"సరోజా.. వద్దమ్మా వద్దు".. 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా' వచ్చి అప్పుడే 15 ఏళ్ళైందా!

  ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు.. ఎ. కరుణాకరన్. 'తొలిప్రేమ' (1998) వంటి మెమరబుల్ మూవీతో దర్శకుడైన కరుణాకరన్.. ఆ తరువాత ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో తనకి మళ్ళీ సక్సెస్ ని అందించిన సినిమా 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా'. ఈ చిత్రంతోనే యశో సాగర్, స్నేహ ఉల్లాల్ తెలుగుతెరకు హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్, సుధ, ప్రసాద్ బాబు, కవిత, సురేఖా వాణి, సత్యకృష్ణన్, సుమన్ శెట్టి, పింగ్ పాంగ్ సూర్య, శ్రీలత, ఎల్బీ ఎరామ్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, 'అల్లరి' సుభాషిణి, గౌతమ్ రాజు, అనంత్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  కథ విషయానికి వస్తే.. రూ. 50 కోట్ల ఆస్తికి వారసురాలైనా సవతితల్లి కారణంగా ఇబ్బందులకి గురవుతుంటుంది ధనలక్ష్మి (స్నేహా ఉల్లాల్). తండ్రి మరణానంతరం ఆస్తిపై కన్నేసిన సవతి తల్లి.. ధన ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్ళి చేయాలనుకుంటుంది. దీంతో ఇంటి నుంచి పారిపోయి వస్తుంది ధనలక్ష్మి. ఈ క్రమంలోనే.. గ్యారేజ్ ఓనర్ కొడుకైన అరవింద్ (యశో సాగర్)తో పరిచయమవుతుంది. ధనతో మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు అరవింద్. అయితే ధన మాత్రం చిన్ననాటి స్నేహితుడైన బాలాజీని తప్ప మరొకరిని ప్రేమించలేనని చెబుతుంది. ఈ నేపథ్యంలో.. అరవింద్  తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నదే మిగిలిన సినిమా. కరుణాకరన్ మార్క్ తో సాగే ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలో.. "సరోజా.. వద్దమ్మా వద్దు" అంటూ సాగే హాస్య సన్నివేశం భలేగా ఎంటర్టైన్ చేసింది.  ఇక పాటల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించిన ఈ సినిమాకి అనంత శ్రీరామ్ సాహిత్యమందించారు. "ఉల్లాసంగా", "దణ్ణాల్లే తల్లి", "నా ప్రేమ", "లాలిపాట", "ప్రియతమా", "మాట మాటికి", "చకోరి" అంటూ సాగే పాటలు యువతరాన్ని అలరించాయి. అమృత్ అమర్ నాథ్ ఆర్ట్స్ పతాకంపై జి.ఎస్. రంగనాథ్, బి.పి. సోము నిర్మించిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా'.. 'బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్' గా ఎ. కరుణాకరన్ కి 'నంది' పురస్కారాన్ని అందించింది. ఇందులో యశోసాగర్ పాత్రకి నటుడు శివాజీ డబ్బింగ్ చెప్పడం విశేషం. తొలి చిత్రంతోనే యువతరాన్ని భలేగా ఆకట్టుకున్న యశో సాగర్.. 2012 డిసెంబర్ లో ఓ కారు ప్రమాదంలో మరణించడం విషాదకరం. కాగా, 2008 జూలై 18న విడుదలై ఘనవిజయం సాధించిన 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా'.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.  

వేణు 'కళ్యాణ రాముడు'కి 20 ఏళ్ళు.. 'చిరునవ్వుతో' కాంబో రిపీట్!

వైవిద్యానికి పెద్దపీట వేసే కథానాయకుల్లో తొట్టెంపూడి వేణు ఒకరు. 'స్వయంవరం', 'చిరునవ్వుతో' చిత్రాలతో అప్పటి యువతరాన్ని విశేషంగా అలరించిన వేణు.. 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళితే' వంటి మల్టిస్టారర్ మూవీస్ తోనూ ఎంటర్టైన్ చేశారు. ఈ విజయవంతమైన సినిమాల తరువాత వేణు నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనరే 'కళ్యాణ రాముడు'. 2002 నాటి మలయాళ చిత్రం 'కళ్యాణ రామన్' (దిలీప్, నవ్యా నాయర్) ఆధారంగా రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రంలో.. వేణు కి జోడీగా నికిత నటించగా ప్రభుదేవా, సుమన్, నాజర్, సునీల్, ఎమ్మెస్ నారాయణ, చిత్తజల్లు లక్ష్మీపతి, రాజా రవీంద్ర, రఘుబాబు, జేవీ సోమయాజులు, అల్లు రామలింగయ్య, గిరిధర్, సన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. కథ విషయానికి వస్తే..  ఈవెంట్ మేనేజర్ అయిన కళ్యాణ రాముడు (వేణు).. ఓ కళ్యాణ మండపంలో పరిచయమైన కళ్యాణి (నికిత)తో క్రమంగా ప్రేమలో పడతాడు. అయితే రాము కుటుంబానికో చరిత్ర ఉంటుంది. అదేమిటంటే.. ఆ ఇంటికి కోడళ్ళుగా వెళ్ళిన వారు సంపూర్ణ ఆయుర్దాయంతో బతకరు. కళ్యాణి అక్క విషయంలోనూ ఇదే జరుగుతుంది.  ఈ నేపథ్యంలో.. రాము, కళ్యాణి పెళ్ళి జరిగిందా? లేదా? అన్నదే మిగిలిన సినిమా. వినోదానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ సుఖాంత కథ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. 'చిరునవ్వుతో' (2000) వంటి ఘనవిజయం తరువాత వేణు - దర్శకుడు జి. రామ్ ప్రసాద్ - ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ - మెలోడీబ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా విజయపథంలో పయనించింది. ఇక పాటల విషయానికి వస్తే.. "ప్రేమించుకున్నవాళ్ళు" మినహాయిస్తే మిగిలినవన్నీ ఒరిజినల్ వెర్షన్ లోనివే యథాతథంగా వాడుకున్నారు. వాటికి బెర్నీ - ఇగ్నటియస్ బాణీలు కట్టారు. కాగా 2003 జూలై 18న జనం ముందు నిలిచిన 'కళ్యాణ రాముడు'.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది. 

బయోగ్రఫీ: రంగనాథ్ జీవితం.. ఓ విషాదాంత సినిమా!

కొందరి జీవితాలు సినిమాల్లా ఉంటాయి. కొన్ని సినిమాలు జీవితాలను పోలి ఉంటాయి. ప్రముఖ నటుడు రంగనాథ్ విషయానికొస్తే.. తన జీవితం కూడా ఓ సినిమాలానే ఉంటుంది. కాకపోతే.. పలు మలుపులతో సాగిన విషాదాంత సినిమాలా. అవును.. అందమైన వృత్తి, అంతకుమించి అర్థం చేసుకునే భార్య ఇలా సాగిపోతున్న రంగనాథ్ జీవితంలో ఓ అనూహ్య ఘటన.. అతని జీవితాన్నే మార్చివేసింది. విషాదాంత సినిమాలాంటి రంగనాథ్ జీవితం.. బయోగ్రఫీ రూపంలో మీ కోసం..  రంగనాథ్ పూర్తిపేరు.. తిరుమల సుందర శ్రీ రంగనాథ్. 1949 జూలై 17న టీఆర్ సుందర రాజు, టీఆర్ జానకి దేవి దంపతులకు జన్మించిన రంగనాథ్.. అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ఆ ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభావంతో ఎదుగుతూ.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో బీఏ డిగ్రీ పట్టా పొందారు. ఆ అర్హతతోనే భారత రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం పొందిన రంగనాథ్ ని.. రంగుల ప్రపంచం ఎంతగానో ఆకర్షించింది. ఈ క్రమంలోనే.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన 'బుద్ధిమంతుడు' సినిమాలో రంగనాథ్ కి చిన్న వేషం దక్కింది. 1969లో రిలీజైన ఈ సినిమా తరువాత వెంటనే అవకాశాలు రాకపోయినా.. 1974లో రూపొందిన 'చందన'లో ఏకంగా కథానాయకుడి పాత్ర దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న రంగనాథ్.. ఆపై 'జమీందారు గారి అమ్మాయి', 'పల్లె సీమ', 'పంతులమ్మ', 'రామచిలుక', 'అమెరికా అమ్మాయి', 'అందమే ఆనందం', 'మా ఊరి దేవత', 'దేవతలారా దీవించండి', 'ఇంటింటి రామాయణం', 'ప్రియబాంధవి', 'మేనత్త కూతురు', 'రామయ తండ్రి', 'లవ్ ఇన్ సింగపూర్', 'మదన మంజరి' తదితర చిత్రాల్లో హీరోగా చేశారు. మరోవైపు అగ్ర కథానాయకుల చిత్రాల్లో సహాయక వేషాల్లోనూ కనిపిస్తూ వచ్చారు. నవలా కథానాయకులను తలపించేలా మంచి ఒడ్డూపొడవు రూపంతో మెరిసిపోయే రంగనాథ్.. మంచి గాత్రం, దేహధారుడ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ సరైన సినీ నేపథ్యం, ప్రోత్సాహకులు లేకపోవడంతో తన అర్హతకు తగ్గ స్థాయికి వెళ్ళలేకపోయారు. అలాగే.. కుటుంబ పరిస్థితులు కూడా అతన్ని కెరీర్ లో ఆశించిన స్థాయికి తీసుకెళ్ళలేకపోయాయి. అయినప్పటికీ నిరాశపడక తనను వరించిన అవకాశాలతో ముందుకు సాగారు. 'ఎర్రమల్లెలు', 'ఈ చరిత్ర ఏ సిరాతో', 'ఈ చదువులు మాకొద్దు', 'ఇది కాదు ముగింపు' వంటి ఆలోచనాత్మక చిత్రాల్లో ఆకట్టుకున్న రంగనాథ్.. 'ఖైదీ', 'పల్నాటి సింహం', 'అడవి దొంగ', 'కలియుగ కృష్ణుడు', 'దొంగ మొగుడు', 'అంతిమ తీర్పు', 'స్టేట్ రౌడీ', 'ముత్యమంత ముద్దు', 'కొండవీటి దొంగ', 'కొదమ సింహం', 'బృందావనం', 'ప్రేమంటే ఇదేరా', 'స్నేహితులు', 'ప్రేమకు వేళాయెరా', 'కలిసుందాం.. రా', 'మన్మథుడు', 'రాధాగోపాళం', 'శ్రీ రామదాసు', 'లక్ష్మి', 'ఎవడైతే నాకేంటి', 'సామాన్యుడు', 'అహ నా పెళ్ళంట', 'సోలో' తదితర విజయవంతమైన సినిమాల్లో ముఖ్య పాత్రల్లో తనదైన ముద్రవేశారు. అంతేకాదు.. 'మొగుడ్స్ పెళ్ళామ్స్' పేరుతో తన దర్శకత్వంలో ఓ సినిమాని సైతం రూపొందించారు. అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'భాగవతం'తో బుల్లితెరపై తొలిసారిగా మెరిసిన రంగనాథ్.. ఆపై దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్ 'శాంతి నివాసం'తో సందడి చేశారు. ఆనక 'మై నేమ్ ఈజ్ మంగతాయారు', 'ఇద్దరు అమ్మాయిలు', 'అత్తో అత్తమ్మ కూతురో', 'మొగలిరేకులు' వంటి ధారావాహికల్లో రంజింపజేశారు. మొత్తంగా.. నాలుగు దశాబ్దాలకి పైగా సినీ జీవితంలో 300కి పైగా చలనచిత్రాల్లో కథానాయకుడిగా, సహాయకనటుడిగా, ప్రతినాయకుడిగా, గుణచిత్ర నటుడిగా పలు వేషాల్లో మురిపించారు రంగనాథ్.  వెండితెర జీవితంలో తన అభినయంతో వెలుగులు పంచిన రంగనాథ్.. నిజజీవితంలోనూ భర్తగా, తండ్రిగా బాధ్యాతయుతంగా ముందుకు సాగారు. తన శ్రీమతి తిరుమల చైతన్య ఓ ప్రమాదం కారణంగా వీల్ ఛైర్ కే పరిమితమైన సమయంలో.. నాలుగేళ్ళ పాటు భర్తగా పలు సపర్యలు చేశారు రంగనాథ్. అయితే 2009లో శ్రీమతి తిరుమల చైతన్య తనువు చాలించాక.. రంగనాథ్ ఆలోచనాధోరణి మారిపోయింది. భార్యావియోగంతో ఒంటరి జీవితాన్ని గడపలేక సతమతమైన ఆయన.. 2015 డిసెంబర్ 19న తన ఆలోచన శైలికి భిన్నంగా ఆత్మహత్య చేసుకున్నారు. అలా.. ఓ విషాదాంత సినిమాలా ఆయన జీవితం ముగిసింది. 

కథానాయికల కథల్లో నాథుడు.. రంగనాథ్! ఆ సినిమాలేంటో, హీరోయిన్లెవరో తెలుసా!!

తెలుగునాట 'అండర్ రేటెడ్' నటుల జాబితాలో తప్పక వినిపించే పేరు.. రంగనాథ్. కెరీర్ ఆరంభంలో కథానాయకుడిగా పలు చిత్రాల్లో అలరిస్తూ వచ్చిన రంగనాథ్.. అదే సమయంలో సహాయనటుడిగానూ కనిపించారు. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. దర్శకుడిగానూ ఓ ప్రయత్నం చేశారు. ఇక టీవీ సీరియల్స్ లో సైతం తనదైన ముద్రవేశారు.   గమ్మత్తు ఏమిటంటే.. రంగనాథ్ హీరోగా నటించిన తొలి చిత్రం మొదలుకుని చాలామటుకు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే కథానాయకుడిగా సందడి చేశారు. 'చందన' (1974)తో మొదలైన ఈ ప్రయాణం.. ఆపై 'జమీందారు గారి అమ్మాయి', 'అమెరికా అమ్మాయి', 'పంతులమ్మ', 'రామ చిలుక', 'అందమే ఆనందం', 'మా ఊరి దేవత',  'దేవతలారా దీవించండి', 'మదన మంజరి', 'పల్లె సీమ', 'మేనత్త కూతురు' తదితర చిత్రాల వరకు సాగింది. 'రామ చిలుక'లో అప్పటి అగ్రకథానాయిక వాణిశ్రీ జోడీగా అలరించిన రంగనాథ్.. 'జమీందారు గారి అమ్మాయి', 'ప్రియబాంధవి'లో మరో స్టార్ హీరోయిన్ శారద జంటగా కనిపించారు. అలాగే 'పల్లె సీమ'లో జయసుధ సరసన, 'పంతులమ్మ'లో లక్ష్మి జతగా, 'అందమే ఆనందం'లో జయప్రద జోడీగా, 'మదన మంజరి'లో జయమాలిని పక్కన, 'మేనత్త కూతురు'లో మాధవితో జట్టుకట్టి ఆకట్టుకున్నారు. వీటిలో సింహభాగం సినిమాలు జనరంజకమే. సో.. కథానాయికల కథల్లో నాథుడిగా రంగనాథ్ అచ్చొచ్చారనే చెప్పొచ్చు.  (జూలై 17.. రంగనాథ్ జయంతి సందర్భంగా..)

బర్త్ డే స్పెషల్: భారతీరాజా నేరుగా తీసిన తెలుగు చిత్రాలివే.. కామన్ పాయింట్ ఏంటో తెలుసా!

  గ్రామీణ నేపథ్య చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకదిగ్గజం భారతీరాజా. ప్రధానంగా తమిళంలో సినిమాలు తీస్తూ వచ్చిన భారతీరాజా.. అడపాదడపా హిందీ, తెలుగు భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేశారు. మరీముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే.. భారతీరాజా నుంచి మొత్తంగా 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. వీటిలో స్టార్ హీరోల మూవీస్ కూడా ఉండడం విశేషం. నేడు (జూలై 17) భారతీరాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేసిన తెలుగు చిత్రాలకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పరిశీలిద్దాం. కొత్త జీవితాలు (1981): భారతీరాజా డైరెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా ఇది. 1979 నాటి తన కోలీవుడ్ మూవీ 'పుదియ వార్పుగళ్' (కె. భాగ్యరాజ్, రతి అగ్నిహోత్రి) ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీరాజా. ఇందులో సుహాసిని, హరిప్రసాద్, గుమ్మడి ముఖ్య పాత్రల్లో కనిపించగా.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు కట్టారు.  సీతాకోక చిలక (1981): అప్పట్లో యువతరాన్ని విశేషంగా అలరించిన  ప్రేమకథా చిత్రమిది. తమిళంలో 'అలైగళ్ ఓయ్ వదిల్లై' (కార్తిక్, రాధ) పేరుతోనూ, తెలుగులో 'సీతాకోక చిలక'  (మురళి అలియాస్ కార్తిక్, ముచ్చర్ల అరుణ) పేరుతోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న ఈ బైలింగ్వల్ మూవీ.. కోలీవుడ్ లో ముందుగా రిలీజైంది. తెలుగులో నెల రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఈ సినిమాకీ ఇళయరాజానే ట్యూన్స్ ఇచ్చారు. ఆరాధన (1987): మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక ముఖ్య పాత్రల్లో భారతీరాజా రూపొందించిన ఈ సినిమా.. 1986 నాటి తమిళ చిత్రం 'కడలోర కవితైగళ్' (సత్యరాజ్, రేఖ, రంజిని)కి రీమేక్ వెర్షన్. ఈ మూవీకి కూడా ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. జమదగ్ని (1988): భారతీరాజా దర్శకత్వం వహించిన చివరి తెలుగు సినిమా ఇది. అంతేకాదు.. భారతీరాజా తెలుగులో చేసిన సినిమాల్లో నాన్ - రీమేక్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.  సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో రాధ నాయిక. ఈ ఫిల్మ్ కి కూడా ఇళయరాజానే మ్యూజిక్ కంపోజర్. మొత్తంగా చూస్తే.. భారతీరాజా తెలుగులో నాలుగు డైరెక్ట్ మూవీస్ చేయగా.. అన్నింటికీ కూడా ఇళయరాజానే స్వరకర్త. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. భారతీరాజా తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా ఇళయరాజా మ్యూజికల్సే. ఇంకా చెప్పాలంటే.. భారతీరాజా పేరు చెప్పగానే ఠక్కున ఇళయరాజా కాంబోనే గుర్తుకు వస్తుంది కూడా. అయితే భారతీరాజా తమిళ చిత్రాలలో కొన్నింటికి ఇళయరాజా కాకుండా ఎ.ఆర్. రెహమాన్, దేవా తదితరులు మ్యూజిక్ ఇచ్చారు. ఇక భారతీరాజా హిందీ మూవీస్ కి ఇళయరాజా స్వరాలు అందించిన వైనం లేదనే చెప్పాలి. సో.. ఒక్క తెలుగులో మాత్రమే భారతీరాజా సినిమాలన్నింటికీ ఇళయరాజా సంగీత దర్శకుడు అన్నమాట.   

'పిచ్చి పుల్లయ్య'గా ఎన్టీఆర్ అలరించి 70 ఏళ్ళు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'పిచ్చి పుల్లయ్య' ఒకటి. ఇందులో అమాయకుడైన పల్లెటూరి యువకుడు పుల్లయ్య పాత్రలో టైటిల్ రోల్ చేసి అలరించారు ఎన్టీఆర్. తమ సొంత సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్.ఎ.టి) నుంచి మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. వాణిజ్యపరంగా ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించకపోయినా.. తదనంతర కాలంలో సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక విభాగాల్లో చిత్రాలు నిర్మించిన అరుదైన సంస్థగా ఎన్.ఎ.టి వార్తల్లో నిలిచింది. అలాగే పలు విజయవంతమైన సినిమాలకు చిరునామాగా నిలిచింది నేషనల్ ఆర్ట్ థియేటర్స్. ఈ చిత్రానికి టి. ప్రకాశరావు దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే సమాకూర్చారు. ఎన్టీఆర్ సోదరుడు ఎన్. త్రివిక్రమరావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.  ఎన్టీఆర్ సరసన కృష్ణ కుమారి నటించిన ఈ సినిమాలో 'షావుకారు' జానకి, గుమ్మడి, అమర్ నాథ్, ఛాయాదేవి, రమణారెడ్డి, హేమలత, మోహన, మహంకాళి వెంకయ్య, కోడూరు అచ్చయ్య ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. నిజజీవితంలో అక్కాచెల్లెళ్ళు అయిన కృష్ణ కుమారి, షావుకారు జానకి ఇందులో కలిసి నటించడం ఓ విశేషమనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ కి జంటగా కృష్ణ కుమారి నటించిన తొలి చిత్రమిదే కావడం మరో విశేషం. అనిసెట్టి సుబ్బారావు మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతమందించారు. "బస్తీకి పోయేటి", "ఆలపించనా", "ఆనందమే", "ఎల్ల వేళలందు", "శోకపు", "అవమానాలకు బలి అవుతున్న", "మనసారా ఒకసారి", "ఏలనోయ్", "రారారా" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. 1953 జూలై 17న జనం ముందు నిలిచిన 'పిచ్చి పుల్లయ్య'.. నేటితో 70 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

30 ఏళ్ళ 'ప్రేమపుస్తకం'.. అజిత్ కి ఫస్ట్ ఛాన్సిచ్చిన ఎస్పీబీ సలహా.. గొల్లపూడిని విషాదంలో ముంచిన ఘటన!

ప్రతి సినిమా నిర్మాణం వెనుక కొన్ని మరపురాని ఘటనలు ఉంటాయి. సరిగ్గా 30 ఏళ్ళ క్రితం విడుదలైన 'ప్రేమ పుస్తకం' కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ చిత్రం ఓ స్టార్ కి కథానాయకుడిగా తొలి అవకాశమిస్తే.. ఓ సినీ ప్రముఖుడికి మాత్రం పుత్రవియోగాన్నిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..  తమిళనాట స్టార్ హీరోగా రాణిస్తున్న అజిత్ కుమార్.. కథానాయకుడిగా తన మొదటి సినిమాని తెలుగులోనే చేశారని మీకు తెలుసా? అది కూడా 'గానగంధర్వుడు' ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇచ్చిన ఓ సలహా కారణంగానే.. తనకి ఆ అవకాశం దొరికింది. ఎలాగంటే.. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. 'ప్రేమ పుస్తకం' పేరుతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా.. కథానాయకుడి పాత్రకై ఓ కొత్త ముఖం కోసం చూస్తున్నారు. ఓసారి ఎస్పీబీని ఇదే విషయమై.. "చూడడానికి బాగుండాలి. మ్యాన్లీగా ఉండాలి. అలాగని చాక్లెట్ బాయ్ లా ఉండకూడదు.. మీకు తెలిసి అలాంటి కుర్రాడి ఉంటే చెప్పండి" అని తమ కథకి సరిపడ యువకుడి గురించి చెప్పుకొచ్చారు గొల్లపూడి. ఈ మాట వినగానే.. బాలుకి తన కొడుకు చరణ్ క్లాస్ మేట్ అయిన అజిత్ కుమార్ వెంటనే గుర్తుకువచ్చి.. తను బాగా కుదురుతాడని సలహా ఇచ్చారు. అలా అజిత్ కి 'ప్రేమ పుస్తకం'లో నటించే అవకాశం దక్కింది. అయితే, ఓ విషాదం కారణంగా సినిమా కాస్త ఆలస్యమై సెకండ్ ఫిల్మ్ గా చేసిన తమిళ చిత్రం 'అమరావతి' ముందుగా రిలీజైంది. ఆపై చేసిన కొన్ని తమిళ చిత్రాలతో అజిత్ స్టార్ గా ఎదిగారు. ఇంతకీ 'ప్రేమ పుస్తకం' సమయంలో చోటుచేసుకున్న ఆ విషాదం ఏమిటంటే.. గొల్లపూడికి ముగ్గురు కొడుకులు. వారిలో చిన్నవాడైన శ్రీనివాస్ కి మాత్రమే సినిమా రంగం అంటే ఆసక్తి. ఒకవైపు రచయితగా రాణిస్తూ.. మరోవైపు ప్రముఖ దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేస్తుండేవాడు శ్రీనివాస్. ఈ అనుభవంతోనే 'ప్రేమ పుస్తకం' కథ తయారుచేసుకున్నాడు శ్రీనివాస్. హీరోగా అజిత్, హీరోయిన్ గా అప్పటికే కొన్ని హిందీ, మలయాళం చిత్రాలు చేసిన కంచన్ ని ఎంచుకున్నాడు. తొలి ఎనిమిది రోజులు సినిమా షూటింగ్ చాలా అంటే చాలా సాఫీగా సాగింది. కానీ.. తొమ్మిదో రోజు (1992 ఆగస్టు 12) ఏదైతే ఉందో ఆ రోజు మాత్రం ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదే  శ్రీనివాస్ జీవితంలో చివరి రోజు అవుతుందని ఎవరూ అనుకోలేదు.  ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే.. వైజాగ్ బీచ్ లోని ఒక బండమీద హీరోయిన్ కంచన్ పై ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమయ్యాడు శ్రీనివాస్. సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద అల వచ్చి శ్రీనివాస్ ని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయింది. కొంతసేపు గడిచాక తను శవమై కనిపించాడు. అంతే.. యూనిట్ అంతా షాక్ లో ఉండిపోయింది. అయితే.. ఆ సమయంలో గొల్లపూడి మారుతీరావు అక్కడ లేరు. యూనిట్ కూడా శ్రీనివాస్ మరణం గురించి గొల్లపూడికి చెప్పలేదు. తరువాత ప్రమాదం గురించి తెలిసి ఆసుపత్రికి వెళ్ళిన గొల్లపూడికి.. ఒక వ్యక్తి పోస్ట్ మార్టమ్ అయిపోయిందని చెప్పగానే షాకయ్యారు. కొన్నాళ్ళపాటు ఆ బాధలోనే ఉండిపోయారు గొల్లపూడి. ఎట్టకేలకు కొడుకు కలని నెరవేర్చడానికి అన్నట్లుగా సినిమాని తన దర్శకత్వంలోనే పూర్తిచేశారు. అంతేకాదు.. కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ పేరిట ఫౌండేషన్ స్థాపించి నూతన దర్శకులను ప్రోత్సహించేందుకు అవార్డ్స్ అందిస్తూ వచ్చారు. అలా.. 'ప్రేమ పుస్తకం' నిర్మాణం వెనుక ఓ తీరని విషాదం ఉంది. ఇక 'ప్రేమ పుస్తకం' చిత్రం విషయానికి వస్తే.. టైటిల్ కి తగ్గట్టే ఇదో ప్రేమకథా చిత్రం. శ్రీకర్ (అజిత్), చరిత్ర (కంచన్) అనే ఓ జంట మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఏ తీరాలకి చేరిందన్నదే సినిమా. దేవేంద్రన్ సంగీతమందించిన ఈ చిత్రంలో పాటలన్నీ బాలు, చిత్ర ఆలపించారు. "విశాఖ బీచ్ లో", "అనుకున్నది", "గెలుచుకో", "కలికి సీతమ్మకు", "మొదలైనది మన", "మూడు నెలలేగా", "పూర్ణమధం".. అంటూ సాగే గీతాలు ఆకట్టుకున్నాయి. కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా రాణించకపోయినా.. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ (గొల్లపూడి మారుతీరావు), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (మనోహర్ రెడ్డి), స్పెషల్ జ్యూరీ (కంచన్) విభాగాల్లో 'నంది' పురస్కారాలు వరించాయి. సత్యనారాయణ నిర్మాణంలో 1993 జూలై 16న జనం ముందు నిలిచిన 'ప్రేమ పుస్తకం'.. ఆదివారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

జగపతి బాబు, సౌందర్య 'పెళ్ళి పీటలు' ఎక్కి పాతికేళ్ళు!

'కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు' జగపతి బాబు సరసన కనువిందు చేసిన నాయికల్లో 'అభినేత్రి' సౌందర్య ఒకరు. వీరిద్దరి కలయికలో అరడజనుకిపైగా సినిమాలు వచ్చాయి. వాటిలో విజయం సాధించిన చిత్రాల్లో 'పెళ్ళి పీటలు' ఒకటి. 'ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్' ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా.. మలయాళ చిత్రం 'ఈ పుళయుమ్ కడన్ను' (దిలీప్, మంజు వారియర్) ఆధారంగా తెరకెక్కింది. తను ప్రేమించిన అమ్మాయి తాలూకు బాధ్యతలను నెరవేర్చే క్రమంలో జైలు పాలయి, చివరకి పెళ్ళి పీటలు ఎక్కే గోపీ అనే ఓ యువకుడి కథే.. 'పెళ్ళి పీటలు' చిత్రం. తెలుగు నేటివిటికి తగ్గట్టు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. దివారకర్ బాబు సంభాషణలు సమకూర్చారు.  చంద్రమోహన్, సుధ, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, ఝాన్సీ, మేఘన, మాస్టర్ ఆనంద్ వర్ధన్, శివాజీ రాజా, హేమంత్, చిత్తజల్లు లక్ష్మీపతి, సుబ్బరాయ శర్మ, చిట్టిబాబు, ఉత్తేజ్, రజిత, తెలంగాణ శకుంతల, తాతినేని రాజేశ్వరి ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.  ఎస్వీ కృష్ణారెడ్డి స్వరకల్పనలో రూపొందిన పాటలకు చంద్రబోస్ సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు "చిటపట చినుకులు పడుతూ ఉంటే" (రీమిక్స్), "జిల్ జిల్" (రెండు వెర్షన్స్), "మోహనం మోహనం", "యే చకచకా", "యమునా తరంగం", "రాజేలు వెలిగించు" (శ్లోకం).. ఇలా పాటలన్నీ ఆకట్టుకున్నాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన 'పెళ్ళి పీటలు'.. సౌందర్య పుట్టినరోజు (జూలై 18) సందర్భాన్ని పురస్కరించుకుని 1998 జూలై 16న జనం ముందు నిలిచింది. ఆదివారంతో ఈ సినిమా పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది. 

కృష్ణ 'జమదగ్ని'కి 35 ఏళ్ళు.. భారతీరాజా చివరి తెలుగు చిత్రం!

తమిళనాట అగ్ర దర్శకుడిగా వెలుగొందిన భారతీరాజా.. తెలుగులోనూ నేరుగా కొన్ని సినిమాలు చేశారు. అలా భారతీరాజా తెరకెక్కించిన చివరి తెలుగు చిత్రంగా ప్రత్యేక  స్థానం పొందింది 'జమదగ్ని'. సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో గ్లామర్ క్వీన్ రాధ నాయికగా నటించింది. కైకాల సత్యనారాయణ, చారు హాసన్, సుమలత, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల, త్యాగరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. డిస్కో శాంతి ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.   సత్యమూర్తి అనే ఓ జిత్తులమారి రాజకీయ నాయకుడి దురాగతాలపై జమదగ్ని అనే ఓ జర్నలిస్ట్ ఎలా పోరాడాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భారతీరాజా ఆస్థాన సంగీత దర్శకుడైన మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "ఇది స్వాతి జల్లు", "ఏలా ఇంత దూరం", "లగి జిగి", "రాక్షస పాలన" (రెండు వెర్షన్స్).. ఇలా ఇందులోని అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. పవన్ ప్రొడక్షన్స్ పతాకంపై చుక్కపల్లి వేణుబాబు, జి. నీలకంఠ రెడ్డి నిర్మించిన 'జమదగ్ని'.. భారతీరాజా పుట్టినరోజు (జూలై 17)కి ఒక రోజు ముందు అంటే 1988 జూలై 16న విడుదలైంది. ఆదివారంతో ఈ సినిమా 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.     

'స్వర్ణకమలం'కి 35 ఏళ్ళు.. "అర్థం చేసుకోరూ.." అంటూ అలరించిన భానుప్రియ!

సంగీత‌, నృత్య సంబంధిత చిత్రాలకు పెట్టింది పేరు.. కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన రూపొందించిన సినిమాల్లో కొన్ని.. 'ఉత్తమ చిత్రం' విభాగంలో 'నంది' పురస్కారం అందుకున్నాయి. వాటిలో   `స్వ‌ర్ణ‌క‌మ‌లం`(1988)కి ప్ర‌త్యేక స్థానం ఉంది. అభినేత్రి భానుప్రియ‌లోని న‌ర్త‌కిని, న‌టీమ‌ణిని పూర్తి స్థాయిలో ఆవిష్క‌రించిన ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేశ్ కథానాయకుడిగా అలరించారు.  సంగీత‌, నృత్య ప్ర‌ధానంగా తెరకెక్కిన ఈ సినిమాకి కె. విశ్వ‌నాథ్ ర‌చ‌న చేయ‌గా, సాయినాథ్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. ఇందులో "అర్థం చేసుకోరూ.." అంటూ మీనాక్షి పాత్రలో భానుప్రియ క‌న‌బరిచిన అభినయం, పలికించిన హావభావాలు, పాటల్లో కనువిందైన నృత్యాలు తనకి 'ఉత్త‌మ న‌టి'గా ఇటు 'నంది', అటు 'ఫిల్మ్ ఫేర్' అవార్డులు అందించాయి.  అలాగే చందు పాత్రలో ఆకట్టుకున్న వెంక‌టేశ్ సైతం 'నంది' స్పెష‌ల్ జ్యూరీని సొంతం చేసుకున్నారు. కేవలం పురస్కారాలకే పరిమితం కాకుండా ప‌లు చిత్రోత్స‌వాల్లోనూ 'స్వర్ణకమలం' ప్ర‌ద‌ర్శిత‌మై అప్పట్లో వార్తల్లో నిలిచింది.   కథ విషయానికి వస్తే.. మీనాక్షి (భానుప్రియ) సంప్రదాయ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి. తండ్రి నుంచి తనకి వారసత్వంగా వచ్చిన సంప్రదాయ నృత్యం తాలూకు విలువను గుర్తించక.. బాగా డబ్బు సంపాదించి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటుంది. అలాంటి మీనాక్షిని పెయింటర్ అయిన చంద్రశేఖర్ అలియాస్ చందు (వెంకటేశ్) ఎలా సరైన దిశలో నడిపించాడు? అనేదే 'స్వర్ణకమలం' సినిమా. ఈ కథని కె. విశ్వనాథ్ తెరకెక్కించిన విధానంతో పాటు నటీనటుల అభినయం, లోక్ సింగ్ ఛాయాగ్రహణం, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం, 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యం..   'స్వర్ణకమలం'ని క్లాసిక్ గా నిలిపాయి. పాటల విషయానికి వస్తే.. "ఆకాశంలో ఆశ‌ల హ‌రివిల్లు", "కొత్త‌గా రెక్క‌లొచ్చెనా" విశేషాదరణ పొందగా.. "ఘ‌ల్లు ఘ‌ల్లు", "శివ‌పూజ‌కు", "అందెల‌ర‌వ‌మిది" కూడా అటు వీనుల‌విందుగానూ, ఇటు క‌నువిందుగానూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాట‌ల‌న్నింటిలోనూ భానుప్రియ నృత్యాలు ఎస్సెట్ అనే చెప్పాలి.  ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమ‌ర్ప‌ణ‌లో భాను ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై సి.హెచ్.వి. అప్పారావు నిర్మించిన 'స్వ‌ర్ణ‌క‌మ‌లం'.. 1988 జూలై 15న విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందింది. కాగా, శనివారంతో ఈ మ్యూజిక‌ల్ హిట్ 35 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

‘‘నీ దారి పూల దారి’’.. చిరు ‘మగమహారాజు’కి 40 ఏళ్ళు

  మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు విజయ బాపినీడు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. వాటిలో 'మగమహారాజు' ఒకటి. వాస్తవానికి ఈ చిత్రాన్ని మౌళి తెరకెక్కించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి విజయ బాపినీడు వచ్చారు.  సుహాసిని కథానాయికగా నటించిన ఈ సినిమాలో నిర్మలమ్మ, ఉదయ్ కుమార్, అన్నపూర్ణ, రావు గోపాల రావు, రాళ్ళపల్లి, రోహిణి, బాలాజీ, తులసి, హేమ సుందర్, నూతన్ ప్రసాద్, అనూరాధ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ కథను అందించిన ఈ చిత్రానికి కాశీ విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చారు.   కథ విషయానికి వస్తే.. రాజు (చిరంజీవి) ఓ నిరుద్యోగి. పెళ్ళి కాని చెల్లి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు.. ఇలా తనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో రాజుకి ధనవంతురాలైన సుహాసిని పరిచయమవుతుంది. తనతో ప్రేమలో పడుతుంది. మరోవైపు డబ్బు సంపాదన కోసం సైకిల్ రేస్ లో పాల్గొంటాడు రాజు. 8 రోజుల పాటు రాత్రి, పగలు తేడా లేకుండా నిరవధికంగా పాల్గొని.. డబ్బు సంపాదిస్తాడు. సుహాసినితో పెళ్ళయ్యాక రాజు సమస్యలు తీరుతాయి.   కృష్ణ - చక్ర సంగీతమందించిన ఈ చిత్రంలో "నీ దారి పూల దారి" చార్ట్ బస్టర్ గా నిలవగా.. "సీతే రాముడి", "అన్నలో అన్న", "నెలలు నిండే", "మా అమ్మ చింతామణి" గీతాలు కూడా ఆకట్టుకున్నాయి. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన 'మగమహారాజు'.. హిందీలో 'ఘర్ సంసార్' (జితేంద్ర, శ్రీదేవి) పేరుతో రీమేక్ అయింది. 1983 జూలై 15న జనం ముందు నిలిచిన 'మగమహారాజు'.. శనివారంతో  40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

బర్త్ డే స్పెషల్: టాప్ స్టార్స్ తో రవిరాజా పినిశెట్టి బ్లాక్ బస్టర్స్.. ఏంటో తెలుసా!

రవిరాజా పినిశెట్టి.. ఇప్పటి ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియకపోయినా 80, 90 దశకాల్లో ఓ సంచలనం. రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రవిరాజా.. దాదాపు టాప్ స్టార్స్ అందరితోనూ ఘనవిజయాలు చూశారు. వాటిలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండడం విశేషం. కథానాయకుల వారీగా ఆ ఘనవిజయాల వివరాల్లోకి వెళితే..  మెగాస్టార్ చిరంజీవి:  రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో చిరంజీవి మంచి విజయాలు చూశారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 'యముడికి మొగుడు'. 1988 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక చిరు తొలి హిందీ చిత్రం 'ప్రతిబంధ్' (1990), మలి బాలీవుడ్ వెంచర్ 'ఆజ్ కా గూండారాజ్' (1992) కూడా మంచి సక్సెస్ అయ్యాయి. నటసింహం బాలకృష్ణ: ఈ నందమూరి అందగాడితో రవిరాజా తీసిన 'బంగారు బుల్లోడు' (1993) అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని భలేగా ఎట్రాక్ట్ చేసింది. బాలయ్య బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా 'బంగారు బుల్లోడు' నిలిచింది. విక్టరీ వెంకటేశ్: ఈ దగ్గుబాటి వారి హ్యాండ్సమ్ హీరోతో రవిరాజా చేసిన తొలి చిత్రం 'చంటి' (1992) అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆపై వచ్చిన 'కొండపల్లి రాజా' (1993) కూడా వసూళ్ళ వర్షం కురిపించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు: రవిరాజా పినిశెట్టి - మోహన్ బాబు కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చినా.. గుర్తుండిపోయే మూవీ అంటే మాత్రం ఒకటే. ఆ చిత్రమే.. 'పెదరాయుడు' . 1995లో రిలీజైన ఈ రీమేక్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో అలరించారు.  యాంగ్రీ హీరో రాజశేఖర్: రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో రాజశేఖర్ మంచి విజయాలు చూశారు. నటభూషణ్ శోభన్ బాబుతో కలిసి రాజశేఖర్ నటించిన మల్టిస్టారర్ 'బలరామకృష్ణులు' (1992)తో పాటు తను ద్విపాత్రాభినయం చేసిన 'మా అన్నయ్య' (2000) కూడా విజయపథంలో పయనించింది.  నటకిరీటి రాజేంద్రప్రసాద్: రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో 'ముత్యమంత ముద్దు' (1989) మంచి విజయం సాధించింది. యండమూరి నవల 'థ్రిల్లర్' ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 

ఎన్టీఆర్ Vs కృష్ణ.. జయప్రదకి మాత్రం డబుల్ ధమాకా.. 45 ఏళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమాలేంటో తెలుసా!

నటరత్న నందమూరి తారక రామారావు అంటే నటశేఖర కృష్ణకి ఎంతో అభిమానం. ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో అలరించారు కూడా.  అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్టీఆర్ కి పోటిగా కృష్ణ నటించిన చిత్రాలు విడుదలైన వైనాలు ఉన్నాయి. 1977 సంక్రాంతికి అంటే జనవరి 14న రామారావు త్రిపాత్రాభినయం చేసి దర్శకత్వం వహించిన 'దానవీరశూరకర్ణ' విడుదల కాగా.. సరిగ్గా అదే రోజున కృష్ణ నటించిన 'కురుక్షేత్రం' రిలీజైంది. వీటిలో 'దానవీరశూరకర్ణ' అఖండ విజయం సాధించింది. కట్ చేస్తే.. 1978లో అంటే ఏడాది తరువాత ఇదే 14వ తేదిని టార్గెట్ చేసుకుని జూలై నెలలో ఈ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. ఆ చిత్రాలే.. 'యుగపురుషుడు', 'దొంగల వేట'. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అందాల తార జయప్రద నాయికగా అలరించారు.  'ఎదురులేని మనిషి' (1975) వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ - కె. బాపయ్య - వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి. అశ్వనీదత్ - కేవీ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'యుగపురుషుడు'. 'ఎదురులేని మనిషి'లా 'యుగపురుషుడు' బాక్సాఫీస్ ని షేక్ చేయకపోయినా.. హిట్ మూవీగా నిలిచింది. 'ఎదురులేని మనిషి'లో వాణిశ్రీ నాయికగా నటిస్తే.. 'యుగపురుషుడు'లో జయప్రద ఎంటర్టైన్ చేసింది. ఇక కృష్ణ, జయప్రద కాంబినేషన్ లో వచ్చిన 'దొంగల వేట'ని ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్ తెరకెక్కించారు. కృష్ణ, కె.ఎస్.ఆర్. దాస్ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా 'దొంగల వేట' కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ సినిమాకి సత్యం స్వరాలు సమకూర్చారు.  ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'యుగపురుషుడు' తెలుగులో విజయం సాధించాక హిందీలో 'మర్ద్ కి జబాన్' పేరుతో రీమేక్ అయితే.. 'దొంగల వేట' మాత్రం హిందీ చిత్రం 'ఇన్ కార్' ఆధారంగా తెరకెక్కింది. కాగా, 1978 జూలై 14న జనం ముందు నిలిచిన ఎన్టీఆర్ 'యుగపురుషుడు', కృష్ణ 'దొంగల వేట' చిత్రాలు.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకున్నాయి. 

మోహన్ బాబు 'అగ్ని జ్వాల'కి 40 ఏళ్ళు!

కెరీర్ ఆరంభంలో ఒకవైపు విభిన్న పాత్రలుచేస్తూనే.. మరోవైపు కథానాయకుడిగానూ ఎంటర్టైన్ చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అలా.. హీరోగా సందడి చేసిన సినిమాల్లో 'అగ్ని జ్వాల' ఒకటి. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబుకి జంటగా కవిత నటించగా.. నరేశ్, ముచ్చర్ల అరుణ, జయంతి, అన్నపూర్ణ, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, సుత్తి వీరభద్ర రావు, సుత్తి వేలు ఇతర  ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం.డి. సుందర్ స్క్రీన్ ప్లే సమకూర్చగా.. సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. సత్యం సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు.  ఇందులోని "ముసుగులో గుద్దులాట", "కోయ్ కోయ్ సొరకాయ కోత కోయ్" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. జీవీకే కంబైన్స్ పతాకంపై జీవీ కృష్ణారావు బీఏ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1983 జూలై 14న జనం ముందు నిలిచిన 'అగ్ని జ్వాల'.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.   

బ‌యోగ్ర‌ఫీః మ‌ధుర‌ స్వ‌రాల విశ్వ‌నాథ‌న్!

(జూలై 14.. ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్ వ‌ర్థంతి సంద‌ర్భంగా) త‌ను "ఏ తీగ పువ్వు" అయినా.. "భ‌లే భ‌లే" బాణీల‌తో ప‌లు చిత్ర‌సీమ‌ల్లో ప‌రిమ‌ళించిన సంగీత‌కుసుమం. "ప‌ల్ల‌వించ‌వా నా గొంతులో" అంటూనే "స‌రిగమ‌లు గ‌ల‌గ‌ల‌లు" వినిపించిన అమ‌ర‌గీతాల గ‌ని. "పిల్ల‌లు దేవుడు చ‌ల్ల‌నివారే" అంటూ చిన్నారుల భావాలు చాటిచెప్పినా.. "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ వెర్రెక్కిఉన్నోళ్ళు" అంటూ కుర్ర‌కారు హుషారు తెలియ‌జెప్పినా.. "క‌న్నెపిల్ల‌వ‌ని క‌న్నులున్న‌వ‌"ని క‌వ్విస్తూనే "ప‌ద‌హారేళ్ళ‌ ప్రాయం చేసే చిలిపి ప‌నులు" వ్య‌క్త‌ప‌రిచినా..  "మౌన‌మే నీ భాష ఓ మూగ మ‌న‌సా" అంటూ మ‌న‌సు భాషను ఆవిష్క‌రించినా, "క‌ళ్ళ‌లో ఉన్న‌దేదో క‌న్నుల‌కే తెలుసు" అంటూ క‌న్నుల భావాన్ని ప్ర‌క‌టించినా.. "గాలికి అదుపు లేదు.. క‌డ‌లికి అంతులేదు" అంటూ వేదాంతం ప‌లికినా, "అరె ఏమిటి ఈ లోకం" అంటూ లోకంపై విరుచుకుప‌డినా అది ఆ మ‌ధుర స్వ‌రానికే చెల్లింది. ఆ స్వ‌రానికి మ‌రోపేరే.. మెలోడీ కింగ్ ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్.    1928 జూన్ 24న కేర‌ళ‌లోని ఎల‌ప్పుల్లి గ్రామంలో జ‌న్మించిన‌ మ‌న‌యంగ‌ద్ సుబ్ర‌మ‌నియ‌న్ విశ్వ‌నాథ‌న్ అలియాస్ ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్ ది.. చిన్న‌ప్ప‌ట్నుంచి అనేక‌ మ‌లుపుల‌తో సాగిన జీవిత‌మ‌నే చెప్పాలి. నాలుగేళ్ళ చిరుప్రాయంలోనే విశ్వ‌నాథ‌న్ తండ్రి చ‌నిపోవ‌డంతో.. ఆయ‌న త‌ల్లి కుటుంబ పోష‌ణ భార‌మై పిల్ల‌ల‌తో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌న్నారు. అయితే చివ‌రి నిమిషంలో తాత ర‌క్షించ‌డంతో.. విశ్వ‌నాథ‌న్ జీవితం మ‌రో మ‌లుపు తిరిగింది. ఆన‌క‌ జైల‌ర్ అయిన‌ మేన‌మామ చెంత చేరిన ఎమ్మెస్.. ఓ థియేట‌ర్ లో బ‌ఠాణీలు అమ్ముతూ సినిమా సంగీతంపై క్ర‌మంగా ఆస‌క్తి పెంచుకున్నారు. అదే స‌మ‌యంలో న‌టుడిగా చిన్న వేషం ద‌క్కినా.. హార్మోనియం నేర్చుకుంటూ ముందుకు సాగారు. ఆ హార్మోనియం అభ్యాస‌మే.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు సి.ఆర్. సుబ్బురామ‌న్ వ‌ద్ద స‌హాయ‌కుడిగా అవ‌కాశాన్ని క‌ల్పించింది. అక్క‌డే వ‌యోలినిస్ట్ అయిన‌ టీకే రామ్మూర్తి తో జ‌రిగిన ప‌రిచ‌యం, సాగిన ప్ర‌యాణం విశ్వ‌నాథ‌న్ జీవితంలో మ‌రో మేలిమ‌లుపు. 'ర‌త్న‌మాల‌', 'లైలా మ‌జ్ను', 'చండీరాణి' వంటి చిత్రాల‌కు సి.ఆర్. సుబ్బురామ‌న్ వ‌ద్ద స‌హాయ‌కులుగా ప‌నిచేసిన విశ్వ‌నాథ‌న్ - రామ్మూర్తి .. 'దేవ‌దాసు' విడుద‌ల‌కు ముందు సుబ్బురామ‌న్ ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డంతో 'జ‌గ‌మే మాయ' పాట‌కు బాణీ కట్టారు. అలాగే అప్ప‌టికే సుబ్బురామ‌న్ ఖాతాలో ఉన్న‌ మ‌రో ఆరు చిత్రాలను కూడా పూర్తిచేశారు. ఆపై విశ్వ‌నాథ‌న్ - రామ్మూర్తి క‌లిసి 'సంతోషం', 'తెనాలి రామ‌కృష్ణ‌', 'ఇంటికి దీపం ఇల్లాలే', 'మంచి చెడు', 'ఆడ బ్ర‌తుకు', 'క‌ర్ణ‌'.. ఇలా దాదాపు 100 సినిమాల‌కు సంయుక్తంగా స్వ‌రాలు స‌మ‌కూర్చారు. త‌మిళం, మ‌ల‌యాళం, తెలుగు భాష‌ల్లో ఈ ద్వ‌యం హ‌వా చాటారు. దాదాపు 13 ఏళ్ళ పాటు ఈ ఇద్ద‌రు జ‌ట్టుగా ముందుకు సాగారు. ఆ త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల విడిపోయారు విశ్వ‌నాథ‌న్ - రామ్మూర్తి.  సోలో కంపోజ‌ర్ గా ట‌ర్న్ అయ్యాక‌ 700కి పైగా చిత్రాల‌కు ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్ సంగీత‌మందించారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ వంటి ద‌క్షిణాది భాష‌ల‌కే ప‌రిమితం కాకుండా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న‌దైన ముద్ర వేశారు ఎమ్మెస్.  ఇక ఎంతోమంది ద‌ర్శ‌కుల‌తో ఎమ్మెస్ ప్ర‌యాణం సాగినా.. కె. బాల‌చంద‌ర్ కాంబినేష‌న్ ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. 'స‌త్తెకాల‌పు స‌త్తెయ్య‌', 'అంతులేని క‌థ‌', 'మ‌రో చ‌రిత్ర‌', 'ఇది క‌థ కాదు', 'అంద‌మైన అనుభ‌వం', 'గుప్పెడు మ‌న‌సు', '47 రోజులు', 'తొలి కోడి కూసింది', 'కోకిల‌మ్మ'.. ఇలా ఈ కల‌యిక‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ సంగీతం ప‌రంగా భ‌లేగా మెప్పించాయి. అంతేకాదు.. 'లేత మ‌న‌సులు', 'మ‌న‌సే మందిరం', 'సింహ‌బ‌లుడు', 'చిల‌క‌మ్మ చెప్పింది', 'పెళ్ళీడు పిల్ల‌లు', 'సామ్రాట్ అశోక' వంటి ఇత‌ర ద‌ర్శ‌కుల చిత్రాలూ విశ్వ‌నాథ‌న్ ఖాతాలో ఉన్నాయి.  ఇక‌ ఎంద‌రో నేప‌థ్య‌గాయ‌కులు, గీత ర‌చ‌యిత‌లు ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌తోనే వెలుగులోకి వ‌చ్చారు. సంగీత ద‌ర్శ‌కుడిగా విశేషంగా రాణించిన ఎమ్మెస్.. గాయ‌కుడిగానూ త‌న‌దైన ముద్ర‌వేశారు. అలాగే న‌టుడిగా ఎనిమిది త‌మిళ చిత్రాల్లో క‌నిపించిన విశ్వ‌నాథ‌న్.. బుల్లితెర‌పైనా సంద‌డి చేశారు. త‌మిళ‌నాట 'మెల్లిసై మ‌న్నార్'గా పేర్గాంచిన ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్.. 'మెలోడీ కింగ్'గా మ‌న్న‌న‌లు పొందారు. నాటి ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత చేతుల మీదుగా 'తిరై ఇసై చ‌క్ర‌వ‌ర్తి' బిరుదుతో సన్మానం పొందారు. 2015 జూలై 14న భౌతికంగా మ‌న‌ల్ని వీడిన‌ విశ్వ‌నాథ‌న్..  త‌న స్వ‌రాల‌తో మాత్రం ఎప్ప‌టికీ చేరువ‌గానే ఉంటారు. 

కాంతారావు 'భ‌లే మొన‌గాడు'కి 55 ఏళ్ళు.. విఠ‌లాచార్య మార్క్ జాన‌ప‌ద చిత్రం

'జాన‌ప‌దబ్ర‌హ్మ‌'గా తెలుగునాట ప్ర‌త్యేక గుర్తింపు పొందారు ద‌ర్శ‌కుడు బి. విఠ‌లాచార్య‌.  క‌థానాయ‌కుడు కాంతారావు కూడా ప‌లు జాన‌ప‌ద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నారు. అలాంటి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో కొన్ని సినిమాలు తెర‌కెక్కాయి. వాటిలో 'భ‌లే మొన‌గాడు' ఒక‌టి.  కృష్ణ‌కుమారి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో జూనియ‌ర్ ఏవీ సుబ్బారావు, చ‌లం, విజ‌య‌ల‌లిత‌, వీజే శ‌ర్మ‌, రామ‌దాసు, త్యాగ‌రాజు, పొట్టి వీర‌య్య ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. వీటూరి క‌థ‌, మాట‌లు స‌మ‌కూర్చారు.  విజేత‌పుర రాజ్యానికి చెందిన రాకుమారి (కృష్ణ‌కుమారి)ని పెళ్ళాడ‌డానికి విజ‌య‌సేనుడు (కాంతారావు) అనే యువ‌కుడు చేసిన సాహ‌సాల నేప‌థ్యంలో 'భ‌లే మొన‌గాడు' రూపొందింది. ప‌క్కా విఠ‌లాచార్య మార్క్ తో సాగే ఈ జాన‌ప‌ద చిత్రానికి ఎస్పీ కోదండ‌పాణి అందించిన పాట‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. "మ‌నిషి త‌లుచుకుంటే గిరులు ఝ‌రులు పొంగ‌వా", "ఇంద ఇంద తీసుకో", "కవ్వించేలేరా", "ఏ ఊరు నీ ప‌య‌నం", "ఏలుకొను రాజు", "సిన్న‌దాన్నిరా" అంటూ సాగే గీతాలు ఆక‌ట్టుకున్నాయి. సునందిని పిక్చ‌ర్స్ ప‌తాకంపై పి. మ‌ల్లికార్జున‌రావు నిర్మించిన 'భ‌లే మొన‌గాడు'.. 1968 జూలై 12న జ‌నం ముందు నిలిచింది. నేటితో ఈ జాన‌ప‌ద చిత్రం 55 వ‌సంతాలు పూర్తిచేసుకుంది. 

గోపీచంద్ సాహ‌సంకి ప‌దేళ్ళు.. నిధి చుట్టూ తిరిగే యాక్ష‌న్ ఎడ్వెంచ‌ర్

ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఒక‌దానితో ఒక‌టి పొంత‌న‌లేని క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేసే యేలేటి.. 'ఒక్క‌డున్నాడు' (2007) వంటి విభిన్న ప్ర‌య‌త్నం త‌రువాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో క‌లిసి చేసిన సినిమా 'సాహ‌సం'.  నిధి చుట్టూ తిరిగే ఈ యాక్ష‌న్ ఎడ్వెంచ‌ర్ ఫిల్మ్ లో తాప్సీ క‌థానాయిక‌గా న‌టించింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు శ‌క్తి క‌పూర్.. తెలుగులో న‌టించిన మూడో సినిమా ఇది.  'క‌లియుగ పాండ‌వులు' (1986), 'యుద్ధ‌భూమి' (1988) లో అల‌రించిన శ‌క్తి క‌పూర్.. దాదాపు పాతికేళ్ళ త‌రువాత న‌టించిన టాలీవుడ్ మూవీ ఇదే కావ‌డం విశేషం.  చిత్ర క‌థాంశం విష‌యానికి వ‌స్తే.. సెక్యూరిటీ గార్డ్ అయిన గౌత‌మ్ వ‌ర్మ (గోపీచంద్)కి రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు కావాలన్న‌ది ఆశ‌. అలాంటి అత‌నికి త‌న పూర్వీకుల ఆస్తులు పాకిస్తాన్ లోని ఓ పురాత‌న‌ దేవాల‌యంలో సొరంగ మార్గం లోప‌ల‌ నిక్షిప్త‌మై ఉన్నాయ‌ని తెలుస్తుంది. అయితే,  అప్ప‌టికే అక్క‌డ ఉన్న నిధి కోసం పాకిస్తాన్ లో ఓ బృందం ప్ర‌య‌త్నిస్తుంటుంది. శ్రీ‌నిధి (తాప్సీ) స‌మేతంగా గౌత‌మ్ ఆ నిధిని ఎలా క‌నిపెట్టాడు?  విల‌న్స్ బారి నుంచి ఆ నిధిని ఎలా ర‌క్షించాడు? అన్న‌ది మిగిలిన సినిమా.  శ్రీ నేప‌థ్య సంగీతం, శ్యామ్ ద‌త్ ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచిన 'సాహ‌సం'ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు.  2013 జూలై 12న విడుద‌లై ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన 'సాహ‌సం'.. నేటితో ప‌ది వ‌సంతాలు పూర్తిచేసుకుంది. 

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ 'ఆర్ ఎక్స్ 100'కి ఐదేళ్ళు.. యూత్ కి పిచ్చెక్కించిన ఫిల్మ్

శ‌రీర వాంఛ‌లు తీర్చుకోవ‌డానికి శివ అనే ఓ యువ‌కుడిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఇందు అనే ఓ యువ‌తి క‌థే.. 'ఆర్ ఎక్స్ 100'.  నూత‌న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి రూపొందించిన ఈ గ్రామీణ నేప‌థ్య ప్రేమ‌క‌థా చిత్రం.. అప్ప‌ట్లో యువ‌త‌ని పిచ్చెక్కించింది. ఇందులో ప్రేమ పేరుతో మోసం చేసే యువ‌తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క‌థానాయిక పాత్ర‌లో పాయ‌ల్ రాజ్ పుత్ మెస్మ‌రైజ్ చేయ‌గా.. ఆ యువ‌కుడి పాత్ర‌లో కార్తికేయ ఆక‌ట్టుకున్నాడు. రావు ర‌మేశ్, రాంకీ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.  మ్యూజికల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన 'ఆర్ ఎక్స్ 100'కి ఛైత‌న్ భ‌ర‌ద్వాజ్ అందించిన స్వ‌రాలు ఎస్సెట్ గా నిలిచాయి. ఇందులోని "పిల్లా రా" చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ కాగా.. "మ‌న‌సుని ప‌ట్టి", "రెప్ప‌ల‌నిండా", "అదిరే హృద‌యం", "రుధిరం మ‌రిగి", "ధిన‌కు ధిన దా" కూడా అల‌రించాయి. కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన "ఆర్ ఎక్స్ 100".. ప‌రిమిత బ‌డ్జెట్ లో త‌యారై రూ 12. 45 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచింది. అలాగే ఒడియాలో 'ప్రేమో న పాగ‌లోప‌న' పేరుతోనూ, హిందీలో 'త‌డ‌ప్' పేరుతోనూ, క‌న్న‌డంలో 'శివ 143' పేరుతోనూ రీమేక్ అయింది. 2018 జూలై 12న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన 'ఆర్ ఎక్స్ 100'.. నేటితో 5 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.  

మ‌ల్టిస్టార‌ర్ మూవీ 'పుట్టినిల్లు మెట్టినిల్లు'కి 50 ఏళ్ళు.. 'కుండ‌మార్పిడి' ఫ్యామిలీ డ్రామా

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, న‌ట‌భూష‌ణ్ శోభ‌న్ బాబు కాంబినేష‌న్ లో ప‌లు జ‌న‌రంజ‌క మ‌ల్టిస్టార‌ర్స్ తెర‌కెక్కాయి. వాటిలో 'పుట్టినిల్లు మెట్టినిల్లు' ఒక‌టి. త‌మిళ చిత్రం 'పుగుంద వీడు' ఆధారంగా తెర‌కెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాకి మాతృక‌ నిర్దేశ‌కుడైన ప‌ట్టు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏవీయ‌మ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ‌కి జంట‌గా చంద్ర‌క‌ళ క‌నిపించ‌గా.. శోభ‌న్ బాబుకి జోడీగా ల‌క్ష్మి అభిన‌యించింది. ఒక ముఖ్య పాత్ర‌లో మ‌హాన‌టి సావిత్రి అల‌రించారు. మాతృక‌లో కూడా సావిత్రి, ల‌క్ష్మి, చంద్ర‌క‌ళ ఇవే వేషాల్లో క‌నిపించ‌డం విశేషం.  హాస్య‌జంట రాజ‌బాబు (ద్విపాత్రాభిన‌యం), రమాప్ర‌భ  వినోదం ఈ సినిమాకి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  చిత్ర క‌థాంశం విష‌యానికి వ‌స్తే..  ఆగ‌ర్బ శ్రీ‌మంతుడైన గోపి (కృష్ణ‌)కి చెల్లి ల‌త (ల‌క్ష్మి) అంటే ప్రాణం. ల‌తకి చిన్న‌ప్ప‌ట్నుంచి శుచి, శుభ్ర‌త విష‌యంలో ప‌ట్టింపు ఎక్కువ‌. ఈ కార‌ణంగానే కుష్టు వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారి తండ్రి (చిత్తూరు నాగ‌య్య‌).. ల‌త కంట‌ప‌డ‌కుండా అజ్ఞాతంలో ఉండిపోతాడు.  మ‌రోవైపు పేదింటి కుర్రాడైన ర‌వి (శోభ‌న్ బాబు)కి సంగీత‌మంటే ప్రాణం. అత‌నికి త‌ల్లి (సావిత్రి), చెల్లి వాసంతి (చంద్ర‌క‌ళ‌) ఉంటారు. ర‌వి గాత్రానికి అభిమానైన ల‌త.. అత‌ణ్ణి ఆరాధిస్తుంది. ర‌వి కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఈ విష‌యం తెలిసి గోపి తొలుత కోప్ప‌డ్డా.. చివ‌రికి వారికి పెళ్ళి చేయాల‌ని నిశ్చ‌యించుకుంటాడు. అయితే ర‌వి త‌ల్లి మాత్రం.. వాసంతి పెళ్ళి గురించి ఆందోళ‌న‌ప‌డుతుంది. దీంతో కుండ‌మార్పిడి ఆలోచ‌న చేస్తాడు గోపి. ఇందుకు ర‌వి కుటుంబం కూడా అంగీక‌రిస్తుంది. పెళ్ళ‌య్యాక గోపి - వాసంతి బాగా ద‌గ్గ‌రైతే.. ల‌త మాత్రం మెట్టింటి వాతావ‌ర‌ణంలో ఇమ‌డ‌లేక‌పోతుంది. మ‌రీముఖ్యంగా ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ర‌వి త‌ల్లిని చూసి అస‌హ్యించుకుంటుంది ల‌త‌. దీంతో ర‌వి - ల‌త మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌చ్చి.. ల‌త మెట్టింటి నుంచి పుట్టింటికి వ‌స్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న గోపి, వాసంతి సైతం.. ల‌త కార‌ణంగా విడిపోవాల్సి వ‌స్తుంది.  కొన్ని ఘ‌ట‌న‌ల అనంత‌రం ల‌త‌ 'శుచి, శుభ్ర‌త గొప్ప‌వే కావ‌చ్చు.. అందుకని ఎదుటివారిని హింసించడం అహంకారం' అని తెలుసుకుంటుంది. తండ్రి, అత్త‌ని ఆద‌రిస్తుంది. దీంతో.. రెండు జంట‌ల క‌థ సుఖాంత‌మ‌వుతుంది.   క‌థ, క‌థ‌నం,  ప్ర‌ధాన‌ పాత్ర‌ధారుల అభిన‌యం, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో పాటు సంగీతం కూడా ఈ సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. స‌త్యం స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన పాట‌ల్లో 'గాన‌గాంధ‌ర్వుడు' ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆల‌పించిన ''ఇదే పాట ప్ర‌తీ చోట''  (రెండు వెర్ష‌న్స్) సినిమాకి ఓ హైలైట్ గా నిల‌వ‌గా.. "సిరిమ‌ల్లె సొగ‌సు జాబిల్లి వెలుగు", "చిన్నారి క‌న్న‌య్య‌", "బోల్తా ప‌డ్డావు" (రెండు వెర్ష‌న్స్), "జ‌మ‌లంగిడి జ‌మ్కా" గీతాలు కూడా రంజింప‌జేశాయి. ఈ పాట‌ల‌కి సి. నారాయ‌ణ‌రెడ్డి, దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు, కొస‌రాజు రాఘ‌వ‌య్య సాహిత్య‌మందించారు.  1973 జూలై 12న విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందిన 'పుట్టినిల్లు - మెట్టినిల్లు'.. బుధవారంతో 50 వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది.