ఇంటి అద్దె క‌ట్ట‌లేక బుల్లెట్ బైక్ అమ్ముకున్న‌ సూప‌ర్‌స్టార్‌!

  కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ అజిత్‌కు స్పోర్ట్స్‌ బైక్స్ అన్నా, స్పోర్ట్స్ కార్స్‌ అన్నా విప‌రీత‌మైన మోజు. అనేక రేసుల్లో అత‌ను స్వ‌యంగా పాల్గొన్నాడు కూడా. త‌న సినిమాల్లో సొంత బైకుల‌తో డూప్ లేకుండా అత‌ను ప‌లు సీన్లు చేశాడు. ఒక‌సారి ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల త‌న బుల్లెట్ బైక్‌ను అమ్మాల్సి వ‌చ్చింద‌నే విష‌యం మీకు తెలుసా? ఎ.ఆర్‌. మురుగ‌దాస్ డైరెక్ట్ చేసిన 'దీన' (2001) సినిమా అజిత్ కెరీర్‌కు గేమ్ చేంజ‌ర్ అయ్యింది. ఆ సినిమాతోటే ఫ్యాన్స్ ఆయ‌న‌కు 'త‌ల' అనే టైటిల్ ఇచ్చారు. నిజానికి, ఈ యాక్ష‌న్ ఫిల్మ్‌లో అత‌ను త‌న సొంత బుల్లెట్ బైక్‌ను ఉప‌యోగించాడు. 'దీన' మూవీలో అజిత్ అనుచరుల్లో ఒక‌డిగా న‌టించిన సంప‌త్ రావు ఆ బైక్ స్టోరీ గురించి చెప్తూ, ఇంటి అద్దెను కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితుల‌ను అజిత్ ఎదుర్కొన్నాడ‌నీ, అప్పుడు త‌న బైక్‌ను అమ్మాల్సి వ‌చ్చింద‌నీ వెల్ల‌డించాడు. అంటే ఒక‌ప్పుడు ఆర్థికంగా అజిత్ అంత‌టి క్లిష్ట ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నాడ‌న్న మాట‌. అలాంటి స్థితి నుంచి ఇవాళ దేశంలోని అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న స్టార్స్‌లో ఒక‌డ‌నే స్థాయికి అత‌ను ఎదిగాడు. వృత్తిప‌ర‌మైన విష‌యానికొస్తే, అజిత్ ప్ర‌స్తుతం 'వాలిమై' మూవీ చేస్తున్నాడు. ఇందులో తెలుగు యాక్ట‌ర్ కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, హుమా కురేషి నాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ప‌లు బైక్ చేజింగ్ సీన్ల‌ను అజిత్ చేస్తున్నాడు. 'నేర్కొండ పార్వై' ('పింక్' రీమేక్‌) త‌ర్వాత అజిత్‌, నిర్మాత బోనీ క‌పూర్‌, ద‌ర్శ‌కుడు హెచ్‌. వినోద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది.

క‌న్న త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా సినిమాల్లో చేరాల‌ని మ‌ద్రాస్ వెళ్లిన సిల్క్ స్మిత‌!

  మ‌హాన‌టి సావిత్రి మ‌ర‌ణంతో యావ‌త్ తెలుగు ప్రజానీకం ఎలాగైతే దుఃఖ సాగ‌రంలో మునిగిపోయిందో, ఒక వ్యాంప్ ఆర్టిస్ట్‌, శృంగార గీతాల‌తో ప్ర‌త్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న సిల్క్ స్మిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ప్పుడు కూడా అలాగే శోక స‌ముద్రంలో మున‌గ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. దాన్ని బ‌ట్టి స్మితను జ‌నం ఎంత‌గా ఆరాధించారో అర్థం చేసుకోవ‌చ్చు. 1996 సెప్టెంబ‌ర్‌లో మ‌ద్రాస్‌లోని త‌న నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చ‌నిపోయింది స్మిత‌. ఇప్ప‌టికీ జ‌నం ఆమెను మ‌ర‌వ‌లేదు.  స్మిత అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. ఏలూరు స‌మీపంలోని ఓ గ్రామంలో పుట్టింది. ఆమె త‌ల్లిదండ్రులు శ్రీ‌రామ‌మూర్తి, న‌ర‌స‌మ్మ‌. అయితే ఏలూరుకు చెందిన‌ అన్న‌పూర్ణ‌మ్మ అనే పిల్ల‌లులేని స‌మీప బంధువు విజ‌య‌ల‌క్ష్మిని ద‌త్త‌త తీసుకుంది. స్కూల్లో చ‌దువుకొనే రోజుల నుంచే విజ‌య‌కు సినిమాలంటే పిచ్చి. అది అన్న‌పూర్ణ‌మ్మ గుర్తించింది. చ‌క్క‌ని శ‌రీర సౌష్ట‌వం, మ‌త్తు క‌ళ్ల‌తో మ‌గాళ్ల‌ను చిత్తుచేసేట్లు ఉండే ఆమెను సినిమా ఫీల్డుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించింది. సినిమాల్లో న‌టిస్తే బాగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని ఆమె వినివుంది. అయితే అన్న‌పూర్ణ‌మ్మ ఊహించ‌ని విధంగా ఒక‌రోజు విజ‌య స్వ‌యంగా త‌న‌కు సినిమాల్లో న‌టించాల‌ని ఉంద‌నే కోరిక‌ను పెంపుడుత‌ల్లి ద‌గ్గ‌ర వ్య‌క్తం చేసింది. దాంతో త‌న ప‌ని ఈజీ అయిన‌ట్లు ఆనందించింది అన్న‌పూర్ణ‌మ్మ‌. ఆ ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కొని విజ‌య క‌న్న త‌ల్లిదండ్రుల‌కు కూడా చెప్ప‌కుండా ఏలూరులో మ‌ద్రాస్ మెయిల్ ఎక్కారు. మ‌ద్రాస్ వెళ్లాక ఎలాగో తంటాలుప‌డి జూనియ‌ర్ ఆర్టిస్టులా కొన్ని సినిమాలు చేసింది విజ‌య‌.  ఆమె రూపం త‌మిళ ద‌ర్శ‌కుడు విను చ‌క్ర‌వ‌ర్తిని ఆక‌ర్షించింది. భ‌విష్య‌త్తులో మంచి పేరు తెచ్చుకొనే తార అవుతుంద‌ని ఆయ‌న ఊహించాడు. ఆయ‌న భార్య కూడా ఆర్టిస్టే. విజ‌య‌కు న‌ట‌న‌లోని మెళ‌కువ‌లు నేర్పింది ఆమే. వారి స‌హ‌కారంతో 1979లో 'ఇన‌యేటేడి' అనే మ‌ల‌యాళం సినిమాలో జ‌నాల దృష్టిని ఆక‌ట్టుకొనే క్యాబ‌రే డాన్స‌ర్ కేర‌క్ట‌ర్ చేసింది. ఆమె వంపుసొంపులు, కైపు క‌ళ్ల‌కు ప్రేక్ష‌కులు చిత్త‌యిపోయారు. మ‌ల‌యాళంలో వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

హీరో కాక‌ముందు పీబీ శ్రీ‌నివాస్ క‌చేరీల్లో గిటారిస్ట్‌గా ప‌నిచేసిన భానుచంద‌ర్‌!

  సీనియ‌ర్ న‌టుడు భానుచంద‌ర్ కెరీర్ తొలినాళ్ల‌లో హీరోగా రాణించి, ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మంచి స్థానం పొందారు. ఆయ‌న తండ్రి దివంగ‌త మాస్ట‌ర్ వేణు ఒక‌ప్పుడు పేరుపొందిన సంగీత ద‌ర్శ‌కుడు. తోడికోడ‌ళ్లు, రోజులు మారాయి, మాంగల్య బ‌లం, సిరిసంప‌ద‌లు, ప్రేమించి చూడు, వింత కాపురం, మేలుకొలుపు లాంటి ప‌లు సినిమాల‌కు ఆయ‌న ర‌స‌గుళిక‌ల్లాంటి ప‌లు పాట‌ల‌ను కంపోజ్ చేశారు. త‌న‌లాగే త‌న కుమారుడు భానుచంద‌ర్ కూడా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావాల‌ని మాస్ట‌ర్ వేణు అనుకున్నారు. కానీ భానుచంద‌ర్ వాళ్ల‌మ్మ మాత్రం త‌న కుమారుడు తెర వెనుక ప‌నిచేసే టెక్నీషియ‌న్ కాకుండా తెర‌ముందు క‌నిపించే మంచి న‌టుడు కావాల‌ని ఆశించారు. భానుచంద‌ర్ త‌ల్లి ఆశ‌యాన్ని నెర‌వేర్చారు. అయితే న‌టుడు కాక‌ముందు ఆయ‌న గిటారిస్ట్‌గా ప‌నిచేశారు. ఆ రోజుల్లో మాస్ట‌ర్ వేణుకు అన్ని వాద్య ప‌రిక‌రాల‌పై మంచి ప‌ట్టు ఉంది కానీ, వెస్ట‌ర్న్ ఇన్‌స్ట్రుమెంట్ అయిన గిటార్‌పై ప‌ట్టు లేదు. అందుక‌ని భానుచంద‌ర్ గిటార్ వాయించ‌డం నేర్చుకున్నారు. "డాడీ నేను ఆర్‌.డి. బ‌ర్మ‌న్ లాగా మోడ‌రన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతా" అనేవారు తండ్రితో.  దాంతో ఆయ‌న కొడుకును ముంబైకి తీసుకెళ్లి ప్ర‌సిద్ధ సంగీత ద‌ర్శ‌కుడు నౌషాద్‌ ద‌గ్గ‌ర చేర్పించారు. నౌషాద్ అసిస్టెంట్ గులామ్ అలీ అప్పుడు క్లాసిక్ ఫిల్మ్ 'పాకీజా'కు మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే ఆ సినిమా పూర్తికాక‌ముందే ఆయ‌న చ‌నిపోతే, మిగ‌తా వ‌ర్క్ నౌషాద్ పూర్తి చేశారు. అప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా చేరారు భానుచంద‌ర్‌. ఆ సినిమా రీరికార్డింగ్‌కు నౌషాద్ పియానో వాయిస్తుంటే, ఆయ‌న ప‌క్క‌న నిల్చొని గిటార్ వాయించేవారు భానుచంద‌ర్‌. ఆయ‌న చెప్పిన నోట్స్ రాసేశారు.  అలా ఆరు నెల‌లు నౌషాద్ ద‌గ్గ‌ర చేశాక‌, తిరిగి మ‌ద్రాస్ వ‌చ్చేశారు. తండ్రి వేణు ట్రూప్‌లో గిటార్ వాయిస్తూ వ‌చ్చారు. ఆ టైమ్‌లో ప్ర‌ఖ్యాత‌ గాయ‌కుడు పీబీ శ్రీ‌నివాస్ బెంగ‌ళూరులో ఎక్కువ‌గా సంగీత క‌చేరీలు చేసేవారు. ఆ ట్రూప్‌లో గిటారిస్ట్‌గా భానుచంద‌ర్‌ను పిలిచేవారు. అలా పీబీ శ్రీ‌నివాస్ నిర్వ‌హించిన ప‌లు క‌చేరీల్లో భానుచంద‌ర్ గిటార్ వాయించారు. ఆ త‌ర్వాత ఆయ‌న గిటార్‌ను వ‌దిలేసి ముఖానికి మేక‌ప్ వేసుకొని న‌టుడిగా మారారు.

వాణిశ్రీ మొద‌ట్లో ర‌త్న‌కుమారి అనే పేరుతో న‌టించార‌ని మీకు తెలుసా?

  వాణిశ్రీ ఇండ‌స్ట్రీలోకి కామెడీ క్యారెక్ట‌ర్ల‌తో అడుగుపెట్టారు. హాస్య‌న‌టులు ప‌ద్మనాభం, రాజ‌నాల వంటి వారి స‌ర‌స‌న న‌టించారు. ఆమె అస‌లు పేరు ర‌త్న‌కుమారి. మొద‌ట ఆ పేరుతోటే న‌టించారు. 1962లో ఓ వైపు 'సోమ‌వార వ్ర‌త మ‌హాత్మ్యం' షూటింగ్ జ‌రుగుతూ ఉండ‌గా, ఆ చిత్ర క‌థానాయ‌కుడు కాంతారావు, విల‌న్ పాత్ర‌ల స్పెష‌లిస్ట్ రాజ‌నాల క‌లిసి 'అలెగ్జాండ‌ర్' నాట‌కం ప్ర‌ద‌ర్శించాల‌ని సంకల్పించారు. అందులో న‌టించ‌డానికి ర‌త్న‌కుమారి (వాణిశ్రీ‌)కి మేక‌ప్ వేయించి సెట్స్‌కు తీసుకువెళ్లారు.  'సోమ‌వార వ్ర‌త మ‌హాత్మ్యం' చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎం. కృష్ణ‌స్వామి స‌హ‌కారంతో మూవీ కెమెరాతో కొన్ని భంగిమ‌లు చిత్రీక‌రించి, ఆ త‌ర్వాత స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ నాగ‌రాజారావు చేత కొన్ని స్టిల్స్ తీయించారు. వాణిశ్రీ‌ని చూడ‌గానే కృష్ణ‌స్వామి, నాగ‌రాజారావు ఇద్ద‌రూ "ఈ అమ్మాయి సినిమాల‌కు ప‌నికిరాదు." అని తేల్చేశారు. ఆ త‌ర్వాత కొద్ది కాలానికే 'ర‌ణ‌భేరి' సినిమాలో కాంతారావు స‌ర‌స‌న హీరోయిన్‌గా వాణిశ్రీ‌ని, కీల‌క‌మైన వ్యాంప్ క్యారెక్ట‌ర్‌కు రాజ‌శ్రీ‌ని తీసుకున్నారు నిర్మాత‌లు. వ్యాంప్ క్యారెక్ట‌ర్ రాణిస్తేనే సినిమా రాణిస్తుంది. అందుక‌ని నిర్మాత‌ల‌తో చెప్పి రాజ‌శ్రీ‌ని హీరోయిన్‌గా చేసి, వాణిశ్రీ‌కి వ్యాంప్ క్యారెక్ట‌ర్ ఇప్పించారు కాంతారావు. అప్పుడంద‌రూ ఆయ‌న మీద అభాండాలు వేశారు. చిత్రం విడుద‌ల‌య్యాక ఆయ‌న జ‌డ్జిమెంట్ క‌రెక్ట‌ని ఒప్పుకున్నారు. ఆ త‌ర్వాత 'ఆకాశ‌రామ‌న్న' సినిమాలోనూ వ్యాంప్ క్యారెక్ట‌ర్ పోషించారు వాణిశ్రీ‌. ఎప్పుడూ వ్యాంప్ పాత్ర‌లేనా?.. అని ఆమె బాధ‌ప‌డేవారు. "వ్యాంప్ పాత్ర‌ల్లో కూడా నీకు నువ్వే సాటి. మ‌నం హీరో హీరోయిన్లుగా క‌లుసుకొనే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంది." అని కాంతారావు ఆమెకు స‌ర్దిచెప్పేవారు. ఆయ‌న చెప్పిన‌ట్లే, 'దేవుని గెలిచిన మాన‌వుడు' (1967) చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా చేశారు వాణిశ్రీ‌. ఆ వెంట‌నే కృష్ణ‌తో 'మ‌ర‌పురాని క‌థ‌'లో హీరోయిన్‌గా చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగింది చ‌రిత్ర‌. స్టార్ హీరోలంద‌రూ ఆమెనే త‌మ స‌ర‌స‌న నాయిక‌గా కావాల‌ని కోరుకొనే రేంజ్‌లో ఎదిగారు వాణిశ్రీ‌. మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత త‌రంలో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, అప్ప‌ట్లో ఆమె స్టైల్ ఐకాన్‌గా మారారు. వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ చీర‌లు, వాణిశ్రీ బొట్టు అంటూ ఆమె క‌ట్టు బొట్టూ ఫేమ‌స్ అయ్యాయంటే.. అది ఆమె ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం.

పిచ్చివాడి గెట‌ప్‌లో శుభ‌లేఖ సుధాక‌ర్‌.. పిచ్చివాడ‌నుకొని ఆపేసిన గూర్ఖా!

  వంశీ డైరెక్ట్ చేసిన క్లాసిక్ థ్రిల్ల‌ర్ 'అన్వేష‌ణ' షూటింగ్‌లో కొంత భాగం మ‌ద్రాస్‌లోని అడ‌యార్ ప్రాంతంలో ఉన్న స్నేక్ పార్క్ వెనుక‌వున్న అడ‌విలో జ‌రిపారు. ఆ సినిమాలో శుభ‌లేఖ సుధాక‌ర్ ఒక పిచ్చోడి పాత్ర ధ‌రించారు. స‌గం స‌గం పెరిగి చింద‌ర‌వంద‌ర‌గా ఉండే జుట్టు, బాగా మాసి సంస్కారంలేని గ‌డ్డం, మెడ‌లో ఒక తాయెత్తు, చిరిగిపోయిన నిక్క‌రు, చొక్కాతో క‌నిపిస్తారు. ఆ పాత్ర కోసం ఆయ‌న ప్ర‌త్యేకంగా గెడ్డాలు, మీసాలు పెంచారు. అంత‌కుముందు ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొని ప‌దిహేను రోజులైంది. అందుక‌ని పిచ్చోడి గెట‌ప్‌లో ఎలా న‌డిచారో, ఎలాంటి మేన‌రిజ‌మ్స్ చేశారో ఒక్క‌సారి గుర్తు తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నిస్తూ.. అదే మేన‌రిజ‌మ్స్‌, న‌డ‌క ప్రాక్టీస్ చేద్దామ‌ని షూటింగ్ స్పాట్ నుంచి కొంత‌దూరం న‌డుస్తూ వెళ్లారు. అక్క‌డ ఒక గూర్ఖా ఆయ‌న్ను చూసి "ఏయ్‌.. ఎవ‌రు నువ్వు?" అని వెన‌క నుంచి భుజంమీద చెయ్యివేసి కాల‌ర్ ప‌ట్టుకున్నాడు. "నేను సినిమా యాక్ట‌ర్‌ని. ఇక్క‌డ షూటింగ్ జ‌రుగుతున్న సినిమాలో న‌టిస్తున్నా. షూటింగ్ కోసం వ‌చ్చాను." అని చెప్పారు సుధాక‌ర్‌. ఆ గూర్ఖా న‌మ్మ‌లేదు. "ఏంటీ.. నువ్వు సినిమా యాక్ట‌ర్‌వా? ఏదీ మొహం.. నీలాంటి పిచ్చోళ్ల‌ని చాలామందిని చూశాను. వెళ్లు వెళ్లు.. బ‌య‌ట‌కు వెళ్లు." అని గేటు బ‌య‌ట‌కు పంపేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు, చొక్కా కాల‌ర్ ప‌ట్టుకొని. "నేను పిచ్చోడ్ని కాదు బాబోయ్‌. ఈ సినిమాలో నాది పిచ్చోడి వేషం.." అని ఎంత చెప్పినా ఆయ‌న మాట విన‌లేదు గూర్ఖా. షాట్‌కు టైమైపోతోంది. ఆ గూర్ఖా సుధాక‌ర్‌ను వ‌ద‌ల‌డం లేదు. ఉద‌యం ఏడున్న‌ర గంట‌ల‌కే లొకేష‌న్‌కు వ‌చ్చిన‌వాడ్ని తొమ్మిదైనా స్పాట్‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో డైరెక్ట‌ర్‌, కెమెరామ‌న్ ఇత‌ర యూనిట్ స‌భ్యులు సుధాక‌ర్ కోసం వెత‌క‌డం ప్రారంభించారు. ఆలోగా మేక‌ప్ చీఫ్‌, కాస్ట్యూమ్స్ చీఫ్‌, ఇంకా కొంత‌మంది యూనిట్ మెంబ‌ర్స్ ఆయ‌న ఉన్న‌చోటుకు వ‌చ్చారు. ఆయ‌న ప‌రిస్థితి చూసి ఆ గూర్ఖాకు న‌చ్చ‌చెప్పాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. అయినా లాభం లేక‌పోయింది. చివ‌ర‌కు ఆ చిత్ర నిర్మాత వ‌చ్చి గూర్ఖాకు న‌చ్చ‌చెప్పి, అత‌ని బారి నుంచి సుధాక‌ర్‌ను విడిపించారు. ఆ రోజు జ‌రిగిన ఆ సంఘ‌ట‌న త‌ల‌చుకుంటే ఒక‌విధంగా ఆయ‌న‌కు ఎంతో ఆనందం క‌లుగుతుంది. ఎందుకంటే త‌ను వేసుకున్న పిచ్చివాడి వేషం నిజంగా ఆయ‌న పిచ్చివాడే అనే భ్ర‌మ‌లో ఆ గూర్ఖాని ముంచేసిందంటే.. అంత స‌హ‌జంగా ఆ మేక‌ప్ కుదిరింద‌న్న మాట అనిపిస్తుంది ఆయ‌న‌కు.

ఎక్స్‌పైర్ అయిన 'పాస్‌'తో బ‌స్సెక్కిన జీవిత ఎలాంటి చిక్కుల్లో ప‌డ్డారు?

  జీవిత చెన్నైలోని ఆద‌ర్శ విద్యాల‌య‌లో చ‌దువుకున్నారు. 1983లో ప్ల‌స్ వ‌న్ చ‌దువుతున్న రోజులు. ప్ల‌స్ వ‌న్ యాన్యువ‌ల్‌ ఎగ్జామ్స్ చివ‌రి రోజున ఓ ఘ‌ట‌న జ‌రిగింది. అప్ప‌ట్లో జీవిత వాళ్ల ఇల్లు టి. న‌గ‌ర్‌లోని జి.ఎన్‌. చెట్టి రోడ్డులో ఉండేది. రోజూ బ‌స్సులో వెళ్లిరావ‌డానికి సీజ‌న్ టికెట్ తీసుకొనేవారు జీవిత‌. అయితే లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజే పాస్ డేట్ అయిపోయింది. ఒకే ఒక్క రోజు కోసం కొత్త పాస్ తీసుకోవ‌డం ఎందుకు.. దండ‌గ అనుకున్నారు. అదీగాక స్కూల్ టైమింగ్స్‌లో బ‌స్సులు ర‌ద్దీగా ఉంటాయి. అంచేత జ‌న‌ర‌ల్‌గా బ‌స్ కండ‌క్ట‌ర్లు ఆ టైమ్‌లో బ‌స్ పాసులు చెక్ చేసి పంచ్ చేస్తూ, మిగిలిన‌వాళ్ల‌కు టికెట్లు ఇవ్వ‌డం కొంచెం క‌ష్టం క‌దా అని, పాసులున్న వాళ్ల‌ను మీ పాసులు మీరే పెన్సిల్‌తోనో, పెన్‌తోనో పంచ్ చేసుకొమ్మ‌ని చెబుతుంటారు. ఆ కార‌ణంగా ఎవ‌రు చూడొచ్చార్లే అని ఆమె ధైర్యంచేసి ఎక్స్‌పైర్ అయిన పాస్ ప‌ట్టుకొని బ‌స్సెక్కేశారు. బ‌స్ కొంత‌దూరం వెళ్లాక కండ‌క్ట‌ర్ టికెట్లు ఇచ్చుకుంటూ జీవిత ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. టికెట్ అడిగాడు. పాస్ అని చెప్పి, ఎక్స్‌పైర్ అయిన పాస్‌ను అతినికి అందించారామె. అత‌ను పాస్ చూసి "ఇదేంట‌మ్మా నిన్న‌టితోటో ఎక్స్‌పైర్ అయిన పాసును చూపిస్తావ్‌. కొత్త పాస్ చూపించు." అని అడిగాడు. బిక్కుబిక్కుమంటూ "కొత్త పాస్ ఇంకా తియ్య‌లేదు." అని చెప్పారు జీవిత‌. రోజూ అమ్మాయిల‌ను ఏడిపించ‌డానికి బ‌స్సుల్లో వెంబ‌డించే కొంత‌మంది స్టూడెంట్ కుర్రాళ్లు గొల్లున న‌వ్వారు. కండ‌క్ట‌ర్ టికెట్ తీసుకొన‌మ‌ని తొంద‌ర‌చేయ‌డం ప్రారంభించాడు. ఆమె చేతిలో న‌యాపైసా లేదు. సాధార‌ణంగా స్కూలుకు వెళ్లేట‌ప్పుడు ఇంట్లో డ‌బ్బు అడిగి తీసుకెళ్లే అల‌వాటు ఆమెకు లేదు. టికెట్ తీసుకుంటేనే కానీ కండ‌క్ట‌ర్ ఒప్పుకోడు. టికెట్‌కు ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. వెన‌క నుంచి స్టూడెంట్ కుర్రాళ్లు ఎగ‌తాళి చేయ‌డం ఎక్కువైంది. అంతా ఆమెవైపే చూస్తున్నారు వింత‌గా. జీవిత‌కు త‌ల కొట్టేసిన‌ట్ల‌యింది. సిగ్గుతో కుంచించుకుపోయారు. ఏం చెయ్య‌డానికీ పాలుపోలేదు. ఈ చిక్కులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌ట‌మా? అని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. చివ‌ర‌కు మ‌ధ్య‌లో దిగిపోయి స్కూలుకు న‌డిచి వెళ్లిపోవ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికే స్కూల్ టైమ్ అయిపోవ‌చ్చింది. స‌రిగ్గా ఆ స‌మయంలో జీవిత వాళ్ల నాన్న‌గారి ఫ్రెండ్ ఒకాయ‌న‌, త‌ర్వాత స్టాపులో అదే బ‌స్సెక్కారు. ఆయ‌న‌ను చూడ‌గానే జీవిత‌కు ప్రాణం లేచొచ్చింది. వెంట‌నే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి జ‌రిగింది వివ‌రించి, డ‌బ్బులు అడిగి తీసుకొని టికెట్ కొన్నారు. స్కూలుకెళ్లి చివ‌రి ఎగ్జామ్ రాసి, రాయ‌పేట నుంచి జి.ఎన్‌. చెట్టి రోడ్డులో ఉన్న త‌మ ఇంటిదాకా న‌డిచి వ‌చ్చారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఎప్పుడు, ఎక్క‌డికి వెళ్లినా చేతిలో డ‌బ్బులు ప‌ట్టుకొని బ‌య‌ల్దేర‌డం అల‌వాటు చేసుకున్నారు జీవిత‌.

హీరోయిన్‌గా సెట్‌లోకి వ‌చ్చిన‌ తొలిరోజే న‌టించ‌న‌ని ఏడ్చేసిన సౌంద‌ర్య‌!

  సావిత్రి త‌ర్వాత అంత‌టి గొప్ప‌న‌టిగా అంద‌రి ప్ర‌శంస‌లూ పొందిన సౌంద‌ర్య ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది 'మ‌న‌వ‌రాలి పెళ్లి' (1993) సినిమాతో. కానీ నిజానికి ఆమె తొలి సినిమా అది కాదు. 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రానికి ర‌చ‌యిత అయిన త్రిపుర‌నేని మ‌హార‌థి కుమారుడు శ్రీ‌ప్ర‌సాద్ (చిట్టి) డైరెక్ట్ చేసిన 'రైతుభార‌తం' సౌంద‌ర్య తొలి చిత్రం. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఇండ‌స్ట్రీలో స‌మ్మె రావ‌డంతో, త‌ర్వాత వేరే కార‌ణాల‌తో చాలా కాలం ఆగిపోయి, 1994లో సౌంద‌ర్య 10వ సినిమాగా రిలీజ‌య్యింది. ఈ సినిమాలో కృష్ణ‌, భానుచంద‌ర్ అన్న‌ద‌మ్ములుగా న‌టించ‌గా, వారి స‌ర‌స‌న నాయిక‌లుగా వాణీ విశ్వ‌నాథ్‌, సౌంద‌ర్య న‌టించారు. మ‌హార‌థికి సౌంద‌ర్య వాళ్ల‌నాన్న స‌త్య‌నారాయ‌ణ స్నేహితుడు. ఆయ‌న క‌న్న‌డంలో ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా. ఆ ప‌రిచ‌యంతో సౌంద‌ర్య‌ను త‌మ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు మ‌హార‌థి. 1992 మార్చిలో షూటింగ్ మొద‌లైంది. తిరుప‌తికి స‌మీపంలోని ప‌ర‌కాల‌లో భానుచంద‌ర్ కాంబినేష‌న్‌లో సీన్ పెట్టారు. మొద‌టిరోజే వాళ్లిద్ద‌రికీ కొంచెం రొమాంటిక్ సీన్ పెట్టారు డైరెక్ట‌ర్ శ్రీ‌ప్ర‌సాద్‌. ఒక‌ట్రెండు షాట్‌లు అయ్యాక సౌంద‌ర్య ఏడ్వ‌డం మొద‌లుపెట్టారు. "నేను చేయ‌లేను. ఈ యాక్టింగ్ నాకు స‌రిప‌డ‌దు. వెన‌క్కి వెళ్లిపోతాను." అని గొడ‌వ చేశారు. డైరెక్ట‌ర్‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. మంచి అమ్మాయి, కేర‌క్ట‌ర్‌కు త‌గ్గ అమ్మాయి దొరికిందే.. చేయ‌నంటోందేమిటి అని ఆయ‌న బాధ‌! ఆమెను మామూలు మూడ్‌లోకి తీసుకురావ‌డం ఆయ‌న వ‌ల్ల కావ‌ట్లేదు. మ‌హార‌థి పెద్దాయ‌న కావ‌డంతో ఆమెను ఆ రొమాంటిక్ సీన్ చేయ‌మ‌ని చెప్ప‌లేక‌పోయారు. సౌందర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ‌దీ అదే స్థితి. కూతురికి ఏమ‌ని స‌ర్దిచెప్పాలో ఆయ‌న‌కు పాలుపోవ‌డం లేదు. అప్పుడు డైరెక్ట‌ర్ శ్రీ‌ప్ర‌సాద్ త‌న భార్యాపిల్ల‌ల‌ను లొకేష‌న్‌కు ర‌ప్పించారు. నెమ్మ‌దిగా సౌంద‌ర్య‌ను ఫ్యామిలీ వాతావ‌ర‌ణంలోకి తీసుకెళ్లి షూటింగ్ మూడ్ క్రియేట్ అయ్యేలా చేసి, "యాక్టింగ్ అంటే అంతేన‌మ్మా. డిఫ‌రెంట్ ఫ్ర‌మ్ లైఫ్‌. అది నిజం కాదు." అని స‌ర్దిచెప్పి, అప్పుడు త‌న‌కు కావాల్సిన వ‌ర్క్‌ను ఆమెనుంచి రాబ‌ట్టుకున్నారు. అలా తొలిరోజు షూటింగ్ చేశారు సౌంద‌ర్య‌!

బ‌ర్త్‌డే పార్టీలో రుచిగా ఉంద‌ని 10 కూల్‌డ్రింకులు తాగిన అర్జున్‌.. త‌ర్వాతేమైందంటే..!

  యాక్ష‌న్ కింగ్ అర్జున్ 'సింహ‌ద మారి సైన్య' (1981) అనే క‌న్న‌డ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ బ‌ళ్లారిలో జ‌రుగుతుండ‌గా, ఆయ‌న పుట్టిన‌రోజు వ‌చ్చింది. యూనిట్ మెంబ‌ర్స్ సెట్స్‌పై ఆయ‌న బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేశారు. అది తెలిసిన ప్రొడ్యూస‌ర్ ఇద్ద‌రు కొడుకులు ఆయ‌న‌కు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో వాళ్లు ఏం చేశారంటే ఓ కూల్‌డ్రింక్‌ను అర్జున్‌కు ఆఫ‌ర్ చేశారు. ఆయ‌న తాగారు. ఆ డ్రింక్ చాలా రుచిగా అనిపించింది. అదివ‌ర‌కు ఎన్నో కూల్‌డ్రింకులు తాగినా, అందులో ఉన్న 'టేస్ట్' ఇదివ‌ర‌కు క‌నిపించ‌లేదు. ఇదేదో చాలా బాగుందే అని వ‌ర‌స‌గా ప‌ది డ్రింకులు తాగేశారు. ఆ త‌ర్వాత త‌ను ఎక్క‌డున్నాడో తెలియ‌ని ప‌రిస్థితి. ఏదో తెలియ‌ని మైకం.. ఆనందం.. చాలా త‌మాషాగా ఉంది. అలాంటి స్థితిలో కారు ఎక్క‌బోయి కింద‌ప‌డ్డారు. ఆ సినిమాలో న‌టించిన మిత్రులు ఆయ‌న‌కు సాయంప‌ట్టి కారులో కూర్చోబెట్టారు. వారు బ‌స చేసిన హోట‌ల్ రూమ్‌కు చేరుకున్నారు. ఆ రోజు రాత్రంతా "నువ్వు పామువి" అంటే "నువ్వు జింక‌వి" అని, "నువ్వు ఏనుగువి" అంటే "నువ్వు కోతివి" అనీ.. ఇలా ఏక‌పాత్రాభిన‌యాలు చెయ్య‌డంతో స‌రిపోయింది. తెల్లారి తెలివి వ‌చ్చేస‌రికి బెడ్ కింద ఉన్నారు అర్జున్‌. ముందురోజు రాత్రి జ‌రిగిన ఘ‌ట‌న లీల‌గా గుర్త‌కువ‌చ్చి ఆశ్చ‌ర్య‌పోయారు.  ఆ త‌ర్వాత అర్జున్‌ మెల్లిగా ఆరా తీస్తే తెలిసిందేమంటే.. కూల్‌డ్రింక్‌లో విస్కీ క‌లిపి త‌న‌చేత తాగించార‌ని. అంత‌వ‌ర‌కూ మ‌త్తు పానీయాలంటే ఎర‌గ‌ని ఆయ‌న వాటిని రుచి చూసింది అప్పుడే. ఆ ఘ‌ట‌న‌ గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇప్ప‌టికీ త‌న‌లో త‌నే న‌వ్వుకుంటూ ఉంటారు అర్జున్‌.

వివాహితుడైన‌ ప్ర‌భుతో ఖుష్‌బూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డార‌నే విష‌యం తెలుసా?

  ఖుష్‌బూ కెరీర్‌ను అనూహ్య‌మైన మ‌లుపు తిప్పిన సంవ‌త్స‌రంగా 1991ను పేర్కొనాలి. ప్ర‌భు జోడీగా ఆమె న‌టించిన త‌మిళ చిత్రం 'చిన్న‌తంబి' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఇదే సినిమా త‌ర్వాత వెంక‌టేశ్‌-మీనా జంట‌గా 'చంటి' పేరుతో రీమేక్ అయి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. 'చిన్న‌తంబి'లో ఖుష్‌బూ న‌ట‌న త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అమితంగా అల‌రించింది. "ప్ర‌తి జిల్లాలో ఆ సినిమా స‌క్సెస్‌ను వేడుక‌లా జ‌రిపారు. నేను ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు వంద‌ల‌మంది ఫ్యాన్స్ నా పోస్ట‌ర్స్ ప‌ట్టుకొని, నా పేరుతో ఒక్క‌పెట్టున నినాదాలు చేశారు. నేను భ‌య‌ప‌డిపోయి, వెన‌క్కి తిరిగి ఎయిర్‌పోర్ట్‌లోకి ప‌రిగెత్తాను. ఆ త‌ర్వాతే వారంతా నా ఫ్యాన్స్ అనీ, నామీద ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికే వ‌చ్చార‌నీ అర్థ‌మైంది." అని గుర్తుచేసుకున్నారు ఖుష్‌బూ. ఆ త‌ర్వాత రోజుల్లో చెన్నై, బోట్ క్ల‌బ్‌లో ఉన్న ఖుష్‌బూ కొత్త ఇంటికి బ‌స్సుల్లో రావ‌డం ప్రారంభించారు అభిమానులు. వారు ఆమెకు గుడులు క‌ట్టారు. ర‌క్తంతో ఆమెకు ఉత్త‌రాలు రాసిన అభిమానులు ఎంద‌రో. బాల‌చంద‌ర్‌, భార‌తీరాజా లాంటి ద‌ర్శ‌కుల‌తో, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ల‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలు ఆమెకు ల‌భించాయి. ప్రొఫెష‌నల్‌గా ఇంత‌టి గ్రాండ్ స‌క్సెస్ చ‌విచూసిన ఖుష్‌బూ వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం సాఫీగా సాగ‌లేదు. వివాహితుడైన ఒక స్టార్‌తో ఆమె ప్రేమ‌లో ప‌డ్డారు. ప్ర‌భుతో ఆమె అనుబంధం గురించి ఇండ‌స్ట్రీ అంతా కోడై కూసింది. ప్ర‌భును ఆమె తొలిసారి క‌లిసిన స‌మ‌యంలో ఆమె తెలుగు, క‌న్న‌డ సినిమాల‌తో బాగా బిజీగా ఉన్నారు. ఒక‌సారి చెన్నైలోని డాక్ట‌ర్ నాయ‌ర్ రోడ్డు మీద నుంచి కారులో వెళ్తుండ‌గా, దేవ‌ర్ ఫిలిమ్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర‌ ఆమె మేక‌ప్‌మేన్‌కు ప్ర‌భు క‌నిపించాడు. అత‌డిని క‌ల‌వాల్సిందిగా మేక‌ప్‌మేన్ స‌ల‌హా ఇవ్వ‌డంతో, స‌రేన‌ని క‌లిసింది ఖుష్‌బూ. ఆ క‌ల‌యిక ఆమెకు ఓ మంచి పాత్ర‌ను చేసే అవ‌కాశం ఇచ్చింది. అదే స‌మ‌యంలో అత‌డితో ప్రేమ‌లో ప‌డ‌టానికీ దారితీసింది. 1989లో ప్ర‌భును తొలిసారి క‌లిస్తే, 1991లో 'చిన్న‌తంబి' చేసే స‌మ‌యంలో అత‌డిపై పిచ్చి ప్రేమ‌లో మునిగిపోయారు ఖుష్‌బూ. కానీ వారి వ్య‌వ‌హారం ప్ర‌భు కుటుంబానికి ఏమాత్రం రుచించ‌లేదు. 1993లో ఒక పాపుల‌ర్ త‌మిళ డైలీలో ఈ వార్త‌ను ఫ్రంట్ పేజీలో ప్ర‌చురించారు. అప్పుడంద‌రూ ఆమెను తిట్టేవారే, విమ‌ర్శించేవారే. ఒక చక్క‌ని సంసార జీవితంలో ఖుష్‌బూ నిప్పులు పోస్తోంద‌ని ఆడిపోసుకున్న‌వారే. ఆ క్ర‌మంలో ఆమెను ఏకంగా ఐదు సినిమాల నుంచి తొల‌గించారు. ఇండ‌స్ట్రీ ఆమె ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించింది. దాంతో ప్ర‌భుతో త‌న అనుబంధాన్ని తెంచేసుకుంది ఖుష్‌బూ. అలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆమెకు అండ‌గా నిలిచింది బాల‌చంద‌ర్‌, హీరో కార్తీక్ లాంటి అతి కొద్దిమందే.  ఏదేమైనా ఇప్పుడు ఖుష్‌బూ, ప్ర‌భు ఎవ‌రి సంసార జీవితాన్ని వారు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ‌డుపుతున్నారు. అంతేకాదు, ఒక‌రి కుటుంబాన్ని మ‌రో కుటుంబం గౌర‌విస్తూ వ‌స్తోంది కూడా. ప్ర‌భు ఇప్పుడు ఖుష్‌బూకు ఒక మంచి స్నేహితుడు. డైరెక్ట‌ర్ సి. సుంద‌ర్‌ను 2000 సంవ‌త్స‌రంలో పెళ్లి చేసుకున్నారు ఖుష్‌బూ. వాళ్ల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భు న‌టించాడు కూడా.

కేర‌ళ‌లో రూ. కోటి వ‌సూలు చేసిన తొలి తెలుగు డ‌బ్బింగ్ ఫిల్మ్ 'ఘ‌రానా మొగుడు'!

  మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌గా క‌లెక్ష‌న్ల‌లో ఇండ‌స్ట్రీ రికార్డ్ సృష్టించిన చిత్రం 'ఘ‌రానా మొగుడు' (1992). కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేయ‌గా, కె. దేవీ వ‌ర‌ప్ర‌సాద్ నిర్మించిన‌ ఈ మూవీతో అమితాబ్ బ‌చ్చ‌న్‌ను దాటి, దేశంలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అవ‌త‌రించారు చిరంజీవి. ఈ సినిమా మ‌ల‌యాళంలో 'హే హీరో' పేరుతో అనువాద‌మై రిలీజ‌య్యింది. అదివ‌ర‌కు కేర‌ళ‌లో కె. విశ్వ‌నాథ్ క్లాసిక్ 'శంక‌రాభ‌ర‌ణం' త్రివేండ్రంలో ఒకే థియేట‌ర్‌లో ఏడాది పాటు ఆడి సంచ‌ల‌నం సృష్టించింది. ఆ సినిమాని సంభాష‌ణ‌ల వ‌ర‌కు మ‌ల‌యాళంలో డ‌బ్ చేసి, తెలుగు పాట‌ల‌తో రిలీజ్ చేశారు.  'ఘ‌రానా మొగుడు' సినిమాకొస్తే.. అది ర‌జ‌నీకాంత్ బ్లాక్‌బస్ట‌ర్ మూవీ 'మ‌న్న‌న్‌'కు రీమేక్‌. అప్ప‌టికే 'మ‌న్న‌న్' మూవీ కేర‌ళ‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయ్యింది. దాంతో మొద‌ట 'ఘ‌రానా మొగుడు'ను మ‌ల‌యాళంలో డ‌బ్ చేయాల‌ని ఎవ‌రూ అనుకోలేదు. అయితే 'ఘ‌రానా మొగుడు'లో చిరంజీవి ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం, చేసిన డాన్సులు కేర‌ళ‌లోని పేరుపొందిన నిర్మాణ‌-పంపిణీ సంస్థ‌ సెవెన్ ఆర్ట్స్‌ అధినేత‌లైన విజ‌య్‌కుమార్, జ‌య్‌కుమార్‌ బ్ర‌ద‌ర్స్‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. వారికి ఈ సినిమాను మ‌ల‌యాళంలోకి డ‌బ్ చేస్తే బాగుంటుంది క‌దా అనే ఆలోచ‌న వ‌చ్చింది.  దాంతో 'ఘ‌రానా మొగుడు' మ‌ల‌యాళ అనువాద హ‌క్కులు తీసుకొని, ఆ భాష‌లోకి డ‌బ్ చేశారు. 'హే హీరో' అనే టైటిల్ పెట్టారు. ప‌బ్లిసిటీ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకొని, పేరుపొందిన తెలుగు సినీ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావుతో ట్రైల‌ర్‌ను క‌ట్ చేయించారు. 1994లో సినిమా రిలీజ‌య్యాక‌, అందులో చిరంజీవి చేసిన డాన్సుల‌పై కాంపిటిష‌న్ నిర్వ‌హించారు. మొద‌ట 12 ప్రింట్ల‌తో రిలీజ్ చేసిన 'హే హీరో' సూప‌ర్‌హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో, కొద్ది రోజుల త‌ర్వాత మ‌రో మూడు ప్రింట్ల‌ను విజ‌య్‌కుమార్ బ్ర‌ద‌ర్స్ పెంచారు. 50 రోజుల‌య్యేసరికి మొత్తం ప్రింట్ల సంఖ్య 21కి  చేరుకుంది. క‌లెక్ష‌న్ల విష‌యానికి వ‌స్తే కేర‌ళ‌లో ఫ‌స్ట్ ర‌న్‌లో రూ. కోటి వ‌సూలు చేసిన తెలుగు డ‌బ్బింగ్ ఫిల్మ్‌గా 'హే హీరో' (ఘ‌రానా మొగుడు) స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. చిరంజీవి స‌ర‌స‌న నాయిక‌గా న‌గ్మా న‌టించిన ఈ చిత్రంలో రావు గోపాల‌రావు, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, వాణీ విశ్వ‌నాథ్‌, బ్ర‌హ్మానందం, శ‌ర‌త్ స‌క్సేనా, ర‌మాప్ర‌భ కీల‌క పాత్ర‌లు పోషించారు. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చిన పాటలు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందాయి.

సురేశ్‌-న‌దియా పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలుసా?

  సినిమా ఇండ‌స్ట్రీలో ఆది నుంచీ ఒక ఆన‌వాయితీ ఉంది. అదేమంటే.. ఒక జంట న‌టించిన సినిమా స‌క్సెస్ అయ్యిందంటే వారికి హిట్ పెయిర్ అని పేరుపెట్టి, అదే జంట‌తో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించ‌డం. ఇది ఎంత‌వ‌ర‌కూ ఆరోగ్యం, అనారోగ్యం అనే మాట అటుంచితే దీనికి ముఖ్య కార‌ణం నిర్మాత‌లే. ప్రేక్ష‌కులు కూడా అదే జంట‌ను చూడ్డానికి ఇష్ట‌ప‌డి ఆ జంట కాంబినేష‌న్‌లో సినిమాలు రావాల‌ని కోరుకుంటారు. అదేవిధంగా సురేశ్‌, న‌దియా జంట‌గా న‌టించిన ఒక త‌మిళ చిత్రం స‌క్సెస్ కావ‌డంతో, వ‌రుస‌గా వారి కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. వాళ్లిద్ద‌రూ క‌లిసి ప్ర‌తి సినిమాలో కనిపిస్తుండ‌టం చూసి, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా లేని సంబంధాన్ని సృష్టించి, సురేశ్‌-న‌దియా పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇందులో అప్ప‌టి త‌మిళ ప‌త్రిక‌లూ భాగ‌మ‌య్యాయి. "నిజానికి మేమెప్పుడూ ఆ సంగ‌తి ఆలోచించ‌లేదు. ఆ ఉద్దేశం కూడా మాకు లేదు. కాక‌పోతే మేం మంచి స్నేహితులం. చాలా స‌న్నిహితంగా ఉంటాం." అని ఒక సంద‌ర్భంలో సురేశ్ వెల్ల‌డించారు. ఇలా వ‌దంతులు వ‌స్తున్నాయ‌నే ఉద్దేశంతో, అప్ప‌ట్నుంచీ సురేశ్ ఒకే హీరోయిన్‌తో న‌టించ‌కుండా ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్‌తో న‌టిస్తూ వ‌చ్చారు. న‌దియా కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ న‌టించే అవ‌కాశం వ‌చ్చినా, ఆయ‌న చేయ‌లేదు. ఇలా ప్ర‌చారంలోకి వ‌చ్చిన కొద్ది కాలానికే 1988లో శిరీష్ గాడ్‌బోలే అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుని, సినిమాల‌కు గుడ్‌బై చెప్పి, అమెరికా వెళ్లిపోయారు న‌దియా.

ఫొటో వెనుక క‌థ‌: 'అల్లూరి సీతారామ‌రాజు' కంటే ఆరేళ్ల ముందే ఆ పాత్ర‌లో కృష్ణ!

  'అల్లూరి సీతారామ‌రాజు' (1974) సినిమా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఎంత‌టి పేరు తెచ్చిందో, ఆయ‌న కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయిగా ఎలా నిలిచిందో మ‌న‌కు తెలుసు. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన మ‌న్యంవీరుడు సీతారామ‌రాజు పాత్ర‌లో కృష్ణ అద్భుతాభిన‌యం అశేష ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకొని, ఆయ‌న అభిమాన గ‌ణాన్ని ఎన్నో రెట్లు పెంచింది. అయితే సీతారామ‌రాజు పాత్ర‌ను ఆ సినిమాలో కంటే ఆరేళ్ల ముందుగానే మ‌రో సినిమాలో కృష్ణ పోషించారు. అది.. 'అసాధ్యుడు' (1968) సినిమా. హీరోగా మారిన మూడేళ్ల‌కు చేసిన ఆ సినిమాలో ఓ నృత్య రూప‌కంగా సీతారామ‌రాజు క‌థ వ‌స్తుంది.  సుప్ర‌సిద్ధ రంగ‌స్థ‌ల‌, సినీ న‌టుడు వ‌ల్లం న‌ర‌సింహారావు ప్ర‌ద‌ర్శించే 'అల్లూరి సీతారామ‌రాజు' నాట‌కం చూసి, ఉత్తేజితులైన కృష్ణ.. ఎలాగైనా ఆ పాత్ర పోషించాల‌ని త‌పించేవారు. 'అసాధ్యుడు' చిత్ర నిర్మాత, ప‌హిల్వాన్ అయిన నెల్లూరు కాంతారావు ద‌ర్శ‌కుడు వి. రామ‌చంద్ర‌రావుతో చ‌ర్చించి సినిమాలో సీతారామ‌రాజుకు సంబంధించిన ఒక ఎపిసోడ్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. సంగీత ద‌ర్శ‌కుడు టి. చ‌ల‌ప‌తిరావుతో త‌మ ఆలోచ‌న చెప్పారు. పాట రూపంలో సీతారామ‌రాజు క‌థ చెబితే బాగుంటుందని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.  ఆ పాట రాసే బాధ్య‌త‌ను మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌కి అప్ప‌గించారు. "తెల్ల‌దొర‌ల గుండెల‌ల్ల ఝ‌ల్లుమ‌నంగా" అంటూ ఉద్వేగ‌భ‌రితంగా సాగే పాట‌ను రాసిచ్చారు శ్రీ‌శ్రీ‌. చ‌ల‌ప‌తిరావు ట్యూన్ క‌ట్టిన ఆ ఏడు నిమిషాల పాట‌ను బి. గోపాలం, వ‌సంత బృందం ఆల‌పించారు. వ‌ల్లం న‌ర‌సింహారావు వ్యాఖ్యానం అందించ‌గా నృత్య రూప‌కంగా దాన్ని మ‌ల‌చారు. ఆ రూప‌కం చిత్రీక‌ర‌ణ‌కు ప‌ది రోజుల స‌మ‌యం ప‌ట్టింది. వేణుగోపాల్ కొరియోగ్ర‌ఫీ అందించిన ఆ రూప‌కం 'అసాధ్యుడు' చిత్రం మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. సీతారామ‌రాజుగా కృష్ణ ఆహార్యం ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. రూథ‌ర్‌ఫ‌ర్డ్‌గా ప్ర‌భాక‌ర్‌రెడ్డి న‌టించ‌గా, గిరిజ‌న యువ‌తిగా వాణిశ్రీ క‌నిపించారు. అనంత‌ర కాలంలో గొప్ప సినిమాటోగ్రాఫ‌ర్‌గా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించిన వి.ఎస్‌.ఆర్‌. స్వామికి ఇది తొలి సినిమా. ఆయ‌న ప్ర‌తిభా సామ‌ర్థ్యాలు ఎలాంటివో తొలి సినిమాలోనే మనం చూడొచ్చు. విశేష‌మేమంటే 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాకూ ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డం. అలాగే 'అసాధ్యుడు'లో సీతారామ‌రాజు నృత్య రూప‌కాన్ని రాసిన శ్రీ‌శ్రీ 'అల్లూరి సీతారామ‌రాజు'లో రాసిన "తెలుగువీర లేవ‌రా" పాట‌కు ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. 'అసాధ్యుడు' ద‌ర్శ‌కుడైన రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలోనే 'అల్లూరి సీతారామ‌రాజు' మొద‌లైంది. అయితే మ‌ధ్య‌లో ఆయ‌న అనారోగ్యం పాల‌వ‌డంతో కె.ఎస్‌.ఆర్‌. దాస్ స‌హ‌కారంతో తానే ఈ సినిమాను పూర్తి చేశారు కృష్ణ‌. అయితే రామ‌చంద్ర‌రావు మీద గౌర‌వంతో టైటిల్స్‌లో ఆయ‌న పేరే వేశారు.

సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ!

  శాంతిప్రియ గుర్తున్నారా? వంశీ డైరెక్ట్ చేసిన 'మ‌హ‌ర్షి' (1988) సినిమాలో చేసిన సుచిత్ర పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై, తొలి పాత్ర‌తోనే ఆక‌ట్టుకున్న న‌టి. ఆమె.. అప్ప‌టి స్టార్ హీరోయిన్ భానుప్రియ‌కు స్వ‌యానా చెల్లెలు. ద‌క్షిణాదితో పాటు, ఉత్త‌రాదితో కొంత‌కాలం త‌న గ్లామ‌ర్‌తో అల‌రించిన శాంతిప్రియ 27 ఏళ్లుగా సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూర‌మ‌య్యారు. చివ‌రిసారిగా ఆమె అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న 'ఇక్కే పే ఇక్కా' సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత ఏ భాష‌లోనూ ఆమె వెండితెర‌పై క‌నిపించ‌లేదు. మీకు గుర్తుందో, లేదో.. ఆమె 'సౌగంధ్' (1994) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సంద‌ర్భ‌వ‌శాత్తూ ఆ సినిమాతోటే అక్ష‌య్ కుమార్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు!  1969 సెప్టెంబ‌ర్ 22న రాజ‌మండ్రిలో పుట్టారు శాంతిప్రియ‌. 18 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'ఎంగ ఊరు పాట్టుక‌ర‌న్' (1987) అనే త‌మిళ చిత్రంతో ఆమె చిత్ర‌రంగ ప్ర‌వేశం చేశారు. అందులో ఆమె రామ‌రాజ‌న్‌తో న‌టించారు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌ర‌మే 'మ‌హ‌ర్షి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. త‌మిళంలో నిశాంతి పేరుతో, తెలుగు, హిందీ భాష‌ల్లో శాంతిప్రియ పేరుతో ఆమె న‌టించారు. 1995లో ఆమె 'బాజీగ‌ర్' ఫేమ్ సిద్ధార్థ్ రేను వివాహం చేసుకున్నారు. కానీ 2004లో సిద్ధార్థ్ మృతి చెంద‌డం బాధాక‌రం. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కొడుకులు.. శుభ‌మ్‌, శిష్య‌. భ‌ర్త మ‌ర‌ణానంత‌రం వారిని త‌నే పెంచుతూ వ‌చ్చారు శాంతిప్రియ‌. 'మ‌హ‌ర్షి' చిత్రం త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు హీరోగా ప‌రిచ‌య‌మైన 'సింహ స్వ‌ప్నం'లో ఆమె నాయిక‌గా న‌టించారు. ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌తో 'య‌మ‌పాశం', 'శిలాశాస‌నం', నాగార్జున‌తో 'అగ్ని', ర‌మేశ్‌బాబుతో 'క‌లియుగ అభిమ‌న్యుడు', న‌రేశ్‌తో 'జ‌స్టిస్ రుద్ర‌మ‌దేవి' లాంటి చిత్రాలు చేశారు. 'సౌగంధ్‌'తో బాలీవుడ్‌లోకి వెళ్లాక‌, ఆమె మ‌ళ్లీ తెలుగులో న‌టించ‌లేదు. హిందీలో అక్ష‌య్ కుమార్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, స‌న్నీ డియోల్ స‌ర‌స‌న న‌టించారు. వివాహానంత‌రం సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన ఆమె, 'విశ్వామిత్ర‌', 'ఆర్య‌మాన్‌', 'మాతా కీ చౌకీ', 'ద్వార‌కాధీష్ - భ‌గ‌వాన్ శ్రీ‌కృష్ణ' త‌దిత‌ర సీరియ‌ల్స్ చేశారు. 2012 త‌ర్వాత టెలివిజ‌న్‌కు కూడా స్వ‌స్తి ప‌లికారు. కొద్ది కాలంగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూ వ‌స్తున్నారు శాంతిప్రియ‌. అప్పుడ‌ప్పుడు త‌న కొడుకుల ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తాను న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ‌డానికి రెడీగా ఉన్నాన‌ని చెప్పారు. "ఇప్పుడు నేను ప‌ని, మ‌రింత ప‌ని కోసం ఎదురుచూస్తున్నాను. మంచి న‌టిగా ప్రూవ్ చేసుకోవాల‌ని ఇప్ప‌టికీ త‌పిస్తున్నాను. ఒక న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నాను." అని ఆమె తెలిపారు. చూద్దాం.. తెలుగు ద‌ర్శ‌కులు కూడా ఆమెకు అవ‌కాశాలు ఇస్తారో, లేదో...

ఉత్త‌ర కొరియా నుంచి గీత ఉత్త‌మ‌న‌టి అవార్డు అందుకున్నార‌ని మీకు తెలుసా?!

  ఒక‌ప్పుడు గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా తెలుగు సినిమాల్లో రాణించారు గీత‌. కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన ఆమెకు ఒక్క‌సారిగా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ఆమె తెలుగు సినిమాల్లో క‌నిపిస్తూ వ‌చ్చారు. అయితే మిగ‌తా ద‌క్షిణాది భాష‌ల్లో మాత్రం ఆమెకు అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. విశేష‌మేమంటే.. మ‌న‌దేశం నుంచి అవార్డు అందుకోవ‌డాని కంటే ముందు ఆమె ఓ అంత‌ర్జాతీయ అవార్డును అందుకున్నారు. అదీ.. ఉత్త‌ర కొరియా నుంచి!  ఆరోజు గీత జీవితంలో మ‌ర‌పురాని రోజు. మ‌ద్రాసులోని ఉత్త‌ర‌కొరియా కాన్సులేట్ కార్యాల‌యాధికారి వాళ్ల ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్‌లో ఆయ‌న‌, "ఉత్త‌ర కొరియాలో ఈ మ‌ధ్య ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ జ‌రిగింది. ఇలా ఇత‌ర దేశాల చ‌ల‌న‌చిత్రాల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించ‌డం మా దేశంలో ఇదే మొద‌టిసారి. ఈ విదేశీ చ‌ల‌న‌చిత్రాల్లో భార‌త‌దేశం నుంచి వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం 'పంచాగ్ని'ని ప్ర‌ద‌ర్శించాం. ఆ చిత్రంలో న‌టించిన మిమ్మ‌ల్ని ఉత్త‌మ‌న‌టిగా ఎన్నుకున్నారు. ఈ అవార్డుల‌కై ప్ర‌త్యేకంగా మేం ఎలాంటి స‌భ‌నూ ఏర్పాటుచేయ‌డం లేదు. అందువ‌ల్ల ఆ అవార్డును మీ ఇంటికి పంపే ఏర్పాటు చేస్తున్నాం." అని చెప్పారు. చెప్పిన‌ట్లే ఆమెకు ఉత్త‌ర‌కొరియా నుంచి వెండి షీల్డు వ‌చ్చింది. గీత‌కు ఒక్క‌సారిగా ఎగిరి గంతేద్దామ‌న్నంత ఆనందం క‌లిగింది. ఎంచేతంటే ఆమెకు ఉత్త‌మ‌న‌టి అవార్డు రావ‌డం అదే మొద‌టిసారి. అందులోనూ 'పంచాగ్ని' చిత్రంలోని త‌న న‌ట‌న గురించి, ఆ అవార్డు గురించి ఒక మ‌ల‌యాళ ప‌త్రిక, "గీత ఈ సినిమాలో ఎంతో చ‌క్క‌గా న‌టించారు. అయినా రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ అవార్డు రాలేదు. అయితేనేం.. వీట‌న్నిటికీ మించిన అంత‌ర్జాతీయ స్థాయి అవార్డు ల‌భించింది. మ‌నం గుర్తించ‌లేని మ‌న న‌టి ప్ర‌తిభ‌ను విదేశీయులు గుర్తించారు." అని రాసింది. స్వ‌దేశంలో ఉత్త‌మ‌న‌టిగా గుర్తింపు ల‌భించ‌లేద‌న్న బాధ ఆ త‌ర్వాత అంటే అదే సంవ‌త్స‌రం క‌న్న‌డ చిత్రం 'అరుణ‌రాగ‌'లో ఆమె న‌ట‌న‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌మ‌న‌టి అవార్డుతో కొంత‌వ‌ర‌కు తీరింది.  ఒక‌ప్పుడు తెలుగు సినిమాల్లో విరివిగా న‌టించిన గీత‌కు ఒక్క‌సారిగా ఇక్క‌డ అవ‌కాశాలు త‌గ్గిపోయాయ‌న్న బాధ ఉండిపోయింది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర రంగాల‌లో మాత్రం ఆమెకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అవార్డులూ ల‌భించాయి. తెలుగు చిత్రాల‌తో అవార్డు సాధించాల‌న్న ఆమె ఆకాంక్ష మాత్రం నెర‌వేర‌లేదు. (జూలై 14 గీత పుట్టిన‌రోజు)

ఫ‌హ‌ద్ ఫాజిల్‌, న‌జ్రియా న‌జీమ్ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ.. రీల్ క‌పుల్ నుంచి రియ‌ల్ క‌పుల్ దాకా!

  ఇవాళ ఫ‌హ‌ద్ ఫాజిల్‌, న‌జ్రిమా న‌జీమ్ దంప‌తుల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. న‌జ్రియా అదివ‌ర‌కే పాపుల‌ర్ న‌టి కాగా, ఫాజిల్ ఇటీవ‌లి కాలంలో మోస్ట్ వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌గా త‌న సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అత‌డి మ‌ల‌యాళ సినిమాలు తెలుగులో డ‌బ్బ‌యి, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు 'పుష్ప‌'లో విల‌న్‌గా న‌టిస్తూ అల్లు అర్జున్‌ను ఢీకొంటున్నాడు. మ‌రోవైపు న‌జ్రియా సైతం తొలిసారి ఓ టాలీవుడ్‌లో.. అదీ నాని స‌ర‌స‌న నాయిక‌గా 'అంటే సుంద‌రానికి' మూవీలో న‌టిస్తోంది. ఫ‌హ‌ద్‌, న‌జ్రియా తొలిసారి క‌లిసి న‌టించిన సినిమాలో దంప‌తులుగా న‌టించి, ఆ త‌ర్వాత ప్రేమ‌లోప‌డి నిజ జీవితంలోనూ దంప‌తులుగా మారార‌నే విష‌యం మీకు తెలుసా? అంజ‌లీ మీన‌న్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ రొమాంటిక్ కామెడీ 'బెంగుళూర్ డేస్‌'లో ఫ‌హ‌ద్‌, న‌జ్రియా తొలిసారి క‌లిసి న‌టించారు. మ‌ల‌యాళంలోని మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్స్ ప‌లువురు న‌టించిన ఆ సినిమాలో న‌ట‌న‌కు న‌జ్రియా బెస్ట్ యాక్ట్రెస్‌గా కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డును అందుకుంది. ఆ మూవీలో ఫ‌హ‌ద్‌, న‌జ్రియా భార్యాభ‌ర్త‌లుగా న‌టించారు. వారి ఆన్‌-స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. ఆ సినిమా మ‌రో రెండు నెల‌ల్లో విడుద‌ల‌వుతుంద‌నంగా, న‌జ్రియాతో త‌న నిశ్చితార్ధాన్ని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు ఫ‌హ‌ద్‌! 2014 ఫిబ్ర‌వ‌రిలో వారి నిశ్చితార్ధం జ‌రిగింది. అదే ఏడాది ఆగ‌స్ట్ 21న వారు జీవిత భాగ‌స్వాములుగా మారారు. ఇంత‌కీ ఫ‌హ‌ద్ ఎవ‌రో తెలుసా?  నాగార్జున‌తో 'కిల్ల‌ర్' మూవీని రూపొందించిన గ్రేట్ మల‌యాళం డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన ఫాజిల్ త‌న‌యుడు. అత‌ను జాతీయ ఉత్త‌మ‌న‌టుడు కూడా. త‌మ పెళ్లిని పెద్ద‌వాళ్లే అరేంజ్ చేసి, పెళ్లి చేసుకోవాల్సిందిగా ఎంక‌రేజ్ చేశార‌ని ఫ‌హ‌ద్ తెలిపాడు. ఆ ఇద్ద‌రి పెళ్లికి తానే కార‌ణ‌మ‌ని ఒక‌సారి నిత్యా మీన‌న్ స‌ర‌దాగా చెప్పింది. 'బెంగుళూర్ డేస్‌'లో ఫ‌హ‌ద్ భార్య పాత్ర‌కు మొద‌ట త‌న‌ను అడిగార‌నీ, కానీ దాన్ని తాను తిర‌స్క‌రించ‌డంతో, ఆ ఛాన్స్ న‌జ్రియాకు వ‌చ్చింద‌నేది ఆమె చెప్పిన కార‌ణం. 'బెంగుళూర్ డేస్' సెట్స్ మీద ఓ రోజు న‌జ్రియా త‌న ద‌గ్గ‌ర‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి "న‌న్ను పెళ్లిచేసుకుంటావా?" అన‌డిగింద‌ని ఫ‌హ‌ద్ తెలిపాడు. "లైఫ్ అంతా నిన్ను శ్ర‌ద్ధ‌గా చూసుకుంటాన‌ని ఆమె చెప్పింది. ఏ అమ్మాయీ అలా నాతో అన‌లేదు." అని ఓ ఇంట‌ర్వ్యూలో అత‌ను చెప్పాడు. అలాంటి అమ్మాయిని ఎవ‌రు మాత్రం ప్రేమించ‌కుండా ఉంటారు! పెళ్లి త‌ర్వాత నాలుగేళ్లు న‌ట‌న నుంచి బ్రేక్ తీసుకుంది న‌జ్రియా. ఫ‌హ‌ద్ ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆమె న‌ట‌న‌కు దూర‌మైందంటూ అప్ప‌ట్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. 2018లో అంజ‌లీ మీన‌న్ మ‌రో సినిమా 'కూడే'తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి, అవ‌న్నీ రూమ‌ర్స్ అని తేల్చేసింది న‌జ్రియా. నిజానికి ఫ‌హ‌ద్ త‌న‌ను ప‌దే ప‌దే స్క్రిప్టులు విన‌మ‌ని అడుగుతూ వ‌చ్చాడ‌ని కూడా ఆమె వెల్ల‌డించింది. పెళ్లి త‌ర్వాత ఫ‌హ‌ద్ కూడా లాంగ్ బ్రేక్ తీసుకున్నాడ‌ని, వైవాహిక జీవితం తొలినాటి మ‌ధురిమ‌ల‌ను ఆస్వాదించ‌డానికే తాము కొంత‌కాలం ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కు దూరంగా ఉన్నామ‌ని న‌జ్రియా స్ప‌ష్టం చేసింది. ఫ‌హ‌ద్ సైతం పెళ్లి త‌న జీవితాన్ని మార్చేసింద‌నీ, న‌జ్రియా త‌న‌ను ప్ర‌శాంత‌చిత్తునిగా, మ‌రింత నిగ‌ర్విగా మార్చింద‌నీ ప‌లుమార్లు చెప్పాడు. ఇప్ప‌డు ఆ ఇద్ద‌రూ త‌మ ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్ గురించి షేర్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ ఉంటార‌ట‌. ఒక‌రి స‌మ‌క్షాన్ని మ‌రొక‌రు ఆస్వాదిస్తూ, హాలిడేస్ లేదా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్తూ జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతున్నారు.

ద‌గ్గ‌రుండి రామ‌కృష్ణ‌తో "అనుబంధం ఆత్మీయ‌త" పాట‌ను పాడించిన ఘంట‌సాల‌!

  ద‌ర్శ‌కునిగా దాస‌రి నారాయ‌ణరావు తొలి చిత్రం 'తాత మ‌న‌వ‌డు'లో ఎస్వీ రంగారావుపై చిత్రీక‌రించిన "అనుబంధం ఆత్మీయ‌త అంతా ఒక బూట‌కం" పాట ఎంత పెద్ద హిట్ట‌య్యిందో చెప్ప‌లేం. ఆ పాట‌ను పాడింది రామ‌కృష్ణ‌. ఆయ‌న చేత ఆ పాట పాడించాల‌ని సంగీత ద‌ర్శ‌కుడు ర‌మేశ్ నాయుడు నిర్ణ‌యించుకున్నారు. రిహార్స‌ల్స్ చేయిస్తున్న‌ప్పుడు స్టూడియోకు గంధ‌ర్వ గాయ‌కుడు ఘంట‌సాల వ‌చ్చారు. ఆయ‌న‌ను చూసి రామ‌కృష్ణ టెన్ష‌న్ ప‌డ్డారు. ఘంట‌సాల వ‌చ్చి రామ‌కృష్ణ ప‌క్క‌న కూర్చున్నారు. దాంతో గ‌తుక్కుమ‌న్నారాయ‌న‌.  "పాట ఎవ‌రు పాడుతున్నారు?" అని ర‌మేశ్ నాయుడును అడిగారు ఘంట‌సాల‌. "ఈ కొత్త‌కుర్రాడు రామ‌కృష్ణ పాడుతున్నాడు." అని ఆయ‌న జ‌వాబిచ్చారు. "స‌రే నాన్నా.. బాగా పాడు. రంగారావుకు మంచి పాట‌వుతుంది. రికార్డింగ్‌కు నేనొస్తాను." అని చెప్పారు ఘంట‌సాల‌. ఆయ‌న ద‌గ్గ‌రుంటే ఎలా పాడ‌గ‌ల‌న‌ని మ‌ళ్లీ టెన్ష‌న్ ప‌ట్టుకుంది రామ‌కృష్ణ‌కు.  జెమినీ స్టూడియోలో రికార్డింగ్ ప్రారంభ‌మైంది. రెండు టేకులు అయ్యాక ఘంట‌సాల వ‌చ్చారు. రామ‌కృష్ణ పాడుతుంటే చిన్న చిన్న క‌రెక్ష‌న్లు చెప్పారు. పాట అయ్యాక, "బాగా పాడావ్‌. నా ప‌ట్టుల‌న్నీ ప‌ట్టేశావ్" అని ఘంట‌సాల మెచ్చుకున్నారు. అదే పాట‌లో "అనుబంధం ఆత్మీయ‌త" అనే డైలాగ్‌ను ఎస్వీ రంగారావుతో చెప్పించాల‌ని దాస‌రి అనుకున్నారు. "పాట మొత్తం బాగా పాడిన‌వాడు ఆ రెండు ముక్క‌లు చెప్ప‌లేడా?  నేను పాడిస్తా" అని చెప్పి ద‌గ్గ‌రుండి రామ‌కృష్ణ‌తో ఆ డైలాగ్స్ స‌హా పాట మొత్తం పూర్తి చేయించారు ఘంట‌సాల‌. ఈ విష‌యాన్ని అనేక సంద‌ర్భాల్లో వేదిక‌పై పంచుకున్నారు రామ‌కృష్ణ‌. ఆ పాట రామ‌కృష్ణ కెరీర్‌లో మ‌కుటాయ‌మాన‌మైన పాట‌గా నిలిచింది.

దాస‌రిని త‌క్కువ అంచ‌నావేసి, 'తాత మ‌న‌వ‌డు' చెయ్య‌నంటే చెయ్య‌న‌న్న శోభ‌న్‌బాబు!

  దాస‌రి నారాయ‌ణ‌రావు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన చిత్రం 'తాత మ‌న‌వ‌డు' (1973). ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. రాఘ‌వ నిర్మించిన తొలి చిత్రం కూడా అదే. అందులో టైటిల్ రోల్స్‌ను ఎస్వీ రంగారావు, రాజ‌బాబు పోషించారు. నిజానికి రాజ‌బాబు క్యారెక్ట‌ర్‌ను శోభ‌న్‌బాబు చెయ్యాల్సింది. ఆ పాత్రను రాఘ‌వ‌ ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు శోభ‌న్‌బాబు చెయ్య‌నని చెప్పేశారు. "డైరెక్ట‌ర్ కొత్త‌వాడు. ద‌య‌చేసి నాతో ఎక్స్‌పెరిమెంట్ చేయొద్దు. అనుభ‌వంలేని ద‌ర్శ‌కుడు ఏం తీస్తాడో తెలీదు. త‌ర్వాత పిక్చ‌రు చేద్దాం." అని త‌ప్పించుకున్నారు. దాంతో రాజ‌బాబును పెట్టి తీశారు దాస‌రి. 'తాత మ‌న‌వ‌డు' అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. దాంతో దాస‌రిని త‌క్కువ అంచ‌నా వేసినందుకు శోభ‌న్‌బాబు బాధ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత నుంచి దాస‌రి నుంచి ఏ ఆఫ‌ర్ వ‌చ్చినా ఎప్పుడూ వెంట‌నే కాద‌ని చెప్ప‌లేదు. డేట్స్ అడ్జ‌స్ట్ అవ‌డం క‌ష్ట‌మైతే త‌ప్ప ఆయ‌న సినిమాలు చేసుకుంటూ వ‌చ్చారు. ఆయ‌న‌ను ఎన్న‌డూ స్క్రిప్టు అడిగిన పాపాన కూడా పోలేదు. అంతేకాదు, ఒక‌రినొక‌రు "బావా బావా" అనుకునేంత స‌న్నిహిత‌త్వం ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డింది. ఇద్ద‌రూ సెట్‌లో ఉంటే చాలా స‌ర‌దాగా ఉండేది.  వాళ్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా 'బ‌లిపీఠం' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. అది దాస‌రికి తొలి రంగుల చిత్రం. ఆ త‌ర్వాత వ‌చ్చిన 'గోరింటాకు' మ‌రింత హిట్‌. దీపారాధ‌న‌, కృష్ణార్జునులు, స్వ‌యంవ‌రం, జ‌గ‌న్‌, అభిమ‌న్యుడు, ధ‌ర్మ‌పీఠం ద‌ద్ద‌రిల్లింది చిత్రాలు వారి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి.

కాస్త‌యితే గౌత‌మి కొండ‌మీంచి ప‌డిపోయేవారే!

  న‌టి గౌత‌మి కెరీర్ తొలినాళ్ల‌లో 'ఏళు సుత్తిన కోటే' అనే క‌న్న‌డ సినిమా కోసం చిక్‌మంగ‌ళూరు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ కుద్రేముఖ్‌కు ఔట్‌డోర్ షూట్ కోసం వెళ్లారు. క్లైమాక్స్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరో అంబ‌రీష్ (న‌టి సుమ‌ల‌త భ‌ర్త‌) రోడ్డు మీద న‌డుస్తూ ఉంటే, హీరోయిన్ అయిన గౌత‌మి కొండ మీద నుంచి ఆయ‌న‌ను పిలుస్తూ కింద‌కు దిగాలి. ఇదీ సీన్‌. గౌత‌మి కొండ‌మీద నిల్చున్నారు. కింద కెమెరా ఫిక్స్ చేశారు. డైరెక్ట‌ర్ గౌరీశంక‌ర్ "స్టార్ట్ కెమెరా.. యాక్ష‌న్" అని కేక పెట్టారు.  గౌత‌మి ఆ కొండమీద నుంచి హీరోను పిలుస్తూ కింద‌కు దిగుతున్నారు. ఆ కొండ‌మీద గోతులు, రాళ్లు, ముళ్లు, పిచ్చిమొక్క‌లు లాంటివి అడుగ‌డుగునా ఉన్నాయి. దాంతో ఆమెకు దిగ‌డం కొంచెం క‌ష్ట‌మైంది. అందులోనూ ఆమె సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చీర‌క‌ట్టులో ఉన్నారు. డైరెక్ట‌ర్ "యాక్ష‌న్" అన‌గానే గ‌బ‌గ‌బా ప‌రిగెత్తుతూ కొండ‌దిగే స‌మ‌యంలో ఓ రాయి కాలికి త‌గిలి, కింద‌ప‌డ‌బోయి త‌మాయించుకున్నారు. అయితే అప్పుడే చీర కుచ్చిళ్లు కాళ్ల‌కింద ప‌డ్డాయి. దాంతో ఆమె ముందుకు తూలారు. వెంట‌నే కాస్త అవ‌త‌ల ఉన్న యూనిట్ మెంబ‌ర్ ఒక‌రు వేగంగా వ‌చ్చి ఆమెను ప‌ట్టుకొని, కొండ‌మీంచి కింద‌కు జారిప‌డ‌కుండా కాపాడారు. లేక‌పోతే ఆ రోజు ఆమె ప‌ల్టీలుకొట్టి, రోడ్డుమీద ప‌డేవారే! దాదాపు ప్రాణాపాయం త‌ప్పింద‌న్న మాట‌. ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న త‌ల‌చుకున్న‌ప్పుడ‌ల్లా ఆమెకు ఓ వైపు భ‌యం, మ‌రోవైపు థ్రిల్ క‌లుగుతూ ఉంటాయి.

రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు అమ్మాయి వేషం తెచ్చిన తంటా! ముద్దులు పెట్టించుకున్న అబ్బాయిలు!!

  న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ గూడురు ఇంజ‌నీరింగ్ కాలేజీలో ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న రోజుల‌వి. లాగూ, చొక్కా వేసుకొని ఆ కాలేజీలో చేరింది ఆయ‌నొక్క‌రే! ఫ‌స్ట్ ఇయ‌ర్ నిక్క‌రు, చొక్కా తోటే కాలేజీకి వెళ్లేవారు. అంటే అక్క‌డ అంద‌రికంటే ఆయ‌నే చిన్న‌వార‌న్న మాట‌! ఓసారి కాలేజీ యానివ‌ర్స‌రీ డే ఫంక్ష‌న్ సంద‌ర్భంగా స్టూడెంట్స్ అంతా క‌లిసి ఒక నాట‌కం వేయాల‌నుకున్నారు. అందులో హీరోయిన్ వేషం ఎవ‌రు వేస్తే బాగుంటుంద‌ని ఆలోచించి, చివ‌ర‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను వెయ్య‌మ‌న్నారు. ఛాన్స్ వ‌చ్చింది క‌దా అని ఆయ‌న రెడీ అయిపోయారు. రిహార్స‌ల్స్ చేశారు. యానివ‌ర్స‌రీ డేకి ఆ నాట‌కాన్ని దిగ్విజ‌యంగా ప్ర‌ద‌ర్శించారు.  ఆ త‌ర్వాత వ‌చ్చిప‌డ్డాయి అష్ట‌క‌ష్టాలు. నాట‌కం అయిపోయాక రాజేంద్ర‌ప్ర‌సాద్ గ్రీన్ రూమ్‌లోకి వెళ్లారు. అప్ప‌టికే ఆయ‌న కాలేజ్ ఫ్రెండ్స్ అంద‌రూ ఆయ‌న‌ను చిల‌కా అని పిలుస్తూ ముద్దులివ్వ‌మ‌ని గొడ‌వ‌చేశారు. వాళ్ల ప్రిన్సిపాల్ ఈ గొడ‌వంతా చూసి, వాళ్ల‌ను మంద‌లించ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయినా స‌రే.. వాళ్లు ఒప్పుకోలేదు. ప్రిన్సిపాల్‌తో దెబ్బ‌లాడి, చివ‌ర‌కు ప‌ర్మిష‌న్ తీసుకొని మ‌రీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ముద్దులు పెట్టించుకున్నారు. ఇక హాస్ట‌ల్ సెక్ర‌ట‌రీ అయితే, రౌండ్స్‌కి వ‌చ్చిన‌ప్పుడు, మ‌ర్యాద‌గా ముద్దిస్తావా, లేదా? అని బెదిరించి మ‌రీ ముద్దు పెట్టించుకొని, ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్పొద్ద‌ని చెప్పి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చాక‌, తొలిసారి 'వివాహ భోజ‌నంబు' చిత్రంలో ఆడ‌వేషం వేసే అవ‌కాశం వ‌చ్చింది రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు. అప్పుడు కాలేజీ నాటి సంఘ‌ట‌న ఆయ‌న‌కు గుర్తుకు వ‌చ్చింది. అప్పుడు ఎలాగైతే ఆయ‌న స్టూడెంట్ ఫ్రెండ్స్ అంతా ముచ్చ‌ట‌ప‌డి ముద్దులు పెట్టించుకున్నారో.. ముద్దులు పెట్టించుకోక‌పోయినా.. ప్రేక్ష‌కులు ఆయ‌న వేషానికి కురిపించిన ఉత్త‌రాలు చూసి, ముద్దులు పెట్టించుకున్న అనుభూతిని ఆయ‌న‌కు క‌లుగ‌జేశాయి. త‌ర్వాత మ‌రోసారి 'మేడ‌మ్‌'లో చాలా సేపు ఆడ‌వేషంలోనే క‌నిపించి ఆయ‌న మ‌న‌ల్ని మురిపించారు.