ఘంట‌సాల పాట‌ల‌న్నింటిలో ఆ పాటంటే పీబీ శ్రీ‌నివాస్‌కు ఎందుకు అత్యంత ఇష్టం?!

  అమ‌ర గాయ‌కులు ఘంట‌సాల వేంక‌టేశ్వ‌ర‌రావు పాడిన వేలాది పాట‌ల్లో న‌చ్చిన పాట‌ను ఒక‌దాన్ని ఎంచ‌డం ఎవ‌రికైనా చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌యం. ఒక‌ప్పుడు మ‌రో గొప్ప గాయ‌కుడు పి.బి. శ్రీ‌నివాస్‌కు ఇదే ప్ర‌శ్న ఎదురైంది. ఆయ‌న కూడా ఇదే ఇబ్బంది ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌ను ఎప్పుడూ వెంటాడే ఓ పాట‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఆ పాటను ఘంట‌సాల పాడిన వైనం, ఆ పాట గొప్ప‌త‌నం పంచుకున్నారు. స్కూల్లో చ‌దువుకుంటున్న రోజుల్లో, కాకినాడ‌లో ఒక థియేట‌ర్‌లో 'పాతాళ‌భైర‌వి' ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ ఉన్న రోజుల్లో, మొద‌టిసారి ఆ చిత్రం చూసిన‌ప్పుడు లీల‌తో క‌లిసి ఘంట‌సాల పాడిన "ఎంత‌ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్ష‌ణ‌మో.." త‌న‌కు ఎంత‌గానో న‌చ్చిన పాట అని చెప్పారు పి.బి. శ్రీ‌నివాస్‌. కార‌ణం.. ఆ రాగంలో అంత‌కుముందు ఆయ‌న అంత మ‌ధుర‌మైన బాణీ విని ఉండ‌లేదు. రాగేశ్రీ బాణీలో సాగిన ఆ పాట ఎప్ప‌టికీ మ‌ర‌పురాని పాట‌గా ఆయ‌న పేర్కొన్నారు. ఆ కాలంలో రాగేశ్రీ‌ని ఎక్కువ‌గా వాడిన‌వారు లేరు. ఆ రాగంలో అంత మ‌నోహ‌రంగా వ‌ర‌స‌క‌ట్టి ఘంట‌సాల ఆల‌పించిన వైనం అత్య‌ద్భుతం అని ఆయ‌న చెప్పారు. "ఆ పాట వింటుంటే ఏదో అలా అలా గాలి అల‌లలో తేలి సాగుతున్న‌ట్ల‌నిపించేది నాకు. ఘంట‌ల, లీల కంఠ‌స్వ‌ర స‌మ్మేళ‌నం కూడా ఆ గీతానికి ఎంతైనా తోడ్ప‌డింది. గంభీర గాత్రాల నుండి వెలువ‌డిన మృదుల మంజుల మోహ‌న‌గానం నా మ‌న‌స్సులో మార్మోగుతూ ఉండేది పొద‌స్త‌మానం. ఆ పాట‌లో "ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మ‌ల‌యానిల‌మా, ప్రియురాలికి విప్పిచెప్ప‌వే.." అని సాగే చ‌ర‌ణంలో ఘంట‌సాల ప్ర‌యోగించిన స్వ‌ర‌సోపానాలు స్వ‌ర్గ‌ద్వారాల‌ని తెర‌చి చూపించేవి. ప‌ర‌మానంద సౌంద‌ర్యాన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బిట్లు కూడా పాట‌కి అనువైన విధానంలో అమ‌ర్చ‌డం ఘంట‌సాల సంగీత నిర్దేశ‌న పాట‌వానికి ఉచితోప‌మానం." అని వెల్ల‌డించారు శ్రీ‌నివాస్‌. ఎల‌క్ట్రిక్ హ‌వైన్ గిటార్ బిట్లు చాలా అధికంగా వాడే ఆ రోజుల్లో, ఎంత‌వ‌ర‌కు వాడాలో అంత‌వ‌ర‌కే వాడి, పాట‌కి కొత్త అందాలు దిద్దారు ఘంట‌సాల‌. "ఇప్ప‌టికీ ఎప్పుడ‌న్నా రేడియోలో కానీ, గ్రామ‌ఫోన్ రికార్డులో కానీ, టేపు రికార్డ‌రులో కానీ, ఈ పాట వినిపించిందంటే, ఒక క్ష‌ణం ఆగి, పాట అయ్యేదాకా నిలిచి, త‌ర‌వాత‌నే ముందుకు సాగుతాను, ఏదో మేగ్న‌టిక్ ఎట్రాక్ష‌న్ ఉంది ఆ పాట‌లో. రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్‌కు ఈ పాట ఒక మ‌చ్చుతున‌క లాంటిద‌ని నా అభిప్రాయం." అని చాలా కాలం క్రితం చెప్పుకొచ్చారు పి.బి. శ్రీ‌నివాస్‌.

చందా కోసం వ‌చ్చాడ‌నుకొని డైరెక్ట‌ర్ని దులిపేసిన చంద్ర‌మోహ‌న్‌!

  తెలుగు చిత్ర‌సీమ మ‌ద్రాసులో ఉన్న‌ప్ప‌టి మాట‌. ఇండ‌స్ట్రీలో బ‌త‌క‌లేక బ‌తికే అనేకానేక మంది ఆర్టిస్టులు, కార్మికులు వాళ్ల‌ పిల్ల‌ల స్కూలు ఫీజుల‌క‌నీ, పుస్త‌కాల‌క‌నీ, ఏవో పెద్ద ఖ‌ర్చులు వ‌చ్చాయ‌నీ చెప్పి పెద్ద ఆర్టిస్టులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర‌కొచ్చి చందాలు అడుగుతుండ‌టం రివాజు. అప్పుడు.. స్కూళ్లు తెరుచుకున్నాయి. ఒక‌రోజు సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ (అప్పుడాయ‌న ఎక్కువ‌గా హీరో వేషాలు వేస్తున్నాడు.) ద‌గ్గ‌ర‌కు ఈ చందాల‌వాళ్లు రావ‌డం మొద‌లైంది. కొద్దో గొప్పో అంద‌రికీ ఇచ్చి పంపారు. 200 రూపాయ‌ల దాకా అయ్యింది. అంత‌లో ఒకాయ‌న‌ సాధార‌ణ‌మైన తెల్ల లుంగీ, జుబ్బాతో చేతిలో ఒక సంచితో వ‌చ్చి, చంద్ర‌మోహ‌న్ కాళ్ల‌కు దండంపెట్టి ఎదురుగా కూర్చున్నాడు. ఆయ‌నెవ‌రో గుర్తుకొచ్చింది. నెల్లూరు నుంచి వ‌చ్చి ఏదో ప‌త్రిక న‌డుపుతున్నాన‌ని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాన‌ని చెప్పి డ‌బ్బు ప‌ట్టుకెళ్తుంటాడు. "ఏం ఇలా వ‌చ్చారు? మ‌ద్రాసు వ‌ద‌ల్లేదా, బాగా గిట్టుబాట‌వుతోందా? అంద‌రి ప్రోత్సాహం ఉంద‌న్న‌మాట‌. మీ ప‌నే బాగుంది. అడుక్కుతినేవాడికి అర‌వై ఇళ్ల‌నీ.. మీకే స‌మ‌స్యా లేదు. పొద్దున్నుంచి అడ్డ‌మైన ప్ర‌తివాడూ త‌లుపు తోసుకొని రావ‌ట‌మే. స‌మాధానాలు చెప్ప‌లేక చ‌స్తున్నాను." అని మూడు గంట‌ల సేపు ఆపుకున్న కోపం, విసుగు ఆయ‌న మీద ప్ర‌ద‌ర్శించారు చంద్ర‌మోహ‌న్‌. ఆయ‌న తెల్ల‌బోయి, గ‌భాల్న లేచి నిల్చున్నాడు. "మీ మూడ్ బాగా లేద‌నుకుంటాను. ఒక పిక్చ‌ర్ విష‌య‌మై మీతో మాట్లాడ‌దామ‌ని వ‌చ్చాను. త‌ర్వాత మాట్లాడ‌తాలెండి." అని వెళ్ల‌బోయాడు. 'మీరు పిక్చ‌ర్ తీస్తారా.. అదొక్క‌టే త‌క్కువైందా మీకూ.." అన‌బోయి, ఎందుకో అనుమానం వ‌చ్చి, "మీరు.. మీరు.." అని న‌సిగారు చంద్ర‌మోహ‌న్‌. "అదేమిటండీ న‌న్ను మ‌ర్చిపోయారా.. నేను మీ 'అంబికాప‌తి' టీవీ సీరియ‌ల్ డైరెక్ట‌ర్‌ని. అది మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం మూలంగా 8 నెల‌ల నుంచి మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేదు. ఇప్పుడు ప‌క్కాగా స్ట్రెయిట్ పిక్చ‌రే మీతో ప్లాన్ చేద్దామ‌ని అంద‌రం నిర్ణ‌యించాం. మీకు ఎప్పుడు వీల‌వుతుందో చెబితే, అప్పుడు వ‌చ్చి మీ డేట్ల‌కి అడ్వాన్స్ ఇచ్చి పోదామ‌ని మా ప్రొడ్యూస‌ర్లు రెడీగా ఉన్నారు." అని చెప్పాడాయ‌న‌. చంద్ర‌మోహ‌న్‌కు జ‌రిగిన పొర‌పాటు అర్థ‌మైపోయింది. ఈయ‌న ఆ నెల్లూరు ప‌త్రికాయ‌న అనుకొని అలా దులిపేశార‌న్న మాట‌. ఆయ‌న్ని గుర్తుప‌ట్ట‌లేద‌ని పైకి చెబితే ఫీల‌వుతాడు. అది మేనేజ్ చెయ్య‌డానికి ప‌రిస్థితిని కామెడీగా మార్చి నానా అవ‌స్థా ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను చూసిన‌ప్పుడ‌ల్లా ఈ సంఘ‌ట‌నే గుర్తుకు వ‌చ్చి న‌వ్వుకునేవారు చంద్ర‌మోహ‌న్‌.

న‌టి సీత గురించి చాలామందికి తెలీని విష‌యాలు!

  న‌టి సీత అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రు. త‌న క్యూట్ లుక్స్‌తో, బ్యూటిఫుల్ ప‌ర్ఫార్మెన్స్‌తో చాలామంది హృద‌యాల్లో ఆమె చెర‌గ‌ని ముద్ర‌వేశారు. ఆడ‌దే ఆధారం, డ‌బ్బెవ‌రికి చేదు, స‌గ‌టు మ‌నిషి, చిన్నారి దేవ‌త‌, బ‌జారు రౌడీ, ముద్దుల మావ‌య్య‌, ముత్య‌మంత ముద్దు, పోలీస్ భార్య‌, చెవిలో పువ్వు లాంటి సినిమాలు ఆమెను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేశాయి. ఆరేళ్ల పాటు త‌న న‌ట‌న‌తో అల‌రించిన ఆమె త‌మిళ న‌టుడు పార్తీబ‌న్‌ను 1990లో వివాహం చేసుకున్నాక‌, సినిమాల‌కు దూర‌మ‌య్యారు. వారికి ఇద్ద‌రు కుమార్తెలు.. అభిన‌య‌, కీర్త‌న పుట్టారు. ఆ త‌ర్వాత రాధాకృష్ణ‌న్ అనే అబ్బాయిని ద‌త్త‌పుత్రుడిగా స్వీక‌రించారు. పార్తీబ‌న్‌తో తీవ్ర భేదాభిప్రాయ‌లు త‌లెత్త‌డంతో 2001లో ఆయ‌న నుంచి విడాకులు పొందారు సీత‌.  ఆ త‌ర్వాత తిరిగి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2010లో ఆమె టీవీ న‌టుడు స‌తీశ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. కానీ ఆరేళ్ల సంసారం త‌ర్వాత ఆయ‌న‌తోనూ ఆమె విడిపోయారు. అస‌లు సీత ఎవ‌రు? ఆమె సినిమాల్లోకి ఎలా వ‌చ్చార‌నే విష‌యాలు చాలా మందికి తెలీదు. ఆమె క‌థేమిటంటే... సీత తండ్రి త‌మిళియ‌న్ కాగా త‌ల్లి తెలుగు వ‌నిత‌. చెన్నైలోనే పుట్టి పెరిగారు సీత‌. చ‌దువుకునే రోజుల్లో ఆమెకు సినిమాల‌పై అంత ఆస‌క్తి ఉండేది కాదు. ఉద‌యం 9 గంట‌ల‌కు స్కూలుకు వెళ్తే, తిరిగి సాయంత్రం 4 గంట‌ల‌కు ఇంటికి రావ‌డం, ఆ త‌ర్వాత ఎక్క‌డ‌కీ వెళ్ల‌కుండా ఇంటిద‌గ్గ‌ర చ‌దువుకుంటూ ఉండ‌టం.. ఇదే ప‌ని. పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో ఆమె అమ్మానాన్న‌లు చాలా స్ట్రిక్టుగా ఉండేవారు.  సీత ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న కాలంలో ఓ రోజు సీత వాళ్ల నాన్న‌గారి స్నేహితుడు ఒకాయ‌న వాళ్లింటికి వ‌చ్చాడు. వాళ్ల నాన్న‌తో మాట్లాడుతూ, "పాండ్య‌రాజాగారు (త‌మిళ డైరెక్ట‌ర్‌) తీస్తున్న చిత్రంలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మ‌న‌మ్మాయి క‌న్ను ముక్కు తీరుగా ఉంటుంది. సినిమాల్లోకి వ‌స్తే రాణించే అవ‌కాశాలు క‌నిపిస్తాయి. మీకు ఇష్ట‌మైతే ఆయ‌న‌కు ప‌రిచ‌యం చేస్తాను." అన్నాడు. సీత వాళ్ల నాన్న మోహ‌న్‌బాబు కూడా న‌టులే. స్టేజిమీద ఎన్నో నాట‌కాలు వేశారు. ప‌లు త‌మిళ సినిమాల్లోనూ న‌టించారు. అందుక‌ని, "సినిమాల్లో న‌టించ‌డంలో ఏమీ త‌ప్పులేదు." అని సీత‌ను ప్రోత్స‌హించారు. అలా పాండ్య‌రాజాను క‌లవ‌డం, అప్పుడు ఆయ‌న తీస్తున్న 'ఆణ్‌పావ‌మ్' సినిమాలో న‌టించ‌డం త‌ల‌వ‌ని త‌లంపుగా జ‌రిగిపోయాయి. ఆ సినిమా స‌క్సెస్ కావ‌డంతో వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి.  అలా త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉండ‌గానే రాజాచంద్ర డైరెక్ష‌న్‌లో శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన‌ 'విజృంభ‌ణ' (1986) సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టారు సీత‌. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయితే రెండో చిత్రం 'డ‌బ్బెవ‌రికి చేదు' సక్సెస్ అవ‌డంతో, తెలుగులోనూ ఆమెకు వ‌రుస‌ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. తొలినాళ్ల‌లో ఆమె మేక‌ప్ లేకుండానే కొన్ని చిత్రాలు చేశారు. 'ఆడ‌దే ఆధారం', 'అగ్నిపుష్పం', 'పెళ్లికొడుకులొస్తున్నారు' సినిమాల్లో ఆమె కేవ‌లం పౌడ‌ర్ రాసుకొని న‌టించేశారు. న‌ట‌న‌లో ఆమెకు ఇన్‌స్పిరేష‌న్ వాళ్ల నాన్న మోహ‌న్‌బాబు గారే. సావిత్రి, బి. స‌రోజాదేవి ఆమె ఆరాధ్య తార‌లు. 'పెళ్లికొడుకులొస్తున్నారు' చిత్రంలో ఆమె గ‌తంలో సావిత్రి చేసిన పాత్ర‌ను పోషించారు. ఆ సినిమా క్లాసిక్ ఫిల్మ్ 'గుండ‌మ్మ క‌థ' ఆధారంగా రూపొందింది. 'గుండ‌మ్మ క‌థ‌'లో సావిత్రి చేసిన పాత్ర‌ను 'పెళ్లికొడుకులొస్తున్నారు'లో ఆమె చేశారు. ముద్దుల మావ‌య్య (1989) చిత్రంలో బాల‌కృష్ణ చెల్లెలిగా చేసిన పాత్రలో సీత‌ను ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేదు.

డైరెక్ట‌ర్ మ‌హేశ్ భ‌ట్ లేకుండా రిస్కీ షాట్ చేసిన మెగాస్టార్‌.. చేయి కాలింది!

  డూప్‌ల‌తో యాక్ష‌న్ సీన్లు చేసే తెలుగు సినిమాకు అస‌లు సిస‌లు యాక్ష‌న్ సీన్ల‌ను ప‌రిచ‌యం చేసింది మెగాస్టార్. అనూహ్య‌మైన వేగం అవ‌స‌ర‌మైన ప‌లు యాక్ష‌న్ సీన్ల‌ను డూప్ లేకుండా చేస్తూ వెండితెర‌పై అస‌లు సిస‌లు యాక్ష‌న్ స్టార్‌గా అవ‌త‌రించారు చిరంజీవి. 'కిరాయి రౌడీలు', 'కిరాత‌కుడు' సినిమాల కాలం నుంచి ప‌లు సినిమాల్లో ఆయ‌న చేసిన ఫైట్లు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ వ‌చ్చాయి. ఫ‌లితంగా మాస్ ఆడియెన్స్‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను ఆయ‌న సంపాదించుకున్నారు. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న రిస్క్‌తో చేసిన ఫైట్లు చూడ్డానికి డైరెక్ట‌ర్లు కూడా భ‌య‌ప‌డ్డ సంద‌ర్భాలున్నాయి. ఆ త‌ర‌హా సంద‌ర్భ‌మే హిందీ సినిమా 'ద జెంటిల్‌మ‌న్' సెట్స్‌పై చోటు చేసుకుంది. అర్జున్ హీరోగా శంక‌ర్ డైరెక్ట్ చేయ‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన 'జెంటిల్‌మ‌న్' సినిమాకు ఇది రీమేక్‌. దీనికి అప్ప‌టి బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన మ‌హేశ్ భ‌ట్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. అందులో చిరంజీవి చేతిలో భుజం కింద బుల్లెట్ దూసుకుపోతుంది. ఒక రాడ్‌కు స్పిరిట్ ముంచిన దూదిని చుట్టి, దానితో బుల్లెట్ త‌గిలిన చోట వెనుక వైపు నుంచి ఆ రాడ్‌తో పొడుస్తాడు చిరంజీవి. దాంతో బుల్లెట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ గాయాన్ని మాన్ప‌డానికి గ‌న్ పౌడ‌ర్‌ను గాయం మీద వేసి అంటించుకుంటే అది కాక‌ర‌పువ్వొత్తిలా వెలుగుతుంది. దీంతో గాయం త్వ‌ర‌గా మానిపోతుంది.  ఈ సీన్‌ను చిరంజీవి తానే చేస్తాన‌ని చెప్ప‌డంతో మ‌హేశ్ భ‌ట్ వ‌ద్ద‌ని వారించారు. "అంత రిస్క్ అవ‌స‌రం లేదు.. డూప్‌తో ఆ సీన్ చేద్దాం" అన్నారు. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. ఆ సీన్ తాను చేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌ట్టారు. అయితే తాను ఆ సీన్ చూడ‌లేన‌నీ, త‌ర్వాత ర‌ష్ చూస్తాన‌నీ చెప్పి మ‌హేశ్ భ‌ట్‌ అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు.  చిరంజీవి త‌న తోడ‌ల్లుడు డాక్ట‌ర్‌ కె. వెంక‌టేశ్వ‌ర‌రావును వెంట‌నే ర‌మ్మ‌ని ఫోన్ చేశారు. ఆయ‌న వ‌చ్చాక‌, ఒక స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్‌ను ద‌గ్గ‌ర పెట్టుకొని, త‌న భుజంపై ర‌క్తంలా క‌నిపించే ఎర్ర‌రంగు అప్లై చేసి, దాని మీద గ‌న్‌పౌడ‌ర్ రాశారు. సెట్లో ఉన్న‌వాళ్లంతా ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని ఉత్కంఠ‌త‌తో ఎదురుచూస్తున్నారు. కెమెరా రోల్ అవుతోంది. గ‌న్‌పౌడ‌ర్ మీద మంట వెలిగించారు. గ‌న్‌పౌడ‌ర్ బ‌ర్న్‌ అయ్యి మంట వెలుగుతోంది. బాధ‌ను భ‌రిస్తున్న‌ట్లు చిరంజీవి యాక్ట్ చేస్తున్నారు. కెమెరా ర‌న్ అవుతోంది. చిరంజీవి బాధ‌ను నిజంగానే భ‌రిస్తున్నారు. కాసేప‌టికి కానీ, అక్క‌డ 'క‌ట్' చెప్పే డైరెక్ట‌ర్ లేడ‌నే సంగ‌తి ఆయ‌న‌కు గుర్తుకొచ్చింది.  అప్పుడు రెండో చేత్తో ఆ మంట‌ను ఆర్పేసుకున్నారు. దాంతో కెమెరా ఆగింది. సెట్లో ఉన్న‌వాళ్లంతా క్లాప్స్ కొట్టారు. ఆ షాట్ బాగా వ‌చ్చింద‌ని కెమెరామ‌న్ చెప్పాడు. కానీ చూస్తే.. చిరంజీవి చేయి కాలిపోయి, పెద్ద బొబ్బ వ‌చ్చింది. అంతా కంగారుప‌డ్డారు. వెంట‌నే డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు ఆయ‌న‌కు ఫ‌స్ట్ ఎయిడ్ చేశారు. ఇలా రిస్కులు చేయ‌డం చిరంజీవికి అల‌వాటు. అందుకే తెర‌పై ఆయ‌న చేసే స్టంట్స్ లైవ్‌గా ఉన్న‌ట్లు అనిపిస్తాయి. ద 'జెంటిల్‌మ‌న్‌'లో క‌నిపించే ఈ సీన్ వెనుక జ‌రిగిన క‌థ ఇది.

ఎన్టీఆర్ మెచ్చిన ఇళ‌య‌రాజా 'నా ప‌రువం నీ కోసం' పాట‌!

  నట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు, మేస్ట్రో ఇళ‌య‌రాజా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏకైక ఫిల్మ్ 'యుగంధ‌ర్' (1976). అది హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన క‌ల్ట్ ఫిల్మ్ 'డాన్' (1978)కు రీమేక్‌. కె.ఎస్‌.ఆర్‌. దాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో జ‌య‌సుధ హీరోయిన్‌గా న‌టించ‌గా, జ‌గ్గ‌య్య‌, స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భాక‌ర‌రెడ్డి, కాంతారావు, త్యాగ‌రాజు, జ‌య‌మాలిని లాంటి ప్ర‌ముఖ న‌టులు అందులో న‌టించారు. ఈ చిత్రానికి నిర్మాత ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మ్యాన్ పీతాంబ‌రం. ఈయ‌న ఎవ‌రో కాదు, 'చంద్ర‌ముఖి' డైరెక్ట‌ర్ పి. వాసు తండ్రి. అప్పుడే త‌మిళ సినిమాల‌తో దుమ్మురేపుతున్న ఇళ‌య‌రాజాను సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకుందామ‌ని పీతాంబ‌రం అంటే కె.ఎస్‌.ఆర్‌. దాస్ అంగీక‌రించారు. ఒరిజిన‌ల్ 'డాన్' సినిమా మొద‌ట్లో వ‌చ్చే 'యే మేరా దిల్' సాంగ్ సూప‌ర్ పాపుల‌ర్ అయింది. దాని ట్యూన్‌ను య‌థాత‌థంగా వాడుకుందామ‌ని డైరెక్ట‌ర్ అంటే, ఇళ‌య‌రాజా ఒప్పుకోలేదు. "దానిక‌న్నా గొప్ప‌గా పాట ఇస్తాను.. చూడండి" అని చెప్పారు. చెప్పిన‌ట్లే, 'నా ప‌రువం నీ కోసం' అనే పాట ట్యూన్ ఇచ్చారు. సినారె రాసిన ఆ పాట నాటి కాలంలో యువ‌త‌ను ఉర్రూత‌లూగించింది. 'డాన్‌'లో అమితాబ్ పాన్ న‌ములుతూ ఖ‌య్‌కే పాన్ బ‌నార‌స్‌వాలా' అంటూ పాడే పాట కూడా బ్లాక్‌బ‌స్ట‌రే. నిజానికి 'డాన్' అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది ఆ పాటే. దేశాన్నంతా ఓ ఊపు ఊపిన ఆ సాంగ్‌ను మాత్రం ఎట్లాగైనా తెలుగులో పెట్టాల‌న్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇళ‌య‌రాజా ఒప్పుకోలేదు. కె.ఎస్‌.ఆర్‌. దాస్ ప‌ట్టు స‌డ‌లించినా, పీతాంబ‌రం అంగీక‌రించ‌లేదు. "ఒక పాట‌కు నీ మాట విన్నాం. ఈ పాట‌కు మా మాట విను." అని గ‌ట్టిగా చెప్పారు. ఆయ‌న‌ను బాధ‌పెట్ట‌డం ఇష్టంలేక‌, త‌న మ‌న‌సు అంగీక‌రించ‌క‌పోయినా, ఒరిజిన‌ల్ సాంగ్‌ను అనుక‌రిస్తూ 'ఓర‌బ్బా వేసుకున్నా కిళ్లీ' పాట‌కు ట్యూన్ క‌ట్టారు ఇళ‌య‌రాజా. పాట‌ల‌న్నీ అయిపోయాయి. ఎన్టీఆర్ విన్నారు. ఆయ‌న‌కు 'నా ప‌రువం నీ కోసం' తెగ న‌చ్చేసింది. "'యే మేరా దిల్' క‌న్నా ఈ పాటే బాగుంది బ్ర‌ద‌ర్‌. ఆ కుర్రాడు బాగా పైకి వ‌స్తాడు." అని కె.ఎస్‌.ఆర్‌. దాస్‌తో అన్నారు ఎన్టీఆర్‌. ఈ పాట‌ను ఎన్టీఆర్‌, జ‌య‌మాలినిపై చిత్రీక‌రించారు.

తండ్రితో ఖుష్‌బూ ప‌డిన క‌ష్టాలు ప‌గ‌వాడికి కూడా వ‌ద్దు.. అంత న‌ర‌కం చూశారు!!

  ఒక సాధార‌ణ ముస్లిం కుటుంబంలో జ‌న్మించిన ఖుష్‌బూ త‌ర్వాత కాలంలో త‌న‌కు ప్ర‌జ‌లు గుడిక‌ట్టి ఆరాధించే స్థాయిలో న‌టిగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకోవ‌డం ఆషామాషీ విష‌యం కాదు. వెంక‌టేశ్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయిన 'క‌లియుగ పాండ‌వులు' సినిమాతోటే ఖుష్‌బూ కూడా ద‌క్షిణాదిన హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. త‌మిళ ప్ర‌జానీకానికి ఆమె మ‌రింత చేరువై, వారి ఆరాధ్య‌తార అయ్యారు. వారామెకు గుడి క‌ట్టి పూజించారు కూడా. త‌మిళ ద‌ర్శ‌కుడు సి. సుంద‌ర్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు.. అవంతిక‌, ఆనందిత‌. ఖుష్‌బూ చిన్న‌నాడు చాలా బాధ‌లు అనుభ‌వించింద‌నీ, తండ్రి చేతుల్లో చాలా హింస ఎదుర్కొన్న‌ద‌నీ మ‌న‌లో చాలామందికి తెలీదు. ఆమె త‌ల్లిని కూడా ఆయ‌న చావ‌గొట్టేవాడు. అందుకే తండ్రి అంటే ఆమెకు అస‌హ్యం, ద్వేషం. ఆయ‌న పేరును త‌ల‌చుకోవ‌డానికి కూడా ఆమె ఇష్ట‌ప‌డ‌దు. చివ‌రిసారిగా ఆమె త‌న తండ్రిని చూసింది 35 ఏళ్ల క్రింద‌ట అంటే న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా అది నిజం. 'ద బ‌ర్నింగ్ ట్రైన్' (1978) చిత్రంతో బాల‌న‌టిగా ఖుష్‌బూ కెరీర్ మొద‌లైంది. ఆమె అస‌లు పేరు న‌ఖ‌త్ ఖాన్‌. ఆ సినిమా సెట్స్ మీదే న‌ఖ‌త్ కాస్తా ఖుష్‌బూగా మారిపోయింది. న‌ఖత్ అంటే ఉర్దూలో సువాస‌న అని అర్థం. హిందీలో దానికి అర్థం ఖుష్‌బూ. అందుకే ఖుష్‌బూ అనే పేరు పెట్టారు. బాల‌న‌టిగా బిజీ అయ్యిందామె. ఆమె సినిమాల్లో అడుగుపెట్టాక త‌ల్లి ఆమెకు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. తండ్రికి ఆమె తెచ్చే డ‌బ్బు ఆనందాన్నిచ్చేది. ఆయ‌న చేతుల్లో త‌ల్లి, ఖుష్‌బూ నానా న‌ర‌కం అనుభ‌వించారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు తిట్ట‌డ‌మే కాకుండా, ఇంట్లో ఉన్న అంద‌ర్నీ ఆమె అన్న‌ల‌తో సహా విప‌రీతంగా కొట్టేవాడు. త‌న త‌ల్లిపేరు న‌జ్మా ఖాన్ అని చెప్పిన ఖుష్‌బూ, తండ్రి పేరును ఉచ్ఛ‌రించ‌డానికి కానీ, క‌నీసం త‌ల‌చుకోడానికి కానీ ఇష్ట‌ప‌డ‌దు. త‌న‌కు త‌ల్లితో త‌ప్ప తండ్రితో ఎలాంటి ఆనంద‌క‌ర క్ష‌ణాలు లేవ‌ని ఆమె అంటారు. ఆమె షూటింగ్‌లో ఉంటే నేరుగా సెట్స్ మీద‌కు వ‌చ్చి అంద‌రి ముందే కొట్టేవాడ‌ని ఖుష్‌బూ చెప్పారు. ఎదిగేకొద్దీ, డ‌బ్బు గురించి అర్థం చేసుకోవ‌డం మొద‌లుపెట్టింది ఖుష్‌బూ. త‌న సంపాద‌న అంతా ఎక్క‌డికి వెళ్తోంద‌న్న ప్ర‌శ్న‌లు రేకెత్తాయి. కూతురు అడిగేస‌రికి తండ్రికి కోపం వ‌చ్చింది. ఆమెనూ, ఆమె త‌ల్లినీ ముంబై నుంచి చెన్నైకు తీసుకొని వ‌చ్చాడు. అప్పుడు ఖుష్‌బూకు 16 ఏళ్లు. అప్పుడే 'క‌లియుగ పాండ‌వులు' సినిమా చేస్తోంది. నిజానికి బాలీవుడ్‌లో ఆమెను హీరోయిన్‌గా లాంచ్ చేయాల‌ని బోనీ క‌పూర్ ప్లాన్ చేశారు. ఆ సినిమాతో పాటు, మ‌రో మంచి ఆఫ‌ర్ కూడా తండ్రి కార‌ణంగా మిస్స‌యింది. ఆర్‌.ఎ. పురంలోని 6వ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో వాళ్ల‌ను దించేసి, తండ్రి ముంబై వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఖుష్‌బూ బ్యాంక్ అకౌంట్‌లోని డ‌బ్బునంతా ఖాళీ చేశాడు. దీంతో కుటుంబ బాధ్య‌త‌ను త‌న చేతుల్లోకి తీసుకుంది ప‌ద‌హారేళ్ల ఖుష్‌బూ. 'మేరీ జంగ్‌'లో ఖుష్‌బూను చూసిన వెంక‌టేశ్‌, 'క‌లియుగ పాండ‌వులు'లో ఆమెను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఆమెను తండ్రి నుంచి ఆ చిత్ర నిర్మాత డి. రామానాయుడు, ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కాపాడుతూ వ‌చ్చేవారు. రామానాయుడును ఆయ‌న డ‌బ్బు అడిగిన‌ప్పుడ‌ల్లా, అప్ప‌టికే ఇచ్చేశామ‌ని ఆయ‌న‌కు అబద్ధంచెప్పి, నేరుగా రెమ్యూన‌రేష‌న్ అమౌంట్‌ను ఖుష్‌బూ చేతికి ఇచ్చేవారు రామానాయుడు. ఇది ఖుష్‌బూ తండ్రికి కోపం తెప్పించాయి. త‌న‌తో నిమిత్తం లేకుండా కూతురు జీవితంలో ముందుకు సాగుతోంద‌ని ఆయ‌న గ్ర‌హించాక‌, ప‌రిస్థితులు ఓ కొలిక్కి వ‌చ్చాయి. చెన్నైలో ఖుష్‌బూ, ఆమె త‌ల్లి నివాసం ఉంటున్న ఇంటికి వ‌చ్చిన ఆయ‌న‌కు అక్క‌డ కూతురు కొత్త‌గా కొనుక్కున్న మారుతీ వ్యాన్ క‌నిపించింది. కోపంతో దాని విండ్‌షీల్డ్‌ను ప‌గ‌ల‌గొట్టాడు. అప్ప‌టికి ఆ కారు కొని రెండంటే రెండు రోజులే అయ్యింది. "తిరిగి బాంబేకి తీసుకువెళ్ల‌మ‌ని అడుక్కోవ‌డానికి నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తావు." అని ఆయ‌న అరిస్తే, "ఇంట్లోవాళ్లంద‌ర్నీ చంపి, నేను చ‌స్తాను కానీ మ‌ళ్లీ నీ ద‌గ్గ‌ర‌కు రాను." అని అంతే గ‌ట్టిగా అరిచి చెప్పింది ఖుష్‌బూ. అంతే.. ఆ త‌ర్వాత ఆమె త‌న తండ్రిని చూసింది లేదు.

సౌంద‌ర్య‌కు రిప్లేస్‌మెంట్ లేద‌ని 'న‌ర్త‌న‌శాల‌'ను ఆపేసిన బాల‌కృష్ణ‌!

  నంద‌మూరి బాల‌కృష్ణ క‌ల‌ల ప్రాజెక్ట్‌.. 'న‌ర్త‌న‌శాల‌'. డైరెక్ట‌ర్‌గా అవ‌తార‌మెత్తి ఆయ‌న రూపొందించ తల‌పెట్టిన తొలి య‌త్నం.. 'న‌ర్త‌న‌శాల‌'. రామోజీ ఫిల్మ్ సిటీలో ప‌ర్ణ‌శాల సెట్ వేసి, ఒక షెడ్యూల్ షూటింగ్ జ‌రిపాక‌, అర్ధంత‌రంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కార‌ణం.. చాలామందికి తెలిసిందే.. సౌంద‌ర్య అకాల మృతి! 'న‌ర్త‌న‌శాల‌'లో ద్రౌప‌ది పాత్ర‌ధారి సౌంద‌ర్య‌. 2004 ఏప్రిల్ 17 బెంగ‌ళూరు నుంచి క‌రీంన‌గ‌ర్‌కు ఎయిర్‌క్రాఫ్ట్‌లో అన్న‌య్య అమ‌ర‌నాథ్‌తో క‌లిసి బ‌య‌లుదేరిన ఆమె, అది టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల‌కే మంట‌ల్లో చిక్కుకుని అన్న‌య్య‌తో పాటు అగ్నికి ఆహుత‌య్యారు. దాంతో బాల‌కృష్ణ 'న‌ర్త‌న‌శాల' ప్రాజెక్ట్‌నే ఆపేశారు. అప్ప‌టికి తీసింది కొద్ది సీన్లే. సౌంద‌ర్య స్థానంలో మ‌రొక‌ర్ని తీసుకొని ఆ సినిమాని చేయ‌వ‌చ్చు. కానీ ద్రౌప‌దిగా సౌంద‌ర్య స్థానంలో మ‌రొక‌ర్ని తాను ఊహించుకోలేన‌ని బాల‌య్య చెప్పేశారు. అదివ‌ర‌కు బాల‌కృష్ణ‌, సౌంద‌ర్య క‌లిసి చేసింది ఒకే సినిమా.. 'టాప్ హీరో'. అయిన‌ప్ప‌టికీ బాల‌కృష్ణ‌ను ఏక‌వ‌చ‌నంతో పిలిచేంత‌గా ఆ ఇద్ద‌రిమ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. ఆయ‌న‌ను సౌంద‌ర్య 'బాలా' అని పిలిచేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్యే చెప్పారు. "ఎక్క‌డ క‌నిపించినా న‌న్ను బాలా అని ఏక‌వ‌చ‌నంతో పిలిచేది సౌంద‌ర్య‌. మామ‌ధ్య అంత ఎఫెక్ష‌న్ ఉండేది. 'న‌ర్త‌న‌శాల' చిత్రంలో ద్రౌప‌ది పాత్ర చెయ్య‌మ‌ని అడిగిన‌ప్పుడు నామీద ఉన్న న‌మ్మ‌కంతో, నా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌న్న అభిప్రాయంతో, ద్రౌప‌ది పాత్ర మీద ఉన్న ఇష్టంతో సహృద‌యంతో వెంట‌నే అంగీక‌రించింది." అని బాల‌కృష్ణ చెప్పారు. రేపు షూటింగ్ ప్రారంభోత్స‌వం అనంగా, ముందురోజు గెట‌ప్ వేసుకొని వ‌చ్చి మ‌రీ ఆయ‌న‌కు చూపించారు సౌంద‌ర్య‌. "తొలిసారి పౌరాణిక పాత్ర చేస్తున్నందుకు గెట‌ప్ ఎలా ఉందో ముందే చూసుకోవాలి అన్న త‌ప‌న‌తో స్పెష‌ల్ ఇంట్రెస్ట్ తీసుకుంది. ఈ త‌రం న‌టీమ‌ణుల్లో అంత‌టి డెడికేష‌న్ నేనెవ‌రిలోనూ చూడ‌లేదు. అలాగే నాలుగు రోజులు అనుకున్న షెడ్యూల్‌ను సౌంద‌ర్య ఒక‌టిన్న‌ర రోజుల్లో పూర్తిచేసింది. సింగిల్ టేక్‌లో ప్ర‌తి డైలాగ్‌ను ఓకే అయ్యేలా చేసింది." అని బాల‌కృష్ణ గుర్తుచేసుకున్నారు.  సౌంద‌ర్య వ్య‌క్తిత్వాన్ని కానీ, అభిన‌యాన్ని కానీ, ప్ర‌వ‌ర్త‌న‌ని కానీ తార‌లంతా ఆద‌ర్శంగా తీసుకోవాలంటారాయ‌న‌. "నా దృష్టిలో ఉత్త‌మ న‌ట‌న‌కు, స‌త్ప్ర‌వ‌ర్త‌న‌కు, గొప్ప వ్య‌క్తిత్వానికి సౌంద‌ర్య ఓ కొల‌మానం. క‌న్న‌డ అమ్మాయి అయివుండి మ‌న తెలుగువారి గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సౌంద‌ర్య‌ని ఎప్ప‌టికీ మ‌ర‌వ‌లేం." అని అన్నారు బాల‌య్య‌. సౌంద‌ర్య అన్నా, ఆమె న‌ట‌న అన్నా అంతటి గౌర‌వాభిమానాలు ఉన్నందునే ఆయ‌న 'న‌ర్త‌న‌శాల‌'ను మ‌రో న‌టితో చేయ‌లేక‌పోయారు.

'య‌మ‌లీల‌'లో హీరోయిన్‌గా చేయ‌లేక‌పోయినందుకు సౌంద‌ర్య ఏడ్చార‌నే విష‌యం తెలుసా?

  సావిత్రి త‌ర్వాత తెలుగులో అంత‌టి ప్ర‌తిభావంతురాలైన పేరు తెచ్చుకున్న తార సౌంద‌ర్య‌. స్వ‌త‌హాగా క‌న్న‌డ అమ్మాయ‌యినా తెలుగమ్మాయి అన్నంత‌గా ఆమె మారిపోయారు. ప‌న్నెండేళ్ల కెరీర్ త‌ర్వాత చిన్న‌వ‌య‌సులోనే హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో విషాద‌క‌రంగా ఆమె కాలి బూడిదైపోయారు. 1992లో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన కొద్ది కాలంలోనే సంచ‌ల‌న హీరోయిన్‌గా ఆమె ఎదిగారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో చేసిన‌ 'రాజేంద్రుడు గ‌జేంద్రుడు', 'మాయ‌లోడు', 'నంబ‌ర్ వ‌న్' లాంటి సినిమాలు ఆమె టాప్ హీరోయిన్‌గా మార‌డానికి దోహ‌దం చేశాయి.  అయితే అలీ హీరోగా కృష్ణారెడ్డి రూపొందించిన 'య‌మ‌లీల' సినిమాలో హీరోయిన్‌గా ఆమే న‌టించాల్సింది. మొద‌ట ఆమెనే బుక్ చేసుకున్నారు. కానీ ఆమె ప్లేస్‌లో ఇంద్ర‌జ వ‌చ్చింది. ఆ మార్పు జ‌ర‌గ‌డానికి వెనుక ఉన్న‌ది సౌంద‌ర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ‌. అప్ప‌టికే సౌంద‌ర్యకు అగ్ర‌హీరోల‌తో న‌టించే అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో క‌మెడియ‌న్ అయిన అలీ ప‌క్క‌న హీరోయిన్‌గా చేస్తే.. ఆమె కెరీర్‌కు ఇబ్బంది అవుతుందేమోన‌ని ఒక తండ్రిగా స‌త్య‌నారాయ‌ణ భావించారు. అదే విష‌యాన్ని నిర్మాత కె. అచ్చిరెడ్డితో అన్నారు. ఆయ‌న బాధ‌ను అచ్చిరెడ్డి అర్థం చేసుకున్నారు. పెద్ద హీరోల ప‌క్క‌న సౌంద‌ర్య‌కు అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్పుడు మంచిదే క‌దా అని అనుకున్నారు. సౌంద‌ర్య అంటే కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిల‌కు త‌మ కుటుంబ‌స‌భ్యురాల‌న్నంత ప్రేమాభిమానులు ఉన్నాయి. అందుకే "వేరే అమ్మాయిని పెట్టుకుంటాం లెండి" అని స‌త్య‌నారాయ‌ణ‌తో చెప్పారు అచ్చిరెడ్డి. ఆయ‌న సంతోషించారు. అప్పుడు ఇంద్ర‌జ‌ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశారు. ఈ విష‌యాన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించేశారు. వారం త‌ర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ద‌గ్గ‌ర‌కు మ‌ళ్లీ వ‌చ్చారు స‌త్య‌నారాయ‌ణ‌. "ఇంద్ర‌జ‌ను హీరోయిన్ అని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసి, సౌంద‌ర్య మూడు రోజుల నుంచి భోజ‌నం చేయ‌ట్లేదు. య‌మ‌లీల‌లో ఇంద్ర‌జ‌ను హీరోయిన్‌గా ఎందుకు ఫైన‌లైజ్ చేశారు. నేను చేస్తాన‌ని చెప్పాను క‌దా.. మీరేమైనా కాన్సిల్ చేశారా? అని నామీద అలిగింది. మీ ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తాను. మీరే త‌న‌ను ఎలాగైనా క‌న్విన్స్ చేయాలి." అని చెప్పారు. "మేమే అమ్మాయి ద‌గ్గ‌ర‌కు వ‌స్తాం" అని కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి బంజారాహిల్స్‌లో సౌంద‌ర్య ఉంటున్న ప్ర‌శాంత్ కుటీర్‌కు వెళ్లారు.  "ఏమైంద‌మ్మా?" అన‌డిగితే, "సారీ అండి. ఆ సినిమా నేను చేస్తాను." అంటూ ఏడ్చేసింది. "నాన్న‌గారి త‌ప్పేం లేదు. ఆ నిర్ణ‌యం మాదే. నీకు పెద్ద హీరోల ప‌క్క‌న ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి క‌దా. వ‌రుస‌గా మాతో మూడు సినిమాలు చేశావ్‌. బ‌య‌టి హీరోయిన్ చేస్తే చేంజ్ ఉంటుంది క‌దా అని అనుకున్నాం." అని వాళ్లు చెప్పాక స‌మాధాన‌ప‌డ్డారు. కానీ సినిమా రిలీజ‌య్యాక ఆమెకు అస‌లు విష‌యం తెలిసిపోయింది. వ‌చ్చి, "సారీ అండీ. నాకు నిజంగా తెలియ‌దు. అలీ ప‌క్క‌న చేయ‌డం వ‌ల్లే నా కెరీర్ పోతే ఆ కెరీర్ నాకు వ‌ద్దు. డ‌బ్బులు విప‌రీతంగా సంపాదించి క‌ట్ట‌లు క‌ట్టాలి అని లేదు. 'య‌మ‌లీల‌'ను రిజెక్ట్ చేశాను అన్న ఫీలింగే జీర్ణం కావ‌డం లేదు. మ‌రోసారి అలీ స‌ర‌స‌న చాన్స్ ఇవ్వండి. చేస్తాను." అని చెప్పారు సౌంద‌ర్య‌. అప్పుడు 'శుభ‌ల‌గ్నం'కు సంబంధించి స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. "అందులో అలీకి ఓ పాట‌నుకున్నాం. అది చేస్తావా?" అన‌డిగారు కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి. ఆనందంగా స‌రేనన్నారు సౌంద‌ర్య‌. అంత మంచి హృద‌యం ఆమెది.

సినీన‌టి కాక‌ముందు, అయ్యాక 'మ‌రో చ‌రిత్ర' స‌రిత‌ జీవితం ఎలా మారిపోయిందో చూడండి!

  న‌టి స‌రిత అస‌లు పేరు అభిలాష‌. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్ డైరెక్ట్ చేసిన 'మ‌రో చ‌రిత్ర' సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా వెండితెర‌కు ఆమె ప‌రిచ‌య‌మ‌య్యారు. అభిలాషను స‌రిత‌గా సిల్వ‌ర్ స్క్రీన్ మీద ఆవిష్క‌రించారు బాల‌చంద‌ర్‌. తొలి చిత్రంలోనే అప్ప‌టి క్రేజీ హీరో క‌మల్‌తో న‌టించ‌డం ఓ డ్రీమ్ లాంటిదైతే, న‌టించిన తొలి సినిమాయే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డ‌మే కాకుండా, తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్‌గా నిల‌వ‌డం మ‌రో క‌ల నిజం కావ‌డం లాంటిదే. అయితే సినిమాల్లోకి రాక‌ముందుతో పోలిస్తే, సినిమాల్లోకి వ‌చ్చాక ఓ అమ్మాయి జీవితం ఎలా మారిపోతుంది, ఎంత‌లా మారిపోతుందో స‌రిత జీవిత‌మే నిద‌ర్శ‌నం. ఆ మార్పును ఆమె స్వ‌యంగా రాసుకున్నారు. అదేలా ఉంటుందంటే... "నాటి అభిలాష‌కీ, నేటి స‌రిత‌కీ చాలా తేడా ఉంది. అభిలాష‌గా ఉన్న‌ప్పుడు ఇన్‌కంటాక్స్‌కు స్పెల్లింగ్ కూడా తెలియ‌దు. స‌రిత అయిన‌ప్ప‌టి నుండి ఆర్టిస్టుకూ, మేక‌ప్పుకూ ఎలా అవినాభావ సంబంధం ఉందో, అలాగే ఇన్‌కంటాక్స్‌తో కూడా సంబంధం ఉంది. స‌రిత ఒక ఇన్‌కంటాక్స్ అసెస్సీ. ఆ గొడ‌వ‌లేవీ అభిలాష‌కు లేవు, తెలియ‌వు కూడా. స‌రిత అభిలాష‌గా ఉన్న‌ప్పుడు చాలా లావు. స్కూల్లో అంద‌రూ షార్టీబ‌న్ బ‌ట‌ర్ జామ్ అని పిలిచేవారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు తినేది అభిలాష‌. ప‌థ్యం తింటున్న‌ట్లు చాలా జాగ్ర‌త్త‌గా తూచి తూచి తింటుంది స‌రిత‌. రాత్రి తొమ్మ‌ది గంట‌ల‌క‌ల్లా ప‌డుకునేది అభిలాష‌. డే అండ్ నైట్ ప‌నిచేస్తుంది స‌రిత‌. మ‌ద్రాసులో ఉంటేఏ షూటింగ్‌, డ‌బ్బింగ్ అంటూ మార్చి మార్చి ప‌నిచేయ‌డం వ‌ల్ల ప‌డుకోడానికి రాత్రి రెండు గంట‌ల‌వుతుంది. కొన్నిసార్లు ఉద‌యం ఐదు గంట‌ల వ‌ర‌కూ కూడా వ‌ర్క్ చేసింది స‌రిత‌. అభిలాష‌కు సాయంత్రం ఆరు నుండి ప‌ది గంట‌ల వ‌ర‌కు చ‌దువుసంధ్య‌లు. త‌ర్వాతేం చేస్తుంది.. హాయిగా ప‌డుకోవ‌డం త‌ప్ప‌! నాటికీ నేటికీ ఆనందం ఒక్క‌టే. నా బాధేమిటంటే, ముందుక‌న్నా నాకిప్పుడు చాలా త‌క్కువ‌మంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ డేస్‌లో బోలెడు ఫ్రెండ్స్ ఉండేవారు. నిజ‌మైన స్నేహితురాళ్లు వారు. ఇప్పుడ‌లా కాదు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ‌కూడ‌దోన‌ని భ‌యం. భ‌యంతోనేఏ మాట్లాడ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఫ్రీగా మాట్లాడ్డం కుద‌ర‌డం లేదు. మ‌న‌సును అర్జంటుగా పాలిష్ చేసుకొని, కృత్రిమంగా మాట్లాడ‌వ‌ల‌సి వ‌స్తోంది. అభిలాష‌కు ఆ బాధ లేదు. స్కూల్లో ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌వ‌చ్చు. ఎవ‌ర‌న్నా అబ్బాయి స్మార్టుగా వెళ్లేడంటే ఏయ్‌! అటు చూడండే స్మార్టుగా హీరోలా వెళ్తున్నాడు! అని మాట్లాడుకునే వాళ్లం. స్కూల్లో స్త్రీ పురుష భేదాల్లేకుండా అంద‌రం క‌లిసే చ‌దువుకునేవాళ్లం. క‌లిసి ఆడుకునేవాళ్లం. ఇప్పుడ‌లా కాదు. ఒక గీత గీసి ఆడ‌వాళ్లు, మ‌గ‌వాళ్లంటూ విడివిడిగా మాట్లాడాల్సి వ‌స్తోంది. అంతేకాదు, ఆడ‌వాళ్ల మ‌ధ్య మాట్లాడినా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తోంది. అభిలాష‌కు పాస్‌పోర్టు లేదు. స‌రిత‌కు పాస్‌పోర్టు ఉంది. హైట్‌, వెయిట్‌, పుట్టుమ‌చ్చ‌ల వివ‌రాల‌తో, నాకూ భార‌తీయ పౌర‌స‌త్వం ఉంద‌న‌డానికి ఆధారంగా పాస్‌పోర్టు ఉంది.  అభిలాష‌కు కాడ్‌బ‌రీస్ అంటే ప్రాణం. మొద‌టిసారిగా నేను సినిమాల్లో న‌టించిన‌ప్పుడు నాకు కాడ్‌బ‌రీస్ ఇచ్చి నాచే న‌టింప‌జేశారు బాల‌చంద‌ర్‌గారు. కానీ స‌రిత స్వీట్స్ తిన‌డం మానేసింది. అభిలాష కాస్త డెలికేట్ అమ్మాయి. ఎప్పుడూ షూస్ తొడుక్కుని ఉంటుంది. సుఖానికి అల‌వాటు ప‌డింది. ఇప్పుడు ఎండాలేదు, వానాలేదు. సినిమా కోసం మండుటెండ‌లో చెప్పుల్లేకుండా న‌డ‌వాల్సి వ‌స్తోంది. కాళ్లు స‌ర్రున‌కాలి బొబ్బ‌లు లేస్తాయి. అయినా ఇదేం పెద్ద క‌ష్టంకాదు. ఇందులో క‌ష్టంక‌న్నా ప్లెజ‌రే ఎక్కువ‌! అభిలాష చాలా ఇన్నోసెంట్‌. స‌రిత‌కు లోక‌జ్ఞానం కాస్త ల‌భించింది. ఇంత‌కుముందైతే స్కూల్ స్నేహితులు, సినిమాలు.. అంతే!. అంత‌కుమించి ఇంకేం తెలియ‌దు. పాత జీవితం కోసం తిరిగి పాకులాడుతున్నాన‌ని అర్థం కాదు. ఇది నేను ఇష్ట‌ప‌డి, ఎన్నుకున్న మార్గం. భ‌గ‌వంతుడ్ని వేడుకోగా ల‌భించిన మార్గం. అభిలాష నుండి స‌రిత‌గా నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇది ఒక ప్ర‌మోష‌న్ వంటిది."

మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌కి వంట‌కాల్లో 'ఉన్న‌ది ఒద్దు లేనిది ముద్దు!

  ముర‌ళీ మోహ‌న్‌, జ‌య‌చిత్ర జంట‌గా వి. మ‌ధుసూద‌న‌రావు రూపొందించిన 'పొరుగింటి పుల్ల‌కూర' (1976) సినిమాలో మ‌హాక‌వి శ్రీ‌శ్రీ, "ఉన్న‌దానితో పోరాటం.. లేని దానికై ఆరాటం.. ఉన్న‌ది ఒద్దు లేనిది ముద్దు.. ఏది ఆశ‌కు హ‌ద్దు" అంటూ ఓ పాట రాశారు. చ‌క్ర‌వ‌ర్తి సంగీతం స‌మ‌కూర్చ‌గా, రామ‌కృష్ణ పాడిన ఈ పాట ఆ రోజుల్లో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ పాట శ్రీ‌శ్రీ‌కే బాగా వ‌ర్తిస్తుందని ఆయ‌న భార్య స‌రోజా శ్రీ‌శ్రీ ఒక‌ప్పుడు చెప్పారు. శ్రీ‌శ్రీ ప‌ద్ధ‌తులు చాలా విచిత్రంగా ఉండేవి. ఏ రోజైనా ప‌ని లేకుంటా ఆ రోజు ఉద‌యం 10 గంట‌లైనా మంచం మీద‌నుంచి లేచేవారు కాదు. ప‌ది అయ్యింది లేవండి అని ఇంట్లోవాళ్లు లేపితే, "ఉండు నాయ‌నా ఇంకా తెల్లార‌లేదు" అనేవారు. ప‌నివుంటే మాత్రం 5 గంట‌ల‌క‌ల్లా లేచి కూర్చొనేవారు. 10.30 నుంచి 11 గంట‌ల మ‌ధ్య టిఫిన్ చేసేవారు. మ‌ధ్యాహ్నం ఒంటిగంట నుంచి భోజ‌నానికి లేవండని పిలుస్తుంటే 3 గంట‌ల‌కు లేచి అప్పుడు స్నానానికి వెళ్లేవారు. స్నానం చేశాక ఓ ట‌వ‌ల్‌తో తుడుచుకొనేవారో, అదే ట‌వ‌ల్ న‌డుంకు చుట్టుకొని టేబుల్ ద‌గ్గ‌ర భోజ‌నానికి కూర్చేనేవారు. ఆయ‌న టేబుల్ ద‌గ్గ‌ర కూర్చున్న‌ప్పుడు అన్నీ సిద్ధంగా ఉండాలి. లేక‌పోతే, మ‌ళ్లీ మంచం ఎక్కేసేవారు. ఇంక ఆరోజు ఎంత పిలిచినా భోజ‌నం చెయ్య‌ర‌న్న మాట‌. అందుక‌ని స‌రోజ‌గారు స్నానానికి అన్నీ సిద్ధంచేసి, టేబుల్ ద‌గ్గ‌ర కాచుకొని ఉండేవారు. భోజ‌నం ద‌గ్గ‌ర కూడా అన్నీ ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే ఉండాలి. ముందు ఉప్పు వ‌డ్డించాలి. ఆవ‌కాయ‌, పెరుగు త‌ప్ప‌నిస‌రి. ఏం వండారో ముందుగా చెప్పాలి. దొండ‌కాయో, బెండ‌కాయో చేశార‌ని చెప్తే "బంగాళాదుంప లేదూ" అనేవారు. "చెయ్య‌నిదాని గురించి అడుగుతారేవండీ" అంటే, మూడ్ బాగుంటే వ‌డ్డించ‌మ‌నేవారు. లేదంటే.. అడిగింది చేసిపెట్టాల్సిందే. అందుక‌ని స్నానానికి లేపే ముందుగానే స‌రోజగారు ఆ రోజు ఏ వంట‌కాలు చేశారో చెప్పేవారు. వేరే ఏదైనా కావాలంటే చెప్ప‌మ‌ని అడిగేవారు. ఇలా ఉండేది శ్రీ‌శ్రీ వ్య‌వ‌హారం.

ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌చిత్ర‌కు పెళ్లిచేసిన పాపుల‌ర్ డైలీ!

  ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌చిత్ర జంట‌గా చాలా సినిమాల్లో న‌టించారు. ఆ టైమ్‌లో ఎక్క‌డ చూసినా వాళ్లిద్ద‌రే క‌నిపిస్తూ ఉండేవాళ్లు. ఒక‌రోజు మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో షూటింగ్‌క‌ని వెళ్లారు ముర‌ళీమోహ‌న్‌. ఆయ‌న‌ను చూసి, అక్క‌డున్న‌ త‌మిళంవాళ్లు "ఇవ‌ర్‌దా (ఇత‌నే) ముర‌ళీమోహ‌న్"  అంటున్నారు. వాళ్ల‌లా ఎందుకంటున్నారో ముర‌ళీమోహ‌న్‌కు అర్థం కాలేదు. మేక‌ప్ వేసుకొని సెట్‌లోకి వెళ్లాక స‌హ న‌టీన‌టులు "ఏంట‌య్యా నిజం చెప్పు.. నువ్వు జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకుంటున్నావా?" అన‌డిగారు. "నేను జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకోవ‌డ‌మేంటి? నాకు పెళ్ల‌యి పిల్ల‌లు కూడా ఉన్నారు." అని చెప్పారు ముర‌ళీమోహ‌న్‌. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను చిత్ర రంగానికి ప‌రిచ‌యం చేసిన నిర్మాత అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు వ‌చ్చి, "బాబూ నీతో ఓసారి మాట్లాడాలి. బ‌య‌ట‌కు రా" అన్నారు. డౌట్‌గానే మేక‌ప్ రూమ్‌లోకి ఆయ‌న‌ను తీసుకొని వెళ్లారు ముర‌ళీమోహ‌న్. పూర్ణ‌చంద్ర‌రావు రూమ్ గ‌డియ వేశారు. "ఇవాళ పేప‌ర్‌లో వ‌చ్చింది చూశావా.. నువ్వు జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకోబోతున్నావ‌ని. నిజ‌మేనా?  నువ్వు త‌ప్పు చెయ్య‌వ‌ని నాకు తెలుసు. ఒక‌వేళ చేస్తున్నావేమో.. నిన్ను హెచ్చ‌రిద్దామ‌ని వ‌చ్చాను." అన్నారు. "అలాంటి పొర‌పాటు ఎప్పుడూ నేను చెయ్య‌నండీ. ఎవ‌రికీ త‌ల‌దించుకొనే అవ‌కాశం రానివ్వ‌నండీ. అస‌లా ఉద్దేశం నాకెప్పుడూ లేదండీ." అని చెప్పారు ముర‌ళీమోహ‌న్‌. సంతృప్తిచెంది వెళ్లిపోయారు పూర్ణ‌చంద్ర‌రావు. కానీ ఇలా పేప‌ర్‌లో వ‌చ్చింద‌నే విష‌యం త‌ట్టుకోవ‌డం ముర‌ళీమోహ‌న్‌కు క‌ష్ట‌మైపోయింది. త‌న‌కు బాగా స‌న్నిహితుడైన డైరెక్ట‌ర్ విజ‌య‌బాపినీడుతో త‌న బాధ‌ను చెప్పుకున్నారు ముర‌ళీమోహ‌న్‌. "త‌మిళంలో ఎల్లో జ‌ర్న‌లిజం అని ఉంటుంది. ఆ హీరో, ఈ హీరోయిన్ క‌లిసి తిరుగుతున్నారు, త్వ‌ర‌లో వాళ్లు పెళ్లిచేసుకోబోతున్నారు అని రాస్తుంటారు. వాటిని ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు." అని ఆయ‌న‌న్నారు. ఇంత‌కీ ఆ వార్త‌ను రాసింది.. త‌మిళంలో బాగా పాపుల‌ర్ అయిన దిన‌తంతి అనే డైలీ పేప‌ర్‌. ఫ్రంట్ పేజీలోనే ప్ర‌ముఖంగా ఆ వార్త‌ను వేశారు. నిరాధారంగా ఆ వార్త‌ను ప్ర‌చురించినందుకు ఆ పేప‌ర్‌కు లీగ‌ల్ నోటీసు పంపించారు ముర‌ళీమోహ‌న్‌. దాంతో త‌మ రిపోర్ట‌ర్ త‌ప్పుడు స‌మాచారంతో ఆ వార్త‌ను రాసినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది ఆ ప‌త్రిక‌. ఇది జ‌రిగిన నెల‌రోజుల త‌ర్వాత ఒక‌రోజు షూటింగ్‌కు వెళ్లాల‌ని మ‌ద్రాస్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు ముర‌ళీమోహ‌న్‌. ఆయ‌న‌, జ‌య‌చిత్ర‌, దాస‌రి నారాయ‌ణ‌రావు ఒకే ఫ్ల‌యిట్‌లో హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఆ వెంట‌నే "మేం అప్పుడు రాసింది క‌రెక్ట్‌. దాస‌రి నారాయ‌ణ‌రావు ఆధ్వ‌ర్యంలో ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌చిత్ర హైద‌రాబాద్‌లో పెళ్లిచేసుకోబోతున్నారు." అని మ‌ళ్లీ అదే పేప‌ర్‌లో వ‌చ్చింది. అప్పుడు అక్కినేనికి క‌థ చెప్తామ‌ని దాస‌రి వ‌స్తే, వ‌డ్డే ర‌మేశ్ వాళ్ల సినిమా షూటింగ్ కోస‌మ‌ని ముర‌ళీమోహ‌న్ వ‌చ్చారు. జ‌య‌చిత్ర వేరే సినిమా షూటింగ్ కోసం వ‌చ్చారు. దాంతో అలాంటి వార్త‌ల‌ను లైట్‌గా తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు ముర‌ళీమోహ‌న్‌. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పుకొచ్చారు.

చిరంజీవిని ఆయ‌న భార్య సురేఖ మొద‌టిసారి ఎక్క‌డ చూశారంటే...

  చిరంజీవితో పాటు స‌త్య‌నారాయ‌ణ అనే అత‌ను న‌ర‌సాపురం కాలేజీలో చ‌దువుకున్నాడు. ఆయ‌న అల్లు రామ‌లింగ‌య్య‌కు ద‌గ్గ‌రి బంధువు. ఆయ‌న ఓసారి మ‌ద్రాస్‌కు చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. చుట్ట‌పు చూపుగా అల్లు రామ‌లింగ‌య్య భార్య క‌న‌క‌ర‌త్నంను క‌లుసుకున్నాడు. అప్పుడు ప‌క్క‌నే ఉన్న చిరంజీవిని చూసి, ఈ అబ్బాయి ఫ‌లానా సినిమాలో న‌టించిన అబ్బాయి క‌దా?.. అని స‌త్య‌నారాయ‌ణ‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ సంద‌ర్భంలోనే చిరంజీవి కుల‌గోత్రాలు, కుటుంబ సాంప్ర‌దాయాల గురించి కూడా ఆమె వాక‌బు చేశారు.   ఆమెకు మ‌న సురేఖ‌కు ఈ అబ్బాయిని చేసుకుంటే అనే ఆలోచ‌న వ‌చ్చింది. మొద‌ట త‌న ఆలోచ‌న‌ను త‌న కొడుకు అర‌వింద్‌కు చెప్పారు. అర‌వింద్‌కు నిర్మాత‌గా మారిన మేక‌ప్‌మ్యాన్ జ‌య‌కృష్ణ అత్యంత స‌న్నిహిత మిత్రుడు. ఆయ‌న చిరంజీవికీ ఆప్త‌మిత్రుడు. జ‌య‌కృష్ణ రంగంలోకి దిగి, రెండు కుటుంబాల పెద్ద‌ల‌తోనూ సంప్ర‌దించి సంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. తాంబూలాల‌ను న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు స‌మ‌క్షంలో ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక పెళ్లికూతురు సురేఖ విష‌యానికి వ‌స్తే.. అప్ప‌టికే ఆమె చిరంజీవి అభిమాని. చిరంజీవిని ఆమె మొట్ట‌మొద‌టిసారి ప్ర‌త్య‌క్షంగా 'తాయార‌మ్మ‌-బంగార‌య్య' సినిమా 100 రోజుల వేడుక‌లో చూశారు. ఈ విష‌యాన్ని త‌న‌తో మొద‌టిరాత్రో, మూడో రాత్రో చెప్పిన‌ట్లు గుర్తు అని ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి వెల్ల‌డించారు. "మా వివాహం 1980 ఫిబ్ర‌వ‌రి 20 ఉద‌యం 10:50 గంట‌ల‌కు మ‌ద్రాసులోని రాజేశ్వ‌రి క‌ల్యాణ‌మంట‌పంలో జ‌రిగింది." అని ఆయ‌న చెప్పారు. 

హాస్యం కంటే శృంగారం గొప్ప‌దంటూ అక్కినేని చెప్పిన క‌ప్ప‌ క‌థ‌!

  న‌వ‌ర‌సాల్లో శృంగార ర‌సం, హాస్య ర‌సం చాలా గొప్ప‌వంటారు. అయితే ఈ రెండింటిలోనూ శృంగార ర‌సం మ‌రింత గొప్ప‌దంటారు మ‌హాన‌టుడు దివంగ‌త అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఒక‌సారి శృంగార‌, హాస్య ర‌సాల్లో ఏది గొప్ప‌ద‌నే వాద‌న వ‌చ్చిన‌ప్పుడు "హాస్య‌ర‌సం చాలా మంచిది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుంచి రిలీవ్ కావాలంటే హాస్య‌ర‌సం కావాలి." అని చెప్తూనే, ఒక సంఘ‌ట‌న పంచుకున్నారు. అక్కినేనిని మార్నింగ్ వాక్ త‌ర్వాత కిచెన్ గార్డెన్‌లో కొంచెంసేపు ప‌నిచెయ్య‌డం అల‌వాటు. అలా ప‌నిచేస్తుండ‌గా ఒక‌చోట ఒక క‌ప్ప క‌నిపించింది. దాన్ని తొల‌గించి, అక్క‌డ శుభ్రం చెయ్యాల‌నుకున్నారు. అది క‌ద‌ల్లేదు. ఒక పుల్ల తీసుకువ‌చ్చి, దాన్ని పొడిచారు. అయినా అది క‌ద‌ల్లేదు. గ‌ట్టిగా ఉన్న ఆకులాంటిది తీసుకువ‌చ్చి, దాన్ని తీసేశారు. "అప్పుడేమైందంటే.. ఆ క‌ప్ప‌కింద అప్పుడే ప్ర‌స‌వించిందో, పెట్టిందో.. దాని చిన్న‌పిల్ల‌లు.. క‌ప్ప‌పిల్ల‌లు క‌నిపించాయి. వాటిని చూసి నా క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. దీన్ని ఎంత డిస్ట్ర‌బ్ చేశాను నేను. ఆ త‌ల్లిప్రేమ ఎలాంటిది. అయ్య‌య్యో.. నేనెంత పొర‌పాటు పని చేశాను. అని బాధ‌ప‌డ్డాను. ఆ వెంట‌నే తెలియ‌కుండా చేస్తే త‌ప్పులేదు క‌దా అని స‌రిపెట్టుకున్నాను." అని చెప్పారు. అప్పుడాయ‌న అనుభ‌వించింది క‌రుణ‌ర‌సం. "కానీ ఆ త‌ల్లిప్రేమ ఉండ‌టానికి కార‌ణం, ఆ ప్రేమ ఉద్భ‌వించ‌డానికి కార‌ణం, ఆ పిల్ల‌లు పుట్ట‌డానికి కార‌ణం శృంగార ర‌స‌మా.. హాస్య ర‌స‌మా.. చెప్పండి. అందుచేత ఫ‌స్ట్ మార్క్ ఎన్న‌టికీ శృంగారానికే. హ్యాట్సీఫ్ టు రొమాన్స్‌. ద‌టీజ్ ల‌వ్." అని చెప్పారు అక్కినేని. అందుకే కాబోలు తెర‌పై శృంగార ర‌సాన్ని అద్భుతంగా ఆయ‌న ఆవిష్క‌రించేవారు.

ఇంట్లో ఉన్న‌ బాల‌కృష్ణ‌ను "షూటింగ్‌కు వెళ్లు" అని ఆర్డ‌ర్ వేసిన ఎన్టీఆర్‌!

  విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించిన కొన్ని సినిమాల‌కు సింగీతం శ్రీ‌నివాస‌రావు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. నిజానికి ఆయ‌న సినీరంగ ప్ర‌వేశం జ‌రిగింది 'మాయాబ‌జార్‌'తో. దిగ్ద‌ర్శ‌కుడు కె.వి. రెడ్డి శిష్యునిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన సింగీతం సైతం లెజండ‌రీ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదిగారు. 'పుష్ప‌క విమానం' ఒక్క‌టి చాలు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఎలాంటిదో చెప్ప‌డానికి. అయితే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయ‌న‌కు జీవిత కాలంలో రాలేదు. కానీ ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణను మాత్రం మూడు సినిమాల్లో ఆయ‌న డైరెక్ట్ చేశారు. వాటిలో రెండు క్లాసిక్స్‌గా కాలానికి త‌ట్టుకొని నిల‌బ‌డ్డాయి.. అవి.. 'ఆదిత్య 369', 'భైర‌వ ద్వీపం'. అయితే మూడో సినిమా 'శ్రీ‌కృష్ణార్జున యుద్ధం' మాత్రం ఫ్లాప‌యింది. ఎన్టీఆర్‌లో ఉన్న దాదాపు అన్ని ల‌క్ష‌ణాలు బాల‌కృష్ణ‌లో ఉన్నాయంటారు సింగీతం. క్ర‌మ‌శిక్ష‌ణ‌, పెద్ద‌వారిని గౌర‌వించే ల‌క్ష‌ణాలు ఆయ‌న‌కు ఎస్సెట్స్‌గా చెబుతారు. పౌరాణిక చిత్రాలు చేసేట‌ప్పుడు ఒక‌సారి ఆభ‌ర‌ణాలు ధ‌రిస్తే, మ‌ళ్లీ షూటింగ్ ప్యాక‌ప్ చెప్పేట‌ప్పుడే వాటిని తీసేవారు ఎన్టీఆర్‌. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యంలోనూ వాటిని తీసేవారు కాదు, స‌మ‌యం వృథా అవుతుందని. అదే ల‌క్ష‌ణం బాల‌య్య‌కూ వ‌చ్చింది. 'ఆదిత్య 369' సినిమాలో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర పోషించే స‌మ‌యంలో త‌ల‌మీద కిరీటం ఇబ్బంది క‌లిగిస్తున్నా అలాగే ఉండేవారు.  ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో భ‌విష్య‌త్ కాలం షాట్స్ తీసేట‌ప్పుడు సింగీతంకూ, సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్‌కు ఎక్కువ ప‌ని ఉండేది. లైటింగ్ సెట్ చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేది. అందువ‌ల్ల ఆర్టిస్టులు వ‌చ్చినా వృథాగా కూర్చోవాల్సి వ‌చ్చేది. అందుకే ఒక‌రోజు బాల‌కృష్ణ‌ను కాస్త ఆల‌స్యంగా ర‌మ్మ‌ని చెప్పారు సింగీతం. అలా ఆయ‌న ఇంటివ‌ద్దే ఉంటే, ఎన్టీఆర్ "షూటింగ్ లేదా?" అని అడిగారు. డైరెక్ట‌ర్‌గారే లేటుగా ర‌మ్మ‌న్నార‌ని బాల‌య్య చెప్పారు. "నిర్మాత మ‌న‌కు డ‌బ్బు ఇస్తున్న‌ది ఉద‌యం నుంచి సాయంకాలం దాకా వారికి అందుబాటులో ఉండ‌టానికి. ముందు మేక‌ప్ వేసుకొని షూటింగ్‌కు వెళ్లు." అని ఆర్డ‌ర్ వేశారు ఎన్టీఆర్‌. వెంట‌నే బాల‌కృష్ణ మేక‌ప్ వేసుకొని షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చారు. అదీ ఎన్టీఆర్ ప‌ద్ధ‌తి. దాన్ని బాల‌య్య అనుస‌రిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో సింగీతం చెప్పుకొచ్చారు.

'గూఢ‌చారి 116'కు హీరో కావాలంటే కృష్ణ బ‌దులు రామ్మోహ‌న్‌ను పంపిన ఆదుర్తి!

  ఇండియాలోనే తొలి జేమ్స్‌బాండ్ సినిమా హీరోగా ఎవ‌రికీ ద‌క్కని అరుదైన కీర్తిని సొంతం చేసుకున్నారు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. 'గూఢ‌చారి 116'తో ఆయ‌న ఈ ఘ‌న‌త సాధించారు. అందుకే ఆ త‌ర్వాత కాలంలో 'ఆంధ్రా జేమ్స్‌బాండ్' అన్న ఖ్యాతి పొందారు. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న హీరోగా ప‌రిచ‌యం అయిన 'తేనె మ‌న‌సులు' సినిమాయే 'గూఢ‌చారి 116'లో న‌టించే అవ‌కాశం ఆయ‌న‌కు క‌ల్పించింద‌నే విష‌యం చాలామందికి తెలీదు.  'తేనె మ‌న‌సులు' సినిమాలో కృష్ణ‌కు స్కూట‌ర్‌తో కారును చేజ్ చేస్తూ, స్కూట‌ర్‌ను అలాగే వ‌దిలేసి కారులోకి జంప్ చేసే సీన్ ఒక‌టుంది. డూప్ లేకుండా ఆ సీన్‌లో న‌టించారు కృష్ణ‌. ఆయ‌న సాహ‌సం నిర్మాత డూండీని బాగా ఆక‌ట్టుకుంది. అందుకే ఎం. మ‌ల్లికార్జున‌రావు డైరెక్ష‌న్‌లో 'గూఢ‌చారి 116' సినిమా తియ్యాల‌ని డూండీ అనుకున్న‌ప్పుడు ఆయ‌న మ‌న‌సులో మెదిలింది కృష్ణే. 'పానిక్ ఇన్ బ్యాంకాక్' మూవీ ఆధారంగా ఆరుద్ర రాసిన క‌థ‌లో జేమ్స్‌బాండ్ క్యారెక్ట‌ర్‌కు కృష్ణ స‌రిగ్గా స‌రిపోతార‌నీ, జేమ్స్‌బాండ్ చేసే సాహ‌సాలు ఆయ‌న బాగా చేస్తాడ‌నీ డూండీకి అనిపించింది. ఒక‌రోజు ఆదుర్తి సుబ్బారావుకు ఫోన్ చేసి, "మీ హీరోతో సినిమా తియ్యాల‌నుకుంటున్నాను. అత‌న్ని మా ఆఫీసుకు పంపిస్తారా?" అన‌డిగారు డూండీ. 'తేనె మ‌న‌సులు'లో మెయిన్ హీరోగా న‌టించిన రామ్మోహ‌న్‌ను అడుగుతున్నార‌నుకొని ఆయ‌న్ని పంపించారు ఆదుర్తి. రామ్మోహ‌న్ రావ‌డంతో డూండీకి తాను చేసిన పొర‌పాటు అర్థ‌మైంది. అప్ప‌టికి ఆయ‌న‌తో అవీ ఇవీ మాట్లాడి పంపించేసి, మ‌ళ్లీ ఆదుర్తికి ఫోన్ చేశారు. "రామ్మోహ‌న్ కాదండీ.. కృష్ణ అని మ‌రో హీరో ఉన్నాడు క‌దా.. అత‌ను కావాలి నాకు" అని చెప్పారు. అప్పుడు కృష్ణ‌ను పంపించారు ఆదుర్తి. కృష్ణ త‌మ ఆఫీసుకు రాగానే, "మా సినిమాలో నిన్ను హీరోగా బుక్ చేశామ‌య్యా.. జేమ్స్‌బాండ్ వేషం" అని చెప్పి, అప్ప‌టిక‌ప్పుడే అగ్రిమెంట్ మీద సంత‌కం చేయించుకున్నారు డూండీ. అలా హీరోగా త‌న మూడో సినిమాలో 'గూఢ‌చారి 116'గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రించారు కృష్ణ‌. ఆయ‌న‌కు అభిమానులు ఏర్ప‌డ‌డం మొద‌లైంది ఈ సినిమాతోటే.

'వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు' షూటింగ్ లాంచ్‌.. ఎన్టీఆర్‌-కృష్ణ ఫ్యాన్స్ హ‌ల్చ‌ల్‌!

  మ‌ద్రాస్‌లోని ఏవీయం స్టూడియో మెయిన్ గేట్ నుంచి ఫ‌స్ట్ ప్లోర్ దాకా ఉన్న రోడ్డు అంతా కార్ల‌తో నిండిపోయి ఉంది. వాటిని దాటితే ఆ ప్ర‌దేశం అంతా జ‌న‌వాహినితో కిట‌కిట‌లాడుతూ ఉంది. ఫ్లోర్ బ‌య‌ట డి. రామానాయుడు, టి. త్రివిక్ర‌మ‌రావు, కె. రాఘ‌వేంద్ర‌రావు, ఎం. బాల‌య్య లాంటి దిగ్గ‌జాలు క‌నిపిస్తున్నారు. ఫ్లోర్‌లోకి వెళ్తే మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌స్తామ‌న్న న‌మ్మ‌కం లేనందువ‌ల్లే వార‌లా నిల్చుండిపోయారు. ఇక ఫ్లోర్ లోప‌ల‌.. గాలికూడా ప్ర‌వేశించ‌లేనంత‌గా జ‌న‌సందోహం.. "కొండ‌వీటి సింహం ఎన్టీఆర్ జిందాబాద్‌", "ప‌గ‌బ‌ట్టిన సింహం కృష్ణ జిందాబాద్" అనే కేక‌ల‌తో ఆ ఫ్లోర్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. తెలుగునాట విప‌రీమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ఎన్టీఆర్‌, కృష్ణ క‌లిసి న‌టిస్తున్న 'వ‌య్యారి భామ‌లు - వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు' చిత్రం ప్రారంభోత్స‌వం అది... ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌లుమూల‌ల నుంచీ వ‌చ్చిన ఇద్ద‌రు హీరోల అభిమానులు చేస్తున్న హ‌ల్‌చ‌ల్‌, హంగామా చూస్తుంటే మిగ‌తావారికి ఆనందంతో పాటు ఆశ్చర్య‌మూ క‌లుగుతోంది. అక్క‌డున్న ప్ర‌తి అభిమాని చేతిలోనూ పూలదండ‌లున్నాయి. కొన్ని భారీ పూల‌హారాల‌ను ఆరుగురు క‌లిసి జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకొని మోస్తున్న‌ప్ప‌టికీ అవి ఓ ప‌క్క‌కు ఒరిగిపోతున్నాయి. ఎవ‌రి అభిమానం వారిది. ఎవ‌రి ఉత్సాహం వారిది. ఎవ‌రి ఆత్రుత వారిది. ఎవ‌ర్ని ఎవ‌రూ కంట్రోల్ చేయ‌లేని ప‌రిస్థితి... అంత‌లో సెట్లో గులాబీపూల వ‌ర్షం కురిసింది. అవి నేల‌మీద ప‌డ‌డానికి అవ‌కాశం లేనంత మంది జ‌నం ఉండ‌టంతో వారి త‌ల‌లు ఆ పూల‌తో నిండిపోయాయి. అప్పుడే.. "మీరంతా నిశ్శ‌బ్దంగా ఉంటే ఈ షాట్ పూర్త‌యిన వెంట‌నే నేనూ, బ్ర‌ద‌ర్ కృష్ణ బ‌య‌ట‌కు వ‌స్తాం.. మీకోసం కొంత టైమ్ స్పెంట్ చేస్తాం. మీరేమీ నిరుత్సాహ‌ప‌డ‌వ‌ద్దు." అనే మాట‌లు గంభీరంగా వినిపించాయి. ఆ గొంతు విన్న‌వారికెవ‌రైనా అది ఎన్టీఆర్ గొంతు అని అర్థ‌మైపోతుంది. ఒక్క‌సారిగా అక్క‌డ నిశ్శ‌బ్దం ఆవ‌హించింది. అభిమానులు గ‌ప్‌చుప్ అయిపోయారు. అంత‌దాకా అరుపులు, కేక‌ల‌తో నానా భీభ‌త్సంగా క‌నిపించిన అక్క‌డి వాతావ‌ర‌ణం ఊహించ‌నంత ప్ర‌శాంతంగా మారిపోయింది. "య‌స్ సుబ్బారావు గారూ.. నేనూ, బ్ర‌ద‌రూ రెడీ" అన్నారు ఎన్టీఆర్‌. "య‌స్ సార్‌.. టేక్ చేద్దాం సార్" అన్నారు డైరెక్ట‌ర్ క‌ట్టా సుబ్బారావు. కెమెరా ర‌న్ అవుతోంది. షాట్ మొద‌లైంది. "ఏం త‌మ్ముడూ.. బాగున్నావా?" అని కృష్ణ‌ను విష్‌చేసి, ఆనందంగా ఆయ‌న‌ను ముద్దుపెట్టుకున్నారు ఎన్టీఆర్‌. కృష్ణ కూడా అంతే ఆనందంతో, "నేను బాగానే ఉన్నాన‌న్న‌య్యా. నీ ప్ర‌యాణం ఎలా జ‌రిగింది?" అని ఎన్టీఆర్‌ను అడిగారు. "ఓ వెరీ నైస్" అన్నారు ఎన్టీఆర్‌. "క‌ట్" చెప్పారు కట్టా సుబ్బారావు. అంతే! కొద్ది నిమిషాల దాకా ఆ ప్ర‌దేశం అంతా క‌ర‌తాళ‌ధ్వ‌నుల‌తో మారుమోగిపోయింది. మ‌ళ్లీ అభిమానుల నినాదాలు మొద‌ల‌య్యాయి. త‌మ ఆరాధ్య క‌థానాయ‌కుల‌ను వారు చుట్టుముట్టేశారు. మెడ‌లో పూల‌దండ‌లు వేసి, అంత‌టితో ఆగ‌కుండా పాదాభివంద‌నాలు మొద‌లుపెట్టారు. ఇద్ద‌రు స్టార్లూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ప‌ది నిమిషాలు అలాగే గ‌డిచిపోయాయి. అక్క‌డి వాతావార‌ణంలో మార్పులేదు.  "ప‌రిస్థితి ఇలాగే ఉంటే ఈ రోజంతా షూటింగ్ జ‌ర‌గ‌దు. ఈ సెట్ సాయంత్రానికి క‌నిపించ‌దు." అని ఎవ‌రో గ‌ట్టిగా అరిచారు. నిర్మాత గురుపాదం త‌న ప‌రిస్థితి ఏమిట‌న్న‌ట్లు హీరో కృష్ణ వంక చూశారు. కృష్ణ‌కు అర్థ‌మైంది. ఎన్టీఆర్ కూడా ఫ్లోర్ బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు కానీ ఫ్యాన్స్ ఆయ‌న‌ను క‌ద‌ల‌నివ్వ‌ట్లేదు. అంత‌లో కృష్ణ "ద‌య‌చేసి అభిమానులంద‌రూ బ‌య‌ట‌కు న‌డ‌వండి. నేనూ బ‌య‌ట‌కు వ‌స్తాను" అన్నారు. "క‌న్వ‌ర్‌లాల్ జిందాబాద్‌.. విప్ల‌వ‌జ్యోతి సీతారామ‌రాజు జిందాబాద్‌.. ప‌గ‌బ‌ట్టిన సింహం జిందాబాద్‌.. అంద‌రికీ మొన‌గాడు జిందాబాద్" అని నినాదాలు చేసుకుంటూ హీరో కృష్ణ‌ను ఆయ‌న అభిమానులు బ‌య‌ట‌కు తీసుకుపోయారు. కృష్ణ బ‌య‌ట‌కు రాగానే, ఫ్లోర్ బ‌య‌ట‌వుండి లోప‌లికి రాలేక‌పోయిన కొంత‌మంది అభిమానులు ఆయ‌న‌కు పాదాభివంద‌నాలు చేశారు. మ‌ళ్లీ పూల‌దండ‌ల కార్య‌క్ర‌మం, ఆటోగ్రాఫ్‌ల ప‌ర్వంతో పాటు స్టిల్స్ దిగే కార్య‌క్ర‌మం న‌డిచింది. కొంతసేపు అభిమానుల కోరిక‌ను తీర్చిన కృష్ణ‌, "ఇక న‌న్ను వ‌దిలెయ్యండి. సాయంత్రం క‌లుస్తాను" అంటూ అభిమానుల‌ను నెట్టుకుంటూ కారెక్కారు. "అన్నా.. నిన్ను మ‌ర్చిపోలేన‌న్నా" అంటూ ఓ అభిమాని కృష్ణ చేతిని అందుకొని ముద్దుపెట్టుకున్నాడు. అత‌నితో "అలాగే అలాగే" అని, డ్రైవ‌ర్‌ను కారు స్టార్ట్ చెయ్య‌మ‌ని చేయి ఊపారు కృష్ణ‌. అప్ప‌టికీ అభిమానులు వ‌ద‌ల‌లేదు. కారు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, "అసాధ్యుడు కృష్ణ‌.. అఖండుడు కృష్ణ‌.. జేమ్స్‌బాండ్ కృష్ణ" అని అర‌వ‌డం ప్రారంభించారు. "న‌న్ను ఆద‌రిస్తున్న మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు" అని చేయివూపారు కృష్ణ‌. కారు బ‌య‌లుదేరింది. ఇక సెట్‌లో.. హోరాహోరీగా ఎన్టీఆర్ మీద దండ‌లు దాడిచేస్తున్నాయి. క‌ట్టా సుబ్బారావు వ‌చ్చి, సార్ సెట్ అంతా పూల‌తో నిండిపోయింది. సెట్ క్లీన్ చేయించాలి అన్నారు. అభిమానుల‌నంద‌ర్నీ ఫ్లోర్ బ‌య‌ట‌కు న‌డ‌వాల్సిందిగా కోరి, త‌ను కూడా బ‌య‌లుదేరారు. "కొండ‌వీటి సింహం జిందాబాద్‌.. స‌ర్దార్ పాపారాయుడు జిందాబాద్‌.. బొబ్బిలి పులి జిందాబాద్." అంటూ నినాదాలు చేసుకుంటూ, కేరంత‌లు కొడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సెట్ బ‌య‌ట‌కు న‌డిచారు. త‌న‌కు పాదాభివంద‌నాలు చేస్తున్న‌వారిని ఎన్టీఆర్ లేవ‌నెత్త‌బోతుంటే, "మామీద న‌డిచివెళ్లండి సార్" అన్నాడొక వీరాభిమాని. అత‌నిని లేవ‌నెత్తి ఆప్యాయంగా భుజం త‌ట్టారు ఎన్టీఆర్‌. అభిమానుల కోలాహ‌లంతో, జ‌య‌జ‌య నినానాదాల‌తో ఏవీయం స్టూడియో ద‌ద్ద‌రిల్లిపోయింది. "మీరంద‌రూ న‌న్ను చూడ్డానికి వ‌చ్చారు. సంతోషం. ఇంత‌మంది అభిమానులు నాకోసం వ‌చ్చి నా విజ‌యాన్ని కోరుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది." అని అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడారు ఎన్టీఆర్‌. అభిమానులు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఓర్పుగా జ‌వాబులు చెప్పారు. అలా అర‌గంట‌సేపు సెట్ బ‌య‌ట కూర్చొని అభిమానుల‌తో గ‌డిపి వారికి ఆనందాన్ని చేకూర్చారు ఎన్టీఆర్‌. వ‌య్యారి భామ‌లుగా శ్రీ‌దేవి, రాధిక, వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లుగా ఎన్టీఆర్‌, కృష్ణ న‌టించిన ఈ చిత్రంలో రావు గోపాల‌రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, నూత‌న్ ప్ర‌సాద్‌, పండ‌రీబాయి, ఎస్‌. వ‌ర‌ల‌క్ష్మి, ర‌మాప్ర‌భ కీల‌క పాత్ర‌లు చేశారు. డి.వి. న‌ర‌స‌రాజు సంభాష‌ణ‌లు రాయ‌గా, రాజ‌న్‌-నాగేంద్ర సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి పి.ఎస్‌. ప్ర‌కాశ్ ఛాయాగ్రాహ‌కుడిగా ప‌నిచేశారు. 1982 సెప్టెంబ‌ర్ 20న విడుద‌లైన 'వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు' చిత్రం ఇద్ద‌రు హీరోల అభిమానుల‌ను అల‌రించింది.

ఫొటోల్లో ట్రాజెడీ కింగ్‌ దిలీప్ కుమార్ జీవితం!

  లెజెండ‌రీ యాక్ట‌ర్ దిలీప్ కుమార్ 'దేవ‌దాస్‌', 'ముఘ‌ల్‌-ఎ-ఆజ‌మ్‌', 'అందాజ్‌', 'క్రాంతి', 'క‌ర్మ' లాంటి సినిమాల్లో అద్భుత‌మైన అభిన‌యంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. ఆయ‌న మృతి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానుల‌ను విషాద సాగ‌రంలో ముంచేసింది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న మృతికి సంతాపాలు తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ, ఆయ‌న జీవితాన్ని ఓసారి స్ఫుర‌ణ‌కు తెచ్చుకుందాం. ప‌ష్తూన్ కుటుంబంలో 12 మంది సంతానంలో ఒక‌రిగా పుట్టారు దిలీప్ కుమార్‌. ఆయ‌న అస‌లు పేరు ముహ‌మ్మ‌ద్ యూస‌ఫ్ ఖాన్‌. ఇప్ప‌టి పాకిస్తాన్‌లోని పెషావ‌ర్‌, డియోలాలి ప్రాంతాల్లో దిలీప్ తండ్రికి తోట‌లు ఉండేవి. 1930 ప్రాంతాల్లో దిలీప్ కుమార్ ఫ్యామిలీ ముంబైకి త‌ర‌లివ‌చ్చింది. సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న పూణేలో ఒక క్యాంటీన్ న‌డిపారు. అలాగే ఫ్రూట్ స‌ప్ల‌య‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. 1944లో 'జ్వ‌ర్ భాత' సినిమాతో న‌టునిగా ప‌రిచ‌యం అయ్యారు. యూస‌ఫ్ ఖాన్‌కు దిలీప్ కుమార్ అనే తెర పేరును ఇచ్చింది హిందీ ర‌చ‌యిత‌ భ‌గ‌వ‌తి చ‌ర‌ణ్ వ‌ర్మ. ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న అనేక సూప‌ర్‌హిట్ ఫిలిమ్స్‌ను అందించారు. మ‌ధుబాల‌తో ప్రేమాయ‌ణం న‌డిపారు. తొమ్మిదేళ్ల పాటు వాళ్ల మ‌ధ్య అనుబంధం కొన‌సాగిందంటారు. అయితే వారి పెళ్లికి మ‌ధుబాల తండ్రి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో, ఇద్ద‌రూ విడిపోయారు. త‌న‌కంటే వ‌య‌సులో 20 సంవ‌త్స‌రాలు చిన్న‌దైన న‌టి సైరా బానును 1966లో దిలీప్ కుమార్ పెళ్లాడారు. త‌ర్వాత ఆయ‌న ఆస్మా రెహ‌మాన్ అనే ఆమెను 1981లో రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కేవ‌లం రెండేళ్ల‌కే ముగిసింది. వెండితెర‌పై అనేక మ‌ర‌పురాని పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన దిలీప్ కుమార్‌.. జోగ‌న్‌, దీద‌ర్‌, దాగ్‌, దేవ‌దాస్‌, మ‌ధుమ‌తి, యాహుడి త‌దిత‌ర చిత్రాల్లో చేసిన పాత్ర‌ల‌తో 'ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్' అనే పేరు పొందారు. బిగ్ స్క్రీన్‌పై ఎన్నో పాత్ర‌ల‌కు జీవం పోసిన దిలీప్‌కు చారిత్ర‌క చిత్రం 'ముఘ‌ల్-ఎ-ఆజ‌మ్' (1960) మూవీలో చేసిన స‌లీమ్ పాత్ర ఆయ‌న‌కు అత్యంత పాపులారిటీ తెచ్చింది. ఇప్ప‌టికీ అభిమానులు ఆ పాత్ర‌ను మ‌ర‌వ‌లేదు. 2008 వ‌ర‌కూ కూడా హిందీ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన రెండో సినిమాగా అది నిలిచింది. బ్రిటీష్ డైరెక్ట‌ర్ డేవిడ్ లీన్ రూపొందించిన 'లారెన్స్ ఆఫ్ అరేబియా'లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా దాన్ని తిర‌స్క‌రించిన దిలీప్‌, హిందీ సినిమాల‌కే త‌న జీవితాన్ని అంకితం చేశారు. వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో 1976 నుంచి నాలుగేళ్ల‌కు పైగా ఆయ‌న సినిమాల‌కు విరామం ఇచ్చారు. తిరిగి 1981లో మ‌ల్టీస్టార‌ర్ 'క్రాంతి'లో న‌టించి, ప్రేక్ష‌కుల హృద‌యాల్ని గెలుచుకున్నారు. ఆ సినిమాలో హేమ‌మాలిని, మ‌నోజ్ కుమార్‌, శ‌శిక‌పూర్‌, శ‌త్రుఘ్న సిన్హా లాంటి ఉద్ధండులు న‌టించారు. చివ‌ర‌గా ఆయ‌న న‌టించిన చిత్రం 'ఖిలా' (1998). ఇందులో ఆయ‌న జ‌గ‌న్నాథ్ సింగ్‌, జ‌డ్జి అమ‌ర‌నాథ్ సింగ్ అనే ద్విపాత్ర‌లు పోషించారు. 2001లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌తో క‌లిసి 'అస‌ర్‌-ది ఇంపాక్ట్' అనే సినిమాలో ఆయ‌న న‌టించాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోవ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ న‌టించ‌లేదు. అత్య‌ధిక అవార్డులు పొందిన భార‌తీయ న‌టుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో దిలీప్ కుమార్ చోటు సంపాదించారు.

శృంగార గీతాల స్పెష‌లిస్ట్‌.. సింగ‌ర్ ఎల్ఆర్ ఈశ్వ‌రి గురించి మీకు తెలీని నిజాలు!

  అల్ల‌రి పాట‌ల‌తో, కైపు పాట‌ల‌తో శ్రోత‌ల గుండె గ‌దుల్లో అల‌జ‌డి రేపిన గాయ‌నిగా ఎల్.ఆర్‌. ఈశ్వ‌రి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆమె పేరులోని 'ఎల్' అంటే 'ల‌వ్' అనీ, 'ఆర్' అంటే 'రొమాన్స్' అనీ సి. నారాయ‌ణ‌రెడ్డి చ‌మ‌త్క‌రించ‌గా, ఆరుద్ర 'అల్లారు ముద్దుల గాయ‌ని'గా ఆమెను ప్ర‌స్తుతించారు. డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావు అయితే 'విజ‌య‌ల‌లిత క‌ళ్ల‌ల్లో కైపుంటే.. ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి గొంతులో కైపుంటుంది.' అని కితాబిచ్చారు. నిజానికి క్ల‌బ్ సాంగ్స్‌, రొమాంటిక్ సాంగ్స్‌ను ఆమె ఎంత కైపుగా పాడ‌తారో, భ‌క్తి పాట‌ల‌ను అంత మ‌ధురంగానూ ఆమె పాడ‌గ‌ల‌రు. ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి అస‌లు పేరు లూర్ద్ మేరీ. ఆమె రోమ‌న్ క్యాథ‌లిక్ కుటుంబంలో మ‌ద్రాసులో జ‌న్మించారు. అమ్మ‌మ్మ ఇంట్లోని వారు 'మేరీ' అని పిలిస్తే, హిందూ దేవ‌త‌ల్ని కొలిచే నాన‌మ్మ గారింట్లో ఆమెను 'రాజేశ్వ‌రి' అని పిలిచేవారు. ఈ గొడ‌వంతా ఎందుక‌ని ఆమె త‌న పేరును 'లూర్ద్ రాజేశ్వ‌రి'గా మార్చేసుకున్నారు. త‌మిళ చిత్ర‌రంగంలో అప్ప‌టికే రాజేశ్వ‌రి పేరుతో ఒక గాయ‌ని ఉండ‌టంతో డైరెక్ట‌ర్ ఎ.పి. నాగ‌రాజ‌న్ ఆమెను 'ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి'గా ప‌రిచ‌యం చేశారు. ఆ పేరే స్థిర‌ప‌డింది.  ఈశ్వ‌రి వాళ్ల‌మ్మ నిర్మ‌ల సినిమా పాట‌ల‌కు కోర‌స్ పాడేవారు. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.తో చ‌దువు ఆపేసిన ఈశ్వ‌రి త‌ల్లితో పాటు పాట‌ల రికార్డింగ్‌కు వెళుతూ వ‌చ్చారు. అలా మొద‌ట్లో కొన్ని పాట‌ల‌కు ఆమె కోర‌స్ సింగ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. స్వ‌ర‌బ్ర‌హ్మ కె.వి. మ‌హ‌దేవ‌న్ ఆమెను 'న‌ల్ల ఇడ‌త్తు సంబంధం' అనే త‌మిళ చిత్రంతో ఈశ్వ‌రిని గాయ‌నిగా ప‌రిచ‌యం చేశారు. తెలుగులో ఆమె పాడిన తొలి చిత్రం 'అనుబంధాలు' (1963). అందులో ఆమె పాడిన పాట‌.. "నా పేరు సెల‌యేరు.. న‌న్నెవ్వ‌రాప‌లేరు". ఆమెకు పాపులారిటీ తెచ్చింది మాత్రం టి.వి. రాజు స్వ‌ర‌క‌ల్ప‌న‌లో 'శ్రీ సింహాచ‌ల క్షేత్ర మ‌హిమ‌'లో పాడిన పాట‌లు.  ఆమె త‌మిళియ‌న్ అయిన‌ప్ప‌టికీ తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, తుళు భాష‌ల్లో ఏమాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా చాలా స్ప‌ష్టంగా పాట‌లు పాడ‌టం ఆమె ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. 'న‌న్న‌గండ ఎల్లి' అనే క‌న్న‌డ చిత్రంలో 14 భాష‌ల చ‌ర‌ణాలు ఉన్న ఓ క్లిష్ట‌మైన పాట‌ను కూడా సునాయాసంగా ఆమె పాడేశారు. 'క‌థానాయిక మొల్ల' (1970)లోనూ ఐదు భాష‌ల్లో ఉండే పాట‌ను ఆమె మృదుమ‌ధురంగా పాడ‌టం మ‌న‌కు తెలుసు. "పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ" (అమాయ‌కుడు), "లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా" (ప్రేమ‌న‌గ‌ర్‌), "ఏస్కో కోకోకోలా" (రౌడీరాణి), "ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ" (భార్యాబిడ్డ‌లు), "నందామయా గరుడ నందామయా" (జీవ‌న త‌రంగాలు), "మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో" (దేవుడు చేసిన మ‌నుషులు), "అరే ఏమిటి ఈ లోకం... పలుగాకుల లోకం" (అంతులేని క‌థ‌), "భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్" (మ‌రో చ‌రిత్ర‌), "సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్" (సింహ‌బ‌లుడు) లాంటి పాట‌లను ఆమెలాగా అంత మ‌త్తు, అంత‌ కైపు ధ్వ‌నించే గొంతుతో పాడ‌టం ఎవ‌రికి సాధ్యం! 14 భాష‌ల‌లో వేలాది పాట‌లు పాడిన ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి వ్య‌క్తిగ‌త జీవితం త్యాగ‌మ‌యం. సోద‌రి, సోద‌రుడి భవిష్య‌త్తు కోసం ఆమె అవివాహిత‌గా ఉండిపోయారు. త‌ను వ‌య‌సులో ఉండ‌గా ఎవ‌రైనా పెళ్లి గురించి ప్ర‌స్తావిస్తే, తాను సంగీతాన్నే పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పేవారు. ప్ర‌స్తుతం చెన్నైలో ఆమె నివాసం ఉంటున్నారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ గురించి మీకు తెలీని నిజాలు!

  మొద‌ట్లో రెండు మూడు సినిమాల్లో చిన్న పాత్ర‌లు చేసి, ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన 'తేనె మ‌న‌సులు' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై, త‌ర్వాత కాలంలో సూప‌ర్‌స్టార్‌గా కృష్ణ‌ ఎదిగిన వైనం అపూర్వం. ఐదున్న‌ర ద‌శాబ్దాల పైగా కెరీర్‌లో 346 సినిమాల్లో న‌టించిన కృష్ణ‌కు ఒక‌ప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధార‌ణం. తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా (అల్లూరి సీతారామ‌రాజు)నీ, తొలి 70 ఎం.ఎం. సినిమా (సిహాస‌నం)నీ నిర్మించిన ఘ‌న‌త కృష్ణ‌దే. "ఏ ప‌ని చేప‌ట్టినా సాహ‌సంతో ముందుకు సాగుతాడు.. సాధించే దాకా విశ్ర‌మించ‌డు." అనే పేరు పొందిన ఆయ‌న గురించి ఆయ‌న అభిమానుల్లో చాలామందికి సైతం తెలీని విష‌యాలు చెప్పుకుందాం... కృష్ణ 1943లో ఇప్ప‌టి గుంటూరు జిల్లాల్లోని బుర్రిపాలెంలో జ‌న్మించారు. 'తేనె మ‌న‌సులు' చిత్రంలో హీరోగా న‌టించే ముందు కొన్ని చిత్రాల్లో చిన్న పాత్ర‌లు పోషించార‌ని చెప్పుకున్నాం క‌దా. వాటిలో జ‌గ్గ‌య్య హీరోగా న‌టించిన 'ప‌దండి ముందుకు' (1962) ఒక‌టి.  కృష్ణ హీరోగా న‌టించిన 'తేనె మ‌న‌సులు' చిత్రం 1965 మార్చి 31న విడుద‌లైంది. ఇక కృష్ణ విల‌న్‌గా ఒకే ఒక చిత్రంలో న‌టించారు. అది.. కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన‌ 'ప్రైవేటు మాస్టారు' (1967). విశేష‌మేమంటే 'తేనె మ‌న‌సులు' సినిమాతో కృష్ణ‌తో పాటు హీరోగా ప‌రిచ‌య‌మైన రామ్మోహ‌న్ ఈ సినిమాలో హీరోగా టైటిల్ రోల్ పోషించారు. కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' (1974) సినిమా తియ్య‌డానికి ముందే ఆ పాత్ర‌ను 'అసాధ్యుడు' (1968) సినిమాలో పోషించారు. అందులో క‌థ‌లో భాగంగా వ‌చ్చే అంత‌ర్నాట‌కంలో ఆయ‌న సీతారామ‌రాజుగా న‌టించారు. అదే.. త‌ర్వాత కాలంలో ఆయ‌న 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాని తియ్య‌డానికి ప్రేరేపించింది. కృష్ణ 1968లో 'అమాయ‌కుడు' అనే సినిమాలో టైటిల్ రోల్ చేశారు. దానికి అప్ప‌టి హాస్య‌న‌టుల్లో ఒక‌రైన అడ్డాల నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది రాజ్ క‌పూర్ టైటిల్ రోల్ చేసిన 'అనారీ' (1959) సినిమాకు రీమేక్ అనే విష‌యం చాలా మందికి తెలీదు. 1970లో కృష్ణ త‌న త‌మ్ముళ్లు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావుల‌తో క‌లిసి ప‌ద్మాల‌య సంస్థ‌ను స్థాపించారు. తొలి య‌త్నంగా కె. వ‌ర‌ప్ర‌సాద‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 'అగ్ని ప‌రీక్ష' చిత్రాన్ని నిర్మించారు. అందులో కృష్ణ, చంద్ర‌మోహ‌న్ హీరోలుగా న‌టించారు. 1972లో దేశంలో తీవ్ర క‌రువు ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఎందరో ఆక‌లితో అల‌మ‌టిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక‌మంది క‌రువు బాధ‌తో అల్లాడుతున్నారు. అలా బాధ‌ల్లో ఉన్న‌వారికి ఉడుతాభ‌క్తి స‌హాయం చెయ్య‌డం మ‌న ధ‌ర్మం అనుకున్నారు కృష్ణ‌. అనుకున్న‌దే త‌డ‌వు అక్టోబ‌ర్ 28 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు నాటి యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు దాదాపు 150 మంది స‌హ‌కారంతో విజ‌య‌వాడ‌, గుంటూరు, తెనాలి, రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వ‌హించి, ఏడు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా సేక‌రించి, ఆ వ‌సూళ్ల‌ను య‌థాత‌ధంగా క‌రువు బాధితుల నిధికి అంద‌జేశారు. విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్‌, హైద‌రాబాద్‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తెనాలిలో శోభ‌న్‌బాబు ప్రారంభోత్స‌వం చేసిన ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ల‌లో ఒక భాగంగా 40 నిమిషాల పాటు సాగే 'వింత మ‌నుషులు' అనే నాటిక‌లో కృష్ణ హీరోగా న‌టించారు. 1972లోనే 'జై ఆంధ్ర' ఉద్య‌మం సంద‌ర్భంగా మ‌ద్రాసు పాన‌గ‌ల్ పార్కు ద‌గ్గ‌ర జ‌రిగిన రిలే నిరాహార దీక్ష‌లో కృష్ణ పాల్గొన్నారు. కృష్ణ న‌టించిన నూర‌వ చిత్రం 'అల్లూరి సీతారామ‌రాజు' నిర్మాణానికి ముందే సంచ‌ల‌నం సృష్టించింది. విడుద‌లైన త‌ర్వాత స్వ‌ర్ణోత్స‌వాలు జ‌రుపుకుంది. ఆ స్వ‌ర్ణోత్స‌వ స‌భ‌కు శోభ‌న్‌బాబుతో పాటు హిందీలో డ్రీమ్ గాళ్‌గా పేరుపొందిన హేమ‌మాలిని ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఆసియా, ఆఫ్రికా దేశాల తృతీయ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వం 1974 జూన్‌లో తాష్కెంట్‌లో జ‌ర‌గ‌గా, అక్క‌డ ప‌ర్య‌టించిన భార‌త బృందంలో కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల స‌భ్యులు. 1977లో 'కురుక్షేత్రం' షూటింగ్ జ‌రుగుతుండ‌గా, కృష్ణ గౌర‌వార్థం న్యూఢిల్లీలోని తెలుగువారు ఒక స‌భ జ‌రిపి, స‌త్క‌రించి ఆయ‌న‌కు 'న‌ట‌శేఖ‌ర' బిరుదును ప్ర‌దానం చేశారు. ర‌మేశ్‌బాబు, మ‌హేశ్‌బాబు కంటే ముందే కృష్ణ రెండో కుమార్తె మంజుల బాల‌న‌టిగా 'శ‌భాష్ గోపి' (1978)లో ఒక కీల‌క పాత్ర పోషించారు.