డైరెక్ట‌ర్‌తో "ఫ్లాప‌య్యే సినిమాకు ఇంకో టేక్ ఎందుకండీ?" అన్న బాల‌కృష్ణ‌!

  బాల‌కృష్ణ హీరోగా ఎ. కోదండ‌రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'అన‌సూయ‌మ్మ‌గారి అల్లుడు' పెద్ద హిట్ట‌యింది. దాంతో బాల‌కృష్ణ‌తో మ‌రో సినిమా చేద్దామ‌న్నారు ఎన్టీఆర్‌. అప్పుడాయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి. బాల‌కృష్ణ చేసే సినిమాల క‌థ‌లు ఆయ‌న విన‌డం, ఆయ‌న ఓకే చేశాకే బాల‌కృష్ణ వాటిని చేయ‌డం ప‌రిపాటి. క‌థ చెప్ప‌డానికి ఎన్టీఆర్ ర‌మ్మ‌న‌డంతో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ను వెంట‌పెట్టుకొని ఒక‌రోజు తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు వెళ్లారు కోదండ‌రామిరెడ్డి.  ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ చెప్పారు. "మీకు ఎట్లా ఉంది?" అని కోదండ‌రామిరెడ్డిని అడిగారు ఎన్టీఆర్‌. "నాకు న‌చ్చ‌లేదు సార్" అనేశారాయ‌న‌. "ద‌ట్సాల్ రైట్‌. మీకు న‌చ్చ‌క‌పోతే మేమెందుకు చేస్తాం? వ‌దిలేయండి. త‌ర్వాత ఇంకోటేద‌న్నా చూద్దాం" అన్నారు ఎన్టీఆర్‌. అక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక "పెద్దాయ‌న ద‌గ్గ‌ర అలా ఎలా చెప్తారు?" అని కోదండ‌రామిరెడ్డిని తిట్టారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌. "క‌థ నాకు న‌చ్చ‌లేదండీ. అదే చెప్పాను" అన్నారాయ‌న‌. ఒక వారం రోజులు గ‌డిచాక వేరే సినిమా షూటింగ్‌లో ఉన్న కోదండ‌రామిరెడ్డికి ఎన్టీఆర్ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. ఫోన్‌లో "బ్ర‌ద‌ర్‌. మాకెందుకో ఆ క‌థ న‌చ్చింది. సినిమా చేసిపెట్టండి" అన్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న ఆ మాట అన్నాక కాద‌న‌డం ఎందుక‌ని "ఓకే స‌ర్" అన్నారు కోదండ‌రామిరెడ్డి. త‌ర్వాత బాల‌కృష్ణ ఆ క‌థ విన్నారు. ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. కానీ తండ్రి మాట కాద‌న‌లేక ఆ సినిమా చెయ్య‌డానికి ఆయ‌న ఒప్పుకున్నారు.  షూటింగ్ మొద‌లైంది. బాల‌య్య‌తో షూటింగ్ అంటే సెట్స్‌పై చాలా స‌ర‌దాగా ఉంటుంది. అంద‌రూ ఆడుతూ పాడుతూ ప‌నిచేస్తుంటారు. ఆ సినిమాలో బాల‌కృష్ణది పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌. ఒక సీన్ తీస్తున్న‌ప్పుడు, "బాల‌య్యా.. వ‌న్ మోర్ టేక్ చేద్దాం" అన్నారు కోదండ‌రామిరెడ్డి. "ఎందుకుసార్ వ‌న్ మోర్ టేక్‌.. ఫ్లాప‌య్యే సినిమాకు.. ఓకే చేసెయ్యండి" అన్నారు బాల‌య్య‌. ఆ సినిమా 'తిర‌గ‌బ‌డ్డ తెలుగుబిడ్డ‌'. ఆయ‌న అన్న‌ట్లే విడుద‌ల‌య్యాక ఆ సినిమా ఫ్లాప‌య్యింది. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో కోదండ‌రామిరెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఆరోజు సావిత్రితో పాటు ల‌క్ష్మి ఉన్న‌ట్ల‌యితే...

  ఇప్ప‌టి తార‌లు అన‌క‌పోవ‌చ్చునేమో కానీ, మొన్న‌టి-నిన్న‌టి తార‌ల‌కు ఆద‌ర్శం మ‌హాన‌టి సావిత్రి. 'సావిత్రిగారి లాగా పెద్ద ఆర్టిస్టును కావాల‌నుకుంటున్నాను' అని చెప్పేవారు న‌టీమ‌ణులు. అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికీ సావిత్రి న‌ట‌నా ప్ర‌తిభ‌కు సాటి రాగ‌ల తార ఇంత‌దాకా రాలేద‌న్న‌ది ఎవ‌రైనా ఒప్పుకొనే విష‌యం. మ‌హాన‌టి అనే ట్యాగ్ ఆమెకు మాత్ర‌మే ఇచ్చారు ప్రేక్ష‌కులు. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఇదే మాటంటారు. ఎనిమిది-తొమ్మిదేళ్ల వ‌య‌సు నుంచీ సావిత్రితో ల‌క్ష్మికి ప‌రిచ‌యం, చ‌నువూ ఉన్నాయి. తొలి చిత్రం 'బాంధ‌వ్యాలు'లో సావిత్రితో క‌లిసి న‌టించారు ల‌క్ష్మి. ఆ త‌ర్వాత 'పుట్టినిల్లు-మెట్టినిల్లు' లాంటి ప‌లు చిత్రాల్లో వారు క‌లిసి న‌టించారు.  'చంద‌న‌గొంబె' అనే క‌న్న‌డ చిత్రం షూటింగ్ జ‌రిగే రోజుల్లో జ‌రిగిన ఘ‌ట‌న ల‌క్ష్మి ఎన్న‌టికీ మ‌ర‌చిపోదు. ఒక‌రోజు మైసూరులోని స్టూడియోలో సావిత్రి, ల‌క్ష్మి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ల‌క్ష్మి వ‌ర్క్ పూర్త‌యింది. ఆమె మ‌ద్రాస్ వెళ్లిపోదామ‌ని అనుకుంటూ ఆ విష‌యం సావిత్రితో చెప్పారు. "ఈ ఒక్క‌రోజు నువ్వు ఇక్క‌డ వున్నావంటే రేపు ఇద్ద‌రం క‌లిసి వెళ్లిపోవ‌చ్చు" అన్నారు సావిత్రి. వీలుప‌డ‌ద‌ని చెప్పి ల‌క్ష్మి బ‌య‌లుదేరి వెళ్లిపోయారు. అంత‌లోనే సావిత్రి కోమాలో ఉన్న‌ట్లు, బెంగ‌ళూరులో ఓ హాస్పిట‌ల్‌లో చేర్పించిన‌ట్లు వార్త వ‌చ్చింది. వెంట‌నే ల‌క్ష్మి కారులో తిరిగి బెంగ‌ళూరు వెళ్లారు.  ల‌క్ష్మి బెంగ‌ళూరులో సావిత్రిని చేర్పించిన హాస్పిట‌ల్‌కు వెళ్లి చూసేస‌రికి ఆవిడ జ‌న‌ర‌ల్ వార్డ్ వ‌సారాలో నేల‌మీద ప‌డుకోబెట్ట‌బ‌డి ఉన్నారు. ఆ దృశ్యం చూడ‌గానే ల‌క్ష్మి హృద‌యం ద్ర‌వించిపోయింది. ఉవ్వెత్తున్న కోపం ముంచుకొచ్చింది. అప్పుడే ప్ర‌ముఖ క‌న్న‌డ నిర్మాత వీరాస్వామి (న‌టుడు ర‌విచంద్ర‌న్ తండ్రి) కూడా వ‌చ్చారు. ఆయ‌న‌, ల‌క్ష్మి.. సిబ్బందిపై కేక‌లేసి సావిత్రిని స్పెష‌ల్ వార్డులో చేర్పించారు. ఇది 1980లో జ‌రిగింది. అప్పుడు ఆవిడ కోలుకున్నారు. 1981లో మ‌ళ్లీ అదే ప‌రిస్థితికి గురై ఆమె చ‌నిపోయారు. అప్ప‌టి ఘ‌ట‌న త‌ల‌చుకుంటే ఇప్ప‌టికీ ల‌క్ష్మికి ఎంతో బాధ‌గా ఉంటుంది. ఒక మ‌హాన‌టికి ఎంత దారుణ‌మైన ప‌రిస్థితి ఎదురైందా అని త‌ల్ల‌డిల్లుతుంటుంది. ఆరోజు గ‌నుక సావిత్రితో పాటు ల‌క్ష్మి ఉండిపోయిన‌ట్ల‌యితే ప‌రిస్థితి వేరే విధంగా ఉండేదేమో! 

ప్రియ‌మైన వాళ్ల‌ను కోల్పోయిన‌ట్లు చెప్పి.. ఏడ్చేసిన‌ పూర్ణ!

  రష్మీ గౌతయ్‌ వయసెంత? స్ట్రయిట్‌గా ఎప్పుడూ ఆమె సమాధానం చెప్పిన సందర్భాలు లేవు. అసలు విషయం దాటవేస్తూ ఉంటుంది. ‘ఢీ’ షోలో కూడా ఆమెకు అదే ప్రశ్న ఎదురైంది. వచ్చే బుధవారం ఎపిసోడ్‌లో ప్రదీప్‌ హాస్టల్‌ వార్డెన్‌గా... ఆ గర్ల్స్‌ హాస్టల్‌లో జాయిన్‌ అవ్వడానికి వచ్చిన అమ్మాయిల వలే రష్మీ, దీపిక, శర్వరీ, నైనికా... బాయ్స్‌ హాస్టల్‌లో జాయిన్‌ అవ్వడానికి వచ్చిన అబ్బాయిల వలే సుధీర్‌, ఆది, అజహర్‌ వచ్చారు. రష్మీ, దీపికలను పేర్లు చెప్పిన తర్వాత ‘వయసు?’ అని ప్రదీప్‌ అడిగాడు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ అంటూ రష్మీ పాట పాడింది. ‘పదహారు ఒకట్లా అమ్మా... పదహారు రెళ్లా?’ అని ప్రదీప్‌ అడిగాడు. ‘పదహారు మూడ్లు వేసినా తప్పు లేదు సార్‌’ అని సుధీర్‌ చెప్పాడు. అదేంటో... రష్మీ వయసు మీద ఎన్నిసార్లు జోక్స్‌, సెటైర్స్‌ వేసినా పేలుతూ ఉంటాయ్‌. చాలాసార్లు ఆమెను సీనియర్‌ సిటిజన్స్‌ కోటాలో వేస్తూ జోక్స్‌ వేశారు. సుధీర్‌ ప్లేబాయ్‌ ఇమేజ్‌ మీద మరోసారి జోక్స్‌ వేశాడు ఆది. వచ్చే ప్రసారమయ్యే ‘ఢీ’ షో ఎపిసోడ్‌ ప్రోమో రీసెంట్‌గా రిలీజ్‌ చేశారు. అందులో కంటెస్టెంట్లు సాయి, నైనికా మధ్య నడిచిల లవ్‌ ట్రాక్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేసిందని చెప్పాలి. చాటింగ్స్‌లో రొమాన్స్‌ ఉంటుందని, స్టేజి మీద ఉండటం లేదని గతంలో ఓసారి సాయి గురించి నైనికా చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి ఇద్దరూ ఒకరికొకరు లవ్యూ, లవ్యూ అని చెప్పుకొన్నారు. ప్రోమో చివర్లో పూర్ణ ఎమోషనల్‌ అయ్యింది. ‘ఐ లాస్ట్‌ మై...’ అంటూ కన్నీటిపర్యంతమైంది. చూస్తుంటే... ఏదో విషాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఆమెను ఓదార్చడానికి పక్క సీట్లలో కూర్చునే ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌ ప్రయత్నించారు. విషాదం ఏంటనేది తెలియాలంటే... బుధవారం వరకూ వెయిట్‌ చెయ్యాలి.

దివ్య‌వాణికి ఫ‌స్ట్ మేక‌ప్ స్టిల్స్ శార‌ద తీయించారు!

  ఒక‌ప్ప‌టి బాపు బొమ్మ‌, 'పెళ్లిపుస్త‌కం' హీరోయిన్ దివ్య‌వాణి సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణ‌మైందీ, ప్రేర‌ణ‌నిచ్చిందీ 'ఊర్వ‌శి' శార‌ద అని ఎంత‌మందికి తెలుసు! అవును. ఊహ తెలిసిన‌ప్ప‌ట్నుంచీ ఇంట్లో అంద‌రితో పాటు సినిమాలు చూడ్డం అల‌వాటైంది దివ్య‌కు. ముఖ్యంగా శార‌ద న‌టించిన చిత్రాలంటే మ‌రీ ఇష్టంగా చూసేది. శార‌ద వాళ్ల ఊరూ, దివ్య ఊరూ ఒక‌టే కావ‌డం వ‌ల్ల - వారి కుటుంబానికీ, దివ్య కుటుంబానికీ స‌న్నిహిత సంబంధాలు ఉన్న కార‌ణంగా, శార‌ద‌తో దివ్య ప‌రిచ‌యం బాగా పెరిగింది. దివ్య‌ను చూసి శార‌ద‌, "సినిమాల్లో న‌టించ‌కూడ‌దూ.. న‌టిగా రాణిస్తావు" అని ప్రోత్స‌హించారు. కేవ‌లం మాట‌ల‌తో స‌రిపెట్ట‌కుండా మొట్ట‌మొద‌టిసారిగా దివ్య‌కు మేక‌ప్ స్టిల్స్ తీయించారు. త‌ర్వాత శార‌ద ప్రోత్సాహంతోనే సినిమాల్లో న‌టించ‌డం కోసం మ‌ద్రాసు వెళ్లింది దివ్య‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌కు దివ్య‌ను ప‌రిచ‌యం చేశారు శార‌ద‌. ఆయ‌న రిక‌మండేష‌న్‌తో 'స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు' సినిమాలో హీరో కృష్ణ చెల్లెలిగా తొలిసారిగా చిత్ర‌రంగ ప్ర‌వేశం చేసింది దివ్య‌. ఆ త‌ర్వాత 'లాయ‌ర్ భార‌తీదేవి', 'మా తెలుగుత‌ల్లి', 'ఆడ‌దే ఆధారం' చిత్రాల్లో ముఖ్య‌పాత్ర‌లు పోషించే అవ‌కాశం ల‌భించింది. నిజానికి దివ్య‌వాణి అస‌లు పేరు ఉష‌. స్వ‌స్థ‌లం తెనాలి. పుట్టిందీ, పెరిగిందీ, ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిందీ అక్క‌డే. తెలుగుతో పాట‌లు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ న‌టించి, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. 'అడ‌విలో అర్ధ‌రాత్రి' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన‌ప్పుడు ఆ సినిమా డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ఆర్‌. దాస్ ఆమె పేరును స్వాతిగా మార్చారు. స్వాతి పేరుతోనే 'స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు', 'లాయ‌ర్ భార‌తీదేవి' చిత్రాల్లో న‌టించింది. అదే స‌మ‌యంలో క‌న్న‌డంలో 'డాన్స్ రాజా డాన్స్' మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ప్పుడు న‌టుడైన ఆ చిత్ర నిర్మాత ద్వార‌కేశ్ ఆమె పేరును దివ్య‌గా మార్చారు. ఆ త‌ర్వాత వాణి అనే పేరును జోడించుకొని దివ్య‌వాణిగా మారింది ఉష‌. 1991లో బాపు తీసిన 'పెళ్లి పుస్త‌కం' దివ్య‌వాణి న‌ట జీవితంలోనే మైలురాయిగా నిలిచింది. ఆమెకు 'బాపుబొమ్మ' అనే పేరు వ‌చ్చింది కానీ పెళ్లి త‌ర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. బాపు తీసిన 'రాధా గోపాళం' (2005) మూవీలో వేణుమాధ‌వ్ భార్య పాత్ర‌లో దివ్య‌ను చూసిన‌వాళ్లంతా, ఆమె స్థూల‌కాయం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.

'య‌ముడికి మొగుడు'లో చెట్టెక్కి డైలాగ్ చెప్ప‌మంటే వ‌ణికిపోయిన సుధాక‌ర్‌!

  చాలా మంది 'ఆ.. కామెడీయే క‌దా' అని తేలిగ్గా మాట్లాడుతుంటారు. కానీ న‌వ‌ర‌సాల్లో హాస్యం పండించ‌డ‌మే క‌ష్ట‌మ‌నేది న‌టులు చెప్పే మాట‌. చూసేవాళ్ల‌కు వినోదంగా అనిపిస్తుంది కానీ చేసేవాళ్ల‌కు మాత్రం భ‌లే ఇబ్బంది. ఒక న‌టుడు తాను న‌వ్వ‌కుండా, త‌న చేష్ట‌ల‌ద్వారానో, సంభాష‌ణ‌ల ద్వారానో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వు తెప్పించాలి. చూసేవాళ్ల‌కు న‌వ్వు రాక‌పోతే.. అది హాస్యం కాదు.. అప‌హాస్యం అవుతుంది. సుధాక‌ర్ హీరోగా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి విల‌న్‌గా, కామెడీ విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా రాణించారు. ఆయ‌న కామెడీ యాక్ట‌ర్‌గా రాణించ‌డానికి కార‌ణం త‌న‌కు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా రేలంగి, ర‌మ‌ణారెడ్డి, ప‌ద్మ‌నాభం లాంటి లెజెండ‌రీ క‌మెడియ‌న్స్ న‌టించిన పాత సినిమాల‌ను ఒక‌టికి రెండు సార్లు చూడ్డ‌మే! కామెడీలో ఆయ‌న‌కు రేలంగి, ప‌ద్మ‌నాభం ప్రేర‌ణ‌.  అలాంటి సుధాక‌ర్ కామెడీ క్యారెక్ట‌ర్‌ను పోషించ‌డానికి క‌ష్ట‌ప‌డిన సినిమాల్లో చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'య‌ముడికి మొగుడు' ఒక‌టి. ఆ సినిమాలో చిరంజీవి, కోట శ్రీ‌నివాస‌రావు, సుధాక‌ర్‌, కొంద‌రు ఫైట‌ర్స్ పాల్గొన్న ఒక యాక్ష‌న్ సీక్వెన్స్‌లో.. సుధాక‌ర్ ఒక చిన్న‌కుర్రాడిని ఎత్తుకొని చెట్టుకొమ్మ‌ల్లో ఇరుక్కుంటాడు. కింద‌నుంచి చిరంజీవి దిగ‌మ‌ని అంటే, సుధాక‌ర్ దిగ‌కుండా "అయ్య‌బాబోయ్ నేను దిగ‌ను. పిచ్చ‌కొట్టుడు కొడ‌తావు" అని డైలాగ్ చెప్పాలి.. కింద‌కు చూస్తూ. సుధాక‌ర్ నేల‌మీద ఎన్నిర‌కాల సాములు, విన్యాసాలు చెయ్య‌మ‌న్నా చెయ్య‌గ‌ల‌రు కానీ, స్టూలు మీద నిల్చొని కింద‌కు చూడ‌మంటే మాత్రం ఆయ‌న చూడ‌లేరు. ఆయ‌న‌కు భ‌యం! అలాంటిది ఏకంగా చెట్టుమీద నుంచి కింద‌కు చూస్తూ డైలాగ్ చెప్ప‌డ‌మంటే మాట‌లా! అదే మాట డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టికి, హీరో చిరంజీవికీ చెప్పారు సుధాక‌ర్‌.. 'చెట్టుమీద కూర్చొని మాత్రం డైలాగ్ చెప్ప‌లేను. కింద‌కు దిగిన త‌ర్వాత చెప్తాను' అని. "ఫ‌ర్వాలేదు.. చెట్టుపై నుంచే డైలాగ్ చెప్పు" అని వాళ్ల‌న్నారు.  సుధాక‌ర్‌కు పైనుంచి కింద‌కు చూస్తే క‌ళ్లు తిరుగుతున్నాయి. ఇక డైలాగ్ ఏం చెప్తారు? భ‌యంతో ఒళ్లంతా చెమ‌ట్లు ప‌ట్టేశాయి. సీన్ అయిపోతే చాలు.. కింద‌కు దిగిపోవ‌చ్చున‌ని ఆయ‌న తాప‌త్ర‌య‌ప‌డ్డారు. చిట్ట‌చివ‌ర‌కు చిరంజీవి ప్రోత్సాహం, ధైర్యంతో ప్రాణాలుగ్గ‌బ‌ట్టుకొని వాళ్ల చెప్పిన‌ట్లుగానే డైలాగ్ చెబుతూ చెట్టుకొమ్మ‌ల మ‌ధ్య న‌టించారు సుధాక‌ర్‌. సినిమా రిలీజ‌య్యాక ఆ సీన్‌లో ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. కానీ ఆ సీన్ వెనుక ఇలాంటి క‌థ ఉంద‌ని వాళ్ల‌కు తెలీదు క‌దా!

రాధిక‌తో పాట‌లో న‌టిస్తుంటే చిరంజీవి ప్యాంట్ చిరిగిపోయింది! ఎలా మేనేజ్ చేశారు?

  చిరంజీవి స‌ర‌స‌న  అత్య‌ధిక చిత్రాల్లో నాయిక‌గా న‌టించిన తార రాధిక‌. వారి కాంబినేష‌న్‌లో ఏకంగా 28 సినిమాలు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌. రాధిక ఏదైనా ప‌నిపైన హైద‌రాబాద్ వ‌చ్చినా, షూటింగ్ కోసం వ‌చ్చినా చిరంజీవి ఇంట్లో ఆతిథ్యం తీసుకోవాల్సిందే. అలాగే చిరంజీవి చెన్నై వెళ్తే రాధిక‌ను క‌ల‌వ‌కుండా ఉండ‌రు. అంత‌టి స‌న్నిహిత‌త్వం ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఉంది. వారు చేసిన సినిమాల్లో 'అభిలాష' పెద్ద హిట్‌. అయితే ఆ సినిమా టైమ్‌లో ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో గొడ‌వ జ‌రిగి, ఇద్ద‌రూ మాట్లాడుకొనేవాళ్లు కాదు. డైరెక్ట‌ర్ ఎ. కోదండ‌రామిరెడ్డి షాట్‌కు పిలిస్తే వెళ్ల‌డం, ఆయ‌న చెప్పింది చేయ‌డం ఇలా ఉండేది.. ఇద్ద‌రి వ్య‌వ‌హారం. చిత్ర‌మేమిటంలో ఆ సినిమాలోని పాట‌లు "న‌వ్వింది మ‌ల్లెచెండు", "సందెపొద్దుల కాడ‌", "బంతీ చేమంతీ" ఆ రోజుల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాయి. ఆ పాట‌ల్లో వారి మ‌ధ్య కెమిస్ట్రీ చూస్తే వాళ్ల మ‌ధ్య మాట‌లు లేవ‌ని ఎవ‌రూ అనుకోరు. "న‌వ్వింది మ‌ల్లెచెండు" పాట తీసే టైమ్‌లో అనూహ్య‌మైన విష‌యం ఒక‌టి జ‌రిగింది. ఆ పాట‌ను వైజాగ్ బీచ్ ద‌గ్గ‌ర జ‌నం మ‌ధ్య‌లో చిత్రీక‌రించారు. ఆ పాట‌లో "యురేకా స‌కమిక" అంటూ రాధిక పైనుంచి దూకి, ఒక ప‌ల్టీ కొడ‌తారు చిరంజీవి. చెప్పాలంటే అది డిఫిక‌ల్ట్ మూవ్‌మెంట్‌. అప్పుడు ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌ట్లేదు. డాన్స్ మాస్ట‌ర్ వ‌చ్చి రాధిక‌కు పాట సీన్ చెప్పారు. "చిరంజీవి జంప్ చేసి, మీ మీద నుంచి దూకుతారు, మీరు కిందికి వంగాలి" అని చెప్పారు. చిరంజీవికి కూడా ఆయ‌న అదే చెప్పారు. చుట్టూ విప‌రీతంగా జ‌నం. ఎక్కువ‌మంది కాలేజీ స్టూడెంట్సే. డైరెక్ట‌ర్ "టేక్" అన‌గానే రాధిక మీదుగా గాల్లో జంప్ చేసి, ఇసుక‌లో కూర్చున్నారు చిరంజీవి. అది లాంగ్ షాట్ కావ‌డంతో యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రూ దూరంగా ఉన్నారు. షాట్ ఓకే అయింది. డైరెక్ట‌ర్ స‌హా అంద‌రూ ఓ ప‌క్క‌కు వెళ్లిపోయారు, నెక్ట్స్ షాట్‌కు రెడీ అవ‌డానికి. కానీ చిరంజీవి మాత్రం ఇసుక‌లో కూర్చున్న‌వాడు కూర్చున్న‌ట్లే ఉన్నారు, పైకి లేవ‌కుండా. రాధిక ఆయ‌న వంక చూశారు. ఆయ‌న "ఎక్స్‌క్యూజ్ మీ" అన్నారు. "న‌న్ను పిలిచారా?" అన్నారు రాధిక ఆశ్చ‌ర్య‌పోతూనే. "ఒక స్మాల్ ఫేవ‌ర్" అన్నారు చిరు. "ఏమైంది?" అడిగారు రాధిక‌. "జంప్ చేసిన‌ప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది. నేను లేవ‌లేను. చుట్టూ ఫ్యాన్స్ ఉన్నారు." అన్నారు చిరంజీవి. "ఓకే.. అయితే ముందు నాకు సారీ చెప్పు." అన్నారు రాధిక‌. "త‌ర్వాత చెప్తాను" అన్నారు చిరు. "ఇప్పుడు చెప్పు. లేక‌పోతే నేను వెళ్లిపోతాను." అన్నారు రాధిక‌. "లేదు లేదు" అని సారీ చెప్పి, రాధిక చీర కొంగు అడ్డంపెట్టుకొని లేచి నిల‌బ‌డ్డారు చిరంజీవి.  ఆయ‌న ముందు అడ్డంగా నిల్చున్నారు రాధిక‌, ఎవ‌రికీ ఏమీ క‌నిపించ‌కుండా. కాస్ట్యూమ‌ర్స్ వ‌చ్చి దుస్తులు ఇచ్చాక‌, ఆయ‌న డ్ర‌స్ మార్చుకున్నారు. ఆ త‌ర్వాత పాట‌ను కంటిన్యూ చేశారు. అయితే చిరంజీవి ఏం చేశారంటే.. నెక్ట్స్ షాట్‌కు పిల‌వ‌గానే డాన్స్ అసిస్టెంట్‌ను పిలిచి, "ఆ మేడ‌మ్‌కు చెప్పండి" అని చెప్పారు. వెంట‌నే రాధిక‌, "నువ్వు నాతో స‌రిగా మాట్లాడ‌క‌పోతే, ఇప్పుడు ఇక్క‌డ జ‌రిగిందంతా అంద‌రికీ చెప్పేస్తాను" అని బెదిరించారు. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ త‌మాషా సంఘ‌ట‌న‌ను ఒక ఇంట‌ర్వ్యూలో రాధిక చెప్పుకొచ్చారు.

పాట‌లో రాజ్య‌ల‌క్ష్మిని కౌగ‌లించుకోడానికి తంటాలుప‌డ్డ సురేశ్‌!

  సురేశ్ న‌టించిన తొలి చిత్రం స‌మ‌తా ఆర్ట్స్ వారి 'జ‌గ‌మొండి'. శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ఈ మూవీలో సురేశ్ సెకండ్ హీరో. అత‌ని జోడీగా 'శంక‌రాభ‌ర‌ణం' రాజ్య‌ల‌క్ష్మి నటించారు. "గుండెలో వున్న‌ది గొడ‌వ చేస్తున్న‌ది.." అనే పాట‌ను తొలిగా ఆ ఇద్ద‌రి మీద ఊటీలో చిత్రీక‌రించారు. సురేశ్ ఫ‌స్ట్ టైమ్‌ కెమెరా ముందు నిల్చున్న‌ది ఆ పాట చిత్రీక‌ర‌ణ‌తోనే. అంత‌కుముందు ఆయ‌న‌కు న‌ట‌న‌లో కానీ, నాట్యంలో కానీ ఎలాంటి అనుభ‌వం లేదు. పైగా రాజ్య‌ల‌క్ష్మి అప్ప‌టికే 'శంక‌రాభ‌ర‌ణం' చిత్రం ద్వారా బాగా పాపుల‌ర్‌. త‌న‌కంటే సీనియ‌ర్ న‌టితో క‌లిసి పాట‌పాడుతూ, డాన్స్ చెయ్య‌డం అన‌గానే మొద‌ట్లో సురేశ్‌కు కొంచెం జంకు క‌లిగింది. ఆ పాట‌లో ఆ ఇద్ద‌రి మీదా చిత్రీక‌రించిన మొద‌టి దృశ్యంలో.. సురేశ్ ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి రాజ్య‌ల‌క్ష్మిని కౌగ‌లించుకోవాలి. ఆ దృశ్య చిత్రీక‌ర‌ణ‌కు ముందు డైరెక్ట‌ర్ వి. మ‌ధుసూద‌న‌రావు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివ‌రంగా చెప్పి రిహార్స‌ల్స్ చేయించారు. అయితే రిహార్స‌ల్స్‌లో మాత్రం రాజ్య‌ల‌క్ష్మిని సురేశ్ కౌగ‌లించుకోవ‌డం చెయ్య‌లేదు. మూవ్‌మెంట్స్ చూసుకొని మ‌ధుసూద‌న‌రావు 'టేక్' అన్నారు. సౌండ్ స్టార్ట్ అయింది. పాట వినిపిస్తోంది. ఆ పాట‌కు త‌గ్గ‌ట్టుగా పెదాలు క‌దుపుతూ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోబోయే ముందు ఆగిపోయాడు సురేశ్‌. "ఏరా.. ఏమైందీ.. అంత‌దూరం ప‌రుగెత్తుకువెళ్లి ఆ అమ్మాయిని కౌగిలించుకోకుండా ఆగిపోయావేంటి?" అన‌డిగారు మ‌ధుసూద‌న‌రావు ఏ విష‌య‌మూ అర్థంగాక‌. సురేశ్ ఏమ‌ని చెప్తాడు! అంత‌దాకా ఏ అమ్మాయి ఒంటిమీదా చెయ్యేసి ఎర‌గ‌డు. వాళ్ల ఇంట్లో ఆయ‌నొక్క‌డే సంతానం. ఆ కార‌ణంగా త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర డిసిప్లిన్డ్‌గా పెరిగాడు. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఆ త‌ర‌హా చిలిపిప‌నులు చేసిన అనుభ‌వం లేదు. పైగా.. కెమెరామేన్‌, డైరెక్ట‌ర్‌, ఇత‌ర యూనిట్ మెంబ‌ర్స్ ముందు ఒక అమ్మాయిని కౌగిలించుకోవ‌డం అనేస‌రికి సురేశ్‌కు ఏదోలా అనిపించింది. ఏదో పెద్ద త‌ప్పు చేస్తున్న ఫీలింగ్ క‌లిగింది. అలాగే ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. అయిదు.. ఆరు.. ఏడు.. ఇలా టేకులు తీశారు. ప్ర‌తి టేకులోనూ సురేశ్ పాట‌కు త‌గ్గ‌ట్లుగా పెదాలు క‌ద‌ప‌క‌పోవ‌డ‌మో, ల‌య‌బ‌ద్ధంగా అడుగులేస్తూ ప‌రుగెత్త‌లేక‌పోవ‌డ‌మో, రాజ్య‌ల‌క్ష్మిని గ‌ట్టిగా కౌగిలించుకోక‌పోవ‌డ‌మో.. ఏదో ఒక‌టి జ‌రిగేది. ఒక టేక్‌లో అయితే పరుగెత్తుకొని వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని భ‌యం భ‌యంగా కౌగిలించుకున్నాడు. మ‌ధుసూద‌న‌రావుకు విసుగెత్తి, "గ‌ట్టిగా కౌగిలించుకోరా" అని కేక‌పెట్టారు. అయినా సురేశ్‌లో భ‌యంపోలేదు. ఇక లాభంలేద‌ని ఆయ‌న "ఒరే టైమింగ్ ప్ర‌కారం ప‌రుగెత్త‌డం, పాట‌కు త‌గ్గ‌ట్టు లిప్ మూవ్‌మెంట్స్ ఇవ్వ‌డం, మొహంలో రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ ఆ అమ్మాయిని గ‌ట్టిగా కౌగిలించుకోవ‌డం.. ఇవ‌న్నీ ఎప్పుడు చేస్తావో చెప్పు.. అప్పుడు తీస్తాను షాటు" అన్నారు.  అన్ని టేకులు తింటూ షాట్ స‌రిగా చేయ‌లేక‌పోతున్నందుకు సురేశ్‌కు చాలా బాధ క‌లిగింది. చివ‌ర‌కు షూటింగ్ వ‌ద్దు.. ఏం వ‌ద్దు.. వ‌దిలేస్తే చాలు అనుకున్నాడు. సురేశ్ ప‌రిస్థితిని గ‌మ‌నించిన మ‌ధుసూద‌నరావు ధైర్యంచెప్పి, ఆయ‌న‌లో భ‌యాన్ని పోగొట్టి, ఎనిమిదో టేక్ తీసి, ఓకే చేశారు. అంత‌వ‌ర‌కూ సినిమా డాన్స్ అంటే ఏముందిలే అనే చుల‌క‌న‌భావం సురేశ్‌లో ఉండేది. ఆ కార‌ణంగానే ఆయ‌న మొద‌ట్లో పెద్ద‌గా ఏకాగ్ర‌త చూప‌లేదు. ఎప్పుడైతే త‌ను ఎక్కువ టేకులు తిన్నాడో అప్పుడ‌ర్థ‌మైంది, డాన్స్ చెయ్య‌డం ఎంత క‌ష్ట‌మో!

అమ‌లా పాల్ ఫ్యామిలీ గురించి మీకెంత‌వ‌ర‌కు తెలుసు?

  మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అమ‌లా పాల్ త‌మిళ డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌. విజ‌య్‌ను ప్రేమించి పెళ్లాడింది. 2014లో వారి పెళ్ల‌యితే, 2017లో విడిపోయారు. క‌ల‌త‌లు, క‌ల‌హాల‌తోటే వారి కాపురం కూలిపోయింది. త‌ర్వాత విజ‌య్ మ‌రో పెళ్లిచేసుకొని సంసార జీవితం గ‌డుపుతున్నాడు. అమ‌ల మాత్రం అప్ప‌ట్నుంచీ సింగిల్‌గానే ఉంటోంది. మ‌ళ్లీ ఎవ‌రితోనూ ప్రేమ‌లో ప‌డిన‌ట్లు క‌నిపించ‌లేదు. అస‌లు అమ‌లా పాల్ ఫ్యామిలీ గురించి మీలో ఎంత‌మందికి తెలుసు? ఎర్నాకుళంలో 1991 అక్టోబ‌ర్ 26న పుట్టింది అమ‌ల‌. ఆమె త‌ల్లిపేరు అన్నీస్‌. ఆమె గృహిణి. బంధుమిత్ర‌ల్లో ఆమెకు గాయ‌నిగా మంచి పేరుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూ క‌నిపిస్తారామె. అలా అని ఆమె ఎప్పుడూ స్టేజి మీద పాడింది లేదు. తండ్రి పాల్ వ‌ర్ఘీస్ క‌స్ట‌మ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఆఫీసు, ఇల్లు త‌ప్ప ఆయ‌న‌కు వేరే లోకం ఉండేది కాదు. సెల‌వులు దొరికితే పూర్తిగా ఫ్యామిలీతోనే గ‌డిపేవారు. అమ‌ల ఏ ప‌ని చేసినా ఆత్మ‌విశ్వాసంతో చేస్తుంది. ఆ గుణం ఆమెకు తండ్రి నుంచే అబ్బింది. ఇండియాలో అమ‌ల పాల్గొనే షూటింగ్స్‌కు అమ్మ వెంట వ‌స్తే, విదేశాల్లో షూటింగ్స్‌కు తండ్రి వెంట వ‌చ్చేవారు. అస‌లు అమ‌ల సినీన‌టి అయ్యిందంటే అది, అన్న‌య్య అభిజీత్ స‌పోర్ట్ వ‌ల్లే. అత‌ను అమెరికాలో మ‌ర్చంట్ నేవీలో ప‌నిచేస్తున్నాడు. ఎప్పుడు ఇంటికొచ్చినా అమ్మానాన్న‌లు, చెల్లెలి కోసం గిఫ్ట్‌లు తీసుకొస్తుంటాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ అన్నాచెల్లెళ్ల‌కు సినిమాలంటే ఇష్టం. నిజానికి వాళ్ల కుటుంబంలో ఎవ‌రూ సినీ ప‌రిశ్ర‌మ‌లో లేక‌పోయినా అమ‌ల‌కు న‌ట‌నాశ‌క్తి స్వ‌త‌హాగా అల‌వ‌డింది. హీరోయిన్ల‌లా త‌నూ అందంగా ఉండాల‌ని అద్దం ముందు గంట‌ల త‌ర‌బ‌డి నిల్చొని త‌న అందం చూసుకొని మురిసిపోయేది అమ‌ల‌. దుస్తుల‌మీద త‌న‌కు మోజెక్కువ‌. వెరైటీ వెరైటీ డ్ర‌స్సులు వేసుకొనేది. టెన్త్ క్లాసులో స్కూల్లో ఫ్యాష‌న్ పోటీ పెడితే, అందులో అమ‌లే ఫ‌స్ట్‌. కాలేజీ డేస్‌లో ర్యాంప్ షోలు జ‌రిగితే క్యాట్ వాక్ చేసేది. ఓసారి వాళ్ల కాలేజీకి పాపుల‌ర్ మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడు లాల్ జోస్ వ‌చ్చారు. అమ‌ల‌ను చూసిన వెంట‌నే నా సినిమాలో న‌టిస్తావా? అన‌డిగారు. అదో చిన్న బ‌డ్జెట్ ఫిల్మ్‌. అందులో ఆమెది స‌హాయ‌న‌టి పాత్ర‌. ఈ విష‌యాన్ని అమ్మానాన్న‌ల‌కు భ‌యంభ‌యంగానే చెప్పింది. ఇద్ద‌రూ వ‌ద్ద‌న్నారు. కూతుర్ని ఇంజ‌నీర్‌గా చూడాల‌నేది వాళ్ల ఆకాంక్ష‌. అప్పుడు అమ‌ల సినిమాల్లోకి వెళ్తే మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని వాళ్ల‌కు అభిజీత్ న‌చ్చ‌చెప్పాడు. అలా 2009లో 'నీల‌తామ‌ర' చిత్రం ద్వారా సినీరంగంలో న‌టిగా అడుగుపెట్టింది అమ‌ల‌. 'మైనా' మూవీ ఆమె కెరీర్‌ను మ‌లుపుతిప్పింది.

హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌డానికి రాధ ఇంటికి స్వ‌యంగా వెళ్లిన భార‌తీరాజా!

  తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో అగ్ర హీరోయిన్‌గా వెలిగారు రాధ‌. ఆమె స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ. ఆమె న‌టిగా ఇండ‌స్ట్రీలోకి రాక ముందే ఆమె అక్క అంబిక హీరోయిన్‌గా మంచి పేరు పొందారు. అప్ప‌టికి రాధ ఇంకా చిన్న‌ది. అయినా ఆమెను కూడా సినీ న‌టిని చెయ్యాల‌నే ఉద్దేశంతో ఆమె త‌ల్లి ఆమెకు డాన్స్ నేర్పించారు. న‌టీన‌టులు ఎలా మేక‌ప్ వేసుకుంటారు?  సెట్లో కెమెరా ముందు ఎలా న‌టిస్తారు?  లాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న‌, ఆస‌క్తి ఏర్ప‌డ‌టానికి రాధ‌ను కూడా అంబిక‌తో పాటు షూటింగ్స్‌కు తీసుకువెళ్లేవారు వాళ్ల‌మ్మ‌. అక్క‌డ జ‌రిగే ప్ర‌తి అంశాన్నీ క్షుణ్ణంగా వివ‌రించి చెప్పేవారు. అలా క్ర‌మంగా న‌ట‌న‌పై ఆస‌క్తిని క‌లిగించారామె. ఇక రాధ‌ను న‌టిగా ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాకుండా, ఆమెలోని ఉత్త‌మ న‌టిని బ‌య‌ట‌కు వెలికితీసింది సుప్ర‌సిద్ధ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా. ఆయ‌న 'అలైగ‌ళ్ ఓయ‌వుదిల్లై' (తెలుగులో 'సీతాకోక‌చిలుక‌') త‌మిళ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు కొత్త న‌టి కోసం అన్వేషిస్తున్న రోజుల్లో ఎడిట‌ర్ ప్ర‌కాశ్ ఒక‌సారి రాధ వాళ్ల ఇంటికి వ‌చ్చారు. రాధ‌, ఆమె అక్క‌లు మ‌ల్లిక‌, అంబిక క‌లిసి తీయించుకున్న ఫొటో చూసి, "ఈ ఫొటో భార‌తీరాజాగారికి చూపిస్తాను. మీ మూడో అమ్మాయికి ఆయ‌న చిత్రంలో మంచి అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చు" అని చెప్పారు. అలాగే ఆయ‌న ఆ ఫొటో భార‌తీరాజాకు చూపించ‌డం, ఆయ‌న రాధ ఫొటో చూసి, "ఓకే ఈ అమ్మాయి బాగుంది.. ఎవ‌రు? ఎక్క‌డుంటారు?" అనే వివ‌రాలు తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత కెమెరామేన్ క‌ణ్ణ‌న్‌ను వెంట‌పెట్టుకొని రాధ‌వాళ్ల ఊరు తిరువ‌నంత‌పురంకు స్వ‌యంగా వెళ్లారు భార‌తీరాజా. రాధ వాళ్లింటికి వెళ్లి ఆమెను చూసి, త‌న హీరోయిన్ ఆమే అని నిర్ణ‌యించుకొని, మ‌ద్రాస్ ర‌మ్మ‌ని చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లు మ‌ద్రాస్‌లోని ప్ర‌సాద్ రికార్డింగ్ థియేట‌ర్‌లో ఆయ‌న‌ను క‌లుసుకుంది రాధ‌. 'అలైగ‌ళ్ ఓయ‌వుదిల్లై' సినిమా నిర్మాత భాస్క‌ర్‌, సుప్ర‌సిద్ధ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకు సోద‌రుడు. ఆ సంద‌ర్భంలోనే భార‌తీరాజా, భాస్క‌ర్‌, "ఈ కొత్త‌ అమ్మాయే మ‌న సినిమాలో హీరోయిన్" అని ఇళ‌య‌రాజాకు ప‌రిచ‌యం చేశారు. అలా ఆ సినిమాలో న‌టించ‌డం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన రాధ‌, తొలి సినిమాతోటే ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకోవ‌డం విశేషం. ఆ త‌ర్వాత కాలంలో ఎన్నో చిత్రాల్లో న‌టించి, 'రాధ కేవ‌లం గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్' అని ముద్ర‌ప‌డిన సంద‌ర్భంలో 'ముద‌ల్ మ‌రియాదై' (తెలుగులో 'ఆత్మ‌బంధువు') త‌మిళ చిత్రం ద్వారా 'రాధ కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాదు. మంచి అవ‌కాశం ల‌భిస్తే గ్లామ‌ర్ ప్రాధాన్యంలేని ప‌ర్ఫార్మెన్స్‌కు అవ‌కాశం ఉన్న ఎలాంటి పాత్ర‌నైనా పోషించి, న్యాయం చేకూర్చి రాణించ‌గ‌ల శ‌క్తిసామ‌ర్థ్యాలున్న న‌టి' అని నిరూపించింది కూడా భార‌తీరాజే!

సీఏ పాస‌వ్వాలంటే ఫొటో పంపాలంటూ విజ‌య‌శాంతికి ఉత్త‌రం రాసిన అభిమాని!

  హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత పేరు ప్ర‌ఖ్యాతులు, డ‌బ్బు సంపాదించినా అభిమానుల‌కు ఒరిగేదేమీ ఉండ‌దు. అయినా తాము ఆరాధించే తార‌ల‌ను వారు ఆరాధిస్తూ, ఆత్మీయ‌త కురిపిస్తూ, త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిగా ప‌రిగ‌ణిస్తూ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అభిమానుల అంత‌రంగం అంచ‌నా వెయ్య‌డానికి వీలు కానిది, వెల‌క‌ట్ట‌డానికి వీలు లేనిది. త‌మ అభిమాన హీరోల‌ను అన్న‌య్యా అనీ, హీరోయిన్ల‌ను అక్క‌య్యా అని సంబోధిస్తూ ఒక‌ప్పుడు వారికి ఉత్త‌రాలు రాసేవారు అభిమానులు. అలా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి ఓ బెంగ‌ళూరు అభిమాని నుంచి ఓ విచిత్ర‌మైన ఉత్త‌రం వ‌చ్చింది. త‌ను సీఏ (చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ) పాస‌వ్వాలంటే, ఆమె రిప్లై ఇవ్వాల‌నీ, ఆ రిప్లైలో ఫొటో పంపాల‌నీ రాశాడు. విజ‌య‌శాంతి అందుకున్న ఆ ఉత్త‌రంలో ఏముందంటే... "ప్రియ‌మైన విజ‌యశాంతి గారికి, నేను బికామ్ పాస‌య్యాను. ప్ర‌స్తుతం చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ చేస్తున్నాను. నాకు స్త్రీల‌తో స్నేహం చెయ్య‌డం అంటే చాలా ఇష్టం. అందుకు కార‌ణం - వారి స్నేహం ద్వారా, ఆ స్నేహం క‌లిగించే ప్రేర‌ణ ద్వారా జీవితంలో నేను అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం. నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె కూడా చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ చేస్తోంది. మేమిద్ద‌రం పోటీప‌డి చ‌దువుతున్నాం. అందుకు కార‌ణం, ఆమె నాకు ప్రేర‌ణ క‌లిగించ‌డ‌మే! ఎలాగైనా ఆ అమ్మాయి క‌న్నా మంచి మార్కులు తెచ్చుకొని సీఏ పాస‌వ్వాల‌ని నా ప‌ట్టుద‌ల‌. అలాగే మీ స్నేహం కోరుకుంటున్నాన‌ను. మీరు ద‌య‌చేసి నా ఈ ఉత్త‌రానికి స‌మాధాన‌మిస్తూ, ఒక ఫొటో పంపిస్తే చాలు. నాకు కొండంత బ‌లం, ధైర్యం వ‌స్తాయి. త‌ప్ప‌కుండా సీఏలో మంచి మార్కుల‌తో పాస‌వుతాను. విదేశాల‌కు వెళ్ల‌డానికి కూడా నాకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నేను విదేశాల‌కు వెళ్లాలంటే సీఏ పూర్తిచెయ్యాలి. నేను సీఏ పూర్తి చెయ్యాలంటే మీ ద‌గ్గ‌ర్నుంచి స‌మాధానం రావాలి. ఈ ఉత్త‌రానికి మీరు స‌మాధానం ఇస్తే, ఆ ప్రేర‌ణ‌తో నేను క‌ష్ట‌ప‌డి చ‌దివి సీఏ పాసై, విదేశాల‌కు వెళ్లేంత‌వ‌ర‌కూ మీకు రెండో ఉత్త‌రం నా ద‌గ్గ‌ర్నుంచి రాదు.  న‌న్ను సీఏని చేసి, విదేశాల్లో న‌న్ను ఉన్న‌త స్థానంలో ఉంచ‌డం అనేది మీ చేతుల్లోనే ఉంది. త‌ప్ప‌కుండా స‌మాధానం ఇస్తార‌ని ఆశిస్తూ.. నా కల‌ల్ని నిజం చేస్తార‌ని విశ్వ‌సిస్తూ.. మీ ప్రియాతి ప్రియ‌మైన అభిమాని" ఈ ఉత్త‌రం చూడ‌గానే త‌న మీద అత‌నికున్న అభిమానాన్ని అంచ‌నా వేయ‌లేక‌పోయారు. ఆమె ఉత్త‌రం రాస్తే అత‌ను త‌ప్ప‌కుండా సీఏలో మంచి మార్కుల‌తో పాస‌వుతాడ‌ట‌. శ్ర‌మించి చ‌దివేది అత‌ను. ప‌రీక్ష‌లు రాసేది అత‌ను. ప‌రీక్ష‌లో ఇచ్చిన ప్ర‌శ్న‌ల‌కు రాసిన స‌మాధానాల‌ను బ‌ట్టి మార్కులు వేసేది మ‌రొక‌రు. దీనికీ, ఆమె ఉత్త‌రానికీ ఎక్క‌డ‌న్నా సంబంధం ఉందా! అయినా అత‌ని అభిమానం అత‌నిచేత అలా ఉత్త‌రం రాయించింద‌న్న మాట‌. ఆ అభిమానికి విజ‌య‌శాంతి రిప్లై ఇచ్చివుంటార‌నీ, ఫొటో పంపివుంటార‌నీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా!

మోహ‌న్‌బాబు 'చిట్టెమ్మ మొగుడు' చేస్తూ ఇక న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న వ‌ర‌ల‌క్ష్మి!

  తెలుగున‌టి వ‌ర‌ల‌క్ష్మి అన‌గానే చాలామంది అల‌నాటి న‌టీమ‌ణులు జి. వ‌ర‌ల‌క్ష్మి, యస్‌. వ‌ర‌ల‌క్ష్మి గుర్తుకువ‌స్తారు. అదే బేబీ వ‌ర‌ల‌క్ష్మి అనండి.. ఒక్క‌రే గుర్తుకొస్తారు. బాల‌న‌టిగా వ‌చ్చిన పేరు.. ఆమె పెద్ద‌యి, పెళ్ల‌యి, పిల్ల‌ల్ని క‌న్న త‌ర్వాత కూడా ప్రేక్ష‌కుల దృష్టిలో ఆమె బేబీ వ‌ర‌ల‌క్ష్మి మాత్ర‌మే! వ‌ర‌ల‌క్ష్మి పుట్టింది భీమ‌వ‌రంలో. కానీ ఆమెకు ఏడాది వ‌య‌స‌ప్ప‌ట్నుంచే చెన్నైలో పెరిగారు. చిన్న‌ప్పుడే సినిమా రంగంలోకి రావ‌డంతో ఆమె ఎక్కువ‌గా చ‌దువుకోవ‌డానికి వీలుప‌డ‌లేదు. స్కూల్లో ఆరో క్లాస్ వ‌ర‌కే చ‌దువుకున్నారు. త‌ర్వాత ప్రైవేటుగా టెన్త్ పూర్తి చేశారు. వ‌ర‌ల‌క్ష్మి భ‌ర్త త‌మిళియ‌న్‌. ఆయ‌న సినిమా రంగానికి చెందిన వ్య‌క్తి కాదు, ఒక డాక్ట‌ర్‌.. జ‌న‌ర‌ల్ ఫిజీషియ‌న్‌. మొద‌ట ఆయ‌న వ‌ర‌ల‌క్ష్మిని ప్రేమించారు. ప్ర‌పోజ్ చేశారు. ఆమె యాక్సెప్ట్ చేశారు. అలా వారి పెళ్ల‌యింది. మ్యారేజ్ త‌ర్వాత కూడా వ‌ర‌ల‌క్ష్మి సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చారు. అయితే తెలుగు సినిమాల కంటే క‌న్న‌డ సినిమాల్లోనే ఎక్కువ చేశారు. ఆమె తెలుగులో చాలాకాలం న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం 'చిట్టెమ్మ మొగుడు'. ఆ సినిమాలో మోహ‌న్‌బాబు, దివ్య‌భార‌తి హీరో హీరోయిన్లు. దివ్య‌భార‌తి ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌ను వ‌ర‌ల‌క్ష్మి చేశారు. ఆ సినిమాలో ఒక సంద‌ర్భంలో ఆమె గ‌ర్భ‌వ‌తిగా క‌నిపిస్తారు. ఒక సీన్‌లో ఆమె అర‌టి తొక్క‌మీద కాలువేసి, జారి కింద‌ప‌డిపోవాలి. ఆ మూవీకి డైరెక్ట‌ర్ కోదండ‌రామిరెడ్డి. ఒక‌టి, రెండు.. మూడు.. ఇట్లా 11 టేకుల‌య్యాయి కానీ సీన్ ఓకే కావ‌ట్లేదు. దాంతో వ‌ర‌ల‌క్ష్మి కూర్చుండిపోయి, ఏడ‌వ‌డం మొద‌లుపెట్టారు. అంద‌రూ వ‌చ్చి "ఏమైంద‌మ్మా.. ఏమైనా దెబ్బ‌త‌గిలిందా?" అని అడుగుతున్నారు. డైరెక్ట‌ర్ కూడా అదే అడిగారు. "లేదు సార్" అని చెప్పారు వ‌ర‌ల‌క్ష్మి. "మ‌రెందుకు ఏడుస్తున్నావ్‌?" అన‌డిగారు డైరెక్ట‌ర్‌. "సార్‌.. ఇన్నిసార్లు ప‌డిపోతున్నాను.. నేను నిజంగానే క‌డుపుతో ఉన్నాను సార్‌. మూడో నెల‌. ఈ టైమ్‌లో ఇలా ఇన్నిసార్లు ప‌డిపోతే నా గ‌ర్భం నిల‌వ‌దేమోన‌ని ఫీల్ వ‌స్తోంది సార్‌.. నాకు భ‌య‌మేస్తోంది" అన్నారు వ‌ర‌ల‌క్ష్మి. షాకైపోయారు కోదండ‌రామిరెడ్డి. "ఏమ్మా ఈ విష‌యం ముందే చెప్ప‌వా? 11 టేకుల దాకా తీస్తున్నా ఇలా ప‌డుతూనే ఉన్నావా?" అని అడిగారు. "లేదు సార్‌.. ఒక‌ట్రెండు టేకుల్లోనే ఓకే అవుతుంద‌నుకున్నాను" అని చెప్పారు వ‌ర‌ల‌క్ష్మి. వెంట‌నే ఆయ‌న ప్యాక‌ప్ చెప్పేశారు. తీసిన టేకుల్లో ఏ షాట్ బాగా వ‌స్తే దాన్ని ఓకే చేసుకుందామ‌ని చెప్పారు. ఆమెను ఇంటికి పంపేశారు. ఇంటికి వ‌చ్చాక వ‌ర‌ల‌క్ష్మి ఆలోచించారు. 'నాకు ఎప్పుడూ రౌడీలు వెంట‌ప‌డితే ప‌రిగెత్తే సీన్లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి.. క‌డుపుతో ఉన్నాను. లోప‌ల బిడ్డ క్షేమంగా ఉండ‌టం ముఖ్యం. ఇంత‌టితో ఆపుదాం' అనుకుని, అప్పుడు సినిమాలు ఒప్పుకోకూడ‌ద‌ని డిసైడ్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా ఆమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. వాటిలో ఇబ్బంది లేద‌నుకున్న 'ఆమె', 'ఆడాళ్లా మ‌జాకా' లాంటి కొద్ది సినిమాలు చేశారు. ఆపైన పాప‌ను చూసుకోవాల‌ని చాలా కాలం సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ప్ర‌స్తుతం సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నారు.

సుహాసిని-మ‌ణిర‌త్నం పెళ్లి.. చాలా మందికి తెలీని ఆస‌క్తిక‌ర నిజాలు!

  సుప్ర‌సిద్ధ న‌టి సుహాసిని, దేశం గ‌ర్వించే సినిమాలు తీసిన మ‌ణిర‌త్నం ప్రేమించి పెళ్లి చేసుకున్నారా?  లేక వారి పెళ్లిని పెద్ద‌లు కుదిర్చారా? అనే విష‌యంలో చాలామందికి సందిగ్ధ‌త ఉంది. 1988 ఆగ‌స్ట్‌లో వారి వివాహం జ‌రిగింది. వారికి నంద‌న్ అనే కొడుకు ఉన్నాడు. 1988 జూన్‌లో సుహాసిని తండ్రి చారు హాస‌న్‌కు వెన్ను స‌మ‌స్య రావ‌డంతో హాస్పిట‌ల్‌లో చేర్చారు. అక్క‌డ మాట‌ల మ‌ధ్య "డిసెంబ‌ర్ త‌ర్వాత నువ్వు కొత్త సినిమాలు ఒప్పుకోవ‌ద్దు." అని కూతురికి చెప్పారాయ‌న‌. సుహాసిని ముఖంలో క్వ‌శ్చ‌న్ మార్క్‌. "నీ గురించి, మ‌ణిర‌త్నం గురించి వ‌దంతులు వ‌స్తున్నాయి. ఈ విష‌యం నేనూ, జి.వి. (మ‌ణిర‌త్నం సోద‌రుడు) చ‌ర్చించుకున్నాం. నువ్వు ఒక‌సారి మ‌ణిర‌త్నంను క‌లుసుకొని మాట్లాడు." అన్నారు చారు హాస‌న్‌. సుహాసినికి ఒక‌వైపు ఆనందం, ఇంకోవైపు ఆశ్చ‌ర్యం! మ‌ణిర‌త్నం అంటే ఆమెకు ఒక విధ‌మైన అభిమానం, గౌర‌వం. ఆయ‌న పెద్ద డైరెక్ట‌ర్ అని మాత్ర‌మే కాదు, ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌, సింప్లిసిటీ ఆమెను బాగా ఆక‌ట్టుకున్నాయి. అయితే దాన్ని ప్రేమ‌నీ, ఇంకోట‌నీ పేరు పెట్ట‌డానికి లేదు. ఏదైతేనేం.. త‌ను మ‌ణిర‌త్నంను క‌లుసుకుని మాట్లాడాలి.. ఎలా? ఇదే విష‌యం త‌న క్లోజ్ ఫ్రెండ్ ఒకామెను అడిగారు. "ముందు ఫోన్‌లో మాట్లాడి చూడు" అని ఆమె స‌ల‌హా ఇచ్చింది.  అంత‌కుముందు మ‌ణిర‌త్నంతో సుహాసినికి పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. జూన్ 8వ తేదీ సాయంత్రం ఆరున్న‌ర‌కు ఆమె మ‌ణిర‌త్నంకు ఫోన్ చేశారు. ఫోన్‌లో ఆప్యాయంగా, బాగా ప‌రిచితులైన‌వారితో మాట్లాడిన‌ట్లే ఆయ‌న మాట్లాడారు. "మ‌నం ఇవాళే క‌లుసుకుందాం" అని చెప్పారు. మ‌రో అర‌గంట‌లో సుహాసిని వాళ్లింట్లో ఉన్నారు.  చాలా మామూలుగానే ఆయ‌నకు స్వాగతం చెప్పారు సుహాసిని. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా స‌బ్జెక్టులోకి వ‌చ్చేశారు. కొంత‌సేపు మాట‌ల‌య్యాక‌, "మ‌రోసారి మ‌నం క‌లుసుకుందాం" అన్నారు మ‌ణిర‌త్నం. ఆ తొలి స‌మావేశం చ‌ల్ల‌ని క‌బుర్ల‌తో, కూల్ డ్రింక్స్‌తో ముగిసింది. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే వారిరువురూ పెళ్లి చేసుకోవాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ త‌మ నిర్ణ‌యాన్ని మ‌రో ఎనిమిది రోజుల దాకా ఎవ‌రికీ చెప్ప‌లేదు. మ‌రోవైపు రెండు కుటుంబాల పెద్ద‌ల మ‌ధ్య సంప్ర‌తింపులు, పెళ్లిమాట‌లు న‌డుస్తున్నాయి.  చారు హాస‌న్‌కు వెన్ను ఆప‌రేష‌న్ అమెరికాలోనో, ఇంగ్లండులోనో చేయించాల్సి వ‌స్తుంద‌నుకున్నారు. కానీ కూతురి పెళ్లివిష‌యం అనేస‌రికి ఆయ‌న‌కు ఎక్క‌డ‌లేని శ‌క్తి వ‌చ్చింది. లేచి తిర‌గ‌డం మొద‌లుపెట్టారు. పెళ్లి తొంద‌ర‌గా జ‌ర‌గాల‌నేది పెద్ద‌ల అభిప్రాయం. సుహాసిని, మ‌ణిర‌త్నం మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే వ‌దంతులే ఆ ఇద్ద‌రిని మ‌రింత స‌న్నిహితం చేశాయి. 1988 ఆగ‌స్ట్ 25.. సుహాసిని, మ‌ణిర‌త్నం పెళ్లిరోజు. వ‌దంతులు వ‌చ్చిన‌ట్లు వారిది ల‌వ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్‌. గ‌మ్మ‌త్తేమిటంటే.. మణిర‌త్నం వాళ్ల ఇల్లు, సుహాసిని వాళ్ల ఇంటి ప‌క్క‌వీధిలోనే ఉంటుంది. అయినా ఆ ఇద్ద‌రూ అంత‌కుముందు ఒక‌రికొక‌రు త‌ట‌స్థ‌ప‌డ‌లేదు.  వారి ప‌రిచ‌యం మ‌ణిర‌త్నం సినిమా 'ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వి' (క‌న్న‌డం) సినిమా సంద‌ర్భంగా జ‌రిగింది. ఆ మూవీలో సుహాసినిని హీరోయిన్‌గా చేయ‌మ‌ని అడుగుదామ‌ని ఆయ‌నే స్వ‌యంగా వాళ్ల ఇంటికి వ‌చ్చారు. కానీ కాల్షీట్లు అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలుప‌డ‌లేదు సుహాసినికి. ఒక‌వేళ ఆ సినిమాలో సుహాసినికి న‌టించివుంటే.. అప్పుడే ప్రేమ‌లో ప‌డేవాళ్లేమో.. తెలీదు. సుహాసిని సినీ న‌టుడ్ని పెళ్లి చేసుకోవాల‌ని మొద‌ట్నుంచీ అనుకోలేదు. క‌ళ‌ల‌ప‌ట్ల అభిరుచి, సంగీతంపై ఆస‌క్తి, హాస్య‌ప్రియ‌త్వం ఉన్న వ్య‌క్తిని ఆమె భ‌ర్త‌గా కోరుకున్నారు. త‌న భ‌ర్త చాక్లెట్ బేబీలా, మంద‌బుద్ధిలా ఉండ‌కూడ‌ద‌నీ, బుద్ధికుశ‌ల‌త‌తో, మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌తో ఉండాల‌నీ అనుకున్నారు. హోదాలో త‌న‌తో స‌మానంగా లేదా త‌న‌కంటే కాస్త ఎక్కువ‌గా, త‌ను గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌తో చూసుకోద‌గ్గ వ్య‌క్తి అయివుండాల‌నుకున్నారు. స‌రిగ్గా అలాంటి వ్య‌క్తినే మ‌ణిర‌త్నంలో ఆమె చూశారు.

చిన్న‌ప్పుడే డూప్ వ‌ద్ద‌ని పైనుంచి కింద‌కు దూకేసిన మ‌హేశ్‌!

  చిన్న‌త‌నంలోనే న‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నాడు మ‌హేశ్‌. 'పోరాటం' సినిమాలో మొద‌ట నటించ‌డానికి తెగ మారాం చేసిన ఎనిమిదేళ్ల పిల్లాడు, ఆ సినిమాలో న‌టించాక మారిపోయాడు. తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన 'శంఖారావం' సినిమా నుంచి న‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఒక‌రోజు త‌న‌లాగే డ్ర‌స్ వేసుకున్న మ‌రో పిల్లాడిని చూశాడు మ‌హేశ్‌. అత‌నికి త‌న డ్ర‌స్ లాంటిదే ఎందుకు వేశార‌ని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ను అడిగాడు. నీకు డూప్‌గా ఆ అబ్బాయి న‌టిస్తున్నాడ‌ని అత‌ను తెలిపాడు. పైనుంచి కింద‌కు దూకే సీన్ ఒక‌టి ఉంద‌నీ, ఆ సీన్ ఆ డూప్ చేస్తాడ‌నీ చెప్పాడు. అది విని, "ఈ మాత్రం దానికి డూప్ ఎందుకు, నేనే దూకుతా".. అన్నాడు మ‌హేశ్‌, కెమెరా లేకుండానే, షాట్ కాక‌పోయినా వెంట‌నే దూకి చూపించేశాడు. త‌న‌కు డూప్ అవ‌స‌రం లేద‌నీ, త‌నే స్వ‌యంగా దూకుతాన‌ని చెప్పి ఆ సీన్‌లో డూప్ లేకుండా న‌టించాడు ఎనిమిదేళ్ల మ‌హేశ్‌! కృష్ణ డైరెక్ట్ చేసిన మ‌రో సినిమా 'కొడుకు దిద్దిన కాపురం'లో ఒక మోటార్ బైక్ స్టంట్ సీన్ ఉంది. అదెంతో రిస్కీ షాట్‌. దానికి మ‌హేశ్ కోసం ఓ డూప్‌ను పెట్టారు. తండ్రి స్పాట్‌లో ఉంటే ఆ ప‌ని చేసేందుకు ఒప్పుకోర‌ని, ఆయ‌న లంచ్‌కు వెళ్లిన స‌మ‌యంలో స్టంట్ మాస్ట‌ర్‌ను ఒప్పించి ఆ మోటార్ బైక్ సీన్‌లో డూప్ లేకుండా న‌టించాడు మ‌హేశ్‌. 'బాల‌చంద్రుడు' సినిమాలో పైనుండి కింద‌కు దూకే స‌న్నివేశంలో తాను డూప్ లేకుండా న‌టిస్తాన‌ని క‌చ్చితంగా చెప్పాడు. ఆ సినిమాలో శ‌ర‌త్‌కుమార్ విల‌న్‌. ఆయ‌న‌ది అస‌లే ఎక్స‌ర్‌సైజ్ బాడీ. "ఇంత చిన్న‌పిల్లాడు డూప్ అవ‌స‌రం లేద‌ని అంటున్నాడు. నేను కూడా డూప్ లేకుండా న‌టిస్తాను." అని ఆయ‌న కూడా ప‌ట్టుప‌ట్టాడు. అయితే ఆ సీన్ తీస్తున్న‌ప్పుడు ప్ర‌మాదానికి గురై, ఆయ‌న మెడ ద‌గ్గ‌ర ఫ్రాక్చ‌ర్ అయ్యింది. మ‌హేశ్‌కు ఏమీ కాలేదు. ఆ త‌ర్వాత కూడా అత‌ను రిస్కీ షాట్స్‌లో న‌టించ‌డం మాన‌లేదు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గానే సూప‌ర్బ్‌ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఫ‌స్ట్ టాలీవుడ్ స్టార్‌ మ‌హేశ్‌!

  1975 ఆగ‌స్ట్ 9న ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌, ఇందిరాదేవి దంప‌తుల‌కు చెన్నైలో జ‌న్మించాడు మ‌హేశ్‌. ఆ టైమ్‌లో కృష్ణ 'గాజుల కిష్ట‌య్య' సినిమా చేస్తున్నారు. పిల్ల‌ల‌కు సెల‌వులు వ‌స్తే వాళ్ల‌ను షూటింగ్ లొకేష‌న్ల‌కూ, సెట్ల ద‌గ్గ‌ర‌కూ తీసుకెళ్లేవారు కృష్ణ‌. దాంతో స‌హ‌జంగానే మ‌హేశ్‌కు సినిమారంగంపై ఆస‌క్తి ఏర్ప‌డింది. అన్న ర‌మేశ్‌బాబు ప్ర‌ధాన‌పాత్ర పోషించ‌గా, దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన 'నీడ' చిత్రంలో మ‌హేశ్ ఓ చిన్న పాత్ర పోషించ‌డం ద్వారా తెరంగేట్రం చేశాడు. అప్పుడు మ‌హేశ్ వ‌య‌సు నాలుగేళ్లు! 1979 నుంచి 1990 వ‌ర‌కు మ‌హేశ్ 9 చిత్రాల్లో బాల‌న‌టుడి పాత్ర‌లు పోషించాడు. ఆ త‌ర్వాత తండ్రి కృష్ణ‌తో క‌లిసి తొలిసారిగా 'పోరాటం' సినిమాలో న‌టించాడు మ‌హేశ్‌. కోడి రామ‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో కృష్ణ‌కు త‌మ్ముడి పాత్ర‌ను పోషించాడు. అప్పుడు మ‌హేశ్ వ‌య‌సు ఎనిమిదేళ్లు. అందులో మ‌హేశ్ న‌ట‌న‌ను చూసిన అప్ప‌టి ప్ర‌ముఖ నిర్మాత డూండీ "ఈ అబ్బాయి సినీరంగంలో అద్భుతంగా పైకి వ‌స్తాడు. ఇత‌నికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంది." అని చెప్పారు. ఆయ‌న అభిప్రాయం, జోస్యం ఆ త‌ర్వాత నిజ‌మైంద‌ని మ‌నందరికీ తెలుసు. 1987లో కృష్ణ డైరెక్ట్ చేసిన 'శంఖారావం' చిత్రంలో మ‌హేశ్‌లోని న‌టుడు బ్ర‌హ్మాండంగా వెలుగులోకి వ‌చ్చాడు. అందులో మ‌హేశ్ న‌ట‌న‌, డాన్సులు అభిమానుల్ని అల‌రించాయి. 1988లో ర‌మేశ్‌బాబు హీరోగా ఎ. కోదండ‌రామిరెడ్డి డైరెక్ట్ చేసిన సూప‌ర్‌హిట్ ఫిల్మ్ 'బ‌జారు రౌడీ' మూవీలో మ‌హేశ్ న‌ట‌న‌ను మెచ్చుకోని వారు లేరు. నిజానికి ర‌మేశ్ కంటే మ‌హేశ్ చాలా బాగున్నాడ‌నీ, చాలా ఈజ్‌తో యాక్ట్ చేశాడ‌నీ విమ‌ర్శ‌కులు రాసేశారు. 1988లోనే కృష్ణ డైరెక్ష‌న్‌లో 'ముగ్గురు కొడుకులు' సినిమా వ‌చ్చింది. అందులో కృష్ణ‌, ర‌మేశ్‌, మ‌హేశ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. ఈ సినిమా కూడా మ‌హేశ్‌కు చ‌క్క‌ని పేరు తెచ్చింది. 1989లో విడుద‌లైన 'గూఢ‌చారి 117' ఫిల్మ్ బాల‌న‌టుడిగా మ‌హేశ్‌కు చాలా వెరైటీ ఫిల్మ్‌. ఇందులో కృష్ణ జేమ్స్‌బాండ్‌గా న‌టించారు. అదే ఏడాది కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌యారైన 'కొడుకు దిద్దిన కాపురం'లో మ‌హేశ్‌ ఫ‌స్ట్ టైమ్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. కృష్ణ‌-విజ‌య‌శాంతి దంప‌తుల‌కు క‌వ‌ల‌పిల్ల‌లుగా మ‌హేశ్ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న అత‌నికి సొంతంగా ఫ్యాన్ బేస్‌ను పెంచింద‌నేది నిజం. తెర‌మీద అత‌ను క‌నిపిస్తే చాలు, ప్రేక్ష‌కులు ఈల‌లు వేస్తూ కేరింత‌లు కొట్ట‌డం మొద‌లుపెట్టారు. 1990లో వ‌చ్చిన 'బాల‌చంద్రుడు', 'అన్నా త‌మ్ముడు' చిత్రాల‌తో బాల‌న‌టునిగా మ‌హేశ్ కెరీర్ పూర్త‌యింది. ఆ త‌ర్వాత అత‌ను చ‌దువుమీద పూర్తి దృష్టి పెట్టాడు. ఎనిమిదేళ్ల త‌ర్వాత తిరిగి కెమెరా ముందుకు వ‌చ్చి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతూ 'రాజ‌కుమారుడు' (1999) చేశాడు. భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్‌న‌ని ఆ సినిమాతోటే చాటిచెప్పాడు.

పెళ్లి చేసుకుంటాన‌ని త‌ల్లిని వెంట‌బెట్టుకొని శ్రీ‌దేవి ఇంటికి వ‌చ్చిన అభిమాని!

  సెల్‌ఫోన్లు రాక‌ముందు వ‌ర‌కూ సినిమా హీరోయిన్ల‌కు ప్రేమ‌లేఖ‌లు రాయ‌డం అభిమానుల‌కు స‌ర‌దా. తాము రాసిన ఉత్త‌రాల‌కు జ‌వాబు ఆ హీరోయిన్ నుంచి జ‌వాబు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారికి కొద‌వ వుండేది కాదు. అయితే ఆ అభిమానులెంత క‌ష్ట‌ప‌డి, భావ క‌విత్వాన్ని, ప్రేమ పైత్యాన్ని ఒలికించినా, తార‌లు ఏమాత్రం ప‌ట్టించుకోరు. ఆ ఉత్త‌రాల్ని చ‌దివి స‌ర‌దాగా న‌వ్వుకొని, డ‌స్ట్‌బిన్‌లో ప‌డేసేవారు. కొంత‌మంది సీరియ‌స్ అభిమానులుంటారు. వాళ్లు ప్ర‌తి విష‌యాన్నీ సీరియ‌స్‌గా తీసుకుంటారు. అలాంటి అభిమాని ఒక‌డు అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి జీవితంలో తార‌స‌ప‌డ్డాడు. అత‌ను శ్రీ‌దేవి సినిమాల్ని ఒక్కోటి ప‌దేసి సార్లు చూసి, ప్రేమ‌లేఖ‌లు రాసేవాడు. అత‌నిది నార్త్ ఆర్కాట్ ప‌క్క‌నున్న ఓ గ్రామం. అత‌ను మాటిమాటికీ శ్రీ‌దేవి వాళ్ల నాన్న‌ను అడ్ర‌స్ చేస్తూ ఉత్త‌రాలు రాసేవాడు. "నా ద‌గ్గ‌ర రెండు ల‌క్ష‌లు ఉన్నాయి. నేనేదైనా వ్యాపారం చెయ్యాల‌నుకుంటున్నాను. అందుకు మీరు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాను. మ‌రియు మీ అమ్మాయి శ్రీ‌దేవిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. నేను మీ అమ్మాయిని క‌ష్ట‌పెట్ట‌కుండా బ‌హు జాగ్ర‌త్త‌గా చూసుకుంటాను.." అంటూ ఇలాంటి ర‌క‌ర‌కాల విష‌యాల‌తో ఏమిటేమిటో రాసేవాడు. శ్రీ‌దేవి వాళ్ల నాన్న‌గారు ఆ ఉత్త‌రాల్ని చ‌దివి, చింపి అవ‌త‌ల పారేసేవారు. ఓసారి ఉత్త‌రంలో త‌ను ఫ‌లానా తేదీన మ‌ద్రాసుకు త‌న త‌ల్లితో క‌లిసి వాళ్లింటికి వ‌స్తున్నట్టు రాశాడు. అల‌వాటు ప్ర‌కారం శ్రీ‌దేవి నాన్న‌గారు ఆ ఉత్త‌రాన్ని చింపేశారు. అందులోని విష‌యాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఓ రోజు ప్యాంటూ, ష‌ర్ట్ ట‌క్ చేసుకొని, టై క‌ట్టుకొని, కూలింగ్ గ్లాస్‌, భుజానికి ఎయిర్ బ్యాగ్ వేసుకొని ఒక‌త‌ను, ఓ పెద్దావిడ‌తో శ్రీ‌దేవి వాళ్లింటికి వ‌చ్చాడు. వాళ్లెవ‌రో తెలీక శ్రీ‌దేవి నాన్న‌గారు తెల్ల‌బోయారు. ఆయ‌న క్వ‌శ్చ‌న్ మార్క్ ముఖం చూసి, ఆ వ్య‌క్తి న‌వ్వుతూ, "నేనెవ‌రో తెలియ‌డం లేదూ.. నేనండీ! మీకు ఉత్త‌రం రాశాను గ‌దా. చ‌ద‌వ‌లేదా?" అన్నాడు. శ్రీ‌దేవి వాళ్ల నాన్న‌గారికి ప‌రిస్థితి అర్థమైంది. అత‌న్ని కూర్చోపెట్టి, అత‌ని వివ‌రాలు అడిగారు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ వుండ‌గా, శ్రీ‌దేవి వాళ్ల‌మ్మ రాజేశ్వ‌రిగారు వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి, ఆ అభిమాని వాళ్ల‌మ్మ‌తో, "ఏవ‌మ్మా! నీ కొడుక్కి బుద్ధి లేక‌పోతే నీకు బుద్ధిలేదూ?  పెళ్లికొడుకుల కోసం మేమేదో అల్లాడిపోతున్న‌ట్టు ప‌రిగెత్తుకొని వ‌చ్చేశారు. బొట్టుపెట్టి పిలిచిన‌ట్టు పెట్టె బేడాతో వ‌చ్చారు.. పొండి.. పొండి." అంటూ వాళ్ల‌మీద విరుచుకుప‌డ్డారు. దెబ్బ‌కు అదిరిపోయారు త‌ల్లీకొడుకులు. ఇంత గొడ‌వ‌లోనూ ఆ వ్య‌క్తి మాత్రం త‌న కూలింగ్ గ్లాస్ తియ్య‌లేదు. శ్రీ‌దేవి వాళ్ల నాన్న‌గారికి సందేహంవ‌చ్చి, చ‌టుక్కుమ‌ని అత‌ని గ్లాసెస్‌ను లాగేశారు. చూస్తే.. ఆ పెళ్లికొడుక్కి ఒక క‌న్నులేదు. "ఇలాంటి పిచ్చి పిచ్చి ప‌నులు మ‌రెప్పుడూ చేయ‌కండి. మేం కాబ‌ట్టి నోటితో చెప్పాం. అంద‌రూ అలా చెయ్య‌రు జాగ్ర‌త్త." అని వాళ్ల‌ను పంపించేశారాయ‌న‌. ఆ వ్య‌క్తి త‌మ ఇంటికి ఉత్త‌రాలు రాయ‌డం, ఇంటికి రావ‌డం లాంటి విష‌యాలు శ్రీ‌దేవికి తెలియ‌వు. ఇది జ‌రిగిన త‌ర్వాత వాళ్ల నాన్న‌గారు చెప్ప‌డంతో న‌వ్వాపుకోలేక‌పోయింది శ్రీ‌దేవి. చాలా కాలం ఆ సంగ‌తి జ్ఞాప‌కం వ‌చ్చి న‌వ్వుకొనేది. ఈ విష‌యాల‌ను ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో వెల్ల‌డించారు శ్రీ‌దేవి.

"మీ కోసం ముంబై వ‌స్తా" అన్న‌ వైజాగ్ అమ్మాయి.. సోను సూద్ రిప్లై ఇది!!

  సోను సూద్ గురించి ఇవాళ తెలియ‌నివాళ్లెవ‌రు! తెర‌పై విల‌న్‌గా ఎన్నో చెడ్డ‌ప‌నులు చేసే ఆయ‌న‌, తెర‌బ‌య‌ట నిజ జీవితంలో ఎన్నో మంచిప‌నులు చేస్తూ రియ‌ల్ హీరోగా ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని అత‌లాకుత‌లం చేసిన సంద‌ర్భంగా ఆయ‌న గొప్ప‌త‌నం ఏమిట‌నేది ప్ర‌పంచానికి తెలిసింది. ఒక వ్య‌క్తి వ్య‌వ‌స్థ‌గా మారి, వంద‌లు కాదు వేల‌మందికి సాయం చేయ‌డం అనేది ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణ‌మే కాదు, చాలా చాలా గొప్ప విష‌యం. స్వ‌త‌హాగా సోను చాలా బిడియ‌స్తుడు. 'సీషా' అనే హిందీ సినిమాలో నేహా ధూపియాతో క‌లిసి న‌టించారు. అందులో నేహ‌తో ఆయ‌న‌కు ఓ ముద్దు సీన్ ఉంది. మామూలుగానే ఆయ‌న‌కు సిగ్గెక్కువ‌. అదీ కిస్ సీన్‌లో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల‌య్యారు. ఈ సీన్‌ను ఎలాగైనా మార్పించాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ డైరెక్ట‌ర్ క‌న్విన్స్ కాలేదు. చివ‌ర‌కు ఆ సీన్‌ను ఇబ్బంది ప‌డుతూనే చేశారు. చాలా కాలం క్రితం విశాఖ‌ప‌ట్నంలో సోను ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న‌ప్పుడు ఒక అమ్మాయి ఆటోగ్రాఫ్ అడిగింది. ఆయ‌న ఇచ్చారు. ఆ త‌ర్వాత నుంచీ ఆయ‌న‌కు ఆ అమ్మాయి ఫోన్లు చేస్తుండేది. త‌న‌ ఫోన్ నంబ‌ర్ ఆమె ఎలా సంపాదించిందో సోనుకు కూడా తెలీదు. "గుడ్ మార్నింగ్" అంటూ మెసేజ్‌లు మొద‌లుపెట్టి ఆయ‌న సినిమా గురించి ఎక్కువ‌గా మాట్లాడుతుండేది. ఓసారి కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా పంపింది.  అప్పుడు సోనుకు కోపం వ‌చ్చింది. "నువ్వు బుద్ధిగా చ‌దువుకో. ఇంతింత ఖ‌ర్చుచేసి నాకు గిఫ్టులు కొనేకంటే మంచి పుస్త‌కాలు కొనుక్కో" అని చెప్పారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు "మీ కోసం ముంబై వ‌స్తున్నా" అని చెప్పింది. "ఆ ప‌ని చేశావంటే పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తా" అన్నారు సోను. దాంతో ఆ అమ్మాయి ఫోన్లు చేయ‌డం మానేసింది.

నాకూ, శ్రీ‌దేవికీ ఇదే లాస్ట్ సీన్ అని చెప్పారా?.. డైరెక్ట‌ర్‌ని అడిగిన‌ ఎన్టీఆర్‌!

  ఏవీయం స్టూడియోలో 'వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు' సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఆరోజు ఎన్టీ రామారావు, శ్రీ‌దేవి జంట‌పై బెడ్‌రూమ్‌ సీన్ తీస్తున్నారు ద‌ర్శ‌కుడు క‌ట్టా సుబ్బారావు. ఓ గ్లాసులో శ్రీ‌దేవి హార్లిక్స్ ప‌ట్టుకొని బెడ్‌రూమ్ ద‌గ్గ‌ర నిల్చుంది. డైరెక్ట‌ర్ "యాక్ష‌న్" అన్నారు. శ్రీ‌దేవి చ‌క‌చ‌కా హార్లిక్స్ ప‌ట్టుకొచ్చి ఎన్టీఆర్‌కు ఇచ్చింది. "ఏమిటిది?" అని ఆశ్చ‌ర్యంగా అడిగారు ఎన్టీఆర్‌. "హార్లిక్స్" అంది ముద్దుగా శ్రీ‌దేవి. "మ‌ధ్య‌లో అదెందుకు?" అంటూ శ్రీ‌దేవిని ద‌గ్గ‌ర‌కు లాక్కొని మంచం మీద కూర్చోబెట్టారు ఎన్టీఆర్‌. ఆమె భుజాల‌మీద చేతులువేసి కౌగ‌లించుకోడానికి ట్రై చేశారు.  "ముందు ఈ హార్లిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటారు." అని మ‌ళ్లీ చెప్పింది శ్రీ‌దేవి. న‌వ్వుతూ "నాకొక స‌హాయం చేస్తావా?" అన‌డిగారు ఎన్టీఆర్‌. "చెప్పండి. దానిదేముంది" అంది చిలిపిగా శ్రీ‌దేవి. "గొల్ల‌భామ పాల‌డ‌బ్బాలు అమ్ముతారు.. అవి తీసుకొచ్చి, ఆ పాలు సీసాలోపోసి, దానికొక పీక‌పెట్టి, ఆ సీసా నా నోట్లోపెట్టు." అని నోరు చ‌ప్ప‌రించారు ఎన్టీఆర్‌. "అబ్బ‌.. పోండి.. నాకిక్క‌డ చాలా ప‌నులున్నాయి." అంటూ ఎన్టీఆర్ కౌగిలి నుంచి బ‌ల‌వంతంగా త‌ప్పించుకొని గ‌బ‌గ‌బా అక్క‌డ‌నుంచి వెళ్లిపోయింది.  "ఛీ.. ప‌థ్యం ఆహారం.. ప‌థ్యం పాలు." అంటూ ఎన్టీఆర్ విసురుగా ఆ గ్లాసును నేల‌కేసి కొట్టారు. గ్లాస్ ట‌ప్‌మంటూ లెక్క‌పెట్ట‌లేన‌న్ని ముక్క‌లైంది. "క‌ట్" అన్నారు క‌ట్టా సుబ్బారావు. "సార్ స్టిల్" అంటూ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. "శ్రీ‌దేవిని పిల‌వండి" అంటూ ఆర్డ‌ర్ వేశారు డైరెక్ట‌ర్‌. శ్రీ‌దేవి వ‌చ్చింది. ఎన్టీఆర్‌, శ్రీ‌దేవి బెడ్‌మీద కూర్చొని రొమాంటిక్ పోజులిస్తున్నారు. ఫ్లాష్‌లు వెలుగుతున్నాయి. కెమెరాలు క్లిక్ మంటున్నాయి.  "వ‌న్ మోర్ సార్‌.. వ‌న్ మోర్ సార్‌.." అంటూ ఫొటోగ్రాఫ‌ర్లు ఇంకా పోజులిమ్మ‌ని అడుగుతున్నారు. ఎన్టీఆర్‌, శ్రీ‌దేవి ర‌క‌ర‌కాల పోజులిస్తున్నారు. వాళ్ల‌లా పోజులిస్తుంటే ఫొటోలు తీస్తూనే ఉన్నారు. ఎంత‌సేప‌టికీ ఫొటోగ్రాఫ‌ర్లు ఎవ‌రూ 'ఇక చాలు' అని చెప్ప‌డం లేదు. అక్క‌డ్నుంచి క‌ద‌ల‌డం లేదు.  చూసి చూసి, క‌ట్టా సుబ్బారావుతో "ఏం బ్ర‌ద‌ర్ నాకూ, శ్రీ‌దేవికీ ఇదే లాస్ట్ సీన్ అని చెప్పారా ఏమిటి? ఇన్ని స్టిల్స్ తీసేస్తున్నారు. మాకింకా పాట‌లున్నాయి.. మ‌ర్చిపోయారా?" అన్నారు ఎన్టీఆర్ న‌వ్వుతూ. దాంతో అంద‌రూ ఘొల్లున న‌వ్వారు. అప్పుడు గానీ ఫొటోగ్రాఫ‌ర్స్ ఫొటోలు తీయ‌డం ఆపలేదు.

చ‌నిపోయే ముందు సాలూరు రాజేశ్వ‌ర‌రావు ఏడేళ్లు బెడ్ మీదే ఉన్నారు!

  తెలుగు సినిమా సంగీత స్వ‌రూపాన్ని మార్చిన ఘ‌నుడిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు సంపాదించారు సాలూరు రాజేశ్వ‌ర‌రావు. అనుస‌ర‌ణ‌లూ అనుక‌ర‌ణ‌లూ లేకుండా కొత్త శైలిలో సంగీతాన్ని సృష్టించారు. ఆయ‌న స్వ‌రాలు కూర్చిన 'ఇల్లాలు' (1940) చిత్రంలోని పాట‌లు అప్ప‌ట్లో కేవ‌లం తెలుగు ప్రాంతంలోనే కాకుండా మొత్తం ద‌క్షిణాదిలోనే ఓ సంచ‌ల‌నం. మ‌ల్లీశ్వ‌రి, మిస్స‌మ్మ‌, ఇద్ద‌రు మిత్రులు, ఆరాధ‌న‌, డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి, రంగుల రాట్నం, పూల రంగ‌డు, మ‌నుషులంతా ఒక్క‌టే, కురుక్షేత్ర‌ము లాంటి సినిమాల‌కు ఆయ‌న స్వ‌రాలు కూర్చిన పాట‌ల‌ను మ‌ర‌చిపోయేదెవ‌రు! చివ‌రి రోజుల్లో ఆయ‌న బెడ్‌మీద ఏకంగా ఏడు సంవ‌త్స‌రాలు ఉన్నార‌నే విష‌యం ఇప్ప‌టి సంగీత ప్రియుల‌కు, గాయ‌నీ గాయ‌కుల‌కు, సంగీత ద‌ర్శ‌కుల‌కు చాలామందికి తెలీదు. కృష్ణంరాజు సొంత సినిమా 'తాండ్ర పాపారాయుడు'కు ర‌స‌గుళిక‌ల్లాంటి పాట‌ల‌ను అందించిన సాలూరి, దాని త‌ర్వాత 'అయ్య‌ప్ప పూజాఫ‌లం' అనే చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఆ సినిమా కోసం నాలుగు ప‌ద్యాలు, మూడు పాట‌లకు స్వ‌రాలు కూర్చారు. ఎస్పీ బాలు, ఏసుదాస్‌, పి. సుశీల‌తో పాట‌లు పాడించి రికార్డు చేయించారు. కానీ ఆ సినిమా ఆ పాట‌ల రికార్డింగ్‌తోటే ఆగిపోయింది.  ఓ రోజు ఆయ‌న‌కు ఎక్కిళ్లు రావ‌డం మొద‌లై ఎంత‌కీ ఆగ‌లేదు. వాళ్లింటి స‌మీపంలో ఉండే ఫ్యామిలీ డాక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌ను పిలిపించారు. ఆయ‌న మందు ఇచ్చాక ఎక్కిళ్లు త‌గ్గాయి. కానీ అనూహ్యంగా రాజేశ్వ‌ర‌రావు శ‌రీరంలో ఒక‌వైపు ప‌క్ష‌వాతం వ‌చ్చేసింది. ఆయ‌న‌కు అంత‌దాకా బీపీ కానీ, షుగ‌ర్ కానీ లేవు. కానీ ఒక్క‌సారిగా హైబీపీతో పాటు సెరిబ్ర‌ల్ పెరాల‌సిస్‌కు గుర‌య్యారు. ఫ‌లితం.. ఏడేళ్లు మంచంమీదే ఉండిపోయారు. ఉలుకూ ప‌లుకూ లేదు. కొంత‌కాలం హాస్పిట‌ల్‌లో.. కొంత‌కాలం ఇంట్లో బెడ్ మీదే ఉన్నారు. నోట్లో ట్యూబ్‌తో పాలు ప‌ట్టేవారు ఇంట్లోవారు. టాబ్లెట్లు కూడా పొడిచేసి నోట్లో వేసేవారు. ఐదుగురు కొడుకులు, ఐదుగురు కోడ‌ళ్లు రాజేశ్వ‌ర‌రావు ప‌సిబిడ్డ‌లాగా చూసుకున్నారు. అలా బెడ్ మీద ఉండే మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఆడుకుంటూ వ‌చ్చారు. అద్భుత‌మైన, స‌మ్మోహ‌న‌మైన స్వ‌రాల‌తో తెలుగు సినిమా పాట‌ను సుసంప‌న్నం చేసిన సాలూరు రాజేశ్వ‌ర‌రావు 1999 అక్టోబ‌ర్ 26న తుదిశ్వాస విడిచారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ఆయ‌న వార‌స‌త్వాన్ని ఆయ‌న కుమారులు వాసూరావు, కోటి కొన‌సాగించారు.

కాలి వేలు తెగి ర‌క్తం కారుతుంటే కూల్‌డ్రింక్ పోసిన ఎన్టీఆర్‌!

  ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లోని సూప‌ర్‌స్టార్స్ అంద‌రి స‌ర‌స‌నా న‌టించిన తార రాజ‌సులోచ‌న. తెలుగులో ఆమె మొట్ట‌మొద‌టిసారి హీరోయిన్ రోల్ చేసిన చిత్రం 'సొంత‌వూరు'. న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు హీరోగా న‌టించిన ఆ సినిమాకు నిర్మాత ఘంట‌సాల. ఆ సినిమా షూటింగ్ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌, రాజ‌సులోచ‌న ఇద్ద‌రూ కొండ‌మీద న‌డిచి వెళ్తూవుండే దృశ్యం చిత్రీక‌రిస్తున్నారు. అది డ్యూయెట్‌లో ఓ భాగం. స్టూడియోలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో తీస్తున్నారు. కొండ సెట్ అంటే వెదుళ్లు, తీగ‌లు.. లాంటి వాటితో నిర్మిస్తారు. అలాంటి సెట్‌లో కొండ‌మీద వాళ్లిద్ద‌రూ వెళ్తూవుంటే రాజ‌సులోచ‌న కాలికి ఒక తీగ త‌గిలిన‌ట్ల‌యింది.  షాట్‌లో ఉన్న‌ప్పుడు అక్క‌డ ఆగి ఇబ్బంది క‌లిగించ‌డం ఇష్టంలేక ఆమె అలాగే న‌డిచి వెళ్లిపోయారు. షాట్ ఓకే అయ్యింది. షాట్ పూర్త‌య్యాక ఎన్టీఆర్‌, రాజ‌సులోచ‌న ఓ చోట కూర్చున్నారు. ఈలోగా సెట్‌బాయ్ వ‌చ్చి వాళ్ల‌కు కూల్‌డ్రింక్స్ అందించాడు. ఇద్ద‌రూ కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. అంత‌లోనే ఎన్టీఆర్ ఆమె కాలివంక చూసి, "ఏమిటిదీ?" అన‌డిగారు. అప్పుడు రాజ‌సులోచ‌న త‌న కాలువైపు చూసుకున్నారు. ఆమె కుడికాలి బొట‌న‌వేలంతా నెత్తురు. అప్ప‌టికి గానీ త‌న వేలు కింద తెగిపోయింద‌నే విష‌యం ఆమె తెలుసుకోలేక‌పోయింది. వెంట‌నే ఎన్టీఆర్ త‌న చేతిలో ఉన్న కూల్‌డ్రింక్‌ను ఆమె వేలిమీద ఒంపేశారు. ఆ వెంట‌నే ఫ‌స్ట్ ఎయిడ్ చేసి, యాంటీసెప్టిక్ ఇంజ‌క్ష‌న్ చేసి, కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టారు. అంత‌కు ముందే ఆ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఆ రోజు ద‌గ్గ‌ర ప‌డుతోంది. అందుక‌ని రాత్రింబ‌వ‌ళ్లు షూటింగ్ జ‌రిపేవారు. ఆ సినిమాలో రాజ‌సులోచ‌న‌కు రాధాకృష్ణుల నృత్యం ఒక‌టి ఉంది. ఆ పాట మొత్తం కాలికి బ్యాండేజ్‌తోనే ఆమె డాన్స్ చేశారు.