తెలుగు సినిమాలో తొలి ఘ‌ట్టాలు!

  తెలుగు సినిమా 1931లో పౌరాణిక గాథ‌తో హెచ్‌.ఎం. రెడ్డి రూపొందించిన‌ 'భ‌క్త ప్ర‌హ్లాద' చిత్రంతో ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత 1950-60 కాలంలో స్వ‌ర్ణ‌యుగాన్ని చ‌విచూసింది. టెక్నాల‌జీ ప‌రంగా అభివృద్ధి చెందుతూ, క‌థ‌ల విష‌యంలో కొత్త ప్ర‌యోగాలు చేస్తూ ప్ర‌యాణిస్తూ వ‌చ్చింది తెలుగు సినిమా. ఎంద‌రో మ‌హాన‌టుల్నీ, ద‌ర్శ‌కుల్నీ, నిర్మాత‌ల్నీ, సంగీత దర్శ‌కుల్నీ, గాయ‌కుల్నీ, గొప్ప‌గొప్ప ఇత‌ర టెక్నీషియ‌న్ల‌నీ అందించింది. దేశంలో జాతీయ భాష అయిన హిందీలో వ‌చ్చిన చిత్రాల‌తో పోటీప‌డుతూ సంఖ్యాప‌రంగా కొన్నిసార్లు వారికంటే ఎక్కువ సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసింది. అలాంటి ఘ‌న చ‌రిత్ర క‌లిగిన తెలుగు సినిమాకు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌ తొలి ఘ‌ట్టాలేవంటే... * తొలి థియేట‌ర్ య‌జ‌మాని - ర‌ఘుప‌తి వెంక‌య్య (1921). మ‌ద్రాస్‌లోని గెయిటీ, క్రైన్‌, రాక్సీ థియేట‌ర్లు. * ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి థియేట‌ర్ - మారుతీ సినిమా, విజ‌య‌వాడ (1921). స్థాప‌కులు: పోతిన శ్రీ‌నివాస‌రావు * తొలి తెలుగు టాకీ చిత్రం - 'భ‌క్త ప్ర‌హ్లాద' (1931) (ద‌ర్శ‌కత్వం - హెచ్‌.ఎం. రెడ్డి) * ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి స్టూడియో - దుర్గా సినీటోన్‌, రాజ‌మండ్రి (1936). స్థాప‌కులు: నిడ‌మ‌ర్తి సూర‌య్య‌ * తెలుగులో తొలి ద‌ర్శ‌కురాలు - భానుమ‌తి ('చండీరాణి' - 1953) * తొలి తెలుగు రంగుల చిత్రం - 'ల‌వ‌కుశ' (1963) (ద‌ర్శ‌క‌త్వం - సి. పుల్ల‌య్య‌) * ఉత్త‌మ న‌టునిగా అంత‌ర్జాతీయ బ‌హుమ‌తి పొందిన తొలి తెలుగు న‌టుడు - ఎస్వీ రంగారావు (1964 - జ‌కార్తా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, జ‌కార్తా) ('న‌ర్త‌న‌శాల‌'లో చేసిన కీచ‌కుని పాత్ర‌కు) * సినిమా స్కోప్‌లో నిర్మాణ‌మైన తొలి తెలుగు చిత్రం - 'అల్లూరి సీతారామ‌రాజు' (1974) (ద‌ర్శ‌క‌త్వం: వి. రామ‌చంద్ర‌రావు) * దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన తొలి తెలుగు సినిమా వ్య‌క్తి - బి.ఎన్‌. రెడ్డి (1974) * వినోద‌పు ప‌న్ను మిన‌హాయింపు పొందిన తొలి తెలుగు చిత్రం - 'తీర్పు' (1975) (ద‌ర్శ‌క‌త్వం: యు. విశ్వేశ్వ‌ర‌రావు) * ఉత్త‌మ‌న‌టిగా తెలుగు సినిమాకు జాతీయ అవార్డు అందించిన‌ న‌టి - శార‌ద ('నిమ‌జ్జ‌నం' - 1978) (ద‌ర్శ‌క‌త్వం: బి.ఎస్‌. నారాయ‌ణ‌) * పాట‌ల రికార్డుల అమ్మ‌కంలో రికార్డులు బ్రేక్‌చేసి గోల్డ్ డిస్క్‌ను పొందిన తొలి తెలుగు చిత్రం - 'శంక‌రాభ‌ర‌ణం' (1981) (ద‌ర్శ‌క‌త్వం: కె. విశ్వ‌నాథ్‌) * 3-డిలో నిర్మాణ‌మైన తొలి తెలుగు చిత్రం - 'సాగ‌ర్' (1985) (ద‌ర్శ‌క‌త్వం: క్రాంతికుమార్‌) * 70 ఎంఎంలో నిర్మాణ‌మైన తొలి తెలుగు చిత్రం - 'సింహాస‌నం' (1986) (ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ‌)

ద్ర‌విడోద్య‌మ ప్ర‌భావం వ‌ల్లే రావ‌ణుడిని నాయ‌కునిగా చూపించిన ఎన్టీఆర్‌!

  తెలుగులో శ్రీ‌రాముడి పాత్ర పోష‌ణ కంటే ముందే పురాణ వాఙ్మ‌యంలోనే అతి భ‌యంక‌ర‌మైన ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌సిద్ధిపొందిన రావ‌ణాసురుని పాత్ర‌ను 'భూకైలాస్' చిత్రంలో పోషించి అద్భుతం అనిపించారు న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. అప్ప‌టివ‌ర‌కూ ప‌ర‌మ దుర్మార్గునిగా, రాక్ష‌సునిగా చిత్రిత‌మైన రావ‌ణ పాత్రకు ఎన్టీఆర్ ధ‌రించ‌డం వ‌ల్ల హీరోయిజం వ‌చ్చింది. తొలిసారిగా తెర‌పై అంద‌మైన రావ‌ణుడు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఈ రావ‌ణుడు స్త్రీలోలుడు కాడు. వేద వేదాంగాలు ఔపోస‌న ప‌ట్టిన విద్యాధికుడు. ఈ పాత్ర‌ను మంచిగా చూపించ‌డం ఒక కొత్త ప్ర‌యోగం. అలా చూపించ‌డానికి కార‌ణం ఎన్టీఆర్‌తో పాటు ద‌ర్శ‌కునిలో ఉన్న ప్ర‌గాఢ‌మైన మాన‌వ‌తా దృష్టి. ఒక రకంగా అది స‌మాజానికి ఎదురీద‌డం. 'భూకైలాస్' త‌ర్వాత 'సీతారామ క‌ల్యాణం'లో మ‌రోసారి రావ‌ణ పాత్ర‌ను ధ‌రించారు ఎన్టీఆర్‌. అందులోనూ రావ‌ణుడే క‌థానాయ‌కుడు. రావ‌ణ పాత్ర‌ను పోషించ‌డానికి ఆయ‌న‌పై ప్ర‌ధానంగా ద్ర‌విడోద్య‌మ ప్ర‌భావం ఉంద‌ని సుప్ర‌సిద్ధ క‌వి దివంగ‌త‌ సి. నారాయ‌ణ‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ద‌క్షిణాదిలో ద్ర‌విడోద్య‌మం ప్రారంభ‌మ‌య్యాక‌, రావ‌ణాసురుడు దాక్షిణాత్యుడ‌ని, ఆర్యుల‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఆయ‌న‌ను దుష్ట‌పాత్ర‌గా చిత్రీక‌రించార‌ని ద్ర‌విడులు గ‌ట్టిగా వాదించారు. లంకేశ్వ‌రుడైన రావ‌ణుని వారు క‌థానాయ‌కుడిగా రూప‌క‌ల్ప‌న చేశారు. రావ‌ణుడు దుష్టుడు కాడ‌నీ, ఆత్మాభిమానం ఉన్న‌వాడ‌నీ, సొంత వ్య‌క్తిత్వం ఉన్న‌వాడ‌నీ వారు సిద్ధాంతీక‌రించారు.  మ‌ద్రాసులో ఉన్న ఎన్టీఆర్‌కు ద్ర‌విడ ఉద్య‌మ‌క‌ర్త‌ల‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఓవైపు, పురాణ పాత్ర‌లు చ‌దివి ఆక‌ళించుకున్న విజ్ఞానం ఇంకోవైపు, స‌ముద్రాల‌-పింగ‌ళి గార్ల‌తో చ‌ర్చించి తీసుకున్న నిర్ణ‌యాలు మ‌రోవైపు.. క‌లిసి 'భూకైలాస్‌', 'సీతారామ‌ క‌ల్యాణం' చిత్రాల్లో రావ‌ణుని పాత్ర క‌ల్ప‌న‌కు దోహ‌దం చేశాయి. 'భూకైలాస్' సినిమాలో త‌ల్లిమాట‌ను శిర‌సావ‌హించే ప‌ర‌మ‌మూర్ఖ శివ‌భ‌క్తునిగా ఆత్మ‌లింగాన్ని సాధించ‌డానికి అత‌డు ప‌డ్డ అగ‌చాట్ల‌తో ఒక కొత్త రావ‌ణుడు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. గొప్ప శివ‌భ‌క్తునిగా ప్రేక్ష‌కుల సానుభూతిని సంపాదించాడు. 'సీతారామ క‌ల్యాణం' పూర్తిగా ఎన్టీఆర్ అభిరుచి మేర‌కు తీసిన చిత్రం. త‌న త‌ల్లి కోరిక మేర‌కు "శ్రీ సీతారాముల క‌ల్యాణం చూత‌ము రారండీ" అనే జాన‌ప‌ద పాట‌ను ఈ చిత్రం ద్వారా తెలుగునాట మ‌రింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. 1961లో ఈ చిత్రం విడుద‌లైతే, ఇప్ప‌టికీ ప్ర‌తి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజు సీతారాముల క‌ల్యాణం స‌మ‌యంలో ఈ పాట వేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

అక్ష‌రాలా రూ. 110.. విజ‌య‌శాంతి తొలి సినిమా పారితోషికం!

  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా పార్ట‌న‌ర్ ఒకాయ‌న కారులో వెళ్తుండ‌గా ఆ కారుకు పంక్చ‌ర్ అయింది. దాన్ని రిపేరుకు ఇచ్చి, అక్క‌డ ఎదురుగా క‌నిపించిన ర‌వి ఫొటో స్టూడియోకు వెళ్లాడాయ‌న‌. అక్క‌డ ఉన్న ఆల్బ‌మ్స్‌లోని ఫొటోల‌ను ప‌రిశీలిస్తుంటే ఒక‌మ్మాయి ఫొటో బాగా న‌చ్చింది. ఆ ఫొటో, ఆమె ఇంటి అడ్ర‌స్ ఇవ్వ‌మ‌ని స్టూడియో ఓన‌ర్‌ను అడిగాడు. ఆ ఓన‌ర్ అందుకు నిరాక‌రించి, ఆ విష‌యాన్ని ఆ అమ్మాయి వాళ్ల నాన్న‌కు చెప్పారు. ఆ అమ్మాయి.. విజ‌య‌శాంతి. విశ్వ‌శాంతి బ్యాన‌ర్ అధినేత‌ విశ్వేశ్వ‌ర‌రావు ర‌వి స్టూడియోలో తీయించిన ఆ స్టిల్స్‌ను భార‌తీరాజా యూనిట్‌లో ప‌నిచేస్తున్న అంబి అనే ఆయ‌న చూసి, "ఈ అమ్మాయి వాళ్ల నాన్న నాకు బాగా ఫ్రెండ్‌. మీకు ఆ అమ్మాయిని ప‌రిచ‌యం చేస్తాను." అని చెప్పి, వాళ్ల ఇంటికి వెళ్లి, విజ‌య‌శాంతి తండ్రితో మాట్లాడాడు. ఆయ‌న స‌రేన‌ని, త‌న కూతుర్ని వెంట‌బెట్టుకొని అంబితో క‌లిసి భార‌తీరాజా ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. వాళ్ల‌ను భార‌తీరాజాకు ప‌రిచ‌యం చేశాడు అంబి. ఆ టైమ్‌లో భార‌తీరాజా 'క‌ల్లుక్కుల్ ఈర‌మ్' అనే త‌మిళ సినిమా తీయ‌డానికి రెడీ అవుతున్నారు. హీరోయిన్‌గా కొత్త‌మ్మాయిని ప‌రిచ‌యం చేయాల‌ని, అప్ప‌టికే 300కు పైగా ఫొటోలు చూశారు. కానీ వారిలో ఎవ‌రూ ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. వెంట‌నే విజ‌య‌శాంతికి మేక‌ప్ టెస్ట్ చేయించారు భార‌తీరాజా. త‌న హీరోయిన్ దొరికేసింద‌ని ఆయ‌న‌కు అనిపించింది. అలా.. 'క‌ల్లుక్కుల్ ఈర‌మ్‌'తో హీరోయిన్‌గా గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌లోకి అడుగుపెట్టారు విజ‌య‌శాంతి. ఆ సినిమాలో న‌టించినందుకు ఆమె అందుకున్న పారితోషికం.. అక్ష‌రాలా 110 రూపాయ‌లు! ఆ త‌ర్వాత విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట్ చేసిన 'కిలాడీ కృష్ణుడు' సినిమాలో హీరో కృష్ణ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా తెలుగు చిత్ర‌సీమ‌లో కాలుపెట్టారు విజ‌య‌శాంతి. ఆ త‌ర్వాత ఆమె ఎలాంటి చ‌రిత్ర సృష్టించారో, తెలుగు సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్‌గా ఎలా ఎదిగారో మ‌నం చూశాం.

జంధ్యాల‌కు బాగా న‌చ్చిన కామెడీ సినిమాలేవో తెలుసా?

  తెలుగు సినిమా స్వ‌ర్ణ‌యుగ కాలంలో ఎన్నో హాస్య‌భ‌రిత చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యాన్ని అందించి, వారిని క‌డుపుబ్బా న‌వ్వించాయి. ఆ త‌ర్వాత చాలా కాలం మంచి కామెడీకి గ్ర‌హ‌ణం ప‌ట్టింద‌ని విశ్లేష‌కులు అంటారు. ద‌ర్శ‌కుడు జంధ్యాల రాక‌తో కామెడీకి తెలుగు సినిమాల్లో తిరిగి ప‌ట్టాభిషేకం జ‌రిగింది. ఆయ‌న రూపొందించిన 'శ్రీ‌వారికి ప్రేమ‌లేఖ' (1984) ప్రేక్ష‌కుల‌ను ప‌డీప‌డీ న‌వ్వించింది. హాయి క‌లిగించే వినోదాన్ని అందించింది. ఆ సినిమా స్ఫూర్తితో తిరిగి కామెడీ సినిమాల హ‌వా మొద‌లైంది. జంధ్యాల 'హాస్య‌బ్ర‌హ్మ‌'గా కీర్తి సంపాదించారు. అలాంటి జంధ్యాల‌కు త‌ను తీసిన సినిమాలు కాకుండా హాస్య సినిమాల్లో ఏవి ఇష్టం? జంధ్యాల‌కు వ్య‌క్తిగ‌తంగా వెనుక‌టి సినిమాల్లో కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయ‌న తీసిన కామెడీ సినిమాలు చూస్తే మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.. వాటిలో కొన్ని క్యారెక్ట‌ర్స్ కానీ, మాట‌లు కానీ.. వాటివ‌ల్లే ప్ర‌భావితులై చేశార‌ని. షావుకారు (1950), మిస్స‌మ్మ‌ (1955), క‌న్యాశుల్కం (1955), మాయాబ‌జార్‌ (1957)  సినిమాల్లో పాత్ర‌ల చిత్ర‌ణ ఆయ‌న‌కు చాలా ఇష్టం. 'క‌న్యాశుల్కం' నాట‌కం అనుకోండి. సినిమాగా వ‌చ్చింది కాబ‌ట్టి మ‌నం సినిమాగా మాట్లాడుకుంటున్నాం. అయిన‌ప్ప‌టికీ ఆ సినిమాలోని క్యారెక్ట‌రైజేష‌న్ కానీ, మాయాబ‌జార్‌లో ఎస్వీ రంగారావు చేసిన ఘ‌టోత్క‌చుడు పాత్ర ద‌గ్గ‌ర ఉండే శిష్యుల క్యారెక్ట‌ర్స్‌, శశిరేఖా ప‌రిణ‌యం సీన్ అంటే జంధ్యాల‌కు తెగ ఇష్టం.  ఇంకా 'పెళ్లిచేసి చూడు' (1952), 'అప్పుచేసి ప‌ప్పుకూడు' (1959), 'ప్రేమించి చూడు' (1965) మంచి కామెడీ సినిమాల‌నేది ఆయ‌న అభిప్రాయం. ఆయ‌న దృష్టిలో 'ప్రేమించి చూడు' మంచి డెప్త్ ఉన్న కామెడీ. వాటిల్లో మ‌న‌కు నిజ‌జీవితంలో క‌నిపించే పాత్ర‌లు క‌నిపిస్తాయని చెప్పేవారు జంధ్యాల‌. "అప్ప‌ట్లో మ‌నుషుల్లోని మంచిత‌నం, అమాయ‌క‌త్వం ఆ పాత్ర‌ల్లో ప్ర‌తిబింబిస్తే, ఇవాళ్లి స‌మాజం సినిమాల్లో ఇవాళ్టికి త‌గ్గ‌ట్లు ప్ర‌తిబింబిస్తోంది. అందుకే గ‌తంలో బూతు అని సెన్సారు అనుమ‌తించ‌ని ప‌దాలు ఇవాళ్లి సినిమాల్లో వారి అనుమ‌తితోనే వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు అశ్లీలం అనిపించేవి ఇవాళ సినిమా టైటిల్స్ అవుతున్నాయి. ఏది మంచి సినిమా.. ఏది చెడ్డ సినిమా అని చెప్ప‌డం క‌ష్టం కానీ, సినిమా అనేది చెడువైపు వెళ్ల‌కుండా ఉంటే చాలు. అటువైపు వెళ్ల‌కుండా హాయిగా న‌వ్వించొచ్చు." అని ఒక‌సారి చెప్పారు జంధ్యాల‌.

ఒక‌ప్పుడు భానుమ‌తి ప‌రిచ‌యం చేసిన ఈ బాల‌న‌టిని గుర్తుప‌ట్టారా?

  బాల తార‌ల‌తో భానుమ‌తి త‌మ భ‌ర‌ణీ స్టూడియోలో నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా 'భ‌క్త ధ్రువ‌ - మార్కండేయ‌'. మొద‌ట ఈ చిత్రాన్ని పెద్ద‌వాళ్ల‌తోనే తియ్యాల‌ని ఆమె అనుకున్నారు. కాని, క‌న్న‌డంలో ఎవ‌రో తీస్తున్నార‌ని తెలుసుకొని ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నారు. త‌ర్వాత పిల్ల‌ల‌తో, హైద‌రాబాద్‌లో క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌నుకున్నారు. పిల్ల‌ల‌తో సినిమా - అందులోనూ పౌరాణికం తియ్యాలంటే ఎంతో ఉత్సాహం, ఓపిక ఉండాలి. కామేశ్వ‌ర‌రావు గారికి ఇత‌ర‌త్రా చిత్రాలుండ‌టం వ‌ల్లా, పిల్ల‌ల‌తో శ్ర‌మ‌తీసుకొని ఉత్సాహంగా చేయించే వ‌య‌సు ఆయ‌న‌ది కాదు క‌నుకా, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను భానుమ‌తి స్వ‌యంగా చేప‌ట్టారు. 'భ‌క్త ధ్రువ - మార్కండేయ‌'కు స్క్రిప్టు రాసింది కూడా ఆమే. పౌరాణికం కాబ‌ట్టి భాష జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే అభిప్రాయంతో మంచి ర‌చ‌యిత‌ల కోసం ప్ర‌య‌త్నించారు. ఆ టైమ్‌కు స‌రైన వాళ్లెవ‌రూ ఆమెకు ల‌భించ‌లేదు. దాంతో ర‌చ‌నా వ్యాసంగంలో త‌న‌కున్న అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు కూడా ఆమే రాశారు. నిజానికి ఆమె ఈ స‌బ్జెక్టును 1974లోనే అనుకున్నారు. ఏడేళ్ల త‌ర్వాత‌.. అంటే 1981లో ప్రారంభించారు. 'భ‌క్త ధ్రువ - మార్కండేయ' చిత్రంలో ధ్రువునిగా బేబీ వంశీకృష్ణ‌, మార్కండేయ‌గా బేబీ పింకీ (బొంబాయి) న‌టించారు.  నార‌దునిగా ర‌విశంక‌ర్ (సాయికుమార్ త‌మ్ముడు), ఈశ్వ‌రునిగా మూర్తి (సంగీత ద‌ర్శ‌కుడు స‌త్యం కుమారుడు), సురుచిగా రోహిణి, సునీతిగా శోభ‌న న‌టించ‌డం ఈ సినిమాకు సంబంధించిన విశేషం. ఈ చిత్రంలో న‌టించిన‌ పిల్ల‌లంతా 13 సంవ‌త్స‌రాల లోపువాళ్లే. సునీతిగా న‌టించిన శోభ‌న‌కు ఇదే తొలి చిత్రం. త‌ర్వాత కాలంలో స్టార్ హీరోయిన్‌గా రాణించడ‌మే కాకుండా న‌ట‌న‌లో రెండు జాతీయ అవార్డులు స‌హా ప‌లు అవార్డుల‌ను అందుకున్న శోభ‌న‌, ఈ బేబి శోభ‌న ఒక్క‌రే. ఆమె ప్ర‌ముఖ తార‌లు ల‌లిత‌, ప‌ద్మినిల‌ మేన‌కోడ‌లు. చిత్ర స్వామినాథ‌న్ ద‌గ్గ‌ర నాట్యంలో శిక్ష‌ణ పొందుతూ ఈ సినిమాలో న‌టించారు శోభ‌న‌. భర‌ణీ సంస్థ నిర్మించే చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌క‌త్వం ఎవ‌రు వ‌హించినా, అందులో భానుమ‌తిగారి చేయి ఉంటుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. 'భ‌క్త ధ్రువ - మార్కండేయ‌'కు సాలూరి రాజేశ్వ‌ర‌రావు సంగీతం అందించారు. రాజేశ్వ‌ర‌రావు-భానుమ‌తి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్ హిట్స్‌గా పేరుపొందిన‌వే. ఈ చిత్రంలో ఎనిమిది పాట‌లు, మూడు ప‌ద్యాలు, రెండు శ్లోకాలు ఉన్నాయి. పాట‌ల‌ను ఆరుద్ర‌, వేటూరి, కొస‌రాజు, సి. నారాయ‌ణ‌రెడ్డి, శార‌దా అశోక‌వ‌ర్ధ‌న్ రాశారు. ఈ చిత్రం 1982లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్ గురించి మీకు తెలీని నిజాలు!

  దిగ్ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి నిర్దేశ‌క‌త్వంలో జూనియ‌ర్ శ్రీ‌రంజ‌ని టైటిల్ రోల్ పోషించిన‌ 'గుణ‌సుంద‌రి క‌థ' (1949) సినిమా నిర్మాణ స‌మ‌యంలో కె. విశ్వ‌నాథ్ మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. స‌రిగ్గా ఆ టైమ్‌లోనే ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు 'షావుకారు' సినిమాకు బుక్ అయ్యారు. అంటే వారంతా దాదాపు ఒకేసారి త‌మ కెరీర్‌ను ప్రారంభించార‌న్న మాట‌. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ అయిన బి.ఎన్‌. రెడ్డికి విద్యావంతులైన యువ‌కుల‌ను చేర‌దీసి, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్ష‌ణ ఇచ్చి, ఆ త‌ర్వాత వారిలో టాలెంట్ ఉన్న‌వాళ్ల‌ను త‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని ఉండేది. ఆ విధంగానే విశ్వ‌నాథ్‌ను వాహినీ సంస్థ‌లో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నారు. సినీ రంగంలోని చాలా మందికి కూడా తెలీని విష‌య‌మేమంటే, వాహినీ పిక్చ‌ర్స్‌లో విశ్వ‌నాథ్ తండ్రి కాశీనాథుని సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ప‌నిచేశారు. ఆయ‌న బి.ఎన్‌. రెడ్డికి స‌మ‌కాలికులు. 1938 నుంచి అంటే 'వందేమాత‌రం' చిత్రంతో వాహినీ సంస్థ ఆరంభ‌మైన‌ప్ప‌ట్నుంచీ ఆ సంస్థ‌లో సుబ్ర‌హ్మ‌ణ్యం ఉన్నారు. ఈ అనుబంధం కార‌ణంగానే విశ్వ‌నాథ్‌ను బి.ఎన్‌. రెడ్డి మొద‌ట టెక్నీషియ‌న్‌గా ఎంచుకొని, త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని అనుకున్నారు. 'బంగారు పాప‌', 'మ‌ల్లీశ్వ‌రి' లాంటి క్లాసిక్స్ నిర్మిస్తున్న‌ప్పుడు ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి వ‌ద్ద‌, ఛాయాగ్రాహ‌కుడు మార్క‌స్ బార్‌ట్లీ వంటి వారి సాహ‌చ‌ర్యంలో విశ్వ‌నాథ్ ప‌నిచేశారు.  సౌండ్ రికార్డింగ్ అన్న‌ది సినిమా నిర్మాణంలో ఒక విభాగం. కానీ, డైరెక్ట‌ర్ ఆదుర్తి సుబ్బారావు రీరికార్డింగ్‌ను కూడా ధైర్యంగా విశ్వ‌నాథ్‌కు అప్ప‌గించి వెళ్లేవారు. ఆయ‌న‌కు డైరెక్ష‌న్ మీద ఉత్సాహం ఉంద‌నే అభిప్రాయంతోనే ఆదుర్తి ఆ ప‌నిచేసేవారు. 'స్వ‌ప్న‌సుంద‌రి', 'లైలా మ‌జ్ను', 'తోడికోడ‌ళ్లు' లాంటి సినిమాల‌కు సౌండ్ రికార్డిస్ట్‌గా ప‌నిచేయ‌డంతో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో ప‌రిచ‌యం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. అన్న‌పూర్ణా పిక్చ‌ర్స్ వాళ్ల 'తోడికోడ‌ళ్లు', 'మాంగ‌ల్య బ‌లం', 'ఇద్ద‌రు మిత్రులు' సినిమాల‌ను వాహినీలోనే తీశారు. దాంతో అక్కినేని, విశ్వ‌నాథ్ బాగా స‌న్నిహితుల‌య్యారు. ఇక ఆదుర్తికి విశ్వ‌నాథ్ ఎంత ద‌గ్గ‌ర‌య్యారంటే.. వాహినీలో రికార్డిస్టుగా ఉన్న‌ప్పుడు ఆదుర్తి సొంత చిత్రం 'మూగ‌మ‌న‌సులు' స్క్రిప్టు డిస్క‌ష‌న్స్‌లో ప్ర‌తిరోజూ ఆఫీసు అవ‌గానే సాయంత్రం పూట పాల్గొనేవారు విశ్వ‌నాథ్. ఆ త‌ర్వాత ఆదుర్తికి అసోసియేట్‌గా అన్న‌పూర్ణ సంస్థ‌లో చేరారు. అందులో నాలుగేళ్లు వ‌ర్క్ చేశారు విశ్వ‌నాథ్‌. అప్పుడు 'చ‌దువుకున్న అమ్మాయిలు', 'డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి' లాంటి సినిమాల‌కు ప‌నిచేశారు. 'మూగ‌మ‌న‌సులు'కు సెకండ్ యూనిట్ డైరెక్ట‌ర్‌గా చేశారు. 'తేనె మ‌న‌సులు' చిత్రానికి ఎంపికైన కృష్ణ‌, రామ్మోహ‌న్‌, సుక‌న్య‌, సంధ్యారాణి త‌దిత‌ర‌ న‌టుల‌కు ట్రైనింగ్ ఇవ్వ‌డంలో పాల్గొన్నారు. 1966లో అక్కినేని హీరోగా అన్న‌పూర్ణ సంస్థ నిర్మించిన 'ఆత్మ‌గౌర‌వం'తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యారు విశ్వ‌నాథ్‌. ఆ త‌ర్వాత క‌థ చాలా మందికి తెలిసిందే. తెలుగు సినిమా గ‌ర్వించే ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా, లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌గా కాశీనాథుని విశ్వ‌నాథ్ పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు.

'ల‌వ‌కుశ‌'లో ప‌ట్టుబ‌ట్టి ల‌క్ష్మ‌ణ పాత్ర‌ను కాంతారావుకు ఇప్పించిన ఎన్టీఆర్‌!

  తొలి తెలుగు టాకీ 'భ‌క్త ప్ర‌హ్లాద' తీసిన హెచ్‌.ఎం. రెడ్డి ఆఫీసులో క‌త్తివీరుడు కాంతారావుకు న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు తొలిసారిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ 'జ‌య‌సింహ' చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తూ ఆ చిత్రంలో త‌న త‌మ్ముడు విజ‌య‌సింహ పాత్ర‌కు మొద‌ట నాగేశ్వ‌ర‌రావునూ, త‌ర్వాత జ‌గ్గ‌య్య‌నూ అనుకొని, చివ‌ర‌కు ఆ అవ‌కాశాన్ని కాంతారావుకు ఇచ్చారు. ఆ చిత్రంలో అన్న‌ద‌మ్ములుగా న‌టించిన వారు నిజ జీవితంలోనూ అన్న‌ద‌మ్ములుగా మెలిగేవారు. ఆ అభిమానంతోనే 'సీతారామ క‌ల్యాణం' చిత్రంలో నార‌ద పాత్ర‌ను కాంతారావుకు ఇచ్చి, ఆయ‌న చేత కామెడీ చేయించిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కే చెల్లింది. క్లాసిక్ ఫిల్మ్ 'ల‌వ‌కుశ‌' (1963)లో మొద‌ట ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌కు కాంతారావును నిర్మాత‌లు తీసుకున్నారు. అయితే మ‌ధ్య‌లో ఆయ‌న‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ప్పుడు, నిజ‌మైన సోద‌రునిగా చొర‌వ తీసుకొని, "ఆ పాత్ర‌ను కాంతారావే పోషించాలి. ఆర్టిస్టును మార్చ‌డానికి వీల్లేదు." అని నిర్మాత‌ల‌కు గ‌ట్టిగా చెప్పి, ప‌ట్టుబ‌ట్టి కాంతారావు చేతే ల‌క్ష్మ‌ణ పాత్ర‌ను ధ‌రింప‌జేశారు ఎన్టీఆర్‌. ఆ పాత్ర కాంతారావుకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఎన్నో జాన‌ప‌ద చిత్రాల్లో, పౌరాణిక చిత్రాల్లో న‌టించారు. పౌరాణికాల్లో శ్రీ‌కృష్ణునిగా ఎన్టీఆర్ న‌టిస్తే, నార‌దునిగా కాంతారావు, అర్జునునిగా ఎన్టీఆర్ న‌టిస్తే, శ్రీ‌కృష్ణునిగా కాంతారావు న‌టించ‌డానికి ముఖ్య‌కార‌ణం ఎన్టీఆరే. 'వీరాభిమ‌న్యు'లో అర్జునునిగా కాంతారావు న‌టించారు. అందులో బృహ‌న్న‌ల‌గా న‌టించాల్సి వ‌చ్చిన‌ప్పుడు, న‌ర్త‌న‌శాల‌లో రామారావు పోషించిన బృహ‌న్న‌ల పాత్ర‌ను గుర్తుచేసుకొని 'ఈ పాత్ర‌కు నేను న్యాయం చెయ్య‌గ‌ల‌నా?' అని సందిగ్ధంలో ప‌డ్డారు. అప్పుడు రామారావు, "ఇది చిన్న సీన్‌ మాత్ర‌మే. కాబ‌ట్టి నాట్య భంగిమ కంటే న‌డ‌క‌లో స్త్రీత్వం చూపిస్తే చాలు." అని స‌ల‌హా ఇచ్చి, ధైర్యంనింపి ఆ పాత్ర రాణింపుకు దోహ‌ద‌ప‌డ్డారు.

శ్యామ‌ల‌గౌరి ప‌రిచ‌య‌మైంది 'త‌రంగిణి'తో కాదు.. 'ప్రేమ సంకెళ్లు'తో! ఆ క‌థేమిటంటే...

  శ్యామ‌ల‌గౌరి అన‌గానే మ‌న‌కు 'త‌రంగిణి' (1982) సినిమా గుర్తుకొస్తుంది. కోడి రామ‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో టైటిల్ రోల్‌లో ఆమె న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఆ సినిమాతో హీరోగా సుమ‌న్ ప‌రిచ‌య‌మ‌య్యారు. శ్యామ‌ల కూడా ఆ సినిమాతోటే ప‌రిచ‌య‌మైన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే నిజానికి ఆమె ప‌రిచ‌య‌మైంది విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట్ చేసిన 'ప్రేమ సంకెళ్లు' (1982)చిత్రంతో.  అందులో న‌రేశ్ కుమార్‌, శ్యామ‌ల‌గౌరి హీరో హీరోయిన్లుగా న‌టించారు. న‌రేశ్ కుమార్ అంటే ఎవ‌రో కాదు, విజ‌య‌నిర్మ‌ల కుమారుడు న‌రేశే! కెరీర్ మొద‌ట్లో న‌రేశ్ కుమార్ అనే పేరుతోటే ఆయ‌న న‌టించారు. త‌ర్వాత 'కుమార్‌'ను తీసేసి, న‌రేశ్‌గా స్థిర‌ప‌డ్డారు. జంధ్యాల రూపొందించిన 'నాలుగు స్తంభాలాట' చిత్రంతో న‌రేశ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమాతో పాటే 'ప్రేమ‌ సంకెళ్లు' చిత్రం కూడా మొద‌లైంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం విజ‌య‌నిర్మ‌ల చాలా క‌ష్ట‌ప‌డ్డారు. కొత్త హీరోయిన్ కావాల‌ని అన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న వేసిన ద‌గ్గ‌ర్నుంచీ రోజుకు యావ‌రేజ్‌గా ప‌దిమంది అమ్మాయిల దాకా విజ‌య‌నిర్మ‌ల‌ను క‌లుస్తూ వ‌చ్చారు. వాళ్లెవ‌రిలోనూ త‌న క‌థానాయిక క‌నిపించ‌లేదు ఆమెకు. డైరెక్టుగా వ‌చ్చిన వాళ్ల‌ను ప‌క్క‌న‌పెడితే, కొన్ని వేల ఫొటోలు వాళ్ల ఆఫీసుకు వ‌చ్చాయి. వాటిలో ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన అమ్మాయిల ద‌గ్గ‌ర్నుంచి 40 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన వారి వ‌ర‌కు ఉన్నారు. దాదాపు రెండు నెల‌ల పాటు హీరోయిన్ అన్వేష‌ణ‌తోనే గ‌డిచిపోయింది. అన్ని వేల ఫొటోల్లో విజ‌య‌నిర్మ‌ల‌కు బాగా న‌చ్చిన‌వి ఇద్ద‌రి ఫొటోలు మాత్ర‌మే! ఆ ఇద్ద‌రిలో ఒక అమ్మాయిని బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఉన్నంత గ్లామ‌ర‌స్‌గా క‌ల‌ర్ స్టిల్స్‌లో లేక‌పోవ‌డంతో, హైట్ ప్రాబ్ల‌మ్ వ‌ల్లా వ‌ద్ద‌నుకున్నారు. ఇంకో ఫొటోలోని అమ్మాయి వారికి అన్ని విధాలా న‌చ్చింది. బొంబాయిలో ఉన్న ఆమెను పిలిపించి, న‌రేశ్‌తో జంట‌గా చాలా స్టిల్స్ తీశారు. స్క్రీన్ టెస్ట్ కోసం న‌రేశ్‌తో కొన్ని దృశ్యాలు చిత్రీక‌రించి ర‌ష్ చూశారు. 'ప్రేమ సంకెళ్లు'కు కావాల్సిన అమ్మాయి దొరికేసింద‌ని అప్పుడు అనిపించింది. ఆమే.. శ్యామ‌ల‌గౌరి. అప్పుడామె వ‌య‌సు ప‌ద‌హారేళ్లు. 1965 ఆగ‌స్ట్ 10న ఆమె పుట్టింది. హిందీ, ఇంగ్లీష్, త‌మిళ భాష‌ల్లో అప్ప‌టికే ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. 10వ క్లాస్ దాకా బొంబాయిలో చ‌దువుకొని, 1980-81 మ‌ధ్య ఒక సంవ‌త్స‌రం మ‌ద్రాస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా పొందిందామె. అక్క‌డ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌యి, తిరిగి బొంబాయ్ వెళ్లిపోయింది. అప్పుడే విజ‌య‌కృష్ణా మూవీస్ 'ప్రేమ సంకెళ్లు' సినిమా కోసం హీరోయిన్లు కావాల‌నే ప్ర‌క‌ట‌న చూసి, స్టిల్స్ పంపించి, హీరోయిన్‌గా సెల‌క్ట‌యింది. చిన్న‌త‌నం నుంచీ డాన్స్ అంటే బాగా ఇష్ట‌మున్న శ్యామ‌ల.. అప్ప‌టికే భ‌ర‌త‌నాట్యం పోటీల్లో గోల్డ్ మెడ‌ల్ కూడా సంపాదించేసింది. అట్లా విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట్ చేసిన 'ప్రేమ సంకెళ్లు' మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది శ్యామ‌ల‌గౌరి. అయితే 'ప్రేమ సంకెళ్లు' ఫ్లాపై, 'త‌రంగిణి' సినిమా హిట్ట‌వ‌డంతో కాల‌క్ర‌మంలో ఈ రెండో సినిమాతోటే ఆమె నాయిక‌గా ప‌రిచ‌య‌మైంద‌నేది ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

చిన్న‌త‌నంలోనే ఇరాక్‌లో యుద్ధాన్ని చూసిన‌ గౌత‌మి!

  న‌టి గౌత‌మి శ్రీ‌కాకుళంలో ఓ డాక్ట‌ర్ల కుటుంబంలో జ‌న్మించారు. ఆమె త‌ల్లిదండ్రులు టి.ఆర్‌. శేష‌గిరిరావు, వ‌సుంధ‌రాదేవి.. ఇద్ద‌రూ డాక్ట‌ర్లే. గౌత‌మి చిన్న‌త‌నం చాలా స‌ర‌దాగా గ‌డిచింది. ఆమె నాలుగో క్లాస్‌లో ఉన్న‌ప్పుడు ఓ చిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. అప్పుడు వాళ్ల అమ్మానాన్న‌లు ఇరాక్‌లో ఉండేవారు. ఓసారి సెల‌వుల‌కు గౌత‌మి, ఐదో క్లాస్ చ‌దువుతున్న‌ వాళ్ల‌న్న‌య్య క‌లిసి ఇరాక్‌కు వెళ్ల‌డానికి బెంగ‌ళూరు నుంచి బొంబాయి వెళ్లి, అక్క‌డ్నుంచి ఫ్లైట్‌లో టెహ్రాన్ ఎయిర్‌పోర్టులో దిగారు. వాళ్ల‌కు అక్క‌డి భాష రాదు. అక్క‌డివాళ్ల‌కు ఇంగ్లీష్ రాదు. పాసింజ‌ర్స్ అంతా వెళ్లిపోయారు.  వాళ్ల ల‌గేజ్ సెక్యూరిటీ చెక‌ప్ పూర్తిచేసుకొని రావ‌డానికి కొంచెం ఆల‌స్యం అయింది. చివ‌ర‌కు అన్నాచెల్లెళ్లిద్ద‌రే మిగిలారు. ఏం చెయ్య‌డానికీ పాలుపోలేదు. అక్క‌డ  సెక్యూరిటీ వాళ్లు చాలా స్ట్రిక్టుగా ఉంటారు. ప్ర‌యాణీకుల్ని రిసీవ్ చేసుకోవ‌డానికి వ‌చ్చేవాళ్ల‌ను ఎయిర్‌పోర్ట్ లోనికి రానివ్వ‌రు. ఆ కార‌ణంగా గౌత‌మి వాళ్ల అమ్మానాన్న‌లు బ‌య‌టే ఉండిపోయారు. పిల్ల‌లిద్ద‌రూ ఎటు వెళ్లాలో, ఏమిటో తెలీని ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆప‌ద్బాంధ‌వుడిలా ఓ సెక్యూరిటీ గార్డు వాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వారిని బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. అక్క‌డ అమ్మానాన్న‌లు క‌నిపించ‌డంతో ప్రాణం లేచివ‌చ్చిన‌ట్ల‌యింది. భావోద్వేగంతో వాళ్ల‌ను క‌రుచుకుపోయారు. ఆ టైమ్‌లోనే ఇరాక్‌లో వాళ్లుంటున్న ఇంటి ద‌గ్గ‌ర ఓ భ‌యాన‌క ఘ‌ట‌న జ‌రిగింది. వారి ఇల్లు ఇరాక్‌-ఇరాన్ బోర్డ‌ర్‌లో ఉండేది. ఓ రోజున గౌత‌మి, వాళ్ల‌న్న‌య్య ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు. బ‌య‌ట ట‌పాకాయ‌లు పేలిన శ‌బ్దం వినిపించింది. ఏమిటో చూద్దాం అని ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వెళ్లి చూశారు. చుట్టుప‌క్క‌ల ఏమీ క‌నిపించ‌లేదు. కానీ శ‌బ్దం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆ శ‌బ్దం వ‌చ్చిన దిశ‌లో.. అంటే వాళ్ల ఇంటి వెనుక‌వైపు.. ఓ కొండ ఉంది. అదేమిటో చూద్దామ‌ని పిల్ల‌లిద్ద‌రూ ఆ కొండ ఎక్కారు. ఇంకేముందీ.. అవ‌త‌ల‌.. మిల‌ట‌రీ సోల్జ‌ర్స్‌.. వాళ్ల చేతుల్లో గ‌న్స్‌!.. విష‌యం ఏమంటే.. అక్క‌డ‌ప్పుడు యుద్ధం జ‌రుగుతోంది. ఓ వైపు గ‌న్స్ పేలుతున్నాయి, ఇంకోవైపు బాంబులు మోగుతున్నాయి. పైప్రాణాలు పైనే పోయినంత ప‌నై, భ‌యంతో వ‌ణుకుతూ ఇంటికి ప‌రుగెత్తుకొని వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత చూస్తే, వాళ్లున్న టౌన్‌కూ, ప‌క్క‌నే ఉన్న ప‌ల్లెకూ మ‌ధ్య‌నున్న రోడ్డు పూర్తిగా దెబ్బ‌తింది. ఎంత‌గా అంటే.. అటువాళ్లు ఇటుకానీ, ఇటువాళ్లు అటుకానీ వెళ్ల‌డానికి వీల్లేని ప‌రిస్థితి. అదొక చిత్ర‌మైన‌, భ‌యాందోళ‌న‌ల‌ను గురించేసిన ఘ‌ట‌న‌. ఇప్ప‌టికీ దాన్ని త‌ల‌చుకుంటే గౌత‌మికి ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంటుంది.

షూటింగ్ సెట్‌లో ఆట‌ప‌ట్టించిన కృష్ణ‌.. వ‌దిలెయ్య‌మ‌న్న‌ అల్లు రామ‌లింగ‌య్య‌!

  మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్ ప‌దో ఫ్లోర్‌లో "చంద‌మామ‌తో బిళ్లంగోడు ఆడిన‌ట్లు దిక్కుల‌న్నీ అదిరిప‌డ్డ‌వి.. అరెరె రెరెరెరే చుక్క‌ల‌న్నీ చెదిరిప‌డ్డ‌వి.." అంటూ పాట వినిపిస్తోంది. కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌, గీత‌, జ్యోతిల‌క్ష్మిల‌కు చేయాల్సిన మూవ్‌మెంట్‌ను వివ‌రిస్తున్నారు కొరియోగ్రాఫ‌ర్ శ్రీ‌ను. ఇంత‌లో అల్లు రామ‌లింగ‌య్య సెట్‌లోకి వ‌చ్చారు. లాల్చీ ధ‌రించి, భుజంమీద కండువా వేసుకొని, మంచి యంగ్ గెట‌ప్‌లో ఠీవిగా న‌డ‌చివ‌స్తున్న అల్లును చూసి.. "ఏమిటీ ప్రేమాభిషేకం గెట‌ప్‌. పాపారాయుడి పోజు కొట్టుకుంటూ వ‌స్తున్నారు. హీరో అవుదామ‌ని ట్రై చేస్తున్నారా ఏంటి? నేనిప్పుడే రామారావు, నాగేశ్వ‌ర‌రావు గార్ల‌కు చెప్తాను." అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు కృష్ణ‌. "అయ్యా మీరు హీరోలు, మేం క‌మెడియ‌న్స్‌. సినిమాల్లో ఎలాగూ ఏడిపిస్తారు. బ‌య‌టైనా మ‌మ్మ‌ల్ని మామూలుగా ఉండ‌నియ్యండ‌య్యా.." అంటూ మందు కొట్టిన‌వాడిలా, మ‌త్తు ఎక్కుతున్న‌వాడిలా న‌టిస్తూ మాట్లాడారు.  అక్క‌డ సెట్ లైటింగ్ అరేంజ్‌మెంట్స్‌ను చెక్ చేస్తున్న డైరెక్ట‌ర్ పి. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, "ఏమండీ రామ‌లింగ‌య్య‌గారూ.. మీ షాట్ ఇంకా అర‌గంట త‌ర్వాత తీస్తాం. ఇప్ప‌ట్నుంచే తాగుబోతు మూడ్‌లో మీరు ఉండాల్సిన అవ‌స‌రం లేదు. షాట్ తీసే ముందు మీకు చెప్తాను. అప్పుడు తాగుబోతు మూడ్‌లోకి వ‌ద్దురుగానీ." అన్నారు. వెంట‌నే కృష్ణ అందుకొని, "ఏమిటీ.. ఈయ‌న తాగుబోతు మూడ్‌లో సాంగ్ పాడ‌తారా ఇప్పుడు మీరు తీసే షాట్‌లో? అన‌డిగారు. "ఈ సినిమాలో ఈయ‌న‌కు అమ్మాయిలంటే భ‌లే మోజు. క‌నిపించిన ప్ర‌తి అమ్మాయి వెంటా ప‌డుతూ ఉంటాడు. ఎంత‌మంది అమ్మాయిల ద‌గ్గ‌ర‌కు పెళ్లిచూపుల‌కు వెళ్లినా ఏదో ఒక ఇబ్బంది ఎదుర‌వుతుంటుంది. ఓసారి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లిచూపుల‌క‌ని బ‌య‌ల‌దేర‌బోతూ ఉంటే, 'అయ్యా మీరు ఆ అమ్మాయిని పెళ్లిచూపులు చూడ్డానికి వెళ్ల‌కూడ‌దు.' అని అల్లు రామ‌లింగ‌య్య ఫ్రెండ్ ఒకాయ‌న ఆపుతాడు. 'ఏమిట‌య్యా నాకు ఇప్పుడు ఏం త‌క్కువ‌య్యింద‌ని.' అని రామ‌లింగ‌య్య రెచ్చిపోతాడు. 'బాబూ.. ఆ అమ్మాయి త‌ల్లిని 20 సంవ‌త్స‌రాల క్రితం మీరు పెళ్లిచూపులంటూ వెళ్లి చూశారు. క‌నుక ఇప్పుడు ఈ అమ్మాయి మీకు కూతురు వ‌ర‌స అవుతుంది. క‌నుక మీరు వెళ్ల‌కూడ‌దు.' అని ఆయ‌న చెప్పేస‌రికి, 'ఇదీ నిజ‌మే' అని ఆగిపోతాడు. అలాగే గీత‌ను ల‌వ్ చేస్తాడు. గీత పోలీసాఫీస‌ర్ అయిన మిమ్మ‌ల్ని ప్రేమిస్తోంద‌ని తెలిసి, భ‌య‌ప‌డి ఆ ప్ర‌య‌త్నం మానేస్తాడు. ఇలా ర‌క‌ర‌కాలుగా స‌ర‌దాగా సాగే ఈయ‌న పాత్ర ఈరోజు తీసే సాంగ్‌లో 'మ‌న‌సు గ‌తి ఇంతే అంటూ' మందు చేత్తో ప‌ట్టుకొని బాధ‌ప‌డే బిట్స్ తీయాలి. ఆ త‌ర్వాత డాన్స్‌లో జ్యోతిల‌క్ష్మి పోజు చూసి 'భ‌లేమంచి పోజు ఖ‌రీదైన పోజు' అంటూ ఆమె వెంట‌ప‌డే షాట్స్ తియ్యాలి." అని వివ‌రించారు చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. "మొత్తానికి ఈ సినిమాలో పాట పాడ‌తార‌న్న మాట." అన్నారు రామ‌లింగ‌య్య‌తో కృష్ణ‌. "ఈ పాట‌లోని బిట్‌లే కాకుండా రామ‌లింగ‌య్య‌, గీత‌ల‌పై ఓ పాట తియ్యాల‌నుకుంటున్నామండీ అన్నారు." అక్క‌డే ఉన్న‌ చిత్ర స‌మ‌ర్ప‌కులు ఎన్‌.వి. సుబ్బ‌రాజు. "ఓహో అదన్న మాట సంగ‌తి. అందుకే ఇంత పోజుకొడుతూ సెట్లోకి వ‌చ్చారు." అని అల్లుని చూపిస్తూ కృష్ణ‌ అనేస‌రికి, "నాయ‌నా కృష్ణా.. ఇక ఆ విష‌యం వ‌దిలెయ్‌. ప‌డ‌క ప‌డ‌క ఈ గెట‌ప్‌లో నీ క‌ళ్ల‌లోనే ప‌డ్డాను." అన్నారు రామ‌లింగ‌య్య‌. "స‌రే మీరు కాసేపు ప‌క్క‌న ఉండండి. ఈ షాట్‌లో మీరు లేరు. షాట్‌లో మీరు లేకుండా ఇప్పుడు ఇక్క‌డికి ఎందుకొచ్చారు. అన‌వ‌స‌రంగా మ‌మ్మ‌ల్ని న‌వ్విస్తూ టైమ్ వేస్ట్ చేయించ‌డానికా?" అని మ‌ళ్లీ అడిగారు కృష్ణ‌. "ఏడీ ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎక్క‌డ‌? న‌న్ను ర‌మ్మ‌న్నాడు. షాట్ రెడీ అన్నాడు. అత‌ను ఏడండీ." అంటూ సెట్ అంతా వెతుకుతున్నారు. "మీరు అడుగుతున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అడుగో ఫ్లోర్ బ‌య‌ట నుంచి సెట్‌లోకి వ‌స్తున్నాడు చూడండి." అని కృష్ణ చెప్పారు. రామ‌లింగ‌య్య సీరియ‌స్‌గా, "ఏమ‌య్యా షాట్ రెడీ అంటూ వ‌చ్చావు. ఇంకా రెడీ అవ‌లేదంట క‌దా." అని నిల‌దీసి అడిగారు. "ఆ విష‌య‌మే మీతో చెపుదామ‌ని బ‌య‌ట‌కు వెళ్లి మీకోసం వెతుకుతున్నానండీ." అన్నాడ‌త‌ను. "నేను ఇక్క‌డే ఉన్నాను క‌దా.." అని రామ‌లింగ‌య్య ఆశ్చ‌ర్యంగా చూశారు. "ఇంత‌మంది ఆర్టిస్టుల మ‌ధ్య‌లో మీరు క‌నిపించ‌లేదేమో.." అని జోక్ చేశారు ఆప‌రేటివ్ కెమెరామ‌న్ ల‌క్ష్మ‌ణ్ గోరే. ఇదంతా 'ప‌గ‌బ‌ట్టిన సింహం' సెట్స్ మీద నిజంగా జరిగిన ఓ స‌ర‌దా స‌న్నివేశం. క‌వ‌ల సోద‌రులుగా కృష్ణ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాలో జ‌య‌ప్ర‌ద‌, గీత, ప్ర‌భ‌ హీరోయిన్లు. స‌త్య‌నారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, సార‌థి, నాగ‌భూష‌ణం, రావు గోపాల‌రావు, పుష్ప‌ల‌త‌, జ్యోతిల‌క్ష్మి, త్యాగ‌రాజు, భీమ‌రాజు కీల‌క పాత్ర‌ధారులు. సత్యం సంగీతం, ఎస్‌.ఎస్‌. లాల్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ సినిమాకు మాట‌లు మోదుకూరి జాన్స‌న్‌, పాట‌లు వేటూరి రాశారు. నిజానికి టైటిల్స్‌లో మోదుకూరి జాన్స‌న్ ఒక్క‌రి పేరే వేసినా, ఆయ‌న కంటే ఎక్కువ‌గా ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌. 1982 సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమా విడుద‌లైంది.

ఒక‌ప్ప‌టి ఈ నంద‌మూరి హీరో హ‌ఠాత్తుగా న‌టించ‌డం ఎందుకు మానేశారు?

  'లంకేశ్వ‌రుడు' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి బావ‌గా, రేవతి భ‌ర్త‌గా న‌టించిన నంద‌మూరి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి గుర్తున్నాడా? 'ఇంటి దొంగ‌', 'రౌడీ బాబాయ్‌', 'దొంగ కాపురం' సినిమాల చ‌క్క‌ని హీరో గుర్తున్నాడా?  కెరీర్‌లో మ‌రింత ముందుకు ఎదుగుతాడ‌నే న‌మ్మ‌కం క‌లిగించి, హ‌ఠాత్తుగా సినిమా రంగానికి ఆయ‌న ఎందుకు దూర‌మైపోయాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే ప్ర‌శ్న‌లు ఆయ‌న సినిమాలు టీవీలో చూస్తున్న‌ప్పుడు చాలా మందికి క‌లుగుతుంటాయి. న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌మ్ముడు త్రివిక్ర‌మ‌రావు కుమారుడే క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి. రామ‌ల‌క్ష్మ‌ణుల త‌ర‌హాలో మెలిగేవారు ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ‌రావు. ఎప్పుడూ త్రివిక్ర‌మ‌రావు అన్న‌య్య వెంటే ఉండేవారు. అన్న‌య్య‌తో ప‌లు సినిమాల‌ను త్రివిక్ర‌మ‌రావు నిర్మించారు. అలా చిన్న‌త‌నం నుంచీ నాన్న‌, పెద‌నాన్న‌ల‌ను చూస్తూ సినిమా వాతావ‌ర‌ణంలో పెరిగిన క‌ల్యాణ్‌కు స‌హ‌జంగానే న‌టుడు కావాల‌నే కోరిక క‌లిగింది. చిన్న‌త‌నం నుంచీ వ్య‌క్తిగా, న‌టునిగా క‌ల్యాణ్‌కు తండ్రే దైవం. ఆయ‌న చెప్పిందే వేదం, ఆయ‌న చూపిందే మార్గం. మ‌నిషికి వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు ఎప్పుడు ఉండ‌వో, అప్పుడు వృత్తిమీదా, త‌ను న‌మ్ముకున్న క‌ళ‌మీదా పూర్తి ఏకాగ్ర‌త చూపిస్తాడు. క‌ల్యాణ్ విష‌యంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. ఆయ‌న పాత్ర‌ల ఎంపిక ద‌గ్గ‌ర్నుంచీ, ఆ పాత్ర‌లో త‌ను చూపించాల్సిన న‌ట‌న‌, త‌ను అనుస‌రించాల్సిన టైమింగ్ అంతా తండ్రే చూసుకునేవారంటే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం.  క‌ల్యాణ్ ఏ సినిమా అయినా ఒప్పుకొనే ముందు క‌థ త్రివిక్ర‌మ‌రావు వినాల్సిందే. ఆయ‌నకు ఓకే అనిపించాకే కొడుకుకు ఆ క‌థ వినిపించి, ఆయ‌న అభిప్రాయం అడిగి తెలుసుకునేవారు. తండ్రి స‌రేనంటే కొడుకు స‌రే అనేవాడు. క‌ల్యాణ్‌ను ఎవ‌రైనా నేరుగా క‌లిసి క‌థ చెప్ప‌బోతే, ముందు తండ్రిని క‌లిసి చెప్ప‌మ‌నేవాడు. మార్నింగ్ మేక‌ప్ వేసుకొని వెళ్ల‌డం, టైమ్ ప్ర‌కారం న‌టించ‌డం, టైమ్ కాగానే తిరిగి ఇంటికి రావ‌డం.. ఇలా ఉండేది క‌ల్యాణ్ డ్యూటీ. ఏ విష‌యంలోనైనా టైమంటే టైమ్ అన్న‌ట్లుగా ఉండేవాడు. ఒక‌సారి కాల్షీట్లు ఇస్తే దానికి తిరుగుండేది కాదు. చిన్న నిర్మాత‌లైనా, పెద్ద నిర్మాత‌లైనా కొడుకు విష‌యంలో త్రివిక్ర‌మ‌రావు ప‌ద్ధ‌తి ఒక్క‌టే. క‌ల్యాణ్ దృష్టిలో హీరోలు అంటే కేవ‌లం డాన్స్‌, ఫైట్స్ చేయ‌గ‌ల‌వారు కాదు. కొద్దో గొప్పో న‌ట‌న వ‌చ్చి ఉండాలి. ఎందుకంటే డాన్సులు హీరోల కంటే డాన్స‌ర్స్ బాగా చేస్తారు. ఫైట్స్ హీరోల కంటే ఫైట‌ర్స్ బాగా చేస్తారు. హీరోల‌కు ముందుగా కావాల్సింది న‌ట‌న అని త్రివిక్ర‌మ‌రావు కొడుక్కు నేర్పారు. అందుకే ముందుగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించ‌గ‌లిగే ఫ్యామిలీ స్టోరీస్‌లో నటించాడు. అక్షింత‌లు, త‌లంబ్రాలు, ఇంటిదొంగ‌, దొంగ కాపురం, మేన‌మామ‌ లాంటి ఫ్యామిలీ మూవీస్ చేశాక‌, మాస్‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని 'రౌడీ బాబాయ్‌', 'రుద్ర‌రూపం' లాంటి యాక్ష‌న్ మూవీస్ చేశాడు. అంతే కాదు, 'భ‌క్త క‌బీర్‌దాస్‌'లో శ్రీ‌రాముడిగా క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి న‌టించాడ‌నే విష‌యం మ‌న‌లో చాలా మందికి తెలీదు.  ఆ పాత్ర‌లో న‌టించేట‌ప్పుడు నిజంగా థ్రిల్ ఫీల‌య్యాడు క‌ల్యాణ్‌. ఉద‌యాన్నే లేచి పండ‌గ జ‌రుపుకున్నంత సంబ‌రంతో, నిష్ఠ‌గా, నియ‌మాల‌తో, భ‌క్తితో ఆ గెట‌ప్ వేసుకొనేవాడు. ఆ విష‌యంలో త‌న పెద‌నాన్న ఎన్టీఆర్‌ను మార్గ‌ద‌ర్శ‌కంగా తీసుకున్నాడు. "వ్య‌క్తిగా మా నాన్న‌గారంత‌, న‌టునిగా మా పెద‌నాన్న గారంత కావాలి నేను. ఆ రోజే నేను అనుకున్న‌ది సాధించిన‌ట్లు." అని చెప్పేవాడు క‌ల్యాణ్‌.  అలాంటి క‌ల్యాణ్ 'లంకేశ్వ‌రుడు', 'అగ్నిన‌క్ష‌త్రం' సినిమాల త‌ర్వాత స‌డ‌న్‌గా సినిమాల‌కు దూర‌మైపోయాడు. కార‌ణం.. ఆయ‌న కొడుకు పృథ్వీ.. రోడ్ యాక్సిడెంట్‌లో చ‌నిపోవ‌డం. ఆ యాక్సిడెంట్‌లోనే అప్పుడ‌ప్పుడే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన క‌ల్యాణ్ త‌మ్ముడు హ‌రీన్ చ‌క్ర‌వ‌ర్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. త్రివిక్ర‌మ‌రావు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ షాక్ నుంచి క‌ల్యాణ్ తేరుకోలేక‌పోయాడు. త‌న పంచ‌ప్రాణాల వంటి కొడుకు మృతి చెంద‌డం, త‌ను దైవంగా భావించే తండ్రి గాయ‌ల‌పాల‌వ‌డంతో న‌ట‌న‌ను ప‌క్క‌న పెట్టేశాడు. గాయ‌ప‌డిన తండ్రికి సేవ‌చేస్తూ వ‌చ్చాడు. మ‌ళ్లీ సినిమాల జోలికి వెళ్ల‌లేదు.  ఆ త‌ర్వాత చిత్ర‌ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చినా, త‌ను మాత్రం తండ్రితో అక్క‌డే ఉండిపోయాడు క‌ల్యాణ్‌. పెద‌నాన్న కుటుంబం, ఆయ‌న కుమారులు అంతా హైద‌రాబాద్‌కు వ‌చ్చేసినా, తండ్రి చ‌నిపోయాక కూడా ఆయ‌న చెన్నైని వ‌దిలి పెట్ట‌లేదు. అక్క‌డే వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయాడు.

ర‌మ్య‌కృష్ణ గురించి మీకు తెలీని నిజాలు!

  న‌టి ర‌మ్య‌కృష్ణ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీని 2003లో పెళ్లాడారు. ఆ దంప‌తుల‌కు రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నాడు. కెరీర్ మొద‌ట్లో గ్లామ‌ర‌స్ రోల్స్ చేసి, ప్రేక్ష‌కుల ఆరాధ్య‌తార‌గా పేరు తెచ్చుకున్న ర‌మ్య‌కృష్ణ కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పిన సినిమా.. ర‌జ‌నీకాంత్ 'న‌ర‌సింహ' (త‌మిళ ఒరిజిన‌ల్ 'ప‌డ‌య‌ప్పా'). అందులో నీలాంబ‌రి అనే నెగ‌టివ్ రోల్‌లో ఆమె చేసిన న‌ట‌న‌ను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదు. వ‌య‌సుకు అనుగుణంగా హీరోయిన్ పాత్ర‌లు త‌గ్గిపోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారారు ర‌మ్య‌కృష్ణ‌. 'బాహుబ‌లి'లో చేసిన శివ‌గామి పాత్ర ఆమెకు దేశ‌వ్యాప్తంగా కీర్తిని తెచ్చింది. అలాంటి ర‌మ్య‌కృష్ణ కెరీర్ ఆరంభంలో టెలీప్లేల‌లో కూడా న‌టించార‌నే విష‌యం చాలామందికి తెలీదు. నేటి త‌రానికి తెలీని ఆమె కెరీర్ తొలినాళ్ల నిజాలేవంటే... ర‌మ్య‌కృష్ణ 1983లోనే న‌టిగా చిత్ర‌రంగంలో అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక‌ముందే ఆమె నాట్య‌కారిణి. సినిమాల్లోకి వ‌చ్చాక కూడా ఆమె నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ వ‌చ్చారు. అలాగే టీవీ నాట‌కాల‌లో (టెలీప్లేలు) న‌టించారు. అలా మూడు విధాలుగా కూడా ఆమె రాణించారు. నాట్యం అంటే ఆమెకు ఎంతో అభిమానం. వెంప‌టి చిన‌స‌త్యం ద‌గ్గ‌ర కూచిపూడిలో అక్ష‌రాభ్యాసం చేసుకున్నారామె. ధ‌నంజ‌య వ‌ద్ద భ‌ర‌త‌నాట్యంలో తొలి అడుగు వేశారు. మ‌న‌దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల్లో నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. అందుకే నృత్యం మీద ఉన్న అభిమానం కొద్దీ త‌న పాత్ర‌లు నృత్య ప్ర‌ధానంగా ఉంటే బావుంటుంద‌ని ఆమె అనుకొనేవారు.  తెలుగులో 'భ‌లే మిత్రులు' ఆమె మొద‌టి చిత్రం. అందులో న‌గేశ్ కుమారుడు ఆనంద్‌బాబు స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. ఆ సినిమా విజ‌యం సాధించింది. అయితే ఆమెలోని న‌ర్త‌కికి న్యాయం చేసిన 'సంకీర్త‌న' (నాగార్జున హీరో) చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం ఆమెకు నిరాశ‌ను క‌లిగించింది. 'అక్షింత‌లు' చిత్రంలో ఆమె న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ను సైతం మెప్పించింది. అలాంటి పాత్ర‌లు కావాల‌ని ఏ న‌టి మాత్రం కోరుకోదు! ఒక వైపు గ్లామ‌ర్‌, మ‌రోవైపు కామెడీ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు ఆమె చేసుకుంటూ వ‌చ్చారు. సినిమాల్లో న‌టిస్తూనే 'అంబికాప‌తి', 'సిలందివ‌లై' అనే రెండు త‌మిళ టీవీ నాట‌కాల్లో న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. 'అంబికాప‌తి' హాస్య‌ప్ర‌ధాన నాట‌కం. అందులో ఆమెకు జోడీగా వై.జి. మ‌హేంద్ర న‌టించారు. 'సిలందివ‌లై' నాట‌కంలో బాగా డాన్స్ చేసే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన అతికొద్ది మంది తార‌ల్లో ఒక‌రిగా ర‌మ్య‌కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఆమెకు విన‌య అనే చెల్లెలు కూడా ఉంది. విన‌య‌కు స్పోర్ట్స్ అంటే ఇష్టం. టేబుల్ టెన్నిస్‌లో ఎన్నో బ‌హుమ‌తులు కూడా గెల్చుకున్నారామె. 'ప‌డ‌య‌ప్పా' (న‌ర‌సింహ‌) చిత్రంలో ప్ర‌తినాయిక పాత్ర‌ను బీభ‌త్సంగా పోషించి, త‌న‌కు ఇష్ట‌మైన డాన్స్‌ను కూడా అంతే బీభ‌త్సంగా చేసి ప్రేక్ష‌కులపై చెర‌గ‌ని ముద్ర‌వేసిన ర‌మ్య‌కృష్ణ చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమెతో త‌ల్లిదండ్రులూ క‌లిసుంటున్నారు. 

ఈ ఫొటోలు ఎప్ప‌టివో తెలుసా? బాల‌య్య చేతుల్లోని చిన్నారి ఎవ‌రు?

  ఎవ‌రి కుటుంబంలో అయినా చిన్నారి పాప మొట్ట‌మొద‌టి సారిగా కేరింత‌లు కొడితే ఆ ఆనందం, ఆ భావోద్వేగం వేరే! ఆ క‌ళ వేరే!! దాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. అదే విధంగా నంద‌మూరి బాల‌కృష్ణ, వ‌సుంధ‌ర దంప‌తుల జీవితాల్లోకి ప్ర‌థ‌మ సంతానంగా 1987 డిసెంబ‌ర్ 21న‌ వ‌చ్చింది చిన్నారి బ్ర‌హ్మ‌ణి. అప్పుడు ఆమె తాత విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. బ్ర‌హ్మ‌ణి ఊయ‌ల ప‌వ‌ళింపు వేడుక 1988 ఫిబ్ర‌వ‌రి 28న‌ వారి ఇంట్లో క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఎన్టీఆర్ వ‌చ్చి, మ‌న‌వ‌రాలిని ఆశీర్వ‌దించి, ముద్దు చేస్తూ మురిసిపోయారు. న‌టులు జ‌గ్గ‌య్య‌, శివాజీ గ‌ణేశ‌న్‌, షావుకారు జాన‌కి, ద‌ర్శ‌కులు ఎల్వీ ప్ర‌సాద్‌, నిర్మాత బి. నాగిరెడ్డి, ర‌చ‌యిత డి.వి. న‌ర‌స‌రాజు త‌దిత‌ర ప‌లువురు ఉద్ధండులు విచ్చేసి బ్ర‌హ్మ‌ణిని ఆశీర్వ‌దించారు.  ఎన్టీఆర్ పెద్ద‌కుమారుడు జ‌య‌కృష్ణ‌, బాల‌కృష్ణ ఆహ్వానితుల‌కు ఎదురేగి స్వాగ‌తం ప‌ల‌క‌గా, ఎన్టీఆర్ మంద‌స్మిత వ‌ద‌నంతో ఆ వేడుక‌కు హాజ‌రైన వారంద‌రినీ ప‌ల‌కించి, వారితో పాత జ్ఞాప‌కాల‌ను, ప‌రిచ‌యాల‌ను గుర్తుచేసుకుంటూ క‌బుర్లు చెప్ప‌డం విశేషం. మ‌ధుర ప‌రిమ‌ళాల‌ను వెద‌జ‌ల్లే మ‌ల్లె పందిళ్ల కింద అమ‌ర్చిన అల్పాహార విందుతో ఆనాటి వేడుక వైభ‌వంగా ముగిసింది.

షూటింగ్‌లో ఎద్దుతో నిజంగా ఫైట్‌చేసి చేతి ఎముక విర‌గ్గొట్టుకున్న ఎన్టీఆర్‌!

  వ్య‌క్తిగ‌తంగా మంచి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న కొంత‌కాలం విజ‌య‌వాడ‌లో పొగాకు వ్యాపారం చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు చుట్ట కాల్చ‌డం బాగా అల‌వాట‌య్యింది. సినిమా హీరోకు పండ్లు తెల్ల‌గా క‌నిపించాల‌నీ, అలా క‌నిపించాలంటే చుట్ట కాల్చ‌కూడ‌ద‌నీ ఆయ‌న తొలి చిత్రం 'మ‌న‌దేశం' ద‌ర్శ‌కుడు ఎల్వీ ప్ర‌సాద్ చెప్పిన‌మాట విని వెంట‌నే మానేశారు. ఊటీలో ఒక‌సారి షూటింగ్ కోసం వెళ్లిన‌ప్పుడు తెల్ల‌వారుజామున చ‌లికి త‌ట్టుకోలేక స‌ర‌దాగా ఆరుబ‌య‌ట కూర్చొని చుట్ట కాలుస్తుంటే చిన్న‌బ్బాయి జ‌య‌శంక‌ర్ కృష్ణ నిద్ర‌లేచి వ‌చ్చి, "నాన్న‌గారూ! మీరు చుట్ట కాలుస్తారా?" అని ఆశ్చ‌ర్యంగా అడిగాడు. అంత చిన్న‌పిల్లాడి ముందు దోషిగా నిల‌వాల్సి వ‌చ్చినందుకు సిగ్గుప‌డుతూ చుట్ట అవ‌త‌ల‌పారేసి మ‌ళ్లీ జీవితంలో చుట్ట ముట్టుకోలేదు. ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'ప‌ల్లెటూరి పిల్ల‌'. అందులో ఎద్దుతో పోరాడే స‌న్నివేశం ఉంది. "అస‌లే అది ఆస్ట్రేలియ‌న్ బుల్‌.. జాగ్ర‌త్త" అని డైరెక్ట‌ర్ బి.ఎ. సుబ్బారావు చెబుతూనే ఉన్నారు. "ఊరికే దాని కొమ్ములు ప‌ట్టుకుంటే చాలు.. క‌ట్ చెప్తాను" అన్నారు. రామారావు దాని కొమ్ములు ప‌ట్టుకొని నిజంగానే దాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఎద్దు ఊరుకోలేదు. ఆయ‌న‌ను ఎత్తి కింద‌ప‌డేసింది. త‌న శ‌రీరం బ‌రువంతా కుడిచేతి మీద మోప‌డంతో చెయ్యి ఎముక విరిగిపోయింది. దాంతో ఆయ‌న నొప్పితో అల్లాడిపోయారు. ఆయ‌న ప‌రిస్థితి చూసి చిత్తూరు నాగ‌య్య గ్లాసులో ప‌చ్చ‌టి ద్ర‌వాన్ని పోసుకువ‌చ్చి, "రామారావ్.. ఇది తాగిచూడు. నీకు బాధ తెలియ‌కుండా ఉంటుంది" అన్నారు. రామారావు, "ఇది నొప్పులు త‌గ్గించే మందా?" అన‌డిగారు. నాగ‌య్య‌, "శ‌రీర బాధ‌లే కాదు, మాన‌సిక బాధ‌లు కూడా త‌గ్గించే మ‌త్తుమందు. తీసుకో" అన్నారు. అందుకు రామారావు, "నాగ‌య్య‌గారూ.. నా శ‌రీరంలో చెయ్యే కాదు, అవ‌య‌వాల‌న్నీ విరిగా ఈ మందు మాత్రం ముట్ట‌ను. ఇది తాగి నా జీవితాన్నే పెద్ద‌నొప్పిగా త‌యారుచేసుకోలేను" అన్నారు. ఆయ‌న భుజంత‌ట్టి, "శ‌భాష్.. నిగ్ర‌హ‌ప‌రుడివి. బాగా పైకి వ‌స్తావ్ నాయ‌నా" అని ఆశీర్వ‌దించారు. నిర్మాత‌లు పుత్తూరు వైద్యుడిని పిలిపించి ఆయ‌న చేతికి క‌ట్టు క‌టించారు. మ‌రుస‌టి రోజు ఎన్టీఆర్ షూటింగ్‌కు సిద్ధ‌మై వ‌చ్చేస‌రికి డైరెక్ట‌ర్ స‌హా అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. డైరెక్ట‌ర్ సుబ్బారావు "వ‌ద్దు.. రెస్టు తీసుకో." అని ఎంత చెప్పినా ఆయ‌న విన‌లేదు. "నో రెస్ట్‌. ఫ‌ర్వాలేదు రండి." అని రెడీ అయ్యారు. అదీ రామారావు మొండిత‌నం, ప‌నిపై ఆయ‌న అంకిత‌భావం.

పిల్ల‌ల్లో చిరంజీవి క్రేజ్ చూసి భ‌య‌ప‌డ్డ కె. విశ్వ‌నాథ్‌!

  చిరంజీవి హీరోగా కె. విశ్వ‌నాథ్ రూపొందించిన 'శుభ‌లేఖ‌', 'స్వ‌యంకృషి', 'ఆప‌ద్బాంధ‌వుడు' చిత్రాలు క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. త‌న మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్న‌మైన ఆ పాత్ర‌ల్లో మెగాస్టార్ సూప‌ర్బ్‌గా రాణించారు. "చిరంజీవి ఇమేజ్‌, ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఒక్కోసారి న‌న్ను భ‌య‌పెడుతూ ఉంటాయి. ఆయ‌న ఇమేజ్‌కు, ఫాలోయింగ్‌కు త‌గ్గ క‌థ మ‌నం తయారుచేయ‌గ‌ల‌మా అనే డౌట్ వ‌స్తుంటుంది." అని  'ఆప‌ద్బాంధ‌వుడు' సినిమా చేయ‌డానికి ముందు ఒక‌సారి చెప్పారు కె. విశ్వ‌నాథ్‌. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో త‌ను చూసిన ఓ సంఘ‌ట‌న‌ను ఆయ‌న వివ‌రించారు. అప్ప‌ట్లో ఆయ‌న మ‌ద్రాస్‌లో నివాసం ఉండేవారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటే, ఇక్క‌డ‌కు వ‌చ్చి హోట‌ల్‌లో బ‌స చేసేవారు. ఒక‌రోజు సాయంత్రం హోట‌ల్‌లో బోర్‌కొట్టి, అలా రూమ్ బ‌య‌ట‌కు వ‌చ్చి రెస్టారెంట్‌లో ఓ మూల‌గా కూర్చున్నారు విశ్వ‌నాథ్‌. ఆయ‌న‌కు బాగా క‌నిపించేట‌ట్లు ఉన్న టేబుల్ ద‌గ్గ‌ర ఓ ఫ్యామిలీ కూర్చొని ఉంది. మూడేళ్ల బాబు అమ్మానాన్న‌ల‌తో కూర్చొని బాగా అల్లరి చేస్తున్నాడు. టిఫిన్ చెయ్య‌కుండా ప్లేటుపై కెలుకుతూ అల్ల‌రి చెయ్య‌డం చూసి, వాళ్ల‌మ్మ ఒక్క దెబ్బ వేసింది. దాంతో ఉక్రోషంతో, "ఇదో.. నేను చిరంజీవి అంకుల్‌తో చెప్తా." అన్నాడు బెదిరింపుగా.  కోపం స్థానంలో ఆవిడ‌ ముఖంలో న‌వ్వు వ‌చ్చేసింది. "చెప్పుకో నాకేం భ‌యం" అంది. వాడు, "చిరంజీవి అంకుల్ గుర్రంమీద వ‌చ్చి నిన్ను డిష్షుం డిష్షుం అని తంతాడు జాగ్ర‌త్త మ‌రీ" అన్నాడు మ‌ళ్లీ బెదిరిస్తూ. ఆవిడ, "నన్నెందుకు తంతాడు. నువ్వు బుద్ధిగా అమ్మ‌చెప్పిన మాట విన‌కుండా అల్ల‌రి చేస్తున్నావ‌ని నిన్నే తంతాడు." అని చెప్పింది. దాంతో ఆ బుడ్డాడు ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. వాడి మౌనం చూసి, "చిరంజీవి అంకుల్‌కి అల్ల‌రి పిల్ల‌లు అంటే ఇష్టం ఉండ‌దు. చ‌క్క‌గా, బుద్ధిగా తింటూ బాగా చ‌దువుకునే పిల్ల‌లంటేనే ఇష్టం." అని చెప్పింది వాళ్ల‌మ్మ‌. అప్పుడు వాళ్ల నాన్న కూడా అందుకున్నాడు.. "చిరంజీవి అంకుల్ నీ అంత చిన్న‌గా ఉన్న‌ప్పుడు ఎంతో బుద్ధిగా ఉండేవాడు. మ‌రి నువ్వు పెద్ద‌యితే చిరంజీవి అంకుల్‌లా అవుతానంటావుగా. చిన్న‌ప్పుడు చిరంజీవి అంకుల్ ఉన్న‌ట్టు నువ్వుండాలి." అని చెప్పాడు. దాంతో వాడు స‌రేన‌ని త‌లూపి టిఫిన్ తిన‌డం మొద‌లుపెట్టాడు. కేవ‌లం తెర‌మీద చిరంజీవిని చూసి నిత్య‌జీవితంలో త‌నకెంతో ద‌గ్గ‌రివాడు, ఆత్మీయుడు అన్న ఫిలింగ్‌ను చిరంజీవి వాళ్ల‌లో క్రియేట్ చేశాడ‌ని విశ్వ‌నాథ్ అంటారు. "అది సామాన్య‌మైన విష‌యం కాదు. ఆబాల‌గోపాలాన్నీ ఆక‌ట్టుకున్న చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ క‌థ త‌యారుచెయ్యాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడ‌ల్లా నాకు ఆ సంఘ‌ట‌న గుర్తొచ్చి భ‌య‌పెడుతూ ఉంటుంది." అని ఆ సంద‌ర్భంగా చెప్పారు.

బాలు 35 ఏళ్లు దేశంమెచ్చే గాయ‌కుడ‌వుతార‌ని ఆనాడే చెప్పిన కోదండ‌పాణి!

  మ‌ద్రాస్ సోష‌ల్ అండ్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ 1963లో జాతీయ స్థాయిలో నిర్వ‌హించిన పాట‌ల పోటీల్లో పాల్గొన్నారు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. అప్పుడాయ‌న మ‌ద్రాసులో ఏఎంఐఈ ఇంజ‌నీరింగ్ కోర్సు చ‌దువుతున్నారు. ఆ పోటీల‌కు జ‌డ్జిలుగా సుప్ర‌సిద్ధ సంగీత ద‌ర్శ‌కులు ఘంట‌సాల‌, పెండ్యాల నాగేశ్వ‌ర‌రావు, సుస‌ర్ల ద‌క్షిణామూర్తి వ్య‌వ‌హ‌రించారు. ఆ పోటీలో అంద‌రికంటే ముందు పాడింది బాలు. ఆ త‌ర్వాత ఇంకా దాదాపు 100 మంది పాడాల్సిన వాళ్లున్నారు. ఫ‌లితాలు మూడ‌వ‌రోజుకు కానీ తెలియ‌వు. ఇంత‌లో ప్రేక్ష‌కుల్లోంచి ఓ పొట్టివ్య‌క్తి బాలు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, "బాగా పాడావు. నువ్వు పాడే ప‌ద్ధ‌తి నాకు న‌చ్చింది. సినిమాల్లో పాడిస్తాను. పాడ‌తావా?" అన‌డిగారు. ఏం చెప్పాలో బాలుకు తోచ‌లేదు. "మీరెవ‌రు సార్‌?" అన‌డిగారు. "నాపేరు కోదండ‌పాణి" అన్నారాయన‌. అదే కోదండ‌పాణితో బాలు తొలిప‌రిచ‌యం. ఆ ప‌రిచ‌యం త‌న జీవితాన్ని ఓ గొప్ప మ‌లుపు తిప్పుతుంద‌ని ఆయ‌న‌కప్పుడు తెలీదు. ఆ మ‌రుస‌టిరోజు బాలును నిర్మాత భావ‌నారాయ‌ణ ఆఫీసుకు తీసుకెళ్లారు కోదండ‌పాణి. ఆయ‌న ముందు పాడారు బాలు. "బాగా పాడుతున్నాడ్రా. కానీ గొంతు మ‌రీ లేత‌గా ఉంది. అటు చిన్న‌పిల్ల‌ల‌కూ పాడించ‌లేం, ఇటు హీరోల‌కూ పాడించ‌లేం. కాస్త గొంతు ముద‌ర‌నీ.. చూద్దాం" అన్నారు భావ‌నారాయ‌ణ‌. నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు బాలు. అప్ప‌టికి సంగీతానికి కామా పెట్టి, చ‌దువుమీద దృష్టి కేంద్రీక‌రించారు. రెండేళ్ల పాటు మ‌ళ్లీ సినీ ప‌రిశ్ర‌మ‌వైపు ఆయ‌న క‌న్నెత్తి చూడ‌లేదు. 1966లో బాలును వెతుక్కుంటూ ఓ వ్య‌క్తి కాలేజీకి వ‌చ్చారు. కోడండ‌పాణిగారు పంపించార‌నీ, వెంట‌నే పిలుచుకు ర‌మ్మ‌న్నార‌నీ ఆ మ‌నిషి చెప్పాడు. ఆయ‌న‌తో పాటు హాస్య‌న‌టులు ప‌ద్మ‌నాభం ఆఫీసుకు వెళ్లారు బాలు. ప‌ద్మ‌నాభం ముందు పాడి వినిపించారు. అలా కోదండ‌పాణి సంగీత సార‌థ్యంలో శ్రీ‌శ్రీ‌శ్రీ మ‌ర్యాద‌రామ‌న్న (1967) చిత్రంతో గాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు బాలు. ఆ త‌ర్వాత క‌థంతా మ‌న‌కు తెలిసిందే. సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలో ఒక కొత్త‌గాయ‌కుడికి అవ‌కాశ‌మిచ్చిన త‌ర్వాత‌, సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఆ సంగీత ద‌ర్శ‌కుడి సినిమాల్లో చిన్నా చిత‌కా అవ‌కాశాలు ఇస్తుంటారు. కాలం క‌లిసి రాక‌పోతే ఆ గాయ‌కుడి క‌థ అక్క‌డే ముగుస్తుంది. గాయ‌కుడిగా బాలు భ‌విష్య‌త్తు మీద ఆయ‌న త‌ల్లితండ్రుల‌కే అంత న‌మ్మ‌కం లేదు. కానీ కోదండ‌పాణికి బాలు మీద ఎంత న‌మ్మ‌కం అంటే, మొద‌టి పాట పాడిన‌ప్ప‌ట్నుంచీ బాలు భ‌విష్య‌త్తును త‌న చేతుల్లోకి తీసుకున్నారు. "ఇంకా 35 సంవ‌త్స‌రాలు దేశంమెచ్చే గాయ‌కుడిగా ప్ర‌సిద్ధి పొందుతావు. అందుకు నీ ప్ర‌య‌త్న‌మూ చాలా కావాలి. చాలా నిష్ఠ‌గా కృషిచేయాలి. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. రోజూ సాధ‌న చేయాలి." అని నూరిపోసేశారు.  అంతేకాదు, బాలు పాట‌ను విజ‌యా గార్డెన్స్‌లోని టేపులో దాదాపు సంవ‌త్స‌రం పాటు చెర‌ప‌కుండా ఉంచి ప్ర‌తి సంగీత ద‌ర్శ‌కుడికీ వినిపిస్తూ వ‌చ్చారు. అవ‌కాశం ఇవ్వ‌మ‌ని వాళ్ల‌ను అభ్య‌ర్థించేవారు కోదండ‌పాణి. బాలు ఆర్థిక ప‌రిస్థితి గ‌మ‌నించి త‌న ద‌గ్గ‌రే స‌హాయ‌కుడిగా ఉద్యోగం ఇచ్చి జీత‌మిప్పించారు. బాలు ప‌రోక్షంలో "నా కోడిపుంజుకి 35 సంవ‌త్స‌రాలు తిరుగులేదు." అని చెప్పేవారు. అంత‌గా బాలు గురించి శ్ర‌ద్ధ తీసుకున్నారు కోదండ‌పాణి. త‌నపై గురువు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని బాలు వ‌మ్ము చేయ‌లేదు. గురువు చెప్పిన‌ట్లు 35 కాదు.. ఇంకో ప‌దేళ్లు ఎక్కువ‌గానే తిరుగులేని విధంగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ చిత్ర రంగాల‌ను త‌న గానామృతంలో ఓల‌లాడించారు బాలు. అలా గురుద‌క్షిణ‌ను చెల్లించుకున్నారు ఆ గానగంధ‌ర్వుడు.

"శివ‌శంక‌రీ" పాట వెనుక ఎంత క‌ష్ట‌ముందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక‌మాన‌రు!

  న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు టైటిల్ రోల్ పోషించ‌గా దిగ్ద‌ర్శ‌కుడు కె.వి. రెడ్డి రూపొందించిన 'జ‌గ‌దేక‌వీరుని క‌థ' (1961) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యిందో, ఆ సినిమాలో ఎన్టీఆర్‌పై చిత్రీక‌రించిన "శివ‌శంక‌రీ శివానంద‌ల‌హ‌రి" పాట అంత‌గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్ప‌టికీ ఆ పాట‌ను సాధ‌న‌చేసి, క‌చేరీలో, పోటీల‌లో పాడేందుకు ఔత్సాహిక గాయ‌కులు అమితోత్సాహం చూపిస్తుంటారంటే.. అది ఆ పాట‌కున్న మ‌హ‌త్తు. తెలుగు సినిమా సంగీత చ‌రిత్ర‌లో "శివ‌శంక‌రీ" పాట ప్ర‌స్తావ‌న లేక‌పోతే అది అసంపూర్ణ‌మ‌వుతుంద‌న‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. ఈ పాట రూపొంద‌డాన‌కి వెనుక కూడా ఓ క‌థ ఉంది. దీనికి ముందు 'జ‌గ‌దేక‌వీరుని క‌థ‌'లోని మిగ‌తా పాట‌ల రికార్డింగ్‌, వాటి పిక్చ‌రైజేష‌న్ కూడా అయిపోయింది. క్లైమాక్స్ షూటింగ్‌కు ఇంకో రెండు నెల‌ల వ్య‌వ‌ధి ఉంద‌నంగా డైరెక్ట‌ర్ కె.వి. రెడ్డి మ్యూజిక్ డైరెక్ట‌ర్ పెండ్యాల నాగేశ్వ‌ర‌రావుతో ఈ పాట సంద‌ర్భాన్ని వివ‌రించి, ఈ పాట సినిమా మొత్తానికీ ప్రాణం లాంటిద‌నీ, రాయిని క‌రిగించి మునికి శాప‌విమోచ‌నం క‌లిగించే ఆ పాట‌లో ఆ ఎఫెక్ట్ నిజ‌మ‌నిపించేట్లు క‌నిపించాల‌నీ చెప్పారు. కావాల‌నుకుంటే, ఈ సినిమాకు ఆధార‌మైన త‌మిళ చిత్రం 'జ‌గ‌ద‌ల ప్ర‌తాప‌న్‌'ను ఓసారి చూడ‌మ‌నీ స‌ల‌హా ఇచ్చారు. కానీ ఒరిజిన‌ల్‌ను చూస్తే ఆ ప్ర‌భావం త‌న‌మీద ప‌డుతుంద‌నే ఉద్దేశంతో పెండ్యాల ఆ సినిమా చూడ‌లేదు. త‌ర్వాత సాంగ్ సిట్టింగ్‌లో గీత ర‌చ‌యిత పింగ‌ళి నాగేంద్ర‌రావు "శివ‌శంక‌రీ శివానంద‌ల‌హ‌రి" అనే ప‌ల్ల‌విని రాసుకొచ్చి వినిపించారు. అది బాగుంద‌ని కె.వి. రెడ్డి ఓకే చేశారు. ఆ ప‌ల్ల‌విని ప‌లు రాగాల్లో పాడి వినిపించారు పెండ్యాల‌. ద‌ర్బారీ రాగంలో చేసిన ట్యూన్ వారికి న‌చ్చింది. మ‌రుస‌టి రోజు మిగ‌తా పాట‌నంతా రాసుకొచ్చి ఇచ్చారు పింగ‌ళి. దాన్ని తీసుకొని ఇంటికెళ్లారు పెండ్యాల‌. ఏకధాటిగా ప‌దిహేను రోజులు శ్ర‌మించి, ఆ పాట‌కు బాణీలు క‌ట్టారు. పాట సిద్ధ‌మైంద‌ని కె.వి. రెడ్డికి చెప్పారు. త‌ర్వాత రోజు అంద‌రూ కూర్చున్నారు. పెండ్యాల పాట మొత్తం ఆల‌పించారు. అంతా నిశ్శ‌బ్దంగా విన్నారు. పాట అద్భుతంగా ఉంది. కానీ "టైమ్ చూశారా.. ప‌ద‌మూడు నిమిషాలు వ‌చ్చింది. అంత‌సేపు తెర‌మీద ఆ పాట‌ను చూపించ‌డ‌మంటే చాలా క‌ష్టం. ప్రేక్ష‌కులు కూడా ఇబ్బంది ఫీల‌వుతారు. స‌గానికి త‌గ్గించండి." అని సూచించారు కె.వి. రెడ్డి. దాంతో మ‌రో నాలుగైదు రోజులు క‌ష్ట‌ప‌డి, కుదించి మ‌ళ్లీ వినిపించారు పెండ్యాల‌. దానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు కె.వి. రెడ్డి. ఆ పాట‌ను బాగా రిహార్స‌ల్స్ చేసి, త‌న‌కే సాధ్య‌మైన రీతిలో అత్య‌ద్భుతంగా పాడారు ఘంట‌సాల‌. ఆ పాట‌ను హిందుస్తానీ విద్వాంసుల త‌ర‌హాలో విన్యాసాలు ప్ర‌ద‌ర్శిస్తూ తెర‌మీద అంతే గొప్ప‌గా అభిన‌యించారు ఎన్టీఆర్‌. పాట మొత్తంలో ఎక్క‌డా ఒక్క‌సారి కూడా త‌డ‌బాటు లేకుండా, పాట మొత్తానికి సింక్ అయ్యేలా లిప్ మూవ్‌మెంట్ ఇస్తూ ఆయ‌న న‌టించిన విధానానికి సెట్స్ మీదున్న యూనిట్ మెంబ‌ర్స్ అంతా త‌మ‌ను తాము మ‌ర‌చిపోయి చూశారు. అంద‌రూ అంత శ్ర‌మ‌ప‌డ్డ ఆ పాట‌కు దానికి త‌గిన అద్భుత ఫ‌లితాన్నిచ్చింది. తెలుగు సినిమా సంగీత ప్ర‌పంచంలో మ‌కుటాయ‌మాన‌మైన పాట‌గా నిలిచిపోయింది.

కృష్ణ 'గూఢ‌చారి 116'తో హిందీ రీమేక్స్ మొద‌లుపెట్టిన జితేంద్ర‌!

  ప‌లు తెలుగు సినిమాల‌ హిందీ రీమేక్‌ల‌లో జితేంద్ర హీరోగా న‌టించారు. వాటిలో 'హిమ్మ‌త్‌వాలా' (ఊరికి మొన‌గాడు), షాదీ కే బాద్ (పెళ్లిచేసి చూడు), దుల్హ‌న్ (శార‌ద‌), దిల్‌దార్ (సోగ్గాడు), స్వ‌ర్గ్ న‌ర‌క్ (స్వ‌ర్గం న‌ర‌కం), నిషానా (వేట‌గాడు), ప్యాసా సావ‌న్ (ఏడంత‌స్తుల మేడ‌), జానీ దోస్త్ (అడ‌వి సింహాలు), తోఫా (దేవ‌త‌) లాంటి సూప‌ర్ హిట్ సినిమాలున్నాయి. ఈ ధోర‌ణికి నాంది ప‌లికింది కృష్ణ హీరోగా న‌టించిన మూడో సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. అది.. 1966లో వ‌చ్చిన 'గూఢ‌చారి 116'. ఆ సినిమాతోటే కృష్ణ‌ ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పేరు పొందారు. మంగ‌ళ‌గిరి మ‌ల్లికార్జున‌రావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో కృష్ణ స‌ర‌స‌న జ‌య‌ల‌లిత నాయిక‌గా న‌టించారు. సినారె రాసిన "ఎర్రాబుగ్గల‌ మీద మ‌న‌సుంది", "నువ్వు నా ముందుంటే నువ్వ‌లా చూస్తుంటే" పాట‌లు, ఆరుద్ర రాసిన "మ‌న‌సు తీరా న‌వ్వులు నవ్వాలి", "ప‌డిలేచే కెర‌టం చూడు" పాట‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. టి. చ‌ల‌ప‌తిరావు సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో నిర్మాత డూండీ దీన్ని హిందీలో రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు జితేంద్ర బాడీ లాంగ్వేజ్ గూఢ‌చారి క్యారెక్ట‌ర్‌కు స‌రిపోతుంద‌నిపించి, ఆయ‌న‌ను తీసుకున్నారు. 'ఫ‌ర్జ్' పేరుతో రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్ ఎవ‌రో తెలుసా.. తెలుగులో ప‌లు సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన‌, తెలుగులో ట్రిక్ ఫొటోగ్ర‌ఫీకి ఖ్యాతి చేకూర్చిన ర‌వికాంత్ న‌గాయిచ్‌! ఒరిజిన‌ల్‌కు ఆరుద్ర ఇచ్చిన క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను య‌థాత‌థంగా హిందీ వెర్ష‌న్‌కు ఉప‌యోగించుకున్నారు. ఈ సినిమాలో నాయిక‌గా క‌రిష్మా క‌పూర్‌, క‌రీనా క‌పూర్ త‌ల్లి బ‌బిత న‌టించారు. శోభ‌న్‌బాబు చెల్లెలుగా న‌టించిన గీతాంజ‌లి క్యారెక్ట‌ర్‌ను 'ఫ‌ర్జ్‌'లో కాంచ‌న పోషించారు. అలాగే ఒరిజిన‌ల్‌లో డైలాగ్స్ లేకుండా క‌నిపించే రాజ‌నాల హిందీ వెర్ష‌న్‌లోనూ అదే పాత్ర చేశారు. తెలుగు వెర్ష‌న్ షూటింగ్‌ను ఏయే లొకేష‌న్ల‌లో తీశారో, హిందీ వెర్ష‌న్‌ను కూడా ఆ లొకేష‌న్ల‌లోనే తీశారు. 1967 అక్టోబ‌ర్ 6న‌ విడుద‌లైన 'ఫ‌ర్జ్' సూప‌ర్ హిట్ట‌యి, జితేంద్ర‌కు స‌రికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా త‌ర్వాత కృష్ణ తెలుగులో చేసిన ప‌లు సినిమాల హిందీ రీమేక్స్‌లో జితేంద్ర హీరోగా న‌టించారు. కేవ‌లం కృష్ణ సినిమాలే కాకుండా 'పాతాళ భైర‌వి', 'ఖైదీ' లాంటి సినిమాల రీమేక్స్‌లోనూ న‌టించిన జితేంద్ర రీమేక్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నారు.

క్లాసిక్ ఫిల్మ్‌ 'క‌ళ్లు' క‌థ ఆలోచ‌న గొల్ల‌పూడికి ఎలా వ‌చ్చిందో తెలుసా?

  తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లో 'క‌ళ్లు' (1988) ఒక‌టి. గొల్ల‌పూడి మారుతీరావు అదే పేరుతో రాసిన రేడియో నాటిక‌కు ఇది తెర‌రూపం. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇది ఘ‌నవిజ‌యం సాధించ‌క‌పోయినా, గొప్ప చిత్రాల్లో ఒక్క‌టిగా విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌లు పొందింది. అనేక అవార్డుల‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుల నామినేష‌న్ ప‌రిశీల‌న‌కు కూడా ఇది ఎంపికైంది. ఈ సినిమాతోటే సినిమాటోగ్రాఫ‌ర్ ఎం.వి.ర‌ఘు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ సినిమాతోటే శివాజీరాజా అనే న‌టుడు ప్రేక్ష‌కుల‌కు తెలిశాడు. ఆ ఇద్ద‌రికీ ఉత్త‌మ తొలిచిత్ర ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ నూత‌న న‌టుడుగా నంది అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాతోటే చిదంబ‌రం అనే న‌టుడికి 'క‌ళ్లు చిదంబ‌రం' అనే పేరు స్థిర‌ప‌డింది. సీతారామ‌శాస్త్రి ర‌చించ‌గా, ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సంగీతం స‌మ‌కూర్చిన "తెల్లారింది లెగండోయ్ కొక్కొరొకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో" పాట ఓ ప్ర‌భంజ‌నంలా తెలుగువారిని చుట్టేసింది. ఆ పాట పాడింది కూడా స్వ‌యంగా సీతారామ‌శాస్త్రి. ఇలాంటి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న క‌ళ్లు క‌థ ఎలా పుట్టిందో తెలుసుకుందాం... గొల్ల‌పూడి మారుతీరావు హైద‌రాబాద్ ఆల్ ఇండియా రేడియోలో ప‌నిచేస్తూ ఉండ‌గా చాలా ర‌చ‌న‌లు చేశారు. త‌న మిత్రుడు, నాట‌కాల ప్రియుడు అయిన బి.వి. రామారావు కోసం కొన్ని నాటిక‌లు రాశారు. వాటిలో చెప్పుకోద‌గ్గ‌వి రెండు.. 'రెండు రెళ్లు ఆరు', 'క‌ళ్లు'. బి.వి. రామారావు అసెంబ్లీ హాలులో ప‌నిచేసేవారు. ఇద్ద‌రి ఆఫీసులూ ఎదురెదురుగానే కాబ‌ట్టి.. రోజూ లంచ్‌కి వాళ్లిద్ద‌రూ క‌లిసి క్యాంటిన్‌కు వెళ్లి తినేవారు. ఎప్ప‌టిలాగే వాళ్లిద్ద‌రూ లంచ్ చేయ‌డానికి క్యాంటిన్‌కు వెళ్తూ ఉండ‌గా, దారిలో మారుతీరావును రామారావు ఓ విచిత్ర‌మైన కోరిక కోరారు. అదేమంటే.. అంద‌రూ గుడ్డివాళ్లుగా ఒక నాటిక రాయ‌మ‌ని.  కొన్ని నెల‌లు గ‌డిచిపోయాయి. చివ‌ర‌కు ఒక‌రోజు గొల్ల‌పూడికి ఒక ఆలోచ‌న వ‌చ్చింది. ఒక గుడ్డివాడు పామువేపు న‌డుస్తున్నాడు. చూడ‌గ‌లిగే శ‌క్తి లేనివాడికి తాను ప్ర‌మాదంవైపు న‌డుస్తున్నాన‌న్న సంగ‌తి తెలీదు. అదే.. చూడ‌గ‌లిగేశ‌క్తి ఉన్న‌వాడైతే అక్క‌డ పాము ఉంద‌ని, దానివేపు న‌డిస్తే త‌న‌కు ప్ర‌మాదమ‌నీ తెలుసుకోగ‌లుగుతాడు. అంటే చూడ‌లేక‌పోవ‌డం అనేది ఒక బ‌ల‌హీన‌త‌. నిజాన్ని చూడ‌లేక‌పోవ‌డం అనే బ‌ల‌హీన‌త‌. చూడ‌గ‌లిగేవాడికీ, చూడ‌లేక‌పోయేవాడికీ కార‌ణం.. 'క‌ళ్లు'. అందుకే క‌ళ్లును సింబ‌ల్‌గా తీసుకున్నారు. ఈ నిజాన్ని చూడ‌లేక‌పోవ‌డం అనే బ‌ల‌హీన‌త విజ్ఞ‌త లేక‌పోవ‌డం వ‌ల్ల కావ‌చ్చు, చ‌దువు లేక‌పోవ‌డం వ‌ల్ల కావ‌చ్చు.. ఇలా ఏ కార‌ణంచేత‌నైనా కావ‌చ్చు. అంచేత‌, ఈ చూడ‌లేనిత‌నాన్ని బ‌ల‌హీన‌త‌గా తీసుకొని, చూడ‌గ‌లిగేవాళ్లు వాళ్ల‌ని ఏవిధంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో అనేది విజువ‌లైజ్ చేస్తే, అనే ఆలోచ‌న మారుతీరావుకు త‌ట్టింది. "గుడ్డిత‌నం అనే బ‌ల‌హీన‌త మూలంగా తాము చేయ‌లేని ప‌నిని అంద‌రూ క‌లిసి త‌మ సంక్షేమం కోసం ఒక నాయ‌కుడిని ఎన్నుకొని, త‌మ న‌మ్మ‌కాన్ని అత‌నిమీద పెట్టుబ‌డిగా పెట్టి త‌మ స‌మాజాన్ని న‌డిపించ‌మంటే, వాళ్ల బ‌ల‌హీన‌త‌ల్ని అవ‌కాశం చేసుకొని, త‌న‌ని పెద్ద‌చేసిన స‌మాజాన్ని దోచేసి, దాన్ని ముష్టెత్తుకొనే స్థితికి తీసుకొస్తాడు ఆ నాయ‌కుడు. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేవాళ్ల‌ను చేతులుజాపే స్థితికి తీసుకువ‌స్తాడు. అట్లాంటి ప‌రిస్థితి ఎద‌రురైన‌ప్పుడు ప్రతివ్య‌క్తీ తానుగా క‌ల్పించిన విశ్వాసాన్ని వెన‌క్కి తీసుకొనే హ‌క్కులేదా? మ‌నం చూడాల‌ని ఆశించిన నిజాన్ని చూడలేని క‌ళ్లు ఉండి ఏం ప్ర‌యోజ‌నం? అనే ఆలోచ‌నే ఈ నాటిక రాయ‌డానికి నాంది ప‌లికింది." అని గొల్ల‌పూడి చెప్పుకున్నారు. 1968-70 ప్రాంతాల్లో విజ‌య‌వాడ రేడియో కేంద్రంలో ఉన్న‌ప్పుడు ఈ నాటిక‌ను ఆయ‌న రాశారు. మిత్రులు బి.వి. రామారావు, జ‌వ్వాది రామారావు ఓ రోజు రాత్రి ఆయ‌న ద‌గ్గ‌ర కూర్చొని రాయించుకున్నారు. ఆలిండియా రేడియోలో బెస్ట్ స్క్రిప్టుగా ఎన్నికైన 'క‌ళ్లు' 1975లో సాహిత్య అకాడ‌మీ అవార్డును కూడా అందుకుంది. విజ‌య‌వాడ ఎస్‌.ఆర్‌. అండ్ సి.వి.ఆర్‌. కాలేజీలో చ‌దివే రోజుల్లో ఈ నాటిక‌ను ఆంధ్ర‌నాట‌క క‌ళాప‌రిష‌త్తు పోటీల్లో చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు ఎం.వి. ర‌ఘు. మొద‌ట 'క‌ళ్లు' నాటిక‌ను ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు ('య‌మ‌గోల' ద‌ర్శ‌క‌డు) సినిమాగా తియ్యాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ అది వాస్త‌వ‌రూపం దాల్చ‌లేదు. చివ‌ర‌కు ఎం.వి. ర‌ఘు ఈ నాటిక‌కు వెండితెర రూపం ఇచ్చారు. అది ఓ క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంటుంద‌ని అప్పుడు ఆయ‌న‌కూ తెలీదు.