2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?

Publish Date:Jan 3, 2026

 2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.  అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి.  పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు  2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు  అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.  ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో  ఉంది.  ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి.  ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ  సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.   బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా  పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.   ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.  ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.  ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.   అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా,  మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది.  ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

కొండ‌గ‌ట్టు, కోన‌సీమ ఓ ప‌వ‌న్ క‌ళ్యాణ్?

Publish Date:Jan 3, 2026

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయుడి గుడికి ప‌వ‌న్ ద్వారా భారీ విరాళం. ఆ భూరి విరాళంతో ఆలయంలో అభివృద్ధి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేయడం..ప్ర‌స్తుతం ఈ వార్తలు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆంజ‌నేయ స్వామి వారంటే ప‌వ‌న్ కి ఎందుకంత ఇష్టం? అని చూస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు కొణిదెల కుటుంబానికి కులదైవం. అందుకు నిదర్శనంగా ప‌వన్ కల్యాణ్ నామధేయంలోని పవన్  ఆంజ‌నేయ స్వామి వారిపేరు. ఔను   ప‌వ‌న సుత హ‌నుమాన్ అని కూడా ఆంజ‌నేయుడ్ని పిలుస్తుంటారు భ‌క్త జ‌నం. వాయుపుత్రుడాయ‌న‌. అంటేపవన్ కల్యాణ్ పేరులో  స‌గం ఆంజ‌నేయ‌స్వామి ఉన్నారు. ఇక పవన్ తల్లి పేరు అంజనా దేవి. ఆ పేరులోనూ ఆంజనేయుడు ఉన్నారు.    అందుకే కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.   అదే బీఆర్ఎస్ గ‌తంలో ఇదే  కొండ‌గ‌ట్టు ఆలయానికి  వంద కోట్ల మేర నిధులు  ప్ర‌క‌టించి ఇవ్వ‌లేదు. అదే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలోనూ, దైవ భక్తికి రాష్ట్రాల హద్దులు ఉండవని చాటడంలోనూ ముందున్నారు.  ప‌వ‌న్  ఏపీకి చెందిన రాజ‌కీయ నాయ‌కుడైనా.. తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టుకు విరాళం ఇప్పించ‌డం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వాసులు అయితే మరో అడుగు ముందుకేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూడా.   పవన్ కల్యాణ్ గ‌తంలో ఇక్క‌డి నుంచే త‌న వారాహీ వాహ‌న యాత్ర‌ను లాంఛ‌నంగా మొద‌లు పెట్టారు. అదీ హనుమంతుల వారిపై ఆయనకు ఉన్న భక్తి. అది పక్కన పెడితే ఇక్కడ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. గ‌తంలో ఆయ‌న కోన‌సీమలో కొబ్బరి రైతులు నష్టాలు పాలుకావడంపై మాట్లాడుతూ..  తెలంగాణ ప్ర‌జ‌ల దిష్టి త‌గిలింద‌ని చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ప‌వ‌న్ యాంటీ తెలంగాణ అన్న మాట కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. అదే ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవ‌మైన కొండ‌గ‌ట్టు హ‌నుమ‌న్న ఆల‌యానికి కోట్ల రూపాయ‌ల విరాళం వ‌చ్చేలా చేసి.. త‌న‌పై వ‌చ్చిన యాంటీ తెలంగాణ కామెంట్స్ ని చెరిపేసుకున్నారు పవన్ కల్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పేర్కొంటున్నారు.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!

Publish Date:Jan 2, 2026

  మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోతే అది జీవితం మీద చాలా గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఈ విషయంలో అమ్మాయిలకు ఒక అవకాశం ఉంది. అదే ముందు జాగ్రత్త.. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ అబ్బాయిలు చేసే పనులే వారిని పట్టిస్తాయి.  వీటిని అర్థం చేసుకుంటే అమ్మాయిలు జాగ్రత్తపడి మోసగాళ్ల బారినుండి తప్పించుకోవచ్చు. ఇంతకీ.. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులేంటో తెలుసుకుంటే..   ప్రవర్తన.. అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో ఉంటే వెంటనే కనిపించే మొదటి మార్పు.. ప్రవర్తన మారిపోవడం.  అబ్బాయి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మునుపటిలాగా ప్రేమించకపోవడం, శ్రద్దగా ఉండకపోవడం చేస్తారు.   అవసరాలు.. కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే అబ్బాయి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇతరుల అవసరాల గురించి, వారి భావాల గురించి అస్సలు పట్టదు.  వారికి  కావాల్సింది దక్కనప్పుడు వారు సింపుల్ గా దూరం పెడతారు.     నిజాలు.. మొదట చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకున్న వ్యక్తి  ఆ తరువాత ఏ విషయాలు చెప్పకుండా గోప్యత మెయింటైన్ చేస్తుంటే, పైగా ఏదైనా విషయం అడిగినప్పుడు నిజం చెప్పకుండా  అబద్దాలు చెబుతుంటే  అలాంటి వారిని నమ్మడం కష్టం.   సమయం.. ప్రేమలో ఉన్నవారు,  ప్రేమిస్తున్న వారు.. తమ పార్ట్నర్ కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తారు.  వారు ఎంత బిజీ అయినా సరే.. సమయాన్ని కేటాయిస్తారు. కానీ మోసం చేసే ఉద్దేశ్యం ఉన్నవారు ఏదో ఒక సాకు చెబుతుంటారు. అలాంటి వారికి బంధం పట్ల సీరియస్ నెస్ ఉండదు.   మాటలు.. చేష్టలు.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిల మాటల్లోనూ, చేష్టలలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో చాలా తియ్యగా మాట్లాడతారు. గొప్పలు చెబుతారు,  తాము చాలా అత్యుత్తమం అనేలా నమ్మిస్తారు. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి పూర్తీగా సీన్ మారిపోతుంది. తాము చెప్పిందే చేయాలన్నట్టు డిమాండ్ చేస్తారు.  లేకపోతే నిర్లక్ష్యం చూపిస్తారు.   సహాయం.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిలు పూర్తీగా స్వార్థంతో ఉంటారు.  అమ్మాయి ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకపోవడం లేదా తప్పించుకున్నా అతను అమ్మాయిని కేవలం వాడుకుంటున్నాడని అర్థం.   స్వప్రయోజనం.. అబ్బాయి డబ్బు లేదా ఏదైనా సహాయం వంటి వాటికోసం అమ్మాయిని ఒత్తిడి చేసి మరీ ఇబ్బంది పెడుతుంటే అతను మోసం చేసే ఉద్దేశం ఉన్నవాడని అర్థం. నిజంగా ప్రేమించే అబ్బాయిలు తమ వల్ల తను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి కష్టం రాకూడదు అనుకుంటారు.   నియంత్రణ.. అమ్మాయి తన కుటుంబానికి, తన సన్నిహితులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసే అబ్బాయిలు ఎప్పుడూ నిజమైన ప్రేమ కలిగి ఉండరు. అమ్మాయిని నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు ఆమెను తమకు అనుగుణంగా వాడుకుంటారు.   బాధ్యత.. ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత ఉంటుంది. కానీ అతను అమ్మాయి పట్ల బాధ్యతతో ఉండకుండా కేవలం తన సొంత సంతోషం గురించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే అతను అమ్మాయి పట్ల సీరియస్ నెస్ లేనట్టే..   ఎమోషన్స్.. అమ్మాయిలకు సాధారణంగానే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా ,  అర్థం చేసుకోకుండా ఉంటే అతను సరైన పార్ట్నర్ కాడని అర్థం.అలాంటి వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండలేదు.   - రూపశ్రీ  
[

Health

]

బాదం పప్పు తినే వారికి అలర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుండా తినకండి..!

Publish Date:Jan 2, 2026

డ్రై ప్రూట్స్ కోవలో చాలామంది తమకు తెలియకుండానే నట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో బాదం,  వాల్నట్ వంటివి ప్రధానంగా ఉంటాయి.  ఇవి  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని అనుకుంటారు. చాలా రకాల వ్యాధులు రాకుండా చేయడంలో ఈ  డ్రై నట్స్ చాలా సహాయపడతాయి.   బాదం పప్పులు అటువంటి డ్రై నట్స్ లో ఒకటి. బాదం పప్పులు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్ వంటివి కలిగి ఉంటాయి.  ప్రతిరోజూ రాత్రి బాదం పప్పులు నీటిలో నానబెట్టుకుని వాటిని ఉదయాన్నే  తినేవారు అధికంగా ఉంటున్నారు. అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని  రోజూ అధికంగా బాదం పప్పు తినేవారు కొందరు ఉంటారు.  అసలు బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం?  ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే.. బాదం తో ఆరోగ్యం.. బాదం అధికంగా తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.   కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను కూడా కలిగిస్తుందని కూడా చెబుతున్నారు. ఇది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై  ప్రతికూల ప్రభావాలను చూపుతుందట. కాబట్టి బాదం పప్పులు ఎన్ని తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాదం పప్పుతో నష్టాలు.. బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, బరువు పెరగడం,  మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వస్తాయి. రోజువారీ సిఫార్సు చేయబడిన బాదం పప్పు తీసుకోవడం వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి మారుతుంది. అయితే వీటిని తక్కువగానే తీసుకోవాలి. బాదం పప్పును అధికంగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు. బాదం పప్పులో కరిగే ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల వైఫల్యం,  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బాదం ఎక్కువగా తినేవారికి  బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణ ఆహారంతో పాటు పెద్ద మొత్తంలో బాదం (20 కంటే ఎక్కువ) తీసుకుంటే, అదనపు కేలరీలు చేరి వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఫైబర్  ఎక్కువ ఉండటం వల్ల ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, జింక్,  ఐరన్  వంటి ఖనిజాల  శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  బాదంను పెద్ద మొత్తంలో తీసుకుంటే అది శరీరంలోని ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా అలసట, బలహీనత,  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. -రూపశ్రీ