'నిన్నే పెళ్లాడ‌తా'లో హీరోయిన్ చాన్స్‌ను వ‌దిలేసుకున్న మీనా! ఎందుకంటే...

  హీరో నాగార్జున‌, డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ కెరీర్ల‌లో 'నిన్నే పెళ్లాడ‌తా' ఎంత‌టి మెమ‌ర‌బుల్ మూవీయో మ‌నంద‌రికీ తెలుసు. ఆ స‌బ్జెక్టు కానీ, ఆ సినిమాలోని పాట‌లు కానీ మ‌ర‌చిపోదామ‌న్నా మ‌ర‌పుకు రావు. నాగార్జున‌-ట‌బు మ‌ధ్య కెమిస్ట్రీ, వాళ్ల రొమాన్స్ ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించింది. చాలా మందికి తెలీని విష‌యం ఏమంటే.. నిజానికి ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఫ‌స్ట్ చాయిస్ ట‌బు కాదు, మీనా! య‌స్‌. మీరు చ‌దువుతోంది నిజం.  అప్పుడే సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా 'ముత్తు' విడుద‌లై, సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. అందులో హీరో హీరోయిన్లు ర‌జ‌నీ, మీనాపై తీసిన "థిల్లానా థిల్లానా" సాంగ్ అంద‌ర్నీ ఊపేస్తోంది. ర‌జ‌నీ-మీనా కెమిస్ట్రీకి ఆడియెన్స్ దాసోహ‌మ‌య్యారు. అప్పుడు 'నిన్నే పెళ్లాడ‌తా'లో హీరోయిన్‌గా మీనాను ఊహించుకున్నారు కృష్ణ‌వంశీ. ఆమెను సంప్ర‌దించారు. అయితే కాల్షీట్స్‌ 60 రోజులు కావాల‌ని అడిగారు. ఆ సినిమా నిర్మాత‌లు ఎవ‌రో కాదు.. అన్న‌పూర్ణ స్టూడియోస్ వాళ్లే. ఆ టైమ్‌లో మీనా డిమాండ్ మామూలుగా లేదు. చాలా సినిమాల‌తో య‌మ బిజీగా ఉంది. 20 రోజుల కాల్షీట్స్ ఇవ్వ‌డ‌మే గ‌గ‌నంలా ఉన్న స్థితి ఆమెది. అలాంటిది 60 రోజులు ఎలా ఇవ్వ‌డం! "అయ్యో.. అన్ని రోజులంటే క‌ష్టం. ఇవ్వ‌లేను" అని చెప్పేశారు మీనా.  నిజానికి నాగార్జున స‌ర‌స‌న‌, కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో సినిమా అంటే ఎవ‌రైనా ఎగిరి గంతేసి ఆ సినిమాని ఒప్పుకుంటారు. కానీ అప్ప‌టికే త‌ను ఒప్పుకున్న సినిమాల‌కు న్యాయం చెయ్యాల‌నీ, ప్రొఫెష‌న‌ల్‌గానే ఉండాల‌నీ, క‌మిట్‌మెంట్‌ను విడ‌నాడ‌కూడ‌ద‌ని భావించి ఆమె 'నిన్నే పెళ్లాడ‌తా'లో చెయ్య‌లేన‌ని బాధ‌ప‌డుతూనే చెప్పారు. అలా ఆమె సారీ చెప్ప‌డంతో, అప్పుడు ట‌బుకు ఆ పాత్ర‌ను ఇచ్చారు కృష్ణ‌వంశీ. ఈ నిజాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకున్నారు మీనా. 

'గోరింటాకు' సుజాత వ్య‌క్తిగ‌త జీవితంలో మీకు తెలీని నిజాలు!

  క‌ళ్ల‌తోటే న‌టించే న‌టిగా సుజాత ద‌క్షిణాది సినీ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందారు. 1952 డిసెంబ‌ర్ 10న ఆమె జ‌న్మించారు. ఉద్యోగ రీత్యా తండ్రి శ్రీ‌లంక‌లోని గాలే ప‌ట్నంలో ప‌నిచేసేవారు. సుజాత అక్క‌డే పుట్టి పెరిగారు. తండ్రి రిటైర‌య్యాక శ్రీ‌లంక నుంచి చెన్నై వ‌చ్చి, అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. 14 ఏళ్ల వ‌య‌సులో సుజాత‌ సినిమాల్లో న‌టిగా అడుగుపెట్టారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమెను ప‌రిచ‌యం చేసింది ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు. శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ఆ సినిమా 'గోరింటాకు'. అందులో ఆమె న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రిచి, వారి అభిమాన తార‌గా మార్చేసింది. ఆమె న‌ట‌నా ప్ర‌తిభ‌ను ప్రపంచానికి చూపించింది కె. బాల‌చంద‌ర్ సినిమాలే. 'గుప్పెడు మ‌న‌సు' ఒక్క‌టి చాలు.. ఆమె ఏ స్థాయి న‌టో చెప్ప‌డానికి! అప్ప‌టి అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు ప‌క్క‌న ఆమె హీరోయిన్‌గా న‌టించి, రాణించారు. త‌మిళంలో శివాజీ గ‌ణేశ‌న్‌, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌ల‌కు జోడీగా చేశారు. ఆమె చివ‌ర‌గా న‌టించిన తెలుగు సినిమా నాగార్జున‌తో కె. రాఘ‌వేంద్రరావు రూపొందించిన 'శ్రీ‌రామ‌దాసు'. న‌టిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన సుజాత వ్య‌క్తిగ‌త జీవితం ఆనంద‌మయం కాదు. ఆమె భ‌ర్త పేరు జ‌య‌క‌ర్ హెన్రీ.. ఆయ‌న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏమీ చేయ‌కుండా ఇంట్లోనే ఉండి, సుజాత సంపాద‌న‌తో ద‌ర్జాగా బతికేవాడు. సుజాత షూటింగ్ ముగించుకొని ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు, అన‌వ‌స‌రంగా నానా దుర్భాష‌లాడుతూ ఆమెను కొట్టేవాడ‌ని అప్ప‌ట్లో చెప్పుకునేవారు. ఒక్కోసారి నేరుగా సెట్స్‌కు వ‌చ్చి, నానా గొడ‌వా చేసేవాడంటారు. సుజాత కాల్షీట్ల కోసం ఎవ‌రైనా నిర్మాత‌లు కానీ, ద‌ర్శ‌కులు కానీ వ‌స్తే, వారికి ర‌క‌ర‌కాల కండిష‌న్లు పెట్టేవాడు. దాంతో సుజాత‌కు చాలా అవ‌కాశాలు మిస్స‌యిపోయేవి. నిజానికి వారిది ప్రేమ వివాహం కావ‌డం గ‌మ‌నార్హం. తాము అద్దెకు ఉండే ఇంటి య‌జ‌మాని కుమారుడైన జ‌య‌క‌ర్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి ఇరువురి పెద్ద‌లూ అంగీక‌రించ‌లేదు. వారిని ఎదిరించి మ‌రీ దంప‌తులుగా మారారు. వివాహానంత‌రం కొంత‌కాలం అమెరికాలో ఉన్నాక‌, తిరిగి ఇండియాకు వ‌చ్చేశారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, టాప్ హీరోల‌కు త‌ల్లిగా న‌టించారు. ఆ దంప‌తుల‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ప‌దేళ్ల క్రితం 2011లో ఏప్రిల్ 6న గుండెపోటుకు గురై మృతి చెందారు సుజాత‌.

"ఆకుచాటు పిందె త‌డిసే" పాట లిరిక్స్‌కు సెన్సార్ అభ్యంత‌రం!

  న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన 'వేట‌గాడు' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. కె. రాఘ‌వేంద్ర‌రావు నిర్దేశ‌క‌త్వంలో రోజా మూవీస్ బ్యాన‌ర్‌పై ఎం. అర్జున‌రాజు ఆ మూవీని నిర్మించారు. అందులోని ఓ సాంగ్ ఎవ‌ర్‌గ్రీన్ రెయిన్ సాంగ్స్‌లో ఒక‌టిగా పేరుపొందింది. ఆ పాట.. "ఆకుచాటు పిందె త‌డిసే". మ‌ద్రాస్‌లోని ఏవీఎం స్టూడియోలోని 5వ ఫ్లోర్‌లో ఎన్టీఆర్‌, శ్రీ‌దేవిపై ఆ పాట‌ను చిత్రీక‌రించారు. వాట‌ర్ స్ప్రింక్ల‌ర్స్‌ను ఉప‌యోగించి మూడు రోజుల్లో ఆ పాట తీశారు రాఘ‌వేంద్ర‌రావు. 'వేట‌గాడు' సినిమాలో ఈ రెయిన్ సాంగ్ హైలైట్ అయ్యింది. త‌ర్వాత వ‌చ్చిన వాన పాట‌ల‌కు ఈ సాంగ్ ఓ సిల‌బ‌స్‌గా నిలిచింది. శ్రీ‌దేవి అంద‌చందాలు, ఎన్టీఆర్ హుషారైన స్టెప్స్‌కు జ‌నం ఉర్రూత‌లూగిపోయారు. ఈ సినిమా సెన్సారింగ్‌కు వెళ్లిన‌ప్పుడు, రెయిన్ సాంగ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసిన సెన్సార్ మెంబ‌ర్స్‌, "ఆకుచాటు పిందె త‌డిసే" త‌ర్వాత వ‌చ్చే "కోక‌మాటు పిల్ల త‌డిసే"లో సౌండ్‌ను క‌ట్ చేయాలి లేదంటే మ‌రో మాట‌తో సౌండ్ రిప్లేస్ చేయాలి.. అని చెప్పారు.  స‌రిగ్గా ఆ టైమ్‌లో ఏడిద నాగేశ్వ‌ర‌రావు ఆఫీసులో 'శంక‌రాభ‌ర‌ణం' సినిమాకు పాట‌లు రాస్తున్నారు వేటూరి. 'వేట‌గాడు' సాంగ్‌కు సెన్సార్ అభ్యంత‌రం విష‌యం క‌బురంద‌గానే, "సెన్సార్‌వాళ్లు నా పాట‌లో, జ‌య‌మాలిని ఆట‌లో క‌ట్‌లు చెప్ప‌కుండా ఉండ‌రు" అని న‌వ్వారు. ఐదు నిమిషాలు ఆలోచించి, "ఆకుచాటు పిందె త‌డిసే" త‌ర్వాత వ‌చ్చే "కోక‌మాటు పిల్ల త‌డిసే" మాట‌ల స్థానంలో "కొమ్మ‌చాటు పువ్వు త‌డిసే" అనే మాట‌ల‌ను రాసిచ్చి పంపారు. అప్ప‌టిక‌ప్పుడు ఆ బిట్‌తో పాట‌ను రికార్డ్ చేశారు సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి. అప్పుడు ఆ పాట‌కు మ‌రే అభ్యంత‌రం చెప్ప‌లేదు సెన్సార్‌వాళ్లు. 1979 జూలై 5న విడుద‌లైన 'వేట‌గాడు' దిగ్విజ‌యంగా ఆడ‌గా, "ఆకుచాటు పిందె త‌డిసే" సాంగ్‌కు జ‌నం పిచ్చెత్తిపోయారు.

మోహ‌న్‌బాబుతో న‌టించ‌వ‌ద్ద‌ని సుమ‌ల‌త‌కు ఏ హీరోయినూ చెప్ప‌లేదు!

  మోహ‌న్‌బాబు అంటే డిసిప్లిన్‌కు మారు పేరు అనే ముద్ర ఉంది సినీ ఇండ‌స్ట్రీలో. అదే స‌మ‌యంలో మ‌హా కోపిష్టి అనే పేరు కూడా ఆయ‌న‌కు ఉంది. అందుకే ఆయ‌నతో సినిమాలు చేయ‌డానికి కొంత‌మంది హీరోయిన్లు వెనుకాడేవార‌నీ, భ‌య‌ప‌డేవార‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. నిన్న‌టి త‌రం అందాల‌ న‌టి సుమ‌ల‌త‌కు మోహ‌న్‌బాబు స‌ర‌స‌న న‌టించ‌డానికి అవ‌కాశం వస్తే ఆమె ఫ్రెండ్స్ అయిన తోటి హీరోయిన్లు కొంద‌రు ఆయ‌న‌తో న‌టించ‌వ‌ద్ద‌ని చెప్పార‌ని ఆ రోజుల్లో అనుకొనేవారు. అయితే అలా త‌న‌కు తోటి తార‌లెవ‌రూ ఆయ‌న‌తో చెయ్య‌వ‌ద్ద‌ని చెప్ప‌లేద‌ని సుమ‌ల‌త వెల్ల‌డించారు. మోహ‌న్‌బాబుతో ఆమె దాదాపు ప‌ది సినిమాల్లో నాయిక‌గా న‌టించారు. మోహ‌న్‌బాబు అంటే ఎవ‌రైనా ద‌డిపిస్తారేమో కానీ, త‌న అనుభ‌వంలో ఆయ‌న తమ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒక‌ర‌ని ఆమె చెప్పారు. "నాకంటే ముందుగా అంబ‌రీష్ (సుమ‌ల‌త భ‌ర్త‌), మోహ‌న్‌బాబు ఒక‌రికొక‌రు బాగా తెలుసు. వారు క్లోజ్ ఫ్రెండ్స్‌. వేరే వాళ్ల ఎక్స్‌పీరియ‌న్స్ గురించి నాకు తెలీదు కానీ, నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌లో చెప్ప‌గ‌ల‌ను, ఆయ‌న నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒక‌రు." అని సుమ‌ల‌త తెలిపారు. బెంగ‌ళూరు నుంచి ఎప్పుడైనా హైద‌రాబాద్‌కు వ‌చ్చి, త‌న‌కు స‌డన్‌గా ఏదైనా అవ‌స‌ర‌మైతే, ఏదైనా హెల్ప్ కావాల‌నుకుంటే ఆమె ఫ‌స్ట్ ఫోన్ చేసేది మోహ‌న్‌బాబుకే. సుమ‌ల‌త‌ ఇంట్లో ఫంక్ష‌న్ల‌కు మోహ‌న్‌బాబు కుటుంబం, మోహ‌న్‌బాబు ఇంట్లో ఫంక్ష‌న్ల‌కు ఆమె కుటుంబం అటెండ్ అవుతుంటారు. ఈ విష‌యాల‌ను సుమ‌ల‌త‌ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. కాగా, సుమ‌ల‌త భ‌ర్త అంబ‌రీష్ మృతి చెందిన త‌ర్వాత జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాండ్య లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గం నుంచి సుమ‌ల‌త పోటీచేసిన‌ప్పుడు ఆమెను గెలిపించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరుతూ మోహ‌న్‌బాబు ట్వీట్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె దేవె గౌడ మ‌న‌వ‌డు, న‌టుడు నిఖిల్ గౌడ‌పై ఘ‌న‌విజ‌యం సాధించారు.

సెట్‌లో త‌న ప్లేస్‌లో బాల‌కృష్ణ‌ను చూసి షాకైన చంద్ర‌మోహ‌న్‌!

  న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు, ముర‌ళీమోహ‌న్‌, బాల‌కృష్ణ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన చిత్రం 'అన్న‌ద‌మ్ముల అనుబంధం' (1975). హిందీ హిట్ ఫిల్మ్ 'యాదోం కీ బారాత్' (1973)కు ఈ మూవీ రీమేక్‌. య‌స్‌.డి. లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగా ఆడింది. ఆ సినిమాలోని "ఆనాటి హృద‌యాల ఆనంద గీతం ఇదేలే" పాట చాలా కాలం పాటు జ‌నం నోట నానింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక విశేష‌మేమంటే.. నిజానికి ముగ్గురు అన్న‌ద‌మ్ముల్లో చిన్న‌వాడి క్యారెక్ట‌ర్‌కు మొద‌ట ఎంపికైంది చంద్ర‌మోహ‌న్‌. షూటింగ్‌కు కూడా ఆయ‌న హాజ‌ర‌య్యారు. కానీ మాట మాత్రం చెప్పాపెట్ట‌కుండా ఆయ‌న‌ను తీసేసి, ఆ పాత్ర‌ను బాల‌కృష్ణ‌తో చేయించారు. ఇది చంద్ర‌మోహ‌న్‌కు తీవ్ర మ‌న‌స్తాపం క‌లిగించింది. తీవ్ర అవ‌మానానికి గురైన‌ట్లు ఆయ‌న భావించారు. అయితే ఆ సినిమా త‌ప్పిపోవ‌డం, మ‌రో మంచి అవ‌కాశాన్ని క‌ల్పించింది.. అది ఏకంగా ఎంజీఆర్ త‌మ్ముడిగా మంచి పాత్ర‌ను చేసే అవ‌కాశం! అవును.  "ఆనాటి హృద‌యాల ఆనంద గీతం ఇదేలే" స్టేజ్ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర్చింది సుంద‌రం మాస్ట‌ర్‌. ఆ సాంగ్‌కు సుంద‌రం ఆధ్వ‌ర్యంలో చంద్ర‌మోహ‌న్‌కు ప‌దిహేను రోజుల పాటు ట్రైనింగ్ ఇప్పించారు నిర్మాత పీతాంబరం (ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మ్యాన్ కూడా). అడ్వాన్స్ ఇచ్చారు. డ్ర‌స్సులు కూడా కుట్టించారు. మ‌ద్రాస్ వాహినీ స్టూడియోలోని ఆరో ఫ్లోర్‌లో షూటింగ్ పెట్టారు. చంద్ర‌మోహ‌న్ త‌న కారులో ఇంటి నుంచి బ‌య‌లుదేరి స్టూడియోకు వ‌చ్చారు. మేక‌ప్ రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నారు. మేక‌ప్ వేయడానికి ఎవ‌రూ రాలేదు. పీతాంబ‌రం కోసం చూశారు చంద్ర‌మోహ‌న్‌. ఆయ‌న క‌నిపించ‌లేదు. అంత‌లో సెట్లోంచి సాంగ్ వినిపించింది. డాన్స్ మాస్ట‌ర్లు ఏమైనా రిహార్స‌ల్స్ చేసుకుంటున్నారేమో అని మొద‌ట అనుకున్నారు చంద్ర‌మోహ‌న్‌. ఎంత‌సేప‌టికీ ఎవ‌రూ రాక‌పోతుండ‌టంతో, చూద్దామ‌ని సెట్ డోర్ ఓపెన్ చేసి చూశారు. అచ్చం చంద్ర‌మోహ‌న్ వేసుకున్న డ్ర‌స్సును ఎవ‌రో కుర్రాడు వేసుకొని, గిటార్ ప‌ట్టుకొని డాన్స్ చేస్తూ క‌నిపించాడు. మొద‌ట ఎవ‌రో డూప్ కాబోలు అనుకున్నారు. త‌ర్వాత అక్క‌డున్న వాళ్లు చెప్పారు, అత‌నెవ‌రో కాదు, ఎన్టీఆర్ గార‌బ్బాయి బాల‌కృష్ణ అని. 'బాల‌కృష్ణ‌కు ఆ వేష‌మేంటి? ఇంత‌దాకా నాకెవ‌రూ చెప్ప‌లేదే!' అన్నారు చంద్ర‌మోహ‌న్‌. అప్ప‌టికి చిన్న‌గా అనుమానం వ‌చ్చింది. కాసేప‌ట్లో త‌ను సెట్‌కు వెళ్లాల్సివుండ‌గా, త‌న ప్లేస్‌లో ఇంకొక‌రు ఉండ‌ట‌మేంటి? ఒక ఆర్టిస్టుకు ఇంత‌కంటే బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఇంకేముంటుంది? అనుకున్నారు. స‌రే చూద్దామ‌ని రూమ్‌లో అలాగే కూర్చున్నారు చంద్ర‌మోహ‌న్‌. కొంత‌సేప‌య్యాక పీతాంబ‌రం వ‌చ్చారు. రాగానే, "సార్‌.. మీరు ఇంటికెళ్లండి. నేను వ‌చ్చి మాట్లాడ‌తాను. చిన్న పొర‌పాటు జ‌రిగింది." అన్నారాయ‌న‌. "ఏం జ‌రిగింది సార్?" అన‌డిగారు చంద్ర‌మోహ‌న్‌. "ఇప్పుడిక్క‌డ ఆ విష‌యాలు వ‌ద్దు. న‌న్ను మ‌న్నించండి." అని చేతులు జోడించారు. అంత పెద్దాయ‌న అలా అనేస‌రికి, స‌రేన‌ని ఇంటికెళ్లిపోయారు చంద్ర‌మోహ‌న్‌.  సాయంత్రం షూటింగ్ అయ్యాక చంద్ర‌మోహ‌న్ ఇంటికి వ‌చ్చారు పీతాంబ‌రం. "రామారావుగారు త‌న బ్ర‌ద‌ర్‌గా బాల‌కృష్ణ వేస్తాడ‌ని చెప్పారు. మీకు ఎన్ఏటీ బ్యాన‌ర్‌లో మంచి వేషం ఇస్తామ‌న్నారు. నేను ఆయ‌న‌ను క‌న్విన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను కానీ ఆయ‌న ప‌ట్టుప‌ట్టారు." అని చెప్పి వెళ్లిపోయారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఎన్టీఆర్ స‌న్నిహితుడు, నిర్మాత‌ పుండ‌రీకాక్ష‌య్య వ‌చ్చారు. రామారావుగారు మీకు ఎన్ఏటీలో మంచి వేషం ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. చంద్ర‌మోహ‌న్‌కు కోపం వ‌చ్చేసింది. "ఇంక నా ద‌గ్గ‌ర రామారావుగారి మాట వినిపించ‌డానికి వీల్లేదు. ఎన్ఏటీ వ‌ద్దు, ఏం వ‌ద్దు. ఇంత ద్రోహం చేస్తారా?  స్టూడియోకు వ‌చ్చిన ఆర్టిస్టుకు ఈ ఖ‌ర్మ తీసుకువ‌స్తారా" అనేశారు. ఆ త‌ర్వాత రోజు మ‌ళ్లీ పీతాంబ‌రం వచ్చి, "అన్న‌ద‌మ్ముల అనుబంధం సినిమాను త‌మిళంలో ఎంజీఆర్‌తో తీస్తున్నాం. అందులో ఆయ‌న త‌మ్ముడిగా మీరు న‌టించండి" అని చెప్పారు. ఎంజీఆర్‌ను క‌లిశాక‌, జ‌రిగిన విష‌యం ఆయ‌న‌కు చెప్పారు చంద్ర‌మోహ‌న్‌. "అలా జ‌రిగిందా?  మిమ్మ‌ల్ని నేను ఎంక‌రేజ్ చేస్తాను." అని ఆయ‌న భుజం త‌ట్టారు ఎంజీఆర్‌. ముగ్గురు అన్న‌ద‌మ్ముల్లో మొద‌టి ఇద్ద‌రి పాత్ర‌ల‌ను ఎంజీఆరే చేయ‌గా, చిన్న‌వాడి పాత్ర‌ను చంద్ర‌మోహ‌న్ చేశారు. ఆయ‌న‌కు ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఈ విష‌యాల‌ను చంద్ర‌మోహ‌న్ స్వ‌యంగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

'గ్యాంగ్ లీడ‌ర్' నావ‌ల్లే హిట్ట‌య్యింద‌ని నేను అన్న‌ట్లు గిట్ట‌నివాళ్లు ప్ర‌చారం చేశారు!

  లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ప్ర‌తిఘ‌ట‌న‌, ఒసేయ్ రాముల‌మ్మా, క‌ర్త‌వ్యం.. ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఈ సినిమాలంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. ఇవి కాకుండా నేటి భార‌తం, ప‌డ‌మ‌టి సంధ్యారాగం, మొండిమొగుడు పెంకిపెళ్లాం, పోలీస్ లాక‌ప్‌, స్వ‌యంకృషి, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాల్లో మంచి పాత్ర‌లు చేశాన‌ని విజ‌య‌శాంతి చెప్పారు. హీరోల సినిమాల్లోనూ ఆమెకు మంచి పాత్ర‌లు ల‌భించాయి. 'గ్యాంగ్ లీడ‌ర్‌'లో అయితే ఆమె ఎవ‌రి మాటా విన‌ని క్యారెక్ట‌ర్ చేశారు. "అరేబియ‌న్ హార్స్ లెక్క‌న ఆ పాత్ర‌ ప‌రిగెత్తుతూనే ఉంటుంది. డైరెక్ట‌ర్ విజ‌య‌బాపినీడు గారు దాన్ని కొంత డిజైన్ చేస్తే, మిగ‌తాది స్పాట్‌లో నేనే డిజైన్ చేసుకున్నా." అని ఆమె చెప్పారు. అప్ప‌ట్లో 'గ్యాంగ్ లీడ‌ర్' త‌న‌ వ‌ల్లే హిట్ట‌య్యింద‌ని విజ‌య‌శాంతి అన్న‌ట్లు ఇండ‌స్ట్రీలో బాగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే త‌నెప్పుడూ అలా అన‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. "గ్యాంగ్ లీడ‌ర్ నా వ‌ల్లే హిట్ట‌య్యింద‌ని నేనెప్పుడూ అన‌లేదు. అదెవ‌రో గిట్ట‌నివాళ్లు క్రియేట్ చేశారు. ఒక‌వేళ నేను అలా అనుంటే మ‌ళ్లీ మేం 'మెకానిక్ అల్లుడు' క‌లిసి చేసేవాళ్లం కాదు క‌దా." అని తెలిపారు విజ‌య‌శాంతి. 'గ్యాంగ్ లీడ‌ర్‌' సినిమాలో హీరో హీరోయిన్ల పాత్ర‌లు రెండూ స‌మాన‌మైన గొప్ప పాత్ర‌ల‌ని ఆమె అన్నారు. "ఒక విధంగా చెప్పాలంటే నాది డామినేటింగ్ క్యారెక్ట‌ర్‌. ఆ పాత్ర అలా కుదిరింది. చిరంజీవి కూడా బాగా స‌హ‌క‌రించారు." అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు లేడీ సూప‌ర్‌స్టార్‌.

'అడ‌వి సింహాలు' షూటింగ్‌లో దుర్ఘ‌ట‌న‌.. సిలిండ‌ర్ పేలి ఒక‌రి త‌ల తెగింది!

  వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వినీద‌త్ నిర్మించిన హిట్ ఫిల్మ్ 'అడ‌వి సింహాలు' (1983). కృష్ణ‌-శ్రీ‌దేవి, కృష్ణంరాజు-జ‌యప్ర‌ద రెండు జంట‌లుగా న‌టించిన ఈ సినిమాకు దర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్షేమ‌మా ప్రియ‌త‌మా, హేయ్ హేయ్ గంట‌కొట్టిందా, అగ్గిపుల్ల భ‌గ్గుమంట‌ది, పిల్ల నచ్చింది, గూటిలోకి చేరేది ఎప్పుడు.. పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వైజాగ్ బీచ్‌లో జ‌రిగిన‌ప్పుడు ఓ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. అందులో ఒక‌రి ప్రాణంపోగా, అక్క‌డున్న పిల్ల‌లు తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. ఆ రోజు వైజాగ్ బీచ్‌లో కృష్ణ‌, కృష్ణంరాజు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌ల‌పై 'పిల్ల న‌చ్చింది' పాట‌ను చిత్రీక‌రించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్క‌డ కొన్ని వంద‌ల రంగురంగుల బెలూన్ల‌కు సిలిండ‌ర్‌తో గ్యాస్ ఎక్కిస్తూ నిర్విరామంగా ప‌నిచేస్తున్నాడు ఓ వ్య‌క్తి. రంగురంగుల బెలూన్ల‌వ‌డంతో బీచ్‌లో ఉన్న పిల్ల‌లంతా వింత‌గా చూస్తూ అత‌ని చుట్టూ మూగారు.  ఇంత‌లో అక్క‌డ‌కు ఓ కారు వ‌స్తోంది. అందులో కృష్ణంరాజు, జ‌య‌ప్ర‌ద ఉన్నారంటూ ఎవ‌రో కేక‌వేశారు. మ‌రుక్ష‌ణంలో పిల్ల‌లంతా కొంచెం దూరంగా ఉన్న ఆ కారువైపు ప‌రుగులు తీశారు. అంతే! అంత‌దాకా బెలూన్ల‌కు గ్యాస్ నింపుతున్న సిలిండ‌ర్ ఒక్క‌సారిగా ఢామ్మంటూ పేలిపోయింది. అక్క‌డ ప‌నిచేస్తున్న‌త‌ని త‌ల తెగి గాలిలో ఎగిరింది. ఒక్క‌సారిగా ఏం జ‌రిగిందో అర్థంకాక స్థాణువులైపోయారు అక్క‌డున్న‌వారంతా. ఆ త‌ర్వాత భీతావ‌హులై వ‌ణికిపోయారు. ఒక్క క్ష‌ణం ముందు దాకా అక్క‌డున్న పిల్ల‌లు కారు ద‌గ్గ‌ర‌కు ప‌రుగెత్తుకొని వెళ్ల‌డంతో ఒక ఘోర విషాదం త‌ప్పిపోయింది. లేక‌పోతే త‌ల‌చుకోడానికే భ‌య‌ప‌డే దుర్ఘ‌ట‌న చోటు చేసుకునేది.

ఆసియాలోనే ఆ ఘ‌న‌త సాధించిన మొద‌టి వ్య‌క్తి ఇళ‌య‌రాజా!

  1993 జూలై 19.. ఆసియాలోని సంగీత ప్రియులంద‌రూ గ‌ర్వించిన రోజు. కార‌ణం.. ఆ రోజు ఎలిజ‌బెత్ రాణి ప్ర‌ధాన పోష‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సుప్ర‌సిద్ధ రాయ‌ల్ ఫిల్హార్‌మోనిక్ ఆర్కెస్ట్రా (లండ‌న్‌) ప్ర‌పంచ ప్ర‌సిద్ధ సంగీత‌కారుడు జాన్ స్కాట్ సంగీత నిర్వ‌హ‌ణ‌లో ఇళ‌య‌రాజా రూపొందించిన 'సింఫ‌నీ' సంగీతాన్ని రికార్డు చేశారు. ఈ మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను పిర‌మిడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ విడుద‌ల చేసింది. దీంతో ప్ర‌పంచ ప్ర‌సిద్ధుల స్థాయిలో, పాశ్చాత్య-శాస్త్రీయ సంగీత పోక‌డ‌లో సింఫ‌నీని రూపొందించిన మొట్ట‌మొద‌టి ఆసియా సంగీత‌కారునిగా ఇళ‌య‌రాజా ఘ‌న‌త సాధించారు. నాలుగున్న‌ర ద‌శాబ్దాల క్రితం త‌మిళ‌నాడులోని ప‌ణ్ణైపురం అనే కుగ్రామం నుంచి సంగీతం నేర్చుకోవ‌డానికి మ‌ద్రాసు వ‌చ్చి, ఒక‌వైపు ఆర్థిక ఇబ్బందులు అనుభ‌విస్తూనే, ప‌ట్టువిడువ‌కుండా సంగీత జ్ఞానాన్ని పెంపొందింప‌జేసుకుని, సంగీత ద‌ర్శ‌కుడై ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అగ్ర‌స్థానానికి చేరుకున్న కృషీవ‌లుడు ఇళ‌య‌రాజా. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అగ్ర‌స్థాయికి చేరుకున్న‌ప్ప‌టికీ శాస్త్రీయ సంగీతంపై ఆయ‌న‌కున్న గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఎంత‌మాత్ర‌మూ త‌గ్గ‌లేదు. అందుకే క‌ర్ణాట‌క సంగీతంలో ఇటు త‌మిళంలో, అటు సంస్కృతంలో ఏడు కృతులు కంపోజ్ చేశారు. శోచ‌నీయ‌మైన విష‌యం ఏమంటే.. ఆసియాలోనే సింఫ‌నీని రూపొందించిన తొలి వ్య‌క్తిగా విశిష్ట గౌర‌వం ఆయ‌న ద‌క్కించుకుంటే.. ఆ విష‌యం జీర్ణించుకోలేని కొంత‌మంది సినీ ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వ‌దంతులు వ్యాపింప‌జేశారు. ఆయ‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేశారు. దాంతో ఇళ‌య‌రాజా మిత్రులు, స‌న్నిహితులు అయిన ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, భాగ్య‌రాజా, పి. వాసు, పంజు అరుణాచ‌లం లాంటి ప్ర‌ముఖులు ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, ఇళ‌య‌రాజా సాధించిన ఘ‌న‌త‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. ఆయ‌న ఘ‌న‌విజ‌యాన్ని కొనియాడుతూ ఇళ‌య‌రాజాను స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇళ‌య‌రాజా మాట్లాడుతూ, "ఇది నా ఒక్క‌డి విజ‌యం కాదు. ఇది సినీరంగం విజ‌యం. సంగీతాభిమానుల విజ‌యం. ఈ ఆనందాన్ని మీతో కాక మ‌రెవ‌రితో పంచుకోగ‌ల‌ను." అన్నారు గ‌ద్గ‌ద‌స్వ‌రంతో.

యాక్సిడెంట్‌లో నెత్తుటి గాయాలు.. అమ్మ‌కు అబ‌ద్ధం చెప్పిన సుమ‌న్‌!

  సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ వాళ్ల‌మ్మ‌గారికి సైకిల్‌, మోటార్ సైకిల్ లాంటి ద్విచ‌క్ర వాహ‌నాలంటే విప‌రీత‌మైన భ‌యం. అందుకే చిన్న‌ప్పుడు ఆయ‌న‌కెప్పుడూ సైకిల్ కొనివ్వ‌లేదు. సుమ‌న్ సైకిల్ తొక్క‌డం నేర్చుకుంటానంటే ఒప్పుకొనేవారు కాదు. అందుక‌ని ఆమెకు తెలీకుండా దొంగ‌త‌నంగా సైకిల్ తొక్క‌డం, మోటార్ బైక్ డ్రైవ్ చెయ్య‌డం నేర్చుకున్నారు సుమ‌న్‌. కాలేజీలో చ‌దువుకొనేప్పుడు ఒక‌రోజు ఫ్రెండ్‌తో క‌లిసి, అత‌ని బైక్‌పై సినిమాకు బ‌య‌లుదేరారు సుమ‌న్‌. ఆయ‌న బైక్ న‌డుపుతుంటే, ఫ్రెండ్ వెనుక కూర్చున్నాడు. బైక్ న‌డ‌ప‌డం నేర్చుకున్న కొత్త‌లో కావ‌డంతో, బాగా స్పీడుగా పోనిస్తున్నారు సుమ‌న్‌. చెన్నై మౌంట్ రోడ్‌లో వెళ్తుండ‌గా, వాళ్ల బైక్‌కు ముందు ఓ సిటీ బ‌స్ వెళ్తోంది. ఎదురుగా మ‌రో మోటార్ బైక్ వ‌స్తోంది. ఆ బైక్‌ను త‌మాషాగా అలంక‌రించి వుండ‌టంతో, దాన్నే చూస్తూ బైక్ న‌డుపుతున్నారు సుమ‌న్‌. అనుకోకుండా వాళ్ల ముందున్న సిటీ బ‌స్ స‌డ‌న్ బ్రేక్‌తో ఆగింది. ఇది గ్ర‌హించ‌క‌పోవ‌డంతో సుమ‌న్ న‌డుపుతున్న బైక్ ఆ బ‌స్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.  సుమ‌న్‌, ఫ్రెండ్‌.. ఇద్ద‌రూ కింద‌ప‌డ్డారు.  ప‌క్క‌నే విమెన్స్ కాలేజీ బ‌స్టాప్‌లో నిల్చున్న కొంత‌మంది అమ్మాయిలు వాళ్ల‌ను చూసి న‌వ్వ‌డం ప్రారంభించారు. అస‌లే కాళ్లూ, చేతులూ గీరుకుపోయి, నెత్తురు కారుతూ, గాయాలు క‌లిగించే మంట కంటే ఆ అమ్మాయిలు త‌మ‌ని చూసి న‌వ్వ‌డం వారికి మ‌రింత బాధ‌నూ, కోపాన్నీ క‌లిగించింది. అంత‌లో బ‌స్ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌, బ‌స్‌లోని జ‌నం, రోడ్డుమీద పోయే జ‌నం వారి చుట్టూ మూగి తిట్ట‌సాగారు. దాంతో సుమ‌న్‌కు దాదాపు ఏడుపొచ్చినంత ప‌నైంది. అయినా ఆ దుఃఖాన్ని దిగ‌మింగుకొని మెల్ల‌గా తేలుకుట్టిన దొంగ‌ల్లా ఇల్లు చేరుకున్నారు. గుమ్మంలోనే సుమ‌న్ వాళ్ల‌మ్మ‌గారు ఎదురై నెత్తుటి గాయాల‌తో ఉన్న సుమ‌న్‌నూ, అత‌ని ఫ్రెండ్‌నూ చూసి గాబ‌రాప‌డ్డారు. ఏం జ‌రిగింద‌ని ఆమె అడ‌గ‌క‌ముందే, "హాకీ ఆడుతూ కింద‌ప‌డ్డాం, దెబ్బ‌లు త‌గిలాయి.. అంతే!" అని అబద్ధం చెప్పి, ఆమె శిక్ష నుంచి త‌ప్పించుకున్నారు. ఆ రోజు నుంచి సుమ‌న్ మోటార్ బైక్‌కు గుడ్‌బై చెప్పేశారు.

అనూప్ రూబెన్స్‌కు ఏడేళ్ల‌పాటు ఒక్క హిట్టూ లేదంటే న‌మ్ముతారా?

  ఇవాళ అనూప్ రూబెన్స్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ్యూజిక్ ల‌వ‌ర్స్ మాత్ర‌మే కాదు, నేటి సినీ ప్రియులంద‌రికీ అత‌ను సుప‌రిచితుడే. కీబోర్డ్ ప్లేయ‌ర్‌గా కెరీర్ ఆరంభించిన అనూప్ ప‌నిచేసిన మొద‌టి సినిమా ఉషాకిర‌ణ్ మూవీస్ వారు తేజ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన 'చిత్రం'. అది సూప‌ర్ హిట్ట‌వ‌డంతో కీబోర్డ్ ప్లేయ‌ర్‌గా వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. సిక్స్‌టీన్స్‌, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, నువ్వు నేను, జ‌యం, సంతోషం, దిల్‌.. ఇలాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కు కీబోర్డ్ ప్లేయ‌ర్ అత‌నే. 2004 దాకా అత‌ను దాదాపు 200 సినిమాల‌కు ఏక‌బిగిన ప‌నిచేశాడు. 'జై' సినిమాతో అనూప్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేశాడు డైరెక్ట‌ర్ తేజ‌. ఆ సినిమాకు చాలా క‌ష్ట‌ప‌డి మంచి ట్యూన్స్ ఇచ్చాడు అనూప్‌. పాట‌లు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి కానీ సినిమా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత ధైర్యం, గౌత‌మ్ ఎస్ఎస్‌సీ, ద్రోణ‌, సీతారాముల కల్యాణం లంక‌లో, అంద‌రి బంధువ‌యా లాంటి సినిమాల‌కు మ్యూజిక్ ఇచ్చాడు. అవేవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆడ‌లేదు. అలా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారిన ఏడేళ్ల దాకా అత‌డికి ఒక్క హిట్టూ ప‌డలేదు. ఈ మ‌ధ్య కాలంలోనూ అత‌ను కొన్ని సినిమాల‌కు కీబోర్డ్ ప్లేయ‌ర్‌గా చేశాడు కూడా. ఎట్ట‌కేల‌కు ఆది హీరోగా ప‌రిచ‌య‌మైన‌ 'ప్రేమ‌కావాలి' రూపంలో అత‌డి కెరీర్‌కు బిగ్ బ్రేక్ ల‌భించింది. 'ద్రోణ' సినిమాలో అత‌ను చేసిన "ఏం మాయ చేశావే" సాంగ్ డైరెక్ట‌ర్ విజ‌యభాస్క‌ర్‌కు న‌చ్చ‌డంతో 'ప్రేమ‌కావాలి' సినిమాకు ఆఫ‌ర్ ఇచ్చారు. ఆ సినిమా పాట‌లు సూప‌ర్ హిట్ కావ‌డ‌మే కాకుండా, 'ప్రేమకావాలి' శ‌త దినోత్స‌వం చేసుకుంది. ఆ వెంట‌నే 'పూల‌రంగ‌డు', 'ఇష్క్‌', 'ల‌వ్లీ' లాంటి హిట్ సినిమాలు రావ‌డంతో అనూప్ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. అక్క‌నేని వంశంలోని మూడు త‌రాల హీరోలు క‌లిసి న‌టించిన‌ 'మ‌నం' మూవీకి ఇచ్చిన సంగీతంతో అనూప్ రేంజ్ ఇంకో లెవ‌ల్‌కు చేరింది.

సూర్య‌-జ్యోతిక ల‌వ్ స్టోరీ గురించి మీకెంత తెలుసు?

  అత‌ను యువ‌త‌రం హృద‌య స్పంద‌న అయితే, ఆమె త‌న అందం, అభిన‌యంతో వెండితెర‌ను శాసించిన తార‌. అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు అచ్చ‌మైన ఉదాహ‌ర‌ణ సూర్య‌, జ్యోతిక క‌థ‌. ఆనంద‌క‌ర‌మైన వైవాహిక జీవితానికి ప్రేమ ఒక్క‌టే చాలున‌ని వారు నిరూపించారు. పెళ్ల‌యి 15 సంవ‌త్స‌రాలు గ‌డిచినా, ఆ జంట త‌మ అనురాగంతో అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉన్నారు. సీనియ‌ర్ త‌మిళ న‌టుడు శివ‌కుమార్ కుమారుడైన సూర్య అస‌లు పేరు శ‌ర‌వ‌ణ‌న్‌. తెర‌పేరును సూర్య‌గా మార్చుకొని సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన స్టార్ల‌లో ఒక‌డిగా ఎదిగాడు. అంత‌ర్ముఖుడిగా, అత్యంత విన‌య‌శీలిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నాడు. 22 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'నెర్రుక్కు నేర్' సినిమాతో ప‌రిచ‌య‌మ‌య్యాడు. మొద‌ట్లో అత‌నికి స‌రైన విజ‌యాలు ద‌క్క‌లేదు. 1999లో 'పూవెల్ల‌మ్ కెట్టుప్పార్' సినిమాలో న‌టించేప్పుడు సూర్య, జ్యోతికి తొలిసారి ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్ప‌టికి ఇద్ద‌రిలో ఎవ‌రూ పెద్ద పేరున్న‌వాళ్లు కాదు. జ్యోతిక ముంబై నుంచి వ‌చ్చింది. త‌మిళం ఒక్క ముక్క రాక‌పోవ‌డంతో ఆ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న ముద్ర‌వేయ‌డానికి ఆమె చాలా క‌ష్ట‌ప‌డింది. వ‌ర్క్ విష‌యంలో ఆమె డెడికేష‌న్‌, ఆమె డైలాగ్ డెలివ‌రీ సూర్య‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ప‌ని విష‌యంలో ఆమె సిన్సియారిటీ, స‌హ న‌టుల‌తో ఆమె ప్ర‌వ‌ర్తించే తీరు ఆక‌ర్షించాయి. 2001లో ఒక సినిమా షూటింగ్‌లో ఉన్న జ్యోతిక‌, అటువైపు వెళ్తున్న సూర్య‌ను చూసి, అత‌డిని పిల‌వ‌మంటూ త‌న అసిస్టెంట్‌కు పుర‌మాయించింది. అలా వాళ్లిద్ద‌రూ రెండోసారి క‌లుసుకున్నారు. క్ర‌మంగా ఇద్ద‌రూ స్నేహితుల‌య్యారు. ఆ త‌ర్వాత త‌ను వెళ్లే పార్టీల‌కు జ్యోతిక‌ను కూడా పిలుస్తూ వ‌చ్చాడు సూర్య‌. త‌న క్లోజ్ ఫ్రెండ్స్‌కు ఆమెను ప‌రిచ‌యం చేశాడు. 2001లో సూర్య టైటిల్ రోల్ చేసిన 'నందా' ఫిల్మ్ ప్రీమియ‌ర్‌కు అటెండ్ అయిన జ్యోతిక‌కు, అత‌ని ప‌ర్ఫార్మెన్స్ బాగా న‌చ్చింది. 'కాక్క కాక్క' (2003) మూవీలో హీరోయిన్‌గా డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ త‌న‌ను ఎంపిక చేసినప్పుడు, హీరో క్యారెక్ట‌ర్‌కు సూర్య బాగుంటాడ‌ని రిక‌మెండ్ చేసింది జ్యోతిక‌. ఆ సినిమాలో చేసే టైమ్‌లోనే త‌మ మ‌ధ్య ప్రేమ‌బంధం పెన‌వేసుకుంటోంద‌నే విష‌యం ఇద్ద‌రూ గ్ర‌హించారు. ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.  అయితే ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని సూర్య‌ ఇంట్లో చెప్పిన‌ప్పుడు తండ్రి శివ‌కుమార్ వెంట‌నే అంగీక‌రించ‌లేదు. ఆయ‌న క‌న్విన్స్ అవ‌డానికి కొంత టైమ్ ప‌ట్టింది. చివ‌ర‌కు త‌ల్లితండ్రులు స‌రేన‌న‌డంతో సింపుల్‌గా వారి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. 2006 సెప్టెంబ‌ర్ 11న సూర్య‌, జ్యోతిక జీవిత భాగ‌స్వాములుగా మారారు. ఆ వివాహ వేడుక‌కు త‌మిళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేరుపొందిన తార‌లంతా హాజ‌ర‌య్యారు.  పెళ్లి త‌ర్వాత ముంబై నుంచి చెన్నైకు వ‌చ్చేసిన జ్యోతిక న‌ట‌న‌ను విడిచిపెట్టింది. ఫ్యామిలీకే స‌మ‌యాన్నంతా వెచ్చించింది. 2007లో వారి జీవితాల్లోకి లిటిల్ ఏంజెల్ దియా వ‌చ్చింది. 2010లో కొడుకు దేవ్ పుట్టాడు. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, భార్యాపిల్ల‌ల కోసం త‌న డేట్స్‌ను అడ్జ‌స్ట్ చేసుకుంటూ, వారితో క్వాలిటీ టైమ్ గ‌డుపుతూ వ‌స్తున్నాడు సూర్య‌. పిల్ల‌లు కాస్త ఎదిగిన త‌ర్వాత తిరిగి కెమెరా ముందుకు వ‌చ్చింది జ్యోతిక‌. 2015లో '36 వ‌య‌దినిలే' సినిమాతో న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ సినిమాని సూర్య స్వ‌యంగా నిర్మించాడు. పర‌స్ప‌ర ప్రేమ‌, అనురాగం, గౌర‌వంతో నిజ‌మైన ప్రేమ ఎన్న‌టికీ నిలిచి వుంటుంద‌ని సూర్య‌-జ్యోతిక నిరూపిస్తున్నారు. 

షూటింగ్‌కు వెళ్ల‌డానికి ముందే డైలాగ్స్ అన్నీ త‌న స్టైల్లో చెప్పిన ఎన్టీఆర్‌!

  ఒక గ్రీన్ క‌ల‌ర్ మోరిస్ మైన‌ర్ కారు కోడంబాకం హైరోడ్డులోని ఒక ఇంటి గుమ్మానికి కొంచెం దూరంగా ఆగింది. డ్రైవ‌ర్ సీట్లోంచి ఒక అంద‌మైన యువ‌కుడు దిగాడు. తెలుగుత‌నం ఉట్టిప‌డేలా పంచెకట్టు, లాల్చీ, చేతిలో ఓ ఫైలు ప‌ట్టుకొని, కారు డోర్ తాళంవేసి, ముందుకు న‌డిచి, ఆ ఇంటి గేటువేపు క‌దిలాడు. ఆ ఇంటి ముందు ఎడ‌మ ప‌క్క‌నున్న ఓ ప‌ర్ణ‌శాల‌లోకి అడుగుపెట్టాడు. "ప‌ప్పాజీ ఉన్నారా?" అన‌డిగాడు. "ఉన్నారు. కూర్చోండి." అని ఆయ‌న‌ను కూర్చోబెట్టి, లోనికి వెళ్లాడు అక్క‌డి ఆఫీస్ ఇన్‌చార్జ్‌. కొంచెం సేప‌య్యాక 'ప‌ప్పాజీ' వ‌చ్చారు. ఆయ‌న‌తో పాటు 'స్వామీజీ' కూడా వ‌చ్చారు. ప‌ప్పాజీ అంటే తెలుగుసినిమా పితామ‌హుడు హెచ్‌.ఎం. రెడ్డి. స్వామీజీ అంటే ఆయ‌న అభిమాన పుత్రుడు వై.ఆర్‌. స్వామి, 'వ‌ద్దంటే' డ‌బ్బు చిత్ర ద‌ర్శ‌కుడు. ఆ వ‌చ్చిన అంద‌గాడు నంద‌మూరి తార‌క‌రామారావు. విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ వారి సినిమాల్లో మాత్ర‌మే న‌టించాల‌న్న అగ్రిమెంట్ పూర్త‌యిన త‌ర్వాత‌, ఇత‌ర నిర్మాత‌ల చిత్రాల్లో న‌టించ‌డానికి ఆయ‌న ఒప్పుకున్న చిత్రాల్లో ఒక‌టి.. 'వ‌ద్దంటే డ‌బ్బు'. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి డైలాగ్స్ ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఫైలులో ఉన్నాయి. ఆ డైలాగ్స్ రాసింది స‌దాశివ బ్ర‌హ్మం. అక్క‌డున్న ఆఫీసు సిబ్బందిని అంద‌రినీ పేరుపేరునా అడిగి ప‌రిచ‌యం చేసుకున్నారు ఎన్టీఆర్‌. కొంచెంసేపు పిచ్చాపాటీ అయిన త‌ర్వాత‌, ప‌ప్పాజీ! మీరు పంపిన స్క్రిప్టు పూర్తిగా, క్షుణ్ణంగా చ‌దివాను. కాసేపు మీరు ఉంటానంటే నా సంభాష‌ణ‌లు అన్నీ నా ఫ‌క్కీలో మీకు వినిపిస్తాను, ఆ త‌ర్వాత మీ ఇష్ట‌ప్ర‌కారం మార్పులు చేసుకోవ‌చ్చు అన్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న డైలాగ్స్‌ను పూర్తిగా న‌టిస్తూ వినిపించారు. సాయంత్రం 6 గంట‌ల నుంచి మొద‌లుకొని రాత్రి 2 గంట‌ల దాకా ఆ సినిమా షూటింగ్‌ 30 రోజులు జ‌రిగింది. ఔట్‌డోర్ సీన్లు మాత్ర‌మే ప‌గ‌టి పూట చిత్రీక‌రించారు. షూటింగ్‌కు ముందు ఎన్టీఆర్ ఇలా సినిమాలోని త‌న డైలాగ్స్ అన్నింటినీ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వినిపించార‌ని చెబితే ఇప్ప‌టి యాక్ట‌ర్లు కానీ, డైరెక్ట‌ర్లు కానీ న‌మ్మ‌రు. కానీ అది నిజం!

సుమ‌న్ గురించి మీకు తెలీని చిన్న‌ప్ప‌టి నిజాలు!

  సుమ‌న్ వాళ్ల‌మ్మ వృత్తిరీత్యా కాలేజీ లెక్చ‌ర‌ర్‌. చిన్న‌త‌నంలో సుమ‌న్‌ను ఆవిడ చాలా క‌ట్టుదిట్టంగా పెంచారు. ఆయ‌న‌ను ఒంట‌రిగా ఎక్క‌డ‌కూ పంపించేవారు కాదు. ఆమె అంటే సుమ‌న్ కూడా బాగా భ‌య‌ప‌డేవారు. బ‌య‌ట పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకోవాల‌న్న స‌ర‌దా ఆయ‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ అమ్మ ఎక్క‌డ కొడుతుందోన‌నే భ‌యంతో ఆయ‌న కూడా బ‌య‌ట‌కు వెళ్లేవాడు కాదు. సుమ‌న్ మ‌ద్రాసులోనే చ‌దువుకున్నారు. మొద‌ట అక్క‌డి చ‌ర్చ్‌పాక్ కాన్వెంట్‌లో చేరారు. ఫ‌స్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా అక్క‌డే చ‌దువుకున్నారు. ఈయ‌న ఆ కాన్వెంట్‌లో చేరిన‌ప్పుడు త‌ర్వాత కాలంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి, త‌లైవిగా ఖ్యాతిపొందిన జ‌య‌ల‌లిత టెన్త్ క్లాస్ చ‌దువుతున్నారు.  సుమ‌న్‌ను డాక్ట‌ర్‌ను చెయ్యాల‌ని వాళ్ల‌మ్మ క‌ల‌. సుమ‌న్‌కేమో పైల‌ట్ అవ్వాల‌ని ఉండేది. అయితే ఆ ఇద్ద‌రి ఊహ‌లూ తారుమారై ఆయ‌న న‌టుడ‌య్యారు. చిన్న‌ప్ప‌ట్నుంచీ సుమ‌న్‌కు పెయింటింగ్ మీద విప‌రీత‌మైన ఆస‌క్తి ఉండేది. అది గ‌మ‌నించి వాళ్ల‌మ్మ ఆయ‌న‌ను సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా మ‌ద్రాస్‌లోని బీసెంట్ థియోసాఫిక‌ల్ హైస్కూల్ (క‌ళాక్షేత్ర‌)లో చ‌దివించారు. అక్క‌డ సుమ‌న్ పెయింటింగ్‌లో శిక్ష‌ణ పొంద‌డ‌మే కాకుండా, వ‌రుస‌గా నాలుగేళ్ల‌పాటు ప్ర‌తి సంవ‌త్స‌రం క‌ళాక్షేత్ర వాళ్లు నిర్వ‌హించే వైల్డ్ లైఫ్ పెయింటింగ్ కాంపిటిష‌న్‌లో ఫ‌స్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డే వీణ‌, గిటార్ వాయిద్యాలు కూడా నేర్చుకున్నారు.  క‌ళాక్షేత్ర‌లో తొమ్మిదో క్లాస్ పాస‌య్యాక, రామ‌కృష్ణా హైస్కూల్‌లో ఎస్ఎస్ఎల్‌సీ చ‌దివారు. ఆ త‌ర్వాత ప‌చ్చ‌య‌ప్ప కాలేజీలో పీయూసీ, బీఏ (లిట‌రేచ‌ర్‌) పూర్తి చేశారు. ప‌చ్చ‌య‌ప్ప కాలేజీ అంటే అప్ప‌ట్లో అల్ల‌రి స్టూడెంట్స్‌కు బాగా పేరుపొందిన కాలేజీ. ఆ కాలేజీలో అడుగుపెట్టిన‌ప్పుడు సీనియ‌ర్ స్టూడెంట్స్ కొంత‌మంది ఆయ‌న చుట్టూ మూగి, రాగింగ్ పేరుతో ష‌ర్ట్ తీసేసి, ప్యాంట్‌తో బొమ్మ‌లాగా నిల్చొని స‌లాం చెయ్య‌మ‌న్నారు. సుమ‌న్ బిక్క‌చ‌చ్చిపోయారు. కొంచెం కోపం కూడా వ‌చ్చింది. అయినా వాళ్లు చెప్పిన‌ట్లు చెయ్య‌క‌పోతే, ప్యాంట్ కూడా తీసేసి అండ‌ర్‌వేర్‌తో ఎక్క‌డ నడ‌వ‌మంటారోన‌ని భ‌య‌ప‌డి, ష‌ర్ట్ తీసేసి స‌లాం కొట్టారు.  ఇది జ‌రిగిన ఐదు రోజుల‌కు సుమ‌న్ స్కూల్‌మేట్స్ న‌ల‌భై మంది అదే కాలేజీలో చేరారు. వాళ్లంతా బ‌లంగా ఉండేవారే. వాళ్ల‌తో సుమ‌న్ త‌న‌ను సీనియ‌ర్స్‌ ర్యాంగింగ్ చేసిన విష‌యం చెప్పారు. అప్ప‌డు అంద‌రూ క‌లిసి ఒక్క‌టై సుమ‌న్‌ను ర్యాగింగ్ చేసిన సీనియ‌ర్ స్టూడెంట్స్‌ను అల్ల‌రి చేశారు. దాంతో సీనియ‌ర్స్ కాళ్ల బేరానికి వ‌చ్చి సుమ‌న్ బ్యాచ్‌తో స్నేహం చేశారు!

జ‌య‌ల‌లిత, జ‌మున మ‌ధ్య గొడ‌వేంటి?

  అల‌నాటి న‌టీమ‌ణులు జ‌మున‌, జ‌య‌ల‌లిత‌.. ఇద్ద‌రికి ఇద్ద‌రూ అభిమాన‌వంతులుగా పేరు పొందిన‌వాళ్లే. ఆత్మాభిమానం విష‌యంలో అంత త్వ‌ర‌గా వారు రాజీప‌డ‌రు. అందువ‌ల్లే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు జ‌మున‌తో అప్ప‌టి అగ్ర హీరోలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కొంత కాలంపాటు న‌టించ‌లేదు. ఆ విష‌యం అలా ఉంచితే, ఒక సంద‌ర్భంలో జ‌య‌ల‌లిత‌తో జ‌మున‌కు గొడ‌వ వ‌చ్చింది. ఆ సంద‌ర్భం.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన 'శ్రీ‌కృష్ణ విజ‌యం' (1971) సినిమా సెట్స్ మీద సంభ‌వించింది.  క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు డైరెక్ట్ చేసిన 'శ్రీ‌కృష్ణ విజ‌యం'లో శ్రీ‌కృష్ణునిగా నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించ‌గా, హీరోయిన్ వ‌సుంధ‌ర పాత్ర‌లో జ‌య‌ల‌లిత‌, స‌త్య‌భామ పాత్ర‌లో జ‌మున న‌టించారు. కౌముది ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మ‌ల్లెమాల సుంద‌ర‌రామిరెడ్డి (ఎం.ఎస్‌. రెడ్డి) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక‌రోజు జ‌య‌ల‌లిత‌, జ‌మున‌కు డైరెక్ట‌ర్ కామేశ్వ‌ర‌రావు రిహార్స‌ల్స్ నిర్వ‌హించారు. మొద‌ట జ‌య‌ల‌లిత డైలాగ్ చెబితే, త‌ర్వాత దానికి స‌మాధానంగా జ‌మున డైలాగ్ చెప్పాలి. అందుక‌ని జ‌య‌ల‌లిత‌ను డైలాగ్ చెప్ప‌మ‌న్నారు జ‌మున‌. ఆమె "నేనెందుకు చెప్పాలి?  మీరే చేసుకోండి" అని నిర్ల‌క్ష్యంగా జ‌వాబిచ్చారు. జ‌మున‌కు కోపం వ‌చ్చింది. "ఏంటండీ డైరెక్ట‌ర్ గారూ.. ఆ అమ్మాయి డైలాగ్ చెప్ప‌క‌పోతే, నేనెట్లా రిహార్స‌ల్ చెయ్య‌ను. ఆమె చెప్పాలి క‌దా?" అని అడిగారు జ‌మున‌. ఆయ‌న ఏం మాట్లాడ‌లేదు.  జ‌మున విసురుగా త‌న మేక‌ప్‌రూమ్‌లోకి వెళ్లిపోయారు. జ‌య‌ల‌లిత అక్క‌డే కూర్చున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇద్ద‌రూ జ‌మున ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఆరోజు షూటింగ్ చేయ‌కుండా వెళ్లిపోవాల‌ని మేక‌ప్ తీసేయ‌డానికి రెడీ అయ్యారు జ‌మున‌. ఆ ఇద్ద‌రూ ఆమెకు స‌ర్దిచెప్పి, ఎలాగో ఉంచేశారు. ఈ ఉదంతాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించారు జ‌మున‌. ఆ త‌ర్వాత కాలంలో తాను, జ‌య‌ల‌లిత స‌న్నిహిత స్నేహితుల‌మ‌య్యామ‌ని కూడా ఆమె చెప్పారు.

ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక పార్తీప‌న్‌-సీత ఒక అనాథ బాలుడ్ని ద‌త్త‌త తీసుకున్నార‌ని తెలుసా?

  తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన న‌టి సీత త‌మిళ ద‌ర్శ‌కుడు-న‌టుడు ఆర్‌. పార్తీప‌న్‌ను వివాహం చేసుకున్నార‌ని చాలా మందికి తెలుసు. 1990లో పెళ్లాడిన ఆ ఇద్ద‌రూ ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత 2001లో విడిపోయారు. అప్ప‌ట్నుంచీ పార్తీప‌న్ ఒంటరిగానే ఉంటున్నారు. సీత మాత్రం టీవీ న‌టుడు స‌తీశ్‌ను 2010లో రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. 2016లో స‌తీశ్‌కు కూడా సీత విడాకులిచ్చేశారు. ఆ విష‌యం అలా ఉంచితే కె. భాగ్య‌రాజా శిష్యుడైన‌ పార్తీప‌న్ పుదియ పాదై (1989) అనే మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమాలో పార్తీప‌న్‌, సీత జంట‌గా న‌టించారు. ఒక అనాథ బాలుడు నేటి స‌మాజంలో ఎన్ని అవ‌స్థ‌లు పడుతూ జీవించాల్సి వ‌స్తుందో, అనాథ‌ను స‌మాజం ఎంత‌గా నిరాద‌రిస్తుందో ఆ సినిమాలో ద‌య‌నీయంగా చూపించారు పార్తీప‌న్‌.  ఆ సినిమా విజ‌యోత్స‌వంలో పార్తీప‌న్ "నేను తీసిన సినిమాలో చెప్పిన సందేశాన్ని ఆచ‌రించి చూపిస్తాను. ఒక అనాథ శిశువును ద‌త్త‌త తీసుకొని పెంచుతాను" అని ప్ర‌మాణం చేశారు. సీత‌తో పెళ్ల‌య్యాక వారికి కీర్త‌, అభిన‌య అనే ఇద్ద‌రు కూతుళ్లు పుట్టారు. అయితే తాను 'పుదియ పాదై' విజ‌యోత్స‌వంలో చేసిన ప్ర‌మాణాన్ని పార్తీప‌న్ మ‌ర్చిపోలేదు. సీత అనుమ‌తితో చెన్నైలోని 'ఉద‌వుక్క‌రంగ‌ళ్' అనే ఆశ్ర‌మంలోని అనాథ బాలుడ్ని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరు రాధాకృష్ణ‌న్ అని పెట్టారు.  ఇలా అనాథ శిశువుల‌ను స్థోమ‌త ఉన్న‌వారంద‌రూ ద‌త్త‌త తీసుకుని వాళ్ల జీవితాల్లో కొత్త కాంతులు ప్ర‌స‌రింప‌జేయాల‌ని, తాము చెయ్య‌ని త‌ప్పుకు శిక్ష అనుభ‌విస్తున్నామ‌నే బాధ ఆ చిన్నారుల్లో క‌ల‌గ‌నీయ‌రాద‌ని పార్తీప‌న్ ఉద్దేశం. ఈ విష‌యం అంద‌రి దృష్టికీ రావ‌డానికి ఆ పిల్లాడి నామ‌క‌ర‌ణోత్స‌వాన్ని చెన్నైలోని మ్యూజియం థియేట‌ర్‌లో ఒక బ‌హిరంగ స‌భ‌లో ఏర్పాటు చేశారు. రాధాకృష్ణ‌న్ మొద‌టి పుట్టిన‌రోజు పండుగ‌ని, ద‌త్త‌త స్వీకార మ‌హోత్స‌వాన్ని ఏర్పాటుచేసి, త‌న భావాల‌ను వివ‌రించారు. ఆ స‌భ‌లో గాన‌కోకిల పి. సుశీల ప్రార్థ‌నా గీతం ఆల‌పించ‌గా, సీత స్వాగ‌త వ‌చ‌నాలు చెప్పారు. సీత‌తో విడిపోయాక పార్తీప‌న్ ముగ్గురు పిల్ల‌ల్నీ త‌నే పెంచుతూ వ‌చ్చారు. కీర్త‌న‌, అభిన‌య‌ల‌కు పెళ్లిళ్లు చేశారు. రాధాకృష్ణ‌న్ అలియాస్ రాఖీ తండ్రి ద‌గ్గ‌రే ఉండిపోయాడు. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్నాడు.

50 వ‌సంతాల‌ కౌబాయ్ క్లాసిక్ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'

  టెక్నిక‌ల్‌గా తెలుగు సినిమా సాధించిన ప‌లు ఘ‌న‌త‌ల్లో, తిరిగిన‌ ప‌లు మ‌లుపుల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఉన్నారు. అలాంటి మ‌లుపే 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'. ఆ సినిమా విడుద‌లై ఆగ‌స్ట్ 27కు స‌రిగ్గా 50 సంవ‌త్స‌రాలు. అంటే 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' స్వ‌ర్ణోత్స‌వం జ‌రుపుకుంటోంద‌న్న మాట‌. ఈ సినిమాతో తెలుగు సినిమాని సాంకేతికంగా ఇంకో అడుగు ముందుకు వేయించారు కృష్ణ‌. కౌబాయ్‌కీ, ఇండియాకీ అస‌లు సంబంధ‌మే లేదు. అయినా కౌబాయ్ తెలుగువాడే అన్న‌ట్లుగా ప్రేక్ష‌కుల్ని భ్ర‌మింప‌జేసి, ఘ‌న‌విజ‌యం సాధించారు. కౌబాయ్ అనేవాడు నార్త్ అమెరికాకు సంబంధించిన‌వాడు. అందుకే హాలీవుడ్‌లో అనేక కౌబాయ్ సినిమాలు వ‌చ్చి అల‌రించాయి. కౌబాయ్‌గా హాలీవుడ్ సూప‌ర్‌స్టార్ క్లింట్ ఈస్ట్‌వుడ్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా రంజింప‌చేశారో చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌సారి కృష్ణ‌కు ఆ త‌ర‌హా కౌబాయ్ క్యారెక్ట‌ర్ చెయ్యాలన్న కోరిక క‌లిగింది. క్రైమ్ స‌బ్జెక్టులు త‌యారుచేయ‌డంలో దిట్ట అయిన ఆరుద్ర ఆ క‌థ‌ను రాసే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. క్లింట్ ఈస్ట్‌వుడ్ న‌టించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' స‌హా కొన్ని కౌబాయ్ సినిమాలు చూసి, వాటి స్ఫూర్తితో స‌రికొత్త‌గా, మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లు క‌థ‌ను త‌యారుచేశారు ఆరుద్ర‌. ఇది ఏ సినిమాకీ కాపీ కాదు, ఒరిజిన‌లే అన్నంత‌గా ఆ క‌థ వ‌చ్చిందంటే ఆరుద్ర ప్ర‌తిభ అది. ఆ క‌థ కృష్ణ‌తో పాటు ఆయ‌న త‌మ్ముళ్లు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావుల‌కూ బాగా న‌చ్చింది. ఆరుద్ర‌నే ఆ సినిమాని డైరెక్ట్ చెయ్య‌మ‌ని కోరారు కృష్ణ‌. కానీ ర‌చ‌యిత‌గా బాగా బిజీగా ఉండే ఆయ‌న ఆ ప‌ని చేయ‌లేన‌న్నారు. దాంతో యాక్ష‌న్ సినిమాల డైరెక్ట‌ర్‌గా పేరుగాంచిన కె.ఎస్‌.ఆర్‌. దాస్‌కు ఈ సినిమా డైరెక్ష‌న్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. కృష్ణ‌. అప్ప‌టికే వారి కాంబినేష‌న్‌లో మూడు సినిమాలు వ‌చ్చాయి. ఇది నాలుగో సినిమా. ఆరుద్ర ఈ స్క్రిప్టుకు పెట్టిన టైటిల్ 'అదృష్ట‌రేఖ‌'. కానీ టైటిల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండాల‌నే ఉద్దేశంతో 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'గా మార్చారు. కె.ఎస్‌.ఆర్‌. దాస్ ఈ సినిమాని కృష్ణ ఊహించిన దానికి మించి గొప్ప‌గా రూపొందించార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కృష్ణ స‌ర‌స‌న నాయిక‌గా విజ‌య‌నిర్మ‌ల న‌టించ‌గా, నాగ‌భూష‌ణం, స‌త్య‌నారాయ‌ణ‌, జ్యోతిల‌క్ష్మి, ప్ర‌భాక‌ర‌రెడ్డి, త్యాగ‌రాజు, రావు గోపాల‌రావు, జ‌గ్గారావు, ఆనంద్ మోహ‌న్‌, రామ‌దాసు, సాక్షి రంగారావు, కాక‌రాల లాంటి ఉద్ధండులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు చేశారు. 1971 జ‌న‌వ‌రి 9న మ‌ద్రాసులోని వాహినీ స్టూడియోలో 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' షూటింగ్ మొద‌లైంది. ప్ర‌ముఖ నిర్మాత డూండీ కెమెరా స్విచ్చాన్ చేస్తే, కృష్ణ‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన దిగ్ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు క్లాప్ కొట్టారు. రూ. 7 ల‌క్ష‌ల భారీ వ్య‌యంతో (ఆ రోజుల్లో) ఈ సినిమాని నిర్మించారు. ప‌ద్మాల‌యా బ్యాన‌ర్ మీద నిర్మాణ‌మైన రెండో సినిమా ఇది. రాజ‌స్థాన్‌లోని థార్ ఎడార్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. కేవ‌లం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేయ‌డం కృష్ణ సోద‌రుల ప్లానింగ్‌కు నిద‌ర్శ‌నం. 1971 ఆగ‌స్ట్ 27న విడుద‌లైన భార‌త‌దేశ‌పు తొలి కౌబాయ్ ఫిల్మ్‌ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' విజ‌య దుందుభి మోగించింది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. కృష్ణ కెరీర్‌లో రూ. 50 ల‌క్ష‌లు పైగా క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన మొద‌టి సినిమా ఇదే. దాంతో ఇండియన్ కౌబాయ్‌గా కృష్ణ పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు. తెలుగులో 14 వేల అడుగుల‌తో ఈ సినిమా విడుద‌ల కాగా, దాన్ని 9 వేల అడుగుల‌కు కుదించి, 'ద‌ ట్రెజ‌ర్ హంట్' పేరుతో ఇంగ్లిష్‌లో డ‌బ్ చేయించారు కృష్ణ‌. తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి డ‌బ్ అయిన తొలి తెలుగు సినిమా 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'. దాన్ని ఏకంగా 125 దేశాల్లో రిలీజ్ చేస్తే, అత్య‌ధిక దేశాల్లో స‌క్సెస్ అయ్యింది.  ఒక తెలుగు సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ మాత్ర‌మే కాదు, ఒక ఇండియ‌న్ ఫిల్మ్ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఇన్ని దేశాల్లో రిలీజ‌వ‌డం రికార్డ్‌. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఇన్ని దేశాల్లో రిలీజైన ఇండియ‌న్ డ‌బ్బింగ్ ఫిల్మ్ అదొక్క‌టే. ఈ సినిమా ఘ‌న విజ‌యంలో సినిమాటోగ్రాఫ‌ర్ వి.ఎస్‌.ఆర్‌. స్వామి పాత్ర ఎంతో ఉంది. సినిమా మొత్తాన్ని బ్యాక్‌లైట్‌లోనే ఆయ‌న చిత్రీక‌రించారు. విడుద‌ల‌కు ముందు ఈ సినిమా ప్రివ్యూ వేసిన‌ప్పుడు ఎన్టీఆర్ చూసి, కృష్ణ‌ను ప్ర‌శంసిస్తూ ఏకంగా ఒక లేఖ రాశారు. "సోదరుడు శ్రీ కృష్ణ తీసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా చూశాను.. ఎంతో ప్రయాసకులోనై విశిష్టమైన సాంకేతిక విలువతో, ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం, పట్టుదల ప్రతి షాటులోనూ, ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రమా అనిపించింది. ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రాహణము.. ఇంత మ‌నోజ్ఞంగా ఉన్నత ప్రమాణంలో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినందనీయుడు. కథకు అనుగుణమైన వేగంతో దర్శకత్వం నిర్వహించిన శ్రీ దాస్‌ ప్రశంసాపాత్రుడు. ఇంత సాంకేతిక విలువలతో జాతీయత.. మన సాంఘిక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావపూరితములైన మహత్తర కళాఖండాలను అభిమానులకు శ్రీ కృష్ణ అందించగలరని ఆశిస్తూ.. సాహసోపేతమైన యీ చిత్ర నిర్మాణ కృషికి అతన్ని అభినందిస్తున్నాను. అని అందులో రాసుకొచ్చారు ఎన్టీ రామారావు. హిందీలో ఈ సినిమా 'గ‌న్‌ఫైట‌ర్ జానీ' పేరుతో, త‌మిళంలో 'మోస‌క్కార‌నుక్కు మోస‌కార‌న్' పేరుతో రిలీజై స‌క్సెస్ సాధించింది. 'గ‌న్‌ఫైట‌ర్ జానీ' క‌ల‌క‌త్తా, పంజాబ్‌ల‌లోనూ బాగా ఆడింది. క‌ల‌క‌త్తాలో అయితే 20 ప్రింట్ల‌తో విడుద‌ల‌యింది. ఇలాంటి ఎన్నో విశేషాలు, ప్ర‌త్యేక‌త‌లు ఉన్న 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' కేవ‌లం కృష్ణ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనూ మైలురాయిగా నిలిచింది. తెలుగువాడు తీసిన సినిమాగా గ‌ర్వంగా చెప్పుకొనే వాటిలో ఒక‌టిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించింది. - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

అంజ‌లికి సీత పాత్ర తెచ్చిన తంటా!

  వెంక‌టేశ్‌, మ‌హేశ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న నాయిక‌గా స‌మంత న‌టిస్తే, వెంక‌టేశ్ జోడీగా అంజ‌లి క‌నిపించింది. నిజానికి టైటిల్‌లోని సీత పాత్రధారిణి ఆమే. అందులో ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయిగా సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చీర‌క‌ట్టులోనే సినిమా అంతా క‌నిపిస్తుంది అంజ‌లి. ఆ పాత్ర ఆమెకు చాలా పెద్ద పేరు తెచ్చింది. 'ఎంత చ‌క్క‌గా, ఒద్దిక‌గా ఉంది ఈ అమ్మాయి!' అని అంద‌రూ ముచ్చ‌ట‌ప‌డిపోయారు.  ఆ త‌ర్వాత ఆమె కొన్ని సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో కుర‌చ దుస్తుల్లో వేసిన డాన్సులు చేసి ఆశ్చ‌ర్య‌పోయిన వారెంద‌రో! ఆ సినిమా అంత ముచ్చ‌ట‌గా క‌నిపించిన ఆ అమ్మాయి ఇలాంటి డ్ర‌స్సుల్లో, ఇలాంటి పాట‌ల్లో చేసిందేమిటి అన్న‌వాళ్లున్నారు. ఇమేజ్ అనేది ఎలాంటి ఇబ్బంది తెస్తుందో అంజ‌లి కూడా స్వ‌యంగా ఎక్స్‌పీరియెన్స్ చేసింది. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' సినిమా చేసిన త‌ర్వాత ఆమె ఒక‌సారి ఫిజియో థెర‌పీ కోస‌మ‌ని వెళ్లింది. అప్పుడు అంజ‌లి డెనిమ్‌, జీన్స్‌లో ఉంది. అక్క‌డ‌ ఆమెను చూసిన ఓ న‌ర్సు చిరాకుప‌డుతున్న‌ట్లుగా బిహేవ్ చేసింది. "ఏమిట‌మ్మా నామీద కోపం చూపిస్తున్నావు?" అన‌డిగింది అంజ‌లి.  "మా అత్త‌య్య‌గారు మిమ్మ‌ల్ని 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' సినిమాలో చూసి ఏమ‌న్నారో తెలుసా? 'చ‌క్క‌గా ఆ అమ్మాయి ఇంత పొడ‌వు జ‌డ‌, పువ్వులు, చీర క‌ట్టుకొని ఎంత బాగుందో చూడు.' అని. ఆమెను తీసుకొచ్చి మిమ్మ‌ల్ని చూపిద్దామ‌నుకున్నాను." అని చెప్పింది ఆ న‌ర్సు.  ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకుంది అంజ‌లి. అయితే అలా త‌న పాత్ర‌కు క‌నెక్ట‌యి, దాన్ని సొంతం చేసుకోవ‌డ‌మ‌నేది ఆశీస్సుల లాంటివేన‌ని ఆమె చెప్పింది.

'రైతుబిడ్డ‌'పై బ్రిటీష్ వాళ్లు విధించిన నిషేధం స్వాతంత్ర్యానంత‌రం కూడా కొన‌సాగింది!

  1939లో మొదటిసారి విడుదలైన గూడవల్లి రామబ్రహ్మం చిత్రం 'రైతుబిడ్డ' నిషేధానికి గురయ్యింది. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఈ చిత్రాన్ని అప్పుడు నిషేధించారు. అయితే స్వతంత్రం వచ్చాక కూడా కృష్ణాజిల్లాలో ఈ సినిమాపై నిషేధం కొనసాగడం శోచనీయం. 1947 నవంబర్‌లో ఉయ్యూరులోని శ్రీ ఏకాంబరేశ్వర పిక్చర్ ప్యాలెస్ యజమాని అప్పటి కృష్ణా జిల్లా కెలెక్టర్ వద్దకు వెళ్లి 'రైతుబిడ్డ' సినిమాని ప్రదర్శించడానికి అనుమతి కోరాడు. 'రైతుబిడ్డ'పై ఇంకా నిషేధం ఉంది కాబట్టి దాన్ని ప్రదర్శించేందుకు వీలు లేదని కలెక్టర్ ఖరాఖండీగా చెప్పారు.  జమీందారుల పాలన కింద రైతుబిడ్డలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు  చూపించారు డైరెక్ట‌ర్ రామబ్రహ్మం. దేశానికి స్వతంత్రం వచ్చినా, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా, అప్పటికే జమీందారీ వ్యవస్థ రద్దవడానికి ఏర్పాట్లు జరుగుతున్నా, 'రైతుబిడ్డ'లాంటి అభ్యుదయ సినిమాపై బ్రిటీష్ కాలంలో పెట్టిన నిషేధాన్ని వెంటనే తొలగించకపోవడం మన బానిస మనస్తత్వానికి నిదర్శనమూ, సిగ్గుచేటు విషయంగా అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎప్పటికో ఆ నిషేధాన్ని తొలగించారు. ఏదేమైనా నిషేధానికి గురైన మొట్టమొదటి తెలుగు సినిమాగా 'రైతుబిడ్డ' చరిత్రపుటల్లో చోటు దక్కించుకుంది. బ‌ళ్లారి రాఘ‌వాచార్య‌, ప‌ద్మావ‌తీదేవి, చెరుకుప‌ల్లి ఎల్లాప్ర‌గ‌డ నెహ్రూ, సుంద‌ర‌మ్మ‌, గిడుగు వెంక‌ట సీతాప‌తిరావు, టంగుటూరి సూర్య‌కుమారి, కొస‌రాజు రాఘ‌వ‌య్య చౌద‌రి, గంగార‌త్నం, నెల్లూరు నాగ‌రాజారావు, భీమ‌వ‌ర‌పు న‌ర‌సింహారావు, ఎం.సి. రాఘ‌వ‌న్‌, పి. సూరిబాబు లాంటి అప్ప‌టి ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల న‌టులు న‌టించిన ఈ మూవీకి తాపీ ధ‌ర్మారావు, త్రిపుర‌నేని గోపీచంద్‌, మ‌ల్లాది విశ్వ‌నాథ క‌విరాజు సంభాష‌ణ‌లు రాశారు. బ‌స‌వ‌రాజు అప్పారావు, స‌ముద్రాల రాఘ‌వాచార్య‌, కొస‌రాజు, తుమ్మ‌ల సీతారామ‌మూర్తి, నెల్లూరు వెంక‌ట‌రామానాయుడు, గూడ‌వ‌ల్లి రామ‌బ్ర‌హ్మం, తాపీ ధ‌ర్మారావు రాసిన పాట‌ల‌కు భీమ‌వ‌ర‌పు న‌ర‌సింహారావు స్వ‌రాలు కూర్చారు. సార‌థీ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మైన 'రైతుబిడ్డ' సినిమా 1939 ఆగ‌స్ట్ 27న విడుద‌లైంది.

హైద‌రాబాద్‌లో సినిమాహాలు క‌ట్టాల‌నుకున్న శోభ‌న్‌బాబు!

  తెలుగువారి అభిమాన న‌టుల్లో శోభ‌న్‌బాబు ఒక‌రు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌ర్వాత ఫ్యామిలీ హీరోగా అంత‌టి పేరు సంపాదించిన న‌టుడు ఆయ‌న‌. అక్కినేని హైద‌రాబాద్‌లో అన్న‌పూర్ణ స్టూడియోస్ క‌ట్టి, తెలుగు చిత్ర‌సీమ ఇక్క‌డ‌కు త‌ర‌లిరావ‌డానికి అవిర‌ళ కృషి చేశారు. స్టూడియో లాంటి ఆలోచ‌న లేక‌పోయినా, హైద‌రాబాద్‌లో సినిమా థియేటర్ కట్టాలని శోభన్‌బాబు అభిలషించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. చిత్రసీమ అంతా హైదరాబాద్ తరలివచ్చినా ఆయన మాత్రం చెన్నైని విడిచిపెట్టలేదు. చివరివరకు అక్కడే గడిపారు. అగ్ర క‌థానాయ‌కుల్లో హైద‌రాబాద్‌కు రాని వ్య‌క్తి ఆయ‌నే. 1975 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తగిన స్థలాన్ని నిర్ణయించి ఆధునిక వసతులతో ఒక చక్కని థియేటర్‌ను నిర్మించదలచినట్లు ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకనో ఆయన ఆ పనిని విరమించుకున్నారు. 'హలో గురూస (1996) సినిమా తర్వాత సినిమాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తన కుమారుణ్ణి సైతం సినిమా రంగానికి దూరంగా ఉంచారు.  శోభ‌న్‌బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును చెన్నైలోని పలు ప్రాంతాల్లో స్థలాలు, భవనాలపై వెచ్చించారు. మరింత డబ్బు గడించారు. ఆయన చూపిన బాటలోనే మరో నటుడు మురళీమోహన్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగంలో రాణించారు.