ముఖంపై రక్తం కారుతుంటే, మిర‌ప‌కాయ‌లు న‌మిలిన ఎన్టీఆర్‌!

  తెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ హీరోగా పేరు పొందారు విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. ప‌నినే దైవంగా భావించే అతికొద్ది మంది న‌టుల్లో ఆయ‌న అంద‌రికంటే ముందుంటారు. షూటింగ్ స‌మ‌యంలో దెబ్బ‌లు త‌గిలినా, లెక్క‌చెయ్య‌కుండా త‌న సీన్లు పూర్తి చేయ‌డానికే ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చిన సంద‌ర్భాలు అనేకం. అలాంటి వాటిలో 'ఎదురీత' (1977) సినిమా షూటింగ్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ప్ర‌ముఖంగా చెప్పాలి. బెంగాలీ న‌టుడు ఉత్త‌మ్ కుమార్ న‌టించిన ద్విభాషా చిత్రం (హిందీ, బెంగాలీ) 'అమానుష్' ఆధారంగా 'ఎదురీత‌'ను నిర్మించారు. వి. మ‌ధుసూద‌న‌రావు దీనికి ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ స‌ర‌స‌న నాయిక‌గా వాణిశ్రీ న‌టించ‌గా, విల‌న్ ప్రెసిడెంట్ భూష‌య్య పాత్ర‌ను కైకాల స‌త్య‌నారాయ‌ణ చేశారు. జ‌య‌సుధ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఆ సినిమాకు వి.ఎస్‌.ఆర్. స్వామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డ‌మే కాకుండా, నిర్మాణ భాగ‌స్వామిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఆ సినిమా షూటింగ్‌ను ఎక్కువ‌గా తూర్పు గోదావ‌రి జిల్లాలోని లంక గ్రామాల్లో నిర్వ‌హించారు. అందులో భాగంగా యానాంలో స‌ముద్రంపై ఎన్టీఆర్‌, స‌త్య‌నారాయ‌ణ‌పై ఓ ఫైట్ సీన్ తీస్తున్నారు. చిన్న షిప్స్ ట్రాల‌ర్స్‌పై ఓవైపు ఆర్టిస్టులు ప్ర‌యాణిస్తుంటే, ఇంకోవైపు కెమెరా బృందం ప్ర‌యాణిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో అనుకోకుండా ఓ ఐర‌న్ రాడ్ ఎన్టీఆర్ ముఖానికి త‌గిలి, ర‌క్తం కార‌డం మొద‌లుపెట్టింది. అంద‌రూ కంగారు ప‌డి, ఒడ్డుకు చేరుకున్నారు.  ఆ టైమ్‌లో ఎవ‌రో అక్క‌డ ఇసుక తిన్నెల‌పై మిర‌ప‌కాయ‌లు ఆర‌బెట్టారు. అంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూస్తుండ‌గా, కొన్ని మిర‌ప‌కాయ‌లు తీసుకొన్న ఎన్టీఆర్‌.. వాటిని నోటిలో వేసుకొని క‌స‌క‌సా న‌మిలేశారు. ఇనుప చువ్వ గీచుకున్న మంట‌కు, మిర‌ప‌కాయ‌ల మంట జ‌త‌క‌లిస్తే, నొప్పి మాయం అయ్యింద‌న్న మాట‌. ఆ వెంట‌నే ఆయ‌న, "ప‌దండి.. షూటింగ్ చేద్దాం" అని అంద‌ర్నీ తిరిగి ప‌నిలోకి మ‌ళ్లించారు. ద‌టీజ్ ఎన్టీఆర్‌! "ఎదురీత‌కు అంతంలేదా", "తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ", "బాలరాజు బంగారు సామీ" లాంటి సూప‌ర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలోనివే. మాధ‌వ‌పెద్ది స‌త్యం ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు.

దాస‌రిని డైరెక్ట‌ర్‌ని చేస్తానంటూ తిప్పించుకొని మాట త‌ప్పిన నాగ‌భూష‌ణం!

  ఎస్వీ రంగారావు, రాజ‌బాబు టైటిల్ రోల్స్ చేసిన 'తాత మ‌న‌వ‌డు' చిత్రంతో దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమాని ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె. రాఘ‌వ నిర్మించారు. ఆ సినిమాతోటే ఆ నిర్మాణ సంస్థ కూడా ప్రారంభ‌మైంది. అదివ‌ర‌కు ఫ‌ల్గుణ ప్రొడ‌క్ష‌న్స్‌లో రాఘ‌వ భాగ‌స్వామిగా ఉండేవారు. నిజానికి దాస‌రిని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తాన‌ని తిప్పించుకుంది 'ర‌క్త‌క‌న్నీరు' నాగ‌భూష‌ణం. కానీ ఆయ‌న దాస‌రికి ఇచ్చిన మాట‌ను త‌ప్పారు. ఎన్టీఆర్ హీరోగా నాగ‌భూష‌ణం నిర్మించిన 'ఒకే కుటుంబం' చిత్రానికి ద‌ర్శ‌కుడైన భీమ్‌సింగ్ ద‌గ్గ‌ర అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు దాస‌రి. ఆ సినిమాకు డైలాగ్స్ అసోసియేట్‌గా కూడా దాస‌రి వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న టాలెంట్‌ను గ‌మ‌నించిన నాగ‌భూష‌ణం ఒక‌రోజు దాస‌రిని పిలిచి డైరెక్ట‌ర్‌గా ఎక్క‌డ అవ‌కాశం వ‌చ్చినా ఒప్పుకోవ‌ద్ద‌నీ, త‌న బ్యాన‌ర్‌లో త‌ర్వాత సినిమాని ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే తీస్తాన‌నీ చెప్పారు. స‌రేన‌ని 'ఒకే కుటుంబం' త‌ర్వాత అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా అన్నీ వ‌దులుకున్నారు దాస‌రి. ఆ టైమ్‌లో త‌మిళంలో విడుద‌లైన 'శ‌ప‌థ‌మ్' మూవీని చూడ‌మ‌నీ, దాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌నీ నాగ‌భూష‌ణం చెబితే, ఆ సినిమా చూశారు దాస‌రి. అది నాగ‌భూష‌ణంకు స‌రిపోతుంద‌నిపించి, ఆ విష‌య‌మే చెప్పారు. స్క్రిప్ట్ ప‌ని ప్రారంభించ‌మ‌ని చెప్ప‌డంతో, డైలాగ్ వెర్ష‌న్ రాయ‌డం మొద‌లుపెట్టారు దాస‌రి. అయితే 'శ‌ప‌థ‌మ్' ప్రొడ్యూస‌ర్స్‌తో పొస‌గ‌క‌పోవ‌డంతో ఆ సినిమా హ‌క్కుల‌ను నాగ‌భూష‌ణం తీసుకోలేదు. మ‌రో స‌బ్జెక్టుతో సినిమా చేద్దామ‌న్నారు. స‌రేన‌ని తాను రాస్తున్న డైలాగ్ వెర్ష‌న్‌ను ప‌క్క‌న పెట్టేశారు దాస‌రి. నాగ‌భూష‌ణం 'ప్ర‌జానాయ‌కుడు' సినిమా తీయాల‌ని సంకల్పించి, ద‌ర్శ‌కుడిగా దాస‌రిని కాకుండా వి. మ‌ధుసూద‌న‌రావును ఎంచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే నాగ‌భూష‌ణంను నిల‌దీశారు దాస‌రి. ఆయ‌నేవో కార‌ణాలు చెప్పి త‌ప్పించుకున్నారు. కానీ దాస‌రి మ‌న‌సుకు క‌ష్ట‌మ‌నిపించి, ఆయ‌న ద‌గ్గ‌ర్నుంచి వ‌చ్చేశారు. కె. రాఘ‌వ‌ను క‌లిసి 'తాత మ‌న‌వ‌డు' క‌థ చెప్పారు. ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు దాస‌రి. ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్‌కు స్టార్ హోదాను క‌ల్పించిన వ్య‌క్తిగా తెలుగుచిత్ర‌సీమ‌లో చ‌రిత్ర సృష్టించారు.

రాముడి వేషంలో భీముడు.. ఒక సీన్ ఎలా తీశారంటే...

  టాలీవుడ్‌లో త‌న త‌రం హీరోల్లో అత్య‌ధికంగా 16 సినిమాల్లో ద్విపాత్రాభిన‌యం చేసిన ఘ‌న‌త నంద‌మూరి బాల‌కృష్ణ‌కే సొంతం. వాటిలో తొలి చిత్రం 'అపూర్వ స‌హోద‌రులు' (1986) కాగా, మ‌లి చిత్రం 'రాముడు-భీముడు' (1988). విశ్వ‌విఖ్యాత ఎన్టీ రామారావు న‌టించిన 'రాముడు-భీముడు' సినిమా క‌థ‌కూ, బాల‌య్య 'రాముడు-భీముడు' క‌థ‌కూ సంబంధం లేదు. కేవ‌లం టైటిల్స్ మాత్ర‌మే ఒక‌టి. బాల‌య్య స‌ర‌స‌న నాయిక‌లుగా సుహాసిని, రాధ న‌టించారు. త‌మిళ ర‌చ‌యిత గుహ‌నాథ‌న్ క‌థ అందించిన ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సంభాష‌ణ‌లు రాశారు. కె. ముర‌ళీమోహ‌న‌రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప‌లు స‌న్నివేశాల్ని మ‌ద్రాస్‌లోని ఏవీయం స్టూడియోలో చిత్రీక‌రించారు. వాటిలో ఓ సీన్ ఎలా తీశారంటే... అది.. అత్యంత సంప‌న్నంగా క‌నిపిస్తోన్న భ‌వ‌నం. బాల్క‌నీలో ప‌డ‌క కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు రాజ‌శేఖ‌రం అనే పెద్దాయ‌న‌. కాళ్ల‌ను ముందున్న పీఠంపైన ఆనించి, నోట్లో పైపు పెట్టుకొని పొగ‌పీల్చి వ‌దులుతూ విలాసంగా కుర్చీలో ఊగుతున్నాడు. ఆయ‌న ప‌క్క‌నే మెట్ల‌మీద న‌డివ‌య‌సులో ఉన్న భార్య పార్వ‌తి, ఆ ప‌క్క‌నే కొడుకు రాముడు నిల్చొని ఉన్నారు.  రాజ‌శేఖ‌రం గంభీరంగా "ఊ.." అన్నాడు. "ఇంకా న‌యం.. ఆ ముద‌న‌ష్ట‌పుదాన్ని కోడ‌లిగా తెచ్చుకొని ఉండేవాళ్లం." అంది పార్వ‌తి. "అంతే కాదు మ‌మ్మీ.. ఆ ముస‌ల్డి మ‌న‌వ‌రాల్ని తీసుకొచ్చిందే.. అదీ నాట‌క‌మే! ఒక‌దాని సంగ‌తి నేను బ‌య‌ట‌పెట్టేస‌రికి రెండోది పారిపోయింది." అన్నాడు రాముడు. "రామూ.." అని పిలిచాడు రాజ‌శేఖ‌రం. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు రాముడు. "నువ్వు గోళ్లు తిన‌డం ఎప్ప‌ట్నుంచీ మానేశావు?"  అనుమానంగా ప్ర‌శ్నించాడు రాజ‌శేఖ‌రం. రాముడు త‌డ‌బ‌డ్డాడు. కుడిచేతి చూపుడువేలిని నోట్లో పెట్టుకొని మునిపంటితో గోరుని కొరుకుతూ, "మామ‌య్య కూతురుకీ, నాకూ సంబంధంలేద‌ని నిరూపించిన‌ప్ప‌ట్నుంచీ.." అని చెప్పాడు కంగారును అణ‌చ‌కుంటూ. దాంతో తృప్తిచెందిన‌ట్లు, "వెరీ గుడ్‌.. స్వాతి ఏ ఊరిలో ఉందో వాక‌బుచేసి వెంట‌నే ఇంటికి వెళ్లి తీసుకురా.. పెళ్లి చేసేస్తాను." అన్నాడు రాజశేఖ‌రం. "ఓకే డాడ్‌.." అని ఆనందంలో వేలిని నోట్లో పెట్టుకొని గోరును అదేప‌నిగా కొరుక్కుంటూ, వెనక్కితిరిగి ప‌రుగులాంటి న‌డ‌క అందుకున్నాడు. "ఒరే.. ఒరే.. వేలు పూర్తిగా తినేసేవు. తాళి క‌ట్టేట‌ప్పుడు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది." అన్నాడు రాజ‌శేఖ‌రం న‌వ్వుతూ. ఈ సీన్‌లో రాజ‌శేఖ‌రంగా జ‌గ్గ‌య్య‌, పార్వ‌తిగా శ్రీ‌విద్య‌, రాముడి వేషంలో ఉన్న భీముడిగా బాల‌కృష్ణ న‌టించారు. స‌త్యం సినీ ఎంట‌ర్‌ప్రైజెస్ ప‌తాకంపై సిహెచ్‌.వి.వి. స‌త్య‌నారాయ‌ణ నిర్మించిన 'రాముడు-భీముడు' చిత్రం 1988 అక్టోబ‌ర్ 20న రిలీజైంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిలో యావ‌రేజ్‌గా ఆడింది.

ఇటీవ‌లి కాలంలో ఇండియ‌న్ క్రికెట‌ర్స్‌ను పెళ్లాడిన ఐదుగురు సినీ తార‌లు వీరే!

  మ‌న‌దేశంలో ప్ర‌జ‌లు బాగా ఇష్ట‌ప‌డే విష‌యాల్లో సినిమా, క్రికెట్ ముందు వ‌రుస‌లో ఉంటాయి. సినిమా పిచ్చి, క్రికెట్ పిచ్చి అనే మాట‌లు ప‌లుకుబ‌డులుగా మారిపోయాయంటే అతిశ‌యెక్తి కాదు. సినిమా స్టార్ల‌ను మించి క్రికెట‌ర్ల‌ను అభిమానించే వాళ్లున్నారు. ఇండియ‌న్ క్రికెట్‌లో స్టార్ క్రికెట‌ర్స్‌గా రాణించే వాళ్ల‌ను అభిమానించే వాళ్లు ఎలా ఉంటారో, వాళ్ల‌తో ప్రేమ‌లో ప‌డేవాళ్లూ అలాగే ఉంటారు. సినిమా తార‌లు అందుకు మిన‌హాయింపు కాదు. ఒక‌ప్ప‌టి బాలీవుడ్ అందాల తార ష‌ర్మిలా ఠాగూర్ ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీ (టైగ‌ర్ ప‌టౌడీ)ని ప్రేమించి పెళ్లాడిన విష‌యం మ‌న‌కు తెలుసు. ఇటీవ‌లి కాలంలో చూసుకుంటే ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌తో ప్రేమ‌లో ప‌డి, వాళ్ల‌ను మ్యారేజ్ చేసుకున్న తార‌లు ఎవ‌రంటే..  అనుష్కా శ‌ర్మ - విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కా శ‌ర్మ‌, ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఒక ద‌శాబ్దం క్రితం ఓ యాడ్ షూట్‌లో క‌లిసి పాల్గొన్న‌ప్పుడు తొలిసారి క‌లిశారు. తొలిచూపులోనే వారి క‌ళ్ల‌తో పాటు మ‌న‌సులూ క‌లిశాయి. త‌మ అనుబంధాన్ని ప్రైవేట్‌గానే ఉంచిన వారు, 2017లో గ్రాండ్‌గా జ‌రిగిన ఓ ప్రేవేట్ వేడుక‌లో పెళ్లాడారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వారికి వామిక అనే పాప పుట్టింది. సాగ‌రిక ఘ‌ట్గే - జ‌హీర్ ఖాన్‌ 'చ‌క్ దే ఇండియా'తో తెరంగేట్రం చేసిన మోడ‌ల్ సాగ‌రిక ఘ‌డ్గే, ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్ కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా క‌లిశారు. త్వ‌ర‌లోనే ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. మ‌రో క్రికెట‌ర్‌-యాక్ట్రెస్ పెళ్లిలో క‌లిసి పాల్గొన్న‌ప్పుడు వాళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. 2017లో నిశ్చితార్ధం జ‌రుపుకున్న ఆ ఇద్ద‌రూ న‌వంబ‌ర్‌లో దంప‌తులుగా మారారు. హాజెల్ కీచ్ - యువ‌రాజ్ సింగ్‌ ర‌వితేజ 'కిక్' సినిమాలో ఓ ఐట‌మ్ సాంగ్‌లో డాన్స్ చేసి, స‌ల్మాన్ ఖాన్ మూవీ 'బాడీగార్డ్‌'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హాజెల్ కీచ్‌, ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ 2011లో ఓ కామ‌న్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో క‌లుసుకున్నారు. హాజెల్‌ను ప్రేమ‌లో దింప‌డానికి యువ‌రాజ్‌కు కొంత స‌మ‌యం ప‌ట్టింది. 2016లో వారి వివాహం జ‌రిగింది. ఆ వేడుక‌లోనే జ‌హీర్‌, సాగ‌రిక రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం ధ్రువ‌ప‌డింది. గీతా బ‌స్రా - హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ 'దిల్ దియా హై' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన గీతా బ‌స్రా, ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ 2015 ప్రాంతంలో డేటింగ్ ప్రారంభించారు. రెండేళ్ల త‌ర్వాత ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఇప్ప‌టికే వారికి ఓ కుమార్తె ఉండ‌గా, ఇప్పుడు రెండో బిడ్డ‌ను క‌నేందుకు సిద్ధంగా ఉంది గీత‌. న‌టాసా స్టాంకోవిక్ - హార్దిక్ పాండ్యా అమితాబ్ బ‌చ్చ‌న్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ కాంబో ఫిల్మ్ 'స‌త్యాగ్ర‌హ‌'లో ఓ స్పెష‌ల్ నంబ‌ర్‌కు డాన్స్ చేయ‌డం ద్వారా బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన సెర్బియ‌న్ గాళ్ న‌టాసా స్టాంకోవిక్‌, ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఓ పార్టీలో తొలిసారి క‌లిసిన‌ప్పుడే మ‌న‌సులు ఇచ్చిపుచ్చుకున్నారు. వెంట‌నే డేటింగ్ మొద‌లు పెట్టేశారు. 2020 మొద‌ట్లో నిశ్చితార్ధం జ‌ర‌గ‌గా, లాక్‌డౌన్ టౌమ్‌లో పెళ్లాడారు. గ‌త ఏడాది జూలైలోనే వాళ్ల‌కు అగ‌స్త్య అనే కొడుకు పుట్టాడు. అంటే నిశ్చితార్ధం జ‌రిగేనాటికే న‌టాసా గ‌ర్భం దాల్చింద‌న్న మాట‌.

కనీసం కొబ్బ‌రికాయ కూడా కొట్ట‌కుండా ప్రారంభ‌మై ట్రెండ్ సెట్ట‌ర్ అయిన‌ తొలి తెలుగు చిత్రం!

  ధ‌వ‌ళ స‌త్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా 1980 ఆగ‌స్ట్ 15న విడుద‌లై సంచ‌న‌ల విజ‌యం సాధించిన చిత్రం 'యువ‌త‌రం క‌దిలింది'. న‌వ‌త‌రం పిక్చ‌ర్స్ ప‌తాకంపై మాదాల రంగారావు క‌థ‌ను రాసి, స‌మ‌ర్పించిన ఈ చిత్రంలో ఆయ‌న‌తో పాటు రామ‌కృష్ణ‌, నారాయ‌ణ‌రావు, ముర‌ళీమోహ‌న్‌, రంగ‌నాథ్‌, సాయిచంద్, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, నాగ‌భూష‌ణం ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. టైటిల్ సాంగ్‌ను సి. నారాయ‌ణ‌రెడ్డి రాసిన ఈ చిత్రంలో "ఆశ‌యాల పందిరిలో అనురాగం సందడిలో.." అనే మ‌రో పాట ఆనాటి యువ‌త‌రాన్ని బాగా ఆక‌ట్టుకుంది. ఆ పాట రాసింది అదృష్ట దీప‌క్‌. ఇది ఆయ‌న తొలి సినీ గీతం. అప్ప‌టికే ఆయ‌న క‌థ‌కుడు, బుర్ర‌క‌థార‌చ‌యిత‌, రంగ‌స్థ‌ల న‌టుడు, గాయ‌కుడు. అదృష్ట దీప‌క్ రాసిన పాట‌తోటే ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ ప్రారంభ‌మైంది. టి. చ‌ల‌ప‌తిరావు స్వ‌రాలు కూర్చిన ఈ పాట‌ను రామ‌కృష్ణ‌, విజ‌య‌ల‌క్ష్మీ శ‌ర్మ బందం పాడ‌గా రికార్డ్ చేశారు. 1980 మార్చి 26న మ‌ద్రాస్‌లోని విజ‌యా గార్డెన్స్‌లో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం పెద్ద సంచ‌ల‌నాన్నే సృష్టించింది. కార‌ణం.. పూజ‌లూ, పురోహితులూ లేకుండా, క‌నీసం కొబ్బ‌రికాయ కూడా కొట్ట‌కుండా అది జ‌రగ‌డం. విప‌రీత‌మైన సెంటిమెంట్ల‌కు ఆల‌వాల‌మైన సినిమా రంగంలో ఇలా చేయ‌డం ద్వారా మాదాల రంగారావు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. "ఇలా జ‌ర‌గ‌డం మొత్తం మ‌ద్రాసు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి." అంటూ ప‌త్రిక‌ల‌న్నీ ఆ సంఘ‌ట‌న‌ను ప్రముఖంగా రాశాయి. 'ఆశ‌యాల పందిరిలో..' పాట రికార్డింగ్ రోజునే యువ‌త‌రం క‌దిలింది సినిమా విడుద‌ల తేదీని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌క‌టించిన విధంగానే అదే సంవ‌త్సరం ఆగ‌స్ట్ 15న విడుద‌లైన ఈ సినిమా అప్పుడు విడుద‌లైన భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను ఢీకొట్టి మ‌రీ సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. ఆ త‌ర‌హా చిత్రాల‌కు ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.

క్రైమ్ స్టోరీతో విజ‌య‌నిర్మ‌ల‌ను డైరెక్ట‌ర్ చేయాల‌నుకున్న కృష్ణ‌.. వ‌ద్ద‌ని వారించిన ఆరుద్ర

  నేడు విజ‌య‌నిర్మ‌ల రెండ‌వ వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఆమె 'మీనా'తో తెలుగులో ఎలా డైరెక్ట‌ర్‌గా మారారో చెప్పుకోవ‌డం ఈ వ్యాసం ఉద్దేశం. విజ‌య‌నిర్మ‌ల నటించిన మూడో చిత్రం 'సాక్షి'. దానికి ద‌ర్శ‌కులు బాపు. డైరెక్ష‌న్‌లో ఆయ‌న తీసుకుంటున్న శ్ర‌ద్ధ‌, ఆయ‌న స్టోరీ బోర్డ్ విధానం అవీ చూసిన‌ప్పుడు ఓ చిత్రానికి ఎలాగైనా ద‌ర్శ‌క‌త్వం చెయ్యాల‌నే కోరిక క‌లిగింది విజ‌య‌నిర్మ‌ల‌కు. అయితే తొంద‌ర‌ప‌డ‌కుండా మెళ‌కువ‌ల‌న్నింటినీ ప‌రిశీలించ‌డం మొద‌లుపెట్టారు. ఆ విధంగా ప‌దేళ్లు సినిమాల్లో న‌టిస్తూనే, దూరంగా ఉండి ద‌ర్శ‌క‌త్వం గురించి స్ట‌డీ చేశారు. న‌టిగా నిల‌దొక్కుకుంటున్న స‌మయంలోనే డైరెక్ష‌న్ చేయాల‌నే కోరిక‌ను కృష్ణ‌కు చెప్పారు. ఆయ‌న రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం వ‌ద్దనీ, కొంత‌కాలం ఆగ‌మ‌నీ సూచించారు. అలా కొంత‌కాలం ఆగి, తొలిసారిగా ఓ సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారారు. అదీ.. 'క‌విత' అనే మ‌ల‌యాళ చిత్రంతో. పైగా అది యాంటీ సెంటిమెంట్ స్టోరీ. ఆ సినిమా విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, ద‌ర్శ‌కురాలిగా, న‌టిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులో తొలిసారిగా య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి న‌వ‌ల 'మీనా'ను అదే పేరుతో రూపొందించడ‌మే కాకుండా టైటిల్ రోల్‌ను త‌నే పోషించారు. అది ఘ‌న విజ‌యం సాధించి ఆమెను గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించే సంఖ్య‌లో సినిమాలు డైరెక్ట్ చేయ‌డానికి దోహ‌దం చేసింది. నిజానికి 'మీనా'తో కాకుండా ఓ క్రైమ్ స్టోరీతో విజ‌య‌నిర్మ‌లను తెలుగులో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు కృష్ణ‌. ఆయ‌న అడ‌గ‌డంతో ఒక సీక్రెట్ ఏజెంట్ స్టోరీని రాశారు ఆరుద్ర‌. ఆ స్టోరీని కృష్ణ‌, ఆయ‌న సోద‌రులు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావుకు వినిపించారు. అంద‌రికీ క‌థ న‌చ్చింది. దాంతో డైలాగ్స్ కూడా రాయ‌మ‌నీ, ఆ క‌థతో విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట‌ర్ అవుతుంద‌నీ అన్నారు కృష్ణ‌. అయితే ఆ అభిప్రాయంతో విభేదించారు ఆరుద్ర‌. క్రైమ్ స్టోరీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై, హిట్ట‌యితే అలాంటి స్టోరీల‌నే ఆమె బాగా తీస్తుంద‌నే ముద్ర ప‌డుతుంద‌నీ, అలా కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీతో డైరెక్ట‌ర్ అయితే ఆమె కెరీర్ రాణిస్తుంద‌నీ ఆయ‌న సూచించారు. ఇది సూచ‌న మాత్ర‌మేన‌నీ, మీ ఇద్ద‌రూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణ‌యం తీసుకోండి అని కూడా ఆరుద్ర చెప్పారు. ఆయ‌న సూచ‌న బాగుంద‌నుకున్న కృష్ణ ఒక ఫ్యామిలీ స్టోరీతోటే విజ‌య‌నిర్మ‌ల‌ను డైరెక్ట‌ర్ చేయాల‌నుకున్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర‌జ్యోతి వీక్లీలో సీరియ‌ల్‌గా వ‌స్తున్న య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి 'మీనా' బాగా పాపుల‌ర్ అయింది. ఆ క‌థ విజ‌య‌నిర్మ‌ల‌నూ ఆక‌ట్టుకుంది. అయితే ఆప్ప‌టికే ఆ న‌వ‌లను సినిమాగా తీసే ఉద్దేశంతో హ‌క్కులు కొన్నారు అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ అధినేత డి. మ‌ధుసూద‌న‌రావు. ఆయ‌న ద‌గ్గ‌ర ఆ హ‌క్కులు తీసుకున్నారు విజ‌య‌నిర్మ‌ల‌. అలా మ‌ల‌యాళంలో తీసిన 'క‌విత' త‌ర్వాత తెలుగులో 'మీనా'తో దర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అయ్యారామె. 1973 డిసెంబ‌ర్ 28న విడుద‌లైన ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా మెప్పించి, శ‌త‌దినోత్స‌వ చిత్రంగా విజ‌యం సాధించింది. "నా న‌వ‌ల‌ను పేరున్న ద‌ర్శ‌కులే సినిమాగా తీయాల‌నే అభిప్రాయం నాకుండేది. అందుకే విజ‌య‌నిర్మ‌ల ఈ న‌వ‌ల‌ని సినిమాగా తీస్తున్నార‌ని విని భ‌య‌ప‌డ్డాను. కానీ చిత్రంచూసి ఎంత ఆనందించానో చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు అన్నారు." య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి.

'మిర్చి'తో రిఎంట్రీ ఇచ్చిన న‌దియా గురించి మీకు తెలీని నిజాలు!

  ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక భాష‌లో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఇత‌ర భాష‌ల్లోనూ న‌టించ‌డం, రాణించ‌డం కొత్తేమీ కాదు. ఆ కోవ‌కు చెందిన తార‌.. న‌దియా. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన 'మిర్చి' మూవీలో ప్ర‌భాస్ త‌ల్లిగా రిఎంట్రీ ఇచ్చిన ఆమె ఒక‌ప్పుడు మోస్ట్ గ్లామ‌ర‌స్ సౌత్ ఇండియ‌న్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. మ‌ల‌యాళం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి, త‌మిళ చిత్రాల‌లో అగ్ర నాయిక‌గా పేరు తెచ్చుకున్న త‌ర్వాతే ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చార‌నే విష‌యం చాలామందికి తెలీదు. అవును. సూప‌ర్‌స్టార్ కృష్ణ పెద్ద‌కుమారుడు ర‌మేశ్‌బాబు స‌ర‌స‌న న‌టించిన 'బ‌జారు రౌడీ' ఆమె తొలి తెలుగు చిత్రం. తొలి తెలుగు సినిమాలోనే డ్యూయ‌ల్ రోల్ చేయ‌డం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఓ విశేషం. ఆమె గురించి చాలా మందికి తెలీని విష‌యాలు, నిజాలేమిటో తెలుసుకుందాం... న‌దియా స్వ‌స్థ‌లం కేర‌ళ‌లోని కొళ్లం స‌మీపాన ఉన్న వ‌త్త‌నంతిట్ట గ్రామం. ఆమె అక్క‌డే జ‌న్మించారు. ఆమె అస‌లు పేరు జ‌రీనా. ఆమె తండ్రి మొయిదు టాటా కంపెనీలో ఉద్యోగ‌రీత్యా బొంబాయిలో నివాసం ఏర్ప‌ర‌చుకున్న‌ప్ప‌టికీ న‌దియా మాత్రం త‌న చెల్లెలితో పాటు మామ్మ‌గారి వ‌ద్ద‌నే ఉండి కేర‌ళ‌లో త‌న చ‌దువు కొన‌సాగించారు. బాల్యం నుంచి నాట్యం, న‌ట‌న‌పై ఆమెకు అభిలాష ఎక్కువ‌. సినిమాలు ఎక్కువ‌గా చూసేవారు. అయితే ఉత్సాహం ఉన్నా త‌గిన వ‌స‌తి లేక‌పోవ‌డంతో న‌దియా నాట్యం నేర్చుకోలేక‌పోయారు. స్కూల్లో క్లాస్‌మేట్ అయిన ఓ అమ్మాయి ఆమెకు బాగా స‌న్నిహితురాలు. వాళ్లింటికి వెళ్తుండేవారు. ఆ అమ్మాయి తండ్రి ఎవ‌రో కాదు.. పాపుల‌ర్ డైరెక్ట‌ర్ ఫాజిల్‌! ఒక‌రోజు ఫ్రెండ్ ఇంటికి య‌థాలాపంగా వెళ్లిన న‌దియాను చూసిన ఫాజిల్‌, "నువ్వు సినిమాల్లో న‌టిస్తావా?" అన‌డిగారు. ఆయ‌న త‌మాషాకి అడిగార‌నుకున్నారు న‌దియా. అప్ప‌టికే ఆయ‌న 'మైడియ‌ర్ కుట్టిచేత‌న్' లాంటి 3డి ఫిల్మ్‌ను తీశారు. అయితే ఫాజిల్ ఆమెను అడ‌గ‌డంతో స‌రిపుచ్చ‌కుండా, ఆమె మామ్మ‌గారిని క‌లుసుకొని అడిగారు. ఈ విష‌యం బొంబాయిలో ఉన్న న‌దియా తండ్రిని అడ‌గ‌మ‌ని ఆమె చెప్పారు. నదియా తండ్రి స్వ‌గ్రామానికి వ‌చ్చిన‌ప్పుడు ఫాజిల్ ఆయ‌న‌ను కూడా అడిగారు. కుమార్తెను సినిమాల్లో చేర్పించ‌డానికి న‌దియా తండ్రి మొద‌ట అంగీక‌రించ‌లేదు. కానీ త‌ను న‌టిస్తాన‌ని న‌దియా ప‌ట్టుప‌ట్టారు. దాంతో ఆయ‌న ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఫాజిల్ ఆమెను న‌దియాగా చిత్ర‌రంగానికి ప‌రిచ‌యం చేశారు. ఆ పేరు న‌చ్చి దానితోనే కంటిన్యూ అయిపోయారు జ‌రీనా అలియాస్ న‌దియా. అలా ఫాజిల్ డైరెక్ట్ చేసిన 'నొక్కేత్త దూర‌త్తు క‌ణ్ణుమ్ న‌ట్టు' (1984)తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు న‌దియా. ఆ సినిమా త‌ర్వాత 'పూవే పూచూడ‌వా' పేరుతో త‌మిళంలోనూ, 'ముద్దుల మ‌న‌వ‌రాలు' పేరుతో తెలుగులోనూ వ‌చ్చింది. 'నొక్కేత్త దూర‌త్తు క‌ణ్ణుమ్ న‌ట్టు'లో న‌దియా అమ్మ‌మ్మ‌గా సుప్ర‌సిద్ధ న‌టి ప‌ద్మిని న‌టించారు. చాలా కాలం విరామంతో ఈ సినిమాతో రిఎంట్రీ ఇచ్చారు ప‌ద్మిని. ఇక ఈ సినిమాలో హీరో.. ఆ త‌ర్వాత కాలంలో సూప‌ర్‌స్టార్ అయిన మోహ‌న్‌లాల్‌. అమ్మ‌మ్మ మృతి చెంద‌డంతో న‌దియా బొంబాయిలో ఉంటున్న తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయారు. ఈలోగా ఆమె మూడు మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించారు. ఆ టైమ్‌లో మ‌ళ్లీ ఫాజిల్ నుంచి క‌బురు వ‌చ్చిందామెకు. ఆమె న‌టించిన తొలి చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు, అందులోనూ హీరోయిన్‌గా న‌టించాలంటూ ఆయ‌న అడిగారు. స‌రేన‌న్నారు న‌దియా. అలా 'పూవే పూచూడ‌వా' మూవీతో త‌మిళ రంగానికి హీరోయిన్‌గా ఆమె ఇంట్ర‌డ్యూస్ అయ్యారు. మ‌ల‌యాళ ఒరిజిన‌ల్‌కు మంచి ఈ త‌మిళ రీమేక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. అంతేకాదు ఫ‌స్ట్ మ‌ల‌యాళం ఫిల్మ్ ఉత్త‌మ‌న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందిస్తే, త‌మిళంలో ఫ‌స్ట్ ఫిల్మ్ నామినేష‌న్ అందించింది. ఆ త‌ర్వాత త‌మిళంలో బిజీ అయిపోయి టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగారు న‌దియా. ఆ త‌ర్వాత ర‌మేశ్‌బాబు స‌ర‌స‌న నాయిక‌గా బ‌జారు రౌడీ (1988)లో న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లోకి ఆమె ఎంట‌ర‌య్యారు. ఆ సినిమాలో ప‌త్రికా సంపాద‌కురాలిగా, సంప‌న్న యువ‌తిగా రెండు పాత్ర‌లు చేసి, ఆక‌ట్టుకున్నారు. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకోవ‌డంతో ఎక్కువ సినిమాల్లో న‌టించ‌లేదు. అప్ప‌టికే ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తిచేసి, కొన్నాళ్ల‌కు భ‌ర్త‌తో క‌లిసి యు.ఎస్‌. వెళ్లిపోయారు. అక్క‌డ్నుంచి లండ‌న్‌కు వెళ్లి, ఏడేళ్లు ఉన్నాక‌, 2008లో తిరిగి ఇండియాకు వ‌చ్చి, ముంబైలో నివాసం ఉంటున్నారు. త‌మిళ సినిమా 'ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి' ('అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి'కి రీమేక్‌) మూవీలో జ‌యం ర‌వి త‌ల్లిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న‌దియా, 'మిర్చి' (2011) మూవీతో మ‌ళ్లీ టాలీవుడ్‌కు తిరిగొచ్చారు.

జ‌మున‌.. మూడు త‌రాలు.. ముగ్గురూ క‌ళాకారిణులే!

  ఇది 40 ఏళ్ల క్రితం నాటి పాత ఫొటో. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు.. మూడు త‌రాల‌కు ప్ర‌తినిధులు.. కౌస‌ల్యాదేవి, జ‌మున‌, స్ర‌వంతి. అంతేకాదు, భిన్న రంగాల్లో నిష్ణాతులైన క‌ళాకారిణులు కూడా. న‌టిగా జ‌మున మ‌నంద‌రికీ తెలుసు. తెలుగు చిత్ర‌సీమ గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప న‌టీమ‌ణుల్లో ఆమె ఒక‌రు. ఏ పాత్ర చేసినా, ఆ పాత్ర‌లో ఇట్టే ఒదిగిపోయే ప్ర‌తిభావంతురాలుగా ఆమె పేరు పొందారు. ప్ర‌జాన‌టిగా ఆమె గుర్తింపుపొందారు.  జ‌మున‌ త‌ల్లి నిప్ప‌ణి కౌస‌ల్యాదేవి హ‌రిక‌థా భాగ‌వ‌తార్‌. ఆమె త‌న 12వ ఏట నుంచే హ‌రిక‌థ‌లు చెప్తూ ఒక‌ప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, ఇత‌ర రాష్ట్రాల‌లోనూ అనేక ప్ర‌శంస‌లు పొందారు. జ‌మున రెండో ఏట నుంచే సంగీతంపై ఆస‌క్తి చూపిస్తూ డాన్స్ చేస్తుండేవారు. ఆమెను న‌టిగా తీర్చిదిద్దాల‌ని కౌస‌ల్యాదేవి కోరుకున్నారు. అమ్మ ఆశ‌యానికి త‌గ్గ‌ట్లే న‌టిగా మారి, అశేష ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందారు జ‌మున‌. కౌస‌ల్యాదేవి జీవించి ఉండ‌గా, త‌న మ‌న‌వ‌రాలు స్ర‌వంతిని కూడా ఓ క‌ళాకారిణిగా చూడాల‌ని కోరుకున్నారు. త‌మ మూడు త‌రాలు క‌ళ‌కు సేవ చేసిన‌వాళ్లుగా, త‌మ‌ది క‌ళాకారుల వంశంగా చెప్పుకోవాల‌ని ఆశ‌ప‌డ్డారు. అయితే కౌస‌ల్యాదేవి కానీ, జ‌మున కానీ స్ర‌వంతిని కూడా సినీ హీరోయిన్‌గా చూడాల‌ని ఆశించారు. ర‌మ‌ణారావుతో వివాహం జ‌రిగాక త‌న‌కు ఓ ఆడ‌పిల్ల పుట్టాల‌ని జ‌మున‌ క‌ల‌లు క‌న్నారు. మంత్రాల‌య రాఘ‌వేంద్ర‌స్వామి భ‌క్తురాలైన ఆమె అనేక‌సార్లు మంత్రాల‌యం వెళ్లి ఈ కోరిక‌నే కోరుకున్నారు. ఆమె పూజ‌లు ఫ‌లించి స్ర‌వంతి పుట్టింది. అయితే స్ర‌వంతిని సినీ హీరోయిన్ చేయాల‌న్న జ‌మున ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఆమెకు అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో, కూతుర్ని హీరోయిన్‌గా ఓ టెలీ సీరియ‌ల్ తీశారు. కానీ స్ర‌వంతి దృష్టి న‌ట‌న మీద‌కంటే చిత్ర‌లేఖ‌నం మీదే ఎక్కువ‌గా ఉంది. అందుకే దానిలో శిక్ష‌ణ పొంది, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్త‌మ అబ్‌స్ట్రాక్ట్ ఆర్టిస్టుల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గీచిన అబ్‌స్ట్రాక్ట్ చిత్రాలు చూసి శ‌భాష్ అన‌కుండా ఉండ‌లేరు.  మొద‌ట్లో త‌ను అనుకున్న‌ట్లు స్ర‌వంతి న‌టిగా స్థిర‌ప‌డ‌క‌పోయినా, చిత్ర‌కారిణిగా మంచి పేరు తెచ్చుకోవ‌డం జ‌మున‌కు గ‌ర్వ‌కార‌ణంగానే ఉంటుంది. మొత్తానికి త‌ను కూడా క‌ళాకారిణి కావాల‌నుకున్న అమ్మ‌మ్మ కోరిక‌ను నెర‌వేర్చి, క‌ళాకారుల వంశం అనే మాట‌ను స్ర‌వంతి నిల‌బెట్టింది. అన్న‌ట్లు స్ర‌వంతి కుమారుడు అవిష్ కూడా త‌ల్లికి స‌రైన వార‌సుడిగా పెయింటింగ్‌లో ప్ర‌తిభ చూపిస్తున్నాడు.

1953లోనే తెలుగు సినిమాలో రెండు హిందీ పాట‌లు!

  మ‌హాన‌టుడు చిత్తూరు నాగ‌య్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ర‌పురాని చిత్రం 'నా ఇల్లు'. అదివ‌ర‌కు రేణుకా ఫిలిమ్స్ ప‌తాకంపై తొలి య‌త్నంగా 'త్యాగ‌య్య' లాంటి క్లాసిక్ ఫిల్మ్‌ను నిర్మించిన ఆయ‌న‌, అవ‌రిండియా ప‌తాకంపై నిర్మించిన‌ సినిమా ఇది. ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయ‌నే స‌మ‌కూర్చ‌డం మ‌రో విశేషం. అద్దేప‌ల్లి రామారావు సంగీత స‌హ‌కారం అందించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తీసిన ఈ మూవీలో నాగ‌య్య స‌ర‌స‌న టి.ఆర్‌. రాజ‌కుమారి న‌టించారు. ఈ చిత్రంలో బ్యాంకు ఉద్యోగి శివ‌రామ్ పాత్ర‌ను నాగ‌య్య చేశారు. క‌థానుసారం ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటారు. సంగీతం అంటే ప్రాణ‌మైన దంప‌తులిద్ద‌రూ త‌మ పిల్ల‌ల‌కు కూడా సంగీతం నేర్పాల‌నుకుంటారు. ధ‌న‌రాజ్ అనే ఒక దుర్మార్గుడు ప‌న్నిన ప‌న్నాగంలో భాగంగా లీల అనే వ‌గ‌లాడి వ‌ల‌లో ప‌డ‌ట‌మే కాకుండా, బ్యాంకు డ‌బ్బును కూడా పోగొట్టి జైలు పాల‌వుతాడు శివ‌రామ్‌. తిరిగి వ‌చ్చేస‌రికి త‌న‌ కుటుంబం క‌నిపించ‌దు. జీవిక కోసం పాకీ ప‌నికి కూడా సిద్ధ‌ప‌డ‌తాడు. ఈలోగా బాలానంద సంఘం ప్రోత్సాహంతో పిల్ల‌లు ప్ర‌యోజ‌కుల‌వుతారు. దుర్మార్గుల బండారం బ‌య‌ట‌ప‌డి, శివ‌రామ్ త‌న కుటుంబాన్ని క‌లుసుకోవ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది. ధ‌న‌రాజ్‌గా ముదిగొండ లింగ‌మూర్తి, లీల‌గా విద్యావ‌తి (జ‌య‌ల‌లిత పిన్ని) న‌టించారు. దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి సాహిత్యం, నాగ‌య్య సంగీతం క‌లిసి అంద‌మైన పాట‌ల‌ను సృష్టించాయి. 'అదిగ‌దిగో గ‌గ‌న‌సీమ‌.. అంద‌మైన చంద‌మామ ఆడెనోయీ' అంటూ సాగే పాట అపురూప గీతాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంకో విశేషం.. బొంబాయిలో క‌థ జ‌రిగిన‌ప్పుడు అందుకు అనుగుణంగా రెండు హిందీ పాట‌ల‌ను పెట్టారు. అవి రెండూ డాన్స్ సీక్వెన్సులుగా వ‌స్తాయి. 'హ‌రి హ‌రి పుష్పా హ‌రి', 'మై హ‌స్తీ గ‌డీ ఆయీ' అంటూ సాగే ఆ పాట‌ల‌ను మీనా క‌పూర్ ఆల‌పించారు. అవి సంద‌ర్భానుసారం రావ‌డం వ‌ల్ల క‌థాగ‌మ‌నానికి అడ్డు కాలేదు. అలా హిందీ పాట‌ల‌ను పెట్టిన తొలి తెలుగు సినిమాగా 'నా ఇల్లు' నిలిచింది.

ఖుష్‌బూ మ‌ర్చిపోలేని రావుల‌పాలెం హోలీ పండ‌గ సంద‌డి!

  సీనియ‌ర్ తార ఖుష్‌బూ.. ఒక‌ప్పుడు గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా ఇటు తెలుగు, అటు త‌మిళ చిత్ర రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'క‌లియుగ పాండ‌వులు' చిత్రంతోటే ఆమె కూడా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత అనేక హిట్ సినిమాల్లో ఆమె న‌టించారు. ఆమె న‌టించిన వాటిలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, చంద్ర‌మోహ‌న్ హీరోలుగా చేసిన 'చిన్నోడు పెద్దోడు' ఓ వైవిధ్య‌మైన చిత్రం. పైకి కామెడీ సినిమా అయినా బ‌ల‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉన్న సినిమా అది. రేలంగి న‌ర‌సింహారావు ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో హోలీ పండ‌గ జ‌రుపుకొనే ఎపిసోడ్‌ ఒక‌టుంది. ఆ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ఇప్ప‌టికీ ఖుష్‌బూ మ‌ర్చిపోలేదు.  'చిన్నోడు పెద్దోడు' సినిమాని రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో తీశారు. సిటీలో పుట్టిపెరిగిన ఖుష్‌బూకు రాజ‌మండ్రి, గోదావ‌రి న‌దీతీరం, అక్కడి వాతావ‌ర‌ణం ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. నిజానికి ప‌ల్లె వాతావ‌ర‌ణంలోకి అడుగుపెట్ట‌డం ఆమెకు అదే మొద‌టిసారి. ఆ సినిమా షూటింగ్‌లో ఆమెకు బాగా న‌చ్చింది హోలీ ఆడే స‌న్నివేశాలు. వాటిని రావుల‌పాలెంలో చిత్రీక‌రించారు. ఆ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చాలా స‌ర‌దాగా జ‌రిగింది. మామూలుగానే రాజేంద్ర‌ప్ర‌సాద్ చాలా స‌ర‌దాగా, క‌లుపుగోలుగా ఉండే వ్య‌క్తి. అదివ‌ర‌కే ఆయ‌న‌తో 'కెప్టెన్ నాగార్జున' లాంటి సినిమాల్లో న‌టించారు ఖుష్‌బూ. ఆయ‌న ఎప్పుడూ జోక్స్ వేసి న‌వ్విస్తూ ఉండ‌టం అప్ప‌టికే ఆమెకు తెలుసు. చంద్ర‌మోహ‌న్‌తో మాత్రం ఖుష్‌బూకు ఇదే మొద‌టి సినిమా. ఆయ‌న త‌న‌క‌న్నా వ‌య‌సులోనే కాక‌, అనుభ‌వంలోనూ పెద్ద‌వాడ‌వ‌డంతో ఆయ‌న‌తో ఆమె ఎక్కువ‌గా మాట్లాడ‌లేక‌పోయారామె. అయినా చంద్ర‌మోహ‌న్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్.. ఇద్ద‌రూ స‌ర‌దా మ‌నుషులే. ద‌గ్గ‌రున్న వాళ్ల‌ను టీజ్ చేస్తూ, స‌ర‌దాగా న‌వ్విస్తూ, న‌వ్వుతూ ఉంటారు. దాంతో హోలీ పండ‌గ సీన్ల‌లో అంతా రెచ్చిపోయి న‌టించేశారు. వైట్ అండ్ వైట్ డ్ర‌స్సులో టిప్ టాప్‌గా త‌యారై ఉండే రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను చంద్ర‌మోహ‌న్‌, తాను చెరో బ‌కెట్ రంగునీళ్లతో ముంచేసే ఆ సీన్ ఇప్ప‌టికీ ఖుష్‌బూ క‌ళ్ల‌ముందు మెదులుతూనే ఉంటుంది. వాళ్ల‌ను త‌ప్పించుకోవ‌డానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ ప‌రుగెత్తుతుంటే ఆ ఇద్ద‌రూ వెంట‌ప‌డి మ‌రీ రంగునీళ్లు పోస్తారు. ఆ త‌ర్వాత వితంతువు అయిన తాళ్లూరి రామేశ్వ‌రి మీద చంద్ర‌మోహ‌న్ రంగునీళ్లు పోయ‌డంతో ఆ సీన్ ఎమోష‌న‌ల్ కింద మారిపోతుంది. "హోలీ పండ‌గ స‌న్నివేశ చిత్రీక‌ర‌ణ‌లో రంగుల్లో ముంచెత్తారంతా. నేను మాత్రం త‌క్కువా! నేనూ వాళ్లంద‌రినీ రంగుల్లో ముంచి తేల్చేశాను. ఈ సంఘ‌ట‌న మాత్రం చాలా త‌మాషాగా అనిపించింది. ఇదే కాదు, సినిమా షూటింగ్ అంతా ఓ పిక్నిక్‌లా స‌ర‌దాగా జ‌రిగింది." అని ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు ఖుష్‌బూ.

ఎస్వీఆర్ ఇస్తాన‌న్న గార్డెన్‌ను ఆయ‌న పోయిన ప‌దిహేనేళ్ల‌కు ద‌క్కించుకున్న శార‌ద‌!

  నేడు ఊర్వ‌శి శార‌ద పుట్టిన‌రోజు. విశ్వ‌న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావుతో క‌లిసి శార‌ద న‌టించిన సినిమాలు చాలా త‌క్కువ‌. ఆయ‌న‌తో క‌లిసి శార‌ద న‌టించిన మొద‌టి చిత్రం 'అభిమాన‌వంతులు'. ఆఖ‌రి చిత్రం 'జ‌మీందారుగారి అమ్మాయి'. ఈ చివ‌రి సినిమాలో ఆ ఇద్ద‌రూ తండ్రీకూతుళ్లుగా న‌టించారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే అంత‌కు ముందు పెద్ద‌గా ప‌రిచ‌యంలేని వాళ్లిద్ద‌రూ 'జ‌మీందారుగారి అమ్మాయి' సినిమాకు ప‌నిచేసిన ప‌ది రోజుల్లోనే ఎంతో స‌న్నిహితుల‌య్యారు. ఎస్వీఆర్ ఎప్పుడూ "అమ్మాయీ, అమ్మాయీ.." అని పిలుస్తూ ఎంతో ప్రేమ‌నీ, ఆప్యాయ‌త‌నీ ప్ర‌ద‌ర్శిస్తూ ఆమెను సొంత కూతురిలా చూసుకునేవారు. ఆ సంద‌ర్భంలో శార‌ద‌తో ఆయ‌న ఓ మాట అన్నారు.. "కేళంబాకంలో నాకో గార్డెన్ ఉంది. దాన్ని ఇంకా బాగా డెవ‌ల‌ప్ చేయాల‌నుకుంటున్నాను. కానీ నాకు వీలుకావ‌డం లేదు. ఆ గార్డెన్‌ను నీకిచ్చేస్తాను. నువ్వ‌యితే బాగా చూసుకోగ‌ల‌వు" అని. ఆయ‌న‌లా అన‌డం చూసి శార‌ద న‌వ్వుకొనేవారు. ప‌దిరోజుల్లోనే తండ్రీకూతుళ్ల‌లాగా ఇంత ద‌గ్గ‌ర‌వ్వ‌డం చూసి, ఇంత‌కాలంగా ఫీల్డులో ఉంటూ ఎప్పుడూ ఇంత ద‌గ్గ‌ర కాలేక‌పోయాం ఎలా?.. అని ఆ ఇద్ద‌రికీ అనిపించేది. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఎస్వీఆర్ క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త శార‌ద‌కు శ‌రాఘాతం. ఆ త‌ర్వాత ప‌దిహేనేళ్ల‌కు రంగారావుగారి గార్డెన్స్‌ను ఆమె తీసుకున్నారు. అది త‌న అమ్మ‌మ్మ పేరిట ఆమె కొన్నారు. ఆ గార్డెన్స్‌కు ఎస్వీ రంగారావు పేరు ఉండేది. ఆయ‌న పేరును తీసేయాలంటే బాధ‌నిపించి, అలాగే ఉంచేశారు శార‌ద‌. "ఆయ‌న ఎప్పుడో ఇస్తాన‌న్న గార్డెన్‌, ఆయ‌న పోయిన ప‌దిహేనేళ్ల‌కు మ‌ళ్లీ నాకే ల‌భించ‌డం అనేది ఒక చిత్ర‌మైన అనుభూతిని క‌లిగించే సంద‌ర్భం. ఆయ‌న ఆప్యాయ‌త‌నీ, అభిమానాన్నీ గుర్త‌చేసే సంద‌ర్భంగా భావిస్తుంటాను." అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు శార‌ద‌.

శార‌ద‌కు తొలిసారి 'ఊర్వ‌శి' అవార్డు అందించిన 'స్వ‌యంవ‌రం' ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే...

  మొద‌టిసారిగా శార‌ద‌కు 'ఊర్వ‌శి' (జాతీయ ఉత్త‌మ‌న‌టి) అవార్డు అంద‌జేసిన చిత్రం.. మ‌ల‌యాళంలో వ‌చ్చిన 'స్వ‌యంవ‌రం' (1972). ఈ సినిమాలో మ‌ధు, శార‌ద హీరో హీరోయిన్లుగా చేశారు. ఆ సినిమా ప్రారంభ స‌మ‌యానికి న‌టిగా శార‌ద బిజీగా ఉన్నారు. ఒక‌రోజు మ‌ద్రాస్‌లోని ప్ర‌సాద్ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్‌లో ఉండ‌గా, ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడు అక్క‌డ‌కు వ‌చ్చి, ఆమెకు క‌థ చెప్పారు. "ఇది చాలా మంచి పాత్ర‌. ఈ పాత్ర‌ను మీరే చెయ్యాలి." అని చెప్పారు. క‌థ విన్న‌ప్పుడే ఆ సినిమాతో ఎవ‌రికి అవార్డు వ‌చ్చినా, రాక‌పోయినా సినిమాకు మాత్రం త‌ప్ప‌క వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం శార‌ద‌కు క‌లిగింది. అదే విష‌యం ఆయ‌న‌కు చెప్పారు కూడా. ఆమె ఊహించిన‌ట్లుగానే జాతీయ ఉత్త‌మ‌చిత్రంగా అవార్డు రావ‌డ‌మే కాకుండా, డైరెక్ట‌ర్‌గా ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్‌కు, సినిమాటోగ్రాఫ‌ర్‌గా మంక‌డ ర‌వివ‌ర్మ‌కూ, న‌టిగా శార‌ద‌కూ అవార్డులు ల‌భించాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ ముఖ్య‌మైన విష‌యం ఒక‌టుంది. హీరోయిన్ నిండు గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు బిందెతో నీళ్లు తీసుకెళ్లాలి. అప్ప‌టికి శార‌ద వ‌య‌సులో చాలా చిన్న‌వారు. గ‌ర్భిణీ స్త్రీల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందనేది తెలీని వ‌య‌సు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కున్న ప‌రిశీల‌నా జ్ఞానంతో, ఊహాశ‌క్తితో త‌న‌కు తానే ఊహించుకొని ఆ సీన్ చేశారు. స‌రిగ్గా అదే స‌న్నివేశం జాతీయ అవార్డుల క‌మిటీ మెంబ‌ర్స్‌ను బాగా ఆక‌ర్షించింది. ఆ అవార్డుల జ్యూరీలో మెంబ‌ర్‌గా ఉన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృణాల్ సేన్‌.. ఆ త‌ర్వాత ఎప్పుడు క‌నిపించినా ఆ స‌న్నివేశాన్ని గుర్తుచేస్తూ.. "ఆ సీన్ చాలా నేచుర‌ల్‌గా వ‌చ్చింద‌మ్మా, నాకు చాలా బాగా న‌చ్చింది." అని ఆమెతో అనేవారు. విశేష‌మేమంటే అప్ప‌టికి కొన్ని డాక్యుమెంట‌రీలు మాత్ర‌మే తీసిన ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్‌కు 'స్వ‌యంవ‌రం' తొలి ఫీచ‌ర్ ఫిల్మ్ (ఆ త‌ర్వాత దేశంలోని గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందారు ఆదూర్‌). విశ్వం, సీత పాత్ర‌ల్లో మ‌ధు, శార‌ద న‌ట‌న‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. మ‌ల‌యాళం సినిమాలో న్యూవేవ్ సినిమా మూవ్‌మెంట్‌కు ఊత‌మిచ్చిన సినిమాగా 'స్వ‌యంవ‌రం' చ‌రిత్రంలో నిలిచింది.

విజ‌య‌శాంతి తొలిసారిగా త‌న పాత్ర‌కు వాయిస్ ఇచ్చిన‌ సినిమా 'ఒసేయ్ రాముల‌మ్మా'!

  1980లోనే హీరోయిన్‌గా 'కిలాడీ కృష్ణుడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజ‌య‌శాంతి, త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి దాదాపు 17 సంవ‌త్స‌రాలు ప‌ట్టిందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. తెలుగ‌మ్మాయి అయివుండి కూడా అంత‌వ‌ర‌కూ ఆమె చేసిన పాత్ర‌ల‌కు డ‌బ్బింగ్ ఆర్టిస్టులే వాయిస్ ఇస్తూ వ‌చ్చారు. దాస‌రి నారాయ‌ణ‌రావు డైరెక్ట్ చేయ‌గా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన 'ఒసేయ్ రాముల‌మ్మా' మూవీలో తొలిసారి త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పారు విజ‌య‌శాంతి. అదివ‌ర‌కు ఎన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా, క‌ర్త‌వ్యం చిత్రంలో ప్ర‌ద‌ర్శంచిన న‌ట‌న‌కు జాతీయ అవార్డు సాధించినా, ఆమె క్యారెక్ట‌ర్‌కు వేరేవాళ్లు డ‌బ్బింగ్ చెబుతూ వ‌చ్చారు. ఉత్త‌రప్ర‌దేశ్‌లో జ‌రిగి ఓ వాస్త‌వ ఘ‌ట‌న ఆధారంగా 'ఓసేయ్ రాముల‌మ్మా' క‌థ‌ను దాస‌రి త‌యారుచేశారు. షూటింగ్ అయ్యాక ర‌ష్ చూసిన దాస‌రి.. రాముల‌మ్మ పాత్ర‌లో విజ‌య‌శాంతి అభిన‌యం చూసి, అద్భుతం అనుకున్నారు. ఆమె చేతే ఆ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిస్తే మ‌రింత స‌హ‌జంగా ఉంటుంద‌ని భావించారు. విజ‌య‌శాంతికి చెప్పి, ఆమెను ఒప్పించారు. అంతేకాదు, డ‌బ్బింగ్ చెప్పేస‌మ‌యంలో తాను కూడా అక్క‌డే ఉన్నారు. విజ‌య‌శాంతి సొంత గొంతు రాముల‌మ్మ పాత్ర‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. మొద‌ట అమాయ‌క రాముల‌మ్మ‌గా, త‌ర్వాత దుండ‌గుల‌పై తిరుగుబాటు చేసే రాముల‌క్క‌గా విజ‌య‌శాంతి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. అందుకే 1997 మార్చి 7న విడుద‌లైన‌ ఆ చిత్రానికి అఖండ విజ‌యం చేకూర్చి పెట్టారు. ఆ సినిమా విడుద‌లైన త‌ర్వాత నుంచి విజ‌య‌శాంతి ఎక్క‌డ క‌నిపించినా ఆమెను "రాముల‌మ్మా" అని పిల‌వ‌డం ప్రారంభించారంటే.. ఆ పాత్ర వారిపై క‌లిగించిన ప్ర‌భావం అలాంటిది. ఈ చిత్రంలో పోలీసాఫీస‌ర్‌గా కీల‌క‌మైన ఓ అతిథి పాత్ర‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ చేయ‌గా, ప్ర‌జానాట్య‌మండ‌లి గాయ‌కుడు కొమ‌ర‌న్న‌గా దాస‌రి న‌టించారు.

'కిలాడీ కృష్ణుడు' ప‌క్క‌న విజ‌య‌శాంతి ఎలా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారంటే...

  విజ‌య‌శాంతి తొలి చిత్ర క‌థానాయ‌కుడు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఆ సినిమా.. 'కిలాడీ కృష్ణుడు'. 1980 సెప్టెంబ‌ర్ 12న ఆ సినిమా విడుద‌లైంది. విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ అవ‌కాశం విజ‌య‌శాంతికి అనుకోకుండా ల‌భించింది. నిజానికి ఇందులో మొద‌ట హీరోయిన్‌గా ఎంపిక చేసిన తార స్వ‌ప్న‌. ఆమెతో ఒక‌రోజు షూటింగ్ కూడా జ‌రిపారు. ఆమె అప్ప‌టికే దాస‌రి సినిమా 'స్వ‌ప్న‌'తో ప‌రిచ‌య‌మైంది. ఆమె అస‌లు పేరు మంజులా కౌర్ కాగా, ఆ సినిమాతో ఆమెకు స్వ‌ప్న అని పేరు పెట్టారు దాస‌రి. అయితే కృష్ణ ప‌క్క‌న స్వ‌ప్న బాగుండ‌ద‌ని కృష్ణ‌కు స‌న్నిహిత స్నేహితుడైన గిరిబాబు చెప్పారు. విజ‌య‌ల‌లిత అక్క కుమార్తె హీరోయిన్‌గా బాగుంటుంద‌ని ఆయ‌నే సూచించారు. స‌రేన‌ని ఆ అమ్మాయిని పిలిపించారు. చూసి, మ‌రీ చిన్న‌పిల్ల‌లా ఉంద‌ని పెద‌వి విరిచేశారు కృష్ణ‌. కానీ విజ‌య‌నిర్మ‌ల‌కు ఆ అమ్మాయి న‌చ్చింది. భ‌విష్య‌త్తులో పెద్ద హీరోయిన్ అవుతుంద‌నిపించి, కృష్ణ‌ను క‌న్విన్స్ చేసి, ఆమెను తీసుకున్నారు. అలా విజ‌య‌శాంతి హీరోయిన్‌గా ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. పైగా కృష్ణ అనుకున్న విధంగానే ఆయ‌న ప‌క్క‌న ఆమె చిన్న‌పిల్ల‌లా క‌నిపించింద‌నే మాట‌లే వినిపించాయి. అయితే విజ‌య‌నిర్మ‌ల ఊహ త‌ప్పు కాలేదు. భ‌విష్య‌త్తులో సూప‌ర్ హీరోయిన్‌గా, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకొనే రేంజిలో ఆమె ఎదిగారు. 'కిలాడీ కృష్ణుడు' కంటే ముందు విజ‌య‌శాంతి రెండు త‌మిళ సినిమాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ న‌ట‌న విష‌యంలో ఆమె ఇంకా ప‌రిణ‌తి చెంద‌లేదు. సెట్‌లో ఉన్న‌ప్పుడు కృష్ణ‌గారు ఎక్కువ‌గా మాట్లాడ‌రు. చాలా సైలెంట్‌గా ఉంటారు. డైలాగులు చెప్ప‌డం రాక‌పోవ‌డంతో నేను ఎక్కువ టేక్స్ తీసుకున్నా చిరాకు ప‌డ‌కుండా ఆయ‌న ఎంతో ఓపిక చూపేవారు. పాట‌ల విష‌యంలోనూ అంతే. స్టెప్స్ వేయ‌డం నాకు కొత్త కావ‌డంతో చాలా కంగారు కంగారుగా ఉండేది. అయినా విజ‌య‌నిర్మ‌ల‌గారు ఏమీ అన‌కుండా న‌న్ను ప్రోత్స‌హించేవారు. కృష్ణ‌గారు న‌ట‌నాప‌రంగా నాకు ఇచ్చిన స‌ల‌హాలు త‌ర్వాత కాలంలో నాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి అని చెప్పారు విజ‌య‌శాంతి. తొలి సినిమాలో కృష్ణ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేసిన ఆమె, ఆ త‌ర్వాత ఆయ‌న‌తో చేసిన రెండో సినిమాలో చెల్లెలిగా న‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమా.. బాపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'కృష్ణావ‌తారం'. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌శాంతి చేసిన ఏకైక చిత్రం అదే. త‌ర్వాత కాలంలో కృష్ణ‌తో ప‌లు హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించారు విజ‌య‌శాంతి. వాటిలో అగ్నిప‌ర్వ‌తం, నాగాస్త్రం, అశ్వ‌థ్థామ‌, దొంగ‌గారూ స్వాగ‌తం, బ్ర‌హ్మాస్త్రం, కొడుకు దిద్దిన కాపురం త‌దిత‌ర చిత్రాలు ఉన్నాయి. అలాగే విజ‌య‌శాంతి ప్ర‌ధాన పాత్ర పోషించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'ఒసేయ్ రాముల‌మ్మా'లో పోలీస్ ఆఫీస‌ర్‌గా కీల‌క పాత్ర‌ను కృష్ణ చేయ‌డం విశేషం.  (ఈరోజు, జూన్ 24 విజ‌య‌శాంతి పుట్టిన‌రోజు)

తెలుగు సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుసా?

  లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్ రూపొందించిన త‌మిళ చిత్రం 'అపూర్వ రాగంగ‌ళ్' (1975) చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ర‌జ‌నీకాంత్‌, ఆ త‌ర్వాత సంవ‌త్స‌ర‌మే అదే డైరెక్ట‌ర్ తీసిన క్లాసిక్ ఫిల్మ్ 'అంతులేని క‌థ' (1976) తో తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్ప‌ట్నుంచీ ఆయ‌న త‌మిళ సినిమాల్లో న‌టిస్తూనే క్ర‌మం త‌ప్ప‌కుండా 1980 వ‌ర‌కు ప్ర‌తి ఏటా తెలుగు సినిమాలు చేస్తూ వ‌చ్చారు. కానీ ఆ త‌ర్వాత మూడేళ్ల పాటు ఆయ‌న ఒక్క తెలుగు సినిమా చేయ‌కుండా దూరంగా ఉండిపోయారు. మ‌ళ్లీ 'ఇదే నా స‌వాల్' (1984),  'న్యాయం మీరే చెప్పాలి' (1985), 'జీవ‌న పోరాటం' (1986) సినిమాలు మాత్ర‌మే చేశారు. అయినా కూడా అదివ‌ర‌క‌టితో పోల్చుకుంటే తెలుగు సినిమాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం త‌గ్గించేశారు. 1986 త‌ర్వాత పూర్తిగా త‌మిళ సినిమాల మీదే దృష్టి పెట్టారాయ‌న‌. కేవ‌లం త‌న స్నేహితుడు మోహ‌న్‌బాబు కోసం 'పెద‌రాయుడు' (1995)లో పాపారాయుడుగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేశారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆయ‌న తెలుగు సినిమాలు త‌గ్గించుకోవ‌డం లేదా తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. అయితే అది నిజం. ఒక ఇంట‌ర్వ్యూలో "చిల‌క‌మ్మ చెప్పింది, అన్న‌ద‌మ్ముల స‌వాల్‌, మీసం కోసం.. ఇంకా చాలా తెలుగు చిత్రాల్లో న‌టించిన మీరు, ఈ మ‌ధ్య తెలుగులో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి?  మీకు న‌చ్చిన పాత్ర‌లు రానందువ‌ల్లా?  లేక మ‌రేదైనా కార‌ణం ఉన్న‌దా?" అనే ప్ర‌శ్న ఆయ‌న‌కు ఎదురైంది.  దానికి కొద్దిసేపు మౌనంగా ఉండి, "ఇక నుండి తెలుగు సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని నిశ్చ‌యించుకున్నాను" అన్నారు ర‌జ‌నీ. "ఎందుక‌లా?" అన‌డిగితే, "నేను ఒక తెలుగు సినిమాలో న‌టిస్తే, అదే తెలుగు సినిమాని త‌మిళంలోకి డ‌బ్ చేసి, స్ట్ర‌యిట్ పిక్చ‌ర్‌గా త‌మిళ‌నాడులో రిలీజ్ చేస్తున్నారు. ఇది ప్రేక్ష‌కుల్ని మోసం చెయ్య‌డం లాంటిది. ఒక భాష‌నుంచి మ‌రొక భాష‌లోకి చిత్రాన్ని డ‌బ్ చేసిన‌ప్పుడు అది డ‌బ్బింగ్ సినిమా అని ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జెయ్యాలి. అలా కాకుండా స్ట్ర‌యిట్ పిక్చ‌ర్‌గా రిలీజ్ చేస్తే, అస‌లు చిత్రంలో ఉన్న ఎఫెక్ట్స్ డ‌బ్బింగ్ సినిమాలో పోయి, పేల‌వంగా క‌నిపించే ఆస్కారం ఉంది. ఈయ‌న న‌ట‌న ఇలా ఉందేమిటి? అని ప్రేక్ష‌కులు భావించే అవ‌కాశం ఉంది. దీనివ‌ల్ల ఇమేజ్ భంగ‌ప‌డే ఆస్కారం ఉంది. అందుక‌నే తెలుగు సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాను." అని చెప్పారు ర‌జ‌నీకాంత్‌. ఈ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది 1981 డిసెంబ‌ర్ చివ‌ర‌లో. అది కూడా డి. రామానాయుడు త‌మిళంలో నిర్మించిన 'త‌నికాట్టు రాజా' సినిమా సెట్స్‌పై.  సో.. అద‌న్న‌మాట విష‌యం. అంత‌దాకా రెగ్యుల‌ర్‌గా తెలుగు సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఆయ‌న అప్ప‌ట్నుంచీ తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ఆ త‌ర్వాత మూడు నాలుగు తెలుగు సినిమాలు చేశారంతే. త‌న ఇమేజ్ విష‌యంలో అంత జాగ్ర‌త్త తీసుకోవ‌డం వ‌ల్ల‌నే అతి త‌క్కువ కాలంలో ఆయ‌న సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగారు. 

అమెరికాలో ఊగిపోయిన క‌మ‌ల్ ఎక్కిన ఫ్లైట్‌.. మిస్స‌యిన 'నాయ‌క‌న్' ప్రింట్‌!

  మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ రోల్ పోషించిన 'నాయ‌క‌న్' (1987 - తెలుగులో 'నాయ‌కుడు') బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. క‌మ‌ల్ న‌ట‌నా విన్యాసాల‌కు, మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టిన చిత్రంగా నాయ‌క‌న్ కాల‌క్ర‌మంలో క‌ల్ట్ క్లాసిక్ స్టేట‌స్‌ను అందుకుంది. ఆ ఏడాది ఆస్కార్ అవార్డుల పోటీకి భార‌త్ త‌ర‌పున అధికారిక ఎంట్రీగా సెల‌క్ట్ అయింది. ఆ సినిమా అమెరిక‌న్ పంపిణీ హ‌క్కుల్ని అక్క‌డి భార‌తీయుడు శంక‌ర్ ర‌మ‌ణి సొంతం చేసుకున్నారు. వివిధ న‌గ‌రాల్లో ఆ సినిమాని ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాని కోసం ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొనాల్సిందిగా నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌ను, ఆ చిత్ర నిర్మాత జి. వెంక‌టేశ్వ‌ర‌న్‌ను ఆయ‌న ఆహ్వానించారు.  ప‌ది రోజుల్లో అక్క‌డ ప‌లు న‌గ‌రాల్లో తిర‌గాల్సి ఉన్నందున భార్య సారిక, నెల‌ల పిల్ల అయిన శ్రుతిల‌ను తీసుకువెళ్ల‌డం కుద‌ర‌ద‌ని వాళ్ల‌ను మ‌ద్రాస్‌లోనే ఉంచి, త‌నొక్క‌డే నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌న్‌తో క‌లిసి యు.ఎస్‌. వెళ్లారు క‌మ‌ల్‌. 1987 డిసెంబ‌ర్ 17న బ‌య‌లుదేరి, 22 గంట‌ల ప్ర‌యాణం త‌ర్వాత మ‌రుస‌టి రోజు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్‌. కెన్న‌డీ ఎయిర్‌పోర్టులో దిగారు. వారికి శంక‌ర్ ర‌మ‌ణి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. డిసెంబ‌ర్ 19న డెట్రాయ్ న‌గ‌రానికి వెళ్లారు. అక్క‌డ త‌మిళ సంఘంవాళ్లు ఏర్పాటుచేసిన అభినంద‌న స‌భ‌లో పాల్గొన్నారు. ఆ స‌భ‌లో క‌మ‌ల్‌ను త‌మిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా మాట్లాడ‌మ‌ని కోరారు. ఒక్కో భాష‌లో రెండు రెండు మాట‌లు మాట్లాడారు క‌మ‌ల్‌. ఆ స‌భ‌లో మోగిన క‌ర‌తాళధ్వ‌నులు చాలా కాలం దాకా క‌మ‌ల్ చెవుల్లో ప్ర‌తిధ్వ‌నిస్తూ వ‌చ్చాయి. ఆ రాత్రి క‌మ‌ల్‌, వెంక‌టేశ్వ‌ర‌న్ డ‌ల్లాస్ న‌గ‌రానికి వెళ్లాలి కాబ‌ట్టి, చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందే ఎయిర్‌పోర్టుకు బ‌య‌లురేరారు. డెట్రాయ్ విమానాశ్ర‌యంలో వాళ్లు ఎక్కిన విమానం రెండుసార్లు సాంకేతిక వైఫ‌ల్యం వ‌ల్ల ఆగి, బ‌య‌ల్దేరింది. విమానం ఆకాశ మార్గం ప‌ట్టి ప‌ది నిమిషాలై ఉంటుంది. మెల్ల‌గా అటు ఇటు ఊగ‌డం ప్రారంభించింది. కొద్దిసేప‌టికే ఆ ఊపు తీవ్ర‌మైంది. వింత వింత శ‌బ్దాలు వినిపించ‌సాగాయి. లోప‌లున్న అంద‌రికీ భ‌యం వేసింది. అంత‌లో విమానం కెప్టెన్ వ‌చ్చి, భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు అని ధైర్యం చెప్పి, స‌మీపంలోని మెంఫిస్ ఎయిర్‌పోర్టులోకి విమానాన్ని సుర‌క్షితంగా చేర్చాడు. అక్క‌డ్నుంచి మ‌రో ఫ్ల‌యిట్‌లో అర్ధ‌రాత్రి డల్లాస్‌కు చేరుకున్నారు. అక్క‌డ‌కు వెళ్లాక చూసుకుంటే వాళ్ల ల‌గేజీలో ఒక పెట్టె క‌నిపించ‌లేదు. క‌మ‌ల్ వాళ్లు గాభ‌రాప‌డ్డారు. "అందులో పాస్‌పోర్ట్‌, డ‌బ్బు కానీ, ఖ‌రీదైన బ‌ట్ట‌లుకానీ లేవుగా" అన్నారు శంక‌ర్ ర‌మ‌ణి. అవేమీ లేవ‌న్నారు క‌మ‌ల్‌. "అయితే కంగారెందుకు?" అన‌డిగారాయన‌. "ఆ పెట్టెలో అంత‌కంటే విలువైన 'నాయ‌క‌న్' ప్రింట్ ఉంది." అని చెప్పారు వెంక‌టేశ్వ‌ర‌న్‌. డ‌ల్లాస్ సిటీలో మ‌ర్నాడు ఉద‌య‌మే ఆ సినిమాని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది. ఆ ఉద‌యం ఏడు గంట‌ల నుంచి ఫోన్ల మీద నాయ‌క‌న్ ప్రింట్ వేట మొద‌లైంది. 10 గంట‌ల‌కు ఆ పెట్టె డెట్రాయ్ ఎయిర్‌పోర్టులోనే ఉంద‌నే స‌మాచారం వ‌చ్చింది. సాయంత్రం ఐదింటికి అది చేరాకే క‌మ‌ల్ బృందానికి ఊర‌ట ల‌భించింది.

లెజెండ‌రీ యాక్ట‌ర్స్ ఎన్టీఆర్‌, జ‌గ్గ‌య్య క్లాస్‌మేట్స్ అని మీకు తెలుసా?

  వెండితెర‌మీద ఎన్టీఆర్ రేంజ్‌లో వెల‌గ‌క‌పోయినా, గొప్ప న‌టునిగా పేరు సంపాదించుకున్నారు కొంగ‌ర జ‌గ్గ‌య్య‌. కంచుకంఠం ఆయ‌న‌కు బిగ్ ఎస్సెట్‌. శివాజీ గ‌ణేశ‌న్‌కు తెలుగులో వాయిస్ ఇచ్చింది ఆయ‌నే. తెనాలికి ఎనిమిది మైళ్ల దూరంలోని మెరంపూడి గ్రామం జ‌గ్గ‌య్య స్వ‌స్థ‌లం. గుంటూరులోని ఎ.సి. కాలేజీలో ఇంట‌ర్మీడియేట్ చ‌దివాక ఆయ‌న 1944లో గుంటూరు నుంచి వెలువ‌డుతుంటే 'దేశాభిమాని' దిన ప‌త్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా చేరారు. అయితే 1945లో తిరిగి ఎ.సి. కాలేజీలో చేరేలోగా ఆయ‌న 'ఆంధ్రా రిప‌బ్లిక్' అనే ఒక వార‌ప‌త్రిక సంపాద‌కుడిగా ప‌నిచేశారు.  కాలేజీలో న‌ట‌న‌లో ఆస‌క్తి ఉన్న స్టూడెంట్స్ అంతా క‌లిసి మంచి నాట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి పూనుకున్నారు. వాహిని స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసిన‌ వి. శివ‌రామ్ అప్పుడు ఎ.సి. కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసేవారు. వీరంతా క‌లిసి నాట‌కాలు ప్ర‌ద‌ర్శించ‌డంలో కృషి చేసేవారు. ఏటేటా యూనివ‌ర్సిటీ వారు జ‌రిపే ఇంట‌ర్ కాలేజ్ నాట‌క పోటీల్లో ఎ.సి. కాలేజీ బృందానికే మొద‌టి బ‌హుమ‌తి ల‌భిస్తుండేది. ఈ నాట‌కాల‌న్నిటిలోనూ జ‌గ్గ‌య్య ప్ర‌ధాన పాత్ర నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలోనే, ఆ త‌ర్వాత కాలంలో తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌హాన‌టుడిగా వెలుగొందిన నంద‌మూరి తార‌క‌రామారావు ఆయ‌న క్లాస్‌మేట్ కావ‌డం గ‌మ‌నార్హం. 1947లో బీఏ పాస‌య్యి వెంట‌నే దుగ్గిరాల బోర్డు హైస్కూల్లో బీఈడీ అసిస్టెంట్‌గా చేరారు జ‌గ్గ‌య్య‌. బ‌డిపంతులు ఉద్యోగం చేస్తున్న‌ప్ప‌టికీ నాట‌కాలు వేయ‌కుండా ఉండేవారు కాదు. అప్ప‌టికే విజ‌య‌వాడ‌లో ఉంటున్న ఎన్టీఆర్‌తో క‌లిసి అక్క‌డే ఒక నాట‌క సంస్థ‌ను ప్రారంభించారు. దాని పేరు 'ర‌వి ఆర్ట్ థియేట‌ర్‌'. 1948లో ఆంధ్ర నాట‌క క‌ళాప‌రిష‌త్తు న‌డిపిన నాట‌కాల పోటీలో కొప్ప‌ర‌పు సుబ్బారావు రాసిన 'చేసిన పాపం' అనే ఏకాంకిక‌ను త‌మ సంస్థ త‌ర‌పున ఎన్టీఆర్‌, జ‌గ్గ‌య్య ప్ర‌ద‌ర్శించారు. వారి ప్ర‌ద‌ర్శ‌న‌కే ప‌రిష‌త్తువారు ప్ర‌థ‌మ బ‌హుమ‌తి ఇచ్చారు. ఆనాటి స్నేహం ఆ త‌ర్వాత కాలంలోనూ, సినిమాల్లో చేరాక కూడా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కొన‌సాగుతూ వ‌చ్చింది. ఆ ఇద్ద‌రూ ప‌లు సినిమాల్లో క‌లిసి న‌టించారు.

కృష్ణ‌కు త‌మిళం వ‌చ్చుంటే హీరోగా ఫ‌స్ట్ త‌మిళ సినిమా చేసేవారే!

  సూప‌ర్‌స్టార్ కృష్ణ 'తేనె మ‌న‌సులు' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో కృష్ణ‌కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. అయితే నిజానికి ఆయ‌న‌కు మొద‌ట హీరోగా ఆఫ‌ర్ వ‌చ్చింది ఓ త‌మిళ సినిమాకు. అయితే ఆయ‌న‌కు త‌మిళం రాక‌పోవ‌డంతో ఆ ఛాన్స్ చేజారింది. లేన‌ట్ల‌యితే ఆయ‌న త‌మిళ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యుండేవారు. త‌మిళ ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్ ఓసారి చెన్నై పాండీ బ‌జార్‌లోని భార‌త్ కేఫ్ ముందు నిల్చొని ఉన్న కృష్ణ‌ను చూసి, 'చాలా బాగున్నాడు, నా సినిమాలో హీరోగా ప‌నికొస్తాడ‌'ని భావించారు. ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచి, "సినిమాల్లో న‌టిస్తావా?" అన‌డిగితే న‌టిస్తాన‌ని చెప్పారు కృష్ణ‌. "రేపు మా ఆఫీసుకు వ‌చ్చి క‌లుసుకో" అని ఆ ఆఫీసు పేరు, అదెక్క‌డ ఉంటుందో చెప్పి వెళ్లారు.  అప్పుడు శ్రీ‌ధ‌ర్ 'కాద‌లిక్క నేర‌మిల్లై' (1964) అనే త‌మిళ చిత్రాన్ని అంతా కొత్త‌వాళ్ల‌తో తీద్దామ‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ర్నాడు చిత్రాల‌య బ్యాన‌ర్ ఆఫీసుకు వెళ్లారు కృష్ణ‌. ఆయ‌న‌కు త‌న సినిమాలో హీరో వేషం ఇవ్వ‌ద‌ల‌చుకున్న‌ట్లు చెప్పారు శ్రీ‌ధ‌ర్‌. కృష్ణ‌కు ఆనందం వేసింది. అయితే త‌న‌కు త‌మిళం రాద‌ని చెప్పారు. దాంతో ఆయ‌న కోసం ఓ త‌మిళ ట్యూట‌ర్‌ను అరేంజ్ చేశారు శ్రీ‌ధ‌ర్‌. అయితే వారం రోజులు గ‌డిచినా కృష్ణ‌కు త‌మిళం ఏమాత్రం వంట‌ప‌ట్ట‌లేదు. ఎందుకంటే ఆయ‌న దృష్టంతా తెలుగు సినిమాల మీదే ఉంది మ‌రి.  దీంతో ఉప‌యోగం లేద‌నుకున్న శ్రీ‌ధ‌ర్.. హీరో వేషానికి మ‌రో కొత్త న‌టుడు ర‌విచంద్ర‌న్‌ను ఎంపిక‌చేశారు. అలా ఆ సినిమా కృష్ణ‌కు త‌ప్పిపోయింది. లేక‌పోతే 'తేనె మ‌న‌సులు' (1965) కంటే ముందే ఆ సినిమాతో ఆయ‌న ప‌రిచ‌యం అయ్యుండేవాడు. అప్పుడు 'తేనె మ‌న‌సులు' సినిమా మిస్స‌యిపోయేదేమో. విశేష‌మేమంటే శ్రీ‌ధ‌ర్ తీసిన 'కాద‌లిక్క నేర‌మిల్లై' సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. అది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరోగా న‌టించిన 'ప్రేమించి చూడు'.  ఈ ఉదంతం జ‌రిగిన ప‌దహారు సంవ‌త్స‌రాల‌కు శ్రీ‌ధ‌ర్ డైరెక్ష‌న్‌లో తొలిసారి న‌టించారు కృష్ణ‌. ఆ సినిమా.. ఎక్కువ‌గా అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న 'హ‌రే కృష్ణ హ‌లో రాధ' (1980).

మ‌ధుర గాయ‌ని వాణీ జ‌య‌రామ్ గురించి మీకు తెలీని నిజాలు!

  అక్క‌చెల్లెళ్లు ల‌తా మంగేష్క‌ర్‌, ఆశా భోస్లే త‌ర్వాత 1970 నుంచీ ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు ఇటు ద‌క్షిణాదిన‌, అటు ఉత్త‌రాదిన ఒకేసారి విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న మ‌ధుర గాయ‌ని వాణీ జ‌య‌రామ్‌. "బ్రోచే వారెవ‌రురా" (శంక‌రాభ‌ర‌ణం), "ఆ లోక‌యే శ్రీ బాల‌కృష్ణం" (శ్రుతిల‌య‌లు), "మిన్నేటి సూరీడు వ‌చ్చేన‌మ్మా" (సీతాకోక చిలుక‌), "కురిసేను విరిజ‌ల్లులే" (ఘ‌ర్ష‌ణ‌) లాంటి పాట‌ల‌తో ఆమె సంగీత ప్రియుల‌ను త‌న గాన మాధుర్యంలో ఓల‌లాడేట్లు చేశారు. ఆమెకు సంబంధించి చాలా మంది తెలీని విష‌యాలు... త‌ల్లిదండ్రుల‌కు ఐదో సంతానంగా త‌మిళ‌నాడులోని వెల్లూరులో ఆమె జ‌న్మించారు. అప్ప‌టికే న‌లుగురు కుమార్తెలు క‌న్న వారు ఐదో సంతాన‌మైనా మ‌గ‌పిల్లాడు పుడ‌తాడ‌ని వారు ఊహించారు. ఆమె పూర్తిపేరు క‌లై వాణి. గ‌త జ‌న్మ‌లో ఆమె కుమార‌స్వామిని తేనెతో పూజ చేయ‌డం వ‌ల్లే మంచి స్వ‌రంతో పుట్టిందంటూ జ్యోతిష్కులు ఆమెకు ఆ పేరు సూచించారు. క‌ళాకారిణుల‌కు వివాహం వారి కెరీర్‌కు ఒక్కోసారి తీవ్ర అవ‌రోధంగా నిలుస్తుంది. కానీ జ‌య‌రామ్‌తో పెళ్లి వాణి కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్ అయ్యింది. 1969లో వారి వివాహం అయ్యాక‌, భ‌ర్త ప్రోత్సాహంతోనే సినిమా ఇండ‌స్ట్రీలోకి ఆమె ప్ర‌వేశించారు. పెళ్లికి ముందు తాను సినీ గాయ‌నిగా మార‌తానంటే తండ్రి సుత‌రామూ ఒప్పుకోలేదు. వాణి భ‌ర్త జ‌య‌రామ్‌కు సంగీత‌మంటే ప్రాణం. ఆయ‌న స్వ‌యంగా పండిట్ ర‌విశంక‌ర్ ద‌గ్గ‌ర సితార్ నేర్చుకున్నారు. భ‌ర్త‌, అత్త‌గారి ప్రోత్సాహంతో అబ్దుల్ రెహ‌మాన్ ద‌గ్గ‌ర హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు వాణి. ఎక‌నామిక్స్‌లో డిగ్రీ చేసిన ఆమె కొంత‌కాలం బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆమె గాన మాధుర్యానికి ప‌ర‌వ‌శించిన ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు వసంత్ దేశాయ్ ఆమెతో మ‌రాఠీ భ‌జ‌న‌లు రికార్డ్ చేయించుకున్నారు. అంతే కాదు, హృషికేశ్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేసిన 'గుడ్డీ' (1970) చిత్రంలోని పాట‌ల‌న్నింటీనీ ఆమె చేత పాడించారు వ‌సంత్ దేశాయ్‌. ఆ సినిమాలో ఆమె పాడిన "బోలే రే ప‌ప్పీ హ‌రా.." పాట ఆ రోజుల్లో జ‌నం నోళ్ల‌ల్లో విప‌రీతంగా నాన‌డ‌మే కాకుండా, జాతీయ ఉత్త‌మ గాయ‌ని అవార్డు, తాన్‌సేన్ అవార్డు స‌హా ప‌లు అవార్డుల‌ను సాధించిపెట్టింది.  'శంక‌రాభ‌ర‌ణం' కోసం పాడిన "మాన‌స సంచ‌రిరే" పాట‌తో రెండో సారి, 'స్వాతికిర‌ణం' చిత్రంలోని "ఆన‌తినీయ‌రా హ‌రా" పాట‌తో మూడోసారి జాతీయ ఉత్త‌మ గాయ‌ని పుర‌స్కారాల‌ను అందుకున్నారు వాణీ జ‌య‌రామ్‌. రెండు ద‌శాబ్దాల‌కు పైనుంచే సినిమా పాట‌ల‌కు దూరంగా ఉన్న ఆమె శాస్త్రీయ సంగీత క‌చేరీలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఆమె విడుద‌ల చేసిన 'గీత గోవిందం', 'ఆదిశంక‌రుని ఆనంద‌ల‌హ‌రి' ఆడియో క్యాసెట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వాణీ జ‌య‌రామ్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, హ‌ర్యాన్వీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా భాష‌ల్లో పాట‌లు పాడారు. ఆమె భ‌ర్త‌ జ‌య‌రామ్ 2018లో మృతి చెందారు.