సూపర్ స్టార్ కృష్ణ తన తొలి జానపద చిత్రంలో టార్జాన్ గా నటించారని మీకు తెలుసా?!

  సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి జానపద చిత్రం, తొలి మల్టీ స్టారర్ ఒక్కటే. అది.. బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన 'ఇద్దరు మొనగాళ్లు' చిత్రం. ఈ మూవీలో కాంతారావు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. 'గూడచారి 116' రిలీజ్ అయిన వందో రోజున 'ఇద్దరు మొనగాళ్లు' సినిమాలో నటించే అవకాశం కృష్ణకు రావడం విశేషం. ఈ మూవీలో కృష్ణ టార్జాన్ వేషంలో కనిపించడం ఇంకో విశేషం. సగం సినిమాలో ఆయనకు అసలు మాటలే ఉండవు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలో గజ పురాధిపతి సింహబాహు పాత్రలో సత్యనారాయణ, ఆయన భార్య శీలావతిగా పుష్పకుమారి నటించారు. వారి పెద్ద కొడుకు రాజశేఖరునిగా కాంతారావు, పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై అడవి మనిషిగా పెరిగిన రెండో కుమారునిగా కృష్ణ కనిపిస్తారు. కాంతారావు సరసన కృష్ణకుమారి, కృష్ణ జోడిగా సంధ్యారాణి నటించారు. 'కన్నె మనసులు' సినిమా తర్వాత కృష్ణ, సంధ్యారాణి జంటగా నటించిన సినిమా ఇదే.  ఇందులో మాంత్రికుడు ధూమకేతువు అనే ప్రతి నాయకుడు పాత్రను నెల్లూరు కాంతారావు చేశారు. రమణారెడ్డి, రామదాసు, రావి కొండలరావు, సారథి, మోదుకూరి సత్యం, కాశీనాథ్ తాత, గణేష్, వేళంగి, రఘురాం, సుకన్య, తిలకం ఇతర పాత్రధారులు. 'ఇద్దరు మొనగాళ్లు' సినిమాని మొదట 1967 ఫిబ్రవరి 16న విడుదల చేయాలని నిర్మాత పి. మల్లికార్జున రావు అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో కరెంటు కొరత తీవ్రంగా ఉండేది. సినిమా హాల్లో జనరేటర్లు ఉండేవి కావు. పైగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కార్మికుల సమ్మె కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అందుకే విడుదల వాయిదావేసి పరిస్థితి చక్కబడ్డాక మార్చి 3న రిలీజ్ చేశారు. ఎస్పీ కోదండపాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటల్ని సి. నారాయణరెడ్డి, వీటూరి, దాశరథి, ఆరుద్ర రాశారు. వరదరాజన్ సినిమాటోగ్రఫీ సమకూర్చగా, రవికాంత్ నగాయిచ్ కెమెరా ట్రిక్స్ సమకూర్చారు.

'మేజర్ చంద్రకాంత్' షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

  శక పురుషుడు ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'మేజర్ చంద్రకాంత్'. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని మోహన్ బాబు నిర్మించారు. సినిమాలో ఎన్టీఆర్, మోహన్ బాబు తండ్రి కొడుకులుగా నటించారు. 1993 ఏప్రిల్ 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. షూటింగ్ జరిగే సమయంలో ఎన్టీఆర్ ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండస్ట్రీలో సమ్మె కారణంగా రాత్రికి రాత్రే షూటింగును హైదరాబాదు నుంచి బెంగళూరుకు నిర్మాతలు షిఫ్ట్ చేశారు. యూనిట్ మెంబర్స్ అందరూ కర్ణాటక ప్రభుత్వ అతిథి గృహం కుమార కృపలో దిగారు. "పుణ్యభూమి నాదేశం" పాటలోని కొంత భాగాన్ని లలిత్ మహల్ రాజ్ మహల్ ప్యాలెస్ లో చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలోని మధ్య భాగంలో ఓపెన్ ఎయిర్ దర్బార్ సెట్టు, 15 అడుగుల ప్లాట్ఫామ్ మీద ఒక తఖ్తు, దానిమీద సింహాసనం ఏర్పాటు చేశారు. తెల్ల దొరల దురాగతాలను చీల్చి చెండాడుతూ వీరపాండ్య కట్ట బ్రహ్మన్న గెటప్ లో ఎన్టీఆర్ "ఎందుకు కట్టాలిరా శిస్తు.. నారు పోశారా నీరు పోసారా కోత కోశారా కుప్ప నూర్చారా.." అంటూ ఉద్వేగ భరితంగా ఆవేశంతో కాళ్ళ ముందు ఉన్న తఖ్తును కింద ఉన్న తెల్ల దొర పాత్రధారి మీద పడేట్లు తన్నుతూ ఉంటే ఒక్కసారిగా ప్లాట్ఫారం కదిలి జర్క్ ఇచ్చింది. దాంతో ఒంటిమీద భారీ కాస్ట్యూమ్ తో ఎన్టీఆర్ ఓ పక్కకు వాలిపోతున్నారు. కింద పడితే పెద్ద ప్రమాదం తప్పదు. ఏమైతేనేం ఓ క్షణం తమాయించుకొని పెద్ద ప్రమాదం అంచున ఆగిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ స్థాణువులై కళ్ళప్పగించి చూస్తున్నారు. మోహన్ బాబు గబగబా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి "అన్నయ్యా.. షూటింగ్ ఆపేద్దాం. ఎంత నష్టం వచ్చినా సరే నాకు ఈ సినిమా వద్దు. మీ ఆవేశంలో మీకు ఏదైనా జరిగితే మేం జీవితాంతం ఎదుర్కొనే క్షోభ కంటే ఈ నష్టం ఎక్కువ కాదు." అని అభ్యర్థించారు. ప్రమాదం అంచుకి వెళ్లి కూడా ఎన్టీఆర్ చిరునవ్వుతో ఏమి జరగనట్లుగానే మోహన్ బాబును అనునయిస్తూ "మీవంటి ఆత్మీయులు అభిమానుల అండదండలు ఉండగా మాకే ప్రమాదం జరగదు బ్రదర్" అని ఆయన భుజం తట్టారు. షూటింగ్‌ను కొనసాగించారు. దటీజ్ ఎన్టీఆర్!

చిరు దగ్గరకు వెళ్లడానికి సాధారణ సినీ జీవులకు సాధ్యమేనా?

తెలుగు సినీ పరిశ్రమకు నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ దాసరి నారాయణ రావే పెద్ద దిక్కు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఆయన మాటకు ఎదురేలేదు. ఆయన చెప్పిందే వేదం. తాను అనుకున్నది.. త‌న‌కు న్యాయం, మంచి అనిపించినది చెప్పి మరీ ఎవ‌రినైనా ఒప్పించగలరు. నువ్వు చేస్తోంది తప్పు.. నువ్వు చేస్తుంది కరెక్ట్.. అని నిక్కచ్చిగా చెప్పగలిగిన వ్యక్తి దాసరి. అందుకే ఆయన ఎంతో కాలం తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉన్నారు. ఆ పెద్ద దిక్కు ఇటీవల దూరమైన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా సినీ పెద్దలకు కావాల్సింది సినిమా వారితో పరిచయాలు కాదు.. సాన్నిహిత్యం కాదు.. సినీ కార్మికులను అర్థం చేసుకొని వారి కష్టనష్టాలను తెలుసుకొని వాటికి సరైన మార్గం వేసే వారే సినీ పెద్ద దిక్కు అవుతారని కొందరు అంటారు. ఈ విషయంలో దాసరి తర్వాత‌ చెప్పుకోవాల్సిన పేర్లు తమ్మారెడ్డి భరద్వాజ్, సి. కళ్యాణ్. ఇక ఈ రెండు పేర్ల‌తో పాటు మోహ‌న్‌బాబు పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. దాసరి ఉన్నంతవరకు దాసరి తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ వద్దకు ఎక్కువగా సినీ కార్మికులు తమ కష్టాలు చెప్పుకోవడానికి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు తమ్మారెడ్డి, సి. కళ్యాణ్, మోహన్ బాబు వంటి విభిన్న పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో సినీ కార్మికుల‌కు కూడా ఎవరు తమకు పెద్దదిక్కు.. తమ సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు.  వాస్తవానికి చిరంజీవిని మించిన సినీ పెద్ద దిక్కు తెలుగులో ఎవ్వరూ ఉండరు. ఆయనకు 150 చిత్రాలకు పని చేసిన అనుభవంతో పాటు సినీ కార్మికులు, సినీ నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు.. ఇలా లైట్ బాయ్ నుంచి అందరితోనూ ఆయనకంటూ ఒక సాన్నిహిత్యం ఉంది. అలాగే ఆర్థికంగా కూడా ఆయన పెద్ద దిక్కు. ఆయ‌న అయితే ఆప‌ద‌లో ఉన్న చాలామందికి సహాయం చేయగలుగుతారు. ఇటీవల కరోనా సమయంలో కూడా ఆయనంతట ఆయన ముందుకు వచ్చి చేసిన సేవలు, సినీ కార్మికులకు అందించిన సహాయం అంతా ఇంతా కాదు. సమాజానికి ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించిన ఆయన.. సినీ పరిశ్రమ కోసం, సినీ కార్మికుల కోసం మరెన్నో చేశారు. కానీ ఎందుకనో కానీ వివాదాలు చిరుకి పెద్దగా ఇష్టం లేదు. ఆయన వివాదర‌హితునిగా ఉండాలనుకుంటారు. అందుకే వివాదాలను దాటవేస్తుంటారు.  తాజాగా చిరంజీవి చెప్పిన మాటలు కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమ‌లో తనకంటే సీనియర్లు, పెద్దవారు చాలామంది ఉన్నారని చిరు చెప్పడం విశేషం. కావాలంటే పరిశ్రమకు ఏదైనా చేయాలనుకునే వారికి, కార్మికులకు అందరికీ సహకారం అందిస్తానని.. కానీ మొత్తం బాధ్యతలు తన మీద వ‌ద్దు అని అంటున్నారు. తాను ఇండస్ట్రీ పెద్ద అనే పదాన్ని.. ఆ బాధ్యతను స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేనని, తనకు కుర్చీల్లో కూర్చోవడం ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. సినీ పెద్ద‌లుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్, సి.క‌ళ్యాణ్‌ల‌లో ఒక‌రు ఉంటే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు. తాను కొందరి వాడిగా మిగిలిపోవడం ఇష్టం లేదని, అందరివాడుగానే అందరికీ సాయం చేస్తానని మరోసారి నొక్కి చెప్పారు.  కానీ మరోవైపు సినీ పెద్దగా సినీ పరిశ్రమ మొత్తం ఆయన పేరే చెబుతుంది. ఆయన మాత్రం తనకు ఉన్నత ఆసనం వద్దు అంటున్నారు. చిరంజీవి సినీ పెద్ద దిక్కుగా ఉన్నా లేకపోయినా.. ఎవరు ఆ స్థానాన్ని అధిరోహించినా సరే చిరంజీవి సూచనలు, సలహాలు మాత్రం సినీ పరిశ్రమకు ఉపయోగపడతాయి. ఇక్కడ చిరు మరో మంచి మాట కూడా చెప్పారు. సినీ పరిశ్రమ తాను కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చింది. అందువల్ల ఇకమీదట తన శక్తివంచ‌న  లేకుండా అందరికీ మేలు చేస్తాను అంటున్నారు.  కాగా దాసరికి, చిరంజీవికి మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని పలువురు లేవనెత్తుతున్నారు. దాసరి దగ్గరకు వెళ్లడానికి ఎవరికైనా ఈజీగా యాక్సెస్ ఉండేది. ఆయన ఇంటికి వెళ్లి కష్టసుఖాలు చెప్పుకొనే సౌలభ్యం ఎవరికైనా ఉండేది. చిరంజీవి దగ్గరకు వెళ్లడానికి అలాంటి సౌలభ్యం సాధారణ సినీ జీవులకు లేదనే విషయం జగమెరిగిన సత్యం. ఈ విషయం తెలుసు కాబట్టే.. సినీ పెద్దగా ఉండటానికి తను కరెక్ట్ కాదని చిరు అంటున్నారు. మొత్తానికి చిరంజీవి చేసిన  వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.  

కమలహాసన్‌కి రాధికపై మూడ్ వచ్చేందుకు విశ్వ‌నాథ్ ఏం చేశారో తెలుసా!?

విశ్వ నటుడు కమలహాసన్. ఆయన కెరీర్ లో 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' ఆల్ టైం క్లాసిక్స్‌గా మిగిలి పోతాయి. భావితరాలకు కూడా కమల్ చేసిన పాత్రలు, ఆయా సినిమాలు ఓ లైబ్రరీగా చెప్పవచ్చు. ఆ సినిమాల్లో కమల్ చేసిన పాత్రలు మరో నటుడు చేయలేడు అనడం అతిశయోక్తి కాదు. చాలెంజింగ్ రోల్స్‌లో  లో కమల్ హాసన్ నటించారు అనేకంటే జీవించారని చెప్పాలి. ముఖ్యంగా 'స్వాతిముత్యం' సినిమాలో మందబుద్ధి కలిగిన యువకుడి పాత్రలో క‌మ‌ల్‌ ఒదిగిపోయి నటించారు. అప్పటికే కమర్షియల్ హీరోగా ఎదిగి స్టార్డం తెచ్చుకున్న కమల్ ఆ తరహా పాత్రలో అభిమానులను మెప్పించడం నిజంగా సాహసమే. 'స్వాతిముత్యం'లో ఆయ‌న‌ది క‌థానుసారం హీరోయిజానికి  అవకాశం లేని పాత్ర. ఈ చిత్రం చూసిన ప్రభావం అందరి పైన పడింది. ఏకంగా చిరంజీవి భారతి రాజా దర్శకత్వంలో సుహాసిని  హీరోయిన్ గా 'ఆరాధన' చిత్రం చేస్తున్న సమయంలో కమల్ 'స్వాతిముత్యం'లో ఎలా నటించాడో తాను కూడా  అలా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు అని అంటారు. ఆ సమయంలో రాధిక, "కమలహాసన్ అద్భుతంగా నటించి ఉండవచ్చు. కానీ ఆయన కంటే రజినీకాంత్ కు తమిళనాడులో క్రేజ్ ఎక్కువ. కాబట్టి ఎవర్నో అనుకరించడం మనకెందుకు? మీకున్న స్టార్డంకి తగ్గట్టుగా మీరు నటించండి" అని చిరంజీవిని ప్రోత్సహించింది అని నాడు వార్తలు వచ్చాయి. ఇక కళాతపస్వి  కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ నుండి జాలువారిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. మ‌న దేశం తరఫున 'స్వాతిముత్యం' సినిమాను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు.  అలాగే పలు అవార్డ్స్ 'స్వాతిముత్యం' అందుకుంది. విశ్వనాథ్ కమలహాన్‌తో తీసిన ఈ  చిత్రం కమర్షియల్ గా కూడా పెద్ద హిట్. ఇక ఇందులో  కమల్ తో పోటీపడి మరీ నటించిన ఘనత రాధికకు దక్కుతుంది. లోతైన భావాలు పలికించాల్సిన పాత్రలో రాధిక పరిపక్వతతో కూడిన నటనను చూపించారు. ఈ చిత్రంలో కమల్‌కు దీటుగా రాధిక నటించాలంటే అతిశయోక్తి కాదు. 'స్వాతిముత్యం' సినిమాలో కమల్ రాధిక‌ల మధ్య 'మనసు పలికే మౌనగీతం' అనే రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌లో ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించాలి. కమల్, రాధిక సీన్స్ సరిగా చేయడం లేదు... ఇన్వాల్వ్ కావడం లేదని దర్శకుడు విశ్వనాథ్ భావించారట. రెండు టేక్స్ చేసినా  కూడా రాజీప‌డ‌ని విశ్వనాథ్.. రాధికను పిలిచి ఆమె మీద పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారట. అయితే కమల్ కి మూడ్‌ రావడం కోసం ఆ స్ప్రే తనే వేసుకున్నానని కమల్ అపార్థం చేసుకున్నారని ఇటీవల రాధిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తానికి ఈ సంఘటన చూస్తుంటే సినిమా నటీనటులు ఆయా సందర్భాలకు తగ్గట్టు ఎలా పర‌కాయ ప్రవేశం చేస్తారు? దానికి ఏ విధంగా కష్టపడతారు?.. అనే విషయం అర్థం అవుతుంది.

‘DVSకర్ణ’లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన చలపతిరావు!

మన ప్రేక్షకులకు ఒకప్పుడు ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం వంటివి బాగా న‌చ్చేవి. సినిమా మొత్తం త‌మ హీరోనే క‌నిపిస్తూ ఉంటే టిక్కెట్‌కి పెట్టిన డ‌బ్బులు గిట్టుబాట‌య్యాయ‌నే భావ‌న వారిది. ఒకే సారి అన్ని పాత్ర‌ల‌లో క‌నిపించ‌డం ఆయా హీరోల అభిమానుల‌కే కాదు.. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా థ్రిల్‌ని క‌లిగించేవి. దాంతో నాటి సీనియ‌ర్ ఎన్టీఆర్ నుంచి కృష్ణ వ‌ర‌కు త్రిపాత్రాభిన‌యాలే కాదు.. మ‌రిన్ని పాత్ర‌ల‌ను ఒకే చిత్రంలో చేసి మెప్పించాల‌ని ఉబ‌లాట‌ప‌డేవారు. కానీ  చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌ల త‌రానికి వ‌చ్చే స‌రికి త్రిపాత్రాభిన‌యం కృత్రిమంగా ఫీల‌వ్వ‌డం మొద‌లైంది. దాంతో ఆ త‌రం హీరోలు త్రిపాత్రాభిన‌యాల‌ను ప‌క్క‌న పెట్టి కాస్త వైవిధ్యంగా ఉంటే ద్విపాత్రాభిన‌యాలు మాత్ర‌మే చేయ‌డం మొద‌లు పెట్టారు. కానీ నేటితరంలో మాత్రం మ‌రీ బాగుంది అనిపిస్తే త‌ప్ప డ‌బుల్ యాక్ష‌న్‌కి కూడా ఒప్పుకోవ‌డం లేదు.  రామ్‌చ‌ర‌ణ్ ఆ మ‌ధ్య నాయ‌క్‌, ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాలు చేశారు. ఇప్ప‌టిత‌రం స్టార్లు, ప్రేక్ష‌కుల నాడి ఎలా ఉందంటే పాత్ర ఒక‌టే అయినా ఏదో విభిన్న గెట‌ప్‌ల‌కు మాత్రం స‌రే అంటున్నారు.   ఇప్పటి వారికి రాను రాను ఇవి కూడా రొటీన్ అయిపోతున్నాయి. తాజాగా వ‌చ్చిన ధ‌మాకా మూవీ మొద‌ట‌ రామ్‌చ‌ర‌ణ్ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. కానీ ఏమాత్రం కొత్త‌ద‌నం లేకుండా వాస్త‌విక‌త లోపించ‌డంతో ఆయ‌న దానికి నో చెప్పాడ‌ని స‌మాచారం.  దాంతో ఇలాంటి రొటీన్ చిత్రాలను కాకుండా  కొత్త తరహా చిత్రాలను, కొత్తదనం నిండిన పాత్రలను వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యాలు నిజ‌జీవితంలో వాస్త‌విక‌త‌కు దూరం.  నిజ జీవితంలో పెద్దగా సాధ్యం కాని పని. దాంతో అది ఊహాతీతంగా మారింది.  ఇక ఈమ‌ధ్య కాలంలో త్రిపాత్రాభినయం చేసి కాస్త మెప్పించిన ఘ‌న‌త కేవ‌లం జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ కే సాధ్య‌ప‌డింది. క‌మ‌ల్‌కి ఏదైనా సాధ్య‌మే. అలా ఆయ‌న భార‌తీయుడులో ద్విపాత్రాభిన‌యం, మైఖేల్ మ‌ద‌న కామ‌రాజులో త్రిపాత్రాభిన‌యంతో పాటు ద‌శావ‌తారం చిత్రాలు చేసి మెప్పించాడు. కానీ చిరు ఎంతో ఆశ‌తో చేసిన ముగ్గురు మొన‌గాళ్లు ఫ‌లితం అంద‌రికీ తెలిసిందే.  ఇక  రాబోయే రామ్ చరణ్ శంకర్‌ల  చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంత‌వ‌ర‌కు ఓకే అనుకోవ‌చ్చు. అందునా శంక‌ర్ చేస్తున్నాడంటే ఆయ‌న లాజిక్‌ను మిస్స‌వ్వ‌డు అనే దృఢ‌భిప్రాయం.  ఇక విషయానికి వస్తే టాలీవుడ్ క్లాసిక్ లో ఒకటిగా చెప్పుకోదగింది దానవీరశూరకర్ణ. ఈ చిత్రంలో పలువురు ఒకటికి మించిన పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ అసమాన నటన ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమిది. ఈ చిత్రంలో ఓవైపు మన తారక రాముడు మూడు పాత్రలలో అత్యద్భుత నటన ప్రదర్శించ‌గా  మరోవైపు ఇదే చిత్రంలో ఐదు పాత్రల‌లో  నటించి నటుడు చలపతిరావు ఔరా అనిపించారు. అవి మరీ అంత పెద్ద పాత్రలు కాకపోవచ్చు. కానీ అవి సమయోచితంగా ఆకట్టుకునేవి. ఈ పౌరాణిక గాథలు సూతుడు, ఇంద్రుడు, జరాసంధుడు, ద్రుష్ట‌ద్యుమ్నుడు, విప్రుడు  పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో చలపతిరావు ఒక్కడే ఐదు  పాత్రల‌లో చేసినట్టు ఆడియన్స్ గుర్తించలేరు. ఇది చాలా గమ్మత్తైన వ్యవహారం.

మహానటి సావిత్రి కోమాలోకి వెళ్లిన ఆనాటి రోజులు...

  మ‌హాన‌టి సావిత్రి 1981 డిసెంబ‌ర్ 26 రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ అనిత‌ర సాధ్య‌మైన న‌ట‌న‌తో ఎప్ప‌టికీ తెలుగువారి ఆరాధ్య‌తార‌గా వారి గుండెల్లో స్థానం పొందారు. భౌతిక దేహాన్ని విడ‌నాడ‌టానికి 596 రోజుల ముందే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఆమె ఆ స్థితిలోకి వెళ్లి ప్ర‌దేశం ఏదో తెలుసా?  క‌ర్నాట‌క‌లోని ఓ హోట‌ల్ గ‌దిలో! 'ఇది అర‌ద‌గాయ' అనే క‌న్న‌డ మూవీలో న‌టించ‌డం కోసం ఆమె బెంగ‌ళూరు వెళ్లారు. త‌న‌కు కేటాయించిన హోటల్ రూమ్‌లో ప‌డుకొంటే, అంత‌దాకా త‌న జీవిత‌మంతా సినిమా రీళ్ల‌లా క‌ళ్ల‌ముందు మెదిలింది. ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్ర‌లు వేసిన త‌ను.. చివ‌రికి బ‌తుకు తెరువు కోసం ఎలాంటి పాత్ర‌లు వేయాల్సి వ‌స్తున్న‌దో త‌ల‌చుకొని తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యారు. దుఃఖం త‌న్నుకువ‌చ్చింది. మంచంపై ప‌డి దొర్లారు. గుండెల్ని పిండేస్తున్న బాధ‌ను త‌ట్టుకోవ‌డం ఆమె వ‌శం కావ‌ట్లేదు. అప్ప‌టికే ఆమె మ‌ద్యానికి బానిస‌య్యారు. త‌ల్లి చ‌నిపోయాక సావిత్రికి స్వాంత‌న చేకూరుస్తోంది ఆ మ‌ద్య‌మే. అప్ప‌టికే రూమ్ బాయ్‌చేత తెప్పించుకొని ఉన్న మందు బాటిల్ తీసుకున్నారు. గ్లాసు త‌ర్వాత గ్లాసు వంపుకొని బాటిల్ మొత్తం తాగేశారు. తెల్లారి ఆమెను లొకేష‌న్‌కు తీసుకుపోవ‌డం కోసం కారొచ్చింది. డ్రైవ‌ర్ వ‌చ్చి ఎంత‌సేపు త‌లుపుకొట్టినా రెస్పాన్స్ లేదు. అత‌ను వెళ్లి రిసెప్ష‌న్‌లో చెప్పాడు. వాళ్లొచ్చి త‌మ ద‌గ్గ‌రున్న రెండో తాళంతో త‌లుపులు తెరిచారు. నేల‌మీద మందు బాటిల్‌, గ్లాసు, చింద‌ర‌వంద‌ర‌గా వ‌స్తువులు.. అక్క‌డే నేల‌మీదే ప‌డిపోయి ఉన్న.. మ‌హాన‌టి! ఎంత పిలిచినా, క‌దిపినా ప‌ల‌క‌లేదు, ఉల‌క‌లేదు. స్పృహ‌లో ఉంటేగా! ప్రొడ్యూస‌ర్‌కు ఫోన్ వెళ్లింది. వెంట‌నే కారులో ఆమెను బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. ఆమె స్థితి చూసి ప్రైవేట్ హాస్పిటల్స్ చేర్చుకోలేదు. దాంతో గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అక్క‌డ బెడ్స్ ఖాళీగా లేక‌పోవ‌డంతో నేల‌మీదే ప‌డుకోబెట్టారు. ఎలాంటి సావిత్రికి ఎలాంటి దుర‌వ‌స్థ‌! సావిత్రిని హాస్పిట‌ల్‌లో చేర్చిన విష‌యం తెలియ‌గానే న‌టి ల‌క్ష్మి ఆగ‌మేఘాల మీద అక్క‌డ‌కు వ‌చ్చారు. ప‌సిపాప‌లా అమాయ‌కంగా నిద్ర‌పోతున్న‌ట్లున్న సావిత్రిని చూడ‌గానే గుండె ప‌గిలింది ల‌క్ష్మికి. "మా అమ్మ‌ను ఇలా కింద ప‌డేశారేమిటి? ఈమె ఎవ‌ర‌నుకుంటున్నారు? ద‌య‌చేసి మంచంపై ప‌డుకోబెట్టండి." అని హాస్పిట‌ల్ వాళ్ల‌ను వేడుకున్నారు. అప్పుడు ఆమెకు మంచం ఏర్పాటుచేసి, ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ఈ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో త‌మ ఆరాధ్య తార‌ను చూడ్డానికి వంద‌లాదిగా జ‌నం త‌ర‌లి రావ‌డం మొద‌లైంది. క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి గుండూరావు, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ స‌హా అనేక‌మంది సెల‌బ్రిటీలు అక్క‌డ‌కు వ‌చ్చి, మంచానికి అతుక్కుపోయి ఉన్న సావిత్ర‌మ్మ‌ను చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అప్ప‌టిదాకా ఆమెను స‌రిగా ప‌ట్టించుకోని జెమినీ గ‌ణేశ‌న్ వ‌చ్చి, ఆమెని చూసి గుండెలు బాదుకున్నాడు. ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఏడ్చాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన ప‌ద‌హారు రోజుల త‌ర్వాత సావిత్రిని తీసుకొని మ‌ద్రాసుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. అన్నా న‌గ‌ర్‌లో ఆమె నివాసంలోనే ఆమెను ఉంచి, డాక్ట‌ర్ ఆర్‌.ఎస్‌. రాజ‌గోపాల్ బృందంతో చికిత్స చేయిస్తూ వ‌చ్చారు. అదివ‌ర‌కు క‌ళ్ల‌తోటే అన్ని ర‌కాల ఉద్వేగాల‌నూ ప‌లికించి మెస్మ‌రైజ్ చేసిన ఆ మ‌హాగొప్ప తార‌, అప్ప‌ట్నుంచి అక్క‌డే నిర్జీవంగా పుండైపోయిన శ‌రీరంతో, మూసుకుపోయిన క‌ళ్ల‌తో మంచంమీదే ఉండి, కోమాలోకి వెళ్లిన 596వ రోజు కొన‌ప్రాణాన్ని కూడా వ‌దిలేసి, అశేష అభిమానుల గుండెలు బ‌ద్ద‌లుచేసి వెళ్లిపోయారు.  (డిసెంబర్ 6 మహానటి సావిత్రి జయంతి) 

టైగర్ పటౌడీకు జయలలిత వీరాభిమాని!

  త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, ఒక‌ప్ప‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ దివంగ‌త జ‌య‌ల‌లిత మొట్ట‌మొద‌ట అభిమానించేది ఏమిటంటే.. క్రికెట్‌! అవును. ఆ ఆట అన్నా, అది ఆడేవాళ్ల‌న్నా ఆమెకు చిన్న‌ప్ప‌ట్నుంచీ ఎంతో ఇష్టం. ఆమె క్రికెట్ పిచ్చి చూసి, ఆమె త‌మ్ముడు అనేవాడు, "ఆ.. మీ ఆడ‌వాళ్లు ఈ ఆట‌లో ఇంట్రెస్ట్ చూప‌డ‌మేంటి? ఇది మ‌గ‌వాళ్లు ఆడే ఆట" అని. కొన్నాళ్ల త‌ర్వాత క్రికెట్‌కు సంబంధించిన ఒక పుస్త‌కం చ‌దువుతూ ఉంటే అప్పుడు జ‌య‌ల‌లిత‌కు తెలిసింది, త‌న త‌మ్ముడు ప‌ప్పులో కాలు వేశాడ‌ని! ఎంచేతంటే అస‌లు క్రికెట్ ఆట‌ను క‌నిపెట్టిందే ఆడ‌వాళ్ల‌ని ఆ పుస్త‌కంలో వివ‌రంగా రాశారు. సినిమాలు చూసి యాక్ట‌ర్ల‌ను అభిమానిస్తున్న‌ట్లుగా, ఆ రోజుల్లో క్రికెటర్లంటే జ‌య‌ల‌లిత‌కూ, ఆమె స్నేహితురాళ్ల‌కూ చాలా పిచ్చి ఉండేది. వాళ్ల పిన్ని విద్య‌కు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. మ‌ద్రాసులో జ‌రిగే టెస్ట్ మ్యాచ్‌ల‌కు వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా వెళ్లేవారు. ఒక‌వేళ వీలుకాక‌పోతే మ్యాచ్‌కు సంబంధించిన ర‌న్నింగ్ కామెంట‌రీని వ‌దిలిపెట్టేవాళ్లు కాదు. మ్యాచ్ అయిపోయాక అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌ను అభిమానించే ఆట‌గాళ్ల వ‌ద్ద‌కు వెళ్లి వాళ్ల ఆటోగ్రాఫ్ తీసుకునేవారు జ‌య‌ల‌లిత‌. అప్ప‌ట్లో వాళ్లింటికి 'స్పోర్ట్ అండ్ పాస్ట్ టైమ్' అనే మ్యాగ‌జైన్ వ‌స్తుండేది. అది వ‌చ్చిన రెండో గంట‌లో అందులోని పేజీలు క‌త్తిరింపుల‌తో క‌నిపించేవి. ఒక‌వైపు ఎవ‌రిలా చేసింది అని ఇంట్లో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతూ ఉంటే, మ‌రోవైపు అప్ప‌టికే క‌త్తిరించి త‌న ఆల్బ‌మ్‌లో అంటించి పెట్టుకున్న ఆ క్రికెట‌ర్ల బొమ్మ‌ల‌ను చూసుకుంటూ ఉండేవారామె. అస‌లు సంగ‌తి తెలిశాక ఇంట్లోవాళ్లు చివాట్లు పెట్టేవారు. జ‌య‌ల‌లిత లెక్క‌చేసేవారు కాదు. ఆమె స్కూల్లో చ‌దువుకునేట‌ప్పుడు వాళ్ల క్రికెట్ పిచ్చి క‌నిపెట్టిన ఒక ఫొటోగ్రాఫ‌ర్ అప్పుడ‌ప్పుడు క్రికెట్ ప్లేయ‌ర్స్ ఫొటోలు ప‌ట్టుకొని జ‌య‌ల‌లిత బ్యాచ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాడు. ఎవ‌రికి ఏ ఆట‌గాడు ఇష్ట‌మైతే వాళ్లు ఆ ఫొటో అత‌ని ద‌గ్గ‌ర్నుంచి కొనుక్కునేవారు. ఒక్కో ఫొటోకు ఆ ఫొటోగ్రాఫ‌ర్ ఐదు రూపాయ‌లు వ‌సూలు చేసేవాడు. అన్న‌ట్లు.. జ‌య‌ల‌లిత ఎవ‌రి ఫొటో తీసుకొనేవారో తెలుసా? అప్ప‌టి ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీ ఫొటో! ఆ రోజుల్లో హిందీ హీరో రాజేశ్ ఖ‌న్నాను చూసి ఎంత‌మంది అమ్మాయిలు మోజుప‌డేవారో, జ‌య‌ల‌లిత బృందం టైగ‌ర్ ప‌టౌడీని అంత‌గా అభిమానించేవారు. స్కూల్స్‌లో 'ప‌టౌడీ ఫ్యాన్ క్ల‌బ్' అని ఉండేవి కూడా. ఇక ఆయ‌న‌ను ప్రేమించ‌డంలో ఉన్న పోటీ అంతా ఇంతా కాదు. ఒక‌రోజున ప‌టౌడీ.. ప్ర‌ముఖ న‌టి ష‌ర్మిలా ఠాగూర్ ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ఉన్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే! ఎవ‌రి ప్రేమ వాళ్ల ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉండిపోయింది. ఈ విష‌యాల‌ను త‌ను హీరోయిన్‌గా ఒక వెలుగుతూ ఉన్న కాలంలో ఒక ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో రాసుకొచ్చారు జ‌య‌ల‌లిత‌. (డిసెంబర్ 5 జయలలిత జయంతి సందర్భంగా)

మెగాస్టార్ కెరీర్ స్లంప్‌కు 'హిట్లర్‌'తో చెక్ పెట్టిన ఎడిటర్ మోహన్

  సినీ ఫీల్డులో ఎంత గొప్పవాళ్లకైనా కష్టాలు తప్పవు. ఫ్లాపులతో సతమతమవక తప్పదు. మెగాస్టార్ చిరంజీవి సైతం అందుకు అతీతుడు కాదు. 1978లో 'ప్రాణం ఖరీదు'తో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి, 1983లో వచ్చిన 'ఖైదీ'తో స్టార్‌గా మారారు. అప్పట్నుంచీ ఒక దశాబ్ద కాలం ఆయనకు తిరుగనేదే లేకుండా పోయింది. ఈ మధ్యలో ఆయన మెగాస్టార్‌గా కూడా బాక్సాఫీసును అనేక సార్లు బద్దలు కొడుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత మూడేళ్ల కాలం ఆయన కెరీర్‌లో ఒక పీడకలగా మారింది. 1993లో రిలీజైన 'ముఠామేస్త్రి' మూవీ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఒక దాని తర్వాత ఒకటిగా ఫ్లాపవుతూ వచ్చాయి. 'మెకానిక్ అల్లుడు', 'ముగ్గురు మొనగాళ్లు', 'ఎస్.పి. పరశురాం', 'బిగ్ బాస్', 'రిక్షావోడు' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గల్లంతయ్యాయి. 'బిగ్ బాస్' కంటే ముందు వచ్చిన 'అల్లుడా మజాకా' సినిమా ఫర్వాలేదనిపించుకున్నా బూతు సినిమాగా దానికి వచ్చిన పేరు, అత్త కేరెక్టర్ చేసిన లక్ష్మితో చిరంజీవి చేసిన సరసాలు విపరీతమైన విమర్శలనీ, కాంట్రవర్సీనీ సృష్టించాయి. ఇది మెగాస్టార్‌గా ఆయన సాధించుకున్న ప్రతిష్ఠకు మచ్చ తెచ్చింది. 'రిక్షావోడు' డిజాస్టర్‌తో ఆయన పునరాలోచనలో పడ్డారు. తర్వాత ఎలాంటి సబ్జెక్టును ఎంచుకోవాలో పాలుపోని స్థితిని ఎదుర్కొని, ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయారు. నిజంగా అది మెగాస్టార్‌కు సంకట స్థితే. ఆ టైంలో ఆయన దృష్టికి వచ్చింది ఒక మలయాళీ సినిమా. అది మమ్ముట్టి టైటిల్ రోల్ చేసిన 'హిట్లర్'. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా మమ్ముట్టి చేసిన నటన, కథలోని సెంటిమెంట్ ఆ సినిమాని హిట్ చేశాయని అర్థం చేసుకున్న చిరంజీవి.. ఆ కథ తనకు సరిపోతుందని భావించారు. ఆయన బావమరిది, సన్నిహితుడు అల్లు అరవింద్ సైతం ఆయనను సపోర్ట్ చేశారు. నిర్మాత ఎడిటర్ మోహన్ ఆ సినిమాని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమాకి డైరెక్టర్‌గా ఎవర్ని ఎంచుకోవాలనే సమస్య ఎదురైంది. అప్పట్లో సెంటిమెంట్ సినిమాలు చేసి, విజయాలు అందుకున్న ముత్యాల సుబ్బయ్య పేరును చిరంజీవికి సూచించారు ఎడిటర్ మోహన్. అప్పటికే ఆయన బేనర్‌లో ముత్యాల సుబ్బయ్య 'మామగారు' వంటి సెంటిమెంట్ సినిమాని డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. పైగా అదే సమయంలో వెంకటేశ్, సౌందర్య జంటగా ఆయన రూపొందించిన 'పవిత్ర బంధం' సూపర్ హిట్టయింది. ఈ విషయాలు ఎడిటర్ మోహన్ చెప్పగానే చిరంజీవి, అరవింద్ కూడా సరేనన్నారు. అలా చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య తొలి కాంబినేషన్‌లో మలయాళ 'హిట్లర్' తెలుగు రీమేక్ అదే టైటిల్‌తో రూపొందింది. ఆ సినిమా మేకింగ్‌లో ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ నుంచి బెదిరింపుల్లాంటి ఉత్తరాలు అందుకున్నారు ముత్యాల సుబ్బయ్య. "మా బాస్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన్ని బాగా చూపించాలి, ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయండి" అనేది ఆ ఉత్తరాల్లోని సారాంశం. అయితే వాటికి సుబ్బయ్య భయపడలేదు. తనేం తీస్తున్నననే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. సబ్జెక్టుపై కాన్ఫిడెన్స్ ఉంది. టైటిల్ రోల్‌ను చిరంజీవి బ్రహ్మాండంగా చేశారు. సెంటిమెంట్‌ను బాగా పండించారు. దానికి కామెడీ జోడై, మూవీ సూపర్ హిట్టయింది. ఎంత హిట్టంటే ఒరిజినల్ కంటే, తమిళ, కన్నడ, హిందీ రీమేక్స్ కంటే పెద్ద హిట్టు. అలా మూడేళ్ల మెగాస్టార్ కెరీర్ స్లంప్‌కు 'హిట్లర్' చెక్ పెట్టేసింది. అలా మెగాస్టార్ కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆయన కెరీర్‌ను గాడిలో పెట్టిన డైరెక్టర్‌గా ముత్యాల సుబ్బయ్య, ప్రొడ్యూసర్‌గా ఎడిటర్ మోహన్ పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. చిరంజీవి నుంచి మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా కూడా అందుకున్నారు. అవును. అప్పుడప్పుడే మొబైల్ ఫోన్లు వస్తున్నాయి. ఖరీదైన అవి పెద్ద పెద్ద వాళ్ల దగ్గర మాత్రమే ఉండేవి. ముత్యాల సుబ్బయ్య వాడిన తొలి మొబైల్ ఫోన్ మెగాస్టార్ ఇచ్చిన కానుకే! ఇటీవల వచ్చి, ప్రేక్షకాదరణను పొందిన చిరంజీవి మూవీ 'గాడ్‌ఫాదర్' డైరెక్టర్ మోహన్ రాజా మరెవరో కాదు.. స్వయానా ఎడిటర్ మోహన్ తనయుడే!   (నేడు ఎడిటర్ మోహన్ జన్మదినం సందర్భంగా...) 

'గోపాల గోపాల', 'కాటమరాయుడు' సినిమాల దర్శకుడు డాలీ ఇప్పుడేం చేస్తున్నాడు?

  కిశోర్ కుమార్ పార్దసాని అలియాస్ డాలీ పుట్టింది విజయవాడలో, పెరిగింది విజయనగరంలో. అమ్మానాన్నలకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందరిలోనూ కిశోర్ చిన్నవాడు. విజయనగరంలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాడు. ధర్మపురి కాలేజీలో ఇంటర్మీడియేట్, మహారాజా కాలేజీలో బీకామ్ చదివాడు. విజయనగరంలోనే ఎం.వి.జి.ఆర్. లా కాలేజీలో లా పూర్తిచేశాడు. కొన్ని రోజులు లాయర్‌గా ప్రాక్టీస్ చేశాడు కూడా. నిజానికి డాలీ వాళ్లది రాజస్థాన్ నుంచి తరలివచ్చిన కుటుంబం. అందుకే తను హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవాడు. వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ క్రాంతిరెడ్డి (క్రాంతి పిక్చర్స్) వాళ్లకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన లీజుకు తీసుకున్న 3 థియేటర్లలో టికెట్ లేకుండా సినిమాలు చూసేవాడు డాలీ. చాలావరకు సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షో చూసేవాడు. క్రాంతిరెడ్డి సాయంతోటే 1999 ప్రాంతంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. వి.వి. వినాయక్, నల్లమలుపు బుజ్జితో కలిసి రూమ్ షేర్ చేసుకున్నాడు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉండే ఆ రూమ్ కి ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుండేవాళ్లు. అందుకే దాన్ని 'పుష్పక విమానం' అని పిలిచేవారు. డైరెక్టర్ సుకుమార్ కూడా కొన్నాళ్లు ఆ రూమ్ లోనే ఉన్నాడు. ఆ రూమ్ లోనే ఉన్న యోగి, వాసువర్మ, విక్కీ తర్వాత డైరెక్టర్లయ్యారు.  వినాయక్ దగ్గర ఆది, దిల్, లక్ష్మీ, బన్నీ.. ఇలా చాలా సినిమాలకు స్క్రిప్ట్ వర్క్‌లో డాలీ పాలుపంచుకున్నాడు. శ్రీను వైట్ల దగ్గర 'ఆనందం' మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సిద్ధర్థ్, తమన్నా జంటగా నటించగా 2009లో వచ్చిన 'కొంచెం ఇష్టం కొంచెం కస్థం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు డాలీ. ఆ సినిమా ఫర్వాలేదన్నట్లుగా ఆడింది. బ్రహ్మానందం చేసిన గచ్చిబౌలి దివాకర్ క్యారెక్టర్ బాగా పేలింది. ఆ సినిమా తర్వాత డైరెక్టర్‌గా డాలీకి చాలా అవకాశాలొచ్చాయి. మొదట ఫ్యామిలీ మూవీ తీశాడు కాబట్టి, రెండోది దానికి భిన్నమైన సినిమా తియ్యాలనుకున్నాడు. కానీ నిర్మాతలు తమకు 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తరహా సినిమా కావాలని అడిగేసరికి అవకాశాలు వదులుకున్నాడు. నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను కలిస్తే, తన దగ్గర తెలుగు రీమేక్ రైట్స్ ఉన్న ఓ తమిళ సినిమా చూపించి, దాన్ని తెలుగులో తియ్యమన్నాడు. అలా 'తడాఖా' తీశాడు. కమర్షియల్‌గా మంచి విజయం సాధించిన ఆ మూవీలో సునీల్, నాగచైతన్య అన్నదమ్ములుగా నటించారు. ఆ తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ 'ఓ మైగాడ్'ను రీమేక్ చేద్దామని సురేశ్‌బాబు అనడంతో, వైవిధ్యమైన సబ్జెక్ట్ కాబట్టి ఓకే అనేశాడు డాలీ. అదే.. వెంకటేశ్ హీరోగా నటించగా, పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో నటించిన గోపాల గోపాల (2015). అది ప్రజాదరణ బాగానే పొందింది. ఆ సినిమా రిలీజ్‌కి ముందే మరో సినిమా అతని డైరెక్షన్‌లో చేస్తానని పవన్ కల్యాణ్ అన్నాడు. అన్నట్లే 'కాటమరాయుడు' (2017)ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కాకపోయినా బాగానే ఆడింది. అది.. అజిత్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ తమిళ్ ఫిల్మ్ 'వీరమ్'కు రీమేక్. ఇలా వరుసగా మూడు రీమేక్‌లు తీశాడు డాలీ. వివాహ బంధం మీద నమ్మకంలేని డాలీ పెళ్లి చేసుకోలేదు. 2009లో డైరెక్టర్‌గా పరిచయమైన అతను ఈ 13 సంవత్సరాల కాలంలో నాలుగంటే నాలుగు సినిమాలు రూపొందించడం, వాటిలో రెండు పవన్ కల్యాణ్‌తో తియ్యడం, అయినా కూడా ఐదేళ్లుగా ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉంది.

'పెళ్ళిచూపులు' కంటే ముందు తరుణ్ భాస్కర్‌తో రీతూవర్మ 'అనుకోకుండా' చేసిందని తెలుసా?

  విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమైన హిట్ ఫిల్మ్ 'పెళ్ళిచూపులు'లో చిత్రగా నటించి యూత్‌ను బాగా ఆకట్టుకుంది రీతూవర్మ. ఆ తర్వాత 'కేశవ', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' చిత్రాల్లో నటించింది. ఇటీవల శర్వానంద్ సినిమా 'ఒకే ఒక జీవితం'లో వైష్ణవి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని మెప్పించింది. రీతూవర్మ వాళ్ల నాన్నది మధ్యప్రదేశ్. బ్యాంక్ ఆఫీసర్‌గా పనిచేశారు. వాళ్లమ్మ హైదరాబాదీ. టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారు. ఓ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వాళ్లమ్మ పనిచేసిన స్కూల్లోనే రీతు చదువుకుంది. రీతుకు ఓ అక్క ఉంది. చిన్నతనంలో రీతు వాటర్ కలర్స్‌తో పెయింటింగ్స్ వేసేది కూడా. ఇంటర్మీడియేట్ తర్వాత మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (ఐటీ) చేసింది. ఈలోపు 'మిస్ రోజ్' అందాల పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. బీటెక్ పూర్తిచేశాక ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తే అందులో జాయినయ్యింది. మరోవైపు మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన తరుణ్ భాస్కర్, తానొక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాననీ, అందులే నటించమనీ అడిగాడు. సరదాగా అందులో నటించింది రీతు. అదే.. 'అనుకోకుండా' అనే షార్ట్ ఫిల్మ్. కేవలం 48 గంటల్లో తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్టయింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఆమెకు సినిమా అవకాశాలు తెచ్చింది. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ 'బాద్‌షా'ను ఫస్ట్ ఫిలింగా ఎంచుకుంది. అందులో చిన్న పాత్రే అయినా నేర్చుకున్నట్లు ఉంటుందని చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'నా రాకుమారుడు', 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాల్లో నటించింది. 2015లో తరుణ్ భాస్కర్‌కు 'పెళ్ళిచూపులు' మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. హీరోయిన్‌గా అతను రీతునే ఎంచుకున్నాడు. 2016లో రిలీజైన ఆ మూవీ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆ మూవీలో రీతు చేసిన చిత్ర పాత్రలో అమ్మాయిలు తమని తాము చూసుకున్నారు. అది రీతు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ జోడీగా నటించిన 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడిథాల్' మంచి హిట్టవడమే కాకుండా రీతు నటనకు ప్రశంసలు లభించాయి. తెలుగులో ఆ సినిమా 'కనులు కనులను దోచాయంటే' పేరుతో రిలీజై ఇక్కడా హిట్టయింది. రీతు ప్రస్తుతం తమిళ ఫిల్మ్ 'ధ్రువ నచ్చత్రమ్' విడుదల కోసం ఎదురుచూస్తోంది. విక్రమ్ హీరోగా నటించిన ఆ సినిమాని గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా 2017లోనే మొదలైనా ఆర్థిక పరమైన కారణాలు సహా అనేక ఇతర కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి, విడుదల కోసం రెడీగా ఉంది. ఈ సినిమా రిలీజైతే తన కెరీర్‌కు మేలు జరుగుతుందని రీతు ఆశిస్తోంది. 

వాణిశ్రీ విషయంలో కాంతారావు మాట నిజమైంది!

  వాణిశ్రీ ఇండ‌స్ట్రీలోకి కామెడీ క్యారెక్ట‌ర్ల‌తో అడుగుపెట్టారు. హాస్య‌న‌టులు ప‌ద్మనాభం, రాజ‌నాల వంటి వారి స‌ర‌స‌న న‌టించారు. ఆమె అస‌లు పేరు ర‌త్న‌కుమారి. మొద‌ట ఆ పేరుతోటే న‌టించారు. 1962లో ఓ వైపు 'సోమ‌వార వ్ర‌త మ‌హాత్మ్యం' షూటింగ్ జ‌రుగుతూ ఉండ‌గా, ఆ చిత్ర క‌థానాయ‌కుడు కాంతారావు, విల‌న్ పాత్ర‌ల స్పెష‌లిస్ట్ రాజ‌నాల క‌లిసి 'అలెగ్జాండ‌ర్' నాట‌కం ప్ర‌ద‌ర్శించాల‌ని సంకల్పించారు. అందులో న‌టించ‌డానికి ర‌త్న‌కుమారి (వాణిశ్రీ‌)కి మేక‌ప్ వేయించి సెట్స్‌కు తీసుకువెళ్లారు. 'సోమ‌వార వ్ర‌త మ‌హాత్మ్యం' చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎం. కృష్ణ‌స్వామి స‌హ‌కారంతో మూవీ కెమెరాతో కొన్ని భంగిమ‌లు చిత్రీక‌రించి, ఆ త‌ర్వాత స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ నాగ‌రాజారావు చేత కొన్ని స్టిల్స్ తీయించారు. వాణిశ్రీ‌ని చూడ‌గానే కృష్ణ‌స్వామి, నాగ‌రాజారావు ఇద్ద‌రూ "ఈ అమ్మాయి సినిమాల‌కు ప‌నికిరాదు." అని తేల్చేశారు. ఆ త‌ర్వాత కొద్ది కాలానికే 'ర‌ణ‌భేరి' సినిమాలో కాంతారావు స‌ర‌స‌న హీరోయిన్‌గా వాణిశ్రీ‌ని, కీల‌క‌మైన వ్యాంప్ క్యారెక్ట‌ర్‌కు రాజ‌శ్రీ‌ని తీసుకున్నారు నిర్మాత‌లు. వ్యాంప్ క్యారెక్ట‌ర్ రాణిస్తేనే సినిమా రాణిస్తుంది. అందుక‌ని నిర్మాత‌ల‌తో చెప్పి రాజ‌శ్రీ‌ని హీరోయిన్‌గా చేసి, వాణిశ్రీ‌కి వ్యాంప్ క్యారెక్ట‌ర్ ఇప్పించారు కాంతారావు. అప్పుడంద‌రూ ఆయ‌న మీద అభాండాలు వేశారు. చిత్రం విడుద‌ల‌య్యాక ఆయ‌న జ‌డ్జిమెంట్ క‌రెక్ట‌ని ఒప్పుకున్నారు. ఆ త‌ర్వాత 'ఆకాశ‌రామ‌న్న' సినిమాలోనూ వ్యాంప్ క్యారెక్ట‌ర్ పోషించారు వాణిశ్రీ‌. ఎప్పుడూ వ్యాంప్ పాత్ర‌లేనా?.. అని ఆమె బాధ‌ప‌డేవారు. "వ్యాంప్ పాత్ర‌ల్లో కూడా నీకు నువ్వే సాటి. మ‌నం హీరో హీరోయిన్లుగా క‌లుసుకొనే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంది." అని కాంతారావు ఆమెకు స‌ర్దిచెప్పేవారు. ఆయ‌న చెప్పిన‌ట్లే, 'దేవుని గెలిచిన మాన‌వుడు' (1967) చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా చేశారు వాణిశ్రీ‌. ఆ వెంట‌నే కృష్ణ‌తో 'మ‌ర‌పురాని క‌థ‌'లో హీరోయిన్‌గా చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగింది చ‌రిత్ర‌. స్టార్ హీరోలంద‌రూ ఆమెనే త‌మ స‌ర‌స‌న నాయిక‌గా కావాల‌ని కోరుకొనే రేంజ్‌లో ఎదిగారు వాణిశ్రీ‌. మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత త‌రంలో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, అప్ప‌ట్లో ఆమె స్టైల్ ఐకాన్‌గా మారారు. వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ చీర‌లు, వాణిశ్రీ బొట్టు అంటూ ఆమె క‌ట్టు బొట్టూ ఫేమ‌స్ అయ్యాయంటే.. అది ఆమె ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం.

అమ్మానాన్నలతో సూపర్‌స్టార్ అనుబంధం

  తల్లితండ్రులు నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి అంటే కృష్ణకు భక్తి, గౌరవం ఎక్కువే. కృష్ణను ఇంజినీర్‌గా చూడాలనేది వారి కోరిక. కానీ సినిమా యాక్టర్ కావాలన్నది ఆయన ఆశయం. బీయస్సీ చదివాక సినిమాల్లోకి వెళ్తానంటే నాగరత్నమ్మ ప్రోత్సహించారు. తమ పిల్లల చదువుల కోసం స్వగ్రామం బుర్రిపాలెం వదిలిపెట్టి, తెనాలిలో కాపురం పెట్టి దగ్గరుండి వారిని చదివించారు. కాలేజీ చదువుల కోసం ఊళ్లోని పొలాన్ని అమ్మి కృష్ణను ఏలూరుకి పంపి చదివించారు. ఆ పొలాన్ని తిరిగి ఎలాగైనా పందాలనే పట్టుదల నాగరత్నమ్మలో ఉండేది.  కృష్ణ హీరోగా బిజీ అయ్యాక ఆయనతో బుర్రిపాలెంలో పొలం కొనిపించారు. అక్కడి పాత ఇంటిని రిమోడలింగ్ చేయించారు. మేడ పైభాగాన్ని కృష్ణ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అమ్మ కోసం తను ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు బుర్రిపాలెం వెళ్లి రెండు మూడు రోజులు అక్కడ గడిపేవారు కృష్ణ. సొంతూరులో స్కూలు కట్టించాలనే అమ్మ కోరికను కూడా కృష్ణ నెరవేర్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1985లో బుర్రిపాలెంలో 'నాగరత్నమ్మ ప్రాథమిక ఉన్నత పాఠశాల' ప్రారంభమైంది. ఆ స్కూల్ ఇప్పటికీ నడుస్తోంది. తన అమ్మానాన్నల పేరు మీద విడివిడిగా సినిమాలు నిర్మించారు కృష్ణ. తండ్రి పేరుమీద జి.వి.ఆర్. (ఘట్టమనేని వీరరాఘవయ్య) పిక్చర్స్ పేరుతో బ్యానర్ నెలకొల్పి 'శభాష్ గోపి' చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. టైటిల్స్‌లో వీరరాఘవయ్య చౌదరి నిర్మాతగానూ, కృష్ణ సమర్పకునిగానూ కనిపిస్తారు. దీనికి స్క్రీన్‌ప్లే రైటర్ హనుమంతరావు, నిర్మాణ సారథి ఆదిశేషగిరిరావు. ఇలా తండ్రీకొడుకులు కలిసి తీసిన ఈ మూవీలో టైటిల్ రోల్‌ను కృష్ణ కుమార్తె మంజుల పోషించడం విశేషం. బాలనటిగా ఆమెకు ఇదే తొలిచిత్రం. మానికొండ మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1978లో విడుదలైంది. ఇక తల్లి పేరిట రత్నా మూవీస్ బ్యానర్ నెలకొలిపిన కృష్ణ, దానిపై 'ప్రజారాజ్యం', 'ముగ్గురు కొడుకులు' చిత్రాలను నిర్మించారు. 'కలియుగ కర్ణుడు ' సినిమా షూటింగ్ జరుగుతున్న కాలంలో 1987లో వీరరాఘవయ్య కన్నుమూశారు. భర్త మరణంతో కుంగిపోయిన నాగరత్నమ్మ ఏడాది తిరిగేసరికి 1989 జనవరి 3న తన 76వ ఏట మృతిచెందారు.

సుశాంక్‌ని పెళ్లి చేసుకోడానికి అనసూయ తండ్రిని ఎదిరించిందని మీకు తెలుసా?

  చిన్నతెరపై 'జబర్దస్త్' అనే ఒకే ఒక్క షోతో ఓవర్‌నైట్‌లో క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీలో నాగార్జున మరదలిగా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె నటించిన మూడో సినిమా 'విన్నర్‌లో "సూయ సూయ సూయ సూయ సూయ.. అట్టా ఎట్టా పుట్టాశావే అనసూయ" అంటూ ఆమెపై పాట రాశారంటేనే యూత్‌లో ఆమె క్రేజ్, ఇమేజ్ ఏంటో అర్థమైపోతుంది. అలాంటి అనసూయ బీహారీ అయిన శశాంక్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. సుశాంక్‌తో అనసూయ లవ్ స్టోరీకి అంత ఈజీగా పెళ్లి కార్డు పడలేదు. ఆ స్టోరీ చాలా ఇంటరెస్టింగ్.       అనసూయ వాళ్ల ఫాదర్ సుదర్శన్ రావు.. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్. కార్యకర్తలు ఆయనను "దర్శన్ అన్న" అని పిలుచుకొనేవాళ్లు. సుదర్శన్ రావుకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దది అనసూయే. ఆమె చెల్లెళ్ల పేర్లు.. అంబిక, వైష్ణవి. పెద్దమ్మాయిని ఆర్మీ ఆఫీసర్‌ని చేయాలని సుదర్శన్ రావు అనుకున్నారు. ఎన్‌సీసీ నుంచి ఆర్మీలో చేరడానికి మంచి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఓల్డ్ మలక్‌పేటలోని స్కూల్ నుంచి, వనస్థలిపురంలోని వికాస భారతి స్కూలుకు అనసూయను మార్పించారు.  ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఎన్‌సీసీ క్యాంపులో అనసూయకు సుశాంక్ భరద్వాజ్ పరిచయమయ్యాడు. రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. క్రమంగా ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. ఆమెకు ఇష్టమైన కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్ గిఫ్టులుగా ఇచ్చేవాడు సుశాంక్. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో అనసూయ డిగ్రీ చదువుతుండగా వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట అతనే ప్రపోజ్ చేశాడు. ఎలా రెస్పాండ్ అవ్వాలో అనసూయకు తెలీలేదు. ప్రతి విషయాన్నీ ఇంట్లో వాళ్లతో పంచుకోవడం చిన్నప్పటి నుంచీ ఆమెకు అలవాటు. అందుకే సుశాంక్ విషయాన్ని మొదట అమ్మకూ, నాయనమ్మకూ చెప్పింది. వారి ద్వారా సుదర్శన్ రావుకు తెలిసింది. ఆయన కోపంతో గట్టిగా కేకలేశారు. అప్పుడు పెద్ద గొడవే జరిగింది. సుశాంక్ వాళ్లది బీహార్ అని తెలిశాక ఆయన ఇంకా భయపడ్డారు. అనసూయకు త్వరగా పెళ్లి చేసెయ్యాలని వేరే సంబంధాలు తెచ్చారు. "నేను సుశాంక్‌ను ప్రేమిస్తున్నా. చేసుకుంటే అతడ్నే చేసుకుంటా, ఇంకెవర్నీ చేసుకోను" అని తెగేసి చెప్పేసింది అనసూయ. ఈ గొడవల మధ్యనే డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ చేయడానికి కాచిగూడలోని భద్రుకా కాలేజీలో చేరింది. అప్పుడే 'పిక్సలాయిడ్' అనే కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఒకవైపు చదువుకుంటూనే, 2007 నుంచి 2009 దాకా అక్కడ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసింది అనసూయ. 2010 జూన్‌లో సుశాంక్ భరద్వాజ్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఇంట్లో వాళ్లతో పోరాడి, ఎట్టకేలకు నాన్న సుదర్శన్ రావును ఒప్పించి మరీ ఈ పెళ్లి చేసుకుంది.  ఏడాది తిరిగేసరికల్లా 2011లో మొదటి అబ్బాయి 'శౌర్య' పుట్టాడు. 2013లో అనసూయకు 'జబర్దస్త్' యాంకర్‌గా ఆఫర్ వచ్చింది. ఆ షో ఇన్‌స్టంట్‌గా హిట్టవడం, యాంకర్‌గా అనసూయకు క్రేజ్ రావడం జరిగిపోయాయి. బీహార్‌లో దీపావళి తర్వాత ఆరు రోజులకు సూర్య భగవానుడిని పూజిస్తూ 'చత్' అనే వేడుక జరుపుతారు. సరిగ్గా ఆరోజు పుట్టాడు కాబట్టి రెండో కొడుక్కు 'అయాంచ్' అనే పేరు పెట్టుకున్నారు. అయాంచ్ అంటే సూర్యుడు అని అర్థం. ఇదీ.. తెలుగు టీవీ తెరపై తొలి గ్లామరస్ యాంకర్ అనసూయ లవ్ స్టోరీ.

'మనదేశం' హీరోయిన్ ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మీకు తెలుసా?

  'మనదేశం' హీరోయిన్‌గా సి. కృష్ణవేణి పాపులర్ అయ్యారు. ఆ సినిమా ద్వారానే ఎన్టీఆర్ నటునిగా పరిచయమయ్యారనే విషయం మనకు తెలుసు. ఆ మూవీలో పోలీసుగా ఆయన ఒక చిన్న వేషం వేశారు. 'సతీ అనసూయ' సినిమాని సి. పుల్లయ్య డైరెక్ట్ చేశారు. అందులో సి. కృష్ణవేణి హీరోయిన్. అప్పటికి ఆమె వయసు 12 యేళ్లు. ఆ మూవీలో నటించే అవకాశం ఆమెకు రేలంగి వెంకట్రామయ్య వల్ల వచ్చింది. ఆయన ప్రొడక్షన్‌లో చిన్నతనంలోనే కృష్ణవేణి నాటకాలు ఆడారు. 'రామదాసు' అనే నాటికలో కమల పాత్ర వేశారు. రాజమండ్రిలో ఆ ప్రదర్శనను సి. పుల్లయ్య చూశారు. రేలంగి ద్వారా ఆమెను మద్రాసు పిలిపించుకొని అనసూయ వేషం ఇచ్చారు. మద్రాసు వెళ్లాక ఆమె స్టూడియోలోనే ఉన్నారు.  13వ యేటనే ఆమె హీరోయిన్ అయ్యారు. మీర్జాపురం రాజావారి జయా ఫిలిమ్స్ నిర్మించిన 'భోజ కాళిదాసు' మూవీలో కన్నాంబ హీరోయిన్ అయితే, కృష్ణవేణి సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత 'కచదేవయాని'లో దేవయానికిగా నటించారు. ఆమె నట జీవితమంతా జయా ఫిలిమ్స్‌కే పరిమితమైంది. మీర్జాపురం రాజాతో పెళ్లయ్యాక సినిమాల్లో నటించవద్దని ఆయన చెప్పారు. అయితే సొంత సినిమాల్లో ఆమె నటించారు. 1974లో రాజావారు మరణించారు. ఆయన పోయినా ఆర్థికంగా అమె ఇబ్బంది పడలేదు. కాకపోతే వాళ్ల ఆస్తులు కొన్నింటిని అప్పటి తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ వాటికి సంబంధించిన కేసులు కోర్టుల్లోనే నలుగుతున్నాయి. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చిన భూమి రాజావారిదే. అందుకే దానికి ఆయన పేరు పెట్టారు.  

'కాంతార' హీరో ఒకప్పుడు వాటర్ బాటిల్స్ అమ్ముకొనేవాడని మీకు తెలుసా?

  రిషబ్ శెట్టి 12 సంవత్సరాల క్రితం తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతి ఒక్కరూ తనతో కలిసి పనిచేయాలని కోరుకునేంత పెద్ద స్టార్ అవుతాడని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు. కానీ నేడు రిషబ్ శెట్టి ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 'కాంతార'లో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. హీరోగా నటించడమే కాకుండా కథను రాసి దర్శకత్వం వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం నేడు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ భాషా చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. నెల రోజుల్లో 'కాంతార' ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రిషబ్ శెట్టి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయటి వ్యక్తి. ఇండస్ట్రీలోకి రాకముందు అతనికి ఎలాంటి సినిమా సంబంధాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో రిషబ్ శెట్టి సొంతంగా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తీరు ఎంతైనా అభినందనీయం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్‌ దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ రాగా, ఇప్పుడు అల్లు అర్జున్‌, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, యష్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే వీరందరి మధ్య రిషబ్ శెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రిషబ్ శెట్టి సినిమా ప్రయాణం, విజయగాథ చాలా క్లిష్టతరమైంది.   ఇండస్ట్రీలో సత్తా ఉంటే రెప్పపాటులో విజయం సాధించవచ్చని నిరూపించిన వారిలో రిషబ్ శెట్టి ఒకడు. చాలా సంవత్సరాలు కష్టపడి, ఈ రోజు ప్రతి ఒక్కరూ తనతో కలిసి పనిచేయాలని కోరుకునేలా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. రిషబ్ శెట్టి గురించి బాలీవుడ్‌లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ స్థాయిని అందుకోవడానికి రిషబ్ 18 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చిందని చాలా మందికి తెలియదు. నటుడు కావాలనేది రిషబ్ శెట్టి కల. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత నటనా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు.   ఒక వైపు చదువుకుంటూనే ఇంకోవైపు వాటర్ బాటిల్స్ అమ్ముతూ, హోటళ్లలో పనిచేస్తూ వచ్చాడు. తన కలను నెరవేర్చుకోవడానికి రిషబ్ శెట్టి రంగస్థలంపై అడుగుపెట్టాడు. తన మొదటి నాటకాన్ని కుందాపురలో ఆడాడు. క్రమంగా రిషబ్ శెట్టి మరిన్ని నాటకాల్లో పనిచేయడం ప్రారంభించాడు. రిషబ్ నటనను జనాలు బాగా మెచ్చుకున్నారు. దీంతో ప్రోత్సాహం లభించిన రిషన్ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల్లో రిషబ్ శెట్టి చదువుకోవడంతోపాటు చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. వాటర్ బాటిళ్లు అమ్మడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పనిచేశాడు. కొంతకాలం హోటల్‌లోనూ పనిచేశాడు. ఈ పనులతో పాటు, సినిమాల కోసం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.  రిషబ్ శెట్టికి 2004లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చిత్రం పేరు నామ్ ఏరియాలి ఒండినా, ఇందులో అతడి పాత్రకు పేరు కూడా లేదు. అయినప్పటికీ దానిని సంతోషంగా అంగీకరించి చేశాడు. అలా కొన్నాళ్ల పాటు అనేక ఇతర చిత్రాలలో అనామక, చిన్న పాత్రలు పోషించాడు. నటునిగా రిషబ్ శెట్టి 18 ఏళ్ల పోరాట గాథలోని బాధ ఒక ఇంటర్వ్యూలో ప్రతిబింభించింది. "నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అయ్యింది. 2004లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మొదటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సినిమా పేరు 'సైనైడ్'. ఆ తర్వాత మరిన్ని సినిమాలు చేశాను. డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకున్నాను. కొన్ని సినిమాల్లో బిచ్చగాడిగా, హీరో స్నేహితుల్లో ఒకడైగా నటించాను." అని చెప్పాడు.  2018 వరకు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించిన రిషబ్ 2019లో లీడ్ హీరోగా మారాడు. అతను హీరోగా నటించిన తొలి చిత్రం ‘బెల్ బాటమ్’. దీని తర్వాత కూడా రిషబ్ చిన్న పాత్రల్లో నటించాడు. 2021లో 'కాంతార’ సినిమా కథ అనుకున్నాడు. ఆ సినిమా కథ రాసి తానే నటించాలని నిర్ణయించుకున్నాడు. 'కాంతార' కథ కోసం తన ఊరిలో ఆడె భూతకోలను, ఇతర జానపద కథలను ఉపయోగించుకున్నాడు. రిషబ్ శెట్టి కావాలంటే 'కాంతార'కి వేరే ఏ దర్శకుడినైనా తీసుకొని ఉండేవాడు. కానీ తను ఊహించినట్లుగా మరెవరూ ఆ కథకు న్యాయం చెయ్యలేరని భావించాడు. అందుకే తనే 'కాంతార' చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. మొదట కన్నడిగుల కోసమే ఆ సినిమా తీశాడు. కానీ విపరీతమైన డిమాండ్ కారణంగా 'కాంతార'ని తెలుగు, హిందీలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇవాళ తన ఈ సినిమా ఇన్ని రికార్డులు సృష్టిస్తుందని కానీ, తనను పాన్ ఇండియా స్టార్‌ని చేస్తుందని కానీ అతను ఊహించలేదు. 

మీరు చూడాల్సిన టాప్ 10 హాలీవుడ్ రీమేక్స్

  ఒక భాష నుంచి మరో భాషలోకి రీమేక్ చేసే అలవాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకే కాదు, హాలీవుడ్‌కూ ఉంది! నిజం చెప్పాలంటే విదేశీ సినిమాల్ని రీమేక్ చెయ్యడం హాలీవుడ్‌కు ఒక వ్యసనంగా మారింది. చాలా సార్లు ఆ రీమేక్స్ బెడిసికొట్టాయి. ఉదాహరణకి స్పైక్‌లీ తీసిన ‘ఓల్డ్ బాయ్’, రూపర్ట్ శాండర్స్ డైరెక్ట్ చేసిన ‘ఘోస్ట్ ఇన్ ద షెల్’ వంటివి. బయటి దేశాల్లో మాస్టర్‌పీస్‌లుగా పేరుపొందిన వాటిని రీమేక్ చెయ్యడంలో ఎన్ని సార్లు ఫెయిలైనా హాలీవుడ్ డైరెక్టర్లు పదే పదే రీమేక్స్ తీస్తూనే ఉన్నారు. అయితే అలా రీమేక్ చేసిన వాటిలోనూ ఘన విజయాలు సాధించిన సినిమాలూ ఉన్నాయి. వాటిలో టాప్ టెన్ సినిమాలేవో చూద్దాం… 1. కోల్డ్ పర్సూట్ (2018): హన్స్ పెట్టర్ మోలండ్ రూపొందించిన ‘ఇన్ ఆర్డర్ ఆఫ్ డిజప్పియరెన్స్’ (2014)కు ఇది రీమేక్. ఈ రీమేక్‌తోటే ఒరిజినల్ డైరెక్టర్ మోలండ్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం గమనార్హం. లియాం నీసన్, టాం బేట్‌మన్, లారా డెర్న్, ఎమ్మీ రోసుం, అలెక్స్ పానోవిక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒకే దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలు రెండూ గొప్పగా పేరు సంపాదించుకున్నాయి. 2. ద బర్డ్‌కేజ్ (1996): ఇది ఎడౌర్డ్ మొలినరో రూపొందించిన ఇటాలియన్ కామెడీ ఫిల్మ్ ‘లా కేజ్ ఆక్స్ ఫోలెస్’కు రీమేక్. రాబిన్ విలియమ్స్, నాథన్ లేన్, జీన్ హాక్‌మన్, డయానే వీస్ట్, డాన్ ఫట్టర్‌మన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు మైక్ నికోల్స్. ఎల్‌జీబీటీ కేరెక్టర్లతో ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. 3. ద కిండర్‌గార్టెన్ టీచర్ (2018): నడవ్ లాపిడ్ రూపొందించిన ఇజ్రాయెలీ డ్రామా మూవీ ‘ద కిండర్‌గార్టెన్ టీచర్’ (2014)కు ఇది రీమేక్. సారా కొలాంజిలో డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మేగీ గిలెన్‌హాల్, పార్కర్ సెవాక్, మైఖెల్ చెర్నస్, గేల్ గార్సియా బెర్నాల్ ప్రధాన పాత్రధారులు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సాధించిన ఈ సినిమా థియేటర్‌లలో కంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ ఆదరణ పొందింది. 4. ద డిపార్టెడ్ (2006): ఆండ్రూ లవ్, అలన్ మాక్ సంయుక్తంగా రూపొందించిన హాకాంగ్ క్రైం మిస్టరీ ఫిల్మ్ ‘ఇంటర్నల్ ఎఫైర్స్’కు ఇది రీమేక్. మార్టిన్స్ స్కోర్సీస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లియొనార్డో డికాప్రియో, మాట్ డామన్, జాక్ నికల్సన్, మార్క్ వాల్‌బర్గ్, మార్టిన్ షీన్ ప్రధాన పాత్రధారులు. హాలీవుడ్ రీమేక్ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన ‘ద డిపార్టెడ్’ బెస్ట్ పిక్చర్‌గా ఆస్కార్‌ను సైతం గెలుచుకుంది. 5. ద మాగ్నిఫిసెంట్ సెవెన్ (2016): విఖ్యాత దర్శకుడు అకిర కురసోవా రూపొందించిన చేసిన మహోన్నత జపనీస్ యాక్షన్ మూవీ ‘సెవెన్ సమురాయ్’ (1954)కి ఇది రీమేక్. ఆంటోయిన్ ఫుఖ్వా డైరెక్ట్ చేసిన ‘ద మాగ్నిఫిసెంట్ సెవెన్’లో డెంజిల్ వాషింగ్‌టన్, క్రిస్ ప్రాట్, ఎథన్ హాక్, బ్యుంగ్-హున్ లీ, విన్సెస్ట్ డి ఓనోఫ్రియో, మాన్యుయెల్ గర్సియా-రుల్ఫో, మార్టిన్ సెన్‌స్మీయర్ టైటిల్ రోల్స్ చేశారు. ఒరిజినల్‌తో పోలిస్తే ఏమాత్రం సరితూగకపోయినా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. 6. హచి: ఎ డాగ్స్ టేల్ (2009): సీజిరో కోయమ డైరెక్ట్ చేసిన జపనీస్ ఫిల్మ్ ‘హచికో మొనొగటరి’ (1987) సినిమాకి ఇది రీమేక్. లాసే హాల్‌స్ట్రాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రిచర్డ్ గెరె, జోవన్ అలెన్, సారా రోమర్, లేలా (డాగ్) ప్రధాన పాత్రధారులు. విమర్శకులు అంతగా మెచ్చని ఈ సినిమాని ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. 7. లెట్ మి ఇన్ (2010): టోమస్ ఆల్ఫ్రెడ్‌సన్ డైరెక్ట్ చేసిన స్వీడిష్ హారర్ ఫిల్మ్ ‘లెట్ ద రైట్ ఒన్ ఇన్’ (2008)కు ఇది రీమేక్. మాట్ రీవ్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కొడి స్మిట్-మెక్‌ఫీ, క్లో గ్రేస్ మోరెట్జ్, రిచర్డ్ జెంకిన్స్, ఇలియాస్ కోటియాస్ ప్రధాన పాత్రలు చేశారు. హాలీవుడ్‌లో రూపొందిన గొప్ప వాంపైర్ సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. 8. సమ్‌ లైక్ ఇట్ హాట్ (1959): మార్లిన్ మన్రో పోషించిన ఐకనిక్ రోల్స్‌లో ఒకటిగా పరిగణించే రోల్ చేసిన ఈ సినిమాని బిల్లీ వైల్డర్ రూపొందించాడు. కర్ట్ హాఫ్‌మన్ డైరెక్ట్ చేసిన వెస్ట్ జర్మన్ ఫిల్మ్ ‘ఫ్యాన్‌ఫేర్స్ ఆఫ్ లవ్’ (1951)కి రీమేక్ అయిన ‘సం లైక్ ఇట్ హాట్’లో మార్లిన్ మన్రో, టోనీ కర్టిస్, జాక్ లెమన్, జార్జ్ రాఫ్ట్, ప్యాట్ ఓ’బ్రియాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కాలానికి ఎదురు నిలిచి క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. 9. ద రింగ్ (2002): ఇది హిదియో నకటా డైరెక్ట్ చేసిన జపనీస్ ఫిల్మ్ ‘రింగ్’ (1998)కు రీమేక్. గోర్ వెర్బెన్‌స్కీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ మూవీలో నవోమీ వాట్స్, మార్టిన్ హెండర్సన్, డేవిడ్ డోర్ఫ్‌మన్, బ్రియాన్ కాక్స్, జేన్ అలెగ్జాండర్ ప్రధాన పాత్రధారులు. ఒరిజినల్, సీక్వెల్ రెండూ ఆల్ టైం బెస్ట్ హారర్ మూవీస్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం. 10. ద సెంట్ ఆఫ్ ఎ వుమన్ (1992): ఇది 1974లో వచ్చిన డినో రిసి డైరెక్ట్ చేసిన 103 నిమిషాల ఇటాలియన్ సినిమా ‘ద సెంట్ ఆఫ్ ఎ వుమన్’కు రీమేక్. 156 నిమిషాల నిడివితో మార్టిన్ బ్రెస్ట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్ పాసినో, క్రిస్ ఓ డన్నెల్, జేమ్స్ రెభార్న్, గాబ్రియెల్లే అన్వర్ ప్రధాన పాత్రలు పోషించారు.

రెండు సినిమాల్లో ప్రియ‌ద‌ర్శి విల‌న్‌గా న‌టించాడ‌ని మీకు తెలుసా?

  ప్రియ‌ద‌ర్శి 'పెళ్లిచూపులు' సినిమాతో వెలుగులోకి వ‌చ్చాడు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రెండ్‌గా న‌టించిన అత‌ను, "నా సావు నేను స‌స్తా.. నీకెందుకు?" అనే డైలాగ్‌తో పాపుల‌ర్ ఐపోయాడు. ప్రియ‌ద‌ర్శి వాళ్ల నాన్న పులికొండ సుబ్బాచారి మంచి క‌వి మాత్ర‌మే కాదు, పీహెచ్‌డీ చేసి గౌర‌వ డాక్ట‌రేట్ పొందిన వ్య‌క్తి కూడా. ఆయ‌న‌ది ఖ‌మ్మం అయితే, ప్రియ‌ద‌ర్శి వాళ్ల‌మ్మ జ‌య‌మ్మ‌ది గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల‌. ప్రియ‌ద‌ర్శి పిడుగురాళ్ల‌లో పుట్టి, హైద‌రాబాద్‌లో పెరిగాడు. అప్ప‌ట్లో సుబ్బాచారి హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప‌నిచేసేవారు. ప్రియ‌ద‌ర్శి చిన్న‌త‌నంలో వాళ్లు ఓల్డ్ సిటీలో ఉండేవారు. త‌ర్వాత చందాన‌గ‌ర్‌కు షిఫ్ట‌య్యారు. అక్క‌డే విజ్ఞాన్ స్కూల్‌లో చ‌దువుకున్నాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ ప్రియ‌ద‌ర్శికి సినిమా పిచ్చి. కె. విశ్వ‌నాథ్‌, కె. బాల‌చంద‌ర్‌, రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాలు తెగ చూసేవాడు. ఎం.ఎన్‌.ఆర్‌. డిగ్రీ కాలేజీలో బీయ‌స్సీ కంప్యూట‌ర్ సైన్స్ ఢ‌క్కామొక్కీలు తిని రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిల‌య్యాడు. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలంటే డిగ్రీ అర్హ‌త ఉండాల‌ని తెలిశాక‌, అష్ట‌క‌ష్టాలు ప‌డి అత్తెస‌రు మార్కుల‌తో డిగ్రీ పూర్తి అయ్యింద‌నిపించుకున్నాడు. అయితే పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు నాన్న ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో, ఆయ‌న ప‌నిచేస్తున్న సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ కోర్సులో చేరాడు. ఎలాంటి ఇంట‌రెస్ట్ లేకుండా చేరిన అత‌ని జీవితం కొత్త మ‌లుపు తిరిగింద‌క్క‌డే. మాస్ క‌మ్యూనికేష‌న్ చ‌ద‌వ‌డంతో రైటింగ్‌, షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో అవ‌గాహ‌న పెరిగింది. చ‌దువ‌య్యాక 'పిక్స‌లాయిడ్' కంపెనీలో రూ. 9 వేల జీతానికి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌గా జాయిన‌య్యాడు. అక్క‌డ సినిమాల‌కు విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, 3డి యానిమేష‌న్ వంటివి చేస్తుంటారు. అలా నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. క‌థ‌లు రాస్తూ, వాటితో సినిమాలు తియ్యాల‌నే కోరిక‌తో డైరెక్ష‌న్ చాన్స్ కోసం ప్ర‌య‌త్నించాడు కానీ అవ‌కాశాలు రాలేదు. దాంతో షార్ట్ ఫిలిమ్స్ వైపు దృష్టి పెట్టాడు. ఉద్యోగం వ‌దిలేశాడు. డ‌బ్బు సంపాద‌న కోసం కార్పొరేట్ యాడ్స్ చేస్తూ, పెళ్లిళ్ల‌కు వీడియో షూటింగ్‌లు చేస్తూ వ‌చ్చాడు. ఆ డ‌బ్బుల‌తో అర‌డ‌జ‌ను షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. వాటిలో త‌నే మెయిన్ రోల్ చేశాడు. ఆ టైమ్‌లోనే త‌రుణ్ భాస్క‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్పుడే 'బైపాస్ రోడ్ ఎల్ఎండీ కాల‌నీ' అనే సినిమాలో న‌టుడిగా చాన్స్ వ‌చ్చింది. అందులో మంచి పాత్ర చేశాడు కానీ, అది విడుద‌ల కాలేదు. ఆ త‌ర్వాత చేసిన ఐదారు సినిమాల ప‌రిస్థితీ అంతే. తెర‌పై అత‌డు మొద‌ట‌గా క‌నిపించిన సినిమా.. 'టెర్ర‌ర్‌'. స‌తీశ్ కాశెట్టి డైరెక్ట్ చేసిన ఆ మూవీలో ప్రియ‌ద‌ర్శి విల‌న్‌గా న‌టించాడు. తెర‌మీద అత‌డ్ని చూసి, వీడు సినిమాల‌కు ప‌నికొస్తాడ‌ని అప్పుడు న‌మ్మారు అమ్మానాన్న‌లు. త‌రుణ్ భాస్క‌ర్ 'పెళ్లిచూపులు' తియ్యాల‌నుకున్న‌ప్పుడు హీరో ఫ్రెండ్ రోల్ కోసం ఆడిష‌న్స్‌కు వెళ్లి సెల‌క్ట‌య్యాడు. నిజానిక‌త‌డు కోట శ్రీ‌నివాస‌రావు లాగ‌గా, ప్ర‌కాశ్‌రాజ్ లాగా విల‌న్ అవ్వాల‌నుకొని పెళ్లిచూపుల‌తో క‌మెడియ‌న్ అయ్యాడు. 'టెర్ర‌ర్‌'తో పాటు 'బొమ్మ‌ల రామారం' సినిమాలో చేసిన విల‌న్ క్యారెక్ట‌ర్లు అత‌డికి వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ 'పెళ్లిచూపులు'లో చేసిన కామెడీ రోల్ అత‌డికి ఒకే సంవ‌త్స‌రం 25 సినిమా చాన్సులు తెచ్చింది. ఈ క్ర‌మంలో 'మ‌ల్లేశం'లో టైటిల్ రోల్ చేసి, న‌టుడిగా ఇంకో మెట్టు ఎక్కాడు ప్రియ‌ద‌ర్శి.

మూడు తరాల హీరోలకు పనిచేసిన రచయిత.. మోక్షజ్ఞకు కూడా రాయాలి!

  చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'సైరా.. నరసింహారెడ్డి'  చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఆ సినిమాకు పలువురు రచయితలు.. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, భూపతి రాజా, బుర్రా సాయిమాధవ్, మధు.. ఇంతమంది పనిచేశారు. 'సైరా' చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్. అందుకే దానికి ఎంత చేయగలరో అంత చేశారు ఆ రైటర్స్ అందరూ. సైరాతో చిరంజీవి పెద్ద సాహసమే చేశారు. 65 సంవత్సరాల వయసులో శారీరకంగా, మానసికంగా అంత కష్టపడ్డం చిన్న విషయం కాదు.     'మాయదారి మల్లిగాడు'   సినిమా తర్వాత సత్యానంద్‌కు అందరు హీరోల సినిమాలకూ పనిచేసే అవకాశం వచ్చింది. కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అందరి సినిమాలకూ పనిచేశారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య.. మూడు తరాలకూ, నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. మూడు తరాలకూ, ఘట్టమనేని కుటుంబంలో కృష్ణ, మహేశ్‌బాబు సినిమాలకు పనిచేశారు.  ఆమధ్య బాలకృష్ణను కలిస్తే, ఆయన తన కుమారుడు మోక్షజ్ఞను పిలిచి, "ఈయన తాతయ్యగారికి రాసిన కవిగారు. దణ్ణం పెట్టు" అన్నారు. ఆ కుర్రాడు దణ్ణం పెడితే సత్యానంద్ అన్నారు, "మోక్షకు కూడా ఎప్పుడో ఒకప్పుడు రాయాలి" అని. ఇటీవల ఆయన తను పనిచేసిన సినిమాలనోసారి చూసుకుంటే, 83 మంది డైరెక్టర్లతో పనిచేసినట్లు తేలింది. 

అచ్చ తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా గురించి మీకు తెలీని విష‌యాలు!

  ఈషా రెబ్బా వాళ్ల సొంతూరు వ‌రంగ‌ల్ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి. వాళ్ల నాన్న ఉద్యోగ రీత్యా ఆమె పుట్ట‌క‌ముందే హైద‌రాబాద్ షిఫ్ట‌య్యారు. ఈషాకు అక్క షీలా, చైలి శైలా ఉన్నారు. నాన్న శంక‌ర్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి కావ‌డంతో బీహెచ్ఈఎల్ కాల‌నీలో ఉండేవాళ్లు. సెయింట్ ఆన్స్ స్కూల్లో టెన్త్ క్లాస్‌, శ్రీ చైత‌న్య జూనియ‌ర్ కాలేజీలో ఇంట‌రీ బైపీసీ చ‌దివింది ఈషా. ఆ త‌ర్వాత ఖైర‌తాబాద్‌లోని షాద‌న్ కాలేజీలో బీయ‌స్సీ మైక్రోబ‌యాల‌జీ చేశాక‌, మ‌ల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ చ‌దివింది. స్కూలుకు, త‌ర్వాత కాలేజీకి వెళ్లొస్తున్న‌ప్పుడు కాల‌నీలోని చ‌ర్చి బ‌స్టాప్ ద‌గ్గ‌ర గోడ‌పై అంటించే సినిమా పోస్ట‌ర్లు ఈషాను అమితంగా ఆక‌ట్టుకునేవి. ప్ర‌తివారం అక్క‌డ మారే రంగురంగుల పోస్ట‌ర్ల‌ను ఆస‌క్తిగా చూసేది. బ‌హుశా సినిమాపై ఆమెకు ఆక‌ర్ష‌ణ అన్న‌ది అప్పుడే మొదలై ఉంటుంది. కాలేజీలో మినీ ప్రాజెక్టులో భాగంగా హైటెక్ సిటీలోని ఇన్ఫోటెక్‌కు, జూబ్లీహిల్స్‌లోని టీవీ 5 చాన‌ల్‌కు వెళ్లేది. టీవీ 5లో ఉండ‌గా కొంద‌రు యాంక‌ర్‌గా ట్రై చెయ్య‌మ‌న్నారు. ఆమెది మొద‌ట్నుంచీ ఇంగ్లీష్ మీడియం కావ‌డంతో టెలీ ప్రాంప్ట‌ర్ మీద స్క్రోల్ అవుతున్న తెలుగు ప‌దాల‌ను గ‌బ‌గ‌బా చ‌దివేందుకు ఇబ్బంది ప‌డేది. ప్రాక్టీస్ కోసం రోజూ తెలుగు పేప‌ర్లు చ‌దివేది. అయితే యాక‌రంటే కెమెరా ముందు గ‌ల‌గ‌లా మాట్లాడాలి. అది త‌న‌వ‌ల్ల కాద‌నుకొని వెన‌క్కి త‌గ్గింది. అలా అని గ్లామ‌ర్ ఫీల్డుపై ఆక‌ర్ష‌ణ మాత్రం పోలేదు. టూ వీల‌ర్‌పై ఇంటికి వెళ్తుంటే చందాన‌గ‌ర్ సెంట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భూమిక జంట‌గా న‌టించిన 'ఖుషి' హోర్డింగ్ ఆమెను క‌ట్టిప‌డేసేది. ఎప్ప‌టికైనా అలాంటి హోర్డింగ్‌పై త‌న బొమ్మ చూడాల‌నుకొనేది. హీరోయిన్ అయ్యాక అక్క‌డే త‌న ఫొటో చూసుకొని మురిసిపోయింది. సినిమాల్లోకి అడుగుపెట్టాలంటే మోడ‌లింగ్ విజిటింగ్ కార్డుగా ప‌ని చేస్తుంద‌నిపించింది. దాంతో మోడ‌లింగ్‌లో అవ‌కాశాల కోసం య‌త్నించింది ఈషా. అప‌ర్ణ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, అంబికా ద‌ర్బార్ బ‌త్తి లాంటి కొన్ని యాడ్స్ చేశాక త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డింది. రిల‌య‌న్స్ కంపెనీ ప‌లు భాష‌ల్లో చేసే యాడ్ కోసం తెలుగులో ఈషాను సెలెక్ట్ చేశారు. అదే స‌మ‌యంలో డెరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఆఫీస్ నుంచి ఫోన్ వ‌చ్చింది. అంత‌కు ముందే నితిన్ హీరోగా చేసిన 'కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్' సినిమా కోసం ఆడిష‌న్ ఇచ్చింది కానీ, ఆ త‌ర్వాత అక్క‌డ్నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. అందుకే ఇంద్ర‌గంటి నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్‌పై కూడా పెద్ద ఆశ‌లు పెట్టుకోలేదు. పైగా ఫోన్ వ‌చ్చిన‌రోజే ఫ్యామిలీ అంతా షిర్డీ ప్ర‌యాణానికి ప్లాన్ చేసుకున్నారు. జ‌ర్నీకి ఇంకా టైమ్ ఉండ‌టంతో ఈలోపు వెళ్లి క‌లిసొద్దామ‌నుకుంది. ఆఫీసుకు వెళ్లాక టెస్ట్ షూట్ చేసి "నువ్వే హీరోయిన్‌వి" అన్నారు. అదే.. 'అంత‌కు ముందు.. ఆ త‌ర్వాత' సినిమా. న‌ట‌న‌లో ఆమెకు ఏమాత్రం అనుభ‌వం లేకున్నా తొలి సినిమాతోటే మంచి గుర్తింపు వ‌చ్చింది. మోహ‌న‌కృష్ణ వ‌రుస‌గా 'బందిపోటు', 'అమీ తుమీ' చిత్రాల్లో ఆమెకు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించాడు. అమీ తుమీలో ఈషా తెలంగాణ యాస అంద‌రికీ తెగ న‌చ్చేసింది. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు, అ!, బ్రాండ్ బాబు, అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌, సుబ్ర‌మ‌ణ్య‌పురం, రాగ‌ల 24 గంట‌ల్లో సినిమాల్లో మంచి పాత్ర‌లు చేసిన ఈషా.. నెట్‌ఫ్లిక్స్ ఆంథాల‌జీ 'పిట్ట క‌థ‌లు'లో పింకీ పాత్ర‌తో ఆక‌ట్టుకుంది. ఇటీవ‌లే 'ఒట్టు' మూవీతో మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టింది.