20 ఏళ్లలో 600 సినిమాలు చేసిన జయమాలిని.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడానికి రీజన్‌ ఇదే!

(డిసెంబర్‌ 22 జయమాలిని పుట్టినరోజు సందర్భంగా..) ‘సన్నజాజులోయ్‌.. కన్నె మోజులోయ్‌..’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘నీ ఇల్లు బంగారంగానూ..’, ‘గు గు గుడిసుంది..’, ‘పుట్టింటోళ్లు తరిమేశారు...’ 1970వ దశకంలో వచ్చిన ఇలాంటి పాటలు అప్పటి కుర్రకారుకి పిచ్చెక్కించాయి. ఈ ఐటమ్‌ సాంగ్స్‌లో జయమాలిని డాన్స్‌, అందాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి మళ్లీ మళ్లీ రప్పించాయి. అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాల్లో జయమాలిని ఐటమ్‌ సాంగ్‌ కంపల్సరీగా ఉండాల్సిందే. అక్క జ్యోతిలక్ష్మీ అప్పటికే తన డాన్స్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్నారు. ఆ సమయంలో వచ్చిన చెల్లెలు జయమాలిని.. ఐటమ్‌ సాంగ్స్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.    1958 డిసెంబర్‌ 22న మద్రాస్‌లో జన్మించారు జయమాలిని. ఆమె అసలు పేరు అలమేలు మంగ. 8 మందిలో జ్యోతిలక్ష్మీ మొదటి సంతానం కాగా, అలమేలు మంగ చివరి సంతానం. ఈ ఇద్దరికీ 10 సంవత్సరాల గ్యాప్‌ ఉంది. తల్లికి చెల్లెలైన ధనలక్ష్మీకి పిల్లలు లేకపోవడం వల్ల జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా ఆమె దగ్గరే జ్యోతిలక్ష్మీ పెరిగారు. అక్క డాన్స్‌ నేర్చుకుంటూ ఉండగా దగ్గరే ఉండి చూసేవారు అలమేలు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్‌ నేర్చుకున్నారు.    అలమేలు మేనమామ టి.ఆర్‌.రామన్న ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో రవిచంద్రన్‌, లత  జంటగా రూపొందుతున్న ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ సినిమాలో లత స్నేహితురాలిగా అలమేలును చిత్ర రంగానికి పరిచయం చేశారు. అప్పటికి అలమేలు వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత దర్శకుడు బి.విఠలాచార్య చేస్తున్న ‘ఆడదాని అదృష్టం’ చిత్రంలోని ఒక ఐటమ్‌ సాంగ్‌ ద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆమెకు జయమాలిని అని పేరు పెట్టింది కూడా ఆయనే.   అదే సంవత్సరం అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించారు జయమాలిని. దాంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ కంటే ఐటమ్స్‌తోనే జయమాలిని ఎక్కువ పాపులర్‌ అయ్యారు. 1977లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన యమగోల చిత్రంలోని ‘గుడివాడ వెళ్లాను, గుంటూరు పొయ్యాను..’ పాటతో ఒక్కసారి ఇండస్ట్రీని షేక్‌ చేశారు జయమాలిని.  ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమాల్లో వరసగా ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు. అందరు టాప్‌ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసినప్పటికీ ఎన్టీఆర్‌ సినిమాలతోనే ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనేది వాస్తవం.    1980వ దశకం వచ్చేసరికి జ్యోతిలక్ష్మీ హవా తగ్గింది. జయమాలిని జోరు పెరిగింది. ఆ తర్వాత సిల్క్‌ స్మిత వచ్చినప్పటికీ జయమాలిని ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు 20 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆమె కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 600కి పైగా సినిమాల్లో నటించారు.    ఐటమ్‌ సాంగ్స్‌తోపాటు విఠలాచార్య డైరెక్షన్‌లో వచ్చిన జగన్మోహిని, గంధర్వకన్య వంటి సినిమాలు జయమాలినికి నటిగా, డాన్సర్‌గా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా జగన్మోహిని రిలీజ్‌ అయిన టైమ్‌కే ఎన్టీఆర్‌ సింహబలుడు, కృష్ణ సింహగర్జన సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ రెండు సినిమాల కంటే జగన్మోహిని చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరచింది.    నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1994 జూలై 19న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన పార్తీబన్‌ను వివాహం చేసుకున్నారు జయమాలిని. వీరి కుమార్తెకు చిన్నతనం నుంచే డాన్స్‌ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినిమా రంగానికి మాత్రం తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పారు జయమాలిని. పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. అంతేకాదు, మీడియాకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈమధ్యకాలంలోనే అక్కడక్కడా జయమాలిని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.    జయమాలినిది ఒక విభిన్నమైన మనస్తత్వం. సినిమాల్లో కనిపించే జయమాలినికి, బయట కనిపించే జయమాలినికి అసలు పొంతనే ఉండదు. తెరపై ఐటమ్‌ గళ్‌గా కనిపించే ఆమె నిజజీవితంలో ఒక సాధారణ మహిళ అనిపిస్తుంది. మితభాషి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన కెరీర్‌ని ఎంతో వైవిధ్యంగా కొనసాగించారు. ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడపాలనుకున్నానని, అందుకే సినిమాలకు స్వస్తి పలికానని చెబుతారామె. ఏది ఏమైనా తన ఐటమ్‌ సాంగ్స్‌తో 20 సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన జయమాలిని అందరి మనసులు గెలుచుకున్నారు.     

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..) కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.   సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు.    సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు.    సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.   ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.   తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.   ‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.   ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.    సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

దాసరి, రాఘవేంద్రరావు కాంబినేషన్స్‌లో 52 సినిమాలు చేసి రికార్డు క్రియేట్‌ చేసిన జయసుధ!

(డిసెంబర్‌ 17 సహజనటి జయసుధ పుట్టినరోజు సందర్భంగా..) ఒక సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎంత ప్రధానమో.. హీరోయిన్‌ క్యారెక్టర్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. పాతరోజుల్లో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లు తమ నటనను ప్రదర్శించే విధంగా వారి కారెక్టర్లను డిజైన్‌ చేసేవారు. పాతతరం హీరోయిన్లు ఎంతో మంది ఆ తరహా పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆరోజుల్లో సావిత్రి, జమున, వాణిశ్రీ వంటి కథానాయికలు పోషించిన తరహా పాత్రలతో ఆ తర్వాతి తరంలో మంచి పేరు తెచ్చుకున్న నటి జయసుధ. అందరూ మాట్లాడుకునే స్థాయిలో ఆమె నటన ఉండేది. 1970వ దశకంలో నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన జయసుధ చాలా తక్కువ సమయంలో వరస అవకాశాలు అందిపుచ్చుకొని నటిగా బిజీ అయిపోయారు.    ఎలాంటి పాత్రనైనా తన సహజ నటనతో రక్తి కట్టించగల సమర్థత ఉన్న జయసుధ.. ఒక దశలో హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌కి వెళ్ళిపోయారు. ఆమె నటించిన 25 సినిమాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి అంటే అప్పటికి ఆమె ఎంత బిజీ హీరోయినో అర్థం చేసుకోవచ్చు. నటిగా అంతటి ఉన్నత స్థానాన్ని పొందిన జయసుధ సినిమా కెరీర్‌ ఎలా ప్రారంభమైంది, ఆమె సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనే విశేషాల గురించి తెలుసుకుందాం. జయసుధ అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్‌ 17న మద్రాస్‌లో జన్మించారు. ఆమెకు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మేనత్త అవుతారు. సుజాతకు ఊహ తెలిసే సమయానికే విజయనిర్మల రంగుల రాట్నం, పూలరంగడు, సాక్షి వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయనిర్మలకు సుజాత అంటే ఎంతో ప్రేమ.. అందుకే షూటింగ్స్‌కి ఆమెను వెంట బెట్టుకొని వెళ్లేవారు. సినిమాల షూటింగ్స్‌ ఎలా ఉంటాయి, నటీనటులు కెమెరా ముందు ఎలా పెర్‌ఫార్మ్‌ చేస్తారు అనే విషయాలు చూస్తూ ఉండడం వల్ల సుజాతకు నటన పట్ల ఆసక్తి కలిగింది. తను కూడా  మేనత్తలా సినిమాలు చేసి పేరు తెచ్చుకోవాలి అనుకున్నారు.    అదే సమయంలో సూపర్‌స్టార్‌ కృష్ణను విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమ సొంత బేనర్‌లో పండంటి కాపురం చిత్రం నిర్మించేందుకు విజయనిర్మల సన్నాహాలు చేసుకున్నారు. లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 12 ఏళ్ళ బాలిక కావాల్సి వచ్చింది. ఆ పాత్రను సుజాతతో చేయించాలనుకున్నారు విజయనిర్మల. అయితే దానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆయన్ని కన్విన్స్‌ చేసి ఆ సినిమాలో నటించేలా చేశారు. కృష్ణ అన్నయ్య కుమార్తెగా పండంటి కాపురం చిత్రంలో నటించారు సుజాత. 1972 ఫిబ్రవరిలో మొదటిసారి సుజాత కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలైంది.    1972 నుంచే సుజాతకు సినిమా అవకాశాలు వరసగా రావడం మొదలైంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. కె.బాలచందర్‌, ఆర్‌.త్యాగరాజన్‌ వంటి దర్శకులు  సుజాతకు మంచి అవకాశాలు ఇచ్చారు. అలా ఓ డజను సినిమాలు చేశారు. అప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో సుజాత పేరుతో అగ్రనటి ఉండడంతో సుజాత పేరును జయసుధగా మార్చారు ఓ రచయిత.    చదువును అశ్రద్ధ చేస్తూ సినిమాల్లో నటించడం జయసుధ తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. 1975లో డైరెక్టర్‌ ఎన్‌.గోపాలకృష్ణ లక్ష్మణరేఖ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాలోని కవిత పాత్రకు జయసుధ సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రారంభమై కొన్నాళ్ళు బాగానే షూటింగ్‌ నడిచినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. అదే సమయంలో కె.బాలచందర్‌ అపూర్వ రాగంగళ్‌ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే సోగ్గాడు చిత్రంలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు కె.బాపయ్య. అలా జయసుధ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పూర్తి కాకముందే రెండు మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అవి ఘనవిజయం సాధించడంతో హీరోయిన్‌గా జయసుధ బిజీ అయిపోయారు. లక్ష్మణరేఖ చిత్రాన్ని పూర్తి చేసేందుకు డేట్స్‌ ఎడ్జస్ట్‌ చెయ్యడం కష్టం అయిపోయింది. ప్రతిరోజూ రాత్రిళ్ళు షూటింగ్‌లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేశారు జయసుధ. 1975లోనే విడుదలైన ఆ సినిమా ఘనవిజయం సాధించి జయసుధకు మంచి పేరు తెచ్చింది.    1976లో కె.రాఘవేంద్రరావు రెండో సినిమా జ్యోతి చిత్రంలో హీరోయిన్‌గా నటించారు జయసుధ. కె.రాఘవేంద్రరావు, జయసుధ కెరీర్‌లో గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా జ్యోతి. ఇక అక్కడి నుంచి ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 1977 ఎన్టీఆర్‌, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా అడవిరాముడులో జయసుధకు ఓ మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో జయసుధకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.    1980లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా ప్రేమాభిషేకం చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు దాసరి నారాయణరావు. ఆ సినిమాలోని వేశ్య పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో జయసుధ అయితే కరెక్ట్‌గా సరిపోతుందని భావించి ఆమెకు విషయం చెప్పారు దాసరి. వేశ్య పాత్ర కావడంతో చేయడానికి సంకోచించారు జయసుధ. నిడివి తక్కువే అయినా చాలా మంచి పేరు వస్తుందని దాసరి చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. సినిమాలోని ఆమె పోర్షన్‌ను 10 రోజుల్లోనే పూర్తి చేసేశారు దాసరి. 1981లో విడుదలైన ప్రేమాభిషేకం సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. దాసరి చెప్పినట్టుగానే శ్రీదేవి కంటే జయసుధకే ఎక్కువ పేరు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటిస్తూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు జయసుధ.    త్రిశూలం, గృహప్రవేశం, మేఘసందేశం, అనురాగదేవత, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, కలికాలం వంటి సినిమాలు జయసుధకు సహజనటి అని పేరు తెచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే. ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అక్క, వదిన, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. 5 దశాబ్దాలుగా వివిధ పాత్రలు పోషిస్తూ నటిగా కొనసాగుతున్న జయసుధ తన కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కిపైగా సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాల్లో నటించారు. అంతేకాదు, భర్త నితిన్‌ కపూర్‌తో కలిసి జె.ఎస్‌.కె. కంబైన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు.    తన సహజ నటనకుగాను ఉత్తమనటిగా 5 నంది అవార్డులు, ఉత్తమ సహాయనటిగా 4 నందులు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా 3, ఉత్తమ సహాయనటిగా 2 ఫిలింఫేర్‌ అవార్డులు, ప్రేమాభిషేకం చిత్రంలోని క్యారెక్టర్‌కు ఫిలింఫేర్‌ సెషల్‌ జ్యూరీ అవార్డు, ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డులు లభించాయి. ఇవికాక కళాసాగర్‌ అవార్డు, ఎఎన్నార్‌ నేషనల్‌ అవార్డు వంటి ఎన్నో అత్యున్నత అవార్డులు అందుకున్నారు జయసుధ.    జయసుధ వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే మనస్పర్థలు రావడంతో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. 1985లో బాలీవుడ్‌ హీరో జితేంద్ర బంధువైన నితిన్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిహాన్‌, శ్రేయాన్‌. జయసుధకు సేవాగుణం, దానగుణం ఎక్కువ. అందుకే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ చేరి 2009లో కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత వైసీపీలో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరి అందులోనే కొనసాగుతున్నారు. 

తెలుగుదనం అంటే బాపు బొమ్మ, తెలుగుదనం అంటే బాపు సినిమా!

(డిసెంబర్‌ 15 చిత్రకారుడు, దర్శకుడు బాపు జయంతి సందర్భంగా..) బాపు.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తన అందమైన చిత్రాలతో మధురానుభూతిని కలిగించి, వ్యంగ్య చిత్రాలతో నవ్వులు పూయించిన మేటి చిత్రకారుడు. అలాగే తన సినిమాలతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని దర్శకుడు. ఆయన వేసిన బొమ్మ చూసినా, ఆయన తీసిన సినిమా చూసినా ఇది ఖచ్చితంగా బాపు మేథస్సు నుంచి పుట్టిందేనని సాధారణ ప్రజలు సైతం గుర్తిస్తారు. తన కళతో ప్రజలపై అంతటి ప్రభావాన్ని వేశారు. బొమ్మలు వేయడంలో ఎంతటి ప్రతిభ కనబరిచేవారో, అక్షరాలను అందంగా రాయడంలోనూ తన ప్రత్యేకతను చూపించేవారు. బాపు బొమ్మను ప్రచురించని పత్రిక లేదు. అలాగే నవలల కోసం బాపు వేసినన్ని బొమ్మలు మరే చిత్రకారుడూ వెయ్యలేదు. అంతేకాదు, తన పేరుతో ఒక ఫాంట్‌ను క్రియేట్‌ చేసి అక్షరాల్లోనూ అందాలు ఒలకబోసిన ఘనాపాటి బాపు. అందుకే బాపు రాత, బాపు గీత అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది.    ఇక సినిమాల విషయానికి వస్తే.. అవన్నీ బాపు చెక్కిన శిల్పాలు. కథాంశం ఏదైనా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు బాపు శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన సినిమాల్లోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు, పాటలు, నేపథ్య సంగీతం అన్నీ బాపు గుండెల్లో నుంచి బయటికి వచ్చినట్టుగానే అనిపిస్తాయి. ప్రేక్షకుల మనసులో మధురానుభూతిని కలిగిస్తాయి. తన బొమ్మల్లో ఎంతటి భావుకత్వం ఉంటుందో, తెరపై కదిలే బొమ్మల్లోనూ అదే భావుకత్వం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కథానాయికలు బాపు గీసిన బొమ్మలకు ప్రాణం పోసినట్టుగానే ఉంటారు. ‘బాపు బొమ్మ’ అనే మాట ఎంత ప్రాచుర్యం పొందిందో, బాపు సినిమాల్లోని కథానాయికలకు కూడా అంతటి ప్రాధాన్యం దక్కింది.   బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. 1933 డిసెంబరు 15న పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్‌ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. బాపు చిరకాల మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ. శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నంతగా వారి స్నేహబంధం చిరకాలం కొనసాగింది. నిజమైన స్నేహానికి నిదర్శనంగా బాపు, రమణలను చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ శీర్షికలు పాఠకులకు గిలిగింతలు పెట్టేవి.    అలా కొన్నేళ్ళపాటు బాపు తన బొమ్మలు, కార్టూన్లతోనూ, రమణ తన రచనలతో పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రతిరోజూ సినిమాలు చూసేవారు. సినిమా చూసిన తర్వాత అందులోని తప్పుల గురించి చర్చించుకుంటూ మైళ్ల కొద్దీ నడిచి ఇంటికి చేరేవారు. అలా సినిమాలు చూస్తున్న ఆ ఇద్దరికీ మనమే సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల్ని పేపర్‌పై పెట్టి రాసిన రమణ కథకు తన బొమ్మలతో స్క్రీన్‌ప్లే రచించేవారు బాపు. తను చేసిన ప్రతి సినిమాకీ అదే పద్ధతిని పాటించారు.    1952లో వచ్చిన ఇంగ్లీష్‌ సినిమా ‘హై నూన్‌’ స్ఫూర్తితో 1959లో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు రమణ. ఆ సినిమాలోని కౌబాయ్‌ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో కృష్ణ, విజయనిర్మల జంటగా ‘సాక్షి’ చిత్రాన్ని రూపొందించారు బాపు. 1967లో ఈ సినిమా విడుదలైంది. అప్పుడు మొదలైన బాపు, రమణల సినీ ప్రయాణం దాదాపు 45 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగింది. వీరిద్దరూ కలిసి 51 సినిమాలు చేశారు. తాము చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావించేవారు. దాన్నే ఎంతో అర్థవంతంగా తెరపై ఆవిష్కరించేవారు.    బాపు కొన్ని వేల బొమ్మలు వేశారు. వాటిలో ఏది గొప్పది అని చెప్పడం ఎంత కష్టమో ఆయన తీసిన 51 సినిమాల్లో ఏది గొప్పది అని చెప్పడం కూడా అంతే కష్టం. దేనికదే ప్రత్యేకం అన్నట్టుగా ఉంటాయి. తన సినిమాల్లోని పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు బాపు. ఎంతో మంది నటీనటులకు బాపు సినిమాలు మంచి గుర్తింపుని, అంతకుమించి మంచి భవిష్యత్తునీ ఇచ్చాయి.    బాపు సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘ముత్యాల ముగ్గు’. 1975లో విడుదలైన ఈ సినిమాలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇందులోని ప్రతి పాత్రలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా రావుగోపాలరావు పోషించిన కాంట్రాక్టర్‌ పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. అప్పట్లోనే ఈ సినిమాలోని రావుగోపాలరావు డైలాగులు రికార్డుల రూపంలో వచ్చాయంటే అవి ఎంత ప్రజాదరణ పొందాయో అర్థం చేసుకోవచ్చు. రామాయణం స్ఫూర్తితో రూపొందించిన ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఇషాన్‌ ఆర్య జాతీయ అవార్డు అందుకున్నారు.    సాక్షి తర్వాత బాపు దర్శకత్వం వహించిన సినిమాల్లో బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్లే రైలు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, రాధాకళ్యాణం వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొంది బాపు రూపొందించిన సినిమాల్లో క్లాసిక్స్‌గా నిలిచాయి. తెలుగులో ఘనవిజయం సాధించిన తన సినిమాలను హిందీలో కూడా రీమేక్‌ చేశారు బాపు. అలా 9 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక 1990వ దశకంలో భారాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం గురించి, వారి బంధం గురించి తెలియజెప్పే కథతో రూపొందిన పెళ్లి పుస్తకం, మహిళల ఆత్మాభిమానం గురించి, వారి శక్తి గురించి తెలియజెప్పే చిత్రంగా వచ్చిన మిస్టర్‌ పెళ్లాం చిత్రాలు ఘన విజయం సాధించాయి. బాపు దర్శకత్వం వహించిన చివరి చిత్రం 2011లో వచ్చిన శ్రీరామరాజ్యం.    చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా, దర్శకుడిగా బాపు అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 2013లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్రప్రభుత్వం బాపుని సత్కరించింది. అలాగే 1986లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌.. బాపుకి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చింది. ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు నంది అవార్డు అందుకున్నారు బాపు. అలాగే ఉత్తమ దర్శకుడిగా రెండుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. అంతేకాదు ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా బాపుని వరించింది. ఇవికాక వివిధ సంస్థలు అనేక అవార్డులతో ఆయన్ని సత్కరించాయి.    తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రాణ స్నేహితులుగా బాపు, రమణలకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. స్నేహానికి మారుపేరుగా జీవితాంతం కలిసే ఉన్న బాపు, రమణ.. 2011లో విడిపోవాల్సి వచ్చింది. అది కూడా ముళ్ళపూడి వెంకటరమణ మరణంతో. 2011 ఫిబ్రవరి 24 అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. స్నేహితుడి మరణం బాపుని బాగా కుంగదీసింది. ఎంతో మనో వేదనకు లోనయ్యారు. బాపు జీవితంలో అనేకసార్లు గుండెపోటు వచ్చింది. ఆఖరు సారి 2014 ఆగస్ట్‌లో గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 2014 ఆగస్ట్‌ 31న తుదిశ్వాస విడిచారు బాపు. ఆయన అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించింది. 

అలాంటి తొందరపాటు నిర్ణయాల వల్లే.. మూడు పెళ్లిళ్లు.. ఒక సహజీవనం!

(డిసెంబర్ 13 నటి లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా..) తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 650కి పైగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆయా సినిమాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే.. కమర్షియల్‌ హీరోయిన్‌గా కాకుండా తమ సినిమాల్లో టిపికల్‌ క్యారెక్టర్‌ వుంటే దానికి లక్ష్మీనే సంప్రదించేవారు. ఆమె కూడా అలాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడేవారు. ఎందుకంటే స్వతహాగా లక్ష్మీ ఒక టిపికల్‌ క్యారెక్టర్‌. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అమ్మగా, అక్కగా, వదిగా.. ఇలా ఆయా పాత్రలకు జీవం పోస్తున్నారు. ఇప్పటికీ తనకు తగిన క్యారెక్టర్‌ వస్తే చేస్తున్నారు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సరసన ఎంతో వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంలోని నటనకుగాను స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డును అందుకున్నారు లక్ష్మీ.    1952 డిసెంబర్‌ 13న వై.వి.రావు, రుక్మిణి దంపతులకు మద్రాస్‌లో జన్మించారు లక్ష్మీ. ఆమె పూర్తి పేరు యారగుడిపాటి వెంకట మహాలక్ష్మీ. తండ్రి వై.వి.రావు నటుడు, దర్శకుడు. తల్లి రుక్మిణి కూడా పలు సినిమాల్లో నటించారు. అలా లక్ష్మీకి కూడా సినిమాలపై ఆసక్తి కలిగింది. 1968లో విడుదలైన ‘జీవనాంశం’ అనే తమిళ సినిమాలో తొలిసారి నటించారు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆ సినిమాలోని నటనకు ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సంవత్సరం ఎస్‌.వి.రంగారావు దర్శకత్వంలో వచ్చిన ‘బాంధవ్యాలు’ చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ స్పీడ్‌ను చూసి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు.    1969లో భాస్కరన్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. అతను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసేవారు. వీరిద్దరి సంతానమే ఐశ్వర్య. తర్వాతి కాలంలో ఆమె కూడా నటిగా కొన్ని సినిమాల్లో నటించారు. కొన్నాళ్లపాటు భాస్కరన్‌, లక్ష్మీ వైవాహిక జీవితం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 1974లో విడాకులు తీసుకున్నారు.    అదే సంవత్సరం ఆమె మలయాళంలో నటించిన ‘చట్టకారి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలోని జూలీ పాత్ర ఆమెకు విపరీతమైన పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డుతోపాటు, కేరళ స్టేట్‌ అవార్డు కూడా ఆమెను వరించింది. ఈ చిత్రాన్ని లక్ష్మీతోనే ‘జూలీ’ పేరుతో హిందీలో రీమేక్‌ చేసింది విజయ ప్రొడక్షన్స్‌ సంస్థ. హిందీలో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఉత్తమనటిగా మరోసారి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు లక్ష్మీ.    ‘చట్టకారి’ చిత్రం చేస్తున్న సమయంలోనే అందులో హీరోగా నటించిన మోహన్‌శర్మ ప్రేమలో పడ్డారు లక్ష్మీ. ఒకరోజు ఒక హోటల్‌కి అతన్ని ఆహ్వానించి తను ప్రేమిస్తున్న విషయం చెప్పారు. అతను కూడా ఓకే చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం పెళ్లి చేసుకోవాలని కోరింది. వెంటనే నుదుటిపై బొట్టు పెట్టి లక్ష్మీని భార్యగా స్వీకరించారు మోహన్‌. అంతేకాదు, తమ శోభనం కూడా తక్షణమే జరిగిపోవాలని కూడా చెప్పడంతో అదే హోటల్‌లో శోభనం జరుపుకున్నారు.   చిన్నతనం నుంచి ముక్కు సూటిగా వుండే మనస్తత్వం లక్ష్మీది. ఎవరినీ లెక్క చేసేవారు కాదు. ఒకరి గురించి తన జీవితాన్ని మార్చుకునే మనస్తత్వం కాదు. తనకు నచ్చినట్టు ఉండడానికే ఇష్టపడేవారు. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసేసుకునేవారు. అలా తీసుకున్న నిర్ణయమే మోహన్‌తో పెళ్లి. రెండో భర్తతో కూడా ఎక్కువ కాలం ఆమె కాపురం చేయలేకపోయారు. లక్ష్మీ స్పీడ్‌కి మోహన్‌శర్మ తట్టుకోలేకపోయారు. ఫలితంగా మనస్పర్థలు రావడంతో 1980లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.    1987 వరకు ఒంటరిగానే ఉన్న లక్ష్మీ.. తమిళ దర్శకుడు శివచంద్రన్‌ను పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక పాపను వీరు దత్తత తీసుకున్నారు. ఆమె పేరు సంయుక్త. అయితే మధ్యలో కన్నడ నటుడు అనంత్‌నాగ్‌తో కొన్నాళ్లు సహజీవనం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన లక్ష్మీ వైవాహిక జీవితం ఇన్ని మలుపులు తిరగడానికి ఆమె తీసుకునే తొందరపాటు నిర్ణయాలే కారణమని చెబుతుంటారు. ఆమెకు జరిగిన పెళ్లిళ్ల క్రమాన్ని చూస్తే అది అర్థమవుతుంది.

విక్టరీ వెంకటేష్‌ హీరో అవ్వడానికి కారణం సూపర్‌స్టార్‌ కృష్ణ. ఎలాగంటే..?

(డిసెంబర్‌ 13 విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా..) సినిమాలపై ఆసక్తి లేకపోయినా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చిత్రరంగంలోకి ప్రవేశించి అనూహ్య విజయాలు సాధించిన వారిలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్‌ ఎంతోమంది ఉన్నారు. అలా నటనపై అవగాహనగానీ, ఆసక్తిగానీ లేకుండా హీరో అయిపోయిన వారిలో దగ్గుబాటి వెంకటేష్‌ ఒకరు. 1986లో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్‌.. ఈ 39 సంవత్సరాల్లో 76 సినిమాల్లో నటించారు. వీటిలో చంటి  హిందీ రీమేక్‌గా వచ్చిన ‘అనాడి’, యమలీల హిందీ రీమేక్‌గా వచ్చిన ‘తక్‌దీర్‌వాలా’ ఉన్నాయి.    1963లో నిర్మాతగా చిత్ర రంగ ప్రవేశం చేసిన మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు.. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి అగ్రనిర్మాతగా ఎదిగారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు సురేష్‌, వెంకటేష్‌. వీరిద్దరి పేరుమీద స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపైనే సినిమాలు నిర్మించేవారు. ఈ సంస్థ లోగోపై ఇద్దరు పిల్లలు, ఎస్‌.. పి అనే అక్షరాలు ఉంటాయి. ఎస్‌ అక్షరంపై ఉన్న వెంకటేష్‌ స్టార్‌గా, పి అనే అక్షరంపై ఉన్న సురేష్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.    1960 డిసెంబర్‌ 13న కారంచేడులో డి.రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు జన్మించారు వెంకటేష్‌. అతని స్కూల్‌, కాలేజీ విద్యాభ్యాసం మద్రాస్‌లోనే జరిగింది. ఆ తర్వాత అమెరికాలో ఎంబిఎ పూర్తి చేశారు. స్టడీస్‌ పూర్తయిన తర్వాత ఇండియా వచ్చి అన్నయ్య సురేష్‌లా నిర్మాతగా లేదా బిజినెస్‌మేన్‌గా సెటిల్‌ అవ్వాలనుకున్నారు.    అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తూ వస్తున్న రామానాయుడు.. 1986లో కృష్ణ హీరోగా ఒక సినిమా నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు. అయితే అప్పటికి కృష్ణ చాలా సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆయన డేట్స్‌ రామానాయుడుకి దొరకలేదు. అదే సమయంలో కృష్ణ చెప్పిన ఒక్క మాటతో వెంకటేష్‌ హీరో అయిపోయారు. ‘ఇప్పట్లో నా డేట్స్‌ ఖాళీ లేవు. అయినా మీ ఇంట్లోనే హీరోని పెట్టుకొని మరొకరితో సినిమా ఎందుకు.. మీ అబ్బాయి వెంకటేష్‌ బాగానే ఉన్నాడు. అతన్ని హీరో చేయండి’ అని సలహా ఇచ్చారు కృష్ణ.    అమెరికా నుంచి వచ్చిన వెంకటేష్‌తో అదే విషయం చెప్పారు రామానాయుడు. వెంకటేష్‌ షాక్‌ అయి తను హీరో ఏంటి అనుకున్నారు. ఎక్కువ కాలం అమెరికాలోనే ఉండడం వల్ల ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడేవారు. నటనలో అనుభవం లేకుండా, తెలుగు రాకుండా సినిమాలు ఎలా చెయ్యగలను అని తండ్రిని అడిగారు వెంకటేష్‌. కానీ, రామానాయుడు మాత్రం కొడుకుని హీరోని చెయ్యాలనే నిర్ణయించుకున్నారు. దానికి తగినట్టుగా వెంకటేష్‌కి శిక్షణ ఇప్పించారు. 1986లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా వెంకటేష్‌ని హీరోగా పరిచయం చేశారు రామనాయుడు. నటన కొత్త కావడంతో నటించడంలో, డైలాగులు చెప్పడంలో బాగా తడబడ్డారు. మొత్తానికి సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ‘కలియుగ పాండవులు’ సూపర్‌హిట్‌ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. దాంతో వెంకటేష్‌కి కూడా ధైర్యం వచ్చింది.    అంతకుముందే 1971లో వచ్చిన ‘ప్రేమనగర్‌’ చిత్రంలో బాలనటుడిగా కనిపించారు వెంకటేష్‌. ఇదే సినిమాను తమిళ్‌లో ‘వసంత మాళిగై’గా రీమేక్‌ చేశారు రామానాయుడు. ఇందులో కూడా వెంకటేష్‌ నటించారు. ‘కలియుగ పాండవులు’ హిట్‌ తర్వాత అక్కినేని నాగేవ్వరరావుతో కలిసి ‘బ్రహ్మరుద్రులు’ చేశారు. ఆ మరుసటి ఏడాది 5 సినిమాల్లో హీరోగా నటించారు. అందులో ‘శ్రీనివాసకళ్యాణం’ వెంకటేష్‌కి మంచి పేరు తెచ్చింది.  ఆ వెంటనే కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘స్వర్ణకమలం’ వంటి క్లాస్‌ సినిమాతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.    1990లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ చిత్రం సాధించిన ఘనవిజయంతో కమర్షియల్‌ హీరోగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన చేరారు వెంకటేష్‌. ఆ తర్వాత వచ్చిన శత్రువు, కూలీ నెం.1, క్షణక్షణం, చంటి సుందరకాండ, కొండపల్లిరాజా, అబ్బాయిగారు వంటి సినిమాలతో స్టార్‌ హీరోగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నారు. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆ క్రమంలోనే ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, రాజా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలతో ఫ్యామిలీ స్టార్‌ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వరకు అన్నిరకాల సినిమాలు చేస్తూ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌ హీరోగా కొనసాగుతున్నారు విక్టరీ వెంకటేష్‌.    యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీలను అద్భుతంగా పండిరచగల హీరోల్లో వెంకటేష్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇటీవలికాలంలో ఎఫ్‌2, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లోనూ తన కామెడీతో అలరించారు. అలాగే ఈనాడు, దృశ్యం సిరీస్‌, నారప్ప, గురు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.    చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న వెంకటేష్‌కి సక్సెస్‌ల శాతం ఎక్కువ. అందుకే విక్టరీని తన పేరుగా మార్చుకొని విక్టరీ వెంకటేష్‌ అయ్యారు. అలాగే ఎక్కువ రీమేక్‌లు చేసిన హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేష్‌.. ఆ తరహా సినిమాలు ఎన్నో చేసి సక్సెస్‌ సాధించారు.    ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఏడాది ముందే 1985లో వెంకటేష్‌ వివాహం నీరజతో జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వెంకటేష్‌.. షూటింగ్‌ తర్వాత కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఇష్టపడతారు.    ప్రస్తుతం వెంకటేష్‌ చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన త్రివిక్రమ్‌ ఆ తర్వాత టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇటీవల ప్రారంభమైంది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంలో స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్‌.

వరప్రసాద్‌.. నూతన్‌ప్రసాద్‌గా మారడం వెనుక అసలు కథ ఇదే!

(డిసెంబర్‌ 12 నూతన్‌ప్రసాద్‌ జయంతి సందర్భంగా..) ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు..’ అంటూ ఒక డిఫరెంట్‌ మాడ్యులేషన్‌తో నూతన్‌ప్రసాద్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ పాపులరే. డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ప్రత్యేక బాణీ కలిగిన నటుడు నూతన్‌ప్రసాద్‌. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన సినీ జీవితం పరిపూర్ణంగా సాగలేదు. కేవలం 16 సంవత్సరాలు మాత్రమే పూర్తి స్థాయి నటుడిగా కొనసాగారు. షూటింగ్‌లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా నూతన్‌ప్రసాద్‌ వీల్‌ చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.    నూతన్‌ప్రసాద్‌ అసలు పేరు వరప్రసాద్‌. 1945 డిసెంబర్‌ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచే కళల పట్ల ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. తరచూ నాటకాలు వేస్తూ తన నటనతో అందర్నీ ఆకట్టుకునేవారు. దాంతో సినిమాల్లోకి వెళ్తే నటుడుగా మరింత పేరు తెచ్చుకోవచ్చు అనే అభిప్రాయంతో 1970 ప్రాంతంలో మద్రాస్‌ చేరుకున్నారు. అక్కడ కూడా నాటకాలు వేస్తూనే సినిమా ప్రయత్నాలు చేసేవారు. అలా 1973లో అక్కినేని నాగేశ్వరరావు, బాపు కాంబినేషన్‌లో వచ్చిన ‘అందాల రాముడు’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.    రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్న నూతన్‌ప్రసాద్‌కు 1975లో మళ్లీ బాపు దర్శకత్వంలోనే నటించే అవకాశం వచ్చింది. అదే ‘ముత్యాల ముగ్గు’. నిత్య పెళ్లికొడుకుగా ఒక నెగెటివ్‌ క్యారెక్టర్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ఆ బాధతో మద్యానికి బానిసయ్యారు. అలా మూడు సంవత్సరాలపాటు ఎలాంటి సినిమా ప్రయత్నాలు చెయ్యకుండా తాగుతూనే ఉన్నారు. రాత్రి, పగలు అదే పనిగా తాగడం వల్ల తనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయేమోనని హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు నూతన్‌ప్రసాద్‌. తనకు ఏదైనా జబ్బు ఉంది అని డాక్టర్‌ చెబితే మద్యాన్ని కంటిన్యూ చేసి త్వరగా చనిపోవాలి, ఏ జబ్బూ లేదని తేలితే మద్యాన్ని వదిలేసి కెరీర్‌పై దృష్టి పెట్టాలి అనుకున్నారు. అన్ని టెస్టులూ చేసిన డాక్టర్‌ అతనికి ఎలాంటి జబ్బూ లేదని తేల్చాడు.    తాగుడు మానెయ్యాలని ఆ క్షణమే నిర్ణయించుకొని దాన్ని కఠినంగా అమలు చేశారు నూతన్‌ప్రసాద్‌. పాత జీవితానికి స్వస్తి పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు కాబట్టి వరప్రసాద్‌ అనే పేరులో ‘వర’ స్థానంలో ‘నూతన్‌’ చేర్చారు. అలా 1978లో వచ్చిన ‘చలిచీమలు’ చిత్రంతో అందరికీ నూతన్‌ప్రసాద్‌గా పరిచయమయ్యారు. 1981 వరకు కొన్ని సినిమాల్లో నటించిన ఆయన 1982 నుంచి బిజీ ఆర్టిస్టు అయిపోయారు. సంవత్సరానికి 10 సినిమాలకు తక్కువ కాకుండా చేసేవారు. 1985లో అత్యధికంగా 22 సినిమాల్లో నటించారు. తను చేసే ప్రతి క్యారెక్టర్‌లోనూ తనదైన ముద్ర కనిపించేలా చూసుకునేవారు.    ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలోని ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు’ అనే డైలాగ్‌, ‘ఇంటింటి రామాయణం’ చిత్రంలో కామెడీగా సాగే హరికథ, బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాజాధిరాజు’ చిత్రంలోని సైతాన్‌ క్యారెక్టర్‌లో ఆయన నటన, ‘కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ..’ అంటూ పాడే కామెడీ సాంగ్‌ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. తన కెరీర్‌లో ఇలాంటి గుర్తుండిపోయే క్యారెక్టర్లు చాలా చేశారు నూతన్‌ప్రసాద్‌. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోల నుంచి నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోల వరకు అందరితోనూ కలిసి నటించారు.    రాజేంద్రప్రసాద్‌తో కలిసి ‘బామ్మబాట బంగారు బాట’ చిత్రం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం వల్ల నూతన్‌ప్రసాద్‌ వెన్నెముకకు బలమైన గాయమైంది. దాంతో ఆయన వీల్‌చైర్‌కి పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించారు. అందాల రాముడు నుంచి బామ్మబాట బంగారు బాట వరకు 100కు పైగా చిత్రాల్లో నటించిన నూతన్‌ప్రసాద్‌.. ఆ తర్వాత 40కిపైగా సినిమాల్లో వీల్‌ చైర్‌లో ఉండి నటించడం ఆయన మనోధైర్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన కెరీర్‌లో ఉత్తమ విలన్‌గా రెండు సార్లు, ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 2005లో ఎన్‌.టి.ఆర్‌. నేషనల్‌ అవార్డుతో నూతన్‌ప్రసాద్‌ను సత్కరించారు. ఆయన నటించిన చివరి చిత్రం కన్నడలో వచ్చిన ‘శ్రీమతి’. చాలా కాలం అనారోగ్యంతో బాధపడిన నూతన్‌ప్రసాద్‌.. 2011 మార్చి 30న తుదిశ్వాస విడిచారు. 

విదేశాలకు వెళ్లినా ఇదే డైట్.. 75 ఏళ్ల రజినీకాంత్ హెల్త్ సీక్రెట్ ఇదే!

(డిసెంబర్‌ 12 రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా..) ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనేది ఏ రంగంలో ఉన్నవారికైనా అవసరమే. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం తాము ఏ స్థితిలో ఉన్నామో చూసుకొని ఆనందించడం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన మూలాలు ఏమిటి అనేది గుర్తెరిగి ప్రవర్తించడంలోనే పరమార్థం ఉంటుంది. అలా ఆలోచించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఒకరు. ఒక సాధారణ వ్యక్తి నుంచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకొని ఒక శక్తిగా ఎదిగినప్పటికీ తనేమిటో, తనకున్న పరిధులేమిటో రజినీకి పూర్తిగా తెలుసు. అందుకే హంగు, ఆర్భాటాల జోలికి వెళ్ళకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఆయన ఇష్టపడతారు.   స్టార్‌ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారెవరైనా ఎంతో లగ్జరీగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. వారు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతీ విషయంలోనూ అది కనిపిస్తుంది. కానీ, రజినీకాంత్‌ జీవితం వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు, ఆయన జీవన విధానం వేరు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన దిన చర్య గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్టార్స్‌ ఇలా కూడా ఉంటారా అనిపించేలా తన రోజును గడుపుతారు రజినీ.    ఉదయం నిద్ర లేవగానే రాగి చెంబులోని నీరు తాగుతారు. ఆ తర్వాత యోగా, మెడిటేషన్‌ చేస్తారు. టిఫిన్‌కి బదులుగా ఫ్రూట్స్‌ తింటారు. ఆరోజు షూటింగ్‌కి వెళ్లాల్సి వస్తే ఓట్స్‌ని టిఫిన్‌గా తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్‌లో పుల్కాలు, కొంచెం రైస్‌ మాత్రమే తీసుకుంటారు. ఆయన దిన చర్యలో స్నాక్స్‌ అనే మాటకు తావులేదు. ఇక డిన్నర్‌లో ఫ్రూట్స్‌ లేదా స్ప్రౌట్స్‌ తీసుకుంటారు. షూటింగ్‌ నిమిత్తం విదేశాలకు వెళ్లినా ఇదే మెనూ మెయిన్‌టెయిన్‌ చేస్తారు.    ఆయన బెడ్‌రూమ్‌ చూస్తే అందరూ షాక్‌ అవ్వాల్సిందే. గది అంతా దేవుని పటాలతో నిండి ఉంటుంది. రజినీ పడుకునేందుకు నేలపై ఒక మామూలు పరుపు, నూలు తాళ్ళతో అల్లిన మంచం ఉంటుంది. నిద్రపోయేందుకు వాటినే వినియోగిస్తుంటారు. ఆయనకు భక్తి భావం ఎక్కువ. తన ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఏదో ఒక దేవాలయానికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటారు. అలా తిరుమలకు కూడా ఎన్నోసార్లు వచ్చారు.    సంవత్సరంలో ఒకసారి తన స్నేహితులతో కలిసి ఏదో ఒక వెకేషన్‌కి వెళ్తారు. ఆ సమయంలో ఎంతో సాధారణమైన దుస్తుల్లో ఉంటారు. తను స్టార్‌ అవ్వకముందు ఎంత సింపుల్‌గా ఉండేవారో అదే తరహా డ్రెస్‌ వేసుకుంటారు. ప్రయాణం మధ్యలో ఏదైనా తినాల్సి వస్తే రోడ్డు పక్కనే తన స్నేహితులతో కలిసి తింటారు. ఆ సమయంలో రజినీని చూసిన వారికి అతనో సూపర్‌స్టార్‌లా కాకుండా సామాన్య వ్యక్తిగా కనిపిస్తారు.    రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాఘవేంద్రస్వామి, మహావతార్‌ బాబాజీ, రమణ మహర్షిలను తన గురువులుగా భావిస్తారు రజినీ. అందుకే రాఘవేంద్రస్వామి చిత్రాన్ని తనే స్వంతంగా నిర్మించారు. అలాగే మహావతార్‌ బాబా గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో బాబా చిత్రానికి కథ అందించారు. ఇప్పటికీ అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి అక్కడి సాధువులను, స్వాములను కలుసుకుంటూ ఉంటారు. వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు.     రజినీకాంత్‌ పెళ్లి కూడా ఎంతో విచిత్రంగా జరిగింది. ఆయనకు స్టార్‌డమ్‌ వచ్చిన తర్వాత తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎంతో మంది ధనికులు ప్రయత్నించారు. కానీ, వాళ్ళను సున్నితంగా తిర్కరించారు. ఒక కాలేజీ తరఫున రజినీని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు రజినీ.   సాధారణంగా స్టార్‌ హీరోలు కొన్ని సందర్భాల్లో విరాళాలు అందిస్తుంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇవన్నీ మనం మీడియా ద్వారా తెలుసుకుంటాం. కానీ, రజినీకాంత్‌ పద్ధతి అది కాదు. తను స్టార్‌ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దానాలు చేశారు. కానీ, ఒక్కటి కూడా ప్రచారంలోకి రాదు. అది ఆయనకు ఇష్టం ఉండదు. తాను చేసిన దానాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అనేది ఆయన అభిప్రాయం.  

సాయం చెయ్యడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్న మహానటి సావిత్రి!

(డిసెంబ‌ర్ 6 మ‌హాన‌టి సావిత్రి జ‌యంతి సంద‌ర్భంగా..) సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో మద్రాస్‌ చేరుకున్న సావిత్రి చిన్న చిన్న పాత్రలు వేస్తూ మహానటిగా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు అందించారు. అంతేకాదు, తోటి నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారికి ఆర్థిక సాయం చేశారు.  అలాంటి మహౌన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సావిత్రి చివరి దశలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఆర్థికంగా ఎలాంటి ఒడిడుకులకు లోనయ్యారు అనేది మనకు తెలుసు. తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఇతరులకు సాయం చేయడానికి వెనుకాడే వారు కాదు. అప్పు చేసైనా తనకు చేతనైనంత సహాయం చేసేవారు. అలాంటి ఓ అరుదైన సంఘటన 1975లో జరిగింది.  నటిగా తను మంచి స్థాయిలో ఉన్నప్పుడు వడ్డీవారిపాలెం గ్రామంలో ఒక పాఠశాలను తన స్వంత ఖర్చులతో నిర్మించారు సావిత్రి. శ్రీమతి సావిత్రి గణేష్‌ పాఠశాల పేరుతో ఆ స్కూల్‌ను 1962లో స్థాపించారు. ఆ తర్వాత పాఠశాలను ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా పేరు మారింది. పాఠశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ వచ్చేది. దానితోనే సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు.  1975 ప్రాంతంలో పాఠశాల ఎలా ఉంది అనే విషయం తెలుసుకునేందుకు ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌కు ఫోన్‌ చేశారు సావిత్రి. అతను చెప్పిన మాటలు విని ఆమె షాక్‌ అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ రాకపోవడం వల్ల 5 నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సావిత్రి మరో మాట మాట్లాడకుండా ఆ కరస్పాండెంట్‌ను మద్రాస్‌ రమ్మని చెప్పారు.  మద్రాస్‌ వెళ్లిన ఆ కరస్పాండెంట్‌కు 1 లక్షా 4 వేల రూపాయల చెక్కును అందించి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించమని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ విషయం తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన్ని పంపించారు. 1975లో లక్ష రూపాయలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం 40 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.  ఈ డబ్బు చెల్లించే సమయానికి సావిత్రి ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్‌ సిబ్బంది కష్టాలు చూడలేక ఆమె ఆ డబ్బును ఏర్పాటు చేశారు. తను ఏ స్థితిలో ఉన్నాను అనేది కూడా ఆలోచించకుండా దానధర్మాలు చేయడానికి వెనుకాడని సావిత్రి వంటి మహాదాత సినీ పరిశ్రమలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన మహానటి సావిత్రి!

  పాత తరం నటీనటుల జీవితాల్లో ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. వాటి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే అనిపిస్తాయి. ముఖ్యంగా మహానటి సావిత్రి వంటి వారి జీవితాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. వారి జీవితం కూడా సినిమాని తలపిస్తుంది. ఆ సినిమాలో ఆనందం ఉంటుంది, విషాదం ఉంటుంది, ఎన్నో మలుపులు కూడా మనకు కనిపిస్తాయి. ఒక సామాన్య యువతిగా జీవితాన్ని ప్రారంభించిన సావిత్రి.. ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. (Mahanati Savitri)   నటిగా మంచి పేరు తెచ్చుకొని స్టార్‌ డమ్‌ వచ్చినా ఏనాడూ ఆ హోదాని ప్రదర్శించలేదు సావిత్రి. కెరీర్‌ మొత్తం ఒక సాధారణ నటిగానే కొనసాగారు. ఒక స్టార్‌ హీరోయిన్‌కి కల్పించే వసతుల పట్ల ఆమె విముఖత చూపించేవారు. తనకంటూ పర్సనల్‌ స్టాఫ్‌ ఎవరూ ఉండేవారు కాదు. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వస్తే తనకు తోడుగా ఒక అమ్మాయిని తెచ్చుకునేవారు. బస చేసేందుకు హోటల్స్‌కి వెళ్లేవారు కాదు. సారధీ స్టూడియోలోనే ఉండేవారు. ఇక కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. సినిమాలోని క్యారెక్టర్‌ కోసం దర్శక నిర్మాతలు ఏ దుస్తులు ఎంపిక చేసారో వాటినే ధరించేవారు. నిర్మాతల శ్రేయస్సును కోరుకునే హీరోయిన్లలో సావిత్రిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి నటించాల్సి వస్తే ఎంతో జాగ్రత్తగా నడుచుకునేవారు. ఇద్దరిలో ఎవరి సినిమా చేసినా వారికంటే ముందుగానే సెట్‌కి వచ్చి సిద్ధంగా ఉండేవారు.    తను నటిస్తున్న సినిమా యూనిట్‌లోని సభ్యుల్ని ఆమె ఎంత బాగా చూసుకుంటారో తెలిసిందే. ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటలు చేయించి షూటింగ్‌ స్పాట్‌కి తెప్పించేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు. షూటింగ్‌ విరామ సమయంలో ఆమెకు ఇష్టమైన తేగలు, జామకాయలు, వేరుశనక్కాయలు తెప్పించి జూనియర్‌ ఆర్టిస్టులకు పంచి, వారితోపాటే కూర్చొని తినేవారు. హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ వచ్చినా తను గతంలో ఒక సాధారణ యువతిగా వున్న విషయాన్ని మర్చిపోయేవారు కాదు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవంగా చూసేవారు. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేసేవారు. ఆమె సహ నటీనటులు కూడా సావిత్రిని అంతే గౌరవంగా చూసేవారు.    Also Read: మహానటికి నగలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?   పాతతరం నటీనటుల్లో ఎస్‌.వి.రంగారావు, సావిత్రిలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1969లో సావిత్రిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయబోతున్నట్టు ముందుగానే ఆమెకు తెలియజేశారు. కానీ, తను నటిగా అంతటి స్థాయికి ఎదగలేదనీ, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.    నటనను జీవితంగా మార్చుకున్న సావిత్రి నిజజీవితంలో ఎప్పుడూ నటించలేదు. అంతేకాదు, తనతో నటిస్తూ మాట్లాడేవారిని గుర్తించలేకపోయేవారు. ఆ కారణంగానే సావిత్రి తన జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది. ఆమెతో సరితూగగల ఏకైక నటి బాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాకుమారి. ఆమెను అక్కా అని పిలిచేవారు సావిత్రి. దురదృష్టవశాత్తూ ఇద్దరి జీవితాలూ విషాదాంతాలుగానే మారాయి. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత తను మోసపోయానని సన్నిహితులకు చెప్పుకొని బాధపడేవారు. నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సావిత్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం విషాదాన్నే చూశారు.    ఇక సావిత్రి చేసిన దాన ధర్మాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువగా ప్రచారంలోకి రాని విషయం ఏమిటంటే.. సావిత్రి తల్లి సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మ సొంత ఊరు గుంటూరు జిల్లాలోని వడ్డివారి పాలెం. సావిత్రికి ఆ ఊరంటే ఎంతో మమకారం. దీంతో పెద్దమ్మ సలహాతో ఆ ఊరిలోనే స్థలాన్ని కొని ఒక స్కూల్‌ కట్టించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్కూల్‌ను గుర్తించి గ్రాంట్‌ అందిస్తూ వచ్చింది. ఒకసారి ప్రభుత్వం గ్రాంట్‌ను పంపించడం ఆలస్యం చేసింది. దీంతో ఆరు నెలల పాటు అక్కడి సిబ్బందికి జీతాలు లేవు. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి.. అప్పటికప్పుడు 1 లక్ష 4 వేల రూపాయలు పంపించి స్కూల్‌కి అండగా నిలిచారు. 1962లో ప్రారంభమైన ‘శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇప్పటికీ అదే పేరుతో నడుస్తోంది. అక్కడ సావిత్రి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ‘మహానటి’ చిత్ర దర్శకనిర్మాతలు ఈ స్కూల్‌ విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందించారు.    

మహానటి సావిత్రికి నగలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?

  సినిమా కోసం నగలు అమ్ముకున్న మహానటి! ఆ పరిస్థితికి కారణం ఎవరు?   సావిత్రి మహానటి. ఎంతటి మహానటో అంతటి దయాశీలి. అంతేకాదు, ఆమెలో చక్కని దర్శకురాలు కూడా ఉంది. అయితే, ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన 'చిన్నారి పాపలు' చిత్రం ప్రశంసలు అందుకుంది కానీ, కాసులు మాత్రం కురిపించలేకపోయింది. ఈ సినిమా కోసం సావిత్రి తన నగలు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.   'చిన్నారి పాపలు' చిత్రంలో అప్పటి గొప్ప నటీనటులు చాలామంది నటించారు. వారిలో జగ్గయ్య, సావిత్రి, షావుకారు జానకి, జమున, ఎస్వీ రంగారావు, రేలంగి, సూర్యకాంతం లాంటి వాళ్లున్నారు.   ఈ సినిమా ముహూర్తపు సన్నివేశాన్ని మద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో 1967 అక్టోబర్ 12న చిత్రీకరించారు. హీరోయిన్ కాస్ట్యూమ్స్ సహా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సావిత్రి చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి తానే నిర్మాతనన్నట్లు వ్యవహరించారు. ఎందుకంటే నిర్మాణ సంస్థ శ్రీ మాతా ఫిలిమ్స్‌లో 14 మంది భాగస్వాములు ఉన్నారు. అందరూ పెద్దమనుషుల భార్యలు. వాళ్లందరూ పెట్టుబడి పెట్టినా సినిమా పూర్తి కాని స్థితి. దాంతో కొంతమంది ఫైనాన్షియర్స్‌ను తీసుకొచ్చారు.    సినిమా రిలీజ్‌కు ముందు దాని పనులన్నింటినీ తన భుజాల మీద వేసుకున్న సావిత్రి.. తన సొంత డబ్బుల్ని చాలావరకు వెచ్చించారు. ఈ సినిమా నిర్మాణంలో భర్త జెమినీ గణేశన్ నుంచి ఆమెకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ముహూర్తపు షాట్‌కు మాత్రం క్లాప్ కొట్టారు.   1968 జూన్ 21న విడుదలైన 'చిన్నారి పాపలు' సినిమా పెట్టుబడిలో పావు వంతు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఫైనాషియర్స్ వచ్చి కూర్చున్నారు. నిర్మాణ సంస్థలోని షేర్ హోల్డర్స్ అందరూ ముఖాలు చాటేశారు. లాభం లేదనుకొని తన దగ్గర ఉన్న క్యాష్‌తో పాటు నగలు అమ్మగా వచ్చిన డబ్బును ఫైనాన్షియర్స్‌కు ఇచ్చేశారు సావిత్రి. అయితే ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలుచుకోవడం ఒకింత ఊరట. సావిత్రి దర్శకురాలిగా మంచి ప్రతిభ చూపించింది అనే పేరు తెచ్చుకున్నారు.   అలనాటి అద్భుత గాయని పి. లీల ఈ సినిమాతో సంగీత దర్శకురాలిగా మారడం మరో విశేషం. పర్యవేక్షకునిగా ఎస్పీ కోదండపాణి వ్యవహరించారు. పాటలను కొసరాజు, ఆరుద్ర, సినారె, వి. సరోజిని రాశారు. శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీని అందించిన ఈ చిత్రానికి ఎంఎస్ఎన్ మూర్తి ఎడిటర్‌గా పనిచేశారు. నిర్మాతగా వ్యవహరించిన వీరమాచనేని సరోజిని.. రమణతో కలిసి సంభాషణలు రాయడమే కాకుండా ఒక పాటనూ రాశారు.   ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇదే సినిమాను శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జెమిని గణేశన్ హీరోగా 'కుళందై ఉళ్లం' టైటిల్‌తో మళ్లీ తీశారు సావిత్రి. అక్కడ కూడా విజయం సాధించలేదు.    

తెలుగు సినిమా సంగీతానికి తీరని అన్యాయం చేసిన ఘంటసాల!

(డిసెంబర్‌ 4 ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా..) ఘంటసాల.. ఈ పేరు ఎంతో మంది సంగీత ప్రియుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన గానం మధురం, ఆయన సంగీతం మృదుమధురం. తన గానంతో ఆబాలగోపాలాన్నీ అలరించడమే కాకుండా, సినీ సంగీతంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన ఘనాపాటి ఘంటసాల. తెలుగు చిత్రసీమలో ఎంతో మంది గాయకులు తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకుల్ని పరవశింపజేశారు. అలాగే సంగీత దర్శకులు అద్భుతమైన పాటల్ని సృష్టించారు. ఘంటసాల విషయానికి వస్తే.. తను పాడిన పాటలతోనే కాకుండా, తన సంగీత దర్శకత్వంలో పదికాలాలపాటు సంగీత ప్రియులు పాడుకునే పాటల్ని రూపొందించారు. అయితే తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల తీరని అన్యాయం చేశారనే అభిప్రాయం కొందరు సంగీత ప్రియులలో ఉంది. అసలు సంగీతం అంటేనే ఘంటసాల. అలాంటిది సంగీతానికి ఆయన అన్యాయం ఎలా చేశారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం.    1922 డిసెంబర్‌ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు ఘంటసాల వెంకటేశ్వరరావు. వీరి వంశ జన్మస్థలం కృష్ణా జిల్లాలోనే ఉన్న ఘంటసాల గ్రామం. నేటికీ వీరి వంశీకులు ఘంటసాల గ్రామంలో ఆలయ పూజారులుగా ఉన్నారు. ఘంటసాల తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. తండ్రితోపాటే ఆ భజనలకు వెళ్లేవారు ఘంటసాల. ఆయన 11 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. ఆయన చివరి మాటలు ఘంటసాలపై ఎంతో ప్రభావం చూపించాయి. ‘సంగీతం అనేది దైవ స్వరూపం. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నువ్వు గొప్ప సంగీత విద్వాంసుడివి కావాలి’ అని తన చివరి కోరికగా చెప్పారు సూర్యనారాయణ.    ఇక అప్పటి నుంచి సంగీతం నేర్చుకునేందుకు ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఘంటసాల. తనకు తెలిసిన సంగీత విద్యాంసుల ఇళ్లలో పనిచేసి రెండు సంవత్సరాలపాటు సంగీతం నేర్చుకునే ప్రయత్నం చేశారు. అయితే అది సరైన పద్ధతి కాదని తెలుసుకున్న ఘంటసాల.. తన దగ్గర ఉన్న 40 రూపాయల విలువైన ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మేసి సంగీత కళాశాలలో చేరేందుకు విజయనగరం చేరుకున్నారు. అయితే ఆ సమయంలో కళాశాలకు సెలవులు కావడంతో ప్రిన్సిపాల్‌గా ఉన్న ద్వారం వెంకటస్వామినాయుడును కలుసుకున్నారు. అక్కడి స్టూడెంట్స్‌తో కలిసి ఒక రూమ్‌లో ఉండే ఏర్పాటు చేశారాయన. ఘంటసాల అక్కడ ఉంటూ వారాలు చేస్తూ గడిపేవారు.   ఒకసారి తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నారు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి.. ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఆయన చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం చేయడం నేర్పించారు. భుజాన జోలె కట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవారు ఘంటసాల.    పట్రాయని శాస్త్రి శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలోనే పూర్తిచేసారు ఘంటసాల. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లికు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు. అదే సమయంలో 1942లో స్వాతంత్య్ర సమరయోధునిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు అలీపూర్‌ జైల్లో నిర్బంధంలో ఉన్నారు.    1944 మార్చి 4న మేనకోడలు సావిత్రితో ఘంటసాల వివాహం జరిపించారు. ఆరోజు తన పెళ్లికి తానే కచ్చేరీ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఘంటసాల సంగీత కచ్చేరి చూసిన ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. అలా మద్రాస్‌ చేరుకున్న ఘంటసాలతో హెచ్‌ఎంవి రికార్డింగ్‌ కంపెనీలో ఒక పాట రికార్డ్‌ చేయించారు. అయితే సినిమా పాటలకు ఘంటసాల గాత్రం పనికిరాదని చెప్పడంతో అవకాశం దొరికే వరకు తన ఇంట్లో ఉండమని సముద్రాల చెప్పారు. ఆయన ఇల్లు చిన్నది కావడంతో వారికి ఇబ్బంది కలిగించకూడదని తన మకాంను పానగల్‌ పార్కుకు మార్చుకున్నారు. పగలంతా అవకాశాల కోసం తిరిగి రాత్రికి ఆ పార్కులోనే పడుకునేవారు. ఆ తర్వాత మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడిగా అవకాశం ఇప్పించారు సముద్రాల.  ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవారు ఘంటసాల. చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌.రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో ఘంటసాలకు మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.   తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. అదే సమయంలో బాలరాజు, చిత్రానికి గాలిపెంచల నరసింహారావుతో కలిసి సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి సి.ఆర్‌.సుబ్బరామన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు. ఆ తర్వాత కీలుగుర్రం చిత్రానికి పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు ఘంటసాల. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. వాటిలో మనదేశం, లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి, నిర్దోషి వంటి సినిమాలు ఉన్నాయి. 1951లో ఎన్టీఆర్‌ హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన పాతాళభైరవితో ఘంటసాల కెరీర్‌ ఒక్కసారిగా టర్న్‌ అయింది. నటరత్న ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమాతోనే మాస్‌ హీరోగా అవతరించారు. ఇక్క అక్కడి నుంచి ఘంటసాలకు వరస అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే నేపథ్యగాయకుడిగా కూడా ఘంటసాలకు మంచి పేరు వచ్చింది. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాలకు తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెప్పడం విశేషం.    1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్‌ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీవెంకటేశ్వర మహత్మ్యం సినిమాలోని శేషశైలావాస శ్రీ వేంకటేశా పాటను తెరపైన కూడా ఘంటసాలే పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలరు అనే పేరు తెచ్చుకున్నారు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే. దాదాపు 25 సంవత్సరాలు కొనసాగిన ఆయన కెరీర్‌లో దాదాపు 10,000 పాటలు పాడారు. 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.    1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో యూరప్‌లో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపచేసారు. 1969 నుండి ఘంటసాల తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారాయన. రెండు నెలల పాటు జరిగిన చికిత్స అనంతరం హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి అయ్యారు. ఘంటసాల హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే ‘భగవద్గీత’ను రికార్డ్‌ చేశారు. భగవద్గీత తర్వాత ఇక సినిమాల్లో పాడకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ  1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు. ఆ తర్వాత తనకు తానే పాటలు తగ్గించుకున్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సినిమా పాటలు పాడారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా..’ పాటను ఘంటసాలతోనే పాడిరచుకోవాలని కృష్ణ పట్టు పట్టడంతో చేసేది లేక ఆ పాట పాడారు ఘంటసాల. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒక మధురగాయకుడు సంగీత ప్రియుల నుంచి సెలవు తీసుకున్నారు. 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల తుది శ్వాస విడిచారు.    ఘంటసాల వెంకటేశ్వరరావు నటుడు, గాయకుడు, మ్యూజిక్‌ డైరెక్టరే కాదు. నిర్మాత కూడా. తన అభిరుచి మేరకు మూడు సినిమాలు నిర్మించారు. అయితే ఇవేవీ ఆర్థికంగా విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే.. ఘంటసాలకు మొదటి నుంచీ సంగీత దర్శకుడు అవ్వాలని తన సంగీతంతో మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. పాటలు పాడాలని, సింగర్‌గా రాణించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, తన మధురమైన గానంతో గానగంధర్వుడుగా పేరు తెచ్చుకునే స్థాయి నేపథ్య గాయకుడయ్యారు. ఇతర సంగీత దర్శకుల పాటలు పాడుతూనే దాదాపు 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు ఘంటసాల. ఇది సామస్యమైన విషయం కాదు. ఆయన సంగీతంలోని మాధుర్యం గురించి తెలిసిన ఆయన సన్నిహితులు, చిత్ర ప్రముఖులు ‘తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల తీరని అన్యాయం చేశారు’ అనేవారు. సింగర్‌గా కాకుండా సంగీత దర్శకుడిగా కొనసాగి ఉన్నట్టయితే కొన్ని వందల సినిమాల్లో వేలకొద్దీ అద్భుతమైన పాటల్ని అందించి ఉండేవారు. ఆ విధంగా తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల వల్ల తీరని నష్టం జరిగింది అనేది వారి అభిప్రాయం.

తెలుగులో పాతిక సినిమాలు చేసిన ఏకైక బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

(నవంబర్‌ 27 బప్పీలహరి జయంతి సందర్భంగా..) భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక పెను సంచలనం బప్పీలహరి. అప్పటి వరకు ఒక తరహా సంగీతానికి అలవాటు పడిన ప్రేక్షకులకు డిస్కో, ఫాస్ట్‌బీట్‌ సాంగ్స్‌ను పరిచయం చేసిన ఘనత బప్పీలహరికే దక్కుతుంది. హిందీ, తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒరియా భాషల్లో 500కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. అలాగే మూడు బంగ్లాదేశ్‌ సినిమాలు కూడా చేశారు. తెలుగులో అత్యధిక సినిమాలకు సంగీతం అందించిన ఏకైక బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పీలహరి. 1989లో వచ్చిన ఐ విట్‌నెస్‌ టు మర్డర్‌ అనే హాలీవుడ్‌ సినిమాకి కూడా సంగీతాన్నందించారు. 1986 సంవత్సరంలో 33 సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా 180 పాటలను రికార్డ్‌ చేసిన సంగీత దర్శకుడిగా బప్పీలహరి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.  1952 నవంబర్‌ 27న వెస్ట్‌ బెంగాల్‌లోని సిలిగురిలో అపరేష్‌, భాన్సురీ లహరి దంపతులకు జన్మించారు బప్పీలహరి. అతని అసలు పేరు అలోకేష్‌ అపరేష్‌ లహరి. తల్లిదండ్రులిద్దరూ క్లాసికల్‌ సింగర్స్‌. చిన్నతనం నుంచే వారు బప్పీకి సంగీతంలో శిక్షణ ఇచ్చారు. మూడేళ్ల వయసులోనే తబల వాయించి అందరి దృష్టినీ ఆకర్షించారు బప్పీ. సంగీతంలోని మెళకువలన్నీ తెలుసుకున్న తర్వాత 19 ఏళ్ల వయసులో బొంబాయి చేరుకున్నారు. 1974లో ‘దాడు’ అనే బెంగాలీ సినిమాకి తొలిసారి సంగీత దర్శకత్వం వహించారు. అతను కంపోజ్‌ చేసిన తొలిపాటను లతా మంగేష్కర్‌ ఆలపించారు. తొలి హిందీ సినిమా ‘నన్హా షికారి’. 1975లో వచ్చిన ‘జక్మీ’ చిత్రం బప్పీలహరికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బ్రేక్‌ నిచ్చింది. ఈ సినిమాలో ఆయన చేసిన ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌, డిస్కో సాంగ్స్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ఇక అప్పటి నుంచి డిస్కో సాంగ్స్‌ చెయ్యాలంటే బప్పీలహరీయే చెయ్యాలి అన్నంత పేరు తెచ్చుకున్నారు. ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ కూడా డిస్కో సాంగ్స్‌ చేస్తున్నప్పటికీ బప్పీ చేసే పాటలు ప్రత్యేకంగా ఉండడంతో ఎక్కువ జనాదరణ పొందాయి. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్‌ చిత్రంతో బప్పీలహరి ఖ్యాతి ఒక్కసారిగా పతాకస్థాయికి చేరింది. ఈ చిత్రంలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత కసమ్‌ పైదా కర్నేవాలేకి, నమక్‌హలాల్‌, షరాబి, డాన్స్‌ డాన్స్‌, హిమ్మత్‌వాలా, మవాలి.. ఇలా ఒకటి కాదు వరసగా బప్పీలహరి చేసిన పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. సంగీత దర్శకుడిగానే కాదు, సింగర్‌గా ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ పాడారు.  1980, 1990వ దశకాలలో బప్పీలహరి మ్యూజిక్‌ ఒక పెద్ద సెన్సేషన్‌ అని చెప్పాలి. బాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరి సినిమాలకు సూపర్‌హిట్‌ పాటల్ని అందించారు. 1986లో సూపర్‌స్టార్‌ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ చిత్రం ద్వారా తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు బప్పీలహరి. ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్‌ అవ్వడంతో తెలుగులో వరస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువగా సంగీతాన్ని అందించారు బప్పీలహరి. ఆ సినిమాలన్నీ మ్యూజికల్‌గా చాలా పెద్ద విజయాలు సాధించాయి. కొందరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో కూడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేసినప్పటికీ అత్యధికంగా తెలుగులో 25 సినిమాలకు సంగీతం అందించిన ఘనత బప్పీలహరికే దక్కుతుంది. 2020లో రవితేజ హీరోగా వచ్చిన ‘డిస్కోరాజా’ చిత్రంలో రవితేజ, శ్రీకృష్ణలతో కలిసి ఒక పాట పాడారు బప్పీలహరి. తెలుగులో ఆయన పాడిన ఒకే ఒక్క పాట అది.  మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా బప్పీలహరి ఎంత పాపులర్‌ అయ్యారో, ఆయన గెటప్‌ కూడా అంతే పాపులర్‌ అయింది. ఎప్పుడూ ఒంటినిండా నగలతో అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేవారు బప్పీలహరి. బంగారు నగలు ధరించడం తనకు బాగా కలిసి వస్తుందని ఆయన చెప్పేవారు. దానికి ఇన్‌స్పిరేషన్‌ అమెరికన్‌ పాప్‌ సింగర్‌ ఎల్విస్‌ ప్రెస్లీ. ఆయనలాగే ఎప్పుడూ బంగారు నగలతో ధగధగ మెరుస్తూ కనిపించేవారు బప్పీలహరి.  దాదాపు 5 దశాబ్దాలపాటు తన సంగీతంతో అలరించిన బప్పీలహరి.. చనిపోయే వరకు  సంగీత దర్శకుడుగా, సింగర్‌గా పనిచేస్తూనే ఉన్నారు. 2022 ఫిబ్రవరి 15న ఒఎస్‌ఎ అనే వ్యాధి కారణంగా కన్నుమూశారు. అంతకు నెలముందు పలు ఆరోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్‌లో చేరిన బప్పీలహరిని ఫిబ్రవరి 14న డిశ్చార్జ్‌ చేశారు. ఆ మరుసటిరోజే ఆయన కన్నుమూయడం అందర్నీ బాధించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బప్పీలహరి పాటలకు ఇప్పటికీ ఆదరణ ఉందంటే సంగీత ప్రియులపై ఆయన ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హాస్య నటచక్రవర్తి రేలంగి సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణమిదే!

(నవంబర్‌ 27 రేలంగి వర్థంతి సందర్భంగా..) హాస్యాన్ని ఇష్టపడని ప్రేక్షకులు ఒక్క శాతం కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హాస్యానికి అంతటి శక్తి ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది, ఏదో ఒక విషాదం ఉంటుంది. వాటన్నింటినీ మటు మాయం చేసేది హాస్యం. హాయిగా నవ్వుకోవడం వల్ల తక్కువ అనారోగ్యానికి గురవుతారని డాక్టర్లే చెబుతుంటారు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్యాన్ని పండించడం ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి పేరు తెచ్చుకున్నారు. వారిలో రేలంగి వెంకట్రామయ్యకు ఓ విశష్ట స్థానం ఉంది. ఆయన హాస్యనటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతదేశంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి. మిగతా నటీనటులతో పోలిస్తే ఆయన ప్రయాణం ఎంతో సుదీర్ఘమైనది. ఈ సందర్భంగా ఈ హాస్య నటచక్రవర్తి అంతటి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పడిన కష్టాలు, ఆయన జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం.  1910 ఆగస్ట్‌ 9న కాకినాడ సమీపంలోని రావులపాడులో జన్మించారు రేలంగి. తండ్రి రామస్వామి, తల్లి అచ్చాయమ్మ. వీరికి ఒక్కగానొక్క సంతానం రేలంగి. ఆ తర్వాత రామస్వామి కుటుంబం కాకినాడకు మారింది. రేలంగి మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించారు. అయితే రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక రామస్వామికి లేదు. కొడుకును వృద్ధిలోకి తీసుకు రావడంలో శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, రేలంగి తల్లిలేని పిల్లవాడు కాకూడదని, తప్పకుండా పెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి తీసుకురావడంతో అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను వివాహం చేసుకున్నారు. రామస్వామి పూర్వీకులు కల్లు అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. ఆయన చదువుకోవడం వల్ల ఆ వ్యాపారం చేయకుండా సంగీతం మాస్టారుగా, హరికథలు చెప్పే గురువుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలా తండ్రి దగ్గర ఆ కళలన్నీ నేర్చుకున్నారు రేలంగి. మంచి శరీర దారుఢ్యంతో ఉండడం వల్ల కొడుకుని పోలీస్‌ ఆఫీసర్‌గా చూడాలనుకున్నారు రామస్వామి. ఒక దశలో రేలంగి కూడా పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకున్నారు. అయితే చదువుపట్ల శ్రద్ధ పెట్టేవారు కాదు. నాటకాలు వేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఫలితంగా 9వ తరగతి తప్పారు. అప్పుడు తండ్రి చేతిలో బాగా దెబ్బలు తిన్నారు రేలంగి. అయినా తనకు నాటకాలపై ఉన్న ఇష్టాన్ని మాత్రం చంపుకోలేదు. ఒకసారి తండ్రితో కలిసి యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ వారు వేసే నాటకానికి వెళ్లారు. అక్కడ నటీనటులు ప్రదర్శించిన నటనను అందరూ ప్రశంసించడం రేలంగిని ఆకట్టుకుంది. తను కూడా నటుడు అవ్వాలని ఆ సమయంలో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో చేరి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన రామస్వామి కొడుకును తీవ్రంగా మందలించారు. అయినా నాటకాల్లో నటించడం మాత్రం మానలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న రామస్వామి.. నాటకాల్లో అయినా వృద్ధిలోకి రమ్మని ఆశీర్వదించారు.  తండ్రి ఆశీర్వాదం కూడా లభించడంతో పదేళ్ళపాటు వివిధ నాటక సమాజాల్లో నాటకాలు వేస్తూ గడిపారు రేలంగి. 1932లో తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద విడుదలైంది. అప్పట్లో తెలుగు సినిమాలు బొంబాయిలో, కలకత్తాలో నిర్మించేవారు. ఆ సమయంలో సి.పుల్లయ్య నిర్మించే సినిమాకి పనిచేసేందుకు తన మిత్రుడు పరదేశి వెళుతున్నాడని తెలుసుకొని తను కూడా వస్తానని చెప్పారు. అయితే మొదట తను వెళ్లి పరిస్థితిని బట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని మాట ఇవ్వడంతో సరేనన్నారు రేలంగి. అదే సమయంలో రామస్వామి కొడుక్కి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకొని 1933 డిసెంబర్‌ 8న బుచ్చియమ్మతో వివాహం చేశారు. తర్వాత కొన్నాళ్ళకు మరో కంపెనీ వారు కలకత్తా వెళుతున్నారని తెలుసుకొని భార్యకు, తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని కలకత్తా వెళ్లారు. ఆ తర్వాత దర్శకుడు సి.పుల్లయ్యను పరిచయం చేసుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, క్యాస్టింగ్‌ అసిస్టెంట్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా.. ఇలా పలు శాఖల్లో దాదాపు 15 సంవత్సరాలు సి.పుల్లయ్య దగ్గరే పనిచేశారు రేలంగి. కొన్నాళ్ళకు సి.పుల్లయ్య మద్రాస్‌ వచ్చేశారు. రేలంగి కూడా మద్రాస్‌ వచ్చేసి భార్యను, తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చారు. రేలంగి క్యాస్టింగ్‌ ఏజెంట్‌ కావడం వల్ల తన తర్వాత వచ్చిన ఎంతో మంది నటీనటులను తన చేతులమీదుగా పంపించేవారు. అలా పుష్పవల్లి, కృష్ణవేణి, భానుమతి, అంజలీదేవి వంటి నటీమణులు అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత నిర్మాతలుగా మారిన భానుమతి, అంజలీదేవి కృతజ్ఞతగా రేలంగికి తాము నిర్మించిన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. సి.పుల్లయ్య దగ్గర పనిచేసిన 15 సంవత్సరాల్లో పది సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వచ్చాయి తప్ప గుర్తింపు మాత్రం రాలేదు.  ఒక దశలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు రేలంగి. భార్య, తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వారికి చికిత్స చేయించే స్తోమత లేక గురువు సి.పుల్లయ్యతోపాటు మరికొందరి ఆర్థిక సాయంతో వారికి వైద్యం చేయించారు. ఇక తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రావని నిర్ణయించుకొని కుటుంబంతో సహా కాకినాడ చేరుకున్నారు. ఆ తర్వాత 1948లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వింధ్యరాణి అనే సినిమా ప్రారంభమైంది. రేలంగి తిరిగి కాకినాడ వెళ్లిపోయారన్న విషయం తెలుసుకున్న పుల్లయ్య అతన్ని మద్రాస్‌ పిలిపించి వింధ్యరాణి చిత్రంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రను ఇచ్చారు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ మరుసటి సంవత్సరం కీలుగుర్రం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన గుణసుందరి కథ చిత్రంలో రేలంగి చేసిన కలామతి క్యారెక్టర్‌ అతని కెరీర్‌ని ఒక్కసారిగా టర్న్‌ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత రేలంగికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలు అతనికి లభించాయి. అతని హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1950 నుంచి 1970 వరకు రేలంగి లేని సినిమా లేదు అన్నంత బిజీ ఆర్టిస్టు అయిపోయారు. ముఖ్యంగా రేలంగి, రమణారెడ్డి కామెడీకి ప్రేక్షకులు విరగబడి నవ్వేవారు. రేలంగికి జంటగా సూర్యకాంతం, గిరిజ ఎక్కువ సినిమాల్లో నటించారు.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన రేలంగికి అందరూ అవకాశాలు ఇచ్చేవారు. అప్పట్లో ప్రతి సినిమాలోనూ రేలంగి ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు. మిస్సమ్మ, మాయాబజార్‌, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు, వెలుగు నీడలు, నర్తనశాల, విప్రనారాయణ వంటి సినిమాల్లో రేలంగి చేసిన పాత్రలకు కథానాయకుడితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నటుడిగానే కాదు, సింగర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రేలంగి. ‘వినవే బాల.. నా ప్రేమగోల..’, ‘ధర్మం చెయ్‌ బాబూ..’, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత సమాజం పేరుతో ఓ సినిమాను నిర్మించారు రేలంగి. హాస్యనటుడు రాజబాబుకి ఇదే మొదటి సినిమా.  తన కెరీర్‌లో 300కి పైగా సినిమాల్లో నటించిన రేలంగి.. నటుడుగా బిజీగా ఉన్న సమయంలోనే తనకు తానే అవకాశాలు తగ్గించుకున్నారు. తోటి హాస్యనటులకు అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు పత్రికా ముఖంగా తెలియజేశారు. రేలంగి తీసుకున్న నిర్ణయం వల్లే పద్మనాభం, రాజబాబు, చలం వంటి నటులు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, ఉత్తమ హాస్యనటులకు ఇచ్చే అవార్డుల పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. రేలంగికి లభించిన పురస్కారాలు, పొందిన సత్కారాలకు లెక్కే లేదు. అన్నింటినీ మించి భారతదేశంలోనే మొదటిసారి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న హాస్యనటుడు రేలంగి. 1959 మే 14న మద్రాస్‌లోని తెలుగు జర్నలిస్టు అసోసియేషన్‌ రేలంగితో గజారోహణ చేయించారు. రేలంగిని ఏనుగుపై ఎక్కించి మద్రాసు పురవీధుల్లో తిప్పారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. రేలంగి పుట్టింది రావులపాడులో, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లిగూడెం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకంటే అక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానించేవారు. అందుకే ఆ తర్వాత తాడేపల్లిగూడెంలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆ ఊరిలో అత్యాధునిక సౌకర్యాలతో రేలంగి చిత్ర మందిర్‌ పేరుతో ఓ సినిమా థియేటర్‌ను నిర్మించారు. 1962లో ఈ థియేటర్‌ ప్రారంభోత్సవానికి కె.వి.రెడ్డి, సి.పుల్లయ్య, ఎస్‌.వి.రంగారావు, జమున, కాంతారావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. తాడేపల్లిగూడెం ప్రజలకు ఎంటర్‌ ది డ్రాగన్‌, మెకన్నాస్‌ గోల్డ్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసే అరుదైన అవకాశాన్ని ఈ థియేటర్‌ ద్వారా కల్పించారు రేలంగి.  రేలంగికి దానగుణం ఎక్కువ. తను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని కష్టాల్లో ఉన్నవారికి దానం చేసేందుకు వెనుకాడలేదు. కళాశాలలకు విరాళాలు ఇచ్చారు, ఎంతో మందికి వివాహాలు చేయించారు. ప్రతిరోజూ రేలంగి ఇంట్లో అన్నదాన కార్యక్రమం జరిగేది. అన్నదానానికి కావాల్సిన బియ్యం, కూరగాయలు పండించేందుకు కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అడిగిన వారికి లేదనకుండా ఎన్నో దానధర్మాలు చేశారు రేలంగి. దానికి భార్య సహకారం కూడా ఎంతో ఉండేది. రేలంగికి కూడా ఒకే ఒక్క సంతానం. పేరు సత్యనారాయణబాబు. తన కొడుక్కి పిల్లనిచ్చేందుకు ఎంతో మంది ధనవంతులు ఆసక్తి చూపినప్పటికీ తను ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా తనకు పిల్లనిచ్చిన బావమరిది కూతుర్నే కోడలుగా తెచ్చుకున్నారు రేలంగి. సత్యనారాయణబాబు కూడా చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. బాలానందం అనే సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరి రోజుల్లో కీళ్ళకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూనే అడపా దడపా సినిమాలు చేసేవారు రేలంగి. ఆ తర్వాత ఆ వ్యాధి తీవ్రరూపం దాల్చి నడుము వరకు చేరడంతో అది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా డాక్టర్లు గుర్తించారు. 1975 నాటికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో నవంబర్‌ 27న తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో కన్నుమూసారు హాస్యనట చక్రవర్తి రేలంగి.

టాలీవుడ్‌కి కలెక్షన్‌ కింగ్‌ని పరిచయం చేసిన ‘స్వర్గం నరకం’ చిత్రానికి 50 ఏళ్లు!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది విలక్షణమైన నటులు ఉన్నారు. వారిలో మంచు మోహన్‌బాబు మరింత విలక్షణమైన నటుడు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ‘స్వర్గం నరకం’. ఈ సినిమా నవంబర్‌ 22కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆరోజు మొదలైన మోహన్‌బాబు సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు, మరపురాని సినిమాలు చేశారు. 1975 నవంబర్‌ 22న ‘స్వర్గం నరకం’ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా కంటే ముందే అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు చిత్రాల్లో మోహన్‌బాబు చిన్న చిన్న పాత్రలు పోషించారు. తన 50 సంవత్సరాల కెరీర్‌లో హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 500కి పైగా సినిమాల్లో నటించి కలెక్షన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు మోహన్‌బాబు. ఆయన తొలిసారి హీరోగా నటించిన ‘స్వర్గం నరకం’ చిత్రం ఎలా ప్రారంభమైంది? ఈ సినిమాకి సంబంధించిన విశేషాలేమిటో తెలుసుకుందాం.  ఎన్నో అపురూపమైన సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న ఆదుర్తి సుబ్బారావు.. ఒక దశలో అంతా కొత్తవారితో ‘తేనె మనసులు’ సినిమా చెయ్యాలనుకున్నారు. 1965లో విడుదలైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు సూపర్‌స్టార్‌ కృష్ణను పరిచయం చేశారు ఆదుర్తి. ఇక ‘స్వర్గం నరకం’ చిత్రం విషయానికి వస్తే.. దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన 10వ సినిమా ఇది. ఆదుర్తి సుబ్బారావు అంటే దాసరికి ఎంతో గౌరవం. ఆయనలా అంతా కొత్తవారితో సినిమా చెయ్యాలని దర్శకుడిగా మారిన రోజు నుంచే అనుకుంటూ ఉండేవారు దాసరి. ఆ కోరిక తన 10వ సినిమాతో తీరింది. అందుకే ఈ సినిమాను ఆదుర్తి సుబ్బారావుకు అంకితమిచ్చారు దాసరి.  తేనెమనసులు సినిమా కోసం హీరోహీరోయిన్ల దగ్గర నుంచి జూనియర్‌ ఆర్టిస్టుల వరకు అంతా కొత్తవారినే తీసుకున్నారు. అదే పద్ధతిలో స్వర్గం నరకం సినిమా ద్వారా 120 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేశారు దాసరి. హైదరాబాద్‌, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం.. ఇలా ప్రతి సెంటర్‌లో రెండు రోజుల చొప్పున ఆడిషన్స్‌ నిర్వహించి నటీనటుల్ని ఎంపిక చేశారు. మోహన్‌బాబు, అన్నపూర్ణ ఒక జంట కాగా, ఈశ్వరరావు, జయలక్ష్మీ మరో జంట.  వీరిలో మోహన్‌బాబు నటించిన రెండో సినిమా భలేదొంగలు చిత్రంతోనే నటుడిగా బిజీ అయిపోయారు. అన్నపూర్ణ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొన్ని వందల సినిమాల్లో నటించారు. జయలక్ష్మీ విషయానికి వస్తే.. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మరో చరిత్ర చిత్రంలో ఫటాఫట్‌ అనే ఊతపదంతో ఫటాఫట్‌ జయలక్ష్మీగా అందర్నీ అలరించారు. అయితే 22 సంవత్సరాల చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తొలి సినిమా స్వర్గం నరకం నవంబర్‌ 22న విడుదల కాగా, 1980 నవంబర్‌ 21న ఆమె చనిపోవడం గమనార్హం.  దాసరి నారాయణరావు నటుడిగానే ఇండస్ట్రీలో ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసి తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారారు. తను దర్శకుడు అయిన తర్వాత తొలిసారి స్వర్గం నరకం చిత్రంలో నటించారు. సినిమాలో ఎంతో కీలకమైన ఆచారి పాత్రను అద్భుతంగా పోషించి అభినందనలు అందుకున్నారు. ఈ పాత్ర ద్వారా ‘ఫినిష్‌’ అనే ఊత పదాన్ని పరిచయం చేశారు దాసరి. అది ఎంతో కాలం జనానికి ఊతపదంగా మారింది. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన దాసరికి స్వర్గం నరకం అనే సినిమా ఎంతో ప్రత్యేకమైందని చెప్పాలి. ఇప్పటికీ స్వర్గం నరకం చిత్రాన్ని చూస్తున్నారంటే ఈ సినిమాకి ప్రేక్షకాదరణ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

రాజబాబు ఒక హిందీ సినిమా చేశారు.. ఎంత తీసుకున్నారో తెలుసా?

పాత తరం హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు రాజబాబు. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని డిఫరెంట్‌గా డైలాగులు చెప్పడంతోనేకాదు, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ చేసేవారు. 1960లో వచ్చిన సమాజం చిత్రంలో తొలిసారి చిన్న పాత్రలో నటించారు రాజబాబు. ఆ తర్వాత తండ్రులు కొడుకులు, కులగోత్రాలు చిత్రాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ క్రమంలోనే స్వర్ణగౌరి చిత్రంలో నటించారు. ఈ సినిమాకి తొలిసారి అందుకున్న పారితోషికం 350 రూపాయలు.  అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న రాజబాబు కెరీర్‌ అంతస్తులు చిత్రంతో ఒక్కసారిగా టర్న్‌ తీసుకుంది. ఈ సినిమాకి 1300 రూపాయల పారితోషికం ఇచ్చారు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌. ఈ సినిమా తర్వాత రాజబాబును వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో బిజీ కమెడియన్‌ అయిపోయారు. ఒక దశలో రాజబాబు ఉంటేనే సినిమాను రిలీజ్‌ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను అడిగే స్థాయికి చేరుకున్నారు.  కమెడియన్‌గా అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న తరుణంలోనే రాజబాబుకి ఒక హిందీ సినిమా చేసే ఛాన్స్‌ వచ్చింది. 1975లో విడుదలైన ‘రాణీ ఔర్‌ లాల్‌పరి’ అనే సినిమాలోని ఒక పాట కోసం రాజబాబుని బొంబాయి పిలిపించారు. పిల్లలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఎంతో మంది బాలీవుడ్‌ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఆ క్రమంలోనే తెలుగు నుంచి రాజబాబు వెళ్లారు. ఈ సినిమాలోని ఒక పాటలో లిల్లీపుట్‌గా నటించారు.  షూటింగ్‌ పూర్తయిన తర్వాత రెమ్యునరేషన్‌ ఎంత ఇవ్వమంటారు అని రాజబాబుని అడిగారు నిర్మాత. ఆ ఒక్క పాట కోసం రెమ్యునరేషన్‌ ఆశించలేదు రాజబాబు. ఆయన అడిగినందుకు ‘మీ ఇష్టం’ అన్నారు. చేసింది ఒక పాటే కాబట్టి ఐదు వేలు ఇస్తే అదే ఎక్కువ అనుకున్నారు. కానీ, ఆ నిర్మాత 40 వేల రూపాయలు చేతిలో పెట్టారు. అంత ఎమౌంట్‌ ఇచ్చేసరికి షాక్‌ అయ్యారు రాజబాబు. ఆ డబ్బు తీసుకున్నారు. తను అనుకున్న 5 వేలు ఉంచుకొని మిగతా 35 వేలను ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్న టెక్నీషియన్స్‌ అందరికీ పంచి పెట్టేశారు. రాజబాబు మంచితనాన్ని ప్రతిబింబించే సంఘటనలలో ఇదొకటి. రాజబాబుకి సేవా గుణం ఎక్కువ. తన జీవితంలో ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

73 ఏళ్ళ క్రితం సంచలన విజయం సాధించిన ‘దాసి’ చిత్రంలోని విశేషాలివే!

చిత్ర పరిశ్రమలో నటీనటులైనా, సాంకేతిక నిపుణులైనా సాధించిన విజయాల వల్ల కొందరి పేర్లు మారు మోగిపోతూ ఉంటాయి. అయితే కొందరు చిత్ర పరిశ్రమ అభివృధ్దికి ఎంతో కష్టపడినప్పటికీ వారు పేర్లు మరుగున పడిపోతూ ఉంటాయి. వారి గురించి ఎవరూ మాట్లాడరు, వారి పేరు చర్చకు రాదు. అలాంటి ఓ దర్శకనిర్మాత సి.వి.రంగనాథదాస్‌. తను చేసిన సినిమాల వల్ల ఆయన ఎక్కువగా లాభపడకపోయినా ఎంతోమందికి లాభం చేకూరింది. 1950 దశకంలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన రూపకల్పన చేశారు. ఆ సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు విజయాలు సాధించారు. అలాంటి రంగనాథదాస్‌ మొదట ‘దాసి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. తనే దర్శకత్వం వహిస్తూ ఆ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ, కొంత షూటింగ్‌ పార్ట్‌ పూర్తయిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో దాన్ని పక్కన పెట్టేసి ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో సంసారం చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాలో సావిత్రిని కథానాయికగా తీసుకొచ్చారు రంగనాథదాస్‌. కానీ, ఎల్‌.వి.ప్రసాద్‌కి ఆమె నచ్చలేదు. లక్ష్మీరాజ్యంను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తమిళ్‌లో సంసారం పేరుతోనే జెమిని వాసన్‌ రీమేక్‌ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్‌ అవ్వడంతో అప్పటివరకు అప్పుల్లో వాసన్‌ ఈ సినిమాతో గట్టెక్కారు.  ఆ సమయంలో తను మొదట దర్శకత్వం వహిస్తూ నిర్మించాలనుకున్న ‘దాసి’ చిత్రాన్ని మళ్ళీ ప్రారంభించారు రంగనాథదాస్‌. అయితే అంతకుముందు తీసిన సినిమాని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ప్రారంభించారు. ఈ చిత్రానికి నిర్మాతగా నటి లక్ష్మీరాజ్యం వ్యవహరించారు. ఎల్‌.వి.ప్రసాద్‌ పర్యవేక్షణలో రంగనాథదాస్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. 1952 నవంబర్‌ 26న విడుదలైన ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయి సంచలనం సృష్టించింది. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధరరావు వెలైకరి మగళ్‌ పేరుతో తమిళ్‌లో నిర్మించారు. అయితే అక్కడ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 1950వ దశకంలోనే సంచలన విజయం సాధించిన ‘దాసి’ చిత్ర కథ ఏమిటి, ఈ సినిమా అంతటి ఘనవిజయం అందుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది పరిశీలిద్దాం.  రామయ్య(ఎన్టీఆర్‌) జట్కా తోలుతుంటాడు. భార్య లక్ష్మీ(లక్ష్మీరాజ్యం) బద్రినాథ్‌(ఎస్వీఆర్‌) అనే సంపన్నుడి ఇంట్లో పాచిపని చేస్తుంటుంది. వారికి సుబ్బడు(చలం) అనే కొడుకు ఉంటాడు. బద్రినాథ్‌, పార్వతమ్మ(శాంతకుమారి) దంపతులకు నడి వయసు వచ్చినా సంతానం ఉండదు. సంతానం కోసం మరో పెళ్లి చేసుకోమని బంధువులు ప్రోత్సహిస్తారు. పార్వతమ్మ అన్న రామారావు (శ్రీవత్స) చెల్లెల్ని చూడటానికి వచ్చి జరిగిన కథ అంతా విని, బద్రీనాథ్‌ బంధువులు ఆయన ఆస్తి కోసం ఈ పన్నాగం పన్నారని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు. పార్వతమ్మ దాసి లక్ష్మి గర్భవతిగా ఉంటుంది. పార్వతమ్మ అన్న రామారావు పార్వతమ్మను, తను గర్భవతిగా ఉన్నట్లు నటించి దాసి లక్ష్మికి పుట్టబోయే బిడ్డను రహస్యంగా పెంచుకోమని సలహా ఇస్తాడు. కానీ సమయం వచ్చేవరకు ఈ సంగతి లక్ష్మికి తెలియనీయవద్దని చెబుతాడు. పార్వతికి మరోదారి లేక దానికి అంగీకరిస్తుంది. పెద్ద దాసి నర్సమ్మకు ఈ విషయమంతా చెప్పి తగినట్లు ప్రవర్తించమంటారు. రామారావు, తరళ అనే లేడీడాక్టరుకు లంచమిచ్చి పార్వతి గర్భవతిగా ఉన్నదని బద్రీనాథ్కు చెప్పిస్తాడు. దానితో బద్రీనాథ్‌ రెండో పెళ్ళి ప్రయత్నం మానుకొంటాడు. లక్ష్మికి కలగబోయే బిడ్డనే తాను పెంచుకోదలచినందువల్ల పార్వతి లక్ష్మికి ప్రతిరోజూ పాలు, ఫలహారాలు ఇచ్చి ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటుంది. పార్వతి లక్ష్మిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి లక్ష్మి భర్త రామయ్య భార్యను అనుమానిస్తాడు. లక్ష్మికి నవమాసాలు నిండుతాయి. ఒకనాడు పార్వతమ్మ పెద్దదాసి నర్సమ్మ, రామారావు లక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మితో తామొక రహస్యం చెబుతామని, ఆ రహస్యం తన భర్తకు కూడా చెప్పకూడదని,ఒక్కగానొక్క కొడుకు మీద ఒట్టువేసుకొమ్మని అడుగుతారు. లక్ష్మి ఒట్టువేసుకొంటుంది. పార్వతి గర్భవతి కాదని, లక్ష్మికి పుట్టబోయే బిడ్డను పార్వతికిచ్చి పార్వతి మానప్రాణాలను కాపాడమని రామారావు లక్ష్మి చేతులు పట్టుకొని బ్రతిమాలతాడు. అదే సమయానికి వచ్చిన రామయ్య తన భార్య చేతులు రామారావు పట్టుకొని ఉండడాన్ని చూస్తాడు. రామారావు ఎందుకు వచ్చాడో చెప్పమని భార్యను అడుగుతాడు. కొడుకు మీద ఒట్టు వేసినందున లక్ష్మి భర్తకు నిజం చెప్పలేకపోతుంది. రామయ్య లక్ష్మిని ఇంట్లో నుండి వెళ్లగొడతాడు. లక్ష్మి ఏడుస్తూ పోయి పార్వతమ్మ కాళ్లమీదపడుతుంది. తన భర్తకు నిజం చెప్పి తన కాపురం నిలబెట్టమని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో నిజం చెబితా రామయ్య ఉద్రేకంలో ప్రపంచమంతా చాటుతాడని తర్వాత నెమ్మదిగా రామయ్యకు నిజం చెప్తానని పార్వతమ్మ లక్ష్మిని సముదాయించి తన బంగళాలోనే ఉంచుతుంది. లక్ష్మికి పురిటి సమయం వస్తుంది. లేడీడాక్టరు తరళను పిలవడానికి పార్వతమ్మ అన్న రామారావు వెళతాడు. ఆ సమయంలో బద్రీనాథ్‌ మేనల్లుడు నారాయణరావు తరళ ఇంట్లో ఉంటాడు. నారాయణరావును ఆరాత్రి పార్వతమ్మ బంగళాకు రానీయకుండా చేయమని రామారావు తరళని బ్రతిమాలుతాడు. తరళ నారాయణరావును ఇంట్లో ఉంచి తాళం వేసి రామారావుతో పార్వ్తతమ్మ బంగళాకు వస్తుంది. పార్వతమ్మ పెద్దదాసి నిజంగా నొప్పులు పడుతున్న లక్ష్మిని నోరెత్తి అరవనీయదు. నొప్పులు లేని పార్వతమ్మను బిగ్గరగా అరవమంటుంది. లక్ష్మికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లను తెచ్చి పార్వతమ్మ ప్రక్కలో పడుకోబెట్టి బద్రీనాథ్కు కూతురు పుట్టిందని చెబుతారు. అతడు సంతోషంతా ఉప్పొంగిపోతాడు. బిడ్డకు కమల అనే పేరు పెడతాడు. పార్వతమ్మ ప్రక్కనున్న పిల్ల ఏడుస్తున్నా గమనించదు. బిడ్డ ఏడ్చినప్పుడెల్లా లక్ష్మి వచ్చి బిడ్డను తీసికొంటుంది. లక్ష్మి మాతృప్రేమ వల్ల ఎక్కడ అసలు రహస్యం బయట పడుతుందోనని పార్వతమ్మ తన ఒంట్లో బాగాలేదని, చికిత్స కోసం మద్రాసు వెళ్తానని భర్తతో చెప్పి లక్ష్మికి తెలియకుండా ఒకరాత్రి మద్రాసుకు వెళ్లిపోతుంది. తెల్లవారగానే లక్ష్మి పార్వతమ్మ ఇంటికి వచ్చి కమల కనబడకపోవడంతో కంగారుపడుతుంది. పెద్దదాసి నర్సమ్మ లక్ష్మిని తిట్టి ఇంటినుండి వెళ్ళగొడుతుంది. లక్ష్మి ఏడుస్తూ భర్తదగ్గరకు వస్తుంది. భర్త రామయ్య ఆ సమయంలో దుర్గి (కనకం) అనే ఆమెను పెళ్ళి చేసుకోవడం చూస్తుంది. భర్త కాళ్లమీదపడి రక్షించమని బ్రతిమాలుతుంది. రామయ్య లక్ష్మి జుట్టు పట్టుకొని యీడ్చి యింటి నుండి వెళ్లగొడతాడు. ఇక తనకు చావే శరణ్యమనుకొని లక్ష్మి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సవతి కొడుకు సుబ్బడిని చూస్తే గిట్టని దుర్గ వాడిని నీళ్లలో తోసి వాడే నీళ్లలో పడ్డాడని గోలపెడుతుంది. రామయ్య కొడుకు కోసం ఏటిలో దూకి వెదుకుతాడు కానీ కొడుకు దొరకలేదు. అదే సమయంలో జీవితం మీద విరక్తి చెంది లక్ష్మి ఇంకో ఒడ్డు నుండి ఏటిలో దూకుతుంది. ఆమెకు ప్రవాహంలో కొట్టుకొస్తూ కొన వూపిరిలో ఉన్న కొడుకు సుబ్బడు కనిపిస్తాడు. ఆమె వాడిని కాపాడి ఒడ్డుకు వచ్చి డాక్టరు దయాకర్‌ (డాక్టర్‌ దామోదరం) వద్దకు తీసుకువస్తుంది. దయాకర్‌ సుబ్బడిని బ్రతికిస్తాడు. లక్ష్మి దయాకర్‌ ఇంట్లో దాసిగా పనిచేస్తుంది. సుబ్బడు దయాకర్‌ పిల్లల్తో కలిసి చదువుకుంటాడు. రామయ్య రెండోభార్య దుర్గకి నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి. భర్తకు తెలియకుండా ఒక నటుడితో స్నేహంచేసి ఇంట్లోనుండి లేచిపోతుంది. మద్రాసులో పార్వతమ్మ కూతురు ఏడేండ్ల బిడ్డ అవుతుంది. ఇంటివద్ద బద్రీనాథ్‌ చనిపోతాడు. కమల (వసంత) దాసి లక్ష్మి కూతురు అని తెలిసి బద్రీనాథ్‌ బంధువులు ఆస్తికోసం దావా వేస్తారు. దేశం అంతా ఈ విషయం తెలిసిపోతుంది. లక్ష్మి నిర్దోషి అని రామయ్య తెలుసుకుంటాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి సన్యాసులలో కలిసిపోతాడు. డాక్టర్‌ దయాకర్‌ బద్రీనాథ్‌ ఆస్తి గురించిన దావావిషయాలు పేపర్లో చదివి భార్యతో చెప్తుంటే లక్ష్మి విని మద్రాసుకు బయలుదేరుతుంది. కోర్టులో కమల పార్వతమ్మ కూతురే కాని నా కూతురు కాదని లక్ష్మి సాక్ష్యం ఇస్తుంది. దానికి ఆధారంగా డాక్టర్‌ తరళ ఇచ్చిన కాగితాలను చూపుతుంది. దానితో కోర్టు కేసును కొట్టివేస్తుంది. తన ఆస్తిని కాపాడినందుకు పార్వతమ్మ లక్ష్మిని కౌగిలించుకొని తప్పును క్షమించమని కోరుతుంది. పార్వతమ్మ లక్ష్మిని మద్రాసులోనే వుండమని బ్రతిమాలుతుంది. లక్ష్మి అంగీకరిస్తుంది. దయాకర్తో చెప్పి లక్ష్మి మద్రాసు చేరుతుంది. సుబ్బడు దయాకర్‌ పిల్లలతోనే చదువుకుంటూ ఉంటాడు. పది సంవత్సరాలు గడిచాయి. సుబ్బడు సుబ్బారావుగా మారి ప్లీడరు పాసై మద్రాసులో ప్రాక్టీసు పెడతాడు. కమల యుక్తవయస్కురాలు అవుతుంది. కాని లక్ష్మిని దాసిగానే భావిస్తుంటుంది. కమల రామారావు కొడుకు ప్రేమనాథ్ను (జనార్ధనం) ప్రేమిస్తుంది. రామారావు భార్య దేవకి దాసిపిల్ల అయిన కమలను తన కొడుకుకు చేసుకోవడానికి ఇష్టపడదు. భిక్షాటన చేస్తూ సన్యాసి వేషంలో ఉన్న రామయ్య తన రెండవ భార్య దుర్గిని చూసి అసహ్యించుకొంటాడు. రాత్రి ఆమెను హతమార్చాలని అనుకొంటాడు. కానీ ఈ లోపుగానే దుర్గి ప్రియుడే ఆమెను హత్యచేసి పారిపోతాడు. రామయ్య మీదకు ఆ కేసు వస్తుంది. రామయ్యను సుబ్బారావు కేసునుండి తప్పిస్తాడా? లక్ష్మి తన కన్నతల్లి అని కమల తెలుసుకొంటుందా? రామారావు భార్య తన కొడుకు ప్రేమనాథ్‌ దాసి కూతురు కమలను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అనేవి మిగిలిన కథ. చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే కన్నతల్లి చూడవే కన్నీరు మానవే - పి.లీల జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే ఘోడా జల్దీ చలో - పిఠాపురం నాగేశ్వరరావు కలకలలాడే పండుగ నేడే బిరబిర రారండి మా పాపను చూడండి - జిక్కి బృందం మారాజుల చాకిరిచేసి దొరసాని వచ్చావే ఈ పూటకు బువ్వేమైన - పిఠాపురం, పి.లీల (తెరపై ఎన్‌ టి ఆర్‌, లక్ష్మీ రాజ్యం) టైటిల్‌ పాత్రను లక్ష్మీ రాజ్యం పోషించారు. పాతాళ భైరవి లో అందాల తోట రాముడిగా , ప్రజల నాయకుడిగా పల్లెటూరులో నటించిన ఎన్‌ టి ఆర్‌ , అంతగా ప్రాముఖ్యం లేని దాసి సినిమాలో నటించడం కొంత ఆశ్చర్యమే. సినిమాలో చాలా పాత్రలు కొంత సినిమా తర్వాత నడి వయసుకు చేరుకుంటాయి. ఎన్‌ టి ఆర్‌ కూడా నడి వయసులో కనిపిస్తారు. అయినా చక్కగా కనిపిస్తారు ఎన్‌ టి ఆర్‌. ప్రేమనాధ్‌ గా వేసిన జనార్ధనం తరవాత ఎన్‌ ఏ టి వారికి మేనేజర్గా పని చేసారు. ఎన్‌ టి ఆర్‌ కొడుకుగా వేసిన చలానికి ఇది మొదటి సినిమా. ఈ సినిమా తెలుగు, తమిళాలలో పూర్తిగా గాని, పాటలు కానీ యూ ట్యూబ్‌ లో దొరకడం లేదు. అంత చిన్న వయసులో ఎన్‌ టి ఆర్‌ నడి వయసు పాత్ర ఎలా వేసారో చూడాలి. ముఖ పుస్తక మిత్రులెవరిదగ్గరైనా వీడియో ఉంటే కామెంట్లలో పంచుకోగలరు. ఎన్‌ టి ఆర్‌ కు పిఠాపురం పాడటం ఒక విశేషం. ఈ చిత్రానికి నిర్మాత: సి.లక్ష్మీరాజ్యం, దర్శకుడు: సి.వి.రంగనాథదాస్‌, పర్యవేక్షణ: ఎల్వీ ప్రసాద్‌, కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, పాటలు: ఆచార్య ఆత్రేయ, ఛాయాగ్రహణం : ఎం.ఎ.రహమాన్‌, ఎన్‌.సి.బాలకృష్ణన్‌, మారి, శబ్దగ్రహణం: రంగస్వామి, ఎడిటర్‌: మాణిక్యం, కళ: టి.వి.ఎస్‌.శర్మ, సంగీతం: సి.ఆర్‌.సుబ్బురామన్‌, సుసర్ల దక్షిణామూర్తి, నేపథ్యగానం: పి.లీల, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు, సంగీతం : సి.ఆర్‌. సుబ్బరామన్‌, సుసర్ల దక్షిణామూర్తి. 

కుర్రకారును ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

  ఒకప్పుడు నాట్య తారలకు మన సినిమాల్లో చాలా ఇంపార్టెన్స్‌ ఉండేది. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత, అనూరాధ వంటి నాట్యతారలు కొన్ని దశాబ్దాలపాటు తమ డాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించారు. వీరిలో జ్యోతిలక్ష్మీ అందరి కంటే సీనియర్‌. వెయ్యికిపైగా సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. అలాగే 300 సినిమాల్లో పలు పాత్రలు పోషించారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ చెల్లెలు జయమాలిని రంగ ప్రవేశం చేసి ఆమె కూడా డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. (Jyothi Lakshmi)   1948 నవంబర్ 2న తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు జ్యోతిలక్ష్మీ. తండ్రిపేరు టి.కె.రాజరామన్‌, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వారిలో జ్యోతిక్ష్మీ అందరికంటే పెద్దది కాగా, జయమాలిని అందరికంటే చిన్నది. రాజరామన్‌ సోదరి అయిన ఎస్‌.పి.ఎల్‌.ధనలక్ష్మీ తమిళ్‌లో ప్రముఖ నటి. ఆమెకు పిల్లలు లేని కారణంగా జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా చిన్నతనం నుంచీ ధనలక్ష్మీ దగ్గరే పెరిగారు జ్యోతిలక్ష్మీ.     జ్యోతిలక్ష్మీ ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు దర్శక నిర్మాత టి.ఆర్.రామన్.. ఎం.జీ.ఆర్ నటించిన ఓ సినిమాలో ఆమెచే నాట్యం చేయించారు. ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం 'కార్తవరాయన్ కథ'లో డ్యాన్స్ చేశారు జ్యోతిలక్ష్మీ. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం 'పెరియ ఇడత్తు పెణ్'తో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రంలో నగేష్ సరసన వల్లి అనే హాస్యపాత్రలో నటించారు. జ్యోతిలక్ష్మీ చిన్నతనంలో రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. ఈ నాట్యశిక్షణ సినిమాలలో నాట్యాలు చేయటానికి సహకరించింది.   తెలుగులో జ్యోతిలక్ష్మీ తొలి చిత్రం 1967లో విడుదలైన 'పెద్దక్కయ్య'. 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన 'ఇదాలోకం' సినిమాలో 'గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు' అన్న పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ.. తిరిగి అదే పాటకు 'కుబేరులు' సినిమాలో నర్తించారు.   ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపారు జ్యోతిలక్ష్మీ. 80, 90 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా అందులో జ్యోతిలక్ష్మీ ఐటమ్ సాంగ్ ఉందంటే జనం క్యూ కట్టేవారు. జ్యోతిలక్ష్మీ డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు. ఆమె పాట అయిపోగానే థియేటర్ నుండి బయటకు వెళ్ళిపోయేవారు. అంటే కేవలం జ్యోతిలక్ష్మీ పాట ఉండటం వల్లే.. ఆ సినిమాలకు టికెట్లు తెగేవి అన్నమాట. అందుకే నిర్మాతలు తమ సినిమాలో జ్యోతిలక్ష్మీ సాంగ్ ఉండేలా చూసుకునేవారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆమె నర్తించిన సినిమాలు కొనడానికి ఆసక్తి చూపేవారు.     సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన జ్యోతిలక్ష్మీ.. నిజ జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ్యోతిలక్ష్మీ వివాహం వాసుదేవన్‌ అనే వ్యక్తితో జరిగింది. ఆయనకు అంతకుముందే పెళ్ళయింది. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడం వల్ల వీరి పెళ్ళిని రహస్యంగా ఉంచి సహజీవనం సాగించారు. ఎనిమిదేళ్ళు ఇద్దరూ కాపురం చేశారు. వారికి మీనాక్షి అనే పాప పుట్టింది. అయితే ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జ్యోతిలక్ష్మీని ఎంతో టార్చర్‌ పెట్టేవాడు వాసుదేవన్‌. తన నిర్మాతలతో అతను ప్రవర్తించే తీరు వల్ల సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి.    1980లో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘సరదారాముడు’ చిత్రం షూటింగ్‌లో జ్యోతిలక్ష్మీ పాల్గొనాల్సి ఉండగా, సడన్‌గా ఆమె మాయమైంది. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. దాంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. చివరి క్షణంలో విజయలలితను తీసుకున్నారు. వాసుదేవన్‌ భార్య నుంచి తప్పించుకునేందుకే జ్యోతిలక్ష్మీ బొంబాయి వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చారు. వాసుదేవన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి సినిమాటోగ్రాఫర్‌ సాయిప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు జ్యోతిలక్ష్మీ. ఆమె కూతురు మీనాక్షి పేరును జ్యోతిమీనా అని మార్చారు. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ, తల్లికి వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి వివాహం చేసుకొని చెన్నయ్‌లో స్థిరపడ్డారు జ్యోతి మీనా.    జ్యోతిలక్ష్మీ డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఆ సమయంలో జయమాలిని బిజీ నృత్యతారగా వెలుగొందుతోన్నారు. ఒకప్పుడు జ్యోతిలక్ష్మీ అనుభవించిన స్థానాన్ని జయమాలిని కైవసం చేసుకున్నారు. దీనికి తోడు జ్యోతిలక్ష్మీ బ్లడ్‌ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆర్థికంగా నష్టపోయి, అనారోగ్యంపాలై చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జ్యోతిలక్ష్మీ.. చివరికి 2016 ఆగస్ట్‌ 9న తుదిశ్వాస విడిచారు.   (నవంబర్ 2 జ్యోతిలక్ష్మీ జయంతి సందర్భంగా)  

ఒకే పాత్రను కొన్ని వందల సినిమాల్లో చేసి మెప్పించిన మేటి నటి సూర్యకాంతం!

(అక్టోబర్‌ 28 నటి సూర్యకాంతం జయంతి సందర్భంగా..) తాము చేస్తున్న సినిమాల్లో ఒకే తరహా పాత్రలు పోషించి మెప్పించడం నటీనటులకు చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ప్రతి సినిమాలోనూ అదే పాత్ర చేయడం వారికి విసుగు తెప్పిస్తుంది కూడా. కానీ, పాతతరం నటి సూర్యకాంతం తన విషయంలో అది కరెక్ట్‌ కాదని నిరూపించారు. గయ్యాళి అత్త అంటే మనకు సూర్యకాంతం గుర్తొస్తారు. ఆ పాత్రకు పేటెంట్‌ హక్కులు పూర్తిగా ఆమెవే. ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అంతలా ముద్రపడిపోయింది. దాదాపు 50 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో 700కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. వాటిలో దాదాపు అన్నీ గయ్యాళి పాత్రలే ఉండడం అనేది గొప్ప విషయం. అలా వరసగా గయ్యాళి పాత్రలు చేసి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించని ఏకైక నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రల ప్రభావం ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా ఉందంటే సూర్యకాంతం అనే పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేదు. అలాంటి విశిష్టమైన నటి సూర్యకాంతం సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆమె సినీ, జీవిత విశేషాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. 1924 అక్టోబర్‌ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం 14వ సంతానం. అందరి కంటే చిన్నది కావడంతో ఆమెను ఎంతో గారాబం చేసేవారు. చిన్నతనం నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తెలుగు కంటే హిందీ సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ఆ సినిమాలు చూసి అందులోని పాటలు పాడుతూ ఉండేవారు. సూర్యకాంతం స్కూల్‌లో వేసే నాటకాల్లో నటించేవారు. ఇది తెలిసి తల్లి మందలించినా అవేవీ పట్టించుకోకుండా నాటకాల్లో కొనసాగేవారు. ఆమె 8వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి అనంతరామయ్య కన్నుమూశారు. ఆ తర్వాత కూడా సూర్యకాంతం స్కూల్‌లో నాటకాలు వేశారు. ఆ సమయంలోనే వారి బంధువు ఒకరు హనుమాన్‌ నాట్యమండలి అనే నాటక సంస్థను నడిపేవారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాబారం వంటి నాటకాల్లో నటించారు.    ఆ సమయంలోనే జెమిని సంస్థవారు తాము నిర్మిస్తున్న చంద్రలేఖ సినిమాలో నూతన నటీనటులు కావాలి అని పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసిన సూర్యకాంతం స్నేహితురాళ్లు ఇద్దరు మద్రాస్‌ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వారితోపాటు సూర్యకాంతం కూడా వెళ్లారు. చంద్రలేఖ సినిమాలో ఈ ముగ్గురికీ చిన్న చిన్న వేషాలు ఇచ్చారు. అదే సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న నారద నారది చిత్రంలో ఒక క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఇది తెలుసుకున్న జెమినివారు తమతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న తర్వాత మరో సినిమాలో నటించడానికి వీల్లేదని చెప్పారు. పుల్లయ్య కూడా పెద్ద డైరెక్టరేనని, ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు సూర్యకాంతం. దీంతో జెమినీవారు సూర్యకాంతంకి ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి అడక్కుండా అగ్రిమెంట్‌ని రద్దు చేసుకున్నారు. అలా 1946లో విడుదలైన నారద నారది చిత్రంలో తొలిసారి నటించారు. ఈ సినిమా తర్వాత 1949 వరకు రత్నమాల, గృహప్రవేశం వంటి కొన్ని సినిమాల్లో నటించారు. నిజానికి సూర్యకాంతం హిందీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే తెలుగులో నటిగా నిలదొక్కుకున్న తర్వాతే హిందీలోకి వెళితే బాగుంటుందని దర్శకుడు సి.పుల్లయ్య ఇచ్చిన సలహాను పాటించి తెలుగులోనే నటిగా కొనసాగారు.    1950లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన సంసారం చిత్రంతో సూర్యకాంతం కెరీర్‌ గొప్ప టర్న్‌ తీసుకుంది. ఈ సినిమాలో మొదటిసారి గయ్యాళి అత్తగా నటించారు. ఆ పాత్ర సూర్యకాంతంకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు సూర్యకాంతంను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నీ ఒకే తరహా పాత్రలే అయినా ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. పెళ్లిచేసిచూడు, దొంగరాముడు, బ్రతుకు తెరువు, మాయాబజార్‌, తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగు నీడలు, అప్పుచేసి పప్పుకూడు.. ఇలా దాదాపు 20 సంవత్సరాలపాటు సూర్యకాంతం లేని సినిమా అంటూ ఉండేది కాదు. 1962లో సూర్యకాంతం చేసిన గుండమ్మకథకు చాలా విశేషాలు ఉన్నాయి. అప్పటికే ఎన్‌.టి.ఆర్‌. ఎఎన్నార్‌ తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలు. వారిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి సూర్యకాంతం చేసిన గుండమ్మ క్యారెక్టర్‌ను హైలైట్‌ చేస్తూ గుండమ్మకథ అనే టైటిల్‌ని పెట్టడం ఆరోజుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ప్రతి సినిమాలోనూ గయ్యాళి పాత్ర పోషించినా.. అందులోనే విభిన్నమైన కోణాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. సూర్యకాంతంను తెరపై చూస్తూ తిట్టుకుంటూనే ఆమె సినిమాలను ఎంతో ఆదరించేవారు.  సినిమాల్లో గయ్యాళి పాత్రలు చేసి అందరితోనూ తిట్లు తినే సూర్యకాంతం నిజ జీవితంలో సౌమ్యంగా ఉండేవారు. పెద్దలను గౌరవించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆమెలో ఉండేవి. ఆమె షూటింగ్‌కి వెళుతున్నారంటే 20 మందికి సరిపడే భోజనాలు వెంట తీసుకెళ్ళేవారు. తన సహనటీనటులకు, సాంకేతిక నిపుణులకు వాటిని కొసరి కొసరి వడ్డించేవారు. అంతేకాదు, రకరకాల పిండి వంటలు కూడా చేయించి షూటింగ్‌కి తీసుకొచ్చేవారు. అలా సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు వంటి వారు కూడా ఇంటి నుంచి భోజనాలు తెచ్చేవారు. సూర్యకాంతం సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతోపాటు బాపు, రమణ తీసే సినిమాలకు ఫైనాన్స్‌ చేసేవారు. అలాగే పాత కార్లు కొని వాటికి మరమ్మతులు చేయించి, పెయింట్‌ వేయించి తిరిగి అమ్మేవారు. ఆరోజుల్లో నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తున్నాయని గ్రహించిన సూర్యకాంతం.. విదేశాల నుంచి క్వాలిటీగా ఉండే మేకప్‌ కిట్‌లను తెప్పించి నటీనటులకు అమ్మేవారు.  ఇక వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. సూర్యకాంతం నాటకాలు వేసే రోజుల్లోనే న్యాయవాదిగా పనిచేసే పెద్దిభొట్ల చలపతిరావు కూడా నాటకాల్లో నటించేవారు. ఆయన తెనాలి నుంచి మద్రాస్‌ షిప్ట్‌ అయిన తర్వాత 1950లో చలపతిరావును వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. వీరికి సంతానం కలగలేదు. దీంతో తన అక్క సత్యవతి కుమారుడ్ని నెలల వయసులోనే దత్తత తీసుకున్నారు. అతనికి అనంత పద్మనాభమూర్తి అని పేరు పెట్టుకున్నారు. సూర్యకాంతంకి దానగుణం ఎక్కువ. వికలాంగులకు, వృద్ధకళాకారులకు ఆర్థికసాయం చేసేవారు. అలాగే సినిమాల్లో నటించాలని వచ్చి అవకాశాలు రాక ఉన్నదంతా పోగొట్టుకొని ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బులేని ఎంతో మందిని సొంత ఖర్చులతో ఊళ్ళకు పంపించేవారు. గ్రంథాలయాలకు, నాటక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకునేవారు కాదు. తిరుపతిలో ఆమె పేరుమీద ఒక కాటేజీ ఉండేది. మూడు వారాలకు ఒకసారి అక్కడికి వెళ్లేవారు. సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ గుడికి తరచూ వెళ్లేవారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక సత్రం కట్టించారు సూర్యకాంతం.    ఆమె ఎంత సున్నిత మనస్కురాలంటే.. ఒక సినిమాలో నటుడు నాగయ్యను నోటికొచ్చినట్టు తిట్టే సీన్‌ చెయ్యాల్సి వచ్చింది. అది పూర్తవ్వగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన కాళ్ళకు నమస్కరించి క్షమించమని వేడుకున్నారు సూర్యకాంతం. ‘నువ్వు కాదు నన్ను తిట్టింది.. నీ పాత్ర.. దానికెందుకమ్మా బాధపడతావు. ఊరుకో’ అని ఓదార్చారు నాగయ్య. స్యూరకాంతం నవలలు ఎక్కువగా చదివేవారు. ఓ పక్క నటిస్తూనే ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చెయ్యాలనుకున్నారు. ప్రతిరోజూ రాత్రి పూట చదువుకునేవారు. దీని వల్ల పగలు షూటింగులో ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన ఛాయాదేవి ‘నటిగా నీకు ఇంత మంచి పేరు ఉంది. డిగ్రీ ఎప్పుడైనా పూర్తి చెయ్యొచ్చు. సినిమా అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు’ అని సీరియస్‌గా చెప్పడంతో డిగ్రీ చెయ్యాలన్న ఆలోచన మానుకున్నారు సూర్యకాంతం. 50 ఏళ్ల వయసులో మరాఠి, ఫ్రెంచ్‌ భాషలు నేర్చుకున్నారు.  చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకునేవారు సూర్యకాంతం. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు మాత్రం మానేవారు కాదు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉండేవారు. చివరికి 1994 డిసెంబర్‌ 17న కన్నుమూశారు సూర్యకాంతం. ఆ సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి నివాళులర్పించారు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. 50 సంవత్సరాలు నటిగా కొనసాగి, దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు నటీనటులతో కలిసి నటించిన సూర్యకాంతం చనిపోయారన్న వార్త తెలిసి కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి అంజలీదేవి, జమున, అల్లు రామలింగయ్య, జి.వరలక్ష్మీ, వాణిశ్రీ వంటి పది మంది మాత్రమే వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారేమోనని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తన సహజ నటనతో లక్షల మంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం ఆత్మకు వారి నివాళే నిజమైన శాంతిని చేకూరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.