ఎన్టీఆర్, కృష్ణ మల్టిస్టారర్ 'దేవుడు చేసిన మనుషులు'కి 50 ఏళ్ళు.. దేశద్రోహులపై అన్నదమ్ముల పోరాటం!

తెలుగునాట పలు మల్టిస్టారర్స్ సందడి చేశాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. నటరత్న నందమూరి తారక రామారావు, నట శేఖర కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' అచ్చంగా ఈ కోవకు చెందిన సినిమానే. ఆచారాలను అవకాశంగా తీసుకుని దేశసంపదను విదేశాలకు చేరవేసి కోట్లు సంపాదించాలని చూసే స్వార్థపరుల నుండి జాతి అమూల్యరత్నాలైన శిల్పాలను కాపాడడం కోసం రంగంలోకి దిగిన రాము, గోపీ అనే అన్నదమ్ముల కథే.. 'దేవుడు చేసిన మనుషులు'.  పద్మాలయా స్టూడియోస్ పతాకంపై జి. హనుమంతరావు ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథను కూడా అందించడం విశేషం. ప్రముఖ దర్శకుడు వి. రామచంద్రరావు స్క్రీన్ ప్లే సమకూర్చి మరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రిపురనేని మహారథి అందించిన సంభాషణలు ఓ ఎస్సెట్ గా నిలిచాయి.  ఎన్టీఆర్, కృష్ణతో పాటు ఎస్వీఆర్, జయలలిత, విజయ నిర్మల, కాంచన, కాంతారావు, జగ్గయ్య (ద్విపాత్రాభినయం), కైకాల సత్యనారాయణ, ఎస్. వరలక్ష్మి, నిర్మలమ్మ, సాక్షిరంగారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కేవీ చలం, మమత ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. జమున, మంజుల ఓ పాట కోసం అతిథి పాత్రల్లో మెరిశారు. రమేశ్ నాయుడు సంగీతమందించిన 'దేవుడు చేసిన మనుషులు'కి శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర సాహిత్యమందించారు. "దేవుడు చేసిన మనుషుల్లారా" (రెండు వెర్షన్స్), "మసక మసక చీకటిలో", "దోరవయసు చిన్నది", "తొలిసారి నిన్ను", "నీ దగ్గర ఏదో ఉన్నది", "విన్నారా అలనాటి వేణు గానం".. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. 1973 ఆగస్టు 9న విడుదలై ఆ యేటి మేటి విజయవంతమైన చిత్రంగా నిలిచిన 'దేవుడు చేసిన మనుషులు'.. హిందీలో 'టక్కర్' (1980) పేరుతో రీమేక్ అయింది.  బుధవారంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.   

సుత్తి వేలు రేర్ రికార్డ్.. ఒకే ఏడాది రెండు నంది అవార్డులు.. ఏ సంవత్సరమో తెలుసా!

దాదాపు 32 ఏళ్ళ పాటు వెండితెరపై నవ్వులు పంచిన వైనం.. దిగ్గజ హాస్య నటులు సుత్తి వేలు సొంతం. 1981లో విడుదలైన 'ముద్ద మందారం'తో మొదలుకుని 2013లో రిలీజైన 'రామాచారి' వరకు వేలు రకరకాల వేషాల్లో వినోదం పంచారు. మరీముఖ్యంగా.. హాస్య బ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ సుత్తి వేలు తనదైన హాస్యంతో గిలిగింతలు పెట్టారు. ఆరోగ్యకరమైన హాస్యంతోనే కాకుండా అడపాదడపా కరుణ రసంతో కూడిన పలు విభిన్న భూమికల్లోనూ ఆకట్టుకున్నారు సుత్తి వేలు. అవార్డుల విషయానికి వస్తే..  తన కెరీర్ మొత్తమ్మీద నాలుగు సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు సుత్తి వేలు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 1985లో ఏకంగా రెండు విభాగాల్లో నంది పురస్కారాలు కైవసం చేసుకుని అరుదైన రికార్డ్ సృష్టించారు. 'వందేమాతరం'కి గానూ 'ఉత్తమ సహాయనటుడు' విభాగంలోనూ, 'దేవాలయం'కిగానూ 'ఉత్తమ హాస్య నటుడు' కేటగిరిలోనూ నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు టి. కృష్ణ దర్శకుడు కాగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించారు. 1985 తరువాత 1989లో 'గీతాంజలి'కిగానూ, అలాగే 1990లో 'మాస్టారి కాపురం'కిగానూ మరో రెండు పర్యాయాలు 'ఉత్తమ హాస్యనటుడు' విభాగంలో నంది పురస్కారాలు పొందారు. (ఆగస్టు 7.. సుత్తి వేలు జయంతి సందర్భంగా)  

శ్రీహరి 'సింహాచలం'కి 20 ఏళ్ళు..  'కౌన్సిలింగ్ సీన్స్' మరచిపోవడం కష్టమే!

ఖాకీ పాత్రలకు చిరునామాగా నిలిచిన నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. తను కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా 'పోలీస్' (1999)తో మొదలుకుని పలు చిత్రాల్లో ఈ తరహా వేషాల్లో ఆకట్టుకున్నారాయన. 2003లో విడుదలైన 'సింహాచలం' కూడా ఈ జాబితాలోదే. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీహరికి జంటగా మీనా నటించగా ప్రకాశ్ రాజ్, సునీల్, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, ఝాన్సీ, ఎల్బీ శ్రీరామ్, రాజా రవీంద్ర, హేమంత్ రావణ్, బండ్ల గణేశ్, నాగినీడు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సురేశ్, కాంతారావు, రాళ్ళపల్లి, మల్లికార్జున రావు, నూతన్ ప్రసాద్, తెలంగాణ శకుంతల గౌరవనటులుగా దర్శనమిచ్చారు. పోసాని కృష్ణమురళి రచన చేశారు. కథ విషయానికి వస్తే.. సింహాచలం (శ్రీహరి) నిజాయితీపరుడైన ఓ పోలీస్ అధికారి. తమ శాఖని కలుషితం చేస్తున్న కొందరు స్వార్థ, అవకాశ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడి.. జాతి సంక్షేమం కోసం ప్రాణాలకు కూడా తెగించి వ్యవస్థను ప్రక్షాళన చేస్తాడు. ఈ క్రమంలో తన భార్య (మీనా)ని కూడా కోల్పోతాడు.  స్టోరీ లైన్ పరంగా కాస్త రొటీన్ గా అనిపించినా.. కథనంతో ఆసక్తికరంగా సాగే కాప్ సబ్జెక్ట్ ఇది. మరీ ముఖ్యంగా.. ఇందులోని 'కౌన్సిలింగ్ సీన్స్' గురించి ఇప్పటికీ చర్చించే వాళ్ళు లేకపోలేదు.  ఇక పాటల విషయానికి వస్తే.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన గీతాల్లో "దోబూచులాడే సిగ్గాటతో.. లాలూచిపడ్డా ముద్దాటకి..", "సోకేమో అదిరిపడి.. నాకేమో మనసుపడి",  "నీతిని నమ్మితే ఓటమి ఉండునా" అలరిస్తాయి. వీటికి వేటూరి సుందరరామ్మూర్తి, సుద్దాల అశోక్ తేజ, శ్రీహర్ష సాహిత్యమందించారు. చంద్రహాసహ సినిమా పతాకంపై కానుమిల్లి శ్రీనివాసరావు నిర్మించిన 'సింహాచలం'.. 2003 ఆగస్టు 8న జనం ముందు నిలిచింది. మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 20 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.   

రవితేజ 'దొంగోడు'కి 20 ఏళ్ళు.. ఏ సినిమాకి రీమేకో తెలుసా!

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!'(2002)తో హిట్ జోడీ అనిపించుకున్నారు మాస్ మహారాజా రవితేజ, కళ్యాణి. ఆ సినిమా విడుదలైన ఏడాది తరువాత ఈ ఇద్దరు మరో మూవీతో ఎంటర్టైన్ చేశారు. ఆ చిత్రమే.. 'దొంగోడు'. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న భీమినేని శ్రీనివాసరావు.. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాని తెరకెక్కించారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'మీస మాధవన్' (దిలీప్, కావ్య మాధవన్) ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రేఖ మరో హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఉత్తేజ్, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, షకీలా, పవిత్రా లోకేశ్, వర్ష, ఉమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, రంజిత, దువ్వాసి మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడు చెల్లి ఆకలి తీర్చడానికని తొలిసారిగా దొంగతనం చేసిన మాధవ (రవితేజ).. క్రమంగా పెద్ద దొంగ అవుతాడు. మాధవ ఎవరినైనా చూస్తూ మీసం మేలేస్తే.. ఆ ఇంట్లో దొంగతనం జరగడం ఖాయమన్నట్లుగా ఊర్లో పేరుంటుంది. అలాంటి మాధవ.. దుష్టుడైన ఆ ఊరి భూస్వామి నాయుడు (తనికెళ్ళ భరణి)తో వ్యక్తిగత సమస్య ఉంటుంది. మరోవైపు నాయుడు కూతురు రుక్మిణి మొదట్లో మాధవని ద్వేషించినా.. అతని మంచితనం తెలిసి ప్రేమిస్తుంది. ఇదిలా ఉంటే, రుక్మిణిపై కన్నేసిన ఎస్. ఐ (రియాజ్ ఖాన్) మాధవ చేయని దొంగతనాన్ని అతనిపై అంటకడతాడు. ఈ క్రమంలో.. మాధవ తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు? అన్నది మిగిలిన సినిమా.   విద్యాసాగర్ సంగీతమందించిన ఈ చిత్రానికి 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, బండారు దానయ్య సాహిత్యమందించారు. "కోడి ముందా", "మీసాల గోపాల", "ఎంత పనిజేసిందే", "సొట్గ బొగ్గల", "డుమ్ డుమ్ డుమ్", "దొంగ దొంగ" (థీమ్ సాంగ్).. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. భీమనేని రోషిత సాయి నిర్మించిన 'దొంగోడు'.. 2003 ఆగస్టు 7న జనం ముందు నిలిచింది. నేటితో ఈ జనరంజక చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంది. 

చిరుకి 'మెగాస్టార్' టైటిల్ ఇచ్చిన సినిమాకి 35 ఏళ్ళు.. ఆ చిత్రమేంటో తెలుసా!

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎందరో స్టార్స్  ఉన్నారు. అయితే.. మెగాస్టార్ మాత్రం ఒక్కరే. అతడే.. చిరంజీవి. 1978లో విడుదలైన 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తెరంగేట్రం చేసిన చిరు.. కెరీర్ ఆరంభంలో ఎన్నో విజయాలు చూసినా 1983లో రిలీజైన 'ఖైదీ'తోనే స్టార్ డమ్ చూశారు. తదుపరి ప్రయాణంలోనూ పలు సంచలనాలకు చిరునామాగా నిలిచారు చిరు. ఈ క్రమంలో తన పేరుకి ముందు ఎన్నో టైటిల్స్ తోడయ్యాయి. అయితే ఎక్కువ కాలంగా వినిపిస్తున్న బిరుదు మాత్రం మెగాస్టార్ నే. గత 35 ఏళ్ళుగా ఈ టైటిల్ చిరుకి పర్యాయపదంగా మారింది.   ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'ఖైదీ' చిత్రం టైటిల్స్ లో తన పేరు ముందు ఎలాంటి బిరుదు ఉండదు. అయితే, తరువాత వచ్చిన సినిమాల టైటిల్స్ లో 'నటకిశోర', 'డైనమిక్ హీరో', 'యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ హీరో',  'డేరింగ్ డాషింగ్', 'సుప్రీమ్ హీరో', 'సుప్రీమ్ స్టార్'  వంటివి జోడించారు. ఇక 'మెగాస్టార్' అనే టైటిల్ ట్యాగ్ ని ఇచ్చింది మాత్రం.. 1988లో విడుదలైన 'మరణ మృదంగం' కోసమే. అలా మెగాభిమానులకు ఎంతో స్పెషల్ గా నిలిచిన 'మరణ మృదంగం' చిత్రం విడుదలై.. ఈ ఆగస్టు 4కి సరిగ్గా 35 ఏళ్ళు. ఈ సందర్భంగా 'మరణ మృదంగం' సినిమా తాలూకు ఙ్ఞాపకాల్లోకి వెళితే..  * 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత చిరంజీవి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు ఇళయరాజా, నిర్మాత కె.ఎస్. రామారావు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'మరణ మృదంగం'.  * 'రాక్షసుడు'లో కథానాయికలుగా నటించిన రాధ, సుహాసిని.. ఇందులోనూ చిరుకి జోడీగా సందడి చేశారు.  * యండమూరి రచించిన 'మరణ మృదంగం' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.   * 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' తరహాలో ఈ చిత్రం అఖండ విజయం సాధించకపోయినా.. హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. * ఈ సినిమాలోని పాటలన్నింటికీ దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. * "కరిగిపోయాను", "సరిగమ పదనిస", "కొట్టండి తిట్టండి", "గొడవే గొడవమ్మా", "జుంగిలి జిమా".. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి.  * "గొడవే గొడవమ్మా" పాటకి చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ అందించడం విశేషం.

అత్తగా వాణిశ్రీ అదరగొట్టిన సినిమాలేంటో తెలుసా!

తెలుగునాట తిరుగులేని స్టార్ డమ్ చూసిన కథానాయికల్లో కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. 1970ల్లో నటరత్న నందమూరి తారక రామారావు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటశేఖర కృష్ణ, నట భూషణ్ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఇలా అందరు అగ్ర కథానాయకులతోనూ ఘనవిజయాలు అందుకున్నారామె. 1978లో డాక్టర్ కరుణాకరన్ ని పెళ్ళాడాక సినిమాలకు కొన్నాళ్ళపాటు దూరమైన వాణిశ్రీ.. 1989లో రీఎంట్రీ ఇచ్చి పలు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. మరీముఖ్యంగా.. హీరోలకి అత్త పాత్రల్లో వాణిశ్రీ అదరగొట్టారనే చెప్పాలి. 1989 సంక్రాంతికి వచ్చిన సంచలన చిత్రం 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'లో మెగాస్టార్ చిరంజీవికి అత్తగా చాముండేశ్వరీ దేవి పాత్రలో అదరగొట్టారు వాణిశ్రీ. ఆపై విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'బొబ్బిలి రాజా'లోనూ మినిస్టర్ రాజేశ్వరీ దేవిగా అత్త పాత్రలో అలరించారు. అదేవిధంగా కింగ్ నాగార్జున టైటిల్ రోల్ లో తెరకెక్కిన 'అల్లరి అల్లుడు'లో అఖిలాండేశ్వరిగా ఆకట్టుకున్నారు. అలాగే 'కలెక్టర్ గారి అల్లుడు', 'హలో అల్లుడు' సినిమాల్లో సుమన్ కి, 'బొంబాయి ప్రియుడు'లో జేడీ చక్రవర్తికి అత్తగా వాణిశ్రీ అదరహో అనిపించారు.  (ఆగస్టు 3.. వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా)

ఒకప్పటి చాక్లెట్ బోయ్ హరీష్.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!

హరీష్.. బాలనటుడిగా పరిచయమై ఆనక కథానాయకుడిగా ఎదిగిన ఒకప్పటి చాక్లెట్ బోయ్. ఒక తరం అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైన్ చేసిన హరీష్.. ఆపై టీనేజ్ హీరోగా 'ప్రేమ ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో అప్పటి యువతకి చేరువయ్యాడు. అదే చిత్రం హిందీలోనూ రీమేక్ అయి హిట్టవ్వడంతో.. బాలీవుడ్ లోనూ గుర్తింపు పొందాడు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఒకవైపు సోలో హీరోగా అలరిస్తూనే.. మరోవైపు ఏయన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో సెకండ్ లీడ్ గానూ కనిపించాడు హరీష్. అయితే, చిన్న వయసులో వచ్చిన క్రేజ్ ని సరైన రీతిలో వాడుకోలేకపోవడంతో పాటు ఇతర భాషల్లో కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాల్లో నటించడంతో.. హరీష్ కెరీర్ క్రమంగా ట్రాక్ తప్పింది. అదేవిధంగా తెలుగు కంటే హిందీ చిత్ర పరిశ్రమపైనే ఎక్కువ దృష్టి సారించటంతో రేసులో వెనుకపడ్డాడు.  సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవటంతో స్టార్ డమ్ చూడాల్సిన ఈ టాలెంటెడ్ హీరో కాస్త.. సైడ్ రోల్స్ కే పరిమితమై తెరమరుగైపోయాడు. తెలుగులో చివరిసారిగా అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన 'పెళ్ళయింది కానీ' (2007)లో కనిపించిన హరీష్.. 2018లో రిలీజైన హిందీ మూవీ 'ఆ గయా హీరో' (గోవిందా) తరువాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వలేదు. కెరీర్ మొత్తమ్మీద 280కి పైగా సినిమాల్లో కనిపించిన హరీష్.. 1995లో ముంబైకి చెందిన సంగీత చుఘ్ ని పెళ్ళాడాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబయిలో ఈవెంట్స్ నిర్వహిస్తూ కాలం గడుపుతున్నాడీ ఒకప్పటి చాక్లెట్ బోయ్.  (ఆగస్టు 1.. హరీష్ పుట్టినరోజు)

‘తొలిప్రేమ’ నుంచి ‘బ్రో’ వరకు.. పవన్ ‘గిటార్’ మీటిన ఆ 8 సినిమాలేంటో తెలుసా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మంచి నటుడు మాత్రమే కాదు. మంచి సంగీతప్రియుడు కూడా. అందుకే.. ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం మ్యూజికల్ హిట్స్ ఉంటుంటాయి. అలాంటి.. పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన మ్యూజికల్ ఇన్ స్ట్రూమెంట్ ఏంటి? దీని గురించి పవన్ ఎక్కడా ప్రస్తావించకపోయినా.. ఆయన నటించిన సినిమాల తాలూకు పోస్టర్స్ పరిశీలిస్తే ఇట్టే సమాధానం దొరికేస్తుంది.. 'గిటార్' అని. నటుడిగా పవన్ స్థాయిని పెంచిన 'తొలిప్రేమ' నుంచి తాజా చిత్రం 'బ్రో' వరకు అటు సినిమాల్లోనూ, ఇటు పోస్టర్స్ లోనూ గత పాతికేళ్ళుగా గిటార్ టచ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. పవన్ చిత్రాల్లో రకరకాల గిటార్ వాడకం ఆయన అభిరుచి మేరకు జరుగుతుందో  లేదంటే యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ.. ఈ పోస్టర్స్ మాత్రం అభిమానులకు కనువిందనే చెప్పొచ్చు.  మరి.. పవన్ 'గిటార్' మీటిన 8 సినిమాల తాలూకు పోస్టర్స్ ఇక్కడ చూద్దాం.. 1. తొలిప్రేమ (1998) 2. బాలు (2005)   3. కొమరం పులి (2010)      4. తీన్ మార్ (2011) 5. అత్తారింటికి దారేది (2013) 6. కాటమ రాయుడు (2017) 7. అఙ్ఞాతవాసి (2018) 8. బ్రో (2023)

బయోగ్రఫీ: వెండితెర నవ్వుల జల్లు.. మన అల్లు రామలింగయ్య!

  స్వరాజ్య పోరాటంలో భాగంగా జైలు శిక్ష అనుభవించిన ఆయన.. వెండితెరపై మాత్రం నవ్వుల జల్లు కురిపించారు. తన కుటుంబంలో తనతోనే మొదలైన ఆ వినోద సేవ.. తరతరాల పాటు కొనసాగేలా బాట వేశారు. వేయికి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించి.. తెలుగువారి మదిలో అల్లుకుపోయిన ఆ నటుడే అల్లు రామలింగయ్య. జూలై 31 అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీ కోసం.. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. చదువుకొనే రోజుల్లో నటన మీద ఆసక్తితో.. పలు నాటకాల్లో వేషాలు వేసేవారాయన. చిరుప్రాయంలోనే వినోదం పంచడంలో ఆరితేరిన అల్లు.. హోమియోపతి వైద్యం నేర్చుకుని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి తగువైద్యం అందించేవారు. అంతేకాదు.. స్వరాజ్య పోరాట సమయంలో తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి, కొన్నాళ్ళు జైలు పాలయ్యారు. తదనంతర కాలంలో అల్లు రామలింగయ్యలోని మంచి నటుడ్ని గుర్తించిన ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, నాటకరంగ ప్రముఖుడు గరికపాటి రాజారావు.. తను ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'పుట్టిల్లు'లో తొలి అవకాశాన్నిచ్చారు. ఇందులో జమున కథానాయికగా నటించగా.. అల్లు రామలింగయ్య మరో ముఖ్య పాత్రలో కనిపించారు. 'పుట్టిల్లు' ఆర్థికంగా విజయం సాధించకపోయినా.. అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీముఖ్యంగా.. అప్పట్లో అగ్ర కథానాయకులుగా దూసుకుపోతున్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లో అల్లు భలేగా సందడి చేశారు. 'పరివర్తన', 'చక్రపాణి', 'వద్దంటే డబ్బు', 'దొంగ రాముడు', 'సంతానం', 'మిస్సమ్మ', 'మాయాబజార్', 'భాగ్యరేఖ', 'తోడికోడళ్ళు', 'పెళ్ళినాటి ప్రమాణాలు', 'ఆడపెత్తనం', 'అప్పు చేసి పప్పు కూడు', 'మంచి మనసుకు మంచి రోజులు', 'ఇల్లరికం'.. ఇలా 1950ల్లో పలు విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు. ఆపై మరో నాలుగు దశాబ్దాలకి పైగా ఎన్నో వైవిధ్యభరితమైన వేషాల్లో ఎంటర్టైన్ చేశారు. వీటిలో ఎక్కువగా హాస్యపూరిత పాత్రలే చేసి.. ఇంటిల్లపాది అలరించారు అల్లు రామలింగయ్య.  అలాగే 1974లో విడుదలైన 'బంట్రోతు భార్య'తో తన తనయుడు అల్లు అరవింద్ ని నిర్మాతగా ప్రోత్సహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై తన సమర్ఫణలో పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణానికి దారి చూపారు. తన చిన్న కుమార్తె సురేఖని అప్పుడప్పుడే చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణతో ఎదుగుతున్న చిరంజీవికి కన్యాదానం చేశారు. అల్లు వారింటికి అల్లుడిగా వెళ్ళకముందు వర్థమాన నటుడుగా స్వయంకృషితో ముందుకు సాగుతున్న చిరంజీవి.. ఆపై మెగాస్టార్ గా పేరుపొందారు. మామఅల్లులిద్దరూ కలిసి పలు చిత్రాల్లో వినోదమూ పంచారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి పలు అగ్ర కథానాయకుల చిత్రాల్లో కనిపించి తన అభినయంతో మురిపించారు అల్లు. 50 ఏళ్ళ పాటు తన నటప్రస్థానాన్ని కొనసాగించిన అల్లు రామలింగయ్య.. 2004లో విడుదలైన 'జై'లో చివరిసారిగా వెండితెరపై కనిపించారు. అయితే మనవలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ముచ్చట మాత్రం నెరవేరలేదనే చెప్పాలి. ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న అల్లు రామలింగయ్య.. 1990లో భారత ప్రభుత్వం తరపున 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్నారు. అలాగే 1998లో 'ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డు'ని, 2001లో రాష్ట్ర ప్రభుత్వం తరపున 'రఘుపతి వెంకయ్య' పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. వెండితెరపై వినోదజల్లు కురిపించిన అల్లు.. తన 82వ ఏట అంటే 2004 జూలై 31న కన్నుమూశారు. భౌతికంగా అల్లు రామలింగయ్య మనకు దూరమైనా.. తన పాత్రలతో మాత్రం జనుల మదిలో నిలిచే ఉంటారు. (జూలై 31.. అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా)

బయోగ్రఫీ: వెండితెర శంకరశాస్త్రి.. రంగస్థలం రామప్పంతులు.. జేవీ సోమయాజులు!

  ఐదు పదుల ప్రాయంలో వెండితెరపై స్టార్ డమ్ చూసిన అరుదైన వైనం ఆయన సొంతం. ఒక ప్రాంతీయ చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుని.. 100కి పైగా సినిమాల్లో అలరించడం తనకే చెల్లింది. రంగస్థలంపై రామప్పంతులుగా.. వెండితెరపై శంకరశాస్త్రిగా విశేషంగా ఆకట్టుకున్న ఆ అభినయానికి మరో పేరే.. జేవీ సోమయాజులు. శతవసంతాల భారతీయ సినీ చరిత్రలో ఫోర్బ్స్ ప్రస్తావించిన 25 అత్యుత్తమ అభినయ ప్రదర్శనల్లో శంకరశాస్త్రిగా సోమయాజులుకి స్థానం దక్కిందంటే ఆ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జూలై 30.. సోమయాజులు జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీ కోసం.. జేవీ సోమయాజులు పూర్తిపేరు.. జొన్నలగడ్డ వెంకట సోమయాజులు. 1928 జూలై 30న శ్రీకాకుళం జిల్లాలోని లుకాలం అగ్రహారంలో జన్మించిన సోమయాజులు.. విజయనగరంలో తన బాల్యాన్ని గడిపారు. చిన్నప్పటినుంచే నటన మీద ఆసక్తితో పలు నాటకాల్లో పాల్గొనేవారు. కాలక్రమంలో ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వాధికారి అయిన ఆయన.. అంచెలంచెలుగా డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. మరోవైపు.. తన సోదరుడు జేవీ రమణమూర్తితో కలిసి 'కన్యాశుల్కము' నాటకాన్ని ప్రదర్శించేవారు. వందల సార్లు ప్రదర్శించబడిన ఆ నాటకంలో జేవీ రమణమూర్తి గిరీశం పంతులు పాత్రలో అలరిస్తే.. రామప్పంతులు వేషంలో ఒదిగిపోయేవారు సోమయాజులు. తన కంటే ముందే తమ్ముడు జేవీ రమణమూర్తి చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నటుడిగా రాణిస్తుంటే.. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అప్పటి నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న జేవీ సోమయాజులు 'రారా కృష్ణయ్య' సినిమాతో ఆలస్యంగా తెరంగేట్రం చేశారు. చంద్రమోహన్, మాధవి జంటగా దర్శకుడు యోగి రూపొందించిన సదరు చిత్రం ఆడకపోయినా.. సోమయాజులుకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' రూపొందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోని ప్రధాన పాత్ర అయిన శంకరశాస్త్రి వేషం కోసం మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ తో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖులను అనుకుని.. చివరికి వెండితెరపై ఏ ఇమేజ్ లేని నటుడైతే బావుంటుందని సోమయాజులుని ఎంచుకోవడం జరిగింది. విశ్వనాథ్ తీసుకున్న ఆ నిర్ణయమే.. సోమయాజులు దశని, దిశని మార్చివేసింది.  నిర్మాణ దశలో ఎలాంటి అంచనాలు లేని ఈ సంగీతభరిత చిత్రం.. విడుదల తరువాత మాత్రం ఓ ప్రభంజనం సృష్టించింది. ఇందులోని పాటలతో పాటు సోమయాజులు అభినయం కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది.  థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు సోమయాజులుగా కాకుండా శంకరశాస్త్రిగానే ఆయన గుర్తుండిపోయారంటే అతిశయోక్తి కాదు. పాత్రలో అలా పరకాయప్రవేశం చేసిన తీరే.. 'ఉత్తమ నటుడు'గా 'ఫిల్మ్ ఫేర్' అవార్డుని కూడా అందుకునేలా చేసింది.  పేరుకి తెలుగు చిత్రమే అయినప్పటికీ.. భాషలతో సంబంధం లేకుండా అనేక చోట్ల 'శంకరాభరణం' విశేష ప్రజాదరణ పొందింది. దీంతో మాతృభాషతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సోమయాజులుకి అవకాశాలు క్యూ కట్టాయి. ఇంకోవైపు.. ప్రభుత్వోద్యోగిగా పదవీ విరమణ చేయడంతో సినీ రంగంవైపు పూర్తి స్థాయిలో దృష్టి సారించారాయన. అలా.. కథలోని ప్రధాన పాత్రలతో పాటు మలుపు తిప్పే వేషాల్లోనూ కనిపిస్తూ మెప్పించారాయన. ప్రముఖ హిందీ నటుడు అనిల్ కపూర్ నటించిన తొలి తెలుగు చిత్రం 'వంశ వృక్షం'లోనూ.. ప్రముఖ తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి హిందీ చిత్రం 'ప్రతిబంధ్'లోనూ సోమయాజులు నటించడం ఓ విశేషమనే చెప్పాలి. అదేవిధంగా విక్టరీ వెంకటేశ్ మొదటి సినిమా 'కలియుగ పాండవులు'తో పాటు అభినేత్రి భానుప్రియ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ 'సితార'లోనూ సోమయాజులు అలరించారు. అలాగే 'స్వాతి ముత్యం', 'విజేత', 'శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం', 'మజ్ను', 'స్వయంకృషి', 'అభినందన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'రౌడీ అల్లుడు', 'అల్లరి మొగుడు', 'సరిగమలు' వంటి విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు. అంతేకాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ 100వ చిత్రమైన 'శ్రీరాఘవేంద్రర్'లో గురువు పాత్రలో మెప్పించారు. మరోవైపు.. టెలివిజన్ రంగంలోనూ నటుడిగా తనదైన బాణీ పలికించారు. రంగస్థలం, చిత్ర పరిశ్రమ, టెలివిజన్ రంగం.. ఇలా వేదిక ఏదైనా దాదాపు 50 ఏళ్ళ పాటు అభినయపర్వాన్ని కొనసాగించారు జేవీ సోమయాజులు.  ఇక తన సోదరుడితో కలిసి 'కన్యాశుల్కము' నాటకాన్ని 45 ఏళ్ళలో 500 సార్లు ప్రదర్శించడం సోమయాజులుకి సంబంధించి ఒక రికార్డు అనే చెప్పాలి. తన విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉన్నారని.. ఆమె తన తల్లి అయిన శారదమ్మ అని పలు సందర్భాల్లో సోమయాజులు  ప్రస్తావించేవారు. సోమయాజులుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా.. ఎందుకనో వారు చిత్ర రంగంవైపు దృష్టి సారించలేదు. కళా సేవలో భాగంగా.. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో తెలుగు థియేటర్ ని అభివృద్ధి చేసే దిశగా తన సమకాలీనులైన చాట్ల శ్రీరాములు, గరిమెళ్ళ రామమూర్తి, రాళ్ళపల్లితో కలిసి 'రసరంజిని'ని స్థాపించారు సోమయాజులు. ప్రభుత్వ సేవల నుండి పదవీ విరమణ పొందకముందు.. సాంస్కృతిక శాఖల్లో కూడా పనిచేశారు. కళాకారుడిగా విశిష్ఠ సేవలందించిన జేవీ సోమయాజులు.. 2004లో అంటే తన 76వ ఏట గుండెపోటుతో మరణించారు. భౌతికంగా  దూరమైనప్పటికీ.. తన పాత్రలతో ఎప్పటికీ జనుల మదిలో నిలిచే ఉంటారు జేవీ సోమయాజులు.   (జూలై 30.. జేవీ సోమయాజులు జయంతి సందర్భంగా)

శంకర్ తొలి చిత్రం 'జెంటిల్ మేన్'కి 30 ఏళ్ళు.. కమల్, రాజశేఖర్ వదులుకున్న సినిమా!

    దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో శంకర్ ఒకరు. సామాజిక సమస్యలకు సాంకేతిక హంగులు జోడించి సినిమాలను రూపొందించడం.. ఈ దిగ్గజ దర్శకుడి శైలి. తొలి చిత్రం 'జెంటిల్ మేన్' నుంచి శంకర్ తన మార్క్ ను చూపిస్తూ వచ్చారు. విద్యావ్యవస్థలోని లొసుగులను లక్ష్యంగా చేసుకుని  తన డెబ్యూ మూవీ 'జెంటిల్ మేన్'ని తెరకెక్కించారాయన. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ సినిమా.. అనువాద రూపంలో తెలుగువారిని కూడా విశేషంగా అలరించింది. శంకర్ కి శుభారంభాన్నివ్వడమే కాకుండా అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రంతో.. యాక్షన్ కింగ్ అర్జున్ తమిళనాట టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలిచారు. వాస్తవానికి ఈ సినిమాని కమల్ హాసన్ తో చేయాలనుకున్నారు శంకర్. అయితే, కథలో ఉన్న రాజకీయాంశాల కారణంగా కమల్ వదులుకున్నారు. దీంతో రాజశేఖర్ ని సంప్రదించినా.. కొన్ని కారణాల వల్ల అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలోనే అర్జున్ వద్దకు వెళ్ళారు శంకర్, చిత్ర నిర్మాత కేటీ కుంజుమెన్. అయితే, కథ వినకుండానే నో చెప్పిన అర్జున్.. చివరికి శంకర్ పట్టుదలకి ముగ్థుడై స్టోరీ విని వెంటనే కనెక్ట్ అయ్యారు. అలా.. ఎట్టకేలకు 'జెంటిల్ మేన్' పట్టాలెక్కింది. కానీ నిర్మాణం పూర్తయ్యాక  ఏ పంపిణీదారుడు కొనడానికి ముందుకు రాలేదు. చూడడానికి ఏదో డబ్బింగ్ సినిమాలా ఉందంటూ వెనక్కు వెళ్ళిపోయారు. కట్ చేస్తే.. కుంజుమెన్ తనే స్వయంగా పంపిణీ చేసి.. సంచలన విజయం అందుకున్నారు. 175 రోజుల పాటు ప్రదర్శితమైన ఈ సినిమా ఫలితం చూసి.. సదరు పంపిణీదారుల నోట మాట రాలేదు. తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించడంతో..  మెగాస్టార్ చిరంజీవి ఎంతో ముచ్చటపడి హిందీలో రీమేక్ చేశారు. 'ది జెంటిల్ మేన్' పేరుతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మహేశ్ భట్ తెరకెక్కించిన సదరు రీమేక్ డిజప్పాయింట్ చేసింది. మాతృకలోని ఆత్మని పట్టుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. పాటల విషయానికి వస్తే.. ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన గీతాలన్నీ అప్పట్లో ఉర్రూతలూగించాయి. ప్రభుదేవా, గౌతమిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్  "చికుబుకు చికుబుకు రైలే" అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. అలాగే "కొంటెగాడ్ని కట్టుకో", "నా ఇంటిముందున్న", "ముదినేపల్లి", "మావేలే మావేలే".. గీతాలు కూడా భలేగా రంజింపజేశాయి. ఇందులో అర్జున్ కి జంటగా మధుబాల నటించగా వినీత్, శుభశ్రీ, నంబియార్, మనోరమ, గౌండమణి, సెంథిల్, చరణ్ రాజ్, రాజన్ పి. దేవ్, అజయ్ రత్నం ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. 'బెస్ట్ ఫిల్మ్', 'బెస్ట్ డైరెక్టర్', 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్' విభాగంలో 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను అందుకున్న 'జెంటిల్ మేన్'.. 'బెస్ట్ యాక్టర్', 'బెస్ట్ డైరెక్టర్', 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్', 'బెస్ట్ ఫిమేల్ సింగర్' విభాగాల్లో తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలను సొంతం చేసుకుంది. 1993 జూలై 30న విడుదలై ఘనవిజయం సాధించిన 'జెంటిల్ మేన్'.. ఆదివారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. అంటే.. దర్శకుడిగా శంకర్ 30 ఏళ్ళ కెరీర్  పూర్తిచేసుకుంటున్నారన్నమాట.

బర్త్ డే స్పెషల్: సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ టాప్ 10 హిట్స్!

పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. ఛాయాగ్రాహకుడిగా తెలుగునాట ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నారు కె.కె. సెంథిల్ కుమార్. ఇటీవలే 20 ఏళ్ళ కెరీర్ పూర్తిచేసుకున్న సెంథిల్.. ఇప్పటివరకు 16 చిత్రాలకు పనిచేశారు. వాటిలో పది సినిమాలు విజయపథంలో పయనించడం విశేషం. జూలై 29 సెంథిల్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ లో టాప్ 10 హిట్స్ (రిలీజ్ ఇయర్ ఆర్డర్ ప్రకారం) ఏంటో చూద్దాం..  10. ఐతే: 2003లో వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ మూవీతోనే సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా తొలి అడుగేశారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. 9. సై: ఛాయాగ్రాహకుడిగా సెంథిల్ స్థాయిని పెంచిన చిత్రమిది. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. సెంథిల్ కి రెండో సినిమా. 2004లో రిలీజైన ఈ మూవీలో నితిన్ కథానాయకుడిగా నటించాడు.  8. ఛత్రపతి: సెంథిల్ కి హ్యాట్రిక్ మూవీ ఇది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన ఈ సినిమాకి కూడా రాజమౌళినే దర్శకుడు. 2005లో ఈ యాక్షన్ డ్రామా జనం ముందు నిలిచింది. 7. యమదొంగ: ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో సెంథిల్ కి హ్యాట్రిక్ మూవీ.. 'యమదొంగ'. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో కనిపించాడు. 2007లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.  6. అరుంధతి: లేడీ సూపర్ స్టార్ అనుష్క టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాకి శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ నిర్దేశకుడు. 2009 సంక్రాంతికి సందడి చేసిన 'అరుంధతి'..  సెంథిల్ కుమార్ కెరీర్ లో ఏకైక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. 5. మగధీర: 2009లో వచ్చిన ఈ పునర్జన్మల ప్రేమకథా చిత్రం.. సెంథిల్ కుమార్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ. ఇక రాజమౌళి కాంబినేషన్ లో సెంథిల్ కి ఇది నాలుగో సినిమా. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో టైటిల్ రోల్ లో దర్శనమిచ్చాడు.  4. ఈగ: 2012లో సందడి చేసిన ఈ సినిమాలో సెంథిల్ కుమార్ విజువల్స్.. మరో స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాకి కూడా రాజమౌళినే దర్శకుడు. నాని, సమంత ఇందులో జంటగా అలరించారు. 3, 2: బాహుబలి సిరీస్: 2015లో రిలీజైన 'బాహుబలి: ది బిగినింగ్', 2017లో విడుదలైన 'బాహుబలి: ది కంక్లూజన్'కి సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఓ ఎస్సెట్ గా నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సిరీస్ కి రాజమౌళి కెప్టెన్.  ఈ రెండు భాగాలు కూడా తెలుగునాట ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అలాగే, జాతీయ స్థాయిలోనూ రికార్డ్ స్థాయి వసూళ్ళు కురిపించాయి ఈ పాన్ ఇండియా సెన్సేషన్స్. 1. ఆర్ ఆర్ ఆర్: 2022లో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్'.. కెమెరామేన్ గా సెంథిల్ స్థాయిని మరింతగా పెంచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆస్కార్ అవార్డు అందుకున్న "నాటు నాటు" పాటకి సెంథిల్ కుమార్ విజువల్స్ కూడా ఓ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.   

చిరంజీవి 'రోషగాడు'కి 40 ఏళ్ళు.. గుప్తనిధి చుట్టూ తిరిగే సినిమా!

    మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో రూపొందిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో 'రోషగాడు' ఒకటి. యాక్షన్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్ రూపొందించిన ఈ సినిమాలో మాధవి నాయికగా నటించగా.. సిల్క్ స్మిత ఓ కీలక పాత్రలో అలరించింది. కన్నడ ప్రభాకర్, ఇందిర, త్యాగరాజు, టెలిఫోన్ సత్యనారాయణ, జయవాణి, వీరభద్రరావు, జగ్గారావు, మాస్టర్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావు కథను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. కథ విషయానికి వస్తే.. సికిందర్ (చిరంజీవి) ఓ గజదొంగ. తను దోచిన సొమ్మునంతా ఓ చోట దాచిపెడతాడు. ఆ వివరాలన్నీ ఓ డైరీలో రాస్తాడు. ఈ క్రమంలో.. అదే పోలికలతో ఉన్న శ్రీకాంత్ (చిరంజీవి) తన ప్రేయసి శైలజ (మాధవి) సహాయంతో ఆ నిధిని ఎలా పోలీసులకు అప్పగించాడు? అనేది మిగిలిన కథ. సత్యం స్వరాలు సమకూర్చిన 'రోషగాడు'కి రాజశ్రీ సాహిత్యమందించాడు. ఇందులోని "అచ్చట్ల ముచ్చట్ల బుల్లెమ్మ", "చిన్నదాని కొనచూపు", "నేనంటే చూడు నేనే", "యవ్వనం నీకు స్వాగతం" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. వీటిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి ఆలపించారు. పి.ఎన్. ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించిన 'రోషగాడు'.. హిందీలో 'దావ్ పేచ్' (జితేంద్ర, భానుప్రియ) పేరుతో రీమేక్ అయింది. 1983 జూలై 29న విడుదలై ప్రజాదరణ పొందిన 'రోషగాడు'.. శనివారంతో 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.  

సూపర్ స్టార్ కృష్ణ 'అశ్వథ్థామ'కి 35 ఏళ్ళు!

    సూపర్ స్టార్ కృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను రంజింపజేశాయి. వాటిలో 'అశ్వథ్థామ' సినిమా ఒకటి. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో జగ్గయ్య, శారద, మోహన్ బాబు, నూతన్ ప్రసాద్, రాజా, చలపతి రావు, ముచ్చర్ల అరుణ, వరలక్ష్మి, నర్రా వెంకటేశ్వరరావు, రాజేశ్, పి.జె. శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథ, మాటలు అందించారు. కథ విషయానికి వస్తే.. అశ్వథ్థామ (కృష్ణ) ఓ డేరింగ్ బస్ డ్రైవర్. తనని స్మశానం సుబ్రహ్మణ్యం (నూతన్ ప్రసాద్) తప్పుడు కేసులో ఇరికిస్తాడు. అన్యాయానికి వ్యతిరేకంగా అశ్వథ్థామ చేసిన పోరాటంలో అడ్వకేట్ భార్గవి (శారద), కస్టమ్స్ ఆఫీసర్ సుధ (విజయశాంతి).. అతనికి ఏ విధంగా సహకరిస్తారు? అనేది మిగిలిన చిత్రం. చక్రవర్తి బాణీలు కట్టిన 'అశ్వథ్థామ'కి వేటూరి సుందరరామ్మూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యమందించారు. "ఓ జాబిల్లి", "ఓరందగాడా", "అందాల బొమ్మ", "సిగ్గెట్టి కొట్టమాకు", "అశ్వథ్థామకు" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ పిక్చర్ పతాకంపై యం. కృష్ణ, శేఖర్ నిర్మించిన 'అశ్వథ్థామ'.. 1988 జూలై 28న జనం ముందు నిలిచింది. శుక్రవారంతో ఈ జనరంజక చిత్రం 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.

కృష్ణ 'రామరాజ్యంలో భీమరాజు'కి 40 ఏళ్ళు.. 'శ్రీమంతుడు'కి బాబు లాంటి సినిమా!

  సూపర్ స్టార్ కృష్ణ గ్రామీణ నేపథ్యంలో నటించిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో 'రామరాజ్యంలో భీమరాజు' ఒకటి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో కృష్ణకి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి నటించగా.. రావుగోపాల రావు, సత్యనారాయణ, జగ్గయ్య, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సంగీత, నిర్మలమ్మ, వడివుక్కరసి, చంద్రిక, చలపతిరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి వసుంధర కథను అందించగా.. సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. కథాంశం విషయానికి వస్తే.. కోట్లకు అధికారి అయిన రఘుపతి రాజు (జగ్గయ్య)కి ఒక్కగానొక్క కొడుకు కృష్ణ రాజ్ కుమార్ (కృష్ణ). "మనిషి బ్రతుకుకి డబ్బొక్కటే అవసరమైనది కాదు.. దానికి మించి మంచితనం, మానవత్వం ముఖ్యం" అని నమ్మే వ్యక్తి కృష్ణ. అయితే, రఘుపతి రాజు ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో.. తండ్రీకొడుకుల మధ్య ఈ విషయంపై వాదన వస్తుంది. తన పేరు, డబ్బు వినియోగించకుండా బ్రతకమంటాడు రఘుపతి రాజు. సరేనంటూ ఇంటి నుంచి బయటికొస్తాడు కృష్ణ. ఈ క్రమంలోనే లంకా నగరం అనే ఊరులోకి భీమరాజుగా అడుగుపెడతాడు. అక్కడ రామరాజు (రావు గోపాల రావు) అన్యాయాలను ఎదురిస్తాడు. మరోవైపు.. జ్యోతి (శ్రీదేవి) కుటుంబానికి చేరువవుతాడు. ఆ ఇంటి సమస్యలు తీరుస్తాడు. తండ్రితో వేసిన పందెంలోనూ నెగ్గుతాడు. కృష్ణ, జ్యోతి ఒక్కటవడంతో సినిమా సుఖాంతమవుతుంది. 'రామరాజ్యంలో భీమరాజు'ని పరిశీలనగా చూస్తే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు'కి ఒక రకంగా ఈ సినిమా కూడా స్ఫూర్తి అనిపించకమానదు.   ఇక పాటల విషయానికి వస్తే.. చక్రవర్తి సంగీతమందించిన 'రామరాజ్యంలో భీమరాజు'కి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. "కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా", "కాబోయే శ్రీమతి", "తటపట తడిసిన కోక", "ఏనాడో నీకు నాకు", "చూపుతోనే చూడకుండా".. అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకుంటాయి. ఈ గీతాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఎస్పీ శైలజ గానం చేశారు. శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించిన 'రామరాజ్యంలో భీమరాజు'.. 1983 జూలై 28న విడుదలై ప్రజాదరణ పొందింది. శుక్రవారంతో ఈ సూపర్ హిట్ మూవీ 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

మురళీ మోహన్, గిరిబాబు తొలి చిత్రం 'జగమే మాయ'కి 50 ఏళ్ళు.. 'ఎ' సర్టిఫికేట్ తో రిలీజైన మూవీ!

  తెలుగునాట నటులుగా తమదైన ముద్రవేసిన మురళీ మోహన్, గిరిబాబు.. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం  ఒకే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. బాలీవుడ్ హారర్ మూవీ 'దో గజ్ జమీన్ కే నీచే' (1972) ఆధారంగా రూపొందిన ఆ చిత్రమే.. 'జగమే మాయ'. ఐ.ఎన్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గొల్లపూడి రచన చేయగా.. నవోదయ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి.వి. సుబ్బారావు నిర్మించారు. 'పెద్దలకు మాత్రమే' అంటూ 'ఎ' సర్టిఫికేట్ తో జనం ముందు నిలిచిన 'జగమే మాయ'లో సునందిని, కె. విజయ కథానాయికలుగా నటించారు. వారిద్దరికి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. విజయలలిత, రాజబాబు, నాగయ్య ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. 'జగమే మాయ'కి ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం అందించిన బాణీలు ప్రధాన బలంగా నిలిచాయి. "నీ మదిలో నేనే ఉంటే.." (ఎస్పీ బాలు, సుజాత గానం.. సి. నారాయణరెడ్డి సాహిత్యం), "జగమే మాయ బ్రతుకే మాయ" (ఎస్పీ బాలు గానం.. కొసరాజు సాహిత్యం), "ఈ జ్వాల ఆరేది కాదు ఈ బాధ తీరేది కాదు" (జానకి గానం.. సి. నారాయణ రెడ్డి సాహిత్యం), "మూగతనం వదులుకో దొరబాబు.. బేలతనం వదులుకో చినబాబు" (జానకి గానం.. సి. నారాయణరెడ్డి సాహిత్యం) అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకుంటాయి. 1973 జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జగమే మాయ'.. ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది.  

ఎన్టీఆర్ 'రాజపుత్ర రహస్యం'కి 45 ఏళ్ళు!

జానపద చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో నటరత్న నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన నటించిన పలు జానపద చిత్రాలు తెలుగు ప్రజల్ని రంజింపజేశాయి. వాటిలో 'రాజపుత్ర రహస్యం' ఒకటి. అందాల తార జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాని ఎస్.డి. లాల్ తెరకెక్కించారు. జమున, కాంచన, సత్యనారాయణ, ఎం. బాలయ్య, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, మల్లాది, చలపతి రావు, జగ్గారావు, పుష్పలత, జయమాలిని, హలం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా.. పద్మా ఖన్నా ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. గొల్లపూడి సంభాషణలు సమకూర్చారు. స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి సాహిత్యమందించారు. "సిరిమల్లె పువ్వు మీద" (ఎస్పీబీ, సుశీల), "సాన్నాళ్ళకొచ్చాడు" (ఎస్. జానకి), "ఎంత సరసుడు" (బాలు, సుశీల), "ఓపలేని తీపి" (సుశీల), "దిక్కులెన్ని దాటాడో" (సుశీల, జానకి).. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. జయలక్ష్మి మూవీస్ పతాకంపై యార్లగడ్డ లక్ష్మయ్య చౌదరి నిర్మించిన 'రాజపుత్ర రహస్యం'.. 1978 జూలై 28న జనం ముందు నిలిచింది. శుక్రవారంతో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంది. 

శోభన్ బాబు 'జీవిత బంధం'కి 55 ఏళ్ళు!

  1968 జూలై మాసం.. నటభూషణ్ శోభన్ బాబుకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. కేవలం 24 రోజుల వ్యవధిలో ఆ నెలలో నాలుగు సినిమాలతో పలకరించారాయన.  1968 జూలై 4న 'మన సంసారం'తో ఎంటర్టైన్ చేసిన శోభన్ బాబు.. అదే నెల 19న 'లక్ష్మీ నివాసం', 'పంతాలు పట్టింపులు' చిత్రాలతో ఒకే రోజున డబుల్ ధమాకా ఇచ్చారు. ఆపై చివరగా జూలై 27న 'జీవిత బంధం'తో సందడి చేశారు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం. ఈ జూలై 27తో 55 వసంతాలు పూర్తిచేసుకున్న 'జీవిత బంధం' విషయానికి వస్తే.. ఇందులో శోభన్ బాబుతో పాటు కాంతారావు, కృష్ణకుమారి, రాజసులోచన, రామకృష్ణ, గీతాంజలి, చలం, ఆర్ముగం, త్యాగరాజు, సూర్యకాంతం, హేమలత ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. విద్వాన్ రాజశేఖర్ కథ, మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. ప్రముఖ గాయకుడు, స్వరకర్త ఘంటసాల వేంకటేశ్వరరావు బాణీలు కట్టిన ఈ సినిమాలో "తెగిపోయిన గాలిపటాలు" (ఘంటసాల), "లేత హృదయాలలో" (ఘంటసాల, సుశీల) అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.  ఎ.ఎన్.సి. ఫైనాన్స్ ర్స్ సమర్పణలో మురుగ ఫిల్మ్స్ పతాకంపై ఎన్. ఆరుముగం ఈ చిత్రాన్ని నిర్మించారు. 

'సీతామాలక్ష్మి'కి 45 వసంతాలు.. హీరోయిన్ అయ్యే ఓ పల్లెటూరి అమ్మాయి కథ!

  కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన సినిమాల్లో.. చాలామటుకు మ్యూజికల్ ఎంటర్టైనర్స్ గా మెప్పించాయి. వాటిలో 'సీతామాలక్ష్మి' చిత్రం ఒకటి. చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ రోల్ లో అలరించింది. రామేశ్వరికి ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీధర్, వంకాయల సత్యనారాయణ, డబ్బింగ్ జానకి, ఈశ్వరరావు, మాస్టర్ తులసీ రామ్, మాస్టర్ హరి, పల్లవి, పి.ఎల్. నారాయణ, సాక్షి రంగారావు దర్శనమిచ్చారు. అల్లు రామలింగయ్య, దేవదాస్ అతిథి పాత్రల్లో కనిపించారు. కె. విశ్వనాథ్ కథను అందించిన ఈ సినిమాకి జంధ్యాల సంభాషణలు సమకూర్చారు. కె. విశ్వనాథ్, జంధ్యాల, కె. మురారి స్క్రీన్ ప్లే అందించారు. కొండయ్య (చంద్రమోహన్), సీతామాలక్ష్మి అలియాస్ సీతాలు (తాళ్ళూరి రామేశ్వరి) పల్లెటూరులోని ఓ టూరింగ్ టాకీస్ లో పనిచేస్తుంటారు. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. నిరక్షరాస్యులే అయినప్పటికీ సినిమాలు చూస్తూ.. వాటిలోని డైలాగులు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ గడిపేస్తుంటారు కొండయ్య, సీతాలు. ఇదిలా ఉంటే, ఓ సారి ఆ ఊరికి షూటింగ్ నిమిత్తం ఓ సినిమా యూనిట్ వస్తుంది. సీతాలుని హీరోయిన్ చేస్తానంటూ ఆ చిత్ర నిర్మాత తప్పుడు వాగ్దానం చేస్తాడు. ఈ క్రమంలో.. కొండయ్య, సీతాలు హైదరాబాద్ వెళతారు. అక్కడికి వెళ్ళాక వారికి  కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. అయితే, చిత్రకారుడు రవి (శ్రీధర్) సహాయంతో సీతాలు కాస్త సరితా దేవిగా మారి హీరోయిన్ అవుతుంది. ఆమె విజయం, డబ్బు చూసి దూరపు చుట్టాలు కూడా దగ్గరకు చేరుకుంటారు. మరోవైపు.. అక్కడి వాతావరణానికి ఇమడలేక కొండయ్య తిరిగి గ్రామానికి వస్తాడు. చివరికి సీతాలు, కొండయ్య మళ్ళీ ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగిలిన కథ.   స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని "మావిచిగురు తినగానే", "సీతాలు సింగారం", "నువ్విట్టా నేనిట్టా", "ఏ పాట నే పాడను", "పదే పదే పాడుతున్నా", "చాలు చాలు", "కొక్కరొక్కో"  అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. యువ చిత్ర పతాకంపై మురారి - నాయుడు నిర్మించిన 'సీతామాలక్ష్మి'.. తమిళంలో 'ఎనిప్పడిగళ్', హిందీలో 'సితార' పేర్లతో రీమేక్ అయింది. 1978 జూలై 27న విడుదలై మంచి విజయం సాధించిన 'సీతామాలక్ష్మి'.. గురువారంతో 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.