన్లు. స్టేజి మీద ఎలా చేస్తారో అలా మేక‌ప్‌, కాస్ట్యూమ్స్‌, ఆభ‌ర‌ణాలు ధ‌రింప‌జేసి అలా మంజుభార్గ‌వి చేత‌ చేయించారు. అలాగే రెండు సీన్లు కూడా ఆమెకు పెట్టారు. బ‌హుశా ఆమె ప‌ర్ఫార్మెన్స్‌ను చూసేదానికేమో! డ‌బ్బింగ్ కూడా ఆమెచేతే చెప్పించారు. అంత‌దాకా ఆమె త‌ను చేసిన ఏ సినిమాకీ డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. కార‌ణం.. ఆమెది బేస్ వాయిస్‌! ద‌గ్గ‌రుండి మంజుభార్గ‌వి చేత డ‌బ్బింగ్ చెప్పించారు విశ్వ‌నాథ్‌. ఆ డ‌బ్బింగ్ అయిపోయాక "నీ ఫొటో ఒక‌టి కావాలి" అన్నారాయ‌న‌. స‌రేన‌ని చెప్పి, బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ సంగ‌తి మ‌ర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు మంజుభార్గ‌వి. నెల రోజులు గ‌డిచాక 'శంక‌రాభ‌ర‌ణం' యూనిట్ నుంచి ఎవ‌రో వ‌చ్చి ఫొటో కావాల‌ని అడిగారు. అప్పుడు పాండీబ‌జార్‌లోకి కృష్ణా ఫొటో స్టూడియోకు వెళ్లి లాంగ్‌షాట్‌, క్లోజ‌ప్‌, ప్రొఫైల్ ఫొటోలు తీయించుకొని అవి ఇచ్చారు. ఆ త‌ర్వాత జె.వి. సోమ‌యాజులు, మంజుభార్గ‌వికి క‌లిపి మేక‌ప్ టెస్ట్ చేయించారు విశ్వ‌నాథ్‌. అప్పుడు తీసిన ఫొటోల‌ను ఇండ‌స్ట్రీలో ప‌లువురికి చూపించారు. అప్ప‌టికే కొన్ని సినిమాల్లో ఏవేవో రోల్స్ చేసిన మంజుభార్గ‌విని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు. అలా 'శంక‌రాభ‌ర‌ణం' చిత్రంలో నాయిక‌గా అడుగుపెట్టారామె. ఆ సినిమా ఆమెకు ఎంత‌టి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా త‌ర్వాత ఆమె సినిమా వేషాల మీద కంటే త‌న మ‌న‌సుకు ఇష్ట‌మైన‌ డాన్స్ ప్రోగ్రామ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా త‌క్కువ సినిమాలు చేశారు.

మంజుల ఎలా చ‌నిపోయారో తెలిస్తే.. ఎవ‌రికైనా గుండెలు ద్ర‌వించ‌కుండా ఉండ‌వు!

  అల‌నాటి గ్లామ‌ర్ హీరోయిన్ మంజుల ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డి, కొన్ని రోజుల త‌ర్వాత అనూహ్యంగా ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్‌తో మృతి చెందారు. ఆమె మృతి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అభిమానుల‌ను తీవ్రంగా క‌ల‌చివేసింది. ఆమె సీనియ‌ర్ త‌మిళ న‌టుడు విజ‌య్‌కుమార్ భార్య‌. 1977లో వారు వివాహం చేసుకున్నారు. విజ‌య్‌కుమార్‌కు ఆమె రెండో భార్య‌. అప్ప‌టికే ఆయ‌న‌కు మొద‌టి భార్య ద్వారా ముగ్గురు పిల్ల‌లు. వారిలో అరుణ్ విజ‌య్ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా విజ‌య్‌కుమార్ ద్వారా మంజుల‌కు ముగ్గురు కుమార్తెలు వనిత‌, ప్రీతి, శ్రీ‌దేవి పుట్టారు.  2013లో చెన్నైలోని పేరుపొందిన శ్రీ రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో జూలై 23న మంజుల తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి దారితీసిన కార‌ణాల‌ను పెద్ద కుమార్తె వ‌నితా విజ‌య్‌కుమార్ వెల్ల‌డించారు.  ఒక‌రోజు ఇంట్లో మంజుల కింద‌ప‌డ్డారు. అప్పుడు క‌ణ‌త పైన చిన్న దెబ్బ త‌గిలి వాచింది. ఆయింట్‌మెంట్ రాసి, రెస్ట్ తీసుకుంటే త‌గ్గిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఆమె ప‌డిన‌ప్పుడు క‌డుపులో బ‌లంగా దెబ్బ త‌గిలింది. అది బ‌య‌ట‌కు తెలీలేదు. అందుక‌ని హాస్పిట‌ల్‌కు వెళ్లి ఎలాంటి టెస్ట్ చేయించుకోలేదు. నెల రోజులు గ‌డిచాక క‌డుపు లోప‌ల బ్లీడింగ్ అయ్యింది. ర‌క్తం గడ్డ క‌ట్టింది. దానివ‌ల్ల కిడ్నీల‌పై ఒత్తిడిప‌డింది. ఫ‌లితంగా మంజుల విప‌రీత‌మైన నొప్పి అనుభ‌వించారు.  అప్పుడు అమ్మ‌ను శ్రీ రామ‌చంద్ర‌ హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు వ‌నిత‌. డాక్ట‌ర్లు మంజుల‌కు ప‌లు టెస్టులు నిర్వ‌హించారు. వాటి ఫ‌లితాలు వ‌చ్చాక‌, 72 గంట‌ల్లో మీ అమ్మ చ‌నిపోతుంద‌ని వ‌నిత‌కు డాక్ట‌ర్ చెప్పేశారు. ఆ 72 గంట‌ల్లో ఏమేం జ‌రుగుతుందో వెల్ల‌డించారు. వ‌నిత‌కు డాక్ట‌ర్ ఏం చెప్తున్నారో కొద్ది క్ష‌ణాల దాకా అర్థం కాలేదు. ఆమెకు త‌లంతా గిర్రున తిరుగుతున్న‌ట్లు అనిపించింది. అమ్మ మ‌రో మూడు రోజుల్లో చ‌నిపోతుంద‌నే వార్త‌ను డాక్ట‌ర్ మొద‌ట‌ ఆమెకే చెప్పారు మ‌రి! ఆ వాస్త‌వాన్ని జీర్ణించుకోవ‌డం త‌న‌కే క‌ష్టంగా ఉందే.. దాన్ని తండ్రికి, ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌కు ఎలా చెప్పాలి? కూతురు డాక్ట‌ర్‌తో మాట్లాడుతుంటే కాస్త దూరంలో ఉన్న మంజుల‌కు త‌న ప‌రిస్థితి ఏమిట‌నేది అర్థ‌మైపోయింది. ఆమె చెవులు చాలా షార్ప్‌. వారి మాట‌లు ఆమె చెవిన ప‌డ్డాయి. "వ‌నితా నీ మాట‌లు నాకు వినిపిస్తున్నాయ్" అని ఆమె అక్క‌డ్నుంచే కేక వేశారు. ఆమెను హాస్పిట‌ల్‌లో ఐసీయూ వార్డులో అడ్మిట్ చేశారు. క్ర‌మ‌క్ర‌మంగా మంజుల‌కు మ‌తిస్థిమితం త‌ప్పుతూ వ‌చ్చింది. తాను హాస్పిట‌ల్లో ఉన్న విష‌యం కూడా ఆమె మ‌ర్చిపోతూ వ‌చ్చారు. కాసేపు ఇంట్లో ఉన్నాన‌నుకొనేవారు. చెప్పిన విష‌యం ప‌ది నిమిషాల్లో మ‌ర్చిపోయేవారు. భ‌ర్త‌, కుమార్తెలు అంద‌రూ హాస్పిట‌ల్‌లో ఉన్నారు. మూడో రోజు.. 23 జూలై 2013.. మంజుల ఆరోగ్య ప‌రిస్థితి పూర్తిగా క్షీణించింది. రెండు రోజులు అక్క‌డే ఉండ‌టంతో, ఆరోజు ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకొన‌మ‌ని వ‌నిత‌కు చెప్పారు విజ‌య్‌కుమార్‌. దాంతో ఆమె ఇంటికి వెళ్లింది. ఈలోపు ఎవ‌రు క‌నిపించినా "వ‌నితా" అని పిల‌వ‌డం మొద‌లుపెట్టారు మంజుల‌. తండ్రి ఆమెకు ఫోన్ చేశారు.. "ఏ క్ష‌ణంలోనైనా అమ్మ మ‌న‌ల్ని వ‌దిలిపోవ‌చ్చు.. నువ్వు రా" అని చెప్పారు. ఆరోజు వ‌నిత హాస్పిట‌ల్‌కు వ‌చ్చేట‌ప్పుడు ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంది. అది త‌ప్పించుకొని వ‌చ్చేస‌రికి మంజుల ఆఖ‌రి క్ష‌ణాల్లో ఉన్నారు. ముఖ‌మంతా ప‌సుపు రంగులోకి మారిపోయింది. క‌నుగుడ్లు కింద‌కు వాలిపోయాయి. ఒక్క గుండె మాత్రం కొట్టుకుంటోంది. వ‌నిత వ‌చ్చిన వెంట‌నే ఐసీయూ రూమ్‌లో ఉన్న‌వాళ్లంతా లేచి, బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఆ రూమ్‌లో మిగిలింది.. మంజుల‌, విజ‌య్‌కుమార్‌, వ‌నిత‌. అమ్మ చేతిని త‌న చేతిలోకి తీసుకున్న వ‌నిత‌.. "అమ్మా లుక్ ఎట్ మి అమ్మా.. వ‌నిత అమ్మా" అంది వ‌నిత‌. వ‌నితా అన్న పిలుపు విన‌గానే కింద‌కు వాల్చిన క‌ళ్లను ఒక్క క్ష‌ణం పైకిలేపి, వ‌నిత వంక చూశారు మంజుల‌. ఆ క్ష‌ణంలోనే మానిట‌ర్‌లో హార్ట్ రేటింగ్, ప‌ల్స్ రేటింగ్‌ ప‌డిపోవ‌డం చూసింది వ‌నిత‌.. వెంట‌నే "డాడీ.. డాడీ.. న‌ర్సును పిల‌వండి" అంటూనే ఉంది.. ప‌ది సెక‌న్ల‌లోనే మంజుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. త‌న తొలి బిడ్డ చేతుల్లోనే ఆమె క‌న్నుమూశారు.

ఎన్టీఆర్ పాదాభివంద‌నం.. హేమ‌సుంద‌ర్ మైండ్ బ్లాక్‌!

  విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తారక‌రామారావు ద్విపాత్రాభిన‌యం చేసిన సినిమా 'ప్రేమ‌సింహాస‌నం' (1981). బీరం మ‌స్తాన్‌రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తాత‌య్య‌గా హేమ‌సుంద‌ర్ న‌టించారు. ఎన్టీఆర్‌తో ఆయ‌న న‌టించ‌డం అదే తొలిసారి. అంత‌టి మ‌హాన‌టుడికి తాత వేషం ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు హేమ‌సుంద‌ర్ చాలా సంతోషించారు. అంతలోనే సిగ్గు కూడా వేసింది.. అంత‌టి న‌టుడికి తాను తాత వేషం వేయ‌ట‌మా!.. అని. చెన్నైలోని భ‌ర‌ణీ స్టూడియోలో షూటింగ్‌.. ఇంటి ద‌గ్గ‌రే మేక‌ప్ వేసుకొని లొకేష‌న్‌కు వ‌చ్చారు ఎన్టీఆర్‌. ఆయ‌న కారుదిగి వ‌స్తుంటే.. అక్క‌డున్న వాళ్లు ఒక్కొక్క‌రుగా ఆయ‌న‌కు పాదాభివంద‌నాలు చేస్తున్నారు. పాదాభివంద‌నాలు చేయ‌డం అంటే హేమ‌సుంద‌ర్‌కు గిట్ట‌దు. అందుక‌ని నెమ్మ‌దిగా లోప‌లికి జారుకున్నారు. షూటింగ్ మొద‌లైంది. హేమ‌సుంద‌ర్‌కు అది తొలి సీన్‌. ఎన్టీఆర్‌కు ఆయ‌న‌ను ప‌రిచ‌యం చేశారు డైరెక్ట‌ర్ మ‌స్తాన్‌రావు. ప‌ర‌స్ప‌రం న‌మ‌స్కారాలు చేసుకున్నారు. డైరెక్ట‌ర్ సీన్ వివ‌రించ‌గానే, "ఓకే టేక్" అన్నారు ఎన్టీఆర్‌. ఒక్క రిహార్స‌ల్ అయినా చేస్తారేమో అనుకున్నారు హేమ‌సుంద‌ర్‌. డైరెక్టుగా టేక్ అనేస‌రికి ఆయ‌న‌కు కాస్త కంగారు వేసింది. డైరెక్ట‌ర్‌తో ఒక రిహార్స‌ల్ పెట్టించ‌మ‌ని అడిగారు. "సార్‌.. అత‌ని కోసం ఒక రిహార్స‌ల్" అని చెప్పారు డైరెక్ట‌ర్‌. "ఓకే.. ఓకే" అన్నారు ఎన్టీఆర్‌. ఆ సీన్‌.. ఎన్టీఆర్ ఫారిన్‌లో ఒక మ్యూజిక్ కాన్స‌ర్ట్ చేసి అప్పుడే ఇంటికి వ‌స్తారు. వ‌చ్చీ రాగానే "తాతా.. తాతా" అని పిలుస్తూ, తాత రాగానే త‌న చేతిలోని బ్రీఫ్‌కేస్ ఓపెన్ చేసి, అందులోంచి మెడిసిన్స్ తీసి ఆయ‌న చేతికి ఇస్తారు. ఇద్ద‌రి మ‌ధ్యా ఒక‌ట్రెండు మాట‌లు న‌డుస్తాయి. రిహార్స‌ల్ అయిపోయింది. టేక్ స్టార్ట‌య్యింది. ఎన్టీఆర్ ఇంట్లోకి "తాతా.. తాతా" అంటూ ఎంట‌రై కుడిచేతిలోని బ్రీఫ్‌కేసును పైకెగ‌రేసి ఎడ‌మ‌చేత్తో దాన్ని ప‌ట్టుకొని, ఠ‌క్కుమ‌ని వ‌చ్చి తాత పాత్ర‌ధారి హేమ‌సుంద‌ర్‌కు పాదాభివంద‌నం చేశారు. అంతే! హేమ‌సుంద‌ర్ మైండ్ బ్లాకైపోయింది. ఒక్క నిమిషం ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. రిహార్స‌ల్స్ చేసిన‌ప్పుడు ఆ పాదాభివంద‌నం లేదు. కానీ టేక్‌లో ఎన్టీఆర్ ఆ ప‌ని చేశారు. మొత్తానికి ఎలాగో ఆ సీన్ మేనేజ్ చేశారు హేమ‌సుంద‌ర్‌. డైరెక్ట‌ర్ "క‌ట్‌.. ఓకే" అన్నారు. ఇప్ప‌టికీ ఆ ఘ‌ట‌న‌ను మ‌ర్చిపోలేదు హేమ‌సుంద‌ర్‌.

రాజేంద్ర‌ప్ర‌సాద్, భానుప్రియతో రైట‌ర్ స‌త్యానంద్ ఓ సినిమాని డైరెక్ట్ చేశార‌ని తెలుసా?

  ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు స‌త్యానంద్‌. ఎన్టీ రామారావు ద‌గ్గ‌ర్నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్‌బాబు వ‌ర‌కు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల‌కు మాట‌ల ర‌చ‌యిత‌గా, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా, క‌థా ర‌చ‌యిత‌గా ప‌నిచేసి తెలుగు చిత్ర‌సీమ‌లోని పాపుల‌ర్ రైట‌ర్స్‌లో ఒక‌రిగా పేరుపొందారు. రైట‌ర్స్ డైరెక్ట‌ర్స్ కావ‌డం చాలా కాలం నుంచి ఉన్న‌దే. దాస‌రి, జంధ్యాల కాలం నుంచి ఇప్ప‌టి త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ దాకా ఎంతోమంది ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులుగా మారారు. వారిలో పైన చెప్పుకున్న‌వాళ్లు స్టార్ డైరెక్ట‌ర్స్ అనిపించుకున్నారు. అదే త‌ర‌హాలో స‌త్యానంద్ కూడా డైరెక్ట‌ర్‌గా మారార‌ని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌లో చాలామందికి తెలీదు. అయితే ఆయ‌న డైరెక్ట్ చేసింది ఒకే ఒక్క సినిమాకు. ఆ సినిమా 'ఝాన్సీరాణి' (1988). టైటిల్ రోల్‌ను భానుప్రియ చేసిన ఆ సినిమాలో హంత‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ నెగ‌టివ్ రోల్ చేశారు. ద‌గ్గుబాటి రాజా, ముచ్చ‌ర్ల అరుణ‌, పూర్ణిమ, రాజ్య‌ల‌క్ష్మి లాంటి తార‌లు కూడా ఇందులో న‌టించారు. మ‌ల్లాది వెంక‌ట‌కృష్ణ‌మూర్తి పాపుల‌ర్ న‌వ‌ల 'మిస్ట‌ర్ వి' ఆధారంగా ఈ సినిమాని తీశారు స‌త్యానంద్‌. మిద్దే రామారావు నిర్మించారు. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఫెయిలైంది. మిస్‌క్యాస్టింగ్ వ‌ల్లే ఈ సినిమా ఫెయిలైంద‌న్న‌ది స‌త్యానంద్ స్వీయ విశ్లేష‌ణ‌. ఈ సినిమాకి ముందు 'లేడీస్ టైల‌ర్' సినిమాతో కామెడీ హీరోగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు చాలా పెద్ద పేరు వ‌చ్చింది. ఆ సినిమాలో ఆయ‌న జ‌నాన్ని విప‌రీతంగా న‌వ్వించారు. అలాంటిది.. అమ్మాయిల‌ను చంపే కిల్ల‌ర్ క్యారెక్ట‌ర్‌ను 'ఝాన్సీరాణి'లో చేశారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. తొలిరోజు సినిమా చూసిన‌వాళ్లు అంద‌ర్నీ న‌వ్వించే రాజేంద్ర‌ప్ర‌సాద్ అమ్మాయిల‌ను మ‌ర్డ‌ర్ చేసే క్యారెక్ట‌ర్ చేయ‌డం ఏమిట‌ని విమ‌ర్శించారు. ఆ మౌత్ టాక్ సినిమాకు ప్ర‌తికూలంగా ప‌నిచేసింది. రాజేంద్ర‌ప్ర‌సాద్ కాకుండా మ‌రో హీరో ఎవ‌రైనా ఆ క్యారెక్ట‌ర్ చేసుండే ఫ‌లితం ఇంకోలా ఉండేద‌ని క్రిటిక్స్ అన్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ అనేసరికి కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసిన‌వాళ్లు అందుకు భిన్న‌మైన రోల్‌లో ఆయ‌న్ను చూసి పెద‌వి విరిచారు. చివ‌ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను కోర్టులో భానుప్రియ షూట్ చేసి చంపేస్తుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్‌లో ఆయ‌న‌ను ప్రేక్ష‌కులు చూడ‌లేక‌పోయారు. 'ఝాన్సీరాణి' రిలీజైన త‌ర్వాత కూడా ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు స‌త్యానంద్ డైరెక్ష‌న్‌లో సినిమా తీద్దామ‌ని వ‌చ్చారు. కానీ ఆయ‌న‌కే ఇక డైరెక్ష‌న్ వ‌ద్దు, రైట‌ర్‌గానే కంటిన్యూ అవుదాం అనిపించి, ఆ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించారు. అలా సింగిల్ మూవీ డైరెక్ట‌ర్‌గా నిలిచిపోయారు స‌త్యానంద్‌.

గిరిబాబు అప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేర‌డానికి కార‌ణం ఇదేనా?!

  ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని పెట్టిన‌ప్పుడు ఆ పార్టీలో చేరిన సినీ ప్ర‌ముఖుల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గిరిబాబు ఒక‌రు. ఎన్టీఆర్ మీద అభిమానంతో, తెలుగువారికి ఆయ‌న వ‌ల్ల మేలు జ‌రుగుతుంద‌నే అపార న‌మ్మ‌కంతో ఆ పార్టీలో చేరారు. అయితే ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న కాలంలోనే ఒక‌రోజు అక‌స్మాత్తుగా ఆ పార్టీకి రాజీనామా చేసి, జాతీయ పార్టీ బీజేపీలో చేరి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు గిరిబాబు. ఆయ‌న అలా ఎందుకు చేశార‌నేది పార్టీలో ఉన్న చాలామందికి తెలుసు కానీ, ప్ర‌జల్లో చాలా మందికి తెలీదు. అందుకే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు రేకెత్తాయి. అస‌లు ఎందుకు ఆరోజు ఆయ‌న టీడీపీని వ‌దిలేశారంటే... గిరిబాబు స్వ‌స్థ‌లం ప్ర‌కాశం జిల్లాలోని రావినూత‌ల గ్రామం. అప్ప‌ట్లో ఆ ఊరివాళ్లు కానీ, చుట్టుప‌క్క‌ల‌వారు కానీ ఇంట‌ర్మీడియేట్ చ‌దువుకోవాలంటే ఒంగోలుకో, చీరాల‌కో వెళ్లేవారు. అబ్బాయిలు ఎలాగో వెళ్లి చ‌దువుకొనేవారు కానీ, అమ్మాయిలు చ‌దువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర‌య్యేవి. దాంతో రావినూత‌ల‌లో ఒక జూనియ‌ర్ కాలేజీ పెట్టించాల‌ని గిరిబాబు ప్ర‌య‌త్నించారు. అందుకోసం ఆయ‌న త‌న సొంత భూమి ఒక ఎక‌రం విరాళంగా ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. ఊళ్లో చందాలు వ‌సూలుచేశారు. కాలేజీ నిర్మాణానికి కార్ప‌స్ ఫండ్ కూడా ఏర్పాటుచేశారు. అక్క‌డ జూనియ‌ర్ కాలేజీ ఏర్పాటుచేస్తే చుట్టుప‌క్క‌ల 24 గ్రామాల పిల్ల‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌భుత్వానికి తెలిపారు. కానీ ప్ర‌భుత్వం అక్క‌డ కాలేజీ మంజూరు చేయ‌లేదు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి ఉన్నారు. గిరిబాబు ప్ర‌పోజ‌ల్‌కు ఆయ‌న ఓకే కూడా చేశారు. కానీ ఏం జ‌రిగిందో చివ‌రి క్ష‌ణంలో అక్క‌డ కాలేజీ ఏర్పాటుకు అనుమ‌తులు ఇవ్వ‌లేదు. దాంతో గిరిబాబు మ‌న‌స్తాపం చెందారు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌కుండా కాలేజీ ఏర్పాటుకు అనుమ‌తించాల్సిందిగా ప్రాధేయ‌ప‌డ్డారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. దాంతో ఆయ‌న టీడీపీని విడిచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. సిద్ధాంతాలు న‌చ్చి బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత ఆ పార్టీలో కూడా ఆయ‌న ఇమ‌డ‌లేద‌నేది వేరే విష‌యం.

మోహ‌న్‌బాబు వ‌ల్ల‌ 'స్వ‌ర్గం న‌ర‌కం'లో ఎస్వీఆర్‌ ట్రావెల్స్ య‌జ‌మానికి హీరో చాన్స్ మిస్‌!

  అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు తీసిన సినిమా 'స్వ‌ర్గం న‌ర‌కం' (1975). ఈ సినిమా ద్వారా మోహ‌న్‌బాబు, ఈశ్వ‌ర‌రావు హీరోలుగా, అన్న‌పూర్ణ‌, జయ‌ల‌క్ష్మి హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమంటే మోహ‌న్‌బాబు అస‌లుపేరు భ‌క్త‌వ‌త్స‌లం, ఈశ్వ‌ర‌రావు అస‌లు పేరు విశ్వేశ్వ‌ర‌రావు. వారి అస‌లు పేర్ల‌ను ఈ సినిమాతో మార్చేశారు దాస‌రి. మొద‌ట నాట‌కాల్లో న‌టించే ఈశ్వ‌ర‌రావును ఒక హీరోగా ఎంపిక‌చేసిన దాస‌రి, మ‌రో హీరోగా అప్ప‌ట్లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న మోహ‌న్‌బాబును ఎంపిక చేశారు. అయితే 'స్వ‌ర్గం న‌ర‌కం' సినిమాని పంపిణీ చేస్తున్న ల‌క్ష్మీ ఫిలిమ్స్ వాళ్లు బోసుబాబు అనే యువ‌కుడ్ని పంపించి, అత‌నికి హీరోగా చాన్స్ ఇవ్వాల్సిందేన‌ని ఈ చిత్రానికి నిర్మాణ సార‌థిగా వ్య‌వ‌హ‌రించిన దిడ్ది శ్రీ‌హ‌రిరావు మీద ఒత్తిడి తీసుకువ‌చ్చారు. అప్ప‌ట్లో డిస్ట్రిబ్యూట‌ర్స్ చెప్పిందే వేదం. దాంతో దాస‌రికి శ్రీ‌హ‌రిరావు విష‌యం చెప్పి, బోసుబాబుకు హీరోగా చాన్స్ ఇవ్వ‌క‌పోతే డిస్ట్రిబ్యూట‌ర్స్ ఇబ్బంది పెడ‌తారేమోన‌ని అన్నారు. దాంతో అప్ప‌టికే త‌ను ఎంపిక చేసిన భ‌క్త‌వ‌త్స‌లం (మోహ‌న్‌బాబు)ను తీసుకోవాలా, బోసుబాబును తీసుకోవాలా అనే సందిగ్ధంలో ప‌డ్డారు దాస‌రి. ఈ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తూ వ‌చ్చిన దాస‌రి శిష్యుడు, ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ర‌విరాజా పినిశెట్టి త‌న గురువుకు ఒక సూచ‌న చేశారు. "భ‌క్త‌వ‌త్స‌లం, బోసుబాబును షూటింగ్ లొకేష‌న్ అయిన విజ‌య‌వాడ‌కు తీసుకువెళ్లి, ఇద్ద‌రిపై ఒకే సీన్‌ను తీద్దాం. ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా చేస్తే వాళ్ల‌ను హీరోగా తీసుకోండి. దానివ‌ల్ల రిక‌మండేష‌న్స్‌కు తావు లేకుండా టాలెంట్‌కు మాత్ర‌మే విలువ ఇచ్చిన‌ట్ల‌వుతుంది." అని ఆయ‌న చెప్పారు. ర‌విరాజా మాట దాస‌రికి న‌చ్చింది.  విజ‌య‌వాడ‌లో షూటింగ్ ప్రారంభించి భ‌క్త‌వ‌త్స‌లం, బోసుబాబు మీద ఒకే సీన్ చిత్రీక‌రించారు దాస‌రి. షూట్ చేసిన ఫిల్మ్‌ను అప్ప‌టిక‌ప్పుడు మ‌ద్రాసుకు పంపించి, డెవ‌ల‌ప్ చేయించారు. మ‌ర్నాడు దాన్ని విజ‌య‌వాడ‌కు ర‌ప్పించి, ఒక థియేట‌ర్‌లో వేసుకొని చూశారు. అంద‌రికీ భ‌క్త‌వ‌త్స‌లం ప‌ర్ఫార్మెన్స్ న‌చ్చింది. అత‌నినే హీరోగా తీసుకున్నారు దాస‌రి. అలా ఆయ‌న 'స్వ‌ర్గం న‌ర‌కం' ద్వారా హీరోగా మోహ‌న్‌బాబు తెర‌పై ఎంట్రీ ఇస్తే, ఆ సినిమాలో హీరో అయ్యే చాన్స్‌ను మిస్ చేసుకున్నాడు బోసుబాబు. ఆ బోసుబాబు మ‌రెవ‌రో కాదు, త‌ద‌నంత‌ర కాలంలో 'బోస్ ఈజ్ బాస్' అంటూ ఎస్వీఆర్ ట్రావెల్స్‌ను దిగ్విజ‌యంగా న‌డుపుతున్న ఆయ‌నే. సినిమా న‌టుడు కావాల‌నుకున్న బోసుబాబు చివ‌ర‌కు వ్యాపార రంగంలో స్థిర‌ప‌డి బాగా సంపాదించారు.

ఒక క‌ల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌ను 'చిరంజీవి'గా మార్చింది!

  చిరంజీవి కెమెరా ముందుకు వ‌చ్చిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'పునాదిరాళ్లు'. అయితే విడుద‌లైంది మాత్రం ఏడో సినిమాగా. దాన్ని ఆయ‌న ఇష్టంతో చేయ‌లేదు. ఆ సినిమావాళ్లు బ‌ల‌వంత‌పెట్ట‌డంతో చేశారు. ఆయ‌న అప్పుడు ఇంకా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉన్నారు. అక్క‌డి నిబంధ‌న‌ల ప్ర‌కారం కోర్సు పూర్త‌య్యేదాకా సినిమాల్లో న‌టించ‌కూడ‌దు. ఒక‌సారి ఎవ‌రి కోస‌మో చిరంజీవి వెళ్తూ, అనుకోకుండా ఒక ప్రొడ్యూస‌ర్‌ను క‌లిశారు. ఆయ‌న చిరంజీవిని త‌మ సినిమాలో న‌టించ‌మ‌ని అడిగారు.  "కోర్సు పూర్త‌య్యేదాకా నేను న‌టించ‌కూడ‌దండీ" అని చెప్పారు చిరంజీవి.  "మాకు అర్జంట్‌గా మీలాంటి యాక్ట‌ర్ కావాలి. షూటింగ్‌కు వెళ్తున్నాం." అని ఆ నిర్మాత‌, ఆ సినిమా డైరెక్ట‌ర్ అడిగారు.  దాంతో ఓకే అని చెప్పి, ఇన్‌స్టిట్యూట్ ప‌ర్మిష‌న్ తీసుకొని ఆ సినిమాలో యాక్ట్ చేశారు చిరంజీవి. ఆ సినిమా 'పునాదిరాళ్లు'.  చిరంజీవి అస‌లుపేరు శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అని మ‌న‌కు తెలిసిందే. పేరు మ‌రీ పొడ‌వుగా ఉంద‌నీ, ఏదైనా మంచిపేరు పెట్టుకుందామ‌నుకున్నారు. అప్ప‌ట్లో శంక‌ర్ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవారు. అలాగే అప్ప‌టికే యాక్ట‌ర్ ప్ర‌సాద్‌బాబు ఉన్నారు. అదే టైమ్‌లో చిరంజీవికి ఒక క‌ల వ‌చ్చింది. ఆ క‌ల‌లో ఆయ‌న ఓ గుడిలో పూజ చేసుకుంటున్నారు. ఆయ‌న స్నేహితుల్లో ఒక‌రు "చిరంజీవీ" అని పిలిచారు. 'నాపేరు శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అయితే వీడు చిరంజీవి అని పిలుస్తున్నాడేంటి' అనుకున్నారు. మెల‌కువ వ‌చ్చాక త‌న ఫ్రెండ్స్‌తో ఈ విష‌యం చెప్పారు. "నువ్వు కూడా మంచిపేరు ఏదైనా పెట్టుకోవాల‌ని ఆలోచిస్తున్నావు క‌దా.. బ‌హుశా ఆంజ‌నేయ‌స్వామి త‌న పేరునే సూచించివుంటారు" అని వార‌న్నారు.  అప్ప‌టిదాకా 'చిరంజీవి' అనే పేరు ఉంటుంద‌ని ఆయ‌న‌కు తెలీదు. పెళ్లి శుభ‌లేఖ‌ల్లో వ‌రుడిని 'చిరంజీవి' అని సంబోధిస్తార‌నీ, వ‌ధువును 'చిరంజీవి ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి' అని సంబోధిస్తార‌ని తెలుసు కానీ ఆ పేరును పెట్టుకున్నార‌ని తెలీదు. ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుందా అన‌డిగితే, బాగుంటుంద‌న్నారు. అప్పుడు 'పునాదిరాళ్లు' షూటింగ్‌కు రాజ‌మండ్రిలో జ‌రుగుతోంది. అక్క‌డ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో "నీ పేరు ఏం చెప్ప‌మంటావు?" అని డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ అడిగారు. "చిరంజీవి అని చెప్పండి" అన్నారు శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌. అలా 'చిరంజీవి' ప్ర‌ప్ర‌థ‌మంగా మీడియాకు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత తెర‌పై ఆ పేరుతో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.