డాన్సుల్లో చిరంజీవికి ఇన్‌స్పిరేష‌న్‌.. జ్యోతిల‌క్ష్మి!

  తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్పీడ్ డాన్స్‌, డిస్కో డాన్స్‌, బ్రేక్ డాన్స్ లాంటి వాటిని ప‌రిచ‌యం చేసింది ఎవ‌రంటే.. ఎవ‌రైనా ఠ‌క్కున చేప్పేస్తారు.. చిరంజీవి అని. తెలుగు సినిమాల్లో అప్ప‌టిదాకా క‌నిపించిన డాన్సులు వేరు.. చిరంజీవి వ‌చ్చాక ఆ డాన్సుల తీరు మారిపోయింది. హీరో కూడా అందంగా, సొగ‌సుగా ఒక గ్రేస్‌తో డాన్స్ చేయ‌గ‌ల‌డ‌ని చిరంజీవి నిరూపించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ వ‌చ్చే దాకా తెలుగు సినిమాల్లో డాన్సులంటే చిరంజీవివే అనే అభిప్రాయం అంద‌రిలోనూ ఉంది.  చిరంజీవి అంత నైపుణ్యంగా డాన్సులు వేయ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా?  నిన్న‌టి త‌రం శృంగార తార‌.. జ్యోతిల‌క్ష్మి! ఏంటీ.. ఆశ్చ‌ర్యంగా ఉందా? అలా అని చిరంజీవే స్వ‌యంగా ఒక‌సారి చెప్పారు. "నేను హైస్కూలు చ‌దివేప్ప‌ట్నుంచీ జ్యోతిల‌క్ష్మిగారి సినిమాలు తెగ చూస్తూ వ‌చ్చాను. కాలేజీకొచ్చాక ఆమె సినిమా చూసి, ఆమె చేసిన విధంగా ఒక గ‌దిలో డాన్స్ చేసేవాడ్ని. ఆవిధంగా నేను జ్యోతిల‌క్ష్మిగారికి ఏక‌ల‌వ్య శిష్యుడ్ని" అని చెప్పారు చిరంజీవి. అలా డాన్సులో త‌న ఆరాధ్య తార అయిన జ్యోతిల‌క్ష్మితో క‌లిసి న‌టించే చాన్స్ ఆయ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు, త‌న అభిమానం విష‌యం ఆమెకు చెప్పారంట‌. అప్ప‌టికే హీరోగా ఆయ‌న మంచి పేరు తెచ్చుకున్నారు. మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయిన జ్యోతిల‌క్ష్మి, ఆ త‌ర్వాత న‌వ్వుతూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశార‌ట‌. నిజంగానే జ్యోతిల‌క్ష్మి అద్భుత‌మైన డాన్సర్ అనే విష‌యం మ‌న‌కు తెలుసు. ఆమె భారీ శ‌రీరానికీ, ఆమె చేసే డాన్సుకు సంబంధం లేద‌న్న‌ట్లు గొప్ప‌గా డాన్స్ చేసేవారామె. అలా ఆమె ఇన్‌స్పిరేష‌న్‌తో డాన్సులు చేస్తూ, ఆ విష‌యంలో తిరుగులేని హీరోగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు.

తెర‌పై త‌న పేరు బాలు ఎప్పుడు చూసుకున్నారో మీకు తెలుసా?

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల స‌రిహ‌ద్దుప‌ల్లె కోనేటంపేట‌లో పుట్టిన శ్రీ‌ప‌తి పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తెలుగువారికీ, త‌మిళుల‌కూ ఉమ్మ‌డి సినీ గాయ‌కుడు. త‌మిళాంధ్ర దేశాల‌ను బాలులాగ ఉర్రూత‌లూగించిన గాయ‌కుడు మ‌రొక‌రు లేరు. ఒక‌విధంగా ఘంట‌సాల తెలుగు రంగానికీ, టి.ఎం. సౌంద‌ర‌రాజ‌న్ త‌మిళ రంగానికీ ప‌రిమిత‌మైన‌వాళ్లు. కాని బాలు గ‌ళం ఈ రెండు రంగాల‌కే కాకుండా క‌న్న‌డ‌, హిందీ రంగాల‌కు కూడా వ్యాపించి తెలుగు గాయ‌క‌శ్రేణికి అఖండ‌మైన కీర్తి ఆర్జించి పెట్టింది. అయితే బాలు కేవ‌లం గాయ‌కుడు మాత్ర‌మే కాదు. ఆయ‌న‌లో గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు కొద్దే అయిన‌ప్ప‌టికీ, ఆ చిత్రాల‌లోని ప్ర‌తి పాటా ఒక మ‌ణిపూస. ఆయ‌న స్వ‌ర‌ర‌చ‌న అంతటి మ‌ధుర‌మైన‌ది, అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ది. ఆయ‌న 30 తెలుగు చిత్రాల‌కు సంగీతం స‌మ‌కూర్చారు. నేటి త‌రంలో చాలా మందికి తెలీని విష‌యం ఆయ‌న ఇత‌ర భాషా చిత్రాల‌కూ సంగీత బాణీలు అందించార‌నేది. 9 క‌న్న‌డ సినిమాలు, 5 త‌మిళ సినిమాలు ఆయ‌న సంగీత ర‌చ‌న‌కు నోచుకున్నాయి. అంతే కాదు, 'నాచే మ‌యూరి' (1986) హిందీ సినిమాకూ ఆయ‌న బాణీలు కూర్చారు. 'హ‌మ్ పాంచ్' (1980) సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన చ‌రిత్ర బాలుది. నిజానికి ఆయ‌న సినీ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందే స్వ‌ర‌కర్త అయ్యారు. ఆల్ ఇండియా రేడియో పోటీల కోసం తొలిసారిగా ఆయ‌న స్వ‌రాలు కూర్చారు. 1961-62 ప్రాంతంలో త‌న తండ్రిగారు రాసిన రెండు పాట‌ల‌కు బాలు స్వ‌యంగా స్వ‌రాలు కూర్చారు. వాటిలో 'పాడ‌వే ప‌ల్ల‌కీ..' అనేది ఒక పాట అయితే, 'ప‌చ్చ‌ని వెచ్చ‌ని ప‌చ్చిక సుడిలో..' అనేది మ‌రో పాట‌. విశేష‌మేమంటే అస‌లు సంగీత‌మే నేర్చుకోని ఆయ‌న ల‌లిత సంగీత ఛాయ‌ల‌తో వాటికి సంగీతం స‌మ‌కూర్చ‌డం. ఆ త‌ర్వాత‌, 1963లో మ‌ద్రాసులోని క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్‌లో జ‌రిగిన పాట‌ల పోటీల కోసం 'రాగ‌మో అనురాగ‌మో..' పాట త‌నే రాసుకొని, స్వ‌రాలు అల్లారు బాలు. ఆ పాట‌తోనే త‌న గురువు ఎస్పీ కోదండ‌పాణి దృష్టిలో ప‌డ్డారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చింది న‌టుడు పేకేటి శివ‌రామ్‌. అయితే అది సినిమా కోసం కాదు, 'తెలుగు త‌ల్లి' అనే డాక్యుమెంట‌రీకి. దానికి నేప‌థ్య సంగీతం అందించారు బాలు. అందులో ఓ పాటకి కూడా సంగీతం స‌మ‌కూర్చారు. అలా మొద‌టిసారి తెర‌మీద సంగీత ద‌ర్శ‌కునిగా త‌న పేరు చూసుకున్నారు బాలు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న సినీ సంగీత ద‌ర్శ‌కుడ్ని చేసింది దాస‌రి నారాయ‌ణ‌రావు. 1977లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'క‌న్యాకుమారి' సినిమాతో గాయ‌కుడు బాలు సినీ సంగీత ద‌ర్శ‌కుడిగా కూడా మారారు.

తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్కేదెప్పుడు?

  జాతీయ స్థాయిలో తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, తెలుగు సినీ క‌ళాకారుల‌కు స‌రైన గుర్తింపు, గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని చాలామంది సినిమావాళ్లు వాపోతుంటారు. ఎట్ట‌కేల‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' సినిమాలు సాధించిన అసాధార‌ణ విజ‌యంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భించింద‌ని సంతోష‌ప‌డుతున్నాం మ‌నం. క‌ళ‌కు, క‌ళాకారుల‌కు గుర్తింపు ల‌భించాల‌ని కోరుకోవ‌డం స‌మంజ‌సం, స‌మ‌ర్థ‌నీయం! అలాంటి గుర్తింపు పొంద‌గ‌లిగిన క‌ళాకారులు ఎంతో సంతృప్తి చెందుతారు. అయితే ఇక్క‌డ ఒక అనుమానం. కంటెంట్ ప‌రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంద‌గ‌ల స్థాయిలో మ‌న సినిమాలు ఉంటున్నాయా? అని ప్ర‌శ్నించుకుంటే మ‌న‌కు అంత సంతృప్తిక‌ర‌మైన జ‌వాబు ల‌భించ‌దు. సినిమాల సంఖ్య‌లో మ‌నం బాలీవుడ్‌తో పోటీ పడుతున్నాం. కొన్ని క్యాలండ‌ర్ సంవ‌త్స‌రాల్లో హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువ‌గా నిర్మాణ‌మైన సంద‌ర్భాలున్నాయి.  కానీ కంటెంట్‌ క్వాలిటీ విష‌యంలో మాత్రం అంద‌రికంటే చాలా వెనుక‌బ‌డి ఉన్నామ‌న్న విష‌యం బాధ క‌లిగిస్తున్నా ఒప్పుకోవాల్సిందే. సామాజిక స్పృహ‌, సాంఘిక ప్ర‌యోజ‌నం లాంటి అంశాల కోసం మ‌న సినిమాల్లో కాగ‌డాపెట్టి వెత‌కాలి. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే అలాంటి సినిమాలు వ‌స్తుంటాయి.  క‌ళాత్మ‌క విలువ‌ల‌కు మ‌న సినిమాలు బ‌హుదూరంగా ఉంటాయి. కేవ‌లం వ్యాపార‌దృష్టి, లాభాపేక్ష త‌ప్ప స‌మాజంపై నైతిక బాధ్య‌త‌ను మ‌న సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌వు.  అరువు తెచ్చుకున్న క‌థ‌ల‌తో, మ‌న వాతావ‌ర‌ణం ఏమాత్రం క‌నిపించ‌ని స‌న్నివేశాల‌తో, మూడు ఫైట్లు, ఆరు డ్యూయెట్లు (ఒక్కోసారి అటుదిటు) లాంటి మూస ధోర‌ణిలో నిర్మాణ‌మ‌య్యే మ‌న సినిమాల‌కు జాతీయ స్థాయిలో అవార్డులు ల‌భించ‌డం ఎలా సాధ్యం? ఇక ఇంత‌దాకా ఒక్క తెలుగు సినిమా కూడా ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డుల‌ను అందించ‌లేక‌పోయిందంటే ఎంత‌టి అవ‌మాన‌క‌రం! మ‌న‌కంటే ఎంతో చిన్న‌వైన మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌రాఠీ, బెంగాలీ, ఒడిశా సినీ ప‌రిశ్ర‌మ‌లు ఎంతో విలువైన‌, అభ్యుద‌యం మూర్తీభ‌వించిన సినిమాలు నిర్మిస్తూ జాతీయంగానే కాకుండా అంత‌ర్జాతీయంగానూ అవార్డులు సాధిస్తున్నారు. స‌మాంజంపై అవ‌గాహ‌న‌ను ప్ర‌ద‌ర్శిస్తూ, స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిబింబించే ప్ర‌యోజ‌నాత్మ‌క చిత్రాల‌కు ఎప్పుడూ గుర్తింపు ల‌భిస్తూనే ఉంటుంది. నిమ‌జ్జ‌నం, శంక‌రాభ‌ర‌ణం, మేఘ‌సందేశం, రుద్ర‌వీణ‌, క‌ర్త‌వ్యం, గీతాంజ‌లి, దాసి, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హాన‌టి, మ‌హ‌ర్షి లాంటి చిత్రాల‌కు జాతీయ పుర‌స్కారాలు ల‌భించిన సంద‌ర్భాలున్నాయి. ప‌రిశీలిస్తే ఉత్త‌మాభిరుచులు క‌లిగిన చిత్రాల‌కు ఎప్పుడూ గుర్తింపు, అవార్డులు ల‌భిస్తాయ‌నే విష‌యాన్ని మ‌నం విస్మ‌రించ‌కూడ‌దు. సినిమాల సంఖ్య‌లో సాధిస్తున్న ప్ర‌గ‌తిని, క్వాలిటీ విష‌యం వైపు కూడా మ‌ళ్లించ‌గ‌లిగితే మ‌న‌కూ కంటెంట్ ప‌రంగా ఎన‌లేని గుర్తింపు ల‌భిస్తుంది. సినీ ప్ర‌ముఖులంతా ఈ విష‌యంపై ఆలోచించాలి.

అమ్మ అంత్య‌క్రియ‌ల‌ను శ్రీ‌దేవి నిర్వ‌హించార‌ని మీకు తెలుసా?

  అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి కోట్లాదిమంది ఆరాధ‌కుల్ని, అభిమానుల్ని దుఃఖ సాగ‌రంలో ముంచేసి 2018 ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లో అనూహ్య‌మైన ప‌రిస్థితుల్లో తిరిగిరాని లోకాల‌కు త‌ర‌లిపోయారు. నాలుగేళ్ల ప‌సివ‌య‌సులో బాల‌న‌టిగా కెరీర్‌ను ఆరంభించి స్టార్ కిడ్‌గా పేరు తెచ్చుకొని, ఆ త‌ర్వాత ద‌క్షిణాది, ఉత్త‌రాది తేడా లేకుండా తారాప‌థానికి దూసుకుపోయి, తిరుగులేని నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌గా రాణించారు శ్రీ‌దేవి. ఆమెకు త‌ల్లితండ్రుల‌తో అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ‌. ఒక‌వైపు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూతుర్ని పెంచుతూనే, ఆమెను అమితంగా ప్రేమించేవారు త‌ల్లితండ్రులు రాజేశ్వ‌రి, అయ్య‌ప్ప‌న్‌. షూటింగ్‌కు వెళ్తున్న‌ప్పుడు రోజుకోసారైనా ఫోన్లో మాట్లాడ‌క‌పోతే వారితో ఫోన్‌లో మాట్లాడ‌క‌పోతే శ్రీ‌దేవికి ఏం తోచేది కాదు. వాళ్ల‌ను విడిచి షూటింగ్‌ల కోసం దూర‌ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నా ఆమెకు క‌ష్టంగా ఉండేది. అయితే, ఓసారి కొన్ని నెల‌ల‌పాటు వ‌రుస షూటింగ్‌ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. హిందీ సినిమాలు 'గురుదేవ్‌', 'రూప్‌కీ రాణీ చోరోంకా రాజా', 'ల‌మ్హే'.. ఈ మూడు సినిమాలూ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వ‌రుస‌గా షూటింగ్‌లు జ‌రిగాయి. ఆ టైమ్‌లో రోజూ ఉద‌యాన్నే ఇంటి నుంచి ఆమెకు ఫోన్ వ‌చ్చేది. అమ్మానాన్న‌ల‌తో కాసేపు మాట్లాడేసి స్పాట్‌కు వెళ్లేవారు శ్రీ‌దేవి. కానీ, ఓరోజు.. ఎందుక‌నో తండ్రి నుంచి ఫోన్ రాలేదు. చాలాసేపు ఎదురుచూసి, ఎప్ప‌టికీ ఫోన్ రాక‌పోవ‌డంతో దిగాలుగా షూటింగ్‌కు వెళ్లిపోయారు. ఆ మ‌ర్నాడు ఉద‌యాన్నే అమ్మ ఫోన్ చేశారు. "నాన్న‌కు ఒంట్లో బాలేదు, అందుకే నిన్న నీకు ఫోన్ చేయ‌లేదు" అని చెప్పారు. అస‌లు విష‌యం ఏంటంటే.. వాళ్ల‌నాన్న ఆ ముందురోజే మృతిచెందారు! అది తెలిస్తే కూతురు త‌ట్టుకోలేద‌నీ, వెంట‌నే ఇంటికి బ‌య‌లురేది రావ‌డం క‌ష్ట‌మ‌నీ చెప్ప‌లేదు. ఆ బాధ నుంచి కోలుకోవ‌డానికి ఆమెకు చాలా కాలం ప‌ట్టింది.  ఆ త‌ర్వాత రాజేశ్వ‌రిగారికి అనారోగ్యం. అప్ప‌ట్లో శ్రీ‌దేవి 'జుదాయి' షూటింగ్‌లో ఉన్నారు. అమ్మ చ‌నిపోయింద‌ని ఫోన్ వ‌చ్చింది. వెంట‌నే ఇంటికి వ‌చ్చేశారు. అమ్మ ఆమెతో ఎప్పుడూ అంటుండేవారు, "నువ్వు నా కూతురివి కాదు.. కొడుకువి" అని. అందుకే అమ్మ అంత్య‌క్రియ‌లు శ్రీ‌దేవే నిర్వ‌హించారు. అది ఆమె జీవితంలో అత్యంత విషాద‌క‌ర ఘ‌ట‌న‌. అమ్మానాన్న‌లు చ‌నిపోయిన‌ప్పుడు ఆమె క‌ళ్ల‌వెంట నీళ్లు రాలేదు. అలాగ‌ని ధైర్యంగానూ లేరు. ఏదో నిర్వికార భావ‌న ఆమెను చాలా రోజుల‌పాటు ఆవ‌హించింది.

సినిమాల్లో మాదిరిగానే ఉపేంద్ర‌-ప్రియాంక ల‌వ్ స్టోరీ కూడా వెరైటీయే!

  వెరైటీ సినిమాలు, వెరైటీ క్యారెక్ట‌ర్స్‌తో అటు క‌న్న‌డ‌, ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్న న‌టుడు ఉపేంద్ర అలియాస్ ఉప్పి దాదా. క‌న్న‌డంలో సూప‌ర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఉపేంద్ర తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించి మ‌న‌వాళ్ల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఓం, ఎ, క‌న్యాదానం, ఉపేంద్ర‌, రా.. సినిమాలు అత‌డికి బాగా పేరు తెచ్చాయి. ఆమ‌ధ్య అల్లు అర్జున్ సినిమా 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి'లో ఓ కీల‌క పాత్ర చేశాడు. అత‌ను న‌టి ప్రియాంక‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్ద‌రూ క‌లిసి 'రా', 'H2O', 'శ్రీ‌మ‌తి' సినిమాలు క‌లిసి చేశారు.  2001లో 'రా' సినిమా చేసేప్పుడు తొలిసారి ఉపేంద్ర‌, ప్రియాంక క‌లుసుకున్నారు. అప్ప‌టికే ప్రియాంక బెంగాలీ, హిందీ సినిమాల్లో అప్‌క‌మింగ్ యాక్ట్రెస్‌. కోల్‌క‌తాలో అందాల పోటీ విజేత‌. త‌న‌కు కాబోయే భ‌ర్త ఒక సూప‌ర్‌స్టార్ అని అప్ప‌టికి ఆమెకు తెలీదు. ఆమె తండ్రి ఒక ఇంజ‌నీర్‌. కొంత‌కాలం ఆమె కుటుంబం అమెరికాలోనూ, త‌ర్వాత సింగ‌పూర్‌లోనూ పెరిగింది. అందువ‌ల్ల ఆమెకు ద‌క్షిణ భార‌త సినిమాల గురించి ఏమీ తెలీదు. బ‌సు చ‌ట‌ర్జీ డైరెక్ట్ చేసిన బెంగాలీ చిత్రం 'హ‌త బ్రిష్టి '(1999) ద్వారా ఆమె సినిమాల్లో అడుగుపెట్టింది. త‌మిళ‌, తెలుగు సినిమాల్లో న‌టించ‌డానికి ముందు కొన్ని బెంగాలీ సినిమాలు, ఓ రెండు హిందీ సినిమాలు చేసిందామె. ఆ త‌ర్వాత ఆమె తెలుగు మూవీ 'రా' సెట్స్ మీద ఉపేంద్ర‌ను క‌లుసుకుంది. తెర‌పై య‌మ ఎన‌ర్జిటిగ్గా క‌నిపించే ఉపేంద్ర నిజ జీవితంలో ఇంట్రావ‌ర్ట్‌. ప్రియాంక అందుకు భిన్నం. ప‌రిచ‌య పెరిగినా, ఇద్ద‌రూ డేటింగ్‌కు వెళ్లిన సంద‌ర్భం లేదంటే ఆశ్చ‌ర్య‌మేస్తుంది కానీ.. అది నిజం. "డిన్న‌ర్ డేట్స్ కానీ, లాంగ్ డ్రైవ్స్ కానీ, చేయీ చేయీ క‌లిపి తిర‌గ‌డం కానీ ఏమీ చేయ‌లేదు మేం. అలాంటివి జ‌ర‌గ‌లేదు. అత‌ను ముంబైలో ఉన్న‌ప్పుడు మా ఇంటికి వ‌చ్చేవాడు. గంట‌ల కొద్దీ మా అమ్మానాన్న‌ల‌తో మాట్లాడేవాడు. అయితే అత‌ను ఆస్ట్రేలియాలో ఉన్న‌ప్పుడు కూడా రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. దాంతో ఫోన్ బిల్లు త‌డిసి మోపెడ‌య్యేది. అది గ‌మ‌నించిన మా అమ్మ‌, ఫోన్‌లో మాట్లాడుకునే బ‌దులు, ఒకే సిటీలో ఉంటున్న‌ప్పుడు క‌లిసి మాట్లాడుకోవ‌డం మంచిద‌ని సూచించింది." అని చెప్పింది ప్రియాంక‌. అలా 2003లో 'H2O' సినిమా చేస్తున్న‌ప్పుడు పెద్ద‌ల అంగీకారంతో ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌ర‌మే కొడుకు ఆయుష్‌, 2005లో కూతురు ఐశ్వ‌ర్య పుట్టారు. అమెరికా, సింగ‌పూర్‌లో పెరిగిన ప్రియాంక‌ చాలా త్వ‌ర‌గానే క‌న్న‌డ సంప్ర‌దాయాల‌ను వంట‌బ‌ట్టించుకొని, అత్తామామ‌ల‌కు ఇష్టురాలైన కోడ‌లిగా మారింది. కొత్త‌లో క‌న్న‌డంతో అడ్జ‌స్ట్ అవ‌డానికి ఇబ్బంది ప‌డినా, ఆ త‌ర్వాత దాన్ని చ‌క్క‌గా మాట్లాడ్డం అల‌వ‌డింది. ఇప్పుడామెకు బెంగ‌ళూరే లోకం.  ఒక సూప‌ర్‌స్టార్‌కు భార్య కావ‌డం ఎంత ఆనంద‌క‌ర విష‌య‌మో, అత‌నికి సంబంధించిన విష‌యాల‌ను డీల్ చేయ‌డం అంత క్లిష్ట‌మైన వ్య‌వ‌హారం. ఉపేంద్ర‌ను క‌లుసుకోవ‌డానికి ఎప్పుడూ అభిమానులు వ‌స్తూ ఉంటారు. వాళ్ల‌తో టైమ్ గ‌డ‌ప‌డం ఉపేంద్ర‌కు త‌ప్ప‌నిస‌రి వ్య‌వ‌హారం. దాన్ని కూడా త‌న జీవితంలో ఒక భాగంగా చేసుకుంది ప్రియాంక‌. "అనేక‌మంది ప్రేమ‌ను పొంద‌డం చిన్న విష‌యం కాదు. అది చూసి నాకు ఆనంద వేస్తుంటుంది. అయితే బ‌ర్త్‌డేకి ఉప్పికి విషెస్ చెప్ప‌డానిక్కూడా నాకు క‌ష్ట‌మైపోతుంటుంది. ఫ్యాన్స్‌తో అత‌ని బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేస్తుంటాం. ప్ర‌తి ఐదు నిమిషాల‌కొక‌రు మా నోట్లో కేక్ పెట్టి, ఫొటోలు దిగుతుంటారు." అని చెబుతుందామె. పెళ్లి త‌ర్వాత కూడా ఆమె న‌టించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం తెలుప‌లేదు ఉపేంద్ర‌. ఆ త‌ర్వాత కూడా ఆమె క‌న్న‌డ‌, త‌మిళ‌, బెంగాలీ, హిందీ సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో నాలుగు క‌న్న‌డ సినిమాలు, ఒక హిందీ సినిమా ఉంది.

'గీతాంజ‌లి' గిరిజ‌ హ‌ఠాత్తుగా సినిమాల‌ నుంచి ఎందుకు త‌ప్పుకుందో తెలిస్తే షాక‌వుతారు!

  జ‌న‌ర‌ల్‌గా ఎక్కువ సినిమాల‌ను అంగీక‌రించ‌డం ద్వారా హీరోయిన్లు ఎక్కువ‌గా వార్త‌ల్లో క‌నిపిస్తుంటారు. కానీ పెద్ద పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు వ‌చ్చినా నిర్మొహ‌మాటంగా నో చెప్తూ అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచారు 'గీతాంజ‌లి' గిరిజ‌. నాగార్జున హీరోగా మ‌ణిర‌త్నం రూపొందించిన ప్రేమ‌క‌థాచిత్రం 'గీతాంజ‌లి' (1989)లో టైటిల్ రోల్ పోషించ‌డం ద్వారా హీరోయిన్‌గా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయిన గిరిజ‌, ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న రెండు సినిమాలు - 'వంద‌నం', 'ధ‌నుష్కోడి'లో న‌టించారు. అయితే ప్రియ‌ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేసిన 'ధ‌నుష్కోడి' ఎందుక‌నో విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయింది.  హిందీ చిత్రం 'జో జీతా వోహి సికింద‌ర్‌' (1992)లో ఆమిర్ ఖాన్ స‌ర‌స‌న మొద‌ట నాయిక‌గా ఎంపికై, ఓ పాట‌, కొన్ని స‌న్నివేశాలు తీశాక‌, మ‌రో ముఖ్య‌మైన ప‌నికోసం అర్ధంత‌రంగా ఆ సినిమా వ‌దిలేశారు. ఆ త‌ర్వాత ఆమె క్యారెక్ట‌ర్‌లోకి ఆయేషా జుల్కా వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె న‌టించింది తెలుగులో 'హృద‌యాంజ‌లి' అనే సినిమాలోనే. పెద్ద హీరోల‌తో న‌టించేందుకు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వ‌దులుకొని, 'హృద‌యాంజ‌లి' అనే చిన్న సినిమాలో న‌టించ‌డానికి ఆమె ఒప్పుకోవ‌డం టాక్ ఆఫ్ ద టౌన్‌. అప్ప‌ట్లో, "మీరెందుకు ప‌లు అవ‌కాశాల‌ను వ‌దులుకుంటున్నారు?" అనే ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు, "నిజ‌మే.. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగుతున్నారు. కానీ నాకు హీరో కాదు ముఖ్యం. క‌థ ఏంటి?  నా పాత్ర ఏంటి? అన‌డిగితే ఎవ‌రూ స‌రిగా చెప్ప‌కుండా, 'హీరో డేట్స్ ఇవి. ఆ డేట్స్‌లో మీరు కాల్షీట్లు ఇవ్వాలి.; ఇదీ రెమ్యూన‌రేష‌న్‌.; ఇదీ అడ్వాన్స్‌.' అని చెప్ప‌డం నాకు హాస్యాస్ప‌దంగా అనిపిస్తోంది. న‌టిగా నేను మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటానే కానీ, డ‌బ్బు కోస‌మ‌ని ఆట‌బొమ్మ‌లా సినిమాల్లో క‌నిపించ‌డం నాకెంత‌మాత్రం ఇష్టం ఉండ‌దు. నా వ్య‌క్తిత్వాన్ని నేనెందుకు అవ‌మానించుకోవాలి? అందుకే నేను విన‌యంగా అట్లాంటి నిర్మాత‌లంద‌రికీ 'నో' అని చెబుతున్నాను. ఇందులో ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌డం నా ఉద్దేశం కాదు. నా అభిరుచికి త‌గిన చిత్రం ల‌భించిన‌ప్పుడు, త‌ప్ప‌క నేను అంగీక‌రిస్తాను. అంత‌వ‌ర‌కు ఖాళీగా ఉండ‌కుండా నేను ర‌చ‌నా వ్యాసంగాన్ని కొన‌సాగిస్తాను." అని చెప్పారు గిరిజ‌. అన్న‌ట్లే త‌న మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌లు రాక‌పోవ‌డంతో సినీ రంగం నుంచి త‌ప్పుకున్నారు. 'హృద‌యాంజ‌లి' సినిమాలో ఆమె ఒక ఇంగ్లీష్ సాంగ్ కూడా రాశారు. సింగ‌ర్ బ్రెండా పాడిన ఆ సాంగ్ సూప‌ర్ పాపుల‌ర్ అవ‌డంతో పొయెట్‌గానూ గిరిజ స‌క్సెస్ అనిపించుకున్నారు. సంజ‌య్ మిత్రా, గిరిజ జంట‌గా న‌టించిన 'హృద‌యాంజ‌లి' సినిమాని ఎ. ర‌ఘురామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 1992లో షూటింగ్ జ‌రుపుకున్న ఆ సినిమా 2002లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.  గిరిజ పూర్తిపేరు గిరిజ షెట్ట‌ర్‌. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్‌లో ఆమె 1969 జూలై 20న జ‌న్మించారు. ఆమె త‌ల్లి బ్రిటిష్ వ‌నిత‌, తండ్రి ఒక క‌న్న‌డ డాక్ట‌ర్‌. 'హృద‌యాంజ‌లి' సినిమా త‌ర్వాత ఆమె సినీ రంగాన్ని వ‌దిలేసి, ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. కార్డిఫ్ యూనివ‌ర్సిటీ నుంచి 2003లో 'ఇంటిగ్ర‌ల్ యోగా ఫిలాస‌ఫీ అండ్ ఇండియ‌న్ స్పిరిచ్యువ‌ల్ సైకాల‌జీ' అనే థీసిస్‌కు గాను 2003లో డాక్ట‌రేట్ ప‌ట్టా పొందారు. 'దిస్ ఇయ‌ర్‌, డాఫోడిల్స్' అనే హైకూ క‌విత‌ల సంపుటిని 2011లో ప్ర‌చురించారు. ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టుగా, రైట‌ర్‌గా త‌న జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు.

త‌ల్లి ల‌క్ష్మి కార‌ణంగా 'టూ టౌన్ రౌడీ'లో హీరోయిన్‌ చాన్స్ పోగొట్టుకున్న‌ ఐశ్వ‌ర్య‌!

  విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన సినిమా 'టూ టౌన్ రౌడీ' (1989). అనిల్ క‌పూర్‌, మాధురీ దీక్షిత్ జంట‌గా న‌టించిన బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'తేజాబ్‌'కు అది రీమేక్‌. 'టూ టౌన్ రౌడీ'లో హీరోయిన్‌గా రాధ న‌టించింది. నిజానికి ఫ‌స్ట్ చాయిస్ ఆమె కాదు.. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూతురు ఐశ్వ‌ర్య‌! 'అడ‌విలో అభిమ‌న్యుడు' మూవీలో జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా ఐశ్వ‌ర్య టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే దానికంటే ముందు 'టూ టౌన్ రౌడీ' మూవీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. కానీ స్వ‌యంగా త‌ల్లి ల‌క్ష్మి ఆ అవ‌కాశాన్ని వ‌దులుకునేట్లు చేశారు. ఆ క‌థేమిటంటే... ఓసారి ల‌క్ష్మి హైద‌రాబాద్ నుంచి మ‌ద్రాస్ వెళ్తుండ‌గా అదే ఫ్ల‌యిట్‌లో మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు, ఆయ‌న శ్రీ‌మ‌తి తార‌స‌ప‌డ్డారు. అప్పుడు ల‌క్ష్మిని ప‌ల‌క‌రించిన రామానాయుడు, "ఏంటీ, మీ అమ్మాయి కూడా సినిమాల్లో న‌టిస్తోంద‌ని విన్నాను. నిజ‌మా?" అన‌డిగారు. అప్పుడే ఐశ్వ‌ర్య 'హోస‌కావ్య' అనే క‌న్న‌డ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంది. ఆ సంగ‌తి వినే ఆయ‌న ల‌క్ష్మిని అడిగారు. అవున‌ని జ‌వాబిచ్చారు ల‌క్ష్మి. అలా వాళ్లిద్ద‌రూ ఐశ్వ‌ర్య గురించి మాట్లాడుకున్నారు.  మ‌ద్రాస్ ఎయిర్‌పోర్టులో ఫ్ల‌యిట్ దిగ‌గానే, "మా ఇంటికి వెళ్లే దారిలోనే క‌దా మీ ఇల్లు.. ఓ సారి అమ్మాయిని చూస్తాను." అని చెప్పారు రామానాయుడు. అలా భార్య‌తో క‌లిసి ల‌క్ష్మి వాళ్లింటికి వెళ్లారు. ఐశ్వ‌ర్య‌ను, ఆమె ఫొటో షూట్‌ను చూసిన రామానాయుడు, "అమ్మాయి బావుంది. మా వెంక‌టేశ్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించ‌డానికి క‌రెక్టుగా స‌రిపోతుంది. డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు గారితో మాట్లాడి క‌బురు పెడ‌తాను." అని చెప్పి వెళ్లారు. ఆ త‌ర్వాత ఆయ‌న దాస‌రితో మాట్లాడ‌గా, ఆయ‌న కూడా ఫొటోలు చూసి ఓకే చేశారు.  అయితే ఆ సినిమాలో హీరోయిన్ స్విమ్‌సూట్ ధ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని దాస‌రి చెప్ప‌డంతో ల‌క్ష్మి అందుకు అంగీక‌రించ‌లేదు. స్విమ్‌సూట్ వేసుకోడానికి ఐశ్వ‌ర్యకు ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోయినా, ల‌క్ష్మి మాత్రం స‌సేమిరా అన్నారు. దాంతో ఆ సినిమాలో న‌టించే చాన్స్ మిస్స‌యిపోయింది ఐశ్వ‌ర్య‌కు. లేదంటే తెలుగులో ఆమె ఫ‌స్ట్ ఫిల్మ్ 'టూ టౌన్ రౌడీ' అయ్యుండేది.

'పెద‌రాయుడు' కోసం మోహ‌న్‌బాబుకు డ‌బ్బిచ్చి ఆదుకున్న ర‌జ‌నీకాంత్‌!

  శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం 'నాట్టామై' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్‌. కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ట్ చేసిన ఆ మూవీని చూసి ఎలాగైనా దాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు మోహ‌న్‌బాబు. ఓ రోజు బొటానిక‌ల్ గార్డెన్స్‌లో బాషా షూటింగ్‌లో ఉన్న త‌న ప్రాణ స్నేహితుడు ర‌జ‌నీకాంత్‌ను క‌లిశారాయాన‌. "నువ్వు మాట్లాడి, 'నాట్టామై" తెలుగు హ‌క్కులు ఏర్పాటు చెయ్యి" అని చెప్పారు. "నువ్వెంత పెట్టాల‌నుకుంటున్నావ్‌?" అని ర‌జ‌నీ అడిగారు. 15 ల‌క్ష‌లు దాట‌కుండా చూడ‌మ‌ని చెప్పారు మోహ‌న్‌బాబు. ఆ రోజు రాత్రికే మోహ‌న్‌బాబుకు ర‌జ‌నీ నుంచి ఫోన్ వ‌చ్చింది. "12 ల‌క్ష‌ల‌కు ఫిక్స్ చేశానురా" అని చెప్పారు. అలా 'నాట్టామై' తెలుగు రీమేక్ 'పెద‌రాయుడు' షూటింగ్ మొద‌లైంది. ర‌విరాజా పినిశెట్టికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు మోహ‌న్‌బాబు. త‌మిళంలో విజ‌య‌కుమార్ చేసిన క్యారెక్ట‌ర్‌ను తెలుగులో ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా చేశారు. రెండో షెడ్యూల్ రాజ‌మండ్రిలో జ‌రుగుతున్న‌ప్పుడు మోహ‌న్‌బాబు ముఖంలో ఆందోళ‌న గ‌మ‌నించిన ర‌జ‌నీ ఏం జ‌రిగింద‌ని అడిగారు. మొద‌ట త‌ట‌ప‌టాయించినా, ర‌జ‌నీ గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో రావాల్సిన ఫైనాన్స్ రాలేద‌నీ, ప‌దేప‌దే వాయిదా వేస్తున్నార‌నీ మోహ‌న్‌బాబు చెప్పారు. భుజం త‌ట్టి, కంగారు ప‌డ‌వ‌ద్ద‌న్నారు ర‌జ‌నీ. ఆ మ‌రుస‌టి రోజు ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చి, అందులో ఎంత అమౌంట్ ఉందో చెప్పి, "స‌రిపోతుందా?" అన‌డిగారు. మోహ‌న్‌బాబు క‌ళ్లు చెమ‌ర్చాయి. భావోద్వేగంతో ర‌జ‌నీని గ‌ట్టిగా కౌగ‌లించుకున్నారు. ఇక ఎలాంటి అంత‌రాయం లేకుండా షూటింగ్ పూర్త‌యింది. 'పెదరాయుడు' (1995) విడుద‌లైంది. ఏ సెంట‌ర్ చూసినా క‌లెక్ష‌న్ తుఫాన్‌! అదివ‌ర‌క‌టి బాక్సాఫీస్ రికార్డుల‌ను చెరిపేసి, వ‌సూళ్ల ప‌రంగా ఇండ‌స్ట్రీ రికార్డ్ సృష్టించింది ఆ సినిమా. ఏకంగా 63 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. పాపారాయుడుగా ర‌జ‌నీకాంత్ కొద్దిసేపే క‌నిపించినా, జ‌నం నీరాజ‌నం ప‌ట్టారు. పెద‌రాయుడుగా, అత‌ని తమ్ముడు రాజాగా మోహ‌న్‌బాబు చేసిన డ్యూయ‌ల్ రోల్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. క‌లెక్ష‌న్ కింగ్‌గా ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు. ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్‌బాబు అపూర్వ స్నేహానికి 'పెద‌రాయుడు' సినిమా ఒక ద‌ర్ప‌ణంలా నిలిచింది.

ఓపెనింగ్ షాట్ తీసేట‌ప్పుడు కెమెరా ముందు పిల్లిని ప‌రుగెత్తించిన హీరో!

  త‌మిళ‌న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ ఒక ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 'కెప్టెన్ ప్ర‌భాక‌ర్' (1991) సినిమాలో చేసిన బందిపోటు వీర‌భ‌ద్రం అనే విల‌న్ క్యారెక్ట‌ర్‌తో తెలుగువారికి  సుప‌రిచితుడ‌య్యారు. ఆ త‌ర్వాత అనేక అనువాద చిత్రాల‌తో ఆయ‌న తెలుగు వారిని అల‌రిస్తూనే ఉన్నారు. ఎలాంటి దాప‌రికాలు లేకుండా అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చెప్పే ల‌క్ష‌ణంతో అనేక‌సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈమ‌ధ్యే కొవిడ్ వాక్సిన్ గురించి వ్య‌తిరేకంగా మాట్లాడి, త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేస్తున్నార‌నే అభియోగంతో అరెస్ట‌యి, బ‌య‌ట‌కు వ‌చ్చారు. మూఢ‌న‌మ్మ‌కాలు, ఆచార‌వ్య‌వ‌హారాల‌కు ఆయ‌న బ‌ద్ధ వ్య‌తిరేకి. కెరీర్‌లో మొద‌ట విల‌న్ రోల్స్‌తో ఆక‌ట్టుకున్న మ‌న్సూర్, త‌ర్వాత ఎంతోమంది లాగా తాను మాత్రం హీరోగా ఎందుకు న‌టించ‌కూడ‌ద‌ని అనుకుని, ఓ రోజు హ‌ఠాత్తుగా త‌నే హీరోగా, డాన్సులు, ఫైట్లు పెట్టి, త‌న‌కో విల‌న్ని పెట్టుకొని ఓ సినిమా తీసేశారు. జ‌నాన్ని ఆక‌ట్టుకునేందుకు ఆ ఫిల్మ్‌కు, 'రాజాధిరాజ రాజ‌మార్తాండ రాజ‌గంభీర కృష్ణ కామ‌రాస‌న్' అనే టైటిల్ పెట్టారు. అందులో మ‌న న‌టుడు శ్రీ‌హ‌రి కూడా న‌టించారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డంతో, హీరోగా వెంట‌నే మ‌రో సినిమా నిర్మించారు. కానీ ఈసారి చిన్న టైటిలే.. కానీ యాంటీ సెంటిమెంట్ టైటిల్ - 'రావ‌ణ‌న్' అని పెట్టారు.  మూఢ‌న‌మ్మ‌కాల‌ను నిర‌సించే మ‌న్సూర్‌, అలాంటి న‌మ్మ‌కాల‌కు నిల‌య‌మైన సినిమా ఇండ‌స్ట్రీ ముక్కున వేలేసుకొనే ప‌నులు ఆ సినిమా ప్రారంభం రోజున చేశారు. రాహు కాలంలో ముహూర్తాన్ని నిర్ణ‌యించారు. దీపారాధ‌న‌ను ఒక వింత‌తువు చేత చేయించారు. ఫ‌స్ట్ షాట్ చిత్రీక‌రించడానికి ముందుగా కెమెరా ముందు ఒక పిల్లిని ప‌రిగెత్తించారు. టైటిల్ 'రావ‌ణ‌న్' అయినంత మాత్రాన ఇది పౌరాణిక చిత్రం అనుకొనేరు. ఫ‌క్తు సోష‌ల్ ఫిల్మ్‌. ఇందులో అతి ఆవేశ‌ప‌రుడైన రావ‌ణ‌న్ అనే రైతుగా మ‌న్సూర్ న‌టించారు. ఈ సినిమా అంద‌రి ఊహాగానాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసింది. ఈ సినిమా త‌ర్వాత కూడా ఆయ‌న మ‌రో నాలుగైదు సినిమాల్లో హీరోగా న‌టిస్తూ, నిర్మించారు.

అక్కినేని కోసం చిరంజీవి సినిమాని వ‌దిలేసిన కోదండ‌రామిరెడ్డి!

  చిరంజీవిని స్టార్ హీరోగా, టాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ స్టార్‌గా మార్చిన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన వ్య‌క్తిగా ఎ. కోదండ‌రామిరెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో న్యాయం కావాలి, అభిలాష‌, ఖైదీ, ఛాలెంజ్‌, కిరాత‌కుడు, ర‌క్త సిందూరం, విజేత‌, రాక్ష‌సుడు, దొంగ‌మొగుడు, ప‌సివాడి ప్రాణం, ముఠామేస్త్రి త‌దిత‌ర సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. అయితే చిరంజీవి హీరోగా కోదండ‌రామిరెడ్డి ఓ సినిమాని ప్రారంభించి, దాని నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందనేది చాలామందికి తెలీని విష‌యం. ఆయ‌న ఫిల్మోగ్ర‌ఫీలో ఆ సినిమా పేరు ఉంటుంది కానీ, నిజానికి ఆ సినిమాని ఆయ‌న డైరెక్ట్ చేయ‌లేదు. ఇంత‌కీ ఆ సినిమా.. 'శివుడు శివుడు శివుడు' (1983).  అవును. ఆ మూవీని శ్రీ‌ క్రాంతి చిత్ర ప‌తాకంపై క్రాంతికుమార్ నిర్మించారు. రాధిక డ్యూయ‌ల్ రోల్ చేసిన ఈ సినిమాను 1983 జ‌న‌వ‌రి 14న ఊటీలో ప్రారంభించారు. అక్క‌డి బృందావ‌న్ హోట‌ల్‌లో దేవుని ప‌టాల‌పై ఫ‌స్ట్ షాట్ తీశారు కోదండ‌రామిరెడ్డి. ఆ మ‌రుస‌టి రోజు నుంచి ఊటీలోనే ప‌లు లొకేష‌న్ల‌లో 40 రోజుల పాటు షూటింగ్ జ‌ర‌పాల‌ని క్రాంతికుమార్ ప్లాన్ చేశారు.  అదే టైమ్‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సొంత చిత్రం 'శ్రీ‌రంగ నీతులు' ప్రారంభ‌ద‌శ‌లో ఉంది. దానికి కూడా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌కులు. అక్కినేని స్వ‌యంగా ఫోన్ చేసి, హైద‌రాబాద్‌కు వ‌స్తున్నావా, లేదా ఒక్క మాట‌లో చెప్ప‌మ‌ని నిల‌దీశారు. నిజానికి రెడ్డిగారి డేట్స్ అప్పుడు అన్న‌పూర్ణ స్టూడియోస్‌కే ఉన్నాయి. మ‌రోవైపు 'న్యాయం కావాలి'తో త‌న‌కు సూప‌ర్ హిట్‌ను ఇచ్చిన క్రాంతికుమార్ మాట కాద‌న‌లేని స్థితి. ఆ రాత్రికి రాత్రి కె. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావుకు ఫోన్ చేసి, అక్కినేని నొప్పించ‌కుండా ఒప్పించ‌మ‌ని కోరారు కోదండ‌రామిరెడ్డి. కానీ రెడ్డిగారి నుంచి 'య‌స్' లేదా 'నో' అనే స‌మాధానం కావాల్సిందేన‌ని తేల్చి చెప్పారు అక్కినేని. ఇక చేసేదేమీ లేక 'శివుడు శివుడు శివుడు' మూవీని వ‌దిలేసుకొని 'శ్రీ‌రంగ‌నీతులు'ను తెర‌కెక్కించ‌డానికి హైద‌రాబాద్ వెళ్లిపోయారు రెడ్డిగారు. షెడ్యూల్ తొలిరోజునే ఇలా జ‌ర‌గ‌డంతో, మ‌రో డైరెక్ట‌ర్‌ను పెట్టుకోకుండా జ‌న‌వ‌రి 15 నుంచి తానే మెగాఫోన్ ప‌ట్టుకొని ఆ మూవీని డైరెక్ట్ చేశారు క్రాంతికుమార్‌. అయితే టైటిల్స్‌లో, పోస్ట‌ర్స్‌లో కోదండ‌రామిరెడ్డి పేరునే వేశారు. చాలా శ్ర‌మ‌కు ఓర్చి తీసిన‌ప్ప‌టికీ, ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రిచింది.

శంక‌ర్ 'జెంటిల్‌మ్యాన్‌'ను మిస్ చేసుకున్న రాజ‌శేఖ‌ర్‌! అది చేసుంటేనా..

  శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా మొట్ట‌మొద‌టి సినిమా 'జెంటిల్‌మ్యాన్' (1993). అర్జున్ టైటిల్ రోల్ చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యిందో మ‌న‌కు తెలుసు. త‌మిళంలో తీసిన ఆ సినిమా తెలుగులో డ‌బ్బ‌యి, ఇక్క‌డ కూడా విజ‌య‌దుందుభి మోగించింది. అర్జున్‌ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసాఫీస‌ర్‌గా చ‌ర‌ణ్‌రాజ్ వేసే ఎత్తులు, అత‌డికి దొరక్కుండా దొంగ‌త‌నాలు చేస్తూ అర్జున్ వేసే పైఎత్తులు, అర్జున్‌-మ‌ధుబాల రొమాన్స్ ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించాయి. ఆ సినిమాని చిరంజీవి హిందీలో సేమ్ నేమ్‌తో రీమేక్ చేసి, హిట్ కొట్టారు. అలాంటి 'జెంటిల్‌మ్యాన్' సినిమాని మొద‌ట శంక‌ర్ ఎవ‌రితో తీయాల‌నుకున్నారో తెలుసా?  డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో! య‌స్‌. శంక‌ర్ ఫ‌స్ట్ చాయిస్ రాజ‌శేఖ‌ర్‌. ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ చేత‌ప‌ట్టుకొని మ‌రీ ఆయ‌న రాజ‌శేఖ‌ర్‌కు క‌థ చెప్ప‌డానికి వ‌చ్చారు. హీరో రోల్‌కు రాజ‌శేఖ‌ర్ అయితే యాప్ట్‌గా ఉంటార‌ని ఆయ‌న భావించారు. అప్ప‌ట్లో 'ఆహుతి', 'అంకుశం' లాంటి సినిమాల‌తో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా రాజ‌శేఖ‌ర్ మంచి క్రేజ్ తెచ్చుకొని ఉన్నారు. 'జెంటిల్‌మ్యాన్‌'ను వ‌దులుకోవాల్సి రావ‌డం త‌న కెరీర్‌లో బిగ్ లాస్ అని రిగ్రెట్ అయ్యారు రాజ‌శేఖ‌ర్. శంక‌ర్ క‌లిసే స‌మ‌యానికి కె. రాఘ‌వేంద్ర‌రావుతో 'అల్ల‌రి ప్రియుడు' సినిమా చేయ‌డానికి అంగీక‌రించి, దానికి డేట్స్ ఇచ్చేశారు రాజ‌శేఖ‌ర్‌. 'జెంటిల్‌మ్యాన్' క‌థ ఆయ‌న‌కు తెగ న‌చ్చేసింది. అయితే దానికి డేట్స్ అప్ప‌టిక‌ప్పుడు ఇవ్వ‌డానికి ఆయ‌నకు వీల‌వ‌లేదు. "అప్ప‌ట్లో చాలామంది హీరోలకు ఎన్ని సినిమాల‌కైనా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌గ‌ల టాక్టీస్ ఉంది. నాకు ఆ టాక్టీస్ లేదు. 'అల్ల‌రి ప్రియుడుకు ఇచ్చిన డేట్స్‌ను మార్చ‌లేను, మార్చ‌మ‌ని వాళ్ల‌ను అడ‌గ‌లేను. సారీ అండీ.. దాని త‌ర్వాత ప్లాన్ చేస్తే డేట్స్ ఇవ్వ‌గ‌ల‌ను. ఇప్పుడైతే చెయ్య‌లేను' అని వారికి చెప్పాను. అప్పుడు వాళ్లు ప‌ది ల‌క్ష‌లు అడ్వాన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ నేను దాన్ని చెయ్య‌లేక‌పోయాను. ఐ మిస్డ్‌ ఇట్‌. రియ‌ల్లీ.. అది బిగ్ లాస్." అని చెప్పారు రాజ‌శేఖ‌ర్‌.

న‌గ్నంగా రోడ్డుమీద న‌డిచిన శ్రీ‌కాంత్‌! గుర్తుప‌ట్ట‌ని జ‌నం!!

  పోసాని కృష్ణ‌ముర‌ళి డైరెక్ష‌న్‌లో శ్రీ‌కాంత్ హీరోగా న‌టించిన సినిమా 'ఆప‌రేష‌న్ దుర్యోధ‌న' (2007). బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. నిజాయితీప‌రుడైన ఓ పోలీస్ ఆఫీస‌ర్ కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కుల కార‌ణంగా భార్యాపిల్ల‌ల‌ను కోల్పోయి, త‌న వేషం మార్చుకొని రాజ‌కీయాల్లో చేరి, ఏం చేశాడ‌నేది ఆ సినిమా ఇతివృత్తం. ఆ సినిమాలో శ్రీ‌కాంత్ న‌గ్నంగా మెయిన్ రోడ్డుమీద న‌డుచుకుంటూ వెళ్లే సీన్ ఒక‌టుంది. నిజంగానే అలా న‌డ‌చుకుంటూ శ్రీ‌కాంత్ ఆ సీన్ చేశాడా? ఎవ‌రినైనా డూప్‌తో చేయించారా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. అయితే.. ఆ సీన్ స్వ‌యంగా చేశాడు శ్రీ‌కాంత్‌. అయితే అది సినిమా షూటింగ్ అనీ, యాక్ట్ చేస్తోంది శ్రీ‌కాంత్ అనీ జ‌నానికి తెలీదు. తెలిస్తే.. ఎలా ఉండేదో తెలీదు. స్క్రిప్టు వినిపించేట‌ప్పుడే పోసాని ఈ సీన్ గురించి శ్రీ‌కాంత్‌కు చెప్పారు. "రాజా.. ఈ సీన్ ఇలా ఉంటుంది. నువ్వెలా చేస్తావ‌నేది నాకు తెలీదు. క‌థ‌కు ఈ సీన్ చాలా కీల‌కం. చేస్తావా?" అన‌డిగారు. "చేసేద్దాం.. యాక్టింగే క‌దా" అన్నాడు శ్రీ‌కాంత్‌. అమ్మాయిలెవ‌రూ ఉండ‌రు, సోలోగా న‌డుచుకుంటూ వెళ్లే సీన్ క‌దా.. ఇబ్బందేమీ ఉండ‌దులే అని ముందుగానే అనుకున్నాడు. ఆ సీన్ ఎక్క‌డ తీశారో తెలుసా? జ‌నంతో ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే అమీర్‌పేట సెంట‌ర్లో, చార్మినార్ ద‌గ్గ‌ర‌, బేగంపేట మ‌హారాణి కాలేజీ ద‌గ్గ‌ర ఈ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించాడు పోసాని.  శ్రీ‌కాంత్‌ను ఒక చోట దింపేసి, కాస్త దూరంలో ఎదురుగా కారునుపెట్టి, కెమెరా అరేంజ్ చేసి, న‌డుచుకుంటూ వ‌చ్చేయ‌మ‌ని చెప్పేవారు. శ్రీ‌కాంత్ అదృష్టం కొద్దీ రోడ్డున‌పోయే వారిలో ఎవ‌రూ ఆయ‌న‌ను గుర్తుప‌ట్ట‌లేదు. కంటికి ఒక‌వేపు పొడ‌వాటి గాటు, చిన్న హెయిర్‌తో ఉన్న ఆయ‌న‌ను చూసి ఎవ‌రో పిచ్చాడు న‌డుచుకుంటూ వెళ్తున్నాడ‌ని అనుకున్నారు. మొద‌ట చార్మినార్ ద‌గ్గ‌ర ఆ సీన్ చేశారు. ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు.  దాంతో ఇలా ఉండ‌టం వ‌ల్ల న‌న్నెవ‌రూ గుర్తుప‌ట్ట‌డం లేద‌నే కాన్ఫిడెన్స్‌తో అమీర్‌పేట‌లో ఆ సీన్ చేశాడు. అక్క‌డ జ‌నం మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఎవ‌రైనా గుర్తుప‌డ‌తారేమోన‌ని అనుకున్నాడు కానీ, అలా ఏమీ జ‌ర‌గ‌లేదు. అప్పుడు ఆయ‌న వేష‌మే ఆయ‌న‌ను జ‌నం గుర్తుపట్ట‌కుండా చేసింది. సినిమా చూసేదాకా అప్పుడు ఆ రోజు రోడ్డుమీద బ‌ట్ట‌ల్లేకుండా న‌డిచింది శ్రీ‌కాంత్ అనే విష‌యం ఆ సినిమా యూనిట్ మెంబ‌ర్స్‌కు త‌ప్ప ఇంకెవ‌రికీ తెలీదు. అలా ధైర్యంగా న‌గ్నంగా ఆ సీన్ చేశాడు శ్రీ‌కాంత్‌. నిజంగానే ఆ స‌న్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. 

'య‌మ‌లీల‌'కు నందులు రాక‌పోవ‌డంపై ఇప్ప‌టికీ తీవ్ర అసంతృప్తితో అలీ!

  అలీని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 'య‌మ‌లీల' (1994) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్మురేపి, బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. చిన్న సినిమాల్లో ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమా అదే. త‌ల్లి ఆయుష్షు తీరిపోతోంద‌ని తెలిసి, ఆమెను బ‌తికించుకోడానికి ఓ కొడుకు ఏం చేశాడ‌నేది ప్ర‌ధానాంశంగా రూపొందిన ఆ సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రించిన తీరు అపూర్వం. 'అలీ లాంటి క‌మెడియ‌న్‌ను హీరోగా పెట్టి సినిమా తీయ‌డ‌మేంటి.. అది ఆడుద్దా, పెట్టుద్దా..' అని ఈస‌డింపుగా మాట్లాడిన వారి నోళ్లు ఆశ్చ‌ర్యంతో తెరుచుకొనేంత హిట్ట‌యింది ఆ సినిమా. అయితే ఆ ఏడాది నంది అవార్డుల్లో ఆ సినిమాకు కంటితుడుపు అన్న‌ట్లు ఒకే ఒక్క అవార్డు ద‌క్కింది.. అదీ బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్‌గా సుచిత్ర‌కు. నిజానికి ఆ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ స్టోరీ, బెస్ట్ మ్యూజిక్‌, బెస్ట్ యాక్ట‌ర్‌/ యాక్ట్రెస్‌, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌/ యాక్ట్రెస్ లాంటి ప్ర‌ధాన కేట‌గిరీల్లో ఒక్క అవార్డూ రాలేదు. దీనిపై అలీ ఇప్ప‌టికీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. "'య‌మ‌లీల‌'కు బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ స్టోరీ, బెస్ట్ మ్యూజిక్ అన్నీ ఇవ్వాలి. ఒక్క‌టి కూడా రాలేదు. 1994లో ఆ సినిమా ఒక థియేట‌ర్‌లో సంవ‌త్స‌రం ఆడింది. బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చుంటే మ‌న‌సులో కాస్త‌యినా తృప్తి ఉండేది. అప్ప‌ట్నుంచీ అవార్డుల మీద ఆస‌క్తి పోయింది. అవార్డులు వాళ్లివ్వ‌క్క‌ర్లేదు, ప్రేక్ష‌కులు ఇస్తే చాలు" అని 'య‌మ‌లీల' హీరోయిన్ ఇంద్ర‌జ‌ను ఇంట‌ర్వ్యూ చేసిన‌ప్పుడు అలీ చెప్పారు.  ఇంద్ర‌జ కూడా "'య‌మ‌లీల‌'కు ఒక్క అవార్డు కూడా రాలేదా?  బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ అయితే రావాల్సింది" అని అన్నారు. ఆ మూవీలోని "నీ జీనూ ప్యాంటు చూసి బుల్లెమ్మో", "సిరులొలికించే చిన్నిన‌వ్వులే", "జుంబారే జూజుంబ‌రే" పాట‌లు సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాయి మ‌రి! ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చింది స్వ‌యానా ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డే!

ఏఎన్నార్ ముందే కాలేజీ కుర్రోడిని చిత‌క్కొట్టిన డిస్కో శాంతి! షాకైన అక్కినేని!!

  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు టైటిల్ రోల్ చేసిన ఫిల్మ్ 'కాలేజీ బుల్లోడు' (1992). ఆ సినిమాలో డిస్కో శాంతి ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. కాలేజీలో అక్కినేని, శాంతి, స్టూడెంట్స్ మ‌ధ్య "రాగింగ్ ఆటా.. రాగాలాటా.." అంటూ ఆ సాంగ్ సాగుతుంది. ఆ పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శాంతి ఓ స్టూడెంట్‌ను అక్కినేని ముందే చిత‌క్కొట్టేసింది. ఆమె ఎందుక‌లా చేసిందో అర్థంకాక ఏఎన్నార్ స‌హా అక్క‌డున్న వాళ్లంద‌రూ షాకై పోయారు. ఆ క‌థేమిటంటే... సాంగ్ తీస్తున్న‌ప్పుడు శాంతి కెమెరాను చూస్తూ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ డాన్స్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ వై. మ‌హీధ‌ర్ చిత్రీక‌రిస్తున్నారు. అంత‌లో ఓ కుర్రాడు కెమెరా ప‌క్క‌కు వ‌చ్చి నిల్చొని, ఆమెను చూస్తూ న‌వ్వాడు. దాంతో కెమెరా నుంచి ఆమె చూపు అత‌డి వైపు మ‌ళ్లింది. 'ఎవ‌రితను, న‌న్ను చూస్తూ న‌వ్వుతున్నాడు?' అనుకున్నారు శాంతి. ఆ త‌ర్వాత అత‌ను మితిమీరి ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాడు. అసహ్య‌క‌రంగా, అభ్యంత‌ర‌క‌రంగా సైగ‌లు చేశాడు. ఆ రోజు మ‌ధ్యాహ్నం నుంచీ ఇదే తంతు. శాంతి ఓర్పు వ‌హిస్తూ వ‌చ్చారు. సాయంత్ర‌మైంది. ఓ షాట్‌లో అక్కినేని ఆమె డ్ర‌స్సును క‌త్తెర‌తో క‌ట్ చేసి టాప్‌ను లాగేస్తారు. అది చేస్తున్న‌ప్పుడు మ‌ధ్యాహ్నం నుంచీ శాంతిని ఇబ్బందికి గురిచేస్తున్న ఆ కాలేజీ కుర్రోడు మ‌రీ అసహ్యంగా సైగ‌లు చేశాడు. షాట్ అవుతుండంగా, ఆ కుర్రోడిని ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌ని పిలిచారు శాంతి. ఆ అబ్బాయి వ‌చ్చాడు. అత‌ను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చీ రాగానే కాలితో ఒక్క త‌న్ను త‌న్నారు శాంతి. అక్కినేని గారికి ఏమీ అర్థంకాక అలానే చూస్తుండిపోయారు. నోటికి వ‌చ్చిన బూతులు తిడుతూ, ఆ అబ్బాయిని కొడుతూనే ఉన్నారు శాంతి. ఆ త‌ర్వాత అక్కినేని "ఈ అమ్మాయి ఇట్లా కొడుతుందేంటి?" అంటూ అక్క‌డ్నుంచి ప‌క్క‌కు వెళ్లిపోయారు. యూనిట్ మెంబ‌ర్స్ అంతా గ‌బ‌గ‌బా అక్క‌డ‌కు వ‌చ్చి, శాంతిని ప‌ట్టుకొని ఆపారు. ఆ అబ్బాయి 'బ‌తికాంరా బాబూ' అనుకుంటూ, గ‌బ‌గ‌బా లేచి దొరికితే మ‌ళ్లీ ఏం చేస్తారోన‌నే భ‌యంతో చాలా ఎత్తున్న గోడ‌ను కూడా ఎక్కేసి, పారిపోయాడు. మ‌రుస‌టి రోజు ఆ సాంగ్ లీడ్ సీన్ అక్క‌డే తియ్యాలి. షాట్ తియ్య‌డానికి ముందు, త‌న‌కు కాస్త దూరంలో చైర్‌లో కూర్చొనివున్న శాంతిని "ఇలా రామ్మా" అని పిలిచారు ఏన్నార్‌. శాంతి వ‌చ్చాక‌, "ఎందుక‌మ్మా వాటిన‌ట్లా కొట్టావ్‌?" అన‌డిగారు. ఆ అబ్బాయి త‌న‌తో ఎలా ప్ర‌వ‌ర్తించిందీ చెప్పారు శాంతి. "ఏమైనా అలా కొట్టొచ్చా అమ్మా. త‌గ‌ల‌రాని చోట త‌గిలి వాడు చ‌చ్చిపోతే నువ్వు జైలుకు పోతావ్ క‌ద‌మ్మా" అని చెప్పారు అక్కినేని. "స‌రే సార్" అని త‌ల‌వూపారు శాంతి. అలాంటి ఫైర్ బ్రాండ్ ఆమె!

నారాయ‌ణ‌మూర్తి ఇత‌రుల‌ సినిమాల్లో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే!

  కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన 'నేర‌ము-శిక్ష' సినిమాతో జూనియ‌ర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించి, దాస‌రి నారాయ‌ణ‌రావు సినిమా 'సంగీత‌'తో హీరోగా మారిన న‌టుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి. త‌నే హీరోగా న‌టిస్తూ డైరెక్ట‌ర్‌గా మారి, ఆయ‌న నిర్మించిన చిత్రం 'అర్ధ‌రాత్రి స్వ‌తంతం' ఒక సంచ‌ల‌నం. అప్ప‌ట్నుంచి సుమారు రెండు ద‌శాబ్దాల కాలంలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను స్వ‌యంగా తీసి, పీపుల్స్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారాయ‌న‌. ఎర్ర‌సైన్యం, భూపోరాటం, అడ‌వి దివిటీలు, దండోరా, చీమ‌ల దండు, ద‌ళం, చీక‌టి సూర్యులు, అడ‌వి బిడ్డ‌లు లాంటి సినిమాలు ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తిని తీసుకొచ్చాయి. సామాజిక అంశాల‌తో, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తో సినిమాలు తీస్తూ, ఆ బాట‌ను వ‌ద‌లకుండా, క‌మ‌ర్షియ‌ల్ హంగుల జోలికి పోకుండా ఒక నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్న అస‌లైన హీరో నారాయ‌ణ‌మూర్తి. ఇత‌ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు తీస్తున్న సినిమాల్లో ఆయ‌న‌కు ముఖ్య పాత్ర‌లు చేయ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌స్తున్నా, వాటిని సున్నితంగా తిర‌స్క‌రిస్తూ, త‌న సినిమాలేవో త‌ను చేసుకుంటూ వెళ్తున్నారు. ప్ర‌స్తుత కాలంలో ఆయ‌న తీస్తున్న సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. అయినా ఆయ‌న త‌న బాట‌ను వీడ‌లేదు. బ‌య‌టి నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల సినిమాల్లో మంచి రెమ్యూన‌రేష‌న్‌తో క్యారెక్ట‌ర్లు ఆఫ‌ర్ చేస్తున్న ఆయ‌న ఎందుకు చేయ‌డం లేదు, ఆయ‌న‌కేమైనా తిక్కా.. అనుకొనేవాళ్లు చాలామందే ఉన్నారు. "నామీదున్న అభిమానంతో చాలామంది నాకు త‌మ సినిమాల్లో ఆఫ‌ర్లు చేశారు. పూరి జగ‌న్నాథ్‌, క్రాంతి మాధ‌వ్ లాంటి చాలామంది గొప్ప గొప్ప ద‌ర్శ‌కులు ఈ వేషం మీరు చేస్తే బాగుంటుంద‌ని ఆఫ‌ర్ చేశారు. నేను సున్నితంగా తిర‌స్క‌రించాను. వారికి వంద‌నాలు. 'న‌న్ను క్ష‌మించండి' అని వారికి చెప్పాను. జూనియ‌ర్ ఆర్టిస్టుగా స్టార్ట‌య్యాను. 'అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం' నుంచి సొంత సినిమాలు తీసుకుంటూ ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి ఫిలిమ్స్ అనే విధంగా పేరు తెచ్చుకున్న‌వాడ్ని. అలాంటిది బ‌య‌టి సినిమాల్లో వేరే పాత్ర‌లు చెయ్య‌డానికి నాకు మ‌న‌స్క‌రించ‌డం లేదు. అది త‌ప్పో, ఒప్పో ప‌క్క‌న‌పెట్టండి. ముందు నాకు మ‌న‌స్క‌రించ‌డం లేదు. ఏ డైరెక్ట‌రైనా నామీద ప్రేమ‌తో క్యారెక్ట‌ర్ ఇచ్చాడ‌నుకోండి. మ‌న‌స్క‌రించ‌కుండా న‌టిస్తే, ఎక్కువ టేకులు తీసుకుంటుంటే నామీద నాకే అస‌హ్యం వేస్తుంది క‌దా! నాతో సినిమా తియ్యాలంటే ఒక 'ఒమ‌ర్ ముఖ్తార్' లాంటి సినిమా తియ్యాలి. లేదంటే 'శంక‌రాభ‌ర‌ణం'లో జె.వి. సోమ‌యాజులు గారు వేసిన‌టువంటి క్యారెక్ట‌ర్ ఇవ్వాలి. మిగ‌తా క్యారెక్ట‌ర్లు చెయ్య‌డానికి నాకు ఎప్ప‌టికీ మ‌న‌స్క‌రించ‌దు." అని తేల్చి చెప్పేశారు నారాయ‌ణ‌మూర్తి.

'అంకుల్' ర‌జ‌నీకాంత్‌తో హీరోయిన్‌గా చేయ‌డానికి ఇబ్బందిప‌డ్డ మీనా!

  అటు అందాల తార‌గా, ఇటు ప్ర‌తిభావంతురాలైన న‌టిగా పేరు తెచ్చుకున్న కొద్దిమందిలో మీనా ఒక‌రు. స్వ‌త‌హాగా త‌మిళురాలైన ఆమెను తెలుగువారు త‌మ ఇంటి ఆడ‌ప‌డుచు అన్నంత‌గా ఆద‌రించారు. ఆమె తెలుగమ్మాయి కాదంటే తెలుగువారిలో చాలామంది న‌మ్మ‌రు కూడా. అంత‌లా ఆమె ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించారు. తొంభైల‌లో తెలుగు, త‌మిళ భాషా చిత్ర రంగాలు రెండింటిలోనూ ఆమె అగ్ర‌నాయిక‌గా ఒక వెలుగు వెలిగారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ జోడీగా న‌టించిన 'ముత్తు' సినిమా ఎంత‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యిందో మ‌న‌కు తెలుసు. ఈ సినిమా జ‌పాన్‌లోనూ విడుద‌లై అటు ర‌జ‌నీకి, ఇటు మీనాకు కూడా అక్క‌డ ఫ్యాన్‌బేస్ ఏర్ప‌డింది. ముఖ్యంగా "థిల్లానా థిల్లానా" సాంగ్ అప్ప‌ట్నుంచి ఇప్ప‌టికీ సంగీత ప్రియుల‌ను అల‌రిస్తూనే ఉంది. ర‌జ‌నీ స‌ర‌స‌న మీనా తొలిసారి నాయిక‌గా న‌టించిన సినిమా 'య‌జ‌మాన్‌' (1993). తెలుగులో ఆ సినిమాని 'రౌడీ జ‌మీందార్‌'గా డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. మొద‌ట ఆ సినిమా చేసేట‌ప్పుడు చాలా ఇబ్బంది ప‌డ్డారు మీనా. కార‌ణం.. అంత‌కుముందు 'అన్బుళ్ల ర‌జ‌నీకాంత్' సినిమాలో ర‌జ‌నీతో పాటు బాల‌తార‌గా న‌టించిన ఆమె, అప్పుడాయ‌న‌ను "అంకుల్.. అంకుల్" అంటూ పిలిచేవారు. ఆ సినిమాలోని ఆమె పాల్గొన్న స‌న్నివేశాల్లో అత్య‌ధిక భాగం ర‌జ‌నీ ఇంటిలోనే చిత్రీక‌రించారు. అలాంటిది 'య‌జ‌మాన్‌'లో ఆయ‌న‌తో రొమాన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించింది. ఇంకోవైపు హీరోయిన్‌గా కెరీర్ స్టార్టింగ్‌లోనే సూప‌ర్‌స్టార్ అయిన ఆయ‌న‌కు జంట‌గా న‌టిస్తున్నాన‌నే ఆనందం కూడా ఆమెలో ఉంది. 'అప్పుడు అంకుల్ అని పిలిచేదాన్ని క‌దా, ఇప్పుడు ఏమ‌ని పిల‌వాలి?' అని సంకోచ‌ప‌డ్డారు మీనా. రొమాంటిక్ సీన్స్ ఎలా చేయాల‌ని ఇబ్బందిప‌డ్డారు. అలాగే, హీరోయిన్‌గా ఆయ‌న‌తో చేయ‌డ‌మంటే మాట‌లు కాదు క‌దా, క‌రెక్టుగా చేయాల‌నే భ‌యం కూడా ఆమెలో ఉంది. ఆ సినిమా మొద‌టి రోజు షూటింగ్ రాజ‌మండ్రిలో జ‌రిగింది. ఆమె పూవులు కోయ‌డానికి వెళ్లి కింద‌ప‌డిపోవ‌టాన్ని తొలి దృశ్యంగా చిత్రీక‌రించారు. ఫ‌స్ట్ షాట్ పూర్తికాగానే మీనాకు "కంగ్రాచ్యులేష‌న్స్" చెప్పారు ర‌జ‌నీ. ఆమె "థాంక్స్ సార్" అని చెప్పినా, ఆ షెడ్యూల్ పూర్త‌య్యేదాకా భ‌యం భ‌యంగానే ఉన్నారామె. ఆయ‌న స‌పోర్టుతో ఆ భ‌యాన్ని పోగొట్టుకొని న‌టించారు. త‌ర్వాత 'ముత్తు' సినిమా ఆ ఇద్ద‌రి జోడీకి సూప‌ర్ పాపులారిటీ తీసుకొచ్చింది.

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ గురించి చాలామందికి తెలీని విష‌యాలు!

  కామెడీ సినిమాలు, యాక్ష‌న్ సినిమాలు, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ తీసి డైరెక్ట‌ర్‌గా ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్న వ్య‌క్తి ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌. ప‌లు హీరోల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందించిన ఆయ‌న కేన్స‌ర్ బారిన‌ప‌డి అకాల మృత్యువాత‌ప‌డ్డారు. లేదంటే మ‌రెన్నో వినోదాత్మ‌క చిత్రాలు ఆయ‌న మేధ‌స్సు నుంచి పుట్టేవే. ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చారు, ఎవ‌రి ద‌గ్గ‌ర ఎలా ప‌నిచేశార‌నే విష‌యాలు చాలామందికి తెలీవు. ఆస‌క్తిక‌ర‌మైన ఆ విష‌యాలు మీకోసం... స‌త్య‌నారాయ‌ణ స్వ‌స్థ‌లం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు స‌మీపంలోని దొమ్మేరు. వారిది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. ఆయ‌న నిడ‌ద‌వోలులో చ‌దువుకున్నారు. చ‌దువుకొనే రోజుల నుండే ఆయ‌న‌కు సినిమా పిచ్చి ఉండేది. సినిమాలు చూస్తూ, వాటిని విశ్లేషిస్తూ ఉండేవారు. నిర్మాత న‌వ‌తా కృష్ణంరాజుకు తెలిసిన ఓ వ్య‌క్తి వాళ్ల ఊరిలో ఉన్నారు. ఆయ‌న‌తో రిక‌మండేష‌న్ లెట‌ర్ రాయించుకొని, ఒక‌రోజు మ‌ద్రాసు రైలెక్కేశారు స‌త్య‌నారాయ‌ణ‌. మ‌ద్రాస్ సెంట్ర‌ల్ స్టేష‌న్‌లో దిగి, నేరుగా న‌వ‌తా కృష్ణంరాజు గారింటికి వెళ్లారు.  స‌త్యనారాయ‌ణ‌ను కృష్ణంరాజు ఎంత నిరుత్సాహ‌ప‌ర‌చాలో అంత నిరుత్సాహ‌ప‌రిచారు. "ఈ సినిమాగోల ఎందుకు? ఇక్క‌డ ఎవ‌రికో ఒక‌రికి త‌ప్ప ఫ‌లితం రాదు" అని చెప్పారు. కానీ స‌త్య‌నారాయ‌ణ గ‌ట్టి ప‌ట్టుద‌ల చూపించారు. అప్పుడు దేవ‌దాస్ క‌న‌కాల 'ఓ ఇంటి బాగోతం' సినిమాని డైరెక్ట‌ర్ చేస్తున్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర స‌త్య‌నారాయ‌ణ‌ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేర్పించారు న‌వ‌తా కృష్ణంరాజు. అలా డైరెక్ష‌న్‌కు సంబంధించిన ఓన‌మాలు దేవ‌దాస్ ద‌గ్గ‌ర నేర్చుకున్నారు స‌త్య‌నారాయ‌ణ‌. త‌న‌వ‌ద్ద స‌హాయ‌కులుగా ప‌నిచేసే వారంద‌రికీ అన్ని విష‌యాలు క్షుణ్ణంగా చెప్పేవారు దేవ‌దాస్‌. పైగా ఆయ‌న మంచి న‌టుడు కూడా. దాంతో చాలా విష‌యాలు ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్నారు. దేవ‌దాస్ ద‌గ్గ‌ర ఆయ‌న నాలుగు సినిమాల‌కు ప‌నిచేశారు.  ఆ త‌ర్వాత అప్ప‌టి అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన వి. మ‌ధుసూద‌న‌రావు హైద‌రాబాద్‌లో మ‌ధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెడితే, దానికి ప్రిన్సిపాల్‌గా వెళ్లారు దేవ‌దాస్ క‌న‌కాల‌. అప్పుడు జంధ్యాల ద‌గ్గ‌ర 'నాలుగు స్తంభాలాట' సినిమాకు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా చేర్పించారు న‌వ‌త కృష్ణంరాజు. అప్ప‌ట్నుంచీ జంధ్యాల ద‌గ్గ‌ర 23 సినిమాల‌కు ప‌నిచేశారు స‌త్య‌నారాయ‌ణ‌. ఫ‌లితంగా జంధ్యాల శిష్యుడిగా ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు బాగా గుర్తింపు ల‌భించింది. కామెడీ పాయింట్‌ను శ్రుతిమించ‌కుండా ఎలా తీస్తే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నోచుకుంటుంద‌నే విష‌యం జంధ్యాల నుంచే ఆయ‌న ఆక‌ళింపు చేసుకున్నారు. జంధ్యాల ద‌గ్గ‌ర‌కు రాక‌ముందు స‌త్య‌నారాయ‌ణ దృష్టి కేవ‌లం ద‌ర్శ‌క‌త్వం మీదే ఉండేది. జంధ్యాల వ‌ద్ద‌కు వ‌చ్చాక క్ర‌మంగా ఆయ‌న దృష్టి ర‌చ‌న‌వైపు మ‌ళ్లింది. ఆ స్ఫూర్తితో అప్పుడ‌ప్పుడు క‌థ‌లు రాసి ప‌త్రిక‌ల‌కు పంపేవారు. అయితే వాటిలో అత్య‌ధికం ప్ర‌చుర‌ణ‌కు అన‌ర్హ‌మైన‌విగా వెన‌క్కి తిరిగి వ‌చ్చేవి. అలా తిరిగివ‌చ్చిన వాటిలో 'ఆడే మ‌గైతే' అనే క‌థ ఒక‌టి. ఈ క‌థ‌ను 'మొగుడు - పెళ్లాలు' సినిమా షూటింగ్ స‌మ‌యంలో జంధ్యాలకు చెప్పారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆయ‌న విని, "బాగుంది స‌త్యం.. త‌ర్వాత వాడ‌దాం" అన్నారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. త‌ను డైరెక్ట‌ర్ అయ్యాక ఆ క‌థ‌ను ఆధారం చేసుకొని సినిమా తీశారు స‌త్య‌నారాయ‌ణ‌. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ఆ సినిమా న‌రేశ్‌, ఆమ‌ని జంట‌గా న‌టించిన‌.. 'జంబ‌ల‌కిడిపంబ' (1992). సినిమాటోగ్రాఫ‌ర్ ఎం.వి. ర‌ఘు డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'క‌ళ్లు'కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు స‌త్య‌నారాయ‌ణ‌. క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాకు డైరెక్ట‌ర్ సురేశ్‌కృష్ణ ద‌గ్గ‌ర ప‌నిచేశాక‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా న‌టించిన 'చెవిలో పువ్వు' (1990) సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. అది క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాక‌పోయినా, ద‌ర్శ‌కుడిగా ప్ర‌శంస‌లు ల‌భించాయి. అయితే రెండో సినిమా, డి. రామానాయుడు నిర్మించిన 'ప్రేమ‌ఖైదీ' (1990) ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో ఈవీవీ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లగ‌లేదు. అప్పుల అప్పారావు, సీతార‌త్నంగారి అబ్బాయి, ఆ ఒక్క‌టీ అడ‌క్కు, వార‌సుడు, జంబ‌ల‌కిడి పంబ‌, హ‌లో బ్ర‌ద‌ర్‌, అబ్బాయిగారు, ఆమె, ఆయ‌న‌కి ఇద్ద‌రు,  అల్లుడా మ‌జాకా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మా నాన్న‌కి పెళ్లి, క‌న్యాదానం, సూర్య‌వంశం, చాలా బాగుంది, కిత‌కిత‌లు, అత్తిలి స‌త్తిబాబు ఎల్‌కేజీ, బెండు అప్పారావు ఆర్ఎంపీ, క‌త్తి కాంతారావు లాంటి సినిమాలు తీసిన ఆ ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు గొంతు కేన్స‌ర్‌కు గురై, 54 ఏళ్ల వ‌య‌సులోనే త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల‌ను, త‌న‌ను అభిమానించేవాళ్ల‌ను వ‌దిలేసి 2011 జ‌న‌వరి 21న‌ వెళ్లిపోయారు.

డైరెక్ట‌ర్ తేజ బ్యాగ్రౌండ్ ఏంటో, ఆయ‌న తండ్రి ఏం చేసేవారో తెలుసా?

  డైరెక్ట‌ర్ తేజ చిన్న‌త‌నం నుంచే చాలా క‌ష్ట‌ప‌డి పైకొచ్చారు. మొద‌ట కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చేరి, అంచెలంచెలుగా ఎదిగి ఆప‌రేటివ్ కెమెరామేన్‌గా, సినిమాటోగ్రాఫ‌ర్ అయ్యారు. ఆ త‌ర్వాత రామోజీరావు నిర్మించిన 'చిత్రం'తో డైరెక్ట‌ర్‌గా మారి సంచ‌ల‌నం సృష్టించారు. అయితే తేజ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంట‌నే విష‌యం చాలామందికి తెలీదు. ఆయ‌న తండ్రి పేరు జె.బి.కె. చౌద‌రి. అంద‌రూ 'జేబీకే' అని ఆత్మీయంగా పిలిచేవారు. సినీ రంగంలో అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా మెలిగేవారు. క‌థలు చెప్పేవారు. మిత్రుల స‌హ‌కారంతో 'ధ‌ర్మ‌ప‌త్ని' అనే సినిమా చేశారు.  జేబీకే, రాణి దంప‌తుల‌కు ఇద్ద‌రు అమ్మాయిల త‌ర్వాత పుట్టిన అబ్బాయికి ధ‌ర్మ‌తేజ అనే పేరు పెట్టుకున్నారు. అప్ప‌టి షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ పేరు జ‌యంతి ధ‌ర్మ‌తేజ‌. ఆయ‌న ఇన్‌స్పిరేష‌న్‌తోటే త‌న కుమారుడికి ధ‌ర్మ‌తేజ అని నామ‌క‌ర‌ణం చేశారు జేబీకే. త‌ర్వాత కాలంలో ఆయ‌న‌ జ‌పాన్‌కు హ్యూమ‌న్ హెయిర్ ఎక్స్‌పోర్ట్ చేసే బిజినెస్ చేశారు. ఒక క‌న్‌సైన్‌మెంట్‌లో తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఆ టైమ్‌లో ఆయ‌న భార్య రాణి మృతి చెందారు. దెబ్బ‌మీద దెబ్బ ప‌డింది. ఎలాగో క‌ష్ట‌ప‌డి పిల్ల‌ల్ని ఒక్క‌డే పెంచి పెద్ద చేశారు. ఆరోగ్యం దెబ్బ‌తిని తేజ‌ ప‌దేళ్ల వ‌య‌సులో ఉండ‌గా జేబీకే క‌న్నుమూశారు. పిల్ల‌లు పెద్ద‌దిక్కులేని వాళ్ల‌య్యారు. అక్క‌య్య‌ల స‌హ‌కారంతో ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తూ చ‌దువుకున్నారు తేజ‌. సినిమాల మీద ధ్యాస ఎక్కువై, ముంబైకి వెళ్లారు. అక్క‌య్య‌లు ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లిళ్లు చేసుకున్నారు. బాలీవుడ్‌లో మొద‌ట చిన్నా చిత‌కా సినిమాల‌కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశారు. చురుకైన‌వాడు కావ‌డంతో త్వ‌ర‌గానే పేరు వ‌చ్చింది. కెమెరామేన్‌గా ప‌నిచేస్తున్న‌ప్పుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న యూనిట్‌లో చేరిపోయారు తేజ‌. అలా 'శివ' సినిమాకు ఆప‌రేటివ్ కెమెరామేన్‌గా ప‌నిచేశారు. ఆర్జీవీ సినిమా 'రాత్రి'తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా మారారు తేజ‌. అంతం, మ‌నీ, ర‌క్ష‌ణ‌, మ‌నీ మ‌నీ సినిమాల త‌ర్వాత ఎక్కువ‌గా హిందీ సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. రామోజీరావును క‌న్విన్స్ చేసి, ఆయ‌న బ్యాన‌ర్‌పై 'చిత్రం' సినిమాని కేవ‌లం రూ. 30 ల‌క్ష‌ల బడ్జెట్‌తో తీసి, బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్ ఎలా సాగుతూ వ‌చ్చిందీ మ‌నం చూస్తున్నాం.

రావు గోపాల‌రావు అంత్య‌క్రియ‌లు ఎలా జ‌రిగాయో, అక్క‌డ‌ ఏం జ‌రిగిందో తెలుసా?

  రావు గోపాల‌రావు ఎలాంటి న‌టుడో ఇప్ప‌టి యంగ్ జ‌న‌రేష‌న్‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, నిన్న-మొన్న‌టి త‌రాల‌కు బాగా తెలుసు. తెలుగు సినిమాల్లో విల‌నిజాన్ని కొత్త‌పుంత‌లు తొక్కించిన న‌టునిగా రావు గోపాల‌రావు ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠులు. అన‌కాప‌ల్లికి చెందిన ఆయ‌న మొద‌ట రంగ‌స్థ‌లంపై పేరు తెచ్చుకొని, ఆన‌క సినిమాల్లోకి వ‌చ్చి, మొద‌ట చిన్న పాత్ర‌లు చేశారు. క్రాంతికుమార్ నిర్మించిన 'శార‌ద‌'లో చేసిన మున‌స‌బు పాత్ర మంచి పేరు తెస్తే, బాపు చిత్రం 'ముత్యాల ముగ్గు'లో చేసిన కాంట్రాక్ట‌ర్ కేర‌క్ట‌ర్ ఆయ‌న కెరీర్‌ను స‌మూలంగా మార్చేసి, వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా చేసింది. కోట శ్రీ‌నివాస‌రావు, గొల్ల‌పూడి మారుతీరావు లాంటి న‌టుల రాక‌తో రావు గోపాల‌రావుకు అవ‌కాశాలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా, 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' లాంటి సినిమాల్లో చేసిన పాత్ర‌ల‌తో త‌నేమిటో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఉన్న‌ట్లుండి ఆరోగ్యం క్షీణించ‌డంతో పాటు, ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాల్లో ముందుచూపు లేక‌పోవ‌డంతో చాలా న‌ష్ట‌పోయారు. న‌మ్మిన‌వాళ్లు ద‌గా చేశారు. అనారోగ్యానికి చికిత్స కోసం చాలా డ‌బ్బే ఖ‌ర్చుపెట్టాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు పోరాటం చాలించి, 1994 ఆగ‌స్ట్ 13న రావు గోపాల‌రావు క‌న్నుమూశారు. అప్ప‌టికింకా తెలుగు చిత్ర‌సీమ పూర్తిగా మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ త‌ర‌లిపోలేదు. మ‌ద్రాసులో ఉన్న సినీ ప్ర‌ముఖులు కొంత‌మంది ఆయ‌న పార్థివ‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆరోజు మ‌ధ్యాహ్నం ఆయ‌న అంతిమ‌యాత్ర మొద‌లైంది. న‌టులు అల్లు రామ‌లింగ‌య్య‌, పి.ఎల్‌. నారాయ‌ణ‌, నిర్మాత జ‌య‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ రేలంగి న‌ర‌సింహారావు లాంటి కొద్దిమందే ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.  పెద్దకొడుకు రావు ర‌మేశ్‌, రెండో కొడుకు క్రాంతి అశ్రున‌య‌నాల‌తో తండ్రి భౌతిక దేహానికి అగ్ని సంస్కారం జ‌ర‌ప‌బోతున్నంత‌లో "ఆగండి" అంటూ కొంత‌మంది త‌మిళ‌మిత్రులు అక్క‌డ‌కు వ‌చ్చారు. చుట్టూ చూసి, "ఇంకా ఎవ‌రైనా రావాలా?" అని త‌మిళంలోనే అడిగారు. లేద‌ని అల్లు రామ‌లింగ‌య్య చెప్పారు. అప్పుడు వాళ్లంతా క‌న్నీరు పెట్టుకుంటూ, రావు గోపాల‌రావు భౌతిక‌దేహానికి న‌మ‌స్క‌రిస్తూ, "ఇలాంటి గొప్ప‌న‌టుడు దేశంలోని మ‌రే ప్రాంతంలోనైనా ఉంటే, వారి అంత్య‌క్రియ‌లు ఇంత సాదాసీదాగా, పేల‌వంగా జ‌ర‌గ‌వు. అంత గొప్ప‌మ‌నిషి, మాన‌వ‌త్వం క‌లిగిన మ‌హ‌నీయునికి ఇలా అగ్నిసంస్కారం జ‌ర‌గ‌డం బాధ‌గా ఉంది" అన్నారు. నిజ‌మే.. రావు గోపాల‌రావు ఎలాంటి న‌టుడు! త‌న డైలాగ్ డిక్ష‌న్‌తో హీరోల‌ను కూడా ఎలా డామినేట్ చేసేవారు!! అలాంటి న‌టుడు ప‌ర‌మ‌ప‌దిస్తే, తోటి న‌టుల్లో చాలామంది ఆయ‌న‌ను క‌డ‌సారి చూసుకొనేందుకు కూడా వెళ్ల‌లేదు. క‌నీసం ఆఖ‌రిసారిగా అయినా ఆయ‌న‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని ఎవ‌రూ అనుకోలేదు. సినీ రంగం నుంచి ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న‌ది ఎక్కువ‌గా చిన్న‌స్థాయి కార్మికులే.