రెండు సార్లు పోయిన‌ట్లే పోయి దొరికిన మాధ‌వి సెంటిమెంట్ రింగ్‌!

  సీనియ‌ర్ న‌టి మాధ‌వి సినిమాల‌కు గుడ్‌బై చెప్పి, భ‌ర్త‌తో క‌లిసి యు.ఎస్‌.లో నివాసం ఉంటోంది. ద‌క్షిణాది నాలుగు భాష‌ల‌తో పాటు, హిందీలోనూ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన తార ఆమె. మాధ‌వి సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ఆమెకో సెంటిమెంట్ ఉండేది. వాళ్ల‌మ్మ‌గారు ఆమెకు అయిదురాళ్ల ఉంగ‌రం ఒక‌టి ఇచ్చారు. అది త‌న చేతిలో ఉన్నంత‌వ‌ర‌కూ త‌న‌కంతా మంచే జ‌రుగుతుంద‌ని న‌మ్మేది మాధ‌వి. సినిమాల్లోనూ ఆ ఉంగ‌రం ఆమె చేతికే ఉంటుంది. ఆ ఉంగ‌రం గురించి ఫ్యాన్స్ ఆమెకు ఉత్త‌రాలు రాసేవారు, "ప్ర‌తి సినిమాలోనూ మీ వేలికి క‌నిపించే ఆ ఉంగ‌రం అంటే మీకిష్ట‌మా?" అని. అంత డీప్‌గా ఆమె ల‌వ్ చేసిన ఆ ఉంగ‌రం ఎక్క‌డో ప‌డిపోతే ఆమెకెలా ఉండివుంటుందో ఊహించుకోవాల్సిందే.  'హ‌నా బ‌ల‌వా.. జ‌నా బ‌ల‌వా' అనే క‌న్న‌డ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అందులో పొలాల్లో ప‌నిచేసే సీన్ ఒక‌టుంది. మోకాలి బుర‌ద‌నీటిలో నిల‌బ‌డి, పొలంలోవున్న బుర‌ద‌నంతా ఒక‌ళ్ల‌మీద ఒక‌రు చ‌ల్లుకొనే సీన్‌. ఆ సినిమాలో శంక‌ర్ నాగ్ హీరో. డైరెక్ట‌ర్ రెడీ అన‌గానే షాట్ మొద‌లైంది. చేతుల‌నిండా బుర‌ద తీసుకొని విస‌ర‌డం మొద‌లుపెట్టింది మాధ‌వి. అంతే.. హ‌ఠాత్తుగా ఆమె వేలికున్న ఉంగ‌రం జారి, బుర‌ద‌లోప‌డి మాయ‌మైంది. షాట్ మ‌ధ్య‌లో ఉంగ‌రం కోసం వెత‌క‌లేని ప‌రిస్థితి. 'పోయింది.. నా ల‌క్కీ రింగ్ పోయింది' అని తీర్మానించుకుంది మాధ‌వి. ఆమెలో ఏడుపు త‌న్నుకొస్తోంది. కానీ బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా లోలోప‌లే దాన్ని అదిమిపెడుతూ అలాగే న‌టించింది. డైరెక్ట‌ర్‌, ఓకే.. క‌ట్ అని చెప్ప‌గానే, అప్పుడు భోరున ఏడ్చేసింది. "ఏమైంది ఏమైంది?" అంటూ డైరెక్ట‌ర్ ప‌రుగున వ‌చ్చి అడిగాడు. సంగ‌తి చెప్ప‌గానే అంద‌రూ ఉంగ‌రం కోసం బుర‌ద‌లో గాలించారు. ఒక తోటి న‌టికి ఆ ఉంగ‌రం దొరక‌డంతో హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకుంది మాధ‌వి. మ‌రోసారి 'అమావాస్య చంద్రుడు' సినిమా షూటింగ్ టైమ్‌లో బీచ్‌లో జారిపోయింది ఆ ఉంగ‌రం. హీరో క‌మ‌ల్ హాస‌న్ అది గ‌మ‌నించి, చ‌టుక్కుమ‌ని వంగి, ఉంగ‌రాన్ని ప‌ట్టుకున్నారు. లేకుండా ఆ ఉంగ‌రం స‌ముద్రంలో క‌లిసిపోయేదే! "చాలా థాంక్స్ క‌మ‌ల్‌గారూ.. చాలా చాలా థాంక్స్" అని ఆయ‌న చేతులు ప‌ట్టుకు ఊపేసింది మాధ‌వి.

శ్రీ‌దేవి చెల్లెలు శ్రీ‌ల‌త గురించి మీకు తెలీని నిజాలు!

  అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవికి ఒక చెల్లెలు ఉంద‌నీ, ఆమె పేరు శ్రీ‌ల‌త అనీ ఇప్ప‌టి త‌రంలో చాలామందికి తెలీదు. సినీ న‌టి మ‌హేశ్వ‌రిని శ్రీ‌దేవి సొంత చెల్లెలుగా చాలామంది పొర‌ప‌డుతుంటారు. మ‌హేశ్వ‌రి.. శ్రీ‌దేవికి క‌జిన్‌. బోనీ క‌పూర్‌ను పెళ్లాడి ముంబైలో సెటిల్ కావ‌డానికి ముందు చెన్నైలో ఉన్నంత కాలం శ్రీ‌ల‌త‌ అంటే శ్రీ‌దేవికి పంచ‌ప్రాణాలు. త‌న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ త‌న చెల్లెలేన‌ని ప‌లు సంద‌ర్భాల్లో శ్రీ‌దేవి చెప్పేవారు. రోజూ క‌నీసం ప‌దిసార్ల‌న్నా ఆ ఇద్ద‌రూ దెబ్బ‌లాడుకుని, అంత‌లోనే క‌లిసిపోయేవారు. ఇద్ద‌రూ భిన్న ధ్రువాల వంటివారు. ఏదైనా సినిమాలో శ్రీ‌దేవి మోడ్ర‌న్ డ్ర‌స్ వేసుకుంటే, త‌న‌కూ స‌రిగ్గా అలాంటి బ‌ట్ట‌లే కావాల‌ని వాళ్ల‌మ్మ రాజేశ్వ‌రి ద‌గ్గ‌ర ఏడుస్తూ మారాం చేసేది శ్రీ‌ల‌త‌. దాంతో అలాంటి బ‌ట్ట‌లు నేను వేసుకుంటేనే బాగుంటాయి, నువ్వు వేసుకుంటే బాగుండ‌వ‌ని చెల్లెల్ని మ‌రింత ఏడిపించేవారు శ్రీ‌దేవి. అలా అన్న వెంట‌నే ఇద్ద‌రి మ‌ధ్యా పెద్ద దెబ్బ‌లాట మొద‌ల‌య్యేది. శ్రీ‌దేవి న‌టించిన సినిమా ప్రొజెక్ష‌న్ వేస్తే అక్క‌చెల్లెళ్లిద్ద‌రూ వెళ్లేవారు. ఏదైనా ఎమోష‌న‌ల్ సీన్‌లో శ్రీ‌దేవి ఏడుస్తూ న‌టిస్తుంటే, ఆమె ప‌క్క‌న కూర్చొని "ఎందుకు త‌ల్లీ అలా ఏడుస్తున్నావ్‌?" అంటూ టీజ్ చేసేది శ్రీ‌ల‌త‌. వెంట‌నే శ్రీ‌దేవికి కోపం వ‌చ్చేసేది. మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్యా పోట్లాట మొద‌లు. ఏమైనా ఐదు నిమిషాల కంటే ఎక్కువ‌సేపు పోట్లాడుకొనేవాళ్లు కాదు. ఎందుకంటే మ‌రోసారి పోట్లాడుకోడానికి చాన్స్ ఉండాలి క‌దా! ప్ర‌తిరోజూ షూటింగ్ అయిపోయాక‌, రాత్రి ఎన్ని గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చినా, కాస్సేపు శ్రీ‌ల‌త‌తో మాట్లాడందే శ్రీ‌దేవికి నిద్ర‌ప‌ట్టేది కాదు. ఇద్ద‌రూ వీడియోలో రోజుకు రెండు సినిమాలు చూసేవారు. శ్రీ‌ల‌త‌కు న‌వ‌ల‌లంటే చాలా ఇష్టం. త‌ను చ‌దివిన ప్ర‌తి న‌వ‌ల గురించి అక్క‌తో చ‌ర్చించేది శ్రీ‌ల‌త‌. అయితే అక్క‌తో క‌లిసి షూటింగ్‌కు వెళ్ల‌డం అంటే ఆమెకు ఇష్టం ఉండేది కాదు. శ్రీ‌దేవే బ‌ల‌వంతంగా చెల్లెల్ని తీసుకువెళ్లేవారు. శ్రీ‌దేవి అమ్మ‌కూచి అయితే, శ్రీ‌ల‌త నాన్న‌కూచి. చిన్న‌ప్పుడు ఆ ఇద్ద‌రూ ఒక తెలుగు సినిమాలో అక్కాచెల్లెళ్లుగా న‌టించారు. ఒక‌సారి షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌న కుక్క‌పిల్ల‌ను షూటింగ్ లొకేష‌న్‌కు తెస్తేకానీ న‌టించ‌న‌ని మొండికేసింది శ్రీ‌ల‌త‌. అలా మారాం చేయ‌కూడ‌ద‌ని శ్రీ‌దేవి, వాళ్ల‌మ్మ ఎంత చెప్పి చూసినా ఫ‌లితం లేక‌పోయింది. ఇక లాభం లేద‌నుకొని కారు పంపించి, ఇంట్లో ఉన్న కుక్క‌పిల్ల‌ను తెప్పించాకే, షూటింగ్ జ‌రిగింది. శ్రీ‌ల‌త అంత మొండిఘ‌టం! త‌ను ఏది కోరితే అది జ‌ర‌గాల్సిందే!!  ఆ సినిమాలో శ్రీ‌ల‌త‌ను ఒకామె కొట్టే సీన్ ఉంది. ఆ షాట్‌లో శ్రీ‌దేవి కూడా ఉన్నారు. శ్రీ‌ల‌త‌ను కొట్ట‌బోయే ఆమె ఒక కొత్త న‌టి. రిహార్స‌ల్‌లో ఆమె స‌రిగా కొట్ట‌లేదు. దాంతో డైరెక్ట‌ర్‌, "ఏవ‌మ్మా, నీకు కొట్ట‌డం కూడా రాదా!" అని కేక‌లేశాడు. టేక్ తీసేట‌ప్పుడు ఆవిడ శ్రీ‌ల‌త‌ను లాగి కొట్టింది. ఆ దెబ్బ‌కు త‌ట్టుకోలేక శ్రీ‌ల‌త వెక్కి వెక్కి ఏడ్చేసింది. అది చూడ‌గానే శ్రీ‌దేవి క‌ళ్ల‌ల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. సీన్ ప్ర‌కారం ఆమె ఏడ‌వ‌కూడ‌దు. దాంతో ఆ సీన్‌ను మ‌ళ్లీ తీయాల్సి వ‌చ్చింది. శ్రీ‌దేవి నైలెక్స్ చీర‌లు ఎక్కువ‌గా ధ‌రించేవారు. శ్రీ‌ల‌త‌కు కాట‌న్‌, ఆర్గండీ చీర‌లంటే ఇష్టం. వాళ్లిద్ద‌రికీ ఎలాంటి బ‌ట్ట‌లు కొన్నా, ఇద్ద‌రికీ ఒకే రంగు బ‌ట్ట‌ల్నే కొనేవారు వాళ్ల‌మ్మ‌. ఈ విష‌యంలో ఆమె చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. శ్రీ‌దేవి ఔట్‌డోర్ షూటింగ్‌ల‌కు వెళ్లి, ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు చెల్లెలికి త‌ప్ప‌కుండా ఏదైనా కొని తీసుకువ‌చ్చేవారు. ఒక‌వేళ ఆమె మ‌ర్చిపోయి వ‌చ్చారంటే, శ్రీ‌ల‌త గొడ‌వ‌పెట్టేసేది. ఆ ఇద్ద‌రూ షేర్ చేసుకొనే ఒకే ఒక్క వ‌స్తువు.. మంచం! అవును. ఇద్ద‌రూ ఒకే మంచం మీద ప‌డుకొనేవారు. బోలెడు క‌బుర్లు చెప్పుకొని కానీ నిద్ర‌పోయేవారు కాదు. త‌ర్వాత కాలంలో సంజ‌య్ రామ‌స్వామి అనే వ్య‌క్తిని శ్రీ‌ల‌త పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే అక్కాచెల్లెళ్ల మ‌ధ్య ఆస్తి గొడ‌వ‌లు త‌లెత్తాయి. దాంతో ఇద్ద‌రూ చాలా కాలం మాట్లాడుకోలేదు. దాదాపు ద‌శాబ్ద కాలం పాటు ఆ ఇద్ద‌రికీ స‌రిగా మాట‌లు లేవ‌ని చెప్పుకొనేవారు. బోనీ క‌పూర్ చొర‌వ‌తో అక్క‌చెల్లెళ్లు తిరిగి ఒక‌ట‌య్యారు.  అక్క శ్రీ‌దేవి దుబాయ్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ బాత్‌ట‌బ్‌లో మృతిచెందిన టైమ్‌లో శ్రీ‌ల‌త కూడా అక్క‌డే ఉంది. అప్ప‌ట్లో శ్రీ‌దేవి మృతిపై ఆమె కొన్ని నిజాలు వెల్ల‌డిస్తుందంటూ ప్ర‌చారంలోకి వ‌చ్చింది కానీ, ఆ విష‌యంలో శ్రీ‌ల‌త మౌనంగానే ఉండిపోయింది.

కెరీర్ మొత్త‌మ్మీద చంద్ర‌మోహ‌న్‌లోని న‌టుడ్ని ఛాలెంజ్ చేసిన సీన్‌ అదొక్క‌టే!

  దాదాపు 600 సినిమాల్లో న‌టించిన చంద్ర‌మోహ‌న్ వాటిలో ఎన్నో మంచి పాత్ర‌లు చేశారు, ఆ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం పొందారు. అయితే ఇన్ని సినిమాల్లో ఆయ‌న బాగా క‌ష్ట‌ప‌డి, ఫ‌లితాల గురించి భ‌య‌ప‌డి చేసిన ఒక స‌న్నివేశం, బాగా ఇన్‌వాల్వ్ అయి చేసిన స‌న్నివేశం 'సిరిసిరిమువ్వ' సినిమాలో "రా దిగిరా దివినుంచి భువికి దిగిరా" పాట స‌న్నివేశం కావ‌డం గ‌మ‌నార్హం. ప్రేక్ష‌కులంద‌రికీ ఆ స‌న్నివేశం ఎంత‌టి అనుభూతిని ఇచ్చిందో, ఎంత‌గా క‌దిలించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమాని రూపొందించింది లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్‌. చంద్ర‌మోహ‌న్‌కు ఆ స‌న్నివేశాన్ని వ‌ర్ణిస్తూ ఆయ‌న‌, "ఈ పాట అద్భుతంగా కుదిరిందిరా. వేటూరి క‌ష్ట‌ప‌డి రాశారు. బాలు హృదయంతో పాడాడు. మ‌హ‌దేవ‌న్ గారు అద్భుతంగా స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. ఆ స‌న్నివేశం - హీరోలో నిస్స‌హాయ‌త‌, క‌చ్చ‌, త‌ను ఆరాధించే అమ్మాయిని బ‌లిప‌శువుగా దేవుడి ముందు అన్యాయం చేస్తుంటే, త‌న‌ని అర్థం చేసుకునేవారు ఒక్క‌రైనా లేరే అన్న బాధంతో ఎదురుగా దేవుడితో మొర‌పెట్టుకుంటూ, ఈ ఘోర‌కృత్యాన్ని నీవైనా ఆప‌లేవా? అని దేవుడ్ని ఛాలెంజ్‌గా అడ‌గటం." అని చెప్పారు. "నువ్వేం చెయ్యాలో నేను చెప్ప‌ను కానీ నాకేం ఎక్స్‌ప్రెష‌న్ కావాలో, ఎమోష‌న్ కావాలో చెబుతా. అందుక్కావాల్సిన ఎఫెక్టు నువ్వివ్వాలి. ఈ స‌న్నివేశం చూసిన‌వాళ్ల‌కు హృద‌యం పుల‌కించాలి. ఈ స‌మ‌స్య నీ స‌మ‌స్య‌గా నువ్వు ఫీల్ అవ్వాలి. పూర్తిగా పాత్ర‌లో అంత‌ర్లీన‌మై పోవాలి. అప్పుడే ఈ స‌న్నివేశం పండుతుంది. అప్పుడు ప్రేక్ష‌కులు కూడా ఈ స‌న్నివేశానికి తాదాత్మ్యం చెందుతారు." అని విశ్వ‌నాథ్ వివ‌రించిన‌ప్పుడు, చంద్ర‌మోహ‌న్‌లో ఎక్క‌డో ఉన్న ఆర్టిస్టును రెచ్చ‌గొట్టిన‌ట్లు అయ్యింది. విశ్వ‌నాథ్ ఇచ్చిన ప్రోత్సాహానికి, స్థ్యైర్యానికి చంద్ర‌మోహ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డి, ఆ సీనును ర‌క్తి క‌ట్టించ‌డానికి ఏం చేశారో, ఎలా చేశారో ఆయ‌న‌కే తెలీకుండా చేసేశారు. ఆ సినిమా వ‌చ్చి ద‌శాబ్దాలు గ‌డిచిపోయినా, ఇప్ప‌టికీ ఆ స‌న్నివేశాన్ని, అందులో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన అభిన‌యాన్ని జ‌నం మెచ్చుకుంటూనే ఉన్నారు. 'సిరిసిరిమువ్వ' త‌ర్వాత ఎన్నో సినిమాల్లో ఎన్నో పాట‌లు, ఎన్నో స‌న్నివేశాలు చేసినా, ఆ సినిమా ఇచ్చిన తృప్తి ఆయ‌న‌కు మ‌ళ్లీ రాలేదు. ఈ విష‌యాల‌ను ఓ సంద‌ర్భంగా ఆయ‌న పంచుకున్నారు.

మ‌హేశ్ త‌ల్లిగా న‌టించిన 'సీతామాల‌క్ష్మి' గురించి మీకు తెలీని విష‌యాలు!

  బాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్న ప‌లువురు తార‌లు ద‌క్షిణాదివారే. వారిలో తాళ్లూరి రామేశ్వ‌రి తెలుగింటి ఆడ‌ప‌డుచు. 'సీతామాల‌క్ష్మి'గా ఆమె తెలుగువారిని అల‌రించారు. అయితే తెలుగు చిత్ర‌సీమ కంటే హిందీ చిత్ర‌సీమ ఆమెను ఎక్కువ‌గా ఆద‌రించింది. ఆమె తొలిగా న‌టించింది హిందీ చిత్రంలోనే. ఆ సినిమా.. 'దుల్హ‌న్ వొహీ జో పియా మ‌న్ భాయే' (1977) పెద్ద హిట్‌. కొత్త‌మ్మాయి అయినా చాలా మంచి ఆర్టిస్ట్ అని రామేశ్వ‌రిని అంద‌రూ ప్ర‌శంసించారు. కొత్త‌లో చాలామందికి ఆమె తెలుగు ప్రాంతం నుంచి వ‌చ్చిన విష‌యం తెలీదు. హిందీ ఫీల్డులో టాలెంటుకే కానీ ప్రాంతీయ‌త‌కు గుర్తింపు ఉండ‌ద‌ని నిరూపించిన వారిలో రామేశ్వ‌రి ఒక‌రు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం కె. విశ్వ‌నాథ్ డైరెక్ష‌న్‌లో చంద్ర‌మోహ‌న్ జోడీగా 'సీతామాల‌క్ష్మి' (1978) సినిమా చేసి, ఒకే ఒక్క సినిమాతో తెలుగువారి హృద‌యాల్లో చిర‌స్థాయి స్థానం సంపాదించారు. అంతే కాదు, ఉత్త‌మ న‌టిగా నంది అవార్డునూ అందుకున్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) స్టూడెంట్ అయిన రామేశ్వ‌రి ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ది నెల‌ల నుంచే హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లుపెట్టాయి. న‌సీరుద్దీన్ షా ప‌క్క‌న‌ 'సున‌య‌న' చేస్తుండ‌గా ఆమె కంటికి దెబ్బ త‌గిలింది. దాని వ‌ల్ల 'అమ‌ర్ దీప్' అనే సినిమాలో నుంచి ఆమెను తీసేశారు. అప్పుడే 'ఆషా' అనే సినిమా చాన్స్ వ‌స్తే, కంటి ప‌రిస్థితి దృష్ట్యా దాన్ని వ‌ద్ద‌నుకున్నారు రామేశ్వ‌రి. కానీ ఆ సినిమా నిర్మాత ఆమె క‌న్ను బాగ‌య్యేదాకా వెయిట్ చేస్తాన‌ని చెప్పాడు. అందులో ఆమె జితేంద్ర స‌ర‌స‌న న‌టించారు. ఆ త‌ర్వాత అగ్ని ప‌రీక్ష‌, ఆద‌త్ సే మ‌జ్‌బూర్‌, ఆస్ ఔర్ ప్యాస్‌, అంధేరా ఉజాలా, వ‌క్త్ వక్త్ కీ రాత్‌, ప్ర‌తిభ‌, ద్రోహి, రోష్నీ లాంటి సినిమాలు రామేశ్వ‌రికి ఎంతో పేరు తెచ్చాయి. ఈ కాలంలో వ‌చ్చిన ప‌లు తెలుగు సినిమా అవ‌కాశాల్ని ఆమె వ‌దులుకున్నారు. కార‌ణం.. మొద‌ట్నుంచీ ఆమె ధ్యాస హిందీ సినిమాల మీదే ఉండేది. ఆ కోరిక‌తోనే ఆమె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లారు. త‌న‌కు న‌చ్చిన‌, మంచివి అనుకున్న సినిమాల‌ను సెల‌క్ట్ చేసుకొని, అవి చేస్తూ వ‌చ్చారు. ఆమె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో త‌న క్లాస్‌మేట్‌, ఫ్రెండ్ అయిన పంజాబీ న‌టుడు-నిర్మాత దీప‌క్ సేఠ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు కొడుకులు.. భాస్క‌ర‌ప్ర‌తాప్ సేఠ్‌, ప్రేమ్ సేఠ్‌. పిల్ల‌లు పుట్టాక వారిని పెంప‌కం చూసుకోవ‌డం కోసం సినిమాల‌కు దూర‌మైన రామేశ్వ‌రి, తిరిగి 2002లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2003లో మ‌హేశ్‌కు త‌ల్లిగా 'నిజం' సినిమా చేశారు. అందులో ఆమె న‌ట‌న అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంది. దానికంటే ముందు ఆమె చేసిన తెలుగు సినిమా 'చిన్నోడు పెద్దోడు' (1988). అందులో త‌న తొలి తెలుగు సినిమా క‌థానాయ‌కుడు చంద్ర‌మోహ‌న్ స‌ర‌స‌న న‌టించ‌డం గ‌మ‌నార్హం. తెలుగులో ఆమె హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాల్లోనూ ఆయ‌నే హీరో!  'నిజం' త‌ర్వాత నీల‌కంఠ డైరెక్ట్ చేసిన 'నంద‌న‌వనం 120 కిమీ', నారా రోహిత్ సినిమా 'రౌడీ ఫెలో' సినిమాల్లో న‌టించారు రామేశ్వ‌రి. అప్ప‌ట్లోనే జీ తెలుగులో ప్ర‌సార‌మైన 'అమెరికా అమ్మాయి' సీరియ‌ల్‌లో హీరోయిన్ త‌ల్లిగా న‌టించారు.

అకార‌ణంగా కోప్ప‌డ్డ భార‌తీరాజా.. మౌనం వ‌హించిన చిరంజీవి!

  వ్య‌క్తిగ‌తంగా చిరంజీవి ఎలాంటి వ్య‌క్తో చెప్ప‌డానికి 'ఆరాధ‌న' సినిమా సెట్స్‌పై జ‌రిగిన ఓ ఉదంతం నిద‌ర్శ‌నం. ద‌ర్శ‌కుడు భార‌తీరాజా విప‌రీత‌మైన కోపిష్ఠి. ప్ర‌తి చిన్న విష‌యానికీ ఆయ‌న‌కు చాలా త్వ‌ర‌గా కోపం వ‌చ్చేస్తుంటుంది. ఈ విష‌యం ఆయ‌న‌తో ప‌నిచేసిన ఆర్టిస్టుల‌కూ, సాంకేతిక నిపుణుల‌కూ బాగా తెలుసు. షూటింగ్ టైమ్‌లో ప‌ని ఒత్తిడి వ‌ల్ల ఏ చిన్న‌లోపం జ‌రిగినా భార‌తీరాజాకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చేస్తుంది. ఈ విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. త‌న‌లోని ఈ స్వ‌భావాన్ని మార్చుకోవ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా ఆయ‌న వ‌ల్ల కాలేదు. ఒక‌రోజు 'ఆరాధన' సినిమా షూటింగ్ నాగ‌ర్‌కోయిల్‌లో, మండుటెండ‌లో జ‌రుగుతోంది. ఆ రోజు ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా భార‌తీరాజా చాలా చిరాగ్గా, కోపంగా ఉన్నారు. ఆయ‌న‌లోని కోపంలో కొంత భాగం ఆ సినిమా హీరో అయిన చిరంజీవి మీద కూడా చూపించారు. అప్ప‌టికే చిరంజీవి తెలుగులో అగ్ర క‌థానాయ‌కుడి పొజిష‌న్‌లో ఉన్నారు. ఆ సినిమాకి నిర్మాత అల్లు అర‌వింద్‌. ఆ కార‌ణంగా, డైరెక్ట‌ర్ త‌న మీద చూపించిన కోపానికి ఆయ‌న‌ను పిలిచి, "అకార‌ణంగా నా మీద ఎందుకు కోప్ప‌డ్డారు?" అని అడ‌గ‌వ‌చ్చు. కానీ ఆరోజు ఆ ప‌రిస్థితిలో ద‌ర్శ‌కుడిని ఏమీ అన‌కుండా మౌనంగా ఉండిపోయారు చిరంజీవి. క‌నీసం ఎందుకు కోపంగా ఉన్నార‌ని కూడా భార‌తీరాజాను ఆయ‌న అడ‌గ‌లేదు. డైరెక్ట‌ర్ త‌న‌ను కోప్ప‌డ్డార‌న్న ఫీలింగ్‌ను ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌నీయ‌లేదు. అలాంటి స‌మ‌యాల్లో చిరంజీవి ప్ర‌ద‌ర్శించే స‌హ‌నం, ఓర్పు వ‌ల్లే ఆయ‌నను మెగాస్టార్ రేంజికి ఎదిగేలా చేశాయేమో!  ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంగా భార‌తీరాజా స్వ‌యంగా షేర్ చేసుకున్నారు. "ఉన్న‌త‌స్థాయికి చేరుకున్న వ్య‌క్తుల్లో అంత‌టి ఉదాత్త‌త‌, స‌భ్య‌త‌, సంస్కారం చాలా అరుదుగా చూడ‌గ‌లం. ఆయ‌న‌లో ఉన్న ఈ అరుదైన ల‌క్ష‌ణాలే ఆయ‌న‌ను చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌బెట్టాయ‌నేది నా న‌మ్మ‌కం. కొంత‌మంది న‌టుల్ని వ్యాప‌ర‌ప‌రంగా వారికున్న పాపులారిటీని బ‌ట్టి, మ‌రికొంత‌మంది న‌టుల్ని వారి బ‌హుముఖ ప్ర‌జ్ఞాపాట‌వాల్ని బ‌ట్టి, ఇంకొంత‌మంది న‌టుల్ని వారి న‌డ‌వడిక‌ను, స‌హ‌కార‌భావాన్ని బ‌ట్టి గౌర‌విస్తాం, ఆద‌రిస్తాం. కానీ చిరంజీవిని నేను లైక్ చెయ్య‌డానికీ, అభిమానించ‌డానికీ కార‌ణం.. వీట‌న్నింటినీ మించిన స‌హృద‌య‌త ఆయ‌న‌లో ఉండ‌ట‌మే." అని ఆయ‌న చెప్పారు.

బాల‌య్య సినిమాలో అజ‌య్‌కు ఒకే డైలాగ్‌.. "ఏంటో మ‌రి?"

  ఇంట‌ర్మీడియేట్‌లో ఉన్న‌ప్పుడే అజ‌య్‌కు సినిమా పిచ్చి ప‌ట్టుకుంది. దాంతో చ‌దువు మీద ధ్యాస క‌లుగ‌లేదు. ఎంసెట్‌లో అత‌నికి వ‌చ్చిన ర్యాంక్ చూసి వాళ్ల‌నాన్న కంగారుప‌డ్డారు. హైద‌రాబాద్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో సీటు రావ‌డం క‌ష్ట‌మ‌ని, డొనేష‌న్ క‌ట్టి నాగ‌పూర్ పంపించారు. ధ్యాస సినిమాల మీదే ఉండ‌టంతో అక్క‌డ ఎక్కువ రోజులు ఉండ‌లేక‌పోయాడు అజ‌య్‌. పైగా అక్క‌డి వాతావ‌ర‌ణం కూడా అత‌నికి స‌రిప‌డ‌లేదు. వాళ్ల నాన్న‌కు విష‌యం చెబితే, ఆయ‌న అర్థం చేసుకున్నారు. స‌రేన‌ని హైద‌రాబాద్ ర‌ప్పించారు. ఇక్క‌డ బీకామ్ చ‌దువుతూనే మ‌ధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సులో చేరాడు. కొంత కాలానికి బాల‌కృష్ణ సినిమా 'వంశోద్ధార‌కుడు'లో న‌టించే చాన్స్ వ‌చ్చింది. దాంతో అజ‌య్ సంతోషానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి. ఫ‌స్ట్ సినిమాలోనే బాల‌కృష్ణ‌తో న‌టించే చాన్స్ రావడంతో, దాని త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని క‌లలు క‌న్నాడు. ఫ్రెండ్స్ కూడా "భ‌లే చాన్స్ కొట్టేశావ్‌రా" అని అభినందించారు. షూటింగ్‌కు వెళ్ల‌గానే డైలాగ్ పేప‌ర్ తీసుకొని, డైలాగ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేసి, ఎంత పెద్ద డైలాగ్‌నైనా సింగిల్ టేక్‌లో చేసేయాలి అనుకున్నాడు. అంతేనా! హీరో బాల‌కృష్ణ‌కు డైలాగ్స్ విష‌యంలో గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని కూడా అనుకున్నాడు. సీన్‌లో న‌టించ‌డానికి ర‌మ్మ‌న‌మ‌ని క‌బురు. అక్క‌డికెళ్లాక త‌న‌కెంత సీన్ ఉందో తెలిసొచ్చింది. సింగిల్ డైలాగ్‌.. అది.. "ఏంటో మ‌రి?" ఇంతే! క్లోజ‌ప్ షాట్‌. ఎప్పుడు డైరెక్ట‌ర్ యాక్ష‌న్ అన్నారో, ఎప్పుడు క‌ట్ చెప్పారో అజ‌య్‌కు అర్థం కాలేదు. సీన్ అయిపోయింద‌న‌గానే ఉసూరుమంటూ ఇంటికొచ్చాశాడు. అత‌డ్ని చూడ‌గానే వాళ్ల‌మ్మ‌, "ఏరా ఎలా చేశావ్‌? ఎన్ని డైలాగులున్నాయ్‌?" అన‌డిగింది.  "ఏంటో మ‌రి?" అని ఊరుకున్నాడు అజ‌య్‌. "ఏడ్చిన‌ట్టే ఉంది. ఇదేం డైలాగ్‌రా" అని ఆమె కూడా న‌వ్వేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ 'ఖుషి' సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్‌తో న‌లుగురి దృష్టిలో ప‌డ్డాడు అజ‌య్‌. దాని త‌ర్వాత ఒక‌టొక‌టిగా అవ‌కాశాలొచ్చాయి. 'విక్ర‌మార్కుడు' సినిమాలో రాజ‌మౌళి ఇచ్చిన టిట్ల‌ర్ క్యారెక్ట‌ర్‌తో అజ‌య్ కెరీర్ మ‌లుపు తిరిగింది.

'ఖైదీ'లో ఆ క్యారెక్ట‌ర్‌ను మిస్ చేసుకున్న ప్ర‌భ‌! అది చేసుంటే కెరీర్ ఇంకో ర‌కంగా ఉండేదే!!

  ప‌దిహేను సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'నీడ‌లేని ఆడ‌ది' (1974) సినిమాలో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి, నాలుగున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా న‌టిగా రాణిస్తూ, మ‌రోవైపు న‌ర్త‌కిగా అమిత పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నారు ప్ర‌భ‌. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, మోహ‌న్‌బాబు లాంటి స్టార్స్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంలో దుర్యోధ‌నునిగా న‌టించిన ఎన్టీ రామారావుతో క‌లిసి చేసిన‌ "చిత్రం భ‌ళారే విచిత్రం.." పాట ఆమె కెరీర్‌లో మ‌ర‌పురానిదిగా నిలిచిపోయింది. అయితే త‌న స‌మ‌కాలీన తార‌లైన జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, రాధిక‌ త‌ర‌హాలో ఆమె స్టార్‌డ‌మ్‌ను అందుకోలేక‌పోయారు. కొన్ని అవ‌కాశాలు ఆమె ప్ర‌మేయం లేకుండా మిస్స‌వ‌డం వ‌ల్ల కూడా ఆ మేర‌కు ఆమె కెరీర్‌కు న‌ష్టం వాటిల్లింది. వాటిలో ముఖ్య‌మైంది చిరంజీవి 'ఖైదీ'. అవును. ఆ సినిమాలో సుమ‌ల‌త చేసిన డాక్ట‌ర్ సుజాత పాత్ర‌ను మొద‌ట ఆఫ‌ర్ చేసింది ప్ర‌భ‌కే. ఆ సినిమా యూనిట్ మెంబ‌ర్ ఒక‌త‌ను ఆ సినిమాలో ప్ర‌భ‌కు ఆఫ‌ర్ చేసిన క్యారెక్ట‌ర్‌కు ఒక‌రోజు షూటింగే ఉంటుంద‌నీ, క‌థ‌లో ఇంపార్టెన్స్ ఉండ‌ద‌నీ చెప్ప‌డంతో.. అలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం ఎందుక‌ని దాన్ని వ‌దిలేసుకున్నారు ప్ర‌భ‌. "కానీ ఆ త‌ర్వాతే తెలిసింది.. అది సెకండ్ హీరోయిన్ క్యారెక్ట‌ర్ అని. అది చేసుంటే అని ఇప్పుడు బాధ‌ప‌డ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని తెలుసు. కానీ ఒక‌రి కార‌ణంగా ఆ సినిమా మిస్స‌య‌వ‌డంతో కెరీర్‌లో చాలా న‌ష్ట‌పోయాను. అదే కేర‌క్ట‌ర్ చేసిన సుమ‌ల‌త‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. దాంతో పాటు ఆమెకు వ‌రుస‌గా చిరంజీవి స‌హా పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా అవ‌కాశాలు ల‌భించాయి. బ‌హుశా.. నేను పెద్ద సినిమాలు ఎక్కువ‌గా చెయ్య‌క‌పోవ‌డం వ‌ల్లే నా ఫ్రెండ్స్ జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, రాధిక అందుకున్న స్టార్‌డ‌మ్‌ను అందుకోలేక‌పోయానేమో." అని ఓ ఇంట‌ర్వ్యూలో అభిప్రాయ‌ప‌డ్డారు ప్ర‌భ‌.

రంభ‌, మాధ‌వి, రిచా: ఇండ‌స్ట్రీని వ‌దిలి అబ్రాడ్‌లో సెటిలైన తార‌లు!

  ఒకానొక కాలంలో ప్రేక్ష‌కుల హృద‌యాలను దోచుకొని, వారి క‌ల‌ల రాణుల్లాగా చ‌లామ‌ణీ అయిన అందాల తార‌లు ఎంద‌రో. ఇప్పుడు వారిలో కొంత‌మంది ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. త‌మ అందంతో, అభిన‌యంతో ఇండ‌స్ట్రీని ఏలిన వాళ్లు, కొంత‌కాలం త‌ర్వాత ఆ ఇండ‌స్ట్రీని వ‌దిలి, అభిమానుల‌కు ప్ర‌త్య‌క్షంగా క‌నిపించ‌నంత దూరం వెళ్లిపోయి, అబ్రాడ్‌లో సెటిల‌య్యారు. మాధ‌వి, మీనాక్షి శేషాద్రి, రంభ‌, శిల్పా శిరోద్క‌ర్‌, మ‌ల్లికా షెరావ‌త్‌, ప్రీతీ జింటా, రిచా గంగోపాధ్యాయ్ లాంటి తార‌లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు దేశాన్ని కూడా విడిచిపెట్టి విదేశాల్లో స్థిర‌ప‌డ్డారు. ఎవ‌రెవ‌రు ఎక్కడెక్క‌డ‌ సెటిల‌య్యారో ఓ లుక్కేద్దాం... మాధ‌వి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో 1980, 90ల‌లో హీరోయిన్‌గా రాణించి, కృష్ణ‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, అమితాబ్, రాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన మాధ‌వి పెళ్లి చేసుకొని, ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్పేసి, విదేశాల్లో స్థిర‌పడింది. ప్ర‌స్తుతం ఆమె యుఎస్ఎలోని న్యూజెర్సీలో భ‌ర్త రాల్ఫ్ శ‌ర్మ‌తో హాయిగా సంసార జీవితం గ‌డుపుతోంది. రాల్ఫ్ జ‌న్మ‌తః ఇండో-జ‌ర్మ‌న్‌. మ‌రో చ‌రిత్ర‌, ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌, చ‌ట్టానికి క‌ళ్లు లేవు, ఖైదీ, దొంగ మొగుడు, మాతృదేవోభ‌వ‌ లాంటి సినిమాలతో మాధ‌వి ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. మీనాక్షి శేషాద్రి బాలీవుడ్ 'దామిని'గా పేరుపొందిన మీనాక్షి శేషాద్రి కూడా 1980, 90ల కాలంలో అనేక సూప‌ర్‌హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించింది. తెలుగులో ఎన్టీఆర్ మూవీ 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌'లో మేన‌క‌గా, 'ఆప‌ద్బాంధ‌వుడు'లో చిరంజీవి జోడీగా న‌టించి ఆక‌ట్టుకుంది. 1995లో హ‌రీశ్ మ‌సూర్‌ను వివాహం చేసుకొనేనాటికి కెరీర్‌లో ఆమె అత్యున్న‌త స్థానంలో ఉంది. పెళ్ల‌య్యాక ఇండ‌స్ట్రీని వ‌దిలేసి, భ‌ర్త‌తో క‌లిసి యుఎస్ఎ వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఆమె టెక్సాస్‌లో నివాసం ఉంటోంది. రంభ‌ తెలుగులో కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ లాంటి అగ్ర‌హీరోల స‌ర‌స‌న ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల్లో న‌టించి, గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా పేరుపొందిన రంభ వివాహానంత‌రం సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసింది. కొన్నేళ్లుగా కెన‌డాలో నివాసం ఉంటోంది. ఎన్నారై బిజినెస్‌మ్యాన్ ఇంద్ర‌కుమార్‌ను పెళ్లాడిన ఆమెకు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కుమారుడు. శిల్పా శిరోద్క‌ర్‌ మోహ‌న్‌బాబు జోడీగా న‌టించిన 'బ్ర‌హ్మ‌'తో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది శిల్పా శిరోద్క‌ర్‌. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా అదే. ఆమె మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌కు స్వ‌యానా అక్క‌. బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్‌, గోవిందా లాంటి స్టార్స్ స‌ర‌స‌న న‌టించింది. 2000లో అప‌రేష్ రంజిత్‌తో వివాహం త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పి, దుబాయ్‌లో సెటిలైంది. ప‌ద‌మూడేళ్ల విరామంతో టీవీ షోస్‌లోకి అడుగుపెట్టింది. ప్రీతీ జింటా సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో వెంక‌టేశ్ జోడీగా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మ‌హేశ్ హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం 'రాజ‌కుమారుడు'లో ప్రిన్సెస్‌ ఆమే. ప్ర‌ధానంగా బాలీవుడ్ సినిమాల్లోనే న‌టించిన ఆమె చివ‌ర‌గా బాబీ డియోల్ స‌ర‌స‌న 'భ‌య్యాజీ సూప‌ర్‌హిట్' (2018) మూవీలో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఆమె భ‌ర్త జీన్ గుడ్ఎన‌ఫ్‌తో క‌లిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటోంది. మ‌ల్లికా షెరావ‌త్‌ 'మ‌ర్డ‌ర్' మూవీ ద్వారా ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయిన తార మ‌ల్లికా షెరావ‌త్‌. మొద‌ట డిల్లీకి చెందిన పైల‌ట్ క‌ర‌ణ్ సింగ్ గిల్‌ను పెళ్లాడి, ఆ వివాహాన్ని ర‌హ‌స్యంగా ఉంచింది. త‌ర్వాత అత‌నికి విడాకులిచ్చేసింది. 2017లో ఫ్రెంచ్ రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ సిరిల్లే ఆక్జెన్‌ఫాన్స్‌తో డేటింగ్ చేసింది. ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటూ, త‌న ల‌గ్జ‌రియ‌ల్ హౌస్ నుంచి ఫొటోల‌ను షేర్ చేస్తోంది. రిచా గంగోపాధ్యాయ్‌ ఢిల్లీలో పుట్టి, యుఎస్ఎలోని మిచిగాన్‌లో పెరిగి, అక్క‌డే చ‌దువుకున్న రిచా గంగోపాధ్యాయ్‌.. 'లీడ‌ర్' మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత వెంక‌టేశ్‌తో 'నాగ‌వ‌ల్లి', ర‌వితేజ‌తో 'మిర‌ప‌కాయ్‌', ప్ర‌భాస్‌తో 'మిర్చి' సినిమాలు చేసింది. నాగార్జున స‌ర‌స‌న న‌టించిన 'భాయ్' త‌ర్వాత సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టి, ఎంబీఏ చ‌ద‌వ‌డం కోసం 2013లో యుఎస్ఎకు తిరిగి వెళ్లిపోయింది. ఎంబీఏ చ‌దివేప్పుడు క్లాస్‌మేట్ జో లాంగెల్లాతో ప్రేమ‌లోప‌డి పెళ్లిచేసుకొని, అక్క‌డే స్థిర‌ప‌డిపోయింది. ఈ ఏడాది మేలో పండంటి కొడుకుకు జ‌న్మనిచ్చింది.

ఇర‌వైల్లో 90 ఏళ్ల వృద్ధురాలి పాత్ర‌.. సింగిల్ టేక్‌లో చేసిన‌ జీవిత‌!

  నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన 'జాన‌కి రాముడు' చిత్రంలో విజ‌య‌శాంతి, జీవిత హీరోయిన్లుగా న‌టించారు. ఏఎన్నార్‌-సావిత్రి క్లాసిక్ ఫిల్మ్ 'మూగ‌మ‌న‌సులు' త‌ర‌హాలోనే ఈ సినిమాను కె. రాఘవేంద్ర‌రావు రూపొందించారు. 'మూగ‌మ‌న‌సులు'లో జ‌మున చేసిన పాత్ర త‌ర‌హాలో 'జాన‌కి రాముడు'లోని జీవిత పాత్ర న‌డుస్తుంది. క‌థానుసారం 90 ఏళ్ల వృద్ధురాలిగా జీవిత క‌నిపిస్తారు. సినిమా ప్రారంభంలో హీరో హీరోయిన్ల పున‌ర్జ‌న్మ కోసం ఆమె ఎదురుచూస్తుంటుంది. ఆ పాత్ర మ‌ళ్లీ సినిమా క్లైమాక్స్‌లోనే క‌నిపిస్తుంది. ముస‌లిత‌నాన్ని మేక‌ప్ టెక్నిక్ ఉప‌యోగించి చూపిస్తారు. కానీ తొంభై సంవ‌త్స‌రాల వృద్ధులు ఎలా న‌డుస్తారు? ఎలా మాట్లాడ‌తారు?.. వారి ప్ర‌వ‌ర్త‌నాధోర‌ణి ఎలా ఉంటుంది?.. ఇవ‌న్నీ న‌టించి చూప‌డం ట్వంటీస్‌లో ఉన్న జీవిత లాంటి తార‌ల‌కు చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అప్ప‌టికి జీవిత‌కు ఆ త‌ర‌హా పాత్ర‌లు చేసిన అనుభ‌వం లేదు. వ‌య‌సుమీద ప‌డ్డ‌వాళ్లు యువ‌పాత్ర‌లు పోషించ‌గ‌ల‌రు. ఎందుకంటే వాళ్ల‌కు ప‌డుచుద‌నంలో ఎలా ఉంటారో అనుభ‌వ పూర్వ‌కంగా తెలుసు కాబ‌ట్టి. ఆ పాత్ర‌ను ఎలా చెయ్యాల‌నేది జీవిత‌కు అర్థం కాలేదు. ఎవ‌రూ ఇలా చెయ్యాల‌ని కానీ, అలా చెయ్యాల‌ని కానీ చెప్ప‌లేదు. ఔట్‌డోర్ షూటింగ్‌.. విప‌రీత‌మైన జ‌నం. యూనిట్‌లోని వారంతా ఎవ‌రి హ‌డావిడిలో వాళ్లున్నారు. ఒక‌వైపు స‌త్య‌నారాయ‌ణ‌, నాగార్జున‌, మోహ‌న్‌బాబు, విజ‌య‌శాంతి లాంటి పేరుపొందిన న‌టులున్నారు. జీవిత‌కు ఒక‌టే టెన్ష‌న్!! చివ‌ర‌కు డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావును ఎలా చెయ్యాల‌ని అడిగారు. "ఏముంద‌మ్మా ఇందులో. నువ్వ అన‌వ‌స‌రంగా ఆందోళ‌న ప‌డుతున్నావు గానీ.." అన్నారాయ‌న‌. "అదికాదండీ.. ఒక్క‌సారి మీరు యాక్ట్ చేసి చూపిస్తే బాగుంటుంది" అన్నారు జీవిత‌. స‌రేన‌ని ఆయ‌న ఒక‌సారి యాక్ట్ చేసి చూపించారు. ఆయ‌న ఎలా చేశారో అలాగే చేశారు జీవిత‌. ఆశ్చ‌ర్యం.. సెకండ్ టేక్ అవ‌స‌రం లేకుండానే సింగిల్ టేక్‌లోనే ఆ స‌న్నివేశాన్ని ఓకే చేశారు రాఘ‌వేంద్ర‌రావు. ఆ వృద్ధురాలి గెట‌ప్‌ స‌న్నివేశాల్ని రెండు రోజుల పాటు చిత్రీక‌రించారు. ఆ రెండు రోజులూ జీవిత ప‌డిన ఆందోళ‌న అంతా ఇంతా కాదు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్ స‌మ‌క్షంలో.. మోహ‌న్‌బాబును "ప‌ప్పారాయుడు" అని పిలిచిన జ‌నం!

  డైలాగ్ కింగ్‌గా మోహ‌న్‌బాబు పేరు తెచ్చుకున్నారు. ఎంత‌టి క్లిష్ట‌మైన డైలాగ్‌నైనా సునాయాసంగా చెప్ప‌డంలో విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు అగ్ర‌గ‌ణ్యులు. ఆయ‌న త‌ర్వాత డైలాగ్స్ చెప్ప‌డంలో మోహ‌న్‌బాబు అంత‌టి పేరును సంపాదించుకున్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమాల్లో.. ఆ ఇద్ద‌రిపై చిత్రీక‌రించిన స‌న్నివేశాల్లో వారు చెప్పిన డైలాగ్స్ అభిమానుల్ని అమితంగా అల‌రించాయి. అందుకు 'స‌ర్దార్ పాపారాయుడు', 'కొండ‌వీటి సింహం' చిత్రాలు నిద‌ర్శ‌నం.  'స‌ర్దార్ పాపారాయుడు' సినిమాలో మోహ‌న్‌బాబు చేసింది చిన్న‌పాత్రే అయినా ప్రేక్ష‌కుల హృద‌యాల‌పై అది ముద్రించుకుపోయింది. అందులో "ప‌ప్పారాయుడూ" అంటూ ఎన్టీఆర్‌ను మోహ‌న్‌బాబు సంబోధించే తీరు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఆ మూవీలో మోహ‌న్‌బాబు బ్రిటీష్ దొర పాత్ర‌లో క‌నిపించారు. "మా వంట‌లు చేసేవాడు భార‌తీ..యుడు, మా దీపాలు వెలిగించేవాడు భార‌తీ..యుడు, మా తోట‌మాలి భార‌తీ..యుడు, మా బ‌ట్ట‌లుతికేవాడు భార‌తీ..యుడు.." అంటూ ఆ పాత్ర‌కు త‌గిన ధోర‌ణిలో ఆయ‌న చెప్పిన డైలాగ్స్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ క‌లిసి న‌టించిన 'స‌త్యం శివం' సినిమాలోనూ మోహ‌న్‌బాబు న‌టించారు. ఆ సినిమాని నిర్మించింది ఎన్టీఆర్ అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. ఆ సినిమా షూటింగ్‌కు వైజాగ్ వెళ్లిన‌ప్పుడు, లొకేష‌న్ మార్పులో రామారావు, నాగేశ్వ‌ర‌రావు, మోహ‌న్‌బాబు ఒకే కారులో ప్ర‌యాణించారు. మోహ‌న్‌బాబు ముందు సీట్లో కూర్చుంటే, రామారావు, నాగేశ్వ‌ర‌రావు వెనుక సీట్లో కూర్చున్నారు. దారిలో ఒక‌చోట ఎందుక‌నో కారు ఆపించి మోహ‌న్‌బాబు కిందికి దిగారు. అప్పుడు అక్క‌డి జ‌నం ఆయ‌న‌ను చూసి, "ప‌ప్పారాయుడు.. ప‌ప్పారాయుడు" అని అర‌వ‌డం ప్రారంభించారు. ఆ పాత్ర అలా ప్ర‌జ‌ల జ్ఞాప‌కాల్లో మిగిలిపోయిదంటే.. అది ఆయ‌న డైలాగ్స్ చెప్పిన విధానం.. ఆ డైలాగ్స్‌ను అలా రాసి, తీసిన ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌తిభ! ఇదంతా చూసి ఆశ్చ‌ర్య‌పోయారు నాగేశ్వ‌ర‌రావు. ఆ త‌ర్వాత "ఏం.. వీళ్లంద‌రికీ డ‌బ్బులిచ్చావా.. ప‌ప్పారాయుడు.. ప‌ప్పారాయుడు అని నిన్నే పొగుడుతున్నారు" అని జోక్ చేశారు. ఎన్టీఆర్‌, మోహ‌న్‌బాబు న‌వ్వేశారు. అలా స‌న్నివేశాలు ఎంత క్లిష్ట‌మైన‌వి అయినా, ద‌ర్శ‌కుడి ఊహ‌ల‌కు త‌న ఊహ జోడించి న‌టించ‌డం అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్లే విల‌క్ష‌ణ న‌టునిగా మోహ‌న్‌బాబు కీర్తి సంపాదించారు.

సాయికుమార్ వాళ్ల‌మ్మ పుట్టింటి నేప‌థ్యం ఏమిటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

  న‌టునిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా సాయికుమార్‌కు ఉన్న పేరు ప్ర‌ఖ్యాతులు మ‌న‌కు తెలిసిందే. కంఠ‌మే ఆయ‌న‌కు మెయిన్ ఎస్సెట్‌. ఆ కంఠం తండ్రి పీజే శ‌ర్మ (పూడిపెద్ది జోగేశ్వ‌ర‌శ‌ర్మ‌) నుంచి ఆయ‌న‌కు వార‌స‌త్వంగా వ‌చ్చింది. ఆయ‌న కూడా న‌టుడు, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌. సాయికుమార్ చిన్న‌ప్ప‌ట్నుంచీ అమ్మ‌కూచి. అమ్మంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. సాయికుమార్ త‌ల్లి కృష్ణ‌జ్యోతికి మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌న్నా, పురాణాల‌న్నా ఎంతో గౌర‌వం. చిన్న‌ప్పుడు ఆర్థికంగా వారి కుటుంబం చాలా ఇబ్బందులు ప‌డింది. పిల్ల‌ల స్కూలు ఫీజులు కూడా తండ్రి పీజే శ‌ర్మ క‌ట్ట‌లేక‌పోయేవారు.  సాయికుమార్, ఆయ‌న పెద్ద‌చెల్లెలు స్కాల‌ర్‌షిప్పుల‌తోనే చ‌దువుకున్నారు. ఆయ‌నెప్పుడూ టెక్ట్స్ బుక్స్ కొనుక్కోలేదు. సీనియ‌ర్ల ద‌గ్గ‌ర బుక్స్ తెచ్చుకొని చ‌దువుకొనేవారు. క్యారేజీ తెచ్చుకోనివాళ్ల‌కు స్కూల్లో మ‌ధ్యాహ్నం పూట గోధ‌మ‌న్నం పెట్టేవాళ్లు. అది తిన‌లేక ఆయ‌న చెల్లి ఏడ్చేది. ఆయ‌న‌కూ ఆ తిండి ఇష్టం ఉండేది కాదు. ఇలాంటి క‌ష్టాల మ‌ధ్య ఆయ‌న‌కు ఊర‌ట అమ్మ చెప్పే క‌థ‌లే. ఆమె భార‌తంలోని క‌థ‌లు చెప్పేది. భాగ‌వ‌త ప‌ద్యాలు నేర్పించేది. ఒక్క మాట‌లో చెప్పాలంటే సాయికుమార్ వ్య‌క్తిత్వాన్ని తీర్చిదిద్దింది వాళ్ల‌మ్మ‌! అప్ప‌ట్లో పీజే శ‌ర్మ రైల్వే ఉద్యోగి. విజ‌య‌న‌గ‌రంలో ఉద్యోగం చేస్తున్న‌ప్పుడు అక్క‌డ జె.వి. సోమ‌యాజులు, జె.వి. ర‌మ‌ణ‌మూర్తి సోద‌ర‌లుతో క‌లిసి నాట‌కాలు వేసేవారు. న‌ట‌న‌మీద ఆస‌క్తితో మ‌ద్రాసు వెళ్లి సినిమాల్లో చిన్న‌చిన్న వేషాలు వేస్తుండేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 1959లో మ‌ద్రాసులో స్థిర‌ప‌డ్డారు శ‌ర్మ‌. ఇక సాయికుమార్ వాళ్ల‌మ్మ ఒక‌ప్పుడు మ‌హారాణిలా బ‌తికారు. వాళ్ల‌ది క‌ర్ణాట‌క‌లోని బాగేప‌ల్లి అనే ఊరు. ఆమె ముత్తాత‌లు మైసూరు రాజుల ద‌గ్గ‌ర ప‌నిచేశారు. పెళ్లి కాక‌ముందు ఆమె పోలో ఆడేవారు! పీజే శ‌ర్మ కోసం అన్నీ వ‌దులుకొని వ‌చ్చేశారు. ఆ ఇద్ద‌రినీ క‌లిపింది రంగ‌స్థ‌లం. ఒక‌సారి నాట‌క పోటీల్లో స్టేజిమీద కృష్ణ‌జ్యోతిని అనార్క‌లి వేషంలో చూసి ఇష్ట‌ప‌డ్డారు శ‌ర్మ‌. అదే పోటీల్లో వేరే నాట‌కంలో ఆయ‌న శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుగా న‌టించారు. ఇద్ద‌రికీ అప్పుడు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్ర‌ణ‌యంగా మారింది. దాంతో స్నేహితులంద‌రూ క‌లిసి వారి పెళ్లి జ‌రిపించారు.  ఆ దంప‌తుల‌కు మొద‌ట సాయికుమార్ పుట్టాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు.. మొత్తం ఐదుగురు సంతానాన్ని క‌న్నారు. పీజే శ‌ర్మ 81 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 2014 డిసెంబ‌రులో మృతి చెందారు.

'ముత్యాల ముగ్గు' హీరో శ్రీ‌ధ‌ర్ గురించి మీకు తెలీని నిజాలు!

  బాపు తీర్చిదిద్దిన‌ 'ముత్యాల ముగ్గు' హీరోగా శ్రీ‌ధ‌ర్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. త‌ర్వాత కాలంలో ఆ పాపులారిటీకి త‌గ్గ హీరో పాత్ర‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న దిగులు ప‌డ‌లేదు. న‌ట‌న‌ను ఒక వృత్తిగా భావించి, సాధ్య‌మైనంత వ‌ర‌కు దేన్నీ కాద‌న‌కుండా వ‌చ్చిన అవ‌కాశాల‌ను చేసుకుంటూ వెళ్లారు. అలా 200కు పైగా సినిమాల్లో న‌టించారు. తాగుడు, జూదం లాంటి వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండే కొద్దిమంది ఆర్టిస్టుల కోవ‌కు చెందే శ్రీ‌ధ‌ర్ డ‌బ్బు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌ప‌రుడు. సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుపెట్ట‌కుండా దూర‌దృష్టితో ఆలోచించి, ఆ డ‌బ్బును భూముల‌పై పెట్టుబ‌డిగా పెట్టారు.  శోభ‌న్‌బాబు త‌ర‌హాలోనే శ్రీ‌ధ‌ర్ కూడా త‌న పారితోషికం విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటార‌నే పేరు తెచ్చుకున్నారు. నిజానికి శోభ‌న్‌బాబు కంటే ముందు రియ‌ల్ ఎస్టేట్‌పై పెట్టుబ‌డులు పెట్టింది శ్రీ‌ధ‌ర్‌. అలాగే ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసేవారు. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆడంబ‌రాల‌కు చోటివ్వ‌కుండా చ‌నిపోయేంత‌వ‌ర‌కు నిరాడంబ‌రంగా జీవించారు. ఆయ‌న‌ పూర్తిపేరు సూర‌ప‌నేని శ్రీ‌ధ‌ర్‌. రంగ‌స్థ‌ల నుంచి సినిమాల్లోకి వ‌చ్చారు. కాలేజీ రోజుల నుంచే ప‌లు నాట‌కాలు ఆడుతూ వ‌చ్చారు. ఆర‌డుగుల పైగా పొడ‌గ‌రి కావ‌డం, స్ఫుర‌ద్రూపి అవ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. 'మంచుతెర' నాట‌కం ఆయ‌న‌కు బాగా పేరు తెచ్చింది. అందులో ఆయ‌నే హీరోగా న‌టించేవారు. 'అమెరికా అమ్మాయి' సినిమాలో హీరోగా వెలుగులోకి వ‌చ్చారు. 'ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా' పాట అప్ప‌ట్లో మంచి పాపుల‌ర్‌. జి. ఆనంద్ పాడిన ఆ పాట‌కు అభిన‌యించింది శ్రీ‌ధ‌ర్‌. ఇక బాపు సినిమా 'ముత్యాల ముగ్గు'తో ఆయ‌న‌కు వ‌చ్చిన పేరు ఎలాంటిదో మ‌న‌కు తెలుసు. శ్రీ‌ధ‌ర్ 2005 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చే క్ర‌మంలో అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాల‌ను ఇచ్చింది. అలా శ్రీ‌ధ‌ర్‌కు సైతం స్థ‌లం ల‌భించింది. దాదాపు ఫిల్మ్‌న‌గ‌ర్ సెంట‌ర్‌లో ఫిల్మ్‌చాంబ‌ర్ గేటుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఆయ‌న‌దే. చెన్నైలోనూ ఆయ‌న‌కు ప‌లు ఆస్తులున్నాయి. శ్రీ‌ధ‌ర్‌కు ముగ్గురు కుమార్తెలు. కొడుకులు లేరు. త‌న కుటుంబ‌స‌భ్యుల‌నెవ‌రినీ ఆయ‌న సినిమాల్లోకి రానివ్వ‌లేదు. 2007 జూలై 11న శ్రీ‌ధ‌ర్ క‌న్నుమూశారు.

చివ‌రి దాకా త‌న‌కు బ్ల‌డ్ కేన్స‌ర్ అని భార్యాపిల్ల‌ల‌కు చెప్ప‌ని పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌!

  క‌ట్టా సుబ్బారావు 30కి పైగా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోన‌సీమ‌లోని రాజోలుకు చెందిన ఆయ‌న ఒక‌ప్ప‌టి సుప్ర‌సిద్ధ ద‌ర్శ‌కులు కె. ప్ర‌త్య‌గాత్మ ద‌గ్గ‌ర 15 సంవ‌త్స‌రాల పాటు శిష్య‌రికం చేశారు. కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద జంట‌గా న‌టించిన‌ 'వియ్యాల‌వారి క‌య్యాలు' (1979) సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత ప‌దేళ్ల కాలంలో 30కి పైగా చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వాటిలో కోడ‌ళ్లొస్తున్నారు జాగ్ర‌త్త‌,  మొగుడు కావాలి, బంగారు బావ‌, గ‌డ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, కొంటె మొగుడు పెంకి పెళ్లాం, కాల‌రుద్రుడు, సీత పుట్టిన దేశం, మాంగ‌ల్య బంధం లాంటి సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, కృష్ణ‌, శ్రీ‌దేవి, రాధిక లాంటి తార‌ల‌తో 'వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు' లాంటి మ‌ల్టీస్టార‌ర్‌ను సైతం ఆయ‌న తీశారు. 1988 జూలై 3న మ‌ర‌ణించే నాటికి ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 49 సంవ‌త్స‌రాలు. లుకేమియా (బ్ల‌డ్ కేన్స‌ర్‌)తో బాధ‌ప‌డుతూ క‌ట్టా సుబ్బారావు క‌న్నుమూశారు. విచార‌క‌ర‌మైన విష‌యం ఏమంటే త‌న‌కు బ్ల‌డ్ కేన్స‌ర్ అనే విష‌యం భార్య స‌హా కుటుంబ స‌భ్యుల‌కు ఎవ‌రికీ తెలియ‌కుండా ఆయ‌న జాగ్ర‌త్త‌ప‌డ్డారు. వారికి అనుమానం రాకుండా మెడిసిన్స్ తీసుకుంటూ వ‌చ్చారు. అలాంటి ప‌రిస్థితుల్లోనూ షూటింగ్స్‌లో పాల్గొన్నారు.  ఆయ‌న‌కు సీరియ‌స్ అయ్యాకే వ్యాధి విష‌యం కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిసింది. అప్ప‌టికే ఆయ‌న‌ను కేన్స‌ర్ దాదాపుగా క‌బ‌ళించేసింది. మ‌ద్రాస్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ చివ‌రి శ్వాస విడిచారు సుబ్బారావు. ఆయ‌న‌కు ఐదుగురు కుమారులు. వారిలో శ్రీ‌క‌ర్‌ప్ర‌సాద్ తండ్రి బాట‌లో డైరెక్ట‌ర్ అయ్యారు.

మ‌ణిర‌త్నం క‌ల్ట్ ఫిల్మ్‌ 'నాయ‌క‌న్'.. రాధిక‌కు న‌చ్చ‌లేదు! ఎందుకంటే...

  క‌మ‌ల్ హాస‌న్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ మ‌ణిర‌త్నం రూపొందించిన 'నాయ‌క‌న్' (తెలుగులో 'నాయ‌కుడు' పేరుతో రిలీజ‌య్యింది) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డ‌మే కాకుండా, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అమితంగా పొందింది. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంత‌ర్జాతీయ స్థాయిలోనూ అనేక చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శిత‌మై, ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకుంది. క‌మ‌ల్‌కు బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు కూడా సాధించి పెట్టింది. కాల‌క్ర‌మంలో క‌ల్ట్ ఫిల్మ్‌గా, క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది నాయ‌క‌న్‌. అనేక‌మంది సినీ సెల‌బ్రిటీలు కూడా నాయ‌క‌న్‌ను మ‌ణిర‌త్నం తీసిన విధానానికి స‌లాం చేశారు. త‌మకు అత్యంత ఇష్ట‌మైన సినిమాల్లో ఒక‌టిగా ఆ సినిమాను పేర్కొన్నారు. అయితే ఒక పేరుపొందిన తార‌కు ఆ సినిమా న‌చ్చ‌లేదంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఆ తార మ‌రెవ‌రో కాదు.. 'స్వాతిముత్యం'లో క‌మ‌ల్ జోడీగా న‌టించిన రాధిక‌! అవును. 'నాయ‌క‌న్' రిలీజై, ఆడుతున్న కాలంలోనే ఆ మూవీపై త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు రాధిక‌. "సినిమాల్లో హీరో ప‌రంగా చూపే కొన్ని అంశాలు ప్రేక్ష‌కుల‌పై, ముఖ్యంగా యువ‌కుల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపే ఆస్కారం ఉంది. అందువ‌ల్ల సినిమాల్లో నాయ‌కుల ప‌రంగా వీలైనంత మంచినే చూపాల‌ని నా అభిప్రాయం. కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లో నాయ‌కుల‌ను చూపిస్తున్న ధోర‌ణి విప‌రీతంగా ఉంటోంది. ఇటీవ‌ల క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'నాయ‌కన్' చిత్రాన్నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే, అందులో న‌లుగురికి మంచి జ‌ర‌గ‌డానికి త‌ప్పు చేసినా ఫ‌ర్వాలేదు అనే ప‌ద్ధ‌తిలో స్మ‌గ్లింగ్ వంటి ప‌నులుచేసే హీరోను ధీరోదాత్తుడిగా చూపారు. ఆ విధంగా త‌ప్పుచేయ‌డం నాయ‌క ల‌క్ష‌ణం అని ఎక్కువ‌మంది అనుకోవ‌డానికి, త‌ద్వారా ప్ర‌మాద‌క‌ర‌మైన పెడ‌త్రోవ‌లు పట్ట‌డానికీ ఆస్కారం ఉంద‌న్న‌మాటేగా.. సినిమాల వ‌ల్ల మంచి జ‌ర‌గ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ ఇలా జ‌నాన్ని పెడ‌త్రోవ‌లు ప‌ట్టించే ధోర‌ణులు చూప‌కూడ‌ద‌ని నా దృఢ‌మైన అభిప్రాయం!" అని చెప్పుకొచ్చారు రాధిక‌.

సీన్ స‌రిగా చెయ్య‌ట్లేద‌ని ర‌జ‌నీకాంత్‌ను బాల‌చంద‌ర్ కొట్టారు!

  న‌టునిగా ర‌జ‌నీకాంత్‌కు గురువు లెజండ‌రీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అపూర్వ రాగంగ‌ళ్ (1975) మూవీతోటే న‌టునిగా తెర‌పై అడుగుపెట్టారు ర‌జ‌నీ. అంతేకాదు, బాల‌చంద‌ర్ సినిమాల‌తోటే ర‌జ‌నీకి ఎంతో పేరు వ‌చ్చింది. బాల‌చంద‌ర్‌కు సంతృప్తి క‌లిగేలా న‌టించాలంటే చాలా శ్ర‌ద్ధ‌గా కృషి చేయాలి. న‌ట‌న‌లో ఏమాత్రం చిన్న‌లోటు క‌నిపించినా ఆయ‌న‌కు చాలా చిరాకు, కోపం వ‌స్తాయి. బాగా న‌టిస్తే మాత్రం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ "వెరీగుడ్" అంటారు.  అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి త‌మిళంలో తొలిసారి క‌థానాయిక‌గా ఆయ‌న ద‌ర్శ‌క‌తంలోనే న‌టించారు. అప్పుడు ఆమె వ‌య‌సు ప‌ద‌మూడేళ్లు. ఆ చిత్రం పేరు 'మూండ్రు ముడిచ్చు' (1976). (తెలుగులో కె. విశ్వ‌నాథ్ రూపొందించిన‌ 'ఓ సీత క‌థ' (1973) ఆ చిత్రానికి ఆధారం). అందులో ర‌జ‌నీకాంత్ కూడా ముఖ్య పాత్ర‌ధారి ధ‌రించారు.  త‌మ ఇద్ద‌రిలో ఎవ‌రు ఎన్నిసార్లు న‌ట‌న‌కు బాల‌చంద‌ర్ చేత "వెరీ గుడ్" అనిపించుకుంటార‌నే పోటీ పెట్టుకున్నారు శ్రీ‌దేవి, ర‌జ‌నీ. ఆ పోటీలో శ్రీ‌దేవి గెలిచారు. అయితే బాల‌చంద‌ర్‌కు ఎంత కోపం అంటే ర‌జ‌నీకాంత్ ఒక స‌న్నివేశంలో బాగా న‌టించ‌లేద‌ని ఆయ‌న‌ను కొట్టేశారు కూడా! శ్రీ‌దేవి కూడా త‌క్కువ తిన‌లేదు. అందులో ఓ స‌న్నివేశానికి 13 టేకులు తీసుకున్నారు. 14వ టేకును డైరెక్ట‌ర్ ఓకే చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పుడూ శ్రీ‌దేవి ఓ సీన్‌కు అన్ని టేకులు తీసుకున్న సంద‌ర్భం రాలేదు. ఈ విష‌యాల‌ను ఓ సంద‌ర్భంలో శ్రీ‌దేవి స్వ‌యంగా చెప్పారు. ఈ సినిమాలో ర‌జ‌నీ కంటే శ్రీ‌దేవికే ఎక్కువ పారితోషికం ఇవ్వ‌డం ఇంకో విశేషం.

ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో తొలి సినిమాలోనే ఎన్టీఆర్ జోడీగా న‌టించిన‌ కె.ఆర్‌. విజ‌య‌!

  తెలుగులో కె.ఆర్‌. విజ‌య మొట్ట‌మొద‌టిసారిగా న‌టించిన చిత్రం 'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం' (1966). న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీ రామారావు సొంత సంస్థ రామ‌కృష్ణ ఎన్‌.ఎ.టి. వారు నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాకు ఎన్టీఆర్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో, ఆయ‌న స‌ర‌స‌న రుక్మిణిగా నాయిక పాత్ర‌లో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తారు కె.ఆర్‌. విజ‌య‌. మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్ట‌డ‌మే కాకుండా, క‌త్తిమీద సాము లాంటి పౌరాణిక పాత్ర‌లో న‌టించ‌డం సాహ‌స‌మే. అప్పుడామె వ‌య‌సు కేవ‌లం ప‌దహారేళ్లు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆయ‌న చెప్పిన‌ట్లుగా న‌టించి, ఆ పాత్ర‌కు న్యాయం చేకూర్చారు కె.ఆర్‌. విజ‌య‌. పౌరాణిక పాత్ర‌లు ధ‌రిస్తున్న‌ప్పుడు రామారావు నియ‌మ‌నిష్ఠ‌ల‌తో ఉండేవారు. ద‌ర్శ‌కునిగా న‌టీన‌టుల గెట‌ప్స్ ద‌గ్గ‌ర్నుంచి అన్నీ స్వ‌యంగా తామే చూసుకునేవారు. త‌మ‌కు ఏ విధ‌మైన ఎఫెక్ట్ కావాలో ముందే ఊహించుకొని, న‌టీన‌టుల‌కు తెలియ‌కుండానే వారి నుంచి ఆ ఎఫెక్టును రాబ‌ట్టుకునేవారు. ఆ త‌ర్వాత కాలంలో ప‌లు పౌరాణిక పాత్ర‌లు, దేవ‌త‌ల పాత్ర‌లు చేయ‌గ‌లిగారంటే దాని వెనుక ఎన్టీఆర్ ప్రేర‌ణ‌, 'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం'లో ప‌నిచేసిన అనుభ‌వం ఎంతైనా ప‌నికొచ్చింద‌ని కె.ఆర్‌. విజ‌య చెప్పేవారు. ఎన్టీఆర్‌తో ఆమె న‌టించిన మ‌రో మంచి సినిమా 'ఏక‌వీర‌' (1969). ఇందులో కాంతారావు, జ‌మున కూడా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. టైటిల్ రోల్ మాత్రం కె.ఆర్‌. విజ‌య‌దే. అప్పుడు ఆమె వ‌య‌సు ప‌ద్దెనిమిదేళ్లు. ఆ వ‌య‌సులోనే ఆమె ఒక బ‌రువైన‌, క్లిష్ట‌మైన పాత్ర‌ను పోషించ‌డం విశేషం. డైరెక్ట‌ర్ సి.య‌స్‌. రావు చెప్పింది చెప్పిన‌ట్లుగా చేసుకుంటూ వెళ్లారు. విడుద‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా ఈ సినిమాని చూసిన‌వాళ్లంతా చాలా బావుంద‌న్నారు. కానీ ఈ చిత్రం ఆర్థికంగా విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. అయితే కాల‌క్ర‌మంలో 'ఏక‌వీర' ఒక క్లాసిక్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. సంగీత‌ప‌రంగా, సంభాష‌ణ‌ల‌ప‌రంగా, న‌టీన‌టుల అభిన‌య‌ప‌రంగా ఈ సినిమాకు పెద్ద పేరు వ‌చ్చింది.

సినిమా హాల్లో పోకిరిరాయుడి చెంప ఛెళ్లుమ‌నిపించిన డిస్కో శాంతి!

  మ‌న‌దేశంలోని అమ్మాయిల‌కు పోకిరీ రాయుళ్ల బెడ‌ద ఈనాటి స‌మ‌స్య కాదు. అనాది నుంచీ ఉంది. న‌టి డిస్కో శాంతి కూడా ఈ స‌మ‌స్య‌ను ఓసారి ఎదుర్కొన్నారు. అప్ప‌టికి ఆమెకు శ్రీ‌హ‌రితో పెళ్లి కాలేదు. ఇంకా చెప్పాలంటే.. సినిమాల్లోకి రాలేదు. ఓసారి శాంతి, ఆమె చెల్లెలు సినిమా చూడ్డానికి వెళ్లారు. వాళ్ల వెనుక వ‌ర‌స‌లో ముగ్గురు ఆక‌తాయిలు కూర్చొని ఒక‌టే అల్ల‌రి చేస్తున్నారు. వారిలో ఒక‌డు సినిమా మొద‌ల‌య్యాక శాంతి భుజంమీద చెయ్యివేశాడు. వెన‌క్కి తిరిగి గుడ్లురిమి చూశారు శాంతి. చీక‌ట్లో ఆమె ఎంత కోపంగా చూసినా ఏం లాభం? ఇంకొంత సేప‌య్యాక ఆమె కాలిని ఎవ‌రో తొక్కిన‌ట్ల‌యింది. ఇక శాంతికి కోపం ఆగ‌లేదు. స‌రిగ్గా త‌న సీటు వెనుక‌వున్న వాడిని చెంప‌చెళ్లుమ‌నేలా కొట్టేశారు. దాంతో వాడు కెవ్వుమ‌ని కేక‌వేశాడు. అంతే.. అంతా క‌ల‌క‌లం. ప్రొజెక్ష‌న్ ఆపేసి థియేట‌ర్లో లైట్లు వేశారు. హాలువాళ్లు "ఏమైంది?" అని వ‌చ్చేస‌రికి జ‌రిగింది చెప్పారు శాంతి. ఆ ముగ్గురినీ అప్పుడంద‌రూ తిట్ట‌డం మొద‌లుపెట్టారు. శాంతి చేతుల్లో దెబ్బ‌తిన్న‌వాడి మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని శాంతి ప‌ట్టుప‌ట్టారు. "నువ్వు పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తావా అమ్మా?" అన్నారు థియేట‌ర్ వాళ్లు. శాంతి ఆ క్ష‌ణంలోనే బ‌య‌లురేరారు. థియేట‌ర్‌వాళ్లు ఆ ఆక‌తాయిల‌ను వెంట తీసుకురాగా ద‌గ్గ‌ర్లో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి కంప్లైంట్ రాసిచ్చారు శాంతి. ఆ త‌ర్వాతే ఇంటికి వెళ్లారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ ఆక‌తాయి కుర్రాడు ఏడుపు ముఖంతో శాంతి వాళ్ల ఇంటికి వ‌చ్చాడు. "నువ్వు నా చెల్లెలి లాంటి దానివి. ఇంకెప్పుడూ ఏ ఆడ‌పిల్ల‌నూ అల్ల‌రి పెట్ట‌ను. ద‌య‌చేసి పోలీస్ట్ స్టేష‌న్‌లో పెట్టిన కంప్లైంట్ వెన‌క్కి తీసుకో." అని ప్రాధేయ‌ప‌డ్డాడు. అత‌డి మాటల్లో నిజాయితీ, ముఖంలో దీన‌త్వం చూసి శాంతి స‌రేన‌ని, కంప్లైంట్ వెన‌క్కి తీసుకున్నారు. 

చిరంజీవి మెగాస్టార్ కావ‌డానికి దోహ‌దం చేసిన ల‌క్ష‌ణాలివే!

  మంచి న‌టుడు గొప్ప విజ‌యం సాధించ‌డం వెనుక ఎన్నో మంచి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌ళాకారుడిగా ఆ వ్య‌క్తిప‌డే త‌ప‌న స‌న్నిహితుల‌కే బాగా అర్థ‌మ‌వుతుంది. చిరంజీవి మెగాస్టార్‌గా, రెండు ద‌శాబ్దాల పాటు తిరుగులేని నంబ‌ర్‌వ‌న్ స్టార్‌గా టాలీవుడ్‌లో రాణించ‌డానికి ఆయ‌న‌లోని కొన్ని ల‌క్ష‌ణాలు దోహ‌దం చేశాయ‌ని ఆయ‌న ఒక‌ప్ప‌టి రూమ్మేట్‌, ఫ్రెండ్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో స‌హ‌విద్యార్థి నారాయ‌ణ‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు.  "చిరంజీవికి సంగీతం ఆరోప్రాణం. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న రోజుల్లోనే మ్యూజిక్‌పై విశేష‌మైన ఆస‌క్తి, డాన్స్ మీద ఎక్కువ ఏకాగ్ర‌త చూపేవారు. అందువ‌ల్లే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ర‌కం డాన్స్ వ‌స్తే వెంట‌నే నేర్చుకొని సినిమాల్లో వాటిని చేస్తూ అభిమాన‌గ‌ణాన్ని పెంచుకుంటూ పోయారు. డిస్కో డాన్స్ వ‌చ్చిన రోజుల్లో అంద‌రికంటే ముందు ఆ డాన్స్‌ను అభ్య‌సించి, సౌత్ ఇండ‌స్ట్రీలో డిస్కో డాన్స‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత బ్రేక్ డాన్స్ వ‌చ్చిన‌ప్పుడూ.. అంతే.. చిరంజీవి బ్రేక్ డాన్స్‌కు దాసోహ‌మైన వాళ్లెంద‌రో!" అని చెప్పారు నారాయ‌ణ‌రావు. "చిరంజీవిలో ఉండే మ‌రో విశిష్ట ల‌క్ష‌ణం భావుక‌త‌. క‌థ చెప్పిన ద‌గ్గ‌ర్నుంచీ ఆ క‌థ గురించి ఆలోచిస్తూ, త‌న పాత్ర‌ను అవ‌గాహ‌న చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తూ, ఆ సినిమా డైరెక్ట‌ర్‌, స్ర్కిప్ట్ రైట‌ర్‌తో పాటు త‌నూ కూర్చొని వాళ్ల‌కు మంచి మంచి స‌ల‌హాలు ఇస్తూ స‌మ‌గ్ర‌మైన క‌థ త‌యారుకావ‌డానికి ఎంత‌గానో దోహ‌దం చేస్తారు. చిరంజీవి కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్టుల‌తో తీసిన చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా, క‌ళాత్మ‌క విలువ‌లు ఉన్న‌తంగా ప్ర‌తిబింబించే చిత్రాల్లోనూ న‌టించారు. శిక్ష‌ణ పొందిన న‌టుడు క‌దా! ఆయ‌న ఎలాంటి పాత్ర‌ల‌కైనా స‌రిపోతారు. ఎంత బ‌ల‌మైన ఇమేజ్ ఉన్న హీరో అయినా క‌థ‌, ఆ క‌థా క‌థ‌నానికి అనుగుణంగా పాత్ర‌ను మ‌ల‌చ‌గ‌లిగే స‌మ‌ర్థుడ‌న ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో ఆ హీరో న‌టించిన‌ప్పుడు, అంత‌కుముందున్న ఇమేజ్ ప్ర‌మేయం లేకుండా ఆ పాత్ర ర‌క్తి క‌డుతుంద‌న‌డానికి 'స్వ‌యంకృషి' హిట్ట‌వ‌డ‌మే ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌." అంటారు నారాయ‌ణ‌రావు. ఆ త‌ర్వాత చిరంజీవి ఆరాధ‌న‌, రుద్ర‌వీణ‌, ఆప‌ద్బాంధ‌వుతుడు లాంటి చిత్రాల్లో ఆ త‌ర‌హా పాత్ర‌లు పోషించి, త‌న న‌ట‌న‌లోని విల‌క్ష‌ణ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. చిరంజీవిలో ఎంత ప‌రిశీలించినా నెగ‌టివ్ ధోర‌ణి అనేది క‌నిపించ‌దనేది నారాయ‌ణ‌రావు చెప్పే మాట‌. సెకండ్ ఇన్నింగ్స్‌ను చిరంజీవి ప్రారంభించిన తీరు కూడా ఆ విష‌యం స్ప‌ష్టం చేస్తుంది. మొద‌ట 'ఖైదీ నంబ‌ర్ 15'0 అనే అంత‌ర్లీనంగా మంచి మెసేజ్ మేళ‌వించిన క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేసి, ఆ త‌ర్వాత తొలినాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌వీరుల్లో ఒక‌రైన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో 'సైరా.. న‌ర‌సింహారెడ్డి' సినిమా చేసి, త‌నేమిటో చూపించారు. త్వ‌ర‌లో 'ఆచార్య‌'గా మ‌న‌ముందుకు రాబోతున్నారు.

'అన్న‌మ‌య్య‌'లో ఆ పాట రాయ‌డానికి 20 నిమిషాలు, తియ్య‌డానికి 2 గంట‌లు ప‌ట్టాయంతే!

  అక్కినేని నాగార్జున‌కు న‌టునిగా అఖండ‌మైన కీర్తి ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిన సినిమా 'అన్న‌మ‌య్య‌'. అంత‌దాకా రొమాంటిక్ హీరోగానో, యాక్ష‌న్ స్టార్‌గానో సినిమాల్లో క‌నిపిస్తూ వ‌చ్చి అటు యూత్‌లో, ఇటు అమ్మాయిల్లో ఎంతో ఇమేజ్ తెచ్చుకున్న నాగ్‌ను వాటికి పూర్తి భిన్న‌మైన భ‌క్తి పాత్ర‌లో చూపించ‌డం అతి పెద్ద సాహ‌సం. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, నాగార్జున క‌లిసి ఆ సాహ‌సం చేసి స‌క్సెస‌య్యారు. అదివ‌ర‌కు 'శివ' సినిమాతో ఒక ట్రెండ్ సృష్టించిన నాగార్జున‌.. 'అన్న‌మ‌య్య' సినిమాతో తెలుగు ప్రాంతాన్ని భ‌క్తి పార‌వశ్యంలో ముంచేశారు. ఈ సినిమాలో అన్న‌మ‌య్య ప్రేమించిన ఇద్ద‌రు భామ‌లు తిమ్మ‌క్క‌, అక్క‌ల‌మ్మ పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ‌, క‌స్తూరి న‌టించారు. త‌న ఇద్ద‌రు ర‌సాధిదేవ‌త‌ల‌కు అన్న‌మ‌య్య శృంగారార్చ‌న చేస్తే ఎలా ఉంటుంది? ఈ సంద‌ర్భానికి ఓ పాట ఉంటే బాగుంటుంద‌నుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. ఆ పాట‌ను వేటూరితో రాయించాల‌నుకున్నారు. కానీ ఆ టైమ్‌లో వేటూరి బాగా బిజీగా ఉండ‌టం వ‌ల్ల రాయ‌లేక‌పోయారు. అప్పుడు 'అన్న‌మ‌య్య' చిత్ర క‌థార‌చ‌యిత జె.కె. భార‌విని పిలిచి, ఈ పాట రాసే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. క‌థ‌కుడు త‌నే కాబ‌ట్టి ఆ పాట సంద‌ర్భం భార‌వికి తెలుసు. అందువ‌ల్ల‌ రాస్తాన‌న్నారు. పాట రూపం ఎలా ఉండాలో ఒక్క‌సారి ఆలోచించుకున్న భార‌వి కేవ‌లం 20 నిమిషాల్లో ఆ పాట‌ను రాసి రాఘ‌వేంద్ర‌రావుకు చూపించారు. ఆయ‌న‌కు న‌చ్చేసింది. వెంట‌నే మ‌ద్రాసులో ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణికి ఫోన్ చేసి పాట వినిపించారు భార‌వి. ఆ వెంట‌నే దాన్ని మ‌నో చేత పాడించి, రికార్డ్ చేయించేశారు కీర‌వాణి. ఆ మ‌రుస‌టి రోజే రెండే రెండు గంట‌ల్లో ఈ పాట‌ను చిత్రీక‌రించేశారు రాఘ‌వేంద్ర‌రావు. త‌న కెరీర్‌లోనే ఆయ‌న అత్యంత వేగంగా చిత్రీక‌రించిన పాట ఇదే! "ప‌ద‌హారు క‌ళ‌ల‌కు ప్రాణాలైన నా ప్ర‌ణ‌వ ప్ర‌ణ‌య దేవ‌త‌ల‌కు ఆవాహ‌నం.." అంటూ సాగే ఈ పాట‌ను నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, క‌స్తూరిపై చిత్రీక‌రించారు. తెర‌పై ఈ పాట‌ను చూస్తుంటే భక్తీ, ర‌క్తీ స‌మ‌పాళ్ల‌లో కుదిరాయి అనిపిస్తుంది. అందుకే శ్రోత‌ల హృద‌యాల్లో ఈ పాట ఇప్ప‌టికీ నిలిచివుంది.